headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-07 | Issue-9 | August 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

3. అల్పజీవి నవల: మనోరమ పాత్ర చిత్రణ

నీరజ దేవళ్ళ

పరిశోధకులు, తెలుగు శాఖ,
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి,
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9849101154, Email: sitanshu.hn@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 08.07.2026        ఎంపిక (D.O.A): 29.07.2026        ప్రచురణ (D.O.P): 01.08.2026


వ్యాససంగ్రహం:

ఆధునిక సాహిత్య వచన ప్రక్రియల్లో నవలకు విశిష్ట స్థానం ఉంది. కథను నడిపించే సాధనలైన పాత్రలు కథావికాసానికి ఆధారమై నవలకు జీవం పోస్తాయి. రచయిత తన భావజాలన్ని నవల లోని పాత్రల ద్వారా పాఠకులకు అందిస్తాడు పాత్రల ద్వారా భావోద్వేగాలకు లోనైన పాఠకుడు అనుభూతిని పొందుతాడు. క్రియాశీల పాత్రలు పాఠకుల్లో ఆలోచనలు రేకెత్తించి కథా సందేశాన్ని ప్రభావవంతంగా సాహిత్య లోకానికి అందిస్తాయి. కాబట్టి పాత్రలు నవలకు జీవనాడుల వంటివి. నవలల్లో రచయితలు పాత్రల యొక్క బహిర్గత ఆలోచనల ద్వారా పాఠకుల్ని ఆలోచింప చేస్తారు. కానీ మనోవైజ్ఞానిక నవలల్లో ఇందుకు భిన్నంగా వ్యక్తి అంతరంగ చిత్రణ ద్వారా పాఠకుడు తనకు తానుగా తరచి చూసుకునే అవకాశాన్ని రచయిత కల్పిస్తాడు. ఉదాహరణగా అసమర్థుని జీవయాత్ర, చివరికి మిగిలేది,అల్పజీవి, వ్యక్తిత్యం లేని మనిషి, మళ్ళీ వసంతం మొదలైన నవలలను చెప్పుకోవచ్చు. మనోవిశ్లేషణాత్మక నవలల్లో రచయితలు తమ భావాల్ని ఆలోచనల్ని సామాజిక దృక్పథాన్ని , సంఘర్షణలను జీవన తత్త్వాన్ని, ఎక్కువగా పాత్రల అంతరంగ కథనం ద్వారా వ్యక్తపరుస్తారు. చివరికి పాఠకలోకానికి సందేశం కూడా పాత్రల ద్వారానే అందించబడుతుంది. అందుకే సాహిత్య జగత్తు లో పాత్రచిత్రణ అనేది ప్రాణస్వరూపంగా భావించబడుతుంది. నవలల్లో అనేక రకాల పాత్రలు ఉంటాయి. కానీ అన్ని పాత్రలు పాఠకులకు గుర్తుండవు. కొన్ని విలక్షణ పాత్రలు మాత్రం పాఠకుల గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయి నీరాజనాలందుకుంటూ ఉంటాయి. అటువంటి పాత్రల్లో రాచకొండ విశ్వనాథశాస్త్రి రాసిన అల్పజీవి నవలలోని మహారమ పాత్ర కూడా ఒకటి. అల్పజీవి నవల చదివిన పాఠకుడు మనోరమను వారి మనోఫలకాలపై దేవతగా చిత్రించి ఆరాధించుకుంటూ ఉంటారనడం అతిశయోక్తి కాదు.కాబట్టి మనోరమ మనస్తత్వాన్ని ఆవిష్కరించడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

Keywords: భావోద్వేగాలు, ఆధునికత, స్పష్టమైన భావప్రకటనలు,సమకాలిన భావజాలం, చొరవ, సాన్నిహిత్యం

1. ప్రవేశిక

తెలుగు నవలాకారుల్లో రాచకొండ విశ్వనాధశాస్త్రికి ఒక ప్రత్యేకస్థానం ఉంది. ఆ స్థానంలో ఆయనను నిలబెట్టింది మాత్రం వారి మొట్టమొదటి మనస్తాత్విక నవల అల్పజీవి నవలే అనేది నిర్వివాదాంశం. అల్పజీవి నవల లో కథ కంటే కథనానికే పెద్ద పీట వేశారు రావిశాస్త్రి. చైతన్య స్రవంతి కథనం తో కూడిన విలక్షణమైన పాత్రచిత్రణ ఈ నవలకు విశిష్ట స్థానాన్ని కట్టబెట్టింది. అల్పజీవి నవలలో సుబ్బయ్య, సావిత్రి, వెంకట్రావు, గవరయ్య, అవధాని, మనోరమ, పోతన్న, పోతురాజు రామాయమ్మ రామారావు వంటి కథను నడిపించే పాత్రలు ఎన్ని ఉన్నా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న పాత్ర మనోరమది. మనోరమ పాత్రచిత్రణ గూర్చి అర్థం చేసుకోవాలంటే ఇతివృత్త పరిచయం తప్పనిసరి. కాబట్టి సూక్ష్మంగా అల్బజీవి నవల ఇతివృత్తాన్ని పరిశీలిద్దాం.

