AUCHITHYAM | Volume-07 | Issue-03 | March 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. ఒగ్గుకథ: మిద్దె రాములు పాత్ర
కడారి సాయిసురేశ్
తెలుగు అధ్యాపకులు, తెలుగుశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ.ప్ర.), సిద్ధిపేట,
సిద్ధిపేట జిల్లా, తెలంగాణ.
సెల్: +91 8639925732, Email: ksaisuresh085@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 15.02.2026 ఎంపిక (D.O.A): 27.02.2026 ప్రచురణ (D.O.P): 01.03.2026
వ్యాససంగ్రహం:
ప్రస్తుత పరిశోధన "ఒగ్గుకథ: మిద్దె రాములు పాత్ర" శీర్షికతో ఒగ్గుకథ పుట్టుక, వ్యాప్తి, రూపాంతరాలపై దృష్టి సారించింది. ఒగ్గుకథ పరిణామక్రమంలో మిద్దె రాములు చేసిన మార్పులను, ఆయన విశిష్టశైలిని విశ్లేషించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. కాలక్రమేణా అనేకకులాలకు ఒగ్గుకథ వ్యాపించడానికి ఆయన చేసిన కృషిని గుర్తించడం ఈ పరిశోధన ఆవశ్యకత. ఈ కళారూపానికి ఆయన అందించిన సేవలను ఇది చర్చిస్తుంది. బిరుదురాజు రామరాజు వంటి పండితుల పూర్వ పరిశోధనలు, కడారి సాయిసురేశ్, వారాల ఆనంద్, గూడూరి సీతారాం వంటి విమర్శలు, రచనలు అధ్యయనంలో కీలకంగా నిలిచాయి. ప్రాథమిక సమాచార సేకరణలో భాగంగా మిద్దె రాములు శిష్యులు మ్యాకల కొమరయ్య, బుగ్గయ్య, మిద్దె వినీత్ వంటి వారితో వేములవాడలో క్షేత్రస్థాయిలో ముఖాముఖి సంభాషించి వివరాలు సేకరించాం. ఆయన ప్రదర్శనల ఆడియో, వీడియో రికార్డింగ్‌లను పరిశీలించాం. ద్వితీయ సమాచారం కోసం తెలుగు అకాడమి, ఉస్మానియా విశ్వవిద్యాలయం, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ప్రచురణలు, అంతర్జాల వనరులను వినియోగించుకున్నాం. పరిశోధన వివరణాత్మక పద్ధతిలో మిద్దె రాములు శైలి, జానపద సినీగీతాల వినియోగం, తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, కథన నైపుణ్యం, 'బోనం' నూతన ప్రక్రియ, శిష్యులకు శిక్షణ వంటి అంశాలపై దృష్టి సారించింది. ఒగ్గుకథను కురుమ కులంతో పాటు ఇతర కులాల వారికి పరిచయం చేయడం, పురాణ, సామాజికకథలను ఒగ్గుకథలోకి తీసుకురావడం, భాషను సరళీకరించడం, జానపదసినీగీతాలను సందర్భానుసారంగా వాడటం, తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడాలను ఈ పరిశోధన సోదాహరణంగా విశ్లేషించింది. శ్రోతల అభిరుచికి అనుగుణంగా కథలను మార్చి చెప్పే సామర్థ్యం మిద్దె రాములు సొంతం. 'బోనం' ప్రక్రియకు నూతన ఆకృతినిచ్చి, నృత్యాన్ని జోడించి ఒక విశిష్టపద్ధతిని సృష్టించారు. దాదాపు 2000 మంది శిష్యులను తయారుచేసి ఒగ్గుకథ వ్యాప్తికి గణనీయంగా కృషి చేశారు. ఇలాంటి మౌఖికకళారూపాలను పరిశోధించడంలో సవాళ్లున్నాయి. భవిష్యత్తులో ఒగ్గుకథ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థికకోణాలతో పాటు జీవన విలువలు, కుటుంబవిలువలు వంటి నూతన దృక్పథాల నుండి అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది.
Keywords: ఒగ్గుకథ, మిద్దె రాములు, జానపద కళలు, తెలంగాణ సంస్కృతి, బోనం, కథన నైపుణ్యం, కళాకారుడు
1. ప్రవేశిక
ప్రస్తుత పరిశోధన అంశం “ఒగ్గుకథ : మిద్దె రాములు పాత్ర”. ఒగ్గుకథ పుట్టుక, విస్తరణ గురించి అనేక వాదోపవాదాలు ఉన్నాయి. ఒగ్గుకథను ప్రాచీనకాలంలో కేవలం కొన్ని సందర్భాల్లో ఒగ్గుకథకులు (కుర్మవాళ్ళు) మాత్రమే చెప్పేవాళ్ళు. కాలక్రమంలో ఒగ్గుకథ అనేక రూపాంతరాలు చెందింది. ఇప్పటికీ మార్పులు చెందుతూనే ఉంది. నేటి కాలంలో అనేక కులాల వారు ఒగ్గుకథను నేర్చుకొని చెబుతున్నారు. ఎంతోమంది ఒగ్గుకథ కళాకారులు ఒగ్గుకథ చెబుతున్నారు. కానీ ఏ ఒగ్గుకథ కళాకారులకు లేని ప్రఖ్యాతి మిద్దె రాములుకు, చుక్క సత్తయ్యకు ఉంది. ఎవరి ప్రత్యేకత వారిదే గాని, ఒగ్గుకథలో అనేక మార్పులు చేసిన వ్యక్తిగా మనం మిద్దె రాములను చూడవచ్చు.
