headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-07 | June 2023 | ISSN: 2583-4797

8. ప్రాచీనకవిత్వం: పర్యావరణస్పృహ, చైతన్యం

dr_ch_lakshmanachakravarti
డా. సిహెచ్. లక్ష్మణచక్రవర్తి

సహాయ ఆచార్యులు,
తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం,
డిచ్పల్లి, నిజామాబాదు, తెలంగాణ.
సెల్: +91 9849714261. Email: chakravarthy.hyd@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ప్రకృతిని ప్రేమించిన వారిగా, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించిన వారిగా, ఆరాధించినవారిగా, పోషించినవారిగా ప్రాచీనులు కనిపిస్తారు. ప్రకృతి వినాశనం కాకుండా ఉండాలంటే ఏమి చేయాలో తెలిసిన వారిగా ప్రాచీనులు ఉన్నారు. అలా ఉన్న, కనిపించిన రీతిని ప్రాచీన కావ్య ప్రబంధాలను ఆధారం చేసుకుని ఆయా కవులరి కాలపు పర్యావరణ చైతన్యాన్ని అవగాహన లోకి తెచ్చుకోవటం, పర్యావరణస్పహను ప్రాచీన కావ్యాలలో చూడడం ఈ వ్యాసపరిధి. సమాజం, మనిషి, ప్రకృతి, వ్యవస్థలు కాలుష్యం అయిన కాలంలో పర్యావరణ వాద సాహిత్య విమర్శ బయలుదేరింది. ప్రాచీన కావ్య ప్రబంధాలలో కనిపించే వర్ణనలు, వృక్షశాస్త్రం, వ్యావసాయిక జీవితాన్ని చెప్పే శాస్త్రకావ్యాలు. ఇతిహాస, పురాణ, కావ్య కథలను పర్యావరణ దృక్పథంతో అన్వయించుకుని పరిశీలించటం ద్వారా కావ్య ప్రబంధాలలోని పర్యావరణ చైతన్యం తెలుస్లుంది. పర్యావరణ దృష్టితో ఆర్. సీతారామారావు గోరటి వెంకన్న పాటలను విశ్లేషించారు. తల్లావజ్ఝల శివాజీ రామాయణ భారత భాగవతాల నుంచి పర్యావరణ దృష్టితో ఉన్న వాటిని సంకలనం చేశారుప్రాచీన కావ్యాలలో ప్రకృతి వర్ణనలు పి.వి. చలపతిరావు, ప్రాచీన కావ్యాలలో గ్రామీణ జీవన చిత్రణ మసన చెన్నప్ప, తెలుగులో శాస్త్ర కావ్యాలను గురించి కె. కుసుమాబాయి వంటి వారు పరిశోధనలు చేశారు. ఏదైనా ఒక కావ్యాన్ని ఎన్నుకుని పరిశోధించిన వారు కూడా ఆయా వర్ణనల విశిష్టతను వివరించారు.. కానీ పర్యావరణ దృష్టిలో చూడలేదు. అలా చూడవలసిన అవసరాన్ని ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: ప్రకృతి, కాలుష్యం, పర్యావరణవాదవిమర్శ, పర్యావరణచైతన్యం, పర్యావరణస్పృహ.

1. ఉపోద్ఘాతం:

సాహిత్య విమర్శరీతులలో పర్యావరణవాదం, పర్యావరణవాద విమర్శ ప్రపంచమంతా ఇటీవల ఒక అధ్యయన విధానంగా ఎదిగింది. రచయిత, పాఠకుడు, రచన, సమాజకేంద్రకమైన సాహిత్య అధ్యయన రీతులలో రచనా కేంద్రంగా ఈ విమర్శ కొనసాగుతుంది. రచనలో, పర్యావరణాన్ని, ప్రకృతిని అధ్యయనం చేయటం ఈ పద్ధతి విమర్శలో కనిపించే అంశం. మనిషికి ప్రకృతికి ఉండవలసిన సంబంధాన్ని గురించి చెప్పడం మాత్రమే కాకుండా ప్రకృతి విధ్వంసానికి కారణమైన మూలాలలోకి వెళ్లి దానికి గల కారణాలను అన్వేషిస్తుంది. ఈ సాహిత్య విమర్శరీతి. మనిషి ప్రకృతిని అదుపులోకి తీసుకోవడం ద్వారా ఎంత వినాశనం జరుగుతుందో, ఎంతటి విధ్వంసం సంభవిస్తుందో ఈ వాదం చర్చిస్తుంది. మనిషి ప్రకృతికి ఒదిగి ఉండాలి దానిపై ఆధిపత్యం చేసే ప్రయత్నం చేస్తే చివరికి మనిషి వినాశనానికి అది దారితీస్తుందని చెబుతుంది పర్యావరణ వాదం. ఈ వాదం దేశం, కాలం, వ్యక్తి, కులం, లింగం, వర్ణం వంటి అంశాలకు పరిమితమైనది కాదు.1 తనకు ప్రకృతికి గల సంబంధాన్ని అవగాహనలోకి తెచ్చుకోవడం, ప్రకృతి వలన పొందవలసిన ప్రయోజనాలను తెలుసుకోవడం, ప్రకృతి సమతౌల్యానికి గల కారణాలను వెతకడం, ప్రకృతిని రక్షించే బాధ్యత మనిషిదే అన్న నిర్ణయంలోకి రావడం అంతా పర్యావరణ స్పృహలోకి వస్తుంది. దానికి తగిన అడుగులు వేయటం పర్యావరణ చైతన్యం అవుతుంది. ఈ స్పృహను, చైతన్యాన్ని సమాజంలోనూ సాహిత్యంలోనూ వెతకటం పర్యావరణ వాద విమర్శ అవుతుంది. ప్రకృతి విధ్వంసమే మానవ విధ్వంసానికి మూలమన్న భావనను పర్యావరణ విమర్శకులు ప్రచారం చేస్తారు. సాహిత్య విమర్శ రీతులలో కొన్ని ఏ కాలానికైనా అన్వయించి చూడదగినవిగా ఉంటాయి. అటువంటి వాటిలో పర్యావరణ వాద విమర్శ కూడా ఒకటి.

2. పర్యావరణ స్పృహ -చైతన్యం:

ప్రాచీన తెలుగు సాహిత్యం పై సంస్కృతప్రభావం ఉందన్నది కాదనలేని సత్యం. వ్యాకరణం, చందస్సు, అలంకారశాస్త్రం, ధర్మశాస్త్రగ్రంథాలు మొదలు ఇతిహాస, పురాణ, కావ్య రచనలన్నిటి పైన ఆ భాషాప్రభావం కనిపిస్తుంది. పర్యావరణవిషయంలో కూడా ఈ ప్రభావాన్ని దాటుకొని చెప్పేందుకు వీలు లేదు. ప్రాచీనసాహిత్యంలో పర్యావరణస్పృహను, చైతన్యాన్ని ఈ కింది రీతులుగా విభజించుకుని చూడవచ్చు.

  1. తెలుగు కావ్యాలలో కనిపించే వర్ణనలు.
  2. వృక్షశాస్త్రం, వ్యావసాయక జీవితాన్ని చెప్పే శాస్త్రకావ్యాలు.
  3. కావ్య ప్రబంధాలను పర్యావరణ దృక్పథంతో అన్వయించుకుని పరిశీలించటం.

2.1 వేద ఇతిహాసపురాణాలు పర్యావరణ స్పృహ:

వేదం ప్రభు సమ్మితమని, ఇతిహాసాలు మిత్ర సమ్మితమని, కావ్యాలు కాంతా సమ్మితమని ఆలంకారికులు వాఙ్మయాన్ని విభజించారు. వేదాలు రాజులా శాసిస్తే, ఇతిహాస పురాణాలు మిత్రుడిలా బోధిస్తాయి. కావ్యాలు భార్యలా ఆనందింప చేస్తాయన్నది ఆలంకారికుల నిర్ణయం.
వేద ఉపనిషత్తులలో పర్యావరణాన్ని రక్షించుకోవాలన్న దృష్టితో శాసన వాక్యాలు కనిపిస్తాయి. పంచభూతాలతో ప్రకృతితో సామరస్యమయిన జీవితం ఉండాలని తత్త్వశాస్త్రం (వేదాంతం) బోధిస్తే, అర్థశాస్త్రం అటవీసంరక్షణ, వన్యప్రాణుల నిర్వహణను గురించి చెబుతుంది, రాజ్యాన్ని నగరాన్ని నిర్మించుకోవాలనే వ్యక్తికి ఋతువులు, పక్షులు, జంతువులు వృక్ష సంపద గురించిన జ్ఞానం ఉండాలంటుంది. నగరాన్ని నిర్మించాలని భావించే వ్యక్తి ముందు కొత్తగా ఒక అటవీ ప్రాంతాన్ని సృష్టించాలని, చెట్లను పెంచాలని అర్థశాస్త్రం చెబుతుంది. ఈ అంశాలు శాసన రూపంలో ఉన్న పర్యావరణ స్పృహను, చింతనను మన ముందు నిలుపుతాయి.
ఇతిహాస, పురాణాలు మిత్రసమ్మితాలు. రామాయణ, భారత, హరివంశాలు, అష్టాదశ పురాణాలు తెలుగులోకి కొంత ప్రక్రియావైవిధ్యంతో వచ్చాయి. మూలంలోని భావమే అయినా రచనాకాలంలోని మార్పు వలన చెప్పే రీతిలో వైవిధ్యం కనిపిస్తుంది.

ద్వైతవనంలో పాండవులు వారిని ఆశ్రయించి ఉన్న వారంతా తన చుట్టూ ఉండగా ఒకరోజు ధర్మరాజుకు ఒక కల వస్తుంది. 'ద్వైత వనంబున ధర్మ రాజుండొకనాడు నిద్రింపగా తద్వనేచరంబు'2 అన్న సీస పద్యంలో అడవిలోని జంతువులన్నీ వచ్చి ఇలా మొరపెట్టుకుంటాయి. అయ్యా మీరు నిత్యం మమ్మల్ని వేటాడి చంపడం వలన మా జాతుల సంఖ్య పూర్తిగా పడిపోయి బీజప్రాయంగా మిగులుతాము. పూర్తిగా మేము అంతరించే లోగా మీరు వేరే చోటికి వెళితే మేము బతకగలము అంటాయి. మరుసటిరోజే ధర్మరాజు మరోచోటికి బయలుదేరుతాడు ఈ ఘట్టం వన్యప్రాణి రక్షణను గుర్తుచేస్తుంది.

ఆంధ్ర మహాభాగవతంలో శ్రీకృష్ణుడు బృందావనం దాటి కొంత దూరంగా ఆవుల్ని తోలుకు వెళ్లి మేపుతున్న సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తనతో ఉన్న గొల్లవారు ఆ ఎండకు తాళలేక నీరసించి పోతున్నారు అక్కడ విశాలంగా గొడుగు లాగా విస్తరించిన నీడనిచ్చే చెట్లు కనిపించాయి కృష్ణుడికి. తనతో బలరాముడు శ్రీదాముడు, గోపాలకులున్నారున్న సందర్భంలో చెప్పిన పద్యం చెట్టు ప్రయోజనాన్ని చెబుతుంది.

అపకారంబులు సేయ వెవ్వరికి నేకాంతంబులందుండు నా
తప శీతానిల వర్ష వారణములై త్వగ్గంధ నిర్యాస భ
స్మ పలాశాగ్ర మరందమాల కుసుమచ్చాయా ఫల శ్రేణిచే
నుపకారంబులు సేయు నర్థులకు నీ యుర్వీజముల్ గంటిరే3 (10- 1- 850)

ఈ చెట్లు ఎవరికి అపకారం చేయవు. ఏకాంతంగా ఉంటాయి. ఎండ, చలి, వానల నుండి ప్రజలను కాపాడుతాయి. వారికి అవసరమైన బెరడు, గంధం, జిగురు, బూడిద, చిగుళ్ళు, తేనే, పూలు, పండ్లు, నీడను ఇచ్చి ఆదుకుంటాయని వృక్ష తత్త్వ బోధనను ఒక మిత్రుడిగా చేశాడు కృష్ణుడు.
పురాణ ఇతిహాసాలు గాలి నీరు చెట్టు చేమల ప్రయోజనాలను చెబుతున్నట్టుగా ఉన్న వాక్యాలు మిత్ర సమ్మితంగా ఉన్నాయి. ఇది పురాణేతిహాసాలలో కనిపించే పర్యావరణ స్పృహ. శ్రద్ధ.

2.2 తెలుగు కావ్యాలలో కనిపించే వర్ణనలు పర్యావరణ స్పృహ:

కావ్యం కాంతా సమ్మితం. శాసించడము బోధించడం దాని ధర్మం కాదు. అందువల్ల ప్రకృతిలో భాగమైన చెట్టు, చేమ, పుట్టా, పురుగు, పక్షి, జంతువు, గాలి, నీరు, భూమి, వనం, మేఘాలను అవి అందంగా వర్ణిస్తాయి.

సింహాసన ద్వాత్రంశికలో చింత చెట్టును ఆరు కందపద్యాలలో కొరవి గోపరాజు వర్ణించాడు

 కం.  చింత మదిలేక మనుజులు
       
చింతించిన కొలది చెవులు చేకూర్చుచు ని
       
శ్చింతులుగా నొనరించెడు
       
చింతకు సరిగలదే లోక చింతామణి...4

చింత చెట్టు స్వభావం, వైశిష్ట్యం చెప్పడమే ఇక్కడ కవి లక్ష్యం. తెలుగు కావ్యాలలో ఉన్న వృక్ష వర్ణనలు అన్ని ఆయా చెట్ల విలక్షణతను మన ముందు నిలుపుతాయి.

చిలుక బాపన కొలంబుల బండుగుల కెల్ల గలితామ్ర ఫలకోటి గ్రాస మొసగు5 (3-96) అన్న కువలయాశ్వచరిత్ర పద్యంలో పక్షులను చాతుర్వర్ణ్యాలతో పోల్చడం ద్వారా వాటి వైవిధ్యాన్ని చెప్పినట్లు భావించవచ్చు. మొల్ల రామాయణంలో ‘బ్రహ్మాండమడలంగ పటపట ధ్వనులతో6 (కిష్కింధ- 9) అన్న పద్యంలో వాన కురిసిన రీతిని సహజంగా వర్ణించింది.

తెలుగు కావ్యాలలో అందునా ప్రాచీన కవిత్వంలో అష్టాదశ వర్ణనలలో కొన్నయినా ఉంటాయి. వాటిలో ఋతువులు, పశుపక్ష్యాదులు, గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశాలను వర్ణించిన భాగాలు కనిపిస్తాయి. ఈ వర్ణనలు అన్నీ వేద ఇతిహాస పురాణాలలో ఒక ధర్మాన్ని చెప్పినట్టుగా కాక ఆయా వస్తువులను, అంశాలను అందంగా మన ముందుకు తెచ్చాయి, వాటిని సౌందర్యాత్మకంగా, కళాత్మకంగా పాఠకుల ముందుకు వర్ణనల రూపంలో కవులు తెచ్చారు, వాటిని వర్ణించటం ద్వారా మనకు అనుభూతిని కలిగించారు, ఆ అనుభూతిని లోకంలో ఉన్న ఆయా అంశాలను చూసి అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు ప్రకృతి, పశుపక్ష్యాదుల పట్ల అతడికి ఒక దగ్గరితనం ఏర్పడుతుంది. మనిషి అనుభవజగత్తులోకి వాటిని తెచ్చి అనుభూతిమయం చేసే స్వభావం ప్రాచీన కవిత్వపు వర్ణనలలో కనిపిస్తుంది.

తన చుట్టుపక్కల ఉన్న వాతావరణం పట్ల తాదాత్మ్యాన్ని కలిగించటం ద్వారా పర్యావరణ విధ్వంసానికి, వినాశనానికి అతడు పాల్పడకుండా ఉండేందుకు తెలుగు కావ్యాలు పరోక్షంగా ప్రయత్నించాయనవచ్చు. జంతు వర్ణనైనా, ప్రకృతి వర్ణనైనా, మరింకే వర్ణనైనా దాని ప్రయోజనాన్ని చెప్పే లక్ష్యంతో కాక దాని వైలక్ష్యణ్యాన్ని, అదిచ్చే ఆనందాన్ని స్వాభావికంగా చెప్పడానికి తెలుగు కావ్యాలు ప్రయత్నించాయి. ఒక కళాఖండం లాంటి వస్తువుని గదికి అందాన్ని ఇచ్చే దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఆ వస్తువు యొక్క అందం, దాని విలువ మన జాగ్రత్తకు ప్రవర్తనకు కారణమైనట్లే, కవుల వర్ణనలలోని అంశం కూడా ప్రకృతి సౌందర్యాన్ని పర్యావరణ విలువను చెప్పటంగా చూడాలి. ఇది ప్రాచీనుల పర్యావరణ చైతన్యానికి ఉదాహరణగా నిలుస్తుంది. వస్తువును ప్రకృతిని సౌందర్యాత్మకంగా మనిషి ముందు నిలపటం ద్వారా వారు పర్యావరణ పరిరక్షణ చేశారనవచ్చు.

