headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-05 | May 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

1. అందెశ్రీ కవిత్వం : అస్తిత్వవేదన

ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి

ఆచార్యులు, తెలుగుశాఖ,
యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప,
వైయస్సార్ కడప జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 8328296952, Email: eswaryvu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 10.04.2026        ఎంపిక (D.O.A): 25.04.2026        ప్రచురణ (D.O.P): 01.05.2026


వ్యాససంగ్రహం:

అందెశ్రీ అనే పేరుతో ప్రసిద్ధి చెందిన అందె ఎల్లయ్య కవిత్వం విశ్లేషణ ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం. ఆయన 'జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం' లాంటి రాష్ట్ర గీతాలను రచించి, మానవీయ విలువలు క్షీణిస్తున్న తరుణంలో వాటిని కవిత్వీకరించిన ప్రజాకవి. శిథిలమవుతున్న గ్రామీణ జీవితం, తెలంగాణ అస్తిత్వ పోరాటం, సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, మానవ సంక్షోభాలు లాంటి విభిన్న స్థానిక ప్రపంచ అంశాలను తన కవిత్వానికి వస్తువుగా స్వీకరించారు. అందెశ్రీ గేయకవిగా ప్రసిద్ధులు, వచన కవిత్వంలో లయను సాధించడం ఒక ప్రత్యేకత. ఈ వ్యాసం అందెశ్రీ కవిత్వంలో విస్తరించి ఉన్న అస్తిత్వ భావనల వైవిధ్యాన్ని పరిశీలించడం లక్ష్యం. అస్తిత్వం అనే భావన వివిధ కాలాల్లో శాస్త్రాల్లో అనేక తత్వవేత్తలు, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల చర్చకు కేంద్రమైంది. René Descartes 'నేను ఆలోచిస్తున్నాను, కాబట్టి నేను ఉన్నాను' అనగా, Jean-Paul Sartre అస్తిత్వవాదాన్ని మానవతావాదంగా పేర్కొన్నాడు. Viktor Frankl మనిషికి అర్థాన్వేషణే జీవిత ధ్యేయం అంటాడు. Aristotle మానవుడిని రాజకీయ జీవిగా గుర్తించాడు. Charles Darwin జీవ పరిణామ క్రమంలో మానవ ఉనికిని వివరించాడు. Abraham Maslow స్వీయ సాకారాన్ని అస్తిత్వ లక్షణంగా భావించాడు. వ్యాసుడు ఆత్మనే నిజమైన అస్తిత్వంగా చెప్పాడు. ఈ వివిధ దృక్పథాలు ప్రస్తుత పరిశోధన సైద్ధాంతిక నేపథ్యంగా నిలుస్తాయి. ఈ పరిశోధన కోసం అందెశ్రీ రచించిన 'అందెల సందడి' కవితా సంకలనం ప్రధాన వనరు. భగవద్గీత, డా.ఎన్.ఈశ్వర రెడ్డి 'సాహిత్య మతం-సమాజ హితం', పాశ్చాత్య తత్వవేత్తల రచనలు లాంటి గ్రంథాలు ఉపయుక్త గ్రంథాలు. పరిశోధనలో విశ్లేషణాత్మక దృక్పథం తాత్విక సామాజిక విమర్శ పద్ధతులను అనుసరించబడింది. ఈ వ్యాసం అస్తిత్వం నిర్వచనం దాని భిన్న కోణాలను వివరిస్తుంది. అనంతరం అందెశ్రీ కవిత్వంలో చైతన్యం, దేవుడి ఉనికి, మనిషి ఉనికి, వ్యక్తిగత స్థాయి అస్తిత్వం, కళ ఉనికి, కవిత్వ బాధ్యత, జాతీయ ప్రయోజనాలు, విశ్వమానవ చైతన్యం లాంటి అంశాలను విశ్లేషిస్తుంది. అందెశ్రీ తన కవిత్వం ద్వారా మూఢనమ్మకాలు, కులమత వైషమ్యాలు, అవినీతి రాజకీయాలు, యుద్ధాలు, పేదరికం లాంటి సామాజిక రుగ్మతలను ప్రశ్నించాడు. నిజమైన మానవ అస్తిత్వం చైతన్యంలో, శాస్త్రీయ దృక్పథంలో, శ్రమ సౌందర్యంలో, మానవ సేవలో ఉందని చాటిచెప్పాడు. అట్టడుగు వర్గాల నుండి వచ్చి అనేక కష్టాలను అనుభవించిన అందెశ్రీ, తన కవిత్వంలో మానవీయతనే పరమ ప్రమాణంగా స్వీకరించాడు. స్థానిక సమస్యల నుండి అంతర్జాతీయ మానవ సంక్షోభాల వరకు విభిన్న కోణాల నుండి మనిషి అస్తిత్వాన్ని దర్శించి, దాని రక్షణకు మార్గాలను సూచించాడు. ఈ పరిశోధన అందెశ్రీ కవిత్వంలో లోతైన తాత్విక సామాజిక అస్తిత్వ కోణాలను ఆవిష్కరిస్తుంది.

