headerbanner

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-03 | March 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. ఆందోల్ సంస్థానం: చారిత్రకావలోకనం

డా. చంద్రకాంత్ మునేశ్వర్

సహాయాచార్యులు, చరిత్ర శాఖ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎల్లారెడ్డి,
కామారెడ్డి జిల్లా, తెలంగాణా
సెల్: +91 9989538243, Email: chandrakanthmuneshwar1980@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 12.02.2026        ఎంపిక (D.O.A): 22.02.2026        ప్రచురణ (D.O.P): 01.03.2026


వ్యాససంగ్రహం:

భారత దేశ చరిత్ర ఆది నుండి మహోన్నత ఘనత కల్గి కీర్తి గడించినది. తెలంగాణ చరిత్రలో సామంత రాజ్యాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ సామంత రాజ్యాలలో ఆందోల్ సంస్థానం ఒకటి ప్రముఖమైనది. పాపన్నపేట సంస్థానం లేదా మెదక్ సంస్థానంగా కూడా పిలువబడే ఈ రాజ్యం, సుమారు 700 సంవత్సరాల పైబడి తన ప్రత్యేక గుర్తింపుతో నిలిచింది. హైదరాబాద్ నిజాం పరిపాలనా కాలంలోని 14 ప్రముఖ సంస్థానాలలో ఇది అతిపెద్దది. ఆందోల్-జోగిపేట జంట పట్టణాలు భారత దేశ చరిత్రకు, ప్రాచీన భారతీయ సంస్కృతిక, ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు వారసత్వానికి నిలయం, ఉద్యమాల పురిటి గడ్డ, సహజ ప్రకృతి సౌందర్యాత దీని సొంతం, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రథమాంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ ఆందోల్-జోగిపేట. భాషా సంస్కృతిక, సాహిత్యం కళల కాణాచి, వర్తక వాణిజ్య కేంద్రం, వైదిక, జైన, భౌద్ద మతాలకు పవిత్ర స్థలం. ప్రస్తుత పరిశోధన వ్యాసంలో ఆందోల్ సంస్థానము చారిత్రక, వారసత్వ, రాజకీయ, సాంఘిక, ఆర్ధిక,సంస్కృతిక, కళ సాహిత్య ప్రగతి వివిధ విశేషాల గురించి చారిత్రక దృష్టి కోణంలో చర్చిస్తుంది. ఆందోల్ పట్టణానికి,జోగిపేట పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది. చారిత్రక, వారసత్వ,రాజకీయ ప్రాముఖ్యత, ఆర్ధిక ప్రగతి, సాంఘిక చైతన్యం, మత విషయాలు, సంస్కృతిక నేపథ్యం, ప్రముఖ సాహిత్యం కేంద్ర, పురాతన వారసత్వ సంపదకు నిలయం, ఆందోల్ -జోగిపేట ప్రగతి వివిధ విషయాలు అదేవిదంగా అందోల్ సంస్థానం జోగిపేట పర్యాటకం, చారిత్రక, పురావస్తు, వారసత్వ సంపదను, సాంఘిక,సంస్కృతిక వైభవం గల వాటిని కాపాడడం, చారిత్రక,వారసత్వ పర్యాటక దృష్టి కోణంలో ప్రస్తుత వ్యాసంలో చర్చించబడింది. అందోల్ సంస్థానము-జోగిపేట చారిత్రక, వారసత్వ అంశాల దృష్టి కోణంలో పరిశోధనలు అతి తక్కువ జరిగాయి. ఆందోల్, జోగిపేట చారిత్రక ప్రాముఖ్యత గురించి తెలియపరచడం, ఆందోల్ సంస్థానము జోగిపేట వారసత్వ సంపద ప్రాముఖ్యత గురించి వివరించడము ముఖ్య ఉద్దేశ్యం. ప్రాథమిక, ద్వితీయ ఆధారాలను ప్రామాణికంగా తీసుకోని పరిశోధన పత్రము సమర్పిస్తాను. అందుబాటులో ఉన్న అనేక రచనలను సేకరిస్తాను చారిత్రక రచనలు, పురావస్తు నివేదికలు, ప్రముఖ చరిత్రకారుల రచనలు, పురావస్తు నివేదికలు, పరిశోధన గ్రంథాలు, రాజ్యభిలేఖ పరిశోధనాలయ సమాచారం, ప్రభుత్వ నివేదికలు, జిల్లా గజీటీర్స్, ప్రభుత్వ రికార్డులు, ప్రముఖ మాసపత్రికలు, పరిశోధనపత్రికలు, దినపత్రికలలో అచ్చైన సమాచారము, క్షేత్రపర్యటన ద్వారా స్వయంగా స్థానికుల నుండి సేకరించిన సమాచారమును ఆధారంగా చేసుకొని పరిశోధన కొనసాగిస్తాను. ఇది ఆందోల్ సంస్థానము-జోగిపేట గురించి అధ్యయనం చేస్తున్న పరిశోధకులకు మార్గదర్శకంగా ఉంటుందని ఆశిస్తున్నాను.

Keywords: ఆందోల్, జోగిపేట, జైన బస్తీ, జోగినాథ్, జోగుల గుట్ట, మాంజీరిక, అనంత రెడ్డి, రామినేడు, రాణి శంకరమ్మ, రంగనాథ స్వామి, అల్లమారెడ్డి, ఆందోల్ కోట, గడి, ఉద్యమం, నిజాం ఆంధ్ర మహాసభ, మహిళ చైతన్యం. ఉత్సవాలు, గడియార స్థంభము, రంగనాథ సాగర్, మెట్ల బావి,పర్యాటకము, పరిరక్షణ

1. పరిచయం

తెలంగాణ చరిత్రలో సామంత రాజ్యాలకు ప్రత్యేక స్థానం. వీటిలో ఆందోల్ సంస్థానం ప్రముఖమైంది. ఆందోల్/పాపన్నపేట సంస్థానం, మెదక్ సంస్థానంగా కూడా పేరు పొందింది. ఇది సుమారు 700 సంవత్సరాలుగా తన ప్రత్యేక గుర్తింపును నిలుపుకుంది. నిజాం పాలనా కాలంలోని 14 ప్రముఖ సంస్థానాలలో అతిపెద్దది ఇది. ఆందోల్ సంస్థానం-జోగిపేట భౌగోళీకంగా భారతదేశ దక్షిణ భాగంలోని దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని పూర్వ ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో గల ఆందోల్ సంస్థానం-జోగిపేట ముఖ్యమైన పట్టణం. ఈ రెండు పట్టణాలు పక్కపక్కనే ఉండి ఒకే పట్టణ ప్రాంతంగా (Conurbation) పరిగణించబడతాయి.

ఆందోల్ సంస్థానం-జోగిపేట సంక్షిప్తంగా చారిత్రాత్మకంగా ఆందోల్, వాణిజ్యపరంగా జోగిపేట అనే రెండు ప్రాంతాలు పక్కపక్కనే ఉండి, ప్రస్తుతం ఒకే పట్టణంగా (ట్విన్ టౌన్స్) అభివృద్ధి చెందాయి. ఈ పట్టణం చారిత్రక వారసత్వానికి, సంస్కృతి, సాంఘిక జీవనానికి, వ్యాపార కార్యకలాపాలకు నిలయం. ఆందోల్-జోగిపేటలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక కాలాల్లో ఈ ప్రాంతం చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ప్రాంతం వివిధ శక్తివంతమైన రాజవంశాల పరిధిలో ఉండేది. ప్రాచీన కాలంలో మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకుల అనంతరం విష్ణుకుండీనుల ఏలుబడిలో, అదేవిధంగా బాదామి చాళుక్యుల పాలనలో ఇది భాగమైంది.

మధ్యయుగంలో రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్య, కాకతీయ, రెడ్డి రాజుల పాలనలో ఉచ్చ దశలో ఉండి, తర్వాత ఢిల్లీ సుల్తానుల, బహమనీ దక్కన్ సుల్తానుల ఏలుబడి అనంతరం గోల్కొండ కుతుబ్ షాహీల ఆధీనంలో ఉంటూనే ఆందోల్ రెడ్డి రాజులు స్వతంత్ర పాలన కొనసాగించారు. కుతుబ్ షాహి పాలకులను మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ క్రీస్తు శకం 1687లో ఓడించడంతో ఈ ప్రాంతం మొఘలుల ఆధీనంలోకి వచ్చింది. ఆందోల్ సంస్థాన పాలకులు మొఘల్ బాద్షాతో సత్సంబంధాలు నెలకొల్పి సామంత రాజులుగా పాలించి మొఘలుల మన్ననలను పొందారు. అనంతరం ఆధునిక కాలంలో అసఫ్ జాహీ నిజాంల ఆధీనంలో ఉంటూ స్వతంత్ర పాలన కొనసాగించారు. కుటుంబ తగాదాల వల్ల సంస్థానం చివరకు నిజాం రాజ్యంలో క్రీస్తు శకం 1934-35లో కలిసింది. నిజాం రాజ్యంపై భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ పోలో (పోలీస్ చర్య)తో ఏడవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి క్రీస్తు శకం 1947 సెప్టెంబర్ 17న లొంగిపోవడంతో ఈ ప్రాంతం భారత సమాఖ్యలో కలిసిపోయింది. ఈ సంస్థాన చారిత్రక వారసత్వ వైభవం అద్భుతమైనది. నాటి నుండి నేటికీ అజరామరంగా విరాజిల్లుతుంది (కమలాకర శర్మ సాగి 191-194).

2. ఆందోల్ పేరు వెనుక కథనం

స్థల పురాణం ప్రకారం, జగన్నాటక సూత్రధారి అయిన విష్ణుమూర్తి త్రేతాయుగంలో భక్తుల సేవలకు పులకించిపోయి దేవలోకం విడిచి మొదట అయోధ్యకు, ఆ తర్వాత దక్షిణ కావేరి నది తీరంలోని శ్రీరంగానికి, ఆ తర్వాత గరుడాద్రి మీదుగా ఆండాళుపురానికి వచ్చాడని చెబుతుంటారు. కాలక్రమంలో ఆండాళుపురము, అందాలపురంగా, ఆందోల్ పురంగా, నేడు ఆందోల్ గా అపభ్రంశమైందని స్థల పురాణం చెప్తుంది.

చారిత్రక ఆధారాల ప్రకారం, కాకతీయుల పతనానంతరం క్రీస్తు శకం 13వ శతాబ్దంలో రెడ్డి రాజుల ఏలుబడిలో అనేక చిన్నచిన్న సంస్థానాలు ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన వాటిలో ఒక చిన్న రాజ్యం ఆందోల్ సంస్థానం. శౌర్యా రాజుల మూలపురుషుడు అనంత రెడ్డి. ఇతను క్రీస్తు శకం 1485 సంవత్సరంలో ‘కల్పగూరును’ రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతమును బహమనీ సుల్తాన్ అయిన ‘ఫిరోజ్ షా బహమని’ నుండి ఈ జాగీరును బహుమతిగా పొందాడు. అనంత రెడ్డి మనవడు రామినేడు వ్యవసాయ భూముల కోసం అన్వేషిస్తూ మంజీర తీరంలోని ‘లంద’ ప్రాంతాన్ని చర్మకారుల నుండి ప్రతిఫలం చెల్లించి పొందాడు. ఇక్కడ రంగనాయక సాగర్ అను తటాకాన్ని, కోటను నిర్మించినట్లు ‘సురవరం ప్రతాప రెడ్డి’ రచించిన ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ ద్వారా తెలుస్తుంది. ‘లందవోలు’ ‘అందవోలు’ ‘ఆందోలు’గా కాలక్రమంలో మారిందని ఆందోల్‌లో ఉన్న శాసనాన్ని బట్టి చారిత్రక రచనల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా ఆందోలు పట్టణం సంస్థానానికి రాజధాని అయిందని చారిత్రక ఆధారాలు రుజువు చేస్తాయి (Epigraphia Indica 60-62).

2.1 చారిత్రక నేపథ్యం

ఆందోల్ సంస్థానానికి చారిత్రకంగా పాపన్నపేట సంస్థానం, రంగపేట సంస్థానం, మెదక్ సంస్థానం, కల్పగురు సంస్థానం అని కూడా పేరు. కాకతీయుల పతనానంతరం, కాకతీయ సేనా నాయకులలో ఒకరైన అనంతరెడ్డి క్రీస్తు శకం 1485 సంవత్సరంలో కల్పగూరును రాజధాని కేంద్రంగా చేసుకుని ఈ ప్రాంతమును దక్కన్ ‘బహమనీ సుల్తాన్’ అయిన ‘ఫిరోజ్ షా బహమ’ని నుండి జాగీరును బహుమతిగా పొంది పరిపాలన మొదలుపెట్టాడు. ఇతను సంస్థాన మూల పురుషుడు. వీరు పాకనాటి రెడ్ల శాఖకు చెందినవారు. వీరి గోత్రం మునిలోల గోత్రం ("రెడ్డి రాణి వీర గాథ").

2.2 భౌగోళిక విస్తరణ

ఆందోల్ సంస్థాన భౌగోళిక విస్తరణ ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా విస్తరించి ఉంది. ఆందోల్ సంస్థానం-జోగిపేట జంట పట్టణాలు భారత ఉపఖండంలోని తెలంగాణ రాష్ట్రం, ఒకప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా, ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సంగారెడ్డికి 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఆందోల్ సంస్థానం-జోగిపేట జంట పట్టణాలు ప్రాచీన భారత దేశ చరిత్రలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలోని మంజీరా నది పరివాహక ప్రాంతం. ప్రాచీన బౌద్ధ సాహిత్యం, పాలి భాషలోని బౌద్ధ జాతక కథ ఐన ‘సుత్తానిపాతము’ ప్రకారం మాంజీరిక దేశంగా ఇది పరిగణించబడింది. ఆందోల్ సంస్థానం సుమారు 24 పరగణాల పరిధి కలిగి ఉండేదని ‘నవాబ్ ఫ్రాముర్జ్ జంగ్ బహద్దూర్’ సుబేదార్ (రెవెన్యూ కమిషనర్) మెదక్, గుల్షానాబాద్ డివిజన్ చారిత్రక రెవెన్యూ రికార్డులను బట్టి తెలుస్తుంది. ‘ఆందోల్ పట్టణం’ సంస్థానానికి రాజధాని కేంద్రం. నాటి సామంత సంస్థానాలకు భిన్నంగా ఆందోల్ సంస్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆందోల్ సంస్థానం సొంత పాలనాధికారాలను కలిగి ఉండి, ప్రత్యేక గుర్తింపున్న పెద్ద సంస్థానం. తెలంగాణలో ప్రాచీన సంస్థానాలలో ఆందోల్/పాపన్నపేట సంస్థానం ఒకటి (శాస్త్రి 276-309).

