AUCHITHYAM | Volume-07 | Issue-04 | April 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
5. నన్నయ భారతం: జ్యోతిశ్శాస్త్రాంశాలు
రాంభట్ల వేంకటరాయశర్మ
తెలుగు పరిశోధకులు, జ్యోతిష్కులు,
ప్రధానసలహాదారు, ఔచిత్యమ్- పరిశోధనమాసపత్రిక
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7989110805, Email: rvr87sarma@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 08.03.2026 ఎంపిక (D.O.A): 29.03.2026 ప్రచురణ (D.O.P): 01.04.2026
వ్యాససంగ్రహం:
ఆంధ్ర మహాభారతంలో జ్యోతిష శాస్త్ర విశేషాలను పరిశీలించడం ఈ పరిశోధనా పత్రం ముఖ్యోద్దేశం. నన్నయ భట్టు కావ్యాన్ని కథా రూపంలో కాక సర్వ శాస్త్ర సారాంశంగా తీర్చిదిద్దిన తీరును విశ్లేషించడం ఈ పత్ర ఆవశ్యకత. శీర్షిక సమర్థన కోసం నన్నయ కవిత్వంలోని ఖగోళ విజ్ఞానం, కాలగణన, జాతకఫలితాలు, ముహూర్తబలం, శకునవిజ్ఞానం, వాస్తుశాస్త్ర అంశాలు పరిశీలించబడ్డాయి. పూర్వ పరిశోధనల విమర్శనాత్మక పరిశీలన ఆధారంగా, టీటీడీ వారు ప్రచురించిన నన్నయ ఆంధ్ర మహాభారత ప్రతి ప్రాథమిక ఆధారంగా తీసుకోబడింది. ఆది, సభా, అరణ్య పర్వాలలోని జ్యోతిష సంబంధిత పద్యాలు, వచనాలను ప్రామాణికంగా ఎంచుకొని విశ్లేషణాత్మక పరిశోధన పద్ధతి అనుసరించబడింది. నన్నయ సూర్యుని గతి, కాంతి వేగం, నక్షత్రాల స్థితి ద్వారా కాల గణన చేసిన విధానం వివరించబడింది. వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం, హస్త సాముద్రికం, జనన సమయ దోషాలు, ముహూర్త నిర్ణయం, శకున విజ్ఞానం, మయసభ నిర్మాణంలో వాస్తు శాస్త్ర ప్రాధాన్యం వంటి అంశాలు సమగ్రంగా చర్చించబడ్డాయి. ఈ పరిశోధన ద్వారా నన్నయ శాస్త్ర పాండిత్యం, నాటి సమాజం జ్యోతిషంపై కనబరిచిన విశ్వాసం స్పష్టమవుతాయి. భవిష్యత్తులో మిగిలిన పర్వాలపై సమగ్ర పరిశోధన చేయడానికి ఈ పత్రం మార్గదర్శకంగా నిలుస్తుంది.
Keywords: ఆంధ్ర మహాభారతం, నన్నయ, జ్యోతిష శాస్త్రం, ఖగోళ విజ్ఞానం, ముహూర్తం, శకునాలు, వాస్తు శాస్త్రం, కాల గణన, సాహిత్య విశ్లేషణ
1. ప్రవేశిక
ఆంధ్ర మహాభారతం తెలుగు సాహిత్యంలో అత్యున్నత స్థానం పొందింది. నన్నయ భట్టు ఈ కావ్యాన్ని కథగా కాక, సర్వ శాస్త్ర సారాంశంగా తీర్చిదిద్దారు. భారతం పంచమ వేదంగా ప్రసిద్ధి చెందింది. వేదాంగమైన జ్యోతిష శాస్త్రం ఇందులోని అనేక ఘట్టాలలో అంతర్లీనంగా కనిపిస్తుంది. ఖగోళ విజ్ఞానం, కాల గణన, జాతక ఫలితాలు వంటి అంశాలను నన్నయ తన కవిత్వంలో నిక్షిప్తం చేశారు. ఈ పత్రం ఆ విశేషాలను విశ్లేషిస్తుంది.
భారతదేశంలో జ్యోతిషం ఒక ప్రధాన విజ్ఞాన విభాగం. సమాజంలోని నమ్మకాలు, ఆచారాలు ఈ శాస్త్రంతో ముడిపడి ఉండేవి. రాజ వంశీయుల జననం, యుద్ధ తంత్రం, గృహ నిర్మాణం వంటి ప్రతి అంశంలోనూ గ్రహ గతులను పరిగణనలోకి తీసుకునేవారు. ఈ పత్రం ద్వారా నన్నయ భారతంలో జ్యోతిష శాస్త్ర ప్రభావం ఎంతటిదో తెలుసుకోవచ్చు.
