headerbanner

అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-07 | June 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

5. పింగళి సూరన సుగాత్రీశాలీనుల కథ: ప్రబంధవక్రత

డా. ఎం. వి. పట్వర్ధన్

అసోసియేట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చెన్నూరు
మంచిర్యాల, తెలంగాణ.
సెల్: +91 9393751540, Email: rasajhari@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.05.2025        ఎంపిక (D.O.A): 31.05.2025        ప్రచురణ (D.O.P): 01.06.2026


వ్యాససంగ్రహం:

పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయానికి ’పద్యరూపంలో ఉన్న నవల’ అనే పేరున్నది. ఇందులో సూరన పూర్తిగా కల్పితమైన కథను స్వీకరించడం మొదలుకొని , కథాసంవిధానం, రసపోషణ మొదలైన అనేక అంశాల్లో ప్రయోగాలు చేశాడు. వాటిలో ‘వక్రోక్తి’ అనే గుణం ఒకటి. అయితే తెలుగు సాహిత్యంలో ఈ వక్రోక్తి మీద ప్రత్యేక పరిశోధనాగ్రంథాలు కానీ పరిశోధనావ్యాసాలు కానీ కొంత పరిమితంగానే వచ్చాయి. వేముల శరణ్య శ్రీనాథుడి పద పూర్వార్థ వక్రత, పరార్థ వక్రతలను గూర్చిన వ్యాసాలను ఔచిత్యం మాసపత్రికలో ప్రకటించారు. బొమ్మిశెట్టి ఆంజనేయులు అదే ఔచిత్యం పత్రికలో ఆధునిక పద్యకవి ‘బులుసు వేంకటేశ్వర్లు ‘జీవనవాహిని’ పద్యకావ్యం: వక్రోక్తి’ అనే అంశంపై తమ పరిశోధనావ్యాసాన్ని వెలువరించారు. పింగళి సూరన కళాపూర్ణోదయంలో నామవక్రతను గూర్చి డా. జి. వి. కృష్ణారావు వివరించారు. అదే విధంగా ఆచార్య జీ.వి. సుబ్రహ్మణ్యం, తమ కొన్ని సాహిత్యవ్యాసాల్లో ప్రకరణ, ప్రబంధ వక్రతలను స్పర్శించారు. అయితే ఇవి కుంతకుడు చెప్పిన సూత్రాలకు యథాతథ పరిశీలనలు కావు. కాబట్టి, పింగళి సూరన సుగాత్రీశాలీనుల కథలో, ప్రబంధవక్రత అనే గుణాన్ని, కుంతకుడి ప్రకారం గుణాత్మక విశ్లేషణ ఆధారoగా, ఈ వ్యాసం పరిశీలిస్తుంది. కుంతకుడి వక్రోక్తిజీవితం, సూరన కళాపూర్ణోదయం ప్రాథమిక ఆకరాలుగా, కట్టమంచి రామలింగారెడ్డి, జి. వి. కృష్ణారావు కళాపూర్ణోదయం గూర్చి రాసిన రచనలతో పాటు, ఇతరుల సాహిత్యవ్యాసాలను కొన్నిటిని ద్వితీయ ఆకరాలుగా స్వీకరించాను. ఈ పరిశీలన గుణాత్మక విశ్లేషణ ప్రకారం జరుగుతుంది. ప్రబంధ వక్రతా భేదాలు సోదాహరణంగా నిరూపితం అవ్వడమే కాకుండా, అవి కావ్యసౌందర్యాన్ని ఎలా పెంచాయో, ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవచ్చు.

Keywords: పింగళిసూరన, కళాపూర్ణోదయం, కుంతకుడు, వక్రోక్తి, ప్రబంధవక్రత, నిర్మాణచాతుర్యము, రసాoతరీకరణ, కథాంశసూచన, నామౌచిత్యము

1. ఉపోద్ఘాతం

కళాపూర్ణోదయంలో వక్రోక్తి గురించి జి. వి. కృష్ణారావు మొదటగా పేర్కొన్నారు. వారు కళాపూర్ణోదయంపై రాసిన పరిశోధనాగ్రంథంలో నామవక్రతను వివరించారు. ఒకవేళ కుంతకుడి కాలానికి ముందు కళాపూర్ణోదయం వెలువడి ఉంటే, ‘నామవక్రత’ పేరుతో ఒక ప్రత్యేక అధ్యాయాన్ని కుంతకుడు రాసి ఉండేవాడని కృష్ణారావు అభిప్రాయపడ్డారు. దీని తరువాత జి. వి. సుబ్రహ్మణ్యం తమ సాహిత్య వ్యాసాల్లో ఇలా అన్నారు: “సరసోక్తి, చతురోక్తి ప్రధానంగా సాగిన అలంకార ప్రస్థానాన్ని వక్రోక్తి, శిష్టోక్తి వైపు మళ్ళించిన గౌరవం సూరన్నకు దక్కింది. వక్రోక్తి వైభవం కళాపూర్ణోదయంలోని కథాంశాలలో, ప్రభావతీ ప్రద్యుమ్నం కవితలో పరిమళించింది” (సుబ్రహ్మణ్యం 236). ఇంతేకాకుండా, సూరన రచనల్లో రసోక్తి మీద వక్రోక్తి విజయం సాధించిందని వారు అంటారు. ప్రబంధ వస్తు నిర్మాణంలో పెద్దనతో పోటీపడడానికి కళాపూర్ణోదయాన్ని సూరన రాశారని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, “ ‘ప్రకరణవక్రత’తో పాటు, ‘ప్రబంధవక్రత’ను కూడా సాంగంగా, సలక్షణంగా సాధించి, వక్రోక్తి జీవితానికి కళాపూర్ణత్వాన్ని కల్పించిపెట్టాడు సూరన” (సుబ్రహ్మణ్యం 250) అంటూ మొదటిసారిగా సూరన కళాపూర్ణోదయం కావ్యంలో ప్రబంధ వక్రతా గుణాన్ని గుర్తించారు.

2. కుంతకుని సిద్ధాంతం, ప్రబంధ వక్రత

2.1. వక్రోక్తి - కావ్యజీవనం

వక్రోక్తి అన్నది సర్వాలంకార అనుస్యూతమును, కావ్య శోభాదాయకమునైన ఒక వైశిష్ట్యము” (పుల్లెల 09) అని కుంతకుడు తెలియజేశాడు. కుంతకుడు, తన వక్రోక్తి జీవితమున, భామహ సూచితమైన, అతి విస్తృతమగు వక్రోక్తి స్వరూపము విశదీకరించి, అదియే కావ్యజీవితమనియు, కావ్యజీవితముగ ఇతరాలంకారికాంగీకృతములగు ధ్వన్యలంకారాదులు, వక్రోక్త్యంతర్గతములే యనియు ప్రతిపాదించినాడు (పుల్లెల 08). నిజానికి ఇతర లాక్షణికులు చెప్పిన అనేక కావ్య సౌందర్య హేతువులను కుంతకుడు వక్రోక్తిలో అంతర్భూతం చేశాడు. కుంతకుడి వక్రోక్తి జీవితంలో మొత్తం నాలుగు ఉన్మేషాలున్నాయి. ప్రథమోన్మేషంలో కావ్య లక్షణాన్ని, శబ్దార్థాల స్వరూపాన్ని నిరూపించాక, కవి వ్యాపారమైన వక్రోక్తిని 1. వర్ణ విన్యాస వక్రత, 2. పద పూర్వార్థ వక్రత, 3. ప్రత్యయ వక్రత, 4. వాక్య వక్రత, 5. ప్రకరణ వక్రత, 6. ప్రబంధ వక్రత అని ఆరు రకాలుగా విభజించాడు. చివరిదైన నాలుగో ఉన్మేషంలో ప్రకరణ - ప్రబంధ వక్రతలను పేర్కొన్నాడు.

2.2. ప్రబంధవక్రత నిర్వచనం

కావ్యం అంతటా విస్తరించి, కథా నిర్మాణంలో వ్యక్తమయ్యే కళాత్మక వైచిత్రినే ప్రబంధ వక్రత అంటారు. సమర్థుడైన కవి దీనిని అనేక విధాలుగా నిర్వహిస్తాడు. “సమగ్రకావ్యంలో కానీ, ప్రబంధంలో కానీ నాటకంలో కానీ ఇతివృత్తం తప్పక ఉంటుంది. రసాదులను ఉపలక్షించి కానీ, రసాoతరాన్ని లక్షించి కానీ, ఇతివృత్త సంవిధానంలో కవి ప్రతిభాజన్యమైన కల్పనావైచిత్రిని ప్రబంధ వక్రతగా కుంతకుడు నిర్దేశించాడు.” (సుబ్రహ్మణ్యం 241) అని జి. వి. సుబ్రహ్మణ్యం తెలియజేశారు.

2.3. ప్రబంధ వక్రత రకాలు

కుంతకుడు పేర్కొన్న ప్రకారం ఈ ప్రబంధవక్రత తిరిగి ఆరువిధాలు:

  1. రసాంతర వక్రత
  2. సమాపన వక్రత
  3. కథావిచ్ఛేద వక్రత
  4. అనుషంగిక ఫల వక్రత
  5. తుల్యకథా వక్రత
  6. నామకరణ వక్రత

2.3.1. రసాంతర వక్రత

ఇతివృత్తాన్యథావృత్త రస సంపదుపేక్షయా-
రసాన్తరేణ రమ్యేణ యత్రనిర్వహణం భవేత్
తస్యా ఏవ కథామూర్తే రామూలోన్మీలితశ్రియ:
వినేయానంద నిష్పత్త్యే సా ప్రబంధస్య వక్రతా

అని కుంతకుడి నిర్వచనం (పుల్లెల). మూలంలో ఉన్న ఒక రసాన్ని ఉపేక్షించి, సామాజికులకు ఆనందం కలిగించడానికి మరొక రసంతో నిర్వహించడమని సూత్రార్థం. వాల్మీకి రామాయణం శాంత రసప్రధానమైనప్పటికీ ఉత్తర రామచరిత్రలో కరుణ రసం, వేణీసంహారంలో వీర రసం పోషించబడ్డాయి. కాబట్టి కుంతకుడు దీనిని రసాంతర వక్రతగా ఉదాహరించాడు. ఇక కళాపూర్ణోదయ కావ్యానికి విమర్శకులు ఇప్పటివరకూ ఒక కచ్చితమైన మూలాన్ని నిరూపించలేకపోయారు. కాదంబరి, కథాసరిత్సాగరం, మహాభారతం, లింగపురాణం, మార్కండేయ పురాణం వంటి వాటి ప్రభావాలు కొన్ని కనబడుతున్నా, అవేవీ యథాతథ మూలాలు కావని జి. వి. కృష్ణారావు సోదాహరణంగా నిరూపించారు.

కేవల కల్పిత కథ తీసుకొని, కావ్యరచనకు పూనుకొనుట సూరన చేసిన ప్రయోగములలో అపూర్వమైనది” (నారాయణరెడ్డి, 120). సూరన కూడా తాను రాస్తున్న కథ “అత్యపూర్వ కథాసంవిధాన వైచిత్రీ మహనీయంబును...” అని స్వయంగానూ, సుగాత్రీ శాలీనుల ప్రస్తావన సందర్భంలో “ఆ రంభ ప్రియునకు జెప్పరాదనిన కథ యత్యపూర్వము” అని నారదుడి చేత అనిపించడం, ఈ కథకు పూర్వ మూలం లేదనే విషయాన్ని సూచిస్తున్నది. ఇక అమూలకమే కాబట్టి రసాంతరీకరణ అన్న ప్రశ్నకు ఆస్కారం లేదు. కానీ పూర్వం పురుషుడి నుండి స్త్రీగా మారిన ఇలా, భంగాశ్వనుడు వంటి పాత్రలు సాంసారిక ప్రణయానికి మాత్రమే పరిమితమయ్యాయి. సుగాత్రి పురుషుడిగా, శాలీనుడు స్త్రీగా మారాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ, ఆ పాత్రలకు సూరన ఎంతో విశాలమైన ప్రయోజనం కల్పించాడు.

అయితే కళాపూర్ణోదయం అంతటికీ కీలకమైన ఈ సుగాత్రీశాలీనుల కథలో భక్తి, శృంగార, అద్భుత, భయానక రసాలను పోషించడం రసాంతరీకరణను మించిన గొప్ప మార్పు. ఒక సాఫీ భక్తిరస ప్రధాన కథగానో, లేదా ఒక మనోహర శృంగార కథగానో సాగాల్సిన వృత్తాంతంలో సూరన చూపిన వైవిధ్యభరిత ఛాయలు శ్లాఘనీయం.

2.3.2. సమాపన వక్రత

త్రైలోక్యాభినవోల్లేఖ నాయకోత్కర్ష పోషిణా
ఇతిహాసైక దేశేన ప్రబంధస్య సమాపనమ్
తదుత్తర కథావర్తి విరసత్వ జిహాసయా
కుర్వీత యత్ర సుకవి: సా విచిశ్రాస్య వక్రతా

అన్న కుంతకుడి శ్లోకాల్లో (పుల్లెల) సుకవి తాను ఇతిహాసంలో చెప్పబడిన ఇతివృత్తాన్నే తీసుకున్నా, రాబోయే కథలో కథానాయకుడికి ఒకవేళ అమంగళం కానీ, నీరసభావం కానీ ఉంటే, అంతవరకూ కథానాయకుడు పొందిన శ్రేష్టతను కాపాడుతూ, ఆ ఇతివృత్తంతోనే కథను ముగిస్తే అది సమాపన వక్రత. ఉదాహరణకు భారవి కిరాతార్జునీయంలో పరమేశ్వరుడి నుండి వరాలు పొందాక, ధర్మరాజుకు జయం సూచించే శుభవాక్యాలతో ముగించాడు. సుగాత్రీశాలీనులు చాలా అనురాగపూరితంగా ఉండేవారు. కానీ ఏ కారణంతో అభిప్రాయభేదం వచ్చిందో కానీ ముందుగా శాలీనుడు:

ఘన రోషు డగుచు నతడా
వనితయు దో నరుగుజేర వడి జని యాచే-
ర్పునను శతతాళదఘ్నుం
బను బేరన్ వెలసియున్న హ్రదమున నురికెన్ (కళా. 4-0-0)

ఆ తరువాత సుగాత్రి కూడా ఆ ‘శతతాళదఘ్నం’ అనే చెరువులో దూకుతుంది. ఆ దంపతులు మళ్ళీ కలుస్తారో లేదన్న ఆలోచన పాఠకులను వెంటాడుతుంది. కానీ ఈ కథలో సుగాత్రి మణిస్తంభుడిగా, శాలీనుడు సుముఖాసత్తి అనే స్త్రీగా మారిన తరువాత, తిరిగి కలవడమే కాకుండా, కళాపూర్ణుడి జన్మకు కూడా కారణమవుతారు. దీనితో వీరి కథ సుఖాంతమౌతుంది.

2.3.3. కథావిచ్ఛేద వక్రత

ప్రధాన వస్తు సంబంధ తిరోధాన విధాయినా
కార్యాన్తరాoతరాయేణ విచ్చిన్నవిరసా కథా
తత్రైవ తస్య నిష్పత్తే నిర్నిబంధ రసోజ్జ్వలామ్-
ప్రబంధస్యాను బధ్నాతి నవాం కామపి వక్రతామ్

ప్రధాన కథాగమనానికి ఆటంకాన్ని కలిగిస్తూ, ఏదో ఒక అప్రధాన కథ ముందుకు రావడం వలన, అసలు కథ కాసేపు మరుగున పడిపోయినప్పటికీ, చివరికి అది రసవంతమై, ప్రబంధానికి సౌందర్యాపాదకం అవుతుందని కుంతకుడు వివరించాడు (పుల్లెల). మాఘుని శిశుపాలవధ కావ్యంలో దేవేంద్రుని తరఫున నారదుడు శిశుపాలుని సంహరించమని శ్రీకృష్ణుని వేడుకోవడం, తన అన్న బలరామునితో కృష్ణుడు మంతనాలు చేయడం అనే ప్రధాన కథకు అడ్డుగా ధర్మరాజు చేసే రాజసూయయాగం, అగ్రపూజ ఇవన్నీ ముందుకు వస్తాయి. కానీ చివరికి, ఆ రాజసూయమే శిశుపాల వధకు కారణమవుతుంది. సుగాత్రీ శాలీనుల కథలో కూడా వేగంగా కొనసాగుతున్న కథలో శాలీనుని:

నీరెత్తు వేళల నీరెత్తు – బాదు బాదునకు కాలువలు పొందుగ నమర్చి
త్రవ్వటంబుల తఱి త్రవ్వటంబులువెట్టు-దగినట్టి కర్రు గుద్దలి గడించి.. (కళా. 4-22)

వంటి తోటపనుల వర్ణనా పద్యాలు ప్రధాన కథాగమనానికి ఆటంకంగా కనిపిస్తాయి. అయినప్పటికీ శాలీనుడితో పాటు సుగాత్రి కూడా పనులు చేయడమే కథను మలుపు తిప్పుతుంది. శాలీనుడికి సుగాత్రిపై సద్భావాన్ని కలిగిస్తుంది. ఆ తరువాత మళ్ళీ వర్ష సమయంలో సుగాత్రి శాలీనుడిని చేరబోయినప్పుడు, ఈ మొదటిసారి కలిగిన సద్భావమే ప్రేమగా మారుతుంది. కథ సుఖాంతం అవుతుంది.

2.3.4. అనుషంగిక ఫల వక్రత

తత్రైక ఫల సంపత్తి సముద్యుక్తోపి నాయక
ఫలాంతరేష్వనంతేషు తత్తుల్య ప్రతిపత్తిషు
ధత్తే నిమిత్తతామ్ స్ఫారయశ: సంభార భాజనమ్
స్వమాహాత్మ్య చమత్కారాత్ సాపరాచాస్య వక్రతా

కథానాయకుడు ఎలాంటి ఉద్దేశం లేకుండానే, అప్రయత్నంగా చేసిన పని, ఆ తరువాత కథాగమనానికి లేదా కార్యసిద్ధికి సహాయకారిగా మారితే దానిని ‘అనుషంగిక ఫల వక్రత’ అంటారు (పుల్లెల). శాలీనుడు ఆవేశంలో ‘శతతాళదఘ్నం’ అనే చెరువులో దూకడం, వెంటనే సుగాత్రి కూడా, అతడినే అనుసరించి అదే చెరువులో దూకడం ఆవేశపూరిత చర్య. కానీ తరువాత కథాగమనంలో, వారిద్దరూ ఇలా దూకడం వల్లనే అతడు మణిస్తంభుడు అనే సిద్ధుడిగా, సుగాత్రి సుముఖాసత్తిగా మారడం సాధ్యమైంది. ఇలా జరగడం వల్లే ఆ దంపతులు, సరస్వతీదేవి తమకిచ్చిన వరానికి తగినట్టుగా కళాపూర్ణుడు అనే బాలుడికి జన్మనివ్వడం సాధ్యమై, మొత్తం కథే మలుపు తిరుగుతుంది. అందువల్ల ఇది ఆనుషంగిక ఫలవక్రత అని చెప్పవచ్చు.

2.3.5. తుల్యకథా వక్రత

శరీరం లాగా కథా వస్తువు ఒకటే అయినప్పటికీ:

కథోన్మేషే సమానే౭పి వపుషీవ నిజైర్గణైః
ప్రబంధా: ప్రాణిన ఇవ ప్రభాసంతే పృథక్ పృథక్

ప్రబంధాలు వేరు వేరు ప్రాణుల్లాగా, వేరు వేరు గుణాలతో, తమ ప్రత్యేకతను నిలుపుకుంటాయని కుంతకుడు అభిప్రాయపడ్డాడు (పుల్లెల). కళాపూర్ణోదయం ఒక స్వతంత్ర కల్పిత ప్రబంధం కాబట్టి, దీనికి ఇతర ప్రబంధాలతో కథావిషయికంగా ఏ పోలికలు ఉండవు. అయినప్పటికీ కథా సంవిధానం, శిల్పచాతుర్యం వంటి లక్షణాల వలన కళాపూర్ణోదయం ఇతర ప్రబంధాలకు భిన్నంగా తన ప్రత్యేకతను నిలుపుకుంది. “కళాపూర్ణోదయం మొత్తం మీద విషయమున ప్రబంధ సంబంధి కాదు, శైలి యంద చ్చటచ్చట వాసన దాల్చినది” (కట్టమంచి 76) అని కట్టమంచి రామలింగారెడ్డి దీని ప్రత్యేకతను గుర్తించారు.

2.3.6. నామకరణ వక్రత

ఆస్తాం వస్తుషు వైదగ్ధ్యం కావ్యే కామపి వక్రతాం
ప్రధాన సంవిధానాంక నామ్నాపి కురుతే కవిః

ప్రబంధానికి పెట్టిన పేరు ఆ ప్రబంధంలోని ప్రధాన కార్యాన్ని సూచిస్తే, దానిని నామకరణ వక్రత అనొచ్చు (పుల్లెల). అభిజ్ఞాన శాకుంతలం, ముద్రారాక్షసము, ప్రతిమానిరుద్దము, మాయాపుష్పకము, కృత్యారావణము, ఛలితరామము, పుష్పదూషికము వంటి పేర్లన్నీ నామకరణ వక్రతకు ఉదాహరణలు. కానీ హయగ్రీవ వధము, శిశుపాలవధము, పాండవాభ్యుదయము, రామానందము, రామచరితము వంటి నేరుగా ఉన్న పేర్లలో వక్రత లేదు.

సుగాత్రీ శాలీనుల కథ ప్రబంధ అంతర్భాగం అయినప్పటికీ, ఆ పేర్లు ఆయా పాత్రల స్వభావానికి తగినట్టుగానే ఉన్నాయి. సుగాత్రి అంటే మంచి అందమైన శరీరం కలది, శాలీనుడు అంటే దృఢంగా లేనివాడని. ఇంకా సుముఖాసత్తి, మణిస్తంభుడు, మణికంఠుడు, కలభాషిణి వంటి పేర్లన్నీ కథలోని ఏదో ఒక ప్రధాన అంశాన్ని సూచిస్తూనే ఉన్నాయి.

ప్రబంధం పేరు కళాపూర్ణోదయం అని పెట్టడంలో ఈ నామకరణ వక్రత ఉంది. కథానాయకుడు కళాపూర్ణుడని, కళాపూర్ణుడు జన్మిస్తాడని, కావ్యంలో అన్ని సంపూర్ణమైన కళలు ఉన్నాయని రకరకాలుగా అన్వయించుకోవచ్చు. ఈ రకంగా ఎంత ఆస్వాదించి, ఆనందించే వారికి అంత ఆనందం దొరుకుతుంది.

జి. వి. సుబ్రహ్మణ్యం అభిప్రాయపడినట్టు పింగళి సూరన ప్రకరణ వక్రతతో పాటు, ప్రబంధవక్రత కూడా సాధించాడు.

ఉపసంహారం

  • పింగళి సూరన రచించిన కళాపూర్ణోదయంలోని సుగాత్రీ శాలీనుల ఉపకథలో, కుంతకుడు చెప్పిన లక్షణాలను అనుసరించి ప్రబంధ వక్రత ఉందని నిరూపితమైంది.
  • ఊహించని కథా నిర్మాణంతో, అపూర్వ సంవిధాన చాతుర్యంతో ఉన్న ఈ ప్రబంధానికి ప్రబంధ వక్రత్వం ఒక ప్రధాన బలంగా నిలిచింది.
  • సూరన ప్రదర్శించిన ప్రబంధ వక్రత కథాపరంగా అందులో ఒదిగిపోయింది.
  • పింగళి సూరన వక్రోక్తి ప్రస్థానాన్ని అంచనావేసి, కథా నిర్మాణంలో, ప్రబంధం పేరు మొదలుకొని అడుగడుగునా విస్తరించిన ప్రబంధ వక్రతను గ్రహించగలిగాము. ఈ పరిశీలన ఇతర ప్రబంధ కవుల్లోని ప్రబంధ వక్రతను అంచనా వేయడానికి ఉపకరిస్తుంది.
  • ఈ విశ్లేషణ కళాపూర్ణోదయం కేవలం ఒక శృంగార కావ్యమే కాదని, వక్రోక్తి సిద్ధాంతానికి గొప్ప ఉదాహరణ అనీ తెలియజేస్తుంది.
  • సూరన తన కల్పనాతీత ప్రతిభతో సంప్రదాయ సిద్ధాంతాలకు కొత్త కోణాలను జోడించడంలో చూపిన నైపుణ్యం స్పష్టమైంది.
  • ప్రబంధ వక్రతలోని వివిధ రకాలను సుగాత్రీశాలీనుల కథా సందర్భంలో వివరించడం ద్వారా ఈ సిద్ధాంతం ఆచరణీయత నిరూపితమైంది.

ఉపయుక్తగ్రంథసూచి

  1. నాగయ్య. జి, (1995). తెలుగు సాహిత్య సమీక్ష (రెండవ సంపుటం), నవ్యపరిశోధక ప్రచురణలు, తిరుపతి
  2. నారాయణరెడ్డి, సింగిరెడ్డి, (1989). ఆధునికాంధ్రకవిత్వము; సంప్రదాయములు-ప్రయోగములు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌజ్, హైదరబాద్
  3. రామచంద్రుడు, పుల్లెల. (1977). కుంతకుని వక్రోక్తి జీవితం, సాహిత్య అకాడమీ, న్యూడిల్లీ
  4. రామలింగారెడ్డి, కట్టమంచి. (1973). కవిత్వతత్వ విచారం, ఆంధ్రాయూనివర్సిటీ, విశాఖపట్నం.
  5. సుబ్రహ్మణ్యం, జీవీ. (1991). సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు, తెలుగు అకాడెమీ, హైదరాబాదు
  6. సుబ్రహ్మణ్యం, జీ. వీ, సి. మృణాళిని & టి. రమేశ్ ( 2015). సివిల్ సర్వీసెస్ మెయిన్, హైదరాబాద్ స్టడీ సర్కిల్
  7. సూరన, పింగళి. (1973), కళాపూర్ణోదయం, సుబ్బయ్యశాస్త్రి కాశీభట్ల (సం), పిఠాపుర సంస్థానాధీశులు
  8. లక్ష్మీకాంతం, పింగళి. (1977), ఆంధ్రసాహిత్య చరిత్ర, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
  9. వేంకటావధాని, దివాకర్ల. (1966). సాహిత్యసోపానములు, కావ్యవిషయసంగ్రహము, ఆంధ్రసాహిత్య పరిషత్తు, హైదరాబాదు.
  10. Krishna Rao, G.V. (1956) Studies in Kalapoornodayam (Thesis), Prabhasa Publications, Tenali

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image