AUCHITHYAM | Volume-07 | Issue-03 | March 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. ఉత్తరాంధ్రకథలు: సంధిస్వరూపం
గేదెల మోహిని
పరిశోధకులు, తెలుగుశాఖ
మానవీయశాస్త్రాల విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం,
హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 8106957941, Email: mohinimoc1998@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.02.2026 ఎంపిక (D.O.A): 27.02.2026 ప్రచురణ (D.O.P): 01.03.2026
వ్యాససంగ్రహం:
ఉత్తరాంధ్రకథలలోని ‘సంధిస్వరూపం’ మీద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పూర్తిస్తాయిలో భాషాపరిశీలన జరగలేదు. ‘విజయనగరం జిల్లా తెలుగు – మాండలిక పరిశీలన’ అన్న సిద్ధాంత గ్రంథంలో డా. ఎం. కె. రావు కేవలం ఒక జిల్లాకు మాత్రమే పరిమితమై వాడుకభాషలోని ‘సంధి స్వరూపాన్ని’ ఒక అధ్యాయంలో చర్చించారు. ఉత్తరాంధ్రప్రాంతపు కవుల, రచయితల మీద పరిశోధన చేసిన పూర్వ పరిశోధకులు ఒక కవి లేదా రచయిత రచనలకు మాత్రమే పరిమితమై వారి సిద్ధాంతగ్రంథంలో ఒక అధ్యాయంలో భాషాంశాలను చర్చించారు. అందువల్ల ఉత్తరాంధ్రప్రాంతపు సంధిస్వరూపాన్ని విస్తృతంగా చర్చించడానికి ఈ వ్యాసాన్ని ఎంచుకోవడం జరిగింది. ప్రస్తుతం వ్యాసానికి ప్రధాన ఆకరంగా విరియాల లక్ష్మీపతి, చాగంటి తులసి సంపాదకత్వం వహించి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారిచే 2014లో ముద్రించబడిన ‘ఉత్తరాంధ్రకథలు’ అనే సంపుటిని తీసుకోవడం జరిగింది. ఈ వ్యాసంలో సంధినిర్వచనాలు, ఉత్తరాంధ్రకథల్లో కన్పించిన అంతస్సంధులను, బాహ్యసంధులను చర్చించాను. ఈ వ్యాసం రచించటంలోని ప్రధానవిశేషం. ఉత్తరాంధ్రవ్యావహారికభాష సంధిరూపాలు వైయాకరణులు చెప్పిన సంధిస్వరూపానికి లొంగుతాయా లేదా అన్నది పరీక్షించాలని పరిశీలన చేయడం జరిగింది.
Keywords: ఉత్తరాంధ్రకథలు, మాండలికభాష, సంధి, అంతస్సంధి, బాహ్యసంధి, అచ్చంధి, హల్సంధి, సంధిస్వరూప నిరూపణ.
1. పరిచయం
మారుతున్న కాలగతి, మానవ అవసరాల మేరకు భాషలో పరిణామం కన్పిస్తుంది. ఇటీవల కాలంలో వివిధ మాధ్యమిక రంగాలలో వాడబడే ప్రజల భాష సమాజంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే మాండలికం రోజురోజుకీ బలపడుతోంది. నేటి కవులు, రచయితలు, సంపాదకులు, భాషాశాస్త్రవేత్తలు, విమర్శకులు, విద్యావేత్తలు మాండలికాన్ని గుర్తించి తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు.
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు మన భాష, యాస పదిలపరచుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో మాండలికాలు ప్రతిబింబించే కథా సంకలనాలను అచ్చొత్తించి పాఠకులకు అందించారు. ఈ వ్యాసంలో విరియాల లక్ష్మీపతి, చాగంటి తులసి సంపాదకత్వంలో 2014 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన ‘ఉత్తరాంధ్ర కథలు’ సంపుటిలో సంధి స్వరూపాన్ని మాత్రమే పరిశీలించడం జరుగుతుంది. ఈ సంపుటిలో ఉత్తరాంధ్ర ప్రాంత కవులుగా గుర్తించిన గురజాడ అప్పారావు, చాసో, రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు, బలివాడ కాంతారావు, అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, బమ్మిడి జగదీశ్వరరావు, సువర్ణ ముఖి లాంటి వారి కథలు ఉన్నాయి.
తెలుగులో వ్యాకరణ చర్చ అంటే విద్యార్థి లోకం కేవలం చిన్నయసూరి చేసిన బాలవ్యాకరణ చర్చకే పరిమితం అవుతున్నట్లు కనపడుతుంది. అంతేకాక, తెలుగు భాషలోని వైయాకరణులు చెప్పిన సంధి విశ్లేషణ పూర్తిగా కావ్య భాషకు పరిమితమై ఉంది. ఆధునిక యుగంలో సామాజిక నేపథ్యంతో వస్తున్న రచనల్లో ‘సంధి’ స్వరూపాన్ని విశ్లేషించడం కొంత క్లిష్టంగా ఉందనే భావన నేటి విద్యార్థుల్లో ఎక్కువ కనపడుతుంది. అలా కాకుండా సర్వకాల సర్వావస్థలలోని భాషపై వ్యాకరణ చర్చ చేసి చూస్తే తెలుగు భాషలోని వ్యాకరణ వైశిష్ట్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మొత్తం భాషను పరిశీలించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు. ఇటీవల వచ్చిన ఉత్తరాంధ్ర కథలలోని సంధి స్వరూపాన్ని ప్రాచీన, అర్వాచీన దృక్పథంతో వివేచించి చూసినప్పుడు ఆధునిక రచనల్లోనూ, అందులో మాండలిక వ్యవహార శైలిలో ఉన్న సంధి స్వరూపం కొంత ప్రాచీనంగానూ, మరికొంత అర్వాచీనంగానూ కన్పిస్తుంది. భాషాశాస్త్ర దృక్పథంతో Morpho-Phonemics రీతిలో వివేచించినప్పుడు, ప్రాచీన వైయాకరణుల సూత్రాలకు లోబడే అనేక సంధి స్వరూపాలు కనబడతాయి. వీటిని వెతికి తీయడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశ్యం.
2. సంధి - నిర్వచనాలు
సంధి అంటే వర్ణసంయోగం. సామాన్యార్థంలో సంధి పదానికి కూడిక, చేరిక లాంటి అర్థాలు ఉన్నాయి. భాషలో ఉచ్చారణ సౌలభ్యం కోసమై ఒక శబ్దం అంతంలో గల వర్ణం, దానికి సన్నిహితంగా పరమైన మరొక శబ్దంలోని ఆది వర్ణంతో కలవడమే సంధి. భాషా వ్యవహారంలో సంధి పాత్ర చాలా కీలకం. లిఖిత భాషలో కొన్నిచోట్ల సంధి జరిగిన రూపాలు, కొన్నిచోట్ల సంధి జరగని రూపాలు కనిపిస్తుంటాయి. పాణిని అష్టాధ్యాయిలో ‘పరః సన్నికర్షః సంహితా’ (అష్టాధ్యాయి 1.4.109) అని నిర్వచించి ‘సంధి’ అనే పదాన్ని ‘సంహిత’ అని పిలిచారు. సంహిత అంటే వర్ణాల సన్నికర్ష లేక సామీప్యం. రెండు వర్ణాలు అర్థ మాత్రాకాలం కన్నా ఎక్కువ వ్యవధానం లేకుండా ఉచ్చరించబడటమే సంహిత అని పాణిని సూత్రానికి ఉన్న వివరణ. సంస్కృత భాషలో సంధి జరగాలంటే వర్ణాల మధ్య సంహిత కుదరాలి. తెలుగు వ్యాకరణవేత్తలు ‘సంహితా’ అనే పదానికి బదులుగా ‘సంధి’ అనే పదాన్ని ఉపయోగించారు. సంహితలో పదాలకు వర్ణలోప, వర్ణాగమ, వర్ణాదేశ, ప్రకృతిభావాలలో ఏదైనా కలగవచ్చు. అలా కలిగితే ఏర్పడే రూపాలనే సంధి అంటారు.
తెలుగు భాషలో సంధి సంప్రదాయం సంస్కృత భాషా సంధి సంప్రదాయం కన్నా భిన్నంగా ఉంటుంది. ప్రాచీన తెలుగు వ్యాకర్తలు సంస్కృత సంధి సంప్రదాయాన్ని అనుసరించి, వారి వ్యాకరణ విశిష్టతకు అనుగుణమైన సంధి నిర్వచనాలు ఇచ్చారు.
“ఆంధ్రభాషా భూషణం” అనే వ్యాకరణ గ్రంథంలో మూలఘటిక కేతన ‘సంధి’ ని ఇలా నిర్వచించారు:
“మొదలిపదము తుదివర్ణము
వదలక పైపదము మొదలివర్ణముతోడం
గదియగ సంధులు నాఁ దగు..” (ఆంధ్రభాషాభూషణం: 44)
“కావ్యాలంకార చూడామణి”లో విన్నకోట పెద్దన ‘సంధి’ ని ఇలా నిర్వచించారు:
ఆదిశబ్దాంతవర్ణంబు నంత్యశబ్ద-
పూర్వవర్ణంబుతోఁ గూడఁ బొత్తుచేఁత
సంధియగుఁ గారకక్రియాసంగతములు
పెక్కురూపంబు లవి గానిపింతుఁ దెలియ (కావ్యా.చూ. 9-45).
బాలవ్యాకరణంలో చిన్నయసూరి స్వరసంధిని మాత్రమే సంధిగా పేర్కొన్నారు:
పూర్వ పరస్వరంబులకుం బరస్వరం బేకాదేశం బగుట సంధి యనంబడు (బాల. సంధి-1).
కేతన, పెద్దనల ప్రకారం సంధి అంటే పూర్వ శబ్దాంత్యవర్ణంతో పర శబ్దాదివర్ణం అవ్యవహితంగా చేరటం. బాలవ్యాకర్త సంధి లక్షణం కన్నా కేతన, పెద్దనల సంధి లక్షణాలు కొంత అధికవ్యాప్తిని కలిగి ఉన్నా, ఇవి తెలుగు భాషలో జరిగే సంధి స్వరూపాన్ని సమగ్రంగా నిరూపించలేదు.
కింది సంధి నిర్వచనం తెలుగు భాషాసంధిసంప్రదాయాన్ని చాలావరకు తేటతెల్లం చేస్తుంది:
కొన్ని అర్థకాలు కలిపి పదంగా ఏర్పడేటప్పుడూ, కొన్ని పదాలు కలిసి వాక్యంగా ఏర్పడేటప్పుడూ వాటిలో ధ్వనులు పరస్పర ప్రభావం వల్లనో లేక చారిత్రక కారణాల వల్లనో మార్పు చెందుతూ ఉంటాయి. ఇటువంటి ధ్వనుల మార్పును సంధి అంటారు (ఆధు. భాషా. సిద్ధాం. 76,77).
కొన్ని సంధులు పద మధ్యంలోనూ (ఒక పదంలో రెండు అర్థకాలు కలిసినప్పుడు), పదాంతంలోనూ (రెండు పదాలు కలిసినపుడు) సమంగానే ప్రవర్తిస్తాయి. కాని మరికొన్ని సంధులు పద మధ్యంలో మాత్రమే లేక పదాంతంలో మాత్రమే ప్రవర్తిస్తాయి. పద మధ్యంలో మాత్రమే ప్రవర్తించే సంధిని పదమధ్య సంధి (Internal sandhi) అంటారు. పదాంతంలో మాత్రమే ప్రవర్తించే దానిని పదాంత సంధి (External sandhi) అంటారు.
2.1 అంతస్సంధి (Internal sandhi)
పదమధ్యంలో మాత్రమే ప్రవర్తించే సంధిని ‘పదమధ్య సంధి’ లేదా ‘అంతస్సంధి’ అంటారు. ఇది ఒక పదంలో రెండు అర్థకాలు కలిపినప్పుడు ఏర్పడే సంధి. ప్రత్యయం పరమైనప్పుడు ప్రాతిపదికల్లో వచ్చే మార్పులన్నీ పదమధ్య సంధులే అవుతాయి. ధాతువు (root) కు లేదా ప్రాతిపదిక (stem) కు, ప్రత్యయానికీ (affix) సంధి జరిగితే ధాతు, ప్రాతిపదికలలోని చివరి అచ్చుకు లోపం నిత్యంగా వస్తుంది. పదమధ్య సంధిని సూచించేందుకు (-) గుర్తును ఉపయోగిస్తారు.
2.1.1 ధాతువుతో ప్రత్యయం కలిసినప్పుడు
అగుపించిన → అగుపించు - ఇన (హిందూ:57)
మార్లే → మార్లు - ఏ (మెటిల్డా:2)
పంట → పండు - ట (కసి:146)
2.1.2 నామప్రాతిపదికతో ప్రత్యయం కలిసినప్పుడు
దొంగలాడి → దొంగలు + ఆడి (కదిలే బొమ్మలు: 73)
ముద్దియ → ముద్దె + ఇయ (ప్రవృత్తి:175)
మాలిమి → మాలు + ఇమి (మనస్వి:228)
ఒంటిగాడు → ఒంటి + కాడు (శకటిక:261)
2.2 బాహ్యసంధి (External sandhi)
సంధి జరిగినప్పుడు పూర్వ పదాంతంలోని అచ్చు లోపించి, పరపదంలోని తొలివర్ణంతో మాత్రమే వ్యవహరించే సంధిని ‘పదాంత సంధి’ లేదా ‘బాహ్య సంధి’ అంటారు. ఇది రెండు పదాలు కలిసినప్పుడు ఏర్పడే సంధి. పదాంత సంధిలో ప్రాతిపదికలో మార్పు రాదు. పదాంత సంధిని సూచించేందుకు (+) గుర్తును ఉపయోగిస్తారు. ఇది అచ్చంధి, హల్సంధి అని రెండు రకాలు. అజంత రూపాలపై జరిగే సంధి అచ్చంధి. హలంత రూపాలపై జరిగే సంధి హల్సంధి.
2.2.1 అచ్చంధి
ఇది అచ్చుకు అచ్చు పరమైనప్పుడు, అచ్చుకు హల్లు పరమైనప్పుడు జరుగుతుంది. పూర్వ పదాంతంలోనూ, పర పదాదిలోనూ అచ్చులే ఉన్నప్పుడు పూర్వ పదాంత అచ్చు లోపించడం లేదా లోపించకపోవడం జరుగుతుంది. లోపించనప్పుడు ‘య’ కారం ఆగమంగా వస్తుంది.
2.2.1.1 అత్వసంధి
బాలవ్యాకర్త “అత్తునకు సంధి బహుళముగా నగు” (బాలవ్యాకరణము, సంధి 4) అని సూత్రీకరించి, హ్రస్వమైన అకారానికి అచ్చు పరమైతే సంధి బహుళంగా జరుగుతుందని చెప్పారు.
ఇలగంతున్నడు → ఇలగ + అంతున్నడు (అ+అ) (గోర:978)
బుర్రొంచుకొని → బుర్ర + ఒంచుకొని (అ+ఒ) (జంక్షనులో:48)
తిన్నగొచ్చెయ్యండి → తిన్నగ + ఒచ్చెయ్యండి (అ+ఒ) (కదిలే: 68)
2.2.1.2 ఇత్వసంధి
హ్రస్వమైన ఇకారానికి అచ్చు పరమైనప్పుడు ఇత్వసంధి జరుగుతుంది. బాలవ్యాకర్త “ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు” (బాలవ్యాకరణము, సంధి 5) అని సూత్రీకరించి ‘ఏమి’ లాంటి వాటి ఇత్వానికి సంధి వికల్పంగా జరుగుతుందని చెప్పారు. మధ్యమ పురుష క్రియలందు మాత్రం హ్రస్వమైన ఇకారానికి సంధి నిత్యంగా వస్తుందని బాలవ్యాకర్త పేర్కొన్నారు.
ఇంకేటంతాడు → ఇంకేటి + అంతడు (ఇ+అ) (గోర:978)
బేగెల్తే → బేగి + ఎల్తే (ఇ+ఎ) (లక్ష్మి:96)
వొగ్గేసినాను → వొగ్గి + ఏసినాను (ఇ+ఏ) (పొగచూరిన:81)
కొట్టీసొత్తాను → కొట్టీసి + ఒత్తాను (ఇ+ఒ) (దాలప్ప:937)
2.2.1.3 ఉత్వసంధి
బాలవ్యాకర్త “ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధి యగు” (బాలవ్యాకరణము, సంధి 1) అని సూత్రీకరించి, హ్రస్వమైన ఉకారానికి అచ్చు పరమైతే అక్కడ సంధి నిత్యంగా జరుగుతుందని చెప్పారు.
నావూసెత్తొద్దంటే → నా వూసు + ఎత్తద్దంటే (ఉ+ఎ) (దివాణం:208)
కాల్లెకెట్టుకుని → కాళ్ళకు + ఎట్టుకుని (ఉ+ఎ) (ఏలయి:566)
దుమ్ములేరాశారు → దుమ్ములు + ఏరాశారు (ఉ+ఏ) (కసి:147)
కళ్ళొత్తుకుంది → కళ్ళు + ఒత్తుకుంది (ఉ+ఒ) (కచట:688)
2.2.1.4 అపదాదిస్వర సంధి
బాలవ్యాకర్త “అంద్వవగాగమంబులందప్ప అపదాదిస్వరంబు పరంబగునపుడు అచ్చునకు సంధియగు” (బాలవ్యాకరణము, సంధి 11) అని సూత్రీకరించి, ‘అందు, అవ’ అనే అపదాలు పరమైనప్పుడు తప్ప తక్కిన అపదాలకు ఆదిన స్వరంగాని ఉన్నట్లయితే సంధి నిత్యంగా వస్తుందని చెప్పారు. ఈ అపదాది స్వరసంధిలో పూర్వపదం పదంగాని, అపదంగాని ఉండవచ్చును. అపదం అనగా స్వతంత్రంగా వాడుటకు యోగ్యత లేనిది.
బారెడు → బారు + ఎడు (ఉ+ఎ) (పొగచూరిన:79)
పట్టెడు → పట్టు + ఎడు (ఉ+ఎ) (ఇదీ:817)
2.2.1.5 ఆమ్రేడిత సంధి
ఒక పదాన్ని రెండుసార్లు ఉచ్చరించినప్పుడు రెండవసారి ఉచ్చరించినది ఆమ్రేడితము. బాలవ్యాకర్త “అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తఱచుగ నగు” (బాలవ్యాకరణము, సంధి 10) అని సూత్రీకరించి, అచ్చుకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరచుగా జరుగుతుందని చెప్పారు.
ఏడేడి → ఏడి + ఏడి (ఇ+ ఏ ) (ఏలయి:568)
ఐటైటికి → ఐటికి + ఐటికి (ఇ+ ఐ) (సెగ:807)
ఓసోసి → ఓసి + ఓసి (ఇ +ఓ ) (కచట:687)
దుందుడుకు → దుడుకు + దుడుకు (ఉ+ఉ) (ఎవరి:630)
అబ్బెబ్బే → అబ్బె + అబ్బే (ఎ+ అ) (ది: 654)
2.2.1.6 యడాగమం
సంధి లేని చోట పదాంతంలోని అచ్చుకు పరమైన అచ్చుకు ముందు యకారము ఆగమంగా వస్తుంది. “సంధి లేని చోట స్వరంబు కంటెంబరంబయిన స్వరంబునకు యడాగమం బగు” (బాలవ్యాకరణము, సంధి - 12) అనే సూత్రం ద్వారా బాలవ్యాకర్త ఈ యడాగమాన్ని విధించారు. ఎక్కడైతే సంధి జరగదో, అక్కడ ఈ యడాగమం తప్పకుండా వస్తుంది.
మాయమ్ముంది → మా + అమ్ముంది (ఆ+య్+అ) (కొబ్బరి:499)
నాయలవాటు → నా+అలవాటు (ఆ+య్+అ) (ఏలయి:575)
కూకోయున్నారు → కూకో + ఉన్నారు (ఓ+య్+ఉ) (పెద్దోళు:868)
2.2.1.7 త్రికసంధి
బాలవ్యాకర్త ‘త్రిక సంధి’ గురించి సంధి పరిచ్ఛేదంలో చెప్పలేదు. వీటిని సమాస పరిచ్ఛేదంలో వివరించారు. “ఆ ఈ ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు” (బాలవ్యాకరణము, సమాస 1) అని ఆ, ఈ, ఏ లను ‘త్రికం’ అంటారని చెప్పారు. ఇవి దీర్ఘాచ్చులు. ‘ఆ-ఈ-ఏ’ ల మీద హల్లుతో మొదలయ్యే పదం చేరినప్పుడు జరిగే సంధిని త్రికసంధి అంటారు.
అద్దరినెక్కడో → ఆ + దరినెక్కడో (కసి:149)
ఇయ్యాళ → ఈ+ యాళ (లక్ష్మి:91)
ఇయ్యమ్మీ → ఈ + అమ్మీ (కొత్త:874)
2.2.1.8 సరళాదేశసంధి
ద్రుతప్రకృతికాలపైన పరుషాలు (క-చ-ట-త-ప) పరమైతే వాటి స్థానంలో సరళములు (గ-జ-డ-ద-బ) ఆదేశంగా వస్తాయి.
నన్ను జెయ్య నియ్యవు → నన్ను + చెయ్య నియ్యపు (చ> జ) (దాలప్ప:937)
యిరగదీసి → యిరగ + తీసి (త>ద) (సెగ:802)
ఎరబెట్టి → ఎర + పెట్టి (ప>బ) (శకటిక:267)
గోలబెట్టేత్తండు → గోల + పెట్టేత్తండు (ప> బ) (సెగ:801)
2.2.1.9 గసడదవాదేశ సంధి
ప్రథమావిభక్తితో అంతమయ్యే పదాల మీది ‘క-చ-ట-త-ప’ల స్థానంలో వరుసగా గ-స-డ-ద-వ” లు బహుళంగా వస్తాయని బాలవ్యాకర్త చెప్పారు.
ఉత్తిసేతుల్తో → ఉత్తి + చేతుల్తో (చ> స) (అల్లు:699)
యిప్పిసెప్పాలా → యిప్పి + చెప్పాలా (చ> స) (సెగ:803)
రునం సెల్లిపోదు → రునం + చెల్లిపోదు (చ>స) (రిక్షా:617)
2.2.1.10 టుగాగమ సంధి
ప్రకృతిభావ నివారణ కోసమే వచ్చేవి ఆగమాలు. చిన్నయసూరి బాలవ్యాకరణంలో ‘సంధి పరిచ్ఛేదం’లో టుగాగమ సంధిని పేర్కొన్నారు.
పెంకుటిల్లు → పెంకు + ఇల్లు (ఉ+ట్+ఇ) (రిక్షా:604)
రేవిటెండ → రేవు + ఎండ (ఉ+ట్+ఎ) (పెద్దోళు:866)
2.2.2 హల్సంధి
ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి (2014) “భాష-సమాజం-సంస్కృతి” పుస్తకంలో “నేటి తెలుగులో హల్సంధి” అనే వ్యాసంలో హల్సంధి గురించి చర్చించారు. తెలుగులో గ్రంథస్థమైన ప్రాచీన కావ్య భాషను పరిశీలిస్తే హల్సంధుల కన్నా, అచ్సంధులే ఎక్కువ కనబడతాయని పేర్కొన్నారు. ముఖ్యంగా హ్రస్వాచ్చుకు ఇరువైపుల ఉన్న హల్లుల్లో అచ్చు లోపించి చాలా రకాల మార్పులు వస్తున్నాయని, వాటిలో నాలుగు రకాల మార్పులను భద్రిరాజు కృష్ణమూర్తి తన వ్యాసంలో ప్రస్తావించారు. నేటి వ్యావహారిక భాషలో అన్ని మండలాల్లో హల్సంధి రూపాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయి. ఈ మార్పు ఉత్తరాంధ్ర కథాసాహిత్యంలో కూడా కన్పిస్తుంది.
2.2.2.1 మొదటి రకం మార్పు: హ1 అ హ2 → హ1 హ2
ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే పూర్వపర హల్లుల్లో మార్పేమీ రాదు. మధ్యనున్న అచ్చు లోపించటం వల్ల ఈ హల్లులు కలిసి సంయుక్తాక్షరంగా మారతాయి. ‘అ’ అంటే హ్రస్వాచ్చుగా గ్రహించాలి. దానికి ముందు (హ1), వెనకా (హ2) ఉన్న వర్ణాలు హల్మాత్రాలుగా గ్రహించాలి.
ఉదాహరణలు:
గోడల్నేవు → గోడలు + నేవు ల్ అ న్ → ల్న (కదిలే: 70)
శాన్దూరము → శాన + దూరము న్ అ ద్ → న్ద (లక్ష్మి:95)
బాధపడ్నేక → బాధపడ + నేక డ్ అ న్ → డ్న (ఓలమ్మో:159)
అరిచ్చంద్రుడ్లా → అరిశ్చంద్రుడు + లా డ్ అ ల్ → డ్ల (ఓలమ్మో:159)
2.2.2.2 రెండవ రకం మార్పు: హ1 అ హ2 → హ2 హ2
ఇందులో హ్రస్వాచ్చు లోపించి, దానికి పూర్వం ఉన్న హల్లు (హ1) పరహల్లు (హ2) గా మారిపోతుంది. ‘హ1’ అనేది ‘హ2’ గా మారేటప్పుడు కొన్నిసార్లు పూర్వపర హల్లులు ఒకేవిధంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో హ1, హ2 యథాతథంగా ఉంటాయని చెప్పినా, లేకపోతే ‘హ1’ ‘హ2’ గా మారుతుందన్నా సరిపోతుంది.
ఉదాహరణలు:
కంఠ్యాలు
గొంతుక్కూర్చున్న → గొంతుకు + కూర్చున్న క్ అ క్ → క్క (అల్లు:696)
పడగ్గదిలోకి → పడక + గదిలోకి క్ అ గ్ → గ్గ (లక్ష్మి:86)
మొగ్గుంటడి → మొగ + గుంటడి గ్ అ గ్ → గ్గ (మునిగి:363)
దంత్యాలు
కాత్తల్లీ → కాదు + తల్లీ ద్ అ త్→ త్త (రిక్షా:606)
తొమ్మిద్దాటేక → తొమ్మిది + దాటేక ద్ అ ద్→ ద్ద (కదిలే: 66)
మూర్ధన్యాలు
బాగుపట్టం → బాగుపడు + టం డ్ అ ట్ → ట్ట (ఏల:574)
బేడ్డబులు → బేడ + డబ్బులు డ్ అ డ్ → డ్డ (లక్ష్మి:89)
ఓష్ఠ్యాలు
పందుప్పుడకలు → పందుపు + పుడకలు ప్ అ ప్→ ప్ప (దివాణం:206)
ఏడుప్పారొస్తాన్నాది → ఏడుపు + పారొస్తాన్నాది ప్ అ ప్ → ప్ప (మునిగి:367)
పార్స్వికాలు
గుండెల్లేకపోయాయి → గుండెలు + లేకపోయాయి ల్ అ ల్ → ల్ల (పొగచూరిన:78)
ఇపుడీల్లేదు → ఇపుడీలు + లేదు ల్ అ ల్ → ల్ల (ఓలమ్మో:158)
కంఠ్యం + ఓష్ఠ్యం
బాగునేప్పోవడం → బాగునేక + పోవడం క్ అ ప్ → ప్ప (సెగ:802)
దిగులుండప్పోను → దిగులుండక + పోను క్ అ ప్ → ప్ప (సెగ:815)
ఓష్ఠ్యం + అంతస్థం
సోఁవ్వోఁరం → సోఁమ + వోఁరం మ్ అ వ్ → వ్వ (ఎత్తు:899)
పార్స్వికం + దంత్యం
చన్నీళ్ళు → చల్ల + నీళ్ళు ల్ అ న్ → న్న (యాత్ర:183)
2.2.2.3 మూడవ రకం మార్పు: హ1 అ హ2 → హ3 హ3
ఇందులో సంధివల్ల ఏర్పడ్డ ద్విత్వమైన ‘హ3’ హ్రస్వాచ్చుకు ముందూ వెనకా గల రెండు హల్లుల కన్నా (హ1, హ2) భిన్నమైనదిగా ఉంటుంది. ఉదాహరణకు పూర్వహల్లుగా ‘డ’ వర్ణం ఉండి, దానికి పరహల్లుగా ‘న’ వర్ణం ఉంటే ‘ణ్ణ’, ‘ల’ వర్ణం ఉంటే ‘ళ్ళ’ వస్తాయి.
ఉదాహరణలు:
మెళ్ళో → మెడ + లో డ్ అ ల్→ ళ్ళ (జంక్షను:48)
సూళ్ళేదా? → సూడ + లేదా? డ్ అ ల్→ ళ్ళ (కదిలే: 66)
పాశ్శింతకాయ → పాత + చింతకాయ త్ అ చ్→ శ్శి (మునిగి:370)
కావిళ్ళు → కావిడి + లు డ్ అ ల్→ ళ్ళ (పెద్దోళు:864)
గుంటణ్ణాటోడివే → గుంటడి + నాటోడివే డ్ అ న్ → ణ్ణ (దాలప్ప:937)
2.2.2.4 నాల్గవ రకం మార్పు: హ1 అ హ2 → హ3 హ2 లేదా హ1 హ3
ఇందులో హ్రస్వాచ్చు లోపించగానే పూర్వహల్లుగాని, పరహల్లుగాని రెండిటిలో ఏదో ఒకటి మరొక హల్లుగా (హ3) పరిణమిస్తుంది. దీన్నిబట్టి మూర్ధన్యవర్ణంతో కలిసే ‘న-ల’ లు ‘ణ-ళ’ లుగా మారతాయి.
ఉదాహరణలు:
తగిలేసేవోణ్ని → తగిలేసేవోడి + ని డ్ అ న్→ ణ్న (కదిలే:71)
వేణ్నీళ్ళు → వేడి + నీళ్ళు డ్ అ న్→ ణ్న (లక్ష్మి:95)
కాణ్నుండి → కాడ + నుండి డ్ అ న్→ ణ్న (ఏల:566)
ఒక్కణ్నీ → ఒక్కడి + నీ డ్ అ న్ → ణ్న (నేను:590)
పన్జేసేవాడు → పని + చేసేవాడు న్ అ చ్→ న్జ (ఎ టీచర్స్:467)
2.2.2.5 ఐదవ రకం మార్పు: హ1 అ హ2 → హ1 హ1
భద్రిరాజు కృష్ణమూర్తి పై చెప్పిన నాలుగు రకాల మార్పులను తెలియజేశారు. ఉత్తరాంధ్ర భాషలో ఈ ఐదవ రకం రూపం కనిపించింది. ఇందులో హ్రస్వాచ్చు లోపించగానే పరహల్లుగా ఉన్న ‘హ2’ అనేది పూర్వహల్లుగా ఉన్న ‘హ1’ గా మారుతుంది.
ఉదాహరణలు:
పోన్నేరా → పోని + లేరా న్ అ ల్→ న్న (జంక్షనులో:49)
చూడ్డం → చూడు + టం డ్ అ ట్→ డ్డ (హిందూ:53)
సూడ్డానికి → సూడ + టానికి డ్ అ ట్→ డ్డ (కదిలే: 70)
పొద్దోయింది → పొద్దు + పోయింది ద్ అ ప్→ ద్ద (ఓలమ్మో:156)
ఉపసంహారం
ఈ వ్యాసం రచించటంలోని ప్రధాన విశేషం ఆధునిక వ్యావహారిక భాషా సంధిరూపాలు వైయాకరణులు చెప్పిన సంధి స్వరూపానికి లోంగుతాయా లేదా అన్నది పరీక్షించాలని పరిశీలన చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంత సంధి స్వరూపాన్ని పరిశీలిస్తున్నప్పుడు, సంప్రదాయ వ్యాకర్తలు, భాషావేత్తలు నిర్వచించిన తెలుగు సంధులు ఇప్పటికీ చాలా వరకు నిలిచి ఉన్నాయని తెలుస్తుంది. ఇవి శాస్త్రానికి లోబడే ఉన్నాయి.
నేటి వ్యావహారిక భాషలో అన్ని మండలాల్లో అచ్సంధులు, హల్సంధి రూపాలు ఎక్కువగానే కన్పిస్తున్నాయి. ఈ మార్పు ఉత్తరాంధ్ర కథాసాహిత్యంలో కూడా కన్పిస్తుంది. మాండలిక వ్యావహారికంలో చాలావరకు దేశీయ స్వరూపం అధికంగా ఉన్నప్పటికీ, ప్రాచీన సంధికార్యాలు సమగ్రంగా కనిపిస్తున్నాయి. భాషా సహజత్వంలో తెలుగు వ్యాకరణంలో సంధి స్వరూపానికి ప్రాచీన, ఆర్వాచీన భేదం లేదని రుజువయింది.
- ఈ పరిశీలన ఆధునిక వ్యావహారిక భాషలోని సంధి రూపాలు ప్రాచీన వ్యాకరణ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించింది.
- ఉత్తరాంధ్ర కథలలో కనిపించే సంధి స్వరూపం, సంప్రదాయ వ్యాకర్తలు, భాషావేత్తల నిర్వచనాలతో చాలా వరకు సరిపోలుతోంది.
- అచ్సంధులు, హల్సంధులు ప్రస్తుత వ్యావహారిక భాషలోని అన్ని మాండలికాలలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర కథాసాహిత్యంలో, విస్తృతంగా కనిపిస్తున్నాయి.
- మాండలిక వ్యవహారంలో దేశీయ స్వరూపం ఉన్నప్పటికీ, ప్రాచీన సంధి నియమాలు స్పష్టంగా కొనసాగుతున్నాయి.
- తెలుగు వ్యాకరణంలో సంధి స్వరూపానికి ప్రాచీన, ఆధునిక కాలాల్లో పెద్ద తేడా లేదని రుజువైంది.
ఉపయుక్త గ్రంథసూచి
- కృష్ణమూర్తి, భద్రిరాజు. 2014. భాష సమాజం సంస్కృతి. హైదరాబాద్: నీలికమల్ పబ్లికేషన్స్.
- కేతన, మూలఘటిక. 1932. ఆంధ్రభాషా భూషణము. మద్రాసు: వావిళ్ల రామస్వామి శాస్త్రులు&సన్స్.
- పెద్దన, విన్నకోట.1972. కావ్యాలంకారచూడామణి. మద్రాసు: వేదం వేంకటరాయ శాస్త్రి అండ్ బ్రదర్స్. ఏడవ ముద్రణ.
- మోహన్ రెడ్డి, ఆలేటి.2014. బాలవ్యాకరణము (తెలుగు వ్యాఖ్య). హైదరాబాదు: ఎమెస్కో ప్రచురణలు. ప్రథమముద్రణ.
- యమ్. కె. రావు, కిలపర్తి,. 2018. విజయనగరం జిల్లా తెలుగు – మాండలిక పరిశీలన. హైదరాబాదు: హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన అముద్రిత సిద్ధాంత వ్యాసం.
- రామకృష్ణయ్య, కోరాడ. 1971. సంధి. మద్రాసు: ఫ్రీడం ప్రెస్ ముద్రణ. ఐదవ ముద్రణ.
- రామకృష్ణారావు, వంతరాం.2011. ప్రౌఢవ్యాకరణ ఘంటాపథము. హైదరాబాద్ : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ద్వితీయ ముద్రణ.
- లక్ష్మీపతి, విరియాల. తులసి, చాగంటి (సంపా.). 2014. ఉత్తరాంధ్ర కథలు. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
- సుబ్రహ్మణ్యం, పి. యస్. 2018. ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