1.1. పరిశోధనాపద్ధతి
ఈ పరిశోధనలో విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించాను. టీటీడీ (TTD) వారు ప్రచురించిన నన్నయ ఆంధ్ర మహాభారత ప్రతిని ప్రాథమిక ఆధారంగా తీసుకున్నాను. ఆది, సభా, అరణ్య పర్వాలలోని జ్యోతిష సంబంధిత పద్యాలు, వచనాలలోని జ్యోతిష్య శాస్త్ర విషయాలను విశ్లేషించాను. ఈ ప్రాథమిక ఆకరం ఆధారంగా వివరణాత్మక అంశాలుగా మార్చి ఈ పత్రాన్ని రూపొందించాను.
2. ఖగోళ విజ్ఞానం - కాల స్వరూపం
నన్నయ ఖగోళ శాస్త్రం పట్ల అపారమైన అవగాహన ఉన్న కవి. ఆదిపర్వం ఏడవ ఆశ్వాసంలో సూర్యుని గతి, దూరం, కాంతి వేగం వంటి అంశాలను ప్రస్తావించారు.
చ. జగదభివంద్యుఁ డాక్షణమ సమ్మతి సంవరణ ప్రయోజనం
బొగి నొనరింపఁగా నయుతయోజనముల్ చని లోకలోచనుం
డగు దిననాథు నాతతసహస్రకరుం గని సంస్తుతించె న
త్యగణితవేదమంత్రముల నమ్మునినాథుఁ డతి ప్రియంబునన్. 85
జగత్పూజ్యుడైన వసిష్ఠమహాముని అప్పటి కప్పుడే సంవరణునికోర్కె తీర్చటానికి అంగీకరించి పదివేల ఆమడలు పయనించి, లోకాలకు కన్నైన వాడు, పగటికి ప్రభువు, విస్తారమైన వేయికిరణాలు కలవాడు అయిన సూర్యుడిని చూసి ప్రీతితో అనేకవేదమంత్రాలతో స్తుతించాడు. (పుట. 737)
ఈ పద్యం సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని వివరిస్తుంది. ఇది నాటి కవులకున్న ఖగోళ పరిజ్ఞానానికి నిదర్శనం.
సూర్య కిరణాల వేగం గురించి 88వ వచనంలో నన్నయ చర్చించారు.
వ. “ఇ ట్లొక్కనిమిషంబున మున్నూటయఱువదినాలుగు యోజనంబులు పఱచు నాదిత్యురథంబుతో నశ్రమంబున నరిగి, తపనదత్త యయిన తపతిం దోడ్కొని వచ్చి, వసిష్ఠుండు విధివంతంబుగా సంవరణునకుం దపతి వివాహంబు సేయించెఁ; గావున మహాత్ము లయిన పురోహితులం బడసిన రాజుల కభీష్టంబు లయిన శుభంబు లగుట నిశ్చయం; ...” 88
నిముషానికి మూడువందల అరవైనాలుగు ఆమడలు సరుగెత్తే సూర్యుని రథంతోపాటు శ్రమలేకుండ వెళ్ళి, అతడిచ్చిన తపతిని తనవెంట తీసికొనివచ్చి, వసిష్ఠుడు శాస్త్రోక్తంగా తపతీ సంవరణులకు వివాహం జరిపించాడు. అందుచేత మహాత్ములైన పురోహితులను పొందిన రాజులకు కోరుకొన్న శుభాలు కలగటం నిశ్చయం. (పుట. 758)
కాల గమనాన్ని అర్థం చేసుకోవడానికి గ్రహాల సంచారం ప్రాతిపదికగా నిలుస్తుంది. అరణ్యపర్వంలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం, ఎండల తీవ్రత వంటి ప్రకృతి మార్పులను వివరించారు. సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణించే క్రమంలో కలిగే శీతోష్ణస్థితి మార్పులను జ్యోతిషదృష్టితో నన్నయ చిత్రించారు.
