AUCHITHYAM | Volume-07 | Issue-02 | February 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. బాపిరాజు కోనంగి నవల: స్త్రీపాత్రలు, మనోవిశ్లేషణ
కొపనాతి ఉష
పరిశోధకులు, తెలుగు - ప్రాచ్యభాషావిభాగం,
ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం,
గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 7901698893, Email: kopanathiushaprasad97@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.01.2026 ఎంపిక (D.O.A): 31.01.2026 ప్రచురణ (D.O.P): 01.02.2026
వ్యాససంగ్రహం:
అనంతమైన తెలుగు సాహిత్యం తరతరాలుగా వ్యాప్తి చెందుతూ ఎందరో కవులను సమాజానికి పరిచయం చేసింది. వారి రచనలలోని విలువైన సాహిత్య సంపదను పాఠక లోకానికి అందించారు. తరాలు మారినా తరగని సంపద కలిగినది తెలుగు సాహిత్యం. ప్రస్తుత కాలంలో కూడా ఎందరో కవులు రచయితలు తమ సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. కొందరి రచనలు ఏ తరం వారినైనా అలరిస్తాయి. అటువంటి రచనలు సాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటాయి. వాటి వల్ల ఆయా రచయితల పేర్లు చరిత్రలో నిలబడిపోతాయి. అటువంటి వారిలో అడవి బాపిరాజు ఒకరు. వీరు రచించిన హిమబిందు నవల, నారాయణరావు నవలలు సాహిత్యంలో ఎనలేని ఖ్యాతిని ఆర్జించాయి. వాటివలెనే వారు రచించిన మరొక నవల ‘కోనంగి’. ఆ నవల గురించి, దాని ఇతివృత్తం గురించి వివరించి, అందులోని స్త్రీ పాత్రల్లో కనిపించే మనోవిశ్లేషణాత్మకతను తెలియజేయడమే ఈ వ్యాసం ఉద్దేశం.
Keywords: తెలుగు సాహిత్యం, నవలలు, అడవి బాపిరాజు, కోనంగి నవల, స్త్రీ పాత్రలు, మనోవిశ్లేషణాత్మకత
1. ప్రవేశిక
తెలుగు సాహిత్యం సముద్రం వంటిది. ఎంత స్వీకరించినా తరగనిది. అటువంటి తెలుగు సాహితీ సాగరంలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు తెలుగు సాహిత్యానికి పరిపుష్టినిస్తున్నాయి. నన్నయ కాలం నుండి నేటి వరకు ఎందరో కవులు, రచయితలు వివిధ ప్రక్రియలలో రచనలు చేసి చరిత్రలో కీర్తి పతాకలయ్యారు. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చారు. సాహిత్య ప్రక్రియలలో నవల సాహిత్యం ఎక్కువ ప్రజాదరణ పొందిన ప్రక్రియగా చెప్పవచ్చు. పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించిన ఈ ప్రక్రియలో రచనలు చేసి ఘన కీర్తిని ఆర్జించిన వారిలో అడవి బాపిరాజు ఒకరు. ఆయన కాలం నుండి జాలువారిన నవలల్లో "కోనంగి" సాంఘిక నేపథ్యం గల నవల. కొంచం హాస్యం, కొంచం వ్యంగ్యం కలగలసి అలనాటి సామాజిక వ్యవస్థను చూపించిన రచన ఇది.
2. అడవి బాపిరాజు - జీవిత విశేషాలు
చిత్రకళా రంగానికి కులపతిగా ప్రసిద్ధికెక్కిన రచయిత అడవి బాపిరాజు తెలుగు సాహిత్య చరిత్రలో నవలాకారుడుగా మాత్రమే కాక, కథకుడుగా, చిత్రకారుడుగా, గాయకుడుగా ప్రసిద్ధి పొందారు. వీరు సాంఖ్యాయన గోత్రంలో నియోగి బ్రాహ్మణ వంశంలో జన్మించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం ప్రాంతానికి దగ్గర్లో ఉన్న సరిపల్లె అనే గ్రామంలో 1895 అక్టోబరు 8న కృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. పుట్టుకతో ధనవంతుల కుటుంబంలో జన్మించినప్పటికీ, తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. బి.ఏ. చదువుతున్న రోజుల్లోనే వీరికి సుభద్రతో వివాహం జరిగింది. బి.ఏ., బి.ఎల్. పూర్తిచేసి న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించి, తరువాత ఎన్నో పదవులను చేపట్టారు. ఏ రంగంలో అడుగుపెట్టినా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బందరు జాతీయ కళాశాలలో చదువుతున్న రోజుల్లో ప్రమోద్ కుమార్ ఛటోపాధ్యాయ దగ్గర శిష్యరికం చేసి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో సైతం పాల్గొని ఎన్నో సార్లు జైలు పాలయ్యారు. అలా జైలులో ఉన్న రోజులలోనే హిమబిందు నవలను ప్రారంభించారు. ఆయన రచనల్లో హిమబిందు ఒక చారిత్రక నవల.