2. అల్పజీవి ఇతివృత్తం

రావి శాస్త్రి గారి కలం పేరుతో కాకుండా సొంతపేరు తో అచ్చైన తొలి రచన అల్పజీవి. దీని రచనాకాలం 16 జూన్ 1952 నుండి 1 సెప్టెంబరు 1952 వరకు. అల్పజీవి నవలకు రచయిత పెట్టిన తొలి పేరు చేదువిషం జీవఫలం. కానీ ఒక నాటి సుప్రసిద్ధ సాహిత్య మాస పత్రిక భారతి సంపాదక వర్గ సభ్యులు వి.డీ ప్రసాదరావు గారు ఈ నవలకు అల్పజీవి అని పేరు పెట్టారు. ఆ పేరుతో 1953 సం॥ జనవరి నుండి ఏప్రిల్ వరకు భారతి మాస పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడింది (తాటి శ్రీకృష్ణ 20).

కథానాయకుడు సుబ్బయ్య సోమయ్యకు ఒక్కగానొక్క కొడుకు. సుబ్బయ్య పుట్టగానే తల్లి మరణించడం, తోబుట్టువులు లేని ఒంటరి జీవితం గడపడం, సవతి తల్లి తన పట్ల క్రూరంగా ప్రవర్తించడం, తండ్రి పై రాత్రివేళ ఆగంతకులు దాడి చేయడం వంటి సంఘటనలు బాల్యంలోని అతనిని ఆత్మన్యూనతకు గురి చేశాయి. పిరికివాడిగా మారినప్పటికీ సుబ్బయ్య స్కూల్ ఫైనల్ పాసయ్యి గుమాస్తాగా ఉద్యోగంలో చేరాడు. పెళ్ళి కాక ముందే తండ్రి చనిపోయాడు. ఉద్యోగం అయ్యిందని తెలియగానే జమిందారి హోదాను పోగొట్టుకున్న తన క్లాస్మేట్ అయిన వెంకట్రావు, సుబ్బయ్య ను సంప్రదించి అతని చెల్లెలు సావిత్రిని సుబ్బయ్యకిచ్చి వివాహం చేసాడు. జమీందారి వంశంలో పుట్టడంతో ఆత్మాధిక్యతాభావం కలిగిన సావిత్రికి సుబ్బయ్య పట్ల ఎట్టి గౌరవము లేకుండా పోయింది. దానితో పాటు కొన్నిసంవత్సరాలుగా డిస్పాచ్ సెక్షన్ లోనే పనిచేయడం, సహోద్యోగులు అవహేళన చేయడం, ప్రమోషన్లు రాకపోవడం కూడా సుబ్బయ్యలో ఆత్మన్యూనతను పెంచి పోషించారు.

ఒకరోజు తన బావమరిది వెంకట్రావు సుబ్బయ్యఇంటికి వచ్చి ఐదువందల రూపాయలు కావాలని అడుగుతాడు. సుబ్బయ్య తన దగ్గర లేవని చెప్పే లోపు కాంట్రాక్టర్ గవరయ్య వద్ద నుండి అడిగి తీసుకోమని సలహా ఇస్తాడు. సుబ్బయ్య తన కంగారును దాచుకుంటూ గవరయ్యను డబ్బులు అడుగుతాడు. గవరయ్య బిల్స్ అన్ని సుబ్బయ్య దగ్గర ఉన్నందున సులభంగా పాస్ చేయించుకోవాలనే ఉద్దేశ్యంతో ఐదువందల రూపాయలు అతనికి ఇస్తాడు.

తన వంటి ఎందుకు కొరగాని మనిషి అంతటి ఘనకార్యం చేయగల్గినందుకు అతనికి చెప్పలేనంత సంతోషం కల్గింది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 44).

తన పిల్లలు చదివే భారతీ విద్యాలయం లోని స్కూల్ టీచరు మనోరమతో పరిచయం సుబ్బయ్య జీవితంలో పెద్ద మలుపు. తొలిసారిగా తనే స్వయంగా చొరవ తీసుకుని ఎదటింటి వారు మీకేమైన అవుతారా అని అడగగల్గేడు (రాచకొండ విశ్వనాధశాస్త్రి 49). ఎవరితోనైనా మాట్లాడడానికి భయపడే సుబ్బయ్య మొదటిసారి మనోరమతో చొచ్చుకు పోయే లేదా కల్పించుకుని మాట్లాడే ధైర్యాన్ని చూపాడు.

