AUCHITHYAM | Volume-07 | Issue-02 | February 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
3. సడ్లపల్లి చిదంబరరెడ్డి కథలు: వ్యంగ్యహాస్యచిత్రణ
సకిరెడ్డి సత్తిబాబు, ఆచార్య జర్రా అప్పారావు
పరిశోధకుడు, తెలుగుశాఖ
ఆంధ్ర విశ్వకళాపరిషత్తు
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9550610314, Email: chetansakireddi@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 11.01.2026 ఎంపిక (D.O.A): 30.01.2026 ప్రచురణ (D.O.P): 01.02.2026
వ్యాససంగ్రహం:
ఈ పరిశోధనా పత్రం సడ్లపల్లి చిదంబర రెడ్డి కథలలో వ్యంగ్యం, హాస్యం ప్రయోగించిన తీరును సమగ్రంగా విశ్లేషిస్తుంది. సమాజంలోని అసమంజసమైన తత్వాలను, వ్యక్తుల ఆచరణలోని లోపాలను గుర్తించి, వాటిని వెక్కిరింతగా కాకుండా సూటిగా హృదయానికి హత్తుకునేలా చెప్పడం రచయిత ముఖ్యోద్దేశం. పాఠకులు తమ భుజాలను తుడుముకొని స్వీయ సవరణ చేసుకునేలా ప్రేరేపించడమే ఈ పరిశోధన ఆవశ్యకతను తెలియజేస్తుంది. వాస్తు, సంఖ్యాశాస్త్రం, మూఢనమ్మకాలు వంటి వాటిపై రచయిత సంధించిన వ్యంగ్య హాస్య బాణాలు సమాజంలో కదలికను తెస్తాయనే ఆశ ఈ పరిశోధనకు మూలం. ఎంపిక చేసిన కథలలో వ్యంగ్యం, హాస్యం సమర్థవంతంగా ప్రదర్శితమైన తీరు ఈ శీర్షికకు సరైన సమర్థన. తెలుగు కథా సాహిత్యంపై అనేక పరిశోధనలు జరిగాయి. ఈ అధ్యయనం చిదంబర రెడ్డి కథలలోని వ్యంగ్య హాస్య చిత్రణపై ఒక ప్రత్యేక విశ్లేషణను అందిస్తూ, గత పరిశోధనల పరిధికి విస్తరిస్తుంది. పరిశోధన కొరకు సడ్లపల్లి చిదంబర రెడ్డి రచించిన 'మట్టిమొగ్గలు' కథాసంపుటి ప్రాథమిక వనరుగా స్వీకరించబడింది. దీనిలోని 'జ్ఞాన తిమిరం', 'లడరటపే' కథలు ప్రధానంగా విశ్లేషించబడ్డాయి. తెలుగు కథానిక రచన, తెలుగు సాహిత్య చరిత్ర, ఆధునికాంధ్ర కవిత్వ సమీక్ష వంటి గ్రంథాలు పరిశోధనకు అవసరమైన ఇతర విషయసేకరణకు దోహదపడ్డాయి. ఈ పరిశోధన వివరణాత్మకమైనది, విశ్లేషాత్మకమైనది, విమర్శనాత్మకమైనది. రచయిత సామాజిక అంశాలను, వ్యక్తిత్వ లోపాలను వ్యంగ్య హాస్యంతో ఎలా చిత్రించారో పరిశీలించడం జరిగింది. పరిశోధనా పత్రం ప్రవేశికతో ప్రారంభమై, ఎంపిక చేసిన కథలను లోతుగా విశ్లేషిస్తుంది ఒక సమగ్ర ముగింపుతో అంతమవుతుంది. ఈ పరిశోధన చిదంబర రెడ్డి వాస్తు, సంఖ్యాశాస్త్రం, దొంగ స్వామీజీలు, భూతవైద్యం, శకునాలు, దెయ్యాల వంటి మూఢనమ్మకాలను వ్యంగ్య హాస్యాలతో ఎంత పదునుగా విమర్శించారో వెల్లడిస్తుంది. 'జ్ఞాన తిమిరం' కథలో వాస్తు, సంఖ్యాశాస్త్ర మూఢత్వాలను, 'లడరటపే' కథలో బాబాలు స్వామీజీల మోసాలను ఎండగట్టి, హేతుబద్ధమైన ఆలోచనలకు ప్రజలను ప్రోత్సహించడం రచయిత లక్ష్యం. చదువుకున్నవారు కూడా మూఢవిశ్వాసాలకు ఎలా లోనవుతారో ఈ కథలు స్పష్టం చేస్తాయి. సామాజిక లోపాలను సరిదిద్దడానికి అమరం వంటి పాత్రలు చేసిన ప్రయత్నాలు అరణ్యరోదనంగా మారడం, మంచి చెప్పబోయిన వారిని పిచ్చివారితో సమానంగా చూడడం సమాజంలో నెలకొన్న సవాళ్లను సూచిస్తాయి. ప్రజలు శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించి, మూఢనమ్మకాల నుండి బయటపడాలనే ఆకాంక్షను రచయిత వ్యక్తం చేస్తారు. ఇది భవిష్యత్తులో మూఢనమ్మకాలు వాటి సామాజిక ప్రభావాలపై మరింత లోతైన పరిశోధన అవసరాన్ని సూచిస్తుంది, మానవుడు ఆత్మవిశ్వాసంతో హేతుబద్ధంగా జీవించాలనే స్ఫూర్తిని రగిలిస్తుంది.