నక్షత్రాల స్థితిని బట్టి కాలగణన చేయడం మరో విశేషం. రోహిణీ నక్షత్రం చంద్రునితో కలిసినప్పుడు ఏర్పడే ఖగోళ దృశ్యం అద్భుతంగా వర్ణించబడింది. దమయంతి అందాన్ని వర్ణించే క్రమంలో చంద్రుడితో కూడిన రోహిణిని ఉదాహరణగా తీసుకోవడం నన్నయ శాస్త్రదృష్టిని తెలుపుతుంది. ఇది కవిత్వమే కాకుండా, ఖగోళ విజ్ఞాన సముదాయంగా చెప్పవచ్చు.
3. జాతకఫలితాలు - హస్తసాముద్రికం
వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం ఉంటుందని భారతకథలో నన్నయ నిరూపించారు. ధర్మరాజు జనన సమయంలో గ్రహగతులు అత్యంత అనుకూలంగా ఉన్నాయని ఆదిపర్వం 5వ ఆశ్వాసం 94వ పద్యం ద్వారా తెలుస్తుంది.
ఉ. శాత్రవజైత్రతేజమున సర్వదిశల్ వెలుఁగంగ నైంద్ర న
క్షత్రయుతుండుగా శశి ప్రకాశజయోన్నత మైన యష్టమిన్
మిత్రముఖగ్రహప్రతి మేలుగ నాభిజితోదయంబునం
బుత్త్రుఁడు ధర్మునంశమునఁ బుట్టె నతిస్థిరధర్మమూర్తి యై. (ఆది. 5-94)
దిక్కు లన్నీ వెలుగగా, చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కూడి ఉండగా, సూర్యాదిగ్రహాలు శుభస్థానాలలో ఉండగా, అష్టమినాడు అభిజిన్ముహూర్తప్రారంభంలో ధర్మదేవత అంశచేత శత్రువులను జయించగల పరాక్రమంతో ధర్మరాజు జన్మించాడు.
ఆంధ్రమహాభారత సంశోధితముద్రణప్రతిలో ఈ క్రింది వివరణం అధస్సూచికలో ఇవ్వబడింది; "యుధిష్ఠిరుఁడు వికృతి సంవత్సర ఫాల్గుణ బహుళ అష్టమియందు జన్మించినట్లు భారతకూలంకష వ్యాఖ్యాకారుఁడు వివరించెను. కలియుగాది ప్రమాది సంవత్సరము చైత్రశుద్ధపాడ్యమిగనుక, ఆ పయిని నూటయెనిమిదియేళ్ళ యెనిమిది దినముల క్రిందట యుధిష్ఠిర జననము. ఆ తిథికి అనగా ఫాల్గుణబహుళ అష్టమికి జ్యేష్ఠానక్షత్రము వచ్చును. జయతిథిన్నీ అవును. ధర్మరాజు తరువాత సంవత్సరమునకు భీమునిపుట్టుక ఖరసంవత్సరఫాల్గుణశుక్లత్రయోదశి మాఘనక్షత్రము. దుర్యోధనుఁడు భీమునికన్న మూఁ డుయామములు 'చింన్న" చిన్న. అర్జునుఁడు నందనసంవత్సర ఫాల్గుణశుక్ల పౌర్ణమాసి" (పుట.279). సంశోధితముద్రణప్రతిలో 'శాత్రవ', 'మిత్ర' శబ్దప్రయోగం ఉన్నది. వావిళ్ళప్రతిలో 'మిత్ర' శబ్దం ఉంది. 'క్షత్ర శబ్దం క్షత్ర'గా వాడబడింది. ఈ రెండింటిని గమనించి ప్రాససామ్యం పరిష్కరించటమైనది. (పుట. 511-512)
ఈ జాతక బలం వల్లే ఆయన ధర్మాత్ముడిగా, అజేయుడిగా నిలిచారని కవి భావన.
హస్త సాముద్రికం జ్యోతిషంలో అంతర్భాగం. శకుంతల హస్తరేఖలను చూసి మహర్షులు ఆమె భవిష్యత్తును ఊహించారు. ఆమె చేతిలోని గుర్తులు చక్రవర్తికి తల్లి అవుతాయని సూచించాయని ఆదిపర్వం 4వ ఆశ్వాసం 63వ వచనంలో ఉంది.
వ. “ ‘నీధర్మచరితంబునకు మెచ్చితి, నీ కోరిన వరం బిచ్చెద వేఁడు’ మనిన శకుంతలయు ‘నాచిత్తం బెప్పుడు ధర్మువునంద తగిలియుండను, నాకుద్భవించెడు పుత్త్రుండు దీర్ఘాయురారోగ్యైశ్వర్య బలసమన్వితుండును వంశకర్తయుఁగాను వలయు’ ననిన నమ్మహాముని కరుణించి దాని కోరిన వరం బిచ్చి, యథాకాలవిధుల గర్భసంస్కార రక్షణంబులు సేయించి యున్నంత, వర్షత్రయంబు సంపూర్ణం బైన, శకుంతలకు భరతుం డుదయించి కణ్వనిర్వర్తిత జాతకర్మాది క్రియాకలాపుం డయి పెరుఁగుచుఁ గరతలాలంకృతచక్రుండును, చక్రవర్తిలక్షణలక్షితుండును, సింహసంహననుండును, దీర్ఘబాహుండును, ననంతజవసత్త్వ సంపన్నుండును నై పరఁగుచు..” (ఆది. 4-63)
శకుంతలకు భరతుడు జన్మించాడు. కణ్వమహర్షి అతనికి జాతకర్మాది క్రియాకలాపాలు జరిపించగా పెరుగుతున్నాడు. అరచేతిలో చక్రరేఖ కలవాడు, చక్రవర్తి, లక్షణాలన్నీ ముద్రించుకొన్న మేను కలవాడు. సింహంవలె సర్వాంగసుందరుడు, పొడుగైన చేతులు కలవాడు, అపారమైన వేగమూ, బలమూ కలవాడై భరతుడు విలసిల్లాడని వర్ణన.
. "చక్రాసి చాప వజ్రాభా। రేఖాః కుర్వంతి భూపతిమ్'- అని సాముద్రికశాస్త్రం, చక్రం, ఖడ్గం, విల్లు, వజ్రాయుధం వంటి రేఖలు కలవాడు తప్పక రాజౌతాడని శాస్త్రం. భరతుడు పుట్టుకతోనే చక్రవర్తి కాదగిన సాముద్రికచిహ్నాలు కలిగి ఉన్నాడు. అరచేతిలో చక్రరేఖ రాజయోగాన్ని సూచిస్తుంది. సాముద్రిక శాస్త్రసూత్రాలను నన్నయ ఇక్కడ సందర్భోచితంగా వాడారు.
జననసమయదోషాలు కూడా కావ్యంలో ప్రస్తావించబడ్డాయి. దుర్యోధనుడు పుట్టినప్పుడు కలిగిన గ్రహస్థితులు కౌరవవంశనాశనానికి సంకేతాలుగా నిలిచాయి. అశుభసమయంలో పుట్టిన శిశువు వల్ల కలిగే అనర్థాలను జ్యోతిషశాస్త్రం ఎలా వివరిస్తుందో నన్నయ దుర్యోధన జననఘట్టంలో చూపారు.
శా. ఆ దుర్యోధనుఁ డుద్భవిల్లుడును గ్రవ్యాదారవంబుల్ శివా
నాదంబుల్ మదఘూకఘూంకృతులు నానారాసభధ్వానముల్
భూదిక్కంపముగాఁ జెలంగె విగతాంభోభృన్నభోవీథియం
దాదిత్యద్యుతి మాయఁగాఁ గురిసె నుగ్రాసృఙ్మహావర్షముల్. (ఆది. 5-106)
దుర్యోధనుడు పుట్టగానే క్రూరమృగాల అరుపులు, నక్కలకూతలు, మదించిన గుడ్లగూబల ఘూంకారాలు, నానావిధాలైన గాడిదల ఓండ్రలు, భూమి, దిక్కులు కంపించే విధంగా చెలరేగాయి. ఆకాశంలో నీటిని ధరించిన మేఘాలు తొలగి, సూర్యకాంతి మాసేటట్లుగా భయంకర మైన పెద్దనెత్తుటివానలు కురిశాయి.
ఇవన్నీ లోకోపద్రవాన్ని సూచించే అపశకునాలు. పాండురాజు పెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకానందకరాలైన శుభశకునాలు కలిగాయి. ధృతరాష్ట్రుని పెద్దకొడుకు పుట్టినప్పుడు సర్వలోకారిష్టదాయకాలైన అపశకునాలు కలిగాయి. ఇవి భావికథలో కురువంశంలో వా ళ్ళిద్దరూ వరుసగా నిర్వహించే నిర్మాణాత్మక, విధ్వంసకాత్మకపాత్రల ప్రవృత్తులను ధ్వనింప చేస్తున్నాయి.(పుట. 518) ఇది వ్యక్తిత్వ నిర్మాణంలో జాతక ప్రాముఖ్యతను తెలుపుతుంది.
4. ముహూర్త బలం - కాల నిర్ణయం
శుభకార్యాలకు ముహూర్తం నిర్ణయించడం ప్రాచీన సంప్రదాయం. హిడింబాసుర వధ సమయంలో భీముడి విజయం వెనుక ముహూర్త బలం ఉందని నన్నయ పేర్కొన్నారు. ఆది పర్వం 6వ ఆశ్వాసం 216వ పద్యంలో ఈ ఘట్టం కనిపిస్తుంది.
ఉ. తూ ర్పరుణంబుగాఁ దొడఁగె దుష్టనిశాచరవేళ యయ్యెడున్
మార్పుము కాలయాపన మమర్పక యప్పిశితాశిఁ బట్టి పా
లార్పఁగ నేల నావుడు బలాఢ్యుఁడు భీముఁడు మల్లవిద్య నే
ర్పేర్పడఁగా హిడింబు బలహీనపరాక్రముఁ జేసెఁ జెచ్చెరన్. 216
తూర్పు ఎర్రబడుతున్నది. దుష్టరాక్షసులకు అనుకూల సమయం ఆసన్నమౌతున్నది. ఆలస్యం చేయక ఆ రాక్షసుణ్ణి చంపుమని అర్జునుడనగా తనమల్లయుద్ధనైపుణ్యం మెరయగా భీముడు హిడింబాసురుణ్ణి బలహీనుణ్ణి చేశాడు.
సంధ్యాసమయం రాక్షసుల కనుకూలమట! పూర్వసంధ్యాసమయంలో రౌద్రముహూర్తం వస్తుందట! అప్పుడు రాక్షసు లెక్కువ శక్తిమంతులవుతారట! 'పుర స్పంరజ్యతే ప్రాచీ, పూర్వా సంధ్యా ప్రవర్తతే| రౌద్రే ముహూర్తే రక్షాంసి భవంతి బలవంతి చ' శ్రీమదాంధ్రమహాభారతసంశోధితప్రతి, పుట. 376.
సరైన సమయంలో తీసుకునే నిర్ణయం విజయానికి మార్గం చూపుతుందని ఇక్కడ స్పష్టమవుతోంది.
వివాహ ముహూర్తాల విషయంలో నక్షత్రాల ప్రాధాన్యతను కవి వివరించారు. ద్రౌపదీ స్వయంవరం పుష్య నక్షత్రం, అష్టమి తిథి కలిసిన శుభముహూర్తంలో జరిగిందని ఆదిపర్వం 7వ ఆశ్వాసం 25వ వచనం తెలుపుతుంది.
వ. “ ’తొల్లి దేవేంద్రుండు గొండొకకాలం బదృశ్యుం డై యుండిన, నతనిం గానక శచీదేవి శోకింపం బోయిన నుపశ్రుతిం జేసి బృహస్పతి దానికి దేవేంద్రాగమనంబు సెప్పె నని వేదంబుల వినంబడుం; గావున నేను నుపశ్రుతిం జూచితి; నిది దప్పదు; పాండవులు పరలోకగతులు గారు; పరమానందంబున నున్నవారు; వార లెందుండియు నిందులకు వత్తురు; నీవును సుచిత్తుండ వయి స్వయంవరం బిప్పురంబున ఘోషింపం బంపు; మిది కన్యాదానంబునందు రాజులకు శాస్త్రచోదితం' బనినం బురోహితువచనంబునంజేసి, యూఱడి ద్రుపదుండు నేఁటికి డెబ్బదియేనగు దివసంబునం బౌషమాసంబున శుక్లపక్షంబున నష్టమియు రోహిణినాఁడు స్వయంవరం బని ఘోషింపం బంచి.” 25
పూర్వం దేవేంద్రుడు కొంతకాలం కనబడకపోగా, శచీదేవి శోకించిం దనీ, శుభసూచకమైన ఇతరుల సంభాషణనుబట్టి బృహస్పతి ఆమెకు దేవేంద్రుని రాకనుగురించి చెప్పా డనీ వేదాలవలన తెలుస్తున్నది. కనుక నేనుకూడ అట్లాంటి శుభశకునాలే చూచాను. ఇది తప్పదు. పాండవులు మరణించలేదు. పరమానందంతో ఉన్నారు. నా ళ్ళెక్కడున్నా ఇక్కడికి వస్తారు. నీవు నిర్మల మైన మనస్సుతో ఈ పట్టణంలో స్వయంవరాన్ని చాటించడానికి ఆజ్ఞాపించుము. స్వయంవరం కన్యాదానంలో రాజులకు శాస్త్రవిహితమే- ఈ విధంగా చెప్పిన పురోహితునిమాటలతో ఈ నాటినుండి డెబ్భై ఐదవరోజు పుష్యమాస, శుక్ల పక్ష అష్టమి, రోహిణీనక్షత్రం ఊరటచెంది, ద్రుపదుడు -ఉన్నరోజు స్వయంవరం జరుగుతుం దని చాటించటానికి ఆజ్ఞాపించాడు.
