headerbanner

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

6. విజయవిలాసం: షడ్విధ ప్రాసలు

గొడుగులూరి గాయత్రి

పరిశోధకురాలు, తెలుగు శాఖ
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్
రంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9346343934, Email: 25htph11@uohyd.ac.in
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 07.04.2026        ఎంపిక (D.O.A): 30.04.2026        ప్రచురణ (D.O.P): 01.05.2026


వ్యాససంగ్రహం:

తెలుగు ప్రబంధ సాహిత్యంలో విజయ విలాసం శబ్దసౌందర్యం, అక్షర రమ్యత, ఛందో నైపుణ్య సమన్వయానికి ప్రతీకగా నిలిచిన మహత్తర కావ్యం. ఈ కావ్యంలో కవి కేవలం భావవ్యక్తీకరణకే పరిమితుడై ఉండక, అక్షర విన్యాసం, లయ, ప్రాసల ద్వారా పాత్రల మనోభావాలను, సందర్భోచిత రసపోషణను సమగ్రంగా ఆవిష్కరించాడు. ఈ వ్యాస రచనలో గుణాత్మక పరిశోధన పద్ధతిని అనుసరించడమైంది. తెలుగు ఛందస్సు, ప్రాస వైవిధ్యాలపై కవిజనాశ్రయకర్త, అప్పకవి మొదలైన ఛందోలాక్షణికులు సిద్ధాంతపరమైన వివరణలు అందించారు. అలాగే విజయ విలాసంపై జరిగిన పూర్వ పరిశోధనలు ప్రధానంగా సంకేత శిల్పం, వర్ణనాత్మక వివేచన, వాక్య విన్యాసం వంటి అంశాలపై కేంద్రీకృతమయ్యాయి. అదేవిధంగా “ఆంధ్ర మహాభారతం - ఛందఃశిల్పము”, “శ్రీమద్రామాయణ కల్పవృక్షము - బాలకాండ ఛందోవస్తుశిల్పము” అనే కావ్యాలపై ఛందస్సు పరంగా పరిశోధన జరిగింది. కానీ విజయవిలాసంలో వినియోగించిన షడ్విధ ప్రాసలను శబ్దసౌందర్యం, రసపోషణ, భావవ్యక్తీకరణల దృష్టితో సమగ్రంగా పరిశీలించిన అధ్యయనాలు అరుదుగా కనిపిస్తాయి. అందుకని “విజయవిలాసం – షడ్విధప్రాసలు పరిశీలన” అనే అంశాన్ని పరిశీలించదలుచుకున్నాను. ఈ పరిశోధన, తెలుగు ఛందః సంప్రదాయంలో ప్రాసల స్వరూపం, ప్రాధాన్యం, వాటి వినియోగ వైవిధ్యాన్ని విశ్లేషిస్తుంది. ముఖ్యంగా సుకర, దుష్కర, ద్విప్రాస, త్రిప్రాస, చతుష్ప్రాస, అనుప్రాస, అంత్యప్రాస అనే షడ్విధప్రాస రూపాలను కేవలం ఛందోనియమాలుగా కాకుండా, భావరసాలకు అనుగుణమైన శబ్దవ్యక్తీకరణ సాధనాలుగా పరిశీలించడం ఈ పరిశోధనలోని నూతనత. ఈ నేపథ్యంలో చేమకూర వేంకటకవి రచించిన విజయవిలాసం కావ్యంలో ఈ షడ్విధ ప్రాసల వినియోగాన్ని ఉదాహరణలతో విశ్లేషించడం ఈ పత్రం ప్రధాన లక్ష్యం. ఉదాహరణకు చిత్రాంగద గర్భధారణ సందర్భంలో అనుస్వారంతో కూడిన ‘చ’కార ప్రాస ఆమె సౌకుమార్యాన్ని, శారీరక మార్పుల మృదుత్వాన్ని వ్యక్తం చేస్తే, వివాహ ఘట్టంలో ద్విత్వ టకారంతో కూడిన ద్విప్రాస (క‘ట్టిరి’) కార్యంలో చురుకుదనాన్ని, రాజవైభవ వర్ణనలో ‘క్ష’ కారంతో ప్రయోగించబడిన దుష్కర ప్రాస వీరరసాన్ని, గాంభీర్యాన్ని ధ్వనింపజేశాయి.దీని ద్వారా ప్రతి ప్రాస రూపం ఒక నిర్దిష్ట భావోద్వేగాన్ని శబ్దాత్మకంగా మలచే సాధనంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. విజయ విలాసంలో ప్రాస కేవలం శిల్ప ప్రక్రియ కాదు; అది పాత్రల స్థితిగతులను, రసస్వరూపాన్ని పాఠకునికి శ్రవణానుభూతి ద్వారా చేరువ చేసే కవిశక్తి. ఈ ప్రక్రియలో షడ్విధ ప్రాస రూపాలు కావ్యాన్ని సంగీతాత్మక అనుభూతిగా మలచాయని ఈ పరిశోధన తేటతెల్లం చేస్తుంది.

Keywords: విజయవిలాసం, చేమకూర వేంకటకవి, షడ్విధ ప్రాసలు, సుకర ప్రాస, దుష్కర ప్రాస, ద్విప్రాస, రసపోషణ

1. ఉపోద్ఘాతం

కావ్యానికి రసభావాదులు అంతర్గత స్వభావాన్ని, ఛందస్సు శబ్దాలు బాహ్యశోభను ఇస్తాయి. అయినప్పటికీ, ఈ రెండు అంశాల సమన్వయమే సమగ్ర కావ్యత్వానికి ఆధారం. కవిత్వానికి ఛందస్సు ఐచ్ఛికమైనది అయినప్పటికీ, పద్య రూపంలో అది లయ, గతి, శ్రవణానందాలను పెంచుతూ కావ్యానుభూతిని విశిష్టంగా మారుస్తుంది. ముఖ్యంగా తెలుగు పద్య కవిత్వంలో యతి, ప్రాసలు వంటి ఛందో నియమాలు కేవలం నిర్మాణాత్మక అంశాలు మాత్రమే కాక, శబ్ద రమ్యతకు, సౌందర్య వ్యక్తీకరణకు, కవిత్వ శోభకు ప్రధాన కారణాలై నిలిచాయి. అందుచే తెలుగు ఛందస్సు సంప్రదాయంలో ప్రాసకు విశిష్ట స్థానం లభించింది.

