AUCHITHYAM | Volume-07 | Issue-01 | January 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
6. తెలంగాణ పటం కథనకళారూపాల ఔన్నత్యం: సాంసృతికవికాసం
డా. లక్ష్మయ్య
సహాచార్యులు, తెలుగుశాఖ,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కూకట్ పల్లి,
మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ
సెల్: +91 9133635714, Email: karnikajanapala@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 05.12.2025 ఎంపిక (D.O.A): 18.12.2025 ప్రచురణ (D.O.P): 01.01.2026
వ్యాససంగ్రహం:
కళలు సమాజం సమిష్టి జ్ఞాపకాలు, సంస్కృతి భాండాగారాలు. తెలంగాణలో కళలు త్రిముఖ పార్శ్వాలలో పని చేస్తున్నది. కుల సంస్మృతి పరిధిలో - సంప్రదాయ రూపాలుగానూ, సామాజిక పరిధిలో - వినోద రూపాలు గానూ, ప్రజా చైతన్య పరిధిలో - అనువర్తితాలుగానూ సాగుతున్నవి. కళలు సమిష్టిగా తెలంగాణ సమాజాన్ని సాంస్కృతిక సైన్యంగా మలిచి మార్చింగ్ చేయస్తు న్నవి, చేయిస్తాయి కూడానూ. ఇలాంటి కళా కదలికల్లో పటం కథన ప్రదర్శన కళారూపాలు కూడ నిలిచాయి. ఇంతటి చారిత్రక, సాంస్కృతిక నేపథ్యం ఉన్న ఈ కళా రూపాల ఔ న్నత్యం, సాంస్కృతిక వికాసాన్ని చర్చించడమే. ఈ వ్యాస ముఖ్య ఉద్దేశ్యం. సామాజిక, సాంస్కృతిక దృక్పథంతో సంస్కృతిలోని మౌలికాంశాల లో ఆశ్రిత కులాల పురోగతిని విశ్లేషణాత్మకంగా చర్చించడమే ఇందులో చేసే పరిశోధన ప్రధానాంశాలు. కుల పరిధిలో సాగుతున్న సాంస్కృతిక వికాసాన్ని విశ్లేషించడం పరిశోధనలోని అంశం. కథనం పుట్టుక, వృత్తిగ్రామకులు -ప్రదర్శన తీరు, కళ ల - ఔన్నత్యం, సాంస్కృతిక వికాసంలో వీని పాత్ర, ప్రతిపాదిత అంశాలతో వ్యాస రచన ప్రణాళిక. ఈ అంశ పరిధిలో పూర్వ పరిశోధనలు చాలానే ఉన్నవి. డా. పులికొండ సుబ్బాచారి : కుల పురణాలు - ఆశ్రిత కులవ్యవస్థ గ్రంథం చారిత్రక విశ్లేషణను పొందు పరిచింది. డా. గడ్డం వెంకన్న : పటం కథలు – కథకులు గ్రంథం ప్రత్యేకించి, పటం కథల ప్రదర్శన తీరులను విశ్లేషించింది. డా. మామిడి హరికృష్ణ : ఆశ్రిత వర్గాల కథన కళారూపాలు - వ్యాసం పుట్టుక క్రమ వికాసం, సమకాలీన సమాజ చేయూత లాంటి అంశాలను విశ్లేషిస్తుంది. తెలంగాణ జానపద కళా సౌరభాలు, కళా తెలంగాణం, బిక్షుక కుంట్లు - ప్రదర్శన విధానం (వ్యాసం) లాంటివి విషయ సేకరణకు దోహద పడినవి.
Keywords: మిరాశి హక్కులు, కట్టడి గ్రామాలు, టోటమ్, మరుగు మాటలు, నకాషీ, చిత్తారి, చేర్యాల పేయింటింగ్స్, బత్త, వృత్తి గాయకులు, మేటి, శికారి, మేళం.
1. ప్రవేశిక
ఒక కుదురు (మూలం, పుట్టుక) నుంచి వచ్చిన సమూహాన్నే కులంగా పిలుస్తున్నారు. కాలక్రమంలో జీవనం కోసం ఎంచుకున్న వృత్తే కులంతో పెనవేసుకొని ఒక సామాజిక వ్యవస్థగా నిలిచింది. భారతీయ సమాజంలోని బలమైన ఆధ్యాత్మిక భావజాలంతో కలిసిన కుల వ్యవస్థ తమ మూల పురుషుడికి, కులం ఆరంభానికి దైవత్వాన్ని ఆపాదించే కులపురాణాలను రూపొందించుకుంది. వీరశైవం మధ్యయుగ దక్షిణ భారత సమాజాన్ని ఒక కుదుపులోకి (మతాభినివేశం) తోసింది. ఆ కుదుపుతో కులాలు తమ మౌఖిక సాహిత్యాల ద్వారా బలంగా వీరశైవ దైవత్వ భావాలను ప్రచారం చేశాయి. తద్వారా కళారూపాలకు విస్తృత ప్రజాదరణ కలిగింది. ఆయా కులాలలోని జిజ్ఞాసువులు, కళాతృష్ణ కలవారు, పిపాసకులు తమ కుల మౌఖిక సాహిత్య కళాప్రదర్శనలను జీవనానికి జీవనోపాధిగా ఎంచుకొని కదిలారు. వీరు మాతృకుల స్రవంతి నుంచి కళాస్రవంతిలోకి మారారు. కాలక్రమంలో వృత్తే కులానికి గుర్తింపు కొలమానం కాబట్టి, కులవృత్తిని వదులుకున్న కళాభిమానులు కులానికి దూరమై కళనే తమ కులంగా ఎదిగారు. వీరు తమ నైపుణ్యాలతో ఆనాటి పాలకులను మెప్పించి, దాతృ కులం ద్వారా తమ జీవనం కోసం కచ్చితమైన మద్దతుగా హక్కులు (మిరాశి) పొందారు. ఇదొక మానవీయ కట్టుబాటు. తద్వారా ఆశ్రిత కులాలుగా గుర్తింపు పొందారు. ఈ కళాభిమానులు తమ సృజనను మెరుగుపరచుకొని మౌఖిక కుల సాహిత్యాన్ని కళాత్మకంగా మలిచారు. ఈ కళాత్మక సృజనే పటం కథన ప్రదర్శన కళారూపాలుగా కొనసాగుతోంది. తరతరాలుగా ఈ కళారూపాల ద్వారా సంస్కృతి గొప్పతనాన్ని అందిస్తూ, ఆశ్రిత కులాలు సమాజ ఐక్యతకు తోడ్పడుతున్నాయి.
2. కథనం - కళారూపాలు
2.1. కథనం ఆవిర్భావం
మనిషి ఏకాంత జీవి నుంచి సంఘజీవిగా ఎదగడానికి తోడ్పడిన భాషా వికాస ప్రస్థానాన్ని మనం అర్థం చేసుకుంటే, ఈ కళారూపాల గొప్పతనం మనకు బోధపడుతుంది. భావ వినిమయ ప్రస్థానంలో భాషలో రెండు దశలు కనిపిస్తాయి. అవి - మౌఖిక దశ, లిఖిత దశలు. మౌఖిక భాష పరిణామ క్రమంలో భావ ప్రసార వినిమయ సాధనంగానే కాకుండా సృజనాత్మకత (కథ చెప్పడం) తోడై విస్తరించింది. తద్వారా భాష జనరంజక స్థాయికి చేరువైంది (హరికృష్ణ xii). భాష ఆధారంగా మానవ సృజన తొలిరూపమే కథనం లేక కథ చెప్పడం. ఈ కథన సంప్రదాయం భాషను సుసంపన్నం చేసింది. విభిన్న నూతన పదాలు వాడుకలోకి వచ్చాయి. భాష అందరి ఆమోదం పొందింది. తద్వారా మానవ మస్తిష్కం భాషా పదకోశాన్ని రూపొందించింది. కథన వికాసంలో చోటు చేసుకున్న ఘటనలు:
- మనిషి అనుభవంలో గమనించిన, చూసిన ఘటనలను ఇతరులతో పంచుకోవడం (చెప్పడం) సహజమైన ఘటన [భాషకు కథనం తోడైన ఆరంభ దశ].
- మనిషి తన అనుభవంలోకి వచ్చిన విషయాలను ఇతరులతో గాఢంగా పంచుకోవడానికి, కథనానికి హావభావాలను (అభినయం లేక నృత్యం) జోడించి చెప్పాడు. [మౌఖిక భాషకు కథనానికి అభినయం తోడైన దశ].
- కథనంలోని భిన్న విషయాలను, విభిన్న సన్నివేశాలను రక్తికట్టేలా చెప్పడానికి వాచికం (పాత్రోచిత భాష) తోడైంది. [మౌఖిక భాషకు కథనం, అభినయంతోపాటు వాచికం తోడైన దశ].
- విభిన్న సన్నివేశాలకు, విభిన్న సందర్భాలకు తగినట్లుగా చెప్పడానికి కథకులు (వంత పాడేవారు) అవసరమైనారు. [మౌఖిక భాషకు కథనం, అభినయం, వాచికం, కథకులు తోడైన దశ].
- కథనం రంజకత్వం పొందడానికి రాగయుక్తం (వినసొంపు), లయబద్ధతలను జోడించడంతో కథాగానానికి (పాట లేక కవిత్వం) బీజం పడింది. [మౌఖిక భాషకు కథనం, అభినయం, వాచికం, కథకులు, కథాగానం తోడైన దశ].
- కథాగానం జనరంజకం కావడానికి, ”పుల్లో - పుడకో, గిల్లో - గిరకో”, కథకుడి నాదసౌష్టవానికి అనుగుణంగా శబ్దసౌష్టవాన్ని కూర్చి కళాత్మకంగా చెప్పడం. [మౌఖిక భాషకు కథనం, అభినయం, వాచికం, కథకులు, కథాగానం (పాట), కథన వాయిద్యాలు (సంగీతం) తోడైన దశ].
- భాషా వికాస క్రమంలో విషయ విస్తృతి పెరిగినప్పుడు, మతిమరుపు కూడ వెంటపడుతుంది. దీనిని అధిగమించడానికి, సన్నివేశాలను రేఖామాత్రంగానైనా చిత్రించి, ఈ చిత్రాల ద్వారా కథనం చేయడం. [మౌఖిక భాషకు కథనం, అభినయం, వాచికం, కథకులు, కథాగానం, కథా వాయిద్యాలు, కథా చిత్రాలు (చిత్రలేఖనం) తోడైన దశ].
భావ వినిమయాన్ని బలంగా, మతిమరుపు లేకుండా, కథనానికి చిత్రాలు తోడై, ప్రదర్శన కళారూపాలుగా నిలిచాయి. వాటినే "తెలంగాణ పటం కథలు" అని పిలుస్తున్నారు. కథనాన్ని పటంగా మార్చినవారు నకాషీలు.
2.2. నకాషీలు: పటాల రూపశిల్పులు
తెలంగాణ ప్రాంతంలో వెలిసిన ఒక జానపద చిత్రకళను నకాషీ చిత్రకళగా పిలుస్తారు. ఇది ఒక బట్టపై రంగులతో బొమ్మలను చిత్రించే పద్ధతి. నవాబుల ఏలుబడిలో, వారి దర్బారులలోనూ, మహళ్లలోనూ నకాషీలచే కుడ్య చిత్రాలు వేయించుకొని, నగీషీలు దిద్దుకొని నకాషీలుగా పేరుపొందారు. తత్ఫలితంగా నకాషీ పేరు ప్రసిద్ధి చెందింది. చిత్తారి పేరు మరుగున పడింది. నవాబుల ద్వారా చిత్రకళ ప్రసిద్ధిలోకి వచ్చింది. (నక్ష్ అనే ఉర్దూ పదం నుంచి నకాషీ పదం పుట్టింది. నక్ష్ అంటే అచ్చు గుద్దినట్లు చిత్రించడం). కాలక్రమంలో నవాబులు లేరు, దర్బారులు లేవు. కానీ కళ మాత్రం క్షయం కానిది కనుక నిలిచి వెలిగింది. నేటికీ ఈ కళలపై ఆధారపడి జీవిస్తున్న కొన్ని కుటుంబాలు వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతంలో నివసిస్తూ కళను వృద్ధిలోకి తెచ్చాయి. నేడు చేర్యాల పెయింటింగ్స్ అనే గుర్తింపుతో సాగుతుంది. నకాషీలే మన పటం కథలకు ప్రాణం పోసే చిత్రకారులు.
వృత్తి కళాకారుల కథనానికి సరిపడే విధంగా పటాలు గీసి ఇస్తారు. కథకులు నకాషీల వద్దే ఉండి, కథను వివరిస్తూ, మార్పులు, చేర్పులు సూచిస్తూ తమకు కావలసిన పటాన్ని గీయించుకుంటారు. ఈ సమయంలో నకాషీలకు కావలసిన మర్యాద (దాన, పీన, ఖాన) చేస్తారు. దీనిని బత్త అని పిలుస్తారు. ఈ నకాషీల ద్వారా పటం కథ ప్రదర్శనకు సిద్ధమవుతుంది. అప్పుడే పటం కథ ప్రదర్శన కళారూపంగా పిలువబడుతుంది. (ఆరంభంలో చిత్తారి కళ; వికాసంలో నకాషీ కళ; ప్రస్తుతం చేర్యాల పెయింటింగ్స్‌గా వికాసం పొందింది). ప్రతి రోజు పటం గీసే ముందు, వీరి కుల దేవత నిముషంబిక దేవిని తలచుకొని బొమ్మలు వేస్తారు. వీరు గీసిన పటాలను ప్రదర్శిస్తూ కథాగానం చేసే కళాకారులను వృత్తి గాయకులని, అర్ధి బిడ్డలని, కుల బిడ్డలని, గురువులని, ఆశ్రిత గాయకులని (భిక్షుక గాయకులు), ఉపకులాలనీ అనేక రకాల పేర్లతో సంబోధిస్తారు. వీరి మాటాచతురత, సృజనతో సాంఘిక ఘటనలను తమ ప్రదర్శనలలో కలిపి నిత్యనూతనంగా మలిచి, జనరంజక ప్రదర్శనలు చేస్తారు (సురేష్ 72).
2.3. వృత్తి గాయకులు, వారి పోషక కులాలు
వృత్తి గాయకులు లేక ఆశ్రిత గాయకులు పోషక దాతృకులాన్ని ఆశ్రయించి, ఆ కులం మౌఖిక సాహిత్యాన్ని గానం చేసేవారు. ఈ సాహిత్య ఆధారాల ప్రకారం, పోషక కులంలోనే అన్నదమ్ములుగా పుట్టి, జీవించి, కుల కట్టుబాట్లను పాటించకపోవడం వల్ల స్థాయి తగ్గి ఆశ్రితులుగా మారినట్లు మనకు బోధపడుతుంది. వీరంతా కుల మూల పురుషుడి స్వేదం నుంచి జనించినట్లుగా సాహిత్యం సాక్ష్యమిస్తుంది.
- డక్కలి ఆశ్రిత కళాకారులు - మాదిగ పోషక కులం - జాంబవపురాణ గానం.
- మాసయ్య లేక గంజి కూటి ఆశ్రిత కళాకారులు - రజక పోషక కులం - మడేలు పురాణ గానం.
- పెక్కర్లు ఆశ్రిత కళాకారులు - కుమ్మరి పోషక కులం - గుండ బ్రహ్మయ్య పురాణ గానం.
- అద్దపు ఆశ్రిత కళాకారులు - మంగలి పోషక కులం - అద్దపు పురాణ గానం.
- గుర్రపు ఆశ్రిత కళాకారులు - మాల పోషక కులం - భేతాళపురాణ గానం.
- గౌడ జెట్టి లేక ఏనూటి ఆశ్రిత కళాకారులు - గౌడ పోషక కులం - గౌడ పురాణ గానం.
- కూనపులి ఆశ్రిత కళాకారులు - పద్మశాలి పోషక కులం - మార్కండేయ పురాణ గానం.
- కొమ్ము లేక తెరచీరల ఆశ్రిత కళాకారులు - గొల్ల పోషక కులం - కాటమరాజు కథాగానం.
- కాకి పడిగెల ఆశ్రిత కళాకారులు - ముదిరాజు పోషక కులం - పాండవుల కథా గానం.
- కోర్రాజుల ఆశ్రిత కళాకారులు - నాయక్ పోడ్ తెగ పోషక కులం - పద్మ నాయక కథా గానం.
2.4. మిరాశి హక్కులు, కట్టడి గ్రామాలు
మిరాశి హక్కులు లేక జాబ్ కార్డులు: ఆశ్రిత కులం జీవనం కోసం పోషక కులం రాసి ఇచ్చిన వంశ పారంపర్య హక్కు పత్రాలు. సమాజంలో ఇదొక మానవీయ కట్టుబాటు. ఇవి రాగి రేకుల మీద, బూర్జువ పత్రాల మీద, కాగితాల మీద లేదా బట్ట మీద రాయబడి ఉంటాయి. నేటి జాబ్ కార్డుల వంటివి.
కట్టడి గ్రామాలు: కట్టడి అంటే నిర్ధారించి, నిర్దేశించి అప్పగించినవి. ఆశ్రిత కళాకారులకు పోషక కుల నివాస గ్రామాలను దానం చేసినట్లు తీర్మానించడం. మిరాశి పత్రంలో నిర్దేశించిన కళాకారులకే ప్రవేశం ఉండే విధంగా సమాజం కట్టడి (తీర్మాన పత్రం) చేసి ఉంచింది.
2.5. మేళం ప్రదర్శన విధానం
మేళం: ప్రదర్శన కళాకారుల బృందం. ఈ బృందం కళా నాయకుడిని మేటి (ప్రధాన కథకుడు) అని పిలుస్తారు. ఈ కళారూపాలను బృందంగా ప్రదర్శిస్తారు. మేటి, ఒకరు తబల, వేరొకరు హార్మోనియం, ఇద్దరు వంత పాడేవారు - మొత్తం ఐదుగురిని బృందం లేక మేళం అని పిలుస్తారు.
ప్రదర్శన తీరు: పటాన్ని ప్రదర్శన వేదిక (కులం పెద్ద ఇంటి వద్ద లేదా కులం వీధి ప్రధాన కూడలి) మీద వేలాడదీసి, మేటి తగిన వేషంతో బెత్తం పట్టుకొని పటంలోని చిత్రాలను చూపుతూ కథనం లేక గానం చేస్తాడు. గానానికి అనుగుణంగా వాయిద్యాలు మోగిస్తారు. వినసొంపును పెంచడానికి వంతులు వంత పాడతారు. కథ ప్రదర్శన పర్వదినాలు, రెండు రాత్రులు, ఒక రాత్రి, ఒక దినం, సగం దినం, ఒక పొద్దు, గంట ప్రదర్శనను పెంచడం, తగ్గించడం పోషక కులం ఇష్టాన్ని బట్టి జరుగుతుంది. “ప్రదర్శనలో భాగంగా ఆచారాలు - బోనాలు, జల్ది (ఊరేగడం), బలి, పూనకాలు తదితరాలను ఆచరిస్తారు. ప్రదర్శన చివర సామూహిక దీవెనార్థి (భరతవాక్యం)ని మేటి ఇస్తాడు (రెడ్డి 4)”. మీ ఇళ్ళలో ధనలక్ష్మి, సంసార సౌభాగ్య లక్ష్మి, అర్ధి దీవెనలు, ధన కనక, వస్తు, వాహనాలు కలిగి, మాకు ఇచ్చిన సంభావనలకు వెయ్యేళ్లు సంపదలు నిండి చల్లగా వర్ధిల్లాలని... ప్రార్థనతో ముగిస్తాడు.
కథనాన్ని నవరస భరితం చేయడానికి మేళం మెలకువలతో, తెలంగాణ నుడికారంతో (యాస) సామెతలు, పొడుపు కథలు, వచనాలు, మరుగు పదాలు, దెప్పిపొడుపులు, పద్యాలు, పాటలతో (దరువులు, ఏలలు) అనేక భాషా మాధుర్యాలతో రక్తికట్టిస్తూ ప్రదర్శిస్తుంది. ఈ బృందం తమ ప్రదర్శనలను కాలానుగుణంగా మార్చుకుంటూ, యక్షగానాలుగా, వీధి భాగవతాలుగా ప్రదర్శిస్తుంది. కుల పురాణాలు సాధారణంగా ఐదు కాండాలుగా ప్రదర్శితమవుతాయి. వీరి ప్రదర్శన మౌఖిక సాహిత్యంలో సృష్టి ఆవిర్భావం, దేవతల జననం, దైవ అవసరాల కోసం కులాల పుట్టుక, వృత్తుల ఆవిర్భావం, దైవ కార్యం నిమిత్తం కుల మూల పురుషుని జననం, కులాలకు దైవత్వం ఆపాదన, వృత్తి పనిముట్ల పవిత్రతలు - మొత్తంగా జీవితమే దైవానుగ్రహం అనే అనుభూతిని కల్పించే రీతి మౌఖిక సాహిత్య మర్మం. మౌఖిక సాహిత్యంలో బలంగా శైవమే కనిపిస్తుంది. వీరశైవం ఈ సాహిత్యాన్ని ప్రచార వాహికలుగా చేసుకొని విస్తృత వ్యాప్తిని నమోదుచేసుకుంది. శివుడే జగత్తుకు మూలం, సర్వం పరిష్కరించే ఆదిదేవుడు శివుడే అనే ధోరణిని ప్రచారం చేశారు.
2.6. పటం కళారూపాల ఔన్నత్యం
మా వృత్తి మాకు ప్రాణం కన్నా మిన్న - అనే త్రికరణ శుద్ధితో కూడిన జ్ఞానం మడేలు పురాణం (రజక), జాంబవపురాణాలలో (మాదిగ) కనిపిస్తుంది. శివుడి మైల వస్త్రాన్ని శుభ్రం చేయడానికి మాడివేలయ్య తన భార్య సీతల దేవిని చంపి, ఆమె అవయవాలతో మురికిని తొలగించి శివుడిని మెప్పిస్తాడు. ఇవి వారి వృత్తి పట్ల ఇష్టం, నిబద్ధతకు నిలువెత్తు సాక్ష్యంగా ఈ ప్రాణత్యాగ సన్నివేశాలు కనిపిస్తాయి. మురికిగా ఉన్న శివుడి వస్త్ర విశేషాన్ని తెల్లగా మెరిపించడంలో వారి వృత్తి నిపుణత నేటి డిటర్జెంట్ కంపెనీలకు తీసిపోనిదిగా మనకు కనువిప్పు కలిగిస్తుంది. ఈ వృత్తి వర్గాల నిపుణతలను ఆధునిక విద్యా విధానంలోని సిలబస్‌కు చేర్చకుండా నిర్లక్ష్యం చేసిన నేటి జ్ఞాన సమాజాన్ని క్షమించలేం. “భారతీయ సమాజంలోని కులవృత్తుల పనితనాన్ని నీచంగా భావించిన అక్షర జ్ఞాన సమాజం నమోదును నిషేధించింది. ఈ నిషేధమే బహుజన సమాజ పని తిరోగమనానికి మూలమైంది (ఐలయ్య 39)”. ఆ నిర్లక్ష్యమే నేటి బహుళజాతి కంపెనీల చలామణి దోపిడీ. ఇది జ్ఞానపరంగా మెరుగుదలే కానీ, ఈ వృత్తులను పురోగతిలోకి మార్చలేకపోయాం.
నేటి కాలంలో సులబ్ కాంప్లెక్స్ స్థాపకుడైన బిందేశ్వర్ పాఠక్ విజయగాథలా మధ్యయుగ దక్షిణ భారతదేశ సమాజంలో మాడివేలయ్య, మాసయ్యల నిపుణత్వం తెలుగు సమాజంలో ఒక వెలుగు వెలిగి ఉండాలి. అందుకే వారు చరిత్ర కెక్కారు. ఆ కులం వారిచే నేటికీ కీర్తించబడుతున్నారు. వారు ఆ కులానికి ఐకానిక్ వ్యక్తులు. తరతరాలుగా వీరికి ప్రచారం కల్పిస్తున్న వారే మడేలు మాసయ్యలనే కళాకారులు. తద్వారా తమ పోషక కులం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. ఒక వృత్తి నిపుణుడిని (విశ్వకర్మ) మెప్పించే మరో వృత్తి నిపుణులుగా మాదిగ ఉత్పత్తి వర్గం కనిపిస్తుంది. జాంబవపురాణంలో పరస్పర త్యాగోపకారం అనే వేదసారాన్ని జీవన సూత్రంగా మలుచుకొని నడచుకున్న కులం. నేటి సమాజానికి ఇది చుక్కాని. వారి వృత్తి నిపుణతలోని మెలకువలు మన ఆధునిక కరిక్యులమ్‌లో చోటు దక్కి ఉంటే, మన సమాజ పురోగతికి మెరుగు వచ్చేది. దేశం వెలిగిపోయేది. ఈ సుసంపన్నతను మాదిగ సమాజానికి అందించే కళాకారులే డక్కలివారు. చచ్చిననాడు మాదే, పుట్టిననాడు మాదే, దాయాదికి మాదే, గుడికి మాదే, ఏ దేవుడికైనా ఇంత కంచుడు బొచ్చ (కుండ) అంటూ... తృప్తిపడే రెండు కులాలు. మట్టి పాత్రలతో వంట చేయడం నుంచి దాచడం వరకు అందించిన కుమ్మర కుల నిపుణుల - గుండ బ్రహ్మయ్య పురాణం. మనిషి జన్మకు మూలం మృత్తికే. మృత్తికకు ప్రాణ ప్రతిష్ట చేసే కుమ్మరి నిపుణులు ఆవిష్కరించింది సారే (కుమ్మరి చక్రం). ఇది మానవ వికాసానికి చోదకంగా (యంత్రం) పనిచేసింది. వీరి సృజనకు ఆకాశమే హద్దు. వారు సహజ సిద్ధ సృజనశీలురు (soil scientists). నేటి రిఫ్రిజిరేటర్లను మరిపించే కుండ పనితనం వీరిది. నిజంగా వీరు పర్యావరణ హితైషులు, సమాజ ఆరోగ్య ప్రదాతలు.
నేటికైనా మన జాతీయ విద్యా విధానంలో భారతీయ మూల జ్ఞానాత్మక కౌశలాలను కరిక్యులమ్‌లో పొందుపరచడం, విద్యుక్త ధర్మంగా ఎంచడమే వారికి మనమిచ్చే కృతజ్ఞత. వస్త్ర విశేషం, మన ఆత్మగౌరవానికి తొడుగును అందించిన పనితనపు సిద్ధాంతం (ప్రాచీన కాలంలో మన వస్త్ర విశేష నిపుణత ప్రపంచాన్ని ఆకర్షించింది. రోమ్ బంగారం భారతదేశానికి తరలివచ్చిందని ఆ దేశ ఆర్థిక నిపుణులు వాపోయిన రోజులున్నాయి - పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ రాతలే సాక్ష్యం) పద్మశాలీల మార్కండేయ పురాణంలో నిక్షిప్తమై ఉంది. దేవతలే తమ వృత్తులను సృష్టించి, మాకు ఇచ్చారనే ఆత్మవిశ్వాసంతో ఈ కులాలు ముందుకు సాగుతున్నాయి. వృత్తి కులాల గొప్పతనానికి ప్రతీక డిగ్నిటీ ఆఫ్ లేబర్ (వృత్తి గౌరవం/శ్రమ గౌరవం). ఆత్మవిశ్వాసంతో తమ వృత్తిని చేపట్టడానికి ప్రేరణ అందించడం. నిపుణతతో వృత్తిని చేపట్టి సమాజానికి సేవ చేయడం. సేవలు అందించడం. గౌరవప్రదమైన మనుగడ సాగించడం. మన కోసం అందరూ, అందరి కోసం మనం అనే పరస్పర సహకార సమిష్టి స్ఫూర్తే ఈ కళల గొప్పతనం. ఆశ్రిత కళారూపాలు పోషక కుల వృత్తుల వారికి ఆత్మన్యూనత భావం దరిచేరకుండా, ఆత్మవిశ్వాసాన్ని కళ ద్వారా నింపిన త్యాగధనులు, నిస్వార్థ సమాజ హితైషులు. స్వయం సమృద్ధి కలిగిన గ్రామీణ జీవనాన్ని సుసంపన్నం చేస్తున్న వృత్తులు, ఉత్పత్తి కులాల మధ్య పరస్పర సహకార సామరస్యాలు సాధించిన ఘనత ఈ కళారూపాలదే.
2.7. సాంస్కృతిక వికాసం
ఆచారాలు, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, ఆలోచనలు, అనుభూతులు, నమ్మకాలు, విలువలు, ఆహారపు అలవాట్లు, వస్తు విశేషాలు; సామాజిక నిర్మాణాలు అయిన భాష, కుటుంబం, కులం, మతం, విద్య, ఆర్థికం, పాలన - ఇవన్నీ కలగలిసి సంస్కృతి ప్రాథమిక అంశాలుగా పరిగణించబడతాయి. వీటిలో మెరుగుదల, పెరుగుదలల ద్వారా పురోగతిని - సమాజ పరంగా, జ్ఞానపరంగా, జీవనశైలి పరంగా కొలవడమే సాంస్కృతిక వికాసం. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం భావన - పరస్పర సహకారంతో స్వయంపోషకంగా సమాజం ఎదగడం అనే సంస్కృతి ఈ కళల్లో కనిపిస్తుంది. పోషక కులం ఆశ్రిత కులాన్ని ఆదరించడం ఒక ఆచారం. తరతరాలుగా సాగుతున్న స్వయం సమృద్ధ గ్రామీణ సమాజానికి ఇది ఒక మానవీయ ధర్మం. బ్రతకాలి, బ్రతకనివ్వాలి అనే ధర్మమే ఆశ్రిత కులాలను పోషించే శక్తినిచ్చింది. తద్వారా ఆశ్రిత కులాల జీవనానికి ఆధారం అయిన కళలు వ్యాప్తి చెంది, సమాజ సంస్కృతి భాండాగారాలుగా వెలుగొందుతున్నాయి. తమ ప్రదర్శనల వినోదాల ద్వారా పోషక కులం మూల పురుషుడి చరిత్రను, వృత్తి నిపుణతలను మరో తరానికి అందించడం ఒక సంప్రదాయం.
సమాజ అవసరాలకు అనుగుణంగా వస్తూత్పత్తి, సేవలను అందించే వృత్తుల వారి పనితనాన్ని కళాత్మకంగా గుర్తుచేయడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం రూపొందిన పరస్పర గౌరవ ఏర్పాటు ఇది. ఆహార పానీయాలు దేహానికి హాయినిస్తే, వినోదం మనస్సుకు ఉల్లాసాన్నిస్తుంది. ఆ వినోద విజ్ఞానాన్ని పంచే కళారూపాలకు తెలుగు సమాజంలో కొదవ లేదు. దాదాపు 52 ప్రదర్శన కళలు నేటికీ మనుగడలో ఉన్నట్లు తెలంగాణ సాంస్కృతిక అకాడమీ నిర్ధారించింది. మన జాతరలు, ఉత్సవాలు, పండుగలు, సాంఘికాచరణ సందర్భాలలో వినోదాత్మకంగా ప్రదర్శించబడే కళారూపాలు కేవలం కడుపు నింపుకునేందుకు మాత్రమే కాదనీ, అది కళా సృష్టిని ప్రసాదించే ఒక వరంగా మనం భావించాలి. తెరచీరలవారు చెప్పే కథలు - కృష్ణ భాగవతం చుట్టూ సాగే కథనంతో ఉంటాయి. పూజారి పటం వాళ్ళు - మహాభారత జూద పర్వం (సభా పర్వం) చుట్టే కథనం సాగుతుంది. పెక్కర్ల వాళ్ళు - శాలివాహన కథ చుట్టే కథనం సాగుతుంది. కాకి పడిగెల వాళ్ళు - పాండవుల కథలు కథనం చేస్తారు. ఏనూటి వాళ్ళు - కాటమయ్య కథనం, మాసయ్యల వాళ్ళు, అద్దం వాళ్ళు - శివపురాణ సంబంధ అంశాలను కథనం చేస్తారు. వీరు గానం చేసే కథా వస్తువు పురాణ, ఇతిహాసాలలోని వివిధ ఘట్టాలను కలిపి, పోషక కులం చరిత్ర, శౌర్యపరాక్రమాలు, పనితనం, పౌరాణిక పాత్రల రీతిలో కళాత్మకంగా వర్ణిస్తారు. సమాజానికి ఇతిహాస, పురాణ, కావ్య గౌరవాలతో నీతిని, విలువలను గుర్తుచేస్తూ ప్రదర్శనలు చేస్తారు.
ఈ ప్రదర్శనలు నేటి సమాజ మానవీయ వికాసానికి తోడ్పడుతున్నాయి. అద్దం కథలోని కళ్యాణ భక్తుడు, రుషి కన్య; గౌడ పురాణంలోని కంఠమహేశ్వరుడు, సురబాండేశ్వరి; కుమ్మరివారిలో గుండ బ్రహ్మ, సూర్యవతి వంటి వివాహ తంతును ప్రదర్శనలో కళాత్మకంగా, ఆచారబద్ధంగా నిర్వహిస్తూ, నేటి తరానికి వివాహ విధి విధానాలు, సంస్కృతి విలువలను తెలియజేస్తున్నారు. వధూవరులకు మైల పోలు తీయడానికి నాయిక కులస్తులను పిలుచుకుంటారు. పోలు అంటే ఒక రకమైన శుభకార్య ముగ్గు విశేషంగా కనిపిస్తుంది. కళారూపాలలో పాణీగ్రహణం, మంగళ సూత్ర ధారణ కన్నా అపశకునాలకు ఎక్కువ ప్రాధాన్యత ప్రదర్శనలో ఉంటుంది. నవరస భరిత దేశాలకు (త్యాగానికి వెళ్ళే) వెళ్ళే ముందు ఆశ్రిత కళాకారులు చేసే పూజా విధానం వారి నమ్మకాలను, అలవాట్లను, అనుభవాలను మనకు తెలియజేస్తుంది.
అవ్వా! పెద్దమ్మ తల్లీ! మేము దేశాల మీదికి పోతున్నాము. మమ్మల్ని చల్లగా చూడాలని మొక్కి కోడిని తీరా మాటను కోస్తారు. మాంసం వండి, ముందుగా ఒక డొప్పలో (మోదుగ ఆకులతో చేసినది) ఆయాలు పాయాలను (ఆట ముఖ్యమైన మాంసంపు ముక్కలు) పడులు పెట్టిన తర్వాత, వాళ్ళు తింటారు. ఆ సాయంత్రం పటం చుట్టిపెట్టి తెల్లారిన తర్వాత పయనమవుతారు (హరికృష్ణ 53).
కాకి పడిగెలవారు త్యాగానికి వెళ్ళే తీరు జానపదులు పండుగలలో ఆచరించే నమ్మకాలను గుర్తు చేస్తుంది. పడులు పెట్టడం, డొప్ప వంటి ప్రకృతి పాత్ర విశేషాలు, ఆవాసంలోని నైరుతి దిశ ధనాగారం (లక్ష్మి నివాసం) వంటి సంప్రదాయాలు మనకు బోధపడతాయి. ప్రదర్శనకు సిద్ధం చేసుకున్న స్థలం వద్ద పోషక కులం పెద్ద తన భార్యతో కలిసి మంగళ హారతి (జ్యోతి ప్రజ్వలన) పట్టి, దిష్టి తీస్తారు. కుల దేవతను తలచుకొని, జీడిగింజ, నిమ్మకాయలను వేదిక ముందు భాగంలో కడతారు. వేదిక మీది ఏర్పాట్లపై పటాన్ని వేలాడదీస్తారు. కుల పెద్ద పూజకు వచ్చిన వారికి బొట్టు పెట్టి, కంకణాలు కడతాడు. పటం ముందు ఊరు బత్తీలు వెలిగించి, భేతాళుడికి మొక్కి కొబ్బరికాయ కొట్టి, మేటికి కథనం చేయమని ఆనతి ఇస్తాడు (హరికృష్ణ 64). ఈ కార్యక్రమంలో నేటి మంగళప్రదమైన పనులలో పాటించే ఆచార సంప్రదాయాలు, మన సంస్కృతి విలువలు ఇందులో కనిపిస్తాయి. మేటి కథను ఆరంభించే ముందు
అమ్మమ్మా మాయమ్మవే,
బవనీటి కొమ్మావే,
కొప్పుల పోశమ్మావే
...అంటూ ఆదిశక్తిని తలచుకొని, శారదాంబను ప్రార్థిస్తూ, గణేశుని పూజతో కథనం ప్రారంభిస్తారు. శక్తి ఆరాధన, పలుకులమ్మ దీవెన, విష్ణురాజ చల్లని చూపులు ఉండాలనే ఆచారం ఇందులో వ్యక్తమవుతుంది. "తెలుగు దేశ్య పదాల్లోనే తొలి నాళ్ళ సంస్కృతి స్వరూపం తెలుస్తుంది. ఒక జాతి ప్రాక్తన సంస్కృతి ప్రాథమిక పదాల్లోనే కనిపిస్తుంది (కృష్ణమూర్తి 220)". "కళారూపాలు ప్రజా సంస్కృతి అనుభవాలకు ప్రతీకలుగా భావించవచ్చు (మోహన్ 312)". ఆశ్రిత కళారూపాలు పోషక కులం చరిత్ర, మూల పురుషులు, పనిమంతుల విశేషాలను పౌరాణిక పాత్రలకు ప్రతీకలుగా నిలిపి కళాత్మకంగా నేటి సమాజానికి అందిస్తున్నాయి.
2.8. టోటమ్, శికారి
టోటమ్: ఆశ్రిత కులాల చిహ్నాలను వారి మరుగు భాషలో టోటమ్ అని పిలుస్తారు. ఇవి వారి మూలాలను తెలియజేస్తాయి. కాకి పడిగెల ఆశ్రిత కులానికి కాకి గుర్తు, గుర్రపు ఆశ్రిత కులానికి గుర్రం గుర్తు, కూనపులి ఆశ్రిత కులానికి పులి జెండా గుర్తు. ఈ విధంగా కుల చిహ్నాలుగా టోటమ్‌లను నిలుపుకుంటారు. “పితృ దేవతలకు ప్రతీకలుగా కొన్ని జాతులలో పూజించే విధానాన్నే టోటమ్ గా జానపదులు పిలుస్తారు (కృష్ణ కుమారి 493)”.
శికారి: ఆశ్రిత కళాకారుల కుటుంబాల ఆహార సంపాదన కోసం ప్రదర్శనలు లేని సమయాలలో వేటను వృత్తిగా స్వీకరించడాన్ని శికారి అని పిలుస్తారు. ఇది వారి ఆర్థిక జీవన స్థాయి తక్కువగా ఉన్నట్లు తెలియజేస్తుంది. ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను, సామూహిక సాంఘిక సందర్భాలలో వీరి కళా ప్రదర్శనలను ఏర్పాటు చేయునట్లు చర్యలు తీసుకోవాలి.
2.9. మరుగు మాటలు, వాటి ప్రాముఖ్యత
మరుగు మాటలు: ఆశ్రిత కళాకారులు తమలో తాము మాట్లాడుకోవడానికి రూపొందించుకున్న భాష. ఇది సమాజంలో ఎవరికీ అర్థం కానిది కనుక మరుగు భాషగా పిలుస్తున్నారు. తమ ప్రదర్శనలో లోటుపాట్లను, రసాభాసాన్ని కప్పిపుచ్చుకోవడానికి కళాకారులు తమలో తాము మాట్లాడుకునే భాషనే మరుగు భాషగా ప్రసిద్ధి చెందింది. దీనిలో వస్తువుల, కులాల, జంతువుల పేర్లు, నామ, క్రియ వాచక పదాలు కూడ కనిపిస్తాయి. ఏ కాలంలోనైనా ఒక భాష మాట్లాడేవారి సంస్కృతి వారి వ్యవహార పదజాలంలో ఇమిడి ఉంటుంది (కృష్ణమూర్తి 221).
- వస్తువులు: కంచికం = డబ్బులు, బోడ్సెం = కుండ, పిస్పి = సంచి, మిర్థన్లు = గుడారాలు, కెందలు = బట్టలు, మిల్కయి = దీపం, మెస్స = అన్నం, పాండ్యాలు = నీళ్ళు, పుంజి = గడియారం
- జంతువులు: కైక = కుక్క, కుక్కడి = కోడి, కాశికం = పిల్లి, భార్భం = ఆవు, మేసం = మేక, పింకెం = పక్షి, మెండం = గొర్రె, గోట్కం = గుర్రం
- కులాలు: కొరంజగాళ్ళు - ఎరుకల, కెందరి గాళ్ళు - చాకలి, పోగులెత్త గాళ్ళు – పద్మశాలిలు, జెళ్ళం గాళ్ళు - గొల్లలు, కడ్డి గాళ్ళు - గౌడులు, మంత గాళ్ళు - కుమ్మరులు, సిర్రావుల గాళ్ళు – మంగలి
- నామవాచకాలు: కర్వా = ఊరు, కేవాలు = వెంట్రుకలు, నిర్జాయి = పెళ్ళి, ఒల్తు = భిక్షం, తెల్లాం = రూపాయి, కారింగాల = రాత్రి, కాష్కం = దెయ్యం
కళాకారుల మరుగు భాష వల్ల నిజమైన తెలుగు పదాలు, భాష సొగసు, పద ప్రయోగాలు తెలుస్తున్నాయి. జానపదం జ్ఞాన పథం అన్న నానుడిని నిజం చేస్తూ నేటి తరానికి భాషా జ్ఞానాన్ని అందిస్తున్నారు.
2.10. సమాజ, జ్ఞాన, జీవన శైలి వికాసం
సమాజ పరంగా: నాయి బ్రాహ్మణ వృత్తి నూతన సాంకేతికతలను అందుకొని చాలా మెరుగుపడింది. రజక వృత్తిలో సాంకేతిక యంత్ర విశేషాలు రావడంతో పురోగతి కనిపించింది. కుమ్మరి వృత్తి కుంచించుకుపోయింది. సమాజ అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల ఇక్కడ తరుగుదల నమోదైంది. గౌడ వృత్తిలో గణనీయ పురోగతి నమోదైంది.
తెలంగాణ సమాజంలో జ్ఞాన పరంగా: వృత్తి కులాలు పురోగతిని (లిడ్ క్యాప్, లెదర్‌పార్క్ (సెజ్), ధోబీ ఘాట్‌లు, డ్రై క్లీనింగ్, టెక్స్‌టైల్ పార్క్‌లు, పవర్ లూమ్స్, ఆప్కో, నీరాకేఫ్) సాధించాయి.
తెలంగాణలో జీవనశైలి పరంగా: ప్రపంచీకరణ కారణంగా పెరుగుదల, తరుగుదల కనిపిస్తాయి. పోషక కులాల మానవీయ చేయూత ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. అందుకే ప్రభుత్వం సంచార జాతులు గౌరవంగా జీవించడానికి తగిన చర్యలు చేపడుతోంది (కళారూపాల డాక్యుమెంటరీలు, కళాకారులకు జీవనభృతి, సంచార జాతుల కార్పొరేషన్, సంక్షేమ పథకాలు).
ఉపసంహారం
- ఏ వృత్తి నీచమైనది కాదనే సత్యాన్ని పటం కథలు కళాత్మకంగా బోధించాయి. తద్వారా వృత్తుల పట్ల, కులాల పట్ల సమాదరణ భావం కలిగింది. పరస్పర గౌరవ సామరస్యత (Give respect and take respect) పెనవేసుకుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనే నీతి బోధపడింది.
- ఈ సృష్టిలో ఏది తక్కువ కాదు. తరచి చూస్తే, అన్నీ ఈశ్వర ప్రసాదాలే అనే వేదభావన కులపురాణ కళారూపాలలో కనిపిస్తుంది. ఇది మన సంస్కృతిలోని ఉత్కృష్ట విలువ.
- తెలంగాణ సమాజానికి కులపురాణ మౌఖిక సాహిత్య సంపదను పటం కథ కళారూపాలు తరతరాలకు అందిస్తూ పదిలపరిచాయి.
- తెలుగు భాష జీవద్భాషగా ప్రస్థానం సాగించడానికి కళారూపాలు తమ వంతు బాధ్యతను అందించాయి.
- మన సమాజ సాంస్కృతిక వికాసంలో పరస్పర సహకార సామరస్య భావన ఈ కళల సాక్షిగా వెల్లివిరియాలని ఆశిద్దాం.
- జానపద కళారూపాలపై సమగ్ర పరిశోధన, ప్రచారం, పరిరక్షణ, కళాకారుల సంక్షేమ, వికాసాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసింది. కళాకారుల జీవన భృతి కింద నెలకు 10,000/- రూపాయలు అందిస్తుంది.
- కుల పురాణాలు క్రమమైన సామాజిక నిర్మితిని అభివ్యక్తం చేస్తున్నాయి. కులాలన్నీ తమ మూల పురుషుడు సాక్షాత్తు భగవంతుడే అని చెప్పుకుంటున్నాయి. కావున తాత్త్వికంగా పుట్టుకతో మనుషులంతా సమానులే అనే భావం నిర్థారితమవుతుంది.
- అష్టాదశ సంస్కృత పురాణాలకు సమాంతరంగా, కుల పురాణ సంప్రదాయాలకు పాదులు వేసిన జానపద సాహిత్య పాయలివి.
- ఆశ్రిత కుల వ్యవస్థ - కుల పురాణాలను ప్రచారం చేయడం కోసం ఆయా పోషక కులాలు ఏర్పాటు చేసుకున్న సామాజిక నిర్మితి.
- తెలంగాణ పటం కథలు కేవలం వినోదాన్ని అందించే కళారూపాలు కావు. అవి సామాజిక ఐక్యతను పెంపొందించే, వృత్తి గౌరవాన్ని చాటిచెప్పే, సాంస్కృతిక విలువలను తరతరాలకు అందించే గొప్ప వారసత్వ సంపద.
- ఈ కళారూపాలు మౌఖిక సాహిత్యాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాయి, భాషా వికాసానికి, పద సంపద విస్తరణకు తోడ్పడ్డాయి.
- నకాషీలు, వృత్తి గాయకులు వంటి కళాకారులు తమ అంకితభావం, నైపుణ్యాలతో సమాజానికి విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించారు.
- పటం కథలలోని టోటమ్‌లు, మరుగు భాష వంటి అంశాలు కళాకారుల సంస్కృతిని, వారి ప్రత్యేకతను ప్రతిబింబిస్తాయి.
- ప్రభుత్వాలు ఈ కళల పరిరక్షణకు, కళాకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు ఈ ప్రాచీన సంప్రదాయాలకు పునర్జీవం పోస్తున్నాయి.
ఉపయుక్త గ్రంథసూచి
- ఐలయ్య షెఫర్డ్, కంచ. శూద్రుల తిరుగుబాటు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2025
- కృష్ణకుమారి, నాయిని. జానపద గేయగాథలు. ఆంధ్రసారస్వతపరిషత్, హైదరాబాద్, 1977.
- కృష్ణమూర్తి, భద్రిరాజు. భాష, సమాజం, సంస్కృతి. ఏడవముద్రణ. నీలకమల పబ్లికేషన్స్, హైదరాబాద్, 2023.
- మోహన్, జి.ఎస్. జానపద విజ్ఞానాధ్యయనం. శ్రీనివాసపబ్లికేషన్స్, బెంగుళూరు, 2001.
- రెడ్డి, నర్రా లవేందర్. "భిక్షుక కుంట్లు: ప్రదర్శనవిధానం." ఔచిత్యమ్, ఏప్రిల్ 2024.
- సుబ్బాచారి, పులికొండ. కుల పురాణాలు - ఆశ్రిత కుల వ్యవస్థ. క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, 2023
- సురేష్, బాసని. తెలంగాణ జానపద కళా సౌరభాలు. భాషా సాంస్కృతికశాఖ, హైదరాబాద్, 2023
- హరికృష్ణ, మామిడి. "ఆశ్రిత వర్గాల కథన కళారూపాలు." మన తెలంగాణ పత్రిక, 10 డిసెంబర్ 2017.
- హరికృష్ణ, మామిడి, విష్ణుభట్ల ఉదయ్ శంకర్ (సంపా). పటం కతలు. తెలంగాణా భాషా సాంస్కృతికశాఖ, హైదరాబాద్, 2017.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.



