AUCHITHYAM | Volume-07 | Issue-02 | February 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. బులుసు వేంకటేశ్వర్లు ‘జీవనవాహిని’ పద్యకావ్యం: వక్రోక్తి
బొమ్మిశెట్టి రామాంజినేయులు
పరిశోధకులు, తెలుగుశాఖ
హైదరాబాద్ విశ్వవిద్యాలయం
రంగారెడ్డిజిల్లా, హైదరాబాద్.
సెల్: +91 6304784388, Email: bommisettyramanjineyulu123@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 10.01.2026 ఎంపిక (D.O.A): 22.01.2026 ప్రచురణ (D.O.P): 01.02.2026
వ్యాససంగ్రహం:
పరిశోధన “జీవనవాహిని” అనే పద్యకావ్యాన్ని బులుసు వేంకటేశ్వర్లు రచించారు. తానా పద్యకావ్యాల పోటీలో లక్షరూపాయల ప్రథమబహుమతి పొందటం ఈ జీవనవాహిని కావ్యవిశిష్టత. కావ్యమనగానే వస్తువు, రసము, నాయకుడు, ప్రధానంగా పరిశీలనలోకి వస్తాయి. ఈ వ్యాసరచనలో గుణాత్మక పరిశోధనాపద్ధతిని అనుసరించడమైంది. వర్ణనలు, కవితాశైలి, అలంకారాదులు, ఛందోవిన్యాసాలు తర్వాత పరిగణనలోకి వస్తాయి. వీటితో పాటు కవి ఈ కావ్యంలో చూపిన వక్రతలను గురించి చర్చించడం ఈ వ్యాసపరిమితి. వక్రోక్తి గురించి ఆలంకరికంగా సాహిత్యకారులు, విమర్శకులు తెలిపిన విషయాలు పరిశీలించాను. కెవిఆర్ నరసింహం - సాహిత్యదర్శనం, జయకృష్ణబాపూజీ శ్రీనాథుని సాహిత్యప్రస్తానాలు, రాఘవన్ కావ్యాత్మ, ఇతర అలంకారశాస్త్రచరిత్రల్లో వక్రోక్తికి తగిన ప్రాధాన్యాన్ని గమనించవచ్చు. వక్తోక్తి సిద్ధాంతాన్ని ప్రాచీనకావ్యాలకు అన్వయిస్తూ కొందరు పరిశోధించారు.‘వక్రోక్తి - వాగ్దృష్టి’ అనే పిహెచ్.డి సిద్ధాంతగ్రంథాన్ని సీతాకుమారి; ‘శ్రీనాథుని కవితాసామ్రాజ్యం - సమగ్రపరిశీలన‘ అనే సిద్ధాంతగ్రంథాన్ని వేములశరణ్య వెలువరించారు. ఔచిత్యమ్ మాసపత్రికలో వేముల శరణ్య ‘శ్రీనాథుని కవితామార్గం-వర్ణవిన్యాస వక్రత’ అనే వ్యాసాన్ని ప్రచురించారు. అయితే ఆధునిక పద్యకావ్యాలలో వక్రోక్తి సిద్ధాంతానికి సంప్రదాయాన్ని అనుసరించి లక్ష్యలక్షణ సమన్వయం చేసిన పరిశోధనలు వెలువడలేదు. ముందుగా “జీవనవాహిని పద్యకావ్యం - ఆలంకారిక విశేషాల పరిశీలన” అనే అంశం మీద ఈ వ్యాసకర్త ఎమ్.ఎ స్థాయిలో డిసర్టేషన్ సమర్పించడమైనది., ప్రస్తుతం వ్యాసం జీవనవాహిని పద్యకావ్యంలో కుంతకప్రోక్త షడ్విధ వక్రతలను సోపపత్తికంగా వివరింస్తుంది. జీవనవాహిని కావ్యాన్ని, కుంతకుడి వక్రోక్తిజీవితాన్ని ప్రాథమిక ఆధారాలుగా స్వీకరించాను. అందుబాటులో ఉన్న కొన్ని విమర్శగ్రంథాలు, సిద్ధాంతగ్రంథాలు ఈ పత్రరచనకు, సమన్వయాలకు ద్వితీయ ఆకరాలు. కుంతకుడు తెలిపిన షడ్విధ వక్రతలను ఈ కావ్యంలోని కొన్ని పద్యాలతో సమన్వయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం. కవి ప్రదర్శించిన ప్రతిభా పోషణ వంటి విషయాలను ఈ వ్యాసం చర్చిస్తుంది.
Keywords: కావ్యం, వక్రోక్తి, అలంకారం, కుంతకుడు, చమత్కారం, జీవనవాహిని, బులుసు, వేంకటేశ్వర్లు
1. కవి పరిచయం
పల్లె నుండి ప్రపంచం దాకా తన ‘జీవనవాహిని’ పద్యకావ్యాన్ని కథావాహినిగా ప్రయాణం చేయించిన మధురకవి, కవివతంస బిరుదాంకితులు బులుసు వేంకటేశ్వర్లు. ఈయన 1955, జూన్ 24న తొత్తరమూడి (విశాఖజిల్లా) గ్రామంలో సుబ్బలక్ష్మి, కృష్ణమూర్తి దంపతులకు జన్మించారు.