సుబ్బయ్య కాంట్రాక్టర్ గవరయ్య వద్ద నుండి లంచం తీసుకున్నాడని ఆఫీసరు ఎకౌంట్ సెక్షన్ నుండి డిస్పాచ్ సెక్షన్ కు మార్చాడు. సుబ్బయ్యకు తన బిల్స్ పాస్ చేసే అధికారం లేదని గవరయ్య తన నౌకరు పోతన్నను పంపి డబ్బులు ఇవ్వాలని బెదిరించడం సుబ్బయ్యను భయభ్రాంతులకు గురిచేసింది. వెంకట్రావు ఎంతకి డబ్బు ఇవ్వక పోగా తన ఇంటి చుట్టూ తిప్పించు కోవడం అతన్ని మానసిక వేదనకు గురిచేసింది.

పలాయనవాదంతో చనిపోవాలని, పారిపోవాలని అనుకుంటాడు సుబ్బయ్య. కాని కుదరక వంతెన గట్టుపై కూర్చొని బాధపడుతూ ఉంటాడు. సినిమా చూసి తిరిగివస్తున్న మనోరమ సుబ్బయ్యను పలకరించి అతనిపై జాలి చూపి తన బాధకు కారణం తెలుసుకున్నది. ఆమె చూపిన చొరవ మొదటిసారి అతని లోని లైంగిక వాంఛా అసంతృప్తిని దూరం చేసింది.

గవరయ్యిడుగితే సామ్మవ్వనని చెప్పెయ్యండి (రాచకొండ విశ్వనాధశాస్త్రి 105) అన్న పోతన్న సలహా తో మనోరమ సహచర్యంతో, అవధాని ఓదార్పు మాటలతో కొంత ధైర్యం తెచ్చుకున్న సుబ్బయ్య, గవరయ్య మనిషి పోతురాజు వచ్చి బెదిరించినా డబ్బులివ్వలేనని తెగేసి చెప్పి పంపించివేస్తాడు. తర్వాత మనోరమ సాంగత్యం సుబ్బయ్యను ఆత్మన్యూనత నుండి కొంత వరకు బయటపడేసింది.

కోపమొచ్చిన గవరయ్య సుబ్బయ్య పై మందితో వచ్చి దాడి చేసి ఐదువందల రూపాయలకు బదులుగా వెయ్యి రూపాయలకు ప్రోనోటు రాయించుకుంటాడు. జరిగినదంతా.. పోతన్న, వెంకట్రావు, అవధాని మనోరమ తో చెప్తాడు. సంగతంతా తెలుసుకున్న మనోరమ సుబ్బయ్య బాధ ను చూడలేక తను చిన్నప్పుడు ఎరిగిన వాడవడం చేత గవరయ్యను వెళ్ళి ప్రోనోటు ఇవ్వమని బ్రతిమిలాడుతుంది. ఆమె పై గల అభిమానంతో గవరయ్య, పోతురాజు తో ప్రోనోటు పంపించి వేస్తాడు. పోతన్న, గవరయ్య బ్లాక్ మార్కెట్ రహస్యాల్ని బయటపెడతానని బెదిరించడం, అవధాని, నోటు ఇస్తే గానీ బిల్సు పాసవ్వవని ఆఫీసరైన రామారావు చే గవరయ్యకు చెప్పించడం కూడా ప్రోనోటు సుబ్బయ్యకు పంపడానికి కారణాలు. ప్రోనోటుతో పాటు తనలోని ఆత్మన్యూనతను కూడా కాల్చి బుగ్గి చేశాడు సుబ్బయ్య.

మనోరమ సుబ్బయ్య తో ఒక ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటుంది. అది విన్న సుబ్బయ్య పరిపరి విధాలుగా ఆలోచిస్తాడు. తనకు స్నేహహస్తాన్ని అందించి, తన సర్వస్వాన్ని అర్పించి, తాను కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేసిన మనోరమకు, ఎలాంటి సహాయం చేయవలసి వస్తుందోనని భయపడిన సుబ్బయ్య తన అల్పత్వాన్ని చాటుకుని అల్పజీవి సార్ధక నామ ధేయుడయ్యాడు. కానీ చాలా సంఘర్షణల తర్వాత మనోరమ అవసరం ఏమిటో తెలుసుకొని సహాయం చేయాలని నవల చివర్లో నిర్ణయించుకుంటాడు. తన స్వార్థమే కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచించడం సుబ్బయ్య లో కలిగిన ఆత్మ విమర్శనా జ్ఞానానికి సంకేతంగా భావించడంతో నవల ముగుస్తుంది.

