AUCHITHYAM | Volume-07 | Issue-8 | July 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. కర్ణాటకసంగీతంలో భాషాంగరాగాలు: సమన్వయం
కలిశెట్టి తేజస్విని
పరిశోధక విద్యార్థి, సంగీత విభాగం,
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు
విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9391633615, Email: abhimanyu.yoma@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 05.06.2026 ఎంపిక (D.O.A): 22.06.2026 ప్రచురణ (D.O.P): 01.07.2026
వ్యాససంగ్రహం:
కర్ణాటక సంగీతం చాలా పురాతనమైనది, ఈ సంగీతంలో జనకరాగాలకు మరియు జన్య రాగాలకు రెండింటికీ చాలా విశిష్టమైన స్థానం ఉందని చెప్పవచ్చు. భాషాంగ రాగాలు అనగా జనకరాగ స్వరాల నుండి పుట్టిన జన్యరాగాలకు అదనంగా కొత్త అన్య స్వరాలు చేరినట్లయితే వాటిని భాషాంగరాగాలు అంటారు. ఇలా అన్య స్వరాలను కలిగి ఉండటం వలన కొత్త రాగ రూపాన్ని మరియు ప్రత్యేకతను కలిగి ఉంటాయి,ఈ పరిశోధనలో వివిధ మేళకర్త రాగాల నుండి పుట్టిన భాషాంగ జన్యరాగ లక్షణాలు, స్వరూపం,అన్యస్వర ప్రయోగాలు మరియు సంగీత పరమైన విశిష్టతను అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన రాగాలు అయినటువంటి భైరవి, మాంజి,ముఖారి,బృందావన సారంగ,సాలగ భైరవి,కాపీ, కాంబోజి,సింధు భైరవి, అఠాణ మొదలైన భాషాంగ రాగాలను పరిశీలించడం జరిగింది . ఈ అన్యస్వరాలు ఉపయోగించడం వలన ప్రత్యేకమైన రసానుభూతిని కలిగి రాగభావాన్ని మరింత సుసంపన్నం చేస్తాయి, అంతేకాకుండా ప్రముఖ వాగ్గే య కారుల కృతులలో ఈ రాగల ప్రయోగం, గమక వైశిష్ట్యం, మనోధర్మ సంగీతంలో వాటి ప్రాధాన్యతలను కూడా విశ్లేషించడం జరిగింది. భాషాంగ రాగాల లక్షణం మరియు స్వర నిర్మాణం సంగీత సౌందర్యాన్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆధ్యయనం ఉపయుక్తంగా ఉంటుంది కర్ణాటక సంగీత సాంప్రదాయంలో భాషాంగ రాగాల ప్రాముఖ్యతను ఈ పరిశోధన ద్వార విపులంగా వివరించడం జరిగింది.
Keywords: కర్ణాటక సంగీతం, భాషాంగరాగాలు, జన్యరాగాలు, అన్య స్వరాలు, రాగాల విశిష్టత
1. కర్ణాటక సంగీతంలో మేళకర్త వ్యవస్థ
కర్ణాటక సంగీతంలో రాగాలను శాస్త్రీయ పద్ధతిలో వర్గీకరించడానికి మేళకర్త వ్యవస్థను రూపొందించారు. ఈ వ్యవస్థ ప్రకారం సంపూర్ణ స్వరాలను కలిగిన మూల రాగాలను మేళకర్త రాగాలు అంటారు. ప్రతి మేళకర్త రాగం ఆరోహణ, అవరోహణ క్రమంలో 7 స్వరాలు క్రమబద్ధంగా ఉండాలి. వీటి నుండి అనేక జన్య రాగాలు ఉద్భవిస్తాయి. కర్ణాటక సంగీతంలో మొత్తం 72 మేళకర్త రాగాలు ఉన్నాయి. ఈ వ్యవస్థను వెంకటమఖి ప్రతిపాదించగా, తదుపరి గోవింద ఆచార్యులు దీనికి సంపూర్ణ రూపాన్ని అందించారు. ఈ మేళకర్త రాగాలను శుద్ధ మధ్యమ, ప్రతి మధ్యమ అనే రెండు విభాగాలుగా వర్గీకరించారు. మొదటి 36 రాగాలు శుద్ధ మధ్యమ రాగాలు కాగా, తర్వాతి 36 రాగాలు ప్రతిమద్యమ రాగాలుగా గుర్తింపు పొందాయి.
2. భాషాంగ రాగాల ఆవిర్భావం
కొన్ని శతాబ్దాలకు ముందు భాషాంగ రాగాలు ఉన్నట్లు ఆధారాలు లేవు. అప్పట్లో అన్ని రాగాలు ఉపాంగ రాగాలుగానే ఉనికిలో ఉండేవి. కొంతకాలం తరువాత, కొన్ని జన్య రాగాలలో ఒకటి, రెండు వికృతి స్వరాలను చేర్చి పాడటం వల్ల అవి ఎంతో హాయిగా, కొత్త భావాన్ని కనబరిచి చాలా శ్రావ్యంగా వినిపించాయి. దీంతో సంగీత ప్రియులు ఈ కొత్తగా తయారైన రాగాలకు ఆకర్షితులయ్యారు. ఉపాంగ రాగాల వలె కాకుండా, తమ జనక రాగాలలో లేని వికృతి స్వరాలను ఒకటి లేదా రెండు స్వర స్థానాలలో కలిగి, పితృరాగాల వికృతి స్వరాలనే పాటించే ఈ నూతన రాగాలు పాత రాగాల కన్నా చాలా ఆకర్షణీయంగా ఉండటంతో, ప్రజలు ఈ మార్పును సంతోషంతో స్వాగతించారు.
కొన్ని శతాబ్దాలకు పూర్వం ఆనందభైరవి, భైరవి ఉపాంగ రాగాలుగా ఉండినట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ఇవి రెండూ ప్రసిద్ధిచెందిన భాషాంగ రాగాలు.
ఒక రాగం తన జనక మేళకర్త రాగం కలిగి ఉన్న స్వరస్థానాలను కలిగి ఉంటూ, వాటితో పాటు ఒకటి, రెండు లేదా మూడు ఇతర స్వరస్థానాలు కూడా ఉన్నట్లయితే, ఆ ఇతర స్వర స్థానాలను అన్యస్వరాలు అంటారు. అలాంటి అన్య స్వరాలను కలిగి ఉన్న రాగాలను భాషాంగ రాగాలు అంటారు.
3. భాషాంగ రాగాల నిర్వచనాలు
3.1. నిర్వచనం 1
"రాగాంగ రాగం నుండి జనించినదై, అది జనించిన జనక రాగం స్వరాలనే కలిగి ఉన్నప్పటికీ, రంజకత్వం కోసం ఇతర జనక రాగాలలో గల శుద్ధ, వికృత స్వరాలలో ఏవైనా ఒకటి, రెండు లేక మూడు స్వరాలను ప్రయోగింపబడే జన్య రాగాలను భాషాంగ రాగాలు అంటారు. ఇవి ఔడవ, షాడవ లేక సంపూర్ణములుగా గానీ, వక్ర లేక అవక్రమములుగా గాని ఉండవచ్చు." (సంగీత కళా ప్రదర్శిని 84)
3.2. నిర్వచనం 2
"ఏదైనా ఒక జన్యరాగం తన మాతృక రాగం స్వరస్థానాలే కాక, రంజకత్వం కోసం ఒకటి, రెండు అన్య స్వరాలను తీసుకున్న అట్టి రాగాన్ని భాషాంగ రాగాలు అంటారు. అంతేకానీ అన్యస్వరపు ఛాయను గానీ లేక అందులోని స్వకీయ స్వరాన్ని హెచ్చుతగ్గులతో పాడినంత మాత్రాన గానీ అన్యస్వరం ఛాయ ఉన్నంత మాత్రాన గానీ అది భాషాంగరాగం అనిపించుకోదు." (సంగీత శాస్త్ర చంద్రిక 527)
3.3. నిర్వచనం 3
"మూర్ఛనలో అన్య స్వరములు కలిగిన భాషాంగ రాగాలు, ప్రయోగంలో అన్య స్వరములు కలిగిన రాగాలను అర్థభాషాంగ రాగాలు అంటారు." (సంగీత శాస్త్ర సుధార్భవం 89)
4. భాషాంగ రాగాల వివరణ
ఎన్నో భాషాంగ రాగాలు ఉన్నప్పటికీ, వ్యాస పరిధిని పరిగణనలోకి తీసుకుని, మూడు ఏక అన్యస్వర భాషాంగ రాగాలను, ఒక ద్వి అన్యస్వర భాషాంగ రాగాన్ని, రెండు త్రి అన్యస్వర భాషాంగ రాగాలను మాత్రమే ఈ వ్యాసంలో వివరిస్తున్నాను.
4.1. ఏక అన్యస్వర భాషాంగ రాగాలు
ఏదైనా ఒక జన్యరాగంలో జనక రాగం నుండి వచ్చిన స్వర స్థానాలే కాకుండా వేరొక అన్య స్వరం అదే రాగంలో ఉన్నట్లయితే, దానిని ఏకాన్య స్వర భాషాంగ రాగం అంటారు.
4.1.1. బిలహరి
బిలహరి ఒక ఔడవ సంపూర్ణ రాగం. ఆరోహణలో మధ్యమ, నిషాదాలు వర్జ్యాలు. ఇది ఒక ఏక అన్యస్వర భాషాంగ రాగం. అన్యస్వరమైన కైశికి నిషాదం 'దనిదప', 'పనిదప' ప్రయోగాలలో మాత్రమే గోచరిస్తుంది. 'దాదాప' అనే ప్రయోగంలో నిషాదం అనుస్వరంగా పలుకుతున్నా, అది కైశికి నిషాదమా లేక కాకలి నిషాదమా అని ఖచ్చితంగా నిర్ణయించలేదు.
అలా అని కైశికి నిషాద ప్రయోగం లేకుండానే బిలహరి రాగాన్ని పాడటానికి అవకాశం లేదని చెప్పలేదు. ఈ రాగంలో మధ్యమ, నిషాదాలకు ప్రత్యేక స్వభావం కనిపిస్తుంది. ఈ రెండూ రాగచ్ఛాయ స్వరాలే అనగా జీవస్వరాలే.
ఈ రెండు స్వరాలను దీర్ఘం చేసి పాడటానికి అవకాశం ఉంది. వీటిని సమయోచితంగా, చమత్కారంగా ప్రయోగించాలి. కానీ రెండింటిని గ్రహ, వ్యాస స్వరాలుగా వాడటానికి అవకాశం లేదు.
రిషభం, గాంధారం, దైవతం ప్రధాన వ్యాస స్వరాలు. విశేష న్యాసాలు. జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగాలు విశేషంగా కనిపిస్తాయి. త్రిస్తాయి రాగం. "రీగమ గామగరి దానిప నీపనిదా" సంవాది ప్రయోగాలు, "నిసదనిపా" విశేష సంచారం.
అన్య స్వర ప్రయోగాలు:
- దాని*దపాదపమగ
- పదని*దదపమగ
- ని*దదపమగ
- పాని*దదపమగరి
- గపదసా
ఉదాహరణలు:
- పరిదానమిచ్చితే - ఖండ చాపు తాళం - పట్నం సుబ్రమణ్యం అయ్యర్
- కనుగొంటిని - ఆదితాళం - త్యాగరాజు
- ఏకదంతం భజేహం - చాపుతాళం - దీక్షితార్
- దొరకునా ఇటువంటి - ఆదితాళం - త్యాగరాజు
4.1.2. భైరవి రాగం
జనక-జన్య పద్ధతి వాడుకలోకి వచ్చాక, 72 మేళాలకు పేర్లు ఖరారు చేశారు. 20వ మేళం ద్విశృతి దైవతం కలిగిన నరభైరవిగా నిర్ధారించినప్పటి వరకు భైరవిని మేళంగా పరిగణించారు.
క్రమమైన సరిగమపదనిస అని పాడటం వలన భైరవి స్ఫురించదు. భైరవిలో అన్ని స్వరాలు రాగచ్ఛాయ స్వరాలే! రిషభం, మధ్యమం, నిషాదం ముఖ్యన్యాసాలు. గాంధారం అవరోహణ క్రమంలోనే న్యాసం. శుద్ధ ధైవతం చాలా అరుదుగా న్యాసంగా వాడబడుతోంది. రిషభం, చతుశృతి దైవతం, కైసికి నిషాదం, షడ్జమం, పంచమ స్వరాలు గ్రహ స్వరాలు. పంచమం కాక, మధ్యమం కూడా ఒక ప్రధాన విశేష న్యాసం. కొన్ని రచనల మధ్య భాగంలో కేంద్ర స్వరంగా వాడబడటం గమనించదగినది.
సర్వస్వరవరీకరక్తి రాగం. మధ్యమ, నిషాదాలు కంపితం. 'నిదపమా' ప్రయోగంలో మధ్యమం అతి మృదువుగా పలుకుతుంది.
శ్యామశాస్త్రుల వారు భైరవి స్వరజతిలో "మాపనిదమా" అనే చరణంలో "తామసము చేయక" అనుచోట మాత్రమే చతుశృతి దైవతాన్ని చూపించారు. "దపనిదాపమ" అనే ప్రయోగంలో దైవతం, నిషాదం అను స్వరాలతో పలుకుతుంది. ముత్తుస్వామి దీక్షితులు "బాలగోపాల" కృతిలో అనుపల్లవి ప్రారంభంలో చతుశృతి దైవత, శుద్ధ దైవత ప్రయోగాలకు మరొక ఆధారంగా చెప్పవచ్చు. భైరవి రాగంలో సొంత స్వరమైన శుద్ధ దైవతానికి, చతుర్థి దైవతానికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది.
శుద్ధ దైవత ప్రయోగాలు:
- పాదనీదాపా
- దపమపదాపా
- పాదపాదమాపా
- మపదపదా
- సానీనీదదాపా
- నీ నిదదదాపా
- దపమగరీగమపదాపా
4.1.3. కాంభోజీ రాగం
ఈ రాగం 28వ మేళకర్త హరికాంభోజి రాగం జన్యం.
ఒక జనక రాగం కన్నా దాని జన్యరాగాలే ప్రఖ్యాతి గాంచిన రాగాలలో కాంభోజి, శ్రీ, మధ్యమావతి, ముఖారి వంటి రాగాలను ఉదాహరణలుగా చెప్పవచ్చు.
ప్రస్తుతం కాంభోజి 28వ మేళం హరికాంభోజి రాగం జన్యంగా వ్యాప్తిలో ఉంది.
ఆరోహణ: సరిగమ పదస
అవరోహణ: సనిదప మగరిస
షడ్జమం, పంచమం కాక, ఈ రాగంలో చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి ధైవతం, కైసికి నిషాదం, కాకలి నిషాదం (అన్యస్వరం) ఉన్నాయి. ఇది ఏకాన్య స్వర భాషాంగ రాగం.
కానీ, కాంభోజిలో కాకలి నిషాద ప్రయోగాన్ని గూర్చి చర్చించవలసిన అవశ్యకత ఉంది. "సనిపాదాసా" అనే ఒక ప్రత్యేక సంచారంలో అన్యస్వరమైన కాకలి నిషాదం ధ్వనిస్తుంది. మరెక్కడా కాకలి నిషాదం ధ్వనించదు, ధ్వనించకూడదు కూడా. 'సనిపాదాసా' ప్రయోగాన్ని 'సానిపదసా'గా పాడితే కాంభోజికి భాషాంగత్వం ఉండదు. పై ప్రయోగంలో కాకలి నిషాదం లేకుండా పాడినట్లయితే, ఈ రాగానికి ఏ విధమైన చెడు రాదు.
ఈ విధంగా అది 'సానిపదసా' అని నిషాదం మంద్రస్థాయిలో పలికించినప్పుడు, కాకలి నిషాదం పలుకటానికి అవకాశం కలుగుతుంది.
ఉదా: ముత్తుస్వామి దీక్షితుల 'కాశీవిశ్వేశ్వర' అనే కృతి వల్లవి చివర "సనిని పాదాసా" ఉంది. కావున, ఈ రాగంలో కాకలి నిషాద ప్రయోగానికి ఉన్న సంప్రదాయ బలాన్ని అంత సులభంగా నిరాకరించటానికి వీలులేదు. అసలు నిరాకరించరాదు.
'గమపామ గమపా' ప్రయోగంలో మధ్యమం చక్కని శుద్ధ మధ్యమంగా పలుకుతుంది. గాంధారానికి ఎటువంటి కంపనం లేదు. 'మగపదసా' ప్రయోగం ఒకప్పుడు 'గపదసా'గా అవుతుంది. 'సరిగసా నిదప దమగ' ప్రయోగాలు ఈ రాగంలోని రంజక ప్రయోగాలు.
ఉదాహరణలు:
- గీతం -మందర ధారే - ఆదితాళం - పైడాల గురుమూర్తి శాస్త్రి (ఈ గీతంలో ప్రారంభంలోనే "సానిప" అనే ప్రయోగం మనకు కనబడుతుంది.)
- తరుణి - తాన వర్ణం - ఆదితాళం
- ఎవరి మాట - ఆదితాళం - త్యాగరాజు
- మరకతవల్లీం - ఆదితాళం - దీక్షిత్ర్
- సరసిజనాభా - తాన వర్ణం - అట తాళం
4.2. ద్వి అన్యస్వర భాషాంగ రాగాలు
ఏదైనా జన్యరాగంలో మాతృ రాగం స్వరస్థానాలు కాకుండా వేరొక రెండు స్వరస్థానాలు అదే రాగంలో ఉన్నట్లయితే, వాటిని ద్వి అన్యస్వర భాషాంగ రాగాలు అంటారు. అందులో భాగంగా అఠాణా రాగాన్ని తీసుకోవడం జరిగింది.
4.2.1. అఠాణా రాగం
సామాన్యంగా అఠాణా రాగం 29వ మేళమైన ధీరశంకరాభరణ జన్యం. ఈ రాగంలో అంతర గాంధారం, కాకలి నిషాదాలు స్పష్టంగా అనగా తమ స్వస్థానాలలోనే పలకటానికి అవకాశం తక్కువ. అఠాణా రాగంలో గాంధారం, నిషాదాలను, దైవతాలను గురించి చర్చిద్దాం.
గాంధారం:
'నిసగామరిస', 'మాగరిసనీ' అనే ఈ రెండు ప్రయోగాలలో అంతర గాంధారానికి అవకాశం ఉంది.
'నిసగమరిస' ప్రయోగంలో గాంధారం అంతర గాంధారమే. 'మాగరిసని' ప్రయోగంలో మధ్యమం దీర్ఘం చేయబడి, గాంధారం ఒక ఛాయాస్వరంగా పలుకటానికి అవకాశం ఉంది. సాధారణ గాంధారం ఈ రాగంలో సాధారణ గాంధారంగా పలుకటం లేదు. ఉదా: గాగారీస – ఇది 'రీమరీమరీస' అనియే పలుకుతుంది. అదేవిధంగా 'మపగామపా' ప్రయోగం 'మపరీమపా'గా పలుకుతుంది.
దైవతం:
'రిపదా' ప్రయోగం ఈ రాగంలో ప్రత్యేకంగా చర్చించవలసిన ఒక ప్రయోగం. ఇక్కడ దైవతం చతుశృతి దైవతం కాదు. ఇందులో దైవతం నిషాదానికి చాలా దగ్గరగా ఉంది.
త్యాగరాజస్వామివారి 'ముమ్మూర్తులు గుమికూడి' అనే కృతిలో కొన్ని విచిత్ర ప్రయోగాలు కనిపిస్తున్నాయి.
దనిసని దాసనిని - పదనీ దనిసా గామగరీ గరీసారిస ఈ ప్రయోగాలలో కనిపిస్తున్నట్లు పాడే ఈ కృతి పాఠాంతరాలను అంత సులభంగా నిరాకరించడానికి అవకాశం లేదు.
నిషాదం:
అఠాణాలో నిషాదం కైశికి నిషాదమే. "సనిరీస నిసదా" ప్రయోగంలో సమయానుసారంగా కైశికి, కాకలి నిషాదాలు వాడబడుతున్నాయి.
గాంధారం, నిషాదం గుణాలను బట్టి ఈ రాగాన్ని హరికాంభోజి మేళ జన్యం కన్నా, ఖరహరప్రియ మేళ జన్యం అని చెప్పటం యుక్తంగా ఉంటుంది.
కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతి గాంచిన రక్తి రాగాలలో అఠాణా ఒకటి. మధ్యస్థాయి పంచమం మొదలు తారస్థాయి మధ్యమం వరకు ఉన్న ప్రాంతమే ఈ రాగానికి ఎక్కువ రంజకత్వాన్ని ఇస్తుంది. ఒక 'మపరిస' ప్రయోగమే అఠాణా రాగాన్ని గుర్తించడానికి చాలు, ఇది ఈ రాగం జీవనాడి. పురందరదాసు, త్యాగరాజ స్వామి ఇరువురు తమ తొలి రచనలను అఠాణా రాగంలోనే రచించారు.
ఉదాహరణలు:
- మోసహాదెనల్లో - పురందరదాసు రచన.
- ఏల నీదయరాదు - త్యాగరాజస్వామి
- సామి నిన్నే కోరి - ఖండ అట - తాన వర్ణం.
- శ్రీకుమార - ఆది - స్వాతి తిరునాళ్
- శ్రీ మహాగణపతిం - జయచామరాజ వొడయార్
- త్యాగరాజో విరాజోతే - దీక్షితులు.
4.3. త్రి అన్యస్వర భాషాంగ రాగాలు
ఏదైనా జన్యరాగంలో మాతృ స్వరస్థానాలు కాకుండా వేరొక మూడు స్వరస్థానాలు అదే రాగంలో ఉన్నట్లయితే, వాటిని త్రి అన్యస్వర భాషాంగ రాగాలు అంటారు.
4.3.1. కాపీ రాగం
ఈ రాగం 22వ మేళకర్త ఖరహరప్రియ రాగం జన్యం. ఈ రాగంలో మాతృ రాగం నుండి పుట్టిన స్వరస్థానాలైన షడ్జమం, చతుశృతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కైశిక నిషాదం స్వరస్థానాలను కలిగి ఉంటూనే, ఆ రాగంలో లేని అంతర గాంధారం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం అనే మూడు అన్య స్వరాలను కలిగి ఉండటం వల్ల ఈ రాగాన్ని త్రి అన్యస్వర భాషాంగ రాగం అంటారు.
'సనిదని పమగరిస' అని అవరోహణ ఉన్నచో ఇంకా యుక్తంగా ఉంటుంది. శుద్ధ రిషభం, ప్రతి మధ్యమాలు తప్ప మిగిలిన స్వరాలన్నీ ప్రయోగింపబడుతున్నాయి. స్వర ప్రస్థారానికి ఈ రాగంలో ఏ నియమం లేదు. 'రిమపని' అని నిషాదాన్ని న్యాసం చేసేటప్పుడు ఒకప్పుడు కైసికి నిషాదం, మరొకప్పుడు కాకలి నిషాదం వస్తాయి. 'సనిస'లో వచ్చునది కాకలి నిషాదమే.
మగమ-నిదని సంవాదులు. 'మగమ'లోని గాంధారం అంతర గాంధారం. 'నిదని'లో దైవతం చతుశృతి దైవతం. నిషాదం కైసికి నిషాదం. 'నిదపమ గరి'లో దైవతం చతుశృతి దైవతం. 'రీగమ గరి'లోని రెండు గాంధారాలు సాధారణ గాంధారాలు. 'సరిగమగమ'లో అంతర గాంధారం వస్తుంది. 'మగరిగరి'లో సాధారణ గాంధారం వస్తుంది.
అన్యస్వర ప్రయోగాలు:
అంతర గాంధార ప్రయోగాలు:
- సాసా గాగా గమ గమదని మగమాగరీ
- ససరీగరి సరిగమగమగరీ
- నిప మగమాగారీ
- నిపమగమాగారీ
- మగసగమానిపారీ
శుద్ధ దైవత ప్రయోగాలు:
- రిమపదప
- దపాగరీ
కాకలి నిషాధ ప్రయోగాలు:
- రిమపనిమపనీసా
- నిసరీసనిసానీదా
- మాపనీస
- రిమపనిమపనీ సస నినిసా
- నిసరీగారి నిసరిమ పనిమపనీస
ఈ రాగంలో పది స్వరస్థానాలు ఉపయోగించబడుతున్నాయి. శుద్ధరిషభం, ప్రతిమధ్యమం తప్ప తక్కిన స్వరస్థానాలన్నీ ఉండటం ఈ రాగానికి చాలా విశేషమని చెప్పవచ్చు.
రచనలు:
- నీవల్ల గుణదోషమేమి - ఝంపేతాళం - త్యాగరాజు
- అన్యాయము చేయకురా - ఆదితాళం - త్యాగరాజు
- సరసములాడేటందుకు - ఆదితాళం - జావళి
4.3.2. ఆనందభైరవి
ఈ రాగం 22వ మేళకర్త ఖరహరప్రియ రాగం జన్యంగా చెప్పవచ్చు. మాతృ రాగం నుండి వచ్చిన స్వర స్థానాలైనటువంటి షడ్జమం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశృతి దైవతం, కైసిక నిషాదం స్వర స్థానాలు మాత్రమే కాకుండా, అన్య స్వరాలైన అంతర గాంధారం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం కూడా ఈ రాగంలో కలిసి ఉన్నాయి.
ఖరహరప్రియ, దాని వర్గరాగాలలో పలుకుచున్న చతుశ్రుతి రిషభ, చతుశ్రుతి ధైవతాలకు ఆనందభైరవిలో అంతగా అవకాశం లేదు. రిషభం, గాంధారాలు, దైవతం, నిషాదాలు షడ్జ గ్రామ స్వరాల వలె పలుకుచున్నవి. కానీ, సగగమా, మగగమా ప్రయోగాలలో స్పష్టమైన సాధారణ గాంధారం కూడా పలుకుటకు అవకాశాలు లేకపోలేదు.
ఈ రాగంలో కాకలి నిషాదానికి కూడా కొంత అవకాశం కనిపిస్తుంది. ఈ అంతర గాంధారం, కాకలి నిషాద ప్రయోగాలు జానపద గేయ ప్రభావాలే.
ఆనందబైరవిలో ద్విశ్రుతి ధైవతమైన శుద్ధ దైవతం 'పాదమా', 'మదపమా', 'గమపదాదగా' అనే ప్రయోగాలలో కనిపిస్తుంది.
పురాతన కాలంలో ఉన్న ఆనందభైరవి రాగంలో పైన చెప్పిన లక్షణాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ రాగంలో గల 'కమల సులోచన' అనే గీతంలో శుద్ధ దైవతం, అంతర గాంధారం, కాకలి నిషాదాలు లేవు. 'నిదనిస' ప్రయోగం గమనింపదగినది. శ్యామశాస్త్రి, త్యాగరాజు వాడిన ఆనందభైరవికి, ముత్తుస్వామి దీక్షితులు వాడిన ఆనందభైరవి రాగానికి కొంత భేదం కనిపిస్తుంది. స్పష్టంగా పలుకు సాధారణ గాంధారానికి, శుద్ధ దైవత ప్రయోగానికి దీక్షితులు మంచి అవకాశం కల్పించివున్నారు.
దీక్షితులు తన 'మానసగురుగుహ రూపం భజరే' లోనే మనకు పరిచయమైన ఆధునిక ఆనందభైరవి స్వరూపాన్ని చూపించారు. శ్యామశాస్త్రికి ఈ రాగంతో కొంచెం ఎక్కువ చనువు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని భైరవి వర్గానికి చెందిన రాగంగానే పరిగణించి, స్వకీయ స్వరం కన్నా అన్యస్వర ప్రయోగమే ఎక్కువ గల భాషాంగ రాగంగా చెప్పవలసి ఉంది.
అంతరగాంధార ప్రయోగాలు:
- మమగరిగామపమమా
- మగగామ
- మగరి గామా
కాకలి నిషాధ ప్రయోగాలు:
- ససనీదనీసరీససా
- సస నీదనీసా
శుద్ధ దైవత ప్రయోగాలు:
- గమపదా
- గానిని దదా మపామగారి
ఉదాహరణలు:
- మరివేరే - చాపు తాళం - శ్యామశాస్త్రి
- ఓ జగదంబ - ఆది తాళం - శ్యామశాస్త్రి
- నీకే తెలియకపోతే - ఆదితాళం - త్యాగరాజు
- క్షీరసాగర విహార - చాపుతాళం - త్యాగరాజు
- హిమాచల తనయ - ఆది తాళం - శ్యామశాస్త్రి
- నీ మది చల్లగా - ఆదితాళం - శ్యామశాస్త్రి
- మానసగురుగుహ - ఆదితాళం - దీక్షిత్ర్
మూడు అన్య స్వరాలు కలిగి ఉండటం వలన ఈ రాగం ఎంతో రాగయుక్తంగా ఉంటుంది.
ఉపసంహారం
ఈ వ్యాసంలో భాగంగా భాషాంగ రాగాల గురించి పార్శ్వదేవుడు, సారంగ దేవుడు వంటి లక్షణకారులు చెప్పిన విషయాలను సమర్థిస్తూ, గాన కళా ప్రదర్శిని (పి. లలిత అన్నప్పారావు), నూకల చిన సత్యనారాయణ, యస్. ఆర్. జానకీ రామన్, శ్రీ పాద పినాకపాణి వంటి కొంతమంది గ్రంథాలను పరిశీలించి, అన్య స్వరాలు కలిగిన భాషాంగ రాగాల గురించి విపులంగా రాయడం జరిగింది.
ఈ వ్యాసం భాషాంగ రాగాలను కొత్తగా నేర్చుకునే వారికి, జనక-జన్య రాగాలను గురించి, జన్య రాగాల నుండి పుట్టిన భాషాంగ రాగాల గురించి తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా అన్య స్వర ప్రయోగాల గురించి తెలుసుకొని పాడటానికి, రాగాలాపన చేయడానికి, సంపూర్ణ భాషాంగ రాగాల అవగాహనకు ఈ వ్యాసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాస పరిధి దృష్ట్యా ఎన్నో భాషాంగ రాగాలు ఉన్నప్పటికీ, కొన్ని రాగాలను మాత్రమే తీసుకోవడం జరిగింది. ఈ వ్యాసంలో అన్యస్వర ప్రయోగాలు, సంచారాలు, రచనలు ఇవ్వడం జరిగింది. సంపూర్ణ జ్ఞానంతో పాడిన, వాయించిన ఈ భాషాంగ రాగాలు ఎంతో ప్రత్యేకంగా, అందంగా, వినేవారి హృదయాలను ఆకట్టుకునేలా ఉంటాయి. అదేవిధంగా ఇతర భాషాంగ రాగాలపై పరిశోధన జరిగితే సంగీత ప్రియులకు, సంగీత విద్యార్థులకు ఈ పరిశోధన ఎంతగానో ఉపయోగపడుతుంది.
- ఈ వ్యాసం కర్ణాటక సంగీతంలోని మేళకర్త వ్యవస్థను, భాషాంగ రాగాల ఆవిర్భావ నేపథ్యాన్ని స్పష్టం చేసింది.
- వివిధ లక్షణకారుల నిర్వచనాలను ఉటంకిస్తూ భాషాంగ రాగాల శాస్త్రీయ దృక్పథాన్ని వివరించింది.
- ఏక, ద్వి, త్రి అన్యస్వర భాషాంగ రాగాల లక్షణాలను, వాటిలోని ప్రత్యేక స్వర ప్రయోగాలను ఉదాహరణలతో సహా విశ్లేషించింది.
- బిలహరి, భైరవి, కాంభోజి, అఠాణా, కాపీ, ఆనందభైరవి వంటి ప్రసిద్ధ రాగాల స్వరూప విశేషాలను వివరంగా చర్చించింది.
- సంగీత విద్యార్థులకు, పరిశోధకులకు భాషాంగ రాగాల ప్రాథమిక, లోతైన అవగాహనను అందించటమే ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం.
ఉపయుక్త గ్రంథసూచి
- అహోబల. (2019). సంగీత పారిజాతం. భారతీయ విద్యా భవన్, మద్రాస్.
- అన్న అప్పారావు, లలిత. (2008). సంగీత శాస్త్ర చంద్రిక. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైద్రాబాద్.
- అన్న అప్పారావు, లలిత. (సంపాదకుడు). సంగీత కళా ప్రదర్శిని. పుట 84. (ఇది "పాదసూచికలు" నుండి తరలించబడినది. ప్రచురణకర్త/సంవత్సరం వంటి వివరాలు లభ్యం కాని కారణంగా పుస్తక శీర్షిక ఆధారంగా చేర్చబడింది)
- అయ్యంగార్, కె.వి. శ్రీనివాస్. (2001). గాన భాస్కరం. ఎమ్. ఆది & కో బుక్ పబ్లికేషన్స్, చెన్నై.
- ఏక, సుబ్బారావ్. (1951). సంగీత విద్యా దర్పణం (నాల్గో భాగం). ఓరియెంటెడ్ పబ్లికేషన్స్, తెనాలి.
- గంధం, శ్రీరామమూర్తి. (2026). సంగీత రత్నాకరం. సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం.
- ప్రకాష్, ఎస్. జయ. (2024). పరిశోధన విధానం. విశాలాంధ్ర పబ్లికేషన్స్.
- రామన్, యస్.ఆర్. జానకి. (1989). సంగీత శాస్త్ర సారం (రెండో భాగం). మీనాక్షి పబ్లికేషన్స్, మద్రాస్.
- సత్యనారాయణ, నూకల చిన. (1994). రాగ లక్షణ సంగ్రహం (ఒకటో భాగం, రెండో భాగం). సుందర కృప పబ్లికేషన్స్, సికింద్రాబాద్.
- సత్యనారాయణ, నూకల చిన. (సంపాదకుడు). సంగీత శాస్త్ర సుధార్భవం. పుట 89. (ఇది "పాదసూచికలు" నుండి తరలించబడినది. ప్రచురణకర్త/సంవత్సరం వంటి వివరాలు లభ్యం కాని కారణంగా పుస్తక శీర్షిక ఆధారంగా చేర్చబడింది)
- సత్యనారాయణ, వి. (2014). సంగీత లక్షణము. రౌతు బుక్ డిపో పబ్లిషర్స్, రాజమహేంద్రవరం.
- సత్యనారాయణ మూర్తి, అరిపిరాల. (సంపాదకుడు). సంగీత కళా ప్రదర్శిని. పుట 84. (ఇది "పాదసూచికలు" నుండి తరలించబడినది. ప్రచురణకర్త/సంవత్సరం వంటి వివరాలు లభ్యం కాని కారణంగా పుస్తక శీర్షిక ఆధారంగా చేర్చబడింది)
- శర్మ ఆకెళ్ల, మల్లిఖార్జున. సంగీత విద్యా మోదిని సంకలనం. హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

