AUCHITHYAM | Volume-07 | Issue-03 | March 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. తెలంగాణ ‘ఒగ్గుకథ’ ప్రదర్శన విధానాలు: సామాజికాంశాలు
డా. నారగోని సైదులు
తెలుగు అతిథి ఉపన్యాసకులు
నృపతుంగ విశ్వవిద్యాలయం
బెంగళూరు, కర్ణాటక
సెల్: +91 9490585645, Email: saidulu645@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.02.2026 ఎంపిక (D.O.A): 28.02.2026 ప్రచురణ (D.O.P): 01.03.2026
వ్యాససంగ్రహం:
ప్రస్తుతపరిశోధన తెలంగాణ జానపద కళారూపాల్లో విశిష్టమైన ప్రాచీన కళారూపంగా పేరుగాంచిన ఒగ్గుకథ ప్రాముఖ్యతను, ప్రదర్శన విధానాలను అందులోని సామాజికాంశాలను సమగ్రంగా విశ్లేషిస్తుంది. భారతదేశం గత కొన్ని సంవత్సరాలుగా సాంకేతికంగా దినదినం అభివృద్ధి చెందుతున్న నేటి తరుణంలో, తెలంగాణ ప్రాంతంలో జానపద కళలుగా లేదా ప్రాచీన ప్రదర్శన కళారూపాలుగా పేరుగాంచిన యక్షగానం, చిందుభాగవతం, పగటివేషాలు, కురవంజి, వీధినాటకం, తోలుబొమ్మలాట, బుర్రకథ, ఒగ్గుకథ, జముకల కథ, హరికథ, రుంజలవారు, గంగిరెద్దుల వారు, బుడుబుడుకులవారు, కాటికపాపలు మొదలైన కళారూపాల విశిష్టతలను వర్తమాన, భవిష్యత్ తరాలకు తెలియజేయవలసిన నేపథ్యమే ఈ పరిశోధనకు మూలం. తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒగ్గుకథ విశిష్టతను, అందులోని సామాజికాంశాలను దేశ, విదేశాలకు చాటి చెప్పిన ఘనత కీర్తిశేషులు చుక్కా సత్తయ్య, మిద్దె రాములు గార్లకు దక్కుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణ ప్రాంతంలో ఒగ్గు గొల్లలుగా, కురుమలుగా, యాదవ కులస్తులుగా పిలువబడుతున్న వారు ఈ బగ్గుకథ కళారూపం ద్వారా చెప్పే కథలు, పాటలు, వాయిద్యాలు, ప్రదర్శన విధానాల ద్వారా వ్యక్తమయ్యే సామాజికాంశాలను పరిశోధన పూర్వకంగా విశ్లేషించటం ఈ వ్యాసం ముఖ్యోద్దేశం. ఈ పరిశోధన వ్యాసం ఒగ్గుకథ కళారూపంపై వెలువడిన మిక్కిలినేని రాధాకృష్ణ రచించిన 'తెలుగు జానపద కళారూపాలు', డా. సాగి కమలాకర శర్మ సంపాదకత్వంలో వెలువడిన 'తెలుగు సాహిత్య ప్రక్రియలు - రూపాలు', డా. రాజిరెడ్డి మహేందర్ రెడ్డి ఆవిష్కరించిన 'ఒగ్గుకథ సమగ్ర పరిశీలన' పుస్తకాలను, వివిధ పత్రికల్లో ముద్రించబడిన వ్యాసాలు, సమీక్షలను అధ్యయనం చేసి రూపొందించడమైనది. అంతేకాదు పూర్వ పరిశోధనల వివరాలు, విశ్లేషణలు, విమర్శలను ఆకళింపు చేసుకుని, పరిశోధన ఫలితాలను వెల్లడించటం ఈ వ్యాసం ప్రధాన అంశం.