పద్య పాదంలో రెండవ అక్షరాన్ని ‘ప్రాస’ అంటారు. అనగా “పాదంలో ప్రథమ ద్వితీయ అచ్చుల మధ్యనున్న వ్యంజనము, లేదా వ్యంజన సమూహము ప్రాస అనబడుతుంది” (కోవెల 52). ప్రాస చెల్లించడంలో హల్లుకు ప్రాధాన్యత లభిస్తుంది, అచ్చుకు లేదు. మొదటి పాదంలో ప్రాస పూర్వాక్షరం గురువు అయితే, మిగిలిన పాదాల్లోనూ గురువే కావాలి. లఘువు అయితే లఘువే కావాలి. ఇక్కడ హ్రస్వ దీర్ఘాలతో పని లేదు, గురు, లఘువులే ముఖ్యం.

విభిన్న రీతుల్లో అక్షరావృత్తి శబ్దాలంకార విశేషం. దీనిని ఛందస్సు శాస్త్రంలో ప్రాస అని, అలంకార శాస్త్రంలో అనుప్రాస అని సూచించారు. సాధారణంగా ఆలంకారికులు చెప్పిన అనుప్రాస, యమకాది శబ్దాలంకారాలు పద్య, గద్యాలు రెండింటిలోనూ ప్రయోగించవచ్చు. కాని శబ్దాలంకార ప్రాసలు పద్యాల్లో మాత్రమే ప్రయోగించేవి కావడంతో ఇవి యతి, ప్రాసలతో పాటు ఛందస్సు శాస్త్రంలో మాత్రమే చెప్పబడ్డాయి, అలంకార శాస్త్రంలో చెప్పబడలేదు. వీటిని ఛందో లాక్షణికులు శబ్దాలంకార ప్రాసలని/షడ్విధ ప్రాసలని పేర్కొన్నారు. సంస్కృత ఛందస్సులో ప్రాస నియమం లేనప్పటికీ, దేశి ఛందస్సు ప్రభావంతో తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. సంస్కృత ఛందస్సుతో పోలిస్తే తెలుగు సాహిత్యంలో ప్రాస సుస్థిర రూపాన్ని పొంది శాస్త్రీయతను సంతరించుకుంది. ఈ లక్షణమే తెలుగు పద్య కావ్యాన్ని ఇతర భారతీయ భాషా సాహిత్యాల నుండి ప్రత్యేకంగా నిలిపింది. ఆంధ్ర ఛందో లాక్షణికులు ప్రాసాక్షర విన్యాసంలోని వైచిత్రి భేదాలు కొన్నిటిని గుర్తించారు. ఈ క్రింది ప్రాస భేదాలను కవిజనాశ్రయకర్త పేర్కొన్నారు.

భాసురములగుచు సుకర
ప్రాసానుప్రాస దుష్కర ప్రాసాంత్య
ప్రాస ద్విప్రాస త్రి
ప్రాసములన షడ్విధములఁ బరగును గృతులన్. (కవిజనాశ్రయం 8)

మల్లియ రేచన “సుకరప్రాస, దుష్కరప్రాస, అనుప్రాస, అంత్యప్రాస, ద్విప్రాస, త్రిప్రాస” అను ఆరు ప్రాసలను పేర్కొనగా, అనంతామాత్యుడు సుకరప్రాసను విడిచి చతుష్ప్రాసను చేర్చి షడ్విధ ప్రాసలను చెప్పాడు. అప్పకవి సుకరప్రాసను, చతుష్ప్రాసను చేర్చి సప్తవిధ ప్రాసలను చెప్పాడు.

అనంతుడు, అప్పకవి వీటిని శబ్దాలంకారములు అన్నారు. రేచన అలా అనలేదు, అనకపోవటమే ఉచితము. షడ్విధప్రాసములు శబ్దాలంకారములు కావు. శబ్దాలంకారాలు పద్య గద్యాల్లో ఉండవచ్చు. షడ్విధప్రాసలు పద్యాలందు మాత్రమే ఉండదగినవి (పాటిబండ 150).

షడ్విధప్రాసలు కేవలం పద్యానికే పరిమితం కావటంతో, వీటిని ‘శబ్దాలంకారాలు’ అనడం కంటే ‘ఛందోఽలంకారాలు’ అనటమే సముచితమని విమర్శకుల అభిప్రాయం (ఎన్. ఎస్. రాజు 32).

ప్రాసాక్షరమే పద్యంలో అనేకసార్లు ఆవృత్తమవ్వడం వల్ల కలిగే నాద సౌందర్యం పాఠకుడిని రసపరవశుడిని చేస్తుంది.

తెలుగు సాహిత్య పరిణామ క్రమంలో పురాణ యుగంలో అంకురించిన ఈ శబ్దాలంకార ప్రాసలకు ప్రబంధ యుగం ‘స్వర్ణయుగం’. ఇక్కడ రసానికి, శబ్దానికి సమతుల్యత కుదిరి ప్రాశస్త్యం పొందింది. దక్షిణాంధ్ర యుగంలో శబ్దాలంకారాల ప్రయోగం అధికం అయ్యింది. ప్రతి పద్యంలోనూ చమత్కారం కోసం వెతకడం వల్ల కావ్యంలోని సహజమైన భావం, రసం తగ్గిపోయాయి. అందుకే దీనిని సాహిత్య చరిత్రలో ‘క్షీణయుగం’ అని కూడా అంటారు (ఎన్. ఎస్. రాజు 22).

దక్షిణాంధ్ర యుగంలో శబ్దాలంకారాల ప్రయోగంలో పడి చాలా కావ్యాలు రసహీనంగా మారినప్పటికీ, చేమకూర వెంకటకవి రాసిన ‘విజయ విలాసం’ దీనికి మినహాయింపు.