Keywords: వ్యంగ్యం, హాస్యం, కథాసాహిత్యం, సడ్లపల్లి చిదంబరరెడ్డి, మూఢవిశ్వాసాలు, సామాజికవిమర్శ, తెలుగు సాహిత్యం, 'మట్టిమొగ్గలు'.
1. ప్రవేశిక
సడ్లపల్లి చిదంబర రెడ్డి రాసిన కథలలో కొన్ని వ్యంగ్య హాస్య కథనాలు ఉన్నాయి. నిజానికి కథను కథగా చెప్పడం ఏ సాహితీకారుడైనా చేయగలడు. అలా కాకుండా, సమాజంలో వ్యక్తులలో జీర్ణించుకుపోయిన కొన్ని తత్వాలను, తీరులను గమనించి, సమర్థనీయం కానివి చెప్పగలగాలి.
అలా చెప్పడంలో దేనినైనా విమర్శించే వెసులుబాటు ఉంటుంది. పైగా వెక్కిరింతలా కాకుండా, గుచ్చినట్లు కాకుండా, పాత్రనో, దాని స్వభావాన్నో, దాని ప్రవర్తననో ఉదాహరించి వ్యంగ్య రూపంలో చెప్తే దానికో ప్రత్యేకత ఉంటుంది. ఆ కథలను చదువుతున్న వ్యక్తులు తమ భుజాలను తుడుముకొని తమను తాము సరిదిద్దుకోగలుగుతారు. అలాగే రచయితలు హద్దు పెట్టుకోకుండా దారాళంగా తమ అభిప్రాయాన్ని నిర్బంధంగా బహిరంగపరచగలరు. అందుకే కొన్ని విషయాలను వ్యంగ్యార్థంతో చెప్పి ‘ఇది వ్యక్తి తీరు’, ‘ఇది సమాజ గతి’ అని పెదవి విరిచే యత్నం చేస్తారు. అలా చెప్పినప్పుడు త్వరితగతిలో కదలిక వచ్చి సరిచేసుకోగలరన్న ఉద్దేశం ఇక్కడ కనిపించింది.
ఒక్కొక్కరికి కథలను చెప్పే విధానంలో, ఒక్కొక్కరు వాటిని అర్థం చేసుకునే విధానంలో తేడాలు ఉంటాయి. వాటిని దొరకబుచ్చుకొని కథాకర్త కథనాన్ని మలచడం వారి నిపుణతకు సూచిక. అలాగే కథను పూర్తిగా వ్యంగ్యంగా చెప్పినప్పటి కన్నా హాస్యాన్ని చేర్చి చెప్పినప్పుడు కొంత సరదాగా ఒక ముఖ్య విషయాన్ని కలగలిపినట్లు ఉంటుంది. పూర్తి వ్యంగ్యంతో చెప్తే దాన్ని పాఠకుడేలా స్వీకరిస్తాడోనన్న శంక లేకుండా నవ్వుతూ, నవ్విస్తూ వీపు చరిస్తే అది అనుభవపూర్వకతగా ఉంటుంది. పైగా హాస్యాన్ని పండించడం కష్టతరమైనది. అలాగే తాను నవ్వినట్లు ఎదుటివాడు హాస్యానందాన్ని పొందగలడని అనుకోలేం. అయినా సరే దాన్ని సంపూర్ణంగా సాధించే ప్రయత్నం కొందరికే సొంతం. సడ్లపల్లి వారి కథలు కొన్ని ఆ కోవకు చెందుతాయి.
మూఢ నమ్మకాల గురించి రచయిత చెబుతూ, సమాజంలో మనిషి ఎలా మిళితమయ్యాడో, అలాగే మూఢత్వం మనిషిలో కలగలిసిపోయింది. నమ్మకాలు ఎప్పుడైతే కరుడుగడతాయో, మూఢత్వం ఆపాదింపబడుతుంది. అవి వ్యర్థ నమ్మకాలైనా వాటిని పాటించేందుకు సిద్ధపడిపోతుంటారు. అందులో సాంప్రదాయాలు, అలవాట్లను వారసత్వంగా పొందే చోట ఇలాంటివి సాధారణంగానే అలవడుతుంటాయి. హేతుబద్ధంగా ఆలోచించలేక అనుసరించడం, భ్రమపడటం వంటివి కొన్ని మూఢనమ్మకాలకు కొమ్ముగాసేలా చేస్తుంటాయి. అలాంటి వాటికి లోనవడం లాభాలేమో గానీ నష్టాలు మాత్రం తప్పవు. దీనిని గమనించిన రచయిత, మనిషి సాంకేతిక విజ్ఞానపరంగా ఎంత ఎదిగినా మూఢత్వాలకు లోనవడాన్ని నిరసించారు. మనిషి మానసిక బలహీనతల ఆధారంగా మూఢత్వాలు అతడిని అంటి పెట్టుకున్నాయన్న ధోరణిని కథనాలకు వస్తువులుగా ఎంచుకున్నారు. వాటిని వ్యంగ్య హాస్య భరితంగా నడిపి కదలికను తేవాలని యత్నించారు. వీటిలో వాస్తు, సంఖ్యాశాస్త్రాలపైన, స్వామీజీలు, బాబాల పైన, భూత వైద్యాలపై, శకునాలపైన, దెయ్యాలున్నాయన్న మూఢత్వాలపై రచయిత వ్యంగ్యం, హాస్యాలను సంధించారు. అలాంటివి నమ్మడం అవివేకం అంటూ నమ్ముతున్న వారికి అసలు నిజాలతో కళ్ళు తెరిపించే ప్రయత్నం ఈ కథలలో దాగి ఉంది.
