headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-01 | January 2023 | ISSN: 2583-4797

3. ‘సుభద్ర సారెపాట’ కథాగేయం - జానపదాంశాలు

డా. మంగరాజు వెంకటగౌరి‌

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9676082339. Email: dr.usharani.m@gmail.com

Download PDF


Keywords: జానపదం, గేయం, కథాగేయం, సుభద్ర, సారెపాట, గౌరి

ఉపోద్ఘాతం:

సాహిత్యాన్ని ప్రారంభం నుండి పరిశీలిస్తే, జానపద సాహిత్యంలో జానపద గేయం ఎంతో ప్రధానమైనది. తెలుగు సాహిత్యంలో దీనికి ప్రత్యేక స్థానముంది. జానపద గేయాన్ని ఆంగ్లంలో ‘ఫోక్‌ సాంగ్‌’ అని అంటారు. తెలుగులో దీనికి శుద్ద గేయమనే పేరు కూడా ఉంది. ఈ జానపద గేయం జానపదులకు దగ్గరగా ఉండి, వారి అభిమానాన్ని, ప్రేమను, పెనవేసుకుపోయింది. ఇది వారి జీవన విధానంలో కలిసిపోయింది. వారి జీవితంతో గేయం గొప్ప అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంది అనటానికి వారి సాంఘిక ఆచారాలే ఆధారం. సాధారణంగా జానపదులందరు కష్టజీవులు. ఆయా పనుల్లో కలిగే కష్టాన్ని మర్చిపోడానికి వీరు గేయాలు పాడుతూ ఉంటారు. అందుకే వారి జీవనంలో గేయం ప్రధాన భాగం అయిపోయింది. ప్రతి పనికీ ఒక గేయం ఉండటం జానపద సాహిత్యంలో కనిపిస్తుంది. పనులు చేసేటప్పుడు శ్రమ తెలియకుండా, ఉత్సాహంగా పని చేయటానికి అనేక పాటలు పాడుతూ ఉంటారు. ఇది వీరి ప్రత్యేకత.

జానపద గేయాలలో సంగీత, సాహిత్యాలు రెండు ఉంటాయి. జానపద గేయాలలో బాణీ, లయ చెవి కోసుకునేంత మధురంగా ఉండి వినేవారికి ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. వారు గేయాలు పాడుతున్నప్పుడు అందులో సంగీతం శ్రోతలకు ఆనందాన్ని కలిగిస్తుంది. గేయాలలో సాహిత్యం మధురంగా ఉంటూ, ఎంతో ఉల్లాసాన్ని కల్గిస్తుంది. గేయాలలో భాష సులభంగా వినేవారికి, పాడేవారికి అనువుగా ఉంటుంది. కనుకనే జానపదులు ఆ గేయాలను బాగా ఆదరిస్తారు.

ఇక కథాగేయం గురించి చెప్పుకుంటే, కథను ప్రథానంగా చెప్తూ పాడుకోవడానికి వీలుగా ఉండేదే కథాగేయం. జానపద గేయాలలో కథాగేయం కూడా అత్యంత ముఖ్యమైంది. కథాగేయాలను ఆంగ్లంలో Ballad, Narrative songs  అని పిలుస్తారు. ఇలా పిలిచే కథాగేయాన్ని తెలుగులో వీరగాథ, గేయగాథ, కథాగేయమని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ కథాగేయాలను పాడటానికి ఒక గంట నుండి మూడు లేక నాలుగు నెలలు తరబడి పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. వీటిలో మళ్ళీ వివిధ విభాగాలున్నాయి. నా వ్యాసంలో భాగంగా ‘సుభద్ర సారెపాట’ను విశ్లేషిస్తున్నాను.