కొన్ని ప్రతులలో 'అష్టమి'కి బదులు పంచమి అని ఉన్నది. ఉపశ్రుతి అంటే ఒకరు మాట్లాడుతున్నప్పుడు అనుకోకుండా శుభాశుభసూచకమైన ఇతరుల సంభాషణ వినటం. ఇది శకునం. దీన్నిబట్టి భవిష్యత్తులో జరుగబోయే శుభాశుభాలను శకునశాస్త్రం చెప్పేవాళ్లు చెప్పుతారు. (పుట. 732)
అయితే నన్నయ మరో చోట రోహిణీ నక్షత్రం అని ప్రస్తావించడంపై పండితుల మధ్య చర్చ ఉంది. ఇది నాటి పంచాంగ గణనలోని సూక్ష్మాలను సూచిస్తుంది.
కాల గణనలో తిథి, నక్షత్రం, యోగం, కరణం వంటి పంచాంగ విశేషాలను నన్నయ తన రచనలో సహజంగా వాడారు. సభా పర్వంలో పాండవులు వనవాసానికి వెళ్లే సమయంలో ఉన్న కాల స్థితిని కూడా జ్యోతిష పరంగా విశ్లేషించారు. ముహూర్త శాస్త్రం వేడుకలకే కాక, విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి కూడా వాడతారని ఇందులో కనిపిస్తుంది.
5. శకున విజ్ఞానం
శకునాలు భవిష్యత్తును సూచించే సంకేతాలని నన్నయ భారతంలో కనిపిస్తుంది. ధర్మరాజుకు విజయసూచకంగా కుడికన్ను, భుజం అదరడం వంటి శుభశకునాలు కలిగాయి. అరణ్యపర్వం 4వ ఆశ్వాసంలోని 114వ వచనం ఈ విశేషాలను వివరిస్తుంది.
వ. “పురుషకారంబునంజేసి దైవంబు నివర్తింప నెవ్వ రోపుదు? రేను మహాబలుండ నయ్యును భవద్గృహీతుండ నై యిట్టియవస్త్రం బొందితి; నాత్మత్యాగంబునకు వగవ; నపహృతరాజ్యానుభోగులై మద్రాతృవరులు దుర్గమంబైన యిప్పర్వతకందరంబునం గ్రుమ్మరుచున్నవారు నన్నుఁ గానక యెంత దుఃఖింతురో యని వగచెద' ననుచున్నంత; నిట ధర్మతనయుండు దీప్తం బైన శివారుతంబు విని యతిశంకితచిత్తుండయి యనంతరంబ తన దక్షిణభుజాస్పందనం బుపలక్షించి మీఁద లగ్గగు నంచు ననుజమధ్యంబున ననిలజుం గానక యర్జునుం గవలను గృష్ణారక్షణార్థంబు నియోగించి ధౌమ్యపురోగమభూసురవరులతో భీము రోయుచుం దదీయపాదతల లలిత హలకులిశ కలశజలజాది లక్షణాలంకృతం బైన పాంసుపథంబునం జని ముందట.” (అర. 4-114)
శకునాల ద్వారా రాబోయే శుభాశుభాలను ముందుగానే గ్రహించవచ్చనే శాస్త్రసమ్మతమైన విషయాలను నన్నయ భారత రచనలో ప్రస్తావించారు. “శివారుతం” - నక్కకూత అపశకునంగా, కుడిభుజం అదరటం శుభసూచనగా మహాభారత రచనాకాలం నుండి వస్తున్న విశ్వాసాలు. పాదాలయందు ఉండే హలం, కులిశం, కలశం, పద్మం మున్నగు చిహ్నాలు మహాపురుషలక్షణాలుగా భారతీయ సాముద్రిక శాస్త్రప్రవచనం.
