headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. శ్రీమన్మహాభారతసభాపర్వం: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం

డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ

సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్య శాఖ,
శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయము,
ప్రశాంతినిలయము, సత్యసాయి జిల్లా.
సెల్: +91 9966108560, Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download PDF


వ్యాససంగ్రహం:

శ్రీమన్మహాభారతంలో ఆదిపంచకంలో సభాపర్వం ఎంతో కీలకమైంది. పద్దెనిమి పర్వాల మహాభారతంలో అరణ్యాది స్వర్గారోహణపర్వాల పర్యంతమూ నెలకొన్న కథాకథనలకు ఈ సభాపర్వఘట్టాలే ఎంతో ముఖ్యమైనవి. వ్యాసభారతంలోని సభాపర్వాంతర్గత సన్నివేశాలైన మయసభావైభవం, నారద-ధర్మజసంవాదం, రాజసూయం, మాయాద్యూతం వంటి సందర్భాలలో ధర్మరాజు ధర్మాన్ని అనుసరించి లోకాలకు ఆదర్శంగా నిలిచిన విధానన్ని అనుశీలించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. ఆయా ఘట్టాలలో వ్యాసమహర్షి సూత్రప్రాయంగా చెప్పిన ధార్మికమైన నీతివాక్యాలు, సంభాషణలు, పాత్రచిత్రణలు, మానసికసంఘర్షణలు, ధర్మజుని వినయశీలాలలో ఔన్నత్యవిచారణ మొదలైన విషయాలను ఈ వ్యాసం చర్చిస్తుంది. “నీ కారణంగా సమస్త రాజలోకాలు నాశనమవబోతున్నాయి- త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ” అనే మాటవినగానే ఒక ధర్మాత్ముడి మనసు ఎంతగా విరిగిపోతుంది.? ఆ హృదయం ఎన్ని ముక్కలైపోతుంది. చుట్టూరా అధర్మాత్ముల ఆగడాలు తనని బానిసని చేసినప్పుడు ధర్మజుని స్థితి ఎలా తట్టుకుని నిలిచింది. తన భార్య నిండుసభలో అవమానించబడినప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్న ధర్మాత్ముడి మనసు ఎంత ఆవేదన పడుతుంది? వంటి అంశాలు ఈ సభాపర్వంలో ధర్మరాజు ధర్మాచరణకు పరీక్షలులాగా కనిపిస్తాయి.

Keywords: మయసభ, నారదసంవాదము, రాజసూయము, భవిష్యవాణి, మాయాద్యూతము, వనప్రస్థానము.

ఉపోద్ఘాతం:

“న్యాయ్యాత్పథః ప్రవిచలన్తి పదం న ధీరాః”- ఎన్ని కష్టాలు వచ్చినా ధీరులు న్యాయమార్గము నుండీ ఒక్క అడుగు కూడా చలించరు. ఆదిపర్వంలో భారతవంశీయుల పరిచయాలు, కౌరవపాండవుల వివాహములు వర్ణించిన వ్యాసులవారు, ఇక మహాభారత కథకు మలుపు తిప్పే పర్వంగా సభాపర్వాన్ని ఎంచుకున్నారనే చెప్పాలి. సహజమిత్రులైన కురుపాండవులను కృత్రిమశత్రువులుగా మార్చిన సంఘటనలు ఈ పర్వంలోనే కనిపిస్తాయి. 

ముందు ప్రశాంతంగా ప్రారంభించబడిన మయసభాసన్నివేశాలు, దిగ్విజయయాత్రలు, రాజసూయయాగాది సన్నివేశములు ఈ పర్వంలో కనిపించినా కూడా, సకలరాజనిర్మూలనకు నాంది పలికిన మాయాద్యూదం, పాండవపత్నికి జరిగిన ఘోరపరాభవము, భీముడి ప్రతిజ్ఞలు, సభానిష్క్రమణము వంటి సంఘటనలతో అధర్మవిజృంభణముతో ధర్మము ఉపేక్షించబడినదా అన్నట్టు ధర్మజుని పాత్ర ఇందులో కనిపిస్తుంది. 

ధర్మరాజు చేసిందిగానీ, ఆడినద్యూతము గానీ ధర్మమేనా? భార్యని పణంగా పెట్టవచ్చా? ఇలాంటి చాలా సందేహాలు సామాన్యులకు ఈ పర్వంలోనే ఎక్కువ కనిపిస్తాయి. అటువంటి ప్రశ్నలకు శ్రీమన్మభారతము ఆధారంగా చేసిన పరిశీలనల సమాహారమే ఈ ప్రయత్నము.

మయసభ:

ధృతరాష్ట్రుడి ఆజ్ఞతో, ధర్మరాజు తన సోదరులు మరియు శ్రీకృష్ణపరమాత్ముడితో కలిసి ఖాండవప్రస్థానికి బయలుదేరారు. పాండవులకు ఏమాత్రం అభివృద్ధి చెందని ప్రాంతాన్ని అప్పచెప్పి అర్థరాజ్యంగా చూపించాడు ధృతరాష్ట్రుడు. ధర్మాత్ములకు కష్టాలు వచ్చినప్పుడే జగన్నాథుడైన శ్రీకృష్ణపరమాత్ముడు అండగా ఉంటాడు. ఇంద్రుడిని ఆహ్వానించి విశ్వకర్మచేత ధర్మరాజుకి అద్భుతమైన రాజధానిని నిర్మించమని ఆదేశించాడు. ఖాండవప్రస్థంలో విశ్వకర్మచేత నిర్మితమైన ఆ రాజధానే ఇంద్రప్రస్థముగా ప్రఖ్యాతమైనది.
శ్రీకృష్ణార్జునులు ఖాండవవనదహన సమయంలో మయుడి ప్రాణాలను రక్షించారు. అందుకు కృతజ్ఞతగా మయుడు కృష్ణార్జునులకు ఏదైనా ప్రీతిని చేయసంకల్పించాడు. శ్రీకృష్ణుడు ఆలోచించి, “మయాసురా! నీవు ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి, ధర్మరాజుకు ఒక మంచి సభాభవనాన్ని నిర్మంచు. ముల్లోకాలలో దానికి సాటి మరొకటి ఉండకూడదు అన్నాడు”.

యది త్వం కర్తృకామోసి ప్రియం శిల్పవతాం వర.
ధర్మరాజస్య దైతేయ యాదృశీమిహ మన్యసే

మయుడు సంతోషంగా అంగీకరించాడు. ముగ్గురూ కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్లారు. విషయం తెలుసుకుని ధర్మరాజు కృష్ణార్జునులకు అభినందనలు తెలిపి మయుణ్ణి కూడా సత్కరించాడు. ఆ మయుడు నిర్మించిన సభకే మయసభ అని పేరు. ఆ సభవలనే ఈ పర్వానికి సభాపర్వము అని పేరువ్చచిందని చెప్పాలి.

ఆ తరువాత కృష్ణుడు అందరి అనుమతితో ద్వారకకు పయనమయ్యాడు. కృష్ణునికి అపరిమితమైన ధనకనక వస్తువాహనాదులను బహూకరించాడు ధర్మరాజు. అంతేకాక కృష్ణుని రథసారథి అయిన దారుకుని స్థానంలో ధర్మరాజే కూర్చుని ప్రేమపూర్వకంగా కొంతదూరం రథాన్ని స్వయంగా నడిపాడు. వీడలేని అనుబంధంతో పరమాత్మను తనివితీరా చూస్తూ నగర పొలిమేరల వరకూ వెళ్లి నయనాభిరాముడైన శ్రీకృష్ణుణ్ణి సాగనంపాడు. కానీ ధర్మనందనుడి మనసు మాత్రం కృష్ణునితోనే ప్రయాణించింది. భగవంతుడికి సర్వసమర్ఫణ భావనలో ఉన్న భక్తుడే ధర్మనందనుడు. ఈ భక్తి వలనే రాబోయే ధర్మపరీక్షలలో ధర్మరాజుకి ధైర్యాన్ని, సహనాన్ని పరమాత్ముడు అందించాడు.

నారద-ధర్మజుల సంవాదం:

ఒకనాడు త్రిలోకసంచారి నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. పరిపాలనసంబధ విషయాలు అడుగుతూ అనేక రాజనీతిని ప్రస్తావించాడు. పరిపాలనలో ఉండే మొళకువలన్నీ ఇందులో చెప్పబడ్డాయి. అదీ ధర్మజుడి అదృష్టం. శ్రీకృష్ణుడు, నారదాదుల చేత దివ్యోపదేశాలను పొంది, తన పరిపాలనను, సచ్చీలతను మరింత వృద్ధిగావించుకున్న మహనీయుడిగా ధర్మజుడు దర్శనమిస్తాడు.

యుధిష్ఠిరుడు నారదులవారి సూచనలు విని “దేవర్షీ! మీరు ఉపదేశించిన విధంగానే చేస్తాను. మీరు చేసిన ఈ ప్రబోధం వలన నా బుద్ది, ప్రజ్ఞ ఎంతో పెరిగాయి”. అంటూ మరొక సందేహాన్నికూడా అడిగాడు ధర్మజుడు. “స్వామీ! వేదాలు ఏ విధంగా సఫలం అవుతాయి. ధనం ఏ విధంగా సఫలం అవుతుంది. స్త్రీల సాఫల్యం ఏవిధంగా ఉంటుంది. శాస్త్రజ్ఞానం ఏ విధంగా సఫలం అవుతుంది”. అని సందేహాన్ని ప్రశ్నించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా నారదులవారు-

అగ్నిహోత్రఫలా వేదా దత్త భుక్తఫలం ధనమ్
రతిపుత్రఫలా దారాః శీలవృత్తఫలం శ్రుతమ్. 5.113

రాజా! వేదాలు నీవు చేసే నిత్యాగ్నిహోత్రక్రియకు ఫలాలు. (అంటే వేదాలు నేర్చుకున్నవారు తప్పక అగ్నిహోత్రాది క్రియలు చేయాలని, వేదాధ్యయనానికి అదే ఫలమని అర్థం.) దానం చేయటమే ధనానికి సరైన ఫలం. పితృఋణం తీర్చుకోటానికి మార్గమైన సంతానం అనేది స్త్రీ సాంగత్యఫలం. అలాగే శీలము, సత్ర్పవర్తనలు శాస్త్రజ్ఞానానికి ఫలాలు.

ఈ విధంగా నారదుడు ధర్మరాజుకు రాజనీతి మెళకువలు ఉపదేశించాడు. ఆ తరువాత ధర్మరాజు “భగవన్! మీరు చెప్పిన రాజధర్మాలన్నీ యదార్థ సిద్ధాంతాలు. వీటిని యథాశక్తి నేను ఆచరిస్తాను” అని మాట ఇచ్చాడు. నారదులవారిని అనేక లోకాలలో ఆ మహర్షి చూసిన దివ్యసభలను, మయసభకంటే గొప్పవేమో అనే ఆత్రుతతో అడిగి తెలుసుకున్నాడు. నారదులవారు దానికి సమాధానంగా “ధర్మజా! మానవలోకంలో ఇటువంటి సభ నేనింత వరకూ చూడలేదయ్యా”, అంటూ ఇంద్రసభను, యమసభను, వరుణసభను, కుబేరసభను, బ్రహ్మసభను వర్ణించాడు. 

చివరికి ఒక ముఖ్యమైన విషయం చెప్పి వెళ్లారు నారదులవారు. “నాయనా! నేను భూలోకానికి వస్తున్నట్టు తెలుసుకుని స్వర్గలోకంలోని నీ తండ్రి పాండురాజు నీకొక మాట చెప్పమన్నారు. అదేమిటంటే, 'భారతా! నీవు భూమండలాన్నంతా జయించగలవు, సోదరులు నీ అదుపులో ఉన్నారు కాబట్టి శ్రేష్ఠయాగమయిన రాజసూయాన్ని నీవు ఆచరించు'.

సమర్థోసి మహీం జేతుం భ్రాతరస్తే స్థితా వశే
రాజసూయం క్రతుశ్రేష్టమాహరస్వేతి భారత 12.25

'నీవు ఆచరించిన ఆ యాగం వలన యమసభలో ఉన్న నేను కూడా హరిశ్చంద్రుని వలే ఎన్నో సంవత్సరాలు ఇంద్రసన్నిధిలో (ఇంద్రసభలో) ఆనందాన్ని అనుభవించగలను', అని” పాండురాజు చెప్పిన సందేశాన్ని నారదుడు యుధిష్టిరునికి తెలిపారు. “రాజా! నీ తండ్రి సంకల్పాన్ని పాటించు. తత్ఫలితంగా నీ పూర్వికులతో పాటు నీవూ ఇంద్రలోకాన్ని పొందుతావు. కానీ ఈ రాజసూయ యాగానికి ఎన్నో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. యాగవినాశకులైన రాక్షసులుగానీ నీ శత్రువులుగానీ ఈ ఆటంకాలను తలపెడతారు. కావున యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అన్నీ బాగా ఆలోచించి నీకు సముచితమైనది ఆచరించు” అని ధర్మరాజు చేత సత్కరించబడి నారదుడు నిష్క్రమించాడు. ధర్మరాజుకు రాజసూయయాగం మీద ఒక ఆలోచన కలిగించాడు.

రాజసూయం:

నారదుల వారి సందేశాన్ని తండ్రి ఆజ్ఞగా భావించి రాజసూయాన్ని చేయాలని సంకల్పించాడు ధర్మరాజు. తనలోని అరిషడ్వర్గాన్ని జయించి అజాతశత్రువని పేరు సంపాదించాడు. ధర్మరాజు అందరినీ ఆదరించేవాడు. భీముడు అందరినీ రక్షించేవాడు. సవ్యసాచి అయిన అర్జునుడు శత్రువులను అణచివేసేవాడు. ధీమంతడైన సహదేవుడు ధర్మబోధ చేసేవాడు. నకులుడు స్వాభావికంగానే అందరితో వినయంగా ఉండేవాడు. అందువలన రాజ్యంలోని జనపదాలన్నీ ధర్మాసక్తితో ఉన్నాయి.

పరిగ్రహాన్నరేన్ద్రస్య భీమస్య పరిపాలనాత్

శత్రూణాం క్షపణాచ్చైవ బీభత్యోః సవ్యసాచినః. 13.10

రాజసూయయాగ సంకల్పం గురించి శ్రీకృష్ణుని నిర్ణయం అడిగాడు. అన్నింటినీ సాధించగలవాడు, అంతటా పూజించబడేవాడు, సర్వరాజులను శాసించగలవాడు మాత్రమే రాజసూయయాగాన్ని సుసంపన్నం చేయగలడు. కాబట్టి నీ నిర్ణయాన్ని బట్టి నేను నడుచుకుంటానని ధర్మజుడు కృష్ణుని పై భారం వేశాడు.

రాజసూయ యాగానికి ధర్మజుని సోదరులు నలుగురూ నలుదిక్కులకు దిగ్విజయయాత్ర గావించి అజేయంగా తిరిగి వచ్చి రాజులందరినీ వశపరచుకుని అనంతమైన సంపదలతో తిరిగి వచ్చారు. యాగానికి ఎటువంటి అవాంతరాలూ రాకుండా కౌరవులను కూడా తగిన పనులలో నియోగించాడు ధర్మరాజు. 

కార్యనిర్వహణ బాధ్యతలు నియోగించడం:

ఈ యాగాన్ని నేనే నిర్వహిస్తున్నాను” - అనే భావన ధర్మజునిలో రవ్వంత కూడా లేదనే చెప్పవచ్చు. పైగా సోదరులు ఐదుగురే కాకుండా కౌరవసహితంగా నూటఐదుగురము మేము అనే భరతసోదరుల ఐకమత్యాన్ని ఈ రాజసూయంలో మనం చూడగలము. అలా ధార్తరాష్ట్రులను కూడా కలుపుకుని, ఎవరిని ఏ కార్యములలో నియమించాలో వారివారి ఆసక్తినిబట్టి, సామర్థ్యాన్ని బట్టి నియమించాడు ధర్మరాజు.
సహదేవుడిని యాగసామగ్రీని సమకూర్చే పనిలో నియోగించాడు. నకులునకు రాజ ప్రముఖులందరినీ స్వయంగా దగ్గర వుండి తీసుకువచ్చే భాద్యత ఇచ్చాడు. బ్రాహ్మణ సత్కారాల బాధ్యతను గురుపుత్రుడైన అశ్వత్థామకు అప్పగించాడు. వివిధ దానాలను ఇచ్చేచోట కర్ణుణ్ణి నియోగించాడు. దానగుణం ఉన్నవాడు కర్ణుడు. కాబట్టి మరింత సంతోషంగా ఇస్తాడు అనే ఉద్దేశంతో ఆ పనిలో కర్ణుడిని నియమించాడు. రాజన్యుల సత్కారాలను సంజయునికి అప్పగించాడు. ఏ పని చేయాలి? ఏ పని చేయకూడదు? అనే నిర్ణయ, శాసనాధికారాలను బుద్థిమంతులైన భీష్మద్రోణులకు అప్పగించాడు. దుర్యోధనుడికి, వచ్చిన కానుకలను స్వీకరించి తగిన ప్రదేశాలకు తరలించే పనిని అప్పచెప్పాడు. 

ఎవరికి ఏ పని ఇష్టమో ఆ పనే అప్పచెప్పి చేయించుకోటమే నాయకుని లక్షణం. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా, ధర్మరాజుకి సహాయంగా అక్కడకి వచ్చిన బ్రాహ్మణులకు పాదప్రక్షాలన చేసే పనిని ఎంచుకున్నాడు. వేదము, తపస్సు, జ్ఞానం ధర్మం పట్టుకుని ఉండేవాడే బ్రాహ్మణుడు అన్నారు.

దైవాధీనం జగత్సర్వం. మంత్రాధీనం తు దేవతాః .
తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణో మమ దైవతమ్ . -

అంటూ కృష్ణుడు వారి పాదాలు కడిగే పని ఎంచుకున్నాడు. తద్వారా ఉత్తమ ఫలితమును పొందాడు.

చరణక్షాళనే కృష్ణో బ్రాహ్మణానాం స్వయం హ్యభూత్.
సర్వలోకసమావృత్తః పిప్రీషుః ఫలముత్తమమ్. 35.10

శ్రీకృష్ణుడు వచ్చిన దగ్గరనుండీ, ఆయన పక్కనే ఉండి ఆయనకు ఆనందాన్ని కూర్చే పనిని అర్జునుడికి అప్పగించాడు. అర్జునుని పక్కన ఉంటేనే కృష్ణునికి ఆనందం. 

ద్రౌపది అందరికీ ఆప్యాయంగా అడిగి మరీ వడ్డించే పనిని స్వీకరించిది. నిరంతాయంగా సాగుతుంది అన్న సంతర్పణ. యాగసమయంలో ధర్మరాజు ప్రక్కన తాను ఉండవలసిన సమయం తప్ప మిగిలిన సమయం అంతా ద్రౌపదీదేవి అతిథులకు భోజనాదులు వడ్డిస్తూ, అందరినీ సంతృప్తిగా భుజించారో లేదో కనుక్కుని ఆదరించింది. అందరికీ తృప్తిగా భోజనం కొసరి కొసరి వడ్డిస్తుంది. లక్షమంది బ్రాహ్మణులు భోజనం చేయగానే ఒక శంఖనాదం వినిపిస్తుంది. అలాంటి శంఖనాదాలు నిరంతరం మోగుతూనే వున్నాయి. అంటే ఎంతమంది బ్రాహ్మణులు భోజనం చేసి వుంటారు? ఇతరులు ఎంతమంది వుంటారనేది అంచనా వేసుకోవచ్చు. అన్నపురాసులు హిమవత్పర్వత శిఖరాలలాగా వున్నాయి. నేతిధారలు నదీ ప్రవాహలు జలపాతాల్లాగా వున్నాయి. అద్వితీయంగా సాగింది యాగం. చివరికి అందరినీ పూజించవలసిన సమయం వచ్చింది.

శిశుపాలవధ:

యాగకార్యక్రమంలో భాగంగా భీష్ముడు ధర్మరాజుతో, “నాయనా! వచ్చిన రాజులను వారికి తగినట్టుగా సత్కరించు” అన్నాడు. అర్ఘ్యం ఇచ్చి పూజింపదగినవారు ఆరుగురు. వారు ఆచార్యులు, ఋత్విజులు, సంయోక్త, స్నాతకుడు, ప్రియమిత్రుడు, రాజు. అందరినీ మించి సర్వలోకాలకు ప్రభువైన శ్రీ కృష్ణుడు అగ్రపూజకు అర్హుడైనవాడు అన్నాడు భీష్ముడు. ఆ సందర్భంలో శ్రీకృష్ణుని ఆక్షేపించిన శిశుపాలుడి శిరస్సు ఖండించాడు పరమాత్ముడు. శిశుపాలుని తేజస్సును పరమాత్ముడు తనలో లీనం చేసుకున్నాడు.

రాజసూయయాగం పూర్తయింది. ధర్మరాజు పరమపవిత్రమైన అవబృథస్నానం చేసి సార్వభౌముడయ్యాడు. యాగం చేసి అవబృథస్నానం చేసినవాని పుణ్యం మాటలలో వర్ణించలేము. స్వర్గలోక ప్రవేశానికి రాచమార్గం ఆ స్నానం. తరువాత శ్రీ కృష్ణుడు అందరికీ చెప్పి ద్వారకకు పయనమయ్యాడు. రాజులందరూ ధర్మజుని వద్ద సెలవు తీసుకున్నారు.

భవిష్యవాణి:

ఇక ఇప్పుడు జరగబోయే ఘట్టం ఇంకా ముఖ్యమైనది. దీనినే భవిష్యవాణి ఘట్టం అంటారు. రాజసూయం అయ్యాక వ్యాసులవారు వెళ్ళబోతుండగా ధర్మరాజు ఒక సందేహాన్ని అడిగాడు. “తాతగారూ! ఉత్పాతాలు మనకి మూడు రకాలుగా వస్తాయి కదా. శిశుపాలుని మరణం అప్పుడు వాటి సంకేతాలు కనిపించాయి. అతని మరణంతో ఆ ఉత్పాతాలు శాంతించినట్లా లేక ఆరంభ సూచికలా” అని అడిగాడు.

ఉత్పాతాంస్త్రివిధాన్ ప్రాహ నారదో భగవాన్ ఋషిః
దివ్యాంశ్చైవాన్తరిక్షాంశ్చ పార్థివాంశ్చ పితామహ 46.9

ఉత్పాతాలు మూడు రకాలు. 1. దివ్యాలు, అంటే పిడుగు పడటం లాంటివి. 2. అంతరిక్షం వలన సంభవించే ఉత్పాతాలు. అంటే ఉల్కలు తోకచుక్కలు పడటం వంటివి. 3. పార్థివాలు అంటే పృథివీ సంబంధమైనవి, భూకంపాలు మొదలైనవి, శిశుపాలుని మరణమప్పుడు ఈ మూడు ఉపద్రవాలూ కనిపించాయి. అవి ఆరంభసూచికలా లేక శాంతిసూచికలా అని అడగగానే వ్యాసులువారు “రాజా! ఈ మహోత్పాతాల ఫలితం పదమూడు సంవత్సరాలు ఉంటుందయ్యా. పదమూడు సంవత్సరాలు అవగానే నీ కారణంగానే సర్వ క్షత్రియ వినాశనం జరగబోతున్నది.

త్వామేకం కారణం కృత్వా కాలేన భరతర్షభ 46.12

దుర్యోధనుని అపరాధం వలన, భీమార్జునుల పరాక్రమం వలన భూమి మీద రాజులందరూ యుద్ధంలో మరణిస్తారు. భూభారాన్ని తగ్గిస్తారు. ఈ జరగబోయే వాస్తవానికి రాబోయే తెల్లవారుఝామున స్వప్నంలో నీవు నీలకంఠుడైన శంకరుణ్ణి చూస్తావు. ఆ శివుడు పితృదేవతలకు ఆశ్రయమైన దక్షిణదిక్కుని చూస్తూ ఉండటం నీవు దర్శిస్తావు.

స్వప్నే ద్రక్ష్యసి రాజేన్ద్ర క్షపాన్తే త్వం వృషధ్వజమ్.
నిరీక్షమాణం సతతం పితృరాజాశ్రితాం దిశమ్. 46.25

అదే సర్వక్షత్రియవినాశనానికి నిదర్శనంగా గుర్తించు. ధర్మజా! కాలం దాటరానిది. జరగాల్సింది జరగక మానదు. కానీ నీవు అప్రమత్తంగా ఉండు. నేను వెళ్లి వస్తాను” అంటూ కైలాసానికి పయనమయ్యాడు వ్యాసుడు. మహర్షి చెప్పింది జరిగి తీరుతుంది. “సోదరులారా! వ్యాసులవారు చెప్పింది విన్నారు కదా! ఆయన ఆ మాట చెప్పినప్పటినుండీ నాకు మరణించాలని అనిపిస్తున్నది. ఎందుకంటే సర్వ వినాశనానికి విధి నన్నే కారణంగా ఎంచుకున్నది. సోదరులారా! నేను బ్రతికి వున్నా గానీ ఇకనుండీ కొన్ని నియమాలతో జీవిస్తాను. ఈ పదమూడు సంవత్సరాలు నేను ఎవరితోనూ పరుషంగా మాట్లాడను. జ్ఞాతుల ఆజ్ఞను పాటిస్తూ వారు అడిగినవన్నీ ఇస్తాను. వైరభావానికి దూరంగా వుంటూ అందరికీ ప్రియాన్నే ఆచరిస్తూ రాబోయే విపత్తులలో నా వంతు దోషం లేకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను”, అంటూ ప్రతిజ్ఞ చేశాడు.

న ప్రవక్ష్యామి పరుషం భ్రాత్రూనన్యాంశ్చ పార్థివాన్. 46.27

విశ్లేషణ:

దైవం అనుకుంటే తప్పక జరిగి తీరుతుంది. కానీ ఆ విషయం తెలిశాక మనం ఎలా ప్రవర్తించాలో, ఎంత సహనంగా ఉండాలో ఈ సన్నివేశం ద్వారా మనం తెలుసుకోవలసిన అంశం. ధర్మరాజు యొక్క నియమబద్ధ జీవితానికి ఇది నిదర్శనం. ఏ మాత్రం ధర్మం తప్పకుండా అటువంటి కష్టాలలో కూడా తన పరంగా నింద రాకుండా పాండవులను పావనచరితులుగా తీర్చిదిద్దాడు ధర్మజుడు.

మాయాద్యూతము:

రాజసూయంలో ధర్మరాజుయొక్క సంపదలు చూసి దుర్యోధనుడు ఇక తన జీవితం వ్యర్థం అనుకున్నాడు. దుష్టచతుష్టయం కలిసి మాయాద్యూతం పన్నాగంలో ఉన్నారు. ద్యూతక్రీడ కొరకు ధృతరాష్ట్రుడు బలవంతంగా నియోగించటం వలన విదురుడు పాండవుల వద్దకు వెళ్ళాడు. విదురుని ముఖం చూడగానే ధర్మరాజు అడిగాడు.

నీ మనసు సంతోషంగా లేదని తెలుస్తోంది. అందరూ క్షేమంగా ఉన్నారా”? అని అడగగానే విదురుడు, ధర్మజా! కురురాజు నీకో సందేశం పంపారు. "ఒక మహాసభను నిర్మించాము. నీ తమ్ముళ్లతో పాటు వచ్చి ఆ సభని చూడాలి. అక్కడి జూదశాలలో కౌరవ సోదరులతో నీవు సుహృద్యూదం ఆడాలి". ఈ సందేశం చెప్పమని నన్ను పంపిస్తే వచ్చానన్నాడు. “బుద్ధిమంతుడైనవాడు ఎవడన్నా జూదక్రీడని ఇష్టపడతాడా? (ఈ ఒక్క మాట చాలు, ధర్మరాజుకు ద్యూతక్రీడ మీద ఇష్టం లేదని చెప్పటానికి) ఇక జరిగేదంతా విథి నిర్ణయం. విదురా! తండ్రి ఆదేశించినట్లు చేయటానికి నిశ్చయించుకొన్నాను. ఇది నా వ్రతం”. అని అందరితో హస్తినకు పయనమయ్యాడు.

అక్కడ వారి ఆతిథ్యాన్ని అందుకున్నారు. నూతనంగా నిర్మతమైన సభనంతా పర్యవేక్షించారు. అక్కడే గుంటనక్కలా ఎదురు చూస్తున్న శకుని ధర్మరాజుని పిలిచాడు. “రాజా! అందరూ నీ కోసమే ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ పాచికలాడే బల్లలను పరిచారు. ద్యూతక్రీడకు సమయం ఆసన్నమైంది. రా!” అంటూ ఆహ్వానించాడు. కానీ ధర్మరాజు వారించ ప్రయత్నించాడు. “సుబలపుత్రా! ఈ క్రీడని జూదరులు తప్ప సజ్జనులు ఎవరూ ప్రశంసించరు. ధర్మబద్ధమైన విజయం యుద్ధమునందే ఉంటుంది. ఆర్యులైనవారు మాటలతో ఎవరినీ చిన్నపుచ్చరు, కపటంగా ప్రవర్తించరు, మోసం లేనిది ధూర్తత్వం లేనిది యుద్ధమొకటే సత్పురుషులకు వ్రతంలాంటిది. మేము మా ధనాన్ని సత్కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. దానికి విరుద్ధమైన జూదానికి ప్రేరేపించకు” అన్నాడు. దానికి శకుని, “యుధిష్ఠిరా! అస్త్రవిద్యలో ఆరితేరినవాడు ఆవిద్యలో ప్రావీణ్యంలేనివాడిని, మిక్కిలి బలవంతుడు బలహీనుడిని, విద్వాంసుడు అపండితుడిని ధూర్తత్వంతోనే, మోసంతోనే సమీపిస్తారు. అలాగే పాచికలు బాగా ఆడగలిగినవాడు మోసంతోనే ఆడలేనివానిని సమీపిస్తాడు. ఇంత ఎందుకులే, నీకు భయంగా ఉంటే తప్పుకోవచ్చు” అన్నాడు. ఆ మాటకి యుధిష్ఠిరుడు, “రాజా! పిలిచిన తరువాత వెనక్కి మరలను. ఇది నా వ్రతం. విధికి లోబడి ఉన్నాను. ఇక్కడ ఉన్నవారితో ఎవరితో నేను ఆడాలి. నాతో పందెం ఒడ్డేవారెవరు. ఈ నిర్ణయం అయ్యాక జూదం ప్రారంభించవచ్చు” అన్నాడు.

దుర్యోధనుడు అందుకున్నాడు. “రాజా! నేను రత్నాలను, ధనాన్ని ఇచ్చేవాడిని. నా కోసం నా శకుని మామ జూదం ఆడతాడు”. ఇక్కడ ఒకని కోసం ఇంకొకరు జూదమాడటంలోనే దుర్యోధనుడి మోసం మొదలైంది. ఇక ఆట మొదలైంది. మణులను పొదిగిన బంగారు హారం పణంగా పెట్టాడు ధర్మజుడు. కపట జూదరియైన శకుని పాచికలు వేసి వెంటనే ఓడిపోయావు రాజా! అన్నాడు. వేయి నిష్కాలతో నిండి వున్న బంగారుమయమయిన భాండాలు పణంగా పెట్టాడు. శకుని పాచికలు వేసి ఓడిపోయావన్నాడు. ఈ సారి లక్షలాది దాస దాసీలను పణంగా పెట్టి ఓడిపోయాడు. క్రమంగా చతురంగబలాలలో గజ, రథ, అశ్వ కాల్బలాను కూడా ఓడిపోయాడు.

విశ్లేషణ:

వ్యాసులవారు ప్రతిసారీ "మోసాన్ని ఆశ్రయించి పాచికలు వేస్తున్న శకుని చేత"- అన్నారు. ఎందుకంటే శకుని అక్షవిద్యా నిపుణుడు, కానీ దానిని వాడకూడని వక్రమార్గంలో కైతవాన్ని ప్రయోగించే మాయగాడు. కపటంతో ఆడుతున్నట్టు వ్యాసులవారు చెప్పటమే కాక శకుని కూడా స్వయంగా ధర్మరాజుతోనే పలికాడు. కాబట్టి సుహృద్యూతం అనే పేరుతో ధర్మజుని పిలిపించి, మాయాద్యూతంతో మోసగించారు కౌరవాధములు. 

విదురుని విఫలప్రయత్నం:

పరిస్థితిని గమనించిన విదురుడు మరొక్కసారి ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. కానీ చావదలిచినవాడికి మందులు ఎందుకు? ఆ మందులు ఎలాగూ అయిష్టంగానే ఉంటాయి వారికి. అలాగే విదురుడు ఎంత నీతి చెప్పినా ధృతరాష్ట్రుడు గానీ, దుర్యోధనుడు గానీ వినిపించుకోలేదు. వినలేదు సరికదా పైగా దుర్యోధనుడు విదురుణ్ణి నానా మాటలూ అన్నాడు. ఆట సాగుతుంది. అడ్డుచెప్పేవాడు లేడు. చెప్పినా వినే పరిస్థితిలో లేరు.

తమ్ముళ్ళను - భార్యను పణంగా పెట్టడం:

శ్యామవర్ణం గల మహాభుజుడు, సింహ మధ్యముడు అయిన నకులుణ్ణి పణంగా పెట్టాడు ధర్మరాజు. ఓడాడు. ధర్మాన్ని ఉపదేశించగల పండితుడైన సహదేవుణ్ణి పెట్టి ఓడిపోయాడు. యుద్ధంలో సోదరులను తరింపచేయగలవాడు లోకైక వీరుడైన అర్జునుణ్ణి పణంగా పెట్టాడు. ఓడిపోయాడు. ఇష్టమైన భీమసేనుణ్ణి పెట్టి ఓడిపోయాడు. చివరికి తనకు తాను పణంగా పెట్టుకుని ఓడిపోయాడు. సోదరులందరూ తలలు దించి కూర్చున్నారు దాసులుగా. శకుని ప్రేరేపణతో చివరి పందెంగా పరమ పవిత్రమైన సాధ్వీమణి, పతివ్రత అయిన ద్రౌపదిని పణంగా పెట్టాడు. మేమే గెలిచామన్నాడు పాచికలు విసిరిన శకుని. పందెం పందానికీ ధృతరాష్ట్రుని పైశాచికానందమా అనట్టు “గెలిచామా? మనమే గెలిచామా?” అంటూ ఆరాటంగా తన అంతరంగాన్ని ప్రదర్శించాడు.

విశ్లేషణ:

ఇక్కడ ద్రౌపదిని పణంగా పెట్టటం అనే విషయాన్ని పరిశీలించినప్పుడు, ముందు ధర్మరాజు తనను తాను ఓడిపోయాడు. కాబట్టి కౌరవులు తనకు యజమానులయ్యారు. శకుని ప్రేరణతో ద్రౌపది పందెంలో పెట్టబడింది. యజమాని పెట్టమన్నాడు కాబట్టి ధర్మం తప్పకుండా తన కర్తవ్యాన్ని చేశాడు ధర్మరాజు.
మరొక కోణంలో పరిశీలిస్తే భార్యభర్తలు కలిపి ఒకరుగానే చెప్పే సంప్రదాయం ఉంది. భర్త వేరు భార్య వేరుకాదు. ధర్మరాజు తనను తాను ఓడిపోయినప్పుడే ద్రౌపది కూడా వారి దాసి అయిపోయిందని భావించవచ్చు.
అంతేకాక ద్రౌపది పరాభవఘట్టములో భీమసేనుడే స్వయంగా ధర్మరాజుని ఆవేశపడి నిందించాడు. ధర్మరాజు యొక్క చేతులు కల్చేయాలని సంకల్పించాడు. సహదేవా! అగ్ని తీసుకురా - అన్నాడు.

బాహూ తే సంప్రధక్ష్యామి సహదేవాగ్నిమానయ. 68.6

కానీ అర్జునుడు ధర్మరాజు దివ్యగుణాలను గుర్తుచేసి భీముడిని శాంతింపచేశాడు. ధార్మికుడైన ధర్మరాజు గుణాలను కీర్తించాడు. క్షాత్రధర్మాన్ని అనుసరించి, ఇతరుల కోరికను అనుసరించి ఆడవలసి వచ్చినట్టు అర్జునుడే పలికాడు. అప్పడు భీముడు కూడా ఇది క్షాత్రగుణమనే అంగీకరించి శాంతించాడు. ద్రౌపదితో కూడా ధర్మరాజు చేసినది ధర్మసమ్మతమే అని నచ్చచెప్పాడు. చేసేది లేక ఆ తల్లి శ్రీకృష్ణభగవానుడినే శరణు వేడి తననుతాను రక్షించుకోగలిగింది. పతులకు కూడా స్వేచ్ఛను కల్పించింది.

ఈ విషయాలను బట్టి చూస్తే ద్యూతక్రీడ విషయంలో ధర్మరాజులో ఎటువంటి ధర్మలోపమూ లేదని తెలిసిపోతుంది. కానీ ద్రౌపదిని కాపాడిన శ్రీకృష్ణపరమాత్ముడు ధర్మరాజును ఎందుకు కాపాడలేదు అనే సందేహమూ కొందరిలో కలుగుతుంది. స్వయంగా ధర్మరాజే అరణ్యపర్వంలో అడుగుతాడు. “నీవు ఆ సమయంలో ఎక్కడు ఉన్నావు కృష్ణా”? అని. దానికి సమాధానంగా శ్రీకృష్ణుడు తాను యుద్ధానికి వెళ్ళినట్లు చెప్పాడు. కానీ ద్రౌపదిని కాపాడాడు కదా అదే సమయంలో? ఈ ప్రశ్నకు సమాధానంగా ద్రౌపది తనకు వచ్చిన కష్టానికి పరమాత్మను ఆర్తితో పిలిచింది. కానీ ధర్మరాజు పరమాత్మను స్మరించలేదనే చెప్పాలి. స్మరించలేదు సరికదా, కృష్ణా! నీవు ఈ దరిదాపులలోకి రాకుండా ఉంటే బావుండునని భావించి ఉంటాడు. ఎందుకంటే ఆడేది ద్యూతక్రీడ. ఇటువంటి వ్యసనాలలో భగవంతుని స్మరించటం దోషముగా భావించి ధర్మజుడు పరమాత్ముడిని తలుచుకొని ఉండడని పండితులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాలు అరణ్యపర్వంలో కనిపిస్తాయి.

అనుద్యూతము- వనప్రస్థానము:

అనుద్యూతంతో మళ్ళీ పాండవులను జూదానికి పిలవాల్సిందేనని దుష్టచుతష్టయం నిర్ణయించింది. ఈ సారి ఒకటే పందెం. ఓడిన వారు రాజ్యం వదిలి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం. ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి, మహారాజు అనుద్యూతానికి పాండవులను ఆహ్వానించారు. ప్రారబ్దానికి తలవంచి ధర్మరాజు మరలా జూదానికి కూర్చున్నాడు. శకుని పందెం చెప్పి పాచికలు వేయటం ఓడించటం క్షణంలో అయిపోయింది.

కుంతీ దేవి పుత్రులకు వచ్చిన ఆ దుస్థితికి చింతించి ద్రౌపదికి పాతివ్రత్య ధర్మాలను ఉపదేశించి సహదేవుణ్ణి అరణ్యవాస కాలంలో కనిపెట్టుకుని ఉండమ్మా అని విశేషంగా చెప్పింది. (మాద్రి అప్పచెప్పిన పుత్రులలో చిన్నవాడు, ధర్మాత్ముడు. ఈ సహదేవుడే కుంతీదేవి గాంధారీధృతరాష్ట్రులతో అరణ్యాలకు వెళ్ళినప్పుడు తల్లికోసం తల్లడిల్లిపోయాడు.)

ఇక సభాపర్వంలో చివరగా పాండవులు వనానికి వెళుతూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వెళ్లారు. ధర్మరాజు ముఖానికి వస్త్రాన్ని అడ్డు పెట్టుకుని, భీముడు బాహువులను తడుముకుంటూ, అర్జునుడు ఇసుకను చల్లుకుంటూ, సకులసహదేవులు మట్టిని పులుముకుని, ద్రౌపది తన కేశములతో ముఖాన్ని కప్పుకుని వెళ్లారు. ధౌమ్యుడు దర్భలతో సామగానం చేస్తూ వెళ్తున్నాడు. 

విశ్లేషణ:

అలా ఎందుకు వెళ్లారు అందులో ఏమన్నా అర్ధముందా? అని వివరాలు విదురుణ్ణి కనుక్కుని ఖంగుతిన్నాడు ధృతరాష్ట్రుడు. ధర్మమూర్తి అయిన ధర్మరాజు యొక్క ఎరుపెక్కిన నేత్రముల ప్రభావం (సుహృద్యూతమనిపిలిచి, ఆటరాని ధర్మజునితో ఆడించి, పందెం వేసేవారు శకునిగాను,పణంగా పెట్టేది దుర్యోధనుడిగానూ ఇలా కపటంతో ఆడుతూ, శకునికి మాత్రమే వశంలో ఉన్న పాచికలను వాడుతూ, ద్రౌపదీ పరాభవానికి కారుకలైన వారిమీద క్రోధంతో కనులు ఎర్రబడితే) ఆ వేదన ప్రభావం అమాయకులైన ప్రజలమీద పడితే భస్మమైపోతారని, అటువంటి ఆపద వారికి కలుగరాదని ముఖాన్ని కప్పుకున్నాడు. ధర్మాత్ముల దృష్టికి అంత ప్రభావం వుంటుంది. వారి ముఖం ప్రసన్నంగా ఉందా, లోకానికి సర్వ శుభాలు కలుగుతాయి. అదే వారి కనుకొనలు ఎర్రపడినా తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నాడు. తదుపరి అరణ్యపర్వము.

ముగింపు:

యతో ధర్మః తతః కృష్ణః” అన్నట్లు, ధర్మరాజు యొక్క ధర్మలక్షణాలకు పరమాత్ముడే ముగ్ధుడై విశ్వకర్మచేత, మయుడి చేత రాజధానీ నిర్మాణమును, సభను ఏర్పాటు చేయించాడు. అన్ని ధర్మములు, ధర్మసూక్షములు తెలిసి ఉండి కూడా నారదుడు విచ్చేసినప్పుడు వినయంగా అన్ని విషయాలు తెలుసుకుని, వాటిని పాటిస్తానని మాట కూడా ఇచ్చాడు. రాజసూయం చేయటం కష్టమని నారదుడు చెప్పినాకూడా తన కీర్తికంటే, తండ్రికి ఉత్తమమైన ఇంద్రలోక ప్రాప్తి కలగటమే ముఖ్యముగా భావించి ముందడుగు వేసి పితృఋణం తీర్చుకున్న ధర్మమూర్తి యుధిష్ఠిరుడు.
పాచికలలో పణంగా పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము, ఒక సంవత్సరం అజ్ఞాతవాసము అని వినగానే ధర్మజుడు వ్యాసుడు చెప్పిన భవిష్యవాణిని గుర్తుచేసుకుని ఉంటాడు. అక్కడ వ్యాసులవారు చెప్పిన పదమూడుసంవత్సరాలు లెక్క ఇక్కడ అనాలోచితంగా శకుని నోట వచ్చిన పదమూడు సంవత్సరాల లెక్క సరిగ్గా సరిపోయింది.

ధృతిః క్షమా దమోఽస్తేయం శౌతమిన్ద్రియనిగ్రహః ।
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణమ్ ।।

ధృతి, క్షమా మొదలైన దశగుణాలను ధర్మలక్షణాలుగా పండితులు చెప్పారు. అందులో ధర్మరాజు ఈ సభాపర్వంలో ఇన్ని కష్టాలు పడినా కూడా సహనము, ఇంద్రియనిగ్రహము, మొదలైన గుణాలతో విలసిల్లి ముల్లోకాలకూ ఆదర్శప్రాయుడయ్యాడు.

మహాభారతము – కొన్ని ప్రత్యేకతలు (అంతర్జాల శోధన ఆధారంగా.)

  • మహాభారత రచన చేసినది పరాశర మహర్షి కుమారుడయిన వేదవ్యాసుడు (500 B.C?-300 B.C?).
  • మహాభారతకథను వ్యాసుడు రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు.
  • మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి శుక మహర్షిని, సర్పలోకంలో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
  • అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగింది.
  • ఈ యుద్ధంలో భీష్ముడు 10 రోజులు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు భీముడు ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
  • ఈ యుద్ధంలో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 అక్షౌహిణులు. పాండవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
  • ఈ యుద్ధం జరిగిన ప్రదేశం శమంతక పంచకం. తన తండ్రిని అధర్మంగా చంపిన క్షత్రియ వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియవధ చేసిన సమయంలో క్షత్రియరక్తంతో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. పరశురాముడు తన తండ్రికి ఇక్కడ తర్పణం వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న పగ తీర్చుకున్నాడు.
  • పంచమ వేదంగా వర్ణించబడే ఈ మహాభారతాన్ని కవులు మహాకావ్యమని, లాక్షణికులు సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు నీతి శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
  • వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే నినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు.
  • మహాభారతంలోని ఉపపర్వాలు అవి: పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, సుభద్రాకల్యాణం, హరణహారిక, ఖాండవదహనం, మయదర్శనం, సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, జటాసురవధ, యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, ఘోషయాత్ర, ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, ద్రౌపదీహరణం, కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గోగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, భగవద్గీత, భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధ వధ, ఘటోత్కచ వధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, స్త్రీపర్వం, శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, అశ్వమేధం, అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం. (హిందూ గ్రంథాలు, మహాభారతం తెలుగు బ్లాగ్, మహాభారతం ప్రత్యేకతలు లింక్: - https://mahabharathamtelugu.blogspot.com/2017/03/special.html)

ఉపయుక్తగ్రంథసూచి:

  1. కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే. 1906.
  2. పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు 30. 2023.
  3. ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
  4. మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత. 2003.
  5. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
  6. రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
  7. శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్. 1931.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]