AUCHITHYAM | Volume-07 | Issue-04 | April 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
4. సులభవ్యాకరణము: బాల, ప్రౌఢ వ్యాకరణాల తులనాత్మక విశ్లేషణ
కప్పల సురేశ్
పరిశోధకుడు, తెలుగుశాఖ
మానవీయ శాస్త్రాల విభాగం, హైదరాబాదు విశ్వవిద్యాలయం
హైదరాబాదు, రంగారెడ్డిజిల్లా, తెలంగాణ
సెల్: +91 7680073973, Email: ureshbabu147147@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 19.10.2025 ఎంపిక (D.O.A): 10.03.2026 ప్రచురణ (D.O.P): 01.04.2026
వ్యాససంగ్రహం:
తెలుగు భాషా వ్యాకరణ చరిత్రలో బాల ప్రౌఢ వ్యాకరణాలు ప్రామాణిక గ్రంథాలు. వీటిని విద్యార్థులకు మరింత సులభతరం చేసే లక్ష్యంతో వావిలికొలను సుబ్బారావు రచించిన 'సులభవ్యాకరణము' ప్రాముఖ్యత ఈ పరిశోధన ప్రధానాంశం. బాల ప్రౌఢ వ్యాకరణాల లోపాలను సవరించడం, విడిచిపెట్టిన అంశాలను పూరించడం, కొన్ని విషయాలను విస్తృతంగా వివరించడం, నూతన అంశాలను పరిచయం చేయడంలో 'సులభవ్యాకరణము' చూపిన ప్రత్యేకతలను విశ్లేషించడం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. ఆధునికాంధ్ర వ్యాకరణ నిర్మాణంలో వావిలికొలను సుబ్బారావుగారి కృషిని అంచనా వేయడం ఈ పరిశోధన ఆవశ్యకత. ఆచార్య జి. లలిత, అమరేశం రాజేశ్వరశర్మ వంటి పూర్వ పరిశోధకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోబడింది. ఈ అధ్యయనం 'సులభవ్యాకరణము' మూల గ్రంథంగా, బాల ప్రౌఢ వ్యాకరణాలు ద్వితీయ వనరులుగా స్వీకరించి, తులనాత్మక విశ్లేషణ పద్ధతిని అనుసరించింది. ప్రస్తుత వ్యాసం కేవలం కొన్ని ప్రాథమిక అంశాల చర్చకు పరిమితమైనది. పరిశోధన ఫలితంగా శకటరేఫ (ఱ) ను వర్ణంగా గుర్తించడం, ణ ళ అక్షరాలు తెలుగు పదారంభంలో ఉండవని పేర్కొనడం, వర్ణోత్పత్తి స్థానాలను వివరించడం, తత్సమ దేశ్య అన్యదేశ్య పదాల మధ్య భేదాలను స్పష్టం చేయడం, గుణింతాలు, 'యె' అక్షర వినియోగం, 'పట్టి' ప్రత్యయ వినియోగం, మాహేశ్వర సూత్రాల ఆధారంగా సంస్కృత సంధులను సూత్రీకరించడం వంటి పలు నూతన అంశాలు 'సులభవ్యాకరణము' లో గుర్తించబడ్డాయి. ఈ గ్రంథం బాల ప్రౌఢ వ్యాకరణాలకు ఒక పరిశిష్ట గ్రంథంగా చెప్పవచ్చు
Keywords: సులభవ్యాకరణము, బాలవ్యాకరణము, ప్రౌఢవ్యాకరణము, తెలుగు వ్యాకరణం, వావిలికొలను సుబ్బారావు, వ్యాకరణ తులనాత్మక విశ్లేషణ, భాషాశాస్త్రం, పరిశిష్ట గ్రంథం.
1. ప్రవేశిక
తెలుగు భాషలో వెలువడిన వ్యాకరణ గ్రంథాలలో ప్రతి ఒక్క గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు భాష కోసం కొన్ని వ్యాకరణ గ్రంథాలు మొదట సంస్కృతంలో రాశారు. ఆ తర్వాత తెలుగులో రచింపబడ్డాయి. తెలుగులో ప్రాచీన కావ్యభాషా లక్షణాన్ని తెలిపే గ్రంథాలుగా విశేషమైన ఆదరణ పొందినవి బాల, ప్రౌఢ వ్యాకరణాలు. కావ్య భాషా పరంగా, సామాన్య భాషా లక్షణాన్ని ‘బాల వ్యాకరణము’ నిర్దేశించగా, అందులో విశేష లక్షణాలను ప్రయోగాలను ‘ప్రౌఢవ్యాకరణము’ వివరించింది. బాల, ప్రౌఢ వ్యాకరణాల ప్రాథమిక విషయాలను ఒకచోట చేర్చి, వాటిని సవరించి, పూరించి, వివరించే కోణంలో వావిలికొలను సుబ్బారావుగారు ‘సులభవ్యాకరణము’ అనే వ్యాకృతిని రచించారు.
వావిలికొలను సుబ్బారావు విద్యార్థులను ఉద్దేశించి ‘సులభ వ్యాకరణాన్ని’ మూడు భాగాలుగా రచించారు. సంజ్ఞా, సంధి పరిచ్చేదాలను మాత్రమే ప్రథమ భాగంలో పేర్కొన్నారు. విద్యార్థుల ఆదరణ పండితుల ప్రోత్సాహాన్ని పురస్కరించుకొని ద్వితీయ, తృతీయ భాగాలను కూడా రచించారు. ద్వితీయ భాగంలో తత్సమ, ఆచ్ఛిక, కారక, సమాస, తద్ధిత, క్రియా, కృదంత, ప్రకీర్ణ పరిచ్ఛేదాలు తృతీయ భాగంలో వ్యాసపరిచ్చేదాన్ని పొందుపరిచారు. మొత్తంగా ఈ వ్యాకరణంలో పన్నెండు పరిచ్ఛేదాలు ఉన్నాయి.
సులభ వ్యాకరణాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు బాల, ప్రౌఢ వ్యాకరణాలకు పూరణ గ్