Keywords: జానపద సాహిత్యం, జానపద కళలు, ఒగ్గుకథ, ప్రదర్శన విధానాలు, సామాజికాంశాలు
1. ప్రవేశిక
తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీన కాలం నుండి నేటి వరకు జానపద దృశ్య కళలుగా, ప్రదర్శన కళలుగా పేరుగాంచిన యక్షగానం, చిందు భాగవతం, పగటి వేషాలు, కురవంజి, వీధి నాటకం, తోలు బొమ్మలాట, బుఱ్ఱకథ, ఒగ్గుకథ, జముకల కథ, హరికథ, రుంజలవారు, గంగిరెద్దులవారు, కాటికపాపలు, బుడుబుడుకులవారు వంటి కళల్లో ఒగ్గుకథకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. గానం, హాస్యం, హావభావాలతో జనబాహుళ్యాన్ని మైమరింపజేసే ప్రదర్శన కళగా ఒగ్గుకథ ఖ్యాతి గడించింది. తెలంగాణ నేలపై పుట్టి పెరిగిన ఒగ్గుకథ గొప్పతనం ఏమిటంటే, ఒకవైపు కుల సంప్రదాయాన్ని, మరోవైపు కళా సంప్రదాయాన్ని కలగలుపుకున్న కళారూపంగా గుర్తింపు పొందింది. అంతేకాదు, అన్ని కులాలను, మతాలను ఆకట్టుకునే శక్తి, ఊరు మొత్తాన్ని వినోదపరచగల సామర్థ్యం దీనికి సొంతం. సంగీతం, నాట్యం, సాహిత్యం తనలో ఇముడ్చుకున్న ఒగ్గుకథ పామరుల నుండి పండితుల వరకు, రాజుల నుండి రాజకీయ నాయకుల వరకు ఎనలేని ప్రశంసలు అందుకుంది. ఒగ్గుకథ ప్రధానంగా శైవ సంస్కృతి, శ్రమ సంస్కృతి, గంగబోనం, లందబోనం, సూర్యబోనం, ఒగ్గు పూజారులు, ఒగ్గు బండారి, గవ్వదర్శనం, సట్టేడువారాలు వంటి ఆచార సంప్రదాయాలు, లోతైన కథనాలను కలిగి ఉంటుంది. ఇంతటి ప్రాముఖ్యత సంతరించుకున్న తెలంగాణ ఒగ్గుకథ ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి, తెలంగాణ ఒగ్గుకథ కంటిపాపలుగా డా. చుక్క సత్తయ్య, డా. మిద్దె రాములు పేరు గడించారు.
ప్రముఖ తెలుగు కళావిశ్లేషకులు పసుపులేటి పూర్ణచంద్రరావు ఒగ్గుకథ సామాజిక ప్రయోజనం గురించి చెప్పిన మాటలను డా. నందిని సిధారెడ్డి ఉటంకించారు. ఆ వ్యాఖ్యలను రాజిరెడ్డి మహేందర్ రెడ్డి తన రచనలో పేర్కొన్నారు:
‘ఒగ్గుకథలో ఒగ్గుపూజలైనా, పట్నాలైనా, కథలైనా ప్రధానంగా ఎల్లమ్మ, మల్లన్న, బీరన్నల చుట్టూ తిరుగుతాయి. భక్తి సంస్కృతి, జాతరలు, వేడుకలు, ఉత్సవాలు, పండుగలు అన్నీ ఒగ్గుకథల్ని, కథకుల్ని వందల సంవత్సరాల నుంచి పోషించుకుంటూ వస్తున్నాయి. ప్రకృతి ఆరాధన, మాతృస్వామ్య ఇతివృత్తాలు, మానవ సంబంధాలు, జానపద గాథలు ఒగ్గు కళాకారుల కథల్లో ప్రతిఫలిస్తాయి. అంతేకాదు రాజులు, రాణులు, దానధర్మాలు, సంతానలేమి సమస్యలు, తపస్సులు, శివుని పరీక్షలు, వరాలు, మలుపులతో, కల్పనలతో కథలు ఆసక్తికరంగా, ఉద్వేగ భరితంగా సాగుతాయి. మతాన్ని, నీతిని, వృత్తిని, స్త్రీ పురుష సంబంధాల్ని, భక్తిని, దానశీలతను, ధైర్యాన్ని, వీరత్వాన్ని అన్నింటినీ కలబోసిన సమగ్ర పాఠాన్ని బోధించటం ఒగ్గుకథ విశిష్టత’ (రాజిరెడ్డి మహేందర్ రెడ్డి III).
2. ఒగ్గుకథ చారిత్రక నేపథ్యం
ప్రపంచ సాహిత్యాల్లో, భారతీయ సాహిత్యాల్లో తెలంగాణ జానపద సాహిత్యానికి, కళలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలంగాణ జానపద సాహిత్యం, కళలను అధ్యయనం చేయటం వల్ల ఆయా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలు ఇట్టే అర్థమవుతాయి. అంతేకాదు, తెలంగాణ ప్రాంతంలో జరిగే పండుగల, జాతర సమయాల్లో ప్రదర్శించే కళల మూలంగా చక్కటి ఉల్లాసం, ఆనందం, వినోదం కూడా కలుగుతాయి. అటువంటి ఉల్లాసం, ఆనందం, వినోదం కలిగించే జానపద కళల్లో ‘ఒగ్గుకథ’ ప్రధానమైనది. ఈ కథ పుట్టుక కళల కాణాచిగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలోనే ఆరంభమైంది. తెలంగాణ ప్రాంతంలో కురుమ గొల్లలుగా పేరుగాంచిన గొల్లవారు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఒగ్గుకథ కళారూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఒగ్గుకథకులు ఉపయోగించే ప్రధాన వాయిద్యం ఒగ్గు. ఇది చర్మంతో తయారు చేయబడి, శివుని చేతిలోని ఢమరుకాన్ని పోలి ఉంటుంది. ఈ ‘ఒగ్గు’ అనే పదం ‘జెగ్గు’ అనే పదం నుంచి ఉద్భవించింది. ‘ఒగ్గు’ సాయంతో చెప్పే కథలను ‘ఒగ్గు కథలు’ అంటారు. ‘ఒగ్గు’ పరికరాన్ని ఉపయోగించి చెప్పే కథకులను ఒగ్గోళ్ళు, ఒగ్గులు, ఒగ్గు కథకులుగా పిలుస్తారు’ (కమలాకర శర్మ 430) అని ఆచార్య సూర్య ధనుంజయ్ పేర్కొన్నారు. ఈ ప్రకారం ఒగ్గుకథ కళారూపంలో ‘ఒగ్గు’ అనే పరికరం చాలా ప్రధాన వాయిద్యంగా ఖ్యాతి గడించింది. ఒక్క మాటలో చెప్పాలంటే- ‘ఒగ్గు’ లేకుండా కథలు చెప్పరు. అయితే ఒగ్గుకథను ప్రదర్శించే సమయంలో ఒగ్గుతో పాటు పెద్ద డోలు, ఇత్తడి తాళాలు, నపిర, కర్రలు, గజ్జెలు, కంజెర, పిల్లనగ్రోవి వంటి పరికరాలను ఉపయోగిస్తారు. శైవ సంప్రదాయానికి సంబంధించిన ఒగ్గుకథ కళారూపంలో ఉపయోగించే ప్రతి వాయిద్యానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంటుంది. అంతేకాకుండా కథాగానంలో ఒక్కో విషయానికి ఒక విధంగా గానం చేస్తున్నప్పుడు, ఆ గానానికి అనుగుణంగా వాయిద్యాలు వాయిస్తారు. ఇంతటి చారిత్రక నేపథ్యం కలిగిన ఒగ్గుకథను ఏ విధంగా ప్రదర్శిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
3. ఒగ్గుకథ ప్రదర్శన విధానాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ‘ఒగ్గుకథ’ కళారూపాన్ని ప్రదర్శించే విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే- ఒగ్గుకథలో ప్రధానంగా మొత్తం నలుగురు వ్యక్తులు ఉంటారు. అందులో ఒకరు ప్రధాన గాయకుడు, ఇద్దరు వాయిద్యగాళ్ళు, డోలు వాయించే ఒకరు ఉంటారు. మరికొన్ని బృందాల్లో ప్రధాన గాయకుడితో పాటు ఇద్దరు డోలు వాయిద్యగాళ్ళు, ఇద్దరు తాళాలు మోగించేవారు, ‘నపిరి’ అనే కొమ్ము వాయిద్యాన్ని మోగించే ఒకరు ఉంటారు. ఇంకొన్ని బృందాల్లో ఇద్దరు ప్రధాన కథకులు (ఒకరు స్త్రీ వేషధారిగా ఉంటారు), మరో ఇద్దరు లేదా ముగ్గురు వాద్య సాయం అందిస్తూ, వంతపాడతారు. ఒగ్గుకథలో ముఖ్యమైన పాత్ర ప్రధాన కథకుడిది. ఇతను కాళ్ళకు గజ్జెలు కట్టుకొని చేతిలో ఒగ్గును పలికిస్తూ కథాగానం చేస్తాడు. కథలో వచ్చే వివిధ పాత్రలను అనుకరిస్తూ కథను ముందుకు నడిపిస్తాడు. అంతేకాదు, నడుముకు పటకా కట్టుకొని, ఒక చేతితో కర్ర పట్టుకొని ముందుకు వెనక్కు అడుగులు కదుపుతూ, చేతిగుడ్డను ప్రేక్షకులవైపు ఊపుతూ కథాగానం చేస్తాడు. కథ సందర్భాన్ని బట్టి స్త్రీ పాత్ర కూడా ప్రధాన కథకుడే వేస్తాడు. ఆ సమయంలో (స్త్రీ పాత్ర వేసినప్పుడు) నడుముకు కట్టుకున్న కండువా గుడ్డను తలమీద ముసుగుగాను, పైట కొంగుగాను మార్చుకుంటాడు. సాధారణంగా ప్రధాన కథకుడు జుట్టు పొడుగ్గా పెంచుకొని, కాలి వేళ్ళకు మెట్టలు ధరిస్తాడు. కథ నడుస్తున్న సమయంలో ప్రధాన కథకుడు పాడే ప్రతి పాటలోని పాదాలను సహాయకులు అనువర్తిస్తూ, మధ్య మధ్యలో హాస్యాన్ని అందిస్తుంటారు. ముఖ్యంగా ఒగ్గుకథ ద్వారా గొల్లకురుమలు తమ మూలపురుషుడైన బీరప్ప, మల్లన్నల శూరత్వాన్ని కథలుగా చెప్తుంటారు.
ఒగ్గుకథ ప్రదర్శన విధానంలో వేషధారణ కూడా ముఖ్యమైనది. ఒగ్గు కథకుల వేషధారణను పరిశీలిస్తే- అది సాధారణంగా ఉండదు, మరీ ఆడంబరంగా ఉండదు. సమాజానికి దగ్గరగా, మధ్యస్తంగా ఉంటుంది. ప్రధాన కథకుడు అంచు ధోతి, లాల్చీ, కాస్త బిగుతైన అంగీ, నడుముకు నాగబంధం, దండ గడియాలు, చేతి కడియాలు, ఉంగరాలు, కుడి కాలి వేలికి మెట్టే, కాళ్ళకు కంచు గజ్జెలు, చెవులకు మకర కుందనాలు ధరించి భుజాన గొంగడి ధరిస్తాడు. స్త్రీ వేషాన్ని గమనిస్తే కథానుగుణంగా వచ్చే అన్ని రకాల స్త్రీ పాత్రలకు ఒకే రకమైన వేషధారణ ఉంటుంది. అయితే పురుష పాత్రదారి చేతిలో కట్లకోల ధరిస్తే, స్త్రీ వేషధారి చేతిలో దస్తురుమాలు ధరించి కథాగానం చేస్తాడు. వంతకుల విషయానికొస్తే- వంతకులందరు ధోతులు, సాధారణ అంగీలు ధరిస్తారు. కాని ఈనాడు అందరు ఒకే విధమైన బట్టలను ధరిస్తున్నారు. స్త్రీ పాత్ర వేసేవారు వివిధ రకాల విగ్గులు ధరిస్తున్నారు. సాధారణంగా ఒగ్గుకథ ప్రదర్శన రాత్రిపూట ప్రారంభమవుతుంది. ఎల్లమ్మ పండుగ, బీరప్ప పండుగ, మల్లన్న పట్నాలు, చౌడమ్మ కొలువుల సమయాల్లో మాత్రం రాత్రి పగలు సాగుతుంది. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా మరణిస్తే సందెపీనుగు (సాయంత్రం వ్యక్తి మరణిస్తే వెంటనే అంతిమ సంస్కారాలు చేయడం వీలుకాక, తెల్లవారే దాకా శవాన్ని ఉంచుకొని జాగరణ చేయడం) సమయంలోను, దశదినకర్మ రోజున, సంవత్సరికం రోజున, గృహ, గ్రామ సంబంధమైన పండుగల సమయాల్లోను, నవరాత్రుల ఉత్సవాల్లోను, రాజకీయ ప్రచారాల్లోను ఒగ్గుకథను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
4. ఒగ్గుకథ పాటలు - ఇతివృత్తం
జానపద కళాకారులు వారి కళలను ప్రదర్శించేముందు కొన్ని ముఖ్యమైన సంప్రదాయాలను తప్పనిసరిగా పాటిస్తారు. అందులో ప్రార్థన ఘట్టం ప్రధానమైనది. సాధారణంగా తెలుగు ప్రాంతాల్లో నివసించే జానపదులు ఏదైనా ఒక శుభ కార్యాన్ని తలపెడితే మొదటగా వినాయకుడికి ప్రార్థన చేస్తారు. కాని ఒగ్గుకథ కళాకారులు గంగమ్మను ప్రార్థిస్తారు. ఆ తరువాత గణపతితో పాటు సకల దేవతలను ప్రార్థిస్తూ- మల్లన్న, బీరప్ప, రేణుకా ఎల్లమ్మలకు సంబంధించిన కథలను పాటలుగా పాడుతారు.
4.1. గంగా ప్రార్థన
‘శరణు శరణు మా యమ్మ రాణి శాంభవి రాణి శాంభవి రాణి కరుణ జూడు మమ్ము గన్నతల్లి గంగాభవాని గంగాభవాని ముందు మా యాదవులకు మూల దేవత మూల దేవత మందలోన నెలకొన్న మగువ చౌడమ్మ దేవి చౌడమ్మ దేవి గంగ వచ్చే చూడరమ్మా గాలి మేఘాన గాలి మేఘాన సాలు సాలు యా వందనాలు సాలొందనాలు సాలొందనాలు సాగనంపగ తోడు పంపె సల్ల పటువాలు, ఎల్లపటువాలు, లాలీ లాలీ మా అమ్మ లాలి లాలమ్మ లాలీ లాలమ్మ లాలి లాలి ముద్దుల పాట పాడు రాజు మల్లెల తీగ మల్లెల’ (రాజిరెడ్డి మహేందర్ రెడ్డి 189) అంటూ ప్రార్థన ముగిస్తారు.
ఓ గంగ మా తల్లి..
మా తల్లి ఓ గంగమ్మ..
గంగాధరుని ప్రియ గంగమ్మ
పాపాలను పోగొట్టే పవిత్ర గంగమ్మ
పార్వతీ పరమేశ్వరుల పాద గంగమ్మ
జలజల పారే జగద్గంగమ్మ
జనుల పాపాలు పోగొట్టే గంగమ్మ
మా మాటలకు మాధుర్యం ఇవ్వమ్మా
మా కథలకు విజయము కలిగించమ్మా
అంటూ గంగమ్మను ప్రార్థిస్తే చేసిన పాపాలు పోతాయని, పంటలు బాగా పండుతాయని, పంటలు బాగా పండితే ప్రజల కష్టాలు తీరుతాయని తెలియజేస్తారు.
4.2. స్త్రీ లక్షణాల పాట
ఒగ్గుకథలో పాడే పాటలు కథను ఆధారంగా చేసుకొని ఆశువుగా సాగుతుంటాయి. సందర్భానుసారంగా కొన్ని పాటలు సంక్షిప్తంగా సాగితే, మరికొన్ని పాటలు విపులంగా సాగుతుంటాయి. అటువంటి పాటల్లో పెళ్లీడుకొచ్చిన బీరప్ప ఎటువంటి లక్షణాలు కలిగిన స్త్రీని పెళ్లి చేసుకుంటే సంసారం బాగుంటుందో తెలియజేస్తూ- ఎలమ్మ చెప్పిన అంశాలను పాటగా పాడుతుంటారు.
వినవయ్య తమ్ముడ నాయి తమ్ముడ చిన్ని తమ్ముడ
పిల్ల, నల్లగున్నగాని ముద్దుగుండాలె ముద్దుగుండాలె
ఈడుకు ఇరవై ఏండ్లుండాలె ఏండ్లుండాలె
దానికి, తుప్పురెంటికలు లేకుంటజూడు లేకుంటజూడు
నెత్తినమాడ లేకుంటజూడు లేకుంటజూడు
పాపెట్లసుడి లేకుంటజూడు లేకుంటజూడు
ఎత్తు పండ్లు లేకుంటజూడు లేకుంటజూడు
నాలికన మచ్చ లేకుంటజూడు లేకుంటజూడు
చెంపకు సుడి లేకుంటజూడు లేకుంటజూడు
జిర్ర పెదవు లేకుంటజూడు లేకుంటజూడు (రాజిరెడ్డి మహేందర్ రెడ్డి 202)
అంటూ ప్రతి యువకుడు పెళ్లి చేసుకునేముందు స్త్రీ విషయంలో గుర్తించవలసిన అంశాలను ఈ పాట ద్వారా వెల్లడించారు.
4.3. వ్యవసాయ పాట
ఏ కళారూపమైనా సమాజాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి. భూమి ఆరంభం నుండి నేటి దాకా సమాజంలో ముఖ్యభూమిక పోషిస్తున్న జానపదుల సంస్కృతి, సంప్రదాయాలు, వ్యధలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రసార సాధనం కావాలి. పగలనక, రాత్రనక శ్రమించే పల్లెవాసులకు అద్భుతమైన అనుభూతిని, ఉల్లాసాన్ని కలిగించాలి. నాగలి చేతపట్టి పొలం దున్నే రైతన్న కష్టాన్ని మాన్పించే మందు కావాలి. ఒక్కమాటలో చెప్పాలంటే గ్రామీణ జీవన వృత్తుల విశిష్టతను రికార్డ్ చేసే పరికరం కావాలి. అటువంటి కళారూపమే తెలంగాణ ఒగ్గుకథ. ఈ ఒగ్గుకథ ద్వారా గ్రామాల్లో నివసించే వివిధ కులాలకు చెందిన కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్, గౌడ, చాకలి వంటి వృత్తులను పాటల రూపంలో ప్రదర్శించవచ్చు.
అల్లోనేరేడల్లో అల్లోనేరేడల్లో అల్లల్లనేరడి సల్లనేరెడి అల్లోనెరెడల్లలో
సల్లనేరడి క్రింద సల్లని శెలిమె అల్లోనెరెడల్లో
సల్లని శెలిమెకు సంగడిపాట అల్లోనెరెడల్లో
బంగారి బొక్కెన బాయికున్నది అల్లోనెరెడల్లో
ఎండియగిరికలు మోటకున్నయి అల్లోనెరెడల్లో
ఆమోట నడిచేటి ఎడ్లపేరేమి అల్లోనెరెడల్లో
రానున్న లచ్చన్న లక్కజోడెడ్లు అల్లోనెరెడల్లో
మోటగొట్టేవాడు మొగలిపురాజు అల్లోనెరెడల్లో
కాల్వదీసేవాడు ఘనబుగ్గరాజు అల్లోనెరెడల్లో (రాజిరెడ్డి మహేందర్ రెడ్డి 207)
4.4. అన్నదమ్ముల ఆప్యాయత పాట
జానపద సాహిత్యం ఒక తరం నుండి మరొక తరానికి మౌఖికంగా అందించబడుతూ- ఈనాడు పుస్తకాల రూపంలో, సినిమాల రూపంలో, సామాజిక మాధ్యమాల రూపంలో నమోదు చేయబడుతుంది. గత 20 - 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి కుటుంబంగా జీవించిన అన్నదమ్ములు నేడు రకరకాల కారణాల వల్ల ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా జీవిస్తున్నారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల కోసం కోట్లాడుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యాన్ని వస్తువుగా స్వీకరించి అన్నదమ్ములు ఏ విధంగా ఉంటే కలిసిమెలిసి ఉండొచ్చు? అనే విషయాన్ని ఒగ్గుకథ కళాకారులు ఈ క్రింది పాట ద్వారా చక్కని పరిష్కారం చూపారు.
కోరుకుంటే రాజ్యాలు దొరుకుతాయి
ఎత్తుక తిరిగితే ఏడూళ్ళు దొరుకుతాయి
చేసుకుంటే పెళ్ళాము దొరుకుతది
చెడిపోతే చెడ్డదే దొరుకుతది
కొంటె భూములు దొరుకుతాయి
కంటే పిల్లగాండు పుడతారు
కానీ..
తోడబుట్టిన తోడు దొరకదు అన్నా.. (రాజిరెడ్డి మహేందర్ రెడ్డి 253)
5. ఒగ్గుకథ గొప్పదనం – సామాజికాంశాలు
తెలంగాణ జానపద కళారూపాల్లో ఒగ్గుకథకు ఉన్న ప్రధానమైన గొప్పదనం ‘సామాజికత’. ఈ కథను చెప్పేవారు నలభై రోజుల పాటు గురువుల వద్ద మండల దీక్ష చేస్తారు. ఒగ్గుకథ ద్వారా బీరన్న, మల్లన్నల చుట్టూ అల్లబడిన కథలనే కాకుండా, గ్రామ దేవతలుగా పేరుపొందిన ఎల్లమ్మ గాథలను కూడా చెప్తారు. అంతేకాదు, గ్రామీణ సమాజంలోని జీవన విధానాలను, కుల వ్యవస్థలను, వృత్తి సంబంధాలను, నైతిక విలువలు, ధర్మబోధ, సామాజిక న్యాయాన్ని ప్రేక్షకుల ముందుంచుతారు. ఒగ్గుకథ కళారూపం ద్వారా ప్రధానంగా బీరన్న, మల్లన్న కథలు చెప్పబడినప్పటికీ, ఆ కథల నేపథ్యంలో కురుమల జీవన విధానం, గొర్రెల పెంపకం, పశుపోషణ, ప్రకృతి మీద ఆధారపడి జీవించే రైతుల వాస్తవ పరిస్థితులను వెల్లడి చేస్తుంది. వీటితో పాటు రాజ్యాధికారాలు, దమనకాండ, అన్యాయం, పేదలపై జరిగే దోపిడీ వంటి సామాజిక సమస్యలను కూడా ప్రతిబింబిస్తుంది. చివరగా ఒగ్గుకథ ప్రదర్శనలో ప్రధాన కథకుడు కథను చెప్పడమే కాకుండా, సామాజిక అవగాహన కలిగించే సందేశాలను పాటల రూపంలో అందిస్తాడు. ధర్మం–అధర్మం, మంచి–చెడుల మధ్య ఉండే తేడాలను సరళమైన భాషలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కథాగానం చేస్తాడు. గ్రామాల్లో ఆనాటి నుండి నేటి వరకు ఒగ్గుకథ ప్రదర్శనను వీక్షించడానికి కుల, మత, వర్గ భేదాలతో సంబంధం లేకుండా అందరూ పాల్గొంటారు. ఈ కారణంగా సామాజిక సమైక్యత బలపడుతుంది. అంతేకాకుండా, గ్రామాల్లో జరిగే జాతరలు, పండుగల సందర్భాల్లో ఒగ్గుకథ ప్రజలను ఒకచోట చేర్చి సామూహిక ఆనందాన్ని, సాంస్కృతిక ఐక్యతను పెంపొందిస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- ఒగ్గుకథ కళారూపం తెలంగాణ గ్రామీణ జీవనానికి, సామాజికతకు అద్దం వంటిది అని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇంతటి గొప్పదనం సంతరించుకున్న ఒగ్గుకథ కళారూపాన్ని దేశ, విదేశాలకు చాటిచెప్పిన కళాకారుల్లో మిద్దె రాములు, చుక్కా సత్తయ్య, చిట్టి కొమురయ్య వంటి ప్రముఖులు ఎందరో ఉన్నారు.
6. ఒగ్గుకథ సామాజిక ప్రయోజనాలు
పాశ్చాత్య సాహిత్యం మూలంగా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన కథ, నాటకం, నవల వంటి ప్రక్రియల వల్ల సమాజానికి, సాహిత్యానికి ఎంతటి ప్రయోజనం ఉందో, జానపద కళారూపాల్లో ఒగ్గుకథకు అంతటి ప్రయోజనం ఉంది. ఎందుకంటే ఒగ్గుకథ ఆనాటి నుండి నేటి వరకు తెలంగాణ మాండలిక పదాలను కంటికి రెప్పలా కాపాడటమే కాకుండా, తెలంగాణ పల్లెల్లో నివసిస్తున్న ప్రజల సంస్కృతి-సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను సంరక్షిస్తుంది. ఒగ్గుకథ వల్ల ప్రధానంగా మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది- ఇది సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు దోహదపడే కళారూపం. శతాబ్దాల కాలంగా మౌఖిక సంప్రదాయంగా కొనసాగుతున్న ఈ కళ ద్వారా తెలంగాణ ప్రాంతానికి చెందిన పురాణాలు, ఇతిహాసాలు, స్థానిక దేవతల కథలు ఒక తరం నుండి మరొక తరానికి అందుతున్నాయి. రెండవది- ఒగ్గుకథ సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, దురాచారాలు, అసమానతలను కథల రూపంలో ప్రజల ముందుంచి మంచి అవగాహనను కలిగిస్తుంది. అలాగే నీతి, ధర్మం, మానవత్వం వంటి విలువలను బలంగా ప్రతిపాదిస్తుంది. మూడవది- ఇది వినోదాత్మక కళారూపం. పాట, నృత్యం, హాస్యం, నటన అన్నీ కలిసిన ప్రదర్శన కళారూపం. పల్లెల్లో నివసించే ప్రజలకు ఉల్లాసం, ఆనందాన్ని అందిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇతర వినోద సాధనాలు లేని కాలంలో ఒగ్గుకథ ఒక ప్రధాన వినోద మాధ్యమంగా నిలిచింది అంటే ఒగ్గుకథ శక్తి ఎటువంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రాచీన కాలం నుండి ఒగ్గుకథ కళాకారులకు ఒక జీవనాధార వృత్తిగా కొనసాగుతుంది. నేడు ఈ కళారూపం ద్వారా ఉపాధి పొందడమే కాకుండా, కళాకారుల ప్రతిభకు గుర్తింపును అందిస్తుంది. ఒగ్గుకథను తెలంగాణ ఉద్యమ సమయంలోను, దేశ, విదేశాల్లో ప్రదర్శించడం వల్ల ఈ కళకు అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పెరిగింది.
7. ఆధునిక యుగంలో ఒగ్గుకథ సవాళ్లు - పరిష్కారాలు
ప్రాచీనకాలంలో వారాల తరబడి ప్రజలకు మంచి వినోదం, ఉల్లాసం, ఆనందం కలిగించిన ఒగ్గుకథ కళారూపం ఈనాడు అనేక సవాళ్లను ఎదుర్కుంటుంది. ఎందుకంటే- గతకొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా, భారతదేశవ్యాప్తంగా సాంకేతికత పేరుతో టెక్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ కారణంగా సామాజిక మాధ్యమాలు, టెలివిజన్, డిజిటల్ యాప్స్ పేర్లతో కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ టెక్నాలజీ వల్ల నేటి సమాజానికి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని సమస్యలు కూడా ఉన్నాయంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాచీన కాలం నుండి ఆధునిక కాలం వరకు మౌఖిక రూపంలోను, కళాకారుల ప్రదర్శనల ద్వారా సంరక్షించబడుతున్న జానపద కళలు ఒక్కొక్కటిగా కనుమరుగయ్యే పరిస్థితికి చేరుకుంటున్నాయి. ఒకవైపు టీవీల్లో, యూట్యూబ్లో ప్రసారమవుతున్న రీల్స్, సీరియల్స్, వినోద కార్యక్రమాల కారణంగా జానపద కళలకు ఆదరణ తగ్గిపోతుంటే, మరోవైపు ఒగ్గుకథ కళారూపాన్ని నేర్చుకోవడానికి అవసరమయ్యే దీక్ష, కాలవ్యయం, పాటలు, హావభావాలు ఈనాటి యువతకు ఆటంకాలుగా మారాయి. ఇంకోవైపు ఒగ్గుకథ కళాకారులకు తగిన ఆర్థిక భద్రత లేకపోవడం, ప్రదర్శనలకు సరైన పారితోషికం లభించకపోవడం, స్థిరమైన ఉపాధి లేకపోవడం వల్ల చాలా మంది కళాకారులు ఇతర వృత్తులను ఎంచుకుంటున్నారు. దీనివల్ల ఒగ్గుకథ కళ తరతరాలకు బదలాయించే సంప్రదాయం బలహీనపడుతోంది.
ఇటువంటి సవాళ్ల మధ్య ఒగ్గుకథ సజీవంగా బ్రతకాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంస్కృతిక శాఖలను ఏర్పాటు చేసి, జానపద కళల అభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటును అందించాలి. ఇతర వృత్తుల్లో స్థిరపడిన ఒగ్గు కళాకారులను గుర్తించి, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు, పురస్కారాలు అందిస్తూ ఒగ్గుకథను ముందు తరాలకు అందించాలి. అలాగే, ప్రతి పాఠశాలలోను, కళాశాలలోను, విశ్వవిద్యాలయాల్లోను ఒగ్గుకథపై అవగాహన కల్పించి విద్యార్థులచే, పరిశోధకులచే ప్రదర్శనలు చేయించాలి. సాహితీవేత్తలు ఒగ్గుకథపై పరిశోధన వ్యాసాలు, సెమినార్లు, వర్క్షాపులు నిర్వహించి అకాడమిక్ స్థాయిలో ఈ కళకు సరైన గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి. ఒగ్గుకథ ప్రదర్శనలను ఆడియో–వీడియో రూపంలో రికార్డు చేసి యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయాలి. పాఠ్య పుస్తకాల్లోను ఒగ్గుకథ కళారూపాలకు స్థానం కల్పించి ప్రాజెక్టులు, పరిశోధనలు చేయించాలి. ఆధునికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, అనుసంధానం చేస్తూ ఒగ్గుకథ విలువను భవిష్యత్తు తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలి.
ఉపసంహారం
తెలంగాణ జానపద కళారూపాల్లో ఒగ్గుకథకు ఉన్న స్థానం విశిష్టమైనది. కురుమ కులస్థుల జీవన విధానంతో ముడిపడి ఉన్న ఈ కళారూపం శైవ సంప్రదాయానికి సంబంధించింది. ఒకవైపు భక్తి భావాన్ని ప్రతిబింబిస్తూనే, మరోవైపు సమాజంలోని వాస్తవాలను కళాత్మకంగా ప్రజల ముందుంచుతుంది. ఈ ఒగ్గుకథ ద్వారా ప్రజలకు ప్రధానంగా ధర్మబోధ, సామాజిక అవగాహన, వినోదం ఒకేసారి అందుతాయి. సమాజంలో ప్రతినిత్యం జరుగుతున్న సమకాలీన సమస్యలు మద్యం దుష్ప్రభావాలు, మహిళా సాధికారత, ప్రకృతి సంరక్షణ, రైతు సమస్యలు, ఆన్లైన్ గేమ్స్ వంటి అంశాలపై ఒగ్గుకథ ద్వారా అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. ఆధునిక కాలంలో జానపద కళలు అంతరించిపోతున్న పరిస్థితుల్లో ఒగ్గుకథ వంటి కళారూపాలను పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసి, సంరక్షించాల్సిన ఆవశ్యకత కూడా అందరిపైన ఉంది. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలోను, విదేశాల్లోను ఒగ్గుకథను ప్రదర్శించాలి. అప్పుడే పది కాలాలపాటు ఒగ్గుకథ సజీవంగా ఉంటూ వందల మంది కళాకారులకు ఉపాధినిస్తుంది. నవ సమాజానికి దారులు వేస్తుంది.
- ఒగ్గుకథ తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వాన్ని, శైవ సంప్రదాయాలను ప్రతిబింబించే ఒక విశిష్ట జానపద కళ.
- ఇది కుల సంప్రదాయం, కళా సంప్రదాయం రెండింటిని ఏకకాలంలో సమ్మేళనం చేసి, సామాజిక ఐక్యతను పెంపొందిస్తుంది.
- ప్రదర్శన విధానంలో ప్రధాన గాయకుడు, వంతదారులు, వాయిద్యగాళ్ళు పాల్గొని కథను, పాటలను, హాస్యాన్ని సమర్ధవంతంగా అందిస్తారు.
- గంగా ప్రార్థన, స్త్రీ లక్షణాలు, వ్యవసాయం, అన్నదమ్ముల అనుబంధం వంటి విభిన్న ఇతివృత్తాలతో కూడిన పాటల ద్వారా సామాజిక సందేశాలను అందిస్తుంది.
- ఆధునిక సాంకేతికత పెరిగిన నేపథ్యంలో ఒగ్గుకథ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, సాహితీవేత్తలు కృషి చేయాలి.
- ఈ కళారూపాన్ని ప్రోత్సహించడం వల్ల కళాకారులకు ఆర్థిక భద్రత, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, భవిష్యత్ తరాలకు సాంస్కృతిక విలువలు అందుతాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- కమలాకర శర్మ, సాగి. కదంబం తెలుగు సాహిత్య ప్రక్రియలు – రూపాలు. శ్రీ సాయి ప్రాసెస్ ప్రింటర్స్, 2014, హైదరాబాద్.
- దొణప్ప, తూమాటి. ఆకాశ భారతి. సుధారా పబ్లికేషన్, 1989, హైదరాబాద్.
- ధనుంజయ్, సూర్య. తెలుగు సాహితీ దుందుభి. తెలుగు అకాడమి, 2024, హైదరాబాద్.
- నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటం. నవ్య పరిశోధక ప్రచురణలు, 1983, తిరుపతి.
- మహేందర్ రెడ్డి, రాజిరెడ్డి. ఒగ్గుకథ సమగ్ర పరిశీలన. మారామ ప్రచురణలు, 2026, సిద్దిపేట జిల్లా.
- మోహన్, జి. ఎస్. జానపద విజ్ఞానాధ్యయనం. ప్రసారాంగ ప్రచురణలు, 2010, కుప్పం.
- రామరాజు, బిరుదు. తెలుగు జానపద సాహిత్యము. తెలుగు అకాడమి, 1956, హైదరాబాద్.
- శాస్త్రి, ద్వా.నా. తెలుగు సాహిత్య చరిత్ర. ప్రగతి పబ్లిషర్స్, 2014, హైదరాబాద్.
- సైదులు, నారగోని. ముకుంద రామారావు సాహిత్యం - ఒక పరిశీలన. రేణుశ్రీ ప్రింటర్స్, 2025, హైదరాబాద్.
- సుందరం, ఆర్వీయస్. ఆంధ్రుల జానపద విజ్ఞానం. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణలు, 2018, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

