headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-1 | January 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. శ్రీమన్మహాభారత ఆదిపర్వం: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం

డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ

సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం
శ్రీసత్యసాయి జిల్లా – 515134, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9966108560, Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

వ్యాసమహాభారతంలో ధర్మమార్మమును అనుసరించి స్వర్గగాములైన మహానుభావులు ఎందరో ఉన్నారు. ప్రతీపుడు, విదురుడు, భీష్ముడులాంటి పెద్దలు, ఎందరో మహర్షులు, రాజర్షులు వారివారి ధర్మాలను అనుసరించినవారు ఉన్నారు. వారందరిలో మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆదిపర్వమునుండీ స్వర్గారోహణపర్వంవరకూ కూడా ధర్మం తప్పకుండా దేవతలను కూడా విస్మయపరచి, స్వర్గారోహణమున ఇంద్రలోకమునకు సశరీరముతో చేరిన ఏకైక ధర్మపురుషుడిగా యుధిష్ఠిరుడినే మనం చెప్పుకోవాలి. మహాభారతంలోని ప్రతిపర్వంలో ధర్మరాజు యొక్క విశిష్టధర్మాచరణము, ఔన్నత్యము, పాఠకులకు, సహృదయులకు ఆశ్చర్యానందములను కలిగింపచేస్తాయి. మహాభారతంలో శ్రీకృష్ణభగవానుడి ప్రభావం కీర్తించబడిననూ మానవమాత్రులలో ముఖ్యతమముగా యుధిష్ఠరుడినే చెప్పుకోవటమనేది ఔచిత్యమును సంతరించుకుంటుంది. అందువలన ఈ వ్యాసంగమునందు ఆ మహాపురుషుని ధర్మానుసరణమునందలి విశేషాంశములను సహృదయులు పరిశీలించగలరు.

Keywords: మహాభారతం, ఆదిపర్వం, ధర్మజధర్మనిరతి, సోదరసంబంధాలు, లాక్షాగృహం, వివాహం, పట్టాభిషేకం

1. ఉపోద్ఘాతము:

వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ l పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ l l

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ l దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ l l

పుణ్యశ్లోకో నలోరాజా పుణ్యశ్లోకో యుధిష్ఠిరః

పుణ్యశ్లోకా చ వైదేహీ పుణ్యశ్లోకో జనార్దనః

ఈ వ్యాసవచనములు ధర్మజుని నలతుల్యత్వమును, జనర్థనతుల్యత్వమును తెలుపుతున్నాయి. యక్షప్రశ్నలు, నహుషప్రశ్నలు, రాయబార ఘట్టాలు, భీష్మ-ఆనుశాసనికిపర్వాలు, మహాప్రస్థాన, స్వర్గారోహణ సందర్భాలలో ధర్మజుని ధర్మజ్ఞత్వము సుస్పష్టమగుచున్నది.

ధర్మేచార్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ

యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్

 “ధర్మ అర్థ కామ మోక్షాల విషయంలో ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది. ఇందులో లేనిది ఇంకెక్కడా ఉండదు” అన్న వ్యాసవచనములలో మొదటి పురషార్ధమైన ధర్మము, ధర్మరాజు చేత ఎలా పాటించబడినదో, సోదరులలోనూ, భరతవంశంలోనూ, భారతదేశంలోనూ అందరికీ ఏవిధంగా ఆదర్శప్రాయమైనదో ఈ పద్దెనిమిది పర్వాల ఆధారంగా తెలుసుకుందాము.

2. జననవిషయము:

అంశావతరణపర్వమునందే భారతమునందిలి పాత్రధారులు ఏఏ అంశలతో జన్మించారో వర్ణిస్తూ, ధర్మదేవత అంశతో పుట్టినవాడు ధర్మరాజు అని చెప్పారు.

                                         ధర్మస్యాంశం తు రాజానం విద్ధి రాజన్ యుధిష్టరమ్       67.110

ఈ అంశములనే సవివరంగా వివరిస్తూ- కిందముడనే మహర్షి శాపంతో పాండురాజు, భార్యలసంగమముతో సంతానమును పొందలేక బాధ పడుతున్న సమయంలో, కుంతీదేవి- తాను దుర్వాసుని ద్వారా పొందిన మంత్రోపదేశవిషయాన్ని వివరించింది. ఆ మంత్ర ప్రభావంతో తాను ఆహ్వానించిన దేవతలు వచ్చి, పుత్రులను అనుగ్రహిస్తారు అనే విషయాన్ని వివరించింది. 

                                    యం యం దేవం త్వమేతేన మంత్రేణావాహయిష్యసి

                                    అకామో వా సకామో వా వంశం తే సముపైష్యతి. 13. 122

“రాజా! నీవు అనుమతిస్తే నేను, నీవు చెప్పిన దేవతలను ఆహ్వానించి  సంతానాన్ని పొంది నిన్ను ఆనందింపచేయటానికి సిద్ధంగా ఉన్నాను”, అనగానే పాండురాజు దైవానుగ్రహానికి పరమానంద భరితుడై ముందుగా యమధర్మరాజుని (ధర్ముడిని) కోరుకోమన్నాడు.

ఇంతమంది దేవతలు ఉండగా పాండురాజు యమధర్మరాజునే ఎందుకు కోరుకోమన్నాడు?

ధర్ముని బిడ్డకు అధర్మంపై మనస్సు మరలదు, నిరంతరం ధర్మబద్ధంగా ప్రవర్తిస్తాడు, అటువంటివాడే భరతవంశానికి నాయకుడు కావాలి. ధర్ముని వలన పుట్టబోయే బిడ్డ కురువంశంలో పరమ ధార్మికుడు కాగలడు అని భావించాడు పాండుడు. ఈ విషయంలో కొంచెం ఆలోచిస్తే - పాండురాజు వేట వ్యసనంలో తాను శాపానికి గురైన పశ్చాత్తాపంలో, ధర్మవర్తనం మీద మనసు పెట్టి, భరతవంశానికి కాబోయే మహారాజు ధర్మవర్తనుడే ఉండాలని, సాక్షాత్ ధర్మదేవతనే కోరుకున్నట్టు తెలుస్తుంది.

ధర్మమావాహయ శుభే స హి లోకేషు పుణ్యభాక్  17.122

కుంతీ ముందుగా భర్తకు ప్రదక్షిణ చేసి ధర్ముణ్ణి పూజించి ఆతరువాత దుర్వాసుడు ఉపదేశించిన మంత్రాన్ని ఉచ్ఛరించింది. వెంటనే దివ్యవిమానంలో సూర్యతేజస్సుతో భాసించే ధర్ముడు కుంతి ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆయన అనుగ్రహంతో చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో ఉండగా, సూర్యుడు తులారాశియందుండగా, శుక్లపక్షంలో పంచమినాడు అభిజిత్ లగ్నంలో ఉత్తముడైన కుమారున్ని కన్నది. అతడు పుట్టగానే అశరీరవాణి – “ఈ కుమారుడు నరోత్తముడై ధర్మాత్ములలో మేటి కాగలడు. పరాక్రమవంతుడు, సత్యవంతుడు కాగలడు. మహారాజుగా ముల్లోకాలలోనూ ప్రసిద్ధిని పొందుతాడు. తేజోయశస్సులతో విరాజిల్లుతాడు. యుధిష్టిరుడనే పేర సుప్రసిద్ధుడవుతాడ”ని పలికింది. ఈ విధంగా జన్మతః దివ్యత్వాన్ని సంతరించుకున్నవాడే కాక, సాక్షాత్తు ధర్ముడి అంశే ధర్మరాజుగా అవతారం దాల్చింది.

పాండుపుత్రులు ఐదుగురూ గుణరూపాలలో దేవతలను మించినవారు. శతశృంగ నివాసులైన మునులు వీరికి నామకరణాదులు నిర్వహించారు. వరుసగా యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ఈ పాండుపుత్రులు అయిదుగురు ఒక్కొక్క సంవత్సరం తేడాతో జన్మించారు.

3. సోదరరక్షణ బాధ్యత – బాల్యక్రీడలు:

“జ్యేష్ఠః పితృసమః” - సోదరరక్షణ బాధ్యత విషయంలో ధర్మరాజు తన సోదరులను తండ్రిలాగానే చూసుకున్నాడని చెప్పాలి. ఒక ప్రక్క ధర్మపథంలో నడిపిస్తూ, భీముడు ఆవేశపడుతున్న సందర్భాలన్నింటిలో సమయోచితంగా ప్రవర్తిస్తూ తన బాధ్యతను పూర్తిగా నిర్వహించిన యుధిష్ఠిరుడు మనకు మహాభారతంలో దర్శనమిస్తాడు.

అలాంటి ఒక ఘటన ఈ ఆదిపర్వంలో బాల్యక్రీడలలో జరిగింది. భీముడి అల్లరిని, బలాన్ని భరించలేక ధార్తరాష్ట్రులు విషాహారాన్ని పెట్టి జలపాతంలో పడవేశారు. పాతాళానికి చేరుకుని ఆర్యుకునిచేత మరింత శక్తిని వృద్ధిచేసుకుని ఎనిమిదవవ నాడు భీముడు తిరిగి ప్రాణాలతో రాజభావనానికి చేరుకున్నాడు. తన సోదరులకు దుర్యోధనుని దుశ్చేష్టను, నాగలోకంలో జరిగినది వివరించాడు.

తూష్ణీం భవ న తే జల్ప్యమిదం కార్యం కథంచన. 128.34

కానీ, ధర్మరాజు ఇటువంటి విషయాలలో మౌనంగా ఉండమని భీమునికి చెప్పారు. ఎందుకంటే వారు ఇప్పుడు తండ్రి లేనివారయ్యారు. పెదనాన్నగారి దగ్గర పెరుగుతున్నారు. వీరు చెప్పిన మాటకు విలువ ఉండకపోగా, ఉన్న ఆశ్రయం కూడా పోయి మరింత కష్టాలు పడవలసి వస్తుందని ముందుచూపుతో భీముడిని ఈ విషయంలో మౌనం వహించమని సూచించాడు ధర్మహృదయుడు. ఇంతవరకు సామాన్యులకు ఆలోచిస్తే అర్థమైపోతుంది. కానీ ధర్మరాజు హృదయాంతరంగం అంతకు మించి ఉంటుంది. ధృతరాష్ట్రుని ఆశ్రయంలో మనం జీవిస్తున్నాము. అందువలన బాధాకరమైన విషయాలు ఆయనకు తెలిపి తండ్రితోసమానమైన పెదతండ్రిగారి మనోక్లేశమునకు మనం కారణం కాకూడదు అనేది ధర్మజుని భావనలో ఉన్న ఔచిత్యము, అంతరార్థము. పెద్దలమీద ఆయనకున్న గౌరవము అటువంటిది. ఇటువంటి సంఘటనలలో ధర్మజుని శీలసౌందర్యము ప్రకటించబడుతున్నది. పెద్దల పట్ల ధర్మరారజుకు ఉన్న ఈ గౌరవభావనలు మహాభారతమంతా మనకు కనిపిస్తాయి.

ఇలాంటి సందర్భాలలో ధర్మజుడు సోదరులను,(ద్రౌపదిని కూడా) నిదానపరచి, సోదరులకు, కుటుంబానకి, తనవారికి ఎటువంటి అపకారమూ కలగకుండా కాపాడుకుంటూ బాధ్యతాయుతంగా నిర్వహించి, సోదరుడిగా, పెద్దవాడిగా తన కర్తవ్యాన్ని నిర్వహించిన సంఘటనలు దాదాపు ప్రతిపర్వంలోనూ దర్శనమిస్తాయి. విద్యాభ్యాస విషయంలో సమస్త విద్యలతో పాటు, భీమ-దుర్యోధనులు గదాయుద్ధంలో ద్రోణునికి మంచి శిష్యులయ్యారు. నకుల సహదేవులు కత్తి యుద్ధంలో ఆరితేరారు. యుధిష్టిరుడు రథం మీదనుండీ యుద్దం చేయటంలో నేర్పు గడించాడు. అర్జునుడు సమస్త విద్యలలో అందరినీ మించిపోయాడు.

కుమారుల అస్త్రవిద్యాప్రదర్శన అయిన సంవత్సరం తర్వాత, ధృతరాష్ట్రుడు ధర్మరాజుని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. అనతికాలంలోనే తన ధైర్యసాహసాలతో, దయాసహనాలతో శీలవర్తనాది గుణాలతో పాండురాజునే మరిపించేట్టు మంచి పేరు గడించాడు ధర్మరాజు. ప్రజలు ధర్మరాజు మీద చూపించే అపారమైన గౌరవమర్యాదలు, ప్రేమాభిమానాలు చివరికి కౌరవులకు కంటకప్రాయమయింది. ధర్మజుని ఆజ్ఞతో భీమార్జునులు సాధించిన విజయపరంపరలను, వారి సంపదలను చూసి దుర్యోధనుడు అసూయపడి, చివరికి ధృతరాష్ట్రుడిని ఒప్పించి పాండవులను వారణావతరానికి పంపించటం జరిగింది. ఈ సందర్భంలో మరొక ముఖ్యమైన అంశం చెప్పుకోవాలి.

4. లాక్షాగృహం:

ధృతరాష్ట్రుని ప్రేరణతో మంత్రులు వారణావత నగరం గురించి రోజుకో వార్త ప్రచారం చేశారు. పాండవులకి ఆ నగరం చూడాలనే కుతూహలాన్ని కలిగేట్టు చేశారు. చివరకు ధృతరాష్ట్రుడు పాండవులను పిలిచి- నాయనా! మంత్రులు రోజూ వారణావతర శోభను వర్ణిస్తున్నారు. మీరు వారణావత నగరాన్ని చూడాలని భావిస్తే సకుటుంబంగా వెళ్లి రండి. కొన్నాళ్ళు అక్కడ ఆనందం అనుభవించి మరలా హస్తినకు రావచ్చు అన్నాడు. ఆ మాటల అంతరంగం అర్థమైనా, బయటపడటానికి ఇది సమయం కాదని ధర్మరాజు అలాగే అని పెద్దలందరికీ నమస్కరించి బయలుదేరతామన్నాడు. (పెద్దలందరికీ నమస్కరిస్తున్నప్పుడు ఒక్కరు కూడా పాండవులను వెళ్ళకుండా నివారించలేకపోయారు. అది గమనించిన ధర్మజుడు ప్రయాణానికే సిద్ధమయ్యాడు.)

సమయం చూసి విదురుడు ధర్మరాజుకి హితవు పలుకుతూ జరగాల్సిన విషయం రహస్యంగా మ్లేచ్ఛ భాషలో అందించాడు. “లోహాలతో నిర్మించబడి, శరీరాన్ని కోసే వాడియైన ఆయుధాన్ని తెలుసుకొనే నేర్పున్నవారిని శత్రువు కూడా హింసించలేడు. అగ్ని- ఎండుగడ్డినీ , ఎండిన అరణ్యాలని, చలిని సంహరిస్తుంది. కానీ కలుగులో ఉన్న ఎలుకను అగ్ని ఏమీ చేయలేదు” అన్నాడు.

                                         కక్షఘ్నః శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః

                                    న దహేదితి చాత్మానం యో రక్షతి స జీవతి. 144.23

“ఆప్తులు కానివారిచ్చిందీ, అలోహమైనదాన్ని ఏ నరుడు స్వీకరిస్తాడో వాడు కుక్క వలే ఉంటేనే, అగ్ని నుంచీ బయట పడగలడు. (కుక్క రాత్రి వేళ తక్కువ నిద్ర పోతుంది) ఈ మాటలను బాగా అర్థం చేసుకో” అన్నాడు విదురుడు.

                                         చరన్ మార్గాన్ విజానాతి నక్షత్రైర్విన్దతే దిశః

                                    అత్మనా చాత్మనః పంచ పీడయన్ నానుపీడ్యతే. 144.26

           ధర్మజుడు “నాకు బాగా అర్థమైంది” అన్నాడు. కొంత దూరం అనుసరించి విదురుడు వెనక్కి వెళ్లిపోయాడు. వెంటనే కుంతీదేవి అడిగింది. విదురుడి మాటలు మాకేం అర్థం కాలేదు నాయనా! నువ్వేమో తెలిసింది అన్నావు. మాకు చెప్పదగినది అయితే ఆ మాటల మర్మమేమిటో చెప్పమంది. అమ్మా! “గృహంలో అగ్ని ప్రమాదం జరగవచ్చు” అనీ, “కొత్త మార్గాలలో పయనించవలసివస్తుంది” అనీ విదురుడి మాటల్లో అంతరార్థం అన్నాడు ధర్మజుడు. ఇటువంటి సూక్ష్మపరిశీలనలో ధర్మజునిది అందెవేసిన చేయి. శత్రుకుటిలనీతిమార్గములను తెలుసుకొనుట యుధిష్ఠిరుని బుద్ధికుశలతకు నిదర్శనాలు.

                                         గృహాదగ్నిశ్చ బోద్ధవ్య ఇతి మాం విదురోఽబ్రవీత్

                                    పన్థాశ్చ వో నావిదితః కశ్చిత్ స్యాదితి ధర్మధీః 144.32.

దుర్యోధనుడి మంత్రి పురోచనుడు నిర్మించిన భవనంలో పాండవులు ప్రవేశం చేశారు. దాని పేరు శివం. లోపలికి ప్రవేశిస్తూనే నిశితపరిశీలన గల ధర్మరాజు, అది అగ్నిగృహమని పసిగట్టేశాడు. విషయం భీమసేనుడికి చెప్పి “భీమా! ఈ గృహం పూర్తిగా నేయి, గుగ్గిలం, లక్క లాంటి పదార్థాలతో నిర్మితమైంది. మనల్ని దహనం చేయటానికి ఈ పురోచనుడు వాడికి పరమ ఆప్తులైన నిపుణుల సాయంతో నిర్మించాడు. వీడు దుర్యోధనుడుకి నమ్మకస్తుడు. కాబట్టి మనం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ఊహించిన విదురుడు నన్ను ముందే హెచ్చరించాడు” అన్నాడు. భీముడన్నాడు “అన్నా! ఇది అగ్నివేశగృహమని తెలిశాక మనం ఇక్కడే ఉండటం దేనికి? పూర్వం ఉన్న వసతిలోనో, మరో ప్రదేశంలోనో కాలం గడుపవచ్చు కదా?” అన్నాడు. కానీ దూరదృష్టికల ధర్మరాజు ఆలోచనాపరుడు. ఆవేశపరుడు కాదు.

“భీమా! మనం గృహదహనానికి భయపడి బహిరంగంగా పారిపోతే దుర్యోధనుడు చారుల ద్వారా ఎక్కడ ఉన్నా కనుగొని మనల్ని మరోరకంగా అయినా చంపటానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నాన్ని మనం తెలుసుకోలేక పోవచ్చు. కాబట్టి ఇక్కడే జాగర్తగా మెలుగుతూ ఈ పురోచనుణ్ణి నమ్మించి వంచించాలి. మనం సురక్షితంగా బయట పడటానికి సొరంగ మార్గాన్ని తయారు చేసుకోవాలి. రోజూ వేట పేరుతో వెళ్లి కొత్త అరణ్యమార్గాన్ని అన్వేషించుకోవాలి, ఎవరికీ అనుమానం రాకూడదు.

                                         వసతోఽత్ర యథా యాస్మాన్న బుధ్యేత పురోచనః

                                    పౌరో వాపి జనః కశ్చిత్ తథా కార్యమతన్ద్రితైః 145.31

సమయం చూసి వాడు ఇంటిని తగులబెట్టే సమయానికి ఉపాయంతో బయటపడి మనం మరణించామని వాడిని నమ్మించాలి. అప్పుడు దుర్యోధనుడు మన విషయంలో వాడి ప్రయత్నాలని విరమిస్తాడు. అంతేకాక భీష్ముడు మొదలైన పెద్దలు వాడిని వ్యతిరేకిస్తారు. కాబట్టి మనం ఇక్కడే జాగ్రత్తగా ఉండటం మంచిదని నాకనిపిస్తుంది” అన్నాడు ధర్మరాజు. ఈ మాటలను బట్టి ధర్మజుని రాజకీయ ధీనైపుణ్యము ప్రకాశితమవుతున్నది.

ఇంతలో పురోచనుడి కంట పడకుండా విదురుడు పంపిన ఖనకుడు రహస్యంగా ధర్మరాజుని కలుసుకున్నాడు. ఇతడు విదురుని మిత్రుడు కూడా. తాను విదురుడు పంపిన మనిషినని ధర్మరాజు నమ్మటానికి ఒక రహస్యసంకేతాన్ని వాడాడు. “ధర్మరాజా! విదురుడు మ్లేచ్చభాషలో నీకు కొన్ని విషయాలు చెప్పాడు, దానికి నీవు 'తెలిసింది, అదినిజమే' అని సమాధానం చెప్పావు. నన్ను నమ్మటానికి ఈ గుర్తు నీకు సరిపోతుంది కదా?

                                         కించిచ్చ విదురేణోక్తో మ్లేచ్ఛవాచాసి పాండవ

                                    త్వయాచ తత్ తథేత్యుక్తమేతద్ విశ్వాస కారణమ్. 146.3

 విదురుడు ఇక్కడ సొరంగమార్గాన్ని సిద్ధం చేయమని నన్ను పంపాడు. నేను ఆ పనిలో సిద్ధహస్తుడిని” అన్నాడు. ధర్మరాజు ఖనకుణ్ణి విదురుడిని గౌరవించినట్టు గౌరవించి పని ప్రారంభించమన్నాడు. పురోచనుడు పాండవుల ఇంటి ద్వారం వద్దే ఉన్న ఒక చిన్న వసతిలో ఉండి సమయం కోసం చూస్తున్నాడు. ఖనకుడు ఆవరణం సుభ్రంచేసేవాడి లాగా ప్రవేశించి ఎవరికీ అనుమానం రాకుండా పని ముగిస్తున్నాడు. పాండవులు పగటి పూట వేట నెపంతో వెళ్ళి సురక్షిత ప్రదేశాన్ని వెతుకుతున్నారు. రాత్రి సమయాలలో ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉంటున్నారు. ఇలా దాదాపు సంవత్సరం గడిచింది. పాండవులు తనని బాగా నమ్మారని పురోచనుడు పరమానందపడ్డాడు. పాండవుల నటనతో పురోచనుడు పూర్తిగా మోసపోయాడు. ఇక సమయం చూసి ధర్మరాజు ఒకసారి దానధర్మాల కార్యక్రమం అనే నెపంతో అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాడు. వచ్చినవారంతా స్వేచ్ఛగా తిన్నారు తాగారు. రాత్రికి అందరూ తిరిగి వారి వారి ఇళ్ళకు చేరుకున్నారు. కానీ ఒక బోయ వనిత తన ఐదుగురు కుమారులతో అలసి మత్తులో అక్కడే నిద్రించింది.

                                         తదుపాదీపయద్ భీష్మః శేతే యత్ర పురోచనః

                                    తతో జతుగృహద్వారం దీపయామాస పాండవః 147.10

ఆ సమయంలో భీముడు ధర్మరాజు ఆజ్ఞతో ముందుగా పురోచనుడు నిద్రిస్తున్న ఇంటికి నిప్పు పెట్టాడు. తరువాత లక్క ఇంటికి అన్ని వైపులా నిప్పు పెట్టాడు. వెంటనే తల్లితో కలిసి సురంగ మార్గంలో ప్రవేశించారు. పురజనులు దహనమవుతున్న ఇంటిని చూసి పురోచనుణ్ణి, ధృతరాష్ట్రుడినీ నిందించారు. ఆ ఇంట్లో నిద్రిస్తున్న బోయ స్త్రీని, ఆమె కుమారులను, పాండవులే అనుకుని పాండవులు దహనమయ్యారు అనుకున్నారు. పురోచనుడు వాడి పాపం వాడే అనుభవించాడు అనుకున్నారు ప్రజలు. ఎంతో విలపించారు. పాండవులు సురక్షితంగా సురంగ మార్గం నుండి బయటపడ్డారు. ఇదే సమయంలో విదురుడు పంపిన సేవకుడు వచ్చి విదురుడు చెప్పిన రహస్యసంకేతాన్ని వాడాడు. “కలుగులోని ఎలుకను అగ్ని దహించలేదు” అని ధర్మరాజుకి నమ్మకం కలగటానికి విదురుడు చెప్పిన మాట వాడాడు.

                                         కక్షఘ్నః శిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః

                                        న హన్తీత్యేవమాత్మానం యో రక్షతి స జీవతి.

 విదురుడు పాండవుల కోసం చేయించిన పడవను గంగా తీరంలో చూపించాడు. విదురుడు చెప్పిన సమాచారం అందించి పాండవులను సురక్షితంగా గంగ దాటించి తాను వచ్చిన దారిలో తిరిగి వెళ్ళాడు. అక్కడ ఖనకుడు సొరంగాన్ని ప్రజలు గుర్తించేలోపే ధూళితో కప్పేశాడు. ఈ విధంగా విదురుని సలహాప్రకారం, ధర్మజుని రహస్యగోపనము, బుద్ధికుశలతతో చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పాండవులను ప్రాణాపాయం నుండీ కాపాడాయి అని చెప్పాలి.

5. పాండవుల వివాహము, పూర్వజన్మ వృత్తాంతం:

ఇది చాలా ముఖ్యమైన, సున్నితమైన ఘట్టం. మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలిచినవాడు అర్జునుడు. కానీ “తెచ్చిన భిక్షను ఐదుగురూ సమానంగా పంచుకోండి” అని కుంతీదేవి అన్నమాటను ధర్మహాని కలుగకుండా చేయమని ధర్మజుడి పైనే భారం వదిలేసింది తల్లి కుంతీదేవి. అర్జునుడుతో ధర్మజుడు “యాజ్ఞ్యసేనిని స్వయంవరంలో నీవే గెలుచుకున్నావు. కావున శాస్త్రోక్తంగా నీవు ఈమెను వివాహం చేసుకో”మని చెప్పాడు. కానీ అర్జునుడు పెద్దవారి వివాహం కాకుండా తాను చేసుకొనుట శాస్త్రం కాదని, అందరికీ ధర్మమైనది, హితమైనది ఆదేశించమని ధర్మజునే వేడుకున్నాడు. సోదరుల మనోభావాలను తెలుసుకొగల సమర్థుడైన యుధిష్ఠిరుడు వారిలో వారికి మనస్పర్థలు కలుగకూడదనే ఆలోచనతో, తల్లి మాటను నిజం చేసే ఉద్దేశ్యంతోనూ, సోదరుల మనసు ద్రౌపదియందు నిలిచిన తీరును పరిశీలించి “ఈ కళ్యాణి మన ఐదుగురికీ భార్య అవుతుంది” అన్నాడు.

ఐదుగురు భర్తల విషయంలో ద్రుపదుడు సందేహ పడినప్పుడు కూడా ధర్మజుడు సమాధాన పరుస్తూ, తాము పాండవులమని తెలిపి “మహారాజా! నా మనసు అధర్మం మీద నిలవదు. నా మాట ఎప్పుడూ పొల్లుపోదు. మా తల్లి ఆజ్ఞ కూడా ఇదే, ధర్మమనేది మిక్కిలి సూక్ష్మమైనది. ఈ విషయంలో మరేమీ సంకోచించకండి” అని మాత్రమే నచ్చచెప్పాడు. (వారు ఇంద్రులు అనే అంశాన్ని తాను చెప్పినా ద్రుపదుడు నమ్మలేడేమో అని సంకోచించి) ఆ మరుక్షణంలోనే వ్యాసుల వారు విచ్చేసి పంచపాండవుల స్వరూపాలను ఇంద్రులుగా తెలియచేసి, ద్రుపదునకు దివ్య చక్షువులు ప్రసాదించి ప్రత్యక్షంగా చూపించి, ద్రుపదుని సందేహనివృత్తి చేశారు.

 ఆ దివ్య నేత్రాలతో పాండవులు ఒకే రూపంలో ఉన్న ఐదుగురు ఇంద్రులుగా దర్శించి ఆశ్చర్యపోయాడు ద్రుపదుడు. ఇంద్రపదవిని అధిష్టించి అహంకారాన్ని ప్రదర్శించిన ఐదుగురు ఇంద్రులను పరమేశ్వరుడు, “మానవ జన్మలో జన్మించి దుస్సహమైన కర్మలను ఆచరించి భూభారం తగ్గించి తిరిగి మీ శుభకర్మలచే పవిత్రులై స్వర్గానికి చేరుకుంటారు” అని శివుడు ఆనతిచ్చాడు. అప్పుడు ఆ ఐదుగురు ఇంద్రులు “మమ్మల్ని యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల అంశతో జన్మించేటట్టు అనుగ్రహించండి” అని కోరుకున్నారు, శంకరుడు వారి కోరిక మన్నించాడు. వారి పేర్లు వరుసగా విశ్వభుక్కు, భూతధామ, శిబి, శాంతి , తేజస్వి, ఇవి పాండవుల పూర్వనామాలు అంటూ వ్యాసుడు ద్రుపదునికి వారి వివరాలు తెలిపాడు.

 

విశ్వభుగ్ భూతధామా చ శిబిరిన్థ్రః ప్రతాపవాన్

శాంతిశ్చతుర్థస్తేషాం వై తేజస్వీ పంచమః స్మృతః 196.29

 అంతేకాకుండా ఇంద్రుని భార్యను ఈ లోకంలోనూ వారికి భార్యగా ద్రౌపదిగా ఏర్పరిచాడు

ఈ సందర్భంలో ధర్మజుడు ద్రుపదుడిని తాను చెప్పవలసినంత వరుకు చెప్పి ఊరుకున్నాడు. మిగిలిన సందేహం వ్యాసులవారే తీర్చాలి కాబట్టి. ఇక్కడ యముడి అంశలో పుట్టిన ధర్మరాజుని, పూర్వం విశ్వభుక్ అనే ఇంద్రుడిగా తెలుసుకోవాలి.

6. అర్థరాజ్యము:

ధృతరాష్ట్రుడు పెద్దల నిర్ణయంతో, ఒక శుభముహూర్తంలో, శ్రీకృష్ణుడు వ్యాసభగవానుడు మొదలైన వారి సమక్షంలో, బ్రాహ్మణుల వేదమంత్రాల నడుమ, భద్రపీఠంపై నిగ్రహంగా ఉన్న ధర్మరాజుకి అర్ధరాజ్యమిచ్చి, ఖాండవప్రస్థంలో పరిపాలన సాగించమని అభిషేకించి పట్టాభిషిక్తుణ్ణి చేశారు. అదే రోజు బంధుమిత్రసపరివారంగా తన అభిమానులు వెంటరాగా ధర్మజుడు పూర్వం పౌరవుల రాజధానిగా విలసిల్లి ఋషుల శాపకారణంగా నాశనమయిపోయిన ఆ ఖాండవప్రస్థాన్ని మరలా ధనధాన్యాలతో వృద్ధి చేయటానికి వాసుదేవుణ్ణి ముందు పెట్టుకుని బయలుదేరాడు.

వాసుదేవుడి ఆనతి పై ఇంద్రుడు విశ్వకర్మను స్మరించి యుధిష్ఠిరునికోసం ఇంద్రభవనంతో సమానమైన రాజధానిని నిర్మించమని ప్రేరేపించాడు.

వాసుదేవో జగన్నాథశ్చిన్తయామాస వాసవమ్

మహేన్ద్రశ్చిన్తితో రాజన్ విశ్వకర్మాణమాదిశత్.206.28

విశ్వకర్మ శ్రీకృష్ణునికి నమస్కరించి సుముహూర్తంలో నగర నిర్మాణాన్ని ప్రారంభించి స్వల్పకాలంలో పూర్తిచేసి ఇంద్రప్రస్థమనే పేర యుధిష్ఠిరునికి అప్పచెప్పాడు. శాస్త్రోక్తంగా శాంతికర్మలను ఆచరించి పాండుపుత్రులు ఇంద్రప్రస్థ భవనంలో ప్రవేశించారు. కొంతకాలానికి ద్రౌపది-ధర్మరాజులకు ప్రతివింధ్యుడు అనే పుత్రుడు కలిగాడు.

7. ముగింపు:

ధారణాత్ ధర్మ ఇత్యాహుః ధర్మో ధారయతే ప్రజాః

ప్రజలను సన్మార్గములో నడిపించేది ధర్మము. అటువంటి ధర్మమును తెలిసుకుని, ఎన్ని అవాంతరములు ఎదురైనా ధర్మహాని జరుగకుండా, తన భరతవంశాన్ని కాపాడుకున్న మహనీయుడు యుధిష్ఠిరుడు. ప్రజ్ఞాచక్షువు, కణికకుటిల నీతితో తన బుద్ధిని విషమయం చేసుకున్న ధృతరాష్ట్రుడు పాండవులను సంహరించటానికి కూడా సిద్ధపడ్డాడు. అటువంటి వానికి కూడా మనసులో కించిత్ అపకారం కూడాతలపెట్టని అజాతశత్రువు ధర్మజుడు. పెద్దలపట్ల ఆ మహనీయుడు చూపిన సంస్కారాదులు ఆనాటి నుండీ నేటి తరానికి కూడా శిరోధార్యములు.

8. ఉపయుక్తగ్రంధసూచి:

  1. కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే.
  2. పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు 2023.
  3. ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
  4. మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత.
  5. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
  6. రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
  7. శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]