AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
7. గాజుల వెంకటకృష్ణ కథలు: దళిత గొంతుక
నల్లగోటి నాగేష్
పరిశోధకులు, తెలుగు అధ్యయశాఖ
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
తిరుపతి. ఆంధ్రప్రదేశ్
సెల్: +91 8886828926, Email: nallagotunagesh@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.04.2026 ఎంపిక (D.O.A): 30.04.2026 ప్రచురణ (D.O.P): 01.05.2026
వ్యాససంగ్రహం:
ఆధునిక తెలుగు సాహిత్యంలో కవిగా, కథకులుగా పేరు ప్రఖ్యాతులు పొందిన రచయితలలో గాజుల వెంకటకృష్ణ ఒకరు. వీరు నాలుగు కథా సంపుటాలు, ఐదు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు రచించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. 1965లో అనంతపురం జిల్లాలోని బూడిద గడ్డపల్లిలో జన్మించారు. వృత్తిరీత్యా కర్నూలులోనే స్థిరపడి, కర్నూలు కథా రచయితలలో ప్రముఖ కథా రచయితగా పేరుపొందారు. సాహిత్య కృషికి గాను జాతీయ స్థాయిలో ఢిల్లీ తెలుగు అకాడమీ పురస్కారాన్ని "కొన్ని రంగులు ఒక పద్యం" అనే కవితా సంకలనానికి సినారె పురస్కారాన్ని అందుకున్నారు. వెంకటకృష్ణ వెలువరించిన రెండు కథా సంపుటాలలోని ఇతివృత్తాన్ని పరిశీలించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. ఈ పరిశోధన వ్యాసాన్ని కథా ప్రక్రియపై వెలువడిన పరిశోధన గ్రంథాలు "కథానిక స్వరూప స్వభావాలు", "తెలుగు కథానిక అవతరణ వికాసాలు", "కథానిక వాఙ్మయం" పుస్తకాలలోని కథ, కథానిక అంశాలను క్షుణ్ణంగా చదివి, ఆధునిక కథా పద్ధతులను అనుసరిస్తూ రూపొందించడమైనది. గాజుల వెంకటకృష్ణ రాసిన కథలలోని సంఘటనలు, సందర్భాలు, పాత్రల ఆధారంగా, పూర్వ పరిశోధనల వివరాలు, విశ్లేషణలు, విమర్శలను ఆకళింపు చేసుకొని, పరిశోధన ఫలితాలను వెల్లడించడం ఈ వ్యాసం ప్రధాన అంశం.
Keywords: గాజుల వెంకట కృష్ణ, రాజకీయ దేవుడు కథ, దళిత చిత్రణ, వైవిధ్యత.
1. ప్రవేశిక
తరతరాలుగా, యుగయుగాలుగా అగ్రవర్ణాలచేత అణిచివేయబడిన వర్గాలు దళితులు. వీరు సమానత్వానికి, సంపదకు, మర్యాదకు, మన్ననకు వేల ఏళ్ల నుండి దూరమై మన సమాజంలో కనీవిని ఎరుగని కటిక దారిద్యాన్ని అనుభవిస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. అగ్రవర్ణాల దౌర్జన్యాలకు, దోపిడీలకు నిత్యం బలి అవుతూ, అగ్రవర్ణాల వారికి ఊడిగం చేస్తూ ఊరి బయట తల దాచుకునే స్థితికి నెట్టబడ్డారు. మానవులంతా సమానమే. అందరికీ ఉండే అవయవాలు ఒక్కటే, అందరికీ ఉండే రక్తపు రంగు ఒకటే, మనుషులంతా ఒకటే. అయినా మనిషికి మనిషికి మధ్య చెప్పరాని అంతరాలు సృష్టించబడుతూ ఉన్నవి.
వీటన్నింటిని స్పష్టంగా చూస్తూ గాజుల వెంకటకృష్ణ వివిధ ప్రాంతాలలో సందర్శించి వాటిని కథలుగా మలిచారు.
2. రచయిత పరిచయం సాహిత్య కృషి
గాజుల వెంకటకృష్ణ అనంతపురంలోని బూడిదపల్లిలో ఏప్రిల్ 28, 1964 సంవత్సరంలో జన్మించారు. ప్రాథమిక విద్య మొత్తం చాలా గ్రామాలలో చదివారు. ఇంటర్మీడియట్ కళ్యాణదుర్గం జూనియర్ కాలేజీలో, డిగ్రీ నిజ లింగప్ప డిగ్రీ కాలేజీ రామోజీ నగర్ బెంగళూరులో, ఎంఏ ఎంపిఎల్ హిస్టరీ శ్రీ కృష్ణదేవరాయల విశ్వవిద్యాలయంలో చేశారు. తెలుగు భాషపై అభిలాష ఉండటం వల్ల, సాహిత్య ప్రసంగాలకు వెళ్లి అనేక కథా పుస్తకాలను చదివి కథాసాహిత్యంపై పట్టు సాధించారు. బండినారాయణస్వామి, కె. శివారెడ్డి, పీనాకపాణి సూచనలు, సలహాలు అనుసరిస్తూ కథకులుగా గుర్తింపు పొందారు. వెంకటకృష్ణ కథలన్నీ పీడిత వర్గపు భావోద్వేగాల చిత్రీకరణలు. ఒక వస్తువును భిన్న కోణాల నుంచి దర్శించి కథను రాయడమే ఆయన ప్రత్యేకత.
గాజుల వెంకటకృష్ణ 1994 సంవత్సరంలో కథలు రాయడం మొదలుపెట్టిన 2000 సంవత్సరం నుండి రచయితగా అందరికీ పరిచయమైనారు. ప్రధానంగా కవిత్వం రాస్తున్నప్పటికీ కథలు, దీర్ఘకవితలు రచించారు. 'గరుడస్తంభం', 'చిలకలువాలినచెట్టు', 'దేవరగట్టుకథ' సంకలనాలు, 'దున్నేకొద్దందుఃఖం', 'లోగొంతుక', 'కొన్నిరంగులు ఒక పద్యం', 'చినుకుదీవి' అని నాలుగు కవితా సంపుటాలు వెలువరించారు.
'నది వరద మనిషి', 'హంద్రీ గానం' అనే రెండు దీర్ఘ కవితలు వెలువరించారు. తెలుగు సాహిత్యానికి తనవంతు సేవచేస్తున్న వెంకటకృష్ణ కృషిని గుర్తించి సన్మానాలు, అవార్డులతో సత్కరించాయి.
3. గాజుల వెంకటకృష్ణ కథా సంపుటాలలో విభజన రేఖ
సంఘంలో మానవులందరూ సమానమే అన్నది కేవలం మాటలకు మాత్రమే పరిమితం. సంఘంలో ఉన్న వివక్షలను అణిచివేయ లేకుండా ఉన్నారు. కారణం పూర్వకాలం నుండి వస్తున్న వివక్షలను ఎదుర్కొనలేక సామాన్య మానవులు అనేక అవరోధాలను ఎదుర్కొంటూ సమాజంలో క్రింది కులస్తులను మానవులుగా కాక వారిని అనేక రంగాలలో దౌర్జన్యాలకు గురిచేస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారు. సంఘం పునర్నిర్మాణం కావాలి. వర్ణ వ్యవస్థలో మౌలికమైన మార్పు రావాలని కోరుతూ వ్యక్తిత్వ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలగజేయాలి.
అన్ని కులాల గుంపులో ఉన్న ఒకదాని తర్వాత ఒకటి ఆ వీధి కలుపుకుంటూ మెయిన్ రోడ్డు దాకా విస్తరించి ఉంది. ఆ వీధి చివరన ఒక అగ్రవర్ణం వారి ఇల్లు ఉంది. చివరన ఇంకేమీ లేదని కాదు, మాదిగ గేరి ఉండనే ఉంది. ఆ వీధిలో కూడా వినకుండా ముందులాగే పంచాయతీలు చేస్తూ, విననివాళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారంటే మాదిగ సంఘం వాళ్ళు కంప్లైంట్ చేశారు. అగ్రవర్ణాల వారు దళితులను "వీరు అతి నాయండ్లు, అతిగా మాట్లాడుతుంటే రెండు దెబ్బలు వేసినారంతే" అని పై కులాల వారు పంచాయతీలో చెప్పి అధికారులకు సైగ చేస్తూ "అలాగే సార్" అని చెప్పారు. "మీకిచ్చేది మీకు ఇస్తున్నాం. సరే ఆ విషయం తర్వాత మాట్లాడదాం గాని ఇప్పుడది కాదు."
“మాదిగగేర్లో వినాయకున్ని కూర్చోబెడుతున్నారట సెక్యూరిటీ ఇవ్వమని వాళ్లు పోయి డిఎస్పి కలిసొచ్చినారు. పై కులాల వారికి ఆ వార్త ఒక్క నిమిషం దెబ్బతిని నేల మీద పడ్డ పాములాగా విలవిలలాడి క్షణాల మీద లేచి పడగా విసిరేపాములా వేగంగా పోయినారువాళ్లేంది? వినాయకుని పెట్టడమేంది.? లోకంలో లేనిది అతినాయళ్లు కాకపోతే. ఊర్లో ఎట్లు ఒప్పుకుంటారు సార్.? మా కట్టుబాట్లు ఏం కావాలా చెప్పండి” అన్నారు. (వెంకటకృష్ణ 28)
నిమజ్జనం ప్రశాంతంగా జరపడం దాకే నా డ్యూటీ దానికి మీ కోఆపరేషన్ కావాలా. పట్టణాలలో జరుగుతుందని పల్లెలలో జరపాలంటే ఎట్లా సార్. ఊర్లో ఊరికే ఉంటారా? వాళ్ళ దేవుని మొక్కి వాళ్ల దారిలో వాళ్లు పోతే ఏమి ఉండదు. వినాయకుని పెట్టి కావాలని ఊర్లో నుండి పోతామంటే, వెనక్కి పంపితిమి. దళితులు చేస్తే మిగతా వాళ్ళు ఊరికే ఉంటారా.?
4. దళితుల గౌరవం
ఒక అగ్రవర్ణ కుటుంబంలో ఒక దళితుడు పనిచేస్తూ ఉండేవాడు. ఆ దళితుడు "నన్ను మంచిగా చూసుకోలేదని జీతగాడు పని ఎగ్గొట్టిపోతే వారిని ఎట్లా ఓయ్ ఆడేమి జీతగాడా,? చుట్టమా,? సరిగా చూడడానికి?" ఆ మాటలు వింటుంటే అక్కడ ఉన్న దళితులకు కడుపు మండింది. "సరిగా చూడటం లేదు అన్నందుకే తంతారా? జీతగాడు మనిషి కాదా?" "అవును తంతాను నువ్వు ఎవరివి అడగనీకే? జీతానికి పెట్టుకునేంకా ఇంతే పనెగొట్టి పోయి సరిగా చూడలేదంటే ఎట్లా….. ఎక్కువ తక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతాను. వానికి 5000 వేలు దండగేయండి!" అని తీర్పు ఇచ్చారు. (వెంకటకృష్ణ 30)
దళితులను హీనాతి హీనంగా చూస్తూ వారి ఎదుగుదలను ఓర్చుకోలేనివారు వీరిని సంఘంలో అణచివేస్తారు. దళితులు విద్యచేతనే వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలి.
5. దళితుల అస్తిత్వం
దళితులు వారి స్థాయికి తగ్గ ఏ శుభకార్యం మొదలుపెట్టినా వారిని అడ్డుకొని దళితుల మనోభావాలను దెబ్బతీస్తారు. ఇలాంటి వ్యతిరేకతను తగ్గించి ప్రతి ఒక్క మానవుని ఉనికిని గౌరవించాలి.
“ఏం జరుగుతోందన్నమాదిగలు కంకరకాంట్రాక్ట్ చేస్తూ బలుస్తున్నారు. వాళ్లు వీధులో వినాయకుని కూర్చోబెడుతున్నారంటనే అదేమన్నా తెలుసుకున్నారా? వీళ్లకు వినాయకుడితో ఏం పని.?
దాన్ని అడ్డం పెట్టుకొని మన ఇండ్ల ముందర ఊరేగింపు చేయడానికిరా. ఎట్లా వస్తారో చూద్దాం వాళ్లను ఎవరు రానిచ్చేది. ఈ సంవత్సరం పోలీసులను ముందు ఉంచుకొని రావాలని చూస్తున్నారు. మీరంతశ అడ్డం నిలబడినారంటే పోలీసులు కూడా ఏం చేసుకోలేరు. (వెంకటకృష్ణ 33)
6. సమాజం - సమానత్వం
ఎన్నో ఏళ్లుగా దళితుల గొంతును వినకుండా వారిని కేవలం శ్రమకు మాత్రమే వాడుకుంటూ దళితుల హక్కులను దోచుకుంటూ వారి ఆనవాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. బ్రిటిష్ వారి సహాయం వల్ల దళితుల్లో కొద్దిగా సంఘంలో సమానంగా ఉండే అవకాశం కలిగింది.
19వ శతాబ్దం చివరిలో మూడు ప్రధాన పరిణామాలు చోటు చేసుకున్నాయి:
- బ్రిటిష్ క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు
- అగ్రవర్ణాల వారి దురాచారాలపై ఖండన
- దళితుల స్వీయ చైతన్యోదయం
దీనికి కారణం బ్రిటీష్ మిషనరీలు దళితులను క్రైస్తవ్యంలో చేర్చుకోవడమే. 20వ శతాబ్దంలో ఆది హిందూ సమాజం, జాషువా రచనలు, అంబేద్కర్ భావజాలం దళిత సమాజాన్ని సాంస్కృతికంగా, సామాజికంగా చైతన్యవంతం చేశాయి.
“దళితులకు దేవాలయ ప్రవేశం లేదని చెప్పలేం కానీ, దళితులు ఎవరు ఆ దేవాలయాల్లోకి వెళ్లి అందరితో కలిసి కల్యాణోత్సవాలు, పూజలు చేస్తారని మాత్రం గట్టిగా చెప్పలేం. మాకు ప్రవేశం ఉందని చెప్పడానికి చర్చిలోకి అత్యధికంగా వెళుతుంటారు” (వెంకటకృష్ణ 32)
ఇద్దరూ వేర్వేరు కులాల వారైనా ఒకే రకమైన పనులు చేస్తుంటారు. కూలికిపోయి వ్యవసాయ పనులు చేసినా, రాళ్లు కొట్టినా ఇద్దరికీ పరిచయమే ఉంది, గాని స్నేహం లేదు. ఏదో ఇద్దరినీ కలవనీయకుండా ఉంది. ఇద్దరూ కొంత దూరం కలిసి నడిచిన తర్వాత ఎదురెదురు గేరులోకి వెళ్ళిపోతారు. ఆ ఊరి మాదిగలు, బోయలు, వడ్డెర్లు మొదలైన వారు రాళ్లు కొడుతూ, తయారు చేసి కంకర కాంట్రాక్టులకు అమ్ముతూ జీవిస్తారు. రాళ్లు కొంటే కాంట్రాక్టుల్లో చాలామంది మాదిగలే మేస్త్రీలుగా ఉన్నారు. మాదిగ మేస్త్రీల కింద వేరే కులం వారు కూలికి పని చేస్తున్నారు. కొంతమంది వారిలో "నా కొడుకులు కంకర కాంట్రాక్టు సంపాదించి మేస్త్రీలైనామని యిరగబడుతున్నారు. దించుతాం ఒక్కొక్కరికి" అంటూ గొంతు వినిపిస్తుంది. తమ అభివృద్ధిని ఓర్వడంలేదని కొంతమంది దళితులకు అర్థమయిపోయింది. కుళ్ళుకునే వారి ముందునే కుళుక్కుంటూ బ్రతుకవలెను అని అనుకున్నారు దళితులు. చేసే పనుల దగ్గర నుండి ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ఒక తక్కువ కులస్తుడు పై అధికారిగా ఉన్న వాడిపై చిన్న చూపు చూస్తుంటారు. ఇలాంటి విభేదాలు తొలగి అందరూ సమానం అనే భావన కొనసాగించవలెను.
7. దళితుల అభివృద్ధి - సమాజంలో అస్పృశ్యత
సమాజంలో అస్పృశ్యతను ఏర్పడటానికి మన సమాజం మూఢవిశ్వాసాలతో మునిగి ఉంది. సంఘంలో హరిజనులను, గిరిజనులను చాలా చులకనగా చూస్తూ ఉంటారు. దళితులు ఏ పని ప్రారంభించినా మిగిలిన వారు వాటిని "మైల పడి ఉంది" అని వ్యతిరేకిస్తూ దళితులను చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఒకే వృత్తిలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కులం ప్రతిపాదికగా మాత్రమే వారిని నిర్ణయిస్తారు. ఇలాంటి వాటిని పూర్తిగా తగ్గించి సంఘంలో నూతనమైన మార్పును తీసుకొని రావలెను.
మాదిగ పేటలో మాత్రం సందడిసందడిగుంది. వినాయకుడు ఉన్న పందిరిని గుడిలాగా అనుకొని అందరూ వినాయకునికి నమస్కారాలు చేసుకుంటున్నారు. పిల్లలు, యువకులు తలలకు కాషాయం పట్టీలు కట్టుకున్నారు. రంగురంగు కుంకుమలు తెచ్చుకున్నారు. అందరూ తల ఇంత ముఖాలకు పూసుకుంటున్నారు. పందిరి దగ్గరకు వచ్చిన వాళ్లకు దగ్గరకు పోయి మరీ పూస్తున్నారు. అందరూ కొత్తదేదో తాము పొందుతున్నట్లు అపురూపమైనదాన్ని తాము అనుభవిస్తున్నట్లు, తమ తాతల ముత్తాతలు ఎవరు చూడనిది చేయనిది తాము చేస్తున్నట్లు, తరతరాలుగా కోల్పోయింది పొందుతున్నట్టుంది. ఆ తర్వాత కాలం ఆ ఊరి మీద పెద్ద పెద్ద గుండ్లు దొర్లిపోయినట్లు దొర్లిపోయింది. ఒక్కో క్షణం ఒక్కో అనుభవంలాగా, ఒక్కొక్కక్షణాన్ని ఒక్కోలాగ తీసినట్లు ఇంకోగంటను కుదించినట్లు అస్తవ్యస్తంగా అంతా అల్లుకుపోయింది. జరిగిన సంఘటనలతో ఆ ఊరు ఒక బీభత్స దృశ్యంలా మారిపోయింది.
“ప్రశ్నించబడిన తమ అస్తిత్వం సవాలై ఊరి వాళ్ళ మీద ప్రతి సవాళ్లు విసురుతుంది. రోడ్డు మీదకు చేరిన మాదిగలు, ఆ రోడ్డు హైవే కావడంతో తమకు జరిగిన అన్యాయం అవమానం అందరికీ తెలియాలని రాస్తా రోకో చేసి వాహనాల్ని దిగ్బంధం చేసి, ఆ రోడ్డు వేదికగా ధర్నా నిర్వహించి ఒక కొత్త మార్పును కోరారు.” (వెంకటకృష్ణ 42)
ప్రభుత్వాన్ని, నోరున్న ప్రతి దళిత వ్యక్తులు ఊర్లో వాళ్లకు రక్షణ ఇవ్వలేకపోయిన వారిని ఆత్మగౌరవం ప్రతీకారం కోరుతుంది. జరిగిన అవమానం కడుపు మంటలాగా బయటపడుతుంది.
8. దళితులకు రాజ్యాధికారం
భారతదేశంలో ఎక్కువ జనాభా గల వారు దళితులు. తక్కువ జనాభా గల వారు అగ్రవర్ణాల వారు. ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారు తక్కువ జనాభాకు చెందిన అగ్రవర్ణాల వారు. ఇది అన్యాయం. నూటికి 85 శాతానికి పైగా హరిజన, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ వర్గాలకు చెందినవారు ఈ దేశంలో నివసిస్తున్నారు. కాబట్టి వీరంతా కలిసి రాజ్యాధికారం సాధించడం కోసం పోరాడాలని సమాజంలో కొత్త మార్పులు తీసుకుని రావాలని నిర్ణయించుకున్నారు.
సమాజంలో ప్రజలందరూ సమానమే అన్న భావన కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా వాటిని ఆచరించి నూతన మార్పును ఈ దేశంలో తీసుకొని రావలెను. ప్రతి వ్యవస్థలో కొత్త ఆలోచన, నూతన మార్పులు రావాలి. కానీ ఈ దేశంలో కులం, మతం ఆధారంగానే పరిపాలిస్తున్నారు. ఇలాంటి మూఢాచారాలను విడనాడి ప్రతి ఒక్క మానవుడిలో క్రొత్త మార్పును తీసుకురావలెను. ఈ దేశంలోని ప్రతి అధికారి ఏసి రూముల్లో కూర్చొని, తమ చేతుల్లో సర్వాధికారాలు ఉన్నాయి, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను అనుకుంటూనే, అణగారిన వారి వాక్కుల్ని కాపాడుతాం అనుకుంటారు. కానీ వీటికి భిన్నంగా డబ్బు ఉన్నవాడు, పెద్ద కులస్తుడు వాటి రూపు రేఖల్ని మారుస్తున్నారు. తమ కళ్ళముందరి అన్యాయాన్ని ఆపలేకపోతున్నామని (వెంకటకృష్ణ 46) అంతా విద్వాంసాన్ని ఆపలేకపోయినందుకు ఊరి జనాలు తమను అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ప్రతి ఒక్క వ్యవస్థ కేవలం కులం ప్రతిపాదిక ఆధారంగానే జరుగుతున్నవి. ఇలాంటి విభేదాలను తొలగించాలి. నేడు సాంకేతిక పరంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇలాంటి అవాంఛనీయ పరిణామాలకు దూరంగా దేశం పురోభివృద్ధి కొనసాగవలెను. అయితే సమాజం ఎప్పుడు నిద్రాణంగా ఉండదు. అదే సమయంలో సమాంతరంగా ప్రతిఘటించే వ్యవస్థలు కూడా ఏర్పడి సామాజిక రుగ్మతలను ఖండిస్తాయి. మీ బానిసత్వాన్ని మీరే తొలగించుకోవాలి. మీ జీవితాల్లో మార్పు రావాలని, మీ పిల్లలు విద్యావంతులై సంఘంలో గౌరవ మర్యాదలు పొందాలంటే ఆ ప్రయత్నం మీరే చేయాలి.
9. దళిత వైవిధ్య ఘర్షణలు
వివక్షలను తగ్గించి దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా ఉంటూ దేశం కోసం కృషి చేయాలి. దళితులు సుఖపడటం వెనక దేశం సుఖపడటం ఉంది. కులం కేంద్రంగా ఉన్న ఈ సమాజంలో దళితులు ఎప్పుడు పరస్పర సంఘర్షణకు లోనవుతూనే ఉంటారు. ఈ సంఘర్షణలో భాగంగానే ఈ కులచట్రం నుండి బయటపడటానికి వారు ఇతర మతాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇతర మతాల వైపు మొగ్గుచూపడాన్ని అదుపు చేయడానికి సంస్కరణలను పరిచయం చేసింది. ఆ క్రమాన్ని ఒక్కసారి అర్థం చేసుకుంటే అసలు దళిత సమాజంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందో స్పష్టమవుతుంది.
దళిత దృక్పథం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ముందు మొదటి దళిత స్పృహను అర్థం చేసుకోవాలి. కేవలం కుల సమస్యలు రాసినంత మాత్రాన ఏది దళిత కవిత్వం కాదు. అట్లాగే సమస్యను విశ్లేషిస్తే పరిష్కరించుకోవాలనేది విప్లవ కవిత్వం. కాబట్టి రెండింటి మధ్య ఉన్న సన్నని పొర ఏంటో తెలుసుకోవాలి. ఈ దేశంలో కులం ఎంతటి పై అంతస్తులో ఉంటే అన్ని హక్కులు దక్కుతాయి, ఎంతటి తక్కువ అంతస్తులో ఉంటే అన్ని తక్కువ హక్కులు దక్కుతాయని అంబేద్కర్ అభిప్రాయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మనిషికి సంక్రమించే విలువలు, వారి వృత్తులు అన్నీ వారి కులాల ఆధారంగానే ఉన్నాయని తెలిసిపోతుంది. ఇదే వాస్తవానికి బ్రాహ్మణవాద పునాది.
దళితులు ఇతరుల నుండి తమ ముద్రలను చెరిపేసికోవడానికి తమకంటూ సొంత ఉనికిని చాటుకోవడానికి చేసే ఉద్యమాలు మత విశ్వాసాలు, అంటరానితనం, అసమానతలు, బానిసత్వం తిరుగుబాటు కోసం జరిగేవి. (వెంకటకృష్ణ 36)
ఉపసంహారం
సృష్టి ప్రారంభం నుండి దళితులపై అనేక వివక్షలు చూపిస్తూ వారిని పశువులకన్నా తక్కువగా చూస్తూ వారి ప్రతిభను కలగర్భంలో కలుపుతున్నారు. ఇలాంటి దూరాలోచనలు వదిలి సమాజ మార్పు కోసం కృషి చేయాలి. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం కనుక, దేశంలో ఉండే ప్రతి మానవుని ఉనికిని కాపాడవలసిన బాధ్యత మన అందరిదీ.
- గాజుల వెంకటకృష్ణ రాసిన కథలు సమాజానికి మార్గదర్శకంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఎంచుకున్న ఇతివృత్తం విలక్షణంగా అనిపిస్తుంది.
- కథలన్నీ సమాజంలో జరుగుతున్నవి, అందరూ విన్నవి, చదివినవే అయినప్పటికీ, కథకుడిగా వీరు ఎంచుకున్న శైలి, కథను నడిపించిన విధానం కొత్తగా ఉంది.
- ఈ కథా సంకలనంలో వివిధ ప్రాంతాల దళిత జీవితాల గురించి పాఠకులు తెలుసుకుంటారు.కథా రచయితలలో సాహిత్య అభిలాషను పెంపొందించవచ్చు. ఈ రచయిత కథలను ఎంచుకున్న విధానం, జాగరూకత, కథాగమనం అద్భుతం.
- జి. వెంకటకృష్ణ కథలు సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ, ఆత్మవిశ్వాసంగా జీవించడానికి స్ఫూర్తినిచ్చే పాత్రలుగా చూపాయి. జి. వెంకటకృష్ణ కథలు దళితుల బాధలను శక్తివంతంగా చిత్రించి సమాజంలో మార్పును ఆకాంక్షించాయి. వీరి కథలను ప్రాథమిక స్థాయి నుంచి డిగ్రీ స్థాయిలో విద్యను అభ్యసించే విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టవచ్చు.
ఉపయుక్త గ్రంథసూచి
- అనురాధ, గాంధీ. భారతదేశంలో కుల సమస్య. మలుపు ప్రచురణ2005
- ఇనాక్, కొలకలూరి. దళితకథానికలు. ప్రజాశక్తి హౌస్ 1996 హైదరాబాద్.
- పద్మారావు, కత్తి. దళితుల చరిత్ర. సృజనా ప్రింటర్స్ పొన్నూరు 1991
- పైదే. దళిత ఉద్యమ చరిత్ర. లోకాయుత ప్రచురణలు. 2005
- భీమన్న, బోయి. కులనిర్మూలన. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ 1998
- లక్ష్మీనారాయణ, కె. ఆదిభారతీయుల చరిత్ర. కర్నూల్ డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ -2006
- విజయలక్ష్మి, సి తెలుగు కథ సాహిత్యం. విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్ తిరుపతి -2000.
- వెంకటకృష్ణ, జి. గరుడ స్తంభం. నాగేంద్ర ప్రెస్ విజయవాడ – 2 (2005)
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. కథాశిల్పం. విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్ విజయవాడ
- వోల్గా. రాజకీయ కథలు. స్వేచ్ఛ ప్రచురణలు హైదరాబాద్.1993.
- సత్యనారాయణ, ఎస్ వి. (సం.) దళితవాద వివాదాలు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్. 2000
- సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య చరిత్ర. విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్, విజయవాడ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

