headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. నరసింహ శతకం: విష్ణు అవతారాల వర్ణన

కడారి సాయిసురేశ్

పరిశోధకులు, తెలుగు శాఖ,
శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్,
కరీంనగర్ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 8639925732, Email: ksaisuresh085@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 13.04.2026        ఎంపిక (D.O.A): 28.04.2026        ప్రచురణ (D.O.P): 01.05.2026


వ్యాససంగ్రహం:

ప్రస్తుతపరిశోధన “నరసింహశతకం: విష్ణు అవతారాల వర్ణన” శీర్షికతో ఏకవింశతి అవతారాలు, వాటిలో ముఖ్యమైన దశావతారాలు నరసింహ శతకంలో ఏ విధంగా వర్ణించబడ్డాయి విశ్లేషించడం ఈ పరిశోధన వ్యాస ముఖ్య ఉద్దేశం. విష్ణు అవతారాల వర్ణనతో పాటు శేషప్పకవిపై పోతన ప్రభావం వంటి అంశాలపై ఈ పరిశోధన దృష్టి సారించింది. ఔచిత్యంలోని తెలుగు శతకసమీక్షణంలో భాగమైన “నరసింహశతకం: వస్తువైవిధ్యం” మొదలైన పూర్వ పరిశోధనాలు, జి. నాగయ్య, నండూరి సుబ్బారావు, వంగూరి సుబ్బారావు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, సముద్రాల లక్ష్మణయ్య వంటి విమర్శలు, రచనలు అధ్యయనంలో కీలక పాత్ర పోషించాయి. ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా పోకల గంగాధర్ అనే వ్యక్తిని కలిసి నరసింహ శతకాన్ని సేకరించను. ద్వితీయ సమాచారం కోసం తెలుగు అకాడమి, తిరుమల తిరుపతి దేవస్థానములు, నవ్య పరిశోధక ప్రచురణలు, కమల్ కుటీర్ (పవర్) ప్రెస్ ప్రచురణలు, అంతర్జాల వనరులను ఉపయోగించుకున్నాం. తెలుగు సాహిత్యంలో ఎన్నో వందల వేల శతకాలు వచ్చయి. ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఎందరో కవులు శతకాలు రాశారు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే. ప్రతి శతకకవి ఆత్మ ఆ శతకంలో ప్రతిబింబిస్తుంది. కేవలం శతకం కావ్యారంభానికి ప్రథమ అధ్యయన క్రియ అనే భావన నుంచి ఉపదేశాత్మక వస్తువులు ఎన్నుకునే స్థాయికి శతకం ఎదిగింది. శతక సాహిత్య ప్రక్రియలో శతక కవులు భక్తి, నీతి, వైరాగ్య, వ్యాజస్తుతి, అధిక్షేప, వేదాంత, శృంగార, హాస్య, పకీర్ణ, కథాత్మక మొదలైన కోణాలలో శతకాలు రాశారు. కానీ శేషప్ప కవి భక్తి మార్గంలో నరసింహ శతకాన్ని రాసిన తన అంతిమ లక్ష్యం మాత్రం జీవన ముక్తి. నరసింహ శతకంలో మనకు భక్తి, నీతి, వైరాగ్య, వ్యాజస్తుతి, అధిక్షేప, వేదాంత మొదలైన అనేక కోణాలు కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం తాను అతి దుర్భరమైన జీవితం మరియు ఎన్నో అవమానాలను ఎదుర్కోవటం, ఎన్నో వివక్షలను ఎదుర్కోవటం మొదలైన విషయాలు మనకు శతకంలో అడుగడుగునా ప్రత్యేక్షంగా కాకపోయినా పరోక్షంగా కనబడతాయి. అందుకే ఒకానొక సందర్భంలో భగవంతున్ని దూషించడానికి కూడా వెనకడుగు వేయలేదు. కావున ఈ శతకంలో అణువణువున ఆత్మాశ్రయ ధోరణి కనబడుతుంది. ఈ విధంగా ఒక శతకంలో అనేక కోణాలు ఉండడం శతకం గొప్పదనాన్ని పెంచుతుంది. సంస్కృత భాగవతంలో, తెలుగు భాగవతంలో విష్ణుమూర్తి ఏకవింశతి అవతారాలును వేద వ్యాసుడు, బమ్మెర పోతన వర్ణించారు. నరసింహ శతకంలో ధర్మపురి శేషప్పకవి విష్ణుమూర్తి సంబంధించిన ఎన్ని అవతారాల గురించి వర్ణించాడు. ఏ విధంగా వర్ణించాడు. మహిమాలను ఏ విధంగా కొనియడాడు అని తేల్చి చెప్పడమే ఈ పరిశోధన వ్యాసం ముఖ్య ఉద్దేశం.

Keywords: శేషప్ప, నరసింహ శతకం, పోతన, భాగవతం, ఏకవింశతి, దశావతారాలు, భక్తి, ముక్తి.

1. ప్రవేశిక

“శతకం సర్వజనాదరణీయమైన శక్తిమంతమైన సాహిత్య ప్రక్రియ” (నాగయ్య 545). ఈ మాటలు అక్షర సత్యాలు. శతక పద్యాలలో సాధారణ భాష, జీవిత సత్యాలు, జీవన మార్గపు విలువలు, పూర్వీకుల అనుభవాలు అనే ఎన్నో రకాల విషయాలు నిక్షిప్తమై ఉంటాయి. ప్రజలు వాటిని తమ జీవితాలకు అన్వయించుకుంటారు.

ధర్మపురి శేషప్ప కవికి ప్రాచీన నీతి, వైరాగ్య, భక్తి శతకాలతో గాఢ పరిచయం ఉంది. భాగవతం శేషప్ప కవిని అత్యంత ప్రభావితం చేసింది. భగవంతునిపై భక్తితో, భాగవత భక్తుల కోవలోకి తనను చేర్చుకున్నాడు. అందుకే “నీకు వీరంద రయినట్లు నేనుగాన” (శేషప్ప 79) అనే ప్రశ్నార్థకాన్ని సైతం వెల్లడించాడు. శ్రీమన్నారాయణుని అవతార వైశిష్ట్యాన్ని, మహిమలను కొనియాడాడు. భగవంతుని నమ్మడం ద్వారానే మోక్షం లభిస్తుందనే భావనను వ్యక్తం చేశాడు. నరసింహ శతకంలో శేషప్ప కవి భగవంతుని కథలను సందర్భానుసారంగా వర్ణించాడు. శేషప్ప కవి ఆదినారాయణ అవతారాలను ఏ విధంగా వర్ణించాడో వివిధ ప్రామాణిక గ్రంథాలను చదివి, విశ్లేషణాత్మక పరిశోధన పద్ధతి ద్వారా విశ్లేషించగా ఈ పరిశోధన వ్యాసం రూపొందింది.

2. ధర్మపురి శేషప్ప పరిచయం

గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో ఉంది. అటువంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో సుమారు 1800 ప్రాంతంలో ధర్మపురి శేషప్ప కవి నివసించాడు. శేషప్ప కవి అత్యంత దుర్భరమైన జీవితాన్ని ఎదుర్కొన్నట్లు ఐతిహ్యాలు చెబుతాయి. నరసింహ శతకంలో అడుగడుగునా అదే భావన కనబడుతుంది. దీనికి తోడు ఆధ్యాత్మిక చింతన, ఆచంచలమైన భక్తి, భక్తి పరిణతి అనే విశేష గుణాలు, ప్రాచీన కావ్యాలు, శతకాలతో కవికి ఉన్న పరిచయం వల్ల అమోఘమైన ధారాశుద్ధి ఏర్పడింది. శేషప్ప చదువుకోలేదు అనడానికి ఆధారాలు లేవు.

సీ. పద్మలోచన! సీసపద్యముల్‌ నీమీఁదఁ

జెప్పఁ బూనితినయ్య!చిత్తగింపు

గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁగలేదు

పంచకావ్య శ్లోకపఠన లేదు

అమరకాండత్రయంబరసి చూడఁగలేదు

శాస్త్రీయ గ్రంథముల్‌ చదువలేదు

నీ కటాక్షంబుననే రచించెదఁ గాని

ప్రజ్ఞ నాయది గాదు ప్రస్తుతింపఁ

తే. దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె

చెఱకునకు వంకపోయిన చెడునె తీపు?

భూషణవికాస! శ్రీధర్మపురనివాస!

దుష్టసంహార ! నరసింహ ! దురితదూర! (శేషప్ప 4)

నరసింహ స్వామీ! నేను నీ మీద సీస పద్యాలను చెప్పడానికి పూనుకున్నాను. నాకు ఛందోశాస్త్రంలోని గణాలు, యతులు, ప్రాసల మీద ఏ విధమైన పట్టులేదు. పంచకావ్య శ్లోక పఠన లేదు. అమరకోశంలోని మూడు భాగాలను అసలు నేను అభ్యాసం చేయలేదు. శాస్త్రీయ గ్రంథాలు చదవలేదు. కేవలం నీ కటాక్షంతోనే పద్యాలు రాయడానికి సిద్ధమయ్యాను. ఈ రచనలో ఏమైనా తప్పులుంటే నీ మీద భక్తి తక్కువ ఉందని అర్థం కాదు. చెరుకు గడకు వంక ఉన్నా తీపి తక్కువ అవుతుందా! అటువంటిదే నా భక్తి. శతక కర్తలు అందరూ వినయంతో తమకు ఏదీ తెలియదని చెప్పుకుంటూ ఉంటారు. కానీ శేషప్ప కవికి ఎన్నో రకాల శాస్త్రాలు, వేదాలపై అవగాహన ఉంది. నరసింహ శతకంలో ఎన్నో రకాల ఉపనిషత్తు రహస్యాలు కూడా ఉన్నాయని పద్యాలు చదువుతూ ఉంటే తెలుస్తుంది. శతకంలో ద్విపాద మకుటం శతకానికి అత్యంత శోభను సమకూర్చింది. కేవలం మకుటం చదువుకుంటే చాలు భగవంతుని కృప దక్కుతుందనే భావన ప్రసిద్ధి చెందింది. మహత్తరమైన భావనను శతక మకుటంలో కేంద్రీకరించిన ఘనత శేషప్ప కవిది.

“ఇది చాలా జనసమ్మతి పొందిన శతక రాజము” (వంగూరి సుబ్బారావు 439). నరసింహ శతకం సామాన్య జనులను, పండితులను ఇలా సర్వజనాన్ని ఆకర్షించింది. అనేక రకాల జానపద కళారూపాలు నీతి బోధనకు నరసింహ శతక పద్యాలను స్వీకరించాయి. చదువు రాని వారు సైతం ఈ సీస పద్యాలను అలవోకగా పాడుకుంటూ ఉంటారు. గ్రామాలలో భజన చేసేటప్పుడు నరసింహ శతకంలోని పద్యాలు లేకుండా అది సంపూర్ణం కాదు. ఇంతటి మహత్తర అదృష్టం కొంతమంది శతక కవులకు మాత్రమే దక్కింది.

శేషప్ప కవి “నరసింహ శతకము, నృకేసరీ శతకము, అవనిజా చరిత్ర, ధర్మపురి రామాయణము” (సుంకిరెడ్డి నారాయణరెడ్డి 455) అనే రచనలను చేశాడు.

3. విష్ణుమూర్తి అవతారాల వర్ణన

నరసింహ శతక ప్రధాన ఉద్దేశం నరసింహ స్వామి అవతారాన్ని కొనియాడటం మాత్రమే. నరసింహస్వామి విష్ణుమూర్తి అవతారం కాబట్టి, విష్ణుమూర్తి ఇతర అవతారాల కథలను, ఆ కథలలోని భక్తుల కథలను అత్యంత సూక్ష్మంగా, శతక లక్షణాలను విస్మరించకుండా శేషప్ప కవి తన శతకంలో వర్ణించాడు. భాగవతంలో పేర్కొన్న ఏకవింశతి అవతారాలలో ప్రసిద్ధి చెందిన, జనుల హృదయాలను దోచుకున్న కథా భాగాలను మాత్రమే తన శతకంలో వర్ణించాడు.

3.1. నారాయణ అవతారం

శ్రీమహావిష్ణువు అన్ని అవతారాలకు మూలం ఆదినారాయణ అవతారం. “అది సకలావతారంబులకు మొదలి గనియైన శ్రీమన్నారాయణ దేవుని విరాజమానంబయిన దివ్యరూపంబు” (నండూరి సుబ్బారావు 24). ఈ ఆదినారాయణ అవతారం నుండే అన్ని అవతారాలు ఉద్భవించాయి. అటువంటి భగవంతుడు నారాయణ అవతారంలో చేసిన మహిమల గురించి శేషప్ప కవి ఏ విధంగా చెప్పాడో చూద్దాం.

“మదగజం బెన్నిచ్చె మౌక్తికములు” (శేషప్ప 79)

“మకరిచే జిక్కి సామజము దుఃఖింపగ గృప యుంచి వేగ రక్షించినావు” (శేషప్ప 82)

పోతన భాగవతంలోని అష్టమస్కందంలో ఉన్న గజేంద్రమోక్షం, ప్రపంచంలో ఏ జీవి అయినా తనలోని అరిషడ్వర్గాలను జయించిన తర్వాతనే భగవంతుడు ఆ జీవి ఎదుట ప్రత్యక్షమవుతాడనే భావనను కలిగిస్తుంది. ఆ గజేంద్రమోక్ష ఘట్టంలోని భావనను నరసింహ శతకంలో శేషప్ప కవి కొనియాడుతూ, అధిక్షేపిస్తూ, గజేంద్రుడు నీకు ముత్యాలహారాలు ఇచ్చాడు. మకరి బారిన పడి ఆ గజేంద్రుడు దుఃఖిస్తూ ఉండగా, నీవు ఆ గజేంద్రాన్ని రక్షించావు. కాబట్టి దీన స్థితిలో ఉన్న నన్ను కూడా రక్షించు అని ఆదినారాయణుడిని ప్రార్థించాడు.

“ఆదినారాయణా యనుచు నాలుకతోడ p>బలుక నేర్చినవారి పాదములకు సాష్టాంగముగ నమస్కార మర్పణ జేఁసి ప్రస్తుతించెదనయ్య బహు విధముల” (శేషప్ప 7)

పైన ఉదాహరించిన పద్యంలో 'ఆదినారాయణా' అనే శబ్దాన్ని బట్టి శేషప్ప కవి ఏకవింశతి అవతారాల ఆధారంగానే ఈ శతకంలో ఆదినారాయణ స్వామి ఇతర అవతార లీలలను వర్ణించాడని స్పష్టమవుతుంది. శేషప్ప కవి సంపూర్ణ వైష్ణవ భక్తితో, ఎవరైతే నిన్ను మనసారా ఆదినారాయణా అని పిలుస్తారో, అటువంటి వారికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను, వారిని పొగుడుతూ ఉంటాను అని కవి ఆదినారాయణ నామ మంత్ర ప్రభావాన్ని ప్రస్తావించాడు.

3.2. మత్స్యావతారం

ఏకవింశతి అవతారాల పరంగా చూస్తే మత్స్యావతారం పదవది. దశావతారాల పరంగా చూస్తే మత్స్యావతారం మొదటిది. ఏకవింశతి అవతారాలలో ప్రసిద్ధమైనవే దశావతారాలు. మత్స్యావతారాన్ని శేషప్ప ఏ విధంగా కొనియాడాడో కింది పద్యంలో చూడవచ్చు.

సీ. మత్స్యావతారమై మడుగులోపల జొచ్చి

సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను

దెచ్చి వేదములెల్ల దేవ భూసురులకు

మెచ్చియిచ్చితి వీవు మేలునొంద

నా వేదముల నియ్య నాచార నిష్టల

ననుభవించుచు నుందు రవనిసురులు

సకల పాపంబులు సమసిపోవునటంచు

మనుజు లందరు నీదు మహిమఁ దెలిసి

తే. యుందురిటువంటివారు నీ యునికిఁ దెలియు

వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ!

భూషణవికాస ! శ్రీధర్మ పుర నివాస !

దుష్టసంహార ! నరసింహ ! దురితదూర ! (శేషప్ప 106)

పైన ఉదాహరించిన పద్యం కథాత్మకంగా కల్పాంతంలో బ్రహ్మ దేవుడు నిద్రిస్తున్న సమయంలో సోమకాసురుడు అనే అసురుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను అపహరించుకొని సముద్రంలో దాక్కుంటాడు అని వివరిస్తుంది. అటువంటి సమయంలో శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకాసురుని వధించి, వేదాలను తిరిగి బ్రహ్మ మొదలైన వారికి ఇచ్చావు. వారు నియమనిష్ఠలతో వాటిని అనుభవిస్తున్నారు. తద్వారా నీ మహిమలను భక్తులంతా తెలుసుకుంటున్నారు. నీ అవతార మహిమ తెలిసిన వారికి మోక్షం వస్తుంది అనే భాగవత భావనను నరసింహ శతకంలో శేషప్ప కవి వర్ణించాడు.

3.3. కూర్మావతారం

కూర్మావతార గొప్పదనాన్ని శేషప్ప కవి కేవలం రెండు పాదాలలో మాత్రమే చెప్పాడు. అసలు కూర్మావతారం లేకుంటే క్షీరసాగర మదన వృత్తాంతం ఉండేదే కాదు. దానవ వైరి అయిన శ్రీమన్నారాయణుడు కూర్మావతారం ధరించి, లోక శ్రేయస్సు కోసం, దేవతలకు సంతోషం కలిగేలా మందార పర్వతాన్ని వీపున ధరించి క్షీరసాగర మదన వృత్తాంతంలో పాల్గొన్నాడు.

“కూర్మావతారమై కుధరంబు క్రిందను గోర్కెతో నుండవా కొమరు మిగుల” (శేషప్ప 107)

క్షీరసాగర మదన వృత్తాంతంలో మందార పర్వతం కింద కూర్మావతారమై పర్వతానికి ఆధారంగా ఉన్నావు. ఈ సూక్ష్మ భావనను శేషప్ప కవి గొప్ప అర్థంలో వాడాడు. పురాణ కథలు తెలిసిన వారికి ఆ రెండు పాదాలు చదవగానే పూర్తి అర్థం గుర్తుకు వస్తుంది.