విజయ విలాస కావ్యంలో శబ్దాలంకారాలు ఉన్నప్పటికీ, అవి రసపోషణకు అడ్డుపడలేదు. శబ్దం, అర్థం రెండూ పోటీ పడుతూ కావ్యానికి వన్నె తెచ్చాయి. అందుకే ఇది ‘విలక్షణమైన’ కావ్యంగా నిలిచింది. ఈ కావ్యంలో షడ్విధ ప్రాసల వైచిత్రి కేవలం ఛందో నియమపాలన కోసమే కాకుండా శిల్పం, భావ వ్యక్తీకరణ మధ్య సమతుల్యతను సాధించి కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చింది. కావున, ఈ పత్రంలో చేమకూర వెంకటకవి తన అద్వితీయమైన శబ్ద చమత్కారంతో విజయ విలాసంలో ప్రయోగించిన షడ్విధ ప్రాసల విశేషాలను సమగ్రంగా విశ్లేషించడమే ప్రధాన లక్ష్యం.

2. విజయ విలాసంలో షడ్విధ ప్రాసల లక్షణ-లక్ష్య విశ్లేషణ

2.1. సుకరప్రాస

సుకర ప్రాసంబన్నది సులభాక్షరంబులు ప్రాసంబిడి చెప్పునది” అని నిర్వచనం (కవిజనాశ్రయం 8). అనగా ప్రాస కూర్చడానికి సులభంగా తనంతట తానుగా లభించే అక్షరం, ఉచ్చారణలో వక్తకు, వినడంలో శ్రోతకు సుకరమైన అక్షరం ఉన్న ప్రాస.

కవిజనాశ్రయ లక్ష్యం:

క . పర మోపకార ధరణీ
సురవర సురభూజ సుగుణ సుందర తరుణీ
స్మరనిభ సుకర ప్రాసం
బరుదుగఁ గృతులందు నొప్పు నభినుత చరితా. (కవిజనాశ్రయం 8)

అసంయుక్తం, అద్విరుక్తం, అబిందుపూర్వకం, అల్పప్రాణమై సులభంగా ఉచ్చరించదగిన అక్షరం సుకరప్రాసాక్షరమని వీరి లక్ష్యం వలన తెలుస్తుంది. ఏ అక్షరం ఉచ్చారణలో వక్తకు, శ్రవణంలో శ్రోతకు, ప్రయోగంలో కవికి సుఖకరమో ఆ అక్షరం ఉన్న ప్రాస సుకరప్రాస. అక్షరాల సుఖకరత్వం తారతమ్యం, రసాది వ్యంజనంలో ఆ అక్షరాల ఔచిత్యం పరిశీలించదగి ఉంది (పాటిబండ 155).

న్న, ల్ల,ంగ వంటి అక్షరాలను కేవలం దుష్కరము అనలేము. కనుక సుకరప్రాస–దుష్కరప్రాసల మధ్య ఎన్నో భేదాలు సంభావ్యములు అవుతున్నాయి (పాటిబండ 156).

పాటిబండ మాధవశర్మ పేర్కొన్నట్టు అన్ని అక్షరాలను దుష్కరము అనలేము.

విజయ విలాసంలోని ఈ క్రింది పద్యంలో ప్రయోగించిన యకారం ద్విత్వం అయినప్పటికీ అక్షర సౌలభ్యంలో, ఉచ్చారణలో, శ్రవణంలో సుఖకరంగా ఉంది. 'అద్విరుక్తం' (ఒత్తు లేనిది) సుకర ప్రాస లక్షణం అయినప్పటికీ, 'య' కారానికి 'య' ఒత్తు చేరినప్పుడు అది ఉచ్చారణను కఠినం చేయలేదు. 'య్య' అనే శబ్దం ఇక్కడ మృదువుగానే సాగింది. కావున దీనిని సుకర ప్రాస కింద విశ్లేషించవచ్చు.

శయ్యకుఁ దార్పఁగాఁ తుఱుము జాఱె దనంతటఁ జక్కదిద్దఁబోఁ
బయ్యెద జాఱె; న య్యదిరిపాటునఁ గ్రక్కున నీవి జాఱె; రా
జయ్యెడ నవ్విలాసిని యొయారముఁ జూచి కవుంగిలించె నౌ;!
నెయ్యెడ మేలె చూతురు, గ్రహింపరు జాణలు జాఱుపాటులన్. (చేమకూర 1.107)

ఈ పద్యం శృంగార రసాత్మకమైనది. ఇందులో ద్విత్వ యకారం ప్రాస అక్షరం. సహజమైన పదబంధాల్లోనే ఈ అక్షరం ప్రయోగించబడింది. అలాగే ఇది కఠినత్వం లేని మృదువైన ధ్వని. కాబట్టి దీనిని సుకర ప్రాస అనవచ్చు. ఈ పద్యంలో నాయిక తొందరపాటులో ఉన్నప్పుడు ఆమె అలంకారాలు ఒక్కొక్కటిగా జారిపోవడం వర్ణించబడింది. ఈ సందర్భంలో ‘శయ్యకు’, ‘పయ్యెద’, ‘రా జయ్యెడ’, ‘నెయ్యెడ’ వంటి పదాలలో ‘య్య’ ధ్వని పదే పదే రావడం వల్ల ఒక రకమైన లాలిత్యాన్ని ధ్వనింపజేసింది. వస్త్రం కాని, కొప్పు కాని జారిపోయేటప్పుడు ఉండే ఆ సున్నితమైన చలనాన్ని ఈ అక్షరం ప్రతిబింబిస్తుంది. ఇక్కడ ‘య’ కారం వాడడం వల్ల సన్నివేశంలోని లాలిత్యం, సుకుమారత్వం దెబ్బతినకుండా కాపాడబడింది.

2.2. దుష్కరప్రాస

విషమాక్షరంబులు ప్రాసంబిడి చెప్పునది” దుష్కర ప్రాస అని నిర్వచనం (కవిజనాశ్రయం 8). విషమాక్షరాలు అనగా భాషలో తక్కువగా ఉపయోగించే అక్షరాలు, క్లిష్టమైన సంయుక్తాక్షరాలు, విసర్గతో కూడిన అక్షరాలు మొదలైనవని అర్థం.

