AUCHITHYAM | Volume-07 | Issue-01 | January 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. నైతిక విమర్శ: పాశ్చాత్యుల కృషి
జీడికంటి అనిల్
పరిశోధకులు, తెలుగుశాఖ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం, గచ్చిబౌలి,
హైదరాబాదు, తెలంగాణ.
సెల్: +91 8374788582, Email: jeedikantianil143@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.12.2025 ఎంపిక (D.O.A): 30.12.2025 ప్రచురణ (D.O.P): 01.01.2026
వ్యాససంగ్రహం:
పాశ్చాత్య సాహిత్య ప్రభావంగా తెలుగులో వెలువడిన అనేక నూతన వచన ప్రక్రియలలో ఒకటి విమర్శ ప్రక్రియ. ఇది ఏదైనా ఒక కావ్యంలోని లేదా రచనలోని గుణదోషాలను క్షుణ్ణంగా విశ్లేషిస్తూ, శ్రేష్టమైన రచనను, సాహిత్యాన్ని సమాజానికి అందిస్తుంది. ఈ ప్రక్రియకు ఉన్న విశేషమైన విస్తృతి లక్షణాల ఆధారంగా 19 వ శతాబ్ధి ఉత్తరార్ధం నుండి మొదలుకొని 20 వ శతాబ్ధి ఉత్తరార్ధం వరకు ఇధి ప్రక్రియ నుండి రూపాంతరంచెంది ఒక దృక్పథంగా అలాగే పరిశోధన అధ్యాయన ప్రమాణంగా రూపుద్ధిద్దుకుంది. ఈ విమర్శ దృక్పథంలో కొన్ని విమర్శనా రీతులు సాహిత్యాన్ని అధ్యాయనం చేయడానికి ఏర్పడ్డాయి అవి మార్క్సిస్టు విమర్శ రీతి, కళా విమర్శ రీతి , రూప విమర్శ రీతి , సాంఘిక విమర్శ రీతి , మనస్తత్వ విమర్శ రీతి, ఆర్కీటైపల్ విమర్శ రీతి మొదలైనవి. వీటిని ఆచార్య ఎస్.వి. రామారావు రచించిన “ తెలుగులో సాహిత్య విమర్శ ” అనే గ్రంథంలో సూత్రప్రాయంగా పరిచయం చేశారు. అలాగే ఆంగ్లసాహిత్య విమర్శకుడు విల్‌బర్ట్ తను సంపాదకత్వం వహించిన “ Five approaches of literary criticism ” అనే గ్రంథంలో వివరించారు. ఈ విమర్శ రీతులలో కొన్ని విమర్శ రీతులు పరిశోధన అధ్యాయన ప్రమాణాలుగా ఉపయోగపడుతున్నాయి. కానీ మరికొన్ని రీతులు ఇంక శాస్త్రీయంగా పరిచయం చేయబడలేదు. కాబట్టి వాటిలో ఒకటైన నైతిక విమర్శ రీతిని పరిచయం చేయడం, పాశ్చాత్య సాహిత్యంలో దీని ఆవిర్భావ వికాసానికి కృషిచేసిన ప్రముఖ లాక్షణికులను, విమర్శకులను పరిచయం చేయడం, అలాగే తెలుగు సాహిత్యాన్ని విమర్శనాత్మకంగా అధ్యయనం చేయడానికి ఇది ఎలా దోహదంచేస్తుందో వివరించే ప్రయత్నం చేయడమే నా ఈ వ్యాస ముఖ్య ఉద్దేశం.
Keywords: నైతికత, ధార్మికత, కావ్యప్రయోజనం, నీతివాదం, ప్రకృతి, అనుకరణ, వస్తువు, ఆకృతి, కవిత్వం.
1. ప్రవేశిక
తెలుగు సాహిత్యంలో 19వ శతాబ్ది పూర్వార్థంలో పాశ్చాత్య సాహిత్య ప్రభావం వలన అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాలంలోనే పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో వెలువడిన నూతనప్రక్రియలలో ఒకటి “విమర్శ” ప్రక్రియ. దీని విశేషవిస్తృతి, లక్షణాల ఆధారంగా 19వ శతాబ్ది ఉత్తరార్థం నుండి మొదలుకొని 20వ శతాబ్ది పూర్వార్థం వరకు ఇది ప్రక్రియ స్వరూపం నుండి రూపాంతరం చెంది, విమర్శనా దృక్పథంగా పరిశోధన అధ్యయన ప్రమాణంగా రూపుదిద్దుకుంది.
1.1. ఆధునిక విమర్శ పద్ధతులు
సాహిత్యాన్ని అధ్యయనం చేసేందుకు, ఆధునిక సాహిత్యంలో కొన్ని ఆధునిక విమర్శ రీతులు ఏర్పడ్డాయి. సామాజిక, మానసిక అంశాల నుండి ప్రముఖుల సిద్ధాంతాల ఆధారంగా అవి ఏర్పడ్డాయి. అవి మార్క్సిస్టు విమర్శ రీతి, కళా విమర్శ రీతి, రూప విమర్శ రీతి, సాంఘిక విమర్శ రీతి, మనస్తత్వ విమర్శ రీతి, ఆర్కీటైపల్ విమర్శ రీతి, శైలీశాస్త్ర విమర్శ రీతి, స్త్రీవాద విమర్శ రీతి, దళితవాద విమర్శ రీతి, నైతిక విమర్శ రీతి మొదలైనవి.
వీటిని ఆంగ్లసాహిత్య విమర్శకుడు విల్‌బర్ట్, తాను సంపాదకత్వం వహించిన “Five Approaches of Literary Criticism” గ్రంథంలో వివరించారు. ఆచార్య ఎస్.వి. రామారావు రచించిన “తెలుగులో సాహిత్య విమర్శ” గ్రంథంలో సూత్రప్రాయంగా పరిచయం చేశారు. ఈ విమర్శ రీతులు పాశ్చాత్య సాహిత్యంలో ప్రాచీన కాలం నుండి ఉన్నా, తెలుగు సాహిత్యానికి మాత్రం ఇవి ఆధునికమైనవని చెప్పవచ్చు. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలను సేకరిస్తూ, వాటి స్వభావం, విస్తృతి, లక్షణాలను అధ్యయనం చేస్తూ అనేక సిద్ధాంత వ్యాసాలు, పరిశోధన గ్రంథాలు వెలువడ్డాయి. అంతేకాక, ఈ విమర్శ రీతులలో కొన్నింటిని సాహిత్య విమర్శనా అధ్యయన ప్రమాణాలుగా మలచుకుని తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం జరిగింది.
1.2. వ్యాస ఉద్దేశం
పైన పేర్కొన్న విమర్శ రీతులలో కొన్నింటికి వాటి స్వరూప స్వభావాలను, విస్తృతి లక్షణాలను తెలుగు సాహిత్య అధ్యయనానికి ఉపయోగపడేలా నిర్ణయించారు. వీటిని సాహిత్య విమర్శ అధ్యయన ప్రమాణాలుగా వినియోగించుకుంటున్నప్పటికీ, ఇంకా కొన్ని రీతులపై శాస్త్రీయ అధ్యయనం జరగలేదు. ఈ వ్యాసంలో ప్రధానంగా పై రీతులలో ఒకటైన నైతిక విమర్శనా రీతి నిర్వచనాలను తెలియజేస్తూ, పాశ్చాత్య సాహిత్యంలో దీని ఆవిర్భావానికి కారకులైన ప్రతిపాదకులను, ప్రతిపాదనను బలపరచినవారిని పరిచయం చేస్తూ, దీని ఆవశ్యకత తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి ఎలా దోహదపడుతుందో సహేతుకంగా వివరించే ప్రయత్నం జరుగుతుంది.
2. నిర్వచనం
2.1. ఆచార్య ఎస్.వి. రామారావు నిర్వచనం
నైతిక విమర్శ రీతిని ఆచార్య ఎస్.వి. రామారావు రచించిన “తెలుగులో సాహిత్య విమర్శ” గ్రంథంలో సూత్రప్రాయంగా ఇలా పరిచయం చేశారు:
“నైతికమగు ఆదర్శములను ప్రమాణముగా గ్రహించి, వాని ప్రాతిపదికపై సాహిత్యమును పరామర్శించుట.” (రామారావు 349)
ఈ విమర్శకుల అభిప్రాయంలో కావ్యాన్ని విలువ కట్టడంలో కేవలం సాహిత్య ప్రామాణాలే కాకుండా, నైతిక ప్రమాణాలకు ప్రాముఖ్యత ఉందని భావిస్తారు.
2.2. టీ.ఎస్. ఇలియట్ నిర్వచనం
టి. ఎస్. ఇలియట్ ఇలా నిర్వచించారు:
“The greatness of literature cannot be determined by solely by literary standards. Literary criticism should be completed by criticism from a definite ethical and theological stand point.”
(“సాహిత్య మహత్త్వాన్ని కేవలం సాహిత్య ప్రమాణాల ద్వారా మాత్రమే నిర్ణయించలేం. సాహిత్య విమర్శను ఒక నిర్దిష్ట నైతిక, ధార్మిక దృష్టికోణం నుండి చేసే విమర్శతో కూడి ఉండాలి.”) (రామారావు 350)
2.3. మాథ్యూ ఆర్నాల్డ్ నిర్వచనం
మాథ్యూ ఆర్నాల్డ్ ఇలా నిర్వచించారు:
“a poetry of revolt against moral ideas is a poetry of revolt against life.”
(“నైతిక భావాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే కవిత్వం అనేది జీవనానికే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే కవిత్వమే.”) (రామారావు 350)
2.4. నైతిక విమర్శ ఆవశ్యకత
పై నిర్వచనాలను పరిశీలించినప్పుడు, ఒక సాహిత్యాంశాన్ని గాని, ఒక కావ్యాన్ని గాని విమర్శించాల్సి వస్తే, కేవలం వాటి వస్తువు, అలంకారం, శిల్పం వంటి సాహిత్య ప్రమాణాలను మాత్రమే తీసుకొని విలువ కట్టకుండా, ఆ కావ్యంలోని నైతిక విలువలను, ఆదర్శాలను, ఉపదేశాలను కూడా ప్రమాణాలుగా గ్రహించాలి. కావ్యం నైతిక భావాలకు విలువనివ్వకుండా రచించబడితే, భవిష్యత్తులో సమాజంలోని నైతికతను లోపింపజేసి, అసమానతలకు గురయ్యేలా చేస్తుంది. అందుకోసమే మాథ్యూ ఆర్నాల్డ్ నైతిక భావాలను ప్రతిఘటించే కవిత్వం నైతిక జీవితాన్ని ప్రతిఘటించే కవిత్వం అవుతుందని అభిప్రాయపడ్డారు.
పాశ్చాత్య సాహిత్యంలో అలాగే భారతీయ సాహిత్యంలో కావ్యప్రయోజన చర్చ పూర్వం నుండే ఉంది. ఈ నైతిక విమర్శ దృక్పథం కావ్య ప్రయోజన చర్చతో సాగుతూ విశ్లేషించబడుతుంది. భారతీయ లాక్షణికులు చర్చించినట్లు కావ్య ప్రధాన ప్రయోజనం ఆనందమా, ఉపదేశమా అనే కోవలో ఈ నైతిక విమర్శ చర్చ సాగుతుంది. కొందరు లాక్షణికులు ఉపదేశం ప్రధానం అన్నారు. మరికొందరు ఆనందం ప్రధానం అన్నవారు. వీరు కాకుండా ఇంకొందరు ఆనందోపదేశాలు రెండూ ప్రధానం అని వాదించేవారూ ఉన్నారు. పాశ్చాత్య విమర్శకులలో ఉపదేశం ప్రధానం అనేవారి ప్రతిపాదన ఆధారంగా నైతిక విమర్శ పాశ్చాత్య సాహిత్యంలో ఉద్భవించిందని భావించవచ్చు. తెలుగు సాహిత్యంలో ఇటువంటి చర్చకు సంబంధించిన అంశాలను కావ్య అవతారికలలో, లాక్షణిక గ్రంథాలలో, వ్యాఖ్యానాలలో, చాటువులలో, విమర్శనా వ్యాసాలలో గమనించవచ్చు. ఈ వ్యాసంలో ప్రధానంగా నైతిక విమర్శ ఆవిర్భవించడానికి కృషిచేసిన పాశ్చాత్య లాక్షణికులను, ప్రముఖ విమర్శకులను, వారి అభిప్రాయాలను వివరించే ప్రయత్నం జరుగుతుంది.
3. నైతిక విమర్శ: పాశ్చాత్యుల కృషి
పాశ్చాత్య సాహిత్యంలోని ప్రాచీన యుగంలో ప్లేటో, హోరేస్, సర్ ఫిలిప్ సిడ్నీ, రస్కిన్ వంటి ఉత్తమ విమర్శకులు, ఆధునిక యుగంలో టి.ఎస్. ఇలియట్, మాథ్యూ ఆర్నాల్డ్, ఎడ్మండ్ పుల్లర్, ఇర్వింగ్ బాబిట్ మొదలైన లాక్షణికులు, దార్శనికులు నైతిక విమర్శనా రీతికి పునాదులు వేశారని ఎస్.వి. రామారావు రచించిన ‘తెలుగులో సాహిత్య విమర్శ’ గ్రంథం ద్వారా తెలుస్తుంది. వారు చేసిన కృషిని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం జరుగుతుంది.
3.1. కావ్య వస్తువు - నైతిక భావన
వడలి మందేశ్వరరావు రచించిన ‘పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్ర – సిద్ధాంతాలు’ గ్రంథంలోని మొదటి భాగంలో ప్లేటోకు సంబంధించిన సాహిత్య వ్యాసాలు విమర్శనాత్మకంగా పరిచయం చేయబడ్డాయి. వాటి ఆధారంగా ఈ కింది విషయాలు గ్రహించబడ్డాయి. పాశ్చాత్య తత్వశాస్త్ర పితామహుడు ప్లేటో గ్రీకు దేశానికి చెందినవారు (క్రీ.పూ. 427-348). తాను అమితంగా అభిమానించిన గురువు సోక్రటీస్‌కు ఆనాటి సామ్రాజ్య ప్రభుత్వం మరణశిక్ష విధించింది. అది తట్టుకోలేని ప్లేటో తన రాజ్యాన్ని విడిచి 28వ ఏట సత్యాన్వేషణలో పలుదేశాలు సంచరించారు. చివరగా తన దేశాన్ని చేరుకొని కొన్ని నూతన సిద్ధాంతాలను స్థాపించారు. వాటి ఆధారంగా ఆదర్శరాజ్య స్థాపనకు పూనుకున్నారు. అందులో భాగంగానే మనుషుల ప్రవర్తనా విధానాన్ని, వారి ఆలోచనా ధోరణిని నిర్ణయించేవి జీవితం అందించే విజ్ఞానం కొంత, సాహిత్యం కొంత అని నమ్మారు. సాహిత్యాన్ని కూడా శుద్ధి చేయాలని నిశ్చయించుకున్నారు. ఆయన రచించిన ‘రిపబ్లిక్’, ‘అయాన్’ విమర్శ గ్రంథాలలో వీటన్నింటికి సంబంధించిన చర్చలు సంభాషణ రూపంలో, వ్యాస రూపంలో కనిపిస్తాయి.
ఈయన తన ప్రాచీనకవులు రచించిన సాహిత్యాన్ని విశ్లేషించారు. ప్రధానంగా హోమర్ రాసిన కావ్యాలను పరిశీలించి ఇలా అన్నారు:
“I confess I am checked by a kind of affectionate respect for homer, of which I have been conscious since I was a child. For all those beautiful tragic poets he seems to have been the original master and guide. But it would be wrong to honour a man at the expense of truth, and therefore I must speak out”. (మందేశ్వరరావు 10)
హోమర్ రచించిన కావ్యాలలోని దేవతలు నీతిహీనులుగా చిత్రీకరించబడ్డారని, వారు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు లోనైన వారని, సచ్ఛీలానికి ప్రతీకగా ఉండాల్సిన దైవం దుష్టకార్య చర్యలు, అసత్య వచనాలు, అంతఃకలహాలు వంటి వాటిని ప్రోత్సహించినట్లు గమనించారు. అకిలీస్, ప్రయామ్ వంటి యోధులు దుర్భాషలాడడం, పామరులలా ఆక్రోశించడం వంటివి సహించలేకపోయారు. ప్లేటో కవులను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు:
“జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలను చిత్రించడంలో గద్య, పద్య రచయితలు పొరబడతారు. ఈ రచనలవల్ల దుర్మార్గులందరు సుఖంగా ఉన్నట్లు, సచ్ఛీలుర జీవితం రోదన భరితంగా ఉన్నట్లు తోస్తుంది. దుష్టమైన ప్రవర్తన లాభసాటిగా ఉండగా సత్ప్రవర్తన వల్ల పొరుగు వారికి మేలు కలిగినా తమకు హాని కలుగుతుంది అన్న భావం కలుగుతుంది.” (మందేశ్వరరావు 10)
ఈయన మాటల ఆధారంగా కవి సాహిత్యంలోని వస్తువును మానవుల నైతిక విలువలను విస్మరించకుండా గ్రహించాలని అభిప్రాయపడుతున్నట్లు అర్థమౌతుంది. కావ్యం రచించే కవులు వస్తువును ఎన్నుకునే సందర్భంలో అవినీతి ఆలోచనలకు తావివ్వకుండా, నీతి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందని, చెడు ఎన్నటికైనా నశిస్తుందని నిరూపించేలా కావ్యాన్ని నిర్మించాలి. అప్పుడే దానిని చదివిన సమాజం ధర్మం, నీతి అనే విశుద్ధ ఆలోచనలవైపు తమ దృష్టిని మరల్చుకొని ఉత్తమ జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తారు. ఈ ఆలోచనే నైతిక విమర్శ పునాది వేసిందని తెలుస్తుంది.
3.2. వస్తువు, ఆకృతి, కవి పరిశీలన - నైతిక చర్చ
బొద్దుల వేంకటేశం రచించిన ‘గ్రీక్ - రోమన్ సాహిత్య శాస్త్రము’ గ్రంథంలోని తృతీయోద్ద్యోతము రెండవ భాగంలోని వ్యాసంలో హోరేస్ సాహిత్యానికి సంబంధించిన విషయాలు పొందుపరచబడ్డాయి. ఈ వ్యాసంలో వస్తువు-ఆకృతి-కవి అనే ప్రాచీన సాహిత్య అంశంలో ఈ కింది విషయాలు చర్చించబడ్డాయి. దాని ఆధారంగా ఈ అంశాలను సేకరించి పొందుపరచడం జరిగింది. హోరేస్ (క్రీ.పూ 65 - 8) లాటిన్ సాహిత్య విమర్శలో అగస్తన్ యుగానికి చెందినవారు. ఈయన ఇటలీ (ప్రాచీన రోమ్) దేశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ కవి. ఈయన ఆథెన్స్ లో విద్యనభ్యసించారు. ఓడ్స్, ఎపోడ్స్, అధిక్షేప కవితలు (satires), లేఖ కవితలు (epistles) వంటి కావ్యాలు, విమర్శనా గ్రంథాలు రచించారు. సాహిత్య చర్చలో భాగంగా ఎపిస్టల్ గ్రంథంలోని రెండవ భాగంలో విమర్శ మీద రెండు దీర్ఘలేఖలు ఉన్నాయి. వాటిలో కవులు ఎలా రాయాలి, కవిత్వ ప్రమాణాలు ఏమిటి అనే విషయాలు ఉన్నాయి. ఈ గ్రంథానికి ‘ఆర్ట్స్ పోయిటికా’ అనే మరో పేరు కూడా ఉంది. ఈ గ్రంథంలో ‘వస్తువు-ఆకృతి-కవి’ అన్న అంశంపై చర్చ జరిగింది. ఇందులో రెండో అంశం వివరంగా చర్చించబడింది. కవిత్వంలో వస్తువు, ఆకృతి రెండింటిలో ఏది ప్రాముఖ్యత వహించాలి అన్నది పురాతన సమస్య. వస్తువుకు ప్రాముఖ్యత ఉంటే కావ్యంలో ఉపదేశానికి ప్రాముఖ్యత కలుగుతుంది. ఆకృతికి ప్రాముఖ్యత కలిగితే అనుభూతి, మనోరంజనం ముఖ్యమైనది అవుతుంది. హోరేస్ ఈ రెండింటికీ సమన్యాయం చేయబూనుకున్నారు. కాబట్టి కవిత్వానికి రెండూ ముఖ్యమేనని, కవిత్వం ఉపదేశించవచ్చు, ఆనందానుభూతిని కలిగించవచ్చు. కానీ ఆ రెండింటిని ఏకకాలికంగా సాధించిన కవే ఉత్తమకవి అని తన అభిప్రాయాన్ని ప్రకటించారు.
అయితే భారతీయాలంకారికులు కూడా ఇటువంటి ప్రతిపాదననే చేశారు. అది హోరేస్ ప్రకటించిన దానికంటే విస్తృతంగా, శాస్త్రీయ పద్ధతిలో ఉంటుంది. వారు వాఙ్మయాన్ని మూడు విధాలుగా విభజించారు: మొదటిది వేద, శాస్త్ర, స్మృతులు; రెండవది పురాణం; మూడవది కావ్యం. వేదం ప్రభుసమ్మితం. అవి ప్రజా సంక్షేమం కోసం, సమాజ శ్రేయస్సు కోసం మానవుడి ప్రవర్తన ఎలా ఉండాలో నిర్దేశిస్తాయి. పురాణం మిత్రసమ్మితం. ధర్మబోధ ప్రధానమైనది. కావ్యం కాంతసమ్మితం. ఇది వ్యంగంగా ధర్మోపదేశాన్ని చేస్తుంది. కావ్యంలో కేవలం మనోరంజనం మాత్రమే ఉండి నైతికత, ఉపదేశం వంటి ప్రయోజనాలు లేనప్పుడు అవి అధర్మ ప్రవృత్తిని కలిగిస్తాయి. కాబట్టి అలాంటి కావ్యాలను వర్జించాలని “పాశ్చాత్య సాహిత్య విమర్శ: చరిత్ర సిద్ధాంతాలు” గ్రంథంలో వడలి మందేశ్వరరావు తెలిపారు. హోరేస్ అభిప్రాయాలను పరిశీలించినప్పుడు కావ్యానికి సాహిత్య ప్రమాణాలు ఎంత ముఖ్యమో, ఉపదేశం, నైతిక విలువలు కూడా అంతే ముఖ్యమని వాటికి సమప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అవగతమౌతుంది.
3.3. కళ, ప్రకృతి అనుకరణ - నైతిక చర్చ
బొద్దుల వేంకటేశం రచించిన ‘ఆంగ్ల సాహిత్య శాస్త్రం’ గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని శాస్త్రవాదం భాగంలో సర్ ఫిలిప్ సిడ్నీకి సంబంధించిన వ్యాసం ఆధారంగా ఈ కింది విషయాలు ఆకళింపుచేసుకొనబడ్డాయి. ఫిలిప్ సిడ్నీ (క్రీ.శ. 1554-1586) పాశ్చాత్య గ్రీకు, రోమన్ దేశాలలో 14వ శతాబ్ది మధ్యకాలం నుండి 15వ శతాబ్ది వరకు పునరుజ్జీవన యుగం ప్రారంభమైంది. నూతనంగా అచ్చుయంత్రాలు రావడంతో, మౌఖికంగా ఉన్న సాహిత్యం లిఖిత రూపంలోకి రావడం మొదలైంది. అప్పటివరకు క్రైస్తవ్యంలో క్యాథలిక్ మత పెద్దలు మందిరాల పేరుతో, విశ్వాసాల పేరుతో చేస్తున్న అకృత్యాలను, అనైతిక కార్యాలను నిరసించారు. మతపెద్దలలో కొందరు వేరుగా ఏర్పడి ప్యూరీటన్స్‌గా తమను గుర్తించుకున్నారు. వీరు ఆట, పాట, పద్యం, వినోదం వంటివాటిని నిషేధిస్తూ, కవిత్వం అవినీతికరమైనదని, దాని నిండా అసత్యాలు, అబద్ధాలు ఉన్నాయని, అది మనిషిని సైతాను వైపు లాగుతుందని భావించారు. వారి భావాలకు ప్రాచీన తత్వవేత్త ప్లేటో అభిప్రాయాలు కూడా అండగా నిలిచాయి.
కవిత్వాన్ని దేశం నుండి బహిష్కరించాలని 1579 లో స్టీఫెన్ గాసన్ “School of Abuse” గ్రంథాన్ని రచించారు. ఇదే కాలానికి చెందిన ప్రముఖ కవి, విమర్శకుడు ఫిలిప్ సిడ్నీ కూడా ప్యూరీటన్. ఈయన కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించారు. కానీ ప్రాచీన కాలం నుంచి వస్తున్న సాహిత్య కళ వాస్తవంగా నిషిద్ధం కాదని అభిప్రాయపడ్డారు. ప్లేటో సిద్ధాంతాన్ని, ఆ తర్వాత వచ్చిన అరిస్టాటిల్ ‘కళ ప్రకృతి అనుకరణ’ సిద్ధాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వారి వారి కాలంలో జరిగిన చారిత్రక పరిణామాలను కూడా విశ్లేషించారు. వాటి ఆధారంగా సిడ్నీ, కవిని అతని వ్యాపారాన్ని ఇలా తెలియజేశారు: కవి కొత్తలోకాన్ని సృష్టిస్తాడు. అది ప్లేటో చెప్పిన ఆదర్శ ప్రాయమైన లోకమని, అది సత్య స్వరూపాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు.
అంతే కాకుండా, హోరేస్ చెప్పినట్లు కావ్యం మనకు మనోరంజకాన్ని కలిగిస్తూ బోధిస్తుందని అంగీకరిస్తూ, ఇంకో అడుగు ముందుకేసి, కావ్యం మనల్ని కదిలిస్తుందని అన్నారు. కావ్యానికి అంతటి విశేషమైన శక్తిని గుర్తించిన సిడ్నీ, కావ్య కదిలించే శక్తి ద్వారా అది చెడును ప్రేరేపిస్తే, మనిషి దానినే ఆకళింపుచేసుకొని వ్యర్థుడు అవుతాడు. కానీ అదే కావ్యం నీతిని, ధర్మాన్ని బోధిస్తే, అది ఉత్తమ ప్రవర్తనను మనుషులకు అలవరింపజేస్తుంది. తద్వారా మనిషి జీవనం నైతికతతో కూడుకొని ఉత్తమమైనదిగా ఉంటుంది. వాస్తవానికి కళను నీచంగా సృష్టించే కవులదే తప్పు కానీ కళకు ఎటువంటి దోషము లేదని ఆయన రచించిన “Apologie for Poetrie” గ్రంథంలో వివరించారు. ఆయన వెల్లడించిన అభిప్రాయాల ఆధారంగా ఆయన సిద్ధాంతాలు కూడా నైతిక విమర్శ రీతిని బలపరుస్తున్నాయని చెప్పవచ్చు.
3.4. కవిత్వం, ప్రకృతికి అనుకరణ - నైతిక చర్చ
బొద్దుల వేంకటేశం రచించిన ‘ఆంగ్ల సాహిత్య శాస్త్రం’ గ్రంథంలోని రెండవ అధ్యాయంలోని ఐదవ భాగంలో డాక్టర్ శామ్యూల్ జాన్సన్ సాహిత్య అధ్యయన సమాచారం ఆధారంగా కింది విషయాలను విశ్లేషిస్తూ పొందుపరచబడ్డాయి. డాక్టర్ శామ్యూల్ జాన్సన్ (క్రీ.శ. 1709-1784) ఆంగ్ల సాహిత్య శాసనికుడిగా చిరకీర్తి వహించారు. ఈయన 1709 సెప్టెంబర్‌లో జన్మించారు. లీచ్‌ఫీల్డ్ గ్రామార్ స్కూల్ లో గ్రీకు, లాటిన్ భాషలను నేర్చుకున్నారు. 1728 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పొంబ్రేక్ కాలేజీలో విద్యనభ్యసిస్తూ తన గురువు జారదేన్ ప్రశంసలు పొందారు. కానీ తన తండ్రి ఆర్థికంగా దివాలా తీయడంతో చదువును కొనసాగించలేక కాలేజీని విడిచిపెట్టారు. ఈయన 1758 లో “డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్” నిఘంటువును రచించారు. అలాగే 1749 లో “ది వ్యానిటీ ఆఫ్ హ్యూమన్ విషెస్” కావ్యాన్ని రచించారు. అంతే కాకుండా ‘ఆయిడ్లర్’ పత్రికను కూడా స్థాపించారు. ఇలా విమర్శకుడిగా, కవిగా సాహిత్య సేవ చేశారు.
ఈయన పాశ్చాత్య కావ్యశాస్త్రంలో స్థిరపడిన “కవిత్వం ప్రకృతికి అనుకరణ” సిద్ధాంతాన్ని సమర్దిస్తూ, ఈ సిద్ధాంతాన్ని నూతన దృష్టితో వ్యాఖ్యానించి, అది మూడు రకాలనీ పేర్కొన్నారు. అవి ప్రకృతి అనుకరణ, అరిస్టాటిల్ ప్రతిపాదిత అనుకరణ, ప్రాచీన సంప్రదాయాల అనుకరణ. వీటిలోని అరిస్టాటిల్ అనుకరణలో అరిస్టాటిల్ రచించిన మీమేసిస్ గ్రంథాన్ని వ్యాఖ్యానిస్తూ, ఆ వ్యాఖ్యానంలో రచయితలను సిడ్నీ లాగా నీతి, ఉపదేశం వైపు ప్రేరేపించారు. కవులు కథా వస్తువును ఎన్నుకునే అంశంపై చర్చిస్తూ కథావస్తువు ఎప్పుడైనా దార్శనికంగా, ఉపదేశాత్మకంగా ఉండేలా చూసుకోవాలి అంటారు. భగవంతుడు కావ్య వస్తువుగా ఉండకూడదు అంటారు. భగవంతుడు సృష్టించిన ప్రకృతే కావ్య వస్తువుగా స్వీకరించడానికి యోగ్యమైనది అంటారు. మానవుడు ప్రకృతి కనుక మానవునితో ముడిపడే అంశాలన్నింటిని కావ్య వస్తువుగా గ్రహించి, దార్శనికతతో ఉపదేశాన్ని కలిగించాలని పేర్కొంటారు. ప్రధానంగా నిజజీవితాన్ని కావ్య వస్తువుగా తీసుకోవాలి. అప్పుడే కావ్య సత్యం పూర్తిగా మానవుడి నైతిక చింతనను ప్రేరేపించేదిగా ఉంటుందని అంటారు.
జాన్సన్ కాలంలో హోరేస్ ప్రతిపాదించిన కావ్య ప్రయోజనం ఆనందానుభూతి, హితోపదేశం లేదా రెండింటి సమన్వయంగా భావించారు. డ్రైడెన్ లాగే జాన్సన్ సైతం సాహిత్యాన్ని జ్ఞానసంబంధిత రూపంగా భావించారు. ఈయన ప్రతిపాదనలను గ్రహించినప్పుడు కావ్యం అనుకృతమైనది, అది అనుకరించబడుతుంది. కానీ ఆ కావ్యాన్ని నిర్మించే కవులు కావ్య నిర్మాణంలో ఎంచుకునే వస్తువు పట్ల శ్రద్ధవహించాలి. సార్వజనీనమైన అంశాన్ని ఎంచుకుంటూ, నిజజీవిత వస్తువుకు ప్రాధాన్యతనిస్తూ, దార్శనిక ధర్మాన్ని బోధించేలా, నైతికమైన వాటికి విలువనిస్తూ కావ్యాన్ని రచించాలని పేర్కొంటున్నట్లు అవగతం అవుతుంది. ఈ చర్చ ఆధారంగా సిద్ధాంతాలు కూడా నైతిక విమర్శ రీతి నిర్మాణానికి కృషిచేశాయని చెప్పవచ్చు.
3.5. పునరుజ్జీవన యుగం - నైతిక చర్చ
బొద్దుల వేంకటేశం రచించిన ‘ఆంగ్ల సాహిత్య శాస్త్రం’ గ్రంథంలోని నాల్గవ అధ్యాయంలోని రెండవ భాగంలో మాథ్యూ ఆర్నాల్డ్ సాహిత్య అధ్యయన సమాచారం ఆధారంగా కింది విషయాలను విశ్లేషిస్తూ పొందుపరచబడ్డాయి. మాథ్యూ ఆర్నాల్డ్ (క్రీ.శ. 1822-1858) ఆంగ్ల సాహిత్యంలో ప్రథమ ఆధునిక విమర్శకుడిగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ కవి, విమర్శకుడు. ఈయన 1882వ సంవత్సరం, డిసెంబర్ 24వ తేదీన లీల్‌హామ్ లో జన్మించారు. వించెస్టర్, ఆక్స్‌ఫర్డ్ కళాశాలలో చదువుకున్నారు. అప్పుడే గ్రీక్, లాటిన్, ఫ్రెంచ్ సాహిత్యాలను అధ్యయనం చేశారు. 1857 లో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో 10 సంవత్సరాలపాటు ఆచార్యునిగా విధులు నిర్వహించారు. ఈ దశకంలోనే అతనికి సాహిత్య సంబంధిత అంశాలపై నిశ్చిత అభిప్రాయం ఏర్పడింది. 1837-1901లో విక్టోరియా మహారాణి పరిపాలన కాలంలో ఇంగ్లాండ్ ఆర్థికంగా, వైజ్ఞానికంగా స్థిరపడింది. వైజ్ఞానిక శాస్త్ర వికాసం, నూతన యంత్రాల ఆవిష్కరణ, పారిశ్రామిక ప్రగతి ఆధారంగా అక్కడి ప్రజలు సంపన్నులుగా మారారు. ధనార్జన మాత్రమే మనిషికి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అనే భ్రమకు లోనయ్యారు. కానీ మరోవైపు అది నిజమని నమ్మిన శ్రామికవర్గం అటు ధనవంతులు కాలేక, పేదలుగా జీవించలేక, మధ్యతరగతి కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తూ మానసికంగా నిశ్చేష్టులుగా మిగిలారు.
ఇటు సాహితీ క్షేత్రంలో స్వేచ్ఛాకవిత్వమే ఉత్కృష్ట కవిత్వంగా గుర్తించబడింది. వి.జె. బెయిలీ, సిడ్నీ, డోబెల్ అలగ్జాండర్‌స్మిత్ మొదలైన కవులు వ్యక్తిగత భావనను చమత్కారవంతంగా, సౌందర్యవంతంగా వ్యక్తీకరించినదే ఉత్తమ కవిత్వం అన్నారు. సామాజికులను ఆనందపరచడమే కవిత్వ ప్రధాన ప్రయోజనం అన్నారు. ధర్మం, నీతి, సంస్కృతితో కవిత్వానికి సంబంధం లేదన్నారు. ఇదంతా గమనించిన ఆర్నాల్డ్, సమకాలీన సాంస్కృతికంగా దుస్థితి పాలైన జాతీయ గౌరవాన్ని, జనజీవితాన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో విమర్శన క్షేత్రంలోకి ప్రవేశించారు.
సాహిత్యం సామాజిక శ్రేయస్సును కలిగించే శక్తివంతమైన సాధనమని నిశ్చయించుకొని, ఉత్కృష్ట రచనలను నిర్మించడానికి కవుల, విమర్శకుల దృష్టిని మరల్చడానికి విశేష ప్రయత్నం చేశారు. ఉత్తమమైన సాహిత్య పరమార్థం లోక శ్రేయస్సుకు ఏ విధంగా ఉపకరిస్తుందో విశదీకరించారు. ఆయన విమర్శకు సంబంధించిన వ్యాసాలు, పత్రికల్లో రచించిన వ్యాసాలు రెండు విమర్శనా సంపుటాలుగా “Essays in Criticism” - 1865 & 1888 అనే పేరుతో ప్రచురించబడ్డాయి. అలాగే ఆయన రచించిన 1869 లోని “Culture and Anarchy” గ్రంథంలోని ప్రథమ అధ్యాయంలో సంస్కృతి గురించి నిర్వచిస్తూ “సంస్కృతి అనగా పరిపూర్ణత. దాని అధ్యయనం మేధస్సును, భగవంతుని సంకల్పాన్ని సఫలీకృతం చేయడం దీని ఉద్దేశ్యం. జీవితంలోని అనురాగ విరాగలను, సాధ్యాసాధ్యాలను పరిష్కరిస్తూ, మానవునిలోని ప్రేమను పెంపొందించడం, సతమతమవుతూ అస్తవ్యస్తంగా కృంగి కృశించి ఉన్న జీవితంలో మాధుర్య లోకాన్ని ప్రసరింపజేయడం సంస్కృతి” అని తెలియజేశారు. కాబట్టి సంస్కృతి ఆదాన ప్రదాన వ్యవహారం కాదు. అది ఆత్మకు సంబంధించిన విషయం. అత్యుత్తమ జ్ఞాన సముపార్జనకు సంబంధించిన ధార్మిక, నైతిక, దార్శనిక చింతనల నిలయం. జీవిత గౌరవానికి, సోదర భావానికి, సమాజ సంక్షేమానికి, నైతిక వ్యవహారానికి సంకేతం సంస్కృతి. దుర్గతి పాలైన సంస్కృతిని పునరుద్ధరించడానికి ఆర్నాల్డ్ సాహిత్య విమర్శను శక్తివంతమైన సాధనంగా భావించారు. ఇలా సమాజాన్ని, సంస్కృతిని నిర్మలపరచడానికి సాహిత్యంలో నైతిక భావనలు ఎంతో ముఖ్యమని ఆర్నాల్డ్ అన్నారు.
3.6. కావ్య సిద్ధాంతం - నైతిక భావన
బొద్దుల వేంకటేశం రచించిన ‘ఆంగ్ల సాహిత్య శాస్త్రం’ గ్రంథంలోని ఐదవ అధ్యాయంలోని రెండవ భాగంలో టి. ఎస్. ఇలియట్ సాహిత్య అధ్యయన సమాచారం ఆధారంగా కింది విషయాలను విశ్లేషిస్తూ పొందుపరచబడ్డాయి. టి. ఎస్. ఇలియట్ (1888 – 1965) కవిగా, విమర్శకుడిగా ఆధునిక ఆంగ్ల సాహిత్యంలో సుప్రసిద్ధుడు. థామస్ స్వరన్స్ ఇలియట్ అమెరికాలోని మిసౌరీ నగరంలో 1888లో జన్మించారు. ఇతని విద్యాభ్యాసం మొదట అకాడమీలో, తదనంతరం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పూర్తయింది. తర్కశాస్త్రం, తర్కమీమాంస, సంస్కృతం, పాళీ భాషలపై పరిశోధన చేసి 1911-14 లో పిహెచ్.డి. పట్టాను పొందారు. ఈయన సాహిత్య విమర్శకుడిగా బహుళ ప్రాచుర్యం పొందిన వ్యక్తి. ఆయన విమర్శలన్నీ వ్యాసాలుగా, ఉపన్యాసాలుగా వెలువడ్డాయి. అందులో ముఖ్యమైనవి ‘The Sacred Wood’, ‘Homage to John Dryden’, ‘For Lancelot Andrews’, ‘Selected Essays’. ఇంత జ్ఞాన పరిపక్వత కలిగిన ఇలియట్ సాహిత్యంలో కవిత్వాన్ని వస్తునిష్ట స్వరూపంగా భావించారు. కావ్య జగత్తులో నైతిక, ధార్మిక భావాలకు స్థానం లేదని, కావ్య మూల్యాంకణం కావ్య సిద్ధాంతాల ప్రమాణంతో నిర్ణయించాలని తన నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ కాలం గడిచిన కొద్దీ ఇలియట్ అభిప్రాయంలో పరివర్తన కలిగింది.
కాలానుగుణంగా కలిగిన పరివర్తనతో సాహిత్యం నైతిక, ధార్మిక దృక్పథంతో సాహిత్యానికి పరిపూర్ణత చేకూర్చాలని, రచన సాహిత్యాకృతిగా నిర్ధారింపబడినప్పుడు అది నైతిక విలువలను ఎంతవరకు పాటించిందో నిశ్చయించడం కూడా ఆవశ్యకతమవుతుందని తెలుపుతూ తన అభిప్రాయాలను మార్చుకున్నారు. చివరగా ధార్మికతను, నైతికతను స్వతఃస్ఫూర్తిగా ప్రస్ఫుటింపజేస్తూ, జీవనకళను ఉపదేశించేదే ఉత్తమ సాహిత్యం అని ప్రతిపాదించారు.
వీరే కాకుండా పాశ్చాత్య సాహిత్యంలో రస్కిన్, ఎడ్మండ్ పుల్లర్, ఇర్వింగ్ బాబిట్ వంటి ప్రముఖులు ఎందరో నైతిక విమర్శనా దృక్పథానికి బీజం వేసి, మహావృక్షంగా వృద్ధి చేశారని వారి విమర్శక గ్రంథాల ఆధారంగా చెప్పవచ్చు.
4. ఉపసంహారం
కావ్యం పుణ్యశ్లోక చరితం కావాలన్నది భారతీయ లాక్షణికుల ఆశయం. ఇదేవిధంగా పాశ్చాత్య విమర్శకులు కూడా కావ్యం కేవలం సాహిత్య ప్రమాణాలనే కాకుండా దార్శనికతను కలిగిస్తూ నైతిక విలువలను ఉపదేశించేలా ఉండాలని అభిలషించారు. నైతికతను, ధార్మికతను ఉపదేశించడానికి నీతిశాస్త్ర గ్రంథాలు, ధర్మశాస్త్రాలు ఉన్నాయిగా, మరి కావ్యం కూడా అదే పనిని చేస్తే కావ్యానికి, ధర్మశాస్త్రానికి మధ్య తేడా ఏమిటి అనే ప్రశ్న అనేక విమర్శకులలో తలెత్తింది. కేవలం కావ్యం మనస్సును రంజింపజేస్తూ ఆనందాన్ని కలిగిస్తే సరిపోతుందని భావించిన విమర్శకులు ఎందరో. కానీ వారు మరిచిపోయిన అంశం మరొకటి ఉందని చెప్పవచ్చు. అదేంటంటే! కావ్యానికి కదిలించే గుణం ఉంటుందని అరిస్టాటిల్ అన్నారు. మనిషి భావాలను అది రెచ్చగొట్టగలదు, సర్దుమనచగలదు. హితాన్ని బోధించగలదు, అల్లరులను రేకెత్తించగలదు. అది గమనించిన ప్లేటో, అరిస్టాటిల్, హోరేస్ వంటి ప్రముఖ విమర్శకులు సాహిత్యంలో ప్రధానంగా కవిత్వాన్ని శుద్ధి చేయాలని నిశ్చయించుకున్నారు. నీతి శాస్త్ర గ్రంథాలకు, ధర్మశాస్త్రాలకు అంతగా కదిలించే శక్తిలేదు. అలాగే సమాజంలోకి కావ్యాలు చేరినంత వేగంగా మరేవి చేరలేవు. ఇంతటి విశిష్టత కలిగిన కావ్యం సమాజాన్ని ఉద్ధరించే కార్యాన్ని అతి సులువుగా చేయగలదు. కాబట్టి అది నీతిని, ధర్మాన్ని ఉపదేశిస్తే సమాజ శ్రేయస్సుకు, మానవ అభ్యున్నతికి ఎంతగానో తోడ్పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కానీ అదే కావ్యం అధములైన కవులచేత పడి, నైతిక విలువలను దిగజార్చే విధంగా నిర్మించబడితే, అధార్మిక వస్తువులతో మనోరంజకంగా తీర్చిదిద్దబడితే, కదిలించే స్వభావం కలిగిన కావ్యం సమాజాన్ని అతి తక్కువ సమయంలోనే నీచ స్థితికి దిగజార్చగలదు. కాబట్టి కావ్యాన్ని ప్రధానంగా నైతిక విలువలు, ధార్మిక దృష్టి కలిగిన వస్తువుతో నిర్మించాలి అన్నదే నైతిక విమర్శ రీతి ప్రతిపాదకుల అభిప్రాయం.
- తెలుగు సాహిత్యంలో పాశ్చాత్య విమర్శ ప్రభావంతో నూతన సాహిత్య ప్రక్రియలు, విమర్శనా పద్ధతులు ఏర్పడ్డాయి.
- మార్క్సిస్టు, కళా, రూప, సాంఘిక, మనస్తత్వ, ఆర్కీటైపల్, శైలీశాస్త్ర, స్త్రీవాద, దళితవాద, నైతిక విమర్శ రీతులు ఆధునిక సాహిత్య అధ్యయనానికి కీలకం.
- ఈ వ్యాసం నైతిక విమర్శ రీతి నిర్వచనాలు, పాశ్చాత్య సాహిత్యంలో దీని పునాదులు వేసిన ప్లేటో, హోరేస్, సిడ్నీ, జాన్సన్, ఆర్నాల్డ్, ఇలియట్ వంటి విమర్శకుల కృషిని విశ్లేషించింది.
- నైతిక విమర్శ అనేది కావ్యాన్ని కేవలం సాహిత్య ప్రమాణాలతో కాకుండా, నైతిక, ధార్మిక విలువల కోణం నుండి అంచనా వేయడం.
- కవిత్వం సమాజంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుందని, అది నైతిక ఆదర్శాలను ప్రబోధించి మానవ జీవనాన్ని ఉన్నతీకరించాలని నైతిక విమర్శకులు అభిప్రాయపడ్డారు.
- నైతిక విలువలు లేని సాహిత్యం సమాజ క్షీణతకు కారణం అవుతుందని, కాబట్టి కావ్య వస్తువు ఎంపికలో నీతి, ధర్మాలకు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవశ్యకం అని ఈ అధ్యయనం తేల్చింది.
5. ఉపయుక్త గ్రంథసూచి
- చక్రవర్తి, సిహెచ్. లక్ష్మణ. (సంపా). తెలుగు సాహిత్య విమర్శదర్శనం. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2016. హైదరాబాదు.
- మందేశ్వరరావు, వడలి. పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్ర – సిద్ధాంతాలు. తెలుగు విశ్వవిద్యాలయం, 1994. హైదరాబాద్.
- రామారావు, ఎస్. వి. తెలుగులో సాహిత్య విమర్శ. సరోజా ప్రచురణలు, 2017. కరీంనగర్.
- విల్‌బర్ట్, జాన్. (సంపా). Five Approaches to Literary Criticism. న్యూయార్క్: యూనివర్సిటీ ప్రెస్, 1970.
- వేంకటేశం, బొద్దుల. ఆంగ్ల సాహిత్య శాస్త్రం. సరోజా ప్రచురణలు, 2010. కరీంనగర్.
- పైదే. ఆరిస్టాటిల్ కావ్యశాస్త్రము. సరోజా ప్రచురణలు, 1993. కరీంనగర్.
- పైదే. గ్రీక్ – రోమన్ సాహిత్య శాస్త్రము. సరోజా ప్రచురణలు, 1993. కరీంనగర్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.



