AUCHITHYAM | Volume-07 | Issue-9 | August 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
2. పాలమూరు వలసకథలు: స్త్రీ జీవన చిత్రణ
ఎల్లముల మానస
పరిశోధకురాలు, తెలుగు శాఖ
హైదరాబాద్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
సెల్: +91 9390965210, Email: manasaellamula2003@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 05.07.2026 ఎంపిక (D.O.A): 28.07.2026 ప్రచురణ (D.O.P): 01.08.2026
వ్యాససంగ్రహం:
గీతాంజలి (డా. భారతి) రాసిన పాలమూరు వలస కథలు స్త్రీలు వారి నిత్యజీవితంలో అనుభవిస్తున్న జీవన సంఘర్షణలను, సామాజిక వాస్తవాలను ఆవిష్కరిస్తాయి. ఈ పాలమూరు వలస కథల గురించి ఎన్. సుభాషిణి గారు తన సిద్ధాంత గ్రంథం “గీతాంజలి సాహిత్యం- సమగ్ర పరిశీలన”లో ప్రస్తావించారు. ఈ సిద్ధాంతవ్యాసంలో కథా శిల్పం, కథల విశ్లేషణ గురించి చెప్పారు. అలాగే మదిరాజ్ నరేష్ గారు “పాలమూరు వలస కథలు సామాజికాంశాలు” అనే పరిశోధన వ్యాసంలో వివిధ సామాజిక సమస్యలను తెలియజేశారు. ప్రస్తుత వ్యాసం పాలమూరు వలస కథల్లో స్త్రీల సమస్యలను కేంద్రంగా చేసుకొని, స్త్రీలు ఎదుర్కొన్న లైంగిక దోపిడి, స్త్రీల అణచివేత, వరకట్న వేధింపులు, ఆకలి బాధలు, చిన్న పిల్లల పై జరిగిన అత్యాచారాలు వంటి స్త్రీల సమస్యలను విశ్లేషించడం ప్రధాన లక్ష్యం. వలస అనేది కేవలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం మాత్రమే కాదు. అది జీవితాల విధ్వంసం, ముఖ్యంగా స్త్రీల బతుకులలో నింపే దుఃఖవేదన, పాలమూరు ప్రాంతపు కరువు కోరల్లో చిక్కుకుని బతుకుతెరువు కోసం కిలోమీటర్ల కొద్దీ సాగే వలస బాటలో స్త్రీల జీవనచిత్రం అత్యంత విషాదకరమైనది. స్త్రీల మానసిక వేదనను, కాంట్రాక్టర్లు, మేస్త్రీల చేతిలో లైంగిక, శారీరక వేధింపులకు గురయ్యే మహిళల అభాగ్య జీవితాలను,పేదరిక కోరల్లో చిక్కుకొని వరకట్న వేధింపులకు గురైన స్త్రీల గాధలను, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి రచయిత్రి పాలమూరు వలస కథల్లో తెలియజేసిన తీరును వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ అధ్యయనం రచయిత్రి సామాజిక స్పందనను, ఆమె స్త్రీవాద దృక్పథాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.
Keywords: స్త్రీ జీవన చిత్రణ, లైంగిక వేధింపులు, వరకట్నం, అత్యాచారాలు, మేస్త్రీలు, కాంట్రాక్టర్లు.
1. ప్రవేశిక
వేదాలలో, మనుస్మృతిలో, భారత రామాయణాల్లో స్త్రీకి విశిష్టమైన స్థానం ఉంది. నాలుగు వేదాలలోని మంత్రాలలో స్త్రీల గొప్పతనాన్ని తెలియజేస్తూ వారిని గౌరవంగా చూడాలని పురుషులకి నిర్దేశించాయి. మనుధర్మశాస్త్రంలో "యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః యత్రైతాస్తు న పూజ్యంతే సర్వాస్తత్రాఫలా: క్రియా:" అనే శ్లోకం స్త్రీల విశిష్టతను తెలియజేస్తుంది. మనం స్త్రీలను గౌరవించడం అంటే కేవలం వారికి నమస్కరించడం మాత్రమే కాదు. వారి ఆలోచనలను, అభిప్రాయాలను, వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. నాటి నుండి నేటి వరకు స్త్రీలు ఎదుర్కొనే సమస్యలలో మార్పు వచ్చింది కానీ, వారి సమస్యలు మారలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా స్త్రీలు కొత్త కోణంలో సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. పాలమూరు వలస కథల్లో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్నవే అని మనకు కళ్ళకు కట్టినట్లుగా రచయిత్రి తెలియజెప్పే ప్రయత్నం చేశారు. గీతాంజలి గారు రాసిన ఈ పాలమూరు వలస కథలు రెండు భాగాలుగా ప్రచురితమయ్యాయి. మొదటి భాగం ఉయ్యాల ఇందులో 8 కథలు (ఎండి గజ్జెలు, పాలమూరు నుంచి కాశ్మీర్ దాకా, కృష్ణమ్మ, నేను పోలేపల్లి పీనుగని మాట్లాడుతున్న!, చావు, ఉయ్యాల, ప్లాట్ఫార్మ్ నంబర్ 34, అబ్బా నేను రషీదాని...) రెండవ భాగం ఆఖరి వడ్లగింజలు ఇందులో 2 కథలు (ఆఖరి వడ్లగింజలు, గొర్లు) ఉన్నాయి. ఈ కథలకి ప్రాణవాయువుగా ఉన్న పాలమూరు స్త్రీల జీవితాన్ని విశ్లేషించే ప్రయత్నమే ఈ వ్యాసం.
2. బాలికలపై అత్యాచారాలు
భారతీయ సాహిత్యం ఆది నుంచి స్త్రీని శక్తికి, మాతృత్వానికి, కరుణకు ప్రతీకగా చిత్రించింది. స్త్రీ గౌరవాన్ని సంస్కృతికి ప్రాణంగా భావించిన నేలలోనే నేడు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు మన సమాజపు విలువలకు మచ్చలుగా దర్శనమిస్తున్నాయి. పాలమూరు వలస కథలలో కూడా అనేక పాత్రల్లో అమ్మాయిలపై అడుగడుగునా అత్యాచార సంఘటనలు ఎదురవుతుంటాయి. వీటిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే బాలికలపై అత్యాచారాలు జరగడానికి ముఖ్య కారణం వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులే. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వ ఉదాసీనత, చెరువులు ఎండిపోయి పంటలు పండక, దొరల దగ్గర చేసిన అప్పులు తీర్చలేక కాంట్రాక్టర్లు, మేస్త్రీల దగ్గర ఏడాదిదాకా పని చేస్తామని అడ్వాన్సులు తీసుకొని, చివరికి మోసపోయామని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితులలో పని చేస్తూ పెద్ద పెద్ద అంతస్థుల నుండి కిందపడి చనిపోయారు. ఇంటి పెద్దదిక్కు చనిపోయాక ఇల్లు గడవటానికి చేసిన అప్పులు తీర్చడానికి చిన్న పిల్లలను బడిమాన్పించి పనికి పంపిస్తే అక్కడి దొరలు, దొరల కొడుకులు అత్యాచారాలు చేసిన ఘటనలు కనిపిస్తాయి.
ఎండి గజ్జెలు కథలో 12 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారాన్ని గురించి రచయిత్రి తెలియజేసింది. మంగకు 12 సంవత్సరాలు, ఆ వయసులోనే వాళ్ళ నాన్న కాలం చేసిండు. మంగవాళ్ళ అమ్మ పేరు భాగ్యమ్మ. వాళ్ళ అక్క అపర్ణ. భూమి అమ్మి, కొంత అప్పు చేసి అపర్ణ పెళ్లి చేశారు. కానీ పెళ్లి తర్వాత అల్లుడు కట్నం కోసం వేధించి అపర్ణని చంపేసాడు. కళ్ళ ముందే తన కూతురు చనిపోయిందన్న బాధతో మంగ వాళ్ళ తండ్రి గుండె నొప్పితో మరణించాడు. తండ్రి పోయిన తర్వాత పేదరికం కారణంగా భాగ్యమ్మ తన కూతురు మంగను పూల దుకాణంలో పనిలో పెట్టింది. ఆ పూల దుకాణం ఓనరు అయిన వేణు సేటు మంగపై అత్యాచారం చేసి కడుపు చేశాడు (గీతాంజలి 56).
ఇడు సేటూ అన్నది మంగ సన్నగ ఒణుక్కుంటు, యాబై రూపాయలు గట్టిగ పట్కోని.చ్చె నెల నీకు ఎండిగజ్జెలు కొంటనె అన్కుంట సేటు మంగ ఒల్లంత తడుముతున్నడు. మంగ గిజగిజలాడిన గని ఇడ్వలె తనకెయ్యి గట్టిగ అద్ముకున్నడు (గీతాంజలి 56).
మంగకి ఎండి గజ్జెలు అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న బాగా చదువుకుంటే వెండి గజ్జెలుకొనిస్తానని చెప్పేటోడు. పనిచేసెదగ్గర వేణు సేటు మంగకి గాజులు కమ్మలు, క్లిప్పుల ఆశ పుట్టించి ఒక రోజు వెండి గజ్జెలు ఇస్తానని తన మిద్దెలకి రమ్మని అత్యాచారం చేశాడు. మంగపై అత్యాచారం జరగడానికి కారణం ఎండి గజ్జెల ఆశచూపిస్తూ పెంచిన వాళ్ల నాన్నదా? లేక అప్పులు తీర్చలేక మంగను పనిలో పెట్టిన వాళ్ళ అమ్మదా? ఏది ఏమైనా లంగా ధరించి, గజ్జెలుపెట్టుకొని, ఘల్లు ఘల్లున సవ్వడి చేస్తూ సాగిపోవాలనే ఏ చిన్నారిలోనైనా ఉండే ముద్దుల ఆశ మంగది. ఆ స్వల్ప కోరికను కూడా నెరవేర్చలేకపోయిన ఆ తల్లి పేదరికం, దైన్యస్థితి 'ఎండి గజ్జెలు'లో మన కళ్లముందు సాక్షాత్కరించింది రచయిత్రి.
చావు కథలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న పుష్ప కుటుంబ దైన్యస్థితిని రచయిత్రి కళ్లకు కట్టినట్లు మన ముందుంచారు. రెక్కాడితే గానీ డొక్కాడని రోజులవి. ఎల్లమ్మ భర్త పెంటయ్య. కూతురి పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి దేశం పోయి గుండె పోటుతో మరణించాడు. ఊర్లో పని దొరకక ఎల్లమ్మ తన కుటుంబంతో (కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, మనుమడు, మనుమరాలు) మహారాష్ట్రకి వలస వెళ్తున్న క్రమంలో టిప్పర్ బోర్లపడి ఎల్లమ్మ కుటుంబమంతా మరణించారు. అదృష్టం కొద్ది వేరే టిప్పర్లో ఉండటంవల్ల ఎల్లమ్మ, తన మనుమరాలు పుష్ప బతికారు. అప్పు తీరినా కూడా పుష్పపెళ్లి కోసం ఎల్లమ్మ ఇంకా పనిచేస్తూనే ఉంది. పుష్పతో కూడా చేపిస్తుంది. పని చేసెదగ్గర చిన్నమేస్త్రి విజయ్ రెడ్డి కన్ను 16 ఏండ్ల పుష్ప మీద పడ్డది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భం చేశాడు.
వద్దు, కొట్టాకు మేస్త్రీ వదులు నేను వోత నీ కాల్మొక్త అవా అని ఏడుస్తున్నగని, వినలే ఆ రాచ్చెసుడు. పిడికిల్ల తోని ఆమె పొత్తి కడుపుల గుద్దుతనే ఉండు. గంట దాంక గట్ల రాక్షసకాండ సాగిస్తనే ఉండు (గీతాంజలి 117).
పుష్పని మోసం చేసింది విజయ్ మేస్త్రి అని తెలుసుకున్న ఎల్లమ్మ అక్కడికి వెళ్ళి మేస్త్రి కాళ్ళ మీద పడి పుష్ప జీవితం ఆగం చేయకుమని బ్రతిమిలాడింది. ఎల్లమ్మ తన స్నేహితుల ముందు పరువు తీసిందనే కారణంతో పుష్పని తన కమ్రకి (రూం) పిలుచుకొని, తాగిన మత్తులో తోడేలు తీరు పుష్ప మీద పడి కొడుతూ చంపేశాడు. నేటి సమాజంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. వలస కూలీలు మేస్త్రీల చేతుల్లో అత్యాచారానికి గురికావడమే కాకుండా వారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారనడానికి ఈ కథ అద్దం పడుతుంది. ఇలా భవిష్యత్తును చూడకుండానే ఎంతో మంది అమాయకమైన బాలికల జీవితాలు అర్ధాంతరంగా నలిగిపోతున్నాయని ఈ చావు కథ ద్వారా రచయిత్రి తెలియజేసే ప్రయత్నం చేశారు.
అబ్బా నేను రషీదాని… కథలో అరబ్ దేశంలో గఫర్ ఖాన్ దగ్గర మోసపోయి తిరిగి ఇంటికి వచ్చిన రషీదా దుర్భర జీవితాన్ని గమనించినట్లయితే… రహ్మతుల్లా అనే బ్రోకర్ రషీదాని అరబ్ దేశంలో గఫర్ ఖాన్ కి మూడు సంవత్సరాలు కాంట్రాక్టు పెళ్లి చేసుకున్నట్టు సంతకాలు పెట్టించి అమ్మేశాడు. మునావర్, నదియాబేగంలకు ఐదుగురు పిల్లలు. పెద్ద కూతురు రషీదా. ఈమెని 8 వరకు చదివిపించి ఇల్లు గడవక పనిలో చేర్పించారు. కొడుకు అర్బజ్ తొమ్మిదవ తరగతి, 2వ కూతురు నస్రీన్ పదవతరగతి చదువుతున్నారు. ఇంకా ఇద్దరు చిన్న పిల్లలు. నస్రీన్, అర్బజ్ తనలాగ కాకూడదని ఆలోచించి అరబ్ దేశంలో జీతం ఎక్కువ వస్తుందని వెళ్ళి గఫర్ ఖాన్ దగ్గర మోసపోయి డెబ్బై ఏండ్ల ఎల్లమ్మ సహాయంతో ఇంటికి వస్తుంది.
ఎల్లమ్మ ఒక రైతు. కల్తీ విత్తనాల వల్ల వ్యవసాయంలో బాగా నష్టపోయింది. వ్యవసాయంలో చేసిన అప్పులు తీర్చడానికి కొడుకుకోడళ్లతో బొంబాయ్ కి వలస వెళ్లారు. ఒకరోజు టిప్పర్ లోడ్ ఎక్కువ కావడంతో బోర్లపడి చాలా మంది కూలీలు చనిపోయారు. అందులో ఎల్లమ్మ కొడుకు కోడలు కూడా ఉన్నారు. అప్పటి నుంచి దేశం కాని దేశంలో భాష రాక అనాధలా బతుకుతున్న ఎల్లమ్మకు గర్భంతో ఉన్న రషీదా తోడవుతుంది. రషీదాని చూసిన తల్లిదండ్రులు ఆమెను బిచ్చేగత్తే అనుకొని గుర్తుపట్టరు "అబ్బా నేను రషీదాని" అంటుంది. దిక్కులేని స్థితిలో తమ బిడ్డని చూసిన ఆ తల్లిదండ్రుల వేదన అంతా ఇంతా కాదు. తన తమ్ముడు బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు ఆర్ధికంగా సహాయపడాలని పనికోసం కుటుంబాన్ని వదిలి వెళ్తున్న రషీదాలాంటి ఎంతో మంది పాలమూరు స్త్రీల జీవితాలను సజీవంగా రచయిత్రి చిత్రించారు.
2.2 వరకట్న వేధింపులు
స్త్రీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే అనేక అంశాల్లో వరకట్నం ఒకటి. ఈ కాలంలో వరకట్నం అనేది ఆడపిల్లల పుట్టుకకు ఒక సవాలుగా మారింది. నవజాత శిశువు పుట్టే ముందే గర్భంలో ఉన్నది ఆడ శిశువా? మగ శిశువా? అనే పరీక్షించే రోజులివి. ఆడపిల్ల పుట్టినప్పటినుంచి తన మరణం వరకు నిరంతరం నిప్పుల కుంపటిలా మండే అనేక సమస్యల మధ్య తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అమ్మాయి పుట్టగానే కట్నం ఎక్కడ పెరుగుతుందేమోనన్న భయంతో తల్లిదండ్రులు పిల్లలకి బాల్యంలోనే వివాహం చేసే ఆలోచనలో పడుతున్నారు. ఆడపిల్లలు పెళ్లితర్వాత కూడా అదనపు కట్నం అనే ఉచ్చులో బంధింపబడి, తమ భర్త, అత్తమామల చేతిలో శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు.
వీటన్నిటికి కారణం స్త్రీలకు విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం లేకపోవడమే. ఎందుకంటే స్త్రీలు చదువుకొని ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడితే ఏ స్త్రీ కూడా తమ భర్త చేతిలో శారీరక, మానసిక వేధింపులకు గురికాదు. ఎండి గజ్జెలు కథలో భాగ్యమ్మకు ఉన్న రెండు ఎకరాలు అమ్మి పెద్ద బిడ్డ అపర్ణ పెళ్లి చేసింది. అయినా కూడా ధన దాహం తీరని అల్లుడు ఒక ప్లాట్, కలర్ టీ.వీ కావాలని బిడ్డని రోజు కొడుతూ..., సిగరెట్లతోని కాల్చేవాడు.
పిల్ల ఎర్రగున్నదని చేస్కుని మోసపోయిన గిప్పుడు, నాకు ఇంకిన్ని దుడ్లు గావల్ల తీస్కరా పో... ల్యాక పోతే యారె మనువు జేస్కుంట (గీతాంజలి 50).
అపర్ణకి పెళ్లి సమయంలో కట్నం పైసలకిందా ముప్ఫై వేల కట్నం, రెండు తులాల బంగారం, ఒక లూన బండి, బాసన్లు, బీరువా వంటి ఇంటి సామాను ఇచ్చారు. పెండ్లిగూడ వాళ్లకు ఉన్న రెండు ఎకరాల భూమిని అమ్మి చేశారు. కానీ కట్నం సరిపోలేదని అదనపు కట్నం కోసం అపర్ణని చిత్రహింసలు పెడుతూ, వేరే పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తూ చివరికి చంపేసాడు. కళ్ళముందే తమ పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. అప్పుచేసిమరి కన్న బిడ్డని చంపుకున్న భాగ్యమ్మ లాంటి ఎన్నో జీవితాలు నేటికి కనిపిస్తున్నాయి. ఇవన్నీ తగ్గాలంటే ప్రతి స్త్రీ చదువుకోవాలని, ఆర్థికంగా అటు తల్లిదండ్రుల పై ఇటు భర్త పై ఆధారపడకుండా బలంగా ఉండాలని గీతాంజలి గారు మార్గ నిర్దేశం చేస్తున్నారు.
ఉయ్యాల కథలో పరిమళ తన బిడ్డ పేరుమీద ఒక ఎకరం భూమి రాసి లగ్గం చేసింది. సెజ్ లు, గ్రీన్ పార్కుల పేరుతో ప్రభుత్వం పాలమూరులో ఎంతో మంది రైతుల భూములను లాక్కుంది. దాంట్లో పరిమళ తన కూతురికి ఇచ్చిన భూమి కూడా ఉంది. దాంతో అల్లుడు నువ్వు తెచ్చిన భూమే లేనప్పుడు నువ్వెందుకని కడుపుతో ఉన్న బిడ్డని పుట్టింట్ల వదిలేసి పోయిండు. భూమి ఇస్తనే బిడ్డని తీసుకెళ్తానని చెప్పిండు. భూమి పోయిందన్న బాధతో పరిమళ భర్త పురుగుల మందు తాగి చనిపోయాడు. భర్త చనిపోయాక ఒకపూట తిండి కూడా కరువైన పరిమళ తన కూతురికి తిరిగి కట్నం ఇవ్వలేని దయనీయమైన పరిస్థితి రచయిత్రి మన కళ్ళముందుంచారు. పెళ్లైన బిడ్డను అత్తారింటికి పంపలేని పరిమళలాంటి ఎన్నో జీవితాలు మన దేశంలో ఇంకా ఉన్నాయి. చట్టాలు మాత్రమే వస్తే సరిపోదు వాటిని సక్రమంగా అమలుచేసే ప్రభుత్వాలు కూడా ఉండాలి. అప్పుడే ప్రజలలో మార్పు వస్తుంది.
2.3 పేదరికం - స్త్రీల పై ప్రభావం
మనదేశంలో పేదరికం అనేది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్యలతో అల్లుకున్న ఒక చిక్కుముడిలాంటిది. ఒక కుటుంబం పేదరికంలో కూరుకుపోయినప్పుడు ముఖ్యంగా దాని ప్రభావం ఆ కుటుంబ స్త్రీలపైనే ఎక్కువగా పడుతుంది. దీనికి కారణం లింగ వివక్షత, విద్యఉద్యోగాలు లేకపోవడం, ఆర్థిక కారణాలు మొదలైన వాటిని ఇలా ఎన్నింటినో చెప్పవచ్చు. ఈ విధంగా గమనించినట్లయితే స్త్రీలపై పేదరిక ప్రభావం పాలమూరు వలస కథల్లో అడుగడుగునా కనిపిస్తుంది. స్త్రీలపై జరుగుతున్న లైంగిక హింస, దేశం కాని దేశంలో చనిపోయి తిరిగి పీనుగులై రావడం, ఆకలి తట్టుకోలేక ఒకపూట గంజి మరోపూట ఆకులు ఉడకపెట్టుకొని తినడం, కూలీల కనీస అవసరాలు తీర్చలేని మేస్త్రిల మనస్తత్వాలను, కన్న కూతుర్లను జోగినిగా మార్చడం, పక్కవారి దగ్గర ఉన్న వస్తువులు తమ దగ్గర లేవనే బాధలో ఆశకు పోయి అత్యాచారానికి గురైన బాలికలు, వలస పోయిన దగ్గర భాష రాక కడుపు చూపిస్తూ ఆకలేస్తుందని బిచ్చం అడుక్కున్న దుర్భర జీవితాన్ని, ఆడపిల్లల్ని అమ్ముకోవలసిన పరిస్థితులు, ఎయిడ్స్ వచ్చి కుటుంబానికి దూరంగా ఉన్న సంఘటనలు వంటివి ఎన్నో ఈ కథల్లో చోటు చేసుకున్నాయి.
కృష్ణమ్మ కథలో పేదరికాన్ని జయించలేక బడి మానేసి పని బాట పట్టి తల్లిదండ్రులతో పాటు బొంబాయికి వలస వెళ్ళి తిరిగి శవమై ఇంటికి వస్తుంది. సాలయ్య చంద్రమ్మలకు ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ కృష్ణమ్మ. ఉన్న ఊర్లో అప్పులెక్కువై ఇల్లు గడవక కుటుంబమంతా వలస వెళ్లారు. పనిచేసెదగ్గర మేస్త్రి ఎక్కువ సమయం పనిచేపించుకోవడం, తిండి సరిగా పెట్టకపోవడం, దెబ్బలు తగిలిన మందులు ఇయ్యకపోవడం, చెప్పిన టైమ్ కి వెళ్లకుంటే ఒక పూట బువ్వ పెట్టకపోవడం వంటి బాధలు పెట్టేవాడు. ఒక రోజు బుడ్డది పాల కోసం ఏడుస్తుందని కృష్ణమ్మ తల్లికోసం మెట్లెక్కుతూ అమ్మా రావే చెల్లె ఏడుస్తుంది అంటూ కిందపడి చనిపోయింది. ఇలా పేదరికం వల్ల బతుకు కోసం వెళ్ళి బతుకు చెడిపోయిన కృష్ణమ్మ లాంటి ఎన్నో జీవితాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నమే ఈ కథ.
పాలమూరు నుంచి కాశ్మీర్ దాకా కథలో వలస పోయిన యాదమ్మ కుటుంబం కాశ్మీర్లో చలికి తట్టుకోలేక పారిపోయిన పరిస్థితిని రచయిత్రి మన కళ్ళ ముందు సజీవంగా చిత్రించారు.
ఆకలే... ఆకలైతాందే... పో లంజె, పోయి ఎవల్తానన్న పండి పైసలు దీస్కరా... ల్యాక పోతే... ఇగో గీ గోదావరిని అమ్మి పైసలు దీస్క రావె లంజెదాన (గీతాంజలి 68).
యాదమ్మ కొడుకు లక్ష్మయ్య, కోడలు గౌరమ్మ, మనుమరాలు గోదావరి. కాశ్మీర్ నుంచి పారిపోయి డిల్లీ రైల్వే స్టేషన్ చేరారు. యాదమ్మ ఆకలికి ఆగలేక చెత్త బుట్టలన్నీ వెతుకుతూ డబర్ రోటి సంపాదించి మనుమరాలు గోదావరికి ఇయ్యకుండనే తిన్నది. అయినా కూడా యాదమ్మ ఆకలి తీరక, ముఖం పీక్కపోయిన గోదావరిని ఎవరికైనా అమ్మి పైసల్ తెమ్మని ఒక పక్క కోడలిని తిడుతూ… ఇంకో వైపు ఆకలి ఆకలి అని అడుక్కుంటున్న సన్నివేశాలను, తిండి కోసం పిల్లల్ని అమ్ముకునే వారి పేదరికాన్ని రచయిత్రి పాఠకుల ముందుంచారు.
ఉయ్యాల కథలో అనసూయ తండ్రి వలస వెళ్లిన దగ్గర పనిచేస్తూ 7 అంతస్థుల బిల్డింగ్ మీద నుండి కింద పడి కాలు పోగొట్టుకున్న సమయంలో పనిచేసి పైసలు సంపాదించే దిక్కు లేక ఇల్లు గడవడానికి కన్న కూతురినే జోగినిగా మార్చిన ఆ తల్లిదండ్రుల దీనస్థితి ఈ కథలో కనిపిస్తుంది. పాలమూరు లేబర్ వలస పోని దేశంలేదు, కట్టని బిల్డింగ్ లేదంటూ పాలమూరు వలస కథలు ముందుమాటలో వరవరరావు గారు అన్న మాటలు అక్షరసత్యాలు.
పెద్ద పెద్ద భవన నిర్మాణాలకు పోయినవాళ్లు. భాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి శ్రీశైలం దాకా భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు ఏవీ పాలమూరు లేబర్ లేకుండా వెలసిన 'ఆధునిక దేవాలయాలు' కావు (గీతాంజలి 7).
ఇలా పెద్దపెద్ద అంతస్థుల నుంచి జారిపడి కాలు చేతులు విరగొట్టుకోవడం ప్రాణాలను కోల్పోవడం వల్ల ఎంతోమంది స్త్రీలు తమ జీవితాన్ని ఒంటెద్దు బండి లాగా ముందుకి లాగుతున్నారు. అనసూయ కూడా తండ్రి కాలు విరగడంతో తమ తల్లికి ఆర్థికంగా సహాయపడాలని కుటుంబ బంధువులు తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయానికి తలవంచక తప్పలే. అప్పటి నుండి ఇంటికి వచ్చిన వారి లైంగిక కోరికలు తీరుస్తూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతుంది. తోటి స్నేహితులతో బడికి పోవాల్సిన అనసూయను తమ తల్లిదండ్రులే పురుషుల దాహానికి అప్పగించిన నిస్సహాయతను ఈ కథ తెలియజేస్తుంది.
2.4 మహిళలపై లైంగిక వేధింపులు
ఈ సమాజంలో స్త్రీలు ఎన్ని రకాలుగా ఎదిగినా, ఎన్ని విజయాలు సాధించిన ఇంకా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు ముగిసిపోలేదు. అందులో ప్రధానంగా స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యగా లైంగిక వేధింపులను గురించి బలంగా నొక్కి చెప్పవచ్చు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా స్త్రీలు ఎన్నో రకాల లైంగిక వేధింపులను, అవమానాలను నేటి సమాజంలో ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. చాలా వరకు ఈ లైంగిక వేధింపులు స్త్రీల ఆత్మ గౌరవాన్ని, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయని చెప్పవచ్చు.
కృష్ణమ్మ కథలో చంద్రమ్మ తన బిడ్డకు పాలిచ్చే హక్కును కూడా దోచుకున్న మేస్రీల దౌర్జన్యాలను తెలియజేస్తుంది.
జర్ర పాలిచ్చి వస్త మేస్త్రీ అని యాడుస్త కాల్లమింద బడై (గీతాంజలి 60).
అన్ని పాలు వస్తున్నాయానే నీకు, ఫో, ఫో రెండు నిమిషాల్లో రావాలి అన్కుంట తన రొమ్ముల మీనకు చొంగ సూపులు సూస్కుంట ఒదిలిండు (గీతాంజలి 60).
పనిచేసే దగ్గర స్త్రీలు తమ ఆత్మగౌరవాన్ని చంపుకొని తమ పిల్లల కోసం ఎన్నో రకాల ఇబ్బందలను ఎదుర్కొంటున్న సంఘటనలు నేటికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఆఖరి వడ్లగింజలు కథలో కాంట్రాక్టర్లు రైతుల భూములను బలవంతంగా లాక్కొని పెద్ద పెద్ద కంపెనీలు కట్టించి, రైతులు కూలీలుగా మారిన సంఘటనలు ఈ కథలో చోటు చేసుకున్నాయి. కంపెనీలో పని చేస్తున్న లక్ష్మీని అక్కడి సూపర్వైజర్ సత్తెనారాయణ "నువ్వు మూత్రానికే వోయినవని నమ్మకమేంది. మూత్రం వోసిన గా జాగ యాడుందో సూపియ్యి" అంటూ వేధించిన ఏమిచేయలేని తన భర్త లక్ష్మయ్య దీన స్థితి మనకి కనిపిస్తుంది.
గొర్లు కథలో పాలమూరు నుండి బొంబాయికి వలస వెళ్లిన కూలీల పై మేస్త్రీలు చేసే అరాచకాలను ఈ కథ తెలియజేస్తుంది. స్త్రీలను ఎక్కడ అంటే అక్కడ ముట్టుకోవడం, ఒకటికి, రెంటికీ మేస్త్రి నడిగి పోవడం, వెళ్ళి తొందర రాకుంటే కర్ర చప్పుడు చేస్తూ అటు వైపు పోవడం, వంటి ఎన్నో లైంగిక వేధింపులకు గురైన స్త్రీల జీవితాలు పాఠకుల హృదయాన్ని కదిలిస్తాయి. స్త్రీల పై లైంగిక వేధింపులు జరగకుండా ఉండాలంటే కేవలం చట్టాలు రావడం మాత్రమే కాదు, దానితో పాటు ఈ సమాజం స్త్రీలపై గౌరవంగా ఉంటూ బాధ్యతగా నడుచుకోవాలి. వారి సమస్యలపై సానుభూతితో ఉండాలి.
ఉపసంహారం
- పాలమూరు వలస కథల్లో స్త్రీల సాధకబాధకాలను స్వయంగా తెలుసుకొని, అనుభూతి చెంది వారి భాషలోనే (మహబూబ్ నగర్ మాండలికం) రాయడం ఈ కథల ప్రత్యేకత.
- ఈ కథలు అక్కడి స్త్రీల జీవిత సంఘర్షణలకు అద్దం పడుతున్నాయి.
- బాలికల పై అత్యాచారాలు, వరకట్న వేధింపులు, స్త్రీల పై చూపిన పేదరిక ప్రభావం, లైంగిక వేధింపులు, ఆకలి, కన్న బిడ్డలని జోగినిలుగా మార్చడం, అమ్ముకోవడం వంటి దుర్భర సంఘటనలు చాలా బలంగా ఆవిష్కరించబడ్డాయి.
- ఈ కథల్లో స్త్రీలు వలస వెళ్లిన కుటుంబానికి అనుబంధంగా కనిపించే ఒక పాత్ర కాదు వలస బాటలో మోసుకెళ్లే బాధలకూ, మౌనంగా భరించే అవమానాలకూ, చెదిరిపోతున్న కుటుంబాలకూ సజీవ సాక్ష్యాలని చెప్పవచ్చు.
- బాలికలపై అత్యాచారాలు, పేదరికం, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు ఇవన్నీ వేర్వేరు సమస్యలుగా కనిపించినా, వాటి మూలాల్లో స్త్రీని సాటి మనిషిగా చూడని ఆధిపత్య ధోరణి దాగి ఉంది.
- ఈ కోణంలో స్త్రీల జీవనం గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- పాలమూరు నేల నుంచి బయలుదేరిన ప్రతి వలస బస్సులో కేవలం కూలీల శరీరాలు మాత్రమే వెళ్లడం లేదు, తమ బాల్యాన్ని, భద్రతను, స్వేచ్ఛను, కలలను వెనక్కి వదిలి వెళ్లే అనేక మంది స్త్రీల జీవితాలున్నాయి.
- అందుకే పాలమూరు వలస కథలను చదవడం అంటే ఒక ప్రాంతపు వలస చరిత్రను చదవడం మాత్రమే కాదు, ఆ వలస నీడలో మౌనంగా నడిచిన స్త్రీల అడుగుజాడలను చదవడం.
ఉపయుక్త గ్రంథసూచి
- గీతాంజలి. ఆఖరి వడ్లగింజలు, పాలమూరు వలస కథలు-2. వెన్నెల - గీత ప్రచురణలు, 2022.
- గీతాంజలి. ఉయ్యాల , పాలమూరు వలస కథలు - 1. వెన్నెల- గీత ప్రచురణలు, 2022.
- జయప్రకాష్, ఎస్. పరిశోధన విధానం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2003.
- దక్షిణామూర్తి, పోరంకి. కథానిక స్వరూప స్వభావాలు. నవోదయ పబ్లిషర్స్, 1988.
- నరేష్, మదిరాజ్. "పాలమూరు వలస కథలు సామాజికాంశాలు". జెఈటిఐఆర్ ప్రచురణ, వాల్యూమ్ 13, ఇష్యూ 4, 2026.
- పతంగి, వెంకటేశ్వర్లు. తెలంగాణ తెలుగు కథ. దీప్తి, 2011.
- వల్లంపాటి, వెంకట సుబ్బయ్య. కథాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 2016.
- ఎన్, సుభాషిణి. గీతాంజలి సాహిత్యం- సమగ్ర పరిశీలన. ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2025.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