2.1. అడవి బాపిరాజు - నవలా సాహిత్యం
అడవి బాపిరాజు కలం నుండి విస్తృతమైన సాహిత్యం వెలువడింది. వాటిలో ఎన్నో ప్రచురించబడగా, మరికొన్ని అముద్రితాలు ఉన్నాయి. ఆయన రచించిన నవలలు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో పాఠకులను ఆకర్షించాయి. అవి: నారాయణరావు, హిమబిందు, తుఫాను, గోనగన్నారెడ్డి, కోనంగి, అడవి శాంతిశ్రీ, అంశుమతి, నరుడు లాంటివి.
3. కోనంగి నవల - పరిచయం
అడవి బాపిరాజు రచించిన నవలల్లో 'కోనంగి' నవల ప్రత్యేకమైనది. ఈ నవల 1939లో ప్రారంభమైంది. ఆ కాలం నాటి భారతదేశంలోని రాజకీయ పరిస్థితులు, స్వాతంత్ర పోరాట తీరుతెన్నులు, అంతర్జాతీయ రాజకీయాల్లో వచ్చిన మార్పులు నిశితంగా పరిశీలించి, వాటిని రచయిత నవలలో చొప్పించారు. కోనంగిగా పిలవబడే కథానాయకుడు కోనంగేశ్వరరావు జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య సంఘటనలు, మార్పులు ఉత్కంఠ భరితంగా పాఠకుల కళ్ళ ముందు ఉంచుతుంది. బాపిరాజు నవలల్లో ఒక్కొక్క కథానాయకుడు వైవిధ్యభరితంగా కనిపిస్తాడు. ఈ నవలలో కథానాయకుడు ఉదాత్త భావాలు కలిగిన వాడు, ఆకర్షణీయమైన రూపం గలవాడు, హాస్యంగా మాట్లాడగల నేర్పు గలవాడు, కార్యసాధకుడు.
3.1. కథాంశ వివరణ
ఈ నవలలో కథానాయకుడు కోనంగేశ్వరరావు బందరువాసి. ఆయన తల్లి ఒక బ్రాహ్మణ వితంతువు. ఆమె ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇంట వంట మనిషిగా చేరింది. ఆమెకున్న అందం ఆ ఉద్యోగిని ఆకర్షించింది. ఆయన వల్ల ఆమెకు జన్మించిన వాడు కోనంగి. ఆ ప్రభుత్వ ఉద్యోగి ఆమెను భార్యగా స్వీకరించి, వారి పోషణ భారం వహించినా, ఆమె దృష్టిలో తాను ఒక పాప కార్యం చేసినట్లుగా భావించింది. ఆయన ఇస్తానన్న ఆస్తిపాస్తులను కూడా వద్దనుకుంది. ఆమె తల్లికి ఉన్న పాపభీతి వల్ల, తప్పు చేశాననే భావనతో పుట్టిన బిడ్డను కూడా ప్రేమగా చూడలేదు. అయినా కొడుకును పెంచి పెద్ద చేసింది. బి.ఏ. పాసైన కోనంగేశ్వరరావు హిందూ పత్రికలో వచ్చిన 'వరుడు కావలెను' అనే ప్రకటన చూసి మద్రాస్ వెళ్ళాడు. అక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూతురైన సీతాదేవిని చూసి, ఆమెకు తన చరిత్ర అంతా వివరిస్తాడు. ఆమె ఆయనను వివాహం చేసుకోవడానికి నిరాకరించింది. కోనంగి తిరిగి బందరు వెళ్ళకుండా అక్కడే ఒక దొరల కంపెనీ 'వై టు వె కంపెనీ'లో సేల్స్ మెన్ గా ఉద్యోగం ప్రారంభించాడు. తన మాటలతో, నేర్పుతో సేల్స్ పెరిగేలా చేశాడు. అక్కడున్న వారందరికీ మంచి స్నేహితుడనిపించుకుంటాడు. అక్కడే సారా అనే ఆంగ్లో ఇండియనుతో పరిచయం ఏర్పడింది. దీనివల్ల ఆ వై టు వె కంపెనీలో ఉద్యోగం కోల్పోయాడు. తిరిగి కంపెనీ వారు ఆయనను ఆహ్వానించినా, దొరల పాలనకు వ్యతిరేకంగా దేశంలో ఉద్యమం జరుగుతున్న సమయంలో తాను వారి దగ్గర పని చేయటం సమంజసం కాదని ఒక హోటల్లో వడ్డనదారుడుగా చేరతాడు. మరొక ప్రక్క కథానాయక అనంతలక్ష్మితో ఏర్పడిన పరిచయంతో ఆమెకు తెలుగు పాఠాలు బోధించే గురువుగా చేరాడు. ఎప్పటి నుండో అనంతలక్ష్మిని తన సొంతం చేసుకోవాలని ఆశతో ఉన్న నాటుకోటి చెట్టి కోనంగిపై హత్యాయత్నం చేయిస్తాడు. ఆ సమయంలోనే తనకు వైద్యం చేసిన డాక్టర్ రెడ్డితో స్నేహం ఏర్పడింది. రాజకీయపరంగా కోనంగిది గాంధీ మార్గం. డాక్టర్ రెడ్డిది కమ్యూనిస్టు మార్గం. అయినా వారి స్నేహానికి అవి అడ్డు రాలేదు. అనంతలక్ష్మి కోనంగిని ప్రేమించడం, కోనంగి కూడా ఆమెను ప్రేమించడం తన అదృష్టంగా భావిస్తాడు. కోనంగి డాక్టర్ రెడ్డి ప్రభావంతో