AUCHITHYAM | Volume-04 | Issue-02 | February 2023 | ISSN: 2583-4797
2. డా॥ వి. చంద్రశేఖరరావు కథలు : మైనారిటీవాదం
పి. ఇందిర
పరిశోధక విద్యార్థిని, తెలుగుశాఖ,
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - 517502, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9492594459. Email: pyatloindira@gmail.com
Download PDF
Keywords: కథ, కథానిక, ఆధునికసాహిత్యం, మైనారిటీవాదం, కవితాప్రక్రియలు, చంద్రశేఖరరావు, ఇందిర.
1. ఉపోద్ఘాతం:
తెలుగు సాహిత్యంలో కథానికకు విశిష్టస్థానం వుంది. సమాజంలో నెలకున్న సామాజిక రుగ్మతలను నిరంతరం ఎత్తిచూపుతూ సమసమాజ నిర్మాణం కోసం కధానిక తోడ్పడుతుంది. కధానిక సాహిత్యంలో విభిన్నమైన పార్శ్వాలను స్పృశిస్తూ భిన్నమైన వస్తు రూపాలను గ్రహిస్తూ ఎందరో రచయితలు కథకు పుష్టిని కలిగించారు. వారిలో ఒకరు చంద్రశేఖరరావు. విలక్షణ కథకుడిగా సాహితీప్రపంచంలో చంద్రశేఖరరావుకు పేరుంది. విభిన్నమైన వస్తువులను ఎన్నుకొని కథలను రాశారు ఈయన. ఈయన వామపక్ష భావజాలంతో మెరుగైన సమాజం కోసం కథల్ని రాశాడు. జీవని, లెనిన్ ప్లేస్, ద్రోహచృక్షం, విట్టచివరి రేడియోనాటకం, మాయాలాంతరు, ముగింపుకు ముందు అనే ఆరు సంపుటాల కేంద్రంగా తన కథలను పాఠక ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ కథల కేంద్రంగా సామాజికవర్గాల మధ్య సంఘర్షణను, లైంగిక సంబంధాల మధ్య నెలకొన్న సంక్షోభాన్ని నిస్సారంగా మిగిలిపోయిన మోడు జీవితాల పరిస్థితిని, అవకాశరాజకీయాల ప్రపంచాన్ని ఈ సంపుటాల కేంద్రంగా తెలియపరచాడు. హిందూ, ముస్లిం భాయి ఛాయి అనుకునే సంస్కృతిగల మనదేశంలో మైనారిటీల పట్ల వ్యవహరించే తీరును రచయిత వాస్తవికంగా తన కథలలో చిత్రించాడు. ఈ పరిస్థితులన్నింటినీ చంద్రశేఖరరావు రాసిన కొన్ని కధల కేంద్రంగా చెప్పడమే ఈ వ్యాసోద్దేశం.
2. హైకు :
నేటి సమాజానికి శాంతి అందాలనే నేపథ్యంలో సాగిన కథ 'హైకూ'. కథలో హరి చరిత్ర అధ్యాపకుడు, దార్శనికుడిగా, మేధావిగా ఆయనకెంతో పేరుంది. ఒకరోజు హరికి క్లాసులో కూర్చొని పాఠం బోధించాలని అనిపించదు. సమాథింగ్ అంటు గొనుక్కుంటాడు. పాఠం ఆపేసి లైబ్రెరీవైపు వెళ్తాడు. నిశ్శబ్దంగా ఉండాల్సిన లైబ్రరీ వాతావరణం గొడవ గొడవగా వుంటుంది. లైబ్రరిలో పావురాలు నివాసం ఏర్పాటు చేసుకోవడం వల్ల పావురాళ్ళను తరిమే పనిలో విద్యార్థులు వుంటారు. ఆ వాతావరణం నచ్చక హరి క్యాంటీన్ కు వెళ్తాడు. అక్కడ 'ముస్తఫా! ముస్తఫా' అనే పాట విషయమై అబ్దుల్లా అనే విద్యార్థితో తోటి విద్యార్థులు ఘర్షణకు దిగుతారు. అక్కడి వాతావరణం నచ్చక హరి స్టాఫ్ రూముకు వెళ్తుండగా దారిలో ఊళ్లో గొడవలు కారణంగా క్లాసులు లేవని హరికి తెలుస్తుంది. అప్పటికే ఆరోజు తనలో తెలియని అలజడి వుండే సరికి భయం వేస్తుంది. ఆ భయానికి కారణం ఆ రోజు డిసెంబర్ 6 అని గ్రహించి దిగులుపడతాడు. ఇంటికి వెళ్తున్న హరికి దారిలో ఒక విద్యార్ధి గోడపై "లెట్ అజ్ ఆల్ లివ్ ఇన్ పీస్’1 అని రాస్తుంటాడు. ఆ విద్యార్థినిని పోలీసులు చేయిచేసుకుంటారు. ఆ వాక్యం హరిని ఆకట్టుకుంటుంది.
భారతీయ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు, హక్కులు వున్నాయి. కానీ ఈ సమాజం నేడు మతోన్మాదశక్తుల కబంధహస్తాలలో ఇరుక్కుపోయింది. హిందూత్వం ముసుగులో మత ఛాందసవాదులు మైనారిటీల పట్ల కఠినంగా ప్రవర్తిస్తున్నారు. శాంతిని ఆకాంక్షించే దేశంలో అశాంతి నెలకొని వుందని 'హైకు' కథ ద్వారా రచయిత చెప్పదలచాడు. ముస్లింలు ఈ దేశ అభివృద్ధికి దోహదం చేస్తున్నా వారిపట్ల మతోన్మాదులు దాడులకు తెగబడుతున్నారు. ఈ పరిణామాలు మనుషుల మధ్య తీవ్రమైన అగాధాన్ని సృష్టిస్తున్నాయి. కథలో చరిత్ర అధ్యాపకుడయిన హరి ఈ సమాజంలో నెలకొనివున్న మతఘర్షణలకు భయపడిపోతాడు. దీనికి ప్రధాన కారణం డిసెంబర్ 6 బాబ్రీమసీదు విధ్వంసం. డిసెంబర్ 6న జరిగిన విధ్వంసం హిందూముస్లిం సోదరుల మధ్య విభేదాలు నెలకున్నాయి. శాంతిని కాంక్షించే దేశంలో అశాంతి తీవ్రరూపం దాల్చడం బాధాకరమైన విషయం. ఈ విషయాని హైకూ కథ ద్వారా రచయిత చెప్పదలచాడు. కథలో “ఒక స్వప్నం మిగిలివుంది. వేసవిలో మొలిచే పచ్చికలా, రండి! పావురాల్ని పెంచుదాం!"2 అన్న ఈ మాటలను బట్టి మనుషుల మధ్య నెలకొన్న ఈ మతోన్మాద ఘర్షణలు మంచివికావని ఈ పరిణామలు సమాజ దిగజారుడుతనానికి నిదర్శనం. కాబట్టి ప్రజలు ఈ ఘర్షణలనుండి విముక్తులై శాంతియుతంగా మెలగాలని హైకూ ద్వారా రచయిత హిందువులకు ముస్లింలకు పిలుపిచ్చాడు.
3. సలీం సుందర్ ప్రేమకథ :
ముస్లింల ప్రమేయం లేకుండానే వాళ్ళ జీవితాలు సంక్షోభంలోకి నెట్టివేయబడతాయని చెప్పడానికి నిదర్శనం ఈ 'సలీంసుందర్ ప్రేమకథ' కథలో సలీంసుందర్ మనోరమ అనే యువకులు ఒకర్నొకరు ప్రేమిస్తారు. ఈ ప్రేమికుల మధ్య మతం అడ్డుగా నిలుస్తుంది. ఒకసారి సలీంసుందర్ మనోరమను కలవడానికి కాఫీషాప్ కు వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు ఏ కారణం లేకుండానే అతడిపై కేసుపెట్టి చేయిచేసుకుంటారు. తాను కేవలం ముస్లిం యువకుడు అయినందు వలన చేయిచేసుకున్నారని అనుకుంటాడు సలీం. మరో సందర్భంలో మనోరమను కలవడానికి యూనివర్శిటీకి వెళ్తాడు. అక్కడ కొంతమంది విద్యార్థులు సలీంసుందర్ పై దాడికి తెగబడతారు. కారణం సలీం మనోరమను ప్రేమించడమే. సలీం తను పుట్టినప్పటినుండి ముస్లింలపై జరుగుతున్న అన్యాయాలను, దౌర్జన్యాలను తలచుకుంటాడు. చివరికి తన వేషధారణను మార్చుకొంటాడు. చివరికి సలీంకు రాష్ట్రంలో బాంబులు పెట్టిన కేసులో పోలీస్టేషన్ కు ఇంటరాగేషన్ కు రావల్సిందిగా కబురువస్తుంది. సలీం పోలీస్టేషన్ కు వెళ్ళేముందు రాత్రి యుద్ధాన్ని కలగంటాడు. కలలో పోలీసుల చేతిలో చావు దెబ్బలు తినడం, యుద్ధం మధ్యలో సలీం క్షతగాత్రుడిలా పడిపోవడం లాంటివి కలగంటాడు. సలీం పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. చాలా మంది కవులు సలీం అరెస్ట్ ను ఖండిస్తారు. పోలీసులు సలీంను వదిలేస్తారు. చివరికి సలీం ప్రేయసి మనోరమ ముస్లిం మతాన్ని వదులుకోమని సలహా ఇస్తుంది. సలీం సుందరంను యస్. సుందరంగానో, ఒట్టి సుందరంగానో, మోహనసుందరంగానో మార్చుకోమని అంటుంది. మనోరమ సలీంను కౌగిలించుకుంటుంది. సలీంకు కామోద్ధీపనకు బదులు ఒక విధ్వంసం. ఒక ప్రాణభయం కల్గుతుంది. సలీం స్పందనలు చచ్చినవాడిలా అలాగే ఉండిపోతాడు.
కథలో సలీంసుందర్ ముస్లిం మతానికి ప్రతీక. మనోరమ హిందూ మతానికి ప్రతీకగానూ రచయిత చిత్రించాడు. వీరిరువురు ఇరుమతాలకు చెందినవారైన వీరి ప్రేమకు ఆ మతాలు అడ్డురావు. ఇదేవిధంగా సమాజంలోని మెజారిటీ మైనారిటీ మతస్థులు ఐక్యంగా ప్రేమతో జీవించడానికి వారి మతాలు అడ్డురావన్నది రచయిత భావనగా చెప్పవచ్చు. అయితే కొన్ని స్వార్థపర శక్తులు మైనారిటీ మతానికి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్లే సలీం లాంటి మైనారిటీ మతంలోని వ్యక్తులకు అభద్రత కలుగుతోందని రచయిత ఈ కథ ద్వారా వెల్లడించాడు. మనోరమ సలీంసుదర్ ను కౌగిలించుకున్నప్పుడు సంతోషం స్థానంలో విధ్వంసము, ఒక ప్రాణభయం కలిగి స్పందనలేకుండా చచ్చినవాడిలా వుండిపోయాడని రచయిత అనడాన్నిబట్టి దేశంలో హిందూ, ముస్లింల మధ్య డిసెంబర్ 6 సంఘటన ఒక వైరుధ్యాన్ని, ఘర్షణను కలిగించిందని తెలుస్తుంది. సలీంసుందరం మనోరమను వివాహం చేసుకుంటే తన జీవితం అభద్రతకు లోనవుతుందని భావించాడు. అదేవిధంగా దేశంలోని ముస్లింలు సలీంసుందరం లాగా హిందువులపట్ల అభద్రతా భావంతోనూ, ప్రాణభయంతోనూ జీవిస్తున్నారన్నదే రచయిత భావన.
4. రెండు ఎర్రని గాలిపటాలు :
గుజరాత్ లో జరిగిన మతోన్మాద విధ్వంసానికి ప్రతిరూపమే 'రెండు ఎర్రని గాలిపటాలు' అనే కథ, గుజరాత్ లో జరిగిన అల్లర్లలో తల్లిదండ్రులను కోల్పోయిన ముస్లిం పిల్లలందరిని 'ఫాతిమా' అనే బిచ్చగత్త అక్కున చేర్చుకొంటుంది. గుజరాత్ లోని మారణకాండను కథలు కథలుగా పాటలు పాడుతూ బిచ్చమెత్తుకుని తను పస్తులుండి పిల్లల ఆకలి తీరుస్తుంది ఫాతిమా. పిల్లల్ని ఆకలితో పెట్టిన సందర్భాలు లేవు. ఫాతిమా మాత్రం రోజు రోజుకీ క్షీణించిపోతుంది. తన పిల్లల శిబిరంలో హమీద్, రషీద్ అనే పిల్లలు మానసికంగా కృంగి విచిత్రంగా ప్రవర్తిస్తారు. హమీద్ అనే కుర్రాడు మహాక్రోదంగా ఇమాజనరీ బుల్లెట్లను తుపాకీలో నింపి సూర్యుడిని కాల్చి ఆనందిస్తాడు. మరో యువకుడు రషీద్ తన పళ్ళతో ఎలుకను చంపాడు, బొద్దింకపై పెట్రోలు పోసి తగలబెట్టి ఆనందపడతాడు. ఒకసారి రషీద్ తన పళ్ళతో హమీద్ గొంతు కొరుకుతాడు. ఈ సంఘటనతో ఫాతిమా జైలు పాలవుతుంది. పిల్లలందర్ని గవర్నమెంట్ శిబిరాలకు పంపేస్తారు. ఆ తర్వాత ఫాతిమా ఏమైందో తెలియదు. ఆమె ఇల్లు ఇప్పుడు ఒక మ్యూజియంగా మిగిలిపోయింది. ఇంటిముందు ఇద్దరు, ముగ్గురు పిల్లలు ఫాతిమా కథనే పాటలుగా వినిపిస్తూ వుంటారు.
గుజరాత్ లో జరిగిన మారణహోమం ముస్లిం పిల్లల మనసుల్లో రేపిన కల్లోల్లాన్ని గురించి చిత్రించిన కథ ఇది. అన్ని మతాల సారాంశం మానవ అభివృద్ధే కానీ మనుషుల మధ్య స్వార్థపూరిత మతోన్మాదులు అడ్డుగోడలుగా నిలుస్తారు. దీంతో హింసాత్మకమైన ఘర్షణలు నెలకొంటున్నాయి. ఈ ఘర్షణలు ద్వారా భావితరాలు తీవ్రమైన ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నారు. గుజరాత్ లో జరిగిన హిందూ, ముస్లింల మత ఘర్షణల్లో మైనారిటీలు తీవ్రమైన సంక్షోభానికి గురైనారు. ముఖ్యంగా ఆ ప్రభావం ముస్లిం పసిపిల్లపై చెరగని ముద్ర వేసింది. కథలో హామీద్, రషీద్ అనే ఇద్దరు ముస్లిం పిల్లలు మానసిక సంక్షోభానికి గురయినారు. భయంతో, అభద్రతతో అనుమానంతో ప్రతిక్షణం సంఘర్షణకు గురవుతారు. పసిపిల్లల్లో నెలకొన్న ఈ అభద్రత కారణంగా హమీద్, రషీద్ అనే యువకులు హింసాత్మక వైఖరులను అవలంభిస్తారు. దీన్నిబట్టి ముస్లింలలో నెలకొన్న అభద్రతాభావం వారిని హింసవైపు తిరుగుబాటు వైపు దారి మళ్ళించే అవకాశం ఉందని ఈ పరిణామాలు వల్ల హిందూ, ముస్లింల మధ్య నెలకొన్న సౌభ్రాతృత్వానికి విగాధం కలుగుతుందని రచయిత సమాజాన్ని హెచ్చరించాడు.
5. చీకటమ్మా! చీకటి:
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కల్గినదేశం. అలాంటి మన దేశంలో అనేక కుల మతాలు చోటుచేసుకున్నాయి. కులమతాలకు అతీతంగా వివాహం చేసుకొని సమాజంలో నిరంతరం మతఘర్షణలను చూస్తూ చివరికి లౌకికవాదం కోసం వారు పోరాటమే ఈ కథలోని ప్రధాన వస్తువు.
ఈ కథలో పార్వతి, రెహమాన్ లది మతాంతర వివాహం. ఈ వివాహం ఇష్టంలేని పార్వతి తండ్రి, కూతురు చచ్చిపోయిందని శ్రాద్ధం పెట్టి చెయ్యిదులుపుకుంటాడు. సమాజంలో జరిగే మతఘర్షణలు చూస్తూ రెహమాన్ విసిగిపోయి ఈ మనుషులు, మతాలు, కొట్లాటలు లేని ఇంకేదైనా ప్రపంచంలోకి వెళ్ళి పోవాలనుకొంటాడు. ఇంత పేలమైతే ఎలా అంటుంది పార్వతి. చివరికి రెహమాన్ “హిందువుగానో, ముస్లింగానో తప్ప మనిషిగా జీవించలేని పరిస్థితులున్న దేశంలోకి నా బిడ్డను ఆహ్వానించలేను"3 అంటూ పార్వతిని అబార్షన్ చేయించుకోమంటాడు. పార్వతి మాత్రం మనందరిలోనూ ఈ దేశ పౌరులందరిలోనూ లెప్పర్ లక్షణాలు వున్నాయి అంటుంది. స్పర్శ, జ్ఞానం లేని చేతులు, ఏ అనుభూతీ అంటని చేతులు, ఈ దేశ పౌరులందరిలోనూ ఈ లక్షణాలున్నాయంటుంది. స్పర్శారాహిత్యంగా ఎన్ని విషాధాలు జరిగినా, ఎన్ని మారణహోమాలు జరిగినా ఏమీ పట్టనట్టే జీవిస్తారని బాధపడుతుంది. హఠాత్తుగా పార్వతి ముందు “ఆరేళ్ళపాప సెక్యులరిజానికి మద్దతుగా మానవహారాన్ని నిర్మిస్తున్నాము. రండి! చెయ్యికలపండి అంది. అప్రయత్నంగానే పార్వతి చెయ్యి ఆ చేతిలో మరోచేయి అనంతంగా సాగిపోతుందా మానవహారం, పార్వతి కడుపులోని శిశువు అటూ ఇటూ కదలాడి నన్ను చేయి కలపనీ అన్నట్లుగా తోచి సన్నగా నవ్వుకుంటుంది పార్వతి”4.
యువతీ యువకుల మధ్య చిగురించే ప్రేమకు మతాంతరాలు అడ్డుకారాదని చెప్పడం ఈ కథలోని ప్రధానాంశం. అయితే స్వార్థపూరిత అరాచక శక్తులు మతాలమధ్య ఘర్షణ వాతావరణాన్ని నెలకొల్పుతున్నాయి. దీంతో మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. అయితే ఈ మతాల అడ్డుగోడలను తొలగించుకొని ప్రేమ వివాహాలు చేసుకొన్న ప్రేమికులు సమాజం నుండి తీవ్రమైన సంఘర్షణకు గురవుతున్నారని ఈ కథ ద్వారా తెలియపరిచాడు రచయిత. కథలో రెహమాన్, పార్వతిలు ప్రేమ వివాహాన్ని చేసుకుంటారు. అయితే రెహమాన్ మత ఘర్షణల నుంచి దూరంగా వెళ్ళిపోవాలని భావిస్తాడు. పార్వతి మాత్రం ధైర్యం చెబుతుంది.
ఇలాంటి మతఘర్షణలు వున్న సమాజంలోకి తనకు పుట్టబోయే శిశువును ఆహ్వానించకూడదని అనుకొంటాడు రెహమాన్. దీన్నిబట్టి ముస్లింలు అభద్రతా భావంతో వున్నారని స్పష్టమవుతుంది. సమాజానికి మతోన్మాద ఘర్షణలపట్ల స్పందించే గుణంలేకుండా లెప్పర్ లక్షణాలు కలిగి వున్నాయని పార్వతి అనుకుంటుంది. తమ ఇరువురి మతాల ఐక్యతకు ప్రతీకగా పుట్టబోయే శిశువుకు మంచి భవిష్యత్తును లౌకికత్వం ద్వారానే సిద్ధిస్తుందని ఈ కథ ద్వారా రచయిత చెప్పదలచాడు.
6. ముగింపు :
ఈ విధంగా డా॥ వి. చంద్రశేఖరరావు సమాజంలో జరుగుతున్న మతఘర్షణలకు అన్నింటిని ఈ కథలో చిత్రించాడు. మతఘర్షణ ప్రభావం సమాజంలోని పసిపిల్లలపైన, ప్రేమికులపైన ఏ విధంగా ప్రభావం చూపిందో పై కథల ద్వారా అర్థం చేసుకోవచ్చు. వాస్తవిక దృష్టితో సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలించి మైనారిటీ ప్రజల ఈతిబాధల్ని అక్షరబద్ధం చెయ్యడంలో చంద్రశేఖరరావు సఫలీకృతుడయ్యాడు.
7. పాద సూచికలు:
- చంద్రశేఖరరావు వామనగుంట - చిట్టచివరి రేడియో నాటకం (క.సం.) 2014 పుట. 70
- చంద్రశేఖరరావు వామనగుంట - చిట్టచివరి రేడియో నాటకం (క.సం.) 2014 పుట. 70
- చంద్రశేఖరరావు వామనగుంట - జీవని (క.సం.) 1994 పుట. 60
- చంద్రశేఖరరావు వామనగుంట - జీవని (క.సం.) 1994 పుట. 60
8. ఉపయుక్త గ్రంథసూచి:
- ఖదీర్ బాబు, మహమ్మద్. (2016). కథలు ఇలా కూడా రాస్తారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- చంద్రశేఖరరావు, వామనగుంట. (1994). జీవని ప్లాసౌగ్రాఫర్స్, హైదరాబాద్
- చంద్రశేఖరరావు, వామనగుంట.(2014). చిట్టచివరి రేడియో నాటకం, విశాలాంధ్రవిజ్ఞానసమితి, హైదరాబాద్
- దక్షిణామూర్తి, పోరంకి. (1998). కథానిక స్వరూప స్వభావాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
- యాదగిరి, కె. (2005). తెలుగులో కవిత్వోద్యమాలు, తెలుగుఅకాడమి, హైదరాబాద్
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. (1995). కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
- వెంకటరమణ, జె. (2012). దశాబ్ది కథలు - కథాకథన పద్దతులు(1991-2000) శరత్ ప్రచురణలు
- శార్వరి. (2002). కథలెలారాస్తారు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
- శ్రీదేవి, కిన్నెర. (2010). కథాదృక్పథం, సంహిత పబ్లికేషన్స్, కడప
- సిమ్మన్న, వెలమల. (2019). తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, విశాలాంధ్ర బుక్ హౌస్
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.