headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-01 | January 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

5. ఎండ్లూరి సుధాకర్‌ కవిత్వం: ధిక్కారస్వరాలు

డా. జరుపుల రమేష్‌

అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలుగు విభాగం,
కాకతీయ ప్రభుత్వ కళాశాల, (స్వయం ప్రతిపత్తి),
హనుమకొండ జిల్లా, తెలంగాణ.
సెల్: +91 9618944654, Email: ramesh.jarupula@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 15.12.2025        ఎంపిక (D.O.A): 29.12.2025        ప్రచురణ (D.O.P): 01.01.2026


వ్యాససంగ్రహం:

పరిశోధన తెలుగు సాహిత్య యవనికపై తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అసామాన్య కవి, ఆధునిక జాషువా ఎండ్లూరి సుధాకర్‌. అభ్యుదయ కవిత్వ పరిమళాలు పరివ్యాప్తమవుతున్న కాలంలో ఉద్భవించిన ఆయన, తన కవితా శక్తితో సామాజిక అన్యాయాల వేర్లను పెకిలించి, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారు. తన బాల్య అనుభవాలలోని చేదును, సామాజిక వైరుధ్యాలను మథించి 'నల్ల సంతకం'తో తెలుగు సాహిత్యానికి ఒక కొత్త దిశను, దశను చూపిన దార్శనికుడు ఆయన. ప్రస్తుత ఈ వ్యాసం ఎండ్లూరి సుధాకర్‌ గారి ప్రసిద్ధ రచనలైన 'కొత్త గబ్బిలం', 'నల్ల ద్రాక్షపందిరి', 'వర్తమానం' లోని కవిత్వాన్ని ప్రధానంగా తీసుకుని వారి దృక్పథాన్ని పరిశీలించడం జరిగింది. దళితవాద దక్పథంతో, సామాజిక స్పహతో ఆయన అల్లిన పదచిత్రాలను, సమాజంలోని అసమానతలపై ఆయన సంధించిన అక్షర అస్త్రాలను ఈ వ్యాసం శాస్త్రీయంగా విశ్లేషిస్తుంది. ఆయన సాహిత్యంలోని వస్తు వైవిధ్యం, శిల్ప చాతుర్యం, సామాజిక బాధ్యతను ఈ పరిశోధన ద్వారా ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. ఎండ్లూరి సుధాకర్‌ సాహిత్యం పై వివిధ విశ్వవిద్యాలయంలో కొన్ని పరిశోధనలు జరిగాయి. వాటిలో పి. గురుస్వామి 'ఎండ్లూరి మొగ్గల గొడుగు- సామాజిక దృక్పథం', బి.విజరు కుమార్‌ 'ఎండ్లూరి సుధాకర్‌ సాహిత్యానుశీలనం', యన్‌. చంద్రప్ప 'ఎండ్లూరి సుధాకర్‌ వర్తమానం ఒక పరిశీలన', ఐ. సైదులు ' కొత్త గబ్బిలం - విమర్శనాత్మక పరిశీలన'.వీటితో పాటు వివిధ వార్త పత్రిక సాహిత్యానుబంధ పేజీలలో ఎండ్లూరి సుధాకర్‌ సాహిత్యం పై వ్యాసాలు రావడం జరిగాయి.

Keywords: దళితవాదం, గొంతుక, నల్లసంతకం, దృక్పథం, సాహిత్యం, కులం, ధిక్కార సర్వం, అంటరానితనం.

1. ప్రవేశిక

'మాకిప్పుడు కావలసింది నెత్తుటిరొఖ్కం కాదు, మాకేం కావాలో కోరుకునే నిర్భయపు గొంతుక'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 114) అని ధైర్యంగా ప్రకటించుకొని, కొత్త రాజ్యాంగం, కొత్తదేశం, కొత్తభూమి, కొత్త ఆకాశం కావాలని ఆశించి, తన అస్తిత్వపు గొంతుకను చాటిన మహనీయుడు, మేధావి ఈతరం జాషువా 'ఎండ్లూరి సుధాకర్‌'. తెలుగు నేల సామాజిక స్థితిగతులను, అణచివేతకు గురైన గుండె చప్పుళ్లను కవిత్వంలో నిక్షిప్తం చేసిన నిబద్ధత గల సృజనకారుడు ఆయన. ఎండ్లూరి సుధాకర్‌ (1959-2022) తెలంగాణ ప్రాంత నివాసి.

సాధారణంగా మనుషులు తమ మీద చిన్న అపవాదు వస్తేనే తట్టుకోలేరు. అలాంటిది ఒక జాతి మొత్తం అవమానాలకు, బహిష్కరణకు, అంటరానితనానికి గురైతే ఆ వేదన ఎలా ఉంటుంది? ఊహించడానికి కూడా మనసొప్పదు కదా! అటువంటి దళిత కుటుంబంలో పుట్టి, ఆ జాతి జనులకు డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ అందించిన ఫలాలను, స్ఫూర్తిని అందివ్వాలని జాషువా మార్గాన్ని అనుసరించి నల్ల సముద్రాన్ని ఈదిన ఘనుడు 'ఎండ్లూరి'. అందుకే తన 'కొత్త గబ్బిలం' లో ''నా విన్నవీ, నేను కన్నవీ, నాకున్నవీ'' కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేశాను. కొందరు ఆదరించారు. కొందరు అవమానించారు. కొందరు హత్తుకున్నారు. కొందరు మొత్తుకున్నారు. ఎవరేమన్నా నా అభివ్యక్తిని అరికట్టలేకపోయారు. నాకు ఏ ప్రాంతాల మీద మోజులేదు. నన్నూ నా జాతిని అంటరానితనంతో చూసిన ఈ వ్యవస్థ మీద అసహనం ఉంది. లోలోపల కవితాజ్వాలనం రగులుతుంది. ఈలాంటప్పుడే ఓ చల్లనిమాల, ఓ వెచ్చని కరస్పర్శ అవసరమవుతుంది. అదే మానవీయత'' (సుధాకర్‌, కొత్త గబ్బిలం, పుట: 6) అంటూ ప్రకటించుకున్నారు.

నల్లద్రాక్ష పందిరి, వర్తమానం, జాషువా నా కథ: పరిశీలన, కొత్త గబ్బిలం, గోసంగి, సాహితీసుధ, తెలివెన్నెల, మల్లెమొగ్గల గొడుగు దళిత కథలు వంటివి వీరి కవిత్వ, వ్యాస, కథా రచనలు. వీరి రచనల గురించి జి. లక్ష్మీనరసయ్య అన్నట్లు,

వీటిల్లో మాదిగ ప్రపంచానికి చెందిన డార్కర్‌ సైడ్‌ కంటే బ్రైటర్‌ సైడ్‌ ఎక్కువగా కనిపిస్తుంది. మాదిగ దు:ఖం ఉంది. అంతకుమించి మాదిగ సంతోషం ఉంది. మాదిగల కష్టాలూ, నిస్సహాయత ఉన్నాయి. అంతకుమించి మాదిగల ప్రతిభాపాటవాలూ, తెగింపూ ఉన్నాయి. మాదిగల బలహీనతలున్నాయి. అంతకు మించి మాదిగల పట్టుదలా, పౌరుషం ఉన్నాయి. మాదిగ నిర్వేదం ఉంది (సుధాకర్‌, మల్లె మొగ్గల గొడుగు, పుట: 10).

ఎండ్లూరి కథల పుస్తకానికి ముందుమాటలో పేర్కొన్నట్లు, సుధాకర్‌ నిత్యం 'దళితవేదన'తోనే అక్షరాన్నే అస్త్రాలుగా మలచుకొని, తమ జాతి జనులు గర్వపడేలా సాహిత్య క్షేత్ర యుద్ధం చేశారు. ఈ దేశం మీద, ప్రాంతం మీద, ఈ వ్యవస్థ మీదనే ధిక్కార స్వరాన్ని ప్రకటించారు.

2. ఎండ్లూరి కవిత్వం - ధిక్కార స్వరాలు

ఎండ్లూరి సుధాకర్‌ సమకాలీన తెలుగు సాహిత్యంలో విశిష్టస్థానం సంపాదించిన కవి. ఆయన రచనల్లో సామాజిక వాస్తవాలు, మానవ సంబంధాలు, మానసిక సంఘర్షణలు సహజంగానే ప్రతిబింబిస్తాయి. కవిత్వంలోని 'వస్తువు' మారుతున్న కాలానికి అనుగుణంగా తమ విలువలను మార్చుకుంటూ, నిస్వార్థానికి లోబడి ప్రవర్తిస్తుంది. పాత గబ్బిలంతో పోలిస్తే వీరి 'కొత్త గబ్బిలం' మరింత చురుకుగా, నిరవకాశవాదిగా మారుతుంది. ఇది ఆధునిక సమాజంలో పెరుగుతున్న అవకాశవాద ధోరణిని సూచిస్తుంది. ఈ సమాజంలోని వ్యక్తులు నిర్వహిస్తున్న ద్వంద్వవైఖరి, బయటకు ఒకలా, లోపల మరోలా ఉండే మనుషుల మానసికత, ప్రపంచీకరణలో కూడా మారని 'కులం' దాష్టికాలను వీరి రచనలు పలకరిస్తాయి. దళితులు, గిరిజనులు, సాంఘికంగా వెనకబడిన జాతులు, ప్రకృతిలోని ప్రతి అణువు తరఫున కవిత్వమై, వారి గొంతుకను తమ స్వరంతో అందించి చైతన్యపరచడానికి, ఉన్నతీకరించడానికి ప్రయత్నం చేశారు.

2.1. ధిక్కార స్వరం ఆవిర్భావం

'ధిక్కారస్వరం' సమాజంలో అన్యాయం, అణచివేత, అసమానత, దోపిడీ వంటి పరిస్థితులపై వ్యక్తి సమూహం స్పష్టంగా, ధైర్యంగా, వ్యతిరేకంగా వ్యక్తపరిచే స్వరం. అధికారాన్ని ప్రశ్నించే ధోరణి, న్యాయం - సమానత్వాల పట్ల నిబద్ధతతో ఇది ఉద్భవిస్తుంది. 'ఎండ్లూరి' సాహిత్యం, కవిత్వం, ప్రసంగాలు, ఉద్యమాలు వంటి రూపాలలో ధిక్కార స్వరాన్ని వ్యక్తపరిచారు. ప్రజలను చైతన్యపరుస్తూ, మార్పుకోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన కవితా సుధాకరుడు ఆయన.

వాస్తవానికి కొంత చరిత్రను గమనిస్తే, ఎండ్లూరి కవిగా/రచయితగా మారడానికి సంఘటనలు, సందర్భాలు, సంభాషణలే కారణాలు. అవే వారిని కవిని చేశాయి. దళితవాడ జాతివేతల గాథలు ఆయనను ధిక్కార కవిని చేశాయి. జాషువా వారసత్వం పుచ్చుకొని, జాంబవంతుడికి సందేశాన్ని పంపిస్తారు. నువ్వు నడిచిన తొవ్వలా తాను కూడా నడుస్తున్నానని ప్రకటించుకుంటారు.

శాశ్వతంగా ఈ దేశం బానిసదేశంగానే ఉండేటట్టు చేయాలనే దురాలోచనతో అలనాడు బ్రిటిషు ప్రభుత్వం ఈ దేశంలో ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్యావిధానానికి కట్టుదిట్టంగా, దూరాలోచనతో రూపకల్పన చేసినవాడు మెకాలే'' (సంపత్కుమారాచార్య, పుట: 48) అని కోవెల అభిప్రాయపడ్డారు. దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత మరికొన్ని సమస్యలు అలాగే ఉండిపోయాయి. పరాయి దేశం వాడు భారతీయులను కేవలం 'బానిసలు'గానే చూశాడు. కానీ, స్వాతంత్య్ర భారతదేశంలో అగ్రకులాల వారు 'దళితులను' మాత్రం అంటరానివారుగా, నీచకులస్తులుగా పరిగణించి, ఈ దేశంలో కనీస సౌకర్యాలు నోచుకోకుండా చేయడం, చరిత్రలో జరిగిన అనేక సంఘటనల ద్వారా తెలుస్తోంది. కారంచేడు, చుండూరు, కోటేశ్ హత్య వంటి సంఘటనలు నిచ్చెనమెట్ల సమాజాన్ని మరింత తేటతెల్లం చేశాయి.

ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలువురు కుమారులనుట విన్నాముగాని పసరము కన్న హీనుడభాగ్యుడైన యైదవకులస్థుడెవరమ్మా! సావిత్రీ?'' (పద్మారావు, పుట: 67) ''అస్పృశ్యులను అణచివేయడమే ఆంధ్రుల చరిత్రగా కొనసాగింద''ని (పద్మారావు, పుట: 68) కత్తి పద్మారావు నిర్వచించిన, గబ్బిలం మహాకావ్యంలో జాషువా వేసిన ప్రశ్నలు దళిత సాహిత్యోద్యమానికే గాక, దళితోద్యమానికి ఒక ఊతం ఇచ్చాయి. రిచర్డురైట్‌ 'ది బ్లాక్‌ ఐడెంటిటీ' గ్రంథంలో ''రోమన్‌లు రాకముందే మేము మా నాగరికతను సృష్టించుకున్నాము, నడిపించుకున్నాము'' (పద్మారావు, పుట.6)

అని చెప్పినట్లే జాషువా, ఎండ్లూరి వంటి దళిత కవులు ఈ నాగరికత తమదని, తమమీద వారి ఆధిపత్యం చెల్లదని ధిక్కారస్వరాన్ని వినిపించారు. తమ చరిత్రను తామే రాసుకుంటామని సగర్వంగా ప్రకటించారు.

''కవిత్వం నా కులవృత్తిలోని చర్మతత్త్వ రహస్యం. ఒకే వస్తువు ముట్టలేను, ఒకే రకం చెప్పులు కుట్టలేను, నా పనితనానికి విలువ కట్టలేను'' (సుధాకర్‌, కొత్త గబ్బిలం, పుట: 10) అంటూ ఎండ్లూరి సుధాకర్‌ తన కవిత్వానికి వస్తువు 'కులవృత్తి' అని బహిరంగంగా ప్రకటించుకున్నారు. వారి కవిత్వంలో అమ్మనాన్నలు, కూతురు, దళితులు, ఎబిసిడి వర్గీకరణ, పారిశుద్ధ్య కార్మికులు, రైతులు, ప్రకృతి, కులం, మతం, ఆకలి, పేదరికం, ధనికవర్గం, నీటి కరువు, అంటరానితనం, సంస్కృతి నియమాలు, అనాథులు, మరణాలు, పట్టణీకరణ, సమాధులు వంటి అంశాలను ప్రధానంగా చూడవచ్చు. వారి తరఫున తమ గొంతుకనిచ్చి కవిత్వమై మాట్లాడుతున్నారు. ఈ అంశాలను పరిశీలిద్దాం.

2.2. దళిత దృక్పథం

''దళితవాదంలో అంబేద్కరు దృక్పథం, మార్క్సిస్టు దృక్పథం అనే రెండు దృక్పథాలు కన్పిస్తున్నాయి. రెండింటిని సమన్వయం చేయాలని కోరేవాళ్ళున్నారు. మరొక వర్గం రెండింటిని నిరాకరించి కొత్త దృక్పథాన్ని, సిద్ధాంతాన్ని అన్వేషించాలంటుంది. అంబేద్కరు సామాజిక విప్లవం, వర్గ కుల దృక్పథాన్ని పునాదిగా చేసుకొని, తెలుగులో దళితవాద తాత్త్వికత ఎక్కువగా సాగుతున్నది'' (సుజాతరెడ్డి, పుట: 287) అని చారిత్రక పరిశోధనతో ముదిగంటి సుజాతారెడ్డి అభిప్రాయపడ్డారు.

ఫూలే, సాహు మహారాజ్‌, అంబేద్కర్‌, కార్ల్‌మార్క్స్‌, మావో ఆలోచనల సిద్ధాంతాలతో, అమెరికాలో వచ్చిన 'బ్లాక్‌ లిటరేచర్‌' ప్రభావం, ప్రేరణలతో దళిత సాహిత్యం పుట్టింది. ఇది తెలుగులో 1980వ దశకంలో ఒక ఉద్యమ రూపాన్ని ధరించింది. ఎండ్లూరి రచనల్లో దళితులు పడుతున్న బాధలు, ఎదుర్కొంటున్న అవమానాలు 'దండోరా' ఉద్యమంగా, భావ ప్రసరణంలా, వేగుచుక్కలా ప్రకటించబడ్డాయి. అందుకే తమ చరిత్రను ''ఒక ప్రాచీన కాలపు చర్మ కళా నైపుణ్యంతో ఆది జాంబవులు చెప్పులు కుడుతూ వుంటారు''(సుధాకర్‌, కొత్త గబ్బిలం, పుట: 17) అంటూ తన వృత్తిని అభివ్యక్తికరిస్తారు. అక్కడితో ఆగక, ''జై దండోరా' అంటూ చయ్యిన ముందుకు దూసుకుపో. తెగించిన వానికి తెగేదీం లేదు, పోరాడే వానికి పోయేదేంలేదు''(సుధాకర్‌, కొత్త గబ్బిలం, పుట: 17) అంటూ కార్ల్‌మార్క్స్‌ అడుగుజాడలలో ప్రయాణించమని సలహా ఇస్తారు. అలా చెప్పడానికి ప్రధాన కారణం 'కుల సమస్య'.

ఒక కులంలో పుట్టిన వ్యక్తికి ఆ కులం వల్ల అన్ని జీవన అవకాశాలు ఘనీభవించుకుపోతాయి. డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ కులాన్ని ఒక మాటలో అద్భుతంగా నిర్వచించారు. ''కులం అన్నివైపులా దారులు మూసుకుపోయిన మార్గం'' (అనూరాధ, పుట: 12). ఈ నిర్వచనం కులానికీ, వర్గానికీ మధ్య ఉన్న తేడాను, పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తోంది. ఒక వ్యక్తి ఏ కులంలో పుడతారో, ఆ కులమే అతని సామాజిక హౌదాను నిర్ణయిస్తుంది. అంతేగాక, వారు ఏ సమూహం పరిధిలో ఏ విధంగా జీవించాలో, పెళ్ళి, చావుల వంటి అన్నింటినీ నిర్దేశిస్తుంది. హిందూమతం వాటిని 'విభజించి పాలించు' విధానంగా, దళితుల పట్ల మరణ శాసనంగా చిత్రించింది. అందుకే అంబేద్కర్‌, జాషువా, ఎండ్లూరి వంటి మహానీయులకు సైతం కుల సమస్య, కుల అవమానాలు తప్పలేదు. భారతీయ కుల వ్యవస్థ కేవలం విభజన ప్రాతిపదికన ఏర్పడలేదు. నాలుగు అంచెల హెచ్చుతగ్గుల దొంతరతో కూడిన వర్ణవ్యవస్థతో పెనవేసుకుపోయిన ఈ వ్యవస్థకు దేవుడి అనుమతి సైతం జోడించబడింది. అందువల్ల భారతదేశంలో కులవ్యవస్థ బృహత్తరమైన, సంక్లిష్టమైన వ్యవస్థగా రూపొందింది.

అనాదికాలంగా దళితులు అస్పృశ్యులుగా, అంటరానివాళ్ళుగా ఉన్నా, సాహిత్యంలో వారికి చోటు దక్కలేదు. 1980 తర్వాత దళిత సాహిత్యం మెల్లమెల్లగా ఉద్యమంలా, సాహితీ క్షేత్రంగా ఉవ్వెత్తున కొనసాగి నిలబడింది. ఎండ్లూరి దళితుల జీవితాన్ని ''ఏ శవమైనా ఎదురుపడితే పాడెముందు ప్రణమిల్లు. వర్ణ భేదం లేకుండా చివరి చూపుచూడు. ఉప్పుల దరువులకు కప్పల్లా ఎగురుతూ పీనుగు మీదుగా విసిరేసి చిల్లర పైసల్ని ఏరుకునే మసిబుగ్గల పసిపిల్లలు నీ కళ్లల్లో ఆకలి ముళ్లై గుచ్చుకుంటారు'' (సుధాకర్‌, కొత్త గబ్బిలం, పుట: 25) అంటూ వారి ఆర్తనాదాలను, ఆవేదనను, మసిబుగ్గల జీవితాసారాన్ని చిత్రీకరించారు.

''నా జాతి పుష్పమా! నా నీలమణి. నీ అందాన్ని బహిష్కరించిన అక్షరాలను ఇవాళ నేను వశీకరించుకున్నాను. నీ బంతిపూల కొప్పు మీద ఒట్టు. నిన్ను ఊరి బయటే నిలబెట్టిన ఆకాశమెత్తు ఉట్టిని పగలగొడుతున్నాను'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 106) అని లోహముద్రలను బద్దలకొట్టి, నవ నాగరికత సమాజంలో దళితులను ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించడానికి కారణాన్ని ''నేనింకా నిషిద్ధ మానవుణ్ని. నాది బహిష్కృత శ్వాస. నా మొలకు తాటాకు చుట్టి, నా నోటికి ఉమ్మిముంత కట్టి, నన్ను నలుగురిలో అసహ్య మానవ జంతువుని చేసిన మనువు, నా నల్లని నుదుటి మీద బలవంతంగా నిషిద్ధముద్ర వేసినప్పుడు నా జాతంతా క్రమక్రమంగా హత్యచేయబడింది''(సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 112) కాబట్టి వారికి ఆహ్వానం పలుకుతున్నారు.

చరిత్రలో దళితులకు జరిగిన అవమానాలను, బాధలను 'పాదముద్రలు' కవితలో చూస్తే... ''నిన్నటిదాకా నన్ను చెట్లుక్కట్టి కాల్చారు. అమానుషపు కొరడాలతో అస్పృశ్యపు గాయాలు చేశారు. నా దేహాన్ని ముక్కలుగా నరికి మూటలు కట్టారు. నా నోట్లో నిర్లజ్జగా మలం కుక్కారు'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 116) అంటూ తన తాతముత్తాల నాటి అంటరానితనపు దస్తావేజల్ని, కన్నీటి కైఫీయతుల్ని, దరిద్రపు చీకటి చరిత్రల్నీ నడిరోడ్డుమీద పెట్టి, చించి పోగులు పెడుతున్నారు. అందుకే భూతకాలపు గొంతుమీద కాలుపెట్టి... నిర్భయంగా ఆశతో 'నల్ల సంతకం' చేస్తున్నారు కవి. భారత ఉపఖండ ప్రజలకు కులాలే జీవన సర్వస్వం. ఇక్కడ సంభవించే రాజకీయ, ఆర్థిక మార్పులను అవి ఎప్పటికప్పుడు తమలో ఇముడ్చుకుంటాయి.

దళితులు అనగానే గుర్తుకువచ్చే మరో సామాజిక సమస్య 'అంటరానితనం'. ''క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం నుంచే అంటరాని వాళ్ల గురించిన ప్రస్తావన ఉంది.''(అనూరాధ, పుట: 44). పుట్టుకను బట్టి ఒక వ్యక్తిని సమూహాన్ని సమాజం నుండి వెలివేసి, వారిని అపవిత్రులుగా పరిగణిస్తూ, ప్రాథమిక హక్కులను నిరాకరించడమే 'అంటరానితనం'. ఇది కేవలం శారీరక దూరం కాదు. ఒక మానసిక వ్యాధి, సామాజిక అణచివేత సమస్య. సాధారణంగా కులాలు అచంచలమైనవి అన్నట్టు మాట్లాడుతారు. అవి ఘనీభవించినవి, శిలాసదృశమైనవి, మారనివి అన్నట్టు, సజీవమైనవి కానట్టు భావిస్తారు. వర్ణానికీ, కులానికీ మధ్య; కులానికీ, అంటరానితనానికీ మధ్య; శూద్రులకూ, దళితులకూ మధ్య గందరగోళం మామూలే.

మనిషిని మనిషిగా చూడటం మానవతావాదం. ఇది భూమి మీద జీవించే జీవరాసులన్నిటి పట్లా బాధ్యతగా వుంటూనే మానవుని కేంద్రకంగా ఆలోచిస్తుంది. మానవ సంక్షేమం దృష్ట్యానే ఆలోచిస్తుంది, ప్రకృతితో సహజీవనం చేస్తుంది. బౌద్ధం ఈ దృక్పథాన్ని మానవ సమాజంలో ఆలోచింపజేసింది, ఆచరణీయంగా మార్చింది. కాని హైందవం ఈ సిద్ధాంతాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. ఫలితంగా వర్ణ వ్యవస్థ బలపడింది. కుల అసమానతలు తప్పలేదు. దళితులను అమానవీయంగా మూతికి ముంత కట్టి, ముడ్డికి చీపురు కట్టి వీధుల్లో నడిపించి, అనాగరిక అథమ స్థానానికి నెట్టివేశారు. ఇది ప్రాచీన యుగం నాటి హైందవ అసమాన మానవ నాగరికత'' (లక్ష్మీనారాయణ, పుట: 117).

ఇలాంటి అచేతనావస్థలోనే దళితులు జీవించారు. సాంఘిక స్థాయిని పొందారు. కులవృత్తులను, శారీరక శ్రమను, సామాజిక సేవలను సమాజానికి అందిస్తూనే తమ ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఇటువంటి తరుణంలో ఎండ్లూరి కంటే ముందు తరంలో మనకు తెలిసి డా. బి.ఆర్‌. అంబేద్కర్‌, జాషువా వంటి వారు ఈ సమస్యను ఎంతో మనోవేదనతో అనుభవించారు. మనోధైర్యంతో పది అడుగులు ముందుకు వేసి, ఈ తరం కోసం కృషిచేశారు. మనుషులను మనుషులుగా చూడలేక, అంటరానివాళ్లుగా ముద్రవేసి, ఆధునిక సమాజం నుండి మరింత దూరం చేశారు.

''భయం భయంగా అర్థాకలితో వెళ్లిపోయే దానిని. ఏ కొళాయి దగ్గరో బావి దగ్గరో నువ్వు దాహమై నిల్చినపుడు, నీ నల్లకుండలో 'వెలి' గాలులు వీస్తున్నప్పుడు ఎన్ని తిట్లు సూదులై నీ గుండెల్లో కుట్లు వెయ్యలేదు?'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 70) అంటూనే కవి మరోచోట మళ్ళీ ఇలా ''మన బతుకంతా అన్నం వెతుక్కోవడంతోనే సరిపోయింది. బుక్కెడు మెతుకులు కళ్లజొడటమే ఈ జీవితానికి గొప్ప వరమైపోయింది. మన బతుకులే కాదు, చివరికి మనకు మెతుకులు కూడా అంటరానివే అయ్యాయిరా దాసూ''(సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 62) అంటూ వాస్తవికతలను కళ్ళముందు ఉంచారు.

దళితుల జీవితం, పుట్టుకే ఒక సమస్యగా చిత్రీకరించింది ఈ సమాజం. సమాజంలో 'మనిషి' అనే వ్యుత్పత్తి అర్థం కోసం 'డిక్షనరీ' ఇంకా రాలేదేమో! ఇతరులను 'మనిషి'గా చూడలేని దృక్పథంతో మనం బతుకుతున్నాం. బహుశా అదే దీనికి కారణం. అందువల్ల ఈ సమాజంలో కొత్త నిర్వచనం, కొత్త దృక్పథం అవసరమయ్యాయి. దానికోసం ఎండ్లూరి ''జన్మ సొరంగంలోంచి కాసింత అన్నాన్ని మాత్రమే వెతికాం'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 62) అనే మాట అనిర్వచనీయమైనది.

2.3. కవిత్వంలో అభివ్యక్తి విధానాలు

ఎండ్లూరి తన కవితా దృక్పథంతో అనేక స్వరాలను వినిపించారు. స్వాతంత్య్ర దేశంలో అభివృద్ధి చెందుతున్న తరుణంలో కూడా ఆకలి, నీటి కరువు, రైతు మరణాలు, పేదరికం, వర్గపోరాటాలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎండ్లూరి తన కవిత్వంలో దళితుల జీవన విధానంతో పాటు, దళిత వర్గీకరణ పట్ల తమ భావాన్ని సూటిగానే తెలియజేశారు. అనేక సందర్భాల్లో తన గొంతుక ద్వారా పైన చెప్పుకున్న దృక్పథాలను, అభివ్యక్తిని ప్రకటించుకున్నారు.

2.4. 'నీలిక' - ఒక ప్రతి సౌందర్యం

ఎండ్లూరి రచించిన 'నల్లద్రాక్ష పందిరి' లో 'నీలిక' కవితను పరిశీలిస్తే... కవి తెలుగు దళిత సాహిత్యంలో అలంకార శాస్త్రానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. సాధారణంగా ప్రాచీన కావ్యాలలో 'సౌందర్యం' కేవలం తెల్లని వర్ణానికి, ఆర్య సంస్కృతికి మాత్రమే పరిమితమై ఉండేది. కానీ, సుధాకర్‌ గారు ఈ కవితలో 'నలుపు'కు ఉన్న అనంతమైన అందాన్ని, ఆత్మీయతను ఆవిష్కరించారు.

''నీ వెండి కడియాల నల్ల కాళ్లముందు వెయ్యేళ్ల కావ్య నాయికలు వెలవెలబోతున్నాను''(సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 106) శ్రమతో నిండిన నల్లని కాళ్ళకు ఉన్న 'వెండి కడియాల' మెరుపు ముందు వేల ఏళ్ళ నాటి కావ్యాలలోని కల్పిత సౌందర్యం చిన్నబోతుందని చెప్పడం ద్వారా ఒక 'ప్రతి సౌందర్యం శాస్త్రాన్ని' (Counter Aesthetics) ఆయన నిర్మించారు.

ఇందులో మరొక బలమైన చిత్రణ ప్రకృతి చిత్రణ. సుధాకర్‌ గారు దాదాపు అన్ని కవితా సంపుటాలలో అంతర్లీనంగా చెప్పిన అంశం ప్రకృతి చిత్రణే. దళితులకు పుట్టుక నుండి మరణం వరకు తోడు ఉండేది కేవలం ప్రకృతే. ఇదే దీనికి కారణం. ఈ కవితలో ''ఓ నా చండాలికా!''ను ద్రాక్ష పందిరితో, తాటాకు గొడుగుతో, నల్లరేగడి మట్టితో పోల్చుతూ, ఆమెను చూస్తే మబ్బులు నేలకు దిగుతాయి, చంద్రుడు ఆమెను చూసేందుకు ఉరకలేస్తాడని చెప్పడం ద్వారా, ప్రకృతి మొత్తం ఆమె అందానికి దాసోహమన్నట్లుగా చిత్రించారు. కవి ఆమెను కేవలం ప్రేయసిగా మాత్రమే గాక, ఒక జాతికి ప్రతినిధిగా చూశారు.

''నా జాతి పుష్పమా! నా నీలమణి… నా నల్ల ద్రాక్ష పందిరీ! నా అరుంధతీ నక్షత్రమా!'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 106-107) ఇక్కడ 'అరుంధతీ నక్షత్రం' అనడం ద్వారా ఆమె పవిత్రతను, గౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. దళిత బహుజన మహిళల ఆత్మ గౌరవాన్ని సాహిత్య శిఖరం మీద నిలబెట్టే ప్రయత్నం కవి చేశారు. ''నీ నీలాలంకార సౌందర్య శాస్త్ర సింహాసనం మీద నిన్ను కావ్య గౌరవంతో అభిషేకిస్తున్నాను'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 106). లోకం చీదరించుకునే నలుపు రంగును, శ్రమ వల్ల కలిగే చెమటను కవి ఒక పవిత్రమైన అభిషేకంగా భావించారు. తన 'నల్ల కావ్యానికి' ఆమెను నాయకిగా ప్రకటించడం ద్వారా అణగారిన వర్గాల వ్యక్తులు కూడా కావ్య నాయకులు కావడానికి అర్హులేనని చాటి చెప్పారు.

2.5. సామాజిక సమస్యల విశ్లేషణ

ఎండ్లూరి రచించిన 'నెత్తుటి ప్రశ్న' దళిత సాహిత్య చరిత్రలో ఒక మైలురాయి. ఈ కవిత సామాజిక అణచివేతను, చారిత్రక అన్యాయాలను అత్యంత శక్తివంతంగా, హృదయ విదారకంగా ప్రశ్నిస్తుంది. కవి తనను తాను ''నేనింకా నిషిద్ధ మానవుణ్నే'' (Forbidden Human) (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 112) అని ప్రకటించుకోవడంతో కవిత ప్రారంభమవుతుంది. ఇది కుల వ్యవస్థ వల్ల ఒక మనిషి సమాజం నుండి ఎలా వెలివేయబడ్డాడో సూచిస్తుంది. ''నా నల్లని నుదుటి మీద బలవంతంగా నిషిద్ధ ముద్ర వేసినప్పుడే నా జాతంతా క్రమక్రమంగా హత్యచేయబడింది'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 112) అనడం ద్వారా ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య కాదు, ఒక సమూహంపై జరిగిన చారిత్రక దాడి అని స్పష్టమవుతుంది. అంతేకాకుండా ''చరిత్ర బూటకపు సాక్ష్యం చెబుతోంది'' అనడం ద్వారా చరిత్రలో బాధితుల గొంతు నొక్కబడి, కేవలం అగ్రవర్ణాల విజయాలు మాత్రమే రాయబడ్డాయనే సత్యాన్ని చాటారు. అక్కడితో ఆగక, తమకు కావాల్సింది కేవలం సానుభూతి కాదు, ఒక 'నిర్భయ గొంతుక' అని కవి ఈ సమాజానికి పిలుపునిచ్చారు. రాజకీయ నాయకుల ద్వంద్వనీతిని కవి నిశితంగా విమర్శించి, వ్యవస్థపై నిరసనను తెలియజేశారు.

ఎండ్లూరి రచించిన మరో అద్భుతమైన కవిత 'మైసమ్మ మరణం'. తెలుగు సాహిత్యంలో కట్టమంచి వారు 'ముసలమ్మ మరణం' ద్వారా తొలి విమర్శకు నాంది పలికారు. ఎండ్లూరి వారు 'మైసమ్మ మరణం' ద్వారా కేవలం ఒక వ్యక్తి మరణం గురించి చెప్పడమే కాదు. సమాజం కంటికి ఆనని అట్టడుగు వర్గాల శ్రమ ఎంత విలువైనదో, వారు లేని లోటు ఎంతటిదో చాటి చెప్పే గొప్ప మానవీయతకు నాంది పలికారు. ''మైసమ్మా! మైసమ్మా!! నీకూ నాకూ ఏ రక్త బంధం లేకున్నా, కొంత నా చెత్తనూ ఎత్తిపోసిన నీలో అమ్మను చూస్తున్నా మైసమ్మా'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 128) అని రాశారు. ''చెత్తనూడ్చే మైసమ్మలో తల్లిని చూడగల్గడం ఒరే నాయనా అది నీకే సాధ్యమైంది'' (గోపి, పుట: 10) అని డా. ఎన్‌. గోపి అభిప్రాయపడ్డారు.

గోదావరిపై కవితలు రాస్తూ, అక్కడితో ఆగక, అనేక సందర్భాలలో అమ్మ గురించి, నాన్న గురించి, కూతురు గురించి ఎన్నో కవితలు అందించారు. నగర వర్ణన ఎండ్లూరి రచనలలో ఒక భాగం అని ఇంతకుముందే చెప్పుకున్నాం. ''రైతు ఉరేసుకోవడం భరించలేను''(సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 23) అంటూ రైతుల ఆర్తనాదాలను తన గొంతుకగా వినిపించారు. ఇది ఒక సామాజిక బాధ్యతగా, రైతుకు భరోసాగా నిలవాలని, ఆత్మహత్యలు ఆగాలని కలలు కన్నారు. 'చెరువు లేని ఊరు' కవితలో ''గుక్కెడు మంచి నీళ్లు కూడా దొరికేవి కావు'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 42) అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

''నాకు ప్రతిభ లేదనే కదా అభియోగం'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 116) అనే మాట ద్వారా దళితులను ఈ సమాజం కేవలం అంటరానివారిగానే చూడడమే కాకుండా, వారి భూమిని, కళలను తొక్కిపెట్టాక ప్రతిభ ఎలా కనిపిస్తుందో మీరే చెప్పాలి అనే ప్రశ్నతో ఈ వ్యవస్థను నిలదీశారు. సాంఘికంగా వెనకబడిపోతున్న తమకు ''వెలివాడల్ని విముక్త ప్రాంతాలుగా ప్రకటించండి. అందులోంచి విశ్వ మానవులు బయటికొస్తారు''(సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 100) అని పిలుపునిచ్చారు. ఇది నినాదం కాదు, ఒక సామాజిక మానిఫెస్టో. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 21 ద్వారా వెలివాడల విముక్తిని కోరారు. భయంలేని జీవితం, అవమానం లేని గుర్తింపు, అవకాశాలపై సమాన హక్కు, మార్పును కోరుకున్నారు. వాటిని సాధించే వరకు పోరాటం చేయాలని మార్గాన్ని అన్వేషించి చూపారు. ''ఇప్పుడు సరస్వతి శాశ్వతంగా మా వాడ కోడలయ్యింది''(సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 100). తరతరాలుగా దళితులకు దూరం చేసిన సరస్వతి, తమ వాడ కోడలయ్యిందనే ఆశాభావాన్ని కవి సగర్వంగా ప్రకటించుకున్నారు. ఎండ్లూరి ప్రతి కవితా ఒక కావ్యంలాగానే సాగుతుంది. అనేక సందర్భాలలో నిలిచి, కొత్త గొంతుకను కవితల ద్వారా అందించారు.

2.6. మరణం పట్ల తాత్వికత

ఎండ్లూరి 'మరణం' గురించి చాలాచోట్ల హృద్యంగా చిత్రీకరించారు. సాహిత్యంలో డా. సి. నారాయణ రెడ్డి తర్వాత, మరణం గురించి అంత అందంగా కవిత్వీకరించడం ఎండ్లూరికే సాధ్యమైంది.

''నా శవం మీద పిడికెడు మట్టికి బదులు గుప్పెడు పంచదార చల్లిపోండి'' అని రాశారు. తనకు ఉన్న మధుమేహం గురించి మాట్లాడిన తీరు కన్నీళ్లు తెప్పిస్తుంది. అక్కడితో ఆగక, మరొక చోట ''మృత్యువు ప్రేయసిలా కన్నుగీటితే ముద్దివ్వడానికి భయమెందుకు? జీవితం చివరి తేదీ ముగిసిపోతే ఈ లోకానికి షుక్రియా చెప్పి చిరునవ్వుతో నిష్క్రమిద్దాం. అంతవరకు జీవితాన్ని వీరోచితంగా అనుభవిద్దాం'' (సుధాకర్‌, వర్తమానం, పుట: 64) అనే పంక్తులు మృత్యువుపై ధిక్కార స్వరాన్ని, జీవితంపై మమకారాన్ని తెలియజేస్తాయి.

సాధారణంగా మనుషులు 'మరణం' అంటే భయపడతారు. కానీ ఇక్కడ కవి మరణాన్ని ఒక 'ప్రేయసి'తో పోల్చారు. ప్రేయసి పిలుపు కోసం ప్రేమికుడు ఎలా ఎదురుచూస్తాడో, మరణం సంభవించినప్పుడు దానిని అంతే ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవాలని, ఈ లోకానికి 'శుక్రియా'(కృతజ్ఞతలు) చెప్పి చిరునవ్వుతో వెళ్ళిపోవాలని చెపుతూనే, అంతవరకు వీరోచితంగా పోరాడాలని 'మరణం' లో తన గొంతుకను అందిస్తారు. ఇంతటి ధైర్యం మరెవ్వరు చేయలేరనడం అతిశయోక్తి కాదు. తెలుగులో ఇలాంటి వర్ణనలు భావకవుల దగ్గర, దిగంబర కవుల దగ్గర ఆ తర్వాత ఎక్కడో అక్కడ మాత్రమే కనిపిస్తాయి. తన చివరి మజిలీని కూడా అంతే ప్రేమతో, ధైర్యంతో ఈ లోకానికి 'శుక్రియా' చెప్పి ముగించారు. ''ఈ మట్టిగోడల కిందే మృత్యువు అస్థిపంజరాల ఆస్తుల్ని దాచుకొనేది. ఈ ఒక్కచోటే మనిషీ, మట్టీ మమేకమవుతాయి. చావంటే మనుషులకెంత భయమో! పూలపాన్పు కౌగిట్లో చరమ స్వప్నం కదా మరణం! అది తొలిసారి అనుభవించే ఆఖరి చుంబనం'' (సుధాకర్‌, నల్ల ద్రాక్ష పందిరి, పుట: 166) అని రాశారు. స్మశానంలో లేదా మట్టికింద అందరూ సమానమే, అక్కడ హౌదాలు, ఆస్తులు ఉండవని, జీవిత ప్రయాణంలో ఎదురయ్యే ఒక 'ఆఖరి మలుపు' మాత్రమేనని, మరణం పట్ల ఒక విభిన్నమైన తాత్త్విక కోణాన్ని ఆవిష్కరించారు.

ఉపసంహారం

కవి తాను కవిత్వం, కథ, మరేదైనా రచన చేసేటప్పుడు ఒక దృక్పథాన్ని, సింబాలిజాన్ని, ప్రతీకాత్మకతలను ఏర్పాటు చేసుకుంటారు. వాటిని ధైర్యంగా ప్రకటించి, ఆవిష్కరింపజేస్తారు. ఎండ్లూరి వారు కూడా తన రచనలో అదే పని చేశారు. అంతర్లీనంగా ఆరని జ్వాలగా ప్రవహించే 'వేదన'ను కవితా దృక్పథంగా ప్రకటించుకున్నారు. ఎక్కడా నటించలేదు. స్వచ్ఛమైన హృదయంతో, కాలానికి ఎదురు నిలిచి పోరాటం చేయాలని అనుకున్నారు. ఏ వ్యవస్థ నుండి వచ్చారో, ఆ సంస్కృతిని, అందులో ఉండే విలక్షణమైన ఆహార నియమాలను గురించి 'దండోరా' దరువు వేపించారు. 'గాడిద'తో కవిత్వాన్ని పరిగెత్తించారు. దళితుడికి దేవుడి గుడిలో నిషేధాన్ని విస్మరించి, దళిత స్త్రీ ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. స్వచ్ఛమైన మనిషి కోసం, పరిపూర్ణమైన వ్యక్తుల కోసం ఎదురు చూశారు. పొల్యూషన్ లేని నగరం కావాలని కోరుకున్నారు. వీటి కోసం 'కొత్త గబ్బిలాన్ని', 'నల్లద్రాక్ష పందిరి', 'వర్తమానాన్ని' ఎంచుకున్నారు.

ఇన్ని సుగుణాలున్న ఈ కవిత్వంలో కవి దృక్పథాన్ని ఎక్కడ పట్టుకోవాలో విమర్శకులకు వదలేసిన సుధాకరుడవీ నీవు. ''మిత్రులారా క్షమించండి. కవిత్వం నిప్పు: నిజమే మాట్లాడుతుంది. ఆత్మ వంచన కాగితాల మీద అబద్ధ వాక్యాలు రాయలేను'' (సుధాకర్‌, వర్తమానం, పుట: 56) అనే ధైర్యాన్ని, సామాజిక కనువిప్పును కలిగించారు. తెలుగు సాహిత్యంలో చెరగని 'నల్ల సంతకాన్ని' చేశారు. అనేక సమస్యల పట్ల బలమైన 'గొంతుకు'ను వినిపించారు. ''కొత్తగా జన్మించకపోతే ఈ దేశంలో జీవించడానికి నేను అనర్హుణ్ణి''(సుధాకర్‌, వర్తమానం, పుట: 85) అని చెప్పి, మళ్ళీ జన్మిస్తావని ఆశపడుతూ, వారి గొంతుక వినాలని బయలుదేరిన మిత్రులు ఆశ్రునయనాలతో ''ఎక్కడైనా తుపాకీ తుపాకీని తీసుకెళ్తుందా?'' అనే మాటలతో మరణంలేని అమరత్వాన్ని పొందారు. మీరు లేని సాహితీసభలు వెలవెలబోతున్నాయి. ఎండ్లూరి సాహిత్యమంటే శ్రమజీవుల, బహిష్కృతుల, పీడితుల కంఠధ్వని. నేటి సమాజానికి ఒక అద్దంలాంటిది. వీరి రచనలు ప్రజాసాహిత్య పునాది మీద నిర్మితమైనవి. ఆయన సాహిత్యం సామాజిక చైతన్యానికి దారితీసే శక్తిగా నిలిచి, ప్రజల ఆవేదనకు భాషానువాదమైంది. ప్రజాసాహిత్య దిశలో ఆయన రచనలు 'సంభవామి యుగేయుగే' అన్నట్లు తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

  • ఎండ్లూరి సుధాకర్‌ దళిత అస్తిత్వం, సామాజిక న్యాయం కోసం ధిక్కార స్వరాన్ని వినిపించిన మహనీయుడు.
  • ఆయన కవిత్వం కుల వివక్ష, అంటరానితనం, దళితుల బాధలను శక్తివంతంగా చిత్రించి, సమాజంలో మార్పును ఆకాంక్షించింది.
  • 'నీలిక' కవిత ద్వారా నలుపు సౌందర్యాన్ని, దళిత మహిళ ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించి, ప్రతి సౌందర్య శాస్త్రాన్ని నిర్మించారు.
  • 'నెత్తుటి ప్రశ్న', 'మైసమ్మ మరణం' వంటి కవితలు చారిత్రక అన్యాయాలను ప్రశ్నించి, అట్టడుగు వర్గాల శ్రమ విలువను చాటిచెప్పాయి.
  • రైతు ఆత్మహత్యలు, నీటి కరువు వంటి సామాజిక సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, 'వెలివాడల విముక్తి' ద్వారా విశ్వమానవులను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు.
  • మరణాన్ని 'ప్రేయసి'గా భావించి, జీవితం పట్ల వీరోచిత దృక్పథాన్ని, మరణం పట్ల తాత్వికతను ప్రకటించి, సాహిత్యంలో విలక్షణ స్థానాన్ని పొందారు.

ఉపయుక్త గ్రంథసూచి

  1. అనూరాధ, గాంధీ. భారతదేశంలో కుల సమస్య. మలుపు ప్రచురణ, 2015.
  2. గోపి, ఎన్., "ముందుమాట." నల్ల ద్రాక్ష పందిరి, ఎండ్లూరి సుధాకర్‌, జె.జె. ప్రచురణలు, 2002, పుట. 10.
  3. పద్మారావు, కత్తి. దళిత ఉద్యమ చరిత్ర. లోకాయత ప్రచురణలు, 2005.
  4. లక్ష్మీనారాయణ, కె., ఆది భారతీయుల చరిత్ర. కర్నూల్‌ డయాసిస్‌ సోషల్‌ సర్వీసు సొసైటి, 2006.
  5. వెంకటేశ్వరరావు, దార్ల, వీచిక (సాహిత్య విమర్శ వ్యాసాలు). ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్‌ ప్రెస్‌, 2009.
  6. సంపత్కుమారాచార్య, కోవెల. కావ్యం: కవిసౌమ్యం. శ్రీలేఖ సామితి ప్రచురణలు, 1993.
  7. సుజాతరెడ్డి, ముదిగంటి. చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర. రోహణమ్‌ పబ్లికేషన్‌, 1996.
  8. సుధాకర్‌, ఎండ్లూరి. కొత్త గబ్బిలం. మానస మనోజ్ఞ ప్రచురణలు, 2001.
  9. పైదే. నల్ల ద్రాక్ష పందిరి. జె.జె. ప్రచురణలు, 2002.
  10. పైదే. మల్లె మొగ్గల గొడుగు మాదిగ కథలు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు, 1999.
  11. పైదే. వర్తమానం. మానస మనోజ్ఞ ప్రచురణలు, 1997.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]