headerbanner

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-03 | March 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. అన్నమయ్య సంకీర్తనలు: విశిష్టాద్వైతసూత్రాలు

డా. వేంపాటి వేంకట సుబ్బారావు

సహాచార్యులు, తెలుగుశాఖాధ్యక్షులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వ), ఖైరతాబాద్,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9492030012, Email: vvsraovempati@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 15.02.2026        ఎంపిక (D.O.A): 23.02.2026        ప్రచురణ (D.O.P): 01.03.2026


వ్యాససంగ్రహం:

అన్నమాచార్యుల సాహిత్యం విశిష్టాద్వైత సిద్ధాంతానికి ఒక ప్రాయోగిక నిఘంటువు. ఈ వ్యాసంలో అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా ఆ సూత్రాలను ఏ విధంగా జనబాహుళ్యంలోకి తీసుకెళ్లారో, కొన్నిచోట్ల కవిత్వస్వేచ్ఛతో ఆ పరిధిని ఎలా దాటారో విశ్లేషించడమైనది. సిద్ధాంతాన్ని, కవితాత్మక సౌందర్యాన్ని సమన్వయం చేయడం వల్లనే ఈ శీర్షిక సమర్థనీయమైనది. విశిష్టాద్వైతంలోని ప్రధానాంశాలైన శరణాగతి, ప్రపత్తి, కైంకర్యం, దాసానుదాసత్వం వంటి విషయాలను అన్నమయ్య సంకీర్తనల ఆధారంగా నిర్వచించడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. ముఖ్యంగా దాక్షిణాత్య శ్రీవైష్ణవంలోని వడగలై, తెంగలై శాఖల మధ్య ఉన్న మౌలిక భేదాలను (మర్కట, మార్జాల కిశోర న్యాయాలు) వివరిస్తూ, అన్నమయ్య దృక్పథాన్ని స్పష్టం చేయవలసిన అవసరం ఈ పరిశోధన ద్వారా నెరవేరింది. అన్నమయ్య, వారి వంశస్థుల సంకీర్తనలను 29 సంపటములుగా ప్రచురించిన తి తి దే, తిరుపతి వారి మౌలిక పరిచయ పీఠికలలో కొంత చర్చ జరిగింది అది మినహాయించి పరిశోధకులుగాని, వివిధ పత్రికా వ్యాస రచయితలు ఈ తాత్విక వివేచనకు పూనుకొనలేదు. 2015 సంవత్సరం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన పరిశోధనలో డా. వి. వి. సుబ్బారావు ఈ అంశాలను పేర్కొన్నారు. ఈ వ్యాసం ప్రధానంగా విశ్లేషణాత్మక, తులనాత్మక పద్ధతిలో సాగింది. పోతన భాగవతం, అహిర్భుద్య సంహిత వంటి ప్రమాణ గ్రంథాలను, అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలను ఆధారంగా చేసుకుని విషయసేకరణ చేయడమైనది. శరణాగతిలోని ఆరు అంగాలను (అనుకూల్య సంకల్పం, ప్రాతికూల్య వర్జనం, మహావిశ్వాసం, గోప్తృత్వ వరణం, ఆత్మనిక్షేపం, కార్పణ్యం) అన్నమయ్య కీర్తనలతో అన్వయించి చూపడమైనది అలాగే, లక్ష్మీదేవి యొక్క 'పురుషాకార' ప్రాధాన్యతను, అన్నమయ్య వంశపారంపర్య శక్తి ఆరాధన ప్రభావాన్ని వివరించడమైంది. భగవంతుని అంతర్యామిత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వాన్ని అన్నమయ్య ఎలా దర్శించారో ఇక్కడ చర్చింపబడింది. అన్నమయ్య అహోబిల శఠకోప యతి శిష్యుడని, నరసింహ మంత్ర ఉపాసకుడని తెలుపుతూ ఆయన వడగలై శాఖా నిష్ఠను ధ్రువీకరించడమైనది . కేవలం ఎదో ఒక కీర్తనలో నిరపేక్ష శరణాగతితో ‘అనాయాస ప్రపత్తి' అనే భావం పలికించినంత మాత్రాన ఆయన తెంగలై శాఖకు చెందినవారనే కొందరి పరిశోధకుల సందేహాన్ని తగిన ఆధారాలతో ఈవ్యాసం పరాస్తం చేసింది. అన్నమయ్య సంకీర్తనల్లోని ధ్వనించిన మర్కటకిశోరన్యాయం ఆయన వైశిష్ట్యాన్ని చాటుతుందని నిరూపించడమైనది.

Keywords: విశిష్టాద్వైతం, శరణాగతి, ప్రపత్తి, వడగలై - తెంగలై, మర్కట - మార్జాల కిశోర న్యాయం, పురుషాకారం (లక్ష్మీ ప్రాధాన్యత), అంతర్యామిత్వం, దాసాను దాసత్వం, కైంకర్యం.

1. ప్రవేశిక

విశిష్టాద్వైతం శ్రీ రామానుజాచార్యులవారి (11వ శతాబ్దం) సిద్ధాంతం. దీనిని ఒకే మాటలో చెప్పాలంటే: "జీవుడు, ప్రకృతి (ప్రపంచం) వేరైనా, అవి భగవంతునిలో అంతర్భాగమే." దీనిని అర్థం చేసుకోవడానికి మూడు ముఖ్య విషయాలు తెలుసుకోవాలి (రాజగోపాలన్ 45):

ఈశ్వరుడు (పరమాత్మ):

  • శ్రీమన్నారాయణుడే పరమ సత్యం. ఆయనే అందరినీ నడిపించే శక్తి.
  • చిత్ (జీవాత్మ): మనం, ప్రాణం ఉన్న జీవులందరూ.
  • అచిత్ (ప్రకృతి): ప్రాణం లేని వస్తువులు, కనబడే ప్రపంచం.

ఒక చిన్న ఉదాహరణతో దీనిని అవగతం చేసుకుందాం. మన శరీరాన్ని, ఆత్మను తీసుకుంటే ఈ సిద్ధాంతం సులభంగా అర్థమవుతుంది. మన శరీరం ఎలాగైతే మనలోని ఆత్మ ఆధీనంలో ఉంటుందో, అలాగే ఈ లోకంలోని జీవులన్నీ, ప్రకృతి అంతా ఆ భగవంతుని శరీరమే. శరీరం వేరు, ఆత్మ వేరు అని మనకు అనిపించినా, ఆత్మ లేనిదే శరీరానికి ఉనికి లేదు కదా? అలాగే భగవంతుడు లేనిదే మనం లేము. సారాంశంగా చెప్పాలంటే, మనం భగవంతుడి కంటే వేరు కాదు; మనం భగవంతుడితో సమానం కూడా కాదు. మనం ఆయనలో ఒక భాగం మాత్రమే.

1.1. విశిష్టాద్వైత మౌలికభావనలు

విశిష్టాద్వైతం నమ్మిన ప్రాథమిక సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో సర్వోత్కృష్టమైన భక్తి మార్గాలు రెండు, అవి శరణాగతి ప్రపత్తి. భాగవతంలో పేర్కొన్న నవవిధ భక్తులకు అదనంగా వాత్సల్య, మధుర, శాంత, సఖ్య, దాస భక్తులు పంచ విధములని విశిష్టాద్వైతులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. కైంకర్యం, దాసానుదాసత్వం, శ్రీ (లక్ష్మీ) పురుషాకారం అదనంగా పరిగణించబడతాయి. శ్రీ పురుషాకారం అంటే లక్ష్మి దేవి దయ. భగవంతుని సర్వవ్యాపకత (omnipresence), అంతర్యామిత్వం (omniscient), సర్వశక్తిమయత్వం (omnipotence) కూడా మౌలిక భావనలలో కనిపిస్తాయి. వాటిని తెలుసుకుంటూ అన్నమయ్య వాటిని ఎలా అనువర్తితం చేశారో గమనించగలరు.

1.2. శ్రీవైష్ణవం రెండు శాఖలు: వడగలై, తెంగలై

రామానుజాచార్యుల తర్వాత కాలంలో, సిద్ధాంతపరమైన కొన్ని సూక్ష్మ విభేదాల వల్ల శ్రీ వైష్ణవం రెండు విభాగాలుగా ఏర్పడింది.

1.2.1. వడగలై శాఖ

‘వడ’ అంటే ఉత్తరం. కాంచీపురం వీరి కేంద్రం. వేదాంత దేశికులు వీరి మార్గదర్శి. సంస్కృత వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వీరు మర్కట కిశోర న్యాయాన్ని విశ్వసిస్తారు (రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ, *తాళ్ళపాక కవుల కృతులు - పీఠిక* 12-14). కోతిపిల్ల తన తల్లిని గట్టిగా కరచుకుంటే అది ఒక చోట నుండి మరోచోటికి తీసుకువెళుతుంది. మోక్ష సాధనలో మనిషి కూడా తనవంతు కృషి చెయ్యాలి. స్పృహతో భగవంతుని శరణు వేడాలి. లక్ష్మీ దేవికి శ్రీ వారికి సమాన ప్రతిపత్తి ఇస్తారు. ఆమె కూడా మోక్ష ప్రదాత్రి. ‘U’ ఆకారంలో తిలకం దిద్దుతారు. భగవంతుడు వాత్సల్యంతో భక్తుని దోషాలను పరిహరిస్తాడని వీరు నమ్ముతారు. కైంకర్యం (సేవ) శాస్త్రోక్తంగా నియమబద్ధంగా ఉండాలి. అహోబల పీఠం, పరకాల పీఠం ఈ పద్ధతికి చెందినవి. అన్నమయ్య దీక్షా గురువు అహోబల పీఠ స్థాపనాచార్యులు శ్రీమాన్ శఠకోపన్ (సుబ్బారావు 68).

1.2.2. తెంగలై శాఖ

‘తెన్’ అంటే దక్షిణం. వీరి కేంద్రం శ్రీరంగం. మణవాళమామునులు వీరి మార్గదర్శకులు. తమిళ నాలాయిర ప్రబంధానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. మార్జాల కిశోర న్యాయం వీరి భావన. తల్లే పిల్లి పిల్లని నోటికి కరచుకుని వివిధ ప్రదేశాలకు తిప్పుతుంది. భక్తుని మీద వాత్సల్యంతో భగవంతుడు మనిషి ఏ ప్రయత్నం చేయకుండానే మోక్షార్హత కలిపిస్తాడు. కావున మోక్ష సాధనకు ప్రయత్నం అవసరం లేదని భావిస్తారు. భగవంతుడే ‘ఉపాయం’ (మార్గం), ఆయనే ‘ఉపేయం’ (గమ్యం) అని వీరి భావన. లక్ష్మీ దేవి భగవంతునికి భక్తునికి మధ్య మధ్యవర్తిని (పురుషాకార భూత) మాత్రమేనని వీరి భావన (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 1, 20). ‘Y’ ఆకారంలో తిలకం దద్దుకుంటారు. భక్తుని దోషాలను సైతం భగవంతుడు ఇష్టపడతాడని వీరి విశ్వాసం. దీనినే ‘దోష భాగ్యం’ అని అంటారు. ప్రేమతో ఆరాధిస్తే ఎలా చేసినా భగవంతుడు స్వీకరిస్తాడని వీరి ధృడ నమ్మకం. వానమామలై మఠం, తిరుపతి పెరియ జీయర్ మఠం తెంగలై శాఖకు చెందినవి. ఇక మౌలిక సూత్రాలను చుద్దాం అవి.

2. శరణాగతి

2.1. శరణాగతి వివరణ

శరణం యధా తథా ఆగతి“ (రాజగోపాలన్ 112) అని శరణాగతి విగ్రహావాక్యం. ”శరణం గృహా రక్షిత్రో:” (అమరకోశం 748) అని అమరం. కానీ పాంచరాత్ర ఆగమంలో ”ఉపాయే గృహా రక్షిత్రో శబ్దః శరణ మిత్యయం వర్తతే, సాంప్రతం చైవ ఉపాయార్థైక వాచకః“ (రామానుజాచార్య 326). ఉపాయమునకు కూడా ఈ శబ్దమే వాచకమని, శరణాగతి శబ్దంలో ఉపాయమే ప్రధానంగా గ్రహించాలని పాంచరాత్రం అంటుంది. ఆధీనుడైన భక్తుడు పరమపదమునకు తీసుకునిపోయేది ఆ ఉపాయమే అని దీని అర్థం. ఇది సర్వస్య శరణాగతి. ముముక్షువైన భక్తుడు తాను సర్వ ధర్మములను విడిచి భగవంతుని శ్రీపాదాన్ని మనోవాక్కాయ కర్మలచే పట్టుటయే శరణాగతి. ఇది ఆరువిధములని పేర్కొనబడినది (అహిర్భుద్య సంహిత 328):

అనుకూలస్య సంకల్ప: ప్రాతికూలస్య వర్జనమ్

రక్షిస్వతీతి విశ్వాసః గోప్తత్వవరణం తథా

ఆత్మనిక్షేప కార్పణ్యే షడ్విధా శరణాగతి:

ఈ ఆరింటిలో ఆత్మనిక్షేపం (కార్పణ్యం) అంగిగా, మిగిలిన ఐదు దానికి అంగములుగా చెప్పబడ్డాయి. యోగమునకు కూడా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహర, ధ్యాన, ధారణ, సమాధులు అష్టాంగములుగా పేర్కొనబడినట్లు, వానిలో సమాధి అంగి కాగా మిగిలినవి అంగములు.

2.2. షడ్విధ శరణాగతి అంగాలు

2.2.1. అనుకూల్య సంకల్పం

శృతి: స్మృతి మమైవాజ్ఞా” అనే భగవద్వచన అనుసారం శ్రుతి స్మృతులలో చెప్పబడిన నిత్య నైమత్తికములందు, భగవద్విషయమునందు మాత్రమే శ్రద్ధ కలిగి ఉండునట్లుగా సంకల్పించుకోవటం.

2.2.2. ప్రాతికూల్య వర్జనం

భగవద్వ్యతిరిక్తములు, భగవద్విరుద్ధములు అయిన విషయములు త్యజించడం.

2.2.3. రక్షిష్యతీతి విశ్వాసం

దీనిని మహా విశ్వాసం అని కూడా అంటారు. భగవంతుడు తప్పక నన్ను రక్షిస్తాడు అనే గాఢ శ్రద్ధ కలిగి ఉండటం.

2.2.4. గోప్తృత్వ వరణం

నీవు తప్ప నాకు వేరే రక్షకుడు లేడని భగవంతుడినే తన రక్షకునిగా నిర్ణయించుకోవటం. ”అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే భావన కలిగి ఉండటం.

2.2.5. ఆత్మ నిక్షేపము

తనకు సంబంధించిన సర్వ భారాన్ని స్వామికే సమర్పించడం. పోషణము, రక్షణము, ఆపదల నుండి కాపాడటం వంటి లౌకికములు; పరమగతికి తీసుకుని పోవటం వంటి అలౌకిక కర్మను భగవంతుడే చేస్తాడు అనే సమర్పణ భావన.

2.2.6. కార్పణ్యము

నేను అల్పడను, అన్యధాగతి లేని వాడను, నాకు నీవే దిక్కు, నన్ను తప్పక కాపాడవలెను అని దీనత్వం ప్రకటించుకోవటం. విశిష్టాద్వైత లక్ష్య భాషలో కార్పణ్యం వ్యవహార భాషలోని రూఢ్యార్థము కంటే భిన్నమైనది.

విక్షేపాపర పర్యాయః న్యాస: పంచాంగ సంయుతః సన్యాసస్త్యాగ ఇత్యుక్తః శరణాగతి రిత్యపి” (కృష్ణమాచార్య 72). దీనినే భరన్యాసమని వ్యవహరిస్తారు. ఇతర మతములలో సన్యాసాశ్రమానికి ఉన్న విలువ శ్రీ వైష్ణవంలో కనపడదు అని పెద్దల మాట. శ్రీ వైష్ణవునిగా సంస్కరించబడిన ప్రతి ప్రాణి శరణాగతి పొందేవాడేనని చెప్పబడింది. గృహస్థాశ్రమాన్ని విడిచి ఉండటం మాత్రమే వైష్ణవ సన్యాసులలో ప్రత్యేకత.

నాకు ఉపాయము లేదు, రక్షించువారు నీవు తప్ప ఇత: పరం లేదని కుయ్యాలించిన గజేంద్రుని రక్షించినట్లుగా భగవంతుడు రక్షిస్తాడు అనేది శరణాగతి పద్ధతని తెలుసుకోవాలి. అన్ని సంశయములు దాటి, సర్వస్య శరణాగతితో ఊర్ధ్వముఖుడై తొండము పైకి ఎత్తి స్వామిని గజేంద్రుడు ఇలా వేడాడు (పోతన 41):

ఓ కమలాప్త! యోవరద! యో ప్రతిపక్ష విపక్ష విదూర! కు

య్యో! కవి యోగివంద్య! సుగుణోత్తమ! ఓ శరణాగతామరా

నోకహ! యో మునీశ్వర !మనోహర! యో విమల ప్రభావ!

రావే! కరుణింప వే తలపవే శరణార్థి నన్ను గావవే. (ఆంధ్ర మహాభాగవతం, vol v, పుట 41)

అహం శరణం గతోస్మిన్’ అనే సంస్కృతభాగవతార్థం సుప్రతీకమైనది పై పద్యంలో. అన్నమయ్య ఇలా సంకీర్తిస్తాడు (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 2, 270):

తే శరణమహంతే శరణమహం

శైశవ కృష్ణా శరణం గతోస్మి. (అన్నమయ్య ఆధ్యాత్మ సంకీర్తనలు, సంపుటి 2, పుట 270)

2.3. అన్నమయ్య కీర్తనలలో షడ్విధ శరణాగతి అంగాల అన్వయం

నీ కథామృతము నిరతసేవన నాకు చేకొనుట సకల సుఖసేవనంబటుగాన ||” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 4, 34)

ఇది ఏ మంత్ర రాజము నాకు నే ప్రొద్దు

నిదియే వేద సంహిత పాఠము

సదా జపించు మంత్ర రాజము…

కర్మము, స్మరణము, బ్రహ్మోపదేశము, ఉపనిషత్ వాక్యము, దాన ఫలము అన్నీ ఇదే అను భావన అనుకూల సంకల్పమే కదా! ప్రయత్న పూర్వక శ్రవణమే!

ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదె శ్రీ వేంకటనాథ || పాసిన పాయవు బంధములు ఆస దేహమున్నన్నాళ్ళు…” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 4, 232)

ఆశ తీరదు దేహము ఉన్నన్నాళ్ళు. విడవని బంధాలు, కోసినా తరగని కోరికల ప్రవాహం, ముడుచుకున్న చిత్త పద్మం, కోపములు, అరిషడ్వర్గాలు అతని శరణు ఉంటే తప్ప జీవన ప్రతికూలతలను అణచలేము. ఈ భావనమే ప్రాతికూల్య వర్జనమే!

అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా || కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి…” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 1, 258)

ఈ భావము మహావిశ్వాసమే కదా! వంశం, మంది మార్బలం, తలపు, కలిమి, నెలవు, తనువు, వినికి, పుట్టుక, ఆది, మధ్య, అంత్యాలు; వెనుక, ముందు అంతా స్వామియే. తనను రక్షింపనున్న మహాభాగుడు స్వయంగా శ్రీహరే అన్న విశ్వాసం. అది రక్షిష్యతీతి విశ్వాసమే కదా!

అభయదాయకుడవదె నీవెగతి యిభ రక్షక నను నిపుడుగావవే భయహర ధైర్యభంజన కేశవ జయ జయ నృసింహ సర్వేశ్వర…” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 4, 284)

ఇభేంద్రుడు గజప్రాణవనోత్సాహిని శరణార్థునికి అభయమిచ్చి రక్షించమని ప్రార్థిస్తున్నాడు. కంచి వరదుని, అభయ వరప్రదాతను వేడే ఈ భావము ‘గోప్తృత్వ వరణ’ మే!

దీనుడ నేను దేవుడవు నీవు నీ నిజ మహిమ నెరుపుటగాక ||...” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 3, 318)

అనే కీర్తనలో లౌకిక ప్రపంచంలో ప్రతి వారికి జననం, మరణం అనివార్యం. కానీ రెండిటినీ ఏ ఒక్కరు తెలుసుకొనరు. జన్మించి ఊహ కలిగిన తర్వాత కదా తాను పుట్టాను అన్న ఎరుక? మరణం గురించి చెప్ప పనిలేదు. అట్టి అల్ప మానవుడు సృష్టినే సృజించిన సర్వేశ్వరుని ఎరుక కలిగి ఉంటాడా! పాపపుణ్యాలకు అంతర్యామివై సాక్షిభూతముగా ఉన్నావు అని దైవాన్ని సంభావిస్తాడు అన్నమయ్య. నాలోని మాలిన్యాలను తొలగించు, పతిత పావనత్వము నీ కృప, కడదాకా నన్ను గాచే దేవుడవు, ఘనుడవు నీవే అని చెప్పే ఈ భావన కార్పణ్యమే కదా!

అరసి నన్ను గాచిన తనికి శరణు పరము నిహము లేలే పతికిని శరణు” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 3, 250)

ఆలించు పాలించు ఆదిమ పురుష జాలి ధీర నీకే శరణుజొచ్చితిమి” (తాళ్ళపాక వారి వాజ్మయం, సం. 4, 226)

ఈ కీర్తనలో “ఇతరములెవ్వారున్నారెంచి చూడ నినుబోల, చతురుడా నిన్నునే శరణుజొచ్చితిమి” అని దేవాధిక్యాన్ని నొక్కి సంకీర్తించాడు. “మనసిచ్చి నీవె నన్ను మన్నించుకుంటేనే తనవి మనవి శరణు జొచ్చితిమి” అని అంటాడు.

3. ప్రపత్తి

3.1. ప్రపత్తి భావన

ప్రకృష్టం యధాతథా పద్యతే ఇతి ప్రపత్తి:” అని విగ్రహ వాక్యం. ”సాధనం భగవత్ ప్రాప్తో సఏవతి స్థిరామతి: సాధ్య భక్తి: స్మృత్య సైవ ప్రపత్తిరితి గేయతే” (రఘునాథాచార్యులు 142) అని భగవచ్ఛాస్త్రం. ప్రపత్తి అనగా మానసికాధ్యవ సాయాత్త్మక (మానసిక + అధ్య + వస + ఆత్మక = మనస్సున అధివసించు ఆత్మజ్ఞానం) జ్ఞానం. భగవంతుడు ఒక్కడే నాకు రక్షకుడని నమ్మకం. దీనిలో జీవుడు సర్వస్వం సమర్పించుకోవటం ప్రపత్తి. చరణదాసోహం అనటం అని కూడా తాత్పర్యం. ప్రతివాది భయంకర అన్నన్ రచించిన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో ప్రపత్తి శ్లోకాలు ఉన్నాయి. ప్రతి నాలుగో పాదంలో మకుటం వలె “శ్రీ వేంకటేశ చరణౌ శరణం శరణం ప్రపద్యే“ అని వస్తుంది. భగవంతుని దయాపరత్వాన్ని, ఆశ్రిత రక్షక భారాన్ని పదేపదే గుర్తు చేసేవి ఈ శ్లోకాలు.

3.2. శరణాగతి ప్రపత్తి మధ్య భేదాలు

శరణాగతికి, ప్రపత్తికి పెద్ద భేదం లేదని తెంగలై శాఖ వైష్ణవుల ఉద్దేశం. మామూలు వారమైన మనకు పై తాత్పర్యముల, వివరణల వలన ప్రత్యేక భేదం ఉన్నట్లు కనిపించదు. కేవలం ఈ రెండు జంట పదాలుగా, పర్యాయపదాలుగా భావించవచ్చు.

శరణాగతి ఉన్నా ప్రపత్తి ఉండి తీరాలని, ప్రపత్తి విశిష్టమైనదని వడగలై శాఖ వైష్ణవులు భావన. ఈ శాఖలలో అన్నమయ్య వడగలై శాఖ వాడనే విషయం మనం గుర్తుంచుకోవాలి.

3.3. అన్నమయ్య ప్రపత్తి కీర్తనలు

కానీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ గారు అన్నమయ్య ఏ శాఖవాడో నిర్ధారించుటకు కష్టమగుచున్నదని, ఈ రెంటి గురించి కీర్తనలు ఉన్నాయని, ఈ కీర్తనచే ప్రపత్తి మాత్రమే తెలిపారని ఉదాహరించారు:

ప్రపంచంలోకి ఇది పరమాచారము

విపరీతా చారము విడువగ వలయు

ఈ కీర్తన చివరి చరణంలో-

ఉపాయంతరములొల్లక భక్తి చేపట్టి

యెపుడూ దీర్థ ప్రసాదేచ్చత

నిపుణత శ్రీ వేంకట నిలయుడే గతియ

ప్రపత్తి గలుగుటే పరమ వైష్ణవము (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 2, 213)

ఈ కీర్తనలో ఉపాయాంతరములొల్లక అని అనటం, కేవల తీర్థప్రసాదలపై కోరిక మాత్రమే అని ఊరుకుంటే అనాయాస శరణాగతి ప్రతిపాదించాడు అని అనుకోవచ్చు. కానీ చివరిలో నిపుణత వేంకటేశుడే గతియనే ప్రపత్తి కావాలని తెలిపాడు. దీనిని బట్టి కేవలం ప్రపత్తి చెప్పాడని అనలేము. నిపుణతతో దానిని సాధించాలి సూచన ఉంది. శర్మ గారు దీనిని గమనంలోకి తీసుకోలేదు. కావున పై కీర్తన వలన అన్నమయ్య తెంగలై శాఖ వాడేమో అని సందేహించనవసరం లేదు. వడగలై శాఖ వాడు అనేందుకు భౌతిక, సాహిత్య ప్రమాణాలు, ఆధారాలు ఉన్నాయి. అన్నమయ్య నుండి నేటి వరకు వారి వంశస్తులందరూ వడగలై శాఖ వారే! శఠకోప మునీంద్ర శిష్య పరంపరలోని వారే! ఇది భౌతిక సాక్ష్యం. ఇక సాహిత్య సాక్ష్యములు బహుళం. అవి వ్యాస అంతర్గతంగా తెలుసుకుందాం.

4. కైంకర్యం

విశిష్టాద్వైతంలో మరో ప్రాథమిక విశేషం కైంకర్యం అంటే ఊడిగం. భగవంతునికి, భగవద్జనులకు చేసే ఊడిగం అని శబ్దార్థ సంగ్రహం తెలియజేస్తుంది. భగవంతునికి అర్పణగా చేయు దానాలకు, సేవలకు నిబంధించిన రొక్కము, దానము మొదలైన వాటికి కైంకర్యము అనే అర్థం వచ్చింది. దేవునికి సమర్పించిన భూమి మొదలైన దానాలు శంకరిగిరి మాన్యాలుగా మారినప్పుడు ఈ అర్థసంకోచం పొంది, స్వాహా చేశారనే నేటి అర్థానికి చేరి ఉంటుంది.

తాళ్ళపాక వంశం వారు కేవలం సంకీర్తన సమర్పణమే కాక, కైంకర్యము భగవంతునికి భిన్న సమయాల్లో భిన్న సేవలకు, అగ్రహారాది కైంకర్యాలను సమర్పించి తమ వైష్ణవ భక్తిని చాటుకున్నారు. ప్రతిఫలాపేక్ష లేని సేవే కదా విష్ణు దాసులకు ఈ ఊడిగం చేయవలనే నమ్మకం స్థిరంగా కలిగించేది.

అతి సులభంబది అందరి పాలికి గతి యిది శ్రీపతి కైంకర్యము ||...” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 2, 7)

ఆ శ్రీహరి కైంకర్యం అతి సులభ మార్గం. శ్రీహరి సేవకులకు చేయు ఊడిగం చాలా సులభంగా మోక్షానికి చేరుస్తుంది, కర్మ బంధాలను తెగగొట్టునది. తేలిక మార్గం ఉండగా కొందరు అవివేకంతో చుట్టూ మార్గాన్ని అనుసరిస్తున్నారు. అమృత సేవనం చేసిన దేవతలు నామామృత పానం చేయటం లేదు కదా! భూసురులు యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటారు కానీ విడువక విష్ణు ప్రసాదం స్వీకరించరు కదా! పై లోకాలు ఎక్కుతుంటారు, అలాగే పడి క్రింది ఏడు లోకాలు చూస్తారే తప్ప తుది పదమైన ఈతని స్మరణను విస్మరిస్తారు కదా! అని, దానికి అతి సులభ మార్గమైన కైంకర్యం గురించి చెబుతాడు అన్నమయ్య. శుద్ధాంతః కరణతో చేసే ఏ పనినైనా స్వామి కైంకర్యంగా స్వీకరిస్తారని త్రికరణశుద్ధిగా నమ్మాడు అన్నమయ్య. ఆ లక్ష్యంతో తగిన ప్రయత్నమే సంకీర్తనా కైంకర్యం, దానధర్మ కైంకర్యాలు.

5. దాసాను దాసత్వం

అహంకారం మనుషులకు సహజమైన అలంకారంగా ఉంటుంది. ప్రతిదీ తానే చేశానని, తానే కారకుడని ఆధునిక మానవుని అభిప్రాయం. నేను అన్నది నశిస్తే ఏర్పడే నిర్మలత్వం ఇప్పటి మనిషికి కడుదూరం. ఆ స్థితికి ఒక మనిషిని తెచ్చిపెట్టగలిగేది శరణాగతి. దేవదేవుని పాదారవింద సేవకునిగా, ఆశ్రితునిగా మారి, ఆ పాటల, సేవల కమలార్చన ప్రారంభించిన ఏ మనిషి అయినా అద్భుతంగా ఆధ్యాత్మిక ప్రగతిని పొందుతాడని శ్రీ వైష్ణవం నమ్ముతుంది. దాన్ని అన్నమయ్య తనంతట తాను బంటుగా చేసుకుంటూ “నీ దాసానుదాసుడను నీవే నన్ను కాపాడి…” రక్షించాలని వినతులు చేస్తాడు.

నీవెంత నేనెంత నీకు నాకు ఎంత దవ్వు దైవమా సిగ్గు పడక తగిలేనేగాక ||” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 3, 34)

పై కీర్తనలో నీ కాళ్లు పట్టుటకు, నీకు తగులుటకు నాకు సిగ్గు లేదు, నా అహంకారము అంతగా అణిగి వంగిపోయింది. నేనెంత నీవెంత. మన మధ్య దూరం ఎంత? బ్రహ్మాదులు, వశిష్ఠులు చేసే పూజలు నీకు అను తాయేమో గాని మా పూజలు సరుకు చేస్తావా అంటూ అభిశంసన చేస్తూ, తప్పక స్వీకరిస్తాను అనేది వ్యంగ్యార్ధంగా చెబుతున్న వైనం ఈ కీర్తనలో చూస్తాం. మా స్తుతులు, భజనలు నీకు లెక్క అవుతాయా, సనకాదులు, శేషాదులు చేసే కీర్తనలు ఉండగా, నీ కింకరులైన నారదాదులు ఉండగా ఈ దాసుని స్వీకరిస్తావా? ఒకవేళ నీవు స్వీకరింపకున్న తరుణోపాయం ఉంది, అది ఏంటి అంటే భక్త పరాధీనుడవైన నీ బంట్లకే బంటునవుతా అని దాసాను దాసత్వం నిర్వచించాడు అన్నమయ్య.

పంచ సంస్కారాలు పొంది శ్రీ వైష్ణవ దీక్షను తీసుకున్నా పేరు మార్చుకోలేదు, కేవలం ఆచార్య పదం మాత్రమే జోడించబడింది అన్నమయ్యకి. సాధారణంగా వైష్ణవుల్లోకి మారితే పూర్వ నామం బదులు కొత్త నామాలని ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు ధనుర్దాసు, రామదాసు, నరసింహదాసు ఇత్యాదులు.

శ్రీకృష్ణుడే రథసారథి. ఆ రథసారథి రథసారథి అంటున్నారని కృష్ణుని రథసారథి, ద్వారకుడు భావించి చిన్నబోయాడట, కానీ అదే పరమమైన భాగ్యం అని భావించటం విష్ణు దాసులందరికీ సామాన్యం. దాస నామం ధరించడం సిగ్గుగా భావించకపోవడం విష్ణు దాసులందరికీ సమానం. దాసనామం ధరించడం సిగ్గుచేటుగా లౌకికులు భావించవచ్చు. ఆ దాసుల దాసుల అవటానికి కూడా అత్యంత భాగ్యశాలులై ఉండాలని దాస భక్తిపరులు భావన. రామదాసు, పురందరదాసు, తులసీదాసు, చండీదాసు, కనకదాసు. అందుకే కనకదాసు “దాస నాగో…. విశేష నాగో…” అని కన్నడ సంకీర్తనలో తెలియచేశాడు.

ఎందరో దాసరులు భిన్న ప్రాంతాలలో రామానుజదాసులమని, భగవద్దాసులమని, దాసకూటమని, శ్రీ వైష్ణవులు, ఉత్తరాది వైష్ణవులు, మాధ్వ వైష్ణవులు మొదలైన వారు భావించిన కాలం వాడే మన అన్నమయ్య.

నిజమైన భోగి హరిదాసేనని త్రికరణ శుద్ధిగా నమ్మాడు కనుకనే “పుట్టు భోగులము మేము భువిని హరిదాసులము, నట్ట నడిమి దొరలు మా కియ్య తగునా…” అని రాజభోగాలను తిరస్కరించే రీతిలో గానం చేశాడు. అందలాలు, పల్లకీలు, పడివాగే తేజీలు, వెల్లవిరి లక్ష్మీ నివాసాలు; ఆ లక్ష్మీ నాధుడే మా తండ్రి, ఆమె మా తల్లి, మాకు తక్కువ ఏంటి అని ప్రశ్నించాడు. రామదాసు కూడా తన భద్రాద్రి రాముడు ఉండగా తను తక్కువేమి అని కదా కీర్తన చేశాడు.

6. పురుషాకారం

శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీ వల్లభుడు శ్రీహరి. శ్రీహరియే పరమోన్నతుడు. కానీ లక్ష్మీదేవి హృదయపూర్వక మూలచైతన్యమై తన ప్రేరణచే నడిపిస్తోందనే భావన వడగలై శాఖది. అన్నమయ్య వంశంలో దుర్గారాధన కొన్ని తరముల ముందు ఉంది. కనుక ఆయన సైతం శాంత దుర్గ అయిన లక్ష్మి ప్రాధాన్యత ఉన్న వడగలై శాఖ అంటే ప్రియత్వం ఏర్పడి ఉందేమోనని ఊహించవచ్చు. కొందరు మిగిలిన శాఖ వైష్ణవులు, తెంగలై శాఖ వారు లక్ష్మీదేవి దయామయి, తండ్రికి విన్నపం చేసి పుత్రులకు మేలు చేసేది అని నమ్మారు (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 1, 20). ఈ విషయంలో రామదాసు మనకు గుర్తుకొస్తాడు. ”నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రోవమని చెప్పవే..” అని అంటాడు రామదాసు. అన్నమయ్య అలివేలుమంగై, లక్ష్మి అనే భిన్న పదాలతో లక్ష్మీదేవిని కీర్తించాడు.

అన్నిటా భాగ్యవంతుడవవుదువయ్యా పన్నినందుకల్లా వచ్చు భామినీకిపుడు” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 7, 81)

అనే కీర్తనలో “చలపెట్టి ఈకెరతి సకల సంపదలు, ఇలనిచ్చె శ్రీ వేంకటేశ నీకునిపుడు” అని అమ్మ ఆధిక్యాన్ని చూపాడు. వెంకటేశ్వర చాలన శక్తి నిత్యానపాయని అలర్మేల్మంగై.

అమ్మమ్మ ఏమమ్మా అలమేల్మంగ నాంచారమ్మ, తమ్మి యింట నలరు కొ మ్మ ఓయమ్మా” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 7, 64)

అని సుప్రసిద్ధ సంకీర్తనలో చివరి చరణంలో వెంకటేశుడు నీకే వేచి ఉన్నాడని, ”నీకె పొంచినీ” తపిస్తున్నాడని ధ్వని పూర్వక సూచన చేశాడు. పద్మసరోవరంలో శతపత్ర సువర్ణ కమలముతో ద్వాదశ వర్షములు పూజించి పొందిన కాంత అలర్మేల్ మంగై అని ఒక గాథ. మరి అంత తపస్సు చేసిన అతనిని కరుణించి, అక్కున చేర్చి అలరించుచున్నది అలిమేల్మంగ. సఖియే ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నది అని అన్నమయ్య వ్యంగంగా స్త్రీ ఆధిక్యతను, పురుషాకారంగా శ్రీ పాత్రని తెలియజేస్తున్నాడు.

అలుకలు చెల్లవు హరి పురుషోత్తమ, నలి నిందిర నీతో నవ్వినది“ (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 20, 5)

అనే కీర్తనలో “ఆదిలక్ష్మి మోహన కమలంబున వేదమాత నిను వేసినది…” అని అమ్మవారు వ్యూహలక్ష్మిగా ఎలా మారిందో చెప్పే వైనం మొదటి చరణంలో చెప్పాడు. మొదటి చరణంలో “ఆదిలక్ష్మి అనే మోహన కమలంలో వేదమాతను వేసింది…” అని ఉంది. మరి ఎవరీ వేదమాత? ఆ దశ నీపై అభయ హస్తమును సాదరముగా సాచినది అనేది కూడా ఉంది. శ్రీ దేవునికే అభయ హస్తం ఇచ్చింది. మరి లక్ష్మియే వేదమాతయా? వేదమాత అనాది అయిన అచ్యుతుని కన్నా ముందుందని అన్నమయ్య అభిప్రాయమా? వేదమాత గాయత్రి అని అందరూ అంటుంటారు కదా! ఇది ఇక్కడ అన్నమయ్య అభిప్రాయం. స్మార్త కుటుంబ జనన వాసన అది.

రెండో చరణంలో వరదహస్తాన్ని పట్టుకుని లక్ష్మీ నిన్ను మాట్లాడించింది అని చెప్పటం ఆమె చలన శక్తి అని చెప్పటమే కదా! తన వైపు ఆకర్షించింది అని చివరి చరణంలో ఉరమెక్కి కూర్చుంది, హృదయకమలంలో నెలకొంది. ఈ విధంగా లక్ష్మీమాత గొప్పదనాలని ఏకరవు పెడతాడు అన్నమయ్య. ఇటువంటి లక్ష్యాత్మక గీతాలు కోకొల్లలు. లక్ష్మీదేవి ప్రాధాన్యతపై అన్నమయ్యది వడగలై శాఖ వారి దారే!

7. దయ

దాసులకు, యజమాని దయ ఆర్ధించటం లోక సహజమే కదా! జగత్ యజమాని శ్రీ వేంకటేశ్వరుని దయను పలుమార్లు అర్థించాడు అన్నమయ్య. భక్తులు తమ మనస్సును చిక్కబట్టటం లేదు, తమలోని ఆరు శత్రువులకు దాసుడై అపరాధి అయ్యారు. మరి కృప గలవాడు, తన ఆత్మ యందు అంతర్యామిగా ఉన్న స్వామి తనను అనుగ్రహంతో కరుణించి అపరాధములను బాపాలి.

అపరాధిని నేనైనాను కృపగలవారికి కపటము లేదు…” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 2, 218)

ఎంత సవినయంగా, దీనంగా దయను అర్థించాడు పై సంకీర్తనలలో! నీ సేవకుని నన్ను అదిలించి దారి చెప్పవయ్యా అని కూడా విన్నవించుకున్నాడు.

8. సర్వవ్యాపిత్వం

భగవంతుడు సర్వవ్యాపి. శ్రీ వైష్ణవులందరూ ఒకేలా భావించారు ఆయన వ్యాపకత్వంని. తెంగలైవారు అణువులో అణువై ఉంటాడు, దీనిని అంతర్వ్యాప్తి అని, గరిమలలో గరిమై ఉండుట బహిరవ్యాప్తి అని అంటారు. అఘటనాఘటన సామర్థ్యము కలవాడు కనుక సూక్ష్మరూపిగా, విశ్వరూపిగా భగవానుడు మార గలడని అంటారు తెంగలై శాఖ వారు. మరి విశ్వవ్యాపి కనుక విష్ణువు అని పేరుబడ్డ తన దైవాన్ని అన్నమయ్య ఎలా అందించాడో చూద్దాం.

విశ్వప్రకాశునకు వెలి యేడలోనేడ, శాశ్వతునకూహింప జన్న్మమిక నేడు…” (తాళ్ళపాక వారి వాజ్మయం సం. 1, 237) అనే కీర్తనలో లోపల, బయట అనేది ఎక్కడ ఉంది ‘ఈశావాస్య మిదం సర్వం’ అనే భావనను ధ్వనింపజేశాడు ఈ కీర్తనలో. మరోసారి ఈ విధంగా సంకీర్తించాడు (తాళ్ళపాక వారి వాజ్మయం సం. 2, 291):

అణురేణు పరిపూర్ణమైన రూపము అణిమాది సిరి అంజనాద్రి మీది దైవము.

ఈ విధంగా స్వామి సర్వవ్యాపి అని ప్రతిపాదనలకు బలం చేకూర్చే సంకీర్తనలు చాలా రచించాడు.

9. అంతర్యామిత్వం

అంతర్యామి అనగా జీవాత్మ లోపల నుండే వాడు అని అర్థాన్నిస్తోంది శబ్దార్థ సంగ్రహం. జీవాత్మ రూపుడై లోపల నుండు అనురూప జ్యోతిరాత్మ పరమాత్మయే అంతర్యామి అని మనం భావించవచ్చు. లో సాక్షి, లోకసాక్షి అతడే. అందుకే సర్వ అంతర్యామిత్వం అన్నమయ్య అనేక సందర్భాల్లో ఉదహరించాడు.

అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీఉయ్యాల…” (తాళ్ళపాక వారి వాజ్మయం సం. 1, 45)

అట్టి అంతరాత్మ సాక్షి మాత్రమే. నారాయణుడు దేహి, నరుడు కర్మ ఆచరించేవాడు అనగా దేహము.

వెలికి వెళ్లడు చలకీ వెరవడు వులికీ నులికీ నులికీనయా || రోగియై తారుచులు బాయడు భోగి అయి రతిపొందల్లడు వేగి మిగిలిన వెడచీకటి నీరు తాగీ దాగీ దాగీనయ్యా” (తాళ్ళపాక వారి వాజ్మయం సం. 1, 209)

మనలో అంతర్యామిగా వ్యూహ రూపం పరమాత్మదే. అందుకే తన దేహము అలసినదని, సొలసిందని, ఇక నిన్ను శరణు వేడుతున్నానని కర్మ బంధమోచనం చేయమని ఆవేదనపడింది జీవి. ఆ మొరయే…

అంతర్యామి అలసితి సొలసితి, యింతట నీ శరణిదె చొచ్చితిని…” (తాళ్ళపాక వారి వాజ్మయం సం. 1, 255)

10. సర్వశక్తిమంతుడు

సర్వవ్యాపి, అంతర్యామి అయిన భగవానుని శక్తి అనంతం. సర్వశక్తిమంతుడు విధికే సృష్టికర్త. నొసటి రాత రాస్తే తిరుగు లేదని కదా అనేది? ఏదైనా జరగరానిది జరిగితే విధి విలాసమని కదా పొగిలేది? మరి ఆ విధి ఎలాంటివాడు, ఆ విధిని తప్పించునది ఏది?

ఎంత సేయగలేదు యిటువంటి విధి యభవునంత వానిని భిక్షమడుగుకొనజేసె …” (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 1, 92) అనే కీర్తనలో విధికి విధి అగు వెంకటేశ్వరుని కృప పడయకుండగా భంగపడకూడదని ప్రబోధం చేస్తాడు.

భావములోన బాహ్యమునందును గోవింద గోవింద యని కొలువవొ మనసా“ (తాళ్ళపాక వారి వాజ్మయం సంపుటి 3, 371) అనే కీర్తనలో సర్వ అవతారాలు హరివి అని సంభావిస్తాడు. ‘విష్ణో పరతరం నాస్తి’ అని కదా శ్రీ వైష్ణవులు నమ్మినది. ఆ పరంధాముని అవతారాలే అఖిల దేవతలు. హరిలోనివే బ్రహ్మాండములు. సర్వ మంత్రాలు హరి నామములు. విశ్వాంతరాత్ముడు విష్ణువు అని వెతుకుతూ, వెతుకుతూ పదేపదే స్మరిస్తూ ఉండాలి. చ్యుతము లేనివాడు, ఆది అంత్యమూ లేని వాడు శ్రీ వేంకటాద్రి అచ్యుతులు అని మన భావంలో నాటింపజేస్తున్నాడు విష్ణు దేవుని సర్వశక్తిత్వ స్వభావాన్ని. ఇవి అన్నీ ప్రయత్నాలే కదా!

ఉపసంహారం

అన్నమయ్య శ్రీవైష్ణవ భక్తి సూత్రాలను ఏ విధంగా ఆచరించాడో మనం ఇప్పటి వరకు గమనించాము. అదే సమయంలో ఆ సూత్రములను దాటి కూడా ఎప్పుడైనా, కొన్ని సంకీర్తనలు చేశాడు అనే విషయం కూడా మనం కొంత గమనించాం. అద్వైత భావనలు కల కీర్తనలు కూడా చాలా ఉన్నాయి. అద్వైత నిరసన ఉన్న కొన్ని కీర్తనలు ఉన్నాయి. అన్నమయ్య వైశిష్ఠ్యం, విలక్షణత అతని భావుకతలో, అలాగే ‘కవి నిరంకుశః’ అనే స్వేచ్ఛా భావనలో ఇమిడి ఉంది అని మనం గమనించవచ్చు. అతనిది విలక్షణ (Maverick) వ్యక్తిత్వం. వైష్ణవంలో ఉంటూనే మాయ, బ్రహ్మ వంటి అద్వైత భావనలు పలికించాడు. వడగలై శాఖకు కట్టబడి రచించిన కీర్తనలతో పాటు ఏదో ఒక తావులో తెంగలై శాఖ భావాలను పలకించి తాను సర్వంసహ స్వతంత్ర కవినని నిరూపించుకుంటూనే, ప్రయత్నపూర్వకంగా రోజుకు ఒకటి తక్కువ కాకుండా కీర్తనలు రచించి, అవి అన్ని దాచుకో, ఒక్క సంకీర్తనతో నాకు ముక్తిని ప్రసాదించు అనే గడుసైన ఉపాయం పన్నినవాడు అన్నమయ్య.

  • విశిష్టాద్వైత సిద్ధాంతంలోని ఈశ్వరుడు, చిత్, అచిత్ అనే త్రితత్వాలను అన్నమయ్య తన కీర్తనలలో స్పష్టంగా ప్రతిబింబించాడు.
  • శ్రీవైష్ణవంలోని వడగలై, తెంగలై శాఖల భేదాలను పరిచయం చేస్తూ, అన్నమయ్య వడగలై శాఖకు చెందినవాడై ఉండవచ్చనడానికి భౌతిక, సాహిత్య ప్రమాణాలున్నాయి.
  • శరణాగతి, ప్రపత్తి మౌలిక సూత్రాలను, వాటి షడ్విధ అంగాలను అన్నమయ్య సంకీర్తనలలో గమనించవచ్చు.
  • కైంకర్యం, దాసానుదాసత్వం, శ్రీ పురుషాకారం, దయ, సర్వవ్యాపిత్వం, అంతర్యామిత్వం, సర్వశక్తిమయత్వం వంటి విశిష్టాద్వైత భావనలను అన్నమయ్య కీర్తనల ద్వారా ఎలా వ్యక్తీకరించాడో తేటతెల్లమైంది.
  • అన్నమయ్య ఒక వైపు వడగలై శాఖ సిద్ధాంతాలను అనుసరిస్తూనే, మరోవైపు స్వతంత్ర భావుకత, కవి నిరంకుశత్వం ప్రదర్శిస్తూ కొన్ని సందర్భాలలో అద్వైత భావనలను కూడా తన రచనలలో పొందుపరిచాడని తేలింది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. పోతనామాత్యుడు, బమ్మెర. శ్రీమదాంధ్రమహాభాగవతం, దశమస్కంధం, నాల్గవసంపుటం, తితిదే, తిరుపతి, 2005
  2. రాజగోపాలన్. కె., విశిష్టాద్వైత వేదాంత దర్శనం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి,1999
  3. రామానుజాచార్య, ఎం.డి, సంపాదకుడు, అహ్నిర్భుద్య సంహిత ఆఫ్ ది పాంచరాత్ర ఆగమ, అడయార్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్‌, 1916
  4. సుబ్బరామశర్మ, గౌరిపెద్ది. అనంత కృష్ణ శర్మ, రాళ్ళపల్లి (సంపా.). తాళ్ళపాక వారి వాజ్మయం. సంపుటులు 1&2. అన్నమాచార్య ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1989.
  5. సుబ్బారావు, వి.వి., అన్నమయ్య సాహిత్య ప్రస్థానం- భక్తి నేపథ్యం, అముద్రితం, హైదరాబాదు, 2015.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image