సుభద్ర సారెపాట జానపద కథాగేయాలలో చిన్న కథాగేయాల శాఖకు చెందినది. ఈ కథాగేయం పౌరాణిక శాఖకు సంబంధించినది. చిన్న కథాగేయాలలో కథ చిన్నదిగా (తక్కువగా) ఒక గంటలోపు పాడటానికి వీలుగా ఉంటుందది. వీటి పేర్ల చివర పాట లేక పదం అనే పేర్లు వస్తుంటాయి. చిన్న కథాగేయాలు పౌరాణిక శాఖలో స్త్రీలు పెళ్లి, పేరంటాలు, పండుగలు, పబ్బాలు సందర్భాలోనూ పాడుకుంటారు. లేక గాయక బిక్షకులు పగటిపూట బిక్షమెత్తుకునే సమయంలోను పాడతారు. ఈ వ్యాసంలో భాగంగా ముందు కథను తెలుసుకుంటూ అందలి గేయాలను విశ్లేషిస్తాను.

జానపద గేయ నిర్వచనాలు:

  1. ‘‘గేయ రూపంలో భావ ప్రధానంగా వెలువడే ఆశురచన జానపద గేయం’’ - ఆర్‌.వి. యస్‌. సుందరం.
  2. ‘‘జానపద గేయ రచయితలందరూ మన గుళ్ళు గోపురములు కట్టిపోయిన అజ్ఞాత శిల్పులు వంటివారు’’ - బిరుదురాజు రామరాజు.
  3. ‘‘జానపద గంధవహుని వలె విహరించి ఆనోటి నుంచి ఈ నోటికి ఎగిరిపోయె జానప గేయం’’ - శ్రీపాద గోపాలకృష్ణమూర్తి.
  4. ‘‘సంగీత సాహిత్యంతో కూడిన నిరక్షరాస్యుని భావగీతమే జానపదగేయం’’ - క్రాపే.

సుభద్ర సారెపాట:

సుభద్రార్జులకు కొత్తగా వివాహమవుతుంది. అర్జునుడు తన భార్య సుభద్రతో తనను ‘సుభద్ర పుట్టింటి వారు సరిగా చూడలేదని’ గౌరవించలేదని అత్తింటి వారిని దెప్పుతూ సుభద్రతో ఇలా చెబుతాడు.           

                           “కుంచము కుంచెడు కొలిచి ఇచ్చిరిగా

                           కొలత పల్లెరాలు పెట్రి మీ వారు

                                             మానెతో మానెడు కొలిచి ఇచ్చిరిగా

                                             మారు కట్టు చీరలు మనకు మీ వారు

                           తవ్వతో తవ్వెడు కొలిచి ఇచ్చిరిగా

                           తలంటు గిన్నెలు పెట్రి మీ వారు

                                             పున్నము నాడైనా బూరెలండుకుని

                                             పుణ్యుడా రమ్మని పిలిచిరేమో మీ వారు

                           అమవాస నాడైనా అట్లు వండుకొని

                           అల్లుడా రమ్మని పిలిచిరా మీ వారు

                                             కనుమ నాడైనా గారె లండుకొని

                                             కాముడా రమ్మని పిలిచిరే మీ వారు”

ఈ గేయంలో భర్త అత్తింటివారిపై చేసే ఆరోపణలు చిత్రించబడ్డాయి. సారెగా వంట సామాను లెక్కపెట్టి ఇచ్చారని, ఒక్క మూటలో వాడిన బట్టలు ఇచ్చారని కొత్తవి ఇవ్వలేదని, ఇంటికి సరిపడా సామానులు కూడా ఇవ్వలేదని దెప్పుతూ, పున్నమి నాడైనా బూరులు వండి భోజనానికి పిలవలేదని, అమవాస్య నాడు అట్లుపోసి పిలవలేదని తనకి గారెలు పెట్టలేదని దెప్పుతు భార్యపై భర్త అలిగాన విధానం ఇక్కడ గమనించవచ్చు. అర్జునుడి మాట విన్న సుభద్ర కూడా భర్తకి సరైన సమాధానాన్ని ఇస్తుంది.

సుభద్ర ఇలా అంటుంది-

         ‘మా వాళ్ళు పేదవాళ్ళు మాకేమి కలదు

         పెట్టగల పెద్దింటి పెళ్లాడతేను

         అచ్చటలు ముచ్చటలు అన్నియు జరుగు...’ అని తనదైన శైలిలో వ్యక్తీకరిస్తుంది.

సాధారణంగా భార్యభర్తల మధ్య ఉండే చిన్నపాటి గొడవలు ఈ పాటలో ప్రస్తావించబడ్డాయి. డబ్బుమీద అంత ఆశ ఉంటే డబ్బుగల అమ్మాయిని పెళ్ళి చేసుకోరాదా? అని అర్జునునితో అంటుంది సుభద్ర. అర్జునుడు వెంటనే కోపంతో సుభద్రను కాలితో తన్నుతాడు.  సుభద్ర వెంటనే అన్న దగ్గరకు వెళ్ళేటప్పటికీ వదినలు మజ్జిగ చిలుకుతారు. మిగతావాళ్లు వేరే పనులు చేస్తారు. సుభద్ర రాకను గమనించిన ఒక వదిన శ్రీకృష్ణుడిని లేపి ఆమె రాకను చెబుతుంది. కృష్ణుడు సుభద్రను అడిగి విషయమంతా తెలుసుకుని కొంతకాలం తన దగ్గర ఉంచుకొని ఆమెను తిరిగి అత్తింటి వారింటికి పంపిస్తు అనేక సొమ్ములు, చీరలు, సారెలు ఇచ్చి పంపిస్తాడు. వాటి గురించి శ్రీకృష్ణుడు సుభద్రతో ఇలా వ్యక్తీకరిస్తాడు.

         ‘తూర్పున ఉన్నాయి చూడి ఆవులు       -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         పడమట ఉన్నాయి పాడి ఆవులు          -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         ఉత్తరాన ఉన్నాయి మదపటేనుగులు     -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         దక్షిణాన ఉన్నాయి తూర్పు గుర్రాలు      -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         కుదురు మీదున్నాయి గుండు బిందెల్లు  -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         గూట్లోను ఉన్నాయి కంచు గిన్నెలు        -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         భరణిల్లో ఉన్నాయి పతకములు పేర్లు    -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         దండేన ఉన్నాయి తెల్లచీరలు              -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         పెటెల్లో ఉన్నాయి పట్టు చీరలు            -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         రత్నాల కోళ్ల పట్టె మంచం                  -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు

         ముత్యాల జాలలు పచ్చదోమతెర         -        అదిగోవె చెల్లెలా అరణంబు నీకు...’

ఈ విధంగా తనకు అన్న ఇచ్చిన సారె తీసుకొని ఆనందంతో అత్తింటికి భయలుదేరుతూ తమ వదినలకు చెప్తుంది. అందరూ ఆనందిస్తారు గాని, ఒక్క ఏడవ వదిన మాత్రం అది సహించలేక సుభద్రను నిందిస్తుంది. ఆమె మనసులోని కొపం ఇలా ఉంటుంది.

                           ‘‘ఎండిన ధాన్యమ్మ ఎత్తుక పొమ్ము

                           ఇంటి వాసాలన్నీ బండి పై వేసి

                           ముంజారు వాసాలు ముట్టించి పొమ్మ

                           ఇల్లు విరుచుక పొమ్మ! ఓ ముద్దు గుమ్మా!

                           వండిన వంటకము పట్టుకుని పొమ్మ

                           కట్టుకొన్న బట్ట కట్టి ఉంచ బోకమ్మా! ...’’ అంటుంది.

ఏడవ వదిన తాలూకు అక్కసును ఈ గేయంలో దర్శనమిచ్చింది. వదిన మాటలకు సుభద్ర బాధపడి తన అన్నతో ఆ బాధను చెప్పుకుంటుంది. దానికి కృష్ణుడు ఈ విధంగా సమాధానమిస్తాడు.

                           ‘‘కొన్న బానిస అంటే కొదవేమి మనకు

                           మన అమ్మ కన్నాది మనల నిద్దరను’’ అని వారిస్తాడు.

పరాయి ఇంటి నుండి వచ్చిన వదిన మాటలను పట్టించుకోవద్దని, ఒక తల్లికి పుట్టిన మనం ఇద్దరం ఒకటని బుజ్జగించడం అర్జునుని మాటల్లో కనిపిస్తుంది. ఇక్కడ సుభద్రను ఓదార్చడమే ప్రధానంగా ఉంది.

జానపదుల సాంఘిక అంశాలు:

సుభద్ర సారెపాట జానపదుల మనస్తత్వానికి, వాతావరణానికి నూటికి నూరుపాళ్ళు అద్దం పట్టే కథాగేయం. సాధారణ కుటుంబాలలో క్రొత్తగా పెళ్లైన స్త్రీలు పుట్టింటిపై మమకారం కలిగి ఉండటం సర్వసాధారణం. తన తల్లిదండ్రులను భర్త గాని అత్తింటి వైపువారు గాని ఏమైనా అంటే ఆడవాళ్లు భరించలేరు. వాళ్లని పల్లెత్తి మాట కూడా అననీయరు. ఎదురు తిరిగిన భార్యను, జవాబు చెప్పిన భార్యను భర్త కొట్టడం, భార్య పుట్టింటికి వెళ్లడం వారు తమ ఆడబడుచు కోసం తమకు ఉన్నంతలో చీర, సారె, కానుకలు ఇచ్చి తిరిగి అత్తింటికి పంపడం జరుగుతూ ఉంటుంది. ఇదే విషయం అత్యంత సహజంగా ఈ సారె పాటలో కనిపించింది.

సాధారణంగా క్రొత్తగా పెళ్లైన అల్లుళ్ళని అత్తింటివారు పండుగలకు పబ్బాలకు పిలవడం, కట్నాలు కానుకలు ఇవ్వడం, రకరకాల పిండి వంటలతో అల్లుడికి మర్యాదలు చేస్తారు. ఆ తరవాత అత్తింటికి తిరిగి వచ్చిన కోడలు తన పుట్టింటి గొప్పను చుట్టుప్రక్కల వాళ్లకు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది. అది భర్తకు నచ్చక, దానితో కోపం వస్తుంది. సామాన్యంగా జరిగే ఈ తంతును జానపదులు తమ వస్తువుగా వాడుకుంటారు. వారి ఊహలకు, గేయాలకు కథలకు అడ్డం ఉండదు. అలా పుట్టిందే ఈ సుభద్ర సారెపాట కథాగేయం.

సుభద్ర, అర్జునుడు, శ్రీకృష్ణుడు జానపదవ్యక్తులుగానే వారికి అనిపిస్తారు. అందుకే వీరుడైన అర్జునుడు, సుభద్రను సాధారణ వ్యక్తిగా మీ వాళ్లు ఏమి పెట్టలేదని దెప్పడం, సుబద్ర మామూలు స్త్రీగా ఎదురు చెప్పడం, అర్జునుడు ఆమెను కొట్టడం మొదలైన తంతు సాధారణ భార్యాభర్తల కలహాన్ని వారు కథా వస్తువుగా తీసుకొంటారు. సుభద్ర అలిగి అన్న దగ్గరకు వెళ్ళడం, శ్రీకృష్ణుడు చెల్లెలి పై ప్రేమతో ఒక సాధారణ అన్నలా ఆమెకు సారె పెట్టడం కథాగేయంలో ప్రధానంగా దర్శనమిచ్చింది. ఆనాటి కాలంలో ముఖ్యంగా జానపదుల జీవితాలలోని సారె విశేషాల ప్రస్తావన, వదినలు విసురుగా మాట్లాడడం, అన్నలు వారించడం మొదలైనవన్నీ జానపదుల నిత్య జీవితంలో జరిగే విశేషాలు.

సాధారణంగా పుట్టింట్లో ఆడపడుచులకు, కోడళ్ళకు పడదు. ఒకరిమీద ఒకరు పిర్యాదులు చేసుకోవడం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే విషయం ఈ సారెపాటలో కనిపించింది. తనకు కలిగిన బాధను అన్నకి చెప్పుకోవడం, చెల్లెలి మాటలు విని అన్న పరాయి ఇంటి పడతి మీ వదిన అని, ఆమె మాటలు లెక్కచేయవద్దని, మనం ఒక తల్లి పిల్లలమని, శ్రీకృష్ణుడు సాధారణ జానపదుడుగా, అన్నగా శ్రీకృష్ణుని పలుకులు వినవచ్చు. సుభద్ర అన్నలు ఇచ్చిన చీర, సారెతో అత్తింటికి వచ్చి వారి గొప్పలను చుట్టు ప్రక్కల వారికి చెప్పడం, అది విన్న అర్జునుడికి కోపం రావడం కూడా చాలా సాధారణమైన విషయం. ఇలాంటివి అన్ని కుటుంబాలలో ఈ విధంగానే జరుగుతూనే ఉంటాయి. జానపదులు ఎంతటి ఉన్నతమైన పాత్రనైనా తమ శైలి, తమ బాణీలు వదలకుండా వారిని సాధారణ వ్యక్తులుగా చూపుతూ సంభాషణలు పలికిస్తారు. అందుకే సుభద్ర జానపద స్త్రీ వలె ప్రవర్తిస్తుంది. అర్జునుడు జానపదుడువలె పౌరుషంతో భార్యను తిట్టడం కనిపిస్తుంది. ఇలాంటి వస్తువులే జానపదుల కథాగేయాలలో కనిపిస్తుంటాయి.

ముగింపు:

జానపదులు పాడుకోవడానికి ‘సుభద్ర సారెపాట’ అనువుగా ఉంటుంది. ఒక పక్క కథను చెబుతూ, మరో పక్క గేయంగా పాడుకునే విధంగా ఈ కథాగేయం ఉన్న ఈ చిన్న కథాగేయంలో జానపదుల మనస్తత్వం, వారి శైలి, వారి బాణి, వారి సంభాషణలు అన్నీ సమానంగా కుదిరి జానపదుల వ్యక్తిత్వానికి చక్కగా సరిపోయే కథాగేయంగా తీర్చిదిద్దుతారు. అన్నిటికంటే ముఖ్యంగా జానపదుల సాంఘిక జీవనం ఉట్టిపడేలా ఈ కథాగేయాలు దర్శనమిస్తుంటాయి.

ఆధారగ్రంథాలు:

  1. ఎల్లోరా, (1966). జానపద గేయాలు (ప్రధమ ప్రచురణ). విజయవాడ 
  2. గంగాధరం, నేదునూరి., (1960). జానపద గేయ వాఙ్మయ వ్యాసావళి (ప్రధమ ప్రచురణ). హైదరాబాద్‌
  3. రామరాజు, బి., (1958). తెలుగులో జానపద గేయ సాహిత్యం (ప్రధమ ప్రచురణ). జానపద విజ్ఞాన ప్రచురణలు, హైదరాబాద్‌ (చీకటి పల్లి)
  4. కృష్ణశ్రీ సంపాదితము (1963). పౌరాణిక స్త్రీల పాటలు. ఆంధ్ర సారస్వత పరిషత్‌, తిలక్‌ రోడ్‌, హైదరాబాద్‌
  5. సుందరం, ఆర్‌. వి. యస్‌., (1979), తెలుగు - కన్నడ జానపద గేయాలు. జానపద విజ్ఞాన భారతి, హైదరాబాద్‌

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]