3.4. వరాహ అవతారం

కూర్మావతారాన్ని వర్ణించిన విధంగానే వరాహావతారాన్ని కూడా రెండు పాదాలలోనే కొనియాడాడు. వరాహ, నరసింహ అవతారాలకు కారణం బ్రహ్మ మానస పుత్రులు సనకసనందాదులు. వీరు ఒకానొక రోజు శ్రీమహావిష్ణువు దర్శనానికి వైకుంఠం వెళ్ళిన సందర్భంలో వైకుంఠ ద్వారపాలకులు వారిని అడ్డుకుంటారు. అందుకు కోపించిన బ్రహ్మ మానస పుత్రులు ఆ ద్వారపాలకులను “దిట్టిరి దౌ వారికుల నసురయోని న, వారితులై పుట్టుఁడనుచు” (సముద్రాల లక్ష్మణయ్య 289) మీరు రాక్షసగర్భంలో మూడు పర్యాయాలు శ్రీమహావిష్ణువుకు శత్రువులుగా జన్మిస్తారు అని సనకసనందాదులు వారిని శపిస్తారు. ఈ కారణం వల్ల ఆ ద్వారపాలకులు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడిని సంహరించడానికి ఆదినారాయణుడు వరాహ రూపం ధరిస్తాడు. అదే విషయాన్ని శేషప్ప కవి కింది విధంగా చెబుతున్నాడు.

“వరహావతారమై వనభూములను జొచ్చి శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు” (శేషప్ప 107)

వరాహ అవతారం ధరించి, సముద్రంలోకి దూకి హిరణ్యాక్షుడిని శిక్షించి భూదేవిని రక్షించిన వృత్తాంతం తెలుస్తుంది. భగవంతుని ఏ అవతారమైనా దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే నియమాన్ని అనుసరించి ఉంటుంది. తాను అవతరించిన ప్రతి అవతారంలోనూ అనేక లీలలతో, అనేక రూపాలతో భక్తులను కాపాడిన ఘనత ఆదినారాయణ స్వామిది.

3.5. నరసింహ అవతారం

నరసింహ అవతారం గురించి చెప్పాలంటే, శతకం మొత్తం నరసింహుని మహిమలు, ఆయన గొప్పదనం, ఆయన అలంకార శోభ అనే ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి ఈ శతకం నరసింహ స్వామిని దృష్టిలో ఉంచుకొని రాసింది కాబట్టి, నరసింహ అవతార ప్రత్యేకతను శేషప్ప కవి ఏ విధంగా కొనియాడాడో మాత్రమే వివరిస్తాను.

“బాల్య మప్పటినుండి భక్తి నీయందున గలుగను బ్రహ్లాద ఘను డగాను” (శేషప్ప 28)

“ప్రహ్లాదు డేపాటి పైడి కానుకలిచ్చె” (శేషప్ప 79)

“స్తంభమం దుదయుంచి దానవేంద్రుని ద్రుంచి కరుణతో ప్రహ్లాదు గాచినావు” (శేషప్ప 82)

“నరసింహమూర్తివై నరభోజను హిరణ్య కశిపుని ద్రుంపవా కాంతిమీఱ!” (శేషప్ప 107)

పైన పేర్కొన్న వివిధ పద్య పాదాలను చూస్తే, హిరణ్యకశిపుడిని సంహరించడానికి ధరించిన అవతారం నరసింహావతారం అని తెలుస్తుంది. ఈ ఘట్టంలో ప్రహ్లాదుని భక్తి వర్ణించలేనిది. అటువంటి ప్రహ్లాదుని భక్తితో శేషప్ప కవి తనను తాను పోల్చుకుంటూ, ప్రహ్లాదుడు నీకు ఏ కానుకలు ఇచ్చాడు? నీవు స్తంభం నుండి ఉద్భవించి హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించావు కదా అనే అధిక్షేపాత్మక భావనతో నరసింహావతార గొప్పదనాన్ని పొగడటం, ప్రహ్లాదుడు మొదలైన భక్తులతో నేను నీకు సమానం కాదా అనే సందేహార్థక భావాన్ని కవి వెల్లడించాడు. ప్రహ్లాదుని భక్తి భావాన్ని, శేషప్ప కవి భక్తిని పోల్చి చూసుకుంటూ భగవంతుడిని స్మరించడం కనబడుతుంది. ఈ విధంగా నరసింహ అవతారం గొప్పదనాన్ని కవి ప్రశంసించాడు.

“నరసింహ! నీదివ్య -నామ మంత్రముచేత దురిత జాలము లెల్ల ద్రోలవచ్చు” (శేషప్ప 6)

పైన ఉదాహరించిన పద్యపాదం ద్వారా నరసింహ నామ విశిష్టతను, ఔన్నత్యాన్ని కవి వెల్లడించాడు. నరసింహ నామాన్ని జపించడం వల్ల పాపాలు, కఠినమైన వ్యాధులు, శత్రు బాధలు తొలగడంతో పాటు యమధర్మరాజు భటులను సైతం తారుమారు చేయవచ్చు. వైకుంఠంలో కూడా స్థానాన్ని సంపాదించవచ్చు. అంత మహత్తర శక్తి నరసింహ మంత్రంలో ఉంది అని కవి వివరించాడు.