Keywords: అందెశ్రీ, కవిత్వం, అస్తిత్వం, తెలంగాణ సాహిత్యం, ప్రజాకవి, మానవీయత, సామాజిక విశ్లేషణ, చైతన్యం, అస్తిత్వవాదం

1. పరిచయం

అందెశ్రీ పేరుతో ప్రఖ్యాతుడైన సహజ శ్రామిక కవి అందె ఎల్లయ్య. ‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం’ అంటూ ఒక రాష్ట్ర గీతానికి ఊపిరి పోసిన ప్రజా కవి. మనిషిలో మానవీయ లక్షణాలు మృగ్యమై పోతున్న సందర్భాన్ని కవిత్వం చేసిన సామాన్యుల్లో అసమాన్యుడైన గీత రచయిత. మాయమైపోతున్న మనిషి జాడ కోసం, మచ్చుకైనా కానరాని మానవత్వం కోసం ఆర్తితో వెతుకులాట సాగించిన భువన పాంథుడు అందెశ్రీ. శిథిలమై పోతున్న గ్రామీణ జీవితాన్ని చూసి ‘పల్లె నీకు వందనమమ్మా’ అంటూ విలపించిన ఊరిబిడ్డ.

ప్రత్యేక తెలంగాణ పోరాట ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వ గొంతుకను వినిపించిన జనోద్యమ కవి అందెశ్రీ. భారతీయ సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ, మార్పు కోసం తపన పడిన అభ్యుదయ కవి, ప్రగతిశీలి అందెశ్రీ. విభిన్న అస్తిత్వాల మధ్య స్థానిక సమస్యల నుండి అంతర్జాతీయ మానవ సంక్షోభాల దాకా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మనిషి ఔన్నత్యాన్ని నిలబెట్టాలనే తపనతో పరిశ్రమించిన కవి చంద్రుడు అందెశ్రీ.

ఈయన గేయకవిగా ప్రసిద్ధుడు. వచన కవిగా కొంతమందికే తెలుసు. అయితే, వచనంలో కూడా లయను సాధించిన వాడు అందెశ్రీ. అందెశ్రీ కవిత్వంలో విస్తిరించి ఉన్న విభిన్న అస్తిత్వాలను పరిశీలించడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.

2. ప్రధాన అంశాలు

2.1 అస్తిత్వం - భావన

అస్తిత్వం అనే పదాన్ని తరచూ వింటూ ఉంటాం. కుల అస్తిత్వంగా, ప్రాంతీయ అస్తిత్వంగా తరచూ పత్రికల్లో చూస్తూ ఉన్నాం. ‘అస్తిత్వము’ అనే పదానికి ఉనికి, ఉండుట అనే అర్థాలు ఆంధ్రశబ్ద రత్నాకరము నిఘంటువు ప్రకారం కనిపిస్తాయి.

అస్తిత్వం (Existence) అంటే వ్యక్తి తాను ఉన్నాననే అవగాహన, తన జీవితం, అనుభవాలు, బాధలు, ఆనందాలు, ఆశలు, భయాలు ఇవన్నీ కలిపి ఏర్పడే స్వీయ చైతన్యం. “నేను ఎవరు? ఎందుకు ఉన్నాను? నా జీవితం అర్థం ఏమిటి?” అనే ప్రశ్నలకు వ్యక్తి తన అంతరంగంలో వెతికే సమాధానమే అస్తిత్వ భావనగా గుర్తిస్తాం. తెలుగు సాహిత్యంలో వచ్చిన వాదాలు, ఉద్యమాలు అస్తిత్వ నేపథ్యంలో వచ్చినవిగానే గుర్తించాలి.

మానవ అస్తిత్వాన్ని (“human existence”) నిర్ధారించే ఏకైక శాస్త్రీయ సూత్రం ఏదీ లేదు. ఇది తత్వశాస్త్రం, మనోవిజ్ఞానం, జీవశాస్త్రం, సామాజికశాస్త్రం వంటి అనేక శాస్త్రాల వెలుగులో నిర్ధారించాల్సిన విషయం. అందుకే “మానవ అస్తిత్వం అంటే ఏమిటి? దానికి ఆధారం ఏమిటి?” అనే ప్రశ్నకు వివిధ ఆలోచనాపరులు కొన్ని ప్రామాణిక సూత్రాలను, సిద్ధాంతాలను రూపొందించారు. వాటిలో ముఖ్యమైనవి ఇవి:

2.2 అస్తిత్వం - వివిధ కోణాలు

మనిషి అస్తిత్వాన్ని ప్రఖ్యాత సామాజిక, మనోవిజ్ఞాన, తత్వ శాస్త్రవేత్తలు విభిన్న కోణాల్లో చెప్పే ప్రయత్నం చేశారు. వారిలో కొందరి ఆలోచనలు ఇలా ఉన్నాయి.