2. సడ్లపల్లి చిదంబర రెడ్డి కథలలో వ్యంగ్య హాస్య చిత్రణ
2.1 జ్ఞాన తిమిరం
రాములు తండ్రి నీటి జాడ వెతుక్కుంటూ వెళ్లే వలస వ్యవసాయదారుడు. అలా వెళ్ళిన చోట మట్టితో చకచకా ఇల్లు కట్టి నివసించేవారు. అందుకే రాములుకు ఇల్లు కట్టడం పెద్ద పని అనిపించేది కాదు. భార్య పోరు పెట్టడంతో సొంత ఇంటికి పూనుకుంటాడు. దీనికై శాస్త్రీయ పద్ధతిలో స్థలాన్ని చూపే లెక్కల మాస్టారు ఆచారి గారి వెంట వెళ్తాడు. అతను ఏడు, ఎనిమిది అనే సంఖ్యల ప్లాట్లను చూపుతాడు. ఏడు సంఖ్య అమంగళం అనీ, పైగా ఎదురుగా ఉన్న గుడి నీడ పడుతుందనీ అంటాడు. ఏ విధంగా చూసినా ఆ స్థలం దురదృష్టకరమని చెప్పి, ఎనిమిది సంఖ్య గల స్థలం మంచిదని అంటాడు. అదైతే అన్ని విధాలా మంచిదని లెక్కలు కట్టి వివరిస్తాడు. ఆ మాటల ప్రభావంతో ఎనిమిది సంఖ్య రాములుకు ఉత్తేజాన్ని అందించినట్లు అనిపిస్తుంది. ఎనిమిదవ సంఖ్య గల బస్సును ఎక్కి, ఎనిమిదో సీట్లో కూర్చొని, ఎనిమిది రూపాయలు టికెట్ ఇవ్వమంటాడు. కండక్టర్ ఏడు రూపాయలు టికెట్ ధర అనడంతో అతనితో గొడవ చేసి పిచ్చిగా వాగుతాడు. వారు పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళగా, ఐదు అక్షరాల ఆసుపత్రిలో నయం కాదని ఎనిమిది అక్షరాలు ఉన్న వైద్యశాలకు తీసుకెళ్ళమని రాములు గోల చేస్తాడు.
2.1.1 సంఖ్యాశాస్త్ర మూఢ నమ్మకాలు
వాస్తు, సంఖ్యాశాస్త్రం, జాతకాలు వంటి మూఢనమ్మకాలపై వ్యతిరేకతను, హాస్యాన్ని జోడించి కథగా మలిచారు. సంప్రదాయ నేలపై వేదకాలం నుండి అనేక ఆచారాలు మానవ సమాజంలో బలంగా పాతుకుపోయాయి. అవి పాటించడం మంగళం అనీ లేదంటే అమంగళం అనీ జనులు నమ్ముతున్నారు. అలా ఆవాసాలు, కార్యాలయాలు వంటి కట్టడాలన్నింటినీ వాస్తును చూసి కట్టడం, సంఖ్యాశాస్త్రాలతో తగినవో కావో అని సరిపోల్చడం, జాతకాలను చూసి శుభాలను ఎలా చేకూర్చుకోవాలో అన్నవి అధికులు ఒక నమ్మకంతో అనుసరిస్తుంటారు. నిజానికి ఇవి హేతువుకు అందనివైనా, ఆయా శాస్త్రాలు, వాటిని నమ్మేవారు వాటికి ముఖ్యతను ఆపాదిస్తుంటారు. అలాంటివి నమ్మకాలు లేనివారికి వాటిని వారి నెత్తిమీద అధికంగా రుద్దే ప్రయత్నం చేసే వారికి పిచ్చెక్కక తప్పదు. అన్నట్లు ఉండే పరిస్థితులను ఎదుర్కొక తప్పదు. ఎందుకంటే వీటిని ఆపాదిస్తూ మాట్లాడే వారి లెక్కలు ఔరా! అనిపించక మానదు. చివరకు కష్టపడి రూపాయికి రూపాయిని చేర్చి ఏ ఆస్తిని కొనాలన్నా, ఏ శుభకార్యాలు చేయాలన్నా, చివరకు ఎటు కదలాలన్నా, మెదలాలన్నా శాస్త్రాలను తెరమీదకు తెస్తున్నారు. అవి ఎంత అర్థంలేనివో తెలిపే యత్నాన్ని కథానాయకుడు ఇల్లు కట్టడానికి స్థలం కొనాలన్నప్పుడు ఆచారి మాటలలో గమనించవచ్చు.
“మీ పేరు రాములు కదా దానికి ముందు గౌరవ వాచకం తగిలిస్తే ముచ్చటగా నాలుగు అక్షరాల ‘శ్రీరాములు’ అవుతారు. ఈ నాలుగు అక్షరాలతో ప్లాటు నెంబర్ అక్షరాల సంఖ్య నాలుగు కలిపితే మొత్తం ఎనిమిది అక్షరాలు అవుతాయి. విచిత్రంగా ఇక్కడ ఇంకో అద్భుతం కనిపిస్తుంది. మీ శ్రీమతి పేరు మంగతాయారు అన్నారు కదా. ఆ పేరుకు గౌరవ సూచకం కలపాలి. అప్పుడు శ్రీమతి మంగతాయారు అని ఎనిమిది అక్షరాలుగా ఆమె విస్తరిస్తారు. మీరు ప్లస్ మీ ప్లాట్ ఈజ్ ఈక్వల్ టు మీ శ్రీమతిగా బ్యాలెన్స్ సరిపోతుంది. ఇల్లు కట్టడానికి ప్రోత్సాహం ఆమెగారే కాబట్టి మీ అదృష్టపు సంఖ్య కూడా ఎనిమిది అవుతుంది” (మట్టిమొగ్గలు, పుట. 263)
అంటూ ముగించి రాములు వైపు చూస్తాడు ఆచారి. ఇక్కడ ఎనిమిదవ సంఖ్యలో ఉన్న స్థలాన్ని కొనిపించడానికి లెక్కల మాస్టారైన ఆచారి గారు కూడికలు, తీసివేతలతో వాస్తు లెక్కలు సరి చేయడం ఈ వాక్యాలలో గోచరిస్తుంది. ఎలాగైనా ఆ స్థలాన్ని రాములు వద్ద కొనిపించడానికి పడుతున్న ఈ సంఖ్యాశాస్త్రాల ప్రయాస వ్యంగ్య పూరితమై ఆ తిప్పలను తెరమీదకు తెచ్చింది. ఇలా కలపడం, తీసివేయడాలతో ఏ సంఖ్యనైనా సృష్టించవచ్చు. ఏ సంఖ్యనైనా నప్పదని చెప్పనూవచ్చు. లేని అక్షరాన్ని చేర్చడం, ఉన్న అక్షరాన్ని తీసేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుందనుకుంటే అంతకన్నా పిచ్చితనం ఇంకేమీ లేదు. అసలే కష్టజీవిగా ఆకలి ఉంటే ఎరిగిన వాడికి, ఎదిగిన వాడికి ఇలాంటి కథలన్నీ వినిపించడం హాస్యాస్పదమే అవుతుంది. ‘విస్తరిస్తారు’ ‘బ్యాలెన్స్ సరిపోతుంది’ అంటూ ఆచారి వాడిన మాటలకు నవ్వుకోవాలో, ఏడవాలో తెలియక రాములు కొట్టుమిట్టాడినట్లు పాఠకులకు అనిపిస్తుంది. కాలం ఆధునికమే అయినా బుర్రలు సనాతనమైనప్పుడు ఇవన్నీ నమ్మి తలలు ఊపుతున్న వారే అధికం. పైగా అదృష్ట సంఖ్యలను అనుసరించి పుట్టిన బిడ్డల నామకరణాలే కాకుండా, అర్థ జీవితాలను దాటిన వారు పేర్లలో అక్షర మార్పులను తెచ్చి పెట్టుకోవడాలున్నాయి. ఇలాంటివి చూసినప్పుడు, విన్నప్పుడు పిచ్చి పరాకాష్టను చేరింది అనుకోక తప్పదు. అలాగే ఆ వాహనాల నెంబర్లు అదృష్ట సంఖ్య అయి ఉండాలని లక్షలు గుమ్మరిస్తున్న వారు ఉన్నారు. ఇవన్నీ అర్థంలేనివని తెలపడానికే రచయిత ఇలా వ్యంగ్యంగా వెలువరించారని భావించవచ్చు.
2.1.2 వాస్తు శాస్త్ర మూఢ నమ్మకాలు
ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లు ప్రతి దాన్ని మనం భౌతిక దృష్టితో చూసి అంచనా వేసి గప్పున తప్పులో కాలు వేస్తుంటాము. ఈ భౌతికవాదం చెప్పలేనివి భావవాదం చెప్తుంది అని ఆచారి చేత అనిపించారు. హేతువాదం కాకుండా భావవాదంలో పడి కొట్టుమిట్టాడుతూ లేనిపోని భ్రమలను కల్పించుకొని బ్రతకాలి అంటున్న అతని మాటలు ఆధారం లేని వాటిని ప్రోత్సహించేవి. అలాగే బలహీనతలను సొమ్ము చేసుకునేవి అని గ్రహింపజేశారు. ఇదే విధంగా వాస్తు శాస్త్రాన్ని అన్వయిస్తూ ఆచారి చెప్పిన మాటలు ఎవరినైనా భయపెట్టి వాటికి లొంగేవిగా ఉంటున్నాయి అనడంలో సందేహం లేదు. అలాంటి మాటలు, మంత్రజాలాలను ఈ కింది వాక్యాలలో పరిశీలించవచ్చు.
“గుడికి ఎదురుగా ఇల్లు కట్టడం అశుభం. దేవుడు గుడి, గోపురం నీడ ఏ ఇంటి మీద పడరాదు. అలా పడితే ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది. దాని జతకు ప్లాట్లు ఫలానా మూల పెరిగింది. అలా పెరగడం వల్ల రకరకాల దుష్టశక్తులు అప్పులుగాను, అనారోగ్యంగాను, రోడ్డు ప్రమాదాలు గాను, వ్యాపార నష్టాలుగాను, పరీక్షలలో పిల్లలు తప్పిపోవడం గాను, ఆడ పిల్లలకు మొగుడు దొరక్కుండాను, దొరికినా సంతానం కలగకుండాను అడ్డుపడతాయో వివరించాడు” (మట్టిమొగ్గలు, పుట. 262)
ఈ విధంగా ఆచారి చెప్పిన మాటలకు కథానాయకునికి తప్పక భయం కలిగి ఉంటుంది. ఇలా మనిషి బలహీనతలపై వాస్తు శాస్త్రాన్ని మోపినప్పుడు వాటిని నమ్మక చస్తారా అనే వ్యంగ్యభావం రచయితది. కానీ ఇక్కడ కథానాయకుని వంటి వారికి అర్థం కానిది ఉంది. అదేంటంటే, దేవునికి, భక్తికి దాసులైన వారంతా అతని చల్లని చూపుల నీడ తమపై ప్రసరించాలని పూజలు, వ్రతాలు, నోములు, మొక్కుబడులు వంటివి చేస్తూ, చెల్లిస్తూ ఉంటారు. అలాంటివి దైవ నిలయం నీడ తమ ఆవాస ఆవరణాలపై పడకూడదనడంలో విచిత్రమే ఉంది. అంటే దేవుడు మంచి చేసేవాడా? చెడుని కోరేవాడా? అనే ప్రశ్నను ఎవరికి వారు వేసుకునేలా చేశారు. సమాధానంగా మంచి చేసేవాడేనని ముక్తకంఠం వినిపించినా, గుడి ఛాయ ఇంటి ఆవరణపై పడితే చెడు ఎలాగో చెప్పలేరు. ఈ విషయాన్ని వ్యంగ్యంగా కథాకర్త అన్నారు. పైగా కథానాయకుడు ఇంటి ఇలవేల్పు సన్నిధిలో ఉండవచ్చునని భక్తితో పరవశించిపోతున్నప్పుడు, ఆచారి ఈ వాస్తు శాస్త్రాన్ని వినిపించి అడ్డుకట్ట వేయడాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు. ప్రశ్నకు సమాధానానికి మధ్య నలిగే మనసు పిచ్చిది అవుతుందని నిరూపించారు. అలాగే ఫలానా మూల స్థలం పెరిగితే ఇలా అని, తరిగితే ఇలా అని వాస్తు కారులైన ఆచారి వంటి వారు వంశనాశనంగానో, ఆరోగ్యానికో, ఆర్థిక సుఖసంతోషాలకో ముడివేసి సర్వనాశనం అని చెప్తే ఆ స్థలాన్ని ఎవడూ ధైర్యం చేసి కొనలేడు. అంటే మనిషి భయాన్ని గుప్పిట పట్టుకున్న మూఢశాస్త్రాలు అతనిపై పెత్తనం చేస్తాయి. ఏ ధైర్యమో చేసి వాస్తు వ్యతిరేకమైన స్థలాన్నినో, ఇంటిని కొంటే ఏ చిన్న బాధో, ఆటంకమో జరిగితే దాన్ని వాస్తు ప్రభావం అనేస్తారు. అనగా అన్ని చూసి, ఆచి, తూచి ఇల్లు కట్టిన వారంతా కేవలం సుఖాలను, సంతోషాలను మాత్రమే అనుభవిస్తూ ఉన్నారా! వీరికి కష్టం, నష్టం అనేవి తెలియవా! రావా! ఇలా హేతువుకు అందనివి శాస్త్రాల పేరిట మానవునిలో పిరికితనాన్ని, అవిశ్వాసాన్ని నూరిపోయడాన్ని నిరసించారు. అర్థంలేని నమ్మకాల పట్ల వ్యంగ్యాత్మకమైన నవ్వుని సవాలుగా విసరడం ద్వారా ఆలోచింపమంటూ ఆదేశించడం ఆలోచనాత్మకంగా ఉంది.
జాతకానికి నప్పెలా, సంఖ్యాశాస్త్రాన్ని సమ్మతించేలా, వాస్తును మెప్పించేలా మనిషి ఆస్తి, ఆలోచన, అస్థిత్వాలు ఉండాలని నిర్దేశించడంలో మూర్ఖత్వమే ఉంటుందేమో. చివరకు బల్లికి, పిల్లికి కూడా శాస్త్రాన్ని ఆపాదించే తీరు స్వార్థ ప్రయోజనాలకు పుట్టినవే గానీ మరేం కావు. కాకుంటే మనిషి వైజ్ఞానిక, సాంకేతికంగా ఎంత ఎదిగినా హేతుబద్ధంగా కాని వాటిని నమ్మడం కథా నిర్మితను ఆశ్చర్యానికి గురి చేసింది. సచివాలయం నుండి అంతరిక్ష కేంద్రాల వరకు వాస్తును అనుసరించడం జరగడం కూడా చూస్తున్నాం. అలాంటి నమ్మకాలను ఘంటాపథంగా ఆచారి వంటి వారు ఆపాదించినప్పుడు కథానాయకుని అంతరంగ కల్లోలమే అతడిని మానసిక ఉన్మత్తుని చేసింది. నిజానిజాల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. దీన్ని హాస్యరస, వ్యంగ్యభరిత కథనంగా మలిచి యోచింపజేశారు.
