headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM | Volume-07 | Issue-9 | August 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

1. భారతీయ సౌందర్యశాస్త్ర ఆలంకారికత: సమకాలీన దృశ్యకళలో అలంకారం

డా. మిష యర్రమిల్లి

అసిస్టెంట్ ప్రొఫెసర్ (గెస్ట్),
శిల్పకళా విభాగం, లలితకళా మహావిద్యాలయ,
ఢిల్లీ.
సెల్: +91 7014673408, Email: mishayarramilli@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 05.07.2026        ఎంపిక (D.O.A): 28.07.2026        ప్రచురణ (D.O.P): 01.08.2026


వ్యాససంగ్రహం:

కావ్యాలంకార, కావ్యదర్శ అనే శాస్త్ర గ్రంథాలలో, ఆచార్య భామహుడు, ఆచార్య దండి, అలంకార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సాధారణంగా అలంకార శాస్త్రం కవిత్వానికి, సాహిత్యానికి సంబంధించినదిగా భావిస్తారు. కానీ సాహిత్య పరిధుల నుంచి దాటించి దృశ్య రూపంలో సమన్వయిస్తూ కొన్ని పరిశోధనలు జరిగాయి. భామహుడు ప్రతిపాదించిన శబ్ద, అర్థ అలంకారాలను చిత్ర లేఖనం, శిల్ప కళ, డిజైనింగ్‌లో ఎలా అన్వయించవచ్చో నిర్వచిస్తూ పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. నేను భారత దేశంలో సమకాలీన దృశ్య కళలో ఈ అలంకారాలను అలంకరణకు అతీతంగా విజువల్ సూత్రాలుగా నిరూపిస్తూ చేసిన చిన్న ప్రయోగమే ఈ శీర్షిక. శాస్త్ర గ్రంథాలను, జరిగిన పరిశోధనలను అధ్యయనం చేసి, కళాకారులను, ఇతిహాసకారులను, నిపుణులను సందర్శించి, వారి పర్యవేక్షణలో ఈ పరిశోధన జరుగుతోంది. శబ్ద, అర్థ అలంకారం అనేటటువంటి విషయాలను దృశ్యకళ అనే కోణంలో పరిశీలిస్తుంది. రైనా సింగ్ సౌరబ్ తివారీ భారతీయ సాంప్రదాయ కళ అయిన మధుబని జానపద కళను వాడుకుని కవిత్వంలో ఉండే శబ్ద - అర్థ అలంకారాలను విజువల్ డిజైన్ దృశ్య రూపకల్పన రూపంలో మార్చారు. సుప్రియా రాయ్ ఆలయ ఐకనోగ్రఫీలో సంస్కృత అలంకార సిద్ధాంతం అన్వయించారు. కె.జి. సుబ్రమణ్యం రూపకాలంకరణ, ఆనందకుమార స్వామి దృక్పథం అలంకార భావనను సరి కొత్త కోణంలో ఆధునిక శిల్ప కళ, చిత్ర కళలో సూత్రాలుగా ఈ శీర్షిక వివరిస్తుంది. భారత కళా సిద్ధాంతంలో అలంకారం అనే పదానికి అర్థం ఒక వస్తువును అందంగా మార్చే ఆభరణం అనే కాదు, ఒక వస్తువు యొక్క అంతర్గత సారాన్ని వెలికి తీసే ఒక ముఖ్యమైన సాధనం. ఒక చిత్రాన్ని కానీ శిల్పాన్ని కానీ అర్థవంతంగా మార్చి, దాని అంతర్గత సారాన్ని వెలికి తీయవచ్చు, సాంకేతికతను జోడించి అందంగా, అద్భుతంగా, ఆసక్తికరంగా మార్చవచ్చు. సమకాలీన దృశ్యకళల్లో శిల్పి ఉపయోగించే పదార్థాన్నే సరికొత్త అలంకారంగా మార్చి కథని నడిపించవచ్చు.

