AUCHITHYAM | Volume-07 | Issue-07 | June 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. తెలుగు పర్యావరణ నవలలు: విమర్శనాత్మక పరిశీలన
మోటూరి హిమబిందు, డా. దార్ల వెంకటేశ్వరరావు
సీనియర్ రీసెర్చ్ స్కాలర్, తెలుగుశాఖ,
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్,
హైదరాబాద్. తెలంగాణ
సెల్: +91 9989628049, Email: himabindu8412@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.05.2026 ఎంపిక (D.O.A): 25.05.2026 ప్రచురణ (D.O.P): 01.06.2026
వ్యాససంగ్రహం:
తెలుగు కల్పనాసాహిత్యం కాలంతో పాటు మారుతూ, సమకాలీన సామాజిక వాస్తవికతను, వస్తు వైవిధ్యాన్ని సజీవంగా ప్రతిఫలిస్తోంది. సమాజంలో తలెత్తే అనేక సంక్షోభాలకు పరిష్కార మార్గాలను అన్వేషించడమే పరమావధిగా సాగుతున్న నేటి ఆధునిక సాహిత్యంలో 'పర్యావరణ సమస్య' ఒక ప్రధాన వస్తువుగా రూపాంతరం చెందింది. పారిశ్రామికీకరణ, ప్రపంచీకరణ, కార్పొరేట్ శక్తుల స్వార్థం కారణంగా అడవులు, వ్యవసాయం, నదీజలాలు తీవ్ర విధ్వంసానికి గురవుతున్న తరుణంలో, మానవునికి - ప్రకృతికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని పునరుద్ఘాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బిభూతిభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీలో రాసిన ‘అరణ్యక్’ (1938) నవలను సూరంపూడి సీతారాం తెలుగులోకి 'వనవాసి' పేరుతో (1961) అనువదించారు. ప్రకృతిని, అడవులను నమ్ముకుని జీవిస్తున్న గిరిజన పేద జీవితాల విధ్వంసాన్ని, అటవీ ఉత్పత్తులపై ఆధారపడేవారి మనుగడను ఈ నవల కేంద్రంగా చేసుకుంది. చంద్రలత రాసిన 'రేగడి విత్తులు' (1997) ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగునీటి ప్రాజెక్టులు, రైతుల ఎదురుదెబ్బలు, వ్యవసాయంలో నిత్యం ఎదురయ్యే విత్తనాల కొరత వంటి పర్యావరణ-వ్యవసాయాధారిత అంశాలను చర్చించింది. సలీం రచించిన 'గుర్రపు డెక్క' (2013) ప్రపంచీకరణ ప్రభావం వల్ల జరుగుతున్న అడవుల విధ్వంసం, గిరిజనుల అస్తిత్వాన్ని, జీవనాన్ని ఎలా దెబ్బతీసిందో విశ్లేషించింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 'ఒంటరి' (2017) నవలలో గ్రామీణ జీవన విధానంలో వస్తున్న ఆరోగ్య సమస్యలను, ప్రకృతి ద్వారా వాటిని పరిరక్షించుకునే మార్గాలను చర్చిస్తూ, మానవుడు ప్రకృతిని విధ్వంసం చేస్తే వచ్చే పరిణామాలను హెచ్చరించారు. చింతకింది శ్రీనివాసరావు రాసిన ‘మున్నీటి గీతలు’ (2021) నవలలో సాగర కాలుష్యం గురించి ఉంటుంది. రసాయనిక కర్మాగారాలు, మందుల కంపెనీల్లో వెలువడే వ్యర్థాలు సముద్రంలో పారబోసేటప్పుడు వచ్చే పర్యావరణ సమస్యలను ఆలోచింపజేస్తుంది. కార్పొరేట్ శక్తులు, ప్రయివేటు వ్యక్తులు అడవులను నరికివేసి, ఖనిజాల అన్వేషణతో సహజమైన కొండలను విధ్వంసం చేస్తూ ఫ్యాక్టరీలు కట్టడం వల్ల నదీజలాలు, సాగరాలు ఎలా కలుషితమవుతున్నాయో ఈ నవలల్లో వివరించారు. ప్రధానంగా ఈ ఐదు నవలలను ఆధారంగా చేసుకుని తెలుగు పర్యావరణ నవలల్లో పర్యావరణ అంశాలను చిత్రించిన విధానాన్ని అధ్యయనం చేయడానికి తులనాత్మక, విశ్లేషణాత్మక పరిశోధనా పద్ధతులను, పర్యావరణ విమర్శనా సిద్ధాంతాన్ని అన్వయించడం జరుగుతుంది. ప్రస్తుత పరిశోధనా పత్రం ఈ ఐదు నవలలను కేంద్రంగా చేసుకుని, తులనాత్మక, విశ్లేషణాత్మక పద్ధతులలో 'పర్యావరణ విమర్శనా సిద్ధాంతాన్ని' (ఎకో క్రిటిసిజమ్) అన్వయిస్తూ, తెలుగు నవలా సాహిత్యంలో పర్యావరణ స్పృహ చిత్రించబడిన విధానాన్ని, పర్యావరణ పరిరక్షణలో సాగుతున్న సామాజిక కృషిని విమర్శనాత్మకంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
Keywords: పర్యావరణ సాహిత్యం, పర్యావరణ నవలలు, అడవుల విధ్వంసం, వ్యవసాయ విధ్వంసం, గిరిజన జీవనం.
1. పరిశోధన పరిధి - ప్రాముఖ్యత
ఎంచుకున్న ఐదు నవలల ప్రాధాన్యత, పరిమితుల దృష్ట్యా ఈ పరిశోధనా పత్రం భూమి, విత్తనం, గిరిజన సంస్కృతి, ఆరోగ్యం, జలవనరులు అనే ఐదు భిన్న పర్యావరణ అంశాలను, అంతర్గత సంక్షోభాన్ని శోధించే ఒక ప్రత్యేక పరిధిని కలిగి ఉంది. 'వనవాసి' నవలలో అటవీ భూములను జమీందారీ శక్తులు వ్యవసాయ భూములుగా మార్చడం వెనుక ఉన్న భూమిని మార్చుకొనే సంక్షోభాన్ని ప్రాధాన్యతగా చర్చిస్తుంది. 'రేగడివిత్తులు' నవల పర్యావరణ పరిధిని దాటి బహుళజాతి సంస్థల మార్కెట్ శక్తులు విత్తన సార్వభౌమత్వాన్ని (అంటే, విత్తనాలను వాళ్లే అమ్ముతారు ఇతరులు ఉత్పత్తి చేయడానికి వీల్లేదు.) ఎలా శాసిస్తున్నాయో వివరిస్తుంది. 'గుర్రపు డెక్క' నవలలో చెంచుల సాంప్రదాయక పర్యావరణ జ్ఞానం అడవిని కాపాడే ఒక రక్షణ కవచంగా మారిన తీరు విశిష్టమైనది వివరిస్తుంది. 'ఒంటరి' నవలలో పాతకాలపు సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లు పునరుద్ధరణ ద్వారా పర్యావరణ నైతికతను లోతైన అధ్యయనం చేస్తుంది. అలాగే 'మున్నీటి గీతలు' నవల పారిశ్రామిక వ్యర్థాల వల్ల జరుగుతున్న అనర్థాలను చర్చిస్తుంది. అయితే, ఈ పరిశోధన కేవలం ఈ ఐదు నవలల వస్తుగత కథాంశాలు విశ్లేషణకు మాత్రమే పరిమితం కావడం వల్ల, తెలుగు సాహిత్యంలో ఉన్న ఇతర పర్యావరణ నవలలను లేదా విస్తృతమైన పర్యావరణ కవిత్వ ధోరణులను పూర్తిస్థాయిలో స్పృశించలేకపోవడం ఈ పత్రం ప్రధాన పరిమితి. అయినప్పటికీ, వివిధ కాలాలు, ప్రాంతీయ సరిహద్దులలో విస్తరించిన ఈ ఐదు నవలల ద్వారా పర్యావరణ సాహిత్య విమర్శకు ఒక వ్యవస్థీకృత నమూనాను అందించడంలో ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
2. పూర్వ పరిశోధనల విశ్లేషణ
ఈ నవలలపై మాకు తెలిసినంతవరకు ప్రత్యేకించి పరిశోధన జరగలేదు. కానీ, పర్యావరణ అంశాలపై విడివిడిగా కొన్ని రచనలపై పరిశోధనలు జరిగాయి. బి శ్రీలత ‘రేగడి విత్తులు- ఒక అధ్యయనం’ పేరుతో హైదరాబాదు విశ్వవిద్యాలయంలో (2003)ను, కె.వి.భాస్కర నాయుడు ‘చంద్రలత దృశ్యాదృశ్యం - నవల పరిశీలన’ పేరుతో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (2009)లోను పరిశోధనలు జరిగాయి. సుధాకర్ కురువ ‘ప్రకృతి వైపరీత్య కథలు-పరిశీలన’ పేరుతో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జరిగింది. ‘ప్రజా వాగ్గేయ సాహిత్యం పర్యావరణ తత్త్వం’ ఆర్.సీతారాం (యూజిసి మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్) చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వేణు వరదా ‘తెలుగు కవిత్వం-పర్యావరణ స్పృహ’ పేరుతో 2000 నుండి 2015 వచ్చిన కవిత్వంపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలలో ఈ ఐదు నవలలకు సంబంధించిన వాటిలో కేవలం ‘రేగడివిత్తులు’ నవల గురించి మాత్రమే ఉంది. కానీ, పర్యావరణ దృక్పథంతో అధ్యయనం జరగలేదు. అయితే, పర్యావరణ స్పృహను ఐదు నవలలకు కూడా అనువర్తించడం ఈ పత్రం లక్ష్యం.
3. పర్యావరణ సాహిత్యం - పర్యావరణ స్పృహ
ఐదు నవలలలో గల కథా సారాంశం, వాటిలో ప్రతిపాదించిన పర్యావరణ స్పృహను విశ్లేషించుకుందాం. తెలుగులో పర్యావరణ సాహిత్యం అనే పదాన్ని ”eco literature” అనే ఆంగ్ల పదానికి సమానంగా వాడుతున్నారు. ఈ పదాన్ని మొదటిసారిగా 1978లో William Rueckert ప్రయోగించాడు. ఈయన ”literature and ecology. An experiment in eco criticism” అనే వ్యాసంలో ఈ పదాన్ని ఉపయోగించాడు. పర్యావరణ భావనలు, ఆ శాస్త్ర విషయాలు సాహిత్యంలో ప్రతిఫలించడాన్ని eco literature అని ఆయన అభిప్రాయపడ్డారు. దీనినే విశ్లేషణాత్మక అధ్యయనం చేసినట్లయితే అది పర్యావరణ సాహిత్య విమర్శ అవుతుంది. దీన్ని బట్టి పర్యావరణ శాస్త్రాన్ని, పర్యావరణ విషయాలను సాహిత్యంలో ప్రతిఫలించిన తీరుతెన్నులు సృష్టించడాన్ని పర్యావరణ సాహిత్య విమర్శగా భావిస్తున్నారు. దీనినే సాహిత్యానికి, పర్యావరణ విషయాలకు మధ్య గల సంబంధాలు లోతుగా అధ్యయనం చేయటం వంటి అంశాలు పర్యావరణ సాహిత్యంలో ఉంటాయి. దీన్ని బట్టి మానవ జీవనానికి, ప్రకృతికి మధ్య గల అవినాభావ సంబంధాన్ని అధ్యయనం చేయడాన్ని పర్యావరణ సాహిత్యం అంటారు. ప్రకృతి పట్ల మనకు ఉన్న అవగాహన, బాధ్యత, ప్రకృతికి జరుగుతున్న విధ్వంసం, వాటి ప్రభావం ఎలా ఉంటుందో వివిధ భావోద్వేగాలతో వర్ణించడం పర్యావరణ సాహిత్యంలో కనిపించే ముఖ్యమైన అంశం.
‘స్పృహ’ అంటే ఏదైనా ఒక అంశంపట్ల అవగాహన కలిగి ఉండటం. ఉదాహరణకు సామాజిక శాస్త్రంలో ‘సామాజిక స్పృహ’ అనే పారిభాషిక పదం ఎంతో ప్రాచుర్యం కలిగింది. దీన్ని ఆంగ్లంలో సోషల్ ఎవేర్నెస్ అంటారు. ‘‘సమాజంలో ఉన్న వివిధ వ్యవస్థల ఉనికి గురించి, వివిధ సమస్యల గురించి వాస్తవ దృష్టి ఆధారంగా ఉన్న అవగాహన, ఆలోచన’’ అని సాహిత్య విమర్శ పదాల డిక్షనరీలో ఎస్.ఎస్.నళిని వివరించారు (నళిని 187). దీన్ని ఆధారంగా చేసుకుని పర్యావరణ స్పృహను కూడా వివరించుకోవచ్చు.
పర్యావరణ స్పృహ అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని, పర్యావరణ వ్యవస్థలను అర్థం చేసుకుని, వాటిని కాపాడాలనే బాధ్యతను గుర్తించడం. కేవలం మొక్కలు నాటడమే కాకుండా, మనం రోజువారీ జీవితంలో వాడే వనరులను పొదుపుగా వాడుతూ, కాలుష్యాన్ని తగ్గించడం ఈ స్పృహలో ప్రధానాంశాలు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెత్తను సరైన పద్ధతిలో తొలగించడం, నీరు, విద్యుత్తును వృధా చేయకుండా ఉండటం వంటి చిన్న చిన్న మార్పులు ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన భూమిని అందించడమే పర్యావరణ స్పృహ అసలైన లక్ష్యం.
4. తెలుగు నవలల్లో పర్యావరణ స్పృహ చిత్రణ
4.1. వనవాసి నవల - పర్యావరణ స్పృహ
బిభూతిభూషణ్ బందోపాధ్యాయ బెంగాలీలో రాసిన ‘అరణ్యక్’ (1938) నవలను సూరంపూడి సీతారాం 'వనవాసి' (1961) పేరుతో తెలుగులోకి అనువదించారు. ఉద్యోగం వేటలో ఉన్న సత్యచరణ్ అనే యువకుడు, స్నేహితుని సిఫార్సుతో పూర్ణియా జిల్లాలోని ఒక జమీందారీ అటవీ ప్రాంతానికి మేనేజర్‌గా వెళ్తాడు. అక్కడ అడవిని కౌలుకు ఇచ్చి, అడవిని నరికి సాగు భూమిగా మార్చడం అతని బాధ్యత. అయితే, మొదట్లో భయంకరమైన ఏకాంతంగా అనిపించిన ఆ అరణ్య జీవనం, క్రమంగా అతనిని తన మాయలో పడేసుకుంటుంది. ప్రకృతి సౌందర్యానికి, అక్కడి గిరిజనుల అమాయకత్వానికి ముగ్ధుడైన సత్యచరణ్, అడవిని తనలో ఒక భాగంగా చేసుకుంటాడు.
అడవిలోని విభిన్నమైన పాత్రలు, వారి పేదరికం, వేసవిలో నీటి కోసం వారు పడే తపన వంటివి సత్యచరణ్‌ను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా యుగళ ప్రసాద్ అనే వ్యక్తి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా అడవిని సుసంపన్నం చేయడానికి కొత్త మొక్కలను నాటడం, ఆ అరణ్య సౌందర్యాన్ని పెంచడానికి పడే తపన అతనికి గొప్ప స్ఫూర్తిని ఇస్తాయి. మనుషులు అవసరాల కోసం అడవిని నరికివేస్తున్నా, ప్రకృతిని ప్రేమిస్తూనే దాన్ని కాపాడాలనే ఆవశ్యకతను యుగళ ప్రసాద్ ద్వారా సత్యచరణ్ గుర్తిస్తాడు.
తన ఉద్యోగ బాధ్యతలో భాగంగా భూములు కౌలుకు ఇవ్వడం వల్ల, తాను ఎంతో ప్రేమించిన అడవి నాశనం అవుతుంటే సత్యచరణ్ తీవ్ర ఆవేదన చెందుతాడు. తన చేతుల మీదుగానే ఈ ప్రకృతి సంపద అంతరించిపోతోందన్న గిల్టీ ఫీలింగ్‌తో, అరణ్య దేవతను క్షమాపణ కోరుకుంటాడు (బందోపాధ్యాయ 215). కౌలుదారులు అడవిని కొట్టివేసి, నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు, ప్రకృతి ముక్కలవుతున్న దృశ్యాన్ని చూసి అతను కలత చెందుతాడు. ఈ సుందరమైన ప్రకృతిని కాపాడటానికి చట్టబద్ధమైన రక్షణ అవసరమని అతను భావిస్తాడు (బందోపాధ్యాయ 234).
దాదాపు ఆరు సంవత్సరాలు అరణ్యవాసం తర్వాత, ప్రకృతి ప్రేమికుడిగా, పరిరక్షకుడిగా సత్యచరణ్ పూర్తిస్థాయిలో పరిణతి చెందుతాడు. "ప్రకృతి మోహన రూపం మనుషుల చేత సంసారాన్ని కూడా త్యజింపజేస్తుంది" (బందోపాధ్యాయ 102) అని గ్రహించిన నాయకుడు, తిరిగి నగరానికి వెళ్లాల్సి వచ్చినా ఆ అరణ్య అనుభూతులు తనలో దాచుకుంటాడు. ప్రకృతిని ధ్వంసం చేయడం కాకుండా, దాన్ని ఆరాధించే వారి కోసం అడవులను సంరక్షించుకోవాలనే సందేశంతో ఈ నవల ముగుస్తుంది.
నవలలో పర్యావరణ స్పృహను ఇలా విశ్లేషించుకోవచ్చు. ప్రకృతిని మానవ అవసరాల కోసం సృష్టించిన వస్తువుగా కాకుండా, ప్రకృతికి తనకంటూ ఒక స్వతంత్ర ఉనికి ఉందని ఎకో-సెంట్రిజం చెబుతుంది.
"The well-being and flourishing of human and nonhuman life on Earth have value in themselves. These values are independent of the usefulness of the nonhuman world for human purposes" (Naess 68).
"భూమిపై మానవ, మానవేతర జీవరాశులు ఉనికికి, అవి ఏ రకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా, వాటికి వాటికే ఒక అంతర్గత విలువ ఉంటుందని ఆర్నే నెస్ 'డీప్ ఎకాలజీ' సిద్ధాంతంలో ఇలా పేర్కొన్నారు. అంటే, ప్రకృతి మనిషికి ఉపయోగపడాలి అనే కోణాన్ని పక్కన పెట్టి, అది తనకై తాను జీవించడమే ఒక విశిష్టత అని ఈ సిద్ధాంతం చెబుతుంది. సత్యచరణ్ అడవిని ధ్వంసం చేస్తున్నప్పుడు పడే వేదన, ఆ అడవికి ఉన్న స్వతంత్ర ఉనికిని కాపాడలేకపోతున్నాననే అపరాధభావం నుండే పుట్టింది. కాబట్టి, నెస్ చెప్పిన ఈ సిద్ధాంతం 'అరణ్యక' నవలలోని ప్రధాన సందేశాన్ని, ప్రకృతిని భోగవస్తువుగా కాక, సహజీవనం చేయాల్సిన ఒక ప్రాణశక్తిగా చూడాలనే కోణాన్ని పరిపూర్ణంగా సమర్థిస్తుంది. నవలా నాయకుడు సత్యచరణ్ అడవిని చూసి, "కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా అడవి సుగంధ పరిమళం గుప్పుమని వెదజల్లుతుంటుంది" అని వర్ణించడం ప్రకృతిని ఒక సజీవశక్తిగా గుర్తించడమే. అడవి నిశ్శబ్దం, ఆ సెలయేటి సంగీతం మనిషిని మైమరపిస్తాయని చెప్పడం ద్వారా, అడవికి మానవ ప్రమేయం లేని ఒక విశిష్ట ఉనికి ఉందని రచయిత నిరూపించారు.
పెట్టుబడిదారీ వ్యవస్థ భూమిని కేవలం లాభం ఇచ్చే ఒక వ్యాపార వస్తువుగా పరిగణిస్తుంది, కానీ ప్రకృతిని ఆరాధించే 'అగ్రేరియన్' తత్వవేత్తలు భూమిని ఒక కుటుంబంగా భావిస్తారు. జమీందారీ వ్యవస్థ అడవిని, గిరిజనులు ఆవాసాలను కేవలం శిస్తులు వసూలు చేసే కౌలుభూములుగా మాత్రమే చూసింది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ, "ఈ భూములలో ప్రజలను స్థిరపరిచే కర్తవ్యంతో నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఈ అరణ్య ప్రకృతిని ధ్వంసం చేయాలని వచ్చి ఈ అపూర్వ సుందరి వన్యమోహంలో పడిపోయాను" అని సత్యచరణ్ ఆవేదన చెందడం, పెట్టుబడిదారీ ధోరణిపై ఒక స్పష్టమైన విమర్శగా నిలుస్తుంది. దీనిని ఆల్డో లియోపోల్డ్ తన సిద్ధాంతంతో సమన్వయం చేయడాన్ని సమర్థిస్తుంది:
"We abuse land because we regard it as a commodity belonging to us. When we see land as a community to which we belong, we may begin to use it with love and respect" (Leopold viii).
మనం భూమిని మనకు చెందిన ఒక వస్తువుగా భావించడం వల్లే దానిని దుర్వినియోగం చేస్తున్నాం, కానీ భూమిని మనం భాగమై ఉన్న ఒక సమూహంగా చూసినప్పుడే దానిని ప్రేమతో, గౌరవంతో వాడుకోగలం అని దీన్ని అర్థం చేసుకోవచ్చు. నిజానికి, అగ్రేరియన్ దృక్పథం ప్రకారం భూమిని కేవలం దున్నడం అంటే పంట పండించడం మాత్రమే కాదు, ఆ మట్టితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గౌరవించడం కూడా. సత్యచరణ్ పాత్రలో కలిగిన ఈ మార్పు అంటే భూమిని యాజమాన్య హక్కుతో కాకుండా, బాధ్యతతో కూడిన సహజీవనంగా చూడటం, లియోపోల్డ్ చెప్పిన భూ నైతికతకు (Land Ethics) అద్దం పడుతుంది. ఇక్కడ అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయడం కాకుండా, మానవ మేధస్సుతో ప్రకృతిని సంరక్షించుకోవాలనే స్పృహను సత్యచరణ్ పాత్ర ద్వారా రచయిత బలంగా వ్యక్తం చేశారు.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం కంటే స్థానిక ప్రజలకు తమ ప్రాంతపు పర్యావరణంపై ఉండే అవగాహన ఎంతో గొప్పదని బెర్కెస్ వంటి శాస్త్రవేత్తలు నిరూపించారు. నవలలోని యుగళ ప్రసాద్ అనే పాత్ర, అడవిని కాపాడటం కోసం స్వచ్ఛందంగా విత్తనాలను సేకరించి నాటడం, ఆ అడవిలోని వృక్షాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి అతనికి ఉన్న లోతైన పరిజ్ఞానం పర్యావరణ పరిరక్షణలో గిరిజనులు పాత్రను స్పష్టం చేస్తాయి. ఆధునిక పద్ధతులతో అడవులు నరికివేయడం వినాశనానికి దారితీస్తుందని, స్థానిక జ్ఞానంతోనే ప్రకృతిని పునరుజ్జీవింపజేయవచ్చని రచయిత ఈ పాత్ర ద్వారా చాటిచెప్పారు. దీనిని బెర్కెస్ తన సిద్ధాంతంతో సమన్వయం చేయడాన్ని ఇది బలపరుస్తుంది:
"Indigenous knowledge is an absolute necessity to counter the ecological degradation caused by modern technology" (Berkes 42).
అంటే, "ఆధునిక సాంకేతికత వల్ల కలిగే పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవడానికి, స్థానిక ప్రజలు సంప్రదాయ జ్ఞానం అత్యంత ఆవశ్యకం" అని మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి, యుగళ ప్రసాద్ అడవిలో మొక్కలు నాటడం అనేది కేవలం ఒక పని మాత్రమే కాదు, అది ప్రకృతితో అతను ఏర్పరుచుకున్న ఒక జీవన ఒప్పందం. సత్యచరణ్ పాత్రలో కలిగిన మార్పుకు కూడా యుగళ ప్రసాద్‌లోని ఈ సహజ సిద్ధమైన జ్ఞానమే ప్రేరణగా నిలుస్తుంది. స్థానిక ప్రజలకు ప్రకృతిపై ఉన్న మమకారం, ఆరాధనలే నిజమైన పర్యావరణ పరిరక్షణకు మార్గదర్శకాలు అని ఈ నవల బలంగా చెబుతుంది.
మానవుడి సాంకేతిక నైపుణ్యం రోజురోజుకు పెరుగుతున్నా, పర్యావరణం పట్ల ఉండాల్సిన వివేకం తగ్గడం వల్లనే నేడు అపారమైన విపత్తులు సంభవిస్తున్నాయి. నవలలో, "మా జమీందారులకు లాండ్ స్కేప్ అంటే తెలియదు, నజరానాలు, శిస్తులు, రాబడి, వసూళ్లు, ఆస్తులు మాత్రమే తెలుసు" అని సత్యచరణ్ చేసే వ్యాఖ్యలో ఈ వివేకరహితమైన దృక్పథం స్పష్టంగా కనిపిస్తుంది. గిరిజనులు అడవిని, వారి జీవన విధానాన్ని నాశనం చేసి, అక్కడ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం లేదా ప్రకృతిని కేవలం లాభాలు కోసం వాణిజ్య పంటలు పండించే క్షేత్రాలుగా మార్చడం ఇవన్నీ 'ఎకో-క్యాటాస్ట్రోఫీ' (పర్యావరణ వినాశనం)కి దారితీస్తున్నాయి.
ఈ వైరుధ్యాన్ని గ్లోట్‌ఫెల్టీ, ఫ్రమ్ తమ సిద్ధాంతంతో సమన్వయం చేయడాన్ని ఇది బలపరుస్తుంది:
"Man's technological expertise has far outstripped his biological and ecological wisdom" (Glotfelty and Fromm 109).
అంటే, "మానవుడి సాంకేతిక నైపుణ్యం, జీవశాస్త్ర పర్యావరణ వివేకం కంటే ఎంతో వేగంగా దూసుకుపోయింది" అని మనం అర్థం చేసుకోవచ్చు. సాంకేతికతను ఎలా ఉపయోగించాలో తెలిసిన మనిషికి, ప్రకృతితో ఎలా మమేకమై జీవించాలో తెలియకపోవడమే ఈ విధ్వంసానికి మూల కారణం. జమీందారీ వ్యవస్థ ప్రతినిధులు అభివృద్ధి పేరుతో ప్రకృతిని కొలబద్దలతో కొలిచి ఆస్తులుగా మార్చినప్పుడు, సత్యచరణ్ మాత్రం ఆ అడవిలోని జీవరాశిని, దానిలోని సౌందర్యాన్ని చూశాడు. సాంకేతిక ప్రగతి పర్యావరణ వివేకానికి తోడైనప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని ఈ వనవాసి నవల మనకు గుర్తు చేస్తుంది.
4.2. రేగడి విత్తులు నవల - పర్యావరణ స్పృహ
చంద్రలత రాసిన "రేగడి విత్తులు" నవల ప్రధానంగా నడిగడ్డ (కృష్ణా, తుంగభద్ర నదులు మధ్య ఉన్న నల్లరేగడి నేలలు) పాలమూరు (మహబూబ్ నగర్) ప్రాంతాల వ్యవసాయ నేపథ్యంలో సాగుతుంది. వ్యవసాయాన్ని, రైతులు కష్టాలను, వారి ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే నవల ఇది. కథానాయకుడు రామనాధం ఒక చదువుకున్న యువకుడు. అతను ఉద్యోగం వదిలేసి వ్యవసాయం మీద మక్కువతో నడిగడ్డ ప్రాంతంలో ఉన్న నల్ల రేగడి భూమిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. అతని అన్న రత్తయ్య, తల్లి పున్నమ్మ, భార్య సావిత్రి, ఆ ప్రాంతపు రైతులు బాలయ్య, సవారి, దస్తగిరి వంటి పాత్రలు ఇందులో కీలకం. రామనాధం తన ఉద్యోగాన్ని వదిలి, నడిగడ్డలో 20 ఎకరాల నల్లరేగడి భూమిని కొనుగోలు చేస్తాడు. అయితే, ఆ కొత్త ప్రాంతపు నేల స్వభావం, నాణ్యమైన విత్తనాలు లభించకపోవడం, నీటి వసతి సమస్యలు తెలియక మొదటి పంటను కోల్పోతాడు. పెట్టుబడి పెట్టడం కోసం అప్పులు ఊబిలో ఇరుక్కుపోతాడు. అయినా అతని ప్రయత్నాన్ని మాత్రం మానుకోడు.
‘వేసే విత్తనాన్ని బట్టి పంట ఉంటుంది, పంటను బట్టి రైతు ఉంటాడు’, ఈ నడిగడ్డ మీద మరో రైతు నకిలీ విత్తనాలు కారణంగా ప్రాణాలు తీసుకోవడానికి వీల్లేదు, నడిగడ్డలోని పత్తి విత్తనాలతో నల్లరేగడిలోంచి తెల్ల బంగారం తవ్వి తీయాలి అని, పత్తి పంట పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించి, నాణ్యమైన విత్తనాల్ని తయారు చేసి, ప్రజలకు తానే అందించాలి అనుకుంటాడు. ఇలా నిర్ణయం తీసుకుని సింధనూరు వెళ్లి సంకరజాతి విత్తనాలు ఇచ్చే పెద్ద రైతులతో చర్చించి, హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని శాస్త్రజ్ఞులను కలుసుకొని, ఆంధ్రప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ వారి అనుమతితో కొత్త రకం నాణ్యమైన పత్తి విత్తనాల ప్రయోగాలను మొదలు పెడతాడు. మొదట అనేక ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ చివరికి తన ప్రయోగంలో విజయం పొందుతాడు. అతని తయారుచేసిన కొత్తరకం పత్తి విత్తనాలకు "రేగడివిత్తులు" అని పేరు పెడతాడు (చంద్రలత 302). ఈ క్రమంలో ఒక రైతుగా అతను పడే సంఘర్షణ, అజ్ఞానం వల్ల కలిగే నష్టం, స్థానిక రైతులు అనుభవం నుండి నేర్చుకునే పాఠాలు నవలలో ప్రధానంగా కనిపిస్తాయి.
భూస్వామ్య పద్ధతులు, రైతులు ఆత్మహత్యలు, వ్యవసాయం పట్ల నేటి తరంలో తగ్గుతున్న ఆసక్తి, అన్నదమ్ములు మధ్య ఉండే ఆస్తి గొడవలు, అప్పుల వల్ల రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను రచయిత్రి చాలా సహజంగా చిత్రించారు. ఎన్నో కష్టాలు ఎదురైనా, ఆ మట్టిని నమ్మి, తనను తాను రైతుగా మలచుకోవాలనే రామనాధం పట్టుదల, ప్రకృతితో పోరాడి గెలవాలనే అతని సంకల్పమే ఈ నవల సారాంశం. తల్లి నేర్పిన విలువలు, ఆత్మీయులు అండతో అతను వ్యవసాయ రంగంలో స్థిరపడటానికి చేసే ప్రయత్నమే ఈ నవలలోని కథ.
చంద్రలతగారి 'రేగడి విత్తులు' నవల కేవలం ఒక వ్యవసాయక గాథ మాత్రమే కాదు, భూమికి, మనిషికి మధ్య ఉన్న విడదీయలేని ఆత్మీయతను ఆవిష్కరించే ఒక పర్యావరణ నివేదిక. ఆధునికత, యాంత్రీకరణ పేరుతో ప్రకృతిని వ్యాపార వస్తువుగా మార్చడాన్ని ఈ నవల నిశితంగా విమర్శిస్తూ, స్థానిక విజ్ఞానమే సుస్థిర జీవనానికి మార్గమని ప్రతిపాదిస్తుంది. వెండెల్ బెర్రీ వంటి పర్యావరణ తత్వవేత్తల భావాలకు అనుగుణంగా, ఇందులో భూమిని కేవలం లాభం కోసం వాడుకునే సరుకుగా కాకుండా, ఒక సంపూర్ణ జీవన వ్యవస్థగా చిత్రించారు. రత్తయ్య పాత్రలో భూమి పట్ల ఉండే మమకారం ఇందుకు నిదర్శనం; "ఏ రైతైనా నిలుచున్న పళాన భూములు అమ్ముకోవడానికి ఎలా ఒప్పుకొంటాడు? గుండె పగిలిపోదూ?" అని అతను పడే ఆవేదన, భూమిని ఆస్తిగా కాకుండా తన ఉనికిలో భాగంగా చూడటాన్ని ప్రతిబింబిస్తుంది. ఆల్డో లియోపోల్డ్ తన సిద్ధాంతంలో చెప్పినట్లుగా:
"When we see land as a community to which we belong, we may begin to use it with love and respect" (Leopold viii).
భూమిని మనం భాగమై ఉన్న ఒక సమూహంగా చూసినప్పుడే దానిని గౌరవించగలం. రత్తయ్య పాత్ర ద్వారా రచయిత, భూమిని రక్షించుకోవడం అంటే కేవలం పంట పండించుకోవడం కాదని, ఆ మట్టిలో కలిసిపోయిన జీవన చైతన్యాన్ని కాపాడుకోవడమేనని స్పష్టం చేస్తారు.
ఈ క్రమంలోనే ఆధునిక విజ్ఞానం విఫలమైన చోట స్థానిక రైతులు సాంప్రదాయక పర్యావరణ విజ్ఞానం ఎలా పరిష్కారాలను చూపుతుందో నవల అద్భుతంగా వివరిస్తుంది. రామనాధం తన ఆధునిక విద్యతో వాగు నీటిని మళ్లించి వరి సాగు చేసే ప్రయత్నం విఫలమైనప్పుడు, బాలయ్య అనే రైతు, "గిడ్డ రేగట్ల ఈతగుల్లల రకం వరి సరిపోతది" అని ఆ నేల స్వభావాన్ని వివరిస్తాడు. ఇది ఆధునిక విద్య క్షేత్రస్థాయి వాస్తవాలను విస్మరించినప్పుడు, స్థానిక జ్ఞానం ఎలా మార్గదర్శకంగా నిలుస్తుందో తెలియజేస్తుంది. వందన శివ ఉటంకించినట్లుగా:
"Local ecological knowledge is superior to universal modern interventions" (Shiva 12).
ప్రపంచవ్యాప్తంగా అమలు చేసే ఆధునిక ప్రయోగాల కంటే, స్థానిక పర్యావరణాన్ని లోతుగా అర్థం చేసుకున్న ప్రజలు అనుభవజ్ఞానమే ఎంతో ఉత్తమమైనది. రామనాధం వంటి ఆధునిక విద్యార్థులు పొరబడిన చోట, స్థానిక రైతులు అనుభవం ప్రకృతికి అనుగుణమైన పరిష్కారాలను చూపుతుంది. కాబట్టి, సాంకేతిక అభివృద్ధిని అమలు చేసేటప్పుడు స్థానిక విజ్ఞానాన్ని గౌరవించడమే నిజమైన పర్యావరణ స్పృహ అని ఈ నవల నిరూపిస్తుంది.
మనిషి ప్రకృతికి యజమాని కాదని, ఆ వ్యవస్థలో కేవలం ఒక భాగం మాత్రమేననే 'ప్రకృతి కేంద్రకవాదం' (Eco-centrism) ఈ నవలలోని ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. సావిత్రి ప్రకృతితో మమేకమై తోటను పెంచుకోవడం, మొక్కలను, పశువులను తన కుటుంబ సభ్యులుగా చూసుకోవడం, ప్రకృతికి ఉన్న అంతర్గత విలువను గౌరవించడమే. రామనాధం, "ప్రకృతి మాత గీచిన అపురూప చిత్రంలో వ్యవసాయదారుడు ఒక బిడ్డడు" అని భావించడం, మానవ కేంద్రకవాదాన్ని (Anthropocentrism) తిరస్కరించి, ప్రకృతి కేంద్రకవాదాన్ని స్వీకరించడమే. ఆర్నే నెస్ తన డీప్ ఎకాలజీ సిద్ధాంతంలో పేర్కొన్నారు:
"The well-being and flourishing of human and nonhuman life on Earth have value in themselves... These values are independent of the usefulness of the nonhuman world for human purposes" (Naess 68).
ప్రకృతి అంటే కేవలం వనరు మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన జీవన ప్రక్రియ అని సావిత్రి, రామనాధుల పాత్రల ద్వారా రచయిత ఆవిష్కరించారు.
ప్రకృతికి తనకంటూ స్వతంత్రమైన, శాశ్వతమైన నియమాలు ఉంటాయని, మనిషి తన పరిమిత శక్తితో వాటిని శాసించలేడని ఈ నవల నొక్కి చెబుతుంది. "ఈ ప్రకృతి తన అందంతో మురిపిస్తుంది, వైపరిత్యాలతో విరుచుకుపడుతుంది" అని రామనాధం గ్రహించడం, ప్రకృతి శక్తులు ముందు మనిషి అల్పత్వాన్ని అంగీకరించడమే. గ్లోట్‌ఫెల్టీ, ఫ్రమ్ సిద్ధాంతం ప్రకారం:
"Nature operates on its own immutable laws, independent of human desires" (Glotfelty and Fromm 109).
ప్రకృతి మానవుని కోరికలతో నిమిత్తం లేకుండా తన నియమాలతో నడుస్తుంది. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా ప్రకృతిని జయించాలని ప్రయత్నించడం సరికాదని, దాని గతిని అంగీకరించడమే నిజమైన పర్యావరణ వివేకమని నవల చెబుతుంది. మొత్తంమీద, ఆధునికత పేరుతో ప్రకృతిని నిర్బంధించాలనుకునే ధోరణిని వ్యతిరేకిస్తూ, మనిషికి మట్టికి మధ్య ఉండాల్సిన పవిత్రమైన బంధాన్ని పునరుద్ధరించడం ద్వారా, ఈ నవల ఒక పరిపూర్ణ పర్యావరణ స్పృహను మనకు అందిస్తుంది.
4.3. గుర్రపుడెక్క నవల - పర్యావరణ స్పృహ
సలీం గారు రచించిన 'గుర్రపుడెక్క' నవల, చారిత్రక పరిశోధన నేపథ్యంతో నల్లమల అడవి బిడ్డలు చెంచుల పర్యావరణ సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. ఒకనాటి శత్రు దుర్బేధ్యమైన 'మన్నుగొండ' సామ్రాజ్య కోట శిథిలాలను, అక్కడ మట్టిలో కూరుకుపోయిన ఆలయాలను కనుగొనాలనే లక్ష్యంతో చరిత్రోపన్యాసకుడు సూర్యకుమార్, అతని స్నేహితుడు కేదార్‌లు అడవిలోకి పరిశోధనార్థం ప్రవేశిస్తారు. అక్కడ వారికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయి, సవతి తల్లి పెట్టే కష్టాలను భరిస్తూ అడవిలోని ఒక వేపచెట్టును తన 'అమ్మ చెట్టు'గా భావించి ఓదార్పు పొందే తోకల కుదురుకు చెందిన గిరిజన యువకుడు మల్లయ్య పరిచయమవుతాడు. లచ్చిమి అనే పడుచును ప్రేమించి పెళ్లాడిన మల్లయ్య, తాను ఒక చిరుతపులితో పోరాడి గెలిచిన గుట్టపై ఉన్న ('నా దేవర') అనే పట్టణాన్ని పరిశోధకులకు చూపిస్తాడు; ఆ రాత్రికి చెంచుపెంటలో ఆతిథ్యం పొంది, మరుసటి రోజు కోట శిథిలాల కోసం సాగించే అన్వేషణలో వన్యప్రాణులను చంపకుండా, ప్రకృతిని నాశనం చేయకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తమ 'సాంప్రదాయిక పర్యావరణ జ్ఞానం'తో సుస్థిరమైన అటవీ జీవనాన్ని సాగిస్తున్న చెంచులు ఉదాత్తమైన తాత్వికతను, ప్రపంచీకరణ ముఖచిత్రంలో వారి అస్తిత్వ పోరాటాన్ని ఆవిష్కరిస్తూ ఈ నవలా కథ ముగుస్తుంది.
'గుర్రపుడెక్క' నవలపై పర్యావరణ విమర్శ సిద్ధాంతాలను వర్తింపజేసినప్పుడు పట్నం నుండి వచ్చిన సూర్యకుమార్, కేదార్‌లు ప్రకృతిని కేవలం ఒక 'పర్యాటక ప్రదేశం'లానో, లేదా పరిశోధనా వస్తువులానో చూస్తే; అడవి బిడ్డలు మల్లయ్య, లచ్చిమి, బుడ్డన్నలు ప్రకృతిని తమ 'జీవన వనరుగా, దైవంగా' చూస్తారు. ఆధునిక గ్లోబలైజేషన్ యుగంలో పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి గిరిజనులు ఈ సాంప్రదాయక పర్యావరణ జ్ఞానం ఎంత అవసరమో ఈ నవల పర్యావరణ విమర్శ సిద్ధాంతాల ద్వారా నిరూపిస్తుంది.
'గుర్రపుడెక్క' నవలలో పర్యావరణ స్పృహ అడుగడుగునా ఒక జీవన దర్శనంలా కనిపిస్తుంది. నాగరిక సమాజం ప్రకృతిని కేవలం మానవ అవసరాల కోసం వాడుకోవాలనే 'మానవ కేంద్రక' (Anthropocentric) ధోరణిని కలిగి ఉంటే, గిరిజనులు మాత్రం 'పర్యావరణ కేంద్రక' (Ecocentric) జీవన విధానాన్ని పాటిస్తారు. నవలలో బుడ్డన్న ఎలుగుబంటును చూసి భయపడినా, తనకు తక్షణ ప్రమాదం లేనందువల్ల దాన్ని చంపకూడదని నిర్ణయించుకోవడం ప్రకృతి సహజీవనానికి నిదర్శనం. "అదీ బతకాల... మేమూ బతకాల" అని అతను చెప్పే మాటల్లో మానవేతర జీవులు మనుగడ హక్కు పట్ల గౌరవం కనిపిస్తుంది. సాహిత్య విమర్శలో ఈ ధోరణి గురించి చెరిల్ గ్లాట్‌ఫెల్టీ పేర్కొన్నారు:
"Ecocriticism takes an earth-centered approach to literary studies" (Glotfelty and Fromm xviii).
అంటే పర్యావరణ విమర్శ అనేది భూమిని కేంద్రంగా చేసుకునే విధానాన్ని అనుసరిస్తుంది. బుడ్డన్న ప్రదర్శించిన ఈ భూమి-కేంద్రక ఆలోచనా విధానం, అడవిని కేవలం వనరుగా కాకుండా ఒక జీవన వ్యవస్థగా గుర్తించడంలోనే మనిషి పర్యావరణ సమతుల్యతను కాపాడగలడని నిరూపిస్తుంది.
ప్రకృతితో మనిషికి ఉన్న ఈ అనుబంధం 'డీప్ ఎకాలజీ' (Deep Ecology) సిద్ధాంతంతో మరింత లోతుగా ముడిపడి ఉంది. నవలలో చెంచుల సామాజిక గోత్రాల పేర్లు అడవిలోని జంతువులు, పక్షులు, వృక్షాల పేర్లతో (తోకలోళ్ళు, పిట్టలోళ్ళు, చిగుర్లోళ్ళు) ముడిపడి ఉండటం, పర్యావరణ వ్యవస్థలో మానవుడు ఒక చిన్న భాగం మాత్రమేనని స్పష్టం చేస్తుంది. ఆర్నే నైస్ తన సిద్ధాంతంలో పేర్కొన్నారు:
"The well-being and flourishing of human and nonhuman life on Earth have value in themselves... These values are independent of the usefulness of the nonhuman world for human purposes" (Naess 68).
అంటే భూమిపై మానవ, మానవేతర జీవరాశులు ఉనికికి, అవి మనిషికి ఏ రకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయనే దానితో సంబంధం లేకుండా, వాటికి వాటికే ఒక అంతర్గత విలువ ఉంటుంది. మనిషిని ప్రకృతి నుంచి వేరు చేసి చూసే ఆధునిక ధోరణులకు భిన్నంగా, ప్రకృతిలో తాము ఒక భాగమేనని గుర్తించే చెంచులు సంస్కృతి సమగ్ర పర్యావరణ స్పృహకు ప్రతీకగా నిలుస్తుంది.
ఈ ప్రకృతి అనుబంధం 'పర్యావరణ స్త్రీవాద' (Ecofeminism) కోణంలో కూడా ఆవిష్కృతమవుతుంది. నవలలో కథానాయకుడు మల్లయ్య చిన్నతనంలోనే కన్నతల్లిని కోల్పోయి, సవతి తల్లి కష్టాలను భరించలేక వేపచెట్టును తన 'అమ్మ చెట్టు'గా భావించడం ప్రకృతిలోని మాతృత్వాన్ని తెలియజేస్తుంది. ప్రకృతిని ఆత్మీయతను పంచే సజీవ వ్యవస్థగా ఆరాధించే ఈ దృక్పథం పర్యావరణ స్త్రీవాద సిద్ధాంతానికి నిలువుటద్దం. ప్రకృతికి, స్త్రీ మాతృత్వానికి గల విడదీయలేని సంబంధాన్ని వివరిస్తూ వందనా శివ పేర్కొన్నారు:
"The forest as the feminine principle provides the model for industrial and agricultural sustainability" (Mies and Shiva 98).
అడవిని ఒక తల్లిలా, తనను రక్షించే కవచంలా భావించే గిరిజన నమ్మకాలను ఈ సిద్ధాంతం బలపరుస్తుంది. మల్లయ్య తన అమ్మను చెట్టులో చూడటం అనేది కేవలం మానసిక ఊరట మాత్రమే కాదు, అది ప్రకృతితో మనిషికి ఉండే ఆదిమ మాతృత్వ బంధానికి ప్రతీక.
గిరిజనులు ఆచరణాత్మక అనుభవాల నుంచి పుట్టిన 'సాంప్రదాయక పర్యావరణ జ్ఞానం' (TEK) కూడా ఈ నవలలో కీలకంగా కనిపిస్తుంది. లచ్చిమి చెంచు గడ్డలు తవ్వుకునేటప్పుడు దుంపలో కొంత భాగాన్ని భూమిలోనే వదిలేయడం, అది మళ్ళీ పెరుగుతుందనే నమ్మకంతో సుస్థిర పద్ధతిని పాటించడం గిరిజన జీవనశైలికి ప్రతీక. లేత వెదుర్లను, బీడీ ఆకులు కోయకపోవడం వంటి ఆచారాలు వనరులు దుర్వినియోగాన్ని అడ్డుకుంటాయి. ఫిక్రెట్ బెర్కెస్ ఈ జ్ఞానాన్ని వివరిస్తూ చెప్పారు:
"Traditional Ecological Knowledge (TEK) represents a component of cultural diversity... It is a cumulative body of knowledge, practice, and belief, evolving by adaptive processes" (Berkes 5).
ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న పర్యావరణ సంక్షోభానికి, ప్రకృతిని కేవలం వినియోగించుకోవడమే కాకుండా దానికి తిరిగి ఇవ్వడం (Restoration) అనే ఈ సాంప్రదాయక జ్ఞానమే సరైన పరిష్కార మార్గమని 'గుర్రపుడెక్క' నవల బలంగా చెబుతుంది.
4.4. ఒంటరి నవల - పర్యావరణ స్పృహ
మారే పల్లెటూరి వాతావరణం, పట్టణీకరణ తెస్తున్న మార్పులు చుట్టూ ఈ నవలా కథ తిరుగుతుంది. ఒకవైపు నగరం విస్తరిస్తూ, జేసీబీ (డోజర్ల) వంటి యంత్రాలతో చెట్లను, పొదలను నరుకుతూ ప్రకృతిని ధ్వంసం చేసే ప్రక్రియ ఊరి పొలిమేరల్లో వేగంగా సాగుతుంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో, నగర నాగరికత మోజులో పడి, డబ్బు సంపాదనే ధ్యేయంగా బతికి, చివరకు ఒంటినిండా రోగాలను తెచ్చుకున్న రాఘవ అనే వ్యక్తి పల్లెకు వస్తాడు. అంతరించిపోతున్న 'అరికె ధాన్యం' అనే ఒక పాతకాలపు ప్రాచీన పంట రకాన్ని వెతుక్కుంటూ, దాన్ని పండించి లాభాలు పొందాలనే స్వార్థపు ఆలోచనతో అతను ఈ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ అతనికి అచ్చమైన పల్లెటూరి రైతు నర్సయ్యతో పరిచయం అవుతుంది. నర్సయ్య ప్రకృతితో మమేకమై, అడవిలోని జుంటితేనె తాగుతూ, వంకలు, చేలను తన కుటుంబ సభ్యుల్లా భావిస్తూ బతికే ఒక అమాయకపు శ్రమైక జీవి. లోకాన్ని ఎదుర్కొని ఒంటరిగా పోరాడుతూ, తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునే రాములమ్మ అనే ధైర్యవంతురాలైన స్త్రీ పాత్ర కూడా వీరికి తోడవుతుంది.
మొదట్లో కేవలం స్వలాభం కోసం వచ్చిన రాఘవ, నర్సయ్యతో కలిసి సాగించే ప్రయాణంలో క్రమంగా మారడం ప్రారంభిస్తాడు. అడవిలో కరువు రావడం వల్లే గొర్రెల మంద తన పైరును మేసిందని సర్దుకుపోయే నర్సయ్య కరుణా హృదయం, మేదరమ్మ పాడే వేదాంత తత్వాలు రాఘవ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. డబ్బుతో కేవలం డబ్బు మాత్రమే పండుతుందని, మనిషి బతకడానికి కావలసిన నిజమైన అన్నాన్ని ప్రకృతి మాత్రమే ఇవ్వగలదని అతను గ్రహిస్తాడు. యంత్రాలతో పల్లెలను, పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేస్తున్న స్వార్థపరులు మధ్య నర్సయ్య చూపిన ఆత్మీయత రాఘవలో అంతఃసంఘర్షణను రేకెత్తిస్తుంది. చివరకు తన స్వార్థాన్ని వీడి, అంతరించిపోతున్న ఆ ప్రాచీన అరికె పంటను కాపాడుకోవాలనే తపనతో రాఘవ సాగించే అన్వేషణ, ఒక చిన్న విత్తనం మొలకెత్తి కొత్త ఆశను రేకెత్తించడంతో కథ ముగుస్తుంది.
‘‘బుల్డోజర్లతో పొదలన్నిట్ని కుళ్లగించి, బరకల్ని, బిడునెలల్ని సాగుభూములుగా మార్చే క్రమంలో పర్యావరణాన్ని విధ్వంసం చేస్తోన్న దుర్మార్గం ఒకవైపు పల్లెల్ని కమ్ముకొస్తూ వుంటే, మరోవైపు పాతకాలపు వృక్షాల ఫలసాయంతో తృప్తిపడాల్సిందే పోయి, ఆ చెట్లనే నరికి సొమ్ము చేసుకోవాలని చూసే మూర్ఖత్వం, స్వార్థం చుట్టుముడుతూ వుంటే, ఇంకోవైపు బహుళజాతి కంపెనీల వంగడాలతో సాంప్రదాయక విత్తనాలు, తృణధాన్యాలను మట్టిలో పాతిపెట్టే అత్యాశ ఒక దయ్యంలా వెంటాడుతోంటే పల్లె తన స్వరూపం కోల్పోతున్న పరిస్థితి నా హయాంలోనే చూస్తూ వున్నాను. ఈ విధ్వంస దృశ్యాలన్నిటికీ సాక్షీభూతంగా నిల్చున్న దయనీయ స్థితిలోంచి ఈ నవల పుట్టింది. పర్యావరణాన్ని మాత్రమే కాదు, తన్ను తాను కాల్చి బూడిద చేసుకునే దిశగా మనిషి గమనం చూస్తున్నాను కాబట్టే ఈ నవల రాయాల్సి వచ్చింది.’’ అని రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తన ‘నామాట’ (వెంకటరామిరెడ్డి 11)లో చెప్పుకున్నాడు. దీన్ని బట్టి రచయిత కొంత కావాలనే పర్యావరణ స్పృహతో ఈ నవలను రచించినట్లనిపిస్తుంది.
'ఒంటరి' నవలలో నగరీకరణ, పర్యావరణ విధ్వంసం మధ్య ఉన్న వైరుధ్యాన్ని రచయిత సన్నపురెడ్డి అత్యంత గాఢంగా చిత్రించారు. నగరాల విస్తరణ పేరుతో పల్లె సంస్కృతిని నిర్మూలించి, జేసీబీ వంటి ఆధునిక యంత్రాలతో వృక్షాలను, పొదలను పెకిలించి వేయడం మనిషి తన స్వల్పకాలిక స్వలాభం కోసం ప్రకృతిని ఎలా దహనం చేసుకుంటున్నాడో తెలియజేస్తుంది. సాహిత్య పర్యావరణ విమర్శకుడైన విలియం రుయెకర్ట్, ఈ విధ్వంసం వెనుక ఉన్న అజ్ఞానాన్ని హెచ్చరిస్తూ పేర్కొన్నారు:
"The human brain has energy-releasing pathways which are presently producing eco-catastrophe. ... Man's technological expertise has far outstripped his biological and ecological wisdom" (Glotfelty and Fromm 109).
అంటే, మానవుడి సాంకేతిక నైపుణ్యం, జీవశాస్త్ర పర్యావరణ వివేకం కంటే వేగంగా దూసుకుపోవడమే నేటి విపత్తులకు మూలం. వృద్ధి పేరుతో చేసే ఈ విధ్వంసం కేవలం భౌతికమైన నష్టమే కాదు, మనిషికి ప్రకృతికి ఉన్న బంధాన్ని తుడిచిపెట్టే చర్య అని ఈ నవల బలంగా వాదిస్తుంది. గ్లోట్‌ఫెల్టీ, ఫ్రమ్ అన్నట్లుగా, లోపభూయిష్టమైన ఆర్థిక, రాజకీయ వ్యవస్థల ఫలితమే నేటి పర్యావరణ పతనం అన్న సత్యాన్ని రాఘవ పాత్ర ద్వారా రచయిత ఆవిష్కరించారు:
"The current environmental crisis is the systemic result of a deeply flawed economic and political structure" (Glotfelty and Fromm 15).
ఈ యాంత్రిక వినాశనానికి ప్రత్యామ్నాయంగా, నవలలోని నర్సయ్య పాత్ర ప్రకృతితో మమేకమైన 'డీప్ ఎకాలజీ' (Deep Ecology) జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. గొర్రెల మంద తన చేనును మేసేసినప్పుడు నర్సయ్య కోపగించుకోకుండా, అడవిలో కరువు వచ్చింది కాబట్టే అవి ఊరిపై పడ్డాయని సహానుభూతితో స్పందించడం, తోటి జీవుల పట్ల అతనికి ఉన్న అపారమైన కరుణను సూచిస్తుంది. మనిషి స్వార్థం కోసం ప్రకృతిని నిందించకుండా, ఇతర జీవరాశులు ఇబ్బందులను తనవిగా భావించే ఈ దృక్పథం, ఆర్నే నైస్ ప్రతిపాదించిన సిద్ధాంతానికి నిదర్శనం. ఆయన స్పష్టం చేశారు:
"The well-being and flourishing of human and nonhuman life on Earth have value in themselves. These values are independent of the usefulness of the nonhuman world for human purposes" (Naess 68).
అంటే మానవ అవసరాలతో సంబంధం లేకుండా సమస్త జీవరాశులకు ఉండే అంతర్గత విలువను గుర్తించడమే డీప్ ఎకాలజీ ఉద్దేశ్యం. నర్సయ్య వంటి పాత్రల ద్వారా, మనిషి ప్రకృతిని శాసించే యజమాని కాదని, ఇతర జీవరాశులతో సమానమైన హక్కులు కలిగిన సహజీవి మాత్రమేనని రచయిత స్పష్టం చేశారు.
ఈ సహజీవనానికి పునాదిగా, అంతరించిపోతున్న ప్రాచీన 'అరికె ధాన్యం' (మిల్లెట్స్) కోసం రాఘవ చేసే అన్వేషణ, సాంప్రదాయక పర్యావరణ జ్ఞానాన్ని పునఃప్రతిష్ఠించే ప్రయత్నం. ఆధునిక హైబ్రిడ్ ఆహారాల కంటే, తరతరాలుగా వస్తున్న స్వదేశీ విజ్ఞానంలోనే మానవ మనుగడ దాగి ఉందని రాఘవ గుర్తించడం, స్థానిక పర్యావరణ పరిరక్షణకు గొప్ప మార్గం. ఫిక్రెట్ బెర్కెస్ దీనిని వివరిస్తూ పేర్కొన్నారు:
"Traditional Ecological Knowledge is a cumulative body of knowledge, practice, and belief, evolving by adaptive processes and handed down through generations by cultural transmission, about the relationship of living beings with one another and with their environment" (Berkes 8).
అలాగే, ఆధునిక సాంకేతికత వల్ల కలిగే విధ్వంసాన్ని అడ్డుకోవడానికి స్థానిక ప్రజలు సంప్రదాయ జ్ఞానం అత్యంత ఆవశ్యకమని ఆయన మాటలు నిరూపిస్తున్నాయి:
"Indigenous knowledge is an absolute necessity to counter the ecological degradation caused by modern technology" (Berkes 42).
పర్యావరణ పరిరక్షణ అంటే ఎక్కడో దూరంగా జరిగే కార్యం కాదు, అది మనం తినే ఆహారంలోనూ, పాటించే జీవనశైలిలోనూ ఉంటుందని రాఘవ అన్వేషణ ద్వారా రచయిత సందేశాన్ని ఇస్తున్నారు. ప్రకృతిని కేవలం లాభం కోసం కాకుండా, దాని అస్తిత్వాన్ని గౌరవించడమే పర్యావరణ సమతుల్యతకు ఏకైక మార్గమని 'ఒంటరి' నవల తాత్వికంగా మనకు బోధిస్తుంది.
4.5. మున్నీటి గీతలు నవల - పర్యావరణ స్పృహ
చింతకింది శ్రీనివాసరావు రాసిన 'మున్నీటి గీతలు' నవల, శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యవేనం వంటి తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు బతుకుపోరాటాన్ని, వారి వలసలు నేపథ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, స్వగ్రామంలో వసతులు లేకపోవడంతో వేలమంది మత్స్యకారులు ప్రతి ఏటా గుజరాత్‌లోని అరేబియా సముద్రానికి వలస వెళ్తుంటారు. ఆదర్శవంతుడైన నాయకుడు పోలారావు, తల్లిని బతికించుకోవటానికి ఉన్నవన్నీ అమ్మి, అప్పుల పాలవుతాడు. ఊరి ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తుంటాడు. ఆ ఊరిలో ఉన్న బ్రాందీ షాపులను మూయించడం, సముద్ర కాలుష్యంపై పోరాడటం వంటి పనులు ద్వారా అతను గ్రామస్థుల పట్ల తన బాధ్యతను చాటుకుంటాడు.
వలస వెళ్ళిన జాలరులు వేట కోసం సముద్రంలో ఎక్కువ దూరం ప్రయాణించడంతో, దారి తెలియక భారతీయ జలాలు సరిహద్దులు దాటి పాకిస్థాన్ జలాల్లోకి ప్రవేశిస్తారు. "గీతలు దాటేశామా, మున్నీటి గీతలు దాటేశామా. అసలు నీటిమీద గీతలు కనపడతాయా" అన్న వారి ఆవేదన సముద్రంపై గీసిన కృత్రిమ సరిహద్దులు వ్యర్థతను ఎత్తిచూపుతుంది (శ్రీనివాసరావు 149). పాకిస్థాన్ నేవీ చేతిలో బందీలైన జాలరులు లాంధీ జైలులో కఠినమైన మట్టి పనులతో, ఆకలితో అల్లాడిపోతారు. ఆ కష్టకాలంలో జైలు సిబ్బంది కొంతమంది చూపిన మానవత్వం వారిలో ధైర్యాన్ని నింపుతుంది.
నవలలో పర్యావరణ స్పృహ కీలకమైనది; రసాయన కర్మాగారాలు వ్యర్థాలను సముద్రంలో కలపడం వల్ల చేపలు చనిపోవడం, వాటిని తిన్న మనుషులు మరణించడం వంటి దారుణాలను పోలారావు నిరసిస్తాడు. "సముద్రపు ఒడ్డున నాచులో కలిసిపోయి చేప గుడ్లను సైతం పురిట్లోనే చంపేస్తున్నాయి" అని ఆ కాలుష్య ప్రభావంపై అతను గ్రామంలో అవగాహన కల్పిస్తాడు (శ్రీనివాసరావు 179). జైలులో ఉన్నప్పుడు కూడా, పోలారావు ఎదుటివారికి సహాయం చేసే గుణాన్ని, గ్రామంలో అతను చేసిన మేలులు మరొకసారి బవిరోడి చెవిన పడటంతో కన్నీళ్లు పెట్టుకొని అప్పటివరకు శత్రువుగా ఉన్న అతను పోలారావు వ్యక్తిత్వానికి ముగ్ధుడవుతాడు.
చివరకు, రెండు దేశాలు ప్రభుత్వాలు సంప్రదింపులతో జాలరులు స్వగ్రామానికి చేరుకుంటారు. బవిరోడు తన కూతురు ఎర్రమ్మను పోలారావుకి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. "ఎందరికో మేలు చేయడానికి నీళ్ల మీద- నేల మీద- మనుషులు మధ్యన - మనిషే గీసిన గీతల్ని చెరపటానికి" నూతన దంపతులు ఢిల్లీలో జాతీయ స్థాయి ధర్నాకు బయలుదేరడంతో కథ ముగుస్తుంది. "మనిషి మేధస్సు భూమ్మీద గీతలు గీయటానికి కాదు, గీతలు చెడపడానికి పనికి రావాలి" అన్న పోలారావు మాటలు, మానవత్వం సరిహద్దుల కంటే గొప్పదని చాటిచెబుతాయి (శ్రీనివాసరావు 205).
చింతకింది శ్రీనివాసరావు రాసిన 'మున్నీటి గీతలు' నవల మత్స్యకారులు జీవన పోరాటాన్ని ఆవిష్కరిస్తూనే, ప్రకృతిపై మానవ ఆధిపత్యం వల్ల కలిగే దుష్పరిణామాలను అత్యంత లోతుగా చర్చిస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలను సాగర జలాల్లోకి వదలడం ద్వారా గంగపుత్రులు జీవనోపాధిని దెబ్బతీయడం 'పర్యావరణ వలసవాదం'కు స్పష్టమైన నిదర్శనం. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లోని రసాయన, భారలోహాల కర్మాగారాలు వెదజల్లే విషపూరిత జలాలు మత్స్యకారులు సహజ ఆవాసాన్ని నాశనం చేస్తున్న తీరును నవల ఎండగడుతుంది (శ్రీనివాసరావు 179). రామాచంద్ర గుహ పేర్కొన్నట్లుగా:
"The imposition of external, state-centric development policies often alienates the very people who have protected these ecosystems for centuries" (Guha 55).
ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు పర్యావరణాన్ని కేవలం లాభదాయక వనరుగా పరిగణించి, స్థానిక జీవన వ్యవస్థలను విధ్వంసం చేయడం ఈ సిద్ధాంతానికి నిలువుటద్దంగా కనిపిస్తుంది.
ఈ కార్పొరేట్ దోపిడీని నిరసిస్తూనే, పోలారావు పాత్ర ద్వారా మనిషి ప్రకృతికి యజమాని కాదని, సహజీవి మాత్రమేనన్న 'ప్రకృతి కేంద్రకవాద' (Eco-centrism) దృక్పథాన్ని రచయిత ఆవిష్కరించారు. రింగు వలలు యాజమాన్యం చేప పిల్లలను సైతం వేటాడటాన్ని అతను నిరసించడం, ప్రకృతిలోని ప్రతి జీవికి మనుగడ హక్కు ఉందనే 'డీప్ ఎకాలజీ'ని సూచిస్తుంది. ఆర్నే నెస్ అభిప్రాయం ప్రకారం, నవలలో పోలారావు "సంపద, వనరులు అందరివి కావాలి" (శ్రీనివాసరావు 205) అని అనడంలో మానవ అవసరాలతో సంబంధం లేకుండా ప్రకృతికి ఉన్న అంతర్గత విలువను గుర్తించడమే అవుతుంది:
"The well-being and flourishing of human and nonhuman life on Earth have value in themselves" (Naess 68).
సముద్రంపై మనిషి గీసుకున్న కృత్రిమ సరిహద్దులు ప్రకృతి గతికి విరుద్ధమని, ఆ నియమాలను అతిక్రమిస్తే శిక్ష తప్పదని నవల హెచ్చరిస్తుంది. నల్లమారి అన్నట్లు, "ఎన్ని చేపల్ని పట్టాం... కచ్చితంగా తగులుతుంది" (శ్రీనివాసరావు 172) అనే మాటలు, కర్మ సిద్ధాంతంతో ముడిపడిన పర్యావరణ నిర్ణయవాదాన్ని ప్రతిబింబిస్తాయి. గ్లోట్‌ఫెల్టీ, ఫ్రమ్ అభిప్రాయపడినట్లు స్పష్టమవుతుంది:
"Nature operates on its own immutable laws, independent of human desires" (Glotfelty and Fromm 109).
మనిషి తన కోరికల కోసం ప్రకృతి నియమాలను ధిక్కరించినప్పుడు, ప్రకృతి తనదైన రీతిలో వైపరిత్యాలు రూపంలో సమాధానం చెప్తుంది; జైలు శిక్షను వారు ఒక ఆత్మశుద్ధి ప్రక్రియగా భావించడం ఇందుకు నిదర్శనం.
చివరగా, చమురు తెట్టు సమస్యను ఎదుర్కోవడానికి మత్స్యకారులు పోలారావు నాయకత్వంలో తీసుకున్న కార్యాచరణ, వారి 'సాంప్రదాయక పర్యావరణ జ్ఞానం' (TEK)కు నిదర్శనం. వ్యర్థాలు వచ్చే సమయంలో సముద్రంలోకి దిగవద్దని, చేపలు తినవద్దని పోలారావు ఇచ్చే సలహాలు ఫిక్రెట్ బెర్కెస్ నిర్వచించిన TEK కి తార్కాణంగా కనిపిస్తాయి:
"Traditional Ecological Knowledge represents a cumulative body of knowledge, practice, and belief, evolving by adaptive processes" (Berkes 5).
దీని ప్రకారం ఆధునిక సైన్స్ కన్నా మిన్నగా, తమ ప్రాంతపు నేల, నీటి స్వభావాన్ని అర్థం చేసుకున్న మత్స్యకారులు ఈ జ్ఞానం, పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ఎంతైనా ఆవశ్యకం. ఈ సిద్ధాంతాల ద్వారా పరిశీలించినప్పుడు, 'మున్నీటి గీతలు' కేవలం ఒక కథ మాత్రమే కాదు, ప్రకృతిని శాసించే మేధస్సు కంటే దానిని గౌరవించే వివేకమే గొప్పదని చాటిచెప్పే ఒక 'పర్యావరణ వేదాంతం'గా మనకు గోచరిస్తుంది.
5. ఐదు తెలుగు నవలల్లో ప్రతిఫలించే పర్యావరణ స్పృహ
తెలుగు సాహిత్యంలో పర్యావరణ స్పృహను ప్రతిబింబించే 'వనవాసి', 'రేగడి విత్తులు', 'గుర్రపుడెక్క', 'ఒంటరి', 'మున్నీటి గీతలు' నవలలు తులనాత్మక పరిశీలనను, పర్యావరణ విమర్శనా సిద్ధాంతాల సారాంశాన్ని ఇలా క్రోడీకరించుకునే అవకాశం ఉంది.
5.1. ప్రకృతి కేంద్రకవాదం - జీవన వ్యవస్థగా ప్రకృతి
సాంప్రదాయక సాహిత్య విమర్శ ఎల్లప్పుడూ మానవ కేంద్రక (Anthropocentric) దృక్పథంతో నడిచింది, కానీ ఈ ఐదు నవలలు ప్రకృతిని ఒక సజీవ వ్యవస్థగా, ఆత్మగల శక్తిగా గుర్తిస్తూ 'ఎకో-క్రిటిసిజం'కు కొత్త అర్థాలు జోడించాయి. 'వనవాసి' నవలలో అడవి కేవలం చెట్ల సమూహం కాదు, అది కథానాయకుడితో శ్వాసించే ఒక పాత్ర. అలాగే 'గుర్రపుడెక్క'లో గిరిజనులు జంతువులను, ప్రకృతిని కేవలం వనరులుగా చూడకుండా, ఒక పవిత్రమైన శక్తిగా భావించడం వారి లోతైన 'ఎకో-సెంట్రిక్' జీవన విధానాన్ని చాటుతుంది. ఇక్కడ ఆర్నే నైస్ (Arne Naess) ప్రతిపాదించిన 'డీప్ ఎకాలజీ' (Deep Ecology) సిద్ధాంతం ప్రధానంగా కనిపిస్తుంది. నర్సయ్య తన చేనును మేసిన గొర్రెలను కోపగించుకోకుండా, అడవిలో కరువు రావడం వల్లే అవి తన వైపు వచ్చాయని భావించడం, ప్రతి జీవికి ఈ భూమిపై అంతర్గత విలువ ఉంటుందనే సత్యాన్ని సాహిత్యపరంగా ఆవిష్కరించడం. ఈ నవలలు మనిషి ప్రకృతిని శాసించే యజమాని కాదని, ప్రకృతి గీసిన గీతల్లో ఒక భాగమని నిరూపిస్తాయి.
ఆర్నే నెస్ తన 'Ecology, Community and Lifestyle' (1989) గ్రంథంలో పర్యావరణ స్పృహను నిర్వచిస్తూ పేర్కొన్నారు:
"Environmental consciousness represents a shift in worldview from a human-centered (anthropocentric) to an earth-centered (ecocentric) paradigm, recognizing the interconnectedness of all living systems" (Naess 28-30).
అంటే, మనిషి తనను తాను ప్రకృతికి యజమానిగా కాకుండా, ఒక భాగస్వామిగా గుర్తించడమే అసలైన పర్యావరణ స్పృహ. ఈ భావం ఈ నవలల్లోని పాత్రల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, 'గుర్రపుడెక్క' నవలలో బుడ్డన్న ఎలుగుబంటును చంపకుండా "అదీ బతకాల... మేమూ బతకాల" అని అనడం, మనిషి-ప్రకృతి వ్యవస్థలు మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని (Interconnectedness) గుర్తించడమే అవుతుంది.
5.2. ఆధునికత, నగరీకరణ - పర్యావరణ విధ్వంసకర ప్రభావం
ఆధునికత, నగరీకరణ పేరుతో సంభవిస్తున్న పర్యావరణ వినాశనాన్ని ఈ నవలలు 'ఎకో-క్యాటాస్ట్రోఫీ' (Eco-catastrophe)గా చిత్రీకరించాయి. 'ఒంటరి', 'మున్నీటి గీతలు' నవలల్లో జేసీబీలు, రసాయనిక కర్మాగారాలు ద్వారా అడవులను, సాగరాలను విషతుల్యం చేయడం పట్ల రచయితలు వ్యక్తం చేసిన ఆవేదన, విలియం రుయెకర్ట్ సిద్ధాంతాన్ని గుర్తుకు తెస్తుంది. మానవుడి సాంకేతిక నైపుణ్యం, జీవశాస్త్ర పర్యావరణ వివేకం కంటే ఎంతో వేగంగా దూసుకుపోవడమే నేటి విధ్వంసానికి మూలం. 'మున్నీటి గీతలు'లో సముద్రంలో పారబోసే పారిశ్రామిక వ్యర్థాలు, కేవలం ఒక వస్తువుగా పరిగణించే ప్రకృతి ఎలా తనను తాను రక్షించుకోలేక మరణిస్తుందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అభివృద్ధి ముసుగులో ప్రకృతిని వస్తువుగా మార్చే వ్యవస్థాగత తప్పులే, నేడు మనం చూస్తున్న పర్యావరణ పతనానికి మూలకారణాలని ఈ నవలలు బలంగా వాదిస్తున్నాయి.
గ్లోట్‌ఫెల్టీ, ఫ్రమ్ తమ 'The Ecocriticism Reader' (1996) గ్రంథంలో వివరించారు:
"Environmental consciousness in literature is the capacity of the text to foster an awareness of the physical environment and the human role within the ecological web" (Glotfelty and Fromm xviii-xix).
ఒక సాహిత్యం పాఠకుడికి భౌతిక ప్రపంచం పట్ల అవగాహనను, పర్యావరణంలో మనిషి బాధ్యతను గుర్తు చేయడమే పర్యావరణ స్పృహ. ఈ నవలల విశ్లేషణలో, 'వనవాసి' నవలలో అడవిని ఒక సజీవ పాత్రగా చూపడం 'మున్నీటి గీతలు'లో సముద్ర కాలుష్యం పట్ల పోలారావు నిరసన తెలపడం, పాఠకుడిలో ఈ అవగాహనను పెంపొందించే ప్రయత్నాలే.
5.3. సాంప్రదాయక పర్యావరణ జ్ఞానం - సుస్థిరతకు మార్గం
విత్తన సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తున్న ఆధునిక వ్యవసాయ విధానాలకు భిన్నంగా, 'రేగడి విత్తులు', 'ఒంటరి' నవలలు గిరిజన, గ్రామీణ సాంప్రదాయక విజ్ఞానమే సుస్థిరమైన మార్గమని నిరూపిస్తాయి. 'రేగడి విత్తులు'లో ఆధునిక విత్తనాలు వల్ల నష్టపోయిన రామనాధం, స్థానిక రైతు బాలయ్య చెప్పినట్లు రేగడి నేల స్వభావాన్ని బట్టి పంటలు వేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకుంటాడు. అలాగే 'ఒంటరి' నవలలో అంతరించిపోతున్న 'అరికె' వంటి చిరుధాన్యాలు అన్వేషణ, ఆధునిక హైబ్రిడ్ ఆహారాల కంటే స్వదేశీ జ్ఞానమే ఆరోగ్యకరమని ఫిక్రెట్ బెర్కెస్ సిద్ధాంతాన్ని బలపరుస్తుంది. ఈ సాంప్రదాయక విజ్ఞానం అనేది కేవలం గతం కాదు; ఇది ప్రకృతితో సుస్థిరమైన సంబంధాన్ని కొనసాగించడానికి అవసరమైన సజీవ ప్రక్రియ. సాంకేతిక అభివృద్ధిని అమలు చేసేటప్పుడు స్థానిక విజ్ఞానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడమే నిజమైన పర్యావరణ స్పృహ.
పర్యావరణ స్పృహ అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిగత బాధ్యతాయుత ప్రవర్తన అని స్మెక్, షుల్ట్జ్ (2002) 'Psychology of Environmental Problems' గ్రంథంలో స్పష్టం చేశారు:
"Environmental consciousness is defined as the individual's perception of environmental problems and their willingness to assume personal responsibility for the protection of the environment" (Schmuck and Schultz 45-47).
'ఒంటరి' నవలలో రాఘవ అంతరించిపోతున్న 'అరికె' విత్తనాలు కోసం పడే తపన, కేవలం ఆరోగ్య శోధన మాత్రమే కాదు, పర్యావరణాన్ని కాపాడుకోవాలనే తన వ్యక్తిగత బాధ్యతను స్వీకరించడం. ఇది ప్రకృతితో తెగిపోయిన బంధాన్ని పునరుద్ధరించుకోవాలనే అతని నిబద్ధతను తెలియజేస్తుంది.
5.4. పర్యావరణ స్త్రీవాదం - ప్రకృతి మాతృత్వ బంధం
ప్రకృతిని పోషించే తత్వాన్ని, దానిని నాశనం చేసే పురుషాధిక్య ధోరణిని విశ్లేషించడంలో 'పర్యావరణ స్త్రీవాదం' (Ecofeminism) ఈ నవలల్లో కీలక భూమిక పోషిస్తుంది. 'రేగడి విత్తులు'లో సావిత్రి పాత్ర ప్రకృతిని తన కుటుంబంలో భాగంగా భావించి నాటడం, పెంచడం స్త్రీకి, ప్రకృతికి గల అవినాభావ సంబంధాన్ని సూచిస్తుంది. 'గుర్రపుడెక్క'లో మల్లయ్య వేపచెట్టును 'అమ్మ'గా భావించడం, వందనా శివ చెప్పినట్లు ప్రకృతిని ఒక మాతృమూర్తిగా ఆరాధించే సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ నవలలు మనిషి ప్రకృతితో ఏర్పరుచుకున్న జీవన ఒప్పందాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతున్నాయి. ప్రకృతి విధ్వంసం అనేది కేవలం భౌతికమైన నష్టం మాత్రమే కాదు, అది ఒక సామాజిక నైతికత లేని చర్య అని ఈ నవలలు చిత్రించాయి.
డైట్జ్, స్టెర్న్ (2002) 'New Tools for Environmental Protection'లో పర్యావరణ స్పృహను ఇలా నిర్వచించారు:
"Environmental consciousness refers to specific psychological factors - including environmental awareness, attitudes, and values that influence an individual’s environmental behavior" (Dietz and Stern 32-34).
పర్యావరణం పట్ల ఉండే జ్ఞానం, విలువలు మనిషి ప్రవర్తనను మార్చాలి. 'రేగడి విత్తులు'లో రామనాధం, స్థానిక రైతు బాలయ్య సూచన మేరకు తన సాగు పద్ధతులు మార్చుకోవడం, ప్రకృతి నియమాలకు అనుగుణంగా ప్రవర్తించడం ఈ ప్రవర్తనా మార్పుకు (Pro-environmental behavior) అద్భుతమైన ఉదాహరణ. నెస్ తన 'Ecology, Community and Lifestyle' (1989) గ్రంథంలో పర్యావరణ స్పృహను నిర్వచిస్తూ పేర్కొన్నారు:
"Environmental consciousness represents a shift in worldview - from a human-centered (anthropocentric) to an earth-centered (ecocentric) paradigm, recognizing the interconnectedness of all living systems" (Naess 28-30).
అంటే, మనిషి తనను తాను ప్రకృతికి యజమానిగా కాకుండా, ఒక భాగస్వామిగా గుర్తించడమే అసలైన పర్యావరణ స్పృహ. ఈ భావం ఈ నవలల్లోని పాత్రల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, 'గుర్రపుడెక్క' నవలలో బుడ్డన్న ఎలుగుబంటును చంపకుండా "అదీ బతకాల... మేమూ బతకాల" అని అనడం, మనిషి-ప్రకృతి వ్యవస్థలు మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని గుర్తించడమే.
6. పరిశోధన పత్ర ఫలితాంశాలు
- తెలుగు నవలలు ప్రకృతిని కేవలం కథా నేపథ్యంగా కాకుండా, మనిషితో పాటు శ్వాసించే, స్పందించే ఒక సజీవ అస్తిత్వంగా చిత్రించాయి. 'వనవాసి'లోని అడవి, 'గుర్రపుడెక్క'లోని చెంచు సంస్కృతి ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి.
- మానవ అవసరాల కంటే ప్రకృతికి అంతర్గత విలువ ఉంటుందనే 'డీప్ ఎకాలజీ' సిద్ధాంతం ఈ నవలల్లోని గిరిజన, గ్రామీణ పాత్రల జీవన విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి ప్రకృతికి యజమాని కాదని, భాగస్వామి మాత్రమేనని ఈ నవలలు బలంగా చాటిచెప్పాయి.
- ఆధునిక విజ్ఞానం విఫలమైన చోట, స్థానిక రైతులు, గిరిజనులు తరతరాల అనుభవజ్ఞానం పర్యావరణాన్ని ఎలా రక్షించాలో మార్గనిర్దేశం చేస్తుంది. 'రేగడి విత్తులు', 'ఒంటరి' నవలలు ఆధునిక హైబ్రిడ్ పద్ధతుల కంటే స్వదేశీ విజ్ఞానమే సుస్థిరమైనదని నిరూపించాయి.
- నగర విస్తరణ, పారిశ్రామికీకరణ పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ఈ నవలలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా 'మున్నీటి గీతలు', 'ఒంటరి' నవలల్లోని దృశ్యాలు, సాంకేతికతకు పర్యావరణ వివేకం తోడవ్వకపోతే మనిషికి ఎంతటి విపత్తు తప్పదో హెచ్చరిస్తున్నాయి.
- ప్రకృతిని మాతృమూర్తిగా భావించి, పాలిస్తూ రక్షించుకునే స్త్రీ తత్వానికి, పురుషాధిక్య దోపిడీ ధోరణులకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఈ నవలలు లోతుగా విశ్లేషించాయి. ప్రకృతిని ఒక కుటుంబ సభ్యునిలా చూసే సావిత్రి, మల్లయ్య వంటి పాత్రలు నైతికమైన పర్యావరణ బాధ్యతను గుర్తుచేశాయి.
- ఈ నవలలు కేవలం సాహిత్య ప్రక్రియలు మాత్రమే కాకుండా, మనిషి తన మనుగడను భూమి ఉనికితో ముడిపెట్టాలని సూచించే ఒక పర్యావరణ వేదాంతంగా నిలుస్తాయి. ప్రకృతిని శాసించే మేధస్సు కంటే, దానికి తలవంచి గౌరవించే వివేకమే మిన్న అని ఇవి ప్రామాణికంగా నిరూపించాయి.
ఉపసంహారం
తెలుగులో వచ్చిన వనవాసి, రేగడివిత్తులు, గుర్రపుడెక్క, ఒంటరి, మున్నీటి గీతలు అనే ఈ ఐదు నవలలు కేవలం పర్యావరణ సిద్ధాంతాలను బోధించడం కోసమే రాసిన నవలలని చెప్పలేం. కానీ, సమాజంలోని భౌగోళిక, సాంస్కృతిక మార్పులు నేపథ్యంలో పాత్రలు జీవన పోరాటాలను సహజంగా ఆవిష్కరిస్తాయని చెప్పడానికి అవకాశం ఉంది. 'వనవాసి'లోని అడవి, 'ఒంటరి'లోని నగర విస్తరణ, 'మున్నీటి గీతలు'లోని సముద్ర కాలుష్యం వంటి సందర్భాలు, మనిషి ప్రకృతితో తెగతెంపులు చేసుకున్నప్పుడు ఎదుర్కొనే ఒంటరితనాన్ని, సామాజిక సంబంధాలు క్షీణతను కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. ఇక్కడ పర్యావరణ స్పృహ అనేది ఉపాధిని, ఆరోగ్యాన్ని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అనివార్యమైన జీవన పోరాటంగా చిత్రించారు. పాత్రలు అనుభవించే మానసిక క్షోభ, భూమిపై వారు చూపే మమకారం, మనుషులు మధ్య ఏర్పడే సంఘర్షణల ద్వారా ప్రకృతికి, మనిషి ప్రవర్తనకు ఉన్న విడదీయలేని బంధాన్ని రచయితలు పరోక్షంగా ప్రతిబింబించారనిపిస్తుంది.
పాత్రలు ఎటువంటి సిద్ధాంత జ్ఞానం లేకుండానే, తమ నిత్య జీవిత అనుభవాల ద్వారా ప్రకృతితో సహజీవనం చేసే క్రమంలో పర్యావరణ స్పృహను సహజంగానే అలవర్చుకున్నట్లు వర్ణించడంలోనే రచయితలు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారనుకోవచ్చు. 'గుర్రపుడెక్క'లోని చెంచులు జీవనశైలి, 'రేగడి విత్తులు'లో రత్తయ్యకు తన మట్టిపై ఉండే మమకారం, కేవలం ఆచారాలు కాకుండా ప్రకృతిని గౌరవించే నైతిక బాధ్యతగా నిలుస్తాయి. పారిశ్రామికీకరణ, ఆధునిక వ్యవసాయ విధానాల వల్ల ఏర్పడే భౌగోళిక మార్పులను పాత్రలు ఎదుర్కొనే తీరు, మనిషి ప్రకృతిని శాసించే యజమానిగా కాకుండా, ఆ వ్యవస్థలో ఒక భాగస్వామిగా ఉన్నప్పుడే జీవన సమతుల్యత సాధ్యమవుతుందని నిరూపిస్తుంది. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ నవలలు మానవ సంబంధాలు పరిణామాలను విశ్లేషిస్తూ, మనిషి మట్టిని, ప్రకృతిని ప్రేమిస్తేనే తన ఉనికిని కాపాడుకోగలడని ఒక జీవన సత్యాన్ని సహజంగానే మన ముందు ఉంచుతాయి. ఈ ఐదు నవలలు తెలుగు సాహిత్యంలో 'పర్యావరణ స్పృహను' ఒక వ్యవస్థీకృత నమూనాగా మార్చాయి. ఇవి కేవలం ప్రకృతిని వర్ణించడమే కాకుండా, పర్యావరణ విమర్శనా సిద్ధాంతాలలోని 'నియమవాదం', 'సాంప్రదాయక విజ్ఞానం', 'అంతర్గత విలువ' వంటి అంశాలను పాత్రలు సంఘర్షణ ద్వారా అద్భుతంగా ఆవిష్కరించాయి. మనిషి తన పరిధిని దాటి ప్రకృతిని శాసించాలనుకున్నప్పుడు ఎదురయ్యే వైపరీత్యాలను, తిరిగి పర్యావరణ వివేకంతోనే బతుకును కాపాడుకోగలమని ఈ నవలలు ప్రామాణికంగా చెబుతున్నాయి. ప్రకృతిని శాసించే మేధస్సు కంటే, దానిని గౌరవించే వివేకమే గొప్పదని ఈ నవలలు చాటిచెప్పే ఒక 'పర్యావరణ వేదాంతం'గా మనకు గోచరిస్తాయి. ఈ నవలలే కాకుండా పర్యావరణ సమస్యలను చిత్రించిన మరికొన్ని నవలలు ఉన్నాయి.
పరిశ్రమలు సృష్టిస్తున్న కాలుష్యం జనజీవనంపై చూపిన దుష్టభావం ప్రాణ్‌రావు ‘‘నీలిపాప’’ నవలలో బయటపెట్టారు. అభివృద్ధి పేరిట విస్తరిస్తున్న పరిశ్రమలు పర్యావరణానికి, మనిషి మనుగడకు ప్రమాదంగా ఎలా పరిణమించాయో ఇందులో చూడవచ్చు. ఆనకట్టలు నిర్మాణం వల్ల జరిగే సాధక బాధకాలను ఒక గ్రామం ప్రాతిపదికగా పరిసరాలు, కాలుష్యం, నీటి సమస్య వంటి పర్యావరణ సమస్యలతో చర్చించింది ‘‘దృశ్యాదృశ్యం’’ (చంద్రలత) నవల. జి.ఎస్.ఆర్. కృష్ణమూర్తిగారి ‘అడవి బతుకులు’ కార్పొరేట్ శక్తులు, ప్రభుత్వాలు కుట్రలు వల్ల అడవిని నమ్ముకున్న ఆదివాసీలు జీవనం ఎలా అగమ్యగోచరంగా మారుతుందో చూపిస్తుంది. ఒకప్పుడు సమష్టి వ్యవసాయంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన కొల్లేటి ప్రాంతంలోని ఒక గ్రామ వాసి వర్తమాన బీభత్సాన్ని చూసి బెంగటిల్లి తలచుకున్న జ్ఞాపకాలు వలపోత అక్కినేని కుటుంబరావు రాసిన ‘కొల్లేటి జాడలు’ ఇలా మరికొన్ని తెలుగు నవలల్లో కూడా పర్యావరణ అంశాలు కనిపిస్తున్నాయి. ఈ పత్రంలో మాత్రం కేవలం ఐదు నవలల్ని మాత్రమే పరిధిగా తీసుకొని కొంచెం లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేశాం.
ఉపయుక్త గ్రంథసూచి
తెలుగు:
- గడ్డిపాటి, శ్రీకాంత్. (2018, మే). ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు. ఈమాట. https://eemaata.com/em/issues/201805/15918.html
- చంద్రలత. (1997). రేగడి విత్తులు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA).
- చక్రవర్తి, సి. హెచ్. (2023, జూన్). ప్రాచీనకవిత్వం: పర్యావరణ స్పృహ, చైతన్యం. ఔచిత్యం. https://www.auchithyam.com/2023/jun_2023/full_papers/june23_08.php
- చలం, జి. ఎస్. (2006). 1991 – 2005 తెలుగు నవల – విస్తరించిన వివిధ కోణాలు. ఈమాట. https://eemaata.com/em/library/ata-2006/284.html?allinonepage=1
- నళిని, ఎస్. ఎస్. (1999). సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ. రమేష్ పబ్లికేషన్స్.
- నీరజ, జె. (2024, ఏప్రిల్ 1). కొల్లేటి జాడలు నవల – పర్యావరణ వివేచన. డెక్కన్ ల్యాండ్. https://deccanland.com/2024/04/01/kolleti-traces-novel-environmental-analysis/
- బందోపాధ్యాయ, బి. (2023). వనవాసి (సూరంపూడి సీతారాం, అను.; అసలు ప్రచురణ 1938). హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
- మారుతి, శ్రీపతి. (2025, ఫిబ్రవరి). ఆధునిక తెలుగు కథాసాహిత్యం: పర్యావరణవాద చైతన్యం. ఔచిత్యం. https://auchithyam.com/2025/feb_2025/full_papers/february25_10.php
- సలీమ్. (2013). గుర్రపుడెక్క. విజయలక్ష్మి పబ్లికేషన్స్.
- శ్రీనివాసరావు, చింతకింది. (2022). మున్నీటి గీతలు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA).
- వెంకటరామిరెడ్డి, సన్నపురెడ్డి. (2017). ఒంటరి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA).
English:
- Bamberg, S., & Möser, G. (2007). Twenty years after Hines, Hungerford, and Tomera: A new meta-analysis of psycho-social determinants of pro-environmental behaviour. Journal of Environmental Psychology, 27(1), 14–25.
- Berkes, F. (2017). Sacred ecology (4th ed.). Routledge.
- Dietz, T., & Stern, P. C. (Eds.). (2002). New tools for environmental protection: Education, information, and voluntary measures. National Academies Press.
- Dunlap, R. E., & Jones, R. E. (2002). Environmental concern: Conceptualizing and measuring an elusive concept. In R. E. Dunlap & W. Michelson (Eds.), Handbook of environmental sociology. Greenwood Press.
- Glotfelty, C., & Fromm, H. (Eds.). (1996). The ecocriticism reader: Landmarks in literary ecology. University of Georgia Press.
- Guha, R. (2000). Environmentalism: A global history. Longman.
- Leopold, A. (1949). A sand county almanac and sketches here and there. Oxford University Press.
- Mies, M., & Shiva, V. (2014). Ecofeminism (2nd ed.). Zed Books.
- Naess, A. (1973). The shallow and the deep, long-range ecology movement: A summary. Inquiry, 16(1-4)
- Naess, A. (1989). Ecology, community and lifestyle: Outline of an ecosophy. Cambridge University Press.
- Naess, A. (1995). The deep ecological movement. In G. Sessions (Ed.), Deep ecology for the 21st century (pp. 64–84). Shambhala.
- Schmuck, P., & Schultz, P. W. (Eds.). (2002). Psychology of environmental problems. Lawrence Erlbaum Associates.
- Schultz, P. W. (2001). The structure of environmental concern: Concern for self, other people, and the biosphere. Journal of Environmental Psychology, 21(4).
- Shiva, V. (1993). Monocultures of the mind: Perspectives on biodiversity and biotechnology. Zed Books.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