3. మనోరమ పాత్రచిత్రణ

రావిశాస్త్రి గారు తన అల్బజీవి నవలలో మనోరమను చైతన్యవంతమైన మహిళగా తీర్చిదిద్దారు. మనరమ పాత్రలో ఆదర్శవంతమైన భావాలతో పాటు సహజమైన బలహీనతలు కూడా కన్పిస్తాయి. ఈ లక్షణాలే పాత్రకు సజీవతను కట్టబెట్టాయి. ఆమె పాత్ర ద్వారా ఆధునిక కాలంలోని, స్త్రీ జీవితంలోని భావోద్వేగాలను, సున్నితమైన మానవ సంబంధాలను చెప్పదలిచాడు రచయిత రావిశాస్త్రి. అల్పజీవిలోని కథావస్తువు, కధానాయకుడైన సుబ్బయ్య ఆత్మన్యూనత ను జయించడం. సుబ్బయ్య జీవితంలోని బలహీనతలను అధిగమించడంలో మనోరమ కీలక పాత్ర పోషిస్తుంది.

సుబ్బయ్య మొదటి సారి మనోరమను చూసినపుడు నల్లచీర కట్టుకుని ఉంటుంది. నవల చివరలో తెల్లచీర కట్టుకుని సముద్రం ఒడ్డున కూర్చొని ఉంటుంది. నలుపు అజ్ఞానానికి, భయానికి, పిరికితనానికి ప్రతీక, తెలుపు ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. సుబ్బయ్యలో ఆత్మ విమర్శనాజ్ఞానం కలిగింది అనడానికి సూచికగా మనోరమ కట్టుకున్న చీర రంగుల్ని చిత్రించాడు రచయిత. అంటే సుబ్బయ్యలో వచ్చిన మార్పుకి కారణం మనోరమగా భావించవచ్చు.

3.1. మనోరమ ఆధునిక జీవన శైలి

మనోరమ వ్యక్తిత్వంలో ఆధునికత కన్పిస్తుంది.

ఆవిళ్ళో మోటుతనం లేదు. ఆవిడ చూపులో కరుకుతనం లేదు. ఆవిడ వంటి మీద ఆభరణాల్లేవు. ఆవిడ తన వంపుల్ని అంతగా దాచుకోవడం లేదు (రాచకొండ విశ్వనాధశాస్త్రి 47).

నడక కూడా అందంగా ఉంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 50).

పై వాక్యాల్ని పరిశీలిస్తే మనోరమ హావభావాల్లో, వేషభాషల్లోను ఆధునికత కన్పిస్తుంది. చీరకట్టులో కూడా సాంప్రదాయత కన్పించదు. చదువుకుని, ఉద్యోగం చేస్తు, తమ జీవితం తాము బ్రతికే స్త్రీలకి ప్రతినిధి మనోరమ.

చిన్న క్లాసులకి చెప్తానండి. ఈ యేడు ఫస్టుఫారం, సెకండ్ ఫారాల వాళ్ళకి ఇంగ్లీషు, హిస్టరీ చెప్పమన్నారండి (రాచకొండ విశ్వనాధశాస్త్రి 50).

మనోరమ భారతీ విద్యాలయంలో టీచరుగా పనిచేస్తుంది. ఆమె స్పష్టమైన భావప్రకటనా స్వేచ్ఛ కలిగిన స్త్రీ. జీవితాన్ని హేతుబద్ధంగా చూడాలని ప్రయత్నిస్తుంది.

3.2. సంప్రదాయాలకు తలొగ్గని వైఖరి

మనోరమ సంప్రదాయాలకు పూర్తిగా లొంగిపోదు.

పరాయి మొగవాళ్ళతో చనువుగా ఉండడానికి సందేహించే మనిషిలా ఆవిడ అగుపించదు (రాచకొండ విశ్వనాధశాస్త్రి 47).

ఎదురుగా నిల్చొని పైట సర్దుకోక పోవడంలో అభిప్రాయం ఏమిటి (రాచకొండ విశ్వనాధశాస్త్రి 47).

ఆవిడ నవ్వు చాలా సొంపుగా ఉంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 49).

వెనకి తిరిగి చూసి మందహాసం చేసింది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 50).

కళ్ళు వాల్చి చూసింది, కళ్ళు తేల్చి చూసింది. తొలగిన పైట సర్దుకుంటూ చూసింది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 51).

చెయ్యి ఊపుతుంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 74).

నన్ను చూసే సంజ్ఞ చేస్తోంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 75).

మొగవాళ్ళని ఆకర్షించడానికి స్త్రీలకి భగవంతుడు ప్రసాదించిన నేర్పంతా ప్రదర్శించిందావిడ తల ఊపడంలో (రాచకొండ విశ్వనాధశాస్త్రి 94).

అతనికి దూరంగా లేని ఆవిడ అతనికి దగ్గరగా జరిగింది. అతని చెయ్యి చేతులోకి లాక్కొంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 95).

వెనుక వైపు నీడుం మీద మెడమీద చేతులు వేసి అతన్ని దగ్గరగా లాగి గట్టిగా అదుముకొంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 99).

