AUCHITHYAM | Volume-07 | Issue-10 | September 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. గురజాడ అప్పారావు కథలు: వస్తు వైవిధ్యం
డా. తంగి ఓగేశ్వరరావు
తెలుగు అధ్యాపకులు,
వేమూరి సుందర రామయ్య ప్రభుత్వ డిగ్రీ & పి జి కళాశాల, మొవ్వ,
కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 15.08.2026 ఎంపిక (D.O.A): 30.08.2026 ప్రచురణ (D.O.P): 01.09.2026
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో ఆధునికతకు పునాదులు వేసిన గురజాడ అప్పారావు కథల వస్తు వైవిధ్యాన్ని సమగ్రంగా విశ్లేషించడం ఈ పరిశోధనా పత్రం ముఖ్యోద్దేశం. సమాజంలోని రుగ్మతలను ఎత్తిచూపుతూ మార్పుకు బాటలు వేయడంలో ఆయన రచనల ఆవశ్యకత ఎంతో ఉంది. కె.వి. రమణారెడ్డి తదితర పూర్వపరిశోధకుల అభిప్రాయాలను సమీక్షిస్తూ, 'దిద్దుబాటు', 'మెటిల్డా', 'మీ పేరేమిటి?', 'మతం-విమతం', 'సంస్కర్త హృదయం' వంటి కథలను ప్రాథమిక ఆధారాలుగా స్వీకరించడం జరిగింది. గ్రంథాలయాల్లో లభించే సాహిత్య విమర్శ గ్రంథాలు ద్వితీయ వనరులుగా ఉపయోగపడ్డాయి. ‘గురజాడ కథలు- సామాజికవిశ్లేషణ’ అనే అంశంపై ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, అవసరాల సూర్యారావు, కె వి రమణారెడ్డి రాసిన పరిశోధన వ్యాసాలను ప్రామాణికంగా తీసుకొని ఈ పరిశోధన పత్రం రూపొందింది. గురజాడ కథాసాహిత్యంలోని ఇతివృత్తాలను పరిశీలించడానికి తులనాత్మక విశ్లేషణ పద్ధతిని అనుసరించి, ఐదు ప్రధాన విభాగాలుగా స్త్రీ చైతన్యం, దాంపత్య సంబంధాలు, మత సామరస్యం, సంస్కరణ భావజాలం వంటి అంశాలు ఈ కథల్లో ప్రముఖంగా వ్యక్తమయ్యాయని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. లభ్యమైన పరిమిత ఆధారాలతోనే లోతైన విశ్లేషణ అందించడం ఈ పరిశోధనలో ఎదురైన ప్రధాన సవాల్ కాగా, ఆధునిక కథా సాహిత్య అధ్యయనానికి ఈ పత్రం భవిష్యత్తులో మరింత విస్తృత పరిశోధనలకు చక్కని సూచనలను అందిస్తుంది.
Keywords: జాడ అప్పారావు, సామాజిక, వస్తువు, వైవిధ్యాలు, మతము, సంబంధాలు.
1. ప్రవేశిక
తెలుగు సాహిత్యంలో ఆధునికతకు పునాదులు వేసిన మహనీయుల్లో గురజాడ అప్పారావు ప్రముఖులు. కవి, నాటకకర్త, కథకుడు, సామాజిక సంస్కర్తగా ఆయన తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు. సాహిత్యం సమాజానికి అద్దం పట్టడమే కాకుండా, సమాజంలోని లోపాలను ఎత్తిచూపి మార్పుకు దోహదపడాలనే భావన గురజాడ రచనల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్ల ఆయన రచనల్లో సామాజిక చైతన్యం, మానవతావాదం, సంస్కరణ భావజాలం ప్రధానంగా కనిపిస్తాయి.
గురజాడ కథలు సంఖ్యాపరంగా తక్కువైనప్పటికీ వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉన్నాయి. ఆయన కథల్లో తన కాలం నాటి సామాజిక జీవితం, స్త్రీల సమస్యలు, మత విశ్వాసాలు, కుల వ్యవస్థ, మూఢనమ్మకాలు, వివాహ వ్యవస్థ, సంస్కరణ భావాలు, మానవ సంబంధాలు మొదలైన అనేక అంశాలు ప్రతిఫలించాయి. సమాజంలోని సమస్యలను కేవలం వర్ణించకుండా, వాటి పట్ల విమర్శనాత్మక దృష్టిని పెంపొందించేలా కథలను తీర్చిదిద్దారు.
“నేటి కథకు విఘ్నేశ్వరపూజ చేసిన వారు శ్రీ గురజాడ అప్పారావు. ఆయన రచించిన దిద్దుబాటు, మీపేరేమిటి? అను కథలు ఆ ప్రాంతమున ఆంధ్రభారతి మాసపత్రికలో ప్రచురితమనవి. వీటిని కథలనుటకంటే స్కెచెస్ అనుట సమంజసము. అచ్చము తెలుగు వాడుక భాష సజీవముగా చిన్న కథలు వ్రాయుటకు వాడినవారు శ్రీ గురజాడ” (రమణారెడ్డి 258)
గురజాడ కథల్లోని ప్రధాన ప్రత్యేకత యథార్థ జీవన చిత్రణ. సామాన్య ప్రజల జీవితాలను కథా వస్తువులుగా స్వీకరించి, వారి సమస్యలను సహజమైన భాషలో, వ్యంగ్యంతో, హాస్యంతో, మానవీయ దృక్పథంతో వ్యక్తీకరించారు. ఈ కారణంగా ఆయన కథలు ఆధునిక తెలుగు కథా సాహిత్య పరిణామంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.
గురజాడ తాను చేపట్టిన ప్రతి ప్రక్రియనూ ఆధునీకరించారు, సామాజీకరించారు, సమకాలీనం చేశారు. ప్రయోగం, సాంఘిక ప్రయోజనం రెండూ సాధించారు. ‘చిన్నకథ’ అప్పారావు మానసిక పుత్రిక అన్నాడు రమణారెడ్డి.
ఈ పరిశోధన పత్రంలో గురజాడ కథలైన “దిద్దుబాటు”, “మెటిల్డా”, “మీ పేరేమిటి?”, “మతం–విమతం”, “సంస్కర్త హృదయం” కథలను ఆధారంగా చేసుకుని వాటిలోని ఇతివృత్తాలను పరిశీలించి, వాటి ద్వారా వ్యక్తమైన వస్తు వైవిధ్యాన్ని విశ్లేషించడం ప్రధాన ఉద్దేశ్యం.
2. గురజాడ కథలు – ఇతివృత్తాలు
గురజాడ అప్పారావు కథల్లోని ఇతివృత్తాలు ప్రధానంగా మన సమాజంలోని రుగ్మతలు. వేశ్య వ్యామోహం, కుల మత వైషమ్యాలు, స్త్రీల అణచివేత ఇత్యాది అంశాలను ప్రధానంగా తీసుకొని సంఘసంస్కరణ దృక్పథంతో రచనలు చేశారు. వ్యవహారిక భాషలో సాదాసీదా పాత్రల ద్వారా సమకాలీన సమాజానికి అద్దం పడుతూ తెలుగు కథా సాహిత్యంలో ఇవి ఒక కొత్త విప్లవాన్ని తీసుకువచ్చాయి.
2.1 దిద్దుబాటు
“దిద్దుబాటు” గురజాడ కథా రచనా ప్రతిభకు చక్కని ఉదాహరణ. ఈ కథలో కుటుంబ జీవితం, దాంపత్య సంబంధాలు, నైతిక విలువలు, స్త్రీ వ్యక్తిత్వం వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. భర్త తప్పుదోవ పట్టినప్పుడు భార్య దానిని ఎలా ఎదుర్కొంటుంది? భర్తను శిక్షించడం కంటే అతనిలో మార్పు తీసుకురావడం ఎలా సాధ్యం? అనే ప్రశ్నలకు కథ సమాధానం చూపిస్తుంది. భార్య పాత్రలో కనిపించే వివేకం, ఆత్మగౌరవం, సమయస్ఫూర్తి కథకు ప్రధాన బలం.
చదువుకుంటే స్త్రీ చెడిపోతుందనుకుంటున్న రోజుల్లో – చదువుకున్న స్త్రీ తన సొంత తెలివితేటలతో, స్వాభిమానంతో – దాంపత్యాన్నీ, కుటుంబాన్నీ కాపాడుకోగలదనే సందేశాన్నిచ్చిన కథానిక ‘దిద్దుబాటు’. ఆధునిక స్త్రీలు మానవచరిత్రను తిరిగిరాస్తారన్న గురజాడ నిబద్ధతకు ప్రారంభసూచి ఈ కథానిక. కమలిని వేశ్యాలోలుడైన భర్తని చాకచక్యంగా, సేవకునితో కలిసి చిన్న నాటకమాడి, భర్తకు కనువిప్పు కలిగించి అతన్ని దారికి తెచ్చుకుంది. అంతే ఇతివృత్తం. శిల్పపరంగా కథానికకు కావలసిన ఐక్యత, క్లుప్త, ఎత్తుగడ, ఉత్కంఠ, కథనం, నడక, పట్టు, విడుపు, ముగింపు – అన్న అన్ని లక్షణాలూ సౌష్టవంగా, పొందికగా కుదిరిన ఆధునిక కథ ’దిద్దుబాటు’. వాడుక భాషా వాదిగా గురజాడ తెలుగుజాతికి ఆనాటికి గల ఆ భాషలో రాసి చూపిన కథానిక ఇది.
నిజానికి ముందు కొంత శిష్టవ్యావహారికంలో ‘కమలిని’ పేర రాసి, దానిని తనకు తానుగా మార్చి ‘దిద్దుబాటు’ రూపాన్నిచ్చాడు. గురజాడ ఆధునిక కథానికాశిల్ప పరిజ్ఞానానికీ, పరిణతికీ ఉదాహరణగా వెలువడిన ఆణిముత్యం ఇది. నాటికీ, ఈనాటికీ, ఏనాటికీ – కథానికా రచనకు ‘నమూనా’ శైలీ శిల్ప రూపం ఇది. తదనంతర రచయితల ప్రతిభ, ప్రజ్ఞ, ఉపజ్ఞల్ని బట్టి ఆ శైలీ శిల్పాల్ని మరింత సానబెట్టుకుని పురోగమిస్తున్నారు. ఈ కథ 1910 జనవరి, ఫిబ్రవరి ‘ఆంధ్రభారతి’ పత్రికలో ప్రచురింపబడింది.
ఈ మొదటి కథలోనే గురజాడ స్త్రీ విద్యపై తన దృక్పథాన్ని స్పష్టంగా వెల్లడించారు.
“బాబు ఆడదాయి చెప్పకుండా పుట్టినారింటికి యేల్తానంటే లెంపలాయించి కూకోబెట్టాలి గాని, మొగోరిలాగ రాతలూ కోతలూ మప్పితే ఉడ్తోరం పుట్టదా బాబూ?” (పెన్నేపల్లి 527)
అని సేవకుడు రామయ్య అన్నప్పుడు
“ఓరి మూర్ఖుఁడా! భగవంతుడి సృష్టిలోకల్లా ఉత్కృష్టమైన వస్తువ విద్య నేర్చిన స్త్రీ రత్నమే. శివుఁడు పార్వతికి సగం దేహము పంచి యిచ్చాడు. యింగ్లీషు వాఁడు భార్యను బెటర్ హాఫ్ అన్నాడు. అనగా పెళ్ళాము మొగునీకన్న దొడ్డదీ అన్నమాట. బోధపడ్డదా?” (పెన్నేపల్లి 527)
అని గోపాలరావు చెప్పిన సమాధానం స్త్రీలపై గురజాడకు ఉన్న దృక్పథానికి అద్దం పడుతుంది.
ఈ కథలో స్త్రీ కేవలం భర్తను అనుసరించే వ్యక్తిగా కాకుండా, తన స్వంత ఆలోచనా శక్తి కలిగిన వ్యక్తిగా చిత్రించబడింది. భర్తలో మార్పు తీసుకురావడానికి ఆమె అనుసరించిన పద్ధతి ఆమె మేధస్సును తెలియజేస్తుంది. అందువల్ల “దిద్దుబాటు”లో దాంపత్య జీవితం, స్త్రీ చైతన్యం, నైతిక సంస్కరణ ప్రధాన ఇతివృత్తాలుగా గుర్తించవచ్చు.
కథలో హాస్యం, వ్యంగ్యం కలగలిపి ఉండటం వల్ల పాఠకుడికి ఆసక్తి కలుగుతుంది. అదే సమయంలో కుటుంబ జీవితంలోని సమస్యలను ఆలోచించేలా చేస్తుంది. తప్పును గుర్తించి సరిదిద్దుకోవడమే నిజమైన సంస్కరణ అనే సందేశాన్ని కథ అందిస్తుంది.
2.2 మెటిల్డా
“మెటిల్డా” కథలో స్త్రీ జీవితం, వివాహ వ్యవస్థ, పురుషాధిక్యత, అనుమానం, మానవీయ సంబంధాలు వంటి అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ కథను గురజాడ ఉత్తమ పురుషలో రాశారు.
మెటిల్డా అనే స్త్రీ పాత్ర చుట్టూ కథా కథనం సాగుతుంది. స్త్రీ జీవితాన్ని పురుషుడి ఆధిపత్యం ఎలా ప్రభావితం చేస్తుందో కథ ద్వారా గురజాడ చూపించారు. భార్యపై అధికారం చెలాయించడం, ఆమె స్వేచ్ఛను పరిమితం చేయడం, అనుమానించడం వంటి పురుషాధిక్య ధోరణులను రచయిత ప్రశ్నించారు. అందువల్ల “మెటిల్డా” కథలో స్త్రీ సమస్య, దాంపత్య సంబంధం, పురుషాధిక్యత, మానవతావాదం ప్రధాన ఇతివృత్తాలుగా చెప్పవచ్చు.
“నా కళ్ళకి కట్టినట్లు ఆ వొంచిన మొఖం. బిందువులుగా స్రవించిన కన్నీరు. కాచుకొన్న నిట్టూర్పుల చేత కంపించిన రొమ్ము - యే మహాకవి రచనలోనూ లేదనగలను, అగాధమై ప్రౌఢమైన కరుణ రసం ఆ సరిలేని సొగసున్ను” (పెన్నేపల్లి 550)
అని భర్త అనుమానపుటగ్నిలో దహించుకు పోతున్న మెటిల్డా గురించి గురజాడ అన్న మాటలు అతని అంతరంగం నుంచి వచ్చినవి. స్త్రీ స్వేచ్చను బలంగా కోరుకున్న వ్యక్తి గురజాడ. అటువంటి స్వేచ్చ ఉన్న మహిళనే గురజాడ ఆధునిక మహిళగా భావించి, వారే దేశచరిత్రను తిరగ రాస్తారని పేర్కొన్నారు.
ఈ కథలో స్త్రీని ఒక స్వతంత్ర వ్యక్తిగా చూడాలనే భావన అంతర్లీనంగా ఉంది. స్త్రీ పట్ల మానవీయ దృష్టి అవసరమని కథ సూచిస్తుంది. వివాహ బంధం పరస్పర గౌరవం, విశ్వాసం, అవగాహనలపై ఆధారపడాలని తెలియజేస్తుంది.
2.3 మీ పేరేమిటి?
“మీ పేరేమిటి?” గురజాడ కథల్లో సామాజిక, మతపరమైన సమస్యలను వ్యంగ్యాత్మకంగా పరిశీలించే కథగా చెప్పవచ్చు. ఈ కథ పూర్తీ పేరు ‘దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?’. మతం పేరుతో మనుషుల మధ్య ఏర్పడే విభేదాలు, కుల-మత భేదాలు, మూఢనమ్మకాలు ఈ కథలో ప్రధానంగా చర్చకు వస్తాయి.
మనిషి అసలు విలువ అతని కులం లేదా మతంలో కాకుండా అతని మానవత్వంలో ఉందనే భావన కథలో వ్యక్తమవుతుంది. మతపరమైన గుర్తింపుల ఆధారంగా మనుషులను విభజించడం పట్ల గురజాడ విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు.
ఈ కథలో జంగం శరభయ్య, మనవాళ్ళయ్య పాత్రల ద్వారా గురజాడ శైవ వైష్ణ మత ఘర్షణలను దృశ్యమానం చేసిన తీరు వాస్తవికంగా ఉంది. కొందరు స్వార్ధపరులు మతాన్ని, కులాన్ని తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటూ సామాజిక ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని గురజాడ ఈ కథలో తెలియజేశారు. కాలం ఏదైనా ఇటువంటి వ్యక్తులు ప్రతికాలంలోను ఉంటారని, ప్రజలు వీళ్ళ విషయంలో జాగ్రత్తతో ఉండాలని హితబోధ చేశారు. చదువుకున్న స్త్రీ తన కుటుంబాన్ని రక్షించుకుంటుందని తెలియజేయడానికి గురజాడ నాంచారమ్మ పాత్రను సృష్టించారు. మనవాళ్ళయ్య, మునసబు రామినాయడు కుట్ర నుండి నాంచారమ్మ తన మామ రంగాచార్యులను, భర్త కృష్ణమాచార్యులను రక్షించుకున్న విధానం ద్వారా గురజాడ చదువుకున్న స్త్రీలపై తనకున్న అభిప్రాయాన్ని మనముందుంచారు.
జంగం శరభయ్య వృషభావతారమని, మనవాళ్ళయ్య గరుడాళ్వారవతారమని చెప్పుకుంటారు. మన సమాజంలో దేవుళ్ళుగా చెలామణి అయ్యే మోసకారులకు ప్రతినిధులుగా గురజాడ ఈ పాత్రలను నిర్మించారు.
“పాతరోజులైతే వీళ్ళే అవతారాలయి పోదురు. వీళ్ళ పేరట బొమ్మలు నిలిపి, దేవాలయాలు కట్టి, మనవేఁ పూజ్జేతుం. మరి బుద్ధుడూ యిలాంటి మనిషే గదండి” (పెన్నేపల్లి 534)
అని గురజాడ వెంకయ్య పాత్ర ద్వారా తన మనస్సులోని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
“రాముడి ఆజ్ఞ యేలా వుంటే, ఆలా జరుగు గాక. వైష్ణవుడు, శైవుడు కావాలని కోరితే, అడ్డి యేమి కార్యం? కాక కాశీలో మృతి పొందిన వారికి శివుడేకదా, తారక మంత్రోపదేశం చేస్తాడు. గనక యీ జన్మంలో పరమ శైవుడైన వాడికి, వచ్చే జన్మలో తారక మంత్రోపదేశం చేసి, ముక్తి యివ్వకపోతాడా? యే మతవైనా ప్రపత్తి వున్నవాడికి తోవ వుంది. అది లేకుంటే వైష్ణవుడైనా, కార్యం లేదు” (పెన్నేపల్లి 535)
అని రంగాచార్యులను అన్న మాటలు గురజాడ అంతరంగాన్ని తెలియజేశాయి. కథలోని హాస్యం, వ్యంగ్యం ద్వారా మతపరమైన కపటత్వాన్ని రచయిత ఎత్తిచూపారు. మత విశ్వాసం వ్యక్తిగతమైనదైనా, అది ఇతరులపై ఆధిపత్యం చెలాయించడానికి లేదా విభజనలు సృష్టించడానికి ఉపయోగించకూడదనే సందేశం కనిపిస్తుంది. ఈ కథ ద్వారా మత సామరస్యం, మానవతావాదం, కులమత భేదాల నిరసన, మూఢనమ్మకాలపై విమర్శ వంటి అంశాలు వ్యక్తమవుతాయి.
2.4 మతం – విమతం
శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వరుని క్షేత్రాన్ని పడగొట్టి షేరు మహమ్మదు ఒక పెద్ద మసీదును నిర్మిస్తాడు. ఇది చరిత్రలో జరిగిన అంశం. ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని గురజాడ రాసిన కథ ఈ “మతం–విమతం”. దేవాలయాన్ని పడగొట్టడమే కాక అక్కడి ప్రజలను బలవంతంగా ముస్లీములుగా మారుస్తాడు. ఈ కథలో మత విశ్వాసాలు, భిన్నాభిప్రాయాలు, సామాజిక సంబంధాలు ప్రధాన ఇతివృత్తాలుగా కనిపిస్తాయి. మతం పేరుతో ఏర్పడే విభజనలు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతాయని గురజాడ సూచించారు.
మతం విషయంలో ఒక వ్యక్తి నమ్మకాన్ని మరొక వ్యక్తి గౌరవించాలి. ఒకరి విశ్వాసాన్ని మరొకరిపై బలవంతంగా రుద్దడం వల్ల సంఘర్షణలు ఏర్పడతాయి. ఈ దృక్పథం కథలో కనిపిస్తుంది.
“అయ్యో! మా పెద మావఁ రామావధానులు చిన్నమామ లక్ష్మణ భట్టు దేశాంతరగతులై నారా? మృతులైనారా?” అని నారాయణభట్టు అనగానే అతని “సాయీబు చేత నుండి చిలుము నేలరాలి ముక్కలై నిప్పులు నలు దెసలా చెదర, నారాయణా! అని సమ్మోదముగా పిలిచెను” (పెన్నేపల్లి 546)
అని రామావధానుల ప్రతిస్పందనను గురజాడ అక్షరీకరించారు. మతమౌఢ్యంతో బలవంత మతమార్పిడిని గురజాడ వ్యతిరేకించారు. మతం కన్న మానవత్వం మిన్న అని నమ్మిన వ్యక్తి గురజాడ అప్పారావు. గురజాడ మతాన్ని పూర్తిగా తిరస్కరించే ధోరణిని కాకుండా, మతం పేరుతో జరిగే అందానుసరణ, కపటత్వం, వివక్షలను ప్రశ్నించే దృక్పథాన్ని ప్రదర్శించారు. వివేకం, సహనం, మానవత్వం సమాజానికి అవసరమని కథ తెలియజేస్తుంది. ఈ కథలోని ప్రధాన వస్తువులు మత విశ్వాసం, విమతం, సహనం, సామాజిక సామరస్యం, మానవతావాదం.
2.5 సంస్కర్త హృదయం
“సంస్కర్త హృదయం” కథ గురజాడ సంస్కరణ భావజాలాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన రచన. గురజాడ రాసిన కథల్లో పెద్ద కథ కూడా ఇదే. ఈ కథను గురజాడ Stooping to Raise అనే పేరుతొ ఆంగ్లంలో రాస్తే దానికి అవసరాల సూర్యారావు సంస్కర్త హృదయం పేరుతో ఆంధ్రీకరించారు. సమాజాన్ని సంస్కరించాలని కోరుకునే వ్యక్తి ఆచరణలో ఎంతవరకు తన సిద్ధాంతాలను పాటిస్తున్నాడు? అనే ప్రశ్నను ఈ కథ ముందుకు తెస్తుంది.
సంస్కరణ గురించి మాట్లాడటం ఒకటి, దానిని వ్యక్తిగత జీవితంలో ఆచరించడం మరొకటి. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని గురజాడ కథలో వ్యంగ్యాత్మకంగా చూపించారు. ఈ కథలో రంగనాధయ్యర్ అనే ప్రొఫెసర్, సరళ అనే వేశ్య వృత్తిలో ఉన్న మహిళను సంస్కరించే ప్రయత్నంలో ఆమె వ్యామోహంలో పడటం ఇతివృత్తం. సమాజ సంస్కర్తలు తమ చుట్టూ ఉన్న సమస్యలను విమర్శించడమే కాకుండా, తమ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని కథ సూచిస్తుంది. వ్యక్తిగత నైతికత, సామాజిక బాధ్యత, స్త్రీ సమస్యలు, సంస్కరణ భావజాలం ఈ కథలో పరస్పరం ముడిపడి ఉన్నాయి. అందువల్ల “సంస్కర్త హృదయం”లో సామాజిక సంస్కరణ, సిద్ధాంతం–ఆచరణ వైరుధ్యం, స్త్రీ సమస్య, మానవ స్వభావం, నైతిక విలువలు ప్రధాన ఇతివృత్తాలుగా కనిపిస్తాయి.
3. గురజాడ కథలు - వస్తు వైవిధ్యం
గురజాడ కథలను పరిశీలిస్తే ఒకే రకమైన వస్తువుకు పరిమితం కాకుండా సమాజంలోని విభిన్న పార్శ్వాలను కథా వస్తువులుగా స్వీకరించినట్లు తెలుస్తుంది. ఆయన కథల్లోని వస్తు వైవిధ్యం ఆయన విస్తృతమైన సామాజిక దృష్టికి నిదర్శనం.
3.1 స్త్రీ సమస్య
గురజాడ కథల్లో స్త్రీ సమస్యకు ప్రముఖ స్థానం ఉంది. “దిద్దుబాటు”, “మెటిల్డా”, “సంస్కర్త హృదయం” వంటి కథల్లో స్త్రీల జీవిత పరిస్థితులు, దాంపత్య సమస్యలు, పురుషాధిక్యత, స్త్రీ వ్యక్తిత్వం వంటి అంశాలు కనిపిస్తాయి. గురజాడ అప్పారావు స్త్రీ విద్యను ఆకాంక్షించారు. చదువుకున్న మహిళ మాత్రమే దేశ గతిని మార్చగలదని నమ్మారు. స్త్రీని కేవలం కుటుంబానికి పరిమితమైన వ్యక్తిగా కాకుండా, స్వతంత్ర ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు కలిగిన మనిషిగా చూడాలనే దృక్పథం గురజాడ రచనల్లో కనిపిస్తుంది. స్త్రీ పట్ల గౌరవం, సమానత్వం అవసరమనే భావన ఆయన కథల్లో అంతర్లీనంగా ఉంది.
3.2 దాంపత్య జీవితం
దాంపత్య సంబంధాలు కూడా గురజాడ కథల్లో ముఖ్యమైన వస్తువుగా కనిపిస్తాయి. భార్యాభర్తల మధ్య విశ్వాసం, అనుమానం, ప్రేమ, బాధ్యత, పరస్పర గౌరవం వంటి అంశాలను ఆయన పరిశీలించారు.
“ఆలు మొగుళ్ళ దెబ్బలాటల్లోకి వెళ్లవద్దని మన పెద్దల శాసనం. అవి అభేద్యాలు, అగమ్య గోచరాలు. మధ్యవర్తులు కాపరం చక్కచేదామని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు” (పెన్నేపల్లి 552)
అంటూ భార్యా భర్తల మధ్య ఇతరుల ప్రమేయాన్ని గురజాడ పరిమితం చేశారు.
“నాకూ నీవూ, నీ స్నేహితుడు రామారావు మరొక గొప్ప వుపకారం చేశారు. మీ మాటలవల్లా చేష్టల వల్లా నా భార్య యోగ్యురాలని తెలుసుకొన్నాను. ఆలోచించుకోగా ఆనాటి నుంచి కళ్లెం వదిలేశాను. నా పెళ్ళాం బహు బుద్ధిమంతురాలు. యిచ్చిన స్వేచ్ఛనైనా పుచ్చుకోలేదు. యెక్కడికి కావాలిస్తే అక్కడికి వెళ్ళమన్నాను. యెవరిని కావలిస్తే వారిని చూడమన్నాను. యెక్కడికి వెళ్ళకోరలేదు. యెవర్నీ చూడకోరలేదు. నాకు నీతో లోకం. మరి యెవరితో యేం పనంది. అలాగే సంచరించింది” (పెన్నేపల్లి 533)
అని మెటిల్డా భర్త చెప్పిన మాటలు భార్యా భర్తల మధ్య ఉండవలసిన నమ్మకాన్ని తెలియజేస్తాయి. “దిద్దుబాటు”, “మెటిల్డా” కథల్లో దాంపత్య జీవితంలోని విభిన్న కోణాలను చూడవచ్చు. కుటుంబ సమస్యలను కేవలం వ్యక్తిగత సమస్యలుగా కాకుండా, సమాజంలోని విలువలతో సంబంధం ఉన్న సమస్యలుగా గురజాడ చూపించారు.
3.3 మతం, సామాజిక విభజన
“మీ పేరేమిట?”, “మతం–విమతం” కథల్లో మతపరమైన విశ్వాసాలు, మత భేదాలు, సామాజిక విభజనలు ప్రధాన వస్తువులుగా కనిపిస్తాయి. ముఖ్యంగా ‘మీ పేరేమిటి?’ కథలో శైవ వైష్ణవ మతఘర్షణలను, కొందరు స్వార్ధపరులు వాటిని ఉపయోగించుకుంటున్న విధానాన్ని అద్భుతంగా చిత్రించారు.
“శివుడన్నా, విష్ణన్నా, పీరన్నా బుద్ధుడన్నా ఆ పరమాత్మ మట్టుకు ఒక్కడే గదా?” (పెన్నేపల్లి 543)
అని శాస్తుర్లు గారి ద్వారా గురజాడ ఈ కథ లక్ష్యాన్ని పాఠకుల ముందుంచారు. మనిషి కంటే మతం గొప్పది కాదనే మానవతా దృక్పథం ఈ కథల్లో వ్యక్తమవుతుంది. మతం పేరుతో మనుషుల మధ్య ద్వేషం, విభజన ఏర్పడకూడదని గురజాడ సూచించారు.
3.4 సామాజిక సంస్కరణ
గురజాడ సాహిత్యంలో సంస్కరణ భావం అత్యంత ముఖ్యమైనది. సమాజంలోని చెడు ఆచారాలను గుర్తించి వాటిని మార్చాల్సిన అవసరాన్ని ఆయన తన కథల ద్వారా తెలియజేశారు. “సంస్కర్త హృదయం” ఈ దృక్పథానికి మంచి ఉదాహరణ.
“సంస్కరణంటే యిదే! ఒకరిని లేవనెత్తబోయి మనమే కింద పడ్డం!” (సూర్యారావు 726)
అని రంగనాధయ్యర్ గురించి గురజాడ వ్యంగ్యంగా అన్న మాటలు కుహాన సంస్కర్తలకు గొడ్డలి పెట్టు. సంస్కరణ కేవలం ఉపన్యాసాలకు పరిమితం కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఆచరణలోకి రావాలని ఈ కథ సూచిస్తుంది.
3.5 మానవతావాదం
గురజాడ కథలన్నింటినీ అనుసంధానించే ప్రధాన సూత్రం మానవతావాదం. కులం, మతం, లింగం, ఆర్థిక స్థితి వంటి భేదాలకు అతీతంగా మనిషిని మనిషిగా గౌరవించాలనే భావన ఆయన రచనల్లో కనిపిస్తుంది. మానవ సంబంధాలకు, పరస్పర గౌరవానికి, సహానుభూతికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్ల ఆయన కథల్లోని సామాజిక విమర్శకు మానవతా దృక్పథం పునాదిగా నిలుస్తుంది.
3.6 మూఢనమ్మకాలు, వివేకం
సమాజంలోని అంధ విశ్వాసాలను గురజాడ ప్రశ్నించారు. మతం, సంప్రదాయం పేరుతో ఏ విషయాన్నైనా ప్రశ్నించకుండా అంగీకరించే ధోరణి సమాజ పురోగతికి ఆటంకమని ఆయన రచనలు సూచిస్తాయి. గురజాడ రాసిన ‘మీ పేరేమిటి?’ కథలో నిప్పుల గుండం తొక్కడం, తాము దైవాంశ సంభూతులము అని చెప్పుకునే మోసగాళ్ళను వ్యంగ్యంగా విమర్శించారు. వివేకం, తర్కం, ఆలోచనా స్వేచ్ఛ సమాజానికి అవసరమని ఆయన భావించారు. ఈ అంశం ఆయన సామాజిక సంస్కరణ దృక్పథంలో ముఖ్యమైన భాగం.
3.7 సిద్ధాంతం – ఆచరణ వైరుధ్యం
మనుషులు చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య ఉండే వ్యత్యాసాన్ని గురజాడ వ్యంగ్యంగా చిత్రించారు. “సంస్కర్త హృదయం”లో ఈ వైరుధ్యం ప్రత్యేకంగా కనిపిస్తుంది. సమాజంలో నైతికత గురించి మాట్లాడేవారు తమ జీవితంలో అదే నైతిక విలువలను పాటిస్తున్నారా అనే ప్రశ్నను గురజాడ పాఠకుడి ముందుంచారు. ఇది ఆయన రచనల్లోని విమర్శనాత్మక దృష్టికి నిదర్శనం.
3.8 వ్యంగ్యం మరియు హాస్యం
గురజాడ కథల్లో వ్యంగ్యం, హాస్యం కేవలం వినోదం కోసం కాకుండా సామాజిక విమర్శకు సాధనాలుగా పనిచేస్తాయి. సమాజంలోని లోపాలను నేరుగా ఉపదేశించకుండా, పాత్రల ప్రవర్తన, సంభాషణలు, సంఘటనల ద్వారా హాస్యాస్పదంగా చూపిస్తారు. దీంతో పాఠకుడు మొదట నవ్వినా, తరువాత ఆ నవ్వు వెనుక ఉన్న సామాజిక సమస్యను గుర్తించి ఆలోచిస్తాడు. ఇదే గురజాడ కథా శైలిలోని ప్రత్యేకత.
3.9 యథార్థ జీవన చిత్రణ
గురజాడ కథలలో కల్పిత ప్రపంచం కంటే వాస్తవ జీవితానికి ప్రాధాన్యత ఎక్కువ. సాధారణ మనుషులు, వారి కుటుంబాలు, వారి సమస్యలు, వారి ఆలోచనలు కథా వస్తువులుగా మారాయి. ఈ యథార్థత కారణంగానే గురజాడ కథలు పాఠకుడికి సహజంగా, జీవితానికి దగ్గరగా అనిపిస్తాయి. ఆయన కథల్లోని సమస్యలు తన కాలానికి సంబంధించినవే అయినప్పటికీ, వాటిలోని మానవ సంబంధాలు, సామాజిక విలువలు నేటికీ ప్రాసంగికంగా కనిపిస్తాయి.
3.10 వ్యవహారిక భాష
గురజాడ కథల వస్తు వైవిధ్యాన్ని మరింత సహజంగా వ్యక్తీకరించడంలో ఆయన భాష కూడా కీలక పాత్ర పోషించింది. ప్రజలు మాట్లాడే వ్యవహారిక భాషకు ఆయన సాహిత్యంలో ప్రాధాన్యత ఇచ్చారు. పాత్రల సామాజిక స్థాయి, వారి ఆలోచనా విధానం, వారి వ్యక్తిత్వానికి అనుగుణంగా సంభాషణలను ఉపయోగించారు. అందువల్ల కథల్లో సహజత్వం పెరిగింది. కథా వస్తువు పాఠకుడికి మరింత చేరువైంది.
ఉపసంహారం
- గురజాడ అప్పారావు కథలు తెలుగు కథా సాహిత్య చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపును సూచిస్తాయి. కథల సంఖ్య తక్కువైనా, వాటిలోని వస్తు వైవిధ్యం, సామాజిక ప్రయోజనం, మానవతా దృక్పథం, సంస్కరణ భావజాలం వాటికి విశిష్టతను కల్పించాయి.
- “దిద్దుబాటు” లో దాంపత్య జీవితం, స్త్రీ చైతన్యం, నైతిక సంస్కరణ; “మెటిల్డా” లో స్త్రీ సమస్య, పురుషాధిక్యత, మానవ సంబంధాలు; “మీ పేరేమిట?” లో మతపరమైన విభజనలు, మానవతావాదం; “మతం–విమతం” లో మత విశ్వాసాలు, సహనం, సామాజిక సామరస్యం; “సంస్కర్త హృదయం”లో సంస్కరణ భావజాలం, సిద్ధాంతం–ఆచరణ వైరుధ్యం వంటి విభిన్న అంశాలను గురజాడ కథా వస్తువులుగా స్వీకరించారు.
- ఈ కథలన్నింటిలో భిన్నమైన ఇతివృత్తాలు కనిపించినప్పటికీ, వాటి అంతర్లీన లక్ష్యం మాత్రం మానవ జీవితాన్ని మెరుగుపరచడం. సమాజంలోని లోపాలను గుర్తించి, వాటిని ప్రశ్నించి, వివేకం మరియు మానవత్వం ఆధారంగా సమాజాన్ని ముందుకు నడిపించాలనే ఆశయం గురజాడ రచనల్లో కనిపిస్తుంది.
- గురజాడ కథల వస్తు వైవిధ్యాన్ని పరిశీలిస్తే ఆయన కేవలం కథకుడు మాత్రమే కాదని, తన కాలంలోని సామాజిక సమస్యలను లోతుగా పరిశీలించిన సంస్కర్త అని స్పష్టమవుతుంది. స్త్రీ స్వేచ్ఛ, మానవ సమానత్వం, మత సామరస్యం, సామాజిక సంస్కరణ, నైతిక విలువలు వంటి అంశాలను కథా రూపంలో అందించడం ఆయన ప్రత్యేకత.
- అందువల్ల గురజాడ కథలు తెలుగు సాహిత్యంలో ఆధునిక భావజాలానికి ప్రతినిధులుగా నిలుస్తూ, నేటి సమాజాన్ని కూడా ఆలోచింపజేసే శక్తిని కలిగి ఉన్నాయి. వస్తు వైవిధ్యం, యథార్థ జీవన చిత్రణ, వ్యవహారిక భాష, వ్యంగ్య ధోరణి, మానవతావాదం గురజాడ కథల చిరస్థాయి విశిష్టతలుగా చెప్పవచ్చు.
ఉపయుక్త గ్రంథసూచి
- నారాయణరెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వము: సంప్రదాయములు, ప్రయోగములు, విశాలాంధ్ర పబ్లిషిన్ హౌస్, హైదరాబాదు, 1999.
- పెన్నేపల్లి, గోపాలకృష్ణ. గురజాడలు (మహాకవి గురజాడ అప్పారావు సర్వలభ్య రచనల సంకలనం), మనసు ఫౌండేషన్, హైదరాబాదు, 2012.
- రాంబాబు, వేదగిరి. తెలుగు కథానిక, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2012.
- రమణారెడ్డి, కె. వి. మహోదయం - జాతీయ పునర్జీవనంలో గురజాడ స్థానం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ, 1969.
- సూర్యారావు, అవసరాల. సంస్కర్త హృదయం అనువాదం, భారతి సంచిక (ఖర ఆషాడ), 1951.
- వెంకట సుబ్బయ్య, వల్లంపాటి. కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 2009.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