3.6. వామన అవతారం

వామనావతార వైశిష్ట్యాన్ని శేషప్ప కవి మూడు పద్యాలలో సూక్ష్మంగా వివరించాడు. ఈ సూక్ష్మతే స్థూల అర్థాన్ని స్మరణకు తెస్తుంది.

“వాంఛతో బలిచక్రవర్తి దగ్గరఁ జేరి భిక్ష మెత్తితి వేల - బిడియపడక!” (శేషప్ప 81)

“మధుకైటభారి! నీ మాయసమర్ధత వసుధలో బలిచక్ర వర్తి కెరుక” (శేషప్ప 99)

“వామనరూపమై వసుధలో బలిచక్ర వర్తి నణంపవా వైరమూవి” (శేషప్ప 107)

పైన ఉదాహరించిన పద్యపాదాలు చదవగానే, వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తిని దానం కోరడం, రెండు అడుగులలో విశ్వమంతటా నిండిపోవడం, మూడవ అడుగు బలిచక్రవర్తి శిరస్సుపై మోపి పాతాళ లోకానికి తొక్కివేయడం అనే భగవంతుని లీలను కవి అతి సూక్ష్మంగా వివరించాడు. శతకాలు ముక్తకాల వంటివి. ఏ పద్యానికి ఆ పద్యం, ఏ పాదానికి ఆ పాదం ప్రత్యేకమైన అర్థాన్ని వ్యక్తీకరిస్తాయి అనే లక్షణాన్ని కవి అత్యంత అద్భుతంగా పాటించాడు.

3.7. రామ అవతారం

రామావతారంలోని రాముని మహిమలను, ధర్మాన్ని శేషప్ప కవి నరసింహ శతకంలో కింది విధంగా వివరించాడు.

“అహల్య నీకే యగ్ర హారమిచ్చె ఉడుత నీకేపాటి యూడిగంబులు చేసె ఘనవిభీషణుడేమి కట్న మిచ్చె” (శేషప్ప 80)

“సావధానముగ నీ చరణపంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిఁగాను” (శేషప్ప 28)

“అడవిలో శబరి తీయని ఫలా లందియ్య జేతు లొగ్గితి వేల - సిగ్గుపడక!” (శేషప్ప 81)

“శరణంచు నా విభీషణుడు నీ చాటుకు వచ్చినప్పుడె లంకనిచ్చినావు” (శేషప్ప 82)

అహల్యకు శాపవిమోచనం చేసిన కథాఘట్టాన్ని వివరించే సందర్భంలో, ఆమె నీకు అగ్రహారాలిచ్చిందా, ఆమెకు శాపవిమోచనం ఎందుకు చేశావు? ఉడుత నీకు ఏం సహాయం చేసింది? కేవలం ఇసుక రాల్చినందుకు దాని జన్మ ధన్యమైపోయింది. విభీషణుడు నీకు కట్నాలు ఇచ్చాడా? శత్రుపక్షం వాడు శరణు వేడి నిన్ను చేరినందుకు అభయాన్ని ఇచ్చావు. లంకను కూడా ఇచ్చావు. నన్ను ఎందుకు కాపాడడం లేదు? నేను నీ భక్తుడిని కాదా అనే వాదన కూడా భగవంతుడితో చేశాడు. తులనాత్మకంగా తన జీవితాన్ని, భాగవత భక్తుల జీవితాన్ని పోల్చుకోవడం కనిపిస్తుంది. అలాగే శబరి దగ్గరికి వచ్చే వరకు సీతను వెతుక్కుంటూ అడవి మార్గంలో వెళుతూ, శబరి కనబడగానే ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించావు. ఆమె ఎంగిలి పండ్లను పెట్టినా సిగ్గుపడకుండా తిన్నావు. నీ పాదసేవ చేసుకుంటే పుణ్యాన్ని ప్రసాదించావు. నీవు భక్తులకు ఇచ్చేవాడివా, భక్తుల దగ్గర నుండి తీసుకొని తినేవాడివా అని అధిక్షేపించడం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా రామావతారంలోని పలు విధాలైన భక్తుల కథలను శేషప్ప కవి ప్రస్తావించాడు.

3.8. కృష్ణావతారం

కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు చేసిన లీలల గురించి, మిత్ర ధర్మం గురించి శేషప్ప కవి ఈ విధంగా చెప్పాడు.

“ఆ కుచేలుడు చారె డటుకు లర్పించిన బహు సంపదలనిచ్చి బంపినావు” (శేషప్ప 82)

“పంచ పాండవులు ఏమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చె” (శేషప్ప 80)

అడగకుండానే అటుకులు తెచ్చినందుకు నీ చిన్ననాటి స్నేహితుడికి సంపదలిచ్చావు. పాండవులకు మహాభారతంలో సహాయం చేశావు. ద్రౌపదిని కాపాడావు. ఈ విధంగా శ్రీకృష్ణుడి ఔన్నత్యాన్ని పొగుడుతూనే, మరి నన్ను ఎందుకు కాపాడడం లేదు అనే భావాన్ని కవి వ్యక్తం చేశాడు.

4. నరసింహ శతకంలో పేర్కొనని అవతారాలు

శేషప్ప కవి ఏకవింశతి అవతారాలలో ఆదినారాయణ అవతారాన్ని, దశావతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, రామ, కృష్ణ అనే ఎనిమిది అవతారాలను మాత్రమే వర్ణించాడు. పరశురామ, బలరామ, కల్కి అనే మూడు అవతారాలను పేర్కొనలేదు. పరశురామ అవతారాన్ని శతకంలో చెప్పే వెసులుబాటు లేదు. పరశురాముడు ఉగ్ర స్వరూపం. నరసింహ శతకం మొత్తం భక్తికి సంబంధించింది. కాబట్టి ఉగ్రం, రౌద్రం కలిగిన పరశురాముడిని శతకంలో వర్ణించే అవకాశం కవికి ఉండకపోవచ్చు. బలరామ అవతారాన్ని పేర్కొనకపోవడానికి కారణం, బలరాముడు కృష్ణుడికి సమాంతరం. అందుకే బలరాముడికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. మరొక కారణం, బలరాముడిని కొందరు ఆదిశేషుడి అవతారంగా భావిస్తారు. కాబట్టి బలరాముడిని శేషప్ప కవి తీసుకొని ఉండకపోవచ్చు. మిగిలిన కల్కి అవతారం ఇంకా రాలేదు కాబట్టి దాని గురించి కవి ప్రస్తావించి ఉండకపోవచ్చు.

5. పోతన ప్రభావం

విష్ణుమూర్తి అవతారాలను వర్ణించడంలో శేషప్ప కవిపై భాగవత ప్రభావం, పోతన ప్రభావం అధికంగా ఉంది. ఉదాహరణకు, పోతన భాగవతం సప్తమస్కందం, ప్రహ్లాద చరిత్రలోని ప్రహ్లాదుడి భక్తితో సమానంగా తన భక్తిని పోల్చుకున్నాడు. “మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే మదనములకు ... వినుత గుణశీల, మాటలు వేయునేల?” (నండూరి సుబ్బారావు) అనే పద్యాన్ని అనుకరిస్తూ—

సీ. ఇభకుంభములమీఁది కెగిరెడి సింగంబు

ముట్టునే కుఱచైన మూషికమును

నవచూత పత్రముల్ నమలుచున్న పికంబు

కొఱకునే జిల్లేడు కొనలునోట

అరవింద మకరంద మనుభవించెడి తేఁటి

పోవునే పల్లేరు పూలకడకు

లలితమైన రసాల ఫలముఁ గొర్కెడి చిల్క

మెసవునే భ్రమత నుమ్మెత్తకాయ

తే. ఇలను నీ కీర్తనలు పాడ నేర్చినతఁడు

పరుల కీర్తనఁబాడునే యరసి చూడ

భూషణవికాస! శ్రీధర్మపుర నివాస !

దుష్టసంహార ! నరసింహ ! దురితదూర ! (శేషప్ప 85)

పోతన భావాన్ని కొన్ని మార్పులతో యథాతథంగా అనుకరించాడు. ఈ ఒక్క కారణం చాలు శేషప్ప కవిపై భాగవత ప్రభావం ఏ విధంగా ఉందో తేల్చి చెప్పడానికి. అయితే శేషప్ప కవి రచించిన ఈ పద్యంలో మొదటి పాదాన్ని చూస్తే, ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళిలోని కొంత ప్రభావం కొద్దిగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సీస పద్యంలో పోతన శైలి అనుకరించిన విధానమే బహుళం. పోతన మామిడి చిగురులను తినే కోకిల కొండమల్లెల దగ్గరికి పోతుందా అంటాడు. దానిని శేషప్ప కవి, మామిడి చిగురులను తినే కోకిల జిల్లేడు ఆకుల దగ్గరికి పోతుందా అంటాడు. మందార మకరందం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్త పూల దగ్గరికి పోదు అని పోతన అంటే, శేషప్ప కవి అరవింద మకరందం అనుభవించే తేనెటీగ పల్లేరు పువ్వుల దగ్గరికి పోదు అంటాడు. ప్రహ్లాదుడు ఏ విధంగా భగవంతుని చింతనామృతంలో ఇతర విషయాల పట్ల వ్యామోహం చెందకుండా ఉన్నాడో ఆ భావాన్ని పోతన తెలియజేస్తే, అదే భావాన్ని శేషప్ప కవి కూడా తెలియజేశాడు. మకరంద, లలిత, రసాల అనే పదాలను కూడా సందర్భానికి తగ్గట్టు శేషప్ప కవి ప్రయోగించాడు. 

ఉపసంహారం

  • ప్రాచీన కాలం నుండి ఎన్నో భక్తి శతకాలు వచ్చాయి. కానీ భక్తి శతకాలలో నరసింహ శతకానికి లభించినంత గౌరవం మరే శతకానికి దక్కలేదంటే అది అతిశయోక్తి కాదు. 100 పద్యాలతో రచించబడిన ఈ శతకం అత్యంత జనాదరణ పొందింది. భక్తి శతకాలలో పాటించే 108 అనే సంఖ్య నియమాన్ని మరిచినప్పటికీ, శతకంలోని ధారాశుద్ధి, భక్తితత్త్వం వల్ల ఆదరణ లభించి పాఠకుల నాలుకలపై స్థిరంగా నిలిచిపోయింది. శతకంలోని ప్రతి పద్యంలో ఆత్మశ్రయరీతి కనబడుతుంది.
  • భగవంతుని లీలలను వర్ణించే భాగవత ప్రభావం ఈ శతక రచయితపై అమితంగా ఉందని ఈ పరిశోధన తెలుపుతుంది.
  • రచయితకు వివిధ ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలపై ఉన్న అవగాహనను ఈ శతకం తెలుపుతుంది.
  • అడుగడుగునా భక్తితో పాటు అధిక్షేపం కనబడుతుంది.
  • ఈ శతకం పూర్తిగా వైష్ణవ భక్తితో రాయబడింది. త్రిమూర్తులలో బ్రహ్మను శేషప్ప కవి రెండు మూడు సార్లు తలుచుకున్నాడు. అది కూడా విష్ణువు గొప్పదనాన్ని కీర్తించడానికి మాత్రమే. శివుడిని కూడా ఒకసారి మాత్రమే తలుచుకున్నాడు. శివుడు కూడా నీ నామ భజన చేస్తాడు, నీ నామ భజన మహత్యం శివుడికి మాత్రమే ఎరుక అనే అర్థంలో శేషప్ప కవి వాడాడు.
  • శేషప్ప కవి కేవలం ముక్తి కోసమే ఈ శతకం రాశాడని అనిపిస్తుంది.
  • భగవంతుడిని చేరుకోవడానికి భక్తి ఒకటే మార్గమని, నవవిధ భక్తి మార్గాలలోని శ్రవణం, కీర్తనం, స్మరణ అనే పద్ధతులలో శతక రచయిత పద్యాలను గానం చేశాడు.

పాదసూచికలు

  1. “తెలుగు సాహిత్య సమీక్ష”, ద్వితీయ సంపుటం. నాగయ్య, జి. పుట సంఖ్య :545
  2. నరసింహ శతకం. శేషప్ప. పుట సంఖ్య:79
  3. శతక కవుల చరిత్ర. సుబ్బారావు, వంగూరి. పుట సంఖ్య:439
  4. ముంగిలి – తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర. నారాయణరెడ్డి, సుంకిరెడ్డి. పుట సంఖ్య :455
  5. పోతన భాగవతం. సుబ్బారావు, నండూరి, పుట సంఖ్య :24
  6. శ్రీమహాభాగవతం. లక్ష్మణయ్య, సముద్రాల. పుట సంఖ్య : 289

ఉపయుక్త గ్రంథసూచి

  1. నాగయ్య, జి.2021. “తెలుగు సాహిత్య సమీక్ష”, ద్వితీయ సంపుటం(ఎనిమిదవ ముద్రణ). నవ్య పరిశోధక ప్రచురణలు, హైదరాబాదు
  2. నారాయణరెడ్డి, సుంకిరెడ్డి. 2022. “ముంగిలి – తెలంగాణ ప్రాచీన సాహిత్య చరిత్ర”(ద్వితీయ ముద్రణ). తెలుగు అకాడమి, హైదరాబాదు
  3. శేషప్ప. 1971. నరసింహ శతకం. గొల్లపూడి వీరాస్వామి సన్స్, రాజమండ్రి.
  4. సుబ్బారావు, నండూరి. 2015. “పోతన భాగవతం” (ఏడవ ముద్రణ). తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
  5. సుబ్బారావు, వంగూరి. 1957. “శతక కవుల చరిత్ర”(ప్రథమ ముద్రణ). కమల్ కుటీర్ (పవర్) ప్రెస్, నరుసాపురం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]