AUCHITHYAM | Volume-07 | Issue-07 | June 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. తెలంగాణ పాట: బి.సి. వాదం
డా. అట్టెం దత్తయ్య
తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్
ఎస్వీ కళాశాల, ఢిల్లీ విశ్యవిద్యాలయం
న్యూ ఢిల్లీ.
సెల్: +91 9494715445, Email: dattaiaha@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.05.2025 ఎంపిక (D.O.A): 30.05.2025 ప్రచురణ (D.O.P): 01.06.2026
వ్యాససంగ్రహం:
ఈ శీర్షిక బి.సి.ల అస్తిత్వాన్ని, వారి పాటల ద్వారా వ్యక్తమయ్యే పోరాట స్ఫూర్తిని సమర్థంగా ప్రతిబింబిస్తుంది. బిరుదురాజు రామరాజు సంపాదకత్వంలో వచ్చిన 'త్రివేణి' వంటి కొన్ని ప్రచురణలలో బి.సి. కులాలకు సంబంధించిన పాటలు లభిస్తున్నప్పటికీ, అన్ని ఆశ్రిత గాయక కులాలకు సంబంధించిన సాహిత్యంపై పూర్తిస్థాయి సేకరణ గాని, పరిశోధన గాని జరగలేదు. ఇతర ఆశ్రిత గాయక కులాలపై పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో, బి.సి. కులాలపై ఈ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిశోధన గూడ అంజయ్య, గోరటి వెంకన్న, జయరాజు, దర్వు ఎల్లన్న, కందికొండ, బండి సత్తెన్న, మిత్ర, చెరబండ రాజు, అందెశ్రీ, స్ఫూర్తి, కె.కె. గౌడ్, మాష్టార్జీ, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, ముకురాల రామారెడ్డి, సుద్దాల అశోక్‌తేజ, రాస భూమయ్య, శమశ్రీ, నకిరేకంటి శీనయ్య వంటి ప్రముఖ కవుల రచనల నుండి, ప్రచురిత గ్రంథాల నుండి, యూట్యూబ్ వంటి మాధ్యమాల నుండి బి.సి. కులాల అస్తిత్వాన్ని ప్రతిబింబించే పాటలను సేకరించింది. ఈ పాటలు పరోక్షంగా విషయదాతలుగా ఆశ్రిత గాయక కులాల మౌఖిక సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. ఈ పరిశోధన గుణాత్మక విశ్లేషణ పద్ధతిని అవలంబించింది. సేకరించిన పాటల ఆధారంగా, బి.సి. కులాలైన గొల్లకురుమలు, ఉప్పరులు, మున్నూరుకాపులు, ముదిరాజులు, దర్జీలు, ఆరెకటికలు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, కుమ్మరులు, గౌండ్లు, వడ్డెరులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, గంగపుత్రుల జీవితాలను, వారి వృత్తులను, శ్రమను, సామాజిక దోపిడిని, అస్తిత్వ పోరాటాలను ఎలా చిత్రించాయో అధ్యయనం చేసింది. పరిశోధన ప్రణాళికలో భాగంగా, ప్రతి బి.సి. కులం సామాజిక-ఆర్థిక పరిస్థితులను, ప్రపంచీకరణ ప్రభావాలను, రాజ్యాధికార ఆకాంక్షలను పాటల ద్వారా వెలికితీసేందుకు ప్రయత్నించబడింది. బి.సి. ఆశ్రిత గాయక కులాల సంపూర్ణ మౌఖిక సాహిత్య సేకరణ ఇంకా పూర్తిస్థాయిలో జరగకపోవడం ఒక ప్రధాన పరిమితిగా నిలుస్తుంది. ఈ పరిశోధన ద్వారా బి.సి. పాటలు ఆయా కులాల చారిత్రక అస్తిత్వాన్ని, శ్రమగౌరవాన్ని, ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను, ఆర్థిక అస్థిరతను, ప్రపంచీకరణ ప్రభావాలను, వృత్తి సంక్షోభాన్ని బలంగా వ్యక్తపరుస్తున్నాయని తేలింది. ఈ పాటలు కేవలం బాధలను చెప్పడం వరకే కాకుండా, ఆత్మగౌరవ చైతన్యాన్ని, బహుజన ఐక్యతను, రాజ్యాధికార ఆకాంక్షను ప్రజ్వలింపజేస్తున్నాయని ఫలితాలు స్పష్టం చేశాయి. మౌఖిక సంప్రదాయాలను లిఖిత రూపంలోకి తీసుకురావడం, కాలక్రమేణా మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులలో వృత్తుల సంక్షోభం, వాటిని పాటలలో ప్రతిబింబించే విధానం పరిశోధనలో సవాలుగా నిలిచాయి. ఈ పాటలు బి.సి. ఉద్యమాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. భవిష్యత్తులో మిగిలిన బి.సి. కులాలపై సమగ్ర పరిశోధనలు చేపట్టాలి. వారి మౌఖిక సాహిత్య సంపదను రక్షించి, భద్రపరచాలి. బి.సి.ల రాజ్యాధికార సాధనకు, సామాజిక న్యాయానికి ఈ సాహిత్య విశ్లేషణలు దోహదపడాలి.
Keywords: బి.సి. అస్తిత్వం, జానపద గేయాలు, కులవృత్తులు, సామాజిక న్యాయం, రాజ్యాధికారం, తెలంగాణ సాహిత్యం, మౌఖిక సంప్రదాయాలు, బహుజన ఉద్యమాలు
1. పరిచయం
పాటకు, మానవుడికి విడదీయరాని బంధం పెనవేసుకుంది. పుట్టినప్పటి నుండి జోలపాటలు, పక్షుల కిలకిలరావాలు వింటూనే మనిషి జీవిస్తున్నాడు. గుండెకు చెవి ఉన్న ప్రతి మనిషి సృష్టిలోని అద్భుత లయను వింటూ పారవశ్యంతో మునిగి తేలుతుంటాడు. పాటకు హృదయాలను కదిలించే, కరిగించే శక్తి ఉంది. అది ఆలోచింపజేస్తుంది. పాషాణులను సైతం వెన్నపూసలా కరిగించే లక్షణం పాటకు ఉంటుంది. నిద్రాణమైన జాతిని మేల్కొలిపే గుణం పాటకు ఉంటుంది. (‘తెలంగాణ సాహిత్య పీఠికలు’ 244) ఇంతటి శక్తివంతమైన పాట బి.సి.ల గురించి విరివిగా వచ్చినప్పటికీ, గ్రంథస్థం కాకపోవడం చింతనీయం. జానపద పాట మౌఖికంగా బి.సి. ఆశ్రిత కులాల ద్వారా పాడబడటం, కథ రూపంలో చెప్పబడటం తరతరాలుగా జరుగుతూనే ఉంది. అయితే అదంతా లిఖిత రూపంలో వచ్చినప్పుడు బి.సి.ల అసలైన కష్టాలు, సాహసాలు, పూర్వ వైభవాలు గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంది.
సామాజికంగా చూస్తే ప్రతి బి.సి. కులానికి ఒక ఆశ్రిత గాయక కులం ఉంది. కొన్ని కులాలకు ఒకటికంటే ఎక్కువ ఆశ్రిత కులాలు కనిపిస్తాయి. గొల్లలకు మందెచ్చులు, పొడపోతులవారు, గొల్లభాగవతులు, గొల్లసుద్దులు, గంగిరెద్దులవారు, బిచనివాళ్ళు ఆశ్రిత గాయక కులాలు. పద్మశాలి వారికి సాధనశూరులు, కూనపులిగాండ్లు, సమయంవారు, పడిగరాజులు ఉంటారు. విశ్వకర్మలకు రుంజలవాళ్ళు, పనసవాళ్ళు. గౌడులకు గౌడసెట్లు. ముదిరాజులకు పాండవుల వారు, కాకిపడగలవారు. కుమ్మర్లకు పెక్కరులు, కులంబిడ్డలు. మంగలివారికి అడ్డసీమవాళ్ళు, అడ్డపవాళ్ళు. రజకులకు గంజికూటివాళ్ళు, పటంచగాళ్ళు మొదలైన బి.సి. కులాలకు వివిధ ఆశ్రిత గాయక కులాల వారు కనిపిస్తున్నారు. వీరు ఆయా కులాల వీరులు, సాహసికులు, నాయకులు, దాతల గురించిన గాథలను గానం చేస్తారు. కానీ ఇప్పటికీ అన్ని బి.సి. కులాలకు సంబంధించిన ఆశ్రిత గాయకుల గురించి కాని, వారు గానం చేసిన సాహిత్య సేకరణ కాని, పరిశోధన కాని పూర్తిస్థాయిలో జరగలేదు. ఇతర ఆశ్రిత గాయక కులాలకు సంబంధించిన పరిశోధనలు కావల్సినంత జరిగాయి, జరుగుతున్నాయి. అంతెందుకు ఇప్పుడు కొన్ని బి.సి. కులాల వారికి వారి ఆశ్రిత గాయక కులం ఏది, వారి సంప్రదాయం ఎలా ఉంటుంది అనే విషయం తెలియదు.
బి.సి.ల మూలాలు, అవమానాలు, సాహసాలను గానం చేసిన మౌఖిక సాహిత్యాన్ని వెలికి తీయాల్సిన అవసరం ఉంది. వారి గేయ సాహిత్యంలో బి.సి.ల పూర్వపు అస్తిత్వాన్ని అధ్యయనం చేసి, వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఉంది. ఇంతటి అనంతమైన మౌఖిక, జానపద సాహిత్యం అచ్చులోకి వచ్చినప్పుడే బి.సి.ల అసలైన అస్తిత్వం సాహిత్యం తెలుసుకున్నవాళ్ళం అవుతాం. ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన వివిధ రకాల సాహిత్య ఉద్యమాల విస్తరణ జానపద సాహిత్యంలోనే కనిపిస్తుంది. ఈ అస్తిత్వ ఉద్యమాలను కూడా పూర్వ మూలాల నుండి పరిశీలించడం అవసరం అని అనిపిస్తుంది. బిరుదురాజు రామరాజు ఇతర సంపాదకత్వంలో వచ్చిన ‘త్రివేణి’ పుస్తకంలో వివిధ బి.సి. కులాల పాటలు కొన్ని లభిస్తున్నాయి. ప్రచురణ పొందిన, ప్రచారం పొందిన కొన్ని పాటలలో బి.సి. కులాల అస్తిత్వం గురించి చూద్దాం.
2. బి.సి. కులాల అస్తిత్వాన్ని తెలిపే పాటలు
2.1. గూడ అంజయ్య, జయరాజు పాటలలో బహుజన బాధలు
జర్మను భాషలోని సుభాషితం "ప్రతి వస్తువులోనూ ఒక పాట నిద్రిస్తూ ఉంటుంది. ప్రతి వస్తువూ ఆ పాటను స్వప్నిస్తూ ఉంటుంది." అని తెలిపినట్లు అన్ని విషయాలకు సంబంధించిన పాట మనకు కనిపిస్తుంది. గూడ అంజయ్య 'అవ్వ... రాజవ్వొ...' పాటలో కులవృత్తులు ధ్వంసం కావడం వలన వారి బతుకులు విచ్ఛిన్నం అవుతున్న తీరును చిత్రించాడు:
సాకలిపొయ్యి కూలిపోయే – అయ్యో
మంగాలికల పేడవోయె - అయ్యో
నేత మగ్గాలు మూలవడిపోయె – అయ్యో
పరుపుతాడి చెట్టు గొడ్డువాయె - అయ్యో... (అంజయ్య 14)
అంతేకాదు, మరోపాట 'బావయ్యో... బావయ్యో' లో పల్లెలు విడిచి వలసలు పోతున్నారని వాపోయాడు:
కుమ్మరోల్ల సారెవాయె
కమ్మరి కొలిమారిపాయె
నేతమగ్గం మాగిపాయె
ఇంటిదీపమారిపాయె
బావయ్యో... చేతివృత్తుల చేతులిరిగె... (అంజయ్య 14)
అని గూడ అంజయ్య చేతివృత్తుల వారి జీవితాలలోని కష్టాలను వ్యక్తపరుస్తాడు.
ప్రజాకవి జయరాజు బి.సి. కులాలను గురించి ఒకే పాటలో పలికించాడు:
గడ్డాలు మీసాలు గీసి/ గుడ్డల్ని శుభ్రంగ ఉతికి/ వండె గుండిల్ని చేసి/ వంటా వార్పుల నేర్పి/
మనిషిని మనిషిగ చేసి/ మమతాను రాగాలు పంచి/ పెదవుల్లా నగవుల్ని చిలికి/ ప్రేమతో హృదయాన్ని తాకి/ బహుజనులే మన ప్రేమ పావురాలు/ బహుజనులే మన శాంతి కపోతాలు (జయరాజు 30)
మలినాలను మాత్రమే కాదు, మనిషిని సైతం పరిశుభ్రం చేసి, సమాజం లోని సకల శ్రమను చేసింది బిసిలే. నిజానికి వీరు చేసే ఉత్పత్తి, సేవను మించిన పనులు ఇంకేముంటాయి? ఇంత గొప్ప పనులను బహుజనులే చేస్తే, వాటి ఫలితం, సుఖం, సంతోషం మాత్రం సమాజంలో అగ్రకులాలుగా చెలామణి అవుతున్నవారు, ఉత్పత్తిలో భాగం కానివారు పొందుతున్నారు. తిరిగి వారిపైననే అహంకారపూరితమైన అధికారం చెలాయిస్తున్నారు.
రాళ్ళపై శిల్పాలు చెక్కి రక్తాన్ని చిత్రాలు గీసి/ అలలపై పడవల్ని నడిపి/ అనంత లోకాల కేగి/
దిక్కుల్ని కలిపింది వీల్లు/ ఒక్కటిగ నడిపింది వీల్లు/ వీరులకు వీరులు వీల్లు/ విజయాన్ని ముద్దాడినోల్లు/ బహుజనుడే రాజులకు రాజునాడు/ బహుజనుడే ఈ రాజ్యమేలేటోడు (జయరాజు 31)
రాళ్ళకి సైతం ప్రాణం పోసి నాగరికతను చరిత్రకు అందించింది కూడా బిసిలే. అలలపై పడవలు నడిపి ప్రయాణాలను సాధ్యం చేసిన సాహసులు బిసిలే. కనుక ఇన్ని పనులను చేస్తూ సమాజాన్ని నడుపుతున్న బిసిలే రాజ్యమేలాలని ఈ పాటలో జయరాజు ఆకాంక్షిస్తున్నాడు.
2.2. ఇతర కవుల పాటలలో బి.సి. వృత్తులు, అస్తిత్వం
సమాజానికి సరిపోయే సరుకులు, కనీస అవసరాలను అందిస్తున్నది బహుజనులే. అలాంటప్పుడు ఏమి ఉపయోగపడని కులం వారు అధికారం చెలాయించడం ఎందుకు? ఈ మోసపూరిత కుట్రకు తెరదించి, చైతన్యంతో అధికారం చేజిక్కించుకోవాల్సిన అవసరం ఉంది. దర్వు ఎల్లన్న రాసిన "ధరణిలొ సిరులెల్లను దొరగాళ్ళ కరగని తిండాయెరో..." అంటూ సాగే పాట అనేక బి.సి. కులాల ఆకలిని వ్యక్తపరుస్తుంది:
మండెటి ఎండలోన గుండెలె/ బండలై పగిలేసినా
బంగ్లాల వాడాయెరో/ నీ బతుకు బండాల పాలాయెరో ॥ధరిణి॥
కుల్లు కంపు కొట్టెటి బట్టలు/ మల్లెమొగ్గొలె వుతికితే
సోకు సొంపు మీకురో/ ఈ పాసిపొయిన బువ్వమాకురో (ఎల్లన్న)
బండలకు ఎన్ని అలంకారాలు అద్ది భవంతులు, బంగళాలు నిర్మించినా వారి జీవితాలు మాత్రం బండమీద గుడిసెలకే పరిమితం అయ్యాయి. ఎంతటి మురికి బట్టలను ఉతికి మెరిపించినా మిగిలిన పాచి బువ్వవేయడమే కాని వారి శ్రమను గౌరవించే తీరు మాత్రం కనబడదు. అలాగే ఈ పాటలో గౌడులు, నాయిబ్రాహ్మణులు, కుమ్మరులు, పద్మశాలీలు గురించి తెలిపిన విషయాలు బిసిలను చైతన్యవంతం చేస్తున్నాయి.
కందికొండ పాట సబ్బండ బి.సి. కులాల అస్తిత్వ గానమై పలుకుతుంది:
బాఫూలే వారసులం/ పెరియారు సైనికులం
నాగరికత నిర్మాతలం/ మేం బి.సి.లం
సబ్బండ కులాలం/ భూమిదున్నె హలాలం
చిగురించె పొలాలం/ మేం బి.సి.లం
రాయిచెక్కె శిల్పులం/ కుండ చేసె కుమ్మరులం
నగలు జేసె కంసాల్లం/ మేం సైంటిస్టులం
మేదరులం మేరొల్లం/ మున్నూరు కాపొల్లం
చాకలిలం మంగలిలం పెరికొళ్ళం/ ఉత్పత్తి కులాలం భూమిదున్నె హలాలం
గొర్లుసాదె కుర్మోళ్లం/ బర్లుసాదె గొళ్ళొల్లం
చేపపెంచె బెస్తొళ్ళం... (కందికొండ)
బి.సి.ల కోసం జీవితాంతం పోరాడిన పూలే వారసులం అని పాట మొదలు పెట్టడంతోనే కవి ఏమి చెప్పదల్చుకున్నాడో అర్థమవుతుంది. ఏ దాపరికం లేకుండా, ముసుకులో గుద్దులాటలా కాకుండా ఇక తమ కోసం తాము పోరాడుతామని తెగేసి చెప్పినట్లుంది. పెరియారు సైనికులం అనడంలో ఇంకొక అడుగు ముందుకేసి ఉత్తర భారత బ్రాహ్మణాధిపత్యానికి, దోపిడికి వ్యతిరేకంగా నికరంగా నిలబడతామన్న అర్థం సూచ్యంగా వ్యక్తమవుతుంది. ఈ పాట బిసి ఉద్యమానికి ఒక మార్గదర్శనం అని చెప్పవచ్చు.
మరో పాట బి.సి. కులాల వారందరికీ తమ శక్తిని గుర్తు చేస్తూ, ప్రేరణ కలిగించి ఐక్యత నింపుతూ రాజ్యాధికారానికి పురికొలుపుతుంది:
చలో చలో చలో చలో బిసి/ నీవే నీ తలరాతను రాసుకోలేసి
60శాతం ఉండి అడుక్కునుడు ఏంది/ ఎవడో బిచ్చం ఏస్తే చెయ్యి సాపుడేంది
ఓటేసి రోబోలా అయ్యాం మనమేంది/ రాజకీయ అంటరాని బతుకు మనకు ఏంది (కందికొండ)
బిసిలను రాజకీయంగా తమ కాళ్లమీద తాము నిలబడాలని ఈ పాట కోరుకుంటుంది. ఈ కాలంలో కందికొండ బిసి చైతన్యానికి కృషి చేస్తూ మంచి ప్రభావశీలమైన పాటలు రాశాడు.
బండి సత్తెన్న బి.సి. వృత్తి కులాల వారందరినీ ఏకం చేస్తూ, ప్రేరేపిస్తూ, వారి మీద జరుగుతున్న అన్యాయాన్ని గుర్తుచేస్తూ 'కులవృత్తులూ జేసెటోడా' అనే పాట రాశాడు:
కులవృత్తులూ జేసెటోడా ఓరన్నా/ కూటికి సరిపోని వాడ మాయన్న
కులమతాలేవైన కూలిదోపిడి దార్ల/ కుట్రలూ ఎదిరించలేరా మాయన్న... (సత్తెన్న 108)
ఈ పాటలో వడ్డెరులు పూట గడవడానికి పడుతున్న కోటి బాధలు, రజకులు పాచిబువ్వకు పాకులాడుతున్న విధానం, మంగలులకు సరైన తిండిలేని తిప్పలు, కుమ్మరులు, కమ్మరులు, పద్మశాలీలు, గీతకార్మికులు ఇలా బిసిలందరి కనపడని జీవిత కష్టాలను వెలుగులోకి తెస్తాడు.
తెలంగాణలో పాట అంటేనే విప్లవం. ఆ విప్లవం కుల, వర్గ పోరాట మార్గంలోకి మలుపు తీసుకున్న తర్వాత పాట కూడా ప్రత్యేకంగా కులాలను గానం చేయడం ప్రారంభమైంది. వారివారి జీవిత కష్టాలను కుల అస్తిత్వ కోణంలో వినిపించడం పెరిగింది, చైతన్య పరిచింది, ఉద్యమాలకు ఉసిగొల్పింది. ఇలాంటి పాటలను కొన్నింటిని పరిశీలించే ప్రయత్నం చేద్దాం.
3. వివిధ బి.సి. కులాల పాటల పరిశీలన
3.1. గొల్లకురుమలు
బిసివాద సాహిత్యంలో గొల్లకురుమల జీవితం శ్రమ, ప్రకృతి, సంస్కృతి, అస్తిత్వ పోరాటాల సమ్మేళనంగా ప్రతిఫలిస్తుంది. పశుపోషణను ఆధారంగా చేసుకుని జీవించే ఈ వర్గాల జీవితం కేవలం వృత్తి పరిమితిలో కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, ఆహార ఉత్పత్తికి, సంస్కృతికీ పునాదిగా నిలిచింది. అయితే సమాజం వీరి శ్రమను వినియోగించుకున్నప్పటికీ, సామాజికంగా వెనుకబడిన వర్గాలుగానే చూసింది. బిసివాద సాహిత్యం ఈ విరుద్ధతను ప్రశ్నిస్తూ గొల్లకురుమల శ్రమ గౌరవం, వారి ఆత్మగౌరవ చైతన్యాన్ని సాహిత్య కేంద్రంగా నిలిపింది. గోరటి వెంకన్న రచించిన 'యలమంద' పాటలో జీవాల కాపరిగా అడవుల్లో తిరిగే గొల్లకురుమ బాలుడి కష్టాన్ని సహజత్వంతో చిత్రిస్తాయి ఈ పాదాలు:
అంగిలేనొంటిపై గొంగడేసుకుండు/ ఆడ్డపంచెను బుడ్డగోసిగా పెట్టిండు
కిర్రుతోల్ల జోళ్లు కాళ్లకు తొడిగిండు (వెంకన్న)
సుద్దాల హనుమంతు రచించిన 'పల్లెటూరి పిల్లగాడా' పాటలో కాపరి జీవితం గ్రామీణ శ్రమజీవి వాస్తవికతకు ప్రతీకగా నిలుస్తుంది. ఏపూరి సోమన్న రాసిన "ఎంతముద్దుగున్నడో గొల్లాకుర్మపోరడు" (సోమన్న) అనే పాట గొల్లకురుమల వేషధారణ, జీవన రీతి, శ్రమ సౌందర్యాన్ని ఆవిష్కరిస్తుంది. "మందబెట్టి ఎరువుజేసి పంటకు బలము ఇచ్చి" (సోమన్న) అనే పాదం పశుపోషణ వ్యవసాయానికి ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ఈ విధంగా గొల్లకురుమల జీవితం ప్రకృతి, పశుసంపద, వ్యవసాయం మధ్య అనుబంధాన్ని బిసివాద సాహిత్యం వెలుగులోకి తెస్తుంది.
అలాగే ఈ సాహిత్యం గొల్లకురుమలపై జరిగిన సామాజిక–ఆర్థిక దోపిడిని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, ఉద్యమ చైతన్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. మిత్ర రాసిన "తోడేలు మీద వడితె - నష్టమిచ్చిందెవ్వడు/ గొర్రెలాకు రోగమొస్తె - మందులిచ్చిందెవ్వడు" (మిత్ర 312) అనే పాట గొర్ల కాపర్ల జీవన అస్థిరతను తెలియజేస్తుంది. "పుల్లరెట్ల గడ్తుమూ - గోసులోల్లం గొంగడోల్లం" (మిత్ర 312) అనే పాదం ప్రభుత్వాల అన్యాయ విధానాలపై నిరసన వ్యక్తం చేస్తుంది. జయధీర్ తిరుమలరావు పేర్కొన్నట్లు "భిన్న అస్తిత్వవాద భావాలను, వర్గవాదాన్ని కలిపి కొత్తశక్తి నింపిన పాటలు" (గౌరీశంకర్ 80) బిసివాద ఉద్యమ సాహిత్యంలో కీలకస్థానం సంపాదించాయి. టి. కృష్ణమూర్తి యాదవ్ రచించిన "గొల్ల కురుమ కులపోళ్లం/ చెట్లపొంటి గట్లపొంటి..." (కృష్ణమూర్తి యాదవ్ 93) అనే పాట గొల్లకురుమల జీవన విధానం, ఉన్నినేయడం, చిన్నవ్యవసాయం వంటి ఉపవృత్తులను చారిత్రక పత్రంలా నమోదు చేస్తుంది. ప్రభంజన్ కుమార్ యాదవ్ "యదువీర లేవరా/ నిజం తెలిసి మసలరా" (ప్రభంజన్ కుమార్ యాదవ్ 93) అని పిలుపునిస్తే, ననుమాస స్వామి "గొడ్డలి నూరి గొంగల్ల బెట్టి/ గొల్లలనంతా దండుగ జేసి/ రాజ్యం కోసం పోరాడరన్నా..." (స్వామి 95) అంటూ రాజకీయ చైతన్యాన్ని ప్రేరేపించాడు. ఈ విధంగా గొల్లకురుమలపై వచ్చిన బిసివాద సాహిత్యం శ్రమజీవి వాస్తవికతను మాత్రమే కాకుండా, ఆత్మగౌరవం, అస్తిత్వం, హక్కుల సాధన, రాజ్యాధికార చైతన్యాన్ని కూడా బలంగా ప్రతిధ్వనింపజేస్తుంది.
3.2. ఉప్పరులు
బిసివాద సాహిత్యంలో ఉప్పరుల వృత్తి శ్రమకేంద్రిత సృజనాత్మక జీవన విధానానికి ప్రతీకగా నిలుస్తుంది. మట్టితో మమేకమై, సమాజానికి నివాసాలను నిర్మిస్తూ జీవించే ఈ వర్గం గ్రామీణ–పట్టణ జీవన నిర్మాణానికి పునాదిగా ఉన్నప్పటికీ, వారి శ్రమకు తగిన గుర్తింపు లభించలేదు. చెరబండ రాజు రచించిన 'ఏకులమబ్బి!' పాటలో ఉప్పరుల కఠోర శ్రమను, నిర్మాణ కళను సరళమైన భాషలో హృద్యంగా వ్యక్తపరుస్తాయి ఈ పాదాలు:
మట్టి పిసికి ఇటుక చేసి / ఇల్లు కట్టి పెట్టినపుడు... (రాజు)
మట్టిని ఇటుకగా, ఇటుకను గోడగా, గోడను గూడుగా మార్చే ప్రక్రియ వెనుక ఉన్న శారీరక శ్రమతో పాటు వారి అనుభవజ్ఞానం కూడా ఈ పాదాల్లో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి విపత్తులు, ఎండలు, వానలు, ఇతర ప్రాణుల నుండి మనిషిని రక్షించే గృహాలను నిర్మించే ఉప్పరులు సమాజానికి అవసరమైన మౌలిక భద్రతను కల్పించే వర్గమని ఈ సాహిత్యం గుర్తిస్తుంది.
3.3. మున్నూరుకాపులు
మున్నూరుకాపుల జీవితం భూమితో ముడిపడిన శ్రమజీవి అస్తిత్వానికి ప్రతీకగా కొన్ని పాటలు నిలుస్తాయి. వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుని సమాజానికి ఆహార భద్రతను అందించిన ఈ వర్గం చారిత్రకంగా శ్రమజీవులుగానే మిగిలిపోయిందని ఈ పాటలు తెలియజేస్తున్నాయి. మిత్ర రచించిన 'నిత్యాన్నదాతా' పాటలో మున్నూరుకాపుల చారిత్రక మూలాలు, వారి సామాజిక పాత్రను ప్రశ్నాత్మకంగా గుర్తుచేస్తాయి ఈ పాదాలు:
ఏ రాజ్యరక్షణలో మున్నూరు సేవవో/ సరిహద్దుగాపాడె ఎల్లాపువైతివో (మిత్ర 331)
"దేశ నలుమూలల నేలతో బంధమో/ ఊరును పంటను కాపాడే చందమో" (మిత్ర 331) అనే పాదం భూమితో, పంటతో, గ్రామ జీవితంతో మున్నూరుకాపుల అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. అలాగే ఈ సాహిత్యం వ్యవసాయ శ్రమను కేవలం వృత్తిగా కాక, సమాజ పోషణకు పునాదిగా చిత్రిస్తుంది. "కాపు దానపు ఇంట/ కను పైరుపంటా/ వృత్తులన్ని కలిసె వ్యవసామంట" (మిత్ర 331) అనే పాదాల్లో వ్యవసాయం అనేక వృత్తుల సమష్టి కృషితో సాగుతుందనే భావన వ్యక్తమవుతుంది. "ఓ కృషీవలుడా నిత్యాన్నదాతా" (మిత్ర 331) అనే పిలుపు రైతు శ్రమకు గౌరవం తెలిపే బిసివాద దృక్పథానికి నిదర్శనం. చెరబండరాజు దారిద్ర్యాన్ని, ఆకలిని, కానీ అదే సమయంలో సమాజానికి అన్నం పండించే వారి త్యాగాన్ని హృదయ విదారకంగా ఆవిష్కరిస్తాడు:
మాడు చెక్కలే తింటూ/ మాగానం దున్నినపుడు/
డొక్కలెండి కోండ్రలేసి/ ధాన్యరాశులెత్తినపుడు (రాజు)
ఈ విధంగా మున్నూరుకాపులపై వచ్చిన బిసివాద సాహిత్యం శ్రమగౌరవం, వ్యవసాయ ఆధారిత జీవన పోరాటం, కుల అస్తిత్వ అన్వేషణ, సామాజిక ఐక్యత, రైతు ఆత్మగౌరవం వంటి అంశాలను బలంగా వినిపిస్తుంది.
3.4. ముదిరాజులు
ముదిరాజుల జీవితం ప్రకృతితో మమేకమైన శ్రమజీవి సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. అడవులు, చెరువులు, గుట్టలు, పండ్లతోటలు, చేపల వేట వంటి ప్రకృతి ఆధారిత జీవనోపాధులపై ఆధారపడి జీవించే ఈ వర్గం సమాజానికి ఆహార వనరులు అందించినప్పటికీ, వారి జీవితం మాత్రం ఆర్థిక అస్థిరతతో, సామాజిక నిర్లక్ష్యంతో సాగిందని ఈ పాటలు తెలియజేస్తున్నాయి. అందెశ్రీ రచించిన "తలమీద సుట్టాబట్ట/ ఆపైన పండ్ల తట్ట" అనే పాటలో తెనుగువారి జీవన విధానాన్ని సహజత్వంతో చిత్రించాడు. "పండ్లు పండ్లమ్మోయంటూ/ పల్లెంత తిరుగుకుంటూ" (అందెశ్రీ) అనే పాదాలు గ్రామాలన్నీ తిరుగుతూ అడవిపండ్లు అమ్ముకుని జీవించే వారి దైనందిన జీవితాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తాయి. జిట్టీతపండ్లు, అల్లనేరేడు, సీతాఫలాలు, సీమచింతపండ్లు, చింతచిగురు వంటి ప్రకృతి సంపదను ప్రజలకు అందించడం ద్వారా ముదిరాజులు గ్రామీణ ఆహార సంస్కృతిలో కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. బిసివాద సాహిత్యం ఈ వర్గాల శ్రమను కేవలం ఉపాధిగా కాకుండా, ప్రకృతి–మానవ సంబంధానికి ప్రతీకగా చిత్రిస్తుంది.
పాటలు ముదిరాజుల జీవనోపాధులపై ప్రపంచీకరణ, భూకబ్జాలు, ప్రకృతి వినాశనం చూపిన ప్రభావాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. మిత్ర రచించిన "ఊరిమీద పండ్లవనం – ఏమాయెరన్న/ సెరువు కుంటలన్ని కూడ – కూలిపోయెరన్న" (మిత్ర 321) అనే పాదాలు అడవులు, చెరువులు, ప్రకృతి వనరులు నశించడంతో ముదిరాజుల జీవనాధారం కూలిపోయిన దుస్థితిని తెలియజేస్తాయి. "గుట్టలన్ని తవ్విపోస్తే – బొందలాయెరన్న/ అడివంత నరికేస్తె మోడబాయెరన్న" (మిత్ర 321) అనే పాదాలు ప్రకృతి విధ్వంసం, దాని వల్ల వెనుకబడిన వర్గాల ఉపాధి సంక్షోభాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
వయ్యా సామేలు రాసిన "పుట్టలను పెట్టి పురుగులను పట్టీ/ జుంటు తేనెలను పెట్టె ముదిరాజా" (సామేలు 78) అనే పాట ముదిరాజుల అనేక జీవనోపాధులను నమోదు చేస్తే, బండి సత్తెన్న "ఫలములమ్మీ బతికేటోళ్ళము ముదిరాజులమూ" (సత్తెన్న 134) అని వారి అస్తిత్వ పోరాటాన్ని వ్యక్తం చేశాడు.
"పెద్దలంతా పెంచిన చెట్లు నరికిపించె పచ్చని నోట్లు/ నోట్లు యజమానికి గలిగె మానోట్లో మన్నే మిగిలె" (సత్తెన్న 134) అనే పాదాలు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రకృతి సంపదను స్వాధీనం చేసుకుని, అసలు ప్రకృతి ఆధారిత వర్గాలను ఆకలికి గురిచేసిందనే బిసివాద విమర్శను బలంగా వ్యక్తం చేస్తాయి. ఈ విధంగా ముదిరాజులపై వచ్చిన సాహిత్యం శ్రమగౌరవం, ప్రకృతి ఆధారిత జీవన విధానం, సామాజిక అసమానతలు, ప్రపంచీకరణ ప్రభావం, అస్తిత్వ పోరాటం వంటి అంశాలను గాఢంగా ప్రతిధ్వనింపజేస్తుంది.
3.5. దర్జీలు
బిసివాద సాహిత్య సిద్ధాంత దృక్పథంలో దర్జీల జీవితం శ్రమ, కళాత్మకత, ఆర్థిక అస్థిరతల సమ్మేళనంగా ప్రతిఫలిస్తుంది. ముడి బట్టకు రూపురేఖలు అద్దుతూ దానిని అందమైన వస్త్రంగా మలిచే దర్జీ వృత్తి సృజనాత్మక శ్రమకు ప్రతీక. అయినప్పటికీ ఈ కళాకారుల జీవితం మాత్రం పేదరికం, అనారోగ్యం, అస్థిర ఉపాధితో నిండిపోయిందని ఈ పాటలు తెలియజేస్తున్నాయి. స్ఫూర్తి రాసిన 'దర్జీవాళ్ళు' పాటలో దర్జీల నిరంతర శ్రమకూ, వారి జీవిత దుస్థితికీ మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఆవిష్కరిస్తుంది ఈ పాదం:
టక్క టక టక్క టక ఎంత కుట్టినా / చిరిగినట్టి బట్టలాగ బతుకులాయెరో... (స్ఫూర్తి 121)
"కొత్త బట్ట తీసుకొచ్చి - లెక్కతోటి గీత గీసి/ కత్తెరేసి చింపినాము – ముక్కలన్ని చేసినాము" (స్ఫూర్తి 121) అనే పాదాలు దర్జీ వృత్తిలోని క్రమశిక్షణ, కొలతల జ్ఞానం, కళాత్మక నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. "ఇంద్రధనుసులాగా మనం – కుట్టినంక మెరిపిస్తం/ సీతాకోక చిలుకలయితరు - ఆ తొడిగినోళ్ళు" (స్ఫూర్తి 121) అనే భావవ్యక్తీకరణ దర్జీలు సమాజానికి అందాన్ని అందిస్తున్న కళాకారులని స్పష్టం చేస్తుంది. బిసివాద సాహిత్యం ఇలాంటి వృత్తులను కేవలం సేవాపనిగా కాకుండా సృజనాత్మక శ్రమగా గౌరవిస్తుంది. అయితే సమాజానికి అందాన్ని అద్దే ఈ కళాకారుల జీవితం మాత్రం "మన బతుకే అతుకులాయెరో..." (స్ఫూర్తి 121) అనే పాదంలో వ్యక్తమైనట్లుగా చితికిపోయిన స్థితిలో ఉంది.
"కన్ను రెప్ప వేయకుండ – లైను వెంట లైను తోటి/ నడుము నొప్పి లేస్తున్న – రోజంత కుట్టుతాము" (స్ఫూర్తి 121) అనే పాదాలు దర్జీల శారీరక శ్రమను, వృత్తి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను హృదయ విదారకంగా చిత్రిస్తున్నాయి. "అద్దాలు కళ్ళకెక్కెరో - ఈ వయసులోనే/ మోకాళ్ళ నొప్పిలొచ్చెరా" (స్ఫూర్తి 121) అనే పాదం వారి జీవితాంత శ్రమను తెలియజేస్తుంది. కాలానుగుణంగా ఫ్యాషన్, వయస్సు, అవసరాలకు తగ్గట్టు కొత్త రూపకల్పనలు చేసే నైపుణ్యం ఉన్నప్పటికీ, ప్రపంచీకరణ ప్రభావంతో రెడీమేడ్ దుస్తుల మార్కెట్ పెరగడం వల్ల సంప్రదాయ దర్జీల జీవితం సంక్షోభంలో పడింది. ఈ విధంగా దర్జీలపై వచ్చిన పాటలు ప్రపంచీకరణ దుష్ప్రభావం, కార్మిక దోపిడి, శారీరక, ఆర్థిక వేదన వంటి అంశాలను బలంగా చిత్రించాయి.
3.6. ఆరెకటికలు
ఆరెకటికల జీవితం వృత్తి ఆధారిత అవమానం, సామాజిక వివక్ష, అస్తిత్వ పోరాటానికి ప్రతీకగా కనిపిస్తుంది. మాంస వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్న ఈ వర్గాన్ని సమాజం "కసాయిలు"గా హీనంగా చిత్రీకరించిన తీరును మిత్ర తన పాటలో ప్రశ్నించాడు. "ఆరెకటికల మీద నూరకుర కత్తిని/ కసాయి వాడంటు - తిడుతూ నా వృత్తిని" (మిత్ర 332) అనే పాదం వారి వృత్తిపట్ల సమాజ దురభిప్రాయాన్ని తెలియజేస్తుంది. "ఆర్యాది జాతులు మాంసాలు దింటిరా/ అది మెక్కి మమ్ములను కసాయిలంటిరా..." (మిత్ర 332) అనే పాదాల్లో మాంసాహారాన్ని స్వీకరించే సమాజమే, దానిని అందించే వృత్తి వారిని హీనంగా చూడటాన్ని కవి విమర్శించాడు. అలాగే ఈ పాట ఆరెకటికల ఆత్మగౌరవ చైతన్యాన్ని, సంఘటిత పోరాట అవసరాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. "మా బతుకు మెరుగయ్యె/ మార్కెట్లు గావాలి/ మేమెంతో మాకంత అధికారమందాలి" (మిత్ర 333) అనే పాదాలు ఆర్థిక స్వావలంబన, సామాజిక గుర్తింపు కోసం వారి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాయి. "సకల కులవృత్తులు అల్లుకుని లేవాలి" (మిత్ర 333) అనే పిలుపు బహుజన ఐక్యత భావనను తెలియజేస్తుంది. ఈ విధంగా ఆరెకటికలపై వచ్చిన పాట సాహిత్యం కులవృత్తి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి అంశాలను నిలదీస్తుంది.
3.7. విశ్వబ్రాహ్మణులు
పంచదాయీల జీవితం శ్రమ, కళానైపుణ్యం, సృష్టిశక్తికి ప్రతీకగా చిత్రితమవుతుంది. మిత్ర రచించిన "సృష్టికి ప్రతి సృష్టిరా/ విశ్వకర్మ దృష్టిరా/ పంచకర్మ పాటయె/ ప్రపంచగతిని చాటెరా..." (మిత్ర 327) అనే పాదాలు పంచకర్మల గొప్పతనాన్ని తెలియజేస్తాయి. కర్ర, ఇనుము, రాయి, బంగారం, వెండి వంటి పదార్థాలకు రూపురేఖలు ఇచ్చి సమాజ అవసరాలను తీర్చిన ఈ వర్గాలు వ్యవసాయం నుండి గృహనిర్మాణం వరకు ప్రతి రంగానికి పునాదిగా నిలిచాయి. "ఆ భూమి దున్నె నాగలి కర్రు కెవరు సారధి" (మిత్ర 327) అనే పాదం వ్యవసాయ నాగరికత వెనుక ఉన్న వారి కృషిని గుర్తుచేస్తుంది. బిసివాద సాహిత్యం ఈ వర్గాల శ్రమను కేవలం చేతిపనిగా కాకుండా సృజనాత్మక జ్ఞానంగా ప్రతిష్ఠిస్తుంది.
ఆధునిక యాంత్రీకరణ, పెట్టుబడిదారీ వ్యవస్థల ప్రభావంతో ఈ సంప్రదాయ వృత్తులు సంక్షోభంలో పడిన వాస్తవాన్ని కూడా ఈ పాటలు ఆవిష్కరిస్తాయి. "బంగారం పని చేసేటోళ్ళం/ అరె బతుకులేక బాధపడుతున్నము" (స్ఫూర్తి 125) అనే పాదం స్వర్ణకారుల దుస్థితిని తెలియజేస్తే, "ఇనుప కడ్డీగాల్చి కర్రుకొడవలి జేసి/ కడుపులోనికి మెతుకు కరువయ్యినోడ" (సత్తెన్న 109) అనే పాదం కమ్మరుల శ్రమకు తగిన ఫలితం లేకపోవడాన్ని ప్రశ్నిస్తుంది. "సృష్టికి ప్రతిసృష్టి జేసె/ విశ్వకర్మ లెమ్మురా/ రాజ్యాధికారానికి/ రుంజను మోగించురా" (మిత్ర 328) అనే పిలుపు విశ్వకర్మల ఆత్మగౌరవ చైతన్యం, రాజకీయ భాగస్వామ్య అవసరాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఈ విధంగా విశ్వబ్రాహ్మణులపై వచ్చిన పాటలు కళాత్మక సృజన, వృత్తి సంక్షోభం, సామాజిక న్యాయం, రాజ్యాధికార చైతన్యం వంటి అంశాలను బలంగా వ్యక్తపరుస్తున్నాయి.
3.8. పద్మశాలీలు
పద్మశాలీల జీవితం శ్రమ, కళాత్మకత, దోపిడి, అస్తిత్వ పోరాటాల సమ్మేళనంగా ప్రతిబింబిస్తుంది. చేనేత వృత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, తెలుగు సంస్కృతికి ప్రతీక అయినప్పటికీ, ప్రపంచీకరణ, కంపెనీల ఆధిపత్యం, పవర్‌లూం ప్రభావంతో ఈ వృత్తి తీవ్ర సంక్షోభంలో పడింది. మిత్ర రచించిన "నేత నేసే కార్మికులారా – బతికి సచ్చిన శ్రామికులారా / తెగిపోయిన దారాలైతిరా – మా యన్నల్లారా" (మిత్ర 278) అనే పాదాలు చేనేత కార్మికుల ఆత్మహత్యల వెనుక ఉన్న దారుణ జీవన వాస్తవాన్ని హృదయ విదారకంగా ఆవిష్కరిస్తాయి.
"రాట్నంపై కండెలు చుట్టి – కండలన్నీ కరిగిపాయే/ మగ్గంపై పోగులు అతికి – కంటిచూపు దగ్గరికొచ్చె" (మిత్ర 278) అనే పాదాలు నేతన్నల శారీరక శ్రమ, ఆరోగ్య సమస్యలను ప్రతిబింబిస్తాయి. గుండేటి రమేష్ "నరాలు దారాలు జేసె – నవశిల్పి నేతగాడె/ గుండెను కండెగజేసి – గుడ్డనేసె నేతగాడె" (రమేష్ 80) అని నేతన్నను కళాకారుడిగా, తన ప్రాణాన్నే దారంగా మార్చే శ్రమజీవిగా చిత్రించాడు. "ఉర్వికి మానం గాసేవు" (రాములు 79) అనే పాదం సమాజానికి వస్త్ర సంస్కృతిని అందించిన నేతన్నల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ కళాకారుల జీవితం మాత్రం దారిద్ర్యం, అప్పులు, ఆత్మహత్యలతో నిండిపోవడం బిసివాద సాహిత్యంలో ప్రధాన ఆవేదనగా కనిపిస్తుంది. వడ్డేపల్లి కృష్ణ "పగ్గం ఒకచేత పట్టి/ మగ్గం ఒక చేతపట్టి" (కృష్ణ 90) అని నేతన్నల సమష్టి శ్రమను చిత్రిస్తే, "అందించే నీకు కడకు/ అన్న వస్త్రమేదిరా?" (కృష్ణ 90) అనే ప్రశ్న సామాజిక అన్యాయాన్ని బలంగా ప్రశ్నిస్తుంది. స్ఫూర్తి రచించిన "మగ్గం నేసిన బతుకుల్లోన/ ఆశల దీపాలారుతున్నాయని" (స్ఫూర్తి 99) అనే పాట నేతన్నల నిరాశను వ్యక్తం చేస్తూనే, "కన్నీళ్ళను కత్తులు చేయన్నా" (స్ఫూర్తి 99) అంటూ తిరుగుబాటు చైతన్యాన్ని రగిలిస్తుంది. జయరాజు "నాటి చేనేత చేజారిపోతున్నదీ/ నేడు సిరిసిల్ల ఉరిసిల్ల అవుతున్నదీ.." (జయరాజు 58) అని చేనేత పట్టణాల విషాదాన్ని చిత్రించాడు. ఈ విధంగా కొన్ని పాటలు పద్మశాలీలు ఎదుర్కొంటున్న ప్రపంచీకరణ దుష్ప్రభావం, కార్మిక దోపిడి, ఆత్మగౌరవం, తిరుగుబాటు చైతన్యం వంటి అంశాలను బలంగా నిలదీస్తున్నాయి.
3.9. కుమ్మరులు
బిసివాద సాహిత్యంలో కుమ్మరుల జీవితం సంప్రదాయ కులవృత్తుల సంక్షోభానికి ప్రతీకగా కనిపిస్తుంది. మట్టికి రూపురేఖలు ఇచ్చి సమాజానికి పాత్రలు, గృహావసర వస్తువులు అందించిన కుమ్మరులు ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ, ప్లాస్టిక్ సంస్కృతి ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వర్గంగా ఈ పాటల్లో చిత్రితమవుతున్నారు. మిత్ర రచించిన "కుండ కుండలో గుండె దీపమున్నదో/ కమ్ముకుని వాములా మండుతున్నదో" (మిత్ర 335) అనే పాదం కుమ్మరుల అంతరంగ వేదనను ప్రతిబింబిస్తే, "ప్లాస్టికొచ్చినాదిరో - అది/ పెట్టుబడుల పాపమై" (మిత్ర 335) అనే పాదం ప్రపంచీకరణ, మార్కెట్ వ్యవస్థల వల్ల సంప్రదాయ వృత్తులు ఎలా నాశనమయ్యాయో తెలియజేస్తుంది.
స్ఫూర్తి "కుండలు చేసేటి వాళ్లం / కూడైన దొరకని వోళ్ళం" (స్ఫూర్తి 117) అని కుమ్మరుల దుర్భర జీవనాన్ని వ్యక్తం చేస్తే, "ప్లాస్టిక్ స్టీలు వచ్చి... పనులు దొరకకుండ చేసె" (స్ఫూర్తి 118) అంటూ ఆధునిక వస్తు సంస్కృతి వల్ల వారి వృత్తి అంతరించిపోతున్న వాస్తవాన్ని ప్రశ్నించాడు. అలాగే ఈ పాటలు కేవలం ఆవేదనతో ఆగకుండా, ఉద్యమ చైతన్యాన్ని కూడా రగిలిస్తాయి. "వాములా రాజుకుని మండిలేవాలి – మనం" (మిత్ర 335) అనే పిలుపు కుమ్మరుల ఐక్యత, పోరాట అవసరాన్ని సూచిస్తుంది. బండి సత్తెన్న "చేసిన కుండలు చెల్లుబాటులేక ప్లాస్టిక్కు లోకంలో పని దొరకనోడ" (సత్తెన్న 108) అని వృత్తి పతనాన్ని చిత్రిస్తే, జయరాజు "కుమ్మరొల్లకుండ చేతిలో చిప్పై/ గడప గడపకు తిరుగుతున్నది..." (జయరాజు 57) అంటూ కుమ్మరుల ఆర్థిక దుస్థితిని హృదయ విదారకంగా ఆవిష్కరించాడు.
3.10. గౌండ్లు
గౌడుల గురించి వచ్చిన పాటలు వారి జీవితం శ్రమ, దోపిడి, సామాజిక విభజనల మధ్య సాగుతున్న అస్తిత్వ పోరాటంగా ప్రతిఫలిస్తాయి. కల్లు గీయడం, ఈత, తాటి చెట్లపై ఆధారపడి జీవించడం వంటి వృత్తులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైనవైనా, గౌండ్లకు మాత్రం సామాజిక గౌరవం, ఆర్థిక భద్రత లభించలేదు. కె.కె. గౌడ్ రాసిన "కల్సికట్టుగా మనముంటె/ దోపిడిమూకల కన్నుకుట్టి/ చీలికలెన్నో పెడుతున్నారు" (గౌడ్ 110) అనే పాదాలు బి.సి.ల ఐక్యతను విచ్ఛిన్నం చేసే అగ్రకుల రాజకీయాలను ప్రశ్నిస్తాయి. మిత్ర రచించిన "మోకుతో ఆకాశమంచుకు ఎగబాకి/ తాల్లు ఈదుల కల్లు పారించి అమృతం" (మిత్ర 317) అనే పాదాలు గౌండ్ల శ్రమ సౌందర్యం, వారి వృత్తి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. "సహజ వైద్యులయితిరీ – గదరన్నా" (మిత్ర 317) అనే పాదం కల్లుకు ఉన్న ఆరోగ్యపరమైన ఉపయోగాలను గుర్తుచేస్తుంది. అయితే ఈ వృత్తి వారిపై జరుగుతున్న ఆర్థిక, అధికార దోపిడిని కూడా ఈ పాటలు బలంగా వ్యక్తపరుస్తాయి.
మాష్టార్జీ రచించిన "పోలీసులొక దిక్కు - గూండాగాళ్ళొకదిక్కు/ తడవ తడవకు వచ్చి - డబ్బు గుంజుతున్నర్రో" (మాష్టార్జీ 111) అనే పాదాలు గౌండ్లపై జరుగుతున్న వేధింపులను చిత్రిస్తాయి. స్ఫూర్తి "లొట్లల్ల కల్లు పారె - కళ్ళల్ల నీళ్ళు కారె" (స్ఫూర్తి 127) అని వారి శ్రమ వెనుక ఉన్న వేదనను వ్యక్తం చేస్తే, నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ "బాధలెన్ని పడిన, బాధ తీరలేదు / బతుకు మారలేదు" అని వారి జీవిత దుస్థితిని తెలియజేస్తాడు. ఈ విధంగా గౌండ్లపై వచ్చిన పాట సాహిత్యం కులవృత్తి అస్తిత్వం, దోపిడి వ్యతిరేకత, బహుజన ఐక్యత, ఆత్మగౌరవ చైతన్యం వంటి అంశాలను బలంగా వినిపించింది.
3.11. వడ్డెరులు
వడ్డెరుల జీవితం కఠిన శ్రమ, సంచార జీవనం, అస్తిత్వ పోరాటాలకు ప్రతీకగా నిలుస్తుంది. రాళ్లను చీల్చి, కంకరగా మార్చి, గృహనిర్మాణాలకు పనికొచ్చే రూపాలలో మలచే ఈ వర్గం సమాజ నిర్మాణానికి పునాదిగా ఉన్నప్పటికీ, వారి జీవితాలు మాత్రం పేదరికం, నిర్లక్ష్యంతో నిండిపోయాయి. చెరబండరాజు "కొండలు పగిలేసినం బండలను పిండినం/ మా నెత్తురే కంకరగా ప్రాజెక్టులు కట్టినం" అనే పాటలో వడ్డెరుల శ్రమతో నిర్మితమైన అభివృద్ధిని గుర్తుచేస్తూ, "శ్రమ ఎవరిదిరో సిరి ఎవరిదిరా" (రాజు) అని సామాజిక అసమానతను ప్రశ్నించాడు. మిత్ర రచించిన "బండను జూసి దాని బలముజెప్పేము/ మట్టిని జూసి దాని గుణముజెప్పేము" (మిత్ర 319) అనే పాదాలు వడ్డెరుల అనుభవజ్ఞానం, రాయి మర్మాన్ని గ్రహించే వారి నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తాయి. "ఇన్ని బుద్ధులున్న విద్యలేదెందుకో/ అన్నీ జేసిన మనకు ఆకలుందెందుకో..." (మిత్ర 319) అనే పాదం వారి శ్రమకు తగిన గౌరవం, జీవన భద్రత లభించకపోవడాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ సాహిత్యం ప్రపంచీకరణ, యాంత్రీకరణ వల్ల వడ్డెరుల సంప్రదాయ వృత్తి సంక్షోభంలో పడిన తీరును కూడా చిత్రిస్తుంది.
ఏపూరి సోమన్న "వడ్డెరోల్లమయ్య మేము వడ్డెరొల్లము/ మట్టితట్ట మోసి ఎట్టి చేసెటొల్లము" (సోమన్న) అంటూ వారి సంచార జీవనం, శ్రమజీవి సంస్కృతిని ఆవిష్కరించాడు. "పొక్లెను మిషనొచ్చినాదో ఒడ్డెరొల్లన్నా... నీ కులవృత్తి కూలదోసిందో" అనే పాదాలు ఆధునిక యంత్రాలు సంప్రదాయ వృత్తులను ఎలా నాశనం చేశాయో తెలియజేస్తాయి. "మట్టి బతుకులు, ఎట్టిబతుకులు ఇంకా ఎన్నాళ్ళు?" అనే ప్రశ్న ద్వారా ఈ పాటలు ఉద్యమ చైతన్యాన్ని, ఆత్మగౌరవ పోరాటాన్ని ప్రేరేపిస్తున్నాయి. ఈ విధంగా వడ్డెరులపై వచ్చిన పాటలు కులవృత్తి సంక్షోభం, అస్తిత్వ పోరాటం, రాజ్యాధికార చైతన్యం వంటి అంశాలను బలంగా చాటుతున్నాయి.
3.12. నాయీ బ్రాహ్మణులు
బిసివాద సాహిత్యంలో నాయీ బ్రాహ్మణుల జీవితం సేవ, శ్రమ, సామాజిక విరోధాభాసాల సమ్మేళనంగా కనిపిస్తుంది. మనిషి జననం నుండి మరణం వరకు ప్రతి సంస్కారంలో భాగస్వాములైన ఈ వర్గం సమాజానికి అత్యవసర సేవలు అందించినప్పటికీ, తగిన గౌరవం పొందలేకపోయింది. గోరటి వెంకన్న "వల్లు నిండ రోమాలు/ అల్లుకున్న నాటి మనిషి" (వెంకన్న 104) అంటూ మంగలి వృత్తిలోని కష్టసాధ్య పరిస్థితులను సహజత్వంతో చిత్రిస్తాడు. "నాదస్వరం రాగమెత్తుతే/ గుడిలో దేవుడు మేల్కొంటడు" (వెంకన్న 104) అనే పాదం వారి కళాత్మక సేవను గుర్తుచేస్తుంది. అలాగే "మల్టినేషన్ గిల్టెన్ బ్లేడ్/ మాయలో మార్కెట్లకొచ్చి" (వెంకన్న 105) అనే పాదాలు ప్రపంచీకరణ, కార్పొరేట్ వ్యవస్థల వల్ల సంప్రదాయ క్షౌరవృత్తి సంక్షోభంలో పడిన తీరును తెలియజేస్తాయి.
రాస భూమయ్య "మాసిన గడ్డం తీసి/ పూసిన తలరంగు వేసి" (భూమయ్య 106) అంటూ వారి సేవాభావాన్ని ప్రతిబింబిస్తాడు. స్ఫూర్తి రచించిన పాటలు నాయీ బ్రాహ్మణుల అస్తిత్వ పోరాటాన్ని మరింత స్పష్టంగా వ్యక్తం చేస్తాయి. "పుట్టు వెంట్రుకలు తీసెటప్ప్పుడు/ ఖర్చుకెవ్వరు వెనక ఆడరు/ గుండు చేసిన మాకు మాత్రం/ గులుక్కుంటు చిల్లరేస్తరు" (స్ఫూర్తి 107) అనే పాదాలు వారి శ్రమకు సమాజం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తాయి. "కన్నతల్లి కాన్పుకాడ – పుట్టె బిడ్డకు మంత్రసానై" (స్ఫూర్తి 111) అనే పాదం వారి సేవ మనిషి జీవిత చక్రంతో ఎంతగా ముడిపడి ఉందో తెలియజేస్తుంది. చివరగా "హక్కుల సాధన కోసం - మేమింక ఊరుకోము" (స్ఫూర్తి 114) అనే పిలుపు నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవ చైతన్యం, సంఘటిత పోరాట అవసరాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఈ విధంగా నాయీ బ్రాహ్మణులపై పాటలు సేవాస్వభావం, సామాజిక వివక్ష, ప్రపంచీకరణ ప్రభావం, హక్కుల సాధన వంటి అంశాలను బలంగా ఆవిష్కరించాయి.
3.13. రజకులు
రజకుల జీవితం సేవా శ్రమ, సామాజిక నిర్లక్ష్యం, అస్తిత్వ పోరాటాల ప్రతీకగా కనిపిస్తుంది. సమాజంలోని ప్రతి ఇంటి మురికిని శుభ్రం చేస్తూ ఆరోగ్యకరమైన జీవనానికి తోడ్పడే ఈ వర్గానికి మాత్రం తగిన గౌరవం లభించలేదు. రాస భూమయ్య రచించిన "పట్టుబట్ట ముట్టు బట్ట/ మాసిపోయిన మైలబట్ట" (భూమయ్య 107) అనే పాదాలు రజకుల కఠోర శ్రమ, ఇంటింటికీ తిరిగి బట్టలు సేకరించి మోసుకెళ్లే వారి బాధ్యతను ప్రతిబింబిస్తాయి. శమశ్రీ "పురుడు బోసి – బొడ్డు గోసి/ పుట్టెడు మురికి సాపుజేసి" (శమశ్రీ 107) అంటూ జననం నుండి చావు వరకు రజకులు చేసే సేవలను గుర్తుచేస్తాడు. "పెద్దా కులముల శుద్ధి జేసి/ సద్దికూళ్ళే చాకిరి ఫలితం" (శమశ్రీ 107) అనే పాదాలు వారి సేవలకు ప్రతిఫలంగా లభిస్తున్న అవమానకర పరిస్థితిని తెలియజేస్తాయి. స్ఫూర్తి "అరె మల్లెపూలుగా బట్టలాయెను/ మాసినట్లు మన బతుకులాయెరా" (స్ఫూర్తి 124) అని రజకుల వృత్తి మహిమను, వారి దుస్థితిని ఒకేసారి ప్రతిబింబించాడు.
అలాగే ఈ సాహిత్యం రజకుల సేవలోని శాస్త్రీయతను, సామాజిక అవసరాన్ని కూడా వెలుగులోకి తెస్తుంది. మిత్ర "సాకిరేవునిబెట్టి - సౌడును కనిపెట్టి/ బట్టలుడుకాబెట్టి - రోగాలనరికట్టి" (మిత్ర 325) అని రజకుల వృత్తిలోని ఆరోగ్య పరిరక్షణ అంశాన్ని గుర్తుచేస్తాడు. "ఊరును తెల్లగా మల్లెలోలిగ ఉతికి" (మిత్ర 325) అనే పాదం రజకులను కేవలం బట్టలు ఉతికేవారిగా కాకుండా సమాజ పరిశుభ్రతకు ప్రతీకలుగా చిత్రిస్తుంది. అయినప్పటికీ "సదివినోనికంటె - సాకలేమేలనే/ శాస్త్రమే మిగిలింది - సదువు దూరమైంది" (మిత్ర 325) అనే పాదం వారికి విద్య, సామాజిక పురోగతి దూరమైన వాస్తవాన్ని తెలియజేస్తుంది. ఇట్లాగే రజకులపై వచ్చిన పాటలు సేవా సంస్కృతి, సామాజిక అసమానత, అస్తిత్వ సంక్షోభం, హక్కుల చైతన్యం వంటి అంశాలను బలంగా నిలదీస్తున్నాయి.
3.14. గంగపుత్రులు
గంగపుత్రులు, జాలరుల జీవితం ప్రకృతి పోరాటం, వలస బాధ, అస్తిత్వ సంక్షోభం, శ్రమ సాహసాల సమ్మేళనంగా ప్రతిఫలిస్తుంది. ముకురాల రామారెడ్డి రచించిన 'వలస కూలి' పాట వలసల పాలవుతున్న బెస్త జీవితాలను హృదయ విదారకంగా చిత్రిస్తుంది:
కూలి మస్తుగ దొరుకుతాదని/ కోస్తదేశం పోతివా!
"కొడిమెలూ, గాలాల గడెలూ గుడిసెకు విసిరిపోతివా!" (రామారెడ్డి) అనే పాదం తమ వృత్తి ఆయుధాలనే వదిలి వలస వెళ్తున్న వారి దుస్థితిని తెలియజేస్తుంది. మిత్ర రాసిన "గంగదారులెంట - గంతేసి దుంకాలి/ గంగపుత్రుల తెగువ - గర్జించి చూపాలి" (మిత్ర 314) అనే పాట జాలరుల ఆత్మగౌరవ చైతన్యాన్ని రగిలిస్తుంది.
"తెలంగాణలోన చెరువులు కుంటలు/ గండ్లువడ్డయెన్ని మాయమైనవెన్ని" (మిత్ర 314) అనే పాదాలు చెరువుల నాశనం వల్ల మత్స్యకారుల జీవనాధారం కూలిపోయిన తీరును ప్రతిబింబిస్తాయి. "వలలాగ అల్లుకుందాం – రండిరా/ ఢిల్లీదాక చేరుదాం" (మిత్ర 314) అనే పిలుపు సంఘటిత పోరాట అవసరాన్ని తెలియజేస్తుంది. అలాగే ఈ సాహిత్యం జాలరుల వృత్తిలోని సాహసం, సముద్రంతో వారి నిరంతర పోరాటాన్ని గొప్పగా చిత్రిస్తుంది. గూడ అంజయ్య జాలరుల జీవన యుద్ధాన్ని ఆవిష్కరిస్తాడు:
కడలితో చెలగాటమాయె/ రోజు చస్తూ పుట్టుడాయె (అంజయ్య 76)
"చావుతోనే చెలిమి చేసి/ ఏటి గట్టు చేరుకుంటవు" (అంజయ్య 76) అనే పాదం వారి ప్రాణాంతక వృత్తి స్వరూపాన్ని తెలియజేస్తుంది. సుద్దాల అశోక్‌తేజ "ఆలుతోని కాదు కడలి/ అలలతోని సంసారం" (అశోక్‌తేజ 77) అంటూ జాలరుల కుటుంబ జీవితాన్ని సముద్ర అలలతో పోల్చి భావోద్వేగంగా చిత్రించాడు. "వేసిన వలలో చిక్కిన చేపయిపోతది మనసు" (అశోక్‌తేజ 77) అనే పాదం వారి ఆత్మీయ జీవన వేదనను ప్రతిబింబిస్తుంది. బండి సత్తెన్న "నీటిలోన చేపలవేట - కన్నీటి గాథల పాట" (సత్తెన్న 137) అంటూ మత్స్యకారుల సమస్యలను సామాజిక ప్రశ్నగా మలిచాడు. గంగపుత్రులపై వచ్చిన పాటలన్నీ కూడా ప్రకృతి పోరాటం, వలస వేదన, అస్తిత్వ సంక్షోభం, సంఘటిత చైతన్యం, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రతిధ్వనింపజేస్తాయి.
ఉపసంహారం
చివరగా 'బి.సి. జాగృతి గీతం'తో సంఘటితమవుదాం. మన హక్కులను సాధించుకుందాం. ఈ పాటలో నకిరేకంటి శీనయ్య రాసినట్లు:
యెనకబడ్డ కులాల - యెతలన్నీ మాపుటకు
చేయి చేయి కలుపుదాం - ఉద్యమమై కదులుదాం
రాజ్యాధికారమే మన అంతిమ లక్ష్యము
జనం మనది బలం మనది - సంఘటిస్తే జయం మనది
ఓట్లు మావి సీట్లు మీవా? చెల్లదు ఇక చెల్లదు?
గడ్డిపోచలేకమై గజమదమే అణిచినట్లు
దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, సర్దార్ పాపన్న, కొండా లక్ష్మణ్ బాపూజీ, మారోజు వీరన్న, ఐలన్న, బెల్లి లలితక్క, జయశంకర్ వంటి బి.సి అమరవీరులను ఆదర్శంగా తీసుకుందాం. కలిసి కట్టుగా పోరాడి రాజ్యాధికారాన్ని సాధించుకుందాం.
- ఈ పరిశోధన బి.సి. కులాల జీవితాలు, వృత్తులు, పోరాటాలను వెలికి తీయడంలో పాటలు పోషించిన పాత్రను విశ్లేషిస్తుంది.
- జానపద, మౌఖిక సాహిత్యం బి.సి. కులాల అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని స్పష్టమైంది.
- గూడ అంజయ్య, జయరాజు, దర్వు ఎల్లన్న, కందికొండ వంటి కవులు బి.సి. వృత్తుల విధ్వంసం, సామాజిక అన్యాయాలను పాటల ద్వారా చాటిచెప్పారు.
- గొల్లకురుమలు, ఉప్పరులు, మున్నూరుకాపులు, ముదిరాజులు, దర్జీలు, ఆరెకటికలు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలీలు, కుమ్మరులు, గౌండ్లు, వడ్డెరులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, గంగపుత్రులు వంటి వివిధ కులాల పాటల ద్వారా వారి శ్రమ, కళాత్మకత, దోపిడి, సంక్షోభం, ఉద్యమ చైతన్యం ఆవిష్కరించబడ్డాయి.
- ప్రపంచీకరణ, యాంత్రీకరణ బి.సి. సంప్రదాయ వృత్తులపై చూపిన తీవ్ర ప్రభావాలను ఈ పాటలు బలంగా చిత్రించాయి.
- బి.సి.ల ఐక్యత, రాజ్యాధికార సాధన ఆవశ్యకతను ఈ సాహిత్యం బలంగా నొక్కి చెబుతుంది.
ఉపయుక్త గ్రంథసూచి
- అంజయ్య, గూడ. 2006. ‘తెలంగాణ - పాటలు’. హైదరాబాద్ : తెలంగాణ పాట కవుల వేదిక.
- గౌరీశంకర్, జూలూరు. సంపా. 2012. ‘మిత్రపర్వం (కొండెత్తు పాటపై విశ్లేషణ)’. నల్గొండ : ఘటన ముద్రణ.
- జయరాజు. 2016. ‘వసంతగీతం’ (జయరాజు పాటలు). హైదరాబాద్ : భూమి బుక్ ట్రస్ట్
- మల్లారెడ్డి, తూర్పు. 2007. ‘తెలంగాణ సాహిత్యం - జీవిత చిత్రణ’. నల్లగొండ : తెలుగుశాఖ శ్రీలక్ష్మీనరసింహస్వామి కళాశాల.
- మిత్ర. 2016. ‘కైతల కవాతు (తెలంగాణ జన విముక్తి గీతాలు)’. హైదరాబాద్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య.
- రాములు, బి.ఎస్. సంపా. 2004. ‘బహుజన తత్వాలు బీసీ, ఎస్సీల పాటలు’. హైదరాబాదు : విశాల సాహిత్య అకాడమి.
- సత్తెన్న, బండి. 2016. ‘బండి సత్తెన్న ప్రజాగేయాలు’. హైదరాబాద్ : నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