2.2 లడరటపే: మోసగాళ్ళ గుంపు
తుళు భాషలో లడరటపే (మోసగాళ్లు గుంపు) అనే పేరు గల పల్లె రాళ్లపాడు నామంతో స్థిరపడింది. ఆ ఊరికి అమరం అనే ఉపాధ్యాయుడు కొత్తగా వస్తాడు. ఆ ఊరి మోతిబారి కొడుకు ఒక పిచ్చివాడు ఉండేవాడు. ఒక రోజు పాఠశాల గదిలోనికి వచ్చినప్పుడు అమరం పాఠం చెబుతుండగా, వాక్యాంతంలో ‘చస్తాడు’ అనే పదం దొరుకుతుంది. ఆ పిచ్చివాడు అదే పదాన్ని ఉచ్చరిస్తూ తిరగడం, ఆ రోజు 90 ఏళ్ళ అమరం తండ్రి మరణించడం జరుగుతుంది. అమరం తమ్ముడు ఒక డాక్టరు. అమరం తండ్రిది సహజమరణమైనా అందరూ పిచ్చివాడి మాటకు మహిమని ఆపాదిస్తారు. మరో రోజు పిచ్చివాడు ‘తెగుతుంది, తెగుతుంది’ అనడం చైనాలో వరదలకు డ్యాములు కొట్టుకుపోవడం జరిగి, తిక్కలోడికి అతీంద్రియ శక్తులు ఉన్నాయనేది అంతర్జాతీయమవుతుంది. ఇంకో రోజు ‘కారుతుంది, కారుతుంది’ అని అతను అనడం ఆ ఊరి నీటి ట్యాంకు చిల్లు పడి నీరు కారి కూలడం జరుగుతుంది. కాంట్రాక్టర్ కనకారావు ఆ తిక్కలోడిని దిగంబర స్వామీజీగా మార్చి అతనికి ట్రష్టిగా మారుతాడు. ఇదంతా సరికాదంటున్న అమరానికి, అతని మాటకు విలువలేక బదిలీ కావాల్సి వస్తుంది. చివరికి తిక్కలోడిని స్వామీజీ చేసింది కనకరావు, అతని తమ్ముడైన డాక్టర్ ఉమ్మడి పథకం అని అమరానికి తెలుస్తుంది.
2.2.1 స్వామీజీల మోసాలు
సమాజంలో బాబాలు, స్వామీజీలు, మహిమలు అంటూ ఉన్న మూఢవిశ్వాసాల పట్ల ఈ కథనం ద్వారా రచయిత తీవ్రంగా నిరసించారు. వేద భూమిపై నమ్మకాలకు కొదవేం లేదు. అది హేతుబద్ధం అవునా? కాదా? అని ఎవరూ ఆలోచించడం లేదు గానీ, వేలంవెర్రి పాటింపులు మాత్రం ఉంటున్నాయి. ఇక మంత్రాలు, తంత్రాలు, దేవుళ్ళు, దెయ్యాలు అనే నమ్మకాలు జీర్ణించుకుపోవడం వలన వీటికి సంబంధించిన మూఢత్వాలు ప్రబలిపోతుంటాయి. అమరం పాత్ర అలాంటి మోసం, అన్యాయం తన కళ్ళ ముందు జరుగుతున్నా ఎవరూ అతని మాటను వినకపోవడం వలన నిస్సహాయంగా నిలబడిపోయాడు. స్వామీజీలు, బాబాలకు పవిత్రతను, మహిమలను ఆపాదిస్తూ జరుగుతున్న ఆరాధనలు, సేవలు, కోట్ల రూపాయల వినిమయాలు, అక్రమాలు వంటివి చూస్తూనే ఉన్నాం. చివరకు పోలీసులు, కోర్టుల వరకు వెళ్తున్నా వాస్తవ కథనాలను గమనిస్తూ తిరిగి అటువైపే పరుగులు తీస్తున్న మూఢజనులు ఉన్నారు. కొందరు స్వార్థంతో అబద్ధాలను నిజాలుగా, మహిమలుగా నమ్మించి మోసం చేస్తున్నారు. ఈ కోణంలో సాగిన ఈ వ్యంగ్యాత్మక కథనం నిజాలను గ్రహించమని ఉదాహరణయుక్తంగా తెలిపింది. ఉపాధ్యాయుడైన అమరం, ఊరిలోని ఒక పిచ్చివాడు బాబాగా ఎలా మారాడో ఈ కథలో చిత్రించారు. బాబా నివాసం గురించి పరిశీలిస్తే పరిస్థితి అర్థమవుతుంది.
“స్వామీజీ దృష్టి మాత్రం ఎవ్వరి మీదా ఆనడం లేదు. శూన్యాన్నో, మరో మాయనో, అతనికే తెలియని చోట వెదికినట్లు ఎక్కడెక్కడో చూస్తున్నాడు. భక్తుల ఒత్తిడిని తట్టుకోలేక స్వామి వారు వారి మీద ఉమ్మి వేస్తున్నాడు. తొక్కుకుంటూ, ఆ ఉమ్మి కోసం ఎగబడుతున్నారు భక్తులు. అదే వారి జీవనముక్తికి సంజీవని. సర్వరోగ నిర్మూలనకు దివ్య ఔషధం. ఉమ్మి తడి చేతికిందిన వారు పెన్నిధి దొరికినట్లుగా దొరకని వారు నిరాశతో మరో ప్రయత్నానికి సిద్ధపడుతున్నారు. మాటలు, అరుపులు, మంత్రాలు, తిట్లు కలగలిపి విచిత్రంగా వాగుతున్నారు స్వామి వారు. ఆ శబ్దాల నుండి కాలజ్ఞానాన్ని భవిష్యత్ వాణిని విశ్లేషించడానికి శాస్త్రవేత్తలు కొందరు ప్రతి మాట రికార్డ్ చేస్తున్నారు. టీవీ ఛానల్ వారు ఒకరి మీద ఒకరు పడి పోటాపోటీగా టెలికాస్ట్ చేస్తున్నారు” (మట్టిమొగ్గలు, పుట. 299)