2.3 సంస్థాన పాలకుల చరిత్ర

"ఆందోలు రాజుల చరిత్ర", "పాపన్నపేట రాజుల చరిత్ర", "మెదక్ రాజుల చరిత్ర", "రంగపేట రాజుల చరిత్ర" అని వివిధ పేర్లతో ఈ సంస్థాన పాలకుల చరిత్రను పిలుస్తారు. అనుబంధంగా సంగారెడ్డి, వెలమకన్నె, రామాయంపేట, శంకరంపేట్, కల్పగూరు, సదాశివానగర్, లింగంపేట, దౌల్తాబాద్ వంటి చిన్న సామంత రాజ్యాలు ఉండేవి. ఒకప్పుడు మెదక్ ప్రాంతం మొత్తం ఆందోల్/పాపన్నపేట సంస్థాన పరిధిలోనే ఉండేది.

క్రీస్తు శకం 1323 సంవత్సరంలో కాకతీయ రెండవ ప్రతాపరుద్రునిపై మహమ్మద్ బిన్ తుగ్లక్ దాడి చేసి కాకతీయ వంశాన్ని పతనం గావించిన తర్వాత, కాకతీయ సేనా నాయకులలో ఒకరైన అనంతరెడ్డి ‘కల్పగూరు’ పరగణాను జాగీరుగా క్రీస్తు శకం 1485 సంవత్సరంలో ‘దక్కన్ బహమనీ’ సుల్తాన్ అయిన ‘ఫిరోజ్ షా బహమని’ నుండి బహుమతిగా పొంది ‘కల్పగూరు’ను కేంద్రంగా చేసుకుని పరిపాలన మొదలుపెట్టాడు. అనంతరెడ్డి మనవడు రామినేడు క్రీస్తు శకం 1398-1400 ప్రాంతంలో పాలనకు వచ్చాడు. క్రీస్తు శకం 1418 సంవత్సరంలో రాజధానిని ‘కల్పగూరు’ నుండి ‘ఆందోల్’ పట్టణానికి తరలించి ‘ఆందోల్’ను రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని సుస్థిర పరచి విస్తరింపజేశాడు. ఇతడే ఆందోల్ కోట నిర్మాత. ఓంకారపురం (కోహీర్‌), పొట్లచెర్వు (పటాన్ చెరువు), తెలంగాణాపురం (తెల్లాపూర్), మెతుకు (మెదక్), కాపాల, రుద్రారం, అతినగరం, డాకూరు, భువనగిరి, నిజాంపేట, చందంపేట, దేవరకొండ, అల్లాదుర్గ్, నర్సాపూర్, దౌల్తాబాద్ వంటివి రామినేడు సంస్థానంలో భాగంగా ఉండేవి.

రామినేడు తర్వాత ముసలారెడ్డి, పెద్దరెడ్డి, అల్లమయ్య చౌదరి (అల్లమరెడ్డి), రామిరెడ్డి, మొదటి సదాశివరెడ్డి, పెద్దనరసింహారెడ్డి, మొదటి లింగాయమ్మ, లింగారెడ్డి, వెంకట నరసింహారెడ్డి, సూర్యప్రతాపరెడ్డి, రాజా వెంకటదుర్గారెడ్డి, వెంకట లక్ష్మాయమ్మ, రాజా రామచంద్రారెడ్డి సంస్థానాన్ని పరిపాలించారు. వెంకట నరసింహారెడ్డి (1720-60) కాలంలో సంస్థాన పరిధి తగ్గి చిన్న సంస్థానంగా మారిపోయింది. రామినేడు తర్వాత ఏడవ తరానికి చెందిన పెద్దనరసింహారెడ్డి సంస్థానాన్ని జనరంజకంగా పాలించాడు. ఔరంగజేబు నుండి ‘మెతుకు సర్కార్’ అను బిరుదును పొందాడు (శాస్త్రి 649-652).

2.3.1 రాణి శంకరమ్మ పరిపాలన

ఆందోల్/పాపన్నపేట సంస్థానాధీశులలో రాణి శంకరమ్మ 12వ తరానికి చెందిన మహారాణి. ఈమె గొప్ప ధీశాలి. క్రీ.శ 1702లో సంగారెడ్డి పట్టణానికి సుమారు 12 కి.మీ దూరంలో ఉన్న గౌడిచర్ల గ్రామంలో జన్మించింది. శంకరమ్మ పరాక్రమాన్ని చూసిన వెంకటనరసింహారెడ్డి (1720-1760) ఆమెను వివాహమాడాడు. వెంకటనరసింహారెడ్డి-శంకరమ్మ దంపతులకు సంతానము కలగలేదు. వెంకటనరసింహారెడ్డి మరణం తర్వాత శంకరమ్మ సంస్థాన పాలన బాధ్యతలను చేపట్టవలసి ఉండగా, అంతఃపుర కుట్రల వల్ల అతడి తమ్ముడి రెండవ భార్య రెండో లింగాయమ్మ రాణి అయింది. ఈమె క్రీస్తు శకం 1760-64 వరకు సంస్థానాన్ని పాలించింది. ఈమె పాలన కాలంలో మహారాష్ట్ర పీష్వాలు నిజాం రాజ్యంపై దండెత్తి వచ్చారు. ఈ దండయాత్ర సందర్భంలో రాణి శంకరమ్మ తన శక్తి సామర్థ్యాలతో మహారాష్ట్ర పీష్వాలను ఓడించింది. ఇందుకు నిజాం ప్రభువు శంకరమ్మ శౌర్యానికి మెచ్చి ఆమెకు "రాయ్ బాగాన్" (ఆడ పులి) అనే బిరుదు ఇచ్చి సత్కరించి అందోల్ సంస్థానానికి రాణిగా నియమించాడు. రాయ్ బాగాన్ అంటే ఆడపులి అని అర్థం. ఆ విధంగా క్రీ.శ 1764లో రాణి శంకరమ్మ పరిపాలనకు వచ్చింది. రాణి శంకరమ్మ రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించింది. తన సంస్థాన ప్రజలకు తాగునీటి, సాగునీటి అవసరాల కోసం అనేక చెరువులు, బావులు, కుంటలను తవ్వించింది.

రాణి శంకరమ్మ గొప్ప సంస్కరణశీలి కూడా. దళితుడైన పాపన్నను ప్రధానిగా, తన సర్వసైన్యానికి దళపతిని చేసి ప్రతిభకు పట్టం కట్టింది. రాజ్యాన్ని సర్వవిధాలా సమర్ధవంతంగా ముందుకు నడిపించింది. రాణి శంకరమ్మ తన సంస్థానంలో వ్యవసాయ అభివృద్ధికి పాటుపడింది. అడవులను నరికించి వ్యవసాయ భూములుగా మలచి ప్రజలకు స్వచ్ఛందంగా ఇచ్చింది. ప్రజల అవసరార్థం నివాసాల కోసం గ్రామాలను కూడా నిర్మించింది. ఇందులో భాగంగా తన కుటుంబీకుల, ఆత్మీయుల పేరు మీద పట్టణాలు, గ్రామాలు నిర్మించింది. సంగారెడ్డి పట్టణాన్ని రాణి శంకరమ్మ తన తండ్రి ‘సంగారెడ్డి’ పేరు మీద నిర్మించింది. తల్లి రాజమ్మ పేరిట ‘రాజంపేట’ గ్రామాన్ని నిర్మించింది. తన పేరు మీద చిన్న శంకరంపేట, పెద్ద శంకరంపేట గ్రామాలను నిర్మించింది. తన సైన్యాధ్యక్షుడు ‘నీరూడి పాపన్న’ పేరు మీద ‘పాపన్నపేట’ అను గ్రామాన్ని నిర్మించింది. కుమారుడు సదాశివరెడ్డి పేరు మీద ‘సదాశివపేట’ గ్రామాన్ని నిర్మించడమే కాకుండా ఇక్కడ ప్రజల సౌకర్యార్తం అనేక ప్రహిత కార్యక్రమాలు చేపట్టింది. వ్యవసాయ భూములను ప్రజలకు స్వచ్ఛందంగా దానం చేసి తన ఉదారత గుణాన్ని చాటుకుంది. సంస్థాన పరిధిలో చెరువులు నిర్మించింది, బావులు తవ్వించి అనేక ప్రజహిత సౌకర్యాలు కల్పించింది. అందుకే ఆందోల్ సంస్థాన పాలకులలో రాణి శంకరమ్మ మేటి అని అంటారు. ఆందోల్/పాపన్నపేట పాలకులు తమ జాగీరు గ్రామాలైన (తమ అధీనంలోనే ఉన్న తమ సామంత రాజ్యాలు) సంగారెడ్డి, వెలమకన్నె, రామాయంపేట, ఆందోల్ వంటి చోట్ల ప్రతిష్టాత్మకమైన కోటలు (గడీలు) కూడా నిర్మించారు (దక్కన్ ల్యాండ్ 10-12).

2.3.2 సదాశివరెడ్డి తర్వాత పాలన

క్రీస్తు శకం 1774లో శంకరమ్మ తర్వాత దత్తపుత్రుడు సదాశివరెడ్డి పరిపాలనకు వచ్చాడు. తల్లిలాగే సదాశివరెడ్డి కూడా బహు పరాక్రమవంతుడు. ఇతడి పట్టపురాణి పార్వతీదేవి కూడా బహు పరాక్రమశీలి. ఈమె గద్వాల సంస్థాన ఆడపడుచు. భర్త సదాశివరెడ్డితో పాటుగా యుద్ధాల్లో పాల్గొంది. నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా-II క్రీస్తు శకం 1762-1802 సంవత్సరాల మధ్య నిజాం కుటుంబంలో రాజ్యకాంక్షకు సంబంధించిన గొడవలు ఉత్పన్నమయ్యాయి. ఈ గొడవలో సదాశివరెడ్డి నిజాం కుమారుడు మీర్ అక్బర్ అలీ ఖాన్ సికిందర్ జా/అసఫ్ జా III పక్షం వహించాడు. ఇందులో భాగంగా జరిగిన యుద్ధంలో నిజాం అలీ ఖాన్ అసఫ్ ఝా-II నిజామును ఎదిరించి నిజాం సేనలను ఓడించాడు. ఇందుకు ప్రతీకారంగా నిజాం అలీఖాన్ అసఫ్ ఝా-II కుట్ర పన్ని సదాశివరెడ్డి దంపతులను బందీగా తీసుకువెళ్లి చంపించడం జరిగింది.

సదాశివరెడ్డి కుమారుడు నరసింహారెడ్డి పాలన గురించి స్పష్టమైన సమాచారం లేదు. క్రీ.శ 1900 మొదటి దశాబ్దంలో రాజా వెంకట దుర్గారెడ్డి సంస్థాన పాలకుడుగా కొనసాగాడు. వీరు అకాల మరణం చెందడంతో సంస్థానం ఆర్థికంగా, పాలనాపరంగా అనేక ఇబ్బందుల్లో పడింది. క్రీ.శ 1927 ప్రాంతంలో ఆందోల్ సంస్థాన వారసుల మధ్య వారసత్వ కుటుంబ తగాదాల మూలంగా సంస్థానం కోర్టు పరిధిలోకి వెళ్ళింది. ఆ తర్వాత రాజా వెంకటదుర్గారెడ్డి భార్య వెంకట లక్ష్మాయమ్మ సర్దేశాయ్ సంస్థాన పాలనకు వచ్చింది. ఈమె తర్వాత రాజా రామచంద్రారెడ్డి బహదూర్ సంస్థానాధీషుడయ్యాడు. క్రీస్తు శకం 1934 సంవత్సరం వరకు సంస్థాన పాలన సజావుగా సాగింది. క్రీస్తు శకం 1934 తర్వాత సంస్థానంలో వారసత్వపు హక్కు విషయమై తగాదా ముదిరిపోయి సంస్థాన పాలన గాడి తప్పింది. క్రీస్తు శకం 1934-35లో ఆందోల్ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం అయిపోయింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మొదటి నుండి కూడా ఆందోల్/పాపన్నపేట సంస్థానంలో సాహిత్యం విశేషంగా పోషించబడింది ("నవ వసంతం" 116-127).

3. విద్య సంస్కృతి వికాసం

ఆందోల్/పాపన్నపేట సంస్థానంలో విద్య, సాహిత్య వికాసం కోసం పాలకులు కృషి చేశారు.

  • రాజా వెంకట నరసింహారెడ్డి ఉర్దూలో "మా సంస్థాన చరిత్ర" రాశాడు.
  • రాణి లింగాయమ్మ "మా పూర్వ వంశావళి", "మా వంశ చరిత్ర" గ్రంథాలు రాసింది.
  • వెంకట లక్ష్మాయమ్మ సర్దేశాయ్ మంచి కవయిత్రి. "మానస బోధ" పేరుతో పద్యాలు రాసింది.
  • సామాజిక సంస్కర్త రాణి శంకరమ్మ గాథను, సదాశివరెడ్డి గాథను నేటికీ సంస్థాన ప్రజలు జానపద పాటల రూపంలో, వీరగాథలుగా చెప్పుకుంటారు, పాడుకుంటారు, గుర్తుకు తెచ్చుకుంటారు ("ఆంధ్ర సంస్థానములు" 224-227; "మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర" 18-23).

4. చారిత్రక నిర్మాణ విశేషాలు

సైనిక అవసరాల కోసం, ధాన్యాలను ఉంచడానికి, సంస్థానాధీశుల నివాసం, సైనిక శిక్షణ, పరిపాలన అవసరాలను దృష్టిలో ఉంచుకొని, మరాఠా దాడులను ఎదుర్కోవడానికి ఆందోల్ సంస్థానాధీశులు రామినేడు, ఇతర సంస్థాన పాలకులు రాణి శంకరమ్మ, సదాశివరెడ్డి, రాణి లింగమ్మ బలమైన సైన్యాన్ని శిక్షణ ఇచ్చి నిర్వహించారు. సైన్యాన్ని, యుద్ధ సామగ్రిని త్వరగా తరలించడానికి వీలుగా మార్గాలను వేయించారు. ఆందోల్ పట్టణంలోని కోట నిర్మాణం, పాపన్నపేట, శంకరంపేట, దౌలతాబాద్ కోట, సదాశివ్ నగర్ కోట, ఇతర ముఖ్యమైన కోటలు పెద్దపెద్ద దర్వాజాలతో (గౌని) బురుజులతో విశాలంగా నిర్మించారు. కోట పైన, వీటి మధ్య రాకపోకల కోసం విశాలమైన మార్గాలను ఏర్పాటు చేశారు. బురుజుల నుండి నిత్యం సైనికులు పహారా కాస్తుండేవారు. సైనికుల కోసం కోట లోపల ఆవాసాలు, ప్రజల గృహాలు ఉండేవి.