“కృతయజ్ఞశ్చ మేధావీ బుధో జానపద శ్శుచిః” (బిరుదురాజు రామరాజు 1)
ఈ శ్లోకపాదం ఆధునిక పండితుల నిర్వచనాలకు భిన్నంగా జానపదులు పామరులు, ప్రాకృతులు, చదువురాని వారు, అనాగరికులు అనే శబ్దాలకు పూర్తిగా విరుద్ధ అర్థం ఇస్తుంది. జానపదులను వ్యాసుల వారు యజ్ఞం చేసిన వారితో, పండితులతో సమానంగా భావించారని బిరుదురాజు రామరాజు గారు తెలుగు జానపద గేయ సాహిత్యం పుస్తకంలో వివరించారు.
నిజంగా జానపదులకు ఎంతో జ్ఞానం ఉంటుంది. కొన్ని వందల పాటలను, ఎంతో దీర్ఘమైన కథా గేయాలను కంఠస్థంగా, ఆశువుగా పాడుతూనే ఉంటారు. అది ఒక యజ్ఞం వంటిదే. జానపదులకు స్ఫురణ, ధారణ శక్తులు అమితంగా ఉంటాయి. నిరంతర సాధన వల్ల వారు అనేక గేయాలను గుర్తుకుంచుకోగలుగుతున్నారు. కొన్నిచోట్ల అనేక మార్పులు చేసుకోగలుగుతున్నారు. అదే విధంగా మిద్దె రాములు కూడా అనేక మార్పులను ఒగ్గుకథలో చేశారు. ఆ మార్పులకు సంబంధించిన విషయాలను, వారి ప్రత్యేకతలను వివరించడమే ఈ పరిశోధనా వ్యాసం ప్రధాన లక్ష్యం.
2. మిద్దె రాములు ప్రత్యేకత శైలి
మిద్దె రాములు ఒగ్గుకథలో గమనించదగిన ప్రత్యేక అంశాలు భాష సరళత, వ్యావహారిక భాష, స్పష్టత, లోకానుభవం, సంస్కరణ భావం. కథకు తగ్గ మార్పులు కూడా ఆయన చేశారు. ఒగ్గుకథ ప్రారంభంలోనే ప్రార్థనను తనకు తానే సొంతంగా కైకట్టి, ప్రాంతీయ అస్తిత్వం, తన వ్యక్తిత్వాన్ని చెబుతూనే కథకు తగ్గ వేగాన్ని, తక్కువ వేగంగా చెప్పడం గమనించవచ్చు.
2.1. ప్రార్థనా శైలి
“హరి హరి హరియా.... హరి హరి బ్రహ్మాండమా, హరిలోకసంచారి, మద్దులు మారేళ్ళు, మానేటిగడ్డ, మరుమన్న తల్లి, విద్య చెప్పిన వాడా వీర హనుమాన్లు, బుద్ధి చెప్పినదాన భూనాంచారి, అమ్మవారు పార్వతి పదివేల దండమే.... ఆ....” (కడారి సాయిసురేశ్ 21)
మానేటిగడ్డ పదం తన ప్రాంతీయ అస్తిత్వం స్పష్టం చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నివాసి ఆయన అర్థం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు వాగు పారుతుంది, అందుకే మానేటి గడ్డ అంటారు. రాములు ప్రారంభించిన ఈ విధానాన్నే ఆయన శిష్యులు, ఇతరులు కూడా అనుసరించారు. గంగా ప్రార్థనను రాములు సందర్భానుసారంగా తమ కథలలో వాడుకున్నారు.
ఆదేవి దండామ భూదేవి దండమా/లోకాల శంకరా నీకన్న దండమా
దండము నారాయణ దాపరమందేమో/అవ్వలాల అక్కాలాల రామొజై రామ రామ
ఆలకించె దాతాలాల రామొజై రామ రామ/నేను చెప్పబోయే కథలోనా రామొజై రామ రామ
ఎన్ని తప్పులూన్నా గాని రామొజై రామ రామ/మీరు మన్నించి బ్రోవాలయ్యా రామొజై రామ రామ
మాకు తండ్రులూన్నారయ్యా రామొజై రామ రామ/నేను గొల్ల వాన్ని కాదోయ్ రాజా రామొజై రామ రామ
అయ్యో కాలు గజ్జ కట్టాలేదు రామొజై రామ రామ/నేను కథనమందు దుంక లేదు రామొజై రామ రామ
అయ్యో ఏమి నేర్వలేనోయ్ రాజా రామొజై రామ రామ/నేను యెడ్డివాని ఉన్నాను రాజా రామొజై రామ రామ
ఏ రాఘవ…. రామా….
రామ శబ్దంతో ప్రారంభం అన్న ఒగ్గు కథ లక్షణాన్ని రాములు వదలకుండా, తనదైన శైలిలో చెప్పారు. తాను చెప్పబోయే కథలో ఎన్ని తప్పులు ఉన్నా మన్నించాలని కోరారు. ఎందుకు మన్నించాలో కూడా ఆయన స్పష్టం చేశారు. "నాకు తండ్రులు ఉన్నారు. మీరేమైనా అంటే వారికి పాతకం చుట్టుకుంటుంది. నేను గొల్ల వాడిని కాదు. కాలికి గజ్జె కట్టుకోలేదు. కథనరంగంలో దూకలేదు. ప్రత్యేకించి ఒగ్గుకథ గురించి ఏమీ నేర్చుకోలేదు." ఇవన్నీ చెబుతూనే "నేను ఎడ్డివాన్ని" అని చమత్కారంగా రాములు తన లక్షణాలను కథ ప్రారంభంలోనే చెప్పుకున్నారు.
సారంగడు ఏలేరా అది చల్లని ఎములాడరో/ఓరి నరియంద ఏలేరా అది గజనాంపల్లిరో
అయ్యో రామ రామ రామ రామ రామ రామ/రాజులమ్మ రాఘవేణి రామ రామ
ఓరి ఎండి కొండ పైడి కొండ ఓరి నాయనో…
ఏలే వాడు శంకరుడో ఓ నాయనో/నీకు పదివేల వందనాలే ఓరి నాయనా
అయ్యో దండిదమ్మ ధర్మపురి ఓ నాయనో/ధర్మపురి ఏలేవాడ ఓ నాయనా
సామి నరసింహ దండామయ్య ఓ నాయనా…
నా ఏడికె మొక్కల తల్లి ఓ దేవతో/నా ఎములాడ బద్దిపోచు ఓ దేవతో
నీకు పదివేల వందనాలే ఓ దేవతో/నా ఊరగాసే ఊరపోసు ఓ దేవతా
నీకు పదివేల వందనాలే ఓ దేవతో (కడారి సాయిసురేశ్ 23) (Disco Ricording Company – Telanagana Folks యూట్యూబ్ ఛానల్. మిద్దె రాములు ఒగ్గు కథ రికార్డింగ్.)
ఇష్టదేవత స్తుతిలో జానపద ఐతిహ్యల ప్రకారం పూర్వం వేములవాడ పట్టణాన్ని సారంగధరుడు పరిపాలించాడు. అదే విధంగా అతని తండ్రి నరియంద రాజు గజనాంపల్లి ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూనే తన వ్యక్తిత్వాన్ని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ పరిసర ప్రాంత దేవతలను కూడా మిద్దె రాములు స్తుతించారు. అదే విధంగా గంగా ప్రార్థనను రాములు సందర్భానుసారంగా తమ కథలలో వాడుకున్నారు. రాములు తన మొదటి ఒగ్గుకథ ప్రదర్శనను వేములవాడలోని బద్ది పోచమ్మ గుడి ముందు ప్రదర్శించారు. అప్పటి నుండి రాములు ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు.
2.2. కళా విస్తరణ
కేవలం ఒక కులానికి పరిమితమైన ఒగ్గుకథను అనేక కులాలకు వ్యాపింపజేశారు. మొదట్లో ఒగ్గుకథను కురుమ వాళ్ళు మాత్రమే చెప్పేవారు. దాన్ని గౌడ కులానికి చెందిన రాములు నేర్చుకున్నారు. రాములు ప్రధాన శిష్యులలో ఒకరు, ఎరుకల కులానికి చెందిన మాన్పాటి పోశయ్య, ఒగ్గుకథను నేర్చుకున్నారు. ఇలా ఒక కులం నుండి మొదలై అనేక కులాలకు ఈ ఒగ్గుకథ వ్యాపించింది. ఒగ్గుకథ పరిణామ క్రమంలో రాములకు ప్రత్యేకమైన స్థానం ఉంది. రాములు శిష్యులలో అనేక కులాల వారు ఉన్నారు. ఈ విధంగా రాములు ఒగ్గు కథను శాఖోపశాఖలుగా వ్యాపింపజేశారు.
2.3. కథలలో మార్పులు
శివలీల ఒగ్గుకథ, బీడీల లచ్చమ్మ ఒగ్గుకథ, బలవంత రాజు ఒగ్గుకథ, సూర్య చంద్ర రాజుల ఒగ్గుకథ లాంటి 15కు పైగా కథలకు ఆయన స్వయంగా కైకట్టారు. నాటకాలకు, ఇతర ఆశ్రిత కులాలకు పరిమితమైన కథలను కూడా ఆయన ఒగ్గుకథలోనికి తీసుకొచ్చారు. ఉదాహరణకు సతీ సావిత్రి ఒగ్గుకథను చెప్పుకోవచ్చు. ఒగ్గుకథలోకి తీసుకురావడం ఒక విశేషం. దాన్ని ప్రదర్శించడంలో అవసరమయ్యే మెలకువలు, శైలి విధానంలో రాములు ఆరితేరారు. విజయవంతంగా ప్రదర్శించారు. అలాంటివే సీతా కళ్యాణం ఒగ్గుకథ (ఆయన మొట్టమొదటి కథ), వినాయక విజయం ఒగ్గుకథ వంటివి కేవలం పురాణాలు, కావ్యాలకు పరిమితమైన కథలను ఒగ్గుకథలోకి తీసుకొచ్చారు. కొండలరాయుని కథ బొబ్బిలి వాళ్ళు చెప్పుకునే కథ. రాములు దాన్ని ఒగ్గుకథలోకి తీసుకొచ్చారని ఆయన శిష్యుడు మ్యాకల కొమరయ్య గారు చెప్పారు. ఒగ్గుకథలో అనేక ప్రయోగాలు చేసి, ఒక నూతన మార్గంలో దాన్ని నవీకరించారు. ఒగ్గుకథలో సందర్భానుసారంగా అనేక మార్పులు తీసుకొచ్చారు. కాలానికి తగిన మార్పులు చేశారు. ప్రేక్షకుల మనసులను ఆకట్టుకునే విధంగా కథలు చెప్పారు. కథల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. మార్పులకు అనుగుణమైన సందర్భాలను, సందర్భానికి అనుగుణమైన కథలను చెప్పారు. ఒగ్గుకథలో విశిష్ట స్థానాన్ని సంపాదించడానికి అడ్డ కథలు కూడా కారణమయ్యాయి. ప్రజల అభిరుచుల మేర, ప్రజల నాడిని పట్టుకొని అప్పటికప్పుడు కథలు చెప్పడం రాములు గొప్ప ప్రత్యేకత.
3. ఒగ్గుకథలో జానపద సినిమా పాటలు
జనులు పాడుకునే పాటలను సందర్భానుసారంగా ఒగ్గుకథలోకి తీసుకొచ్చిన ఘనత మిద్దె రాములకు చెందుతుంది. ఆడవారితో కలిసి, వారి దగ్గర పాటలు నేర్చుకొని ఒగ్గుకథలో సందర్భానుసారంగా పాడారు. ఆడవారితో కలిసినప్పుడు వారి ముచ్చట్లు విని, వారి సుఖదుఃఖాలను మనసులో అంతర్లీనం చేసుకున్నారు. ఒగ్గుకథలో తనదైన స్థానాన్ని, శైలిని నిలుపుకోవడం కోసం వారి బాధలను లోక బాధలుగా మలిచి అడ్డ కథలుగా చెప్పారు మిద్దె రాములు.
రాములు స్త్రీల వద్ద నేర్చుకున్న అనేక జానపద పాటలను తర్వాతి కాలంలో ఒగ్గుకథలోకి తీసుకొచ్చారు. అలాగే మిద్దె రాములు ఒగ్గుకథలోని పాటల చరణాలు కొన్ని సినిమా రంగంలో కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు:
మల్లె చెట్టు కిందికెళ్ళి మదనో నా వయ్యారి….
నువ్వక్కడ నేనిక్కడ
మనమిద్దరం కలిసేది ఎక్కడ…. (మంచి మనుసులు, 1992)
నమ్మదు నమ్మదు నమ్మదు ఆడవాళ్ళ నమ్మద్దురో…. (రణం, 2006) (కడారి సాయిసురేశ్ 26)
ఈ పాటలు మనం రాములు ఒగ్గుకథలో చూడవచ్చు.
4. తెలంగాణ ఉద్యమంలో రాములు
రాములు తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక ఒగ్గుకథలు ప్రదర్శించారు. ఉద్యమంలో రాములకు ఒక విశిష్ట స్థానం ఉంది. వేదిక ఎక్కి పాటలు పాడినా, ఒగ్గుకథ చెప్పినా ప్రజలు పూర్తిగా ఆకర్షితులయ్యేవారు. ఉద్యమం అంటేనే చైతన్యపరిచేది. తెలంగాణ ఉద్యమంలో రాములు ఒగ్గుకథ ప్రజలను ఎంతగా చైతన్యపరచిందో తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు తెలంగాణ ఉద్యమంలోని ఒక పాట.
“సుక్కల్లోన సెందమామ ఓ లచ్చ గుమ్మడి
సక్కనొక్క కారు గుర్తు ఓ లచ్చ గుమ్మడి
బయలెల్లె కేసీఆర్ ఓ లచ్చ గుమ్మడి
బయలు పిట్ట చందమామ ఓ లచ్చ గుమ్మడి
చేతుల జండా పట్టే ఓ లచ్చ గుమ్మడి
వెళ్ళిపోతున్నాడమ్మా ఓ లచ్చ గుమ్మడి….” (మ్యాకల కొమరయ్య)
ఈ విధంగా అనేక జానపద పాటలను ఒగ్గుకథలోకి ప్రవేశపెట్టి, వారి పేర్లతో పాడడం మిద్దె రాములకు ప్రత్యేకత.
ఈ పాట అసలు రూపం ఒగ్గుకథలో రాజు లేదా రాణి వస్తున్నారంటే పాడే పాట.
“సుక్కల్లోన సెందమామ ఓ లచ్చ గుమ్మడి
సక్కనొక్క రాజు అంట ఓ లచ్చ గుమ్మడి...” (మ్యాకల కొమరయ్య)
5. కథా నైపుణ్యం
రాములకు కథను ఎవరి వద్ద ఏ విధంగా చెప్పాలో తెలుసు. “బ్రాహ్మణులకు రామాయణం, మహాభారతం, సత్యహరిచంద్ర లాంటి కథలను చెప్పేవారు. తెనుగోళ్లకు పెద్దమ్మ కథ, మాదిగోళ్లకు మాతమ్మ కథ, కురుమ వాళ్ళకు బీరప్ప కథ, కాపోళ్లకు మల్లన్న కథ” (బుగ్గయ్య) చెప్పేవారని రాములు శిష్యుడు బుగ్గయ్య వివరించారు.
బుగ్గయ్య చెప్పిన దాని ప్రకారం, కథ అందరూ చెబుతారు. కానీ అందరూ చెప్పేది కథ కాదు. ప్రజల దృష్టికి తగ్గట్టు చెప్పేది కథ. ఇది మిద్దె రాములకు బాగా తెలుసు. ఒగ్గుకథకు సరైన మార్గనిర్దేశం చేసింది మిద్దె రాములే అని బుగ్గయ్య చెప్పారు.
రాములు ఎల్లమ్మ కథ కొన్ని వేల సార్లు చెప్పారు. పూర్వం నుండి ఉన్న ఎల్లమ్మ కథకు మెరుగులు దిద్దారు. ఎల్లమ్మ కథను నాలుగు భాగాలుగా చేశారు. ఎల్లమ్మ కథలో బోనం పద్ధతి ఉన్నప్పటికీ, దానిని ఎలా చేయడం, ఎత్తుకొని ఎలా నటించడం అనేది రాములు సృష్టించారు. ఈ విధంగా అనేక కథలలో, కథకు అనుగుణమైన మార్పులు చేయడంలో రాములు నిష్ణాతులు.
6. మిద్దె రాములు బోనం
రాములు ఒగ్గు కథలో తీసుకొచ్చిన అనేక మార్పులలో, బోనం ఒక గొప్ప మార్పు. ఆయన కథ చెప్పక ముందు నుంచీ బోనం ఉన్నా, ఆ బోనం ప్రక్రియకు మెరుగులు దిద్దింది మాత్రం రాములే. రాములకు ఎల్లమ్మ కథ అంటే చాలా ఇష్టం. ప్రేక్షకులు సైతం ఎల్లమ్మ కథ చెబుతున్నారంటే బోనం ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటారా అని ఎదురు చూస్తారు. ఎల్లమ్మ కథలో బోనం ఒక ముఖ్య అంశం.
“నడుముకు ఎర్ర కండువా కట్టుకొని రాములు తలమీద బోనం ఎత్తుకొని దీపం ముట్టించి దీపం కొండెక్కకుండా, రెండు చేతులలో వేపమండలు పట్టుకొని, వేప ఆకును నోటితో నములుతూ, ఊపిరి బిగబట్టి, ఒంటికాలిపై నృత్యం చేసి, పాము వలె మెలికలు తిరుగుతూ, చేతులను వెనుకకు మడిచి, చేతుల సహాయం లేకుండా కింద పెట్టిన డబ్బులను నోటితో అందుకునేవారు. ఆ సందర్భంలో స్వయంగా ఎల్లమ్మ తల్లి నృత్యం చేస్తుందా అన్నట్లు ఉంటుంది” (గూడూరి సీతారాం 12).
రాములు బోనంతో చేసే నృత్య విధానం క్రమంగా ప్రజలలోకి కూడా వ్యాపించింది. ఈనాడు మనం అనేక దేవతా ఉత్సవాలలో హిజ్రాలు బోనం తీయడం చూస్తున్నాం. వారు తీసే బోనం మిద్దె రాములు ఎల్లమ్మ బోనం నుండి స్వీకరించబడింది. బోనం ఎత్తుకొని నృత్యం చేసే పద్ధతికి ఆద్యుడు మిద్దె రాములు. రాములు బోనం ఎత్తుకోవడం కంటే ముందు నుదురు మీద మాణిక్యం (దీపం) పెట్టుకొని నటనలు చేశారు. నుదుటి మీద దీపం ఉండగానే కింద గుండ్రంగా మలిచి పెట్టిన నోటును కనురెప్పతో అందుకునేవారు. మాణిక్యం నుదురు మీద పెట్టుకోవడానికి ముందే, రాములు సీసాను నుదురుపై ఉంచుకొని నాటకాలలో నాట్యం చేసేవారు.
రాములు చేసిన ‘బోనం’ ప్రయోగానికి మూలం ఎల్లమ్మ బోనాలు. శ్రావణ మాసంలో తెలంగాణ జిల్లాలలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగలో సున్నం, పసుపు, కుంకుమల అలంకరించిన కుండలను నెత్తిన పెట్టుకొని, వేప మండలను రెండు చేతులా ఊపుతూ ఎల్లమ్మ తల్లిని స్తుతిస్తారు. పోతురాజులు బోనాల ముందు భీకర నృత్యం చేస్తారు. ఈ బోనాల నృత్యాన్ని మిద్దె రాములు ఒగ్గుకథలోనికి తీసుకున్నారు (వారాల ఆనంద్ 11).
ఎల్లమ్మ ఒగ్గుకథ, నల్ల పోచమ్మ ఒగ్గుకథ, మాంధాత ఒగ్గుకథ, ఎరుకల నాంచారి ఒగ్గుకథ వంటివి చెప్పినప్పుడు రాములు బోనం తీస్తారు (బుగ్గయ్య). ఎల్లమ్మ కథ చెప్పే సందర్భంలో రాములు ఏడంతరాల బోనం ఎత్తుకొని పోతుంటే ప్రేక్షకులు తన్మయత్వానికి లోనయ్యేవారు. నిజంగా ఎల్లమ్మతల్లి భర్తను కాపాడుకోవడానికి వెళ్తుందా అన్నట్టు ఉంటుందని చెప్పారు. ఈ కథలో పరుశరాముడు గండ్రగొడ్డలి పట్టుకొని పోతుంటే, నిజంగా రాములు పరుశరాముడి వలె కనిపించేవారని ప్రేక్షకులు వివరించారు. కథ చెప్పడంలో అంత మధురంగా, గాంభీర్యంగా వేరొకరు చెప్పలేరని ఆయన శిష్యుడు బుగ్గయ్య పేర్కొన్నారు.
7. మిద్దె రాములు ఒగ్గుకథ బృందం
వేములవాడకు పూడూరు గ్రామం నుండి ముగ్గురు ఒగ్గుకథ కళాకారులు కథ చెప్పుకొని బతకడానికి వచ్చారు. వారు కురుమలు (ఒగ్గులు). ఒగ్గుకథ చెప్పడం వారికి తెలుసు. రాజరాజేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో పరిసర ప్రాంతాలలో పది రూపాయలు ఇస్తే కథ చెప్పి కడుపు నింపుకునేవారు. వారు కథ చెబుతారు, కానీ వారి కథ అంతగా ఆకట్టుకునేది కాదు. అయినా ఆ ముగ్గురు ఏదో ఒక తీరుగా కాలం గడిపేవారు. ఈ విధంగా కొనసాగుతుండగా, ఒక పెద్దమనిషి వారిని సీతా కళ్యాణం ఒగ్గుకథ చెబితే కార్యక్రమం ఏర్పాటు చేస్తానని అడిగారు. ఆ ముగ్గురికి సీతా కళ్యాణం ఒగ్గుకథ తెలియదు. "మేము ఆ కథ చెప్పలేము" అని వారు అన్నారు. రాములు కథ చెబుతారని ఎవరో ఆ పెద్దమనిషికి చెప్పారట. ఆయన నేరుగా రాముల కొబ్బరికాయల దుకాణం వద్దకు వచ్చి కథ చెబుతారా అని అడిగారు. మొదట ఆ పెద్దాయన రాములను వ్యాపారం చేస్తున్నందువల్ల బ్రాహ్మణుడో, కోమటో అయి ఉంటారని భావించి 'మీ కులం ఏమిటి?' అని అడిగారట. దానికి సమాధానంగా, తాను గీత కార్మికుల కులానికి చెందినవాడినని రాములు చెప్పారు. ఆ పెద్దాయన 15 రూపాయలకు కథ చెప్పమని అడిగితే, 15 రూపాయలకు చెప్పనని, రెట్టింపు ఇస్తే చెబుతానని రాములు అన్నారు. సరే అన్న తర్వాత, రాములు కథను విజయవంతంగా పూర్తి చేశారు. అప్పటి నుండి రాములు ఎన్నడూ వెనుదిరిగి చూడలేదు.
ఒగ్గరి ఐలయ్య, కంబల్ల ఐలయ్య, ఒగ్గరి వెంకటి, ఒగ్గరి ఓదెలు అనే నలుగురితో మిద్దె రాములు 36 సంవత్సరాలకు పైగా ఒగ్గుకథ చెప్పారు. ఒకరికి తెలియని విషయాలను ఒకరు చెప్పుకున్నారు. ఐకమత్యంతో ఉండి రాములు విజయానికి వీరు తోడ్పడ్డారు.
“రాములు ఒకానొక సందర్భంలో కుటుంబ సభ్యులు అందరూ మాట్లాడుకుంటున్నప్పుడు. తాను మరణించిన తర్వాత 11 రోజులు ఒగ్గు కథ చెప్పించాలని రాములు కోరారు. ఆ విధంగానే రాములు మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు 11 రోజులు ఒగ్గు కథ చెప్పించారు” (మిద్దె వినీత్).
మిద్దె రాములు కుటుంబ సభ్యులు అడగకముందే, ఆయన శిష్యులు స్వచ్ఛందంగా వచ్చి ఒగ్గుకథలు చెప్పారు. రాములు మరణం నుండి దశదినకర్మ వరకు ఆయన ఇంటి ముందు అంగరంగ వైభవంగా ఒగ్గుకథ ప్రదర్శనలు జరిగాయి.
8. మిద్దె రాములు శిష్యులు
మిద్దె రాములకు ప్రత్యేకించి గురువు ఎవరూ లేరు. ఆయన స్వయంగా ఒగ్గుకథను నేర్చుకున్నారు. కానీ అనేకమంది శిష్యులను ఆయన తయారు చేశారు. రాములకు దాదాపు రెండు వేలకు పైగా శిష్యులు ఉన్నారు. మిద్దె రాములు శిష్యులను ప్రత్యక్ష, పరోక్ష శిష్యులుగా విభజించవచ్చు. కొంతమంది రేడియో క్యాసెట్లు విని శిష్యులమని చెప్పుకున్నారు. కొంతమంది దగ్గర ఉండి విద్యను నేర్చుకున్నారు. మ్యాకల కొమరయ్య వంటి వారు కూడా రేడియో క్యాసెట్లు విని కథ నేర్చుకొని చెప్పారు. కానీ తర్వాత రాములను కలిసి, వారు శిష్యులుగా అంగీకరించబడ్డారు.
రాములు మొదటి శిష్యుడు ఎరుకల కులానికి చెందిన మాన్పాటి పోశయ్య. కథ చెప్పాలని ఆసక్తి గలవారు రాములు వద్దకు వచ్చి కథ నేర్చుకుంటామంటే, రాములు వారిని ఆహ్వానించి, ఒక పాట చెప్పి ప్రదర్శించడానికి అవకాశం కల్పించేవారు. చాలామంది ఆయనను చూసి భయపడి ఆయన ముందు కథ చెప్పలేకపోయారు. రాములు వారికి 'నేను ఉన్నాను, ధైర్యంగా కథ చెప్పండి' అని భరోసా ఇచ్చేవారు.
రాములు శిష్యులు కథ చెప్పే ముందు రాములను స్మరించుకొని, 'మేము మిద్దె రాముల శిష్యులం' అని చెప్పుకొని కథను ప్రారంభిస్తారు. పరోక్ష శిష్యులుగా పరిచయమైన వారిని కూడా కథ చెప్పడానికి రాములు తీసుకెళ్ళారు. రాములు శిష్యులు, ఆయన మనుమడు మిద్దె వినీత్ మాటల్లో: "రాములు ఒక మహా వృక్షం. ఆ వృక్షానికి ఎన్ని కాయలు కాసాయో, ఎన్ని పువ్వులు పూసాయో లెక్కబెట్టడం కష్టం." అంతమంది శిష్యులను రాములు తయారు చేశారని వారు పేర్కొన్నారు.
ఉపసంహారం
వేల సంవత్సరాల నుండి గ్రామీణ ప్రాంతాలలో అనేక జానపద కళలు మౌఖికంగా ప్రచారంలో ఉన్నాయి. నేటి కాలంలో అనేక కళా రూపాలు కనుమరుగైపోతున్నాయి. వాటిని కాపాడవలసిన బాధ్యత మనందరిదీ. జానపద గేయాలు, ఒగ్గుకథ, బతుకమ్మ వంటివి నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో సజీవంగా ఉన్నాయి. మిగిలిన కళారూపాలను పరిశోధించడం ద్వారా ఆ కళారూపాలలో నిక్షిప్తమైన సామాజిక, సాంఘిక, రాజకీయ, ఆర్థిక విషయాలు తెలుస్తాయి. విద్యా విధానం, ఆహార సంస్కృతి, వస్తు సంస్కృతి, జీవన విలువలు, కుటుంబ విలువలు వంటి అనేక నూతన అంశాల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఒగ్గుకథను ఇంకా అనేక నూతన దృక్పథాలతో అధ్యయనం చేయాలి.
- ఒగ్గుకథ కళలో మిద్దె రాములు పాత్ర విశిష్టమైనది.
- ఆయన సరళమైన భాష, లోకానుభవంతో కూడిన శైలి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
- ఒక కులానికి పరిమితమైన ఒగ్గుకథను అనేక కులాలకు విస్తరింపజేశారు.
- జానపద, సినిమా పాటలు, సామాజిక అంశాలను కథల్లోకి తీసుకొచ్చి, కాలానికి తగ్గట్టు మార్పులు చేశారు.
- బోనం నృత్యంలో ఆయన చేసిన ప్రయోగాలు కళాకారులకు, ప్రజలకు స్ఫూర్తినిచ్చాయి.
- తెలంగాణ ఉద్యమంలో ఆయన ప్రదర్శనలు ప్రజలను చైతన్యపరిచాయి.
- రెండు వేలకు పైగా శిష్యులను తయారుచేసి ఒగ్గుకథ వ్యాప్తికి ఎనలేని కృషి చేశారు.
ఉపయుక్త గ్రంథసూచి
- ఆనంద్, వారాల. 2017. మిద్దె రాములు (మొదటి ముద్రణ). తెలుగు అకాడమి. హైదరాబాదు.
- బుగ్గయ్య. వ్యక్తిగత సంభాషణ. 2024.
- కొమరయ్య, మ్యాకల. వ్యక్తిగత సంభాషణ. 2024.
- కృష్ణకుమారి, నాయిని. 2019. తెలుగు జానపద విజ్ఞానం సమాజం-సంస్కృతి-సాహిత్యం (ద్వితీయ ముద్రణ). సంపాదకత్వం. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం. హైదరాబాదు.
- మహేందర్ రెడ్డి, రాజిరెడ్డి. 2021. ఒగ్గుకథ – సమగ్ర పరిశీలన (పరిశోధన గ్రంథం). ఉస్మానియా విశ్వవిద్యాలయం. హైదరాబాదు.
- రాధాకృష్ణ మూర్తి, మిక్కిలినేని. 1992. తెలుగువారి జానపద కళారూపాలు (మొదటి ముద్రణ). తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ. హైదరాబాదు.
- రామరాజు, బిరుదురాజు. 2015. తెలుగు జానపద గేయ సాహిత్యం (మొదటి ముద్రణ). తెలుగు అకాడమి. హైదరాబాదు.
- సాయిసురేశ్, కడారి. 2023. మిద్దె రాములు ఒగ్గుకథ – ఒక పరిశీలన (డెసర్ట్రేషన్). హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం. హైదరాబాదు.
- సీతారాం, గూడూరి. 2009. బోనం, మిద్దె రాములు గారి ఒగ్గుకథ స్వర్ణోత్సవ సంబరాల సంచిక. వేములవాడ.
- సుందరం, ఆర్. వి. ఎస్. 1993. ఆంధ్రుల జానపద విజ్ఞానం (ప్రథమ ముద్రణ). ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. హైదరాబాదు.
- వినీత్, మిద్దె. వ్యక్తిగత సంభాషణ. 2024.
అంతర్జాల వనరులు
- Disco Recording Company – Telangana Folks యూట్యూబ్ ఛానల్. https://youtu.be/PY9eXLbifrc?si=K6XWrO06ZsYLEEbf 10.02.2026
- Disco Recording Company – Telangana Folks యూట్యూబ్ ఛానల్. https://youtu.be/jOZldRoNon0?si=jOZldRoNon0 10.02.2026
- Disco Recording Company – Telangana Folks యూట్యూబ్ ఛానల్. https://youtu.be/wdL5-RFeBec?si=NocbGIvpBpjklxJE 10.02.2026
- Doordarshan YADAGIRI యూట్యూబ్ ఛానల్. https://youtu.be/oQF5ymJf9ag?si=lSqJhFhAMCw9WMf 10.02.2026
- Telangana folk యూట్యూబ్ ఛానల్. https://youtu.be/NNH9swcglTA?si=gVs6t9qdkTfsXye 10.02.2026
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