సినిమాల్లో చేరాడు. డాక్టర్ రెడ్డి మిత్రులు తీసిన సినిమాల్లో నాయకుని వేషం వేసి, అందరినీ మెప్పించాడు. కథానాయకుడుగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఆయన ఆదాయ స్థితిగతులు పెరిగాయి. తనతో సినిమాలో నటించిన నాయిక వాణిదేవి ఆయనపై మనసు పడింది. కానీ ఆయన తాను అనంతలక్ష్మిని ప్రేమిస్తున్నట్లు చెప్పి ఆమె నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఎందరో దర్శకులు, నిర్మాతలు సినిమా అవకాశం ఇస్తామన్నా మరలా సినిమాల్లో నటించలేదు. అందుకు కారణం అనంతలక్ష్మికి కలుగుతున్న అనుమానం. ఇక కోనంగి మనసంతా రాజకీయాలపై పడింది. ఆయనకు రెండు మార్గాలు కనిపించాయి. ఒకటి అప్పుడే తలెత్తి బయటకు వస్తున్న సామ్యవాదం. రెండవది భారతదేశమంతా నిండి ఉన్న గాంధీ మార్గం.
లోకంలో ఉన్న అన్ని ఆవేదనలకూ, బాధలకు, కష్టాలకు, బీదతనానికి, చలికి, ఆకలికి, ఎండిపోయే వాంఛలకు, అఖండ నిస్పృహలకు ఏడుగడ రష్యా వారి సామ్యవాదమే అని అనుకుంటాడు. పాశ్చాత్యుల ప్రజా ప్రభుత్వ వాదం చెప్పినట్లు వ్యక్తి స్వాతంత్ర్యమే ప్రపంచ రక్షేమో, అది సామ్యవాదమా అని అనుమానిస్తాడు (అడవి బాపిరాజు 123).
ఇలా అనేక ఆలోచనలో ఉండగానే అనంతలక్ష్మి ఇంటర్ పాస్ అయ్యింది. అనంతరం జయలక్ష్మి కోరిక మేరకు ఇద్దరికీ పెళ్లి అవుతుంది. అనంతలక్ష్మి, కోనంగి శోభన కార్యక్రమం అయిపోయిన మరుసటి రోజే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారనే నెపంతో పోలీసులు కోనంగిని అరెస్టు చేశారు.
నాటుకోటి చెట్టి రహస్యంగా ప్రభుత్వానికి ఇచ్చిన కంప్లైంట్ వల్ల కోనంగి అరెస్టు చేయబడ్డాడు. మరో ప్రక్క చెట్టియారు అనంతలక్ష్మీ తనకు దక్కలేదని, జయలక్ష్మి అనుభవిస్తున్న ఆస్తి అక్రమమైనదని పలు కారణాలు చూపుతూ కోర్టులో వ్యాజ్యం వేశాడు. ఈ వ్యాజ్యం విషయంలో కోనంగిపై, కేసు విషయంలో, రెండింటిలోనూ చెట్టియారు ఓడిపోయాడు. పరమ స్త్రీలోలుడైన చెట్టియారు నుండి ఒక నటి 50,000 వదిలించింది. మరో ప్రక్క సినిమాల్లో పెట్టిన పెట్టుబడులకు నష్టాలు వచ్చాయి. చెట్టియారు ఆగడాలను ఒక పత్రిక తరచుగా దుయ్యబట్టింది. కేసు నుండి బయటపడిన కోనంగి నవజ్యోతి అనే పత్రికను ప్రారంభించాడు. పత్రిక బాగా సాగుతుంది. ఆయన మిత్రుడు మధుసూదన్, ఆయన చెల్లెలు చౌదురాణి పత్రిక నిర్వహణలో సహాయం చేస్తున్నారు. చౌదురాణి తన చిన్నతనంలో కోనంగిని ఇష్టపడింది. కానీ కాస్త యవనంలోకి వచ్చాక తన తప్పు తెలుసుకుంది. ఆయనను సోదర సమానంగా భావించుకుంది. వీరిద్దరి సంభాషణలను అనంతలక్ష్మీ తప్పుగా అర్థం చేసుకొని తన భర్త కోనంగిపై అనుమానం పడింది. కోనంగి తన భార్య ముందు తలెత్తుకోలేకపోయాడు. ఆమె జీవితం నుంచి వెళ్లిపోవాలనుకున్నాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించి, ఎనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించాడు. తన భర్త విషయంలో తప్పుగా ఆలోచించినందుకు అనంతలక్ష్మి పశ్చాత్తాపపడింది. జయలక్ష్మి తన కూతురిని పట్టించుకోకుండా ఆయన జైలు పాలయ్యే సరికి కోనంగిని తప్పు పట్టింది. అందుకు అనంతలక్ష్మి తల్లిని వారించింది:
అమ్మా వారిని ఏమీ అనకు. నాదే అంతా లోటు. పది మంది ఎదుటా చెప్పుకుంటే చేసిన పాపం కొద్దిగైనా పోతుంది. వారిని అనుమానించాను. వారు ఉత్తమ పురుషులు. వారి హృదయం చిందర వందర చేశాను. వారి నవ్వులో ఎంత దుఃఖమో గర్భితమై ఉండాలి. నాకు శాంతినివ్వాలని ఆయన సత్యాగ్రహం చేసి ఖైదుకు వెళ్లారు (అడవి బాపిరాజు 258).