కవిజనాశ్రయ లక్ష్యం:

స్వః కాంతాసమయోషిదు
రః కృతరతిచిహ్న దుష్కరప్రాసం బా
విః కృతమగు నిట్లు సుపు
త్రః కులదీపక యనంగఁదగుచు మహాత్మా, (కవిజనాశ్రయం 8-9)

కవిజనాశ్రయంలో పేర్కొన్న లక్షణం-లక్ష్యం ఆధారంగా “స్థానకరణ ప్రయత్నాదులందు విషమమైన వర్ణాల సంయోగములు, విసర్గపూర్వకములు దుష్కర ప్రాసాక్షరములు. ఉచ్ఛారణమున దుఃఖకరములు అయినవి- ర్భ, ర్జ, గ్మ, ధ్మ, ష్మ, ష్ట్ర మొదలైన అక్షరాలు దుష్కర ప్రాసాక్షరాలు” అని పాటిబండ మాధవశర్మ వివరించారు (పాటిబండ 156).

విజయ విలాసంలోని ఈ క్రింది పద్యంలోని ‘క్ష’కారం ప్రయోగించడంలోనూ, ఉచ్చారణలోనూ, శ్రవణంలోనూ క్లిష్టంగా ఉంటుంది. కావున దీనిని దుష్కర ప్రాస కింద విశ్లేషించవచ్చు.

దాక్షిణ్యాకర మూర్తి! షోడశ మహా దానాది పుణ్య క్రియా
దక్షా! యాశ్రిత దీన రక్షణ కళా ధౌరంధరీ సత్కృపా
వీక్షా! శాశ్వతకీర్తి వైభవ రమాభృ చ్చోళ సింహాసనా
ధ్యక్షా! దుర్దమ రాట్కిరీట దళనై కాక్షేయ కౌక్షేయకా! (చేమకూర 2.204)

ఈ పద్యం చోళ సింహాసనాధ్యక్షుడిని ఉద్దేశించిన సంబోధనాత్మక పద్యం. ఇందులో ‘క్ష’ అనే అక్షరం ప్రాస స్థానంలో ఉంది. అలాగే పద్యం అంతటా వివిధ పదబంధాల్లో పునరావృత్తమవుతూ ‘దుష్కర ప్రాస’, అనుప్రాస వైభవాన్ని చాటుతుంది. ఇక్కడ ప్రాసాక్షరం ‘క’, ‘ష’ అనే రెండు కఠిన వ్యంజనాల కలయికతో ఏర్పడిన సంయుక్తాక్షరం. ఇది వీర రసానికి, గంభీరతకు అత్యంత అనువైన ధ్వని. దీనిలోని ‘ష’ కారం ఊష్మ వర్ణం కావడం వల్ల, అది పలికేటప్పుడు వచ్చే గాలి ఘర్షణ పరాక్రమాన్ని, ఆయుధాల శబ్దాన్ని ధ్వనింపజేస్తుంది. సాధారణంగా సరళ అక్షరాలతో ప్రాస కూర్చడం సులభం. కానీ ‘క్ష’ వంటి అక్షరంతో నాలుగు పాదాల్లోనూ ప్రాసను నిర్వహించడం కవి పాండిత్యానికి పరీక్ష వంటిది. అందుకే దీనిని ‘దుష్కర ప్రాస’ అనవచ్చు.

ఒక రాజు సౌందర్యాన్ని, శక్తిని వర్ణించేటప్పుడు మృదువైన అక్షరాల కన్నా ఇటువంటి ‘బిగువైన’ అక్షరాలు వాడడం వల్ల పద్యానికి ఒక రకమైన గాంభీర్యం చేకూరుతుంది. ఇది రాజు దానగుణంలోని దృఢత్వాన్ని, రక్షణలోని నైపుణ్యాన్ని, యుద్ధంలోని పరాక్రమాన్ని ఏకకాలంలో ధ్వనింపజేస్తుంది. కవి తన శబ్ద సంపదతో ఒక శక్తివంతమైన పాలకుడి వ్యక్తిత్వాన్ని ఈ దుష్కర ప్రాస ద్వారా అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించారు.

2.3. ద్విప్రాస

ద్విప్రాసంబన రెండక్షరంబులు ప్రాసంబిడి చెప్పునది’ అని నిర్వచనం (కవిజనాశ్రయం 9). అనగా ప్రాసాక్షరంతో పాటు దాని తర్వాత అక్షరం కూడా ప్రాసగా ఉపయోగిస్తే అది ద్విప్రాస అవుతుంది.

కవిజనాశ్రయ లక్ష్యం:

క. దోసంబు లేక వస్తు ని
వాసం బై వెలయఁ జెప్ప వలయును ద్వంద్వ
ప్రాసం బుచితాక్షర వి
న్యాసంబుగఁ గృతుల రేచ! నయతత్త్వ నిధీ ! (కవిజనాశ్రయం 9)

ఇందు 1, 3, 4 పాదములందు ఉత్వ విశిష్ట బకారముండగా, 2వ పాదమున ఐత్వ విశిష్ట బకారమున్నది. అప్పకవి దీనిలో స్వరసామ్యము కూడా పాటించాడు. స్వరవ్యంజనోభయసామ్యము శ్రవ్యతరమగుట నిజమే. అయినప్పటికీ ప్రాసలో వ్యంజనానికే ప్రాధాన్యత కావున ఇక్కడ రేచన మతమే గ్రహించబడుతుంది (పాటిబండ 174).

విజయవిలాసం నుండి గ్రహించిన ఈ క్రింది రెండు పద్యాల్లోని ద్విప్రాసలో స్వరసామ్యం కూడా పాటించబడింది. కానీ కవిజనాశ్రయంలో చెప్పినట్టు ప్రాసలో వ్యంజన సామ్యం ప్రధానం. అందుచే స్వర సామ్యం ఉండకూడదని అర్థం కాదు. స్వరసామ్యం లేకపోయిన కూడా ప్రాస చెల్లుతుందని అర్థం. దీనిని పాఠకులు దృష్టిలో ఉంచుకోవాలి.