దుశ్శకునాల వల్ల కలిగే భయాన్ని నన్నయ వర్ణించారు. దుర్యోధనుడి జననం, సభాపర్వంలో ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి సందర్భాలలో అశుభ శకునాలు సంభవించాయి. నక్కల కూతలు, ఆకాశంలో మార్పులు వంటివి వినాశనాన్ని ముందే హెచ్చరించాయి.
ధృతరాష్ట్రుడికి కలిగిన అశుభసూచనలు కూడా సభాపర్వం 2వ ఆశ్వాసంలో ప్రస్తావనకు వచ్చాయి.
కం. ధృతరాష్ట్రు నగ్నిహోత్రా
యతనంబున నఱచె వఱళు, లగ్నులు శాంత
ద్యుతులయ్యెఁ, గౌరవ స్త్రీ
తతిహృదయము లధికశోకతప్తము లయ్యెన్. (సభా. 2-251)
కం. క్రూరాత్మకులై దుప్పద
వీ రతులగు ధార్తరాష్ట్రవీరుల శయ్యా
గారముల నెగసె నెంతయు
ఘోరంబుగఁ గాక ఘూక ఘూత్కారంబుల్. (సభా. 2-252)
ధృతరాష్ట్రుని అగ్నిహోత్రగృహంలో పెద్దనక్కలు అరిచాయి. అగ్నిహోత్రాల్లో వెలుగులు చల్లారినాయి. కౌరవస్త్రీసమూహాల హృదయాలు దుఃఖంతో కలతచెందాయి. క్రూరమైన మనస్సు కలవాళ్ళు, చెడుమార్గం ఇష్టమైనవాళ్ళు, అయిన కౌరవ వీరుల పడకటిండ్లలో ఎంతో భయంకరంగా కాకుల కూతలు, గుడ్లగూబల అరపులు వ్యాపించాయి. (పుట. 252)
ప్రకృతిలోని మార్పులను శకునాలుగా భావించడం నన్నయ కవిత్వంలో ఒక ప్రత్యేకత. పక్షుల ధ్వనులు, జంతువుల ప్రవర్తన భవిష్యత్ సంఘటనలకు అద్దం పడతాయని ఆయన వివరించారు. ఇవి కేవలం మూఢనమ్మకాలు కాక, ప్రకృతితో మానవ జీవితానికి ఉన్న సంబంధాన్ని తెలిపే శాస్త్ర అంశాలుగా పరిశోధకులు భావిస్తారు.
6. వాస్తు శాస్త్రవిశేషాలు
నిర్మాణరంగంలో జ్యోతిష అనుబంధ శాస్త్రమైన వాస్తు ప్రాధాన్యాన్ని నన్నయ గుర్తించారు. మయసభ నిర్మాణం వాస్తు శాస్త్రానికి సంబంధించిన అద్భుతంగా నన్నయ భారతంలో వర్ణించబడింది. సభాపర్వం మొదటి ఆశ్వాసం 14వ వచనంలో మయుడు సకల జన సమ్మతంగా సభను నిర్మించిన తీరు ఉంది.
వ. “మఱియు సకలజన మనోహరంబు లైన నానావిధ యంత్రంబులును, ననవరత కుసుమఫలభరితంబు లైన తరువనంబులును, వికచ కమల కుముదాభిరామంబులైన జలాశయంబులును, వివిధ విచిత్ర పతాకావలంబిత తోరణ విటంక ప్రదేశంబులునుం గలిగి దశ కిష్కు సహస్ర ప్రమాణవృత్తాయతంబును. సహస్రకర ప్రభా ప్రసర విస్తార విభూతియును వివిధరత్న విభవాభిశోభితంబునుంగా నపూర్వ సభా భవనంబు నందుఁ బదునాలుగు నెలలు నిర్మించి, దాని నెనిమిది వేల రాక్షస కింకరుల మహాకాయుల మహాజవసత్త్వ సంపన్నుల నంతరిక్ష చరులం బనిచి మోపించికొని వచ్చిధర్మరాజున కిచ్చి, గదయును శంఖంబును భీమార్జునుల కిచ్చి, ధర్మరాజుచేత సత్కృతుండయి మయుం డరిగిన”, 14
ఇందులో దిశలు, కొలతలు, గ్రహగతుల అనుసరణ కనిపిస్తుంది. అపురూపమైన ఆ సభాభవనంలో మయుడు మనోహరాలైన అనేక యంత్రాలు అమర్చాడు. ఎప్పుడూ పూలతో, పండ్లతో కనులపండువుగా కనిపించే చెట్లతోపులను రూపొందించాడు. పూచిన తామరలతో, విచ్చిన కలువలతో కళకళలాడే కొలనులు కల్పించాడు. చూడ ముచ్చటగా వ్రేలాడే రకరకాల పతాకాల తోరణాలతో కూడి గువ్వల గూళ్ళున్న ప్రదేశాలు ఏర్పాటు చేశాడు. పదివేల మూరల చుట్టుకొలతతో సువిశాలమై, సూర్యకిరణప్రసారంతో వైభవోపేతమై, వివిధరత్నకాంతులతో విశేషంగా శోభిల్లే ఆ సభాభవనాన్ని బిందుసరం దగ్గర పదునాలుగునెలలు పరిశ్రమించి నిర్మించాడు. పెద్దశరీరాలతో, అమితవేగంతో అత్యధికబలంతో ఆకాశాన సంచరించే ఎనిమిదివేలమంది రాక్షసభటులచేత ఆ భవనాన్ని మోయించి తెచ్చి ధర్మరాజుకు ఇచ్చాడు. భీమునికి గదను, అర్జునునికి శంఖాన్ని అందించాడు. ధర్మరాజుచేత సన్మానంపొంది వెళ్ళాడు. (పుట. 9)
పాండవులు అరణ్యవాసంలో పర్ణశాలలు నిర్మించుకున్నప్పుడు కూడా వాస్తునియమాలు పాటించినట్లు ఆధారాలున్నాయి. జలవనరులు, గడ్డి, ఇతర సౌకర్యాల లభ్యతను బట్టి గృహస్థాన నిర్ణయం చేసే పద్ధతిని అరణ్యపర్వంలో వివరించారు. ఇది నాటిసామాజిక జీవితంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యాన్ని చాటుతుంది.
ఉపసంహారం
నన్నయ ఆంధ్ర మహాభారతం జ్యోతిషశాస్త్ర నిధి. ఖగోళాంశాలు, జాతకచక్రాదులు, ముహూర్తనిర్ణయాలు, శకునాలు, వాస్తువిశేషాలు ఈ ఇతిహాసంలో విడదీయలేని ఆనుషంగిక విషయాలు. నన్నయకున్న ఈ శాస్త్రపాండిత్యం ప్రతి పద్యంలోనూ ప్రతిబింబిస్తుంది. నాటి సమాజం జ్యోతిషంపై కనపరచిన విశ్వాసాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని ఈ పరిశోధన ద్వారా గ్రహించవచ్చు. భారత కథను నడపడంలో జ్యోతిషాంశాలు కీలకపాత్ర పోషించాయని చెప్పడం అతిశయోక్తి కాదు.
- నన్నయ మహాభారతంలో ఖగోళ విజ్ఞానం, కాల గణన శాస్త్రీయ కోణంలో వివరించబడ్డాయి.
- వ్యక్తి జననం, వంశ నాశనం వంటి అనేక ఘట్టాలలో జాతక ఫలితాలు ప్రధాన పాత్ర పోషించాయి.
- ముహూర్త బలం, శకున విజ్ఞానం ఇతిహాసంలో భవిష్యత్ సూచనలుగా నిలిచాయి.
- నిర్మాణ రంగంలో వాస్తుశాస్త్రప్రాధాన్యాన్ని మయసభ, పర్ణశాల ఉదంతాల ద్వారా కవి నిరూపించారు.
ఉపయుక్త గ్రంథసూచి
- కవిత్రయభారతం. ఆది, సభా, అరణ్యపర్వములు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 2012
- కామాచార్య, అరసవల్లి. కామేశ్వర వాస్తు సుధాకరము. బాలాజీ బుక్ డిపో, విజయవాడ, 2003.
- శ్రీశార్వరి. హస్త సాముద్రికం. మాస్టర్ యోగాశ్రమం, సికింద్రాబాద్, 2007.
- కమలాకరశర్మ, సాగి. ప్రాచీన తెలుగుసాహిత్యంలో జ్యోతిషవిజ్ఞానం. ఉస్మానియా విశ్వవిద్యాలయము, 2004.
- వేంకటరాయశర్మ, రాంభట్ల. మహాభారతంలో జ్యోతిశ్శాస్త్రాంశాలు, ప్రాజెక్టు రిపోర్డ్, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం, CIIL, నెల్లూరు. 2021
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