బులుసు వేంకటేశ్వర్లు తన ప్రాథమిక విద్యను టి.కొత్తపల్లి ఉన్నత విద్యను ఐ.పోలవరం గ్రామాల్లో పూర్తి చేశారు. ఆ తరువాత తెలుగు భాష మీద ఇష్టంతో రాజమండ్రిలోని ‘గౌతమీ విద్యాపీఠంలో’ భాషా ప్రవీణలో ఐదు సంవత్సరాల ఓరియంటల్ విద్యను అభ్యసించారు. ఎం.ఏ. తెలుగు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదివారు. తన విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే 1978లో ఉపాధ్యాయ రంగంలోకి ప్రవేశించారు.
విద్యార్థులకు తన బోధనా శక్తితో జ్ఞానసారాన్ని ప్రసాదించాలనే సంకల్పంతో 1978లో స్కూల్ అసిస్టెంట్ (SA) తెలుగు పండితుడిగా ఉద్యోగం సంపాదించారు. ఈ విధంగా తన ప్రతిభా పాటవాలతో విద్యార్థుల్లో తెలుగుభాషాభిమానాన్ని పెంపొందిస్తూ ముందుకు సాగి ప్రధానోపాధ్యాయులుగా 2012లో పదవీవిరమణ పొందారు. 1980వ సంవత్సరంలో భువనేశ్వరీ దేవి గారితో వీరికి వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు.
తన 15వ ఏటనే కంద పద్యాలు రాయడం నేర్చుకున్నారు. తన గురువుగారు మేరు సోమయాజుల సుబ్రహ్మణ్య శర్మ ఆశీస్సులతో సాహిత్యాన్ని జీర్ణించుకొని కావ్యాలు రాయడం ప్రారంభించారు. ఉద్యోగం వచ్చినా రచన వ్యాసంగం మాత్రం ఎక్కడా ఆపలేదు.
1.2. జీవనవాహిని కథాసంగ్రహం
శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం - సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం - రామం నిశాచర వినాశకరం నమామి.
రామాయణంలో శ్రీరాముడు నిద్రపోతుండగా విశ్వామిత్రుడు కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే అని శ్లోకంతో వారిని మేల్కొలుపుతాడు. అదేవిధంగా ఈ కావ్యంలో నాయకుడిని తన తల్లి రామున్ని స్తుతిస్తూనే నాయకుడిని నిద్ర లేపడం అనే ఘట్టంతో కావ్యం ప్రారంభమవుతుంది. ఈ కావ్యంలో నాయకుడి పేరు రాఘవుడు.
రాఘవుడు తన తెలివితేటలతో అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. తన తల్లిదండ్రులు చూపించిన శారదను వివాహం చేసుకుంటాడు. ఉద్యోగంలో ఎంతో ప్రశాంతంగా సాగుతున్న సమయంలో తన ఆఫీసులో దొంగతనం జరగడం, ఆ నింద రాఘవునిపై పడడం, ఆ అవమానాన్ని భరించలేక ఉద్యోగం నుండి వైదొలగడం, ఆ తర్వాత అసలైన దొంగ దొరకడంతో రాఘవుడు తిరిగి అదే ఉద్యోగంలోకి చేరుతాడు.
ఇలా ప్రశాంతంగా సాగుతున్న రాఘవుని జీవితంలో మాత్రమే కాక ప్రపంచ మానవాళికి కరోనా అనే వైరస్ నిద్ర లేకుండా చేసింది. ఈ కరోనా మహమ్మారికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మాటల్లో చెప్పలేనిది. ఇందులో మన రాఘవుని తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
కరోనా పరిస్థితుల దృష్ట్యా తన తల్లిదండ్రుల చివరి చూపునకు కూడా నోచుకోలేదు. అందుకు రాఘవుడు ఎంతో దుఃఖించాడు. తాను పడ్డ ఆవేదనను ఇంకే కుమారుడు పడకూడదనే ఉద్దేశంతో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వృద్ధుల బాగోగులు స్వయంగా తానే చూసుకుంటున్నాడు. ఈ విధంగా నిజంగా జరిగిన కథను అంశంగా తీసుకొని ‘జీవనవాహిని’గా బులుసు వేంకటేశ్వర్లు రచించారు.
1.3. పూర్వ అధ్యయనాల సమీక్ష
పూర్వ అధ్యయనాలలో వక్రోక్తి గురించి ఆలంకరికులు, సాహిత్య విమర్శకులు తెలిపిన విషయాలు పరిశీలించాను. కెవిఆర్ నరసింహం - సాహిత్యదర్శనం, జయకృష్ణబాపూజీ శ్రీనాథుని సాహిత్యప్రస్తానాలు, రాఘవన్ కావ్యాత్మ, ఇతర అలంకారశాస్త్ర చరిత్రల్లో వక్రోక్తికి తగిన ప్రాధాన్యాన్ని గమనించవచ్చు. వక్తోక్తి సిద్ధాంతాన్ని ప్రాచీనకావ్యాలకు అన్వయిస్తూ కొందరు పరిశోధించారు. ‘వక్రోక్తి - వాగ్దృష్టి’ అనే పిహెచ్.డి సిద్ధాంతగ్రంథాన్ని సీతాకుమారి; ‘శ్రీనాథుని కవితాసామ్రాజ్యం - సమగ్రపరిశీలన‘ అనే సిద్ధాంతగ్రంథాన్ని వేముల శరణ్య వెలువరించారు. ఔచిత్యమ్ మాసపత్రికలో వేముల శరణ్య ‘శ్రీనాథుని కవితామార్గం-వర్ణవిన్యాస వక్రత’ అనే వ్యాసాన్ని ప్రచురించారు. అయితే ఆధునిక పద్యకావ్యాలలో వక్రోక్తి సిద్ధాంతానికి సంప్రదాయాన్ని అనుసరించి లక్ష్యలక్షణ సమన్వయం చేసిన పరిశోధనలు వెలువడలేదు. ముందుగా “జీవనవాహిని పద్యకావ్యం - ఆలంకారిక విశేషాల పరిశీలన” అనే అంశం మీద ఈ వ్యాసకర్త ఎం.ఎ స్థాయిలో డిసర్టేషన్ సమర్పించడం జరిగింది. ప్రస్తుతం వ్యాసం జీవనవాహిని పద్యకావ్యంలో కుంతక ప్రోక్త షడ్విధ వక్రతలను సోపపత్తికంగా వివరిస్తుంది. జీవనవాహిని కావ్యాన్ని, కుంతకుడి వక్రోక్తి జీవితాన్ని ప్రాథమిక ఆధారాలుగా స్వీకరించాను. అందుబాటులో ఉన్న కొన్ని విమర్శగ్రంథాలు, సిద్ధాంతగ్రంథాలు ఈ పత్రరచనకు, సమన్వయాలకు ద్వితీయ ఆకరాలు.
1.4. జీవనవాహిని కావ్యం - ముందుమాటలు
ఈ కావ్యానికి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, పొన్నపల్లి శ్రీరామారావు, దోనేపూడి నరేశ్ బాబు ముందుమాటలు రాశారు. “పద్య కవిగా వీరు లబ్ధ ప్రతిష్ఠులు. వీరి పద్యరచన, పద్యపఠనం రెండిటికీ నేను వీరాభిమానిని” (రామబ్రహ్మం) అని ఈ కావ్య రచయిత గురించి బేతవోలు రామబ్రహ్మం చెప్పారు. “మధుర కవి బులుసు వేంకటేశ్వర్లుగారు ఈ చక్కని కావ్యం రాయడం సాహిత్యంలో ఎవరికీ ఆశ్చర్యం కలిగించదు” అంటూ పోటీ తానా అమెరికా నిర్వహణ కనుక మధురకవి బులుసు వేంకటేశ్వర్లుగారు అమెరికాను కథాభిత్తికగా చేసుకున్నారని పొన్నపల్లి శ్రీరామారావు తన ముందుమాటలో చెప్పారు. “కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఆంతర చైతన్యాన్ని ఆవాహన చేసుకుని పద్య రచనను, గాన ఫణితిని అనుసరిస్తూ పద్య పఠనాన్ని చేయడం బులుసు అభిరుచి” అంటూ దోనేపూడి నరేశ్ బాబు కావ్య విశిష్టత రచయిత గొప్పదనాన్ని కూడా తెలియజేశారు.
2. వక్రోక్తి - పరిచయం
వక్రోక్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆలంకారికుడు కుంతకుడు. కుంతకుడు వక్రోక్తిని సమస్త కావ్యవ్యాపారాలకు మూలాధారంగా భావించాడు. కావ్యంలో శబ్దం, అర్థం ఇవే రెండు ప్రత్యక్ష తత్వాలని కుంతకుని భావం. వీటిని అలంకరించే తత్వమే వక్రోక్తి. వక్రోక్తి కారణంగా మనకు కావ్యంలో సౌందర్యం గోచరిస్తుంది. వక్రోక్తి లేనపుడు మనం కావ్యంలో దర్శించే సౌందర్యం, చమత్కారం దర్శించలేము. ఈ వక్రోక్తిని కుంతకుడు ఆరు భేదాల్లో వివరించాడు. అవి: 1. వర్ణ విన్యాస వక్రత, 2. పద పూర్వార్ధ వక్రత, 3. పద పరార్ధ వక్రత, 4. వాక్య వక్రత, 5. ప్రకరణ వక్రత, 6. ప్రబంధ వక్రత.