అని చెప్పి పశ్చాత్తాప పడింది. కోనంగి తన జైలు శిక్ష పూర్తి చేసుకుని వచ్చే సరికి పండంటి కొడుకుని ఎత్తుకుని అనంతలక్ష్మీ ఆయనకు స్వాగతం పలికింది. అందరూ సంతోషంగా ఇంటికి చేరారు. ఆ సమయంలో అనంతలక్ష్మి, కోనంగిలను చూసి కుళ్లుకుంటున్న చెట్టియారుకు ఆయనను విమర్శించే పత్రిక అధినేత కనిపించే సరికి ఆయనలో కోపం మిన్నుముట్టింది. ఆయన మీద దాడికి పాల్పడ్డాడు. పత్రికా సంపాదకుడు కూడా ప్రతి దాడి చేశాడు. ఇద్దరికీ దెబ్బలు తగిలాయి. వీరి ఘర్షణను గమనించి వచ్చిన కోనంగి, రెడ్డి, జయలక్ష్మి ఇంటికి వస్తాదులైన వినాయగం పిళ్లై స్నేహితులు మొదలగు వారు వారిని అడ్డుకున్నారు. ఇద్దరికీ వైద్యం చేయించి పంపించివేశారు. చెట్టియారు కోనంగి మంచితనం అర్థం చేసుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు. భార్యా భర్తలు రెడ్డి, చౌదురాణికి; రియాసత్ ఆలి, మెహరున్నీసాలకు వివాహాలు జరిపి, వారి ఆనందాన్ని పంచుకున్నారు.
4. కోనంగి నవల - స్త్రీ పాత్రల మనోవిశ్లేషణ
4.1. అనంతలక్ష్మి
నవలలో ఈమె ప్రధాన కథానాయిక. తనకు ఊహ తెలియక ముందే తండ్రి మరణించడం వల్ల తల్లి అనురాగం, గారాబం మధ్య పెరిగింది. యుక్త వయసు వచ్చేంత వరకు ఆమె 'Extrovert'గా కనిపిస్తుంది. స్నేహితులతో సరదాగా తిరగడం, కాలేజీకి వెళ్ళడం, తన అభిప్రాయాలు ఆలోచనలు చెప్పి, తన మిత్రులను ఒప్పించడం ఆమె జీవితం. మొదటిసారి కోనంగేశ్వరరావుని చూసినప్పుడు ఆయన ఆమె మనసులో ముద్రపడిపోయాడు. ఆయనను తనకు తెలుగు పాటలు బోధించే గురువుగా నియమించుకుంది. ఆయన ఆమె జీవితంలో ప్రవేశించిన తర్వాతనే ఆమెలో సిగ్గు మొలకెత్తింది. ఆయన విషయంలో తన మనసులో ఎన్నో 'Fantasies'ని ఊహించుకుంది. తరచూ ఆయన కలలోకి రావడం, ఆయనను మళ్లీ మళ్లీ చూడాలని ఆశపడడం, ఆయనను చూసినప్పుడు ఆమె మోములో కలిగే వైవర్ణ్యం దీని ప్రభావమని చెప్పవచ్చు.