పై విషయాలను పరిశీలిస్తే మనోరమ చొరవ చూపి సుబ్బయ్య ను ఆకర్షించిందనడం లో సందేహం లేదు. సహజంగా స్త్రీలలో ఉండే బిడియం మనోరమలో కన్పించదు. సుబ్బయ్య అచేతనంలోని లైంగిక వాంఛా అసంతృప్తిని తన మాటల ద్వారా చేతల ద్వారా తొలగించింది. తన నిర్ణయాల విషయంలో దృఢంగా ఉంటుంది. పెళ్ళాం, పిల్లలు ఉన్నారని తెలిసి సుబ్బయ్యతో అనైతిక సంబంధాన్ని పెట్టుకుంది. స్వతంత్ర ఆలోచనల తో సామాజిక కట్టుబాట్లకు తలొంచక ప్రవర్తించే స్త్రీగా కనబడుతుంది మనోరమ.

3.3. నిస్వార్ధమైన ప్రేమ

మనోరమలో భావుకత కల్పిస్తుంది. ప్రేమ విలువైనదిగా భావిస్తుంది. మనోరమ మొదటి చూపు లోనే సుబ్బయ్యను ప్రేమిస్తుంది. ప్రేమించిన తను సిగ్గుపడి మనసులోనే దాచుకోక తన చొరవతో అతని సాంగత్యాన్ని పొందుతుంది. మొదటి పరిచయంలోని మాట కలిపి అతనిని ఆకర్షించింది.

అబ్బ! నా మాట వింటినా మీరు? ఇందాట్లానే వచ్చినప్పటికి ఎందుకలా దీనంగా ఉన్నారు? అలా అంత దీనంగా కూర్చోడం చూసి జాలేసింది స్మండి నాకు (రాచకొండ విశ్వనాధశాస్త్రి 95).

నాతో కూడా చెప్పరా అనే భావంతో అడిగిందామె. అందరి కంటే సుబ్బయ్యకి తనే దగ్గర మనిషయినట్టు (రాచకొండ విశ్వనాధశాస్త్రి 45).

మిమ్మల్ని చూస్తే నాకు నిజంగా జాలి వేస్తోందండి ఆమె కళ్ళంట వీరు జారినట్టనిపించింది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 95).

మనోరమ సుబ్బయ్య బాధలు విని జాలి పడింది. అలా ఆమె సహచర్యంతో అతని బాధలకు ఉపశమనం కలిగించాలనుకుని తన సర్వస్వాన్ని అతనికి అర్పించింది ఇది నిస్వార్థమైన ప్రేమకు తార్కాణం.

ఈవిడ ఆరితేరిన మనిషి అనుకోలేదు సుబ్బయ్య (రాచకొండ విశ్వనాధశాస్త్రి 100).

పై వాక్యాలను బట్టి మనోరమ లైంగిక వాంఛల తో సుబ్బయ్యను కోరుకోలేదు. అతనికి ప్రేమతో దగ్గరయ్యింది అని అర్ధమవుతుంది. దీనిని బట్టి మనోరమ భావప్రపంచం విశాలంగా ఉండినప్పటికి ఆమెలో ప్రేమ పట్ల సున్నితత్వం కనిపిస్తుంది.

3.4. సామాజిక దృక్పథం

మనోరమకి సామజిక స్పృహ ఉంది.

ఆయనకి జ్వరంగా ఉంటే చూసి పోదామని వచ్చాను.. అంతే (రాచకొండ విశ్వనాధశాస్త్రి 49).

ఎవరో మాస్టర్ గారు చచ్చిపోయారటండి భోగట్ట ఇప్పుడే తెలిసి బయల్దేరి వెళ్ళింది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 151).

తన తోటి పని చేసిన మాస్టారి పట్ల తనకున్న కనీస సామాజిక బాధ్యతను నిర్వర్తించింది. ఇతరుల జీవితాల పట్ల ఆసక్తి చూపే వైఖరిని ప్రదర్శిస్తుంది.

మీ అమ్మాయి గురించి చూస్తుం ఉంటాన్లెండి (రాచకొండ విశ్వనాధశాస్త్రి 50).

ఏమండీ సుబ్బయ్యగారు ఇక్కడ కూర్చున్నారేం (రాచకొండ విశ్వనాధశాస్త్రి 92).

నా పేరు సుబ్బయ్యని ఎలా తెలిసింది మీకు (రాచకొండ విశ్వనాధశాస్త్రి 93).

నాతో కూడా చెప్పరా అనే భావంతో అడిగిందామె (రాచకొండ విశ్వనాధశాస్త్రి 91).

ఈ విధంగా సుబ్బయ్య జీవితం గూర్చి అతని సంఘర్షణల గూర్చి, తెలుసుకుని అతనికి కష్టకాలంలో అండగా నిలబడింది.

3.5. ఇతరులను నొప్పించని వైఖరి

ఇతరుల పట్ల సానుభూతి గల వ్యక్తి మనోరమ.

సందు చివర్ని హోటల్లో ఎంత టైమయిందో చూపి, వస్తానుండండి అన్నాడు ఆత్రంతో. అక్కర్లేదండీ అలాగే వెళ్తున్నాన్నేను ఆవిడ కంఠం చాలా ఇంపుగా ఉంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 48).

నా వెధవ గొడవలన్నీ వెళ్ళబోసుకొని అనవసరంగా ప్రయాస బెట్టి ఈమెని అర్థరాత్రి వరకు నేనాపేస్తే కాదు నా వల్ల ఆలస్యం అయింది అంటున్నాదీమె (రాచకొండ విశ్వనాధశాస్త్రి 97).

పై వాక్యాలను బట్టి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదనుకుంటుంది. తన వల్ల సుబ్బయ్య బాధ పడ కూడదనుకున్నది.

నీరునిండిన నయనాల్లోకి ఆమె వినీల నయనాలు జాలితో చూసేయి (రాచకొండ విశ్వనాధశాస్త్రి 95).

సుబ్బయ్య కష్టాలు మనోరమను కదిలించాయి. సుబ్బయ్య ఆమెతో చనువుగా మాట్లాడాలను కుంటున్నాడని అర్థం చేసుకుని, చొరవతో సుబ్బయ్యకు దగ్గరయ్యింది. గవరయ్య తను అడిగితే నోటు ఇచ్చే అవకాశం ఉందని గ్రహించి అతనితో మాట్లాడింది గవరయ్య మనసు మార్చింది.

నోటివ్వనంటే నొచ్చుకుంటుంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 140).

గవరయ్య మనస్తత్వం అర్థం చేసుకోవడం ద్వారా సుబ్బయ్య ను సమస్య నుండి గట్టెక్కించింది.

3.6. సమస్యా పరిష్కార వైఖరి

సమస్యల నుండి పారిపోదు, ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటుంది. ఇతరుల సంక్షేమాన్ని కోరుకుంటుంది. వారి సమస్యల పరిష్కారానికి మార్గాలను వెతుకుతుంది. ఇతరుల కష్టాలను తీరుస్తుంది. గవరయ్య తనని కొట్టి ఐదువందలకి బదులుగా వెయ్యి రూపాయలకు ప్రోనోటు రాయించుకన్నాడని మనోరమ సుబ్బయ్య ద్వారా తెలుసుకుంది. తెలుసుకోవడమే ఆలస్యం గవరయ్య నుండి ప్రోనోటును తీసుకువచ్చి సుబ్బయ్యకు ఇవ్వాలని నిర్ణయించుకుంది.

గవరయ్య నన్ను బాగా ఎరిగివుండాలండి, గంగమ్మ నన్ను చూస్తే ఎంతో ముచ్చటపడేది. రేప్పొద్దున్నే వెళ్ళి సెటిల్ చేసుకువస్తానుండండి అన్నాది మనోరమ (రాచకొండ విశ్వనాధశాస్త్రి 139).

పాపం మా వూరు పిల్ల వచ్చి అడిగింది కూడానూ (రాచకొండ విశ్వనాధశాస్త్రి 140).

నోటివ్వనంటే నొచ్చుకొంటుంది. అయిదువందలూ కావలిస్తే తాను తీర్చుకుంటానంది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 140).

సరే ఏదో, ప్రాధేయపడ్డాది ... సరే అనేశాను (రాచకొండ విశ్వనాధశాస్త్రి 140).

మనోరమ గవరయ్య ను ఆ అప్పు తాను తీర్చుకుంటాదని ప్రాధేయపడి సమస్య నుండి గట్టుకు లాగింది. ఇదే వైఖరితో సుబ్బయ్యను ఆత్మన్యూతన నుండి కూడా బయటపడేయగల్గింది.

3.7. ఆశావాహ జీవన దృక్పథం

నిజాయితీ కల్గిన వ్యక్తి మనోరమ. సుబ్బయ్యను ఎప్పుడూ మోసం చెయ్యాలనుకోలేదు. ఆమె తన చుట్టూ ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తుంది. ఆత్మపరిశీలన గుణం కలది. తన లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి కృషిచేస్తుంది. మానవీయ విలువలకు ప్రాధాన్యతనిస్తుంది. కష్ట సమయాల్లో ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శిస్తుంది. అభిప్రాయాలను ధైర్యంగా చెబుతుంది. ఇతరులకు ఓదార్పు నిస్తుంది. సుబ్బయ్య మనోరమ పరిచయం తర్వాత తన ప్రతి కష్ట సమయం లోనూ మనోరమ ఓదార్పు కోరుకున్నాడు. జీవితం పట్ల ఆశావహ వైఖరితో ముందుకు సాగే ఆత్మవిశ్వాసానికి ప్రతిక మనోరమ.

3.8. ఆత్మవిశ్వాసం కల్గిన స్త్రీ

స్వతంత్ర భావాలతో, ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో ముందుకు సాగే పాత్ర మనోరమది.

ఎవరో మాస్టర్ గారు చచ్చిపోయారటండి. భోగట్ట ఇప్పుడే తెలిసి బయల్దేరి వెళ్ళింది.మీరు వస్తే గదిలో కూర్చోమని తాళం నా చేతికి ఇచ్చింది. ఇప్పుడే వచ్చేస్తుందంట (రాచకొండ విశ్వనాధశాస్త్రి 151).

ఎదురింటి మనిషి సుబ్బయ్యతో పలికిన పలుకులు. మనోరమ తనకు సుబ్బయ్యతో ఏర్పడిన సంబంధాన్ని దాచాలని అనుకోలేదు. నవల మొత్తంలో ఎక్కడ కూడా తప్పుచేశాను అన్న భావన గానీ, అబద్ధం చెప్పిన సందర్భంగాని కనిపించదు. మనోరమ ప్రతీ అడుగులో నిజాయితీ, ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. తనకు తానుగా విధించుకున్న నైతిక విలువలతో జీవనం సాగిస్తుంది. సమయపాలన పాటించే తత్వం కలిగి ఉంది.

టీచర్నయినా లేటుగా వెళ్తే బావుండదు వెళ్ళి వస్తా (రాచకొండ విశ్వనాధశాస్త్రి 50).

నన్ను చూసి నవ్వుతూ, ఎంతో ముద్దుగా నవ్వుతూ. నన్నే పలకరించింది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 75).

మగవారైనప్పటికి తెలిసినవాళ్ళను ముందుగా భేషజాలకు పోకుండా పలకరించేతత్వం మనోరమలో కన్పిస్తుంది.

3.9. భావోద్వేగ సంఘర్షణలు

మనోరమ స్త్రీ భావోద్వేగ సంఘర్షణలను అనుభవించినా వికాసం కోల్పోని వైఖరిని ప్రదర్శిస్తుంది.

వాడి మీద మనస్సుతో ఉన్నట్టుంది పాపం (రాచకొండ విశ్వనాధశాస్త్రి 140).

వాడంటే బాగా మోజుగా ఉన్నట్టుందండి (రాచకొండ విశ్వనాధశాస్త్రి 140).

అవున్రా అప్పటికీ చెప్పెను వాడికి వెళ్ళాం, పిల్లలు ఉన్నారని , చెప్పినా, విన్నాది కాదు. ఆడదాని మనసుకు తలాతోక లేదురా పోతురాజా (రాచకొండ విశ్వనాధశాస్త్రి 140).

సుబ్బయ్యను ప్రేమించింది. పెళ్ళాం, పిల్లలు ఉన్నారని తెలిసి ప్రేమించింది. చొరవతో దగ్గరయ్యింది. తనని సుబ్బయ్య మోసం చేస్తాడన్న భావం కన్పించదు. తాను వెళ్తున్న దారి తప్ప గా మనోరమ భావించదు.

నామీద అభిమానం కొద్ది అలా అంటున్నారు (రాచకొండ విశ్వనాధశాస్త్రి 99).

మనోరమా నా మీద నీకెందు కింత అభిమానం (రాచకొండ విశ్వనాధశాస్త్రి 125).

నాయెందు మీకెందు కింత అభిమానమో ముందుమీరు చెప్పండి - అని ఆవిడ నవ్వింది (రాచకొండ విశ్వనాధశాస్త్రి 126).

నాకోసం అలా తంటాలు పడుతుందా ! నా మీద అభిమానం లేకపోతే (రాచకొండ విశ్వనాధశాస్త్రి 153).

సుబ్బయ్య, మనోరమ పరస్పరానురాగంతో ఉంటారు. సంప్రదాయవాదులు మనోరమ పాత్రను విమర్శించినప్పటికి, మనోవైజ్ఞానికి సిద్దాంతాల పరంగా ఆలోచిస్తే మనరమ గొప్ప వైద్యారాలిగా సుబ్బయ్య ఆత్మన్యూనత కు మంచి మందుగా పనిచేస్తుంది. మనోరమ పాత్రలో ఎక్కువగా వైవిధ్యం కనిపించక పోయినప్పటికి లోతు కన్పిస్తుంది. అనేక సంఘటనల ద్వారా తనలో గూడుకట్టుకున్న ఆత్మన్యూనత నుండి సుబ్బయ్యను మనోరమ సహచర్యం బయట పడేయగల్గింది.

ప్రాయిడ్, మనో విశ్లేషణ సిద్ధాంతపరంగా చూస్తే చిన్నతనం నుండి అచేతనంలో అణచివేయబడ్డ లైంగికవాంఛలే ఆత్మన్యూనతకు కారణంగా భాवించవచ్చు. సుబ్బయ్య భార్య సావిత్రి జమిందారి కుటుంబంలో జన్మించడం, పెరగడం వల్ల ఆ హోదాను అలాగే వివాహమయ్యాక కూడా కొనసాగించింది. తక్కువ జీతం ఉన్న సుబ్బయ్యను గౌరవించలేదు. అతనికి భర్తగా తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు సంసారిక జీవితంలో భర్తకు సంతోషాన్ని కల్గించలేదు. కనుక సుబ్బయ్య లౌకిక, మానసిక కోరికలను అభిప్రాయాలను వెలిబుచ్చే స్థితిగాని అవకాశం గానీ లేకపోవడం ఒక ఎత్తయితే వివాహజీవితంలోని అనుభూతిని పొందడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. అందుకే సుబ్బయ్య నిగూఢంగా ఉన్న కోరికలు అలానే ఉండిపోయాయి. ఈ పరిస్థితుల నుండి సుబ్బయ్యను బయటపడేయడానికి రచయిత ఎన్నుకున్న సాధనమే మనోరమ. కాబట్టి మనోమ అల్పజీని నవలలో కీలకపాత్ర మరియు చైతన్యవంతమైన పాత్ర.

ఉపసంహారం

అల్పజీవి నవలా కథాగమనాన్ని కీలక సందర్భాలలో ప్రభావితం చేసే పాత్ర మనోరమ అని మనకు అర్ధమవుతుంది. రచయిత కూడా మనోరమ పాత్రతో మమేకమై పోతాడు. ఎలాగంటే ఆఖంమాటలో "ఈ నవల చివరి భాగాలు రాస్తున్నపుడు నాయ సుబ్బయ్యంటే అసహ్యం వేసింది. గవరయ్య చెప్పినట్టు, వాడు దొంగ వెధవనే నమ్మకంతో ఉండిపోయను" (రాచకొండ విశ్వనాధశాస్త్రి 162) అంటాడు. భారతి పత్రికలో ఈ నవల ప్రచురించబడినపుడు సుబ్బయ్య మనోరమ వైపు నడవడు. ఈ సందర్భంలో సంఘర్షణకి లోనైనా రచయిత రావిశాస్త్రి గారు మనోరమ పక్షం వహిస్తారు. ఆ సంఘర్షణ వల్ల "పత్రిక లోంచి పుస్తకం లోనికి వచ్చినపుడు సుబ్బయ్యకి ఆత్మ విమర్శనాజ్ఞానం కలిగింది. తన దుస్థితిని, దుర్భుద్ధిని కొంతగా గుర్తుంచుకుని మంచి మార్గాన వెళ్లేవాళ్ళా కనిపిస్తాడు. నవల చివర్న" (రాచకొండ విశ్వనాధశాస్త్రి 163) అంటే రావి శాస్త్రి గారు మనోరమ పక్షాన వకాల్తా పుచ్చుకొని సుబ్బయ్యను మనోరమ వైపు నడిపించాడు.

  • స్వతంత్రభావాలు, స్వయం నిర్ణయాధికారం కలిగిన స్త్రీ మనస్తత్వానికి ప్రతీకగా మనోరమ నిలుస్తుంది.
  • ఆధునిక జీవనశైలికి, స్పష్టమైన భావప్రకటనా వైఖరి కి తార్కాణంగా కనిపిస్తుంది.
  • సాంప్రదాయాలను లొంగని భావజాలానికి నిదర్శనంగా రూపుదిద్దుకుంది.
  • ఎదుటి వారి కష్టాలకు స్పందిస్తూ కన్నీటి చుక్కలా ఆదుకుంటుంది.
  • సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం చేసే చుక్కానిలా నిలుస్తుంది.

ఈ విధంగా అల్పజీవి నవలలో మనోరమ స్త్రీ భావోదేగాల్ని ప్రతిబింబించే నిస్వార్ధమైన పాత్రగా దర్శనమిస్తుంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. విశ్వనాథశాస్త్రి రాచకొండ - 2022 - అల్పజీవి-నవోదయ బుక్ హౌస్, హైదరాబాద్
  2. శ్రీ కృష్ణ తాటి - 1997-రావిశాస్త్రినవలానుశీలనం. బసవపూర్ణ పబ్లికేషన్స్ విజయవాడ
  3. వెంకట సబ్బయ్య వల్లంపాటి - 2021 - నవలాశిల్పం, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
  4. శ్రీ రామమూర్తి కోడూరి - 2020 - తెలుగు నవలా సాహిత్యంలో మనోవిశ్లేషణ,గీతాంజలి ప్రచురణలు. విజయవాడ.
  5. రమాపతిరావు అక్కిరాజు - 1975- తెలుగు నవల-ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ-హైదరాబాద్
  6. వెంకటేశ్వరరెడ్డి అన్నపరెడ్డి, 2014- ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం,పల్లవి పబ్లికేషన్స్, విజయవాడ

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal