headerbanner

✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025ముఖ్యగమనిక: "UGC" వారు "UGC-CARE" ను రద్దు చేసినట్లు ఒక ప్రకటన (11.02.2025) విడుదల చేసారు. "పీర్-రివ్యూడ్" జర్నళ్ళు పాటించాల్సిన పరిశోధన ప్రమాణాల రీత్యా కొన్ని "పారామీటర్లు" సూచించారు. "AUCHITHYAM" పరిశోధన మాసపత్రిక MARCH - 2025 సంచిక నుండి "Peer-Reviewed Journal" గా కొనసాగుతోంది. గమనించగలరు. ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

Impact Factor (IF):   SJIF 2024 = 5.897      SJIF 2023 = 5.578      SJIF 2022 = 4.132

AUCHITHYAM | Volume-07 | Issue-01 | January 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

4. జల సంరక్షణ కవితాసంకలనాలు: కవుల ప్రణాళికలు

గుంటి రోహిత్ కుమార్

పరిశోధకులు, తెలుగుశాఖ,
హైదరాబాదు విశ్వ విద్యాలయం,
రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 6281390586, Email: guntirohith0303@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 10.12.2025        ఎంపిక (D.O.A): 25.12.2025        ప్రచురణ (D.O.P): 01.01.2026


వ్యాససంగ్రహం:

ఈ పరిశోధన పత్రలక్ష్యం నీటి కరువులు ఏర్పడుతున్న ప్రస్తుతసమాజంలో నీటిని సంరక్షించుకోవాల్సిన ప్రణాళికలను తెలియజేయడం. ఈ కవిత్వాన్ని సూక్ష్మ పరిశీలనద్వారా వివిధ విభాగాలుగా వర్గీకరించి పరిశీలించాను. అవి: భూగర్భ జల సంరక్షణ, జల వనరుల సంరక్షణ, నీటి పొదుపు వినియోగ స౦బంధ జలసంరక్షణ కవిత్వం, సమాజ బాధ్యత సంబంధ జల సంరక్షణ కవిత్వం, ప్రభుత్వ బాధ్యత సంబంధ జల సంరక్షణ కవిత్వం, మురుగునీటి సద్వినియోగ సంబంధ జల సంరక్షణ కవిత్వం, ఇంకుడు గుంతల నిర్మాణ సంబంధ జల సంరక్షణ కవిత్వం, వృక్ష సంబంధ జల సంరక్షణ కవిత్వం, వ్యవసాయ (బిందు, తుంపర సేద్య పద్దతి) సంబంధ జల సంరక్షణ, పోరాట యోధుల స్పూర్తి సంబంధ జల సంరక్షణ కవిత్వం మొదలైనవి. ఈ జల సంరక్షణ ప్రణాళిక కవిత్వంను విశ్లేషణాత్మక పద్దతిద్వారా వివరించాను. గంగ కాశీనాథ్ ప్ర.సం.పాలో వచ్చిన జలమే జగతికి బలం, బైస దేవదాసు సం.పా లో వచ్చిన నీళ్లగోస, ఎస్. నిరంజనరెడ్డి సం.పాలో వచ్చిన తెలంగాణ జల కవితోత్సవం అనే కవిత సంకలనాలు, కె.బాలగోపాల్ రాసిన కరువు-వ్యవసాయ సంబంధాలు, ఆర్. సత్యనారాయణ రాసిన నీటి గోస, బెల్లంకొండ సంపత్ కుమార్ సం.పా లో వచ్చిన తొలినాళ్ళ సోయి మొదలైన గ్రంథాలను నా వ్యాసానికి ప్రథమ, ద్వితీయ ఆకరాలుగా స్వీకరించాను. చివరగా జీవకోటి భవిష్యత్ మనుగడ కొనసాగాలంటే ఇప్పటి నుంచే జల సంరక్షణ పద్దతులను పాటించాలని, సమాజాన్ని చైతన్యపర్చడంలో భాగంగా జలసంరక్షణ ప్రణాళికలను తెలియజేస్తూ కవులు తమ సామాజిక బాధ్యతను ప్రదర్శించారు. దీన్ని సమాజం అర్థం చేసుకొని పాటిస్తే నీటి కరువులు రావు అని తెలియజేయడమే ఈ వ్యాస౦ ప్రధాన ఉద్దేశం.