కట్టిరి మంచి లగ్నమునఁ గంకణముల్ కరపంకజంబులన్,
బెట్టిరి మేనులన్ నలుఁగు మేలి మృగీమద కుంకుమంబులన్;
జుట్టిరి కైశికంబుల విశుద్ధ మనోహర పుష్పమాలికల్;
వట్టిరి పేరఁటాండ్రు ధవళంబులు పాడుచు నుల్లభంబులన్. (చేమకూర 3.76)

ఈ పద్యంలో ప్రతి పాదం ఒక క్రియాపదంతో ప్రారంభమైంది. ఇందులో క‘ట్టిరి’ ద్విప్రాసగా వాడబడింది. ద్విత్వంతో కూడిన ద్విప్రాసను వాడడం ద్వారా నిశ్శబ్దం లేకుండా పెళ్లి ఇంట్లో పనులు చకచకా జరిగే విధానాన్ని పాఠకుడికి స్ఫురింపజేశాడు. ‘కట్టిరి.. పెట్టిరి.. చుట్టిరి’ అన్నప్పుడు వచ్చే ఆ ధ్వని, పెళ్లి పనుల హడావిడిని, సందడిని శబ్ద రూపంలో మన కళ్ళ ముందు ఉంచుతుంది. ఈ పద్యంలో ద్విప్రాస, పెళ్ళి వేడుకలోని పనుల వరుసను, ఆత్మీయుల సంబరాన్ని ఒక గొలుసుకట్టుగా అల్లి, పాఠకుడికి ఆ సన్నివేశాన్ని శబ్ద చిత్రంగా అందించడంలో సంపూర్ణంగా సఫలమైంది. పెళ్ళి పనుల్లో ఉండే ఒక రకమైన సందడిని, పేరటాండ్ర ఉత్సాహాన్ని ఈ ద్విత్వాక్షరం ప్రతిబింబిస్తుంది. ఈ పద్యంలోని ద్విప్రాస సందర్భానికి తగిన ‘క్రియాశీలతను’ కలుగజేసి; వివాహ వేడుకలోని మంగళకరమైన పనులన్నీ నిర్విఘ్నంగా, నిక్కచ్చిగా జరుగుతున్నాయనే భావనను కలిగిస్తుంది. ఇది కవి శబ్ద వినియోగ చాతుర్యానికి గొప్ప ఉదాహరణ.

దానము లెన్ని యే నచటి తైర్థిక భూసుర సంఘ మెల్ల డెం
దాన ముదమ్ము చెందఁగ నొనర్చి, దృఢవ్రతచర్య నిత్యముం
దానము చేయుచున్, హరికథా శ్రవణం బొనరించుచుండె నం
దా నముచి ద్విషత్తనయుఁ డాశ్రిత కల్పమహీరుహం బనన్. (చేమకూర 1.57)

ఈ పద్యంలో ‘న’ కారం, ‘మ’ కారం (దానము) అనే రెండు అక్షరాలు ద్విప్రాసగా కలవు. అర్జునుడు చేస్తున్న వ్రత దీక్షకు ఈ అనునాసిక అక్షరాల సాత్విక ధ్వని ఎంతో అనువైనది. పద్యం ‘దానము’తో మొదలై, ‘డెందానము’, ‘దానము’ (స్నానము), ‘నముచి’ అంటూ సాగుతుంది. ఇందులో ఆది ప్రాసతో కూడిన ద్విప్రాస రావడం వల్ల అర్జునుడు చేసే దానధర్మాలు, వ్రతచర్యలు ఏదో ఒక రోజుతో ఆగిపోయేవి కావు, అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి అనే భావన కలుగుతుంది. అలాగే ద్విప్రాస పద్యానికి ఒక రకమైన ‘బిగువు’ను ఇస్తుంది. ఈ అక్షర బంధం అర్జునుడి మనస్సులోని దృఢత్వాన్ని, చలించని ధర్మనిష్ఠను శబ్ద రూపంలో చూపిస్తుంది.

ఇక్కడ దా‘నము’ అనే అనునాసిక ధ్వని అర్జునుడిలోని శాంత రసాన్ని, ధర్మ నిరతిని, సాత్విక గుణాన్ని పటిష్టం చేసింది. అక్షరాల మృదుత్వం, పునరావృతం ద్వారా కవి 'ఆశ్రిత కల్పవృక్షం' వంటి అర్జునుడి దాతృత్వాన్ని శబ్దబద్ధం చేశారు. ఈ ద్విప్రాస వినియోగం వల్ల పద్యం చదువుతున్నప్పుడు పాఠకుడికి ఒక రకమైన ధ్యానపూరితమైన అనుభూతి కలుగుతుంది. ఇది అక్షర రమ్యతకు, కవి శబ్ద పరిజ్ఞానానికి ఒక నిదర్శనం.

2.4. త్రి చతుష్ప్రాసలు

త్రిప్రాసంబన మూడక్షరంబులు ప్రాసంబిడి చెప్పునది” అని నిర్వచనం (కవిజనాశ్రయం 9). అనగా ప్రాసాక్షరంతో పాటు తర్వాత మరో రెండక్షరాలు కూడా ప్రాసగా చెల్లిస్తే ‘త్రిప్రాస’ అవుతుంది. ప్రాసాక్షరంతోపాటు తర్వాత మూడక్షరాలు (అంటే మొత్తం నాల్గక్షరాలు వరుసగా) ప్రాసగా చెల్లిస్తే చతుష్ప్రాస అవుతుంది.

త్రిప్రాస - కవిజనాశ్రయ లక్ష్యం:

కం. దానమున సత్యమున నభి
మానమునం బోల్ప నీసమానము ధరణిం
గాన మనం త్రిప్రాసము
దాన మనోహర మగును బుధస్తుతచరితా ! (కవిజనాశ్రయం 9)

రేచన ఇచ్చిన లక్ష్యాన్ని బట్టి ద్వి, త్రిప్రాసలు పాద చతుష్టయమున ఉండాలనే అర్థం. కాని పాదద్వయ, పాదత్రయములందు మాత్రమే ఉన్నను ద్విత్రిపాసములు సౌందర్య హేతువులు కాకమానవు (పాటిబండ 174).

విజయవిలాసంలో చేమకూర వెంకట కవి త్రి-చతుష్ప్రాసలను చాలా అరుదుగా ప్రయోగించారు. నాలుగు పాదాల్లో నిర్వహించిన త్రిప్రాస ఒక్కటి కూడా కనపడడం లేదు. మూడు పాదాల్లో, రెండు పాదాల్లో ప్రయోగించిన పద్యాలు కొన్ని కలవు. అన్నీ పాదాల్లో ప్రయోగించిన చతుష్ప్రాస పద్యం విజయ విలాసంలో లేదు. రెండు పాదాల్లో నిర్వహించిన పద్యాలు కలవు. కావున “రెండు, మూడు చరణాలందే కనిపించే ద్వంద్వాది ప్రాసములు యాదృచ్ఛికములని త్రోసివేయనక్కరలేదు. యాదృచ్ఛికమైననూ అవి యథాశక్తి ఛందమునకు శ్రవ్యత కలిగించునవియే” (పాటిబండ 174) అను పాటిబండ వారి అభిప్రాయం ప్రకారం ఈ క్రింది పద్యాన్ని విజయ విలాసం నుండి తీసుకొని సమన్వయం చేస్తున్నాను.

'విహరించున్ మలయానిలం బిచటఁ; తావిం జిల్కి నెమ్మేని యా
విహరించున్; బికి నాదముల్ చెవికిఁ గావించుం జవుల్; పోద మా
సహకారాళి పదంబుఁ జూడఁగ వయస్యా! హాళి వాటిల్లెడున్
స హకారాళి పదంబుఁ జూడఁగ వయస్యా హాళి! యౌనే కదా!' (చేమకూర 2.53)

త్రిప్రాస: మొదటి రెండు పాదాలు: విహరించున్.

చతుష్ప్రాస: చివరి రెండు పాదాలు: సహకారాళి. ఈ రెండు పాదాలు మొత్తం దాదాపు ఒకే ప్రాసలో సాగాయి.

ఇక్కడ 'హ' కారం ప్రాసలో ప్రధాన భూమిక పోషిస్తుంది. 'హ' అనేది ఊష్మ వర్ణం. ఇది ఒక రకమైన 'విశ్రాంతిని' లేదా 'ఆహ్లాదాన్ని' ధ్వనింపజేస్తుంది. వసంత కాలంలో మలయమారుతం వీస్తూ, కోయిలలు కూస్తూ ఉంటే మనసుకి కలిగే సంతోషాన్ని వర్ణించడానికి కవి ఎంచుకున్న ఈ త్రిప్రాస మలయమారుతం ‘విహరించడం’, శరీర తాపం ‘హరించడం’ (తొలగిపోవడం) లోని మెల్లని తీరును ప్రతిబింబిస్తుంది.

చివరి రెండు పాదాల్లో కవి చతుష్ప్రాసను ఉపయోగించారు. తియ్యని మామిడి చెట్ల వరుసను చూడాలనే ఉత్సాహాన్ని దాదాపుగా పాదాంతం పాటించిన ప్రాస ద్వారా కవి చక్కగా ఆవిష్కరించారు. ఈ పద్యంలోని త్రిప్రాస, చతుష్ప్రాసలు కేవలం కవి పాండిత్యాన్ని ప్రదర్శించడానికి మాత్రమే కాకుండా, వసంత కాలపు ఆహ్లాదాన్ని శబ్ద రూపంలో నిక్షిప్తం చేయడానికి వాడబడ్డాయి. ‘హ’ కార ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాసలు పాఠకుడి మనస్సులో ఒక మధురమైన హాయిని కలిగిస్తాయి.

2.5. అనుప్రాస

అనుప్రాసంబన్నది ప్రాసాక్షరంబు పెక్కెడల నిడి చెప్పునది” అని నిర్వచనం (కవిజనాశ్రయం 9). వర్ణసామ్యం అనుప్రాస. అనగా ప్రాసాక్షరంతో సమానమైన అక్షరాన్ని పద్యంలో విరివిగా ఉపయోగిస్తే అనుప్రాస అవుతుంది. అనుప్రాస అనే శబ్దాలంకారంలో ఏ అక్షరాన్నైనా ఇలా ఉపయోగించవచ్చు. కాని షడ్విధ ప్రాసల్లోని అనుప్రాసలో ప్రాసాక్షరాన్నే ఉపయోగించాలి, ఇదే ఈ రెండింటికి భేదం.

కవిజనాశ్రయ లక్ష్యం:

కం. విత్రస్తాఘ పవిత్ర చ
రిత్ర జితత్రి దశవర ధరిత్రీనుత స
న్మి త్రాంబుజ మిత్రగుణా
మత్ర యనుప్రాస మిదియ మల్లియరేచా (కవిజనాశ్రయం 9)

ఈ లక్ష్యంలో ప్రాస స్థానంలో ఉన్న ‘త్ర’ అనే అక్షరం పద్యంలో పలుమార్లు ఆవృత్తం అయ్యింది. కావ్యాలలో కేవలం అర్థం మాత్రమే కాకుండా, అక్షర విన్యాసం కూడా భావ వ్యక్తీకరణలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ప్రాస అక్షరాన్ని కేవలం ఛందస్సు కోసం వాడతారని అనుకుంటారు. కానీ, సందర్భానుసారంగా ఈ ప్రాస అక్షరం ద్వారా కూడా ఒక్కో రకమైన భావోద్వేగాన్ని వెల్లడిస్తాడు కవి. చిత్రాంగద గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెలో కలిగే మార్పులను వర్ణించే ఈ పద్యంలో ‘అనుప్రాస’ అద్భుతమైన భావశబలతను కలిగి ఉంది.

