AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
8. శ్రమైకజీవనం: శ్రీకాకుళం జానపదగేయాల పాత్ర
డా. శీలంకి గోవిందరావు
తెలుగు ఉపాధ్యాయులు,
పాతపట్నం
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 8464034547, Email: govisjgc43@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 12.04.2026 ఎంపిక (D.O.A): 27.04.2026 ప్రచురణ (D.O.P): 01.05.2026
వ్యాససంగ్రహం:
జానపదం అంటే పల్లె జానపదులు పాడుకునే పాటలు.ఇటువంటి జానపద పాటలను తెలుగు సాహిత్యానికి అందించిన నేలలలో శ్రీకాకుళం జిల్లా ఒకటి.ఉద్యమాల పురిటిగడ్డగా పేరొంది,యావత్ ఆంధ్రప్రదేశ్ లో ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ విధంగా వెనుకబడి ఉన్నదో ,ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లా కూడా అన్నింటా వెనుకబడి ఉంది.ఈ జిల్లాలో అధిక శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసించడం వలన, ఇక్కడి ప్రజలలో అధికులు వ్యవసాయ సంబంధిత కూలీలుగా ఉండడం వలన జానపద గేయాలు వీరి జీవన విధానాలతో మమేకమై ఉంటాయి.అందువలన ఇక్కడ ప్రజలు తమ దైనందిన జీవితాలలో చేసే పనులలో అలుపు సొలుపు లేకుండా ఉండడానికి,వారి శ్రమైక్య జీవితాన్ని ఆస్వాదించడానికి జానపద పాటలను పాడుకుంటూ,వాటిని పరిరక్షించుకుంటూ, తరువాతి తరాలకు అందించుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఈ ప్రాంత వాసులకు చేతి నిండా పనిలేక, పస్తులుండాల్సిన పరిస్థితులు అధికంగా ఉండుట వల్ల ఇక్కడ ప్రజలు పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్ర ప్రాంతాలతో పాటు గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళుట చేత కుటుంబాలకు దూరమైనప్పటికీ వారి మనుసు నుండి తన వారిని దూరం చేయలేక,ఆ ఎడబాటును తట్టుకోలేక భార్యలు భర్తలు కోసం, భర్తలు భార్యలు కోసం తలుచుకుంటూ వారి అనుభవాలను/అనుభూతులను స్మరించుకుంటూ వారు పాడుకునే పాటలు వంటివి ఇక్కడి జానపద గేయాసాహిత్యంలో చూడవచ్చు.జానపద సాహిత్యానికి ఈ ప్రాంత వాసులు ఎనలేని సేవలు అందించారు. ఉత్తరాంధ్ర బాణీలు ద్వారా ఆంధ్రప్రదేశ్ అంతటా తన బాణీలను వినిపించిన వంగపండు ప్రసాదరావు వంటి వ్యక్తులు ఈ ప్రాంతమ ప్రత్యేకమైన యాసతో కూడిన జానపద పాటలతో ఆంధ్ర దేశాన్ని సైతం నివ్వెర పరిచిన ఈ సిక్కోలు గడ్డ నేడు జానపద పాటలలో, వాటిని తరువాత తరాలకు అందించుటలో వెనుకబడిపోతున్నది. నాడు ఊరూరా ఉర్రూతలూగిస్తూ జానపద పాటలు పాడిన కళాకారులు నేడు అదే ఊర్లల్లో బిచ్చమెత్తుకుని జీవనం సాగించాల్సిన పరిస్థితి దాపురించింది. ఇటువంటి తరుణంలో కళారూపాలతో పాటు తెలుగు సాహిత్యంలో ముఖ్య భూమికను కలిగి ఉన్న జానపద పాటలు ఎదుర్కొంటున్న పరిస్థితులను వివరిస్తూ, జానపద కళారూపాలతో పాటు, జానపదగేయ సాహిత్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వాలతో పాటు కవులు, కళాకారులు, జానపదులు అందరూ కలిసి ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి వక్కాణిస్తూ, జానపదాలు ఉనికి పదికాలాలు ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి విశ్లేషిస్తూ ఈ వ్యాసాన్ని తీసుకు రాగలిగాను.
Keywords: పురిటిగడ్డ, చికాకోల్, వృత్తి కూలీలు, శ్రమైకజీవనం, గల్ఫ్ దేశాలు, విజ్ఞానం, చరమదశ, ముఖ్యభూమిక.
1. పరిచయం
ప్రపంచ దేశాలలో జానపద సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఆయా దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు అందాన్ని చేకూరుస్తుంది. మన భారతదేశం అనేక సంస్కృతి, సంప్రదాయాలకు, భాషలకు పుట్టినిల్లు. తెలుగు భాష చరిత్ర ఉన్నతమైనది. తెలుగు భాషలో మొదటి సాహిత్యంగా జానపద సాహిత్యం పరిగణన పొందింది. జానపద గేయాలు అందులో ప్రధానంగా నిలుస్తాయి. దేశంలోని ఇతర ప్రాంతాల లాగే ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో అనేక జానపద కళలు, సాహిత్యం, పాటలు ఉన్నాయి. అయితే, అన్ని సామాజిక అంశాలలో ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నట్లు, జానపదాలను వెలికితీసే, వాటిని అధ్యయనం చేసే, జానపద గేయ పరిశోధన చేసే ప్రయత్నాలలో ఈ ప్రాంతం వెనుకబడి ఉందని చెప్పవచ్చు. రాయలసీమలో తుమాటి దొణప్ప, యస్ గంగప్ప, తంగిరాల వెంకటసుబ్బయ్య వంటి వారు, తెలంగాణలో గద్దర్, సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, గూడ అంజయ్య వంటి వారు, కోస్తాలో నేదునూరి గంగాధరం వంటి వారు జానపద గేయాలపై పరిశోధనలు చేశారు. ఈ ప్రాంతంలో అటువంటి పరిశోధనలు జరిపిన దాఖలాలు లేవు.
గిరిజన రైతాంగ పోరాటంలో జముకు పాటలతో ఉద్యమించిన ఈ ప్రాంతంలో తప్పెటగుళ్ళు, గంగిరెద్దుల వారు, ఎరుకలు, జంగాలు, బుడబుక్కల వారు, పగటివేషాల వారు వంటి కళాకారులు తమ శైలిలో పది రూపాయల కోసం, ఒక పట్టెడు అన్నం కోసం నిస్వార్థంగా కళలకు సేవలు చేశారు. నేడు, ఈ కళలను నమ్ముకున్న వేలాదిమంది ఇతర వృత్తులకు వెళ్ళిపోతున్నారు. దీనితో ఈ కళలకు వారసులు లేని పరిస్థితి ఏర్పడింది. ఇది జానపద సాహిత్య ప్రపంచానికి జీర్ణించుకోలేని విషయం. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం గా కొన్ని కళలు, జానపద సాహిత్యం కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని కొన ఊపిరితో ఉన్నాయి. నిరక్షరాస్యుల నోటి నుండి వచ్చే ఈ మౌఖిక జానపద గేయ సాహిత్యం, దానికి మూలమైన పాత తరం జానపదుల కాలం చెల్లించడంతో వారితో పాటు అంతరించిపోతుంది. ఈ సమయంలో శ్రీకాకుళం గేయ సాహిత్యాన్ని పరిరక్షించి, భావి తరాలకు అందించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది.
2. శ్రీకాకుళం జానపద గేయాల ప్రత్యేకతలు
ప్రాచీన కాలం నుండి జానపద కళలకు తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, పుట్టినిల్లు లాంటిది. పల్లె జీవన విధానంలో వ్యవసాయ, కార్మిక గీతాలుగా జానపద కళలు మానవ జీవితంతో మమేకమవుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయి. వ్యవసాయ క్షేత్రాలలో అలుపు సొలుపు లేకుండా సహచరులను ఉత్సాహపరుస్తూ పాడుకునే పాటలు, తీరిక వేళల్లో కాలక్షేపం కోసం, బావ మరదళ్లు పాడుకునే సరస సంవాద పాటలు నేడు నూతన హంగులతో మళ్ళీ మళ్ళీ వస్తున్నాయంటే తెలుగు జానపద గేయాలపై ప్రజలకు ఉన్న మక్కువ అలాంటిది. ఈ ప్రాంతంలోని జానపద పాటలను పరిశీలిస్తే వివిధ కళారూపాలలో, వివిధ పరిస్థితులలో, సందర్భ నేపథ్యాన్ని బట్టి విభిన్నతను కలిగి ఉంటాయి.
2.1. ఉద్దానం ప్రాంతపు పాటలు
అన్నయ్య: మందస మాడిపెల్లి మనువిస్తను చెల్లమ్మా... ఓలే చెల్లమ్మా
మనువెల్లి మనువాడమ్మా... నా చెల్లమ్మా మనువెల్లి మనువాడమ్మా
చెల్లమ్మ: గోంగూర గంపలు నేనమ్మలేను రన్నాయో... ఓరన్నాయో..
మనువెల్లి మనువాడనురా... నా అన్నయ్యో.. మనువెల్లి మనువాడనురా
అన్నయ్య: ఏడూళ్ల పాలేము మనువిస్తాను...చెల్లమ్మా... ఓలే చెల్లమ్మా
మనువెల్లి మనువాడమ్మా... నా చెల్లమ్మా మనువెల్లి మనువాడమ్మా.
చెల్లమ్మ: ఆ ఇసుక దిబ్బల్లో నడవలేను రన్నాయో... ఓరన్నాయో..
మనువెల్లి మనువాడనురా... నా అన్నయ్యో… మనువెల్లి మనువాడనురా (కళింగాంధ్ర 215)
ఈ శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఒక అన్నయ్య చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి తన చెల్లిని పెంచి పెద్ద చేశాడు. ఆమెకు పెళ్లి చేయాల్సిన బాధ్యత గుర్తొచ్చిన సందర్భంలో, చెల్లిని పెళ్లి చేసుకోమని ఒప్పిస్తున్నాడు. ఆ చెల్లెలు అన్నయ్యను విడిచి వెళ్లలేక, ఏ ఊరు సంబంధం ఇస్తే ఆ ఊరిని ఏదో ఒక వంక పెట్టి, పెళ్లి చేసుకోనని వివరిస్తున్న సందర్భంలోని పాట ఇది.
2.2. గొల్ల పిల్లవాడి పాట
చిన్నది: దానిసేరు దాని గొల్లో - ఓరే వరిసెలు వరిగట్లు
మేపకురా గొల్ల - దాని సేరు దానిగొల్ల దానిసేరు దాని గొల్లో
మాయన్నలు వస్తారు తోలవోరి గొల్ల దాని సేరు దానిగొల్ల
చిన్నవాడు: దాని సేరు దానిగొల్లో ఓలే - మీ అన్నలు వస్తేనే నాకు బావలు కారా
దాని సేరు దానిగొల్ల
చిన్నది: దాని సేరు దానిగొల్లో.. ఏ ఊరి గొల్లోడికి ఏమిగటమమ్మ - దాని సేరు దానిగొల్ల
దాని సేరు దానిగొల్లో…
మా అయ్యలు వస్తారు తోలవోరి గొల్ల దాని సేరు దానిగొల్ల
చిన్నవాడు: దాని సేరు దానిగొల్లో..
మీ అయ్యలు వస్తేనే నాకు మామలు కారా - దాని సేరు దానిగొల్ల
చిన్నది: దాని సేరు దానిగొల్లో..
ఏ ఊరి గొల్లోడికి ఏమిగటమమ్మ - దాని సేరు దానిగొల్ల
దాని సేరు దానిగొల్లో... (కళింగాంధ్ర 310)
ఒక గొల్ల పిల్లవాడు పొలం గట్ల వెంబడి గొర్రెల మందలను మేపుతుంటాడు. గొర్రెలు వరి చేను మేసేస్తున్నాయి. ఆ గొర్రెలను తోలమని ఒక చిన్నది అంటుంది. అప్పుడు ఆ గొల్ల పిల్లవాడు ఆమెతో సంభాషిస్తున్న సందర్భంలోని పాట ఇది.
2.3. గోంగూర పాట
గోంగూర అమ్మలారా…గోంగూరకి
ఎలా ఎండనబడితినమ్మ…గోంగూరకి
నేనేమీ చేతునమ్మ…గోంగూరకి
మందలమారి మాయత్త… గోంగూరకి
ఎలా మందురాసి పంపినాది… గోంగూరకి
గోంగూర పట్టుకోని…గోంగూరకి
ఎలా సోంపేట నేనెళ్తే …గోంగూరకి
ఆ సోంపేట వీధిలోన… గోంగూరకి
ఎలా కాముటోడు అమ్మమ్మ… గోంగూరకి
ఎలా రెక్క పట్టి లాగినాడు…గోంగూరకి
నేనేమీ చేతునమ్మ…గోంగూరకి
మందలమారి మాయత్త… గోంగూరకి (కళింగాంధ్ర 318)
ఉద్దానం ప్రాంతంలో పేద స్త్రీలు గోంగూర అమ్మడానికి వెళ్తారు. అప్పుడు కొంతమంది మగవారు తమ చేష్టలతో ఎంతగా బాధపడ్డారో ఒక స్త్రీ తన తోటి వారికి చెప్తున్న నేపథ్యంలోని గేయం ఇది.
3. శ్రీకాకుళం ప్రాంతంలో జానపద గేయాల ప్రస్తుత పరిస్థితి
ఒకప్పటి పరిస్థితులతో పోల్చుకున్నట్లయితే శ్రీకాకుళం జానపదం ప్రస్తుతం కష్టాల్లో ఉందని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. చిన్నపిల్లలు మొదలు పెద్దల వరకు, కళాకారులు మొదలు కళాపోషకుల వరకు అందరూ పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనై జానపదాలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. జానపదాలకు ప్రధాన ఆధారాలు అయిన వృత్తి కళాకారుల సంఖ్య నానాటికి తగ్గిపోవడం, అసలు వృత్తులే కనుమరుగవ్వడం, పొట్టకూటి కోసం కళాకారులు ఎంతోమంది తమ సాంప్రదాయ కళలను విడిచిపెట్టి, ఇతర పనులకు మళ్లడం, నాగరికత పేరుతో సమాజం నాటికి నేటికి ఎంతగానో మార్పు చెందడం, ఆదరించేవారు కరువవ్వడంతో కొన్ని కళారూపాలు కనుమరుగవ్వడం వంటి అనేక అంశాలు జానపదం కొన ఊపిరితో ఉందని చెప్పడానికి తార్కాణాలుగా భావించవచ్చు.
నేటి కాలంలో టీవీ, సినీ, సాంకేతిక రంగాల ప్రభావం వలన ప్రాచీన కళలకు ఆదరణ తగ్గి, జానపద కళాకారులకు సరైన ఆదరణ లేక వారి జీవన పరిస్థితులు దుర్భరంగా మారాయి. దీనితో వారు కూడా పొట్టకూటి కోసం సాంప్రదాయేతర వృత్తుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా, ఒకప్పటి శ్రీకాకుళం స్థానిక ప్రజానీకానికి జానపదాల పట్ల ఉన్న అభిరుచి, నేటి తరానికి కొంచం కూడా లేకపోవడం వంటి అనేక అంశాలు ఈ ప్రాంతంలో జానపదాల దుస్థితిని వివరిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో మారుమూల జిల్లా అయిన నిజామాబాద్ కు చెందిన డాక్టర్ కె. ముత్యం గారు 1987 మేలో శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి చెందిన పిల్లల పాటలను సేకరించి సాహిత్య ప్రపంచానికి అందించారు (ముత్యం). కానీ ఈ ప్రాంత పిల్లలు మాత్రం నేడు అటువంటి ఆటపాటలకు దూరమై సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు సెల్ ఫోన్లతోనే గడుపుతున్నారు. జానపద పాటలతో, ఆటలతో మానసికోల్లాసాన్ని పొందాల్సిన వారు కేవలం DJ పాటల పేరుతో మానసిక సంతృప్తిని పొందుతున్నారు. ఇకపోతే ఈ శ్రీకాకుళం ప్రాంతంలో జానపద గేయాలను పాడుతూ, వాటిని పరిరక్షించుకుంటూ వస్తున్న తపాలా మహాలక్ష్మి, టంపా రాములు, కిలారి అప్పన్న, మూల తాతయ్య, పొగిలి గుర్రమ్మ, బోనెల అసిరయ్య, పీత గంగయ్య, లింగుడు రాజు వంటి కళాకారులలో అనేకమంది కాలం చెల్లించడంతో వారితో పాటు ఈ కళారూపాలు కూడా కాలం చెల్లిస్తున్నాయి.
4. శ్రీకాకుళం జానపద గేయాల పరిరక్షణ అవసరం
ఈ శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న జానపద గేయాలను పరిరక్షించాలంటే, ఇక్కడ గేయ సాహిత్యాన్ని సేకరించి, అధ్యయనం చేయాలి. ఇక్కడ జానపద పాటల గురించి లోతైన అధ్యయనం చేయాలంటే అనేక అంశాలను పరిశీలించి చూడాలి. అంతేకాకుండా అవి పాడే, ప్రదర్శించబడే సందర్భాలను కూడా నిశితంగా పరిశీలించాలి. నిజానికి జానపద సాహిత్యంలో దాగివున్న భాషపై అధ్యయనం జరగాలన్న, వాటిని సేకరించాలన్న సంబంధిత జానపదులతో, జానపద గేయకారులతో సన్నిహిత్యం ఏర్పడాలి. ప్రస్తుత కాలంలో ఈ ప్రాంతంలో జానపద కళారూపాలకు మూలవాసులైన పాత తరపు నిరక్షరాస్యుల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం, టంపా రాములు (జముకు కళాకారుడు), తపాలా మహాలక్ష్మి వంటి అనేకమంది కళాకారులు కాలం చెల్లించుట వలన వారితో పాటే ఈ జానపద కళలు అంతరించిపోతున్నాయి. కావున ప్రస్తుతం ఈ కళలతో పాటు జీవిస్తూ, వాటిని కొన ఊపిరితో పరిరక్షిస్తున్న కళాకారులతో ముఖాముఖి చర్చల ద్వారా వారి నుండి అశురూపంలో ఉన్నటువంటి ఈ జానపద సాహిత్యాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. జానపద కళాకారులను, వృత్తికళాకారులను ప్రోత్సహించేలా ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, అందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఇక్కడి ప్రజలు వలస పోకుండా చర్యలు చేపట్టాలి.
ప్రభుత్వాలతో పాటు ఈ ప్రాంత వాసులు కూడా జానపద పరిరక్షణకై నడుము బిగించి, నిస్వార్థంగా సేవ చేయాలి. ఎందుకంటే ఈ జానపద కళలను పరిరక్షించడమే తమ ధ్యేయమని ఈ ప్రాంతంలో రోజుకొక సంస్థ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నప్పటికీ, వారిలో చాలామంది జానపద కళలను, పాటలను పరీక్షించే పేరుతో పలువురి పోషకుల నుండి కలెక్షన్లు చేయడం తప్ప, కళలను నిజంగా ఉద్ధరించాలనే ఉద్దేశం కొంచెం కూడా కనబడడం లేదు. అయితే చుక్కల్లో చంద్రుడిలా శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో వెలసిన జానపద ఉద్దారకుడిగా, జానపద కళల బిడ్డగా 2004 సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని తన స్వగ్రామమైన “రంగోయి” కేంద్రాన్ని గిడుగు రామ్మూర్తి తెలుగు భాష జానపద కళాపీఠాన్ని స్థాపించి, ఎన్నో ఏళ్లుగా ఆ కళల తల్లికి సేవ చేస్తూ, ఈ శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్న ఎన్నో కళారూపాలను పరిశీలిస్తూ, అవి పది కాలాలు పాటు వర్ధిల్లేలా వాటిని పరిరక్షిస్తూ, తరతరాలకు వాటిని పదిలంగా అందిస్తూ విశేష సేవలందిస్తున్న బద్రి కూర్మారావు లాంటి జానపద కళా పోషకులు, పరిశీలకుల వలన ఈ జానపదాలు ఈ శ్రీకాకుళం గడ్డపై ఇంకా సజీవంగానే కొన ఊపిరితో కొనసాగుతున్నాయి. ఈయన గురించి నేను చెప్పడం కాదు, సాక్షాత్తు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఒక సందర్భంలో, శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది కవులు కళాకారులు ఉన్నప్పటికీ, ఎవరూ పట్టించుకోని కళలను, కళారూపాలను వెలుగులోకి తీసుకువచ్చిన మొదటి వ్యక్తి బద్రి కూర్మారావు అన్నారు (రాధాకృష్ణమూర్తి 5-6). నిజానికి అటువంటి వ్యక్తులకు మరి కొంతమంది కళాపోషకులు తోడై, ఆయన బాటలోనే సాగితే ఈ ప్రాంత జానపదాలు ఇక్కడి జానపదుల మధ్య నిత్యము జజ్జనకరి జనారే అంటూ జయభేరి మోగిస్తూనే ఉంటాయి.
ఉపసంహారం
తెలుగు వారికి అపూర్వమైన జానపద కళా వారసత్వం ఉంది. ఒక జాతి నిర్మాణానికి అవసరమైన ఆకారాలను జానపద కళలు అందిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా జానపద సాహిత్యం విలువ పెరుగుతోంది. కానీ తెలుగు రాష్ట్రాలలో మాత్రం దానిపై నిర్లక్ష్యపు నీడ కమ్ముకుంటోంది. ఇలాంటి సంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. తెలుగు సాహిత్యంలో జానపద సాహిత్యానికి, అందులో గేయ సాహిత్యానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. అటువంటి గేయ సాహిత్యంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీకాకుళం జానపద గేయాలను పరిరక్షిస్తూ, తర్వాతి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
ఈ జానపద పాటలను ఆదరిస్తున్న వారిలో ఎండకు ఎండి, వానకు తడిసి, రేయనక పగలనకా నిత్యం పొలాల్లో పనిచేసి, సమాజానికి పట్టెడు అన్నం పెడుతున్న రైతు కూలీలు ఉన్నారు. అదేవిధంగా దేశానికి సంపాదన అందించి, కునారిల్లుతున్న కులవృత్తుల వారు, కాయకష్టం చేసుకునే కార్మికులు ఉన్నారు. కానీ ప్రస్తుత రోజుల్లో సాంకేతికత, సినీ రంగాల అభివృద్ధి ప్రభావం వలన జానపద కళలు అంతరిస్తున్నాయన్న మాట వాస్తవం. అయితే ఏ సాంకేతికత మూలాన జానపద కళలు, గేయాలు అంతరిస్తున్నాయని భావిస్తున్నామో, అదే సాంకేతికతను ఉపయోగించి మారుమూల ప్రాంతాలలో ఉన్న జానపద విజ్ఞానాన్ని సేకరించి, తరతరాలకు ఉపయోగపడేలా వాటిని రికార్డు చేసి, అంతర్జాతీయ వేదికల యందు వాటిని ఎప్పటికప్పుడు ఉపయోగించుకునేలా, అంతర్జాల ఆధారిత సేవలను వినియోగించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
నేటి కాలంలో జానపదులు కూడా సామాజిక బంధాలకు దూరమై, సామాజిక మాధ్యమాలు దగ్గరవుతున్న నేపథ్యంలో, శాస్త్ర సాంకేతిక రంగం దినదిన అభివృద్ధి చెందుతున్న తరుణంలో సాంకేతిక విధానాలను సైతం ఉపయోగించి జానపద విజ్ఞానాన్ని సంరక్షించి, దానిని సుభిక్షంగా తర్వాతి తరాలకు అందిస్తారని ఆశిస్తున్నాను.
- శ్రీకాకుళం జానపద గేయాలు తెలుగు సంస్కృతి గొప్ప వారసత్వం.
- ఆధునికత ప్రభావం, ప్రభుత్వ నిర్లక్ష్యం, వృత్తి కళాకారుల కొరత కారణం గా ఈ కళలు ప్రస్తుతం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి.
- జానపద విజ్ఞానాన్ని సేకరించి, అధ్యయనం చేయడం, కళాకారులను ప్రోత్సహించడం అత్యవసరం.
- సాంకేతికతను సద్వినియోగం చేసుకొని జానపద గేయాలను రికార్డు చేయాలి.
- బద్రి కూర్మారావు వంటి వ్యక్తులు చేస్తున్న సేవలు జానపద పరిరక్షణకు స్ఫూర్తిదాయకం.
- ప్రభుత్వాలు, ప్రజలు సమష్టి కృషి చేస్తేనే జానపద కళలు సజీవంగా ఉంటాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- కళింగాంధ్ర జానపద గేయాలు; పల్లే పాటలు, విజయనగరం, బద్రి అప్పన్న స్మారక కళా పీఠం & సిక్కోలు బుక్ ట్రస్ట్,2015.
- కూర్మారావు, బద్రి. ఉత్తరాంధ్ర జానపద కళలు,విజయనగరం,గిడుగు రామ్మూర్తి తెలుగు భాష & జానపద కళాపీఠం మరియు బద్రి అప్పన్న స్మారక కళాపీఠం,మొ.ము,2005.
- కృష్ణకుమారి, నాయని తెలుగు జానపద గేయ గాథలు, హైదరాబాద్, తెలుగు అకాడమీ, నా.ము, 2012.
- తిరుమల రావు, జయధీర్. ముందుమాట,కళింగాంధ్ర జానపద గేయాలు, విజయనగరం,బద్రి అప్పన్న స్మారక కళా పీఠం & సిక్కోలు బుక్ ట్రస్ట్,2015,పు.లు (v-ix)
- ప్రసాదరావు, వంగపండు .ముందుమాట, ఉత్తరాంధ్ర జానపద కళలు,విజయనగరం,గిడుగు రామ్మూర్తి తెలుగు భాష & జానపద కళాపీఠం మరియు బద్రి అప్పన్న స్మారక కళాపీఠం,మొ.ము,2005.పు.లు (7-8)
- రాధాకృష్ణ, మిక్కిలినేని. ముందుమాట, ఉత్తరాంధ్ర జానపద కళలు,విజయనగరం,గిడుగు రామ్మూర్తి తెలుగు భాష & జానపద కళాపీఠం మరియు బద్రి అప్పన్న స్మారక కళాపీఠం,మొ.ము,2005.పు.లు (5-6)
- సత్యన్నారాయణ, మానేపల్లి. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం జన సాహితి మైత్రి బుక్హౌస్ బ్బక్హహస్, విజయవాడ.
- సుబ్బారావు, ముత్యం. పాణిగ్రహి- జీవితం, విజయవాడ, శ్రీశ్రీ ప్రింటర్స్, మొ. ము, 2018.
.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