4.1 ఆందోల్ కోట నిర్మాణం

అనంతరెడ్డి మనవడు రామినేడు క్రీస్తు శకం 1398-1400 ప్రాంతంలో పాలనకు వచ్చాడు. క్రీస్తు శకం 1418లో సంస్థానాన్ని కల్పగూరు నుండి ఆందోల్‌కు తరలించి రాజ్యాన్ని విస్తరింపజేసిన రామినేడు ఆందోల్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు. ఇతడే ఆందోల్ కోట నిర్మాణ కారకుడు. ఆందోల్ ఒక ప్రాచీన చారిత్రక స్థానిక రాజ్యం. రెడ్డి రాజుల కాలంలో రాణి శంకరమ్మ ఈ ప్రాంతాన్ని పాలించింది. మంజీరా నది తీరంలో విహారయాత్రకు వెళ్ళిన రామినేడు ఆ ప్రదేశం నచ్చడంతో ఇక్కడే ఉండిపోయి ఆందోల్ నుండి పరిపాలన సాగించాడు. రాణి శంకరమ్మ కోటను పునర్నిర్మించి పటిష్ట పరచినట్లు చరిత్ర చెబుతుంది. నాడు ‘మెతుకు’ రాష్ట్రానికి ఆందోల్‌ ముఖ్య పట్టణంగా ఉండేది. ఆందోల్ కోట నుండి శంకరమ్మ, సదాశివరెడ్డి, అల్లమరెడ్డి, సూర్యప్రతాపరెడ్డి పాలించేవారు. వీరు మొదటగా బహమనీ సుల్తానులకు, బహమనీల తర్వాత కుతుబ్ షాహీలకు, అటు పిమ్మట మొఘలులకు, అటు తర్వాత అసఫ్ జాహీ నిజాంలకు సామంత కప్పం కడుతూ ఒప్పందం కుదుర్చుకుని సర్వ స్వతంత్రంగా పాలించినట్లు చారిత్రక ఆధారాలు సమాచారం ఇస్తున్నాయి. అప్పట్లో ఆందోల్‌లో మూడు గౌనిలు, 36 బురుజులు, ఆరు చిన్న దొడ్డీలు, ఒక సొరంగమార్గం నిర్మించుకున్నారు. సంస్థానాల రాజుల నివాసం కోసం పెద్ద భవంతి అయిన దేవడి, సమావేశాల కోసం చావడి వంటి ప్రత్యేక భవంతులు నిర్మించుకున్నారు. ఆందోల్ పట్టణం లోపలికి రావడానికి 3 దిక్కుల నుండి మూడు విశాలమైన గౌనీలు ఉన్నాయి. రాణి శంకరమ్మ పరిపాలిస్తున్న కాలంలో రాత్రి 7 గంటలు దాటితే గ్రామంలోనికి గౌనీల నుండి ప్రవేశం ఉండేది కాదు. అత్యవసరమైతే పక్కనే ఉన్న చిన్న ద్వారం ద్వారా లోనికి అనుమతించేవారు. అంత పటిష్ట బందోబస్తు ఉండేదని నాటి రచనలు, జానపద గేయాలలో పాడుకోవడం ద్వారా అవగతం అవుతుంది. ఆందోల్ రాజ్యాధికారానికి చిహ్నంగా నిలిచి ఉన్న కోట ద్వారాలు నేటికీ మిగిలి ఉన్నాయి. ఇది ఆనాటి పటిష్ట రక్షణ నిర్మాణానికి, అద్భుతమైన వాస్తు నిర్మాణ శైలిని సూచిస్తుంది. తెలంగాణలోని పలు కోటల మాదిరిగానే ఇక్కడి నిర్మాణాలు కూడా ఇండో-ఇస్లామిక్, మొఘల్ వాస్తు పాశ్చాత్య నిర్మాణ శైలుల కలయికను కలిగి ఉన్నాయి (ఉదాహరణకు దోమకొండ కోటలో ఉన్నట్లు) (రఘురామ శర్మ, శాశ్రుల 214-235).

4.2 అద్భుత శిల్పకళ

ఆందోల్‌లోని రంగనాయకసాగర్‌ (ఆందోల్ పెద్దచెరువు) కట్టపైనున్న శిల్పాలు దాదాపు వెయ్యేళ్ల కిందటివని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ‘ప్లీచ్‌ ఇండియా సీఈవో డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి’ తన రచనలలో తెలిపారు. ఇక్కడి శిల్పకళను, శిల్పాలను శివనాగిరెడ్డి పరిశీలించారు. ఆందోల్‌లోని శ్రీ రంగనాథాలయం గోపురం ముందున్న మహిషాసుర మర్దిని తదితర శిల్పాలు, రాష్ట్రకూటులు, కల్యాణి చాళుక్యుల కాలం నాటివని క్రీస్తుశకం 9-11 శతాబ్దాల మధ్య చెక్కినవని నాటి శిల్పకారుల కళా నైపుణ్యాన్ని ఆధారంగా చేసుకుని వెల్లడించారు. అలాగే చెరువు గట్టున నాగులకట్టపై వెలిసిన చెన్నకేశవ, జనార్దన, నాగదేవతల విగ్రహాలు, కల్యాణి చాళుక్యులు, కాకతీయుల కాలం, క్రీస్తు శకం 11-13 వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవి. శిల్పాల శైలిని బట్టి పరిశోధనాత్మకంగా చెప్పవచ్చు. చెన్నకేశవ విగ్రహం చుట్టూ ఉన్న మకర తోరణం, శ్రీదేవి, భూదేవి దశావతార శిల్పాలకు చారిత్రక ప్రాధాన్యముంది. ఈ శిల్పాలు అలనాటి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. నాగులకట్టగా పిలుచుకునే ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసినట్లయితే అద్భుతమైన పర్యాటక ఆకర్షణ అవుతుంది. ఆందోల్ ప్రాంత శిల్పకళ, వాస్తు నిర్మాణ శైలి ఈ ప్రాంత అద్భుతమైన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ("ఆంధ్రజ్యోతి దిన పత్రిక" 10 మార్చ్ 2024).

4.2.1 ముఖ్య శిల్పకళా అంశాలు

4.2.1.1 శ్రీ రంగనాథ స్వామి ఆలయం

ఆరువందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి శేషశాయి రూపంలో కొలువై ఉన్నారు. ఆందోల్‌లో ఉన్న పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి ఆలయం ఈ ప్రాంతపు స్థానిక వాస్తు నిర్మాణ శైలికి, శిల్పాకళకు ఒక ఉదాహరణ. ఈ ఆలయ నిర్మాణం ఆనాటి ప్రాంతీయ నిర్మాణ శైలులను, ముఖ్యంగా దక్షిణ భారతీయ ద్రవిడ, వేసర శైలులను ప్రతిబింబిస్తుంది. స్థల పురాణం ప్రకారం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ విష్ణుమూర్తి త్రేతాయుగంలో భక్తుల సేవలకు పులకించిపోయి దేవలోకం విడిచి మొదట అయోధ్యకు, ఆ తర్వాత దక్షిణాన కావేరి నది తీరంలో ఉన్న శ్రీరంగానికి, ఆ తరువాత గరుడాద్రి మీదుగా ఆండాలు పురానికి వచ్చాడని ఇక్కడి స్థానికులు చెప్తుంటారు. కాలక్రమంలో ఈ ఆండాలు పురము, అందాలపురంగా, ఆందోల్ పురంగా, నేటి ఆందోల్‌గా మారిందని స్థల పురాణం చెప్తుంది.

ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం 15వ శతాబ్దంలో రామినేడు కట్టించాడు. శ్రీరంగం నుండి రంగనాథ స్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్టించాడు. ఆ తర్వాత తన సంస్థానాన్ని కల్పగురు నుండి ఆందోల్ పట్టణమునకు మార్చి రాజ్యాన్ని విస్తరింపజేశాడు. క్రీస్తు శకం 18వ శతాబ్దంలో ఆందోల్‌ను పాలించిన రాణి శంకరమ్మ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసింది. ఆలయ ప్రత్యేకత ఏమిటంటే, సాధారణంగా ఏ దేవాలయంలోనైనా గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివే ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఉత్సవ విగ్రహాలు రుక్మిణి, సత్యభామలతో పాటు శ్రీకృష్ణుని రూపంలో దర్శనమిస్తాయి. ఆలయ ప్రాంగణంలో మూడు కోనేరులు, ఐదు చేద బావులు ఉంటాయి. ఇందులో గుడికి ఈశాన్యమున నాలుగు ద్వారాలతో పెద్ద నీటి గుండం కోనేరు ఉంటుంది. ఈ గుండంలో పక్కనే ఉన్న శ్రీ రంగనాథసాగర్ ఆందోల్ చెరువు నుండి నీళ్లు చేరే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. కోనేటి గుండంలోని నీరు ఎప్పటికప్పుడు శుద్ధి కాబడుతుంది. ఈ కోనేరులో స్నానం చేసి స్వామి చుట్టూ ప్రదర్శన చేస్తే సర్వ రోగాలు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయ శిఖరం పైన 108 రేకులతో ప్రత్యేకమైన బంగారు పూత చక్రం ఉంది. స్వామి దర్శనం కాకపోయినా ఈ చక్ర దర్శనం చేసుకుంటే రంగనాథున్ని పూజించిన పుణ్యం వస్తుందని, మోక్షం సిద్ధిస్తుందని స్థానిక ప్రజలు చెప్పారు. ఆలయంలో ఏటా పుష్య మాసంలో చేసే ధనుర్మాస సేవ, స్వామి వారి కళ్యాణఘట్టం కన్నుల పండువగా జరుగుతుంది. ఈ వేడుకలను చూడడానికి భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ప్రధానమైనవి. ఈ బ్రహ్మోత్సవాలు సాధారణంగా మే లేదా జూన్ నెలలో జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం, గరుడ హోమం, స్వామివారి కల్యాణోత్సవం చివరి రోజున భారీ రథోత్సవం నిర్వహిస్తారు. ధనుర్మాస ఉత్సవాలు ప్రతి ఏడాది పుష్య మాసంలో నెలరోజుల పాటు నిర్వహించబడతాయి. ఈ ధనుర్మాస ఉత్సవ సమయంలో గోదాదేవికి ప్రత్యేక పూజలు, తిరుప్పావై పారాయణం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) ఉత్తర ద్వార దర్శనం ఇక్కడి ప్రత్యేక విశేషం. వేలాదిమంది భక్తులు ఏకాదశి పర్వదినమున స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. విశేష సేవలు ఆచారబద్ధంగా నిర్వహించబడతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో లేదా ప్రత్యేక పర్వదినాలల్లో స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. చక్రస్నాన ఉత్సవము బ్రహ్మోత్సవ సేవ ముగింపురోజు సమీపంలోని రంగనాథసాగర్ ఆందోల్ పెద్ద చెరువులో నిర్వహిస్తారు. ఇక్కడి సువర్ణ చక్ర దర్శనము ప్రత్యేకమైనది అని చెప్పవచ్చు. ఆలయ శిఖరంపై ఉన్న ఒక వంద ఎనిమిది రేకులతో ఉన్న బంగారు పూత గల చక్రాన్ని దర్శించుకోవడం వల్ల మోక్షం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ రంగనాథ ఆలయ నిర్వహణకు, నిత్య ధూప, దీప నిర్వహణకు సంస్థాన పాలకులు ఆలయానికి అనుబంధంగా భూమిని కేటాయించారు. కేటాయించిన వ్యవసాయ భూమి నుండి వచ్చిన ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతుంది (నందిని, సిద్దరెడ్డి 119).

అనంత రెడ్డి కల్పగూరు కోటలో కాశీ విశ్వనాథ ఆలయం నిర్మించాడు. ఈ ఆలయం ప్రసిద్ధమైన చారిత్రక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది కోటలోపల ఉన్న నిర్మాణం, ప్రత్యేకమైన త్రికూటాలయంగా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయ ప్రాంగణంలో మూడు వేర్వేరు ఆలయాలు ఒకే చోట ఉన్నాయి. శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం దక్షిణ భాగంలో, శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయం పశ్చిమ భాగంలో, శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఉత్తర భాగంలో ఉన్నాయి. శివకేశవులు ఒకే ప్రాంగణంలో ఉండటం ఈ ఆలయ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయ చారిత్రక నేపథ్యం చూసినట్లయితే, ఇక్కడి చారిత్రక ఆధారాలను పరిశీలించినట్లయితే ఈ ఆలయ నిర్మాణ వాస్తు శైలి కాకతీయ వాస్తుశైలిని పోలి ఉండి వరంగల్‌లోని ప్రసిద్ధ వేయి స్తంభాల గుడి నిర్మాణశైలిని కలిగి ఉంటుంది. వేణుగోపాల స్వామి గర్భగుడిలో ఒక నాణెం వేస్తే అది నీటిలో పడినట్టుగా శబ్దం వస్తుంది. ఈ నిర్మాణ ఆలయ ప్రాంగణము పటిష్టమైన రాతినిర్మాణం. ఈ ఆలయంలో నిత్యం ధూప, దీప, నైవేద్య పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయానికి అనుబంధంగా ఆలయం నిర్వహణకు ప్రత్యేక భూమి ఉంది. ఈ భూమి నుండి వచ్చే ఆదాయంతో నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఆలయమును సంస్థాన మూలపురుషుడు అనంత రెడ్డి కాలంలో నిర్మించబడినప్పటికీ, ఆయన మనవడు రామినేడు ఆలయాన్ని కళాత్మకంగా పునరుద్ధరించాడు (నందిని, సిద్దరెడ్డి 119).