2.3 వృక్షశాస్త్రం, వ్యావసాయిక జీవితాన్ని చెప్పే శాస్త్రకావ్యాలు:

ప్రాచీన సాహిత్యంలో శాస్త్ర వాఙ్మయం కూడా ఒక ప్రధానమైన శాఖ. గణితం, సంగీతం, ఆయుర్వేదం, అశ్వశాస్త్రం, ధర్మశాస్త్రం మొదలైన విషయాలను ఎన్నుకొని కవులు శాస్త్ర కావ్యాలను రచించారు. రెట్టమత శాస్త్రము అన్న రచన వృక్ష శాస్త్రాన్ని బోధిస్తుంది. ఇది జ్యోతిషాన్ని సమన్వయించుకున్న రచన. రెట్ట ఘనుడు కన్నడలో రాసిన గ్రంథం కాబట్టి రెట్టమత శాస్త్రంగా ఇది ప్రసిద్ధమయింది. “వర్షాదిహేతువులగు భూజాతపరీక్షయు, గోప్రజార్చనా శకునంబును, దూత లక్షణంబును, మేఘ లక్షణంబును, విద్యుల్లక్షణంబును, గర్జిత లక్షణంబును, ఇంద్ర చాప లక్షణంబును, పరివేష లక్షణంబును, ప్రతి సూర్యాతప వాయులక్షణంబును, గ్రహ యుధ్ధ లక్షణంబును, బీజావాఫలక్షణంబు, అర్ఘ లక్షణంబును, గ్రహ లక్షణంబును, ఆకస్మిక లక్షణంబును, గ్రహచారాస్తమయోదయ లక్షణంబును, గ్రహబల లక్షణంబును, గురూదయాబ్ద సంవత్సర ఫల లక్షణంబును, సంవత్సరాది ఫలంబును వివరించి యుండునందు7 అని రెట్టమత శాస్త్రంలోని అంశాలను చెప్పుకున్నాడు అయ్యలరాజు భాస్కరుడు. జ్యోతిషాన్ని సమన్వయించుకున్న వ్యవసాయోపకరమైన విషయాలు, వృక్ష పరిరక్షణాంశాలు, వాయు, వర్ష లక్షణాలు ఇందులో ఉన్నట్లు పై వచనం ద్వారా తెలుస్తుంది.

ఈ రెట్టమతశాస్త్రకావ్య రచనకు గర్గుడు, హరిభట్టు, ధన్యుడు, శ్రీపతి, వరాహమిహిరుడు, నారాయణ భట్టు వంటి వారి ఆలోచనలు మేఘమాలిక అన్న శాస్త్ర గ్రంథం మూలాలుగా గ్రహించినట్లు కవి చెప్పుకున్నాడు. వీటితోపాటు పెద్దల ఆచరణ రీతిని, తాను అనుసరించిన దానిని గ్రహించి ఈ కావ్యాన్ని రచించానన్నాడు. వృక్ష పుష్ప ఫల లక్షణమన్న విభాగంలో ఏ రకమైన చెట్ల వలన ఏ రకమైన ధాన్యాలు. దినుసులు పండుతాయో చెప్పడం. ఏ కార్తెలలో వర్షం ఏ విధంగా కురుస్తుందో చెప్పడం తో బాటు చెట్ల పరిరక్షణ ఏ రకమైన ఫలితాలను పంటలను ఇస్తుందో ఈ కావ్యం చెబుతుంది. ఈ రచన మానవుడి జీవికకు అవసరమైన వ్యవసాయాన్ని, అది ఫలవంతంగా ఉండడానికి అనుకూలమైన చెట్ల పెంపకం అన్న అంశాలను చర్చించింది. దీనికి అనుకూలతను ఇచ్చే వాతావరణ విషయాలను వర్ణించడం ద్వారా మానవుడు తన జీవితం కొరకు పర్యావరణంతో కలిసి నడవవలసిన స్థితిని ఈ కావ్యం ప్రతిపాదించింది.

దోనయామాత్యుని సస్యానందం నాలుగు అధికారాలున్న వర్షశాస్త్రగ్రంథం. రెట్టమతశాస్త్రంలో అక్కడక్కడ మూఢనమ్మకాలుగా భావించే అంశాలు కనిపిస్తాయి కానీ సస్యానందంలో అది కూడా లేదు. వచ్చే సంవత్సరంలో వర్షం ఎంత పడుతుందో గ్రహగతులు చెప్పే అంశం ఒక రీతి అయితే, రైతులు తమకు తాముగా తెలుసుకునే పద్ధతిని ఈ కావ్యం ఒకచోట వివరించింది.

"దైవజ్ఞులాత్మ మీదటియేటి వర్షంబు
గొలదిని దెలియంగ గోరిరేని
పుష్య మాసంబున బున్నమ మునిమాపు
దొరకొని పలిమెడు దూది యుంచి
మడకలోపలబెట్టి మఱుగేమియులేని
పొడవున నిడివేగు బోకదూది
పిడువంగ ధారయై బెరసిన నయ్యేట
వాన కాలములోన వఱపులేదు
అందులేక కొన్ని బిందువులగునేని
మధ్యవృష్టి దూది మంచు నీట
దోగదేని వాన దోగదు మేదిని
చిన్మయ ప్రకాశ శ్రీ గిరీశ" 8 (1 - 42)

పుష్యమాసంలో పున్నమినాడు ప్రదోషసమయంలో పలిమెడు దూదిని నాగలికి తగిలించి ఆరుబయట పెట్టాలి. దూదికి ఆకాశానికి మధ్య ఏది అడ్డం ఉండకూడదు మరుసటి రోజు ఉదయం దాకా ఆ దూది అలాగే ఉండాలి. పొద్దున్నే ఆ దూదిని పిండాలి. ఆ దూది నుండి ధారగా నీళ్లు కారితే తరువాత సంవత్సరం వానలు బాగా కురుస్తాయని, కొన్ని చుక్కలు మాత్రమే కారితే మధ్య రకంగా వానలు కురుస్తాయని, మంచుకు దూది కొంచెం కూడా తడవకపోతే వానలు కురవవని ఈ పద్యం చెబుతుంది. దీన్ని తూల పరీక్ష అంటారు. వర్షం గురించి చెప్పడం ఇక్కడ గమనించదగింది. గాలి బాగా వీస్తే మబ్బులు చెదిరిపోతాయి వానలు పడవని గాలి వల్లనే ఉరుములు ఏర్పడతాయని వీటన్నిటికీ గాలే కారణమని ప్రాచీనులకున్న అవగాహన. దీనిని వాయులక్షణ విభాగంలో సస్యానందం చర్చించింది. వాతావరణ జ్ఞానం రైతుకి చాలా అవసరమైన అంశం.

వాతావరణ మార్పులను జంతువులే ముందుగా పసిగడతాయని ఆధునికశాస్త్రజ్ఞులంటారు. అలాంటిదే కాదు కానీ ఊరిలో కుక్కలు సూర్యోదయానికి సూర్యాస్తమయానికి కొంచెం ముందుగా అరవకుండా ఉంటే పైరులకు అవసరమైనంత వర్షం కురుస్తుందని9 దోనయామాత్యుడు చెప్పాడు. వర్షాలు బాగా పడటానికి అరణ్యాలను పెంచాలంటుంది ఈ కావ్యం. గంగుల శాయిరెడ్డి వర్ష యోగము ఆధునిక యుగంలో వచ్చిన వర్ష శాస్త్ర రచన.