అనంతలక్ష్మి తాను కోరుకున్నట్లే ఆయనను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వారి మొదటి రాత్రి రోజునే పోలీసులు కోనంగేశ్వరరావుని అరెస్టు చేశారని, జాతీయోద్యమంలో పాల్గొంటూ జైలు పాలయ్యాడని ఆమెకు తెలిసినప్పుడు ఆమె 'Mental Stagnity'కి గురైంది. కాలం గడిచి, తన భర్త తిరిగి వచ్చి, తనతో ఆనందంగా గడపడం, ఆమె జీవితం సుఖంగా సాగిపోతున్న తరుణంలో ఆమె గర్భం దాల్చిన సమయంలో మరలా ఆమెలో ఎన్నో అలజడులు ప్రారంభమయ్యాయి. స్త్రీలు గర్భం దాల్చిన సమయంలో వారిలో హార్మోన్ ప్రభావం వల్ల అత్యధిక మార్పులు సంభవిస్తాయి. వీటి ప్రభావం ప్రవర్తన పైన కూడా పడుతుంది. చిరాకుగా ఉండడం, చిన్నచిన్న విషయాలకి కోపం, నీరసం, అసహనం వంటివి బయటకు కనిపించేవి. అనంతలక్ష్మిలో కూడా ఈ భావాలు కనిపిస్తాయి. తన భర్త సినిమా రంగంలో పనిచేయడం, నటుడిగా ఎందరో తారల మీద చేతులు వేయడం, పట్టుకోవడం చూసి ఆమెలో అనుమానాలు మొదలయ్యాయి. అంతేగాక కోనంగేశ్వరరావు చౌదురాణితో చనువుగా ఉండడం, ఒంటరిగా మాట్లాడుతుండటం పలుసార్లు గమనించటం వల్ల వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనుకొని తన భర్తతో దూరంగా ఉంది. ఈ పరిస్థితులు ఆమెలో 'Delusions' ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. కోనంగేశ్వరరావు చౌదురాణిని తన చెల్లెలుగా చూసుకుంటాడు. ఆమెకు డాక్టర్ రెడ్డితో పెళ్లి విషయమై మంతనాలు చేస్తున్న విషయం తెలియక, వారిద్దరి మధ్య అక్రమ సంబంధాలు ఉన్నాయనుకొని తనలో తానే ఎన్నింటినో ఊహించుకొని మదనపడిపోతూ ఉంటుంది. చివరకు ఆ 'Delusions' తీవ్ర స్థాయికి చేరి, తన భర్త మీద విరుచుకుపడుతుంది:
ఏమండీ మీకు నా మీద ప్రేమ నశిస్తే నశించింది గాక! మీ ప్రణయ విలాసాలు ఇంత వెల్లడిగా ప్రదర్శించకపోతే కాస్త రహస్యంగా సంచరించలేకపోయారు? నా మీద మీకెప్పుడూ ప్రేమ లేదని ఈ మధ్యనే తెలుసుకున్నాను. నా డబ్బు కోసం ఆశించారు. నన్ను చేసుకున్నారు. అయినా నా ప్రేమ మాత్రం మీకు సంపూర్ణాంకితం చేస్తిని. నన్ను మీకు దేహమూ, మనస్సూ, ఆత్మ అర్పించుకుంటిని. నా మీద ప్రేమ లేకపోయినా, దయాంతఃకరణాలు కూడా లేవా మీకు.. (పకపక నవ్వి) ఏదో అంటున్నాను. నాకు తల తిరుగుతోంది (అడవి బాపిరాజు 247).
అంటూ బాధతో కళ్ళు తిరిగి పడిపోయింది. తన భర్త విషయంలో కలిగిన ఆలోచనల వల్ల తన సంసారా అంటూ బాధతో కళ్ళు తిరిగి పడిపోయింది. తన భర్త విషయంలో కలిగిన ఆలోచనల వల్ల తన సంసారాన్ని చేజేతులారా నాశనం చేసుకోబోయింది. కానీ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని తనవన్నీ అపోహలని గ్రహించాక తన భర్త విషయంలో పశ్చాత్తప పడింది అయ్యింది.
అనంతలక్ష్మి గర్భవతి అని ఆమె గ్రహించాక ఆ శుభవార్తను తన భర్తకు స్వయంగా తెలియజేసి క్షమాపణ అడగాలనుకుంది. “తాను భర్తను కోపించిన పిచ్చితనం ఎంత జుగుప్స కలిగించింది. తనను తానే కోపగించుకున్నది”4 (కోనంగి – అడవి బాపిరాజు – పుట: 251) ఆమె అనరాని మాటలు ఆడిపోసుకుని భర్త హృదయాన్ని నొప్పించిన మరుక్షణంలోనే “ఎంత తెలివి తక్కువ దాన్ని”5 (కోనంగి – అడవి బాపిరాజు – పుట: 252) అని విచారించింది. తన భర్త పట్ల తాను చేసిన చర్యకు ఆమె పశ్చాత్తాపానికి గురయిందని చెప్పవచ్చు. ఆమె మనోభావాలను గుర్తించిన ఆమె భర్త ఆమెను బాధపెట్టకూడదని, ఆమెను విడిచి దూరంగా వెళ్లేందుకు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. అలా జైలు పాలవడం తనకు ఆనందాన్ని ఇచ్చే విషయమే. తను కూడా తన భర్తతో పాటు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళాలని అనుకొంది. కానీ తన భర్తను విడిచి తను ఉండలేదనే వేదన మరొక ప్రక్క మానసికంగా ‘ఉపగమ పరిహార సంఘర్షణ’లను అనుభవించింది. ఇలా ఈమెలో ఎన్నో రకాల మానసిక వేదనలు అనుభవించిందని చెప్పవచ్చు.
2. చౌదురాణి
ఈ నవలలో చౌదురాణి కోనంగేశ్వరరావుకి మిత్రుడైన మధుసూదనరావుకి చెల్లెలు. ఈమె పాత్రలో ‘Incest feeling’ కనిపిస్తుంది. చౌదురాణి తన అన్నతో సమానమైన కోనంగేశ్వరరావుపై అపారమైన అనురాగాన్ని పెంచుకుంది. అది కూడా తెలిసీ తెలియని వయసులో అతనిపై అనురాగాన్ని పెంచుకుంది. కోనంగికి పద్నాలుగు, పదిహేను సంవత్సరాల వయసున్న కాలంలో అతన్ని ప్రేమించిన దాని వలె నడతలో చూపించేది. కోనంగి ఆమె ప్రవర్తనకు నవ్వుకునేవాడు. కోనంగికి ప్రణయ లేఖలు రాసి, తన చెల్లెలు కమలనయనతో పంపించేది. అది ఆమెలో ఆ వయసులో ఉన్న ‘తీయటి ఫ్యాషన్’ గా రచయిత చూపించారు. ఆమె ఇంటర్ చదివే రోజుల్లో ఆమెకు కోనంగి మీద ఉన్న ప్రణయం పొగమంచులా మాయమైంది. ఆ తరువాత అతనికి ఎదురు పడినప్పుడు చేసిన తప్పుకి ‘Guiltyness’ వల్ల అతనిని చూడటానికి సిగ్గుపడింది. డాక్టర్ రెడ్డితో పెళ్లి విషయంలో ఆమెలోని మానసిక పరిపక్వత భావాలని మనం గమనించవచ్చు. భర్తను ఎంచుకోవడంలో ఆమె చూపిన ఆలోచనా సరళి, కోనంగి మాటల మీద ఉన్నటువంటి ఆమెకున్న నమ్మకం ఆమె ప్రవర్తనలో వచ్చిన మార్పుని మానసిక పరిపక్వతని సూచిస్తాయి.
3. పార్వతమ్మ
ఈమె కథానాయకుడయిన కోనంగేశ్వరరావుకి తల్లి. ఆమె బాల వితంతువు. ఆమెను ప్రేమించిన ఒక బ్రాహ్మణుడు ఆమెను తల్లిని చేశాడు. ఆమె కూడా ఒకనాడు అతడిని ఇష్టపడినా ఇప్పుడు ఆమె విగత భర్తృక జీవితం అనుభవిస్తుంది. కన్నవారి నుండి, అత్తింటి వారి నుండి వేరైపోయి దూరంగా వచ్చి వంటలక్కగా బ్రతుకు సాగిస్తుంది. అతను మరలా పెళ్లి చేసుకుని జీవితాన్ని ఇస్తానన్నా ఒప్పుకునేది కాదు. అతని బలవంతం మీద ఒక బిడ్డకు తల్లి అయింది. పార్వతమ్మ స్వతహాగా ఛాందస భావాలు కలిగిన స్త్రీ. తాను ఒకప్పుడు ప్రేమించిన వ్యక్తి ఆమెకు రెండో భర్తగా మంచి జీవితాన్ని ఇస్తానని చెప్పినా ఆమె మాట్లాడదు. ఎన్నో విధాలుగా పురాణాల్లోని కథలు చెప్పి మనసు మార్చేందుకు ప్రయత్నించినా ఆమె మనసు కరగదు. “కోనంగి అసలు తండ్రి లోనికి చొచ్చుకుని పోయి, ఆమెను బిగియారా కౌగిలించుకున్నాడు. అతనికి ఆమె విగత కేశినిలా కనబడనే లేదు. అతని ముద్దులు కర్ర బొమ్మ పెదవులపై పడ్డాయి కానీ ఆమెకు కొంచమన్నా స్పందనం కలిగించలేక పోయాయి. ఆడవాళ్ళ హృదయం పరమాత్మనికి కూడా తెలియదనుకుంటూ ఆతడామెను మళ్లీ తనకు స్త్రీని చేసుకునే ప్రయత్నం తగ్గించాడు.”6 (కోనంగి – అడవి బాపిరాజు – పుట:103) కొంచెం చొరవ తీసుకొని ఆమె పక్కలో చేరి శారీరకంగా దగ్గరయేందుకు ప్రయత్నించేవాడు. అయినా ఆమె మోములో ఎలాంటి చలనము లేదు. సాంప్రదాయాలు, కట్టుబాట్లు, పాప భీతి ఆమెలో నరనరాల్లో పాతుక పోయాయి. కాబట్టి వాటి ప్రభావం వల్ల ఆమెలో ‘Irrational Behaviour’ కనిపిస్తుందని చెప్పవచ్చు. సహేతుకం కాని విషయాలకు ప్రాధాన్య మిచ్చి ప్రస్తుత జీవితాన్ని కట్టడి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. మత సిద్ధాంతాల ప్రభావం మనిషిని ఆత్మన్యూనతకు గురిచేస్తాయని ఈ పాత్ర ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ఈమెలో ‘Inferiority Complex’ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ ‘Inferiority Complex’ ప్రభావం తీవ్ర స్థాయికి చేరుకోగా చివరకు దాని ప్రభావం వల్ల తన జీవితం పాప పంకిలమైనట్టు భావించుకొని, దుఃఖించింది. తన రెండవ భర్త వల్ల కలిగిన బిడ్డని తాను చేసిన పాపానికి చిహ్నంగా భావించుకుంది. ఆ పాపాన్ని పెంచడమే తన కర్మకు శిక్షగా అనుకుంది. కొంచమైనా జ్ఞాపకం లేని తన చిన్ననాటి భర్తను తలుచుకొని ఎప్పుడూ ఏడుస్తూ ఉండేది. తల్లిగా తన బిడ్డపైన ప్రేమ ఉన్నా అతనిని చూడటానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ ప్రభావాన్ని మానసిక విశ్లేషణ శాస్త్ర ప్రకారం ‘Guilty Consiousness’ గా చెప్పవచ్చు. దాని ప్రభావంతోనే కోనంగేశ్వరరావు తండ్రి ఆస్తిపాస్తులు ఇస్తానన్నా, జీవితం గడవడానికి ఏ లోటు లేకుండా చేస్తానన్నా వేటినీ ఆమె స్వీకరించలేదు. ఇరు వర్గాల బంధువుల సాయం ఆశ్రయించలేదు. చివరికి కొడుకు సంపాదించి ఇచ్చిన డబ్బును కూడా అతని కోసమే దాచేది.
4. సారా:
పేరుకి తగ్గట్లుగానే అందమైన స్త్రీ. ఆంగ్లో ఇండియన్ స్త్రీ అవడం వల్ల కథానాయకుడైన కోనంగేశ్వరరావు ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. “సారా చాలా అందంగా ఉంటుంది. కొంచెం పొడుగరే! ఎత్తు మడమల జోడుతూ ఒక అంగుళం తగ్గగా కోనంగితో సమానంగా ఉంటుంది. కోనంగి సమోన్నతం కలిగిన వాడు. అంటే అయిదడుగుల ఏడు అంగుళాల వాడు. పెద్ద బలమైన వాడు కాదు. కండ పుష్టి సామాన్యం. కను ముక్కు తీరు సామాన్యం. కానీ అతని ఆనందం అతనికి ఎంతో అందాన్నిస్తుంది.”7(కోనంగి – అడవి బాపిరాజు – పుట: 29) అటువంటి కోనంగి సారాతో కూడా ఇతరులతో వలెనే సరదాగా ఉండేవాడు. సారాకు కూడా మొదటి నుంచి కోనంగి అంటే ఎంతో గౌరవం ఉండేది. సాధారణంగా ఆంగ్లో ఇండియన్స్ స్త్రీలు భారతీయులతో ఎక్కువగా కలవరు. కానీ సారతో కోనంగి విషయమై ఆమెకు అపేక్ష పుట్టింది. ఆమెలో ఏర్పడిన ‘Id’ అతనితో గాఢ స్నేహాన్ని చేయాలని వాంఛ ఉద్భవించింది. ఇతరుల విషయంలో ఇన్నాళ్లు ఆమె ఒక విధంగా ‘Introvert’ గా కనిపించేది. “ఎవ్వరితోను ఎప్పుడు మాట్లాడదు. తన మీద తనకు గౌరవము, ఒక విధమైన బిడియము సారాను ప్రత్యేక భౌతికతను ఒనరించాయి. అటువంటి ఆ బాలిక కోనంగి అంటే ఒక్కసారిగా పుష్పములా విరిసిపోయింది.”8 (కోనంగి – అడవి బాపిరాజు – పుట: 29) తామిద్దరు పని చేసే చోట మాట్లాడనట్లే ఉన్నా పని సమయం ముగిసి ఇంటికి వెళ్లేటప్పుడు అతనితో కలిసి వెళ్ళేది. అతను చెప్పే కబుర్లు, మాట్లాడే విషయాలు, చేసే అభినయాలు ఆమెను ఎంతగానో అలరించేవి.
ఒకనాడు అతనితో కలిసి సినిమాకి వెళ్ళింది. ఒక ఇంగ్లీషు లార్డ్, ఒక ఇంగ్లీష్ డచెస్ ను తీసుకెళ్లినట్లుగా సారా చేతిని తన చేతి మీద వేసుకొని తీసుకువెళ్లాడు కోనంగి. అక్కడున్న వారంతా వారి హుందాతనాన్ని, సారా అందాన్ని చూసి పొగుడుతుంటే సారా మనసులోని ఇగో సంతృప్తి చెందేది. తను నిజంగానే రాజకుమారి అన్నట్లుగా మరింత ఎక్కువగా ప్రవర్తించేది. ఆ సమయంలో వారి ఇరువురి మధ్య చెలరేగిన కామాభిలాష తీవ్ర రూపం దాల్చింది. సారా అతనిని సినిమా హాల్ నుండి తన ఇంటికి తీసుకెళ్లింది. ఇంట్లో ఆ సమయంలో ఎవరూ లేరు. “సారా తనలో ఉప్పెనలా విరుచుకుపడుతూ ఉన్న కామ కాంక్షతో కోనంగిని తీగలా అల్లుకు పోయింది. ఈ రాత్రి ఇక్కడే ఉండిపో కోనంగి! అంది.”9 (కోనంగి – అడవి బాపిరాజు – పుట:97 ) కోనంగీ ఆమెను ఆ సమయంలో గట్టిగా కౌగిలించుకొని ముద్దులు కురిపించి, ఒక్కసారిగా ఆమెను విడిచి సోఫాలో కూర్చొని ఆలోచించాడు. ఆమె దేహం అతనితో పొందు కోసం పరితపించిపోయింది. కానీ కోనంగిలోని అచేతనలోని భావాలకు చేతనలోని భావాలకు మధ్య జరిగిన సంఘర్షణలో అచేతనలోని నీతి, న్యాయాలు విజయం సాధించాయి. ఆమెను విడిచి ఇది సరైనది కాదని, పెళ్లి లేకుండా స్త్రీ సంపర్కం చేయనని నిరాఘాటంగా చెప్పాడు. ఆ సమయంలో ఆమెలో చెలరేగిన శృంగార భావాలు, ఆమెలోని ‘Sublimation Activity’ ని సూచిస్తాయి. సారాకి ఆమె పనిచేసే కంపెనీ మేనేజరుతో పూర్వమే శారీరక సంబంధం ఉన్నా నిజమైన ప్రేమతో కూడిన కామ వాంఛ మాత్రం కోనంగి మీదనే కలిగింది. అందుకే ఆ తర్వాత రోజున కోనంగిని మరల తన ఇంటికి పిలిచి తన గతాన్ని వివరించింది.
ఉపసంహారం
కోనంగి నవల లోని స్త్రీ పత్రాలు అన్ని ఒక్కొక్క మనస్తత్వాన్ని కనబరుస్తాయని పైన విషయాలను పరిశీలిస్తే అర్థమౌతుంది. మానసిక విశ్లేషణ సిద్ధాంతంలోని పలు విషయాలలో వీరి పాత్రలు సరిపోలే విధంగా రచయిత ఈ పాత్రలను తీర్చిదిద్దారు. అమలిన శృంగార భావనలకు తగినట్లుగా రచించారు రచయిత. మనుషుల్లో సహజంగా కనిపించే భావాలను కళ్ళకు కట్టినట్లుగా చూపించారు రచయిత. పైన వివరించబడిన విధంగా అడవి బాపిరాజు నవలల్లో కేవలం స్త్రీ పాత్రలలో మాత్రమే కాకుండా పురుష పాత్రల్లో కూడా మనోవిశ్లేషణాత్మకత ప్రభావం కనిపిస్తుంది. మానసిక శాస్త్ర సిద్ధాంతాలకు తగినట్లుగా రచించిన నవలలు కొన్ని అయితే దాని ప్రభావం లేకపోయినా వాటిలో కూడా మానసిక శాస్త్ర విధానాలు, సిద్ధాంతాలు నామ మాత్రంగానైనా మనకు కనిపిస్తాయని పైన చెప్పబడిన విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తరువాత అధ్యాయంలో సామాజిక చైతన్యానికి సంబంధించిన విషయాలు పరిశీలించుదాము.
ఉపయుక్తగ్రంథసూచి
- కుటుంబరావు, బొడ్డుపాటి. (1971). ఆంధ్ర నవలాపరిణామము. గాయత్రీ ప్రచురణలు, హైదరాబాద్.
- బాపిరాజు, అడవి. కోనంగి. (2002). విశాలాంధ్ర ప్రచురణలు, విజయవాడ.
- వెంకటేశ్వరరెడ్డి. అన్నపురెడ్డి. (2000). సిగ్మండ్ ఫ్రాయిడ్. విశాలాంధ్ర ప్రచురణలు, విజయవాడ.
- శ్రీరామమూర్తి, కొర్లపాటి. (1991). తెలుగు సాహిత్యచరిత్ర. రమణ శ్రీ ప్రచురణలు, విశాఖపట్నం.
- శ్రీరామమూర్తి, కోడూరి. (1992). తెలుగు నవలాసాహిత్యంలో మనోవిశ్లేషణ. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమి, హైదరాబాద్.
- సాయి బ్రహ్మానందం, గొర్తి. (2020). ఈ వారం తెలుగు పుస్తకం. అంతర్జాలపత్రిక. 12. ఆగష్ట్, 2020
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.