4.3 ఇతర కోటలు, గడులు

శంకరంపేట్ కోట, పాపన్నపేట కోటలను రాణి శంకరమ్మ క్రీస్తు శకం 1760లో నిర్మించింది. లింగంపేట కోట (గడి)ని సంస్థాన పాలకుడైన రాజా వెంకట నరసింహారెడ్డి, రాణి లింగమ్మ కాలంలో నిర్మించి గ్రామాన్ని అభివృద్ధి పరచారు. రామయంపేట కోట (గడి), సదాశివపేట గడి ఆందోల్/పాపన్నపేట సంస్థాన పాలకులచే నిర్మించబడిన చారిత్రక కట్టడాలలో సదాశివపేట గడి ఒకటి. ఈ గడిని రాణి శంకరమ్మ కుమారుడు సదాశివరెడ్డి పేరు మీదుగా రాణి శంకరమ్మ నిర్మాణం మొదలు పెడితే సదాశివరెడ్డి నిర్మాణం పూర్తి చేశాడు. సదాశివపేట ముఖ్యమైన వర్తక వాణిజ్య కేంద్రం, ప్రత్యేక సైనిక శిక్షణ కేంద్రంగా ఉండేది. ఈ గడి వాస్తు పూర్తిగా ప్రాంతీయ వాస్తు శైలికి చెందినది. గడి ప్రధాన ఆకర్షణ ప్రతిష్టాత్మకమైన ఎత్తైన రాతినిర్మాణ ప్రహరీ గోడలు ప్రధానమైనవి. అదేవిధంగా మరియొక ఆకర్షణ బలమైన భారీ కలపతో చేసిన ప్రధాన ద్వారాలు విశేషమైన శిల్పాలతో చెక్కబడి (గౌనీ) ఉన్నాయి. కోట లోపల పాలకుల నివాస గృహాలు, ధాన్యాగారాలు, ఆయుధశాలలు, పరిపాలన కార్యకలాపాలు నిర్వహించేందుకు విశాలమైన మందిరాలు ఉన్నాయి. భవనం పైకప్పులు భారీ కలపతో ఆకర్షణీయమైన శిల్పాలతో చెక్కబడి కనిపిస్తాయి. పై కప్పు కుమ్మరి పెంకతో కప్పబడి ఉంటుంది. ఈ నిర్మాణం శత్రువుల దాడుల నుండి రక్షించుకోవడం కోసం కోట నాలుగు మూలాలలో నాలుగు ప్రధానంగా ఎత్తైన బురుజులు కళాత్మకంగా నిర్మించబడ్డాయి. బురుజులపై నుండి పహారా కాయడానికి, ఫిరంగులు అమర్చడానికి వీలుగా ప్రత్యేక నిర్మాణావసరాలు ఉన్నాయి.

దౌల్తాబాద్ గడి ఆందోల్/పాపన్నపేట సంస్థానంలో ఒక ముఖ్యమైన రక్షణ, పరిపాలన కేంద్రం. గడిని స్థానిక దొరలు నిర్మించారు. ఇది శత్రువుల దాడుల నుండి రక్షణ పొందేందుకు వీలుగా ఒక చిన్న కోట వలే నిర్మించబడి ఉన్న గడి. గడి చుట్టూ అత్యంత ఎత్తైన పటిష్టమైన రాతి గోడలు, బురుజులు, వీటిని నల్లరాయి, డంకు సున్నంతో నిర్మించారు. గడికి ఒకే ఒక భారీ చెక్క ప్రవేశ ద్వారం ఉంటుంది. ఇది ఏనుగులు ఢీ కొట్టినా తట్టుకోగలిగేంత బలంగా, పటిష్టంగా ఉంటుంది. నాలుగు మూలాల్లో సైనికులు (కాపాలాదారులు) పహారా కాయడానికి వీలుగా బురుజులు నిర్మించారు. ఈ బురుజులపై నుండి గ్రామం మొత్తం కనిపిస్తుంది. ఆందోల్ సంస్థాన పరిధిలోని 24 పరగణా ప్రాంతంలో ఇది ఒకటి.

ఆందోల్/పాపన్నపేట సంస్థాన చరిత్రలో ఒక కీలకమైన కట్టడం సంగారెడ్డి గడి. ఆందోల్ సంస్థానమును పాలించిన ధీర వనిత రాణి శంకరమ్మ తన తండ్రి సంగారెడ్డి జ్ఞాపకార్థం ఈ నగరాన్ని, ఇక్కడ ఒక గడిని నిర్మించింది. అందుకే ఈ పట్టణానికి సంగారెడ్డి అనే పేరు వచ్చింది. గడిని పటిష్టమైన రాతి గోడలతో, ఎత్తైన బురుజులతో నిర్మించబడింది. కోట రక్షణకు కోట గోడలకు ఆనుకొని విశాలమైన కందకంతో, ఎత్తైన బురుజులతో నిర్మించబడి నేడు కూడా పటిష్టంగా, చూడ ముచ్చటగా ఉంది. శత్రువుల దాడులను తట్టుకునేలా భారీ ప్రవేశ ద్వారాలు అద్భుతమైన శిల్పాకళతో లోపల విశాలమైన దర్బార్ హాల్, సంస్థానాధీశుల నివాస భవనం, సైనికులకు విడిది భవంతి ఉన్నాయి. సంస్థానాధీశులకు ఈ గడి పరిపాలన ప్రాముఖ్యత కలిగింది. ఈ గడి ఆందోల్ సంస్థానానికి సంబంధించిన ముఖ్యమైన రెవెన్యూ వసూలు, న్యాయ పరిపాలన కేంద్రంగా ఉండడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి పన్నుల వసూలు ఇక్కడి నుండే జరిగేది. పట్టణీకరణలో భాగంగా గడిలోని చాలా భాగాలు కనుమరుగయ్యాయి. ప్రభుత్వం ఈ గడిని పునర్నిర్మించి పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది. అయినప్పటికీ కొన్ని శిథిలమైన గోడలు, బురుజులు ఇప్పటికి నిర్లక్ష్యం గురిఅయ్యాయి. ఈ గడి ఆనాటి సంస్థాన వైభవానికి సాక్ష్యంగా నిలిచి ఉంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంగా ఉండటంతో ఈ గడి ఉన్న ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇక్కడి కారాగారము చరిత్ర ప్రసిద్ధి కలిగింది. ఈ కారాగారమును ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వము (పురావస్తు) వారసత్వ శాఖ, రాష్ట్ర జైళ్ల శాఖ ఉమ్మడిగా పోలీసు శాఖకు చెందిన ‘పురావస్తు సంగ్రహాలయము’గా అభివృద్ధి పరిచారు.

వెలమకన్నె గడి ఆందోల్/పాపన్నపేట సంస్థాన చరిత్రలో ఒక ముఖ్యమైన, కీలకమైన రక్షణ కట్టడం. తమ రాజ్య దక్షిణాన పరిపాలన సౌలభ్యం కోసం, సైనిక శిక్షణ, నిర్వహణ అవసరాల నిమిత్తం నిర్మించారు. ముఖ్యంగా శత్రువుల కదలికలను గమనించడానికి, సైనిక శిక్షణ కోసం ఈ గడిని ఉపయోగించుకున్నారు. ఈ గడి అత్యంత ఎత్తైన, పటిష్టమైన రాతి గోడ కట్టడం. నాలుగు మూలాలలో విశాలమైన బురుజులు నిర్మించబడి ఉంటాయి. సైనికులకు పహారా కాయడానికి సంస్థాన రక్షణ చర్యలకు ఉపయోగపడే విధంగా తొలి సంస్థాన పాలకులు నిర్మించారు. సంస్థాన రాజులు, స్థానిక సంస్థాన అధికారులు, ఉద్యోగులు, సైనికులు, గూఢచారులు ఈ గడిలో ప్రధానంగా నివాసం ఉండేవారు. రాజ కుటుంబీకులు నివసించడానికి వీలుగా విశాలమైన గదులు, ధాన్యాగారములు, గడిలో నివసించే వారి కోసం నీటి బావులు, కారాగారం ఈ గడిలో ప్రధానంగా ఉన్నాయి. సంస్థాన పాలకురాలు రాణి శంకరమ్మ కాలంలో ఈ ప్రాంత రక్షణ నిమిత్తం ఈ గడిని పునర్నిర్మించి బలోపేతం చేయడం జరిగింది. రాణి శంకరమ్మ తన సంస్థాన పరిధిలో వెలమకన్నె వంటి గడుల ద్వారా తమ రాజ్యంపై జరిగే దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఉదాహరణకు మరాఠా దాడులను వెలమకన్నె గడి నుండే తన ప్రజలను, రాజ్యాన్ని సురక్షితంగా రక్షించుకుంది.

రంగంపేట గడి నాటి రక్షణ, పరిపాలన స్థావర కట్టడాలలో ఒకటి. ఈ గడిని ఆందోల్ సంస్థాన పాలకులు, ముఖ్యంగా రాణి రెండవ లింగయమ్మ, రాణి శంకరమ్మ రాజ్య రక్షణ, పరిపాలన అవసరం నిమిత్తం నిర్మించారు. కోట స్వాగతం ద్వారం ఆనాటి కళాతృష్ణకు, ఆర్థిక వైభవమునకు అభూషణం వంటిది. శత్రువుల కదలికలను గమనించడానికి, రాజ్య రక్షణ కోసం కోట నాలుగు దిక్కుల నలుమూలల్లో ఎత్తైన బురుజులు నిర్మించబడి ఉంటాయి. ఏనుగులు కూడా ప్రవేశించగలిగేంత ఎత్తైన, పటిష్టమైన చెక్క తలుపులతో ప్రవేశ ద్వారం నిర్మించబడింది. ఈ గడి కేవలం స్థానిక గ్రామాల నుండి పన్నులను వసూలు చేయడానికి, ధాన్యాన్ని భద్రపరచడానికి, సైనిక శిక్షణ ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకున్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ఇక్కడ దర్బార్‌ను నిర్వహించడం జరిగేది. పంచాయతీ తీర్పుల కోసం ఉపయోగించారు.

5. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు

సంస్థానాధీశులు తమ ప్రజల యోగక్షేమాల కోసం, సంస్థాన ఆర్థిక ప్రగతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు.

5.1 నీటిపారుదల నిర్మాణాలు

తమ సంస్థానంలో అనేక చెరువులు, బావులు తవ్వించారు. ఆందోల్ సంస్థానంలో ఉన్న రంగనాయక సాగర్ రామినేడు తవ్వించాడు. అన్నాసాగర్ చెరువు, సంగారెడ్డి చెరువు, సదాశివపేట చెరువు, ఢాకూర్ చెరువు, పెద్ద శంకరంపేట చెరువు - నాటి ప్రతి గ్రామంలో చిన్న, పెద్ద చెరువులను, కుంటలను, బావులను తవ్వించి ప్రజలకు తాగునీటికి, వ్యవసాయ సాగు అభివృద్ధికి, ఆర్థిక ప్రగతికి పాటుపడ్డారు. ముఖ్యంగా వారి మెట్ల బావుల నిర్మాణం విశిష్టమైనవి, ప్రత్యేక కలిగిన నిర్మాణ తవ్వకాలు అని అనవచ్చు (నందిని, సిద్దరెడ్డి 114-118).

5.1.1 మంజీరా నదిపై ఆనకట్ట

మంజీరా నది పైన చిన్న ఘానాపురం గ్రామ శివారు ప్రాంతంలో ఆందోల్ సంస్థానాధిపతుల కాలంలో నిజాం నవాబుల ప్రోత్సాహంతో, యూరోపియన్ ఇంజినీర్ల సహకారంతో ఒక మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టును ఆందోల్ సంస్థానాధీశులు నిర్మించారు. మంజీరా నదికి అడ్డంగా ఈ ఆనకట్టను 1902 నుండి 1905 మధ్యకాలంలో నిజాం హయాంలో సంస్థానాధీశులు ప్రజల సౌకర్యార్థం, తమ సంస్థాన ఆర్థిక ప్రగతిని పెంచుకోవడానికి, వ్యవసాయ సాగుకు, ప్రజల తాగునీటి అవసరాల కోసం, ఏడుపాయల పర్యావరణ పర్యాటకమును దృష్టిలో ఉంచుకొని నిర్మించారు. మహబూబ్ నహర్ కుడి కాలువ క్రీస్తు శకం 1905లో నిర్మించారు. ఫతేనగర్ ఎడమ కాలువ క్రీస్తు శకం 1925లో నిర్మించారు. ఈ నీటిపారుదల ప్రాజెక్టు మూలంగా ఆందోల్/పాపన్నపేట సంస్థానంలోని ప్రజల ఆర్థిక ప్రగతి ఉచ్చదశలోకి వచ్చి ఆందోల్ సంస్థానం ‘మెతుకు సీమగా’ అవతరించడానికి కారణమైంది ("The Medak District" 47).

5.1.2 కిచ్చన్నపల్లి మెట్ల బావి

ఆందోల్ మండలం కిచ్చన్నపల్లిలో కాకతీయ పాలకురాలు రాణి రుద్రమదేవి క్రీస్తు శకం 13వ శతాబ్దంలో మెట్ల బావిని నిర్మించినట్లు శాసనాధారాలను బట్టి విశదమవుతుంది. ఇది అతి పురాతన మెట్లబావి. ఈ మెట్లబావి శిథిలావస్థకు రాగా, ఆందోల్ రాణి శంకరమ్మ పునర్నిర్మించి ప్రజలకు తాగు, సాగునీటి కొరతను తీర్చింది. ఇది కేవలం నీటి వనరుగానే కాకుండా, అద్భుతమైన వాస్తునిర్మాణ శిల్పకళతో కూడిన నిర్మాణం. ఇది ఆనాటి ఇంజనీరింగ్ నైపుణ్యానికి తార్కాణం.

5.1.3 జక్ష్మి నాగన్న మెట్ల బావి

చారిత్రకమైన ఈ బావికి సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. సంస్థానాధీశురాలైన రాజా వెంకట నరసింహారెడ్డి, రాణి లింగమ్మ నిర్మించారని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఈ మెట్ల బావి స్థానిక దక్కన్ వాస్తు శైలి నిర్మాణం. ఈ బావికి నాలుగు వైపుల నుండి దిగుడు మెట్లు నిర్మించబడి ఉంటాయి. నేరుగా నీటిని తోడుకోవడానికి వీలుగా నిర్మించారు. నీటి మట్టం వరకు దిగుడు మెట్ల ద్వారా చేరుకోగలుగుతాం. చుట్టూ ప్రహరీ గోడ పటిష్టమైన రాతి కట్టడం, ఆర్చీలు, తోరణాలు అడుగడుగునా చిన్నచిన్న గూళ్లు ఉన్నాయి. గూళ్లలో దీపాలు వెలిగించేందుకు ప్రమిదలు పెట్టడానికి వీలుగా ఈ నిర్మాణం నిర్మించారు. ప్రస్తుతం బావి మంచి స్థితిలో ఉంది. గతంలో సరైన నిర్వహణ లేక బావి పూడికతో నిండిపోయి శిథిలావస్తకు చేరుకుని ఉండేది. తెలంగాణ రాష్ట్ర పురావస్తు శాఖ వారసత్వ సంపద పరిరక్షణలో భాగంగా ఈ బావిని అధికారులు ఇటీవల పునరుద్ధరించి పూర్వ వైభవమునకు తీసుకువచ్చారు. నేడు పురావస్తు శాఖ పరిరక్షణలో ఉంది. పర్యాటక ప్రేమికులకు ఆకర్షణీయమైన చారిత్రక ప్రదేశంగా మారింది. ఇది ఆనాటి నీటి సంరక్షణ వ్యవస్థకు, పాలకుల దార్శనికతకు, దూరదృష్టికి గొప్ప తార్కాణంగా భావించవచ్చు ("నమస్తే తెలంగాణా" 23 మే 2021).

5.2 ఆర్థిక, వాణిజ్య ప్రోత్సాహాలు

రామాయంపేట చుట్టుపక్కల గ్రామాలలో ఇత్తడి, వెండి వస్తువులు తయారీదారులకు, కలప చెక్క సామాగ్రి తయారీని ప్రోత్సహించారు. జోగిపేట పరిసర గ్రామాలలో చేనేత వస్త్రాల ఉత్పత్తికి, ఉన్ని నేత పనివారికి, బంగారు, ఇత్తడి, వెండి హస్త కళాకారులకు ఉదారంగా ప్రోత్సాహకాలను అందించారు. చిన్న తరహా పరిశ్రమలను పోషించి ప్రోత్సహించారు. వ్యవసాయ ఆధార పరిశ్రమలైన బెల్లం ఉత్పత్తిదారులకు ప్రోత్సాహకాలను అందించారు. నాడు ఆందోల్ సంస్థానం నిజాం రాజ్యానికి ఆహార ధాన్యాన్ని అందించిన ముఖ్యమైన సంస్థానం. కొత్త వ్యవసాయ భూములను అభివృద్ధిలోకి తెచ్చారు. అడవిని నరికించి ప్రజలకు, వ్యవసాయదారులకు భూములను ఉచితంగా ఇనాములుగా ఇచ్చారు. చిరుధాన్యాల పంటలను అధికంగా సాగు చేయించారు. బియ్యం ఉత్పత్తిలో మెదక్ సంస్థానం మొదటి స్థానంలో నాడు ఉంది. అందుకే ఆందోల్ సంస్థానం ‘మెతుకు సీమ’గా ప్రసిద్ధి గాంచింది (Aravind, Kumar 235-243).

6. సాంఘిక సంస్కరణలు

ఆందోల్/పాపన్నపేట సంస్థానంలో, ముఖ్యంగా రాణి శంకరమ్మ పాలన కాలంలో ప్రజా జీవనము ఉన్నత శిఖరాలను చేరింది. ప్రజల జీవన ప్రమాణం మెరుగుపరచడానికి పలు సాంఘిక సంస్కరణలు చోటు చేసుకున్నాయి.

6.1 మహిళా సాధికారత

రాణి శంకరమ్మ ఒక మహిళా పాలకురాలు. స్వయంగా ఆమె ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ఆ కాలంలో మహిళలకు పరిపాలనలో, పాలనా నిర్ణయాలలో, విధి విధాన రూపకల్పనలో, అధికార నిర్వహణ భాగస్వామ్యంలో పాలు పంచుకున్నారు. విద్య, విజ్ఞానమును అభ్యసించడానికి అవకాశం ఉంది. వివిధ అంశాలలో స్త్రీ శక్తికి ప్రాధాన్యతను ఇచ్చారు.

6.2 కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహం

ఆందోల్ సంస్థానంలోని ప్రజలలో స్వయం ఉపాధిని పెంచడానికి స్థానిక కళాకారులను, చేతివృత్తుల వారిని ప్రోత్సహించడం, చేనేత హస్త కళను ప్రోత్సహించారు. బంగారం, వెండి కళాకారులకు, కంసాలి, ఇత్తడి పని వారికి, బిందెలు తయారు చేసే వారికి ఉదారంగా ఆర్థిక సహాయం చేశారు. కలప కళాకారులకు, వడ్రంగం, కమ్మర పని వారికి రాణి శంకరమ్మ కొత్త గ్రామాలను ఏర్పాటు చేసినప్పుడు, వ్యవసాయ అభివృద్ధికి వీరి అవసరం ముఖ్యం కాబట్టి వీరిని ప్రోత్సహించారు. చేనేత కళను, కళాకారుల అభివృద్ధికి, చర్మకారుల సంక్షేమంకు, అదేవిధంగా వర్తక వాణిజ్య ప్రగతికి సంతలు నిర్వహించడం, వాణిజ్య ప్రగతికి కొన్ని పట్టణాలను అభివృద్ధిలోకి తేవడానికి పాటుపడ్డారు. ఉదాహరణకు జోగిపేట, సదాశివపేట, పొట్లచెర్వు ఒక ప్రధాన వాణిజ్య ప్రదేశం - ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు. సామాజికంగా వెనుకబడిన ఆర్థిక వర్గాల వారికి భరోసాను కల్పించారు.

6.3 మత సామరస్యం

సంస్థానంలో హిందూ, ముస్లింల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించారు. కల్పగూరు కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధికి, ఆందోల్ రంగనాథ ఆలయ ప్రగతికి, జోగిపేటలోని జోగినాథ దేవాలయ అభివృద్ధికి పాటు పడ్డారు. రంగంపేట్ రంగనాథ స్వామి ఆలయ అభివృద్ధికి చేదోడు వాదోడుగా నిలిచారు. సంస్థానంలో ఉర్దూ భాషా పండితులను, ఉర్దూ పాఠశాలలను ఉదారంగా ఏర్పాటు చేసి విద్యా ప్రగతికి పాటుపడ్డారు (ఉదాహరణకు మొక్ధూమ్ మొహమ్మద్ ఈ ప్రాంత ఉర్దూ కవి, ప్రగతిశీల నాయకుడు). తమ సంస్థానంలో సూఫీ గురువులను గౌరవించారు. ఉర్సు ఉత్సవాలను ఉదారంగా ప్రోత్సహించి మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచారు. ఉదాహరణకు వట్పల్లి ఉర్సు ఉత్సవాలు హిందు-ముస్లీం మత సామరస్యానికి ఒక ప్రత్యేక నిదర్శనం అని చెప్పవచ్చు. వట్పల్లిలోని ఉర్సు ఉత్సవాలు వెంకట్ ఖాజా దర్గాలో ప్రతి సంవత్సరం అనావాయితీగా జరుగుతాయి. ఈ ఉర్సు ఉత్సవాలు ఆందోల్ సంస్థాన కాలంలో మొదలయ్యాయి. వెంకట్ అనే సూఫీ, ఈయన హిందూ బ్రాహ్మణుడు. ఈయన ముస్లిం మత ఆచారాలను పాటించి సూఫీ మత గురువుగా ఈ ప్రాంత వాసులకు ఆరాధ్యుడు అయ్యాడు. సర్వమత సామరస్యాన్ని ప్రోత్సహించారు. మత సామరస్యానికి ప్రతీక. ఈయనను సమాధి చేసిన ప్రాంతం వట్పల్లిలోని దర్గాను వెంకట్ ఖాజా దర్గాగా ప్రఖ్యాతిగాంచింది. ప్రతి సంవత్సరం ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉర్సు ఉత్సవాలను ఆందోల్ సంస్థానంలోని సంస్థానాధీశులు ప్రోత్సహించారు. కుల, మతాలకు అతీతంగా భక్తులు పెద్ద సంఖ్యలో దర్గాను దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక వేడుకగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో మహాశివరాత్రి తర్వాత మూడు రోజులపాటు వైభవంగా ఉర్సు ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఇందులో గంధ సమర్పణ, అన్నదానం, కవ్వాళి వంటి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుండి భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు. ఈ ఉర్సు ఉత్సవాలు మత సామరస్యానికి ప్రత్యేకత అని తెలపడానికి ఒక ఉదాహరణ (దక్కన్ ల్యాండ్ 10-12).

6.4 పాలనా సంస్కరణలు

ఆందోల్ సంస్థానాధీశులు కుల, మతాలకు అతీతంగా, స్త్రీ, పురుష భేద భావాలు లేకుండా పరిపాలించారు. ప్రజ్ఞాపాటవాలు కలిగిన వ్యక్తులను అధికారులుగా, పరిపాలనలో భాగస్వాములుగా చేశారు. నిష్ణాతులైన వారిని తమ ఆస్థాన ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఉదాహరణకు ‘నీరుడి పాపన్న’ దళితుడు (మాల), ధీశాలి, సైనికుడు. తన శౌర్య పరాక్రమ ప్రతిభ పాఠవాలతో మరాఠాలను రాణి శంకరమ్మ ఆదేశాలను పాటించి యుద్ధంలో ఓడించాడు. రాణి రెండవ లింగమ్మ పాలన కాలంలో మరాఠాలు ఆందోల్ సంస్థానం, హైదరాబాద్ నిజాం రాజ్యంపై దండెత్తినప్పుడు మరాఠాలను ఓడించడంలో పాపన్న కీలక పాత్ర నిర్వహించడం ఒక విశేషం. ఆందోల్ సంస్థానాధీశురాలు రాణి శంకరమ్మ తన ప్రధానమంత్రిగా, ముఖ్య సైనిక అధికారిగా నియమించుకోవడం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది ఆందోల్ సంస్థానంలో సాంఘిక సంస్కరణలకు ఒక నిదర్శనం.

6.4.1 ప్రజల చైతన్యం

నిజాం కాలంలోని భూస్వామ్య వ్యవస్థలో ఉన్న కొన్ని కఠినమైన నిబంధనలను సడలించి సామాన్య ప్రజలకు సాగునీరు, తాగునీరు, విద్యా సౌకర్యాలు, ఆర్థిక ప్రగతికి చేయూత కల్పించడం, సాంఘిక సంస్కరణల ద్వారా తమ ఉదార పాలనతో ఆందోల్ సంస్థాన ప్రజలలో సామాజిక జన చైతన్యాన్ని బలోపేతం చేశారు. న్యాయపాలన వ్యవస్థ, ప్రజలలో రాజకీయ, సామాజిక చైతన్యం కలగడానికి, ఆర్థిక ప్రగతికి, స్థానిక స్వపరిపాలన గ్రామాల్లో పంచాయతీ తరహా వ్యవస్థను పటిష్టపరిచారు. వివాదాలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుని ప్రజారంజక పాలకులుగా మన్ననలు పొందారు.

6.4.2 రవాణా సౌకర్యాలు

రాణి శంకరమ్మ, రాణి లింగమ్మ కాలంలో కొత్త కొత్త గ్రామాలను, పట్టణాలను నిర్మించడం జరిగింది. కొత్త కొత్త పట్టణాలను అనుసంధానం చేస్తూ రవాణా వ్యవస్థను, రోడ్డు మార్గాలను వ్యూహాత్మకంగా నిర్మించారు. సదాశివపేట-సంగారెడ్డి, సంగారెడ్డి-ఆందోల్ మీదుగా నారాయణఖేడ్‌కు, ఆందోల్-జహీరాబాద్‌లను కలుపుతూ ఒక రోడ్డు, ఆందోల్-పాపన్నపేట-మెతుకు పట్టణంను కలుపుతూ మరొక రోడ్డు, అదేవిధంగా మెతుకు పట్టణం-నర్సాపూర్ వరకు ఇంకో రోడ్డును ఇలా అనేక రోడ్డు మార్గాలను వేశారు. ఆందోల్ సంస్థానాధీశులు వ్యాపార మార్గాలను కూడా అభివృద్ధి పరిచారు. ఆందోల్-జోగిపేట ప్రాంతం అప్పట్లో వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. స్థానిక కుటీర గృహ ఉత్పత్తులైన బంగారు, వెండి, ఇత్తడి, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఆధార ఉత్పత్తులు, బెల్లం, పత్తి, చిరు ధాన్యాలు, ఆందోల్ సంస్థానం ఉన్ని ఉత్పత్తికి, గొంగళ్ల తయారీకి ప్రధాన కేంద్రం. ఇక్కడి గొంగళ్లు నాణ్యత కలిగి ఉండి ప్రజాదరణ పొందాయి. వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి వీలుగా కచ్చా రోడ్లను, బాట మార్గాలను అభివృద్ధి చేశారు. బాటల వెంట బావులు తవ్వించారు. బాటలకు ఇరువైపుల మర్రి చెట్లు, రావి చెట్లు, మామిడి చెట్లు, చింత చెట్లు నాటించారు. ఈ బాటలు, ఈ బాటలకు ఇరువైపులా ఉన్న చెట్లు ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. ఉదాహరణకు సంగారెడ్డి-ఆందోల్-అల్లాదుర్గం-నారాయణఖేడ్ రహదారి, సంగారెడ్డి మీదుగా ఆందోల్-జహీరాబాద్ బాటలు, బాటలకు ఇరువైపుల ఉన్న మర్రి చెట్లు మార్గాలకు తోరణాలుగా ఇప్పుడు కూడా దర్శనమిస్తాయి. ఈ చెట్లు బాటలకు తోరణాలుగా మనం అభివర్ణించవచ్చు.

7. జోగిపేట ప్రాధాన్యత

ఆందోల్ సంస్థానములోని జోగిపేటకు చరిత్రలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు స్థానం ఉంది. జోగిపేట ప్రాచీన చారిత్రక, వారసత్వ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ జన చైతన్య కేంద్రం. ఈ జోగిపేట చాళుక్యుల, కాకతీయుల కాలంలో ప్రముఖ జైన మత కేంద్రాలలో ఒకటి. జోగులా గుట్ట ప్రముఖ జైన ‘బసది’గా చరిత్రలో వాసికెక్కింది. ఆందోల్ సంస్థానాధీశుల కాలంలో జోగిపేట ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రం. నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన జోగిపేట జన చైతన్య కేంద్రంగా, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా, అదేవిధంగా ఒక వర్తక వాణిజ్య కేంద్రంగా చరిత్రలో జోగిపేటకు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

7.1 జోగిపేట పేరు చరిత్ర

జోగిపేట పట్టణానికి ఆ పేరు రావడానికి ప్రధానంగా రెండు చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథనం ప్రకారం, జోగిపేట ప్రముఖ జైన మత ఆధ్యాత్మిక కేంద్రం. ప్రఖ్యాతి గాంచిన ‘జైన బసది’ జోగులా గుట్ట ప్రధాన పుణ్యక్షేత్రం. జోగిపేట చాళుక్యుల, కాకతీయుల కాలంలోని ప్రముఖ జైన పుణ్యక్షేత్రాలలో మొదటిది కొలనుపాక, రెండవది పొట్లచెర్వు, మూడవది జోగిపేట. ప్రముఖ జైన మత ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లింది. చాళుక్యుల, కాకతీయుల కాలంలో కొలనుపాక, పొట్లచెర్వు, జోగిపేట బస్తీ జైనుల ఆరాధ్య ప్రదేశాలు. జోగిపేటలోని జోగుల గుట్ట ఒకప్పుడు జైన మత గురువుల ఏకాంత ప్రదేశం. ఒక ‘బసది’. ఇక్కడ జైన గురువులు ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవారు. జోగిపేట ఒకప్పుడు దిగంబర జైనులకు ప్రధాన పుణ్య క్షేత్రంగా వర్ధిల్లింది. ఇక్కడ లభించిన చారిత్రక రాతి శాసనాలు, రాగిరేకు శాసనాలు, చాళుక్యుల, అదేవిధంగా కాకతీయుల కాలం నాటి వాస్తునిర్మాణాలు, శిల్పాలు, అల్లాదుర్గం గ్రామంలోని చాళుక్యుల కాలం నాటి చిత్రాలు వంటి చారిత్రక, వారసత్వ రచన ఆధారాలు ఈ ప్రాంతం జైన పుణ్యక్షేత్రం అని చెపుతున్నాయి. చారిత్రక పరిశోధనల ప్రకారం జోగిపేట ప్రాంతం జైనులకు అపురూపమైన ప్రదేశం. ఆందోల్ సంస్థాన పాలకుల కాలము నుండి వీరశైవులకు ప్రధాన పుణ్యక్షేత్ర నిలయంగా మారిపోయింది. క్రీస్తు శకం 16వ శతాబ్దంలో వీరశైవ లింగాయత మతం బసవేశ్వరుని ద్వారా విస్తరించడంతో అనేక జైన ఆలయాలు శివాలయాలుగా మార్చబడ్డాయని స్థానిక కథనాలు, చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. చారిత్రక, పురావస్తు ఆధారాల బట్టి ఇక్కడ జైన ఆలయం, విగ్రహాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి. నేడు కూడా అతి పురాతనమైన దిగంబర జైన ఆలయం జోగిపేటలోని శివాజీ రోడ్డులో ఉంది. ఇక్కడ 22వ తీర్థంకరుడైన ‘నేమి నాథుని’ విగ్రహం పద్మాసన ముద్రలో ఉంటుంది. ఈ ఆలయంలో తెల్లరాతి మార్బుల్ విగ్రహాలు, అదేవిధంగా పంచలోహాలతో చేసిన అనేక చిన్న జైన విగ్రహాలు, జైన సాహిత్యం కూడా లభిస్తుంది. జోగిపేట సమీపములోని కొల్చారం, అల్లాదుర్గం వంటి ప్రాంతాలలో ఇప్పుడు కూడా అనేక జైన ఆనవాళ్లు, వర్తమాన మహావీరుని విగ్రహాలు వ్యవసాయ క్షేత్రలలో, గ్రామాలలో గృహ నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంలో అనేకం లభ్యమయ్యాయి. ఒకప్పుడు ఇక్కడ అనేక జైన కుటుంబాలు నివసించేవి. అయితే కాలక్రమేణా వీరశైవ మత విజృంభణ మూలంగా ఈ జోగిపేటలోని జైనులు సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో ప్రస్తుతం అతి తక్కువ సంఖ్యలో జైన కుటుంబాలు ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఈ ప్రాంతంలో అహింసా మార్గం, నైతిక విలువలతో కూడిన జైన మత ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. పురాతత్వ, చారిత్రక ఆధారాల ప్రకారం జోగిపేట పరిసరాలలో జైనులకు సంబంధించిన అనేక శిల్పాలు, అదేవిధంగా శిథిలాలు, అపురూప కళాఖండాలు, వస్తువులు లభించాయి. పదవ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూటుల, వేములవాడ చాళుక్యుల కాలం నాటి జైన చౌముఖ శిల్పాలు ఇక్కడ వెలిశాయి. స్థానిక కొండలపై జైన తీర్థంకరుల శిల్పాలు, అదేవిధంగా చారిత్రక శాసనాలు లభించాయి. జోగిపేటలోని ఈ చారిత్రక జైన సంపదను ఆధారంగా చేసుకుని జోగిపేటకు జైన మతము మూలంగానే జైన బసది అని, జైన బస్తీ కాలక్రమంలో జోగిపేటగా పేరు వచ్చిందని చరిత్రకారులు నిర్ధారించారు.

రెండవ కథనం రామాజోగు కథనం ప్రకారం, ఆందోలు రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించిన శౌర్యవంశ రెడ్డి రాజులైన రామినేయుని వంశంలోని 4వ తరం రాజు అల్లమారెడ్డికి సంతానం కలగలేదు. దానితో రామజోగి అనే సాధువు సలహా ప్రకారం వైక్రాంతగిరి పైన శివలింగాన్ని ప్రతిష్టించి పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించాలని సూచించడంతో అల్లమారెడ్డికి సంతానం కలిగింది. తనకు సలహా ఇచ్చిన రామజోగి శైవ గురువుకు కృతజ్ఞతగా వైక్రాంతగిరి (జోగినాథ్) గుట్ట కింద క్రీస్తు శకం 1547వ సంవత్సరంలో గ్రామాన్ని నిర్మించి దానికి రామజోగిపేటగా నామకరణం చేశారని స్థానికులు చెపుతున్నారు. కాలక్రమంలో రామాజోగి అను పేరు అపభ్రంశంగా జోగిపేటగా మారిందని స్థానికుల కథనం. దీనితో పాటు వైక్రాంతగిరిపై ఉన్న జైన తీర్థాంకరుల విగ్రహాలను తొలగించి తమ ఇష్టదైవమైన శివలింగాన్ని ప్రతిష్టించి జైన జోగులబస్తీని వీరశైవ బస్తీగా పేరు మార్చారని ఆందోల్ సంస్థాన కాలము నాటి చారిత్రక, పురావస్తు, సాంస్కృతిక ఆధారాలు తెలియజేస్తున్నాయి. అయితే కాలక్రమంలో జోగులబస్తీ యోగుల బస్తిగా, జోగిపేటగా రూపుదిద్దుకున్నట్లు రుజువు అవుతుంది. వైక్రాంతగిరి గుట్టపై ఉన్న జోగినాథ ఆలయం ఒకప్పుడు జైన ఆలయంగా ఉండేది. వీరశైవ మత విజృంభణ మూలంగా జోగినాథ ఆలయం కాస్త జోడు లింగాల ఆలయంగా మార్చబడి జైన జోగులా ఆలయం యోగుల ఆలయంగా రూపాంతరం చెందిందని అనేక చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి (కమలాకర శర్మ సాగి 309-316).

7.2 వర్తక వాణిజ్య కేంద్రం

జోగిపేట ప్రముఖ వర్తక వాణిజ్య కేంద్రం. నాటి నుండి నేటి వరకు అజరామరంగా వర్ధిల్లుతుంది. ఆందోల్ సంస్థానాధీశుల ప్రజాహిత కార్యక్రమాల మూలంగా ఈ ప్రాంతము వ్యవసాయ రంగంలో ముందంజలో ఉంది. రైతులు పండించిన రకరకాల పంటలు, చిరు ధాన్యాలను జోగిపేటలోని సంతలో విక్రయించేవారు. వేలాది మంది రైతులతో, పంట కొనుగోలుదారులతో, వినియోగదారులతో సంత కిక్కిరిసిపోయేది. ఈ సంతలో వ్యవసాయ పంటలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తి వస్తువులు అమ్మకాలు, కొనుగోలు ప్రధానంగా జరిగేవి. వినియోగదారులు వస్తువులను కొనేవారు. ఈ సంతకు (బజార్) అసఫ్ జాహీ నిజాం పాలకులు భారీ ఏర్పాట్లను క్రీ.శ. 1941 సంవత్సరంలో చేసి శ్రీ జోగినాథుని పేరు పెట్టినట్లు మెదక, గుల్షానాబాద్ డిస్ట్రిక్ట్ గజిటీర్ ద్వారా నాటి నిజాం కాలము నాటి రెవెన్యూ రికార్డులలో నమోదు కాబడి విషయం అవగతం అవుతుంది.

7.3 ఉద్యమాల కేంద్రం జోగిపేట

నిజాం ఆంధ్ర మహాసభ పురిటి గడ్డ ఈ నేల. తల్లి భాష తెలుగు ప్రజల అస్తిత్వంపై నాటి నిజాం ప్రభువు విధించిన నిరంకుశ, ప్రజా వ్యతిరేక ఆంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ జన్మించింది జోగిపేట గడ్డ మీద. క్రీ.శ 1921 సంవత్సరంలో నిజాం హైదరాబాద్‌లోని ‘డి.కె.కార్వే’ అనే మహాశయుడి అధ్యక్షతన సాంఘిక సంఘసంస్కరణ సభ జరిగింది. ఈ సభలో నాటి నిజాం రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలుగు భాషా మాట్లాడే మేధావులను ఈ సమావేశంలో తెలుగులో మాట్లాకూడదని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత మేధావులు ఆంక్షలు విధించారు. తెలుగులో ప్రసంగిస్తే మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల వారు అడ్డుకున్నారు. ఈ చర్యకు అవమాణంగా భావించిన నిజాం తెలుగు ప్రాంత మేధావులు మాడపాటి హనుమంతరావు, కొండ వెంకటరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, మందుమూల నర్సింగరావు, బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి నిజాం తెలుగు ప్రాంత నేతలు అదే రాత్రి ‘ఆంధ్ర జన సంఘం’ క్రీ.శ.1921 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. క్రీ.శ.1928 సంవత్సర తదనంతరం ‘ఆంధ్ర జనసంఘ’ను మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణరావు మేధావుల ఆలోచనలకు అనుగుణంగా ‘ఆంధ్ర మహాసభ’గా పేరు మార్చి విధి విధానాలు రూపొందించి, నియమావళిని ఖరారు చేసి తెలంగాణ ప్రజల ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన ఉద్దేశ్యంగా, ప్రజలలో స్వాతంత్ర్య ఆకాంక్షను రగిలించేందుకు గాను క్రీస్తు శకం 1930 మార్చి 3, 4, 5వ తేదీలలో ఒక మహాసభను జరిపేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మహా సభ జరుపడానికి జోగిపేటను వేదికగా చేయాలని అప్పటి స్వాతంత్రాభిలాషులు, జోగిపేట ప్రాంతావాసులు ఐన బసవమానయ్య, సులుగంటి శివప్ప ముందుకు రావడంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, స్థానిక జోగిపేట వ్యాపారుల ఆర్థిక సహాయం, అండదండలతో పట్టణంలోని విఠలేశ్వర ఆలయంలో మహా సభను ఏర్పాటుచేశారు. ఈ సభకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా ఇదే ప్రాంతానికి చెందిన అనంత వెంకట్రామారావు దేశ్ పాండే, కార్యదర్శిగా బచ్చు వెంకటేశం గుప్తాను నియమించుకున్నారు.

నాటి నిజాం పాలకుడు ‘గస్తీ నిషాన్’ అను ఆంక్షలను విధించాడు. ఈ ‘గస్తీ నిషాన్’ ఆంక్షలను దిక్కరించి, నిజాం నిరంకుశ ఆంక్షలకు వ్యతిరేకంగా, సైనికుల కనుల గప్పి ‘ఆంధ్ర మహాసభ’ను నిర్వహించారు. నాడు ‘తెలంగాణ విమోచన ఉద్యమం’ ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలో నిజాం నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించి స్వాతంత్య్రం సాధించాలన్న దిశలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా క్రీస్తు శకం 1930 మార్చి 3, 4, 5వ తేదీలలో స్థానిక విఠలేశ్వర దేవాలయంలో ప్రథమాంధ్ర మహాసభ జోగిపేటలో నిర్వహించారు. ఈ సమావేశానికి సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సభ తెలుగు భాషా రక్షణకు, ప్రజలలో చైతన్యాన్ని రగిల్చడానికి నాంది పలికింది. అనేకమంది మహానుభావులెందరో హాజరయ్యారు. ఈ ప్రథమ ‘ఆంధ్ర మహాసభ’లో నాటి ప్రధాన సమస్యలపై 32 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు. వీటిలో ఎక్కువగా విద్య, సంఘ సంస్కరణకు సంబంధించినవి ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటు బాల్య వివాహాలని రూపుమాపడానికి, వితంతు వివాహం వంటి దురాచారాలను రూపుమాపడానికి ఇలా వివిధ తీర్మానాలను కూడా చేశారు. అయితే సభలో ఉన్న సనాతన సాంప్రదాయవాదులను ఈ తీర్మానాలు బాధించాయి అని అనుకోవచ్చు. ఈ ప్రథమ ‘ఆంధ్ర మహాసభ’ జరుగుతున్న సందర్భంలోనే నడింపల్లి సుందరమ్మ అధ్యక్షతన ‘ప్రథమాంధ్ర మహిళా మహాసభ’ కూడా జోగిపేటలోనే నిర్వహించడం గమనార్హం.

7.3.1 ప్రథమ ఆంధ్ర మహిళా మహాసభ

తొలి ఆంధ్ర మహాసభకు పురుషులే వచ్చినప్పటికీ, ముందుచూపుతో అప్పటి మహిళలను సైతం స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములు చేయాలనే సదుద్దేశ్యంతో ప్రముఖులు ‘ప్రథమ ఆంధ్ర మహిళాసభ’ జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ప్రథమాంధ్ర మహాసభ మూడవరోజున, క్రీస్తు శకం 1930 మార్చి 5వ తేదీన నడింపల్లి సుందరమ్మ అధ్యక్షతన జోగిపేటలో ‘ప్రథమ ఆంధ్ర మహిళా’ మహా సభను ఏర్పాటు చేశారు. స్థానిక వనిత ‘విఠబాయి’ మొదటి ‘ఆంధ్ర మహిళాసభ’ సమావేశానికి అధ్యక్షత వహించింది. ఈ సమావేశం ద్వారా అప్పటివరకు కేవలం పురుషుల్లోనే ఉన్న స్వాతంత్ర్య కాంక్ష, భాషా అభిమానం మహిళలల్లోనూ రగిలించినట్లయింది.

7.3.2 గ్రంథాలయ ఉద్యమం

అప్పట్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన గ్రంథాలయ ఉద్యమానికి మొదటగా స్పందించింది జోగిపేట ప్రజలు కావడం విశేషం. స్థానిక వ్యాపారుల సహాయంతో స్వాతంత్ర్యాభిలాషులు బసవ మానయ్య, సుగంటి శివప్ప జోగిపేటలోని గడియార స్థంభం వద్ద జోగినాథాంధ్ర గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయంలో పలు పత్రికలు, పుస్తకాల ద్వారా నిజాం నిరంకుశ, ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజలలో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. ఈ కార్యక్రమముతో కోపగించిన నిజాం ప్రభుత్వం ‘గస్తీ నిషాన్’ అను నిరంకుశ శాసన చట్టంను రూపొందించింది. ఈ నిరంకుశ శాసన చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా గ్రంథాలయాలు, పాఠశాలలు, వ్యాయామశాలలను ఏర్పాటు చేయరాదు. అయినా గస్తీ నిషాన్ చట్టమును ఉల్లంఘించి జోగిపేటలో క్రీస్తు శకం 1932 సంవత్సరంలో మొట్టమొదటి సారి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఆయుర్వేద వైద్యశాలను, వ్యాయామ కేంద్రాన్ని ఆందోల్ కోటలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో నిర్వహించడం జోగిపేట స్వాతంత్ర్య సమర యోధుల ధీరత్వానికి తార్కాణం.

7.4 జోగిపేట ద్వారాలు

జోగిపేట గ్రామానికి నాలుగు ముఖ ద్వారాలు ఆందోల్ సంస్థాన పాలకులు నిర్మించారు. జోగిపేట గ్రామంలోకి వెళ్ళాలంటే జోగిపేట ప్రధాన ముఖద్వారం గుండానే గ్రామంలోకి ప్రవేశించాలి. ఈ ముఖ ద్వారాన్ని స్థానికులు గౌని అనే పేరుతో పిలుస్తారు.

7.5 గడియార స్తంభం

సుమారు 158 ఏళ్ల చరిత్ర కలిగిన గడియార గోపుర స్థంభం (క్లాక్ టవర్) జోగిపేట పట్టణానికి ఐకానిక్, ఒక ప్రత్యేక చిహ్నంగా నిలుస్తోంది. ఇది నిజాం కాలం నాటి నిర్మాణం. గ్రామానికి నాలుగు వైపులా ఉన్న ముఖ ద్వారాలకు మధ్యలో క్రీస్తు శకం 18వ శతాబ్దంలో హైదరాబాద్ అసఫ్ జాహీ నిజాంల పాలనకాలంలో ఈ గడియారపు గోపుర స్థంభంను జోగిపేట ప్రజలకు సమయం తెలపడానికి నిర్మించారు. క్లాక్ టవర్ మధ్యలో తెల్లటి పాలరాతితో జాతి పిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థానిక ప్రజలు నిర్మించుకున్నారు. ఈ క్లాక్ టవర్ నేటికీ చెక్కుచెదరకుండా చరిత్రకు సాక్ష్యంగా నిలిచి ఉంది (దక్కన్ ల్యాండ్ 49).

8. పర్యాటక, సాంస్కృతిక ఆకర్షణలు

జోగిపేట ఒక సాంస్కృతిక, వారసత్వ, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం. సుమారు 400 సంవత్సరాల క్రితం స్థానిక గుట్టపై జోడు లింగాలు ఆందోల్ సంస్థాన పాలకుడు అల్లమారెడ్డి కాలంలో వెలిశాయి అని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ గుట్ట పైన ఆందోల్ సంస్థాన పాలకుడు అల్లమారెడ్డి జోగినాథ ఆలయాన్ని నిర్మించాడు. జోగినాథ గుట్టపై వెలసిన రామజోగి ఆలయమే జోగినాథ స్వామిగా కొలువబడుతుంది. క్రీస్తు శకం 1922 సంవత్సరంలో జోగిపేటలోని శ్రీ జోగినాథ ఆలయాన్ని స్థానిక ప్రజలు పునర్నిర్మించుకున్నారు. ప్రతి ఏటా ఈ ఆలయంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు స్థానికులు. ఈ జాతర ఉగాది పండుగకు ముందు రోజు నిర్వహించడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్న ఆచారం. జోగినాథ తిరుణాళ్ళలో భాగంగా రథమును అలంకరణ చేసి ఊరేగిస్తారు. ఈ జోగినాథ రథము లోహ రథము. ఈ రథము 52 ఫీట్ల ఎత్తు కలిగి ఉంటుంది. ఈ రథమును ప్రత్యేకంగా తయారు చేయించారు. 32 టన్నుల ఇనుముతో తయారు చేయించిన ఈ రథానికి ఐదు అంతస్తులు ఉంటాయి. ప్రతి అంతస్తు దేనికది ప్రత్యేకం. ఒక్కో అంతస్తులో ఒక్కో దేవతా మూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేస్తారు. గణపతి, దుర్గ మాత, నందీశ్వరుడు, నాగసర్పం, జోగినాథ దేవాలయా దేవతా మూర్తుల విగ్రహాలు రథంపై ఏర్పాటు చేసి ఉన్నాయి. ఈ రథం తెలంగాణలోని అతిపెద్ద రథముగా గుర్తింపు పొందింది. స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రతి ఏడు ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రారంభించడం అనావాయితీగా వస్తుంది. అయితే ఇక్కడి ప్రత్యేకమైన ముఖ్య ఘట్టాలుగా చెప్పుకునేవి భక్తులు అగ్నిగుండాల గుండా ప్రవేశం చేసి వెళ్లడం ముఖ్య విశేషం. జోగినాథ జాతర సందర్భంగా రైతులు ఎడ్లబండ్ల ఊరేగింపు ఎంతో ఆనందంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అదేవిధంగా జాతర చివరి రోజు పార్వతి, పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించడం అందరిని ఆకర్షించే విధంగా ఉంటుంది.

8.1 ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం

ఏడుపాయల వన దుర్గమ్మ భవాని ఆలయం ఈ ప్రాంతంలో అత్యంత పవిత్రమైనది. ఆలయ నిర్మాతలు ఆందోల్ సంస్థానాధీశులు. ఏడుపాయల క్షేత్రం పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయ అభివృద్ధిని ఒక క్రమ పద్ధతిలో నిర్వహించడం కోసం ఈనాడు కూడా ఆందోల్ సంస్థానాధీశుల కృషి మరువలేనిది. భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించి, పూజాది కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను నేటికీ కూడా పాపన్నపేట/ఆందోల్ సంస్థానం వారు తమ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా వెలసిన స్వయంభూ క్షేత్రం ఇది. నేటికీ ఆందోల్ సంస్థానానికి చెందిన వారసులే ఈ ఆలయానికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఏడుపాయల అంటే మంజీరా నది ఇక్కడి అడవిలో ఏడుపాయలుగా విడిపోయి ప్రవహించడం వల్ల దీనికి ఏడుపాయలు అనే పేరు వచ్చింది. స్థానిక జాతర ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. వర్షాకాలంలో నది ఉప్పొంగినపుడు అమ్మవారి విగ్రహం నీట మునిగి నది జలలతో అభిషేకం జరగడం ఇక్కడ ప్రత్యేక విశేషం. నేడు వనదుర్గ ప్రదేశం పర్యావరణ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతుంది. ప్రభుత్వం కూడా పర్యావరణ పర్యాటకానికి ఎంతో కృషి చేస్తుంది.

8.2 ఇతర పర్యాటక స్థలాలు

నాటి ఆందోల్ సంస్థాన పరిధిలోని కోటలు, శ్రీ రంగనాథ స్వామి ఆలయము, ఆందోల్ పెద్ద చెరువు, సంస్థాన పరిధిలో ఉన్న కల్పగూరు కాశీ విశ్వనాథ ఆలయం, శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయం ఝరాసంగం, సింగూర్ జలాశయ మోసళ్ల పెంపక కేంద్రం, కల్పగూరు జలాశయ పక్షి సంరక్షణ కేంద్రము, మంజీరా అభయారణ్యము, మెదక్ కోట, అల్లాదుర్గం బేతాల జాతర, చిన్న ఘానాపురం ఆనకట్ట, పోచారం అభయారణ్యము, పోచారం ప్రాజెక్ట్, సంగారెడ్డి కారాగార ‘వస్తు సంగ్రహాలయము’, మెదక్ కొండాపూర్ పురావస్తు సంగ్రహాలయము, కొల్చారం జైన దిగంబర ఆలయం, చిట్కూల్ శ్రీ చాముండేశ్వరి ఆలయం, లింగంపేట మెట్లబావి, కిచ్చన్నపల్లి మెట్లబావి, మెదక్ చర్చి వంటివి ఆందోల్ సంస్థాన పరిధిలోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ ప్రదేశాలు. ఇవి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ పర్యాటక ప్రదేశాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. పర్యాటకుల సౌకర్యార్థం అనేక వసతులను కల్పిస్తుంది. పర్యాటక అభివృద్ధితో ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుంది. పర్యాటకము మూలంగా ఈ ప్రాంతంలోని నిరుద్యోగులకు, యువతకు ఉపాధి లభిస్తుంది. స్థానిక వర్తక వ్యాపారము, హోటల్ వ్యాపారము ద్వారా అధిక ఆదాయమును సమకూర్చుకోవచ్చు. పర్యాటకులకు వసతి, హోటల్ సౌకర్యాలు అందుబాటు ధరలలో ఉన్నాయి. ఐన ఇంకా పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా సౌకర్యాలు సమకూరాలి. పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయవలసిన అవసరం ఉంది. పర్యాటక సమాచారంతో ప్రకటనల ద్వారా ఈ ప్రాంత పర్యాటకమును అభివృద్ధి పరచాలి అని ఆశిస్తున్నాను (Chandrashekhar).

ఉపసంహారం

  • అందోల్/పాపన్నపేట సంస్థాన పాలకులు ప్రజారంజక పాలకులు.
  • అనంత రెడ్డి కల్బగూరు కేంద్రంగా సంస్థాన పాలనకు ఆద్యుడు. రామినేడు రాజకీయ పటుత్వం కోసం రాజధానిని ఆందోల్‌కు మార్చడం తన రాజకీయ చతురతకు నిదర్శనం. నాటి నుండి పాలన ఆందోల్ కేంద్రంగా జరిగింది.
  • ఆందోల్/పాపన్నపేట కేంద్రంగా ఈ వంశ పాలకులు ఎందరో ప్రజారంజక, సంక్షేమ కార్యక్రమాల ద్వారా తమ ప్రజల మన్ననలను పొందారు.
  • ఎన్నో బిరుదులు పొందారు. పెద్దనరసింహారెడ్డి ‘మెతుకు సర్కార్’ అను బిరుదు ఔరంగజేబు నుండి పొందాడు. అదేవిధంగా రాణి శంకరమ్మ హైదరాబాద్ నిజాం నుండి ‘రాయ్ బాగాన్’ ‘శార్ధూలం’ వంటి గొప్ప బిరుదులు పొందింది. రాణి శంకరమ్మ ‘ఆందోల్ పులి’గా పేరుగాంచింది.
  • ఆందోల్/పాపన్నపేట సంస్థానాధీశులు సంస్థాన ఆర్థిక ప్రగతికి అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి రాజ్య ఆదాయాన్ని పెంచారు. అడవులను నరికించి కొత్త వ్యవసాయ భూములను సాగులోకి తెచ్చి భూములను ప్రజలకు పంచిపెట్టారు.
  • అడవి భూములను వ్యవసాయ భూములుగా మార్చి వ్యవసాయ ప్రగతికి, వర్తక, వాణిజ్య అభివృద్ధికి జోగిపేట, అల్లాదుర్గం, రామాయంపేట, సదాశివపేట, సంగారెడ్డి వంటి కొత్త నగరాలను నెలకొల్పి ఇక్కడ రోడ్డు, రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేసి వ్యాపార ప్రగతికి కారకులయ్యారు.
  • అనేక సాంఘిక సంస్కరణలను తీసుకువచ్చారు. రాణి శంకరమ్మ స్త్రీ పాలకురాలు. పురుషునికి ధీటుగా ప్రజారంజకంగా పాలించింది. కుల, మతాలకు తావులేకుండా ప్రతిభకు పట్టం కట్టింది. రాణి శంకరమ్మ నీరుడి పాపన్న అనే దళితుని ప్రతిభ చూసి తన ప్రధానిగా, ప్రధాన సైనిక అధిపతిగా నియమించుకుంది.
  • తమ సంస్థానంలో విద్యా కేంద్రాలను ఏర్పాటు చేసి విద్య అభివృద్ధికి పాటుపడ్డారు.
  • అనేక చారిత్రక, వారసత్వ కట్టడాలు నిర్మించారు. ఆందోల్ కోట, పాపన్నపేట, సదాశివపేట గడి వంటి అనేక ప్రదేశాలలో తమ రాజకీయ ప్రాబల్యం కోసం, ధాన్యాల నిల్వ కోసం, సైనిక శిక్షణ నిమిత్తం, స్థానిక తగాదాలను పంచాయతీ తీర్పులు ఇవ్వడానికి వీటిని ఉపయోగించుకున్నారు.
  • వ్యవసాయ ప్రగతికి కొత్త కొత్త చెరువులు తవ్వించారు. ఆందోల్ రంగనాయకసాగర్, అన్నాసాగర్, అనంతసాగర్, దాకూర్ చెరువు, మంజీరా నదిపై చిన్న ఘనపూర్ వద్ద ఆనకట్టను నిర్మించి వ్యవసాయ ప్రగతికి తోడ్పాటును అందించారు.
  • పరిశ్రమలను నెలకొల్పి పారిశ్రామిక ప్రగతికి నాంది పలికారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు నెలకొల్పారు. చేనేత, ఉన్ని, తోలు, బెల్లం, పంచదార పరిశ్రమలను అభివృద్ధికి తెచ్చి సంస్థాన ఆర్థిక ప్రగతికి బీజం వేశారు. ఈ విధంగా ప్రజారంజక ప్రగతికి బాటలు వేశారు. కాబట్టే ఈ ప్రాంత ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం భారత యూనియన్‌లో కలిసే వరకు పోరాటం చేశారు. ఈ ప్రాంత ప్రజలు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని ఉద్యమాల గడ్డగా తీర్చిదిద్దారు.
  • మొదటి ఆంధ్ర మహాసభకు ఆతిథ్యం ఇచ్చి తమ స్వతంత్ర కాంక్షను తెలియపరిచారు. మహిళా చైతన్యాన్ని రగిలించారు.
  • నిజాంకు వ్యతిరేకంగా మొట్టమొదటి సారిగా మహిళా నాయకత్వంలో నిజాం ఆంధ్ర మహిళా ప్రథమ సభను నిర్వహించడం ఈ ప్రాంత ప్రజల చైతన్యానికి ప్రధాన నిదర్శనం.
  • గ్రంథాలయ ఉద్యమానికి ఈ ప్రాంతమే బీజం వేసింది. ఈ ప్రాంతం ఆధ్యాత్మిక కేంద్రం.
  • ఆందోల్-జోగిపేట ప్రాంతం ప్రముఖ జైన, వైదిక ఆధ్యాత్మిక కేంద్రం. జోగిపేట జోగినాథ ఆలయ ఉత్సవాలు, ప్రముఖ సూఫీ వెంకట్ ఖాజా వట్పల్లి ఉర్సు ఉత్సవాలు ఈ ప్రాంత మత సామరస్యానికి నిదర్శనం.
  • ఈ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధికి కారకులు ఆందోల్/పాపన్నపేట సంస్థానాధీశులు. ఏ రాజ్యమైనా, రాజరిక పాలన ఐనా ఏదో ఒకనాడు చరిత్ర కాలగర్భంలో కలిసిపోవలసిందే. ఆందోల్ సంస్థానం కూడా నిజాం రాజ్యము ఇండియన్ యూనియన్‌లో కలిసినప్పుడు స్వతంత్ర భారతావనిలో కలిసిపోయింది.
  • ఈ ప్రాంత అభివృద్ధికి కారకులు ఆందోల్ సంస్థానాధీశులు రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో ప్రగతికి కారకులు. నేడు ఆందోల్-జోగిపేట ఒక ముఖ్యమైన వర్తక వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఆందోల్ సంస్థాన ఆర్థిక మూలాలు, రాజకీయ స్థితిగతుల మూలంగా నేడు కూడా తన వైభవాన్ని నిలుపుకుంది. నేడు ఆందోల్-జోగిపేట ఒక ముఖ్యమైన రాజకీయ నియోజకవర్గం, పురపాలక సంఘం. గత చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యం ఆందోల్. అదేవిధంగా వివిధ ప్రదేశాలలో నిర్మించిన కోటలు, గడులు, కట్టడాలు, వారసత్వ, ఆధ్యాత్మిక కట్టడాలు, నాటి శిల్పాలు, రంగనాయక చెరువు, చిన్న ఘనపురం మంజీరా నదిపై నిర్మించిన ఆనకట్ట, ప్రతి గ్రామంలో చిన్న చెరువులు, కుంటలు, మెట్ల బావులు వ్యవసాయ అభివృద్ధికి, కొత్త భూముల సాగుకు, ఆర్థిక ప్రగతికి జోగిపేట, సంగారెడ్డి, సదాశివపేట నేటికీ నిదర్శనం. చారిత్రక, వారసత్వ సంపదను, వారసత్వ, ఆధ్యాత్మికతకు, మత సామరస్యతకు నిలువెత్తు నిదర్శనం ఈ సంస్థానం. చారిత్రక, వారసత్వ సంస్కృతిక సంప్రదాయ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరముపై, ప్రభుత్వంపై ఎంతైనా ఉంది. ఇక్కడి చారిత్రక వారసత్వ సంపద, ఇక్కడి శిల్పాలు, చాళుక్య, కాకతీయుల శిల్పకళా సంపద నిర్లక్ష్యం, నిరాదరణ గురి అవుతున్నాయి. ఇక్కడి చారిత్రక, వారసత్వ సంపదను స్థానికులు, ప్రభుత్వం, పురావస్తు వారసత్వ శాఖ వారు బాధ్యతగా కాపాడవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ చారిత్రక, వారసత్వ సంపదను భావి తరాలకు భద్రంగా అందివ్వవలసిన బాధ్యత, అవసరం మనదరిపైన ఉంది. ఆందోల్-జోగిపేట, పాపన్నపేట, సంగారెడ్డి, కల్బగూరు, అల్లాదుర్గం, ఏడుపాయల, సింగూరు, మెదక్, కొల్చారం ప్రాంతాలు నేడు ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా వెలుగొందుతున్నాయి. ఈ పర్యాటక ప్రదేశాలను ఇంకా అభివృద్ధి పరచినట్లయితే ప్రభుత్వానికి ఆదాయం రావడమే కాకుండా, స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి. ఆర్థిక వ్యవస్థకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఈ ప్రాంత చరిత్ర, సంస్కృతి ప్రాముఖ్యత గురించి నేటి తరానికి తెలిసే విధంగా పాఠశాల స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు పాఠ్య ప్రణాళికలో భాగము చేసి విద్యార్థులకు చరిత్ర, వారసత్వ అంశాలు తెలియపర్చాలి. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని, చారిత్రక వారసత్వ సంపదను రక్షిస్తారని ఆశిస్తున్నాను. నేను జోగిపేట ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నప్పుడు నా విద్యార్థులతో పాటు క్షేత్ర పర్యటనకు అనేక సార్లు వెళ్ళాను. క్షేత్ర పర్యటనకు వెళ్ళిన ప్రతిసారి ఒక కొత్త అనుభూతి, అనుభవము, విషయాలు స్థానికుల ద్వారా తెలిసేవి. అదేవిధంగా ఆందోల్ సంస్థాన చరిత్రను తెలుసుకోవడానికి నిజాం కాలము నాటి రికార్డులు, అనేక రచనలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా సమాచారం రాబట్టుకోవచ్చును. 2014 సంవత్సరంలో ఎన్. ఎస్. ఎస్ బి.ఏ యూనిట్ శీతాకాల శిబిరాన్ని ఆందోల్‌లో నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలో అధిక సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం కలిగింది. జోగిపేటలోని జైన దిగంబర ఆలయానికి 2013 సంవత్సరంలో విద్యార్థులతో క్షేత్రం పర్యటనకు స్వయంగా వెళ్లి దర్శనం చేసుకుని కొంత సమాచారం సేకరించాను. పరిశోధన క్షేత్ర పర్యటన లేనిదే పరిశోధన అనుభవం రాదు కావున క్షేత్ర పర్యటన పరిశోధకులకు అవసరం అని నేను భావిస్తున్నాను.

ఆందోల్-జోగిపేట సంస్థానం చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి అద్దం పడుతుంది. ఈ అధ్యయనంలో సంస్థానం పాలనా విశేషాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మత సామరస్యం, సాహిత్య వికాసం, ప్రముఖ పాలకులైన రాణి శంకరమ్మ వంటి వారి కృషి విశ్లేషించబడ్డాయి. ఈ ప్రాంతం విద్య, వర్తక వాణిజ్యం, ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిందనే విషయం స్పష్టమవుతుంది.

  • ఆందోల్-పాపన్నపేట సంస్థానం ఒక ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతిని కలిగి ఉంది.
  • దీని పాలకులు ప్రజా సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపారు.
  • రాణి శంకరమ్మ వంటి ధీర వనితలు పరిపాలనలో కీలక పాత్ర పోషించి, మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారు.
  • సంస్థానం విద్య, సాహిత్యాలకు గొప్ప ప్రోత్సాహం అందించింది.
  • నీటిపారుదల ప్రాజెక్టులు, కోటలు, ఆలయాల వంటి అద్భుతమైన నిర్మాణాలను నిర్మించారు.
  • జోగిపేట ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా, జైన, వీరశైవ సంస్కృతులకు నిలయంగా వెలుగొందింది.
  • నిజాం వ్యతిరేక ఉద్యమాలు, గ్రంథాలయ ఉద్యమాలు, ప్రథమ ఆంధ్ర మహిళా మహాసభ వంటి వాటికి జోగిపేట పురిటిగడ్డగా నిలిచింది.
  • ఈ ప్రాంతం అనేక చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ఆకర్షణలతో నిండి ఉంది. వీటి పరిరక్షణ, అభివృద్ధికి భవిష్యత్ తరాలు కృషి చేయాలి.

ఉపయుక్త గ్రంథసూచి

  1. A., Chandrashekhar. *Census of India 1961 Vol-II. Andhra Pradesh Part VII-B(14) Fair's and Festivals*. Government of Andhra Pradesh, 1961.
  2. A., Altekar. *A Kannada Dynasty was Created in Berar Under the Rule of Badami Chalukyas*. 1934.
  3. A., Parthasarathy. *Places of Interest in Andhra Parades (A Monograph) Vol-I*. District Gazetteers Department, Andhra Parades, 1984.
  4. Aravind, Kumar. "Economic Conditions in Medieval Telangana (As Glended Through the Kannada Inscriptions)." *Proceedings of the Indian History Congress*, vol. 67, 2006-2007, pp. 235-243.
  5. ఆచార్య, ఎన్. ఎల్. ఎస్. *కాకతీయ శాసనాలు భారతి సూచి*. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 1997.
  6. "ఆంధ్ర సంస్థనములు: సాహిత్య పోషణ." పుటలు 224-227.
  7. "ఆంధ్రజ్యోతి దిన పత్రిక." 10 మార్చ్ 2024.
  8. ఆర్కియాలజికల్, ఆఫ్ ఇండియా, ది డైరెక్టర్ జనరల్. *Epigraphia Indica: Arabic & Persian Supplement 1931-36*. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, 1986.
  9. బి. ఎన్., శాస్త్రి. *ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి*. మూసీ పబ్లికేషన్స్, 1980.
  10. బి. ఎన్., శాస్త్రి. *ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతి*. (1,2,3 భాగాలు), మూసీ పబ్లికేషన్స్, లింగంపల్లి, హైదరాబాద్.
  11. బి. ఎన్., శాస్త్రి. *గోల్కొండ చరిత్ర-సంస్కృతి శాసనములు*. మూసీ పబ్లికేషన్స్, హైదరాబాద్, 1989.
  12. "దక్కన్ ల్యాండ్ మాస పత్రిక." ఏప్రిల్ 2019, పుటలు 10-12.
  13. "దక్కన్ ల్యాండ్ మాస పత్రిక." అక్టోబర్ 2015, పుట 49.
  14. D.L.N., Sastry. *The Pre Historic Culture of the Manjra Valley*. Bharatiya Kala Prakashan, 1997.
  15. ఈ.టీవీ.భారత్ తెలంగాణా టీం. 22 డిసెంబర్ 2023. స్పెషల్ స్టోరీ.
  16. "ఈనాడు దినపత్రిక." 05 జూన్ 2022.
  17. Framurz Jung Bahaddur, Nawab. *H.H. The Nizams Territory*. Secunderabad, 1909.
  18. G., Yazdhani. *Early History of Deccan*. Oxford, 1960.
  19. Hoiberg and Ramchandani. *Rashtrakuta Dynasty*. 2000.
  20. Hyderabad District Gazetteers Medak. *Hyderabad District Gazetteers Part-2. Tables*. vol. 8, Government Central Press, Hyderabad, ఇండియా, 1925.
  21. Imperial Gazetteers of India. *Provincial Series Hyderabad*. Superintendent of Government Printing, Calcutta, 1909.
  22. Jaya Rao, S.S. *Census of India-1981. Series-2. Andhra Pradesh, District Census Hand Book Medak*. Government Andhra Pradesh, 1986.
  23. కమలాకర శర్మ, సాగి. *ఆలోకనం*. మూసి పబ్లికేషన్, హైదరాబాద్, 2017.
  24. ఖండవల్లి, లక్ష్మి రంజనం; and ఖండవల్లి, బాలేందు శేఖరం. *ఆంధ్రుల చరిత్ర సంస్కృతి*. బాల సరస్వతి బుక్ డిపో, ఎడ్యుకేషనల్ పబ్లిషర్స్, కర్నూల్, మద్రాస్, 1957.
  25. లక్ష్మణ శాస్త్రి, విదిరే. *మెదకు రాజుల చరిత్ర*.
  26. మానయ్య, టి. *పొట్లచెర్వు చరిత్ర*.
  27. మాణిక్ ప్రభు, పి. *మెదక్ జిల్లా గ్రామాలు*.
  28. మెదక్ జిల్లా సాహిత్య చరిత్ర. తెలంగాణా సాహిత్య అకాడమీ. పుటలు 18-23.
  29. M.V., Raja Gopal. *Andhra Pradesh District Gazetteers Publishing*. 1977.
  30. "నమస్తే తెలంగాణా, దినపత్రిక." 23 మే 2021.
  31. "నమస్తే తెలంగాణా, దినపత్రిక." 05 నవంబర్ 2017.
  32. నందిని, సిద్దరెడ్డి. *మెతుకు సీమ చరిత్ర - సంస్కృతి*. మంజీరా రచయితల సంఘం, చరిత ఇంప్రెషన్స్, ఆజమాబాద్, హైదరాబాద్, 2008.
  33. "నవ వసంతం-2: తెలుగు వాచకం, ఏడవ తరగతి. రాణి శంకరమ్మ వీర గాథ, గేయ కథ." పుటలు 116-127.
  34. N.R., Visalatchy. *Telangana Through Ages: Perspectives From Early and Medieval Periods*. Proceedings of the Second Seminar, Deccan History, Hyderabad, 19 జనవరి 2019.
  35. పి., మాణిక్ ప్రభు. *మెదక్ జిల్లా గ్రామాలు*.
  36. ప్రతాపరెడ్డి, సురవరం. *ఆంధ్రుల సాంఘిక చరిత్ర*. సురవరం ప్రతాప రెడ్డి సాహిత్య వైజయంతి, హైదరాబాద్, 1949.
  37. రాధాకృష్ణ శర్మ, M. *Temple of Telingana*. Munsiram Manoharlal Publishers, 1979.
  38. రాధాకృష్ణ శర్మ, M. *Temple of Telingana; Through the Ages*. Department of Heritage Telangana, డా. MCR HRD Institute of Hyderabad, తెలంగాణ.
  39. "రెడ్డి రాణి వీర గాథ." *సంచిక - తెలుగు సాహిత్య వేదిక*, 1 ఏప్రిల్ 2019.
  40. రఘురామ శర్మ, శాశ్రుల. *మెతుకు సీమ విజ్ఞాన సర్వస్వం*. మౌకిక గ్రాఫిక్స్, కవాడిగూడ, హైదరాబాద్, 2001.
  41. S.S., Jaya Rao. *Census of India-1981. Series-2. Andhra Pradesh, District Census Hand Book Medak*. Government Andhra Pradesh, 1986.
  42. "సాక్షి దినపత్రిక." 03 సెప్టెంబర్ 2017.
  43. సత్యనారాయణ, ద్వానావల్లి. *Cultural Heritage of Telangana*. Recent Explorations, Telangana Resource Center, హిమాయత్ నగర్, హైదరాబాద్, 2015.
  44. శివనాగి రెడ్డి, ఈమని. *Temple of Telingana; Through the Ages*. Department of Heritage Telangana, డా. MCR HRD Institute of Hyderabad, తెలంగాణ.
  45. సోమశేఖర శర్మ, మల్లంపల్లి; వెంకట రంగయ్య, మామిడిపూడి; వెంకట రమణయ్య, నేలటూరి; and సత్యనారాయణ, మోటూరి. *తెలుగు విజ్ఞాన సర్వస్వం*. vol. 3, తెలుగు భాషా సమితి, మద్రాస్, 1958.
  46. T., Vedant. *Census-1971. Searees-2. Andhra Pradesh. District Census hand book, Medak. Part X-A. Village & Town Directorate. Part X-3. Village & Town Primary Census Abstract*. Government of Andhra Pradesh, 1973.
  47. T., Vedantam. *Census-1971.Series-2.Andhra Pradesh District Census Hand Book Medak Part X-A, Village & Town Directory. Part-B. Village &Town Primary Census Abstract*. The Government of Andhra Pradesh, 1973.
  48. T., మానయ్య. *పొట్లచెర్వు చరిత్ర*.
  49. వసంత లక్ష్మి, గజ్జల; and గౌతమ్, పింగిళి. *Epigraphia Telangana*. vol. 2, Imperial Kakatiyas, డా. MCR మానవ వనరుల అభివృద్ధి సంస్థ, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్, 2023.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image