ఈ శాస్త్ర గ్రంథాలను జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలుగా భావించడం వలన ఎక్కువ కాలం ఆ పరిధిలోని వీటిని గురించి ఆలోచనలు సాగాయి. ఇవి జ్యోతిష్య విషయాన్ని నేపథ్యంగా చేసుకుని వ్యవసాయ జీవనానికి అనుకూల సూత్రాలను ప్రతిపాదించాయి. రైతుకు గాలి, నీరు, భూమి ప్రధాన ఆధారాలు. ఆకాశం నుంచి వచ్చే వర్షం గురించి ఈ శాస్త్ర గ్రంథం చెబుతున్నది. అంటే నింగిని అక్కడి తేజస్సును కూడా కలుపుకున్నట్లే. గాలి నీరు, నింగి, భూమి, తేజస్సు మనిషికి, రైతుకి జీవనాధారాంశాలు. పంటలు సరిగ్గా పండటం పశుపక్ష్యాదుల మనుగడకు నాంది. మంచి చెట్లు పొలం గట్లపై ఉండడం చేనుకు ఎంత అవసరమో చెబుతూనే దానికి దగ్గరగా వనాలుండటం వానకు ఎంత ఉపయోగమో ఈ కావ్యాలు బోధించాయి.

2.4 కావ్య, ప్రబంధకథలు - పర్యావరణదృక్పథాన్వయం:

కావ్య ప్రబంధాలలో కనిపించే కొన్ని కథాంశాలను చారిత్రక, సామాజిక, రాజకీయ, మనస్తత్త్వ, మానవతా దృక్పథాల నుంచి చూసినట్లుగానే పర్యావరణవాద సూత్రాల నుంచి పరిశీలించవలసిన అవసరం ఉంది.

2.4.1 కావ్యాలు:

సింహాసన ద్వాత్రింశిక లో చెరువు తవ్వించిన వైశ్యుని కథలో అతడు నీటి కోసం అనేక తంటాలు పడవలసి వస్తుంది. చెరువులు తవ్విన తరువాత 32 మంచి లక్షణాలున్న ఒక మంచి వ్యక్తి రక్తపు బొట్టు చెరువులో పడితే నీరు వస్తుందనడం ధార్మికత, నైతికత ప్రకృతి మనకు సహకరించడానికి కారణమని చెబుతుంది. విక్రమార్కుడు రక్తాన్ని ధార పోయాలనుకుంటాడు. 

ఆతరి బార్థివుండు సమయంబిదె నిర్జన మంచు నిల్చి త
త్సేతువు మీద రక్తబలిదేవత నిష్ట దలంచి ధర్మవి
ఖ్యాతముగా బరోపకృతికై తల యిచ్చెదనంచు నుబ్బుచుం
చేతి కృపాణమల్ల మెడ జేర్చి మెరుంగులు తొంగలింపగన్

ప్రకృతి వికృతి కాకుండా ఉండడానికి ప్రభుత్వం, రాజు ఎంతటి ధార్మికుడు కావలసి ఉందో ఈ కథ చెప్తుంది. దానితో బాటు ప్రకృతిని ఆరాధించటంలో నైతికత ప్రాధాన్యాన్ని అవసరాన్ని ఈ కథ చెబుతుంది10.

వసుచరిత్ర ప్రబంధంలో శుక్తిమతీ కోలాహలులు నదికీ పర్వతానికీ సంకేతాలు. పర్వతం నదీ ప్రవాహానికి అడ్డుగా నిలవడం ఇందులో కనిపిస్తుంది. కథాకావ్యాలైన పంచతంత్రం శుకసప్తతి వంటి వాటిలో, మనుచరిత్ర, కళాపూర్ణోదయం, వసుచరిత్ర వంటిప్రబంధాలలో పక్షులు, జంతువులు పాత్రలుగా కనిపిస్తాయి. ఈ అంశాలను పర్యావరణ కోణం నుంచి చూడాలి.

3. ముగింపు:

ప్రకృతిని రక్షించవలసిన బాధ్యత మనిషిది. ప్రకృతిని తన ఉన్నతికి అనుకూలంగా మార్చుకొని దానితో సంబంధాన్ని కొనసాగించాలని ప్రాచీనసాహిత్యం బోధిస్తుంది. ప్రకృతిని కలుషితం చేయకపోవడం మానవత్వంగా, మానవతాధర్మంగా ప్రాచీనులు భావించారు. ప్రకృతిలోని వివిధ వస్తువులకు మానవత్వారోపణ చేసి కళాత్మకంగా సౌందర్యాత్మకంగా మన ముందు నిలిపారు. కావ్య ఆస్వాదనం సౌందర్యపార్శ్వంతో కూడినది. అది వర్ణనల రూపంలో తెలుగుకావ్యాలలో కనిపిస్తుంది. ఈ వర్ణనల సౌందర్యాన్ని అనుభూతి గాఢతలోకి తెచ్చుకున్నప్పుడు, ఆయా వస్తువులతో మమేకమైనప్పుడు పర్యావరణస్పృహ చైతన్యం అన్న జ్ఞానం లేకపోయినా ఆరాధిస్తాడు, రక్షిస్తాడు, పోషిస్తాడు. అటువంటి చైతన్యమే పర్యావరణ విషయంలో ప్రాచీన సాహిత్యమంతా పరచుకుని ఉంది.

4. పాదసూచికలు:

  1. జి. లక్ష్మీనరసయ్య, సాహిత్యవిమర్శలో ఆధునిక భావనలు వ్యాసం, ఎ.కె. ప్రభాకర్, సంపాదకుడు 2018 బహుళ. పు 45.
  2. ఎర్రన, ఆంధ్ర మహాభారతం. అరణ్యపర్వం 6 -98)
  3.  పోతన, ఆంధ్రమహాభాగవతం 10- 1- 850
  4. కొరవి గోపరాజు, సింహాసన ద్వాత్రింశిక 3-155 to 160
  5. సవరము చిననారాయణ నాయకుడు, కువలయాశ్వచరిత్ర (3-96)
  6. మొల్ల, రామాయణం (కిష్కింధ- 9)
  7. అయ్యలరాజు భాస్కరుడు, రెట్టమత శాస్త్రం 1-56 
  8. దోనయామాత్యుడు, సస్యానందం 1-42
  9. దోనయామాత్యుడు, సస్యానందం 3-26
  10. కొరవి గోపరాజు, సింహాసన ద్వాత్రింశిక 4-119

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అయ్యలుడు భాస్కరుడు, రెట్టమత శాస్త్రం. పురాణం సూర్యనారాయణతీర్థ (పరిష్కరణ) రాజరాజేశ్వరీ నికేతన ముద్రాక్షర శాల, మద్రాసు: 1981.
  2. ఎర్రన. ఆంధ్రమహాభారతం, అరణ్యపర్వం. సుబ్రహ్మణ్యం జి.వి. (సంపాదకుడు). తి.తి.దే. ప్రచురణ. తిరుపతి: 2020.
  3. గోపరాజు, కొరవి. సింహాసన ద్వాత్రింశిక. గడియారం రామకృష్ణశర్మ (సంపాదకుడు). ఆ.ప్ర.సా. అకాడమీ, హైదరాబాదు: 1982.
  4. దోనయామాత్యుడు. సస్యానందం. ఉన్నజ్యోతివాసు (సంపాదకుడు). రావికృష్ణకుమారి. చీరాల: 2016.
  5. పోతన, ఆంధ్రమహాభాగవతం. సముద్రాల లక్ష్మణయ్య (సంపాదకుడు). తి.తి.దే. ప్రచురణ. తిరుపతి: 2021.
  6. ప్రభాకర్, ఎ.కె. బహుళ. పర్స్ పెక్టివ్ పబ్లిషర్స్, హైదరాబాదు: 2018.
  7. మొల్ల, రామాయణం. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ (సంపాదకులు).పొ.శ్రీ. తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు: 2008.
  8. రామరాజభూషణుడు, వసుచరిత్ర. తంజనగరం దేవపెరుమాళ్లయ్య వ్యాఖ్య, శ్రీ రామరాజభూషణ సాహిత్యపరిషత్. భీమవరం: 2001.
  9. శివాజీ, తల్లావజ్ఝల. త్రిపథ ఛాయా రిసోర్స్ సెంటర్, హైదరాబాదు: 2019.
  10. సవరము చిననారాయణ నాయకుడు. కువలయాశ్వచరిత్ర. బాలసరస్వతీ ముద్రాక్షరశాల, కాకినాడ: 1903.

 

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]