AUCHITHYAM | Volume-07 | Issue-03 | March 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
6. జిల్లేళ్ళ బాలాజీ కథలు: స్త్రీసమస్యల విశ్లేషణ
రాగిపాటి బాజివలి, ఆచార్య జర్రా అప్పారావు
పరిశోధకులు, తెలుగుశాఖ
ఆంధ్రవిశ్వకళాపరిషత్, విశాఖపట్నం
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 8374049149, Email: valiragipati@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 02.02.2026 ఎంపిక (D.O.A): 27.02.2026 ప్రచురణ (D.O.P): 01.03.2026
వ్యాససంగ్రహం:
తెలుగు కథాసాహిత్యం స్త్రీల జీవితాల్లోని పలుకోణాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరంభం నుండి విశ్లేషిస్తోంది. ఈ పరిణామ క్రమంలో జిల్లేళ్ల బాలాజీ కథలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఈ పరిశోధన ముఖ్యోద్దేశం బాలాజీ కథల్లోని స్త్రీల సంక్లిష్ట సమస్యల చిత్రణను విశ్లేషించడం. వరకట్నం, వితంతు సమస్యలు, లైంగిక దాడులు, పితృస్వామ్య ధోరణులు వంటి సామాజిక అంశాలను ఆయన ఎలా చిత్రీకరించారో వివరించడం ఈ వ్యాస ఆవశ్యకత. 'నిరుడు కురిసిన వెన్నెల', 'వొంతు' కథా సంపుటాల నుండి 'ప్రాయశ్చిత్తం', 'ఉమ్మెత్తపూలు', 'సమీరా ఓ సమీరా!', 'దృష్టి' కథలను ఈ అధ్యయనానికి ప్రాథమిక ఆధారాలుగా స్వీకరించడమైంది. కందుకూరి వీరేశలింగం వితంతు పునర్వివాహ కృషి, గురజాడ రచనల్లోని వితంతు వేదన, చాసో ఆధునిక విశ్లేషణ, ఓల్గా, కాత్యాయనీ విద్మహే వంటి ప్రముఖుల స్త్రీవాద దృక్పథాలు ఈ పరిశోధనకు సైద్ధాంతిక నేపథ్యాన్ని అందించాయి. ఈ పరిశోధన గుణాత్మక విశ్లేషణ పద్ధతిని అనుసరించి, ఎంచుకున్న కథల వస్తుశిల్పాలను పరిశీలించింది. కథల్లోని పాత్రల అంతరంగిక సంఘర్షణ, సామాజికనేపథ్యం, రచయిత సందేశాన్ని వివరణాత్మకంగా విశ్లేషించడం జరిగింది. బాలాజీకథలు స్త్రీలను బాధితులుగానే కాక, పురుషాధిక్య వ్యవస్థను ప్రశ్నించే చైతన్య మూర్తులుగా చిత్రీకరించాయి. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల అస్తిత్వం తండ్రి, భర్త గుర్తింపుతో ముడిపడి ఉండటం, తమ సొంత జీవితాలపై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలను ఈ కథలు విశదపరిచాయి. 'ప్రాయశ్చిత్తం' వరకట్న దురాచారం, 'ఉమ్మెత్తపూలు' వితంతువుల పట్ల సమాజ వివక్ష, 'సమీరా ఓ సమీరా!' లైంగికమైన దాడుల పర్యవసానాలు, 'దృష్టి' పితృస్వామ్య అనుమానపు పోకడలు ఎంతటి విధ్వంసానికి దారితీస్తాయో స్పష్టం చేస్తాయి. ఈ అధ్యయనం జిల్లేళ్ల బాలాజీ కథలను పూర్తిగా విశ్లేషించ-లేకపోయినా, ఎంచుకున్న కథల ద్వారా స్త్రీల సమస్యల తీవ్రతను ఆవిష్కరించగలిగింది. భవిష్యత్తు పరిశోధనలకు బాలాజీ ఇతర కథలపైన, స్త్రీవాద సాహిత్యంలోని నూతనధోరణుల పైన అధ్యయనం చేయాడానికి ఈ వ్యాసం ఉపకరిస్తుంది. బాలాజీ సాహిత్యం సామాజికమైనమార్పుకు బలమైన సాధనంగా, స్త్రీలలో ఆత్మవిశ్వాసాన్ని నింపే మార్గదర్శిగా నిలుస్తుంది. వరకట్నం లేని వివాహాలు, వితంతువుల పట్ల మానవీయ దృక్పథం, స్త్రీలకు వ్యక్తిగత స్వేచ్ఛ కల్పించడం ద్వారానే సమసమాజ నిర్మాణం సాధ్యమని ఈ కథలు స్పష్టంగా చాటాయి.
Keywords: జిల్లేళ్ళ బాలాజీ, తెలుగు కథాసాహిత్యం, స్త్రీ సమస్యలు, వరకట్నం, వైధవ్యం, లైంగికవేధింపులు, పితృస్వామ్యం, సామాజికమైన మార్పు
1. ప్రవేశిక
తెలుగు కథా సాహిత్యం ఆరంభం నుండి నేటి వరకు స్త్రీల జీవితంలోని వివిధ కోణాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఎన్నో రకాలుగా అందిస్తూనే ఉంది. ప్రారంభంలో కన్యాశుల్కం, బాల్య వివాహాలు, వరకట్న వేధింపుల వంటి సామాజిక రుగ్మతలు కథలకు ప్రధాన ఇతివృత్తాలుగా నిలిచాయి. అయితే కాలక్రమేణా స్త్రీ విద్య, ఆర్థిక స్వాలంబన పెరగడంతో కథావస్తువులలో మార్పు వచ్చింది. నేటి కథల్లో స్త్రీలు బాధితులుగా మాత్రమే కాక, పురుషాధిక్య వ్యవస్థను ప్రశ్నించే చైతన్యవంతులుగా కనిపిస్తున్నారు. గృహ హింస, కార్యాలయాల్లో వేధింపులు, సమాజంలో స్త్రీలు ఎదుర్కొనే అనేక సమస్యలను రచయితలు విశ్లేషిస్తున్నారు.
ఆధునిక కథా సాహిత్యం స్త్రీల అంతరంగిక సంఘర్షణలకు, అస్తిత్వ పోరాటానికి పెద్దపీట వేస్తోంది. పెళ్లి, సంతానం వంటి సాంప్రదాయ చట్రాల మధ్య నలిగిపోతున్న స్త్రీల మానసిక స్థితిని, తమకంటూ ఒక గుర్తింపును కోరుకునే వారి ఆరాటాన్ని కథకులు హృద్యంగా చిత్రిస్తున్నారు. పట్టణీకరణ వల్ల మారుతున్న జీవనశైలిలో ఉద్యోగాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు, అభద్రతాభావం వంటి అంశాలు కథల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి. సమస్యలను వివరించడమే కాకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసే స్త్రీ పాత్రలను సృష్టించడం ద్వారా తెలుగు కథా సాహిత్యం సమాజంలో మార్పుకు ఒక బలమైన సాధనంగా నిలుస్తోంది. అటువంటి విశిష్టత జిల్లేళ్ల బాలాజీ కథల్లోనూ ఉంది. స్త్రీలు ఎదుర్కొనే ప్రధానమైన, సంక్లిష్టమైన సమస్యలైన వరకట్నం, వితంతువుల దుస్థితి, లైంగిక దాడులకు సంబంధించిన ఇతివృత్తంతో బాలాజీ రాసిన కథలను ఈ పరిశోధనా వ్యాసంలో పరిచయం చేసి వివరిస్తున్నాను.
2. వరకట్న వేధింపులు
సామాజిక రుగ్మత అయిన వరకట్నం స్త్రీ ఆత్మగౌరవాన్ని, ఆమె ఉనికిని కాలరాసే సామాజిక దురాచారం. తెలుగు కథల్లో తొలినాళ్ల నుండే ఈ సమస్యను ప్రస్తావించారు. మధ్యతరగతి కుటుంబాలలో పుట్టిన అమ్మాయిలకు పెళ్లి పండుగలా కాకుండా, భారంగా ఎలా మారుతుందో అనేక కథలు నిరూపించాయి. తండ్రి తనకున్న కొద్దిపాటి ఆస్తిని అమ్మి, అప్పులు చేసి కట్నం ఇస్తే, అది చాలదన్న నెపంతో అత్తవారింట్లో స్త్రీ ఎదుర్కొనే శారీరక, మానసిక హింసలు వర్ణనాతీతం.
కథల్లో ఈ సమస్యను విశ్లేషించేటప్పుడు రచయితలు కన్నీటి గాథలకే పరిమితం కాలేదు. వరకట్నం కారణంగా జరిగే హత్యలను 'ఆత్మహత్యలు'గా చిత్రీకరించే విధానాలను కూడా ప్రశ్నించారు. స్త్రీవాద కథలు వచ్చిన తర్వాత, కట్నం అడిగే వారిని పెళ్లి చేసుకోనని ఎదిరించే పాత్రలు పెరిగాయి. చదువు, ఉద్యోగం ఉన్న స్త్రీలు సైతం కట్నం విషయంలో వివక్షకు గురికావడం పితృస్వామ్య వ్యవస్థ ఎంత బలంగా ఉందో తెలుపుతుంది. 'వస్తువు'గా మారిపోయిన స్త్రీ తన ఉనికిని చాటుకోవడానికి చేసే పోరాటం ఈ కథల్లో ప్రధాన ఇతివృత్తం. బాలాజీ రచనలలో ఈ విభాగంలోకి చేరిన ఒక కథను ఇక్కడ పరిశీలిస్తున్నాను.
2.1. ప్రాయశ్చిత్తం
ఈ కథ 'నిరుడు కురిసిన వెన్నెల' సంపుటిలోనిది. వరకట్న మహమ్మారి వల్ల ఒక సామాన్య స్త్రీ జీవితం ఎలా చితికిపోతుందో రచయిత ఎంతో స్పష్టంగా ఇందులో చిత్రించారు. రాఘవ తన తల్లిదండ్రుల ఆశకు తలొగ్గి కట్నం తీసుకుని జానకిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లయిన తర్వాత సైతం అదనపు కట్నం కోసం జానకిని ఆమె అత్తమామలు వేధించి, "మరో పదివేలు తెస్తేనే ఇంటి గడప తొక్కాలి" అని పుట్టింటికి పంపించేస్తారు. కట్నం తీసుకునే అబ్బాయిలు మరో అమ్మాయి మెడలో "ఉరిత్రాడు" బిగిస్తున్నారని రాఘవ తమ్ముడు రమేష్ తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్తాడు. ఒక పురుషుడికి సొంత వ్యక్తిత్వం లేకుండా, డబ్బుకు అమ్ముడుపోయినప్పుడు, అతని భార్య బానిస బతుకు గడపాల్సి వస్తుందని ఈ కథ పాఠకులకు తెలియజేస్తుంది.
స్త్రీలు ఎదుర్కొనే ఆర్థిక, మానసిక సమస్యలు జానకి తన భర్తకు రాసిన ఉత్తరం ద్వారా అర్థమవుతాయి. జానకి తండ్రి ఆమె పెళ్లి కోసమే ఎన్నో కష్టాలు పడ్డారని, ఇప్పుడు మళ్ళీ అదనంగా పదివేలు అంటే అతను ఎక్కడి నుండి తెస్తారనేది ఆ ఉత్తర సారాంశం. తనకు ఒక చెల్లెలు, తమ్ముడు ఉన్నారని, తన కోసం తండ్రి తన ఆస్తి అంతా పోగొట్టుకుంటే వారి భవిష్యత్తు ఏమవుతుందోనని ఆమె ఆందోళన చెందుతుంది. "మీకు మరో అమ్మాయి దొరుకుతుందేమో కానీ, నేను నా నాన్నను తిరిగి పొందగలనా?" అని ఆమె అడిగిన ప్రశ్న సమాజంలోని వరకట్న బాధితులందరి బాధను అద్దం పడుతుంది. స్త్రీని డబ్బు తెచ్చే యంత్రంలా చూడటం వల్ల ఆమె పుట్టింటిలోనూ, మెట్టింటిలోనూ ఒక 'ప్రశ్నార్థకం'లా మిగిలిపోతుందని ఈ కథలో రచయిత వివరించారు.
ఈ కథలో వరకట్నం ఒక కుటుంబ సమస్య కాదు, అదొక సామాజిక రుగ్మత. రాఘవ తల్లిదండ్రులు తమ కొడుకు చదువుకు పెట్టిన ప్రతి పైసాను కట్నం రూపంలో రాబట్టుకోవాలనుకోవడం వారి స్వార్థాన్ని తెలియజేస్తుంది. అదనపు కట్నం తెచ్చే వరకు జానకిని ఇంటికి రానివ్వమని వారు కచ్చితంగా చెప్పడం, మనుషుల కంటే బ్యాంకు బ్యాలెన్స్‌కే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారని, కొడుకు జీవితం కన్నా డబ్బే ప్రధానమని తెలుస్తోంది. ఆఖరికి రాఘవ తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడతాడు. తాను చేసిన పాపానికి పరిహారంగా, జానకి చెల్లెలిని తన తమ్ముడు రమేష్‌కు ఇచ్చి కట్నం లేకుండా ఆదర్శ వివాహం చేయాలని నిర్ణయించుకోవడంతో కథ ముగుస్తుంది. ఈ విధంగా కట్నం లేని వివాహాల ద్వారానే ఇలాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రచయిత సూచించారు (బాలాజీ, ప్రాయశ్చిత్తం 47-50).
3. వితంతు సమస్యలు
తెలుగు సాహిత్యం వితంతువుల సమస్యలను చిత్రించడంలో గొప్ప పరిణామ క్రమాన్ని కలిగి ఉంది. కందుకూరి వీరేశలింగం కాలం నుండి వితంతు పునర్వివాహం ఒక ఉద్యమంగా సాగింది. పాత కాలపు కథల్లో వితంతువు అంటే తెల్లచీర కట్టుకుని, తలనీలాలు కోల్పోయి, శుభకార్యాలకు దూరంగా, వంటింటికే పరిమితమైన ఒక అపశకునంగా చూపబడేది. బాల్య వివాహాల వల్ల పసిప్రాయంలోనే భర్తను కోల్పోయి, జీవితాంతం వైధవ్యాన్ని అనుభవించే స్త్రీల వేదనను గురజాడ వంటి కవులు అత్యంత కరుణాత్మకంగా చిత్రించారు.
ఆధునిక కథల్లో ఈ విశ్లేషణ మరింత విస్తృతంగా మారింది. వితంతువుకు సైతం కోరికలు, ఆశలు ఉంటాయని, ఆమెకు కూడా మళ్ళీ జీవితాన్ని ప్రారంభించే హక్కు ఉందని చాసో వంటి రచయితలు తమ కథల ద్వారా చాటి చెప్పారు. సమాజం విధించిన కట్టుబాట్లను తెంచుకుని, ఆత్మవిశ్వాసంతో బతికే వితంతు పాత్రలు నేటి కథల్లో కనిపిస్తున్నాయి. ఆర్థిక ఆసరా కోసమే కాకుండా, మానసిక తోడు కోసం వితంతువులు తీసుకునే నిర్ణయాలను సమర్థించే విధంగా కథా గమనం సాగుతోంది. ఇది స్త్రీ స్వేచ్ఛ, మారుతున్న సామాజిక విలువలకు నిదర్శనం.
బాలాజీ రచించిన 'ఉమ్మెత్తపూలు' అనే కథను ఇక్కడ విశ్లేషిస్తున్నాను.
3.1. ఉమ్మెత్తపూలు కథ
ఈ కథలో వితంతువుల పట్ల సమాజం చూపే వివక్ష, స్త్రీలు ఎదుర్కొనే మానసిక వేదనను రచయిత అత్యంత హృద్యంగా చిత్రించారు. భర్త చనిపోయిన తర్వాత కమల తన జీవితాన్ని శూన్యంగా భావిస్తూ, తనలో సగం చచ్చిపోయానని, అందుకే జీవచ్ఛవంలా బ్రతుకుతున్నానని అంటుంది. ఆమె తన భర్త ఫోటో పక్కన తన ఫోటోకు కూడా పూలమాల వేసుకోవడం ద్వారా, సమాజం వితంతువులను సామాజికంగా ఎలా వెలివేస్తుందో, వారిని బ్రతికున్న శవాలుగా ఎలా చూస్తుందో స్పష్టమవుతుంది. మగవాడు భార్య చనిపోతే రెండో పెళ్లి చేసుకోవచ్చని, కానీ ఆడది వితంతువుగా మారితే ఆమెకు ఆ సంతోషం ఉండకూడదని విధించే ఆంక్షలు సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను ఎండగడతాయి.
సమాజం స్త్రీలపై విధించే ఆంక్షలను ఒక చిన్న పల్లెటూరి అమ్మాయి ద్వారా రచయిత ప్రశ్నించారు. "భర్త చనిపోయిన ఆడదానికి గుర్తుగా అలంకారాలైన కుంకుమ, పూలు, గాజులు వేసుకోకూడదని ఆంక్షలు విధించే ఈ లోకంలో ఎందుకు పుట్టామా అనిపిస్తోంది" అని ఆ అమ్మాయి ఆవేదన చెందుతుంది. భార్య చనిపోయిన మగవాడికి ఎలాంటి గుర్తులు లేవని, అతను దర్జాగా తిరగవచ్చని, కానీ ఆడదానికి మాత్రం సుఖం, సంతోషం దరి చేరకూడదని సమాజం గీసిన గీతలు స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాన్ని చాటిచెబుతాయి. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త చనిపోతే తన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందేమోనన్న భయంతో, ఆ పదేళ్ల అమ్మాయి "నాకు అసలు పెళ్లే వద్దు" అని చెప్పడం వితంతువులంటే ఉన్న సామాజిక క్రూరత్వాన్ని సూచిస్తుంది.
దేవుడి పూజకు పనికిరాని "ఉమ్మెత్త పూలు" వితంతువుల జీవితాలకు సంకేతంగా ఈ కథలో కనిపిస్తాయి. దేవుడే ఈ పూలను వద్దన్నప్పుడు వీటి గతేమిటని ఆ అమ్మాయి అడిగే ప్రశ్న, సమాజం వితంతువులను ఏ శుభకార్యానికి పనికిరాని వారిగా చూడటాన్ని ప్రతిబింబిస్తుంది. దేవుడికి కూడా దయ లేనప్పుడు ఆ దేవుడెందుకని ఆ అమ్మాయి ఆవేశపడటం గమనార్హం. చివరకు, దేవుడి పూజకు పనికిరాని ఆ ఉమ్మెత్త పూలను కమల తలలో తురిమి, ఆమె నుదుట కుంకుమ దిద్ది, ఆమెను మళ్ళీ అందంగా చూడాలనుకోవడం ద్వారా వితంతువులంటే ఉన్న అపశకునాల ముద్రను ఆ అమ్మాయి చెరిపివేస్తుంది. స్త్రీల కష్టాలు, వారి అణచివేత వితంతువుల నిస్సహాయతను ఈ కథ ఎంతో సున్నితంగా చర్చించింది (బాలాజీ, ఉమ్మెత్తపూలు 07-12).
4. లైంగిక దాడి, వేధింపులు
లైంగిక దాడి స్త్రీ శరీరంపై జరిగే భౌతిక దాడి, ఇది ఆమె వ్యక్తిత్వం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. తెలుగు కథల్లో ఈ అంశాన్ని స్పృశించడం ఒక సాహసంతో కూడుకున్న పనిగా ఉండేది. తొలినాళ్లలో ఇటువంటి సంఘటనలను పరోక్షంగా చెప్పేవారు, కానీ నేటి కథల్లో బాధితురాలి పక్షాన నిలబడి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సమాజం బాధితురాలిని తప్పు పట్టే 'విక్టిమ్ బ్లేమింగ్' ధోరణిని రచయితలు తీవ్రంగా నిరసిస్తున్నారు.
ఉద్యోగం చేసే చోట జరిగే లైంగిక వేధింపుల గురించి ఆధునిక కథలు విపులంగా చర్చిస్తున్నాయి. ఒక స్త్రీ తన నైపుణ్యంతో పైకి ఎదుగుతున్నప్పుడు, ఆమెను మానసికంగా కృంగదీయడానికి లైంగిక వేధింపులను ఒక ఆయుధంగా వాడే పురుష అహంకారాన్ని ఈ కథలు ఎండగట్టాయి. లైంగిక దాడికి గురైన స్త్రీ ఆత్మహత్యే శరణ్యం అనుకోకుండా, నేరస్థుడిని చట్టం ముందు నిలబెట్టాలని, తలెత్తుకుని బతకాలని సందేశాన్నిచ్చే కథలు సమాజంలో మార్పుకు నాంది పలుకుతున్నాయి. ఈ విభాగంలోకి 'సమీరా ఓ సమీరా!' అనే కథను ఇక్కడ పరిశీలిస్తున్నాను.
4.1. సమీరా ఓ సమీరా! కథ
ఈ కథలో ఒక ప్రతిభావంతురాలైన యువతి తన ఎదుగుదల కోసమో, తోటివారిని నమ్మి చేసిన చిన్న పొరపాటు వల్ల లైంగిక వేధింపులకు ఎలా గురైందో రచయిత హృద్యంగా చిత్రించారు. సమీర అనే యువతి ఒక టీవీ సింగింగ్ పోటీలో విజేతగా నిలిచి యాభై లక్షల విలువైన ఫ్లాట్‌ను గెలుచుకుంటుంది. ఆ సమయంలో ఛానల్ కెమెరామేన్ విశాల్ ఆమెకు, ఆమె తండ్రికి ఎంతో సహాయపడుతూ, ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంటాడు. అయితే ఈ స్నేహం వెనుక ఒక వికృతమైన కుట్ర ఉందని గ్రహించలేక, అతడి ముసుగులోని మంచితనాన్ని చూసి సమీర అతన్ని ప్రేమిస్తుంది. మహిళల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారిని వేధించే మృగాల మనస్తత్వం ఇక్కడ కనిపిస్తుంది.
విశాల్ ఒక ఆదివారం నాడు సమీరను చంద్రగిరి కోట చూడటానికి రమ్మని ఆహ్వానిస్తాడు. సమీర ఒంటరిగా రావడానికి భయపడితే, తనతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉంటారని నమ్మించి ఆమెను కొండపైకి తీసుకువెళతాడు. అక్కడ వారికి ముందే ప్లాన్ చేసినట్లుగా కూల్ డ్రింక్స్ ఇస్తారు, అందులో మత్తు మందు కలపడం వల్ల సమీర స్పృహ కోల్పోతుంది. ఆ సమయంలో విశాల్ అతడి స్నేహితులు సమీరపై అతి కిరాతకంగా, అమానుషంగా సామూహిక అత్యాచారానికి ఒడిగడతారు. ఒక స్త్రీ తన పరువును, ప్రాణాన్ని నమ్మిన వ్యక్తి చేతిలోనే పోగొట్టుకోవడం సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అత్యంత భయంకరమైన సమస్యకు నిదర్శనం.
లైంగిక వేధింపుల వెనుక ఉన్న మరో దుర్మార్గమైన కోణం ఈ కథలో కనిపిస్తుంది. విశాల్ తన కామవాంఛ కోసం కాకుండా, తన వృత్తిలో ప్రమోషన్ సంపాదించడం కోసం తన బాస్ ని సంతోషపెట్టడానికి సమీరను బలిపశువును చేస్తాడు. "నా ప్రమోషన్ సాంక్షన్ అవుతుందా సార్?" అని విశాల్ అడగటం, అందుకు ఆ అధికారి సంతృప్తి చెంది అతన్ని రీజనల్ ఇన్‌చార్జిగా నియమించడం చూస్తే, వ్యవస్థలలో మహిళల పట్ల ఉన్న వివక్ష, దోపిడీ అర్థమవుతుంది. ఇలాంటి వారు మరికొంతమంది అమ్మాయిలను తమ వలలో వేసుకోవాలని ప్లాన్ చేయడం స్త్రీల రక్షణపై ఉన్న భయాందోళనలను తెలియజేస్తుంది.
సమీర స్పృహలోకి వచ్చాక తనపై జరిగిన దారుణాన్ని, విశాల్ చేసిన నమ్మకద్రోహాన్ని గ్రహించి కుమిలిపోతుంది. తనలాంటి వారు ఇంకెందరో బాధితులు కాకూడదని, విశాల్ లాంటి నీచుడిని అంతం చేయాలని నిర్ణయించుకుంటుంది. విశాల్ మళ్లీ తన దగ్గరకు వచ్చినప్పుడు, అతన్ని గట్టిగా కౌగిలించుకుని తనతో పాటు లోయలోకి లాగి మరణిస్తుంది. తన శీలాన్ని, జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తికి శిక్ష వేస్తూనే, తనను తాను బలి ఇచ్చుకోవడం స్త్రీల సమస్యలలో తీవ్రతను, వారి నిస్సహాయతను చాటిచెబుతుంది. ఈ కథ సమాజంలోని మృగాల విషయంలో స్త్రీలు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తుంది (బాలాజీ, సమీరా! ఓ సమీరా 91-100).
5. పురుషాధిక్యత, పితృస్వామ్య సమస్యలు
పితృస్వామ్యం పురుషుడు కేంద్రంగా సాగే ఒక సామాజిక వ్యవస్థ. ఇక్కడ అధికారం, ఆస్తి హక్కులు, నిర్ణయాధికారాలు ప్రధానంగా పురుషులకే దక్కుతాయి. ఇది రాజకీయ, ఆర్థిక, మతపరమైన సంస్థలలో సైతం వ్యాపించి ఉంటుంది. తెలుగు సమాజంలో పితృస్వామ్య పోకడలను విశ్లేషిస్తూ, ప్రముఖ రచయిత్రి ఓల్గా తన వ్యాసాలలో స్త్రీల అణచివేతకు ఈ వ్యవస్థ ఎలా పునాది వేస్తుందో వివరించారు. పురుషాధిక్యత వల్ల స్త్రీలు తమ సొంత జీవితాలపై నియంత్రణ కోల్పోవడమే కాకుండా, వారి అస్తిత్వం తండ్రి లేక భర్త గుర్తింపుతోనే ముడిపడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు (ఓల్గా 12).
పురుషాధిక్యత స్త్రీలపై పురుషులు ప్రదర్శించే శారీరక, మానసిక ఆధిపత్యాన్ని సూచిస్తుంది. ఇది సమాజంలో అనాదిగా వస్తున్న సంప్రదాయాల పేరుతో కొనసాగుతోంది. ఈ వివక్ష వల్ల స్త్రీలు విద్య, ఉపాధి, సామాజిక హోదాలో వెనుకబడిపోతున్నారు. తెలుగు సాహిత్యం స్త్రీవాద దృక్పథాన్ని బలంగా వినిపించిన విమర్శకులు, పితృస్వామ్యం స్త్రీల శ్రమను, వారి పునరుత్పత్తి సామర్థ్యాన్ని పురుషుల ప్రయోజనాల కోసం వాడుకునే ఒక సాధనంగా అభివర్ణించారు. కాత్యాయనీ విద్మహే వంటి విద్వాంసులు తెలుగు సమాజంలోని సామాజిక నిర్మాణాలను విశ్లేషిస్తూ, స్త్రీని ఒక వస్తువుగా చూసేలా సమాజాన్ని ప్రేరేపిస్తుందని స్పష్టం చేశారు (కాత్యాయనీ విద్మహే 45).
ఈ విభాగంలో 'దృష్టి' అనే కథను ఇక్కడ పరిశీలిస్తున్నాను.
5.1. దృష్టి కథ
పితృస్వామ్య వ్యవస్థలోని పట్టుదలకు, అనుమానపు దృష్టికి స్త్రీలు ఎలా బలవుతున్నారో జిల్లేళ్ల బాలాజీ ఈ కథలో వివరించారు. రాజకుమార్ అనే పోలీస్ అధికారి తన కూతురు లహరిని ప్రేమతో కంటే నిఘాతోనే ఎక్కువగా గమనిస్తుంటాడు. కూతురు ఎక్కడ పెడదోవ పడుతుందో అన్న అనుమానంతో ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తూ, ప్రతి చిన్న విషయాన్ని అనుమానపు దృక్కోణంలో చూడటం పితృస్వామ్య ధోరణికి నిదర్శనం. తండ్రిగా రక్షణ కల్పించాల్సింది పోయి, పితృస్వామ్య ఆధిపత్యంతో కూతురి చదువుకునే గదిలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం, ఆమె ఫోన్‌ను తనిఖీ చేయడం వంటి చర్యలు ఆమెను మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. సామాజికంగా స్త్రీ ఎదుర్కొనే ప్రధాన సమస్య ఆమె అస్తిత్వాన్ని, శీలాన్ని తండ్రి లేక పురుషుడు నియంత్రించాలని చూడటం. బాధ్యతాయుతమైన ప్రొఫెసర్ వసంత్ పలకరింపుగా చేయి ఊపినంత మాత్రాన, రాజకుమార్ తన కూతురికి ఆ ప్రొఫెసర్‌తో ఏదో సంబంధం ఉందని నిశ్చయించుకుని నడిరోడ్డుపై దాడి చేయడం పురుషాధిక్యతకు పరాకాష్ట. స్త్రీల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, వారిపై తమ సొంత నిర్ణయాలను రుద్దడం ఈ వ్యవస్థలోని లోపం. లహరి తన లక్ష్యం చదువు అని, తనకు ఏ తప్పుడు ఉద్దేశాలు లేవని మొత్తుకుంటున్నా, తండ్రి ఆమె మాటను నమ్మకుండా బెల్టుతో కొట్టడం స్త్రీలు ఇంట్లో ఎదుర్కొనే హింసను ప్రతిబింబిస్తుంది.
తల్లి పాత్ర ద్వారా సైతం పితృస్వామ్య ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. లహరి తన గోడును తల్లికి చెప్పుకున్నప్పుడు, ఆమె సైతం తండ్రికి ఎదురు చెప్పలేక, "డాడీ చెప్పినట్లు నడుచుకో" అని చెప్పడం ద్వారా పురుషాధిక్య వ్యవస్థలో స్త్రీల నిస్సహాయతను చాటిచెబుతుంది. స్త్రీలు తమ సమస్యలను చెప్పుకోవడానికి సైతం సరైన వేదిక లేదా మద్దతు లేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చివరకు తండ్రి తన తప్పు తెలుసుకుని మార్పు చెందాలనుకున్నా, అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోవడం, లహరి ఆత్మహత్య చేసుకోవడం వంటివి అనుమానపు దృష్టి ఎంతటి దారుణాలకు దారితీస్తుందో చూపిస్తాయి. ఈ కథ స్త్రీలకు కావాల్సింది నిఘా కాదని, వారిపై నమ్మకం, స్వేచ్ఛ అని చాటిచెబుతుంది. పురుషాధిక్య అహంకారం, అనుమానం కారణంగా ఒక నిండు ప్రాణం ఎలా బలైపోయిందో ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. స్త్రీల పట్ల సమాజం, కుటుంబం తన 'దృష్టి'ని మార్చుకోవాలని రచయిత బలంగా సందేశాన్ని ఇచ్చారు (బాలాజీ, దృష్టి 100-110).
ఉపసంహారం
జిల్లేళ్ల బాలాజీ కథలు సమాజంలోని వరకట్నం, వైధవ్యం, లైంగిక వేధింపులు వంటి కఠిన వాస్తవాలకు ప్రతిబింబాలు. స్త్రీలను బాధితులుగా కాకుండా, పురుషాధిక్య వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే చైతన్య మూర్తులుగా ఆయన చిత్రించారు. పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల అస్తిత్వం తండ్రి లేక భర్త గుర్తింపుతో ముడిపడి ఉండటం, వారు తమ సొంత జీవితాలపై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలను ఈ కథలు విశ్లేషించాయి.
'ప్రాయశ్చిత్తం', 'ఉమ్మెత్తపూలు' వంటి కథల ద్వారా సామాజిక కట్టుబాట్లు స్త్రీల ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బతీస్తున్నాయో రచయిత నిరూపించారు. 'సమీరా! ఓ సమీరా!', 'దృష్టి' కథలు సమాజంలోనూ కుటుంబంలోనూ స్త్రీలు ఎదుర్కొంటున్న అభద్రతాభావానికి, అనుమానాలకు అద్దం పట్టాయి. నమ్మకమే పునాదిగా ఉండాల్సిన బంధాలలో పురుష అహంకారం, స్వార్థం ప్రవేశించినప్పుడు ఎంతటి దారుణమైన ముగింపులకు దారితీస్తాయో ఈ కథలు హెచ్చరించాయి. జిల్లేళ్ల బాలాజీ సాహిత్యం సమాజం తన 'దృష్టి'ని మార్చుకోవాల్సిన అవసరాన్ని బలంగా చెప్పింది. వరకట్నం లేని వివాహాలు, వితంతువుల పట్ల మానవీయ దృక్పథం, స్త్రీలకు లభించే వ్యక్తిగత స్వేచ్ఛ మాత్రమే సమసమాజ నిర్మాణానికి మార్గాలని స్పష్టమవుతోంది. స్త్రీల సమస్యలను వివరించడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి సామాజిక మార్పుకు ఈ కథలు ఒక బలమైన సాధనంగా నిలిచాయి.
- జిల్లేళ్ల బాలాజీ కథలు స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సామాజిక సమస్యలైన వరకట్నం, వితంతువుల స్థితి, లైంగిక వేధింపులను సూక్ష్మంగా పరిశీలించాయి.
- 'ప్రాయశ్చిత్తం' వంటి కథల ద్వారా వరకట్న దురాచారం స్త్రీల జీవితాలను ఎలా నాశనం చేస్తుందో, అందుకు సామాజిక పరిష్కారాలను ఎలా అన్వేషించాలో వివరించారు.
- 'ఉమ్మెత్తపూలు' కథ వితంతువుల పట్ల సమాజ వివక్ష, వారి మానసిక వేదనను చిత్రిస్తూ, మూఢనమ్మకాలను ప్రశ్నించింది.
- 'సమీరా! ఓ సమీరా!' అనే కథ లైంగికమైన దాడి తీవ్రత, నమ్మకద్రోహం, పురుషాధిక్యవ్యవస్థలో స్త్రీలు ఎదుర్కొనే అభద్రతాభావం గురించి హెచ్చరించింది.
- 'దృష్టి' కథ పితృస్వామ్య వ్యవస్థలో అనుమానం, నియంత్రణ స్త్రీల స్వేచ్ఛను ఎలా హరిస్తాయో, వారి ఆత్మగౌరవాన్ని ఎలా దెబ్బతీస్తాయో స్పష్టం చేసింది.
- బాలాజీ కథలు స్త్రీలను బాధితులుగా కాకుండా, సామాజిక రుగ్మతలను ప్రశ్నిస్తూ, ఆత్మవిశ్వాసంతో జీవించడానికి స్ఫూర్తినిచ్చే పాత్రలుగా చూపాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- ఓల్గా. రాజకీయ కథలు. స్వేచ్ఛ ప్రచురణలు, హైదరాబాద్, 1993.
- కాత్యాయనీ, విద్మహే. తెలుగు నవల - స్త్రీవాద దృక్పథం., బుక్ ట్రస్ట్, హైదరాబాద్, 1995.
- బాలాజీ, జిల్లేళ్ల. వొంతు. కథాసంకలనం, పార్వతీవిశ్వం ప్రచురణ, తిరుపతి, 2016
- పైదే. నిరుడుకురిసిన వెన్నెల. కథాసంకలనం, పార్వతీవిశ్వం ప్రచురణ, తిరుపతి, 2022
- పైదే. సిక్కెంటిక. కథాసంకలనం, పార్వతీవిశ్వం ప్రచురణ, తిరుపతి, 2013
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

