AUCHITHYAM | Volume-07 | Issue-01 | January 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
7. కందుకూరి మాళవికాగ్నిమిత్రం నాటకానువాదం: అనుశీలనం
డా. పఠాన్ ఖాసింఖాన్
సహాయాచార్యులు, తెలుగుశాఖ, ఆధునిక భారతీయభాషావిభాగం,
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం,
అలీఘర్, ఉత్తరప్రదేశ్.
సెల్: +91 9494998492, Email: pathankhasimkham@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 13.12.2025 ఎంపిక (D.O.A): 24.12.2025 ప్రచురణ (D.O.P): 01.01.2026
వ్యాససంగ్రహం:
కందుకూరి వీరేశలింగం ఒక పండిత ప్రవరుడు, ప్రథమ సాంఘిక సంస్కర్త. ఆయన రచనలు సమాజానికి మార్గదర్శనం చేసాయి. కాళిదాసు రచించిన మాళవికాగ్నిమిత్రం నాటకాన్ని తెలుగులోకి అనువదించడం ఆయన సంస్కరణాభిలాషలో కీలకమైన చర్య. స్త్రీవిద్య, విధవా వివాహం, సర్వమత సమభావం, మూఢవిశ్వాస నిర్మూలన వంటి ప్రధానలక్ష్యాల సాధనకు ఈ అనువాదం ఒక బలమైన మాధ్యమంగా పనిచేసిందని తెలియజెప్పడం ఈ పరిశోధన వ్యాసం ప్రధానోద్దేశం. ఈ సామాజికాంశాలు నేటికీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అధ్యయనాల ఆవశ్యకత స్పష్టం. ఈ శీర్షిక కందుకూరి అనువాదవ్యూహాలను, సామాజికలక్ష్యాలను ప్రతిబింబిస్తుంది. పూర్వ అనువాదాలతో పోల్చుకుంటూ, వీరేశలింగం అనువదించిన మాళవికాగ్నిమిత్రం నాటకాన్ని ప్రాథమిక ఆధారంగా పరిశోధించడమైనది. మూల సంస్కృత పాఠం, ఇతర తెలుగు అనువాదాలను సహాయకాలుగా ఉపయోగించడమైనది. ఈ పరిశోధన కందుకూరి అనువాదంలో చోటు చేసుకున్న మార్పులు, చేర్పులు, తొలగింపులను విశ్లేషించింది, అనువాదకుని ఆశయాలను, సామాజిక దృష్టిని అర్థం చేసుకునే పద్ధతిని అనుసరించింది. నాటకంలోని 96 శ్లోకాలలో 94కి పద్య అనువాదం చేయడం, కేవలం రెండు శ్లోకాలకు గద్యం రాయడం వంటి వివరాలు పరిశోధన పరిధిని వెల్లడిస్తాయి. నాందీ శ్లోకంలో చేసిన మార్పులు, భాసుడు ధావకుడు అనే పేర్ల ప్రయోగం, నాట్యాచార్యుల పోలికలు, మాళవిక నైజ వర్ణనలు, మధ్యాహ్న వర్ణన, మూఢవిశ్వాసాలకు సంబంధించిన 'నాగ' పదం తొలగింపు, 'కన్దు' పదం 'మంగలం'గా మార్పు, 'మత్స్యణ్ణికా' స్థానంలో 'పానకపు కుండ' వాడకం, 'తేనెటీగ' పోలిక పరిత్యాగం వంటి అనేక ఉదాహరణలతో వీరేశలింగం తన సంస్కరణాశయాలను అనువాదంలో ఎలా నిక్షిప్తం చేసారో ఈ అధ్యయనం వివరంగా తెలియజేస్తుంది. స్త్రీవిద్య ప్రాముఖ్యత, విధవా పునర్వివాహాలకు పరోక్ష ప్రోత్సాహం, అన్యమతాల గౌరవం, అంధవిశ్వాసాల నిర్మూలన అనే వీరేశలింగం ఆశయాలు ఈ అనువాదంలో స్పష్టంగా ఆవిష్కృతమయ్యాయి. ఆయన భాషాశైలి సులభ గ్రాంథికం, తెలుగు పదాలకు ప్రాధాన్యం ఇస్తుంది, అన్వయ క్లిష్టత ఉండదు, సుదీర్ఘ సమాసాలకు దూరంగా ఉంటుంది. వలపల గిలక వాడకం లాంటి లిపి మార్పులు ఆయన సరళీకరణా దృష్టిని సూచిస్తాయి. ఈ పరిశోధన కందుకూరి సాహిత్యకృషి కేవలం ఒక అనువాదం మాత్రమే కాక, సామాజిక పరివర్తనకు దోహదపడిన ఆయుధమని స్పష్టం చేస్తుంది. భవిష్యత్ పరిశోధనలకు ఆయన ఇతర అనువాదాలపై, సమకాలీన సంస్కరణాపద్ధతులపై అధ్యయనాలకు ఇది మార్గం సుగమం చేస్తుంది.