ఇప్పుడు వక్రోక్తి భేదాలను జీవనవాహిని కావ్యంతో అన్వయం చేసి కావ్యంలోగల వైశిష్ట్యాన్ని, కావ్య సౌందర్యాన్ని తెలుసుకుందాం.
2.1. వర్ణవిన్యాసవక్రత
వక్రోక్తిలో ఈ భేదం వర్ణవిన్యాసానికి చెందుతుంది:
ఏకో ద్వౌ బహవో వర్ణాః బధ్యమానాః పునఃపునః
స్వల్పాంతరాస్త్రిధా సోక్తా వర్ణ విన్యాస వక్రతా (కుంతకుడు 2.1)
ఒకటి, రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు చిన్న అంతరంతో మాటిమాటికీ పునరావృతం అయితే అది వర్ణ విన్యాస వక్రత అవుతుంది. ఈ విధమైన వక్రతను జీవనవాహిని కావ్యంలో కవి బులుసు వేంకటేశ్వర్లు చాలా చోట్ల ప్రదర్శించారు.
ఘన కీలాకలిత ప్రసారమగు నాకార్చిచ్చు నార్పంగ వ-
చ్చును కాకోదర ఘోరసంజ్వల విషార్చుల్ మాన్పగావచ్చు శై-
ల నిరూఢ స్థితి పిండిపిండిగను మార్పన్ వచ్చు దుర్వార మీ-
ర్ష్యను మండంజను వాని లోయెడదఁజల్లార్పంగ వీలున్నదే? (వేంకటేశ్వర్లు 126)
“ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడే పెద్ద అడవి నిప్పును కూడా ఏదో ఒక విధంగా ఆర్పవచ్చు. భయంకరమైన పాము తీవ్రమైన విష జ్వాలలను కూడా మందుల ద్వారా తగ్గించవచ్చు. కదలని స్థితిలో స్థిరంగా ఉన్న కొండలను సైతం పిండి పిండగా మార్చవచ్చు. కానీ ఆపడం సాధ్యం కాని ‘ఈర్ష్య’ అనే అగ్నితో రగిలిపోయే మనిషి హృదయాన్ని మాత్రం చల్లార్చడం ఎవరి తరమూ కాదు”.
ఇక్కడ “కీలాకలిత" అన్నప్పుడు ‘క’ కార ‘ల’ కారాలకు, "నాకార్చిచ్చునార్పంగ” అన్నప్పుడు ‘న’ కార ‘ర’ కారాలకు, “కాకోధర" లో ‘క’ కారానికి, “పిండిపిండిగను" లో ‘ప’ కార ‘డ’ కారాలకు, “లోయెడదజల్లార్పంగ" లో ‘ల’ కారానికి ఆవృత్తి ఉండడం వల్ల ఇది వర్ణ విన్యాస వక్రతకు ఉదాహరణ. ఇది అనుప్రాసాలంకారానికి సంబంధించినది. ఈ వర్ణ విన్యాస వక్రతలో శబ్దాలంకారాలు అంతర్గతంగా ఉంటాయి.
2.2. పదపూర్వార్ధవక్రత
పదాల అర్థంలో ఉండే విశిష్టత పద పూర్వార్ధ వక్రత. సంస్కృతంలో పూర్వార్ధానికి సంబంధించిన దానిని ప్రాతిపదిక అంటారు. సంస్కృతంలో పదాలు సుబంతములు, తిఙంతములు అని రెండు విధాలు. సుబంత పదములు పూర్వార్ధ ప్రాతిపదికము, తిఙంతము పూర్వార్ధ ధాతువు. ఈ రెండింటి వక్రతకు పద పూర్వార్ధ వక్రత అని పేరు. ఇది 8 విధాలు: 1) రూఢి వైచిత్ర్య వక్రత 2) పర్యాయ వక్రత 3) ఉపచార వక్రత 4) విశేషణ వక్రత 5) సంవృత్తి వక్రత 6) వృత్తి వైచిత్ర్య వక్రత 7) లింగ వక్రత 8) క్రియా వైచిత్ర్య వక్రత.
ఈ వ్యాసంలో కేవలం రూఢి వైచిత్ర్య వక్రతకు సంబంధించిన ఉదాహరణ మాత్రమే చూపుతున్నాను.
యత్ర రూఢేరసంభావ్యధర్మాధ్యారోపగర్భతా,
సర్ధర్మాతిశయారోపగర్భత్వం వా ప్రతీయతే.
లోకోత్తరతిరస్కారశ్లాఘ్యోత్కర్షాభిధిత్సయా,
వాచ్యస్య సోచ్యతే కాపి రూఢివైచిత్ర్యవక్రతా. (కుంతకుడు 2.8-9)
రూఢి అనగా పరంపరాగతంగా లోకవ్యవహారంలో ప్రసిద్ధమైన వాచ్యార్థం అని అభిప్రాయం. కవి తన ప్రతిభాశక్తి ద్వారా రూఢి అర్థంపై ఏదైనా కమనీయమైన, రమణీయమైన అసంభావ్య అర్థాన్ని ఆరోపించినప్పుడు ఆ ప్రయోగ విశేషంలో లోకోత్తర చమత్కారం ఉత్పన్నం కావడమే రూఢి వైచిత్ర్య వక్రత. అంటే కవి చెప్పాల్సిన భావాన్ని ప్రత్యక్షంగా సూచించకుండా పరోక్షంగా సూచించడమే రూఢి వైచిత్ర్య వక్రత.
బులుసు వేంకటేశ్వర్లు ఈ కావ్యంలో గొప్ప చమత్కారంతో ప్రయోగించిన సందర్భమిది.
ఇటలీ శ్రామిక లోకమున్ మొదట చుంబించెన్ కరోనాహి యం
తటఁబ్రాకెన్ సరిహద్దులందు ప్రజనానాక్లేశముల్ పొందె నిం
కట నుద్యోగుల దైనికంబయిన యాతాయాతముల్ తోడుగా
పటువేగాన ‘కరోన' ప్రక్కలకు వ్యాప్తంబయ్యె నొక్కుమ్మడిన్ (వేంకటేశ్వర్లు 155)
“కరోనా అనే పాము మొదట ఇటలీలోని కార్మిక లోకాన్ని కాటు వేసింది. ఆ తర్వాత అది మెల్లగా సరిహద్దుల వెంబడి పాకుతూ వెళ్ళింది. దీనివల్ల ప్రజలు అనేక రకాల కష్టాలను అనుభవించారు. దీనికి తోడు ఉద్యోగులు ప్రతిరోజూ చేసే రాకపోకల వల్ల కరోనా వైరస్ అత్యంత వేగంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ విస్తరించింది.”
కరోనా వైరస్ చైనా దేశం నుండి పుట్టిందని ప్రపంచం మొత్తం అభిప్రాయపడింది. దాన్ని కవి ప్రత్యక్షంగా సూచించకుండా ఇక్కడ తన ప్రతిభాపాటవంతో ఒక గుర్తుని సూచించారు. అదే ‘కరోనాహి’. “చమత్కారం వినా కవిత్వం నాస్తి" కాబట్టి కవి ‘కరోనాహి’ అని ఆ రోగాన్ని డ్రాగన్‌తో పోల్చి వ్యంగ్యంగా చైనాని స్ఫురింపజేయడం రసజ్ఞులను అలరిస్తుంది. కవి భావాన్ని రూఢార్థంలో చెప్పారు కాబట్టి ఇది రూఢి వైచిత్ర్య వక్రత అవుతుంది.
2.3. పదపరార్ధవక్రత
ప్రాతిపదికకు చేరే ప్రత్యయాలు, విభక్తుల ప్రయోగంలోని వైవిధ్యమే పద పరార్ధ వక్రత. పద పరార్ధానికి అంతర్గతంగా పదాల పూర్వార్ధం అంటే ప్రాతిపదిక, ధాతువు కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇది సామాన్యంగా ప్రత్యయ రూపం అవుతుంది. అందుకే పద పరార్ధ వక్రతను ప్రత్యయ వక్రతగా కూడా చెప్తారు. కుంతకుడు దీనిని ఆరు విధాలుగా చెప్పాడు: 1) కాల వైచిత్ర్య వక్రత 2) కారక వక్రత 3) సంఖ్యా వక్రత 4) పురుష వక్రత 5) ఉపగ్రహ వక్రత 6) ప్రత్యయ వక్రత.
ఇక్కడ కాల వైచిత్ర్య వక్రత గురించి తెలుసుకుందాం.
ఔచిత్యాన్తరతమ్యేన సమయోరమణీయతామ్,
యాతి యత్ర భవత్యేషా కాలవైచిత్రవక్రతా. (కుంతకుడు 2.26)
ఔచిత్య సామీప్యం ద్వారా కాలం ఎక్కడ రమణీయత్వాన్ని పొందుతుందో అది కాల వైచిత్ర్య వక్రత అవుతుంది. అంటే కాలవాచకానికి అత్యంత రమణీయమైన చమత్కారాన్ని చేర్చడమే కాల వైచిత్ర్య వక్రత. దీనిని బులుసు వేంకటేశ్వర్లు ఈ విధమైన రీతిలో ప్రయోగించారు.
కాలీచబడ ప్రతి కార్యాలయముజూచి
పెద్దవారలకు కన్పించుచుండు
కన్పించి యుద్యోగకాంక్షకు సరిపోవు
విద్యార్హతలఁజూపు వినయమొప్ప
వినయమొప్పగ తన విజ్ఞానగరిమను
వివరించు నుద్యోగవిధులగూర్చి
విధులఁగూర్చిన యాత్మవిశ్వాసములు
తన యెల్ల పల్కుల ప్రకటింపజేయు
చేయునట్టి ప్రయత్నముల్ సేయుచుండె
రాఘవుడు నిరాశలకు దూరమ్ము జరిగి
అనువు కాలమ్ములోగదా యంకురించు
ధరణిగత బీజమందు చైతన్యశక్తి (వేంకటేశ్వర్లు 16)
రాఘవుడు ప్రతి కార్యాలయానికి (ఆఫీసుకి) వెళ్తూ, అక్కడ ఉన్న అధికారులను కలుస్తున్నాడు. తన విద్యా అర్హతలను చాలా వినయంగా వారికి వివరిస్తున్నాడు. తనకున్న జ్ఞానాన్ని, తాను చేయబోయే ఉద్యోగ బాధ్యతలను ఏ విధంగా నిర్వహించగలడో అధికారులకు నమ్మకం కలిగేలా చెబుతున్నాడు. అతని మాటల్లో ఎక్కడా తడబాటు లేకుండా తనపై తన ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని ప్రయత్నాలూ చేస్తూ రాఘవుడు నిరాశకు లోనుకాకుండా ముందుకు సాగుతున్నాడు. చివరగా కవి ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. భూమిలో ఉన్న విత్తనం మొలకెత్తడానికి సరైన సమయం రావాలి. అలాగే మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటే సరైన కాలం వచ్చినప్పుడు తప్పకుండా విజయం లభిస్తుంది. ఇక్కడ “అంకురించు” అనేది భవిష్యత్తు కాలవాచక క్రియా పదం. ఇదే చమత్కారానికి ఆధారం.
2.4. వాక్యవక్రత
కవి వాక్యనిర్మాణంలో పాటించే ప్రత్యేకతనే వాక్య వక్రత అంటారు. అంటే సాధారణంగా చెప్పాల్సిన విషయాన్ని కవిత్వ రసంతో, వాక్య నిర్మాణంలో వైవిధ్యంతో చెప్పడం. కొన్ని వర్ణాలతో పదం ఏర్పడుతుంది. కొన్ని పదాల కలయికతో వాక్యం రచిస్తారు. ఈ విధంగా కుంతకుడు తన వక్రోక్తి సిద్ధాంతాన్ని వర్ణం నుండి పదానికి, పదం నుండి వాక్యం వరకు విస్తరింపజేశాడు.
బులుసు వేంకటేశ్వర్లు ఈ కావ్యంలో ప్రయోగించిన వాక్య వక్రతను తెలుసుకుందాం.
ఒకసారిపాంచజన్య కఠోర రావమ్ము
తలపించు చెవుల బ్రద్దలుగజేయు
ఒకసారి విడియంచులకు సుదర్శనముగా
తరుణకాంతుల రాశి త్రవ్విపోయు
ఒకసారి నిల్చి నందక చంద్రహాస త
ళ్తళ జూపు గిరుల పార్శ్వముల నిలిచి
ఒకసారి శార్ఙ్గ ముక్తోగ్ర శరాళిగా
చిన్కు గములను వర్షించుమించి
ప్రకట నిర్ణిద్ర జలపూర్ణ భారగతులు
శీతలానిల సౌమ్యవశీకరములు
నీలకాంతుల జిమ్మి కన్పించు విష్ణు
పదసమాక్రాంతమైనట్టి వారిదములు (వేంకటేశ్వర్లు 70)
“ఆ మేఘాలు ఒకసారి విష్ణువు పాంచజన్య శంఖంలా గర్జించి చెవులు చెదిరేలా శబ్దం చేస్తున్నాయి. ఒకసారి సుదర్శన చక్రంలా మెరుపులు మెరుస్తున్నాయి. మరోసారి నందక ఖడ్గంలా తళతళ మెరిసి పర్వత శిఖరాలపై ప్రకాశిస్తున్నాయి. ఇంకొకసారి శార్ఙ్గధనుస్సు నుండి విడిచిన బాణాల్లా ఘోరంగా వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఇలా గర్జనలు, మెరుపులు, వర్షాలతో విరాజిల్లే ఆ మేఘాలు నిద్రలేని సముద్ర జలభారంతో నిండి, శీతల గాలులతో సౌమ్యంగా కదులుతూ నీలవర్ణంతో విష్ణుపాదస్పర్శ పొందినట్లుగా ఆకాశంలో కనబడుతున్నాయి.”
ఈ పద్యంలో ప్రతి వాక్యంలో ‘ఒకసారి’ అనే పదం ప్రయోగించిన ప్రతిసారీ పాఠకుడిలో ఏం జరిగింది? అనే ఉత్సుకత కలుగుతుంది. ఇది యోగ్యతాకాంక్షాసత్తి అని ప్రౌఢ వ్యాకరణంలో చెప్పినట్లు ఆసక్తినీ, ఆకాంక్షను కలిగిస్తుంది. అదే వాక్య వక్రత. ప్రతి వాక్యంలో ఒక ఆయుధం, ఒక ప్రకృతి ఘట్టం అనే నిర్మాణ క్రమం ఉంది. ఈ విధంగా మేఘాలను విష్ణు ఆయుధాలతో వరుసగా పోల్చడం ద్వారా వాక్య నిర్మాణంలో ప్రత్యేక గాంభీర్యం, క్రమబద్ధత కనిపిస్తుంది. నేరుగా ‘మేఘాలు విష్ణువు వలె’ ఉన్నాయి అని చెప్పకుండా ఆయుధాల ద్వారా సూచించడం వల్ల ఈ పద్యానికి వాక్య వక్రత కలిగింది.
2.5. ప్రకరణవక్రత
సృజించాలనే ఉత్సాహంతో ప్రేరితుడై కవి తన వస్తు వర్ణనలతో అపూర్వ ఉత్కర్షతను సృష్టించినప్పుడు అది ప్రకరణ వక్రత అవుతుందని కుంతకుడు నిర్వచించాడు. అంటే ఒక కావ్యంలో లేదా గ్రంథంలో ఒక నిర్దిష్ట సందర్భం (ప్రకరణం) లో కవిభావాన్ని, పాత్రలను, సంఘటనలను చమత్కారంగా, విశిష్టంగా చిత్రించడం వల్ల కలిగే సౌందర్యాన్ని ప్రకరణ వక్రత అని అంటారు. కావ్య కథాభాగం ఎక్కడైతే మలుపు తిరుగుతుందో అక్కడ ప్రకరణ వక్రత ఉంటుందని గమనించవచ్చు. ఇది ఒకే వాక్యానికి సంబంధించినది కాదు. మొత్తం సందర్భ నిర్మాణంలో కనిపించే వక్రత.
బులుసు వేంకటేశ్వర్లు ఈ కావ్యంలో విశిష్టంగా ప్రకరణ వక్రతను ప్రయోగించిన తీరును గమనించవచ్చు.
చైనాదేశపు జాఠరాగ్నులకు నేసంకోచముల్లేవు జీ-
వానేకంబులు సర్వమున్ వరలు భక్ష్యంబౌను నవ్వారి దే-
శానన్ గబ్బిలపుంగమిన్ పొరటిమాంసంబున్ భుజింపంగఁ గా-
లూనెన్, వింతగు నంటురోగమది వాయువ్యాప్తమై వచ్చినన్ (వేంకటేశ్వర్లు 152)
“చైనా దేశంలోని ప్రజల ఆకలికి ఎలాంటి సంకోచం లేదు. కనిపించిన ప్రతి జీవి వారికి ఆహారమే. ఆఖరికి గబ్బిలాలను కూడా తినడంలో ముందుంటారు. అలాంటి వారి దేశం నుండి కరోనా అనే మహమ్మారి వైరస్ ప్రపంచానికి వ్యాపించింది.”
రాఘవుడు అమెరికాలో మంచి ఉద్యోగం సంపాదించి భార్యతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని సాగిస్తున్న సందర్భంలో చైనా దేశం నుండి కరోనా అనే మహమ్మారి రావడం ద్వారా ఎటూ కదలని, వెళ్లలేని స్థితికి రావడంతో ఇక్కడి నుండి కథ మరో మలుపు తిరుగుతుంది. రాఘవుని జీవితంలోకి ఈ కరోనా మహమ్మారి రాగానే ఒక ఉత్కర్ష కలుగుతుంది. తన జీవితాన్ని మరిచిపోయి రాఘవుడు ఈ కరోనా తర్వాత ఏ విధంగా మారిపోయాడో కవి తన చమత్కార ప్రయోగంతో కావ్యంలో వివరించాడు.
2.6. ప్రబంధవక్రత
కావ్యమంతటా విస్తరించి, కథా నిర్మాణంలో వ్యక్తమయ్యే వైచిత్ర్యమే ప్రబంధ వక్రత అవుతుంది. పద్యం, గద్యం కాకుండా మొత్తం కావ్యమంతటా వ్యక్తమయ్యే వైచిత్ర్యమే ప్రబంధ వక్రత.
బులుసు వేంకటేశ్వర్లు ఈ కావ్యంలో ప్రబంధ వక్రతను చాలా చక్కగా ప్రయోగించినట్లు కనిపిస్తుంది.
కథలో నాయకుడి పేరు రాఘవుడు. అందుకే కావ్యాన్ని “శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయం” అనే ప్రసిద్ధ ప్రార్థనాశ్లోకంతో ప్రారంభించాడు. తానై సొంత పద్యంతో శ్రీకారం చుట్టలేదు. పేరుకు తగిన శీలం కలవాడు రాఘవుడు.
స్నేహం ఒక స్వర్గం. తల్లిదండ్రుల ప్రేమ మరొక స్వర్గం. భాగ్యమిచ్చి జీవనాన్ని ఇచ్చేది పరసీమ అయినా అదొక స్వర్గం. ఆ భాగ్యం లభించి మాతృదేశ సేవాచరణంలో తరించడం జీవనవాహినికి పరమధ్యేయం. ఇది కవి గొప్పగా చమత్కరింపజేశారు. తల్లిదండ్రుల మీద ప్రేమను విశ్వమానవ ప్రేమగా మలుచుకుని మన పరిధిలో ఉన్న దేశసేవ చేయడమే హితబోధ అని గొప్పగా చమత్కరించారు.
ఈ విధమైన లక్షణాలు, లక్ష్యాలు మొదటి నుండి కనిపిస్తూ కావ్యాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు కవి.
ఉపసంహారం
బులుసు వేంకటేశ్వర్లు సాధారణ బుద్ధికి అందని సూక్ష్మతను భావాలను ఒడిసి పట్టడం, అందంగా పద్యాలలో నిబంధించడం వీరి పద్య రచనా శైలిలో ఒక భాగం. బాహిరమైన వేషభాషలలో స్వల్ప మార్పులు వచ్చినా, భారతీయ ధర్మాన్ని ఆత్మగతం చేసుకున్న ఆధునిక యువకుడి జీవితంలోని ఒక భాగమే ఈ కావ్య వస్తువు. వక్రోక్తి సిద్ధాంతం ప్రకారం కవిత్వ సౌందర్యం అనేది భావంలో కాక ఆ భావాన్ని చెప్పే విధానంలో ఉంది. కవి తన ప్రత్యేక శైలితో విభిన్నమైన మాటలతో చెప్పినప్పుడు ఆ కవిత్వం జీవిస్తుంది. అలంకార శాస్త్ర నియమాలన్నీ పాటిస్తూ బులుసు వేంకటేశ్వర్లు జీవనవాహిని కావ్యాన్ని ధ్వనింపజేశారు. అనుప్రాస, యమకం మొదలైన శబ్దాలంకారాలు వర్ణ విన్యాస వక్రత అవుతుందని పై వ్యాసం వల్ల తెలుస్తుంది. ఉపమ, రూపకాది అర్థాలంకారాలు కలిసి వాక్య వక్రత అవుతుంది. జీవితం అన్నాక ఆటుపోట్లు తప్పవు. బెంబేలు పడకూడదు. సముద్రాన్ని చేరేదాకా సాగవలసిందే. అందుకే ఇది “జీవన వాహిని”.
- ఈ పరిశోధన జీవనవాహిని పద్యకావ్యంలో వక్రోక్తి సిద్ధాంత విశేషాలను పరిశీలించింది.
- బులుసు వేంకటేశ్వర్లు వక్రోక్తి ఆరు భేదాలను తన కావ్యంలో ప్రభావవంతంగా ప్రయోగించారు.
- కరోనా మహమ్మారి వంటి సమకాలీన అంశాలను సైతం ఆలంకారికంగా చిత్రించడం కావ్య ప్రత్యేకత.
- మానవ జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను అధిగమించి ముందుకు సాగాలనే సందేశం కావ్య మూలభావం.
- ఈ కావ్యం ఆధునిక తెలుగు పద్యరచనలో ఒక విశిష్ట స్థానాన్ని పొందింది.
ఉపయుక్త గ్రంథసూచి
- కుంతకుడు. (1977). వక్రోక్తి జీవితమ్ (బాలానందిని అను తెలుగు వ్యాఖ్యతో). సాహిత్య అకాడమీ. న్యూఢిల్లీ.
- నాగయ్య, జి. (2021). తెలుగు సాహిత్యసమీక్ష (రెండు సంపుటాలు). నవ్య పరిశోధక ప్రచురణలు. హైదరాబాద్.
- రామాంజినేయులు, బొమ్మిశెట్టి. (2025). జీవనవాహిని పద్యకావ్యం- ఆలంకారిక విశేషాల పరిశీలన (హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఏమ్.ఏ.స్థాయిలో చేసిన డిసర్టేషన్). రోజా ప్రచురణలు. హైదరాబాద్.
- వేంకటేశ్వర్లు, బులుసు. (2023). జీవనవాహిని. జి.కె. ప్రింట్ హౌస్. విశాఖ పట్నం.
- వేంకటేశం, బొద్దుల. (2015). వక్రోక్తి సిద్ధాంతం. సరోజా ప్రచురణలు. కరీంనగర్.
- శ్రీరామచంద్రుడు, పుల్లెల. (2002). అలంకారశాస్త్రచరిత్ర. ఆర్.కె.ప్రింటర్స్ అండ్ గ్రాఫిక్స్.
- శ్రీనివాసరావు, గొట్టె. (2024). భాగవతం - అలంకారశిల్పం. శ్రీ రాధాకృష్ణ ప్రచురణలు. హైదరాబాద్.
- హనుమచ్ఛాస్త్రి, ఇంద్రగంటి. (1988). ప్రాచీన కవితా వైజయంతి. తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.