  1. ఫ్రెంచ్ తత్వవేత్త René Descartes (1596-1650) “Cogito, ergo sum (I think, therefore I am) “నేను ఆలోచిస్తున్నాను, కాబట్టి నేను ఉన్నాను” అనే సిద్ధాంతాన్ని అస్తిత్వ ఉనికి తెలియజేయడానికి ఉపయోగిస్తాడు. దీన్నిబట్టి ‘చైతన్యం అస్తిత్వానికి ప్రాథమిక సాక్ష్యం’గా గుర్తించాలి.
  2. మరో ఫ్రెంచ్ నవలా రచయిత, తత్వవేత్త Jean-Paul Sartre (1905-1980) “Existentialism is a Humanism” (అస్తిత్వ వాదాన్ని ఒక మానవతా వాదంగా పేర్కొంటాడు). మనిషి ముందుగా ఈ ప్రపంచంలోకి వస్తాడు; తర్వాత తన నిర్ణయాలు, చర్యల ద్వారా తన స్వరూపాన్ని నిర్మించుకుంటాడని పేర్కొంటాడు.
  3. ఆస్ట్రియన్ మనో విజ్ఞాన శాత్రవేత్త Viktor Frankl (1905-1997) తన Man's Search for Meaning గ్రంథంలో మనిషి అర్థాన్ని వెతికే జీవి అంటాడు. మనిషి ప్రధాన లక్ష్యం సుఖం కాదు, అధికారమూ కాదు. జీవితానికి అర్థం కనుగొనడమే ప్రధానం అంటాడు. అంటే మనిషి అస్తిత్వం జీవిత అర్థాన్ని కనుగొనడంలో ఉందని భావించవచ్చు.
  4. ప్రఖ్యాత గ్రీకు తత్వవేత్త, శాస్త్రవేత్త అయిన Aristotle (384-322 BCE) తన Politics గ్రంథంలో ‘Man is by nature a political animal’ (మనిషి స్వభావరీత్యా రాజకీయ జీవి) అంటాడు. మనిషి ఒంటరిగా కాదు; సమాజంతో, సంబంధాలతో, నైతిక వ్యవస్థలతోనే అస్తిత్వం సంపూర్ణమవుతుందంటాడు.
  5. ప్రఖ్యాత జీవ పరిణామవాద సిద్ధాంతకర్త Charles Darwin (1809-1882) తన పరిణామ సిద్ధాంతం ద్వారా మానవ అస్తిత్వాన్ని తెలిపే ప్రయత్నం చేశాడు. మానవుడు ప్రత్యేకంగా ఒక్కసారిగా సృష్టించబడలేదని, జీవ పరిణామ క్రమంలో ఇతర జాతుల నుండి అభివృద్ధి చెందాడని అంటాడు.
  6. అమెరికన్ మనో విజ్ఞాన శాస్త్రవేత్త, తత్వవేత్త అయిన Abraham Maslow (1908-1970) “Self-Actualization” (స్వీయ సాకారం) గురించి చెప్తూ ‘మనిషి ప్రాథమిక అవసరాలు తీరిన తర్వాత, తన సామర్థ్యాన్ని పూర్తిగా వికసింపజేయాలనే తపన కలిగి ఉంటాడు. ఇది అస్తిత్వానికి సంబంధించిన అంశంగా ఉంది.
  7. వ్యాసుడు (C.3100 BCE) అస్తిత్వం అంటే ఆత్మ అంటాడు. శరీరం నశించినా ఆత్మ నశించదు; నిజమైన మానవ అస్తిత్వం శరీరంలో కాదు, చైతన్యస్వరూపమైన ఆత్మలో ఉందని చెబుతాడు. (భగవద్గీత 2.20)

ఆదిమ కాలం నుండి, ఆధునిక కాలం వరకు అనేక మంది శాస్త్ర, తత్వవేత్తలు ఇలా మనిషి అస్తిత్వాన్ని విభిన్న కోణాల్లో చూశారు. 

2.3 కవిత్వంలో అస్తిత్వ భావన

నిజానికి వ్యక్తిగత స్వేచ్ఛ, బాధ్యత, ఒంటరితనం, నిరాశ, ఆశ, అర్థాన్వేషణ వంటి అంశాలతో అస్తిత్వం ముడిపడి ఉంటుంది. అంతేగాక, అస్తిత్వాన్ని వ్యక్తిగత, కుటుంబ, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో, విభిన్న ప్రమాణాలతో చూడవచ్చు.

వ్యక్తిగత జీవితంలో సుఖ సంతోషాలు, ఆర్థిక స్వేచ్ఛ, సాంఘిక హోదా, సామాజిక గౌరవం, అధికారంలో భాగస్వామ్యం మొదలైనవి ఉన్నప్పుడు వ్యక్తి మూర్తిమత్వం ఒక రకంగా కనిపిస్తే, అవి లేనప్పుడు మరో రకంగా కనిపిస్తుంది. అన్నీ ఉన్నచోట మనిషి ఎలాంటి ఉద్వేగాలకు, ఉద్రిక్తతలకు లోను కావాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ లేని చోట, పీడన, అణచివేత, దోపిడి మొదలైనవి ప్రభలి మనిషిని అస్తిత్వ పోరాటంలోకి నెట్టేస్తుంది.

20, 21 వ శతాబ్దాలలో ప్రపంచాన్ని ఆవరించిన అనేక అమానవీయ అణచివేతలను, ప్రపంచీకరణ ముసుగులో విశీర్ణమై పోతున్న మానవతా విలువలను, ప్రపంచ స్థాయిలో జరుగుతున్న దౌర్జన్యాలను స్వయంగా చూసి, అనుభవించి వాటిపై గళమెత్తిన అందెశ్రీ కవిత్వ అస్తిత్వంపై కూడా వేదన పడ్డాడు. వ్యక్తి అంతర్మథనానికి కవిత్వం ఒక వేదిక. కవిత్వం వ్యక్తి లోపలి సంఘర్షణలను, ప్రశ్నలను వ్యక్తపరిచే శక్తివంతమైన మాధ్యమం. అస్తిత్వ కవిత్వంలో కవి తన ఒంటరితనాన్ని, తన బాధను, అన్వేషణను వ్యక్తపరచడం సహజం.

అస్తిత్వం ఆధునిక కవిత్వానికి ఆత్మ. వ్యక్తి ఉన్నతిని, బాధను, ప్రశ్నలను కవిత్వ రూపంలో నిలిపే శక్తి అస్తిత్వ భావనకే ఉంది. అందుకే అస్తిత్వ కవిత్వం కాలాన్ని దాటి నిలుస్తుంది. రాశిలో తక్కువే అయినా, వాసిలో తక్కువ కాకుండా కవిత్వం రాసిన అందెశ్రీ, మనిషి అస్తిత్వాన్ని నిర్ణయించే కులం, మతం, వర్గం, లింగం, పేద-ధనిక వ్యత్యాసం మొదలైన అనేక అంశాల నేపథ్యంలో రాసిన కవిత్వంలోని విషయాలను పరిశీలిద్దాం.

2.4 చైతన్యమే అస్తిత్వం

విక్టర్ ఫ్రాంక్ల్ చెప్పినట్టు ‘మనిషి అర్థాన్ని వెతికే జీవి’. అంటే మనిషి కార్య కారణ సంబంధం వెతికే జీవి. ఆ సంబంధాన్ని ఎత్తి చూపించగలిగేది శాస్త్రీయ చైతన్యమే. మనిషి చైతన్యమే అతని నిజమైన అస్తిత్వం. చైతన్యం కోల్పోయిన మనిషి ఉనికిని కోల్పోతాడు. ఉనికి కోల్పోవడానికి కారణమైన పరిస్థితులను మార్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ప్రశ్నించడం. ఉద్యమించడం. అదే చైతన్యం. ఆ చైతన్యం అందెశ్రీలో స్పష్టంగా కనిపిస్తుంది.

కలము కన్ను తెరిచింది గళమే గర్జించింది
కలం గళం బలం చూపనా నే ప్రళయమునై ప్రతిఘటించనా !
వేకువనై వెలుగు పంచి వెల్లువనై పల్లవించి
ప్రతి గుండెలో ప్రతిధ్వనించనా నే జాతిని జాగృతం చేయనా !
కన్ను మిన్ను కానలేక అడుగులేసే అజ్ఞానుల
ఆలోచింప చేయ తలపనా వారి మేధస్సుకు మేత వేయనా !
కులమతాల కల్లోలం మానవతకు హాలాహలం
తరతరాల దురంతాల తరిమి కొట్టనా..

అని అందెశ్రీ తన ‘చైతన్య బావుటా’ (4) కవితలో అంటాడు. అంతే కాకుండా బాధ్యతలను విస్మరించి బానిసలుగా బతకడానికి సిద్ధపడిపోయిన యువతరాన్ని మేల్కొలిపి కొత్త బాట పట్టిస్తానంటాడు. అవసరమైతే ప్రజల కోసం ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమంటాడు. శాంతి సమతకు మూలంగా నిలిచి, సకల జనులను సంఘటితం చేయడానికి చైతన్య బావుటాగా పైకి లేస్తానంటాడు. మానవ అస్తిత్వానికి నిజమైన రూపం చైతన్యమే అని నిరూపిస్తాడు అందెశ్రీ.

మనిషీ! ఓ మనిషీ! నీ నిద్ర నుండి లేవవోయ్, దేశ మనుగడ కోసం పాటుపడవోయ్ అంటూ చేసే హెచ్చరిక సమాజ మార్పుకు దారి చూపిస్తుంది.

వ్యసనాలకు బానిసవై విలాసాల సహచరుడవై
కులమతాల కుల్లులో ఒల్లుమరిచి కళ్ళుమూసి
ఎన్నాండ్లని ఎన్నేండ్లని ఎంతకని ఎందుకని
పెనుచీకటి కబంధహస్తాల కిందనే నలిగి పోతావా!?

అని ‘జాగోరే జాగో’ (అందెశ్రీ 5) కవితలో ప్రశ్నిస్తాడు. మనుషుల్లో వైయక్తిక ఘర్షణలు పెరిగిపోయి ‘మానవత్వాన్ని మంటగలిపేస్తూ, రాక్షసత్వాన్ని పెంచుకొని పెడదారులపై నడుస్తుంటే, ఈ ధాత్రి దెబ్బతింటుంటే అలా చూస్తూ ఊరికే కూర్చోకుండా, ఉగ్ర నరసింహమై మేలుకొమ్మని’ కర్తవ్య బోధ చేస్తాడు. అన్నపూర్ణ దేశంలో ఆకలి చావులను వినమంటాడు. దేశ బాగు కోసం ఉదయభానుడిలా లేవమంటాడు. 'విందు - మందు- పొందు' వ్యసనాల బురదలో ఊర పందిలా బతకవద్దని బుద్ధి చెప్తాడు. ప్రతి మనిషి వ్యక్తిగతంగా మారాలని, అప్పుడే దేశం మారుతుందని విశ్వసిస్తాడు. మనిషి అస్తిత్వాన్ని వ్యక్తిగత స్థాయి నుండి ప్రపంచ స్థాయిలో బేరీజు వేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎత్తి చెప్తాడు.

2.5 దైవ ఉనికిపై సందేహాలు

భారతీయ సంప్రదాయ సమాజంలో దేవుడికి ఉన్నంత ప్రాధాన్యం మనిషికి లేదు. ఈ సృష్టి సమస్తాన్ని దేవుడు సృష్టించాడని, మనుషులందరూ ఆ దేవుడి సృష్టిలో భాగమేనని భారతీయ సమాజం బలంగా విశ్వసిస్తుంది. అది నిజమైనప్పుడు దేశ ప్రజలందరూ ఎందుకు సమానంగా లేరు? ఎందుకు సంతోషంగా లేరు? అంటే దేవుడు కులమతాల పేరుతో, ఉన్నవాళ్లు లేని వాళ్ళు అని హెచ్చుతగ్గులతో ఇలా ఎందుకు విడదీశాడు? దేవుడికి అలా విడదీయాల్సిన అవసరం ఏముంది? అలాంటి హెచ్చుతగ్గులు చూపించేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఈ కోణంలో దేవుడి ఉనికిని ప్రశ్నిస్తాడు అందెశ్రీ.

దేవుడా నీవున్నావా? లేక మనిషిలో భ్రమ నన్నవా? ఉంటే...నీ ఉంటే
భ్రమకాదనంటే కలియుగంబును... నేటి... కళ్ళు తెరచీ చూడు…
ధనపిచ్చితో నరులు ధర్మాన్ని తెగనరక
వర్ణాశ్రమ ధర్మాల పేర మానవాళిని చీల్చ
మతము పేరిట మనిషి కూర్మి ఓర్మిని గూల్చ
కట్నవాంఛతో స్త్రీని కష్టంబులన్ గాల్చ
చావు పుటకల మధ్య సారధీవై నావు దేవుడా!

అంటూ అందెశ్రీ (అందెశ్రీ) ప్రశ్నిస్తాడు. ఒకవేళ ఈ సృష్టిని తనే చేసి ఉంటే, విలోమ సమాజ సృష్టికర్త కూడా తానే అవుతాడు. అందుకే మానవ అస్తిత్వ ఉనికిని నిర్ణయించిన దేవుడు అసలు ఉన్నాడా? అని ప్రశ్నిస్తాడు.

2.6 మానవ ఉనికి - సామాజిక విశ్లేషణ

జీవ పరిణామవాద సిద్ధాంతకర్త డార్విన్ తన On the Origin of Species గ్రంథంలో పేర్కొన్నట్టు నిరంతర పోరాటంలో జంతుజాలం నుండి మానవ రూపం ఏర్పడింది. వేల సంవత్సరాల పరిణామ క్రమంలో మనిషి రూపం దాల్చిన జీవి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తాడు అందెశ్రీ.

పూర్వీకులు తవ్విన పునాదులను పునర్జన్మలను పేరుతో నింపి
భయభ్రాంతుల గోడలు పెట్టి పురాణ ఇతిహాసాల మేడలు కట్టి
స్వర్గము నరకము అను పేర్లు పెట్టి మానవతను మంటకల్పిన
మనుధర్మ శాస్త్రాలు మనకందని వేదాలు

అంటూ ‘ఇదేనా మన సంస్కృతి’ (అందెశ్రీ 1) కవితలో మనుషులు సృష్టించుకున్న లోతైన అగాధాలను, మూఢనమ్మకాలను, అశాస్త్రీయమైన అంశాలను మన ముందుంచుతాడు. శాస్త్రీయమైన ఆలోచన కలిగిన మనిషి మూఢ నమ్మకాల గుహ లోకి వెళ్లలేడు. మనిషి అస్తిత్వాన్ని సమానత్వం నుండి, స్వేచ్ఛ నుండి, సౌభ్రాతృత్వం నుండి వేరుచేసిన గతాన్ని ప్రశ్నిస్తాడు. గతాన్ని భద్రపరిచే పుక్కిటి పురాణ సంస్కృతిని వ్యతిరేకిస్తాడు. ఈనాటి సమాజం చీలికలు పీలికలు కావడానికి పాప పుణ్యాలు, స్వర్గ నరకాలు, పునర్జన్మలు, వర్ణ సిద్ధాంతాలు కారణం కాదా అని ప్రశ్నిస్తాడు.

ఉపనిషత్తులు ఊహకందని భావనలని, యజ్ఞ యాగాదులు వైదిక శిలాశాసనాలని, శత్రువుల దండయాత్రలు బలహీనులపై ఆధిపత్యానికి అవకాశం ఇచ్చాయని, శ్రామిక చైతన్య పోరాటాలు భూమిపై నిర్జీవ నినాదాలుగా పడిపోయాయని, ఈ చరిత్ర చెప్పే పాఠం ఇదేనని వాపోతాడు. ఇన్ని వైషమ్యాల మధ్య నలిగిపోతున్న మనిషి మానవత్వాన్ని కోల్పోతున్నాడని తెలియచెప్తాడు.

మనిషి మనిషి రాసుకొని ఇల అగ్గిపుల్లలా భగ్గుమంటే
మానవత్వము మంటగలిసి దానవత్వము నింగికెగసి
దారులే పెడదారులై ఈ ధాత్రిని కబళిస్తుంటే చూస్తూనే ఊరుకుంటే..

చివరికి మనిషి అనే స్పృహను కూడా కోల్పోతాడని అందెశ్రీ (అందెశ్రీ) తెలియచెప్పాడు. మనిషి అస్తిత్వ రక్షణలో ఇది ఒక ప్రధానమైన అంశం.

2.7 వ్యక్తిగత అస్తిత్వ పోరాటాలు

ప్రతి వ్యక్తికి ఒక వ్యక్తిత్వ స్థాయి ఉంటుంది. అది అతని ఆర్థిక, సాంఘిక, సామాజిక, విద్యాత్మక హోదాలతో పాటు, కొన్ని సందర్భాలలో శారీరక స్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. కుష్టు వ్యాధిగ్రస్తుడైన భిక్షగాడిపై అందెశ్రీ రాసిన కవిత భిక్షకుల అస్తిత్వాన్ని పట్టిస్తుంది.

‘పేదరికం, అనారోగ్యం మనిషిని భిక్షగాడిగా మారిస్తే... ఆ భిక్షగాడు కుష్టు వ్యాధిగ్రస్తుడైతే... ఆ భిక్షగాడి భార్య అతనిని ఒక మూరెడు చెక్క బండిపై కూర్చోబెట్టుకుని ఈడ్చుకుంటూ అడుక్కోవాల్సి వస్తే... చిరిగిన బట్టల్లో ఆమె వెలవెలబోతుంటే... ఆమె చుట్టూ కామాంధుల కళ్ళు కంచెలు కడుతుంటే’ ఎలాంటి వేదన ఉంటుందో కళ్ళ ముందు ఉంచాడు అందెశ్రీ. హృదయ విదారకంగా ఉన్న ఆ జీవితం, దాని చుట్టూ అల్లుకుపోతున్న సమస్యలను ముందుంచి మానవతా దృక్పథంతో ఆలోచించమంటాడు. అతని వ్యథను హృదయానికి హత్తుకుని 'సాదృశ్యం' పేరుతో అక్షరీకరించాడు అందెశ్రీ. కష్టాల్లో మనిషి ఉంటే కాసులు ఇవ్వడానికి మనసొప్పని వాళ్ళు, కనిపించిన దేవుళ్లకు ఎంతైనా ఖర్చు చేసి గుడులు కడతారని, కాశీ యాత్రలు, వెంకన్న ముడుపులు, అయ్యప్ప దీక్షలు చేస్తున్న మనుషులు మనిషిని పట్టించుకోకుండా పోవడాన్ని ఎత్తి చూపించి, "మానవసేవయే మాధవసేవ" అనే నినాదాన్ని గుర్తించమంటాడు. ఇక్కడ భిక్షగాడి అస్తిత్వం దిగజారిపోవడానికి, మనిషిని ఆదుకోవడం కన్నా రాళ్లు రప్పలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమే కారణంగా తేల్చేస్తాడు.

2.8 కళలో అస్తిత్వ ప్రతిబింబం

‘భూమిలోన పుట్టు భూసార మెల్లను, తనువులోనపుట్టు తత్వమెల్ల, శ్రమములోన పుట్టు సర్వంబు తానౌను’ అన్న వేమన చెప్పినట్టే, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి కళ శ్రమలోంచి పుట్టిందేనని అందెశ్రీ విశ్వసిస్తాడు. ప్రతి కళ వెనుక మనిషి ఆలోచన ఉందని, దాని ప్రతిఫలం కూడా మనిషికే సొంతమని నిర్ధారిస్తాడు.

గిరిపైన గురిపెట్టి ఉహలకు తలుపు తట్టి శిల్పి తన ఉలిబట్టి
శిలనంత చెక్కితే శిల్పాన్నై చిందులు వేస్తా సిరులెన్నో వొలక బోస్తా,
చిగురించే ఆశల్లో చిత్రాంగి ఊసుల్లో చిత్రకారుని కుంచెతో
రంగులెన్నో సింగారిస్తే చిత్రలేఖనై చిగురిస్తా హృదయాలను ఊగిస్తా
భావాలను బంధించి భాష్యాన్ని సూచించి కవి కలం సంధించి
ప్రతిస్పందన కల్గిస్తే కవితనై జనియిస్తా గీతాన్నై పల్లవిస్తా

అని అందెశ్రీ తన ‘నిష్ఠలో సృష్టి’ (అందెశ్రీ 2) కవితలో అంటాడు. ఈ కవితను చదువుతున్నప్పుడు ఈ మధ్యకాలం గేయకవి జయరాజు రాసిన ‘శిలా నీవే శిల్పీనీవే, శిల్పం నీవే ’ గేయం గుర్తుకొస్తుంది. శిల-శిల్పం, చిత్రకారుడు - చిత్రం, కవి- కవిత, స్వరం - గీతం ఇలా సృజన, అనుభవం అన్నీ మానవ సృష్టేనని, అందువల్ల కళ అస్తిత్వం కూడా మానవ శ్రమతో ముడిపడి ఉందని అందెశ్రీ అంటాడు. శ్రజీవనసౌందర్య మార్గాన్ని అస్తిత్వ ఉనికికి ప్రమాణంగా చూడడాన్ని గమనించవచ్చు.

2.9 కవిత్వ బాధ్యత - అస్తిత్వ దృక్పథం

కవిత్వానికి అస్తిత్వం ఉంటుంది. కవి ఆలోచనా స్థాయి, వైఖరి, నిర్మాణ నైపుణ్యం కవిత్వ అస్తిత్వానికి భూమిక. ‘మేధావుల మెప్పుకోసం వాస్తవాలను వక్రీకరించే కవిత్వం అది కవిత్వం ఎప్పటికీ కాదంటాడు. పక్క వాళ్ళను కాపీ కొట్టి రాసేవాడు కవే కాదంటాడు. ఎంతటి మహాకవులు రాసినా, ప్రజల్లోకి వెళ్ళని కవిత్వం కవిత్వమే కాదని, కర్మ జీవులకు కనువిప్పు కలిగించే కవిత్వమే అసలైన కవిత్వమని’ కవిత్వ అస్తిత్వాన్ని ప్రయోజనాత్మక కోణంలో రాస్తాడు అందెశ్రీ.

‘పాలకవర్గాలకు ఊడిగం చేయకుండా, ధనవంతులకు కాళ్ళు ఒత్తకుండా, ఎవరి ముందు తలవంచకుండా కవిత్వం నిలబడాలని’ కోరుకుంటాడు. తను అలాగే నిలబడే ప్రయత్నం చేశాడు. ఆకలి, పేదరికం ఎన్ని అవస్థలు పెట్టినా, ఎంతమంది నాయకులు ఎన్ని ప్రలోభాలు పెట్టినా తన సిద్ధాంతానికి తాను కట్టుబడి బతికిన మనిషి ఆయన.

కులాల కుట్రలు పన్నినా మతాల పేరిట మంటలు రేపినా
రిజర్వేషన్లాగ్నికి ఆజ్యం పోసినా అహింస కపోతాల నాహుతి చేసినా
విశ్వమాత గుండెల్లో విచ్చుకత్తులు గుచ్చినా వెచ్చని నెత్తురు ఏరులై దొర్లినా...

అని అందెశ్రీ తన ‘దండోరా’ (14) కవితలో నా కవిత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తాడు. ఇక్కడ డప్పును కవిత్వానికి ప్రతీక చేస్తాడు. 'వినకుంటే మీ బ్రతుకులు బట్టబయలు చేసి ప్రపంచానికి చాటి చెప్పు నా డప్పు' అని అనడంలో ప్రయోజనాత్మక కవిత్వ అస్తిత్వం కనిపిస్తుంది.

2.10 జాతీయ అస్తిత్వం - పాలన విమర్శ

ప్రతి దేశానికి సరిహద్దులు ఉన్నట్టే ప్రతి దేశానికి ఒక అస్తిత్వం ఉంటుంది. సంస్కృతి, నాగరికత, సంస్కారం, విలువలు, సంప్రదాయాలు, పరిపాలన మొదలైన అనేక అంశాలు దేశ అస్తిత్వంలో భాగమవుతాయి. ప్రజాస్వామ్య దేశంలో నాయకులు ప్రధాన భూమిక పోషిస్తారు. ప్రజల ద్వారా ఎన్నికైన ఈనాటి నాయకులు అన్ని వ్యవస్థలపై గుత్తాధిపత్యాన్ని చెలాయించాలని చూస్తున్నారు. అలా చలాయించే నాయకులు నీతి నిజాయితీలతో వ్యవహరిస్తే ఈ దేశం ముందుకు నడుస్తుంది. వారు స్వార్థపూరితంగా పరిపాలిస్తే దేశం కునారిల్లుతుంది. అలాంటి స్వార్థ నాయకుల కుతంత్రాలను ఎండగడుతూ..

వక్రనీతి చక్రవర్తులు ఆక్రమించిరీదేశం
'ఇజాల' పేర 'నిజాలు' మరిచి భుజాలు చరిచే ప్రబుద్ధు లదిగో
కుక్కలు చింపిన విస్తరిచేసి కుట్రల స్వార్థపు 'అత్తరు పూసి
దేశమాత 'అంగాంగం' దోచి ఎవనికి వాడే ‘దాచుకు' పోతే
ఏమౌతుందో ఈ దేశం ఎన్నాళ్ళోయ్ ఈ మోసం?
రాష్ట్రాలు రగులుతున్నా కాష్ఠాలు కాలుతున్నా
ఉగ్రవాదం ఉరుముతున్నా నక్సలిజం తరుముతున్నా
ఊసరవెల్లుల్లా రంగులు మార్చి ద్వంద నీతితో దగాలు చేసి
పదవుల కోసం ప్రభుత్వాలను పడదోస్తుందింకెవరన్నా? మీలో మీరే తోడుదొంగలు...

అని అందెశ్రీ ‘ఇది నిజం’ (11) కవితలో తెగేసి చెప్తాడు. ‘ప్రజలపై విపరీతమైన పన్నులు వేసి, సామాన్య జనం నడ్డి విరుస్తారని, వీళ్లు మాత్రం ప్రజల సొమ్ముతో జల్సాలు చేస్తారని, వ్యాపారులతో చేతులు కలిపి ధరలను పెంచేస్తారని, పదవుల కోసం పాకులాడుతూ ఒకరినొకరు లాగేసుకుంటారని, ఇలాంటి వాళ్లకు అన్నార్థుల ఆకలి కేకలు వినబడవని’ ఈ దుర్నాయకుల అవినీతిని ఎండగడతాడు. ఈ దేశ అస్తిత్వాన్ని కాపాడాలంటే ఈ దేశంలోని నాయక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తాడు.

ఈ మధ్యకాలం చాలామంది భారతదేశ ఔన్నత్యాన్ని పొగుడుతూ వసుదైక కుటుంబాన్ని గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మతం పేరుతో, కులం పేరుతో రక్త ధారలు పారిస్తున్నారు. 'మతం మంటలు, కులం కుట్రలు... విచ్చుకత్తులు గుచ్చుకుంటే... భయం నీడలో భారతావని బగ్గు బగ్గున మండెనా?' అంటూ ఈ దేశంలో జరుగుతున్న అరాచకాన్ని ప్రశ్నిస్తాడు. గూండాగిరి - గాంధీగిరిని పక్కకు నెట్టిందని గాడ్సే వారస వర్గం ప్రజావళి గొంతు నొక్కిందని ఆవేదన వ్యక్తం చేస్తాడు.

2.11 విశ్వ మానవ చైతన్యం - శాంతి సందేశం

విశ్వ మానవ శ్రేయస్సు కోరుకునే కవులు అచ్చమైన మానవతావాదులుగా నిలుస్తారు. వేమన, గురజాడ అప్పారావు, గుర్రం జాషువా, శ్రీశ్రీ లాంటి మహాకవులు అదే పనిచేశారు. మనిషిని నాశనం చేసే ఎలాంటి వ్యవస్థనైనా, ఎలాంటి వ్యక్తినైనా నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా ప్రతిఘటించడం, మార్పుకు ప్రయత్నించడం వంటి గుణాలను మహా కవుల రచనల్లో చూడవచ్చు. అందెశ్రీ కవిత్వంలో కూడా అలాంటి తత్వం కనిపిస్తుంది.

ఆవహించిన నిశ్శబ్దములో అలుముకున్న భయం నీడ,
బుసలు గొట్టే విషనాగులు, పారజూస్తు కోర చాచి పొంచియున్నవి,
ఒక వంక యుద్ధభేరీ శబ్దాలతో - బద్దలయ్యే భూభాండం
దద్దరిల్లే ప్రతిధ్వనులు, వినిన విశ్వమాత గుండె విలపించిన వినేదెవరు?
నరహంతక ధరపతులు అణుబాంబులతో ఆడుకుంటే,
మానవాళి మరుభూమి మంటల్లో మాడుతుంటే,
మసిబారిన ముసి మబ్బులు, విష జ్వాలలు కురిపిస్తే,
వికసించక ఈ విశ్వం విలపించిన విషాదం,
దివి చెక్కలు భువి ముక్కలై దిక్కులన్ని పిక్కటిల్లగా,
అగోచరమైన అరుపుల మెరుపులతో అవని స్థంభిస్తుంది శాంతి దహిస్తుంది.
ప్రతిజ్ఞలను మానుకోండి- ప్రపంచాన్ని ఆదుకోండి

అంటూ అందెశ్రీ ‘భయం భయం’ (20) కవితలో పిలుపునిస్తాడు.

ఉపసంహారం

అందెశ్రీ అణగారిన వర్గాల నుంచి వచ్చిన అపర శ్రామికుడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. బర్రెల కాపరిగా, నిర్మాణ కూలీగా, మేస్త్రీగా అనేక విధాలుగా కష్టపడి జీవితాన్ని ఒక తీరానికి లాక్కొచ్చిన గేయ నావికుడు ఆయన. అక్షర జ్ఞానం లేకపోయినా ప్రపంచజ్ఞానాన్ని ఒడిసిపట్టిన ఆధునిక ఏకలౌవ్యుడు అందెశ్రీ. తన చుట్టూ ఉన్న సమాజ స్థితిగతులు అర్థమయ్యాక తన ఆలోచన ప్రయాణం అభ్యుదయ రూపం తీసుకుంది. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసింది. తమలోని అస్థిత్వాన్ని నిద్ర మేల్కొల్పింది. శాస్త్రీయ దృక్పథంతో సంప్రదాయ ఇనుప చట్రాన్ని ఢీకొట్టే శక్తిని ఇచ్చింది. వ్యక్తిగా తను అనుభవించిన కష్టాలు ఒకవైపు- కవిగా తను చూసిన సమాజం ఇంకోవైపు. శ్రామికవర్గం- పెట్టుబడిదారి వర్గం, పాలకవర్గం- పాలిత వర్గం, దోపిడివర్గం- దోచుకోబడుతున్నవర్గం ఇలా సమాజంలో ఏర్పడ్డ రెండు వర్గాల స్వరూప స్వభావాలను అర్థం చేసుకున్న అందెశ్రీ, స్థానిక సమస్యల నుండి అంతర్జాతీయ సమస్యల దాకా అనేక అంశాలను కవిత్వానికి వస్తువుగా స్వీకరించాడు. మానవీయతే ఆయన స్వీకరించిన కవితా వస్తువుకు పరమ ప్రమాణం. సమాజ స్థితిని అట్టడుగు మనిషి కోణంలో చూసే అందెశ్రీ, దాన్నే తన అస్తిత్వంగా మార్చుకోవడాన్ని గుర్తించవచ్చు.

  • అందెశ్రీ సామాజిక నేపథ్యం, శ్రామిక జీవన అనుభవం ఆయన కవిత్వానికి ప్రాతిపదిక.
  • చైతన్యం, సామాజిక మార్పు కోసం పోరాటం మానవ అస్తిత్వానికి మూలం అని ఆయన కవిత్వం వివరిస్తుంది.
  • మూఢనమ్మకాలు, దైవ ఉనికి, మనుధర్మ శాస్త్రాలు వంటి సంప్రదాయ భావనలపై అందెశ్రీ ప్రశ్నలు సంధించారు.
  • వ్యక్తిగత కష్టాలు, పేదరికం, అనారోగ్యం మానవ అస్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన కవితలు చిత్రీకరిస్తాయి.
  • కళ, శ్రమ మానవ సృష్టిలో భాగమని, కళ అస్తిత్వం శ్రామిక జీవన సౌందర్యంపై ఆధారపడి ఉందని అందెశ్రీ పేర్కొన్నారు.
  • కవిత్వం ప్రయోజనాత్మకంగా ఉండి, సమాజంలోని అసమానతలను ప్రశ్నించాలి అని ఆయన దృఢంగా నమ్ముతారు.
  • జాతీయ రాజకీయాల్లో అవినీతి, స్వార్థం దేశ అస్తిత్వాన్ని ఎలా దెబ్బతీస్తాయో వివరించి, నాయకత్వ ప్రక్షాళన ఆవశ్యకతను ఆయన ప్రబోధిస్తారు.
  • విశ్వ మానవ శ్రేయస్సు, శాంతి స్థాపన కోసం యుద్ధాలను వ్యతిరేకించి, మానవతావాదాన్ని అందెశ్రీ ప్రతిబింబిస్తారు.

ఉపయుక్త గ్రంథసూచి

  1. అందెశ్రీ. అందెలసందడి. n.p., 1984.
  2. Aristotle. Politics. Translated by Carnes Lord, University of Chicago Press, 1984.
  3. Darwin, Charles. On the Origin of Species. n.p., 1859.
  4. Descartes, René. Discourse on the Method. n.p., 1637.
  5. Descartes, René. Meditations on First Philosophy. n.p., 1641.
  6. ఈశ్వర రెడ్డి, ఎన్. సాహిత్య మతం-సమాజ హితం. n.p., 2025.
  7. Frankl, Viktor. Man's Search for Meaning. n.p., 1946.
  8. Maslow, Abraham. Motivation and Personality. n.p., 1954.
  9. Sartre, Jean-Paul. Existentialism Is a Humanism. n.p., 1946.
  10. వ్యాసుడు. భగవద్గీత. మెక్మిలెన్ ప్రచురణ, 1972.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]