ఈ వాక్యాలు ప్రజలలోని మూఢనమ్మకాలు, స్వామీజీల గూడుపుఠానీలు అంచనా వేయించేవిగా ఉన్నాయి. ఇలాంటివి సామాన్యులతో పాటు శాస్త్రవేత్తలు నమ్మడాన్ని, టీవీ చానల్స్ ఇలాంటి విశ్వాసాలను ప్రసారం చేయడాన్ని నిరసించారు. అక్షర జ్ఞానం, విజ్ఞానం ఉన్నవారు మూఢవిశ్వాసాలను పెంచి పోషించడం అర్థం లేనిది. అందుకే మంత్రాలు, మహిమలు ఉన్నాయని, ఏది చెప్తే అది జరిగి తీరుతుందని చెప్పడాన్ని వ్యంగ్యంగా విమర్శించారు. మానవాతీత శక్తులు, దేవుళ్ళమనే మహిమల మాటలు అర్థంలేనివి. ఒక పిచ్చివాడి పిచ్చి చేష్టలు, మాటలను కూడా సంపాదన మార్గంగా మలుచుకునే కాంట్రాక్టర్ కనకారావు, అతని తమ్ముడైన డాక్టర్ వంటి వారు ఉంటారని అమరం ఉదాహరణపూర్వకంగా చెప్పి, కళ్ళు తెరిపించేందుకు యత్నించారు. ఒక వ్యక్తి ఎంగిలిలో బ్యాక్టీరియా ఉంటుందని తెలియని వారు లేరు. అయినా ఆ ఉమ్మిలో మహిమలు ఉన్నాయంటే దానికోసం వెర్రి జనాలు ఎగబడుతున్నారన్నది హాస్యాన్ని, కంపరాన్ని జోడించి వ్యంగ్యాన్ని మేళవించి చెప్పారు. అక్షరాస్యులే ఇలా చేస్తే నిరక్షరాస్యులైన అమాయకులు అలాంటి వాటి వెంటపడి పలు రకాలుగా మోసపోతున్నారనేది కథాకర్త ఆవేదన. మూఢాచారాలెన్నింటినో ఒకనాటి సంస్కర్తలు చాలా వరకు రూపుమాపారు. కానీ కళ్ళ ముందున్న మూఢత్వాన్ని వదలమని హేతుబద్ధంగా వివరించబోయిన అమరం భంగపడ్డాడు. ‘నా మాటలు వినే స్థితిలో ఏ ఒక్కరూ లేరు. నన్ను ఒక మెంటల్ కేసు కింద జమ కట్టారు’ అని అతను వాపోయాడు. దీన్ని బట్టే ప్రజల మానసిక గతిని చూడవచ్చు. ఎందుకు నిత్యానందలు, డేరా బాబాలు, ఆశారాంలు పట్టుబడినా తిరిగి స్వామీజీలు, మహిమాన్వితులు అంటూ జనాలు పరుగులు తీయడం మానరని అమరం పాత్ర ద్వారా రచయిత వ్యంగ్యాన్ని ఆవేదనగా వెళ్ళగక్కారు. మూఢవిశ్వాసాలను నేర్పుగా నాటి, పెంచి పోషించే వారుంటే ఎవరో మార్చలేరన్న నిరాశ అతనిది. తద్వారా అయినా చైతన్యం వచ్చి మార్పు సాధ్యమవుతుందేమోనన్న ఆశావాదాన్ని నర్మగర్భముగా భవిష్యత్తులో అయినా మనిషి శాస్త్రీయంగా ఆలోచించాలనే రచయిత దృక్పథం వెల్లడవుతుంది.
మానవుడు బలహీనుడు. అతను తనను తాను నమ్మి ఆత్మవిశ్వాసంతో నడవడం కన్నా మూఢత్వాన్ని, కట్టు కథలను అధికంగా నమ్ముకుంటాడు. దీన్ని సొమ్ము చేసుకోవడానికి కొందరు తయారైపోతారు. చస్తాడు, తెగుతుంది, కారుతుంది అని తిక్కలోడు అనగానే దాన్ని ఊర్లో ముసలివాడు చావుకి, చైనాలో డ్యాములు కొట్టుకుపోవడానికి, ఊరి నీళ్ళ ట్యాంకు కారడానికి అన్వయించి తిక్కలోడిని కాస్త తిక్కల స్వామిని చేసినందుకు అమరంవంటి వారు జీర్ణించుకోలేరు. పైగా అట్టి వారి గొప్పతనాన్ని వ్యతిరేకించడం అజ్ఞానం అనీ, ప్రగతి నిరోధకమని అందరూ అతనిపై తిరుగుబాటు చేశారు. చివరకు అతను బదిలీ వెళ్ళిపోవాల్సి వచ్చింది. మూఢులకు మంచి చెప్పబోతే వారంతా బహిష్కరించి వారి పిచ్చి లోనే మగ్గిపోయేంత బుద్ధిహీనులు అనే అభిప్రాయానికి అమరం వచ్చాడు. అతనిలాగే కొందరు ఏది నిజం ఏది భ్రమ అని కనులు తెరిపించాలని చూస్తుండగా వారిదే పిచ్చితనం అనే మాటని ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, సైంటిస్టులు వంటి విద్య, అధికార అధికులు కూడా స్వామీజీల వెంట చేరి చిడతలు వాయించి, పొర్లు దండాలు పెడుతున్నారు. అలాంటప్పుడు చెప్పే మంచి మాట చెవికెక్కదని రచయిత నిట్టూర్చినా, తన వంతు ప్రయత్నంతో మార్చే యత్నాన్ని చేశారు. అందుకే అమరం జీవితంలో జరిగిన సంఘటనలను, తన సొంత అనుభవాలను జోడించి వాస్తవాన్ని వ్యంగ్యగర్భంగా చెప్పారు. ‘ఇదీ పరిస్థితి’ అని వెల్లడిస్తే కొంత కదలికలైనా తెచ్చుకొని మూఢవిశ్వాసాలను పక్కనపెట్టి హేతుబద్ధతగా ఆలోచిస్తారని ఆకాంక్షించారు. మహిమలు, మహత్యాలు అంటూ బయలుదేరే స్వామీజీల అసలు రంగుని వెల్లడించారు. అలాగే వారి చుట్టూ చేరిన వారి స్వార్థాలను, ఆదాయాలను లెక్క కట్టించడం విశేషం. ఇలాంటివి నమ్మి మోసపోయేది అమాయకులే అని నిరూపించడం ద్వారా ఆలోచన రేకెత్తించారు. అదృశ్య శక్తులు ఉన్నాయన్నది నమ్మకూడదని నూరి పోశారు. ఒకరకంగా చైతన్యపరచడానికి వ్యంగ్య హాస్యాన్ని జతచేసిన కథనాన్ని సమర్థవంతంగా నిర్వహించారనడంలో సందేహం లేదు.
ఉపసంహారం
కథల మీద పరిశోధన అంటే సమాజ అనువణువునూ దర్శించడం. ఆ జీవన చిత్రణను రచనలో ప్రతిబింబించినప్పుడు ఒక సంజీవతను ఆ అక్షరాలు అందుకొని సహజ రూపాన్ని ధరిస్తాయి. అలాంటి అనుభవసారంతో మనిషి జీవితాన్ని, సమాజ గమనాన్ని కథలుగా చేసుకున్న వారే సడ్లపల్లి చిదంబర రెడ్డి. కథలు చెప్పడం చాలామంది చేయగలరు. కానీ తమదైన శైలిలో ఒక పెద్ద విషయాన్ని చర్చిస్తూ తప్పులను ఎత్తిచూపే వ్యంగ్యాత్మకతను కొందరే ప్రదర్శించగలరు. తద్వారా వ్యవస్థ లోపాలను కళ్ళ ముందుంచడం మార్పును కోరడంలో భాగం. అలాంటి కథలలో నిశిత దృష్టిలోని సమస్యావగాహన గమనించాను. సమాజంలో ప్రపంచవ్యాప్తంగా జనులు సాంకేతికంగా ముందుకు పోతుంటే, మూఢవిశ్వాసాలకు లోనై, అబద్ధాలను నిజాలుగా, మహిమలుగా నమ్మించి, ఈనాటి సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేనితనాన్ని గుర్తించి దాన్ని పున:ప్రతిష్టించాలన్న తపనను కొన్ని కథల్లో గమనించవచ్చు. కొన్ని కథలలో అక్షరాస్యులే ఇలా చేస్తే, నిరక్షరాస్యులైన అమాయకులు అలాంటి వారి వెంటపడి, కొన్ని రకాలుగా మోసపోతున్నారనేది కథాకర్త ఆవేదన మనల్ని ఆలోచింప చేస్తుంది.
- సడ్లపల్లి చిదంబర రెడ్డి కథలు వ్యంగ్య హాస్య శైలి ద్వారా సమాజంలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాలను సమర్థవంతంగా ప్రశ్నిస్తాయి.
- ‘జ్ఞాన తిమిరం’ కథలో సంఖ్యాశాస్త్రం, వాస్తు పేరుతో జరిగే మోసాలను, వాటి వల్ల కలిగే మానసిక ఆందోళనలను స్పష్టంగా చిత్రించారు.
- ‘లడరటపే’ కథ స్వామీజీలు, బాబాల పేరిట సాగే మోసాలను, అక్షరాస్యులు సైతం వాటికి ఎలా బలైపోతారో వివరించింది.
- హేతుబద్ధమైన ఆలోచన ఆవశ్యకతను, అశాస్త్రీయ విధానాలపై నిరసనను ఈ కథల ద్వారా రచయిత ప్రస్ఫుటం చేశారు.
- మనుషులలో చైతన్యాన్ని తీసుకురావాలనే లక్ష్యంతో హాస్యాన్ని జోడించి సంక్లిష్ట సామాజిక సమస్యలను సులభంగా అర్థమయ్యేలా అందించడం రచయిత ప్రత్యేకత.
ఉపయుక్త గ్రంథసూచి
- ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి. తెలుగు కథా రచయితలు. హైదరాబాద్, 1982.
- ఆరుద్ర. సమగ్రాంధ్ర సాహిత్యం (1, 2 సంపుటాలు). ఎం. శేషాచలం అండ్ కంపెనీ, మద్రాసు, 1965.
- కాసింఖాన్. మహమ్మద్, కథానిక రచన. హైదరాబాద్, 1944.
- చిదంబర రెడ్డి, సడ్లపల్లి. మట్టిమొగ్గలు (కథా సంపుటి). తపన సాహిత్య వేదిక ప్రచురణలు, టీచర్స్ కాలనీ, హిందూపురం, 2021.
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక - స్వరూప స్వభావాలు. హైదరాబాద్, 1986.
- నరసింహం, కె.వి.ఆర్., ఆధునికాంధ్ర కవితా సమీక్ష. గంగాధర్ పబ్లికేషన్స్, విజయవాడ, 1982.
- నవీన్, వాసిరెడ్డి. కథ 2003 సంపాదకులు. కథాసాహితీ, 2003.
- నాగయ్య, జి., తెలుగు సాహిత్య సమీక్ష (1, 2 సంపుటాలు). నవ్య పరిశోధన ప్రచురణలు, 18-1-699, భవానినగర్, తిరుపతి.
- నారాయణరెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వ సంప్రదాయాలు-ప్రయోగాలు (ద్వి.ము.). శివాజీ ప్రెస్, సికింద్రాబాద్, 1977.
- శాస్త్రి, ద్వానా. తెలుగు సాహిత్య చరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2001.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.