Keywords: జలసంరక్షణ ప్రణాళిక, కవిత్వం, భూగర్భజలం, జలవనరులు, నీటిపొదుపు, వృక్షాలు, వ్యవసాయం, సమాజ బాధ్యత, ప్రభుత్వ బాధ్యత, ఇంకుడుగుంతలు, పోరాట యోధులు, సామాజిక చైతన్యం

1. ప్రవేశిక

జీవరాశికి జీవశక్తినిచ్చేవి నీళ్లు. నీటికి, మనిషికి విడదీయరాని బంధముంది. మనిషి పుట్టినప్పటి నుండి మరణించే వరకు నీటితో సంబంధం కొనసాగుతూనే ఉంటుంది. పంచభూతాలలో ఒకటిగా నీటికి మనిషికే కాదు, ప్రతి జీవికి అనేక విధాలుగా సంబంధముంది. మానవ జీవన ప్రస్థానంలో నీటితో సంబంధంలేని క్షణంలేదు. మనిషికి భూమి శరీరమైతే నీరు ప్రాణం. సామ్రాజ్యాలు, ప్రస్థానాలు, సంఘర్షణలు, యుద్ధాలు, ఉద్వేగాలు వికసించడానికి జలసంపద కారణం. అలాంటి జలసంపద నేడు తగ్గిపోతున్న తరుణంలో, జలాన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించడంలో భాగంగా సామాజిక బాధ్యతతో వ్యక్తీకరించిన కవిత్వమే జలసంరక్షణ ప్రణాళిక కవిత్వం. జల సంరక్షణ ప్రణాళిక కవిత్వాన్ని సూక్ష్మ పరిశీలనతో వివిధ రకాలుగా విభజించి పరిశీలించాను. అవి: భూగర్భ జలసంరక్షణ, జల వనరుల సంరక్షణ కవిత్వం, నీటి పొదుపు వినియోగ సంబంధ జలసంరక్షణ కవిత్వం, సమాజ బాధ్యత సంబంధ జలసంరక్షణ కవిత్వం, ప్రభుత్వ బాధ్యత సంబంధ జలసంరక్షణ కవిత్వం, మురుగునీటి సద్వినియోగ సంబంధ జలసంరక్షణ కవిత్వం, ఇంకుడుగుంతల నిర్మాణ సంబంధ జలసంరక్షణ కవిత్వం, వృక్షసంబంధ జలసంరక్షణ కవిత్వం, వ్యవసాయ (బిందు, తుంపర సేద్య పద్ధతి) సంబంధ జలసంరక్షణ కవిత్వం, పోరాట యోధుల స్ఫూర్తి సంబంధ జలసంరక్షణ కవిత్వం మొదలైనవి.

2. జలసంరక్షణ కవిత్వ విభాగాలు

2.1. భూగర్భ జలసంరక్షణ కవిత్వం

జల సంరక్షణలో భాగంగా భూగర్భ జలాలను కాపాడుకోవడంద్వారా భవిష్యత్ తరాలకు నీటికొరతలేని సమాజాన్ని అందించవచ్చు. కాబట్టి ప్రతి పల్లెలో, నగరాలలో నీరు భూమిలోకి ఇంకేలా చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా భూగర్భజలాలు పెరుగుతాయి (దేవదాసు ii). ఫలితంగా భవిష్యత్ లో నీటికొరత ఉండదనే అంశాన్ని సమాజంలోకి బలంగా తీసుకువెళ్లడానికి కవులు జలసంరక్షణలో భాగంగా ఈ రకమైన కవిత్వాన్ని వ్యక్తీకరించారు.

“జీ పోర్” టెక్నాలజీలో జీవిస్తున్నామనుకుంటున్నాం!
జీవనాధారమైన నీరు వృధాగా కడలిపాలౌతుంటే కళ్ళప్పగిస్తున్నాం!
‘వర్షం నీరు కాపాడుకుంటే చాలు గ్రౌండ్ వాటర్ మీకు అసెట్’ అని
జలనిపుణులు మొత్తుకుంటున్నా ఆ సంగతి పెడ చెవిన పెట్టాం! గతం గతః
ముందే సన్నద్ధం కానందుకు చింతిద్దాం ఇప్పటికైనా మేల్కొందా౦!
యుద్ధప్రాతిపదికన సమస్య నెదుర్కొనడానికి సంసిద్దులమౌదాం! చేయి చేయి కలుపుదాం!
అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేద్దాం!!” (దేవదాసు 25)

కవి నీటి సమస్యను ప్రస్తావిస్తూ, మానవులు జీపోర్ టెక్నాలజీ సాధించిన ఈ సమయంలోకూడా వచ్చే వర్షపు నీటిని సముద్రంలోకి వృధాగా పంపుతున్నారు. అలా కాకుండా నిల్వచేసుకునే మార్గాలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ వాటిని అనుసరించకపోవడంతో లక్షలాది క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్తుంది. ఫలితంగా నీటి కరువులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని జలనిపుణులు చెప్పే పద్ధతులు అనుసరించి భూగర్భజలాల స్థాయి పెంచడంద్వారా కరువును పారదోల వచ్చని వ్యక్తీకరిస్తున్నారు. ఇదేగాక ప్రకృతి పాదాలను అభిషేకించు వంటి కవితలలో భూగర్భ జల సంరక్షణ ప్రణాళికలను వ్యక్తీకరించారు.

2.2. జల వనరుల సంరక్షణ కవిత్వం

“అన్నింటికి మూలాధారమైన జల వనరులన్నీ నాశనమై తాగు నీటికోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడుతున్న పరిస్థితి వచ్చిన ప్రజలు ఎంతటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ దుస్థితి నివారణకోసం వాగులు, వంకలను, చెరువులు, కుంటలను రక్షించే ప్రయత్నం జరగటంలేదు” (సత్యనారాయణ 29). కావున ఇప్పటికైనా జలసంరక్షణలో భాగంగా జల వనరులను సంరక్షించడంద్వారా జలసంరక్షణ చేపట్టవచ్చు. వచ్చే వాననీటిని సరిగ్గా వినియోగించుకోవాలంటే ముఖ్యంగా జల వనరులను సంరక్షించుకోవాలి. జల వనరుల సంరక్షణతో భవిష్యత్ నీటికొరత లేని సమాజాన్ని సృష్టించవచ్చు అనే విషయాన్ని సమాజంలోకి తీసుకువెళ్లడంలో భాగంగా కవులు జల వనరుల సంరక్షణ చేపట్టాలని కవిత్వ రూపంలో వ్యక్తీకరించారు.

చెర్వుకుంటలను కాపాడుకుందాం
చుక్క చుక్క నీటిని అదిమి పట్టుకొని
భూమిలోనే దాచుకుందాం……
చెక్ డ్యాములు కట్టుకుందాం
నీటిని పొదుపుగా వాడుకుందాం నీటి వృధాని అరికట్టుదాం
జలమే జగతికి ఆధారం జీవకోటికి ప్రాణాధారం
జగతిని కాపాడుకుంటూ ప్రగతికి బాటలు వేద్దాం (కాశీనాథ్ 49)

సమాజంలో ఏర్పడుతున్న నీటికొరతను అధిగమించాలంటే జలవనరుల సంరక్షణ చేపట్టాలని కవి తెలియజేస్తున్నారు. అందులో భాగంగా చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు వంటి నిర్మాణాలను చేపట్టాలి; వాటిని వాడకంలోకి తేవాలి. తద్వారా వర్షపునీటిని, వృధా నీటిని వాటిలోకి మళ్ళించడంతో భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి. భూగోళాన్ని కాపాడుతూ అభివృద్ధికి బాటలు వేయాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదేగాక జలం జీవకోటికి ఆధారం – దొంతరబోయిన దైవాధీనం, నీటి సంక్షోభాన్ని అరికడుదాం – శ్రీమతి వసంత లక్ష్మణ్, సంజీవిని – పాతూరి అన్నపూర్ణ వంటి కవితలలో జల వనరుల సంరక్షణ ప్రణాళికలను వ్యక్తీకరించారు.

2.3. సమాజ బాధ్యత సంబంధ జలసంరక్షణ కవిత్వం

జీవించేందుకు అత్యవసరమైన నీటిని సంరక్షించేందుకు వ్యక్తులుకాని, గ్రామాలు, పట్టణాలుకాని ఎలాంటి ప్రయత్నాలు చేయనప్పుడు ఆ నీటిని వినియోగించుకునే హక్కు మాత్రం ఎవరికి ఎందుకు ఉండాలన్నా ప్రశ్న ప్రతి వ్యక్తి వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కరువు కాటకాలను నిరంతరం ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనైనా నీటి సంరక్షణ బాధ్యతను అందరూ చేపట్టకపోతే మనుగడ కష్టమన్న సత్యాన్ని అందరూ గుర్తించాల్సిన ఆవశ్యకత ముందుకు వచ్చింది” (సత్యనారాయణ 97). కావున ప్రతి ఒక్కరూ జల సంరక్షణలో భాగస్వామ్యం కావాలి అని కవులు తమ కవిత్వంతో సమాజ బాధ్యతను గుర్తుచేస్తున్నారు.

నీటిని కాపాడుకోవాల్సిన మానవాళి మౌనమౌతోంది
నీటిధార కన్నీటిధారవుతోంది
ప్రతోడు పక్కోడి మీదకు వదిలేస్తే చివరకు జలం శూన్యమౌతుంది
నీటి రక్షణలో అందరూ భాగస్వాములవ్వకపోతే బాధ్యతను మరిస్తే
బ్రతుకు ఎప్పటికైనా భారమవుతుంది (దేవదాసు 74)

ఈ కవితలో జల సంరక్షణలో సమాజ బాధ్యతను ప్రస్తావిస్తూ, నీటిని సంరక్షించాల్సిన మానవ సమాజం మౌనంగా ఉంది. ప్రతి వ్యక్తి తన బాధ్యత మరిచి పక్కవాడిమీద నెట్టివేస్తే చివరకు సమాజ మనుగడకు కావాల్సిన నీళ్లు లభించని పరిస్థితి వస్తుంది. కావున ఇప్పటికైనా సమాజంలోని అందరూ నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని రచయిత్రి కోరుకుంటున్నారు. ఇదేగాక గుక్కెడు నీళ్లకోసం - దాస్యం సేనాధిపతి, నీరు - ఎస్. కాశింబి, ఈ జగతికదే నిత్య శోభనమని - దోసపాటి సత్యనారాయణమూర్తి వంటి కవితలలోకూడా జల సంరక్షణలో సమాజ బాధ్యతను వ్యక్తీకరించారు.

2.4. ప్రభుత్వ బాధ్యత సంబంధ జలసంరక్షణ కవిత్వం

భూసార పరిరక్షణ, భూగర్భజలాల పెంపుదల ప్రభుత్వం సాధించాల్సిన లక్ష్యాల జాబితాలలో చాలాకాలంగా ఉన్నాయి. కానీ నదులాపి కట్టే ప్రాజెక్టుల విషయంలో వారు చూపే ఆతృత వీటి విషయంలో పూర్తిగా మృగ్యమని చెప్పాలి’. ‘ప్రభుత్వానికి ఒక ఖచ్చితమైన కరువు నియమావళి ఉండాలి. అది చట్ట రూపంలో ఉండాలి. అందులో పశుగ్రాసం, తాగునీరు, మనుషులకు పని అనే మూడు విషయాలకు ఖచ్చితమైన భరోసా ఉండాలి” (బాలగోపాల్ 45, 87) అన్న బాలగోపాల్ వ్యాఖ్యలు అక్షరసత్యం. భూగర్భ జలాలను, వనరులను ఆ భూమితో కలిసిన ప్రాంతాన్ని ఆక్రమణల నుండి కాపాడటానికి, చెట్లను రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం WLATA (వాటర్ లాండ్ అండ్ ట్రీస్ యాక్టు 2002) చట్టాన్ని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చింది. ఈ చట్టం ఇప్పుడు ఉభయ రాష్ట్రాలకు వర్తిస్తుంది. కానీ ఇది ప్రస్తుతం పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. కావున ఇప్పటికైనా ప్రభుత్వాలు జలసంరక్షణ విషయంలో తమ బాధ్యతను గుర్తెరగాలి అని కవులు కోరుకుంటున్నారు.

చలివేంద్రాలు, ఇంకుడు గుంతలు చెరువులు, బావులు పూడికతీత
ప్రభుత్వం వేగవంతం చెయ్యాలి
ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని నిల్వ చేసుకోవాలి
నేడు చెట్టు నాటితే .. రేపటి తరం పండ్లు తిన్నట్టు
నేడు నీరు నిల్వ చేస్తే ఈ తరమే కాదు ..
ముందుతరం కూడా పచ్చగా ఉంటుంది
దాహార్తిని తీరుస్తుంది. (దేవదాసు 57)

జలసంరక్షణకోసం ప్రభుత్వాలు ముందస్తు ప్రణాళికలు రచించి అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి. అందులో భాగంగా ఇంకుడుగుంతలు, చెరువులు, బావులను పూడికలు తియ్యడంతో జలాన్ని తగినంత నిల్వచేసుకోవచ్చు. తద్వారా తాగు, సాగునీటికి కొరత ఉండదు. కావున వెంటనే ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టాలి అని కవి పై కవితలో కోరుతున్నారు. ఇదేగాక జల వనరులు - దూబగుంట రామకృష్ణ, నేను మీ నుంచి విడిపోతున్నా.. - పి. సిద్దయ్య వంటి కవితలలో జల సంరక్షణలో ప్రభుత్వ బాధ్యతను వ్యక్తీకరించారు.

2.5. నీటి పొదుపు వినియోగ సంబంధ జల కవిత్వం

జల సంరక్షణలో భాగంగా భవిష్యత్ లో వచ్చే నీటి కరువులను దృష్టిలో పెట్టుకొని నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో నీటి కరువులు, నీటి వివాదాలు, వానలు సరియైన సమయంలో రాకపోవడం ఇవన్నీ భవిష్యత్ లో సంభవించే నీటి యుద్ధాలకు సంకేతంగా కనపడుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ పెరిగే జనాభాకు నీటికొరత లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ డబ్బులను ఏవిధంగా అయితే కూడబెట్టుకుంటారో అదే విధంగా నీటిని కూడా భవిష్యత్ తరాలకు అందించాలంటే పొదుపుగా కూడపెట్టాలి. వినియోగంలో కూడా పొదుపుగా వాడాలి అనే కోణంలో వచ్చిన కవిత్వం ఇది.

మనిషి బ్రతకాలన్నా../మొక్క పెరగాలన్నా..
పంటలు పండాలన్నా../ఫలములు కావాలన్నా..
నీరే మరి ఆధారం …/తాతల కాలంలో బావుల్లో నీరు
తండ్రుల కాలంలో బోరుల్లో నీరు/మన కాలంలో నల్లాల్లో నీరు
కొడుకుల కాలంలో కొంటేనే నీరు/ఇప్పుడు పొదుపు చేస్తేనే
భవిష్యత్తులో దొరుకును నీరు/లేదంటే మిగిలేది కన్నీరు అందుకే..
వృధా చేయకు నీటిని/ఆదా చేయుము వాటిని (కాశీనాథ్ 46)

ఈ కవితలో చారిత్రకంగా జలవనరుల లభ్యతను ప్రస్తావిస్తూ, నీరు మన తాతలకాలంలో బావుల్లో సమృద్ధిగా లభించేది, తండ్రుల కాలంలో బోరుబావుల్లో, మన తరానికి వచ్చేసరికి నల్లాల్లో, మన పిల్లల కాలంకు వచ్చేసరికి నీటిని కొనవలసిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా మేల్కొని నీటిని పొదుపుగా వినియోగించుకుంటేనే భవిష్యత్ లో నీరు దొరుకుతుంది. లేదంటే మనిషికి కన్నీరే మిగులుతుందని చెప్తూ, చివరిగా నీటిని వృధా చేయకుండా పొదుపు చేయమని కవి ఆకాంక్షిస్తున్నారు. ఇదేగాక నీటి బొట్టు - శ్రీ దాస్యం లక్ష్మయ్య, పొదుపే మంత్రం - అంబల్ల జనార్ధన్, అందరూ ఆచరిస్తేనే – అన్నపూర్ణ వంటి కవితలలో జల సంరక్షణలో నీటి పొదుపు ఆవశ్యకతను వ్యక్తీకరించారు.

2.6. ఇంకుడుగుంతల నిర్మాణ సంబంధ జలసంరక్షణ కవిత్వం

కొండవాలుకు గట్లు వేయడంద్వారా, ఇంకుడుగుంతల నిర్మాణంద్వారా వర్షాన్ని ఆహ్వానించగలిగే వనాలను పెంచుకోవడంద్వారా నీటి నిర్వహణ చేయాలన్నది ఒక మంచి ఆశయం” (కాశీనాథ్ ii). ఇందులో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో ఇంకుడుగుంతలు తవ్వడంద్వారా ఇంటి వ్యర్థజలాలను, వాననీటిని అందులోకి మళ్లించడంద్వారా భూమిలో భూగర్భజలాలను పరోక్షంగా పెంచినవాళ్లమవుతాం. అందుకే ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహించాలి. సమాజంలోని ప్రతి ఒక్కరూ నీటి విలువను గుర్తించి ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టడంద్వారా జల సంరక్షణలో భాగం కావాలని ప్రజలను చైతన్యపరచడంలో భాగంగా వచ్చింది ఈ కవిత్వం.

మండుటెండలలో నీటి చుక్కైనా, కన్నీటి చుక్కైనా!
చెమట చుక్కైనా గుక్కెడు నీళ్లు రాక!
జీవులు విలవిల తండ్లాడి మరణించాల్సిందే! నీటి వృధా మనందరికీ వ్యధే! అందుకే/
ఇంకుడు గుంతలు నిర్మిద్దాం/హాయిగ నీటిని నింపుదాం!
వృధా నీటిని వర్షపు నీటిని మళ్ళిద్దాం!/భూమిలో ఇంకేలా చేద్దాం
భూమికి బలాన్ని చేకూరుద్దాం!/ఇంటింటికి ఇంకుడు గుంత/
జంకుడులేని నీటి కుండ!
(దేవదాసు 68)

కవి నీటిసంరక్షణను ప్రస్తావిస్తూ, నీటికరువుతో ప్రాణులు సతమతమవ్వకముందే వచ్చే వర్షపు నీటిని, వృధా నీటిని ఇంకుడుగుంతలకు మళ్ళించి భూమికి బలాన్ని అనగా భూమిలో నీటినిల్వ స్థాయిలు పెంచాలని చెప్తూ, నేడు ఇంటింటికీ ఇంకుడుగుంత జంకుడులేని నీటి కుండ అనే నినాదంను ప్రతి ఒక్కరికి చేరవేయాలని సందేశిస్తున్నారు. ఇదే గాక నీరే జీవనాధారం - వెల్లట్ల సాయిలు, జలమే ఆధారం- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, జలసిరి సొగసిరి- ఐతా చంద్రయ్య వంటి కవితలలో జల సంరక్షణలో ఇంకుడుగుంత ప్రాముఖ్యతను వ్యక్తీకరించారు.

2.7. వృక్షసంబంధ జలసంరక్షణ కవిత్వం

అడవుల నష్టాన్ని గురించి బాధపడటం సమంజసమే కాని దానికి, కరువుకు గల సంబంధం ఏమిటో చూడకపోతే మన అంచనా అతిశయోక్తుల పాలవుతుంది. అడవులు వర్షాన్ని తేమ రూపంలో నిలుపుకుంటాయి. చెట్ల ఆకులు, వేర్లు, గడ్డి నీటిని నిలుపుతాయి. ఆ నీరు ఆవిరిగా మారి తిరిగి వర్షానికి దోహదం చేస్తుంది. అందువల్ల అడవుల నష్టం ప్రత్యక్షంగా అనావృష్టికి దారితీయగలదు” (బాలగోపాల్ 15). కావున చెట్లను పెంచడం, సంరక్షించడం కూడా జలసంరక్షణలో ఒక భాగం. వృక్షాలు అధికంగా ఉన్నప్పుడే వాటి ప్రభావంతో వానలు సంవృద్ధిగా పడుతాయి. అందువల్ల నీరు భవిష్యత్ తరాలకు సంవృద్ధిగా లభించాలంటే ఉన్న చెట్లను కాపాడుతూ కొత్త వాటిని పెంచాలి. కావున వృక్షసంపదతోనే జలసంపద పెరుగుతుంది అన్న సందేశాన్ని ఇవ్వడంలో భాగంగా వచ్చిన కవిత్వమే వృక్ష సంబంధ జలకవిత్వం.

అడవి పట్ల అశ్రద్ధ చెట్ల పట్ల అనాసక్తి
కొండైనా గుట్టైనా చెట్లైనా పొదలైనా
వనరక్షణ జలరక్షణ మన కాంక్షగ నిలవాలి
స్వేచ్ఛగా పెరిగే చెట్లే సుజలాలనీయగలవు!..
స్వేచ్ఛగా పెరిగే వృక్షం సుఫలాలనీయగలవు
మన స్వార్థం మన లాభం కొంతైనా తగ్గించి
మన త్యాగం మన సమయం కొంతైనా వెచ్చించి
భూగర్భ జలాలను పెంచగ అడవుల సంరక్షించగ
స్వచ్ఛమైన నీరు, గాలి మన భావితరాలకందించు. (కాశీనాథ్ 87)

ప్రకృతిలోని కొండలు, గుట్టలు, చెట్లు, అడవుల పట్ల నేటి సమాజానికి అశ్రద్ధ ఉంది. దానిని తొలగించాలి. మన స్వార్థం, మన లాభం కొంతైనా తగ్గించుకొని, మన సమయం, మన త్యాగం కొంతైనా వెచ్చించి, భూగర్భజలాలను పెంచడానికి వినియోగించాలి. వనరక్షణ చేపట్టడం అంటే జలరక్షణకు పూనుకున్నట్లే అనేది గుర్తించుకున్నపుడే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వగలమని కవి తన పై కవితలో సందేశాన్నిస్తున్నారు. ఇదే గాక జలమే జగతికి మూలం - దాసరి శాంతకుమారి, నీరు కన్నీరే - బళ్లారి శ్రీనివాసచారి, ఉతుకుతున్న ఊట - తాండ్ర చిరంజీవి వంటి కవితలలో జల సంరక్షణకు పరోక్షంగా వృక్షాలు ఏ విధంగా తోడ్పడతాయో వివరించారు.

2.8. వ్యవసాయ (బిందు, తుంపర సేద్య పద్ధతి) సంబంధ జలసంరక్షణ కవిత్వం

వ్యవసాయానికి ముఖ్యమైన వనరు నీళ్లు. నీటి సాగుబడికి మోట కొట్టడం, ఏతం పోయడం, గూడ వేయడం, గాడెం తొక్కడం, రాటు తిప్పడం వంటి పద్ధతులు ఆనాడు పొలం పారించడానికి ఉపయోగపడినవి” (బెల్లంకొండ 56). కానీ నేడు ఆ పద్ధతులు కనుమరుగు అయ్యాయి. నీటిలభ్యత తగ్గుతున్న నేటి వాతావరణంలో వ్యవసాయ రంగంలోకూడా నీటి వృధాను అరికట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం నూతన ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనవి బిందు, తుంపర సేద్య పద్ధతి. ఈ పద్ధతులను వ్యవసాయ రంగంలోని ముఖ్యంగా వాణిజ్య పంటలకు వినియోగించడంద్వారా నీటిని చాలావరకు వృధాకాకుండా అరికట్టవచ్చు. కావున రైతులందరు ఈ పద్ధతులను ఉపయోగించుకోవాలని కవిత్వం రూపంలో కవులు వ్యక్తీకరిస్తున్నారు. జల సంరక్షణలో భాగంగా ఈ కవిత్వాన్ని చూడవచ్చు.

కాలంగాని కాలంలో/బోర్లు నిండాయి బావులు నిండాయి
నీటి పొదుపుతో సిరి ధాన్యాలు పండించుకుందాం
బిందు తుంపర సేద్యాలకు ప్రాముఖ్యతనిద్దాం
అధిక దిగుబడులనుసాదిద్దాం/శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం
మన పంటలే మనకు బంగారం అదే ప్రభుత్వ లక్ష్యం (నిరంజన్ రెడ్డి 231)

జలసంరక్షణలో భాగంగా వ్యవసాయంలోకూడా నీటిని పొదుపుగా వాడాలని అందుకోసం నేడు అభివృద్ధి చెందిన శాస్త్రవిజ్ఞాన పద్ధతులను ఉపయోగించుకోవాలని వ్యక్తీకరిస్తూ, అందులో ముఖ్యంగా బిందు, తుంపర సేద్య పద్ధతులు అనే నూతన శాస్త్రీయ పద్ధతులు ఉపయోగించి పంటలు అధిక దిగుబడులు వచ్చే విధంగా సాగుచేయవచ్చు. అందుకు ప్రభుత్వంకూడా సబ్సిడీలు ఇస్తుంది. కావున రైతులందరు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా శాస్త్రీయ పద్ధతులవైపు వెళ్ళడంద్వారా నీటి సంరక్షణ చేపట్టిన వారవుతారని కవి తెలియజేస్తున్నారు.

2.9. పోరాట యోధుల స్ఫూర్తి సంబంధ జల కవిత్వం

జల సంరక్షణలో భాగంగా జల సంబంధ లేదా ప్రకృతి సంబంధ సంరక్షణలో భాగంగా చరిత్రలో, పురాణాలలో కనపడుతున్న పాత్రలను లేదా యోధులను స్ఫూర్తిగా తీసుకొని ప్రకృతిని అందులో భాగంగా జలసంరక్షణ చేపట్టాలని కవులు తమ కవిత్వంతో సందేశాన్నిస్తున్నారు.

అడవుంటేనే నీళ్ల జాతర సాగుతుంది
నీళ్లుంటేనే భూమి పురుడుపోసుకుంటుంది
భూముంటేనే చెట్లు పచ్చని గాలి కెరటాలవుతాయి
జల్ జంగల్ జమీన్ లను రెప్పల కింద దాచుకొని
యుద్ధాలు చేసిన కొమరంభీం, రాంజీ గోండులు
నేడు ఓట్ల గాలాలయ్యారు (హరికృష్ణ 152)

ఈ కవితలో చరిత్రలో నీరు, అడవి, భూమి కోసం పోరాడిన యోధులను ఆదర్శంగా తీసుకొని జలసంరక్షణకు పాటుపడాలి అని తెలియజేస్తూ, అడవి, నీళ్ళు, భూమి, చెట్లు ఇలా ఒకదానిపై ఒకటి ఆధారపడి భూగోళంపై మానవుల జీవనం కొనసాగుతుంది. వీటి కోసం (నీళ్ళు, అడవి, భూమి) ఎంతోమంది పోరాటయోధులు (కొమరంభీమ్, రాంజీ గోండులు) తమ ప్రాణాలను కోల్పోయారు. కాని నేటి పాలకులు జల సంరక్షణలో అలాంటి వీరుల స్ఫూర్తిని తీసుకోకుండా కేవలం వారిని తమ ఓటుబ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. ఇప్పటికైనా ఇలాంటి యోధులను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వాలు, సమాజం జల సంరక్షణకు పూనుకోవాలని కవి ఆకాంక్షిస్తున్నారు. ఇదేగాక నీరు పదిలం - యు. కృష్ణా గౌడ్ వంటి కవితలలో కూడా జలసంబంధ చారిత్రక, పురాణ మహర్షులను ఆదర్శంగా తీసుకొని జల సంరక్షణకు ప్రతిన పూనాలని వ్యక్తీకరించారు.

2.10. మురుగునీటి సద్వినియోగ సంబంధ జల కవిత్వం

జలసంరక్షణలో భాగంగా మురుగునీటినికూడా సద్వినియోగ పరుచుకోవాలి. ప్రస్తుతం ఉన్న సాంకేతిక టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యర్థజలాలను కూడా శుద్ధి చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఇంటిలో గృహావసరాలకు వాడిన నీటిని చెట్లకు పోయడం, మళ్ళించడం జల సంరక్షణలో భాగమని సమాజాన్ని చైతన్యపరచడంలో భాగంగా వచ్చింది ఈ కవిత్వం.

మురికి నీటిని వృధా చేయక మొక్కలకు మళ్ళించగ
“సుజలాం సుఫలాం” అనుచు
ప్రేమతో ప్రకృతి మనల దీవించేను (కాశీనాథ్ 77)

కవయిత్రి జల సంరక్షణలో భాగంగా వ్యర్థజలాలను సద్వినియోగం చేసుకోవాలని వ్యక్తీకరిస్తున్నారు. వృధాగా ఒలకబోసే మురికి నీటిని మొక్కలకు మళ్ళించడంద్వారా ప్రకృతిని సంరక్షిస్తే అది మనల్ని సంరక్షిస్తుంది. వ్యర్థజలాలను శుద్ధి చేసి మొక్కలకు మళ్ళించడంవల్ల నీటిని సద్వినియోగం చేసుకోవడం ఒక ప్రయోజనం అయితే, రెండవది ఆ నీటిని మొక్కలకు మళ్ళించడంవల్ల ప్రకృతి పచ్చబడుతుంది. తద్వారా వానలు సకాలంలో కురుస్తాయని సమాజానికి పిలుపునిస్తున్నారు. ఇదేగాక జలం జనం – తుమ్మరాజు అనే కవితలో కూడా మురుగునీటిని సద్వినియోగం చేయడం జలసంరక్షణలో ఒక భాగంగా వ్యక్తీకరించారు.

3. సూచికలు

  1. బైస, దేవదాసు. నీళ్లగోస. పుట: ii.
  2. ఆర్., సత్యనారాయణ. నీటి గోస. పుట: 29.
  3. ఆర్., సత్యనారాయణ. నీటిగోస. పుట: 97.
  4. కె., బాలగోపాల్. కరువు వ్యవసాయ సంబంధాలు. పుట: 45, 87.
  5. గంగ, కాశీనాథ్. జలమే జగతికి బలం. పుట : ii.
  6. కె., బాలగోపాల్. కరువు వ్యవసాయ సంబంధాలు. పుట:15.
  7. సంపత్ కుమార్, బెల్లంకొండ. తొలినాళ్ళ సోయి. పుట: 56.

ఉపసంహారం

  • జలసంరక్షణ కవిత్వం సామాజిక చైతన్యానికి, భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించడానికి ఒక శక్తివంతమైన సాధనం.
  • ఈ కవిత్వం భూగర్భ జలాలు, జల వనరులు, నీటి పొదుపు, మురుగునీటి సద్వినియోగం వంటి అనేక కోణాలలో జలసంరక్షణ ఆవశ్యకతను తెలియజేస్తుంది.
  • నీటి సంరక్షణలో వ్యక్తిగత, సామాజిక, ప్రభుత్వ బాధ్యతలను కవులు తమ రచనల ద్వారా స్పష్టం చేశారు.
  • ఆధునిక సేద్య పద్ధతులు, ఇంకుడుగుంతల నిర్మాణం, వృక్ష సంపద పెంపుదల వంటి ఆచరణాత్మక పరిష్కారాలను కూడా కవిత్వం సూచిస్తుంది.
  • చరిత్రలోని పోరాట యోధుల స్ఫూర్తిని కూడా కవులు జలసంరక్షణ ఉద్యమానికి అనుసంధానించారు.
  • కవులు ఇచ్చిన ఈ సందేశాలు పాటించకపోతే జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తుంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. కాశీనాథ్, గంగ, సంపా. జలమే జగతికి బలం. సాహిత్య రంజని సాంస్కృతిక కళా సంస్థ, సంగారెడ్డి,
  2. నిరంజన్ రెడ్డి, ఎస్., సంపాదకుడు. తెలంగాణ జల కవితోత్సవం. తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ వికాస సమితి హైదరాబాద్,
  3. బాలగోపాల్. కె., కరువు- వ్యవసాయ సంబంధాలు. మానవ హక్కుల వేదిక ప్రచురణ, హైదరాబాద్,
  4. బైస, దేవదాసు, సంపాదకుడు. నీళ్లగోస. నేటి నిజం ప్రచురణ, హైదరాబాదు,
  5. సంపత్ కుమార్, బెల్లంకొండ, సంపా. తొలినాళ్ళ సోయి. తెలంగాణ సాహిత్య అకాడమి, హైదరాబాద్,
  6. సత్యనారాయణ. ఆర్., నీటి గోస. రీజనల్ డెవలప్ మెంట్ ఫోరం, హైదరాబాద్.
  7. హరికృష్ణ, మామిడి,  సంపాదకుడు. అలుగు దుంకిన అక్షరం. భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాదు, 2018.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Special Call
Responsive image

Circular
Responsive image

Responsive image

Letter of Support - Format
[for Research Scholars only]