Keywords: అర్ధ అలంకారం, శబ్ద అలంకారం, సమకాలీన దృశ్య కళ, అలంకరణ, భారతీయ సౌందర్య శాస్త్రం

1. పరిచయం

అలంకార శాస్త్రం అనేది భారతీయ సౌందర్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన సిద్ధాంతం. అలంకారం అంటే సంస్కృతంలో "ఆభరణం" అనే అర్థం వస్తుంది. ఒక స్త్రీకి ఆభరణాలు అందాన్ని ఎలా పెంచుతాయో, అలాగే ఒక కావ్యానికి అలంకారాలు అంతే అందాన్ని రెట్టింపు చేస్తాయి అని ఈ సిద్ధాంతం చెబుతుంది.

సంస్కృత శాస్త్ర గ్రంథం "నాట్యశాస్త్రం" రస సిద్ధాంతాలతో పాటు అలంకారం గురించి ప్రస్తావిస్తుంది. కానీ, భామహుడే ఈ సిద్ధాంతానికి మూల పురుషుడు.

  • భామహుడు: "కావ్యాలంకార గ్రంథం"లో అలంకార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అలంకారం కావ్యానికి ప్రాణం అని చెప్పారు (భామహుడు).
  • దండి: దండి రచించిన "కావ్యప్రకాశ" అనే గ్రంథంలో కావ్య శోభను పెంచే ధర్మాలే అలంకారాలు అని అన్నారు (దండి).
  • వామనుడు: "కావ్యాలంకారసూత్రవృత్తి" అనేది సంస్కృతంలో వామనుడు రచించిన ప్రసిద్ధ అలంకార శాస్త్ర గ్రంథం (వామన). క్రీ.శ. 8వ శతాబ్దం చివర లేదా 9వ శతాబ్దం ప్రారంభంలో సౌందర్యమే అలంకారం అని నిర్వచించారు.
  • ఉద్భటుడు: 8వ శతాబ్దం "భామహవివరణం" అనే మూల గ్రంథంలో, భామహుడు రచించిన కావ్య అలంకార సిద్ధాంతానికి టిప్పణి వ్రాశారు. "అలంకారసారసంగ్రహం" అలంకార విశ్లేషణలో ఒక మైలురాయి.
  • రుద్రటుడు: 9వ శతాబ్దంలో, అలంకారాలను మరింత విస్తృతంగా వర్గీకరించారు.
  • నమిసాధు: నమిసాధు 11వ శతాబ్దానికి చెందిన జైన విద్వాంసుడు. రుద్రటుని 'కావ్యాంకార' గ్రంథానికి ఇతడు రాసిన వ్యాఖ్యానం చాలా ప్రసిద్ధమైనది. అలంకార అంతరార్థాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో దోహదపడింది.
  • ఆనందవర్ధన: ఈయన రచించిన "ధ్వన్యలోకం" అలంకార శాస్త్రాన్ని ఒక కొత్త మలుపు తిప్పింది (ఆనందవర్ధన). అలంకారమనేది రసాభివ్యక్తికి సాధనంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
  • అభినవగుప్తుడు: "ధ్వన్యలోకలోచన" అనే శాస్త్రగ్రంధాన్ని రచించారు. "లోచనం" అనే వ్యాఖ్యానాలు అలంకార సిద్ధాంతానికి సరికొత్త తాత్విక పునాదిని ఇచ్చాయి.
  • మమ్మటుడు: "కావ్యప్రకాశం" అలంకారశాస్త్రంలో ప్రామాణిక పాఠ్య గ్రంథం లాంటిది. అలంకారంపై, పూర్వపు సిద్ధాంతాలన్నింటినీ సమన్వయం చేస్తూ 70 కి పైగా వ్యాఖ్యానాలు చేశారు.
  • రుయ్యకుడు: 12వ శతాబ్దం "అలంకారసర్వస్వం"లో అలంకార శాస్త్రీయ విశ్లేషణ చేశారు.
  • సముద్రబంధుడు: అలంకారాలపై వ్యాఖ్యానించారు.
  • విశ్వనాథ: 14వ శతాబ్దం "సాహిత్యదర్పణం" శాస్త్రగ్రంథం, అలంకారాల స్వరూపాన్ని వాటి ఉదాహరణలను సమగ్రంగా రచించింది.
  • జగన్నాథ పండితరాయలు: 17వ శతాబ్దం "రసగంగాధర" గ్రంథంలో అలంకార లక్షణాలను అత్యంత తార్కికంగా నవ్య న్యాయ పద్ధతిలో విశ్లేషించారు.
  • ఆచార్య కేశవదాసు: "కవిప్రియ".
  • మహాకవి భూషణ: "శివరాజభూషణ".
  • కన్నయ్యలాల్ పొద్దార్: "అలంకారమంజరి", "కావ్యకల్పద్రుమం".
  • చిత్రకవి పెద్దన్న: "లక్షణసారసంగ్రహం".
  • కేతన: "ఆంధ్రభాషాభూషణం".

భారతీయ కళా సంప్రదాయాలను పరిశీలించినప్పుడు, కళను కేవలం దృశ్య సౌందర్యాన్ని సృష్టించే ప్రక్రియగా మాత్రమే చూడలేదు. అలంకార సిద్ధాంతంలో అలంకారం అంటే కేవలం అలంకరణ మాత్రమే కాదు, అది వస్తువు అంతర్గత సారాన్ని, భావాన్ని వెలికితీసే ఒక ముఖ్యమైన సాధనం లేదా ప్రక్రియ అని గమనించవచ్చు. రసానందాన్ని కలిగించడానికి ఉపయోగపడే ఒక వాహకం. రూపం అర్థం మధ్య సంబంధాన్ని సృష్టించే ఒక సృజనాత్మక ప్రక్రియ అని స్పష్టమవుతోంది.

భారత సౌందర్య శాస్త్రంలో విస్తృత సామర్థ్యాన్ని కలిగివున్న అలంకార శాస్త్రం అనేది కవిత్వానికి, సాహిత్యానికి సంబంధించినదిగా భావన. కానీ, సాహిత్య పరిధులను దాటించి దృశ్య రూపంలో మార్చుతూ కొన్ని పరిశోధనలు జరిగాయి. భామహుడు ప్రతిపాదించిన శబ్ద, అర్థ అలంకారాలను చిత్రలేఖనం, శిల్పకళ, డిజైనింగ్‌లో ఎలా అన్వయించవచ్చో పరిశీలిస్తూ, భారతదేశ సమకాలీన దృశ్యకళలలో, అనగా ప్రస్తుత కళలలో, ఈ అలంకార సూత్రాలను అలంకరణకు అతీతంగా ఎలా అన్వయించవచ్చో, పునర్వ్యాఖ్యానించవచ్చో విశ్లేషించడం ఈ శీర్షిక ఉద్దేశం.

2.1 సాహిత్య సమీక్ష

రైనా సింగ్, సౌరబ్ తివారీ 'విజువల్ అలంకారాస్: టువర్డ్స్ డీకలోనైజ్డ్ విజువల్ డిజైన్ ఫ్రేమ్‌వర్క్.' అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించారు (సింగ్ తివారీ).

  • ప్రయోగం: కవిత్వంలో వుండే శబ్దాలంకారం, అర్థాలంకారాలను విజువల్ డిజైన్ సూత్రాలుగా మార్చారు. భారతీయ సాంప్రదాయ కళ అయిన మధుబని జానపద కళలను ఒక మాధ్యమంగా వాడుకున్నారు.

సుప్రియా రాయ్: "Embodied Aesthetics: Application of Sanskrit Alamkara theory in temple iconography" (రాయ్).

భామహుడు తన కావ్యాలంకార గ్రంథంలో చెప్పిన వక్రోక్తి, వక్రంగా, చమత్కారంగా చెప్పడం, అతిశయోక్తి వంటి అలంకారాలు భారతదేశంలో శిల్పాలు వాటి భంగిమలలో వ్యక్తమవుతాయో తన దృశ్య విశ్లేషణ ద్వారా చూపించారు.

ఆనంద కుమారస్వామి దృక్పథం: ప్రముఖ కళా చరిత్రకారుడు ఆనంద కుమారస్వామి, తన పరిశోధనలో అలంకారమనేది ఒక వస్తువును దాని పూర్తి అర్థంతో సమర్థవంతం చేసే ప్రక్రియ అని పేర్కొన్నారు (కుమారస్వామి). ఆనంద కుమారస్వామి "Ornament" అనే ప్రసిద్ధ గ్రంథంలో అలంకార భావన చారిత్రక అర్థాన్ని విశ్లేషించారు. ఒక వస్తువును కేవలం అదనపు అలంకరణగా భావించబడిన అంశం, ఒక వస్తువుకు అవసరమైన పూర్ణ స్థితిని కల్పించే అంశం మధ్య తేడాను చూపించారు. "అలంకారం = రూపం" తన అంతర్గత సారాన్ని మరింత స్పష్టంగా, అనుభూతి పరంగా వ్యక్తీకరించే ప్రక్రియ.

కె. జి. సుబ్రమణ్యం: కె. జి. సుబ్రమణ్యం చేసిన పరిశోధన అంతా భారత సంస్కృత శాస్త్ర గ్రంథం అయిన అలంకరణం శాస్త్రం చుట్టూ తిరుగుతుంది (సుబ్రమణ్యం). ఆయన శిల్పాలలో, మురల్ చిత్రకళలో అద్భుతంగా దృశ్యమానం చేశారు. ఆయన అనుప్రాస అలంకారాన్ని వివరించారు. ఒకే అక్షరాన్ని పదే పదే వ్రాయడం, ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా చూపించడం. ఇటువంటి సూత్రాలను చిత్రకళలో లేదా శిల్పంలో, ఒకేరకమైన రేఖలు, రంగులు లేదా టెక్స్చర్‌లను పదే పదే ఉపయోగించడంతో పోల్చారు.

2.2. పరిశోధన లక్ష్యాలు

  1. భారతీయ అలంకార సిద్ధాంతంలో ప్రాథమిక భావాలను పరిశీలించడం.
  2. శబ్ద అర్థ అలంకారాలకు ప్రముఖుల శాస్త్రీయ వివరాలను విశ్లేషించడం.
  3. శబ్ద, అర్థాలంకారాలను అన్వయించగల అవకాశాలను పరిశీలించడం.
  4. అలంకారాలను బాహ్య అలంకరణ నుంచి, దృశ్య నిర్మాణంగా అలంకరణకు అతీతంగా పునర్నిర్వచించడం.
  5. సమకాలీన దృశ్యకళల్లో శబ్ద, అర్థ అలంకారాలను అన్వేషించడం.
  6. కళాకారులు నిపుణులతో సంభాషణ.

2.3. శబ్దాలంకారాలు

శబ్దాలంకారాలను దృశ్య సూత్రాలుగా మార్చడం అంటే వినేటప్పుడు కలిగే శబ్దలయలను, చూసేటప్పుడు కలిగే దృశ్య లయగా మార్చడమే.

  1. వృత్త్యనుప్రాస
  2. ఛేకానుప్రాస
  3. లాటానుప్రాస
  4. అంత్యానుప్రాస
  5. యమకము
  6. ముక్తపదగ్రస్తము

2.3.1. వృత్త్యానుప్రాస - దృశ్య పునరావృత్తి

  • కావ్యంలో: ఒకే అక్షరాన్ని పదే పదే రాయడం.
  • దృశ్యంలో: ఒకే రంగు, ఒకే ఆకారం, ఒకే టెక్స్చర్ ఒకే ఫ్రేమ్ లో పదే పదే కనిపించడం.

భారత ప్రసిద్ధ కళాకారులు ఈ పునరావృత్తి సూత్రాన్ని తమ చిత్రకళ, శిల్పకళలో ఎలా ఉపయోగించారో కొన్ని ఉదాహరణలు:

  • మంజునాథ కామత్: మంజునాథ కామత్ శిల్పాలలో, గుడి గంటలను లేదా వందలాది చిన్న చిన్న మట్టి గంటల ఆకారాలను ఒకే వరుసలో లయబద్ధంగా, మోటివ్‌లుగా విరివిగా ఉపయోగిస్తారు.
  • వలై షిండే: (మెటల్ బాల్ స్కల్ప్చర్స్) ఈయన స్టెయిన్‌లెస్ స్టీల్ వేలాది చిన్న చిన్న గోళాలను ఒకదానికొకటి వెల్డింగ్ చేసి ఒక లైఫ్ సైజ్ మనిషిని "ముంబై డబ్బావాలా" ఇన్‌స్టాలేషన్ చేశారు.

2.3.2. ఛేకానుప్రాస

రూపం ఒకటే కాని దాని భావం వేరు వేరుగా వుండే రెండు వస్తువులను పక్క పక్కనే వుంచడం. ఆధునిక కళాకారులు, రూపంలో ఒకేలా వుంటూ, అర్థంలో లేదా, భావంలో వేరుగా వుండే జంట దృశ్యాలను తమ కళాఖండాలలో అద్భుతంగా ఉపయోగించారు.

  • అతుల్ దోడియా: రోలర్ షట్టర్ ఆర్ట్: కళాఖండం: ఆయన ఐరన్ రోలర్ షట్టర్స్ పైన పెయింటింగ్స్ వేస్తారు. షట్టర్ మూసివున్నప్పుడు లక్ష్మీ దేవి చిత్రాన్ని గీశారు. ఆ షట్టర్ అంచు కింద నేలకు తాకుతూ ముగుస్తుంది. ఆ షట్టర్ పైకి లేపినప్పుడు సరిగ్గా అదే అంచు ఉన్న ప్రదేశం నుంచి, భారత దేశంలో మహిళపై జరిగే హింసను ప్రతిబింబించే ఒక తీవ్రమైన దృశ్యం మొదలవుతుంది. ఇక్కడ ఒకే చోట ఒకే ఆకృతిలో రెండు వేరు వేరు అర్థాలు కలిగిన జంట దృశ్యాలు ఎదురవుతాయి.
  • జితిష్ కల్లాట్: కాన్సెప్చువల్ ఆర్ట్. ఆయన తన తండ్రి బతికిన రోజుల సంఖ్యను లెక్క కడుతూ, అన్ని రోజులకు సరిపడా రొట్టెలను వరుసగా అమర్చారు. ఆ రొట్టెలను చంద్రుని వివిధ దశలుగా, నెల వంక నుంచి పౌర్ణమి వరకు, కోసినట్టుగా డిజైన్ చేశారు. ఇక్కడ రూపం చూస్తే తినే రొట్టె, కానీ భావాన్ని గమనిస్తే కరిగిపోయే జీవిత చక్రం. ఒకే ఆకారం రెండు వేరు వేరు లోతైన అర్థాలను గమనించవచ్చు.

2.3.3. లాటానుప్రాస

తాత్పర్య భేదంతో ఒకే పదం రెండుసార్లు రావడం.

  • కృష్ణ రెడ్డి: కృష్ణ రెడ్డి తన వినూత్న "Viscosity", "Clown", "Demonstrators" వంటి కళాకృతులలో లాటానుప్రాస భావనను దృశ్య రూపంలో అద్భుతంగా ప్రదర్శించారు.

2.3.4. అంత్యానుప్రాస

ప్రతి వాక్యం లేదా ప్రతి దృశ్యం ముగిసేటప్పుడు ఒకే రకమైన విజువల్ ఎలిమెంట్ ఆకారంతో ముగించడం.

  • లక్ష్మ గౌడ్: ఆయన గీసే డ్రాయింగ్స్‌లో స్త్రీల జుట్టు, పురుషుల చేతులు, వెనక భాగంలో వుండే చెట్ల కొమ్మలు, ఇవన్నీ వేరు వేరు ఆకారాలు. అయినా ఆ గీతలన్నీ చివరకు ఒక రకమైన పదునైన సుడి వంపు ఆకారంతో ముగుస్తాయి. ఇక్కడ రూపాలు వేరైనా, వాటి ముగింపులు అన్నీ ఒకే శైలిలో వంపు తిరిగి ముగించడం వలన, చిత్రం అంతటా ఒకే అంతఃప్రాస గమనించవచ్చు.
  • విన్సెంట్ వాన్ గోహ్: ఈయన చేసిన చాలా చిత్రాలలో ఆకాశం, కొండలు, చెట్లు, కేఫే, అన్నీ వేరు వేరు వస్తువులు. కానీ ఆయన ఉపయోగించిన బ్రష్ స్ట్రోక్స్ చివరకు ఒక చిన్న సుడిగుండం లాంటి వంపుతోనే ముగుస్తుంది.

2.3.5. యమకము

అర్థ భేదం గల ఆకారాల సమూహం మళ్లీ మళ్లీ రావడం.

  • దాకు: ప్రసిద్ధ కాన్సెప్చువల్ అండ్ షాడో ఆర్టిస్ట్. భారతదేశంలో కాంతి నీడల లయను ఉపయోగించి ఇన్‌స్టాలేషన్లు చేయడంలో ఈయన అత్యంత ప్రసిద్ధులు. ప్రసిద్ధ కళా ఖండం: "Time changes Everything". ఈయన గోడలపై నిర్దిష్ట కోణాలలో, పదునైన ఇనుప ముక్కలను అక్షరాలను అమర్చారు. పగటిపూట సూర్యకాంతి ఆ ఇనుప ముక్కలపై పడినప్పుడు, కాలంతో పాటు ఆ నీడలు కదులుతూ గోడపై మనుష్య స్త్రీ ఆకృతులుగా అమరుతాయి. ఇక్కడ ఇనుప ముక్కల రూపం ఒకటే రాళ్లకుప్పగా కనిపిస్తుంది. కానీ సూర్యుని గమనాన్ని బట్టి ఇంకొక చోట, కొద్ది వ్యవధి కాలంలో అర్థవంతముగా మారుతుంది.

2.3.6. ముక్తపదగ్రస్తము

ఒక దృశ్యం, ఒక రేఖ ఎక్కడ ముగిసిందో సరిగ్గా అదే పాయింట్ నుండి మరొక పాయింట్, కాలం లేదా కథ ప్రారంభం అవడం. దీనినే ఫోటోగ్రఫీలో మ్యాచ్ కట్ అంటారు.

  • సాల్వడార్ డాలీ: ఆయన వేసిన "Melting Clocks" చిత్రంలో కరిగిపోతున్న గడియారాలు ఉంటాయి. ఒక టేబుల్‌పై నుంచి కిందకి జారుతున్న ఒక జేబు గడియారం, ఒక చోట ముగుస్తుంది. సరిగ్గా ఆ గడియారం ముగిసిన అంచు నుండి కరిగిపోతున్న ఒక వింత జీవి ముఖం లేదా ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మ ఆకారం ప్రారంభమై ముందుకు సాగుతుంది. ఇక్కడ ఒక వస్తువు ఆకృతి ముగిసి అదే గీత నుంచి మరొక వింత ప్రపంచం ప్రారంభమైంది.
  • ఐస్ ఏజ్-3 యానిమేషన్ మూవీలో డైనోసార్ నేపథ్యంలోని చిత్రంలో మల్టీలెవల్ మ్యాచ్ కట్స్ తరచుగా వస్తాయి. ఒక విజువల్‌లో పగిలిన గుడ్డు నుంచి ఉదయించే సూర్యుడు వచ్చే సన్నివేశం అచ్చమైన విజువల్ ముక్తపదగ్రస్థముకు అద్భుతమైన ఉదాహరణ.
    • పగిలిన గుడ్డు - ఉదయించే సూర్యుడు
    • మొదటి షాట్: గుడ్డు పగిలి లోపల నుంచి జీవం వచ్చేటప్పుడు ఆ గుడ్డు పై భాగం విడిపోతుంది. కెమెరా ఆ గుడ్డు గుండ్రటి తెల్లటి అంచుపై ఫోకస్ అయి చాలా బ్రైట్‌గా మారి ఆ షాట్ ముగుస్తుంది.
    • రెండవ షాట్: ఆ గుండ్రటి మెరుస్తున్న ఆకారం ఏమాత్రం మారకుండ, వెంటనే తరువాతి షాట్‌లో అది కొండల మధ్య నుంచి ఉదయిస్తున్న సూర్యుడిగా రూపాంతరం చెందుతూ సీన్ ఓపెన్ అవుతుంది. కెమెరా వెనక్కు వచ్చినప్పుడు ఒక కొత్త రోజు, కొత్త ప్రకృతి కనిపిస్తుంది.

2.4. అర్థ అలంకారం

పద్యం లేదా చిత్రం శిల్పం పై పై శబ్దాల కంటే దాని లోపల దాగి వున్న భావం లేదా అర్థం హృదయానికి హత్తుకునేలా ఉండడం. ఒక చిత్రంలో లేదా పద్యంలో అర్థాన్ని అలంకరించి చెప్పడం వలన అది పద్యాన్ని లేదా చిత్రాన్ని మరింత లోతైన అర్థవంతమైన సౌందర్యంతో నింపుతుంది.

పాబ్లో పికాసో గీసిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన "గార్నికా" (Guernica) పెయింటింగ్‌ను మనం అర్థాలంకరణ భావంతో జోడించి అర్థం చేసుకోవచ్చు. స్పానిష్ అంతర్యుద్ధంలో గ్వెర్నికా అనే గ్రామంలో జరిగిన బాంబు దాడిని పికాసో ఇందులో చిత్రీకరించారు.

ఈ పెయింటింగ్ సాంప్రదాయ పెయింటింగ్స్ లాగా అందంగా ఉండదు. అది చాలా గందరగోళంగా, నలుపు, తెలుపు, చేతులు, కాళ్లు విరిగిపోయి సాగిపోవడం, గుర్రం నోరు తెరిచి ఆకాశం వైపు కత్తిలా మారడం, తల్లి తన చనిపోయిన బిడ్డను పట్టుకుని ఏడవడం, బూడిదరంగులలో భయంకరంగా ఉంటుంది. కానీ దాని అర్థం తెలిసినప్పుడు, యుద్ధం వ్యతిరేకత, మానవవాదం ఆ పెయింటింగ్ నిజమైన సౌందర్యం, విలువలను బయట పడతాయి. ఇది విజువల్ అతిశయోక్తి అలంకారానికి ఒక మంచి ఉదాహరణ.

భారతదేశంలో బెంగాల్ కరువు సమయంలో "Wound Series" చేసిన సోమనాథ్ హోరే కాంస్య శిల్పాలు ఈ అర్థాలంకారాలకు (అతిశయోక్త్యలంకారం, రూపకాలంకారం, స్వభావోక్తి అలంకారం) అద్భుతమైన ఉదాహరణ. ఇక్కడ అర్థమే అలంకారం. ప్రతి గాయం ఒక అలంకారంగా మారి ఆ శిల్పానికి అమూల్యమైన కళాత్మక సౌందర్యాన్ని తెచ్చి పెడుతుంది.

ఉపసంహారం

  • ఆధునిక శిల్ప చిత్రకళలో శబ్ద అర్థ అలంకారాలను సూత్రాలుగా పరిగణించి, అలంకార భావనలను సరికొత్త కోణంలో అన్వయించవచ్చు.
  • అలంకారం కేవలం బాహ్య ఆభరణం కాక, ఒక వస్తువు అంతర్గత సారాన్ని వెలికితీసే సాధనం.
  • చిత్రాలు, శిల్పాలు అర్థవంతంగా, సాంకేతికతతో కూడి అందంగా, అద్భుతంగా మారతాయి.
  • 21వ శతాబ్దపు శిల్పులు చిత్రకారులు అలంకార భావనను అలంకరణకు అతీతంగా ఆవిష్కరిస్తున్నారు.
  • కళాకారులు ఉపయోగించే పదార్థమే సరికొత్త అలంకారంగా మారి కథను నడిపిస్తుంది.

ఉపయుక్త గ్రంథసూచి

  1. Bhāmaha. *Kāvyālaṅkāra.* Motilal Banarsidass, [సంవత్సరం]. భామహుడు రచించిన కావ్యాలంకారం, అలంకార సిద్ధాంతానికి ప్రాథమిక గ్రంథాలలో ఒకటి.
  2. Coomaraswamy, Ananda K. “Ornament.” *The Art Bulletin*, [సంవత్సరం]. భారతీయ "అలంకార" ornament భావనను పాశ్చాత్య decoration భావనతో తులనాత్మకంగా ఆలోచించడానికి ఇది ముఖ్యమైన మూలం.
  3. Daṇḍin. *Kāvyādarśa.* [ప్రచురణకర్త], [సంవత్సరం]. దండి రచించిన ఈ గ్రంథం కావ్య లక్షణాలు, గుణాలు, దోషాలు, అలంకారాలపై ముఖ్యమైన చర్చను అందిస్తుంది.
  4. Kuntaka. *Vakroktijīvita.* [ప్రచురణకర్త], [సంవత్సరం]. వక్రోక్తి, వైచిత్ర్యపూర్వక వ్యక్తీకరణకు సంబంధించిన ముఖ్యమైన గ్రంథం.
  5. Pramanick, Mrinmoy. “Dandin and Indian Poetics.” *Indian Literary Criticism and Theory*, INFLIBNET, [సంవత్సరం].
  6. రాయ్, సుప్రియ. “Embodied Aesthetics: Application of Sanskrit Alankāra Theory in Temple Iconography.” *Indian Journal of Multidisciplinary Research and Studies*, 2026.
  7. సింగ్, రైనా; తివారీ, సౌరబ్. "విజువల్ అలంకారాస్: టువర్డ్స్ డీకలోనైజ్డ్ విజువల్ డిజైన్ ఫ్రేమ్‌వర్క్." *అంతర్జాతీయ పరిశోధనా పత్రిక*, [సంవత్సరం].
  8. సుబ్రమణ్యం, కె. జి. *Kurukshetra University study material.* Kuk University, [సంవత్సరం]. ఆయన కళా శైలి, ప్రభావాలు, వివిధ మాధ్యమాల వినియోగంపై సమాచారం.
  9. సుబ్రమణ్యం, కె. జి. *When Was Modernism.* Asia Art Archive, [సంవత్సరం]. కె. జి. సుబ్రమణ్యం కళలో జానపద, craft, metaphor, modernism మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగకరమైన మూలం.
  10. Vāmana. *Kāvyālaṅkārasūtravṛtti.* [ప్రచురణకర్త], [సంవత్సరం]. అలంకారం, గుణం, రీతి సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైన మూలం.
  11. విశ్వనాథ. *సాహిత్యదర్పణం.* [ప్రచురణకర్త], [సంవత్సరం].

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal