AUCHITHYAM | Volume-07 | Issue-07 | June 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. వీరకళింగం నవల: కళింగాంధ్ర ప్రాంతీయ అస్తిత్వం
నరేష్ గురుగుబెల్లి, డా. ఢిల్లీశ్వరరావు సనపల
పరిశోధకులు, తెలుగుశాఖ,
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం, ఎచ్చెర్ల
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440485346, Email: nareshg.skl@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.05.2025 ఎంపిక (D.O.A): 25.05.2025 ప్రచురణ (D.O.P): 01.06.2026
వ్యాససంగ్రహం:
ఉత్తరాంధ్ర ప్రాంతీయ అస్తిత్వాన్ని ఆవిష్కరించిన నవలలలో డాక్టర్ దీర్ఘాసి విజయ భాస్కర్ రచించిన ‘వీరకళింగం’ ఒక ముఖ్యమైన చారిత్రక – సామాజిక నవలగా గుర్తింపును పొందింది. ఈ నవలలో కళింగ ప్రాంతపు చారిత్రక వైభవం, భౌగోళిక ప్రత్యేకతలు, వాణిజ్య సంబంధాలు, ప్రజల పోరాట చైతన్యం, సంస్కృతీ సంప్రదాయాల ప్రతిబింబం సమగ్రంగా దర్శనమిస్తాయి. ముఖ్యంగా భౌగోళిక పరిస్థితులు ఎలా సామాజిక నిర్మాణాన్ని ప్రభావితం చేశాయి? చారిత్రక పరిణామాలు, ప్రజల జీవనవిధానం ఏ విధంగా చిత్రించబడింది? వాణిజ్య సంబంధాలు కళింగ ప్రాంత అభివృద్ధికి ఎలా దోహదపడ్డాయి? ప్రజల పోరాట చైతన్యం ఏ విధంగా చాటిచెప్పింది? ప్రాంతీయ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు నవలలో ఏ రూపంలో నిలిచాయి? అనే అంశాలను చారిత్రక విశ్లేషణాత్మక పద్ధతిలో పరిశోధనాత్మక, విమర్శనాత్మక దృష్టితో, ప్రాంతీయ అస్తిత్వ సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని విశ్లేషించబడింది. నా అవగాహన పరిధిలో ఈ నవలపై ప్రాంతీయ అస్తిత్వ పరిశీలన కోణంలో ఇంతవరకు పరిశోధనలు గానీ, పరిశోధనా వ్యాసాలు గానీ ప్రచురింపబడలేదు
Keywords: ఉత్తరాంధ్ర, ప్రాంతీయ అస్తిత్వం, వీరకళింగం, చారిత్రక నవల, సంస్కృతీ సంప్రదాయాలు, పోరాట చైతన్యం, వర్తక వాణిజ్యం.
1. ప్రవేశిక
అస్తిత్వం అనగా ఒక వ్యక్తి, సమాజం, ప్రాంతం లేదా జాతిని ఇతరుల నుండి ప్రత్యేకంగా గుర్తించే లక్షణాల సముదాయం. భౌగోళిక పరిస్థితులు, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, జీవన విధానం, పోరాట స్ఫూర్తి వంటి అంశాల సముదాయం ఒక ప్రాంత అస్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఆధునిక అభివృద్ధి విధానాల ద్వారా స్థానిక సంస్కృతులు, భాషలు, జీవన విధానాలు క్రమంగా కనుమరుగవుతాయి. ఇటువంటి పరిస్థితులలో ఒక ప్రాంతానికి సంబంధించిన చరిత్ర, సంస్కృతి, భాష, సంప్రదాయాలను సంరక్షించి, వాటి ప్రత్యేకతను గుర్తించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఈ ఆవశ్యకత ప్రాంతీయ అస్తిత్వ అధ్యయనాలకు పునాది.
తెలుగు నవలా సాహిత్యంలో ప్రాంతీయ అస్తిత్వం ఒక ముఖ్యమైన సాహిత్య ధోరణిగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత జీవన విధానం, సామాజిక సంబంధాలు, రాజకీయ చైతన్యం, భౌగోళిక విశిష్టతలను ప్రతిబింబించే నవలలు ప్రాంతీయ అస్తిత్వాన్ని స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాయి. కళింగ ప్రాంత చరిత్ర, ప్రజల పోరాట స్ఫూర్తి, సాంస్కృతిక వైభవం నిరూపించే నవలలలో ‘వీరకళింగం’ ప్రత్యేక స్థానాన్ని పొందింది.
ఈ నవల కేవలం చారిత్రక సంఘటనల సముదాయం మాత్రమే కాదు; కళింగ ప్రాంత సామాజిక నిర్మాణం, రాజకీయ పరిణామాలు, వాణిజ్య విస్తరణ, ప్రజల పోరాట చైతన్యం, ప్రాంతీయ సంస్కృతిని దర్శింపజేసే సామాజిక సాహిత్య సాధనంగా కూడా ఇది నిలుస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతీయ అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నవల ఒక ప్రామాణిక ఆధారంగా ఉపయోగపడుతుంది. ప్రాంతీయ నవలల ప్రధాన లక్ష్యం స్థానిక జీవితం, భాష, సంప్రదాయాలు, చరిత్రను సాహిత్యరూపంలో సంరక్షించడం. ఈ దృష్టితో ‘వీరకళింగం’ నవలలోని అంశాలను విశ్లేషించడం ద్వారా ఉత్తరాంధ్ర సమాజ చారిత్రక – సాంస్కృతిక స్వరూపం స్పష్టమవుతుంది.