మించెన్ బోరచి కోరికల్; కడు విజృంభించెన్ దనుగ్లాని; కా
న్పించెన్ మేచక కాంతి చూచుకములన్; జెక్కిళ్లపైఁ దెల్పు రె
ట్టించెన్; గూర్కులు సందడించె; నడ చండించెన్; మృదామోదము
న్గాంచెన్ వాతెఱ; యోసరించెఁ త్రివళుల్ నానాఁటికిన్ బోటికిన్. (చేమకూర 2.36)

ఇక్కడ ‘పూర్ణ బిందువు పూర్వక చకార’ ఆవృత్తి ఒక రకమైన మెత్తదనాన్ని, ఆర్ద్రతను కలిగిస్తుంది. గర్భవతి అయిన చిత్రాంగద శరీరంలో కలిగే మార్పులను, ఆమె అలసటను వివరించడానికి ఈ మృదువైన అనుస్వార ధ్వని ఎంతో చక్కగా సరిపోయింది. ప్రాస స్థానంలో ఉన్న ‘చ’ కారం, దానితో కూడిన అనుస్వారం ఇక్కడ ఒక లయను సృష్టిస్తున్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు మార్పులు ఒక్కసారిగా రావు, అవి క్రమంగా పెరుగుతాయి. 'మించెన్', 'విజృంభించెన్' వంటి పదాల్లోని అనుస్వార ధ్వని ఆ మార్పుల గాఢతను, నిశ్శబ్దంగా లోలోపల జరుగుతున్న తీరును సూచిస్తున్నాయి. ఇక్కడ చిత్రాంగద సౌకుమార్యాన్ని, గర్భధారణ సమయంలో ఆమె పొందే ‘తనూగ్లాని’ (శరీరపు అలసట) ని తెలపడానికి ‘చ’ వంటి సరళాక్షరాన్ని అనుస్వారంతో కలిపి ప్రయోగించారు. ఇది పద్యానికి ఒక రకమైన ‘మాధుర్యాన్ని’ చేకూర్చింది. కావున ప్రాస అక్షరం కేవలం అలంకారం మాత్రమే కాదు, అది ఆ సందర్భంలోని పాత్ర స్థితిని ప్రతిబింబించే ధ్వని తరంగం. ఈ పద్యంలో ‘పూర్ణ బిందువు పూర్వక చకార’ ప్రాస చిత్రాంగద గర్భవతిగా ఉన్నప్పటి కోమలత్వాన్ని, ఆమెలో కలిగే సహజమైన మార్పుల సౌందర్యాన్ని ధ్వనింపజేస్తుంది. కేవలం వర్ణన కోసమే కాకుండా, శబ్దాల ద్వారా గర్భవతి శారీరక, మానసిక స్థితిని, చిత్రాంగదలోని మాతృత్వ వికాసాన్ని ప్రతిబింబించడంలో కవి చూపిన ప్రతిభ ఇక్కడ ప్రశంసనీయం.

2.6. అంత్యప్రాస

అంత్యప్రాసంబన్నది మొదటి పాదము కడపటి అక్షరంబు నాలుగు పాదంబుల కడపట నిడి చెప్పునది” అని కవిజనాశ్రయకర్త పేర్కొన్నారు (కవిజనాశ్రయం 9). పాదాదిలో ప్రాసను పాటించినట్లే పాదాంతంలో పాటిస్తే అది పాదాంతంలో పాటించబడింది కావున అంత్యప్రాస అవుతుంది. పాదాదిలో ఉన్న ప్రాసాక్షరమే అంత్యప్రాసలో ప్రాసాక్షరం కావాలి అనే నియమం లేదు.

కవిజనాశ్రయ లక్ష్యం:

కం. జనమత భీమతనూజా !
సునయార్పిత విభవతేజ సుభగమనోజా !
వినుత విశిష్ట సమాజా!
యన సంత్యప్రాస మగున హర్పతి తేజా ! (కవిజనాశ్రయం 9-10)

ఈ పద్యంలో ‘జా’ అను అక్షరం అంత్య ప్రాసగా ప్రయోగించబడింది. ఈ అక్షరంలో వ్యంజన సామ్యం, స్వర సామ్యం ఉన్నాయి. “ప్రాసలో వలె వ్యంజనసామ్యము ఉన్నంత మాత్రమున అంత్యప్రాసకు చాలదు” (పాటిబండ 181). ఈ లక్షణ - లక్ష్యం ప్రకారం సాధారణ ప్రాసలో ఉన్నట్టుగా కేవలం వ్యంజనసామ్యం మాత్రమే కాదు స్వరాలు కూడా అంత్య ప్రాసలో సమంగా ఉండాలి.

లాక్షణికుల అభిప్రాయం ప్రకారమే విజయ విలాసం నుండి ఈ క్రింది పద్యాన్ని గ్రహించాను.

సీ. తన యరు ణాధరంబునకు నీ డివి యన్న
రమణ నేఱిచి పల్లవములు కొన్ని,
తన తనూసౌరభంబునకు జో డివి యన్న
చందాన వెదకి పుష్పములు కొన్ని,
తన మధు రాలాపమునకు దీ టివి యన్న
పగిది నారసి తియ్యఁబండ్లు కొన్ని,
తన లేనగవు తేటకును బాటి యివి యన్న
పోల్కిఁ దేఱిచి హిమాంబువులు కొన్ని. (చేమకూర 2.133)

ఈ సీస పద్యంలో అంత్యప్రాస విన్యాసం అత్యంత మనోహరంగా, లయబద్ధంగా సాగింది. సీస పద్యంలోని ప్రతి పాదం చివర ద్విత్వ ‘న’ కారం (న్ని) అంత్యప్రాసగా వాడబడింది.

ఆ బాలమృగీనయన (సుభద్ర) అర్జునుడికి వస్తువులను సమర్పిస్తున్నప్పుడు ఉండే సున్నితత్వాన్ని ఈ ధ్వని ప్రతిబింబిస్తుంది. సాత్విక భావంతో కూడిన ఉపచారాలను వివరించడానికి ఇటువంటి మృదువైన అక్షరాల పునరావృతం ఎంతో అవసరం. పల్లవములు కొన్ని, పుష్పములు కొన్ని, పండ్లు కొన్ని, నీరు కొన్ని ఇలా విడివిడిగా పేర్కొనడం వల్ల ఆమె చేస్తున్న పరిచర్యలోని విన్యాసం కనిపిస్తుంది. అన్నీ ఒకేసారి కాకుండా, దేనికదే ప్రత్యేకంగా సేకరించినట్లు ఈ అంత్యప్రాస ధ్వనింపజేస్తుంది. తన పెదవులకు సాటి చిగుళ్లు, మేని వాసనకు సాటి పువ్వులు అని ప్రతి వస్తువును తన అంగ సౌందర్యంతో పోల్చడంలో ఉన్న ముగ్ధత్వాన్ని ఈ లయబద్ధమైన ‘కొన్ని’ అనే పదం బలపరుస్తుంది. ఇక్కడ ద్విత్వ ‘న’ కారంగా ఉన్న అంత్యప్రాస నాయిక వినయాన్ని, ఆమె చేసే ఉపచారాలలోని సౌందర్యాన్ని ఆవిష్కరించింది.

ప్రతి పాదం చివర ఒకే అక్షరాలు ప్రాసగా రావడం వల్ల, ఆ సుభద్ర వస్తువులను ఒక్కొక్కటిగా తెచ్చి అర్జునుడి ముందు అమర్చుతున్నట్లుగా ఒక దృశ్యం మనకు శబ్దం ద్వారా వినిపిస్తుంది. ఈ అంత్యప్రాస పద్యానికి నాద కాంతిని ప్రసాదించింది. ఇది కవి రస దృష్టికి, శబ్ద సంస్కారానికి గొప్ప నిదర్శనం.

ఉపసంహారం

ఛందస్సులో ప్రాసలు పాటించటం భావాన్ని నాదరూపంలో సజీవం చేసే సాహిత్య శక్తులని చెప్పవచ్చు. కవి వాటిని యుక్తంగా వినియోగించినప్పుడు మాత్రమే కవిత్వం శిల్పపరమైన పరిపూర్ణతను దాటి, హృదయాన్ని తాకే అనుభూతిగా మారుతుంది. ఈ దృక్పథమే తెలుగు పద్య సాహిత్యం మహత్తును నిలబెట్టిన ఆధారం.

చేమకూర వెంకటకవి విజయ విలాసంలో ఈ షడ్విధ ప్రాసలు కేవలం శిల్ప నైపుణ్య ప్రదర్శనగా కాకుండా, భావ రసాలకు అనుకూలంగా సజీవంగా ప్రయోగించబడ్డాయి. సుకరప్రాసలో లాలిత్యం, దుష్కరప్రాసలో గాంభీర్యం, ద్విప్రాసలో చలనం, అనుప్రాసలో మాధుర్యం, అంత్యప్రాసలో లయబద్ధత వంటి అనుభూతులు కలిగే విధంగా కావ్యంలోని వివిధ సందర్భాలలో సహజంగా మేళవించబడి, శబ్దానికి అర్థానికి మధ్య సమతుల్యతను సాధించాయి. దక్షిణాంధ్ర యుగంలో శబ్దాలంకారాలు అధికం అవ్వడం వల్ల ఏర్పడిన రసహీనతకు విరుద్ధంగా, విజయ విలాసం శబ్దాన్ని రసానికి అనుగుణంగా ప్రయోగించి, శబ్దానికి అర్థానికి మధ్య సమతుల్యత ఎంత అవసరమో చూపించిన విలక్షణ కావ్యంగా నిలిచిందని చెప్పవచ్చు.

  • విజయ విలాసంలో షడ్విధ ప్రాసలు కావ్యం రసపోషణకు, భావ వ్యక్తీకరణకు దోహదపడ్డాయి.
  • చేమకూర వెంకట కవి పాటించిన శబ్దచమత్కారం, రస సమతుల్యత కావ్యవిశిష్టతను పెంచాయి.
  • కావ్యంలోని సందర్భాలకు అనుగుణంగా ప్రాసల ప్రయోగం, పాఠకుల అనుభూతిని మెరుగుపరుస్తుంది.
  • ఈ విశ్లేషణ, తెలుగు పద్య సాహిత్యంలో శబ్ద శిల్ప ప్రాధాన్యత, దాని ఔచిత్యాన్ని స్పష్టం చేస్తుంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. ధర్మారావు, తాపీ.(1968). విజయవిలాసము. హృదయోల్లాస వ్యాఖ్య. శివాజీ ప్రెస్. సికింద్రాబాదు.
  2. నాగయ్య, జి. (2021). తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటి). నవ్య పరిశోధక ప్రచురణలు. హైదరాబాదు.
  3. రేచన, మల్లియ. (1966). కవిజనాశ్రయం. వావిళ్ళ ప్రెస్. మద్రాస్.
  4. మాధవశర్మ, పాటిబండ.(1966). ఆంధ్రమహాభారతము - ఛంధఃశిల్పము. శివాజీ ప్రెస్. సికింద్రాబాదు.
  5. రాజు, ఎన్. ఎస్.(1983). ఛందో వ్యాసావళి. శ్రీనివాసా ప్రింటర్స్. హైదరాబాదు.
  6. వెంకట కవి, చేమకూర. (2005). విజయ విలాసం. ఎమెస్కో ప్రచురణలు. విజయవాడ.
  7. శ్రీరామరాజు, నడుపల్లి. (1985). తెలుగులో ఛందోవిశేషములు. శ్రీసత్యప్రచురణలు, హైదరాబాద్.
  8. సంపత్కుమారచార్య, కోవెల. (2011). తెలుగు ఛందస్సులో వెలుగులు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాదు.
  9. సంపత్కుమారచార్య, కోవెల. (2012). ఛందః పదకోశం. తెలుగు అకాడమి. హైదరాబాదు.
  10.  పైదే. (1990). తెలుగు ఛందోవికాసము. తెలుగు అకాడమి. హైదరాబాదు.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image