Keywords: కందుకూరి వీరేశలింగం, మాళవికాగ్నిమిత్రం, అనువాద సిద్ధాంతం, సాంఘిక సంస్కరణ, స్త్రీవిద్య, విధవా వివాహం, సాహిత్య విశ్లేషణ, కాళిదాసు.
1.0 ప్రవేశిక
విశ్వజగత్తు విరాజిల్లటానికి స్త్రీ విద్య ప్రధానమైనది. కందుకూరి తన గేహ, దేహ జీవితకాల, ధన రూపమైన సర్వస్వాన్ని ఈ సాధన కోసం త్రికరణశుద్ధిగా సమర్పించిన సత్యమైన త్యాగమూర్తి. తన లక్ష్యసాధనకు మాళవికాగ్నిమిత్రానువాదం సైతం సత్సాధనంగా ఉపయుక్తమైందని భావించవచ్చు. స్త్రీ విద్య, విధవా వివాహం, అన్యమతాదరణం లాంటి విషయాలు ప్రస్తుత సమాజంలో స్వల్పంగానే కనిపిస్తున్నాయి. వీని సంవర్ధనం అధికంగా జరగాలి. అందుకు ఇటువంటి అధ్యయనాలు, అధ్యాపన ప్రక్రియలు ఎంతైనా ఆవశ్యకం.
కాళిదాసు మాళవికాగ్నిమిత్రమును కందుకూరి యథామూలకంగానే ఆంధ్రీకరించారు. ఎడనెడ కొన్ని మార్పులను చేసారు. రచయిత ఏదో ఒక సత్ప్రయోజనాన్ని ఆశించి మూలంలో కంటే మార్పులు, చేర్పులు, తొలగింపులు, కుదింపులు చేసి ఉంటారు. వాటిని సమీక్షించేటప్పుడు అనువాదకునికి సంబంధించిన ఆత్మీయతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే మనం వారి లక్ష్యాలకు చేరువకాగలం. అందుకే కందుకూరి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత రూపకాన్ని పరిశీలించడం జరుగుతుంది.
2.0 అనువాద పద్ధతి - సమగ్ర విశ్లేషణ
2.1 శ్లోకాల అనువాదం
ఈ నాటకం మొత్తంలో 96 శ్లోకాలు ఉండగా, కందుకూరి 94 శ్లోకాలకు పద్యానువాదం చేసారు. కేవలం రెండు శ్లోకాలకు గద్యానువాదం మాత్రమే చేసారు. ఆ రెండు శ్లోకాలు ఇద్దరు నాట్యాచార్యులు పరస్పర జయకాంక్షతో, దోషైకదృక్కులుగా ఉన్న సందర్భంలోనివి. అందుకే కవికి అప్రియమైన అవి రెండు గద్యరూపం దాల్చినవేమో. ఈ నాటకాన్ని తెనిగించినవారు పలువురున్ననూ, పద్యానువాదకులు తక్కువ. ఛలిక ప్రదర్శనం ఈ రూపకంలో ప్రధానమైనందున కందుకూరి పద్యంతో పాటు, పాట కూడా సన్నివేశ సముచితంగా, రాగతాళ యుక్తంగా, రసరమ్యంగా, తెనుగుదనము ఉట్టిపడునట్లు, వీనులవిందుగా విలిఖించారు. ఘంటారాగం, ఆదితాళం అని ఆ పాటకు రాగతాళాలను సైతం కందుకూరి సూచించారు.1
2.2 నాందీ పద్యము - పురుషార్థ ప్రబోధం
నాందీ శ్లోకం సంస్కృతంలో దీర్ఘ వక్రముతో (ఏ) ఆరంభమయితే, తెలుగులో హ్రస్వవక్రము (ఎ) తో ఆరంభమైంది.
ధర్మార్జితమైన అర్థాన్ని తన అవసరాలకు తక్కువగా వాడుకొని ఇతరులకు ఎక్కువగా దానం చెయ్యాలని, సతీసమేతంగా జీవిస్తూనే జితేంద్రియుడు కావాలని, తమ ధర్మాలను బహువిధాలుగా నిర్వర్తిస్తూ కూడ నిగర్విగా ఉండాలని, తమ హృదయాలందలి తామస వృత్తిని త్యజించి వివేకంతో విముక్తిని సాధించాలని నాందీపద్యం పురుషార్థాలను ప్రబోధిస్తున్నట్లుంది. ఇందులో ఏకేశ్వరునికి బదులుగా తెలుగువారికి సుపరిచితుడైన మహేశుని ప్రయోగించి ఉండవచ్చు. వివేకం మూలంగా సత్, అసత్ అనే ఉభయం విదితమవుతాయి. అందుకే ‘సన్మార్గాలోకనాయ’2 స్థానంలో ‘వివేకము’3 విరచితమైంది. లక్ష్యసిద్ధికి చిత్తశుద్ధి ముఖ్యమైనది. అందుకే హృదయంబుల అని మూలాధికంగా చేర్చారు.
2.3 అష్టమూర్తుల ప్రస్తావన
నాస్తికుడు, ఆస్తికుడు, ఏ మతస్తుడైనా కనిపించే సృష్టిని కాదనలేడు. అందుకే కవి కన్పిస్తున్న అష్టమూర్తులు - నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, హోత, సూర్య చంద్రులను - ప్రస్తావించడం జరిగింది. ఈ సృష్టిని చూసి ఆ స్రష్టను స్మరించాలని భావం.
3.0 అనువాదంలోని విశేషమైన మార్పులు
3.1 భాసుని ప్రస్తావన - ధావకుని చేర్పు
రూపకారంభంలో పారిపార్శ్వికుడు భాస, సౌమిల్లక, కవిపుత్రాదులు ప్రథితయశస్వులుగా ప్రస్తావించాడు. కందుకూరి భాసునికి బదులుగా ధావకుని పేర్కొన్నారు. భాసునికి ధావకుడని మరొక పేరు ఉందో, తాను అనుసరించిన తారానాథతర్కవాచస్పతి ప్రతిలో అలా ఉందో, లేదా భాస నాటకాలు భాస రచించినవి కాదని విశ్వసిస్తున్నారో, ఎందుచేతనో వీరేశలింగం గారు మొత్తం మీద భాసుని పరిత్యజించారు.
3.2 ప్రస్తావనలో సూత్రధారుని వాక్యాలు
ప్రస్తావనలో సూత్రధారుడు "ప్రాతదంతా సాధువు కాదు. క్రొత్తదనం వలన కావ్యానికి కొఱతరాదు. యోగ్యులు అరసి ఉత్తమము గ్రహిస్తారు. మూఢులు బుద్ధిలేక అన్యులనే నమ్ముతారు" అని వక్కాణిస్తాడు. పరీక్షించటానికి యోగ్యత తప్పనిసరి కావున ‘సన్తః’కు యోగ్యులని, క్రొత్తదానిలో కొఱతలేకపోవటమే ముఖ్యం కాబట్టి ‘అనవద్యమ్’4కు కొఱతరాదని5, రెండింటిలోనే కాదు ఎన్నింటిలోనైనా యోగ్యులు ఉత్తమమును గ్రహించగలరని కాబోలు 'అన్యతరద్' కు ఉత్తమంబు అని ఉచితంగా అనువదించారు.
3.3 గణదాసుని వాక్యాలలో మార్పులు
మాళవిక నాట్యప్రదర్శనానంతరం రాజు మెప్పు బడసిన గణదాసు "నిష్పక్షపాతులైన సాధుజనులే శిక్షకుని విద్య శుద్ధతను తెలుపగలరు. వహ్నిలో బంగారం వలె రాజసన్నిధిలో తమ చదువు సైతం వన్నె కెక్కుతుంది" అని పలుకుతాడు. ఇందులో ‘సన్త’కు నిష్పక్షపాతులైన సాధుజనులు అని ‘శ్యామాయతేన’కు వన్నెకెక్కు6 అని ఆంధ్రీకరించారు. నిష్పక్షపాత గుణం నిగ్గు తేల్చటానికి నిశ్చయంగా ఉండవలసినదే. అందుకే అదనంగా నిష్పక్షపాతులు అనే విశేషణాన్ని వినియోగించారు. ఇక్కడ చదువును బంగారంతో పోల్చారు. అగ్నిలో అపరంజిలాగా స్వామి సన్నిధిలో చదువు 'నల్లబడదు’ అనే దాని కంటే వన్నె కెక్కు అనేది అత్యంతవరముగా ఉంది. ‘సన్తః’7 అనే పదానికి సందర్భానుగుణంగా పైన యోగ్యులని, ఇక్కడ సాధువులని8 చక్కగా ఆంధ్రీకరించారు.
3.4 రాణి ప్రసంగంలో మార్పు
రాజుతో మధ్యాహ్నమైందని వచిస్తూ రాణి ‘నిర్వర్తయతు’ ఆర్యపుత్రో ‘మజ్జనవిధిం’9 అని పలుకుతుంది. అనువాదంలో ‘దేవరవారు మాధ్యాహ్నిక కృత్యములను దీర్చవలెను'10 అని ఉంది. సంస్కృతంలో మజ్జన విధి మాత్రమే ప్రసక్తమయితే తెలుగులో కృత్యములన్నింటినీ ప్రవచించడం జరిగింది. మజ్జనమును పలుకకుండానే స్ఫురింప చేయడం తెలుగువారి సభ్యభాషణా స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.
3.5 నాట్యాచార్యుల పోలికలో మార్పు
పరస్పర జయకాంక్షతో నాట్యాచార్యులిద్దరు రాజదర్శనానికి వస్తున్నప్పుడు వారు ‘సాక్షాద్ భావావివ శరీరిణౌ’11 అని మూలంలో ఉంటే, ‘సాక్షాద్ కోపదేవత వలే ఉన్నారు’12 అని కందుకూరి మార్చారు. పురోభాగులై పరస్పర జయకాంక్షతో ఉభయాచార్యులు ఉన్నారు, కావున కోపదేవతలతో పోల్చడమే భావస్ఫోరకంగా, ప్రకరణయుక్తంగా ప్రజ్వలిస్తుంది.
3.6 రాజు ప్రశ్నకు సమాధానం
చిత్తంలో ధారిణికి దగ్గరలో ఉన్న ఆమె పేరేమని రాజు మరీమరీ అడుగుతున్నపుడు సంస్కృతంలో – ‘దేవీం పునరప్యనుబంధుమ్’13 అని ఉంటే కందుకూరి - దేవిగారిని ‘గుచ్చి గుచ్చి అడిగారు’14 అని తెనిగించారు. ఇతర అనువాదకులు మళ్ళీ మళ్ళీ అడిగారని రాసారు. కాని ‘గుచ్చి గుచ్చి’ అనడం అచ్చమైన తెనుగుతనంతో అలరారుతుంది. అంతేకాక ఇక్కడ ఉన్న రూపక బీజం సైతం ‘గుచ్చి గుచ్చి’ అనడంతో రూపు ధరిస్తుందని తలంచవచ్చు.
3.7 మాళవిక నటన అనంతర సన్నివేశం
ప్రదర్శనానంతరం మాళవిక వెళ్తుంటే విదూషకుడు క్రమం మరిచావని నిలబడమని నెపంతో అంటున్నపుడు (మాళవిక జంకి నిలుచున్నది) 15 అని మార్చారు. తనలో తప్పుకొలువులో ఎన్నుతున్నపుడు జంకడం కన్యా స్వభావసిద్ధం. అందుకే ‘మరలి’ అనకుండా ‘జంకి’ అనడం ప్రకృతి రమణీయంగా రాజిల్లుతుంది.
3.8 మధ్యాహ్న వర్ణనలో అనువాద సూక్ష్మత
మధ్యాహ్నమును – ‘సౌధాన్యత్యర్థతాపాద్ వలభిపరిచయద్వేషి పారావతాని’ ఇత్యాదిగా వర్ణించారు.16 తెలుగులో – ‘మించిన వేడి చేరవలె మేడల చూరులు పావురంబులు’ అని తొలికి, తుదికి నడుమ పొసగు విధంగా మేళవించారు. హంసలు దీర్ఘకలందలి పద్మపత్ర ఛాయలందు కనులు మూస్తున్నాయి.17 నెమళ్ళు దప్పికతో నీళ్ళు త్రాగటానికి జలయంత్రాలను చేరుతున్నాయి. ఎండ తీవ్రతకు పావురాలు మాత్రం మేడపై ఇళ్లు విడుస్తున్నాయనడం ఔచిత్యంగా లేదు. ‘వలభి’ అంటే ఇంటి ముంజూరు లేదా మేడపై ఇల్లు అని రెండర్థాలున్నాయి. కాబట్టి సందర్భోచితంగా హంసలకు, నెమళ్ళకు భిన్నంగా అందంగా పావురాలు కూడ మేడల చూరులు చేరుతున్నాయనడం కందుకూరి సూక్ష్మదృష్టిని పట్టిచూపుతుంది.
3.9 ధారిణి మాళవికను రక్షించు తీరు
ధారిణి మాళవికను రక్షించే తీరును వర్ణిస్తూ వకుళావళిక ‘నాగరక్షిత ఇవ నిధనం’ అని తెలుపుతుంది. వీరేశలింగం గారు ‘నాగ’ను విడిచి ‘నిధిని కాపాడినట్లు’ అని విరచించారు. మూఢవిశ్వాసాలను సమూలంగా నాశమొనరించుటకు ఉద్యమించిన కందుకూరి, తన లక్ష్యసాధనకు దీనిని సదవకాశంగా భావించి ‘నాగ’ పదాన్ని పరిత్యజించి అంధవిశ్వాసానికి తావు లేకుండా చేసారు.
3.10 విదూషకుడు ఎత్తిన దోషం
ముందుగా బ్రాహ్మణ పూజచేయలేదని మాళవిక ప్రదర్శనంలో విదూషకుడు దోషాన్ని ఎంచగా ‘నఖలు ప్రథమం నేపథ్యదర్శనమ్’18 అని వివరిస్తాడు. తెలుగులో ‘ఇది పరీక్ష కాని ఆట కాదు కదా’19 అని అనువాదం. ఇక్కడ ‘పరీక్ష’ అనేది మూలం కంటే అదనంగా చేర్చారు. అలాగే ‘ఆట కాదు కదా’ అన్నారు. పరీక్ష అనే పదం అవధానాన్ని, ఆటకాదు అనడం పరిహాసం కాదని సూచిస్తూ గురువు క్రోధాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఆట తెలుగు ప్రకృతిని ప్రతిబింబిస్తుంది. ఈ అనువాదం అనుసంధానగుణంగా అలరారుతుంది.
3.11 విదూషకుడి ఆకలి బాధ
మధ్యాహ్న సమయంలో విదూషకుడు ‘దృఢం విపణి కన్దురివమే ఉదర / హృదయాభ్యన్తరం దహ్యతే’20 అని క్షుద్బాధ తెలుపుతాడు. తెలుగులో ‘అంగడిలోని మంగలము వలె నిశ్చయముగా నా కడుపు మండుకొని పోవుచున్నది’21 అని ఉంది. పలువురు అనువాదకులు ‘కన్దుకు పెనము’ అని రాసారు. కడుపుకు పెనమునకు ఆకారంలో పోలిక లేదు. కాని మంగలానికి కడుపుకి మరింత పోలిక ఉంటుంది. పల్లెలందు మంగలంలోపల కందులు మున్నగునవి వేల్చుతుంటారు. అట్లు పెనం పైన వేస్తుంటారు. కడుపులోపల ఆకలి మండుతుంది. అందుకే కందుకూరి ‘కన్దు’కు మంగలంగా భాజనంగా మార్చారు.
3.12 మాళవిక ప్రవేశం - విదూషకుడి వర్ణన
ఉద్యానవనంలో మాళవిక ప్రవేశించగా విదూషకుడు 'సీధు పానోద్వేజితస్య మత్స్యణ్ణి కోపనతా'22 అని రాజుతో అంటాడు. కందుకూరి తెలుగులో - 'మద్యపాన విహ్వలుడై ఉన్న వాని వద్దకు పానకపు గుండ తీసికొని రాబడినది'23 అని విలిఖించారు. ‘మత్స్యణ్ణికా’కు కండచక్కెర లేదా పటిక బెల్లం అని అన్యులు అనువదిస్తే వీరేశలింగం గారు ‘పానకపు కుండ’ అని మార్చారు. సాధారణంగా పానకం బెల్లంతో చేస్తారు. మత్తు వదలటానికి బెల్లం మహౌషధంగా భావిస్తుంటారు. అంతేకాక ‘లగ్నానికి పిలుచుటకు పెండ్లికొడుకు విడిదిలోనికి ఆడపెళ్ళివారు బెల్లపు పానకము కలబిందె తీసికొని వెళ్తారు’ అనే ఘట్టం సైతం తెలుగువారికి స్ఫురిస్తుంది. కావున ‘పానకపు కుండ’ శుభసూచకంగా, మనోరథసిద్ధిగా పర్యాప్త పాత్రంగా భావించి కందుకూరి విరచించారని అవగతమవుతుంది.
3.13 రాజు, మాళవిక చిత్రావలోకనం
మాళవిక సభలో ప్రవేశించబోవుచుండగా విదూషకుడు – ‘ఉపస్థితం నయన మధు సంనిహిత మక్షికంచ, తదప్రమత్త ఇదానీం పశ్య’24 అని రాజుకు చెపుతాడు. తెలుగులో ‘నీ అభీప్సితమూర్తి విశేషము దృష్టి పథమున బడబోవుచున్నది. కనుక నీవిప్పుడు అప్రమత్తుడవై చూడుము’25 అని మార్చారు. ఇరావతిని లేదా ధారిణిని తేనెటీగగా భావించి ఉండవచ్చు. తేనెటీగలు సమకూర్చుకున్నది తేనె. అది వాటి సొత్తు. అందుకే తేనె తుట్టెను కదిలిస్తే తేనెటీగలు కదిలించిన వానిని వెంటాడి ప్రాణిహానిని కూడ కలిగిస్తాయి. ఇక్కడ రాజు ప్రాణహాని రాణులు తలపెట్టరు. ఎందుకంటే రాజు తమ సొంతం. అందుకే ఇటువంటి అసంగతమైన పోలికలను వీరేశలింగం గారు విడిచి పెట్టారు.
విదూషకుడు మాళవికను - నఖలు అస్యా' ‘ప్రతిచ్ఛన్దాత్పరిహీయతే మధురతా’26 అని పొగుడుతాడు. దీనిని పూర్తిగా మార్చి ‘పరాధీనురాలయి ఉన్నను, ఆమె సౌందర్యమునకు కొఱత ఏమీ లేకయున్నది గదా?’ 27 అని కందుకూరి రాసారు. మాళవిక చిత్రాన్ని పూర్వం విదూషకుడు సైతం చూసాడేమో అనే అనుమానం మూలం వలన కలుగుతుంది. మార్చి రాయడం వలన ఆ అనుమానం దూరమైంది. చిత్రపటమును రాజు చూసాడు కాబట్టి - ఆనాడు చిత్రమును వీక్షించినపుడు అటువంటి సొగసు ఉండదని సంశయం కలిగింది. కాని నేడు ప్రత్యక్షంగా చూస్తే చిత్రించిన శిల్పి అప్రౌఢుడుగా తలస్తున్నాను' అంటాడు. మూలంలో ‘శిథిల సమాధిని’ మార్చి అప్రౌఢుడని అనువదించారు. అనువాదం అనువుగా అమరింది. ఇంకా ఇటువంటి మార్పులు మరికొన్ని పొడచూపుతున్నాయి.
4.0 సామాజిక దృక్పథం, సంస్కరణలు
4.1 స్త్రీవిద్య ప్రాముఖ్యత
‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటున్నారు. ఇంకా ఇల్లాలి చదువు ఇల అంతా వెలుగు అంటారు. అనాలి కూడ. ప్రస్తుత రూపక ప్రారంభమే విద్యా విషయక ప్రస్తావనతో ప్రకాశిస్తుంది. వివేకమిచ్చి హృదయాలలోని తామసవృత్తిని తొలగించమని పరమేశ్వరుని ప్రార్థించారు.
శిష్యులకు గురువులు నేర్పిన దానిని బట్టి వారి నైపుణ్యాన్ని నిర్ణయించాలని పరివ్రాజిక 'కొందరు కోవిదులైనా విద్య నేర్పలేరు. కొందరు నేర్చుకున్నది కొంచెమైనా గొప్పగా నేర్పుతారు. రెండింటిలో నైపుణ్యం ఉన్నవారే శిక్షకాళిలో అగ్రగణ్యులు' అని వక్కాణిస్తుంది. మందమతి అయిన శిష్యురాలు తిన్నగా విద్య గ్రహించకపోతే అది గురువు దోషమవుతుందా అని రాణి వాదిస్తుంది. అప్పుడు గణదాసు 'కొలువు సంపాదించాను అని భావించి, వాదానికి జడిసి, పరదూషణలను సహించి చదువును ఒక జీవనోపాధిగా జేసికొనినవాడు చదువును అమ్ముకొనే వణిజుడ’ని ప్రవచిస్తాడు. ఇటువంటి బహుపాత్రల బహువిధ సంభాషణలతో ప్రస్తుత రూపకంలో విద్యా ప్రాముఖ్యత, దాని మహత్యం విదితమవుతాయి. హరదత్తుడు ఇరావతి గురువు. గణదాసు మాళవిక గురువు. పరివ్రాజిక, పట్టపురాణి, పరిచారికలు, రాజు, విదూషకుడు వంటి పాత్రల ప్రవచనాలలో పలు ప్రకరణాలలో బహువిధాలుగా విద్య ప్రసక్తమైంది.
నాటకారంభంలో నాయిక దాసి, అథమ కులస్థురాలు. రాకుమారి అని తెలియదు. అయినా ధారిణి ఆమెకు విద్య నేర్పిస్తుంది. అలాగే ఇరావతి సైతం హరదత్తుని వద్ద విద్యను అభ్యసిస్తున్నట్లు ప్రస్తావించడం జరిగింది.
తుట్టతుదకు సత్కులోద్భవ మాళవిక అని ధారిణి అంటుండగా పరివ్రాజిక ‘గనిలో పుట్టినా జాతిరత్నమైన మణి సైతం స్వర్ణంతో సంయోగార్హమైనది’28 అని ప్రబోధిస్తుంది. ఈ మూలభావాన్ని మార్చి కందుకూరి తన లక్ష్యానికి తగినట్లుగా ‘గనిలో పుట్టినదైనా పొసగే విధంగా, మెరిసే లాగా, సానబట్టకుండా స్వర్ణంతో సంయోగమొనగూర్చటానికి మణి అర్హం కాదని29 విలిఖించారు. ఎంత ఉత్తమకులంలో పుట్టినా అధ్యయనం, అభ్యాసం, వినయ విధేయత లాంటి సద్గుణాలు లేకుంటే విలువ లేదని’ ఒనరంగా సానబట్ట కున్న అనే అనువాదం ప్రవచిస్తున్నట్లుంది. ప్రస్తుత రూపకం ఇటువంటి ప్రమాణాలతో స్త్రీ విద్యా ప్రాముఖ్యతను ప్రకటిస్తున్నట్లుంది.
4.2 విధవా వివాహాల ఆవశ్యకత
సహమానవులతో సరిపోల్చుకోవటం మానవ స్వభావం. పరుల గొప్పలను పరీక్షించే వాళ్ళు పరిమితంగా ఉంటారు. పురోభాగులు మాత్రం పుష్కలంగా లభిస్తారు. ఈ నాటకంలో నాయకుడు, యుక్తవయస్కుడైన పుత్రుడున్నా, ఇద్దరు భార్యలున్నా ముచ్చటగా మూడవ పెళ్ళి చేసుకుంటాడు. యుక్తవయస్సులోనే విధవలైన యువతులలో ఎక్కువమందికి ఈ నాయకుని చూసి తాము మళ్ళీ పెళ్ళి చేసుకుంటాం అనేది పెద్ద తప్పు కాదనిపిస్తుంటుంది. అలా అనిపించడంలో చిన్న తప్పు కూడ కనబడదు. ఇది నారీ నైజమే కాదు. ఇది నర నైజమని సైతం తన దాకా వచ్చినపుడు విదితమవుతుంది. ఈ నాటకం చూస్తున్నప్పుడు, వారిలో అలాంటి భావాలు ఉత్పన్నమై వారు పునర్వివాహాలు చేసుకునేందుకు ప్రస్తుత రూపకం పరోక్షంగా దోహదం చేస్తుందని భావించడంలో అయుక్తమేమి లేదనిపిస్తుంది. ఎందుకంటే అనుకూలతల కంటే అధికంగా ప్రతికూల ప్రబోధనలు హృదయాలకు హత్తుకుంటుంటాయి. విధవా వివాహాలను స్వయంగా దగ్గరుండి జరిపిస్తున్న కందుకూరి గారి కార్యాచరణానికి ఈ రూపకం సైతం ఈ విధంగా సత్ కార్యసాధకంగా కనిపిస్తుంది.
4.3 సర్వమత సమ్మానం
పరివ్రాజిక సాధారణంగా బౌద్ధ సన్యాసిని. బౌద్ధ ధర్మావలంబిని అయిన పరివ్రాజికను రాజు, రాణి, ఆచార్యులు, విదూషకుడు వంటి వారందరు ఆదరిస్తారు. రాజు ఎదుట గురువుల పరీక్షా పద్ధతిని నిర్ణయించడం, పరీక్షలో ప్రథమ ప్రాధాన్యతను వయోవృద్ధుడైన గణదాసుకి ఇవ్వడం, రాణికి బహువిధాల ప్రబోధనలు చేయడం లాంటి మహత్కార్యాల మూలంగా ఆమె పొందిన గౌరవ ప్రతిష్ఠలు, సమున్నత స్థానం స్పష్టమవుతుంది. చివరకు ఆమె తమ రాజు మాధవసేనుని వద్దకు వెళ్తానంటే, రాణి, రాజు ఇద్దరు ఆమెను వారించి తమ వద్దనే ఉండవలసిందిగా అభ్యర్థిస్తారు. తమను విడిచి వెళ్తానంటున్నందుకు చింతను వ్యక్తం చేస్తారు. రాజు అయితే ఆమె క్షేమ సమాచారాన్ని మాధవసేనునికి లేఖ ద్వారా తెలియజేస్తామంటాడు. ఈ విధంగా అన్యమత సమ్మానం సైతం అగుపిస్తుంది.
4.4 మూఢవిశ్వాసాల నిర్మూలనం
విదూషకునికి పాము కాటు వేసినదని అన్నప్పుడు, పరివ్రాజిక పాము కఱిచిన అంగాన్ని ఛేదించడం, కాల్చడం, ఆ గాయం నుండి రక్తం తీయడం వలన ఆ వ్యక్తిని బ్రతికించవచ్చని సూచిస్తుంది. కాని రాజు ఉదకుంభ, సర్పముద్రా విధానం ప్రయోగించే ధృవసిద్ధి దగ్గరకు పంపుతాడు. ఎందుకంటే వారికి ముఖ్యంగా కావలసినది, మాళవికను విడిపించటానికి రాణిగారి నాగముద్రాంగుళీయకం. అందుకోసం విదూషకుడు పాము కఱిచినట్లు గొప్ప నటన చేస్తున్నాడు. ఇప్పుడు వైద్య శాస్త్ర ప్రకారం ఛేదించడం, కాల్చడం, రక్తం తీయడం వలన గాయమవుతుంది. బాధ కలుగుతుంది. ఏ బాధ లేనిది, మోసపూరితమైనది ధృవసిద్ధి తాంత్రిక పద్ధతి. పాము కాటు ఒక పెద్ద నటన, తాంత్రిక పద్ధతి మరో పెద్ద వంచన. ఇటువంటి సంఘటనలను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇందలి మూఢవిశ్వాసం ప్రస్ఫుటమవుతుంది. ఈ విధంగా ఈ నాటకం అంధవిశ్వాసాలను నిర్మూలించడానికి సైతం ఉపయుక్తమవుతుంది.
5. భాషాశైలి
వీరు చేస్తున్నది అనువాద రచన కావున వీలైనంతగా తెలుగు పదాలను ప్రయోగించుటకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. మూలం సంస్కృతం కావున సందర్భానుగుణంగా సంస్కృత పదాలు సైతం సులభగ్రాహ్యంగా విరచించారు. అన్వయక్లిష్టత లేకుండా సుదీర్ఘ సమాస రహితంగా, పరుష పద విరహితంగా పద్యరచన సాగింది. సంధి నియమాలను పాటిస్తూ, అర్థానుస్వార, పూర్ణానుస్వార లక్షణాలను అనుసరిస్తూ శకట రేఫను సైతం ఉపయోగిస్తూ, ఎక్కడో ఒకటి రెండు తప్ప అన్యదేశ్యాలకు తావు లేకుండా సులభమైన కావ్యభాషలో వీరి అనువాదం జరిగింది. అందువలన ఈ రూపకంలోని వీరి శైలిని సులభ గ్రాంథిక భాషాశైలి అని చెప్పవచ్చు. ఇందులో ‘ర’ ఒత్తుకు బదులుగా వలపలగిలకను రాసారు. ఉదాహరణమునకు ‘వర్షము’ అని రాయుటకు ‘వష 9ము’ అని లిపిలో వలపల గిలకను ముద్రించారు.
6. కందుకూరి వీరేశలింగం గారి వ్యక్తిత్వం
కందుకూరి మానవ మహోపకారి. విశ్వహితం కోసం విరచించి, స్త్రీ విద్యార్థం అవమానాలు, అపవాదాలు అనుభవించి, విధవా వివాహాల కోసం వీరోచితంగా పోరాడి విజయం సాధించి, అంధవిశ్వాసాలను అంతమొందించి ఈ సమాజంలో, సాహిత్యంలో, మహిళల మనస్సుల్లో సతతం సముజ్జ్వలంగా వెలుగొందుతున్న దీపం వీరేశలింగం.
ఉపసంహారం
- కందుకూరి వీరేశలింగం గారి మాళవికాగ్నిమిత్ర అనువాదం కేవలం ఒక భాషాంతరీకణమాత్రమే కాదు, ఇది సామాజిక సంస్కరణకు వారెంచుకున్న సాధనం.
- తెలుగుదనం ఉట్టిపడేలా, భావగాంభీర్యం తగ్గకుండా, మూలానుసరనంగా అనువాదం సాగింది.
- స్త్రీ విద్య, విధవా వివాహం, సర్వమత సమభావం, మూఢనమ్మకాల నిర్మూలన వంటి ప్రగతిశీల ఆలోచనలను నాటకం ద్వారా ప్రచారం చేసారు.
- సులభమైన గ్రాంథిక భాషాశైలితో సామాన్య ప్రజలకు కూడా సాహిత్య ఆస్వాదన కలిగేలా చేసారు.
- కందుకూరి సాహిత్య కృషి, సామాజిక సంస్కరణ దృష్టి అవిభాజ్యమైనవి. అవి తెలుగు సమాజంపై చిరస్థాయిగా ప్రభావం చూపాయని ఈ నాటకానువాదంతో చెప్పవచ్చు.
సూచికలు
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 19
- మాళవికాగ్నిమిత్రమ్, మహాకవి కాళిదాసః, ప్రథామంకం. శ్లోకం. 1
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 1
- మాళవికాగ్నిమిత్రమ్, మహాకవి కాళిదాసః, ప్రథామంకం, శ్లోకం. 2
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 1
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం. 21
- మాళవికాగ్నిమిత్రమ్, మహాకవి కాళిదాసః, ద్వితీయాంకం, శ్లోకం. 9
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 21
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 57
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట.23
- మాళవికాగ్నిమిత్రమ్, మహాకవి కాళిదాసః, ప్రథామంకం, శ్లోకం. 10
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 8
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 10
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 3
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 19
- మాళవికాగ్నిమిత్రమ్, మహాకవి కాళిదాసః, ద్వితీయాంకం, శ్లోకం. 12
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 23
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 23
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 21
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 58
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 24
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 73
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 29
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 43
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 17
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 43
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 18
- మాళవికాగ్నిమిత్రమ్, మహాకవి కాళిదాసః, పంచమాంకం, శ్లోకం. 18
- మాళవికాగ్నిమిత్రము. కందుకూరి వీరేశలింగం, పుట. 76
ఉపయుక్త గ్రంథసూచి
- మహాకవికాళిదాసః, మాళవికాగ్నిమిత్రమ్. చౌఖమ్బాసురభారతీ ప్రకాశన్, వారణాసీ, 2018
- రామాంజనేయశర్మ, దోనెపూడి. కాళిదాసు మూడు నాటకాలు- తెలుగు : పీకాక్ క్లాసిక్స్, హైదరాబాద్, 2009
- విశ్వేశ్వరశాస్త్రి, పిసుపాటి. శ్రీ కాళిదాసకవితా వైభవము. ప్రథమభాగం, శ్రీ విజయలక్ష్మీ పవర్ ప్రెస్- భట్నమిల్లి, 1987
- పైదే. ద్వితీయభాగం, 1988
- పైదే. తృతీయభాగం, 1992
- పైదే. చతుర్థభాగము 1989
- వీరేశలింగము, కందుకూరి. మాళవికాగ్ని మిత్రము. శ్రీరామముద్రాక్షరశాల, రాజమహేంద్రవరము, 1938
- సుజాతారెడ్ది, ముదిగొండ. సంస్కృతాసాహిత్యచరిత్ర. తెలుగు విశ్వవిద్యాలయం, 1986.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.