2. 'వీరకళింగం' నవలలో ప్రాంతీయ అస్తిత్వ విశదపరచడం
2.1. భౌగోళిక అంశాల పరిశీలన
ఉత్తరాంధ్ర ప్రాంత భౌగోళిక స్వరూపం ‘వీరకళింగం’ నవలలో ప్రధాన నేపథ్యంగా కనిపిస్తుంది. సముద్రతీర ప్రాంతాలు, ఎత్తైన తూర్పుకనుమలు, నదీ పరివాహక ప్రాంతాలు, వృత్తి ఆధారిత గ్రామీణ జీవనం నవలలో సజీవంగా చిత్రించబడ్డాయి. కళింగ ప్రాంతం ప్రాచీన కాలం నుండి సముద్ర వాణిజ్యానికి ప్రసిద్ధి. సముద్రతీర భౌగోళిక పరిస్థితులు ప్రజల జీవన విధానాన్ని ప్రభావితం చేశాయి. నవలలో సముద్రతీర ప్రాంతాల వర్ణనలు కేవలం ప్రకృతి సౌందర్యం మాత్రమే కాదు; ఆ ప్రాంత ఆర్థిక – సామాజిక జీవనాన్ని కూడా చాటిచెప్పాయి.
ఈ ప్రాంత సముద్రతీర రేవు పట్టణం కళింగనగరం (కళింగపట్నం) మిగిలిన కళింగ ప్రాంత రేవు పట్టణాల కంటే సముద్రయానానికి అనుకూలమని చెబుతూ ఇలా ఉంది:
“తామ్రలిప్తి, పరదీపు మొదలైన రేవు పట్టణాలు ఉన్నప్పటికీ సముద్రయానానికి కళింగనగరమే అనుకూలం. దానికి మొట్టమొదటి కారణం వంశధార నదీ సంగమం. రెండవ కారణం కళింగ తీరమంతా సముద్ర నీటిరేఖ ఎగువకు పోయిన కొద్దీ పెరుగుతుండడం వలన తీవ్రమైన గాలివానలు, వాయుగుండాలు ఏర్పడినప్పుడు సాధారణంగా అవి కళింగ నగరం రేవు వద్ద తీరాన్ని దాటవు. దాని వలన కళింగనగరం రేవులో నిలిచిన ఓడలు సురక్షితంగా ఉంటాయి” (దీర్ఘాసి 103).
నదుల ప్రాధాన్యం కూడా ఈ నవలలో ప్రముఖంగా కనిపిస్తుంది. తరాల తరబడి త్రాగునీటికి, సాగునీటికి ఆధారమైన అనేక నదులు కళింగాంధ్రలో ఉన్నాయి. ప్రధానంగా వంశధార నదిని వ్యవసాయానికి, వర్తక వాణిజ్యానికి ఆధారంగా నిలిపినట్లు నవలలో వెల్లడించారు. దండకపురానికి కళింగసముద్రాన్ని (నేటి బంగాళాఖాతం) కలిపే ఆర్థిక జీవనాడిగా వంశధార నదిని చిత్రించారు. వంశధార నది గుండా నౌకల ద్వారా, పడవల ద్వారా సరకు రవాణా జరిగేదని వ్యక్తీకరించారు (దీర్ఘాసి 31). K.S. చలం రాసిన చారిత్రక గ్రంథమైన త్రికళింగ దేశ చరిత్ర కూడా ఈ విషయాన్ని సమర్థిస్తుంది:
“దంతపురం వంశధార నది ఒడ్డున వుండబట్టి దగ్గరలోని తీరం నుండి వాణిజ్యానికి అనువుగా వుంది” (చలం 83).
కళింగ ప్రాంత ప్రజలు ప్రకృతి పట్ల, ప్రకృతి వనరుల పట్ల అమితమైన అవగాహన కలిగి ఉన్నట్లు నవలలో పేర్కొనబడింది. స్థానికంగా లభించే కలపను ఆనాటి వ్యవహారంలో నాలుగు రకాలుగా విభజించారని నౌకా నిర్మాణ ప్రవీణుడైన ఓడేసు మాటలలో రచయిత ఇలా వ్యక్తం చేశారు:
”కర్ర తేలికగా, మృదువుగా ఉండి ఇతర జాతి కలపతో సులువుగా కలిసిపోయేవి బ్రహ్మజాతి కలప రకం. లఘువుగా, దృఢంగా ఉండేవి క్షత్రియ జాతి. ఇది ఇతర జాతి కలపతో కలవదు. అగాధ సముద్ర ప్రయాణానికి అనుకూలంగా ఉంటుంది. కోమలంగా ఉన్నా బరువు ఎక్కువగా ఉండేది వైశ్య జాతి కలప. దృఢంగా బరువుగా ఉండేది శూద్ర జాతి కలప. ఇది నౌకల నిర్మాణానికి పనికిరాదు” (దీర్ఘాసి 64).
కళింగులు ప్రకృతి రహస్యాలు చక్కగా తెలిసినవారని, పంచభూతాల గుణ, రూప విశేషాలను ఎరిగినవారని పేర్కొంటూ ఇలా ఉంది:
“కళింగులు ప్రకృతి రహస్యాలు తెలిసిన జ్ఞానులు. పంచభూతాల తత్వాన్ని గుప్పెట పట్టుకున్నవారు. వాటి లక్షణాలైనా శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. భూమికి అయిదు, నీటికి నాలుగు, అగ్నికి మూడు, గాలికి రెండు, ఆకాశానికి ఒకే ఒక లక్షణం ఉంటాయని కళింగులకు చిన్నప్పుడే బోధిస్తారు. ఈ ఐదింటి సంయోగం జీవమని, వియోగం నిర్జీవమని పిల్లలకు తెలియజేస్తారు” (దీర్ఘాసి 209).
దీని ద్వారా కళింగులు ప్రకృతి తత్వాన్ని అవపోసన పట్టిన బహుముఖ ప్రజ్ఞాశాలురని నిరూపితమవుతుంది.
ఒక ప్రాంత సంస్కృతి అలవాట్ల మీద ఆ ప్రాంత భౌగోళిక అంశాల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు. వంశధార నదీ తీరం కూడా ఇక్కడి ప్రజల సంస్కృతిని ప్రభావితం చేసింది. నేటికీ ఈ ప్రాంతంలో వంశధార నదిలో కార్తీకపౌర్ణమి రోజున జరుపుకునే బాలియాత్రను అప్పటి నుండి వస్తున్న ఆచారంగా మనం భావించవచ్చు. దీనిపై నవలలో ఇలా ఉంది:
“ఆనాడు కార్తీక పౌర్ణమి. వర్తక వాణిజ్యం కోసం సముద్రయానం చేస్తూ విదేశాలు వెళ్లిన మగవారు క్షేమంగా తిరిగి రావాలని అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లోనూ, చెరువుల్లోనూ వదులుతారు. వంశధార జలరాశులపై అరటి దొప్పల్లో వెలిగించిన కార్తీకజ్యోతులు తూర్పున ఉన్న కళింగ సముద్రం వైపు ప్రయాణిస్తున్నాయి” (దీర్ఘాసి 208).
‘వీరకళింగం’ నవల ఉత్తరాంధ్ర భౌగోళిక స్వరూపాన్ని చిత్రించి, ప్రాంతీయతను ఉత్తమంగా సాక్షాత్కరింపచేసిందని చెప్పవచ్చు.
2.2. చారిత్రక అంశాల పరిశీలన
‘వీరకళింగం’ నవలలో కళింగ ప్రాంత చరిత్ర సంబంధించిన అనేక అంశాలు సమగ్రంగా ప్రతిఫలించాయి. కళింగ సామ్రాజ్య వైభవం, రాజకీయ సంఘర్షణలు, రాజ్య విస్తరణ, సామాజిక పరిణామాలు నవలలో చారిత్రక నేపథ్యంగా నిలిచాయి. కళింగ ప్రాంత ప్రసిద్ధ ప్రదేశాలతో పాటు చారిత్రక వ్యక్తుల ప్రస్తావన ఈ నవలలో ఉంది. సింహబాహుడు నిర్మించిన సింహపురం, బ్రహ్మదత్తుడు పాలించిన దండకపురం వంశధార నది ఒడ్డున వెలసిన శక్తివంతమైన పురరాజ్యాలుగా రచయిత ఉద్ఘాటించారు. ఈ నగరాల వర్ణన ద్వారా కళింగ నాగరికత వైభవం స్పష్టమవుతుంది.
కళింగ రాజులు ఆశ్రిత పక్షపాతానికి అతీతులని, న్యాయపాలనకు కట్టుబడి ఉండే రాజనీతిజ్ఞులుగా నవలలో చిత్రించారు. ఒక యువతిని చెరిచి, హత్య చేసిన నేరానికి తన కుమారుడైన విజయబాహుడిని సింహబాహుడు ద్వీపాంతర ప్రవాసానికి పంపడం ద్వారా కళింగ రాజుల రాజధర్మాన్ని రచయిత ఉత్తమంగా ఆవిష్కరించారు. విజయబాహుడు తామ్రపర్ణి (శ్రీలంక) చేరుకొని అక్కడ సింహళ రాజ్య స్థాపనకు కారణమయ్యాడనే అంశం చారిత్రక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీనిపై నవలలో ఇలా ఉంది:
“అన్ని తండాల్లోని వీరుల సమక్షంలో నాగరిక పద్ధతిలో తామ్రపర్ణి ద్వీపానికి విజయబాహుడు రాజయ్యాడు. కువేణి రాణి అయ్యింది. తండాలన్నిటినీ ఏకం చేసి తన తల్లి సింహళ పేరున సింహళ దేశంగా నామకరణం చేశాడు” (దీర్ఘాసి 157).
K.S. చలం రచించిన త్రికళింగ దేశచరిత్ర (చలం 120) లో కూడా ఈ విషయాన్ని ఇలా సమర్థిస్తుంది:
“శ్రీలంక మహావంశ, దీపవంశ మత గ్రంథాల్లో కళింగ నుండి (సింహపురం) సింహబాహుని కొడుకు విజయుడు 700మంది సైనికులతో శ్రీలంకలో ప్రవేశించి మొట్టమొదట రాజ్యాన్ని స్థాపించినట్లు వుంది”.
నవలా రచయిత తన తొలి పలుకులలో శ్రీలంక వైద్యుడైన అజిత్ అమర్ సింఘే రాసిన Finding Simhababu (దీర్ఘాసి 17) అనుగ్రంథంను కూడా ఈ చారిత్రకాంశానికి సాక్ష్యంగా ప్రస్తావించడం ద్వారా కళింగుల చారిత్రక వైభవం, సముద్రయాన సామర్థ్యం, అంతర్జాతీయ సంబంధాలు స్పష్టమవుతాయి. అలాగే నవలలో విజయబాహుడు దేశ, జాతి, భాషల ముందు తన తల్లి “సింహళ” అని చేర్చడం ఈ ప్రాంతపు వ్యక్తులకు తల్లి పట్ల గల గౌరవాభిమానాలకు సాక్ష్యం.
కళింగ ప్రాంతం భారత చరిత్రలో విశిష్ట స్థానాన్ని పొందడానికి కళింగ యుద్ధం కూడా ఒక ముఖ్య కారణం. అశోకుని పశ్చాత్తాపం, బౌద్ధ ధర్మ ప్రచారం వంటి అంశాలు ఈ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను మరింత పెంచాయి. చారిత్రక నిజానిజాల చర్చ ఏమైనప్పటికీ అశోకుడు వంశధార నదిలో స్నానం చేసి దంతపుర స్థూపాన్ని సతీసుత సమేతంగా దర్శించుకున్నట్లు నవలలో పేర్కొనడం ద్వారా కళింగ ప్రాంత మత, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కూడా ప్రస్తావించబడింది. చారిత్రక అంశాల ద్వారా రచయిత ప్రాంతీయ చరిత్రను నిర్మించడంలో విజయవంతమయ్యాడు. చారిత్రక అంశాలను కేవలం చారిత్రక గాథలుగా కాకుండా ప్రాంతీయ గౌరవానికి ప్రతీకలుగా ఈ నవలలో నిరూపించబడింది.
2.3. వర్తక వాణిజ్య అంశాల పరిశీలన
‘వీరకళింగం’ నవలలో వర్తక వాణిజ్య అంశాల ప్రస్తావన స్పష్టంగా కనిపిస్తుంది. కళింగ ప్రాంతం ప్రాచీన కాలం నుండి సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా అభివృద్ధి చెందింది. సముద్రమార్గాల ద్వారా ఇతర దేశాలతో ఏర్పడిన వాణిజ్య సంబంధాలు కళింగ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదపడ్డాయి. భారతదేశ తూర్పుతీరంలో కళింగదేశ నౌకాయానం ఒక ప్రత్యేక స్థానం పొందింది. నౌకాయానం ద్వారా దక్షిణ ఆగ్నేయాసియా దేశాలతో వర్తక వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. మసాలా దినుసులు, అటవీ ఉత్పత్తులు, లోహ వస్తువులు, వస్త్రాలు వంటి వస్తువుల వ్యాపారం అభివృద్ధి చెందింది. ఇవే కాకుండా విదేశాల నుండి మేలు రకమైన ఏనుగులు, గుర్రాలు దిగుమతి చేసుకున్నట్లు ప్రస్తావన ఉంది. తామ్రపర్ణి (శ్రీలంక) నుండి మేలి రకపు ఏనుగులను సింహపురం, దండకపురం రాజులు దిగుమతి చేసుకున్నట్లు నవలలో కలదు (దీర్ఘాసి 23-24).
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా వాణిజ్య నిర్మాణంలో భాగమైంది. రైతులు ఉత్పత్తి చేసిన పంటలు, కళాకారులు తయారు చేసిన వస్తువులు స్థానిక మార్కెట్ల ద్వారా వ్యాపించేవి. స్థానిక సంతలు, పోర్టు పట్టణాలు ఆర్థిక చైతన్యానికి కేంద్రాలుగా నిలిచాయి. దీనిపై నవలలో ఇలా ఉంది:
“కళింగపట్నం ఓడరేవులో దొరికే వస్తువులు కొనుగోలు చెయ్యాలనుకొనేవారు శాలివాటిక నుండి ధాన్యాగార మీదుగా కళింగపట్నం వరకు రహదారికి ఇరువైపులా ఉండే అంగళ్లలో వారికి కావలసిన పులిగోళ్లు, ఏనుగు దంతాలు, సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేస్తారు” (దీర్ఘాసి 26).
ఈ ప్రస్తావన ద్వారా కళింగ ప్రాంత వర్తక వాణిజ్య ఉన్నతి వ్యక్తమవుతుంది.
ఏదైనా ఒక ప్రాంతం లేదా దేశం అభివృద్ధిలో రోడ్లు, రవాణా సదుపాయాలు చాలా ప్రధాన భూమిక వహిస్తాయి. ఆనాటి కాలంలోనే కళింగ రాజులు వీటి ప్రాధాన్యతను గుర్తించినట్లు, కళింగ ప్రాంత రహదారులు రాజ్య ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదపడినట్లు నవలలో కలదు. ఉదాహరణకు సింహబాహుడు సింహపురం నుండి దండకపురం వరకు ఉండే రహదారిని నగర నిర్మాణంలో భాగంగా ఐదేళ్లపాటు కష్టపడి పూర్తి చేసి దీనికి జటపాళి రహదారి అని పేరు పెట్టారు. నవలలో ఇలా ఉంది:
“ఈ రహదారి వలన శాలివాటిక (శాలిహుండం) లో వాణిజ్యం అభివృద్ధి చెందింది. పర్యాటకం అభివృద్ధి చెంది సింహపురానికి ఆదాయం కూడా వస్తుంది. రహదారి పైన వాడవలస దగ్గర పన్నుకంచె ఏర్పాటుచేశారు. రథాలు, బగ్గీలు, గుర్రాల పైన వచ్చినవారు రహదారి పన్ను చెల్లించవలెను. పాదచారులు, ఎడ్లబళ్ళు మినహాయించబడినవి” (దీర్ఘాసి 27).
ఈ సందర్భంలో సామాన్య ప్రజానీకం జీవన వ్యవహారాలను కూడా పరిగణనలోకి తీసుకుని పన్ను విధించేవారని ఊహించవచ్చు.
సముద్ర వాణిజ్యం, కళింగ ప్రాంత రాజ్యాల ఆర్థిక స్థితిగతులను కూడా ఈ నవల ప్రస్తావించింది. సముద్ర ప్రయాణాలు, విదేశీ సంబంధాలు ప్రజలలో విశాల దృష్టిని పెంపొందించడం పాటు ప్రాంతీయ అస్తిత్వానికి అంతర్జాతీయ కోణాన్ని జోడించాయి.
2.4. పోరాట స్ఫూర్తి
‘వీరకళింగం’ నవలలో పోరాటస్ఫూర్తి ఒక ప్రత్యేక అంశం. కళింగ ప్రాంత ప్రజానీకం తమ స్వాతంత్ర్యం, గౌరవం, సంస్కృతిని కాపాడుకోవడానికి నిరంతరం పోరాడిన సమాజంగా ఈ నవల నిరూపించింది. మొదటగా దుర్యోధనుని భార్య భానుమతికి వెన్నుదన్నుగా నిలిచి కౌరవసేన వైపు పోరాడిన చరిత్ర కలిగిన సమాజంగా పేర్కొన్నారు (దీర్ఘాసి 166). బుద్ధుని దంత ధాతువుని నాశనం చేసి కళింగ ప్రాంతంలో వైదికాన్ని బలపరచాలన్న ఉద్దేశంతో ఉజ్జయిని పాలకుడైన మోక్షధర నరేంద్రుని ఆధ్వర్యంలో దంతపురంపై దండెత్తిన సైన్యం నుండి దంత ధాతువును ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నాటి దంతపుర పాలకుడు గుహశీవుడు తన కుమార్తె, అల్లునికి దంతధాతువును అప్పజెప్పి తామ్రపర్ణి (శ్రీలంక) ప్రాంతానికి చేర్చి అక్కడ మహాసేనుడికి అప్పగించమని వారిని సముద్ర మార్గంలో పంపి, ఆ తరువాత శిరస్సు ఖండించుకొని ఆత్మ త్యాగం చేసుకున్నాడు (దీర్ఘాసి 185-187). ఈ విశ్లేషణ ద్వారా ఈ ప్రాంత పాలకులు, ప్రజలు నమ్మిన ధర్మం కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని వీరధనులుగా మనం అర్ధం చేసుకోవచ్చు.
ప్రాచీన భారతదేశ చరిత్రలోనే అత్యంత విశిష్ట స్థానం పొందిన కళింగ యుద్ధంలో ఈ ప్రాంత ప్రజల ధైర్య సాహసాలను ఈ నవల ఉత్తమంగా చిత్రించిందనటంలో అతిశయోక్తి లేదు. అశోకుడితో వార్తాహరులు యుద్ధ విశేషాలు చెప్పే సందర్భంలో ఇలా ఉంది:
“ప్రభూ ఈ యుద్ధం ఇద్దరు రాజుల మధ్య యుద్ధంగా ఎవరూ భావించడం లేదు. అశోక చక్రవర్తికి, కళింగ ప్రజానీకానికి మధ్య యుద్ధమని ప్రతి వాడు భావిస్తున్నాడు. బానిస మనస్తత్వాన్ని పెంచి పోషించే రాచరిక వ్యవస్థకు, స్వేచ్ఛాయుత జానపద జీవనానికి మధ్య జరుగుతున్న పోరుగా భావిస్తున్నారు. కళింగనేల మొత్తం తనను తాను ఆత్మాహుతికి సిద్ధం చేసిన సైనికునిలా తయారు చేసుకుంది” (దీర్ఘాసి 231).
ఇలా చెప్పడం ద్వారా ఈ ప్రాంతపు సమాజంలో స్వేచ్ఛాభిలాష, ప్రతిఘటన స్వభావం ప్రతి ఒక్కరిలో ఉన్నట్లు అర్ధం చేసుకోవచ్చు.
పోరాట చైతన్యం కేవలం యుద్ధాలకు మాత్రమే పరిమితం కాదు. అణచివేత, ఆత్మగౌరవం, సాధించితీరాలనే సంకల్పం వంటి అనేక సందర్భాలకు సంబంధించిన అంశంగా చెప్పవచ్చు. స్త్రీ పాత్రలలో కూడా పోరాటస్ఫూర్తి కనిపిస్తుంది. వారి ఆత్మగౌరవం, త్యాగం, ధైర్యం ఈ నవలలో ప్రముఖంగా నిలిచాయి. అశోకుడి భార్యలలో ఒకరైన కళింగ ప్రాంత ఆడపడుచు “కారువాకి” అభి పేరుతో మగ వేషధారణతో కళింగసేనలకు నాయకత్వం వహించి మౌర్యులకు వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు చిత్రించారు. నవలలో ఇలా ఉంది:
“అతడి నాయకత్వంలో స్త్రీ పురుషులు ఏకమయ్యారు. రైతులు శ్రామికులు, నావికులు, బిడారులు ఒక్క దళంగా ఏర్పడి దయానదికి సమీపంలో భీకరంగా యుద్ధం చేస్తున్నారు” (దీర్ఘాసి 233).
ఈ ప్రాంత ఆడపడుచులు వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనానికి ఇచ్చే ప్రాధాన్యతను ఈ సన్నివేశంలో అంతర్లీనంగా చిత్రించారు.
ఇక్కడి ప్రాంత ప్రజల పోరాట చైతన్యాన్ని ప్రాంతీయ ఆత్మగౌరవ ప్రకటనగా రచయిత ఈ నవలలో నిరూపించారు. ‘వీరకళింగం’ నవల ప్రాంతీయ పోరాట చైతన్యాన్ని సాహిత్య రూపంలో ఆవిష్కరించి ఉత్తరాంధ్ర ప్రజల సామూహిక పోరాట అస్తిత్వాన్ని మరింత స్పష్టంచేసింది.
2.5. సంస్కృతి అలవాట్లు
ఉత్తరాంధ్ర ప్రాంత సంస్కృతి అలవాట్ల వైవిధ్యంను కూడా ‘వీరకళింగం’ నవల ఆవిష్కరించింది. స్థానిక పండుగలు, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామూహిక జీవన విధానం, జానపదకళలు ప్రాంతీయ ప్రత్యేకతను తెలియజేస్తాయి.
2.5.1. పండుగలు
కార్తీక పౌర్ణమి నాటి కార్తీకదీపోత్సవం జరుగుతున్న వంశధార నదిలో “విదేశాలు వెళ్లిన మగవారు క్షేమంగా తిరిగి రావాలని ఆడవాళ్లు అరటి దొప్పలలో దీపాలు వెలిగించి వదులుతారు” (దీర్ఘాసి 208). కళింగ ప్రాంతంలో ఈనాటికీ బాలియాత్ర పేరుతో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనాటి నుండి వస్తున్న అస్తిత్వ ఆచారంగా భావించవచ్చు.
2.5.2. మతం
కళింగ ప్రాంతం అన్ని మతాలకూ ఆలవాలం. దండకపుర రాజు బ్రహ్మదత్తుడు బౌద్ధమతాన్ని, సింహపుర రాజు సింహబాహుడు జైనమతాన్ని ఆదరించగా రెండు రాజ్యాలలో వైదిక మతం చాప కింద నీరులా వ్యాపించి ఉండేదని స్పష్టంచేశారు (దీర్ఘాసి 25). ఆనాటి కాలంలోనే బ్రహ్మదత్తుడు సర్వమత సమ్మేళనం నిర్వహించినట్టు పేర్కొనడం (దీర్ఘాసి 41-52) ద్వారా కళింగ ప్రాంతంలో ముందు నుండి ఆధ్యాత్మిక చైతన్యం, సర్వమత సామరస్యం, పరమత సహనం కళింగ సంస్కృతి ముఖ్య లక్షణమని స్పష్టమవుతుంది. సంస్కృతి కేవలం ఆచారాల సముదాయం మాత్రమే కాదు; ప్రజల జీవన తత్వాన్ని వ్యక్తీకరించే సాధనంగా రచయిత చూపించాడు. ప్రాంతీయ సంస్కృతిని పరిరక్షించే సాహిత్య సాధనంగా “వీరకళింగం” నిలిచింది.
2.5.3. ఆహారం
కళింగ ప్రాంత ప్రజలు భోజనప్రియులు, అతిథి మర్యాదలు తెలిసినవారు. ‘వీరకళింగం’ నవలలో ఈ ప్రాంత ప్రత్యేక వంటకాలను ప్రస్తావించారు. దండపాణి (సింహపుర మంత్రివర్యులు) వస్తున్నాడన్న వార్త రాగానే ఇంద్రవర్ణుడు (దంతపుర మంత్రివర్యులు) ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రకరకాల ఫలహారాలు చేయించిన సందర్భంలో ఇలా ఉంది:
“మినప కుడుములు, చోడితోప, కొబ్బరిబూర్లు, కోడికూర, మేక మాంసం, తాటిముంజల తర్ని - భోజనాల బల్ల వంటల ప్రదర్శనశాలలా కనబడుతోంది” (దీర్ఘాసి 67).
ఈ ప్రస్తావన ఈ ప్రాంత ప్రత్యేకమైన చోడితోప, తాటిముంజల తర్ని వంటి వంటకాలను ఉటంకించింది. జన వ్యవహారంలో రాగి సంకటిని చోడితోప అని అనడం ఈ ప్రాంతంలో సర్వసాధారణం. అయితే రెండు రాజ్యాల మంత్రివర్యులూ వైదికమతాన్ని ఆచరించేవారు అయినప్పటికీ భోజన వంటకాలలో కోడికూర, మేక మాంసం చోటు చేసుకోవడం బట్టి నాటి వైదికమత ఆహార సంస్కృతిలో మాంసాహారం కూడా భాగంగా ఉన్నట్లు అర్థమవుతుంది.
2.5.4. జానపద కళలు
ఈ నవలలో జానపద కళారూపాలు కూడా ప్రముఖంగా కనిపిస్తాయి. ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాలలో రాత్రి భోజనాలు అయ్యాక బయలాట ప్రదర్శించే వారని వెల్లడించారు (దీర్ఘాసి 165). ఇందులో దుర్యోధనుని భార్య భానుమతి కళింగుల ఆడపడుచు అని, కురుక్షేత్ర యుద్ధ సమయంలో కళింగ సైన్యం కౌరవ పక్షాన పాల్గొన్నదని (దీర్ఘాసి 165), శబ్దభేరి విద్యలో వీరాధివీరులైన గదబలు, కోయలు, గోండులు, సోర (సవర) లను చూసిన పాండవులు పులిని చూసి వణికే పిల్లి కూనల్లా వణికి పోతారని బయలాట జానపద గేయం (దీర్ఘాసి 166-168) లో పేర్కొన్నారు. చిత్రాంగదుడు ధీర గంభీర సాహసవంతుడని, నిషాద కేతుమంతుడు పాండవుల పాలిట విషాదరూపుడని ఈ గేయంలో వర్ణించి; శ్రీకృష్ణున్ని మాయావిగా పేర్కొన్నారు. గత వీరుల గాథలను జానపద కళారూపాల ద్వారా తరతరాలకు అందించడం ప్రాంతీయ స్వాభిమాన నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
2.6. భాషా వివరాలు
ఈ నవలలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ మాండలిక పదాల వినియోగం పరిమితంగా ఉన్నప్పటికీ విషయాన్ని అర్ధవంతంగా చెప్పాలనుకున్న సందర్భంలో ప్రాంతీయ భాషా మాండలిక పదబంధాలు, సామెతల ద్వారా రచయిత ప్రాంతీయ సంస్కృతిని జీవింప చేశారు.
2.6.1. పదబంధాలు
- ఊజిన చెరువులా: “అస్తవ్యస్తం లేదా చిందరవందరగా ఉంది” అనే వ్యవహారంలో వాడతారు. ఈ నవలలో కళింగ యుద్ధంలో చనిపోయిన వారి మృతదేహాలు, తలలు తెగిపడి ఉన్న దృశ్యాన్ని వర్ణించే సందర్భంలో ఉపయోగించారు (దీర్ఘాసి 242).
- చెయ్యి సాగడంలేదు: “తన మాటకు విలువ/అధికారం లేదు/సాధ్యంకావడం లేదు” అన్న అర్ధంలో ఉపయోగిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న అశోకుని ఆదేశాలకు విలువ ఉండడం లేదు అని వ్యక్తపరిచే సందర్భంలో ఉపయోగించారు (దీర్ఘాసి 257).
- బెసకడం: జారడం. ఉండవలసిన చోటు నుండి అదుపు తప్పిపోవడం (దీర్ఘాసి 193).
- నేల విడిచి సాము: తమ స్థాయికి, శక్తికి మించిన పనులను తలకెత్తుకుని నష్టపోవడం (దీర్ఘాసి 53).
2.6.2. సామెతలు
- వ్రేళ్ళకు పట్టిన సుంకు ఆకుల్లో కనిపించినట్టు. మొదటితరం / పూర్వీకులు చేసిన తప్పుల కారణంగా తరువాతి తరం వారు శిక్షలు అనుభవించడం అని అర్ధం లో ఉపయోగించారు (దీర్ఘాసి 92).
- పెరధర్మం నీడలో బ్రతికే కన్నా పాము పడగ నీడలో బ్రతకడం క్షేమం. మనకంటూ ఒక హక్కులేనిచోట బ్రతికే కంటే చావడం మేలు అనే భావనలో ఉపయోగించారు (దీర్ఘాసి 136).
- ఇప్ప కల్లుకు నిప్పు పెట్టినట్లు. “అసలే కోతి ఆపైన కల్లు తాగింది” అనే అర్ధంలో ఉపయోగిస్తారు. కళింగులు అసలే తుంటరివారు. వారికి బౌద్ధం తోడైంది అనే విశ్లేషణ లో ఉపయోగించారు (దీర్ఘాసి 194).
- కాలు దువ్వే గుర్రం బండి లాగదు, బండి లాగే గుర్రం కాలు దువ్వదు. మాట్లాడేవాడు పనిచేయడు, పనిచేసేవాడు మాట్లాడడు అనే అర్ధంలో ఉపయోగించారు (దీర్ఘాసి 197).
- పండే పంటను మండే పొయ్యి నిర్ణయిస్తుంది. ప్రజలు తమ ఇళ్లలో రోజు ఏది వండుకుని తింటారో (మండే పొయ్యికి ఏం కావాలో), రైతులు పొలంలో దాన్నే పండించాలి. వంటగదిలో వాడలేని పంటను ఎంత కష్టపడి పండించినా ప్రయోజనం ఉండదు (దీర్ఘాసి 216).
ఉపసంహారం
‘వీరకళింగం’ నవల ఉత్తరాంధ్ర ప్రాంతీయ అస్తిత్వాన్ని నిరూపించిన ముఖ్యమైన చారిత్రక – సామాజిక నవలగా నిలుస్తుంది. భౌగోళిక స్వరూపం, చారిత్రక పరిణామాలు, వాణిజ్య విస్తరణ, ప్రజల పోరాటస్ఫూర్తి, సంస్కృతీ సంప్రదాయాల సమగ్ర ప్రతిబింబంగా ఈ నవలను భావించవచ్చు. ఈ నవల ద్వారా కళింగ ప్రాంత ప్రజల సామూహిక చైతన్యం, ప్రాంతీయ స్వాభిమానం, సాంస్కృతిక వైవిధ్యం స్పష్టమవుతుంది. ప్రాంతీయ నవలా సాహిత్యం కేవలం కథన నిర్మాణం కొరకు మాత్రమే కాకుండా సామాజిక – చారిత్రక సాక్ష్యంగా కూడా పనిచేస్తుందని ఈ నవల నిరూపిస్తుంది. ఉత్తరాంధ్ర నవలా సాహిత్యం ప్రాంతీయ అస్తిత్వ పరిశీలనలో ‘వీరకళింగం’ ఒక ముఖ్యమైన ఆధారగ్రంథంగా ఉపయోగపడుతుంది. భౌగోళిక స్వరూపం, చారిత్రక అంశాలు, వర్తక వాణిజ్యం, పోరాట చైతన్యం, సంస్కృతీ సంప్రదాయాలు వంటి అంశాలను సమన్వయం చేస్తూ ఈ నవల ప్రాంతీయ అస్తిత్వ అధ్యయనాలకు విలువైన ఆధారగ్రంథంగా నిలుస్తుంది.
“ఈ వీరకళింగం నవల ద్వారా డా. విజయభాస్కర్ ఒక కళింగాన్వేషణ మొదలుపెట్టాడు” (దీర్ఘాసి 11) అన్న వాడ్రేవు చినవీరభద్రుని మాటలు అక్షర సత్యం.
- ‘వీరకళింగం’ నవల ఉత్తరాంధ్ర ప్రాంత అస్తిత్వాన్ని, దాని భౌగోళిక నేపథ్యాన్ని స్పష్టంగా వివరిస్తుంది.
- కళింగ ప్రాంత చారిత్రక వైభవం, రాజ్య విస్తరణ, న్యాయపాలన వివరంగా చూపబడ్డాయి.
- సముద్ర వాణిజ్యం ప్రాధాన్యం, దాని వలన కలిగిన ఆర్థిక, సాంస్కృతిక ప్రగతి నవలలో విశదంగా ఉంది.
- పోరాట స్ఫూర్తి, ప్రజల ఆత్మగౌరవం, స్త్రీల ధైర్యం కళింగ సమాజ ముఖ్య లక్షణం.
- స్థానిక పండుగలు, మత సామరస్యం, ప్రత్యేక వంటకాలు, జానపద కళలు కళింగ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
- ప్రాంతీయ మాండలికాలు, సామెతలు రచయిత నవలలో చేర్చి స్థానికతను పెంచారు.
ఉపయుక్త గ్రంథసూచి
- అప్పారావు, గంధం. పరిశోధన పద్ధతులు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1993.
- ఎస్, జయప్రకాష్. పరిశోధన విధానం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1990.
- K.S., చలం. త్రికళింగ దేశ చరిత్ర. భూమి బుక్ ట్రస్ట్, 2021.
- రాధాకృష్ణ, బూదరాజు. తెలుగు మాండలికాలు శ్రీకాకుళం జిల్లా. తెలుగు అకాడమి, 2012.
- రామమోహనరాయ్, కడియాల. ఉత్తరాంధ్ర నవలా వికాసం-1. వెలుగు సాంస్కృతిక సంస్థ, 2005.
- వెంకటరావు, బగాది. సిక్కోలు సామెతలు – సంగతులు. శ్రీకాకుళసాహితి, 2015.
- విజయ భాస్కర్, దీర్ఘాసి. వీరకళింగం. సాహితీమిత్రులు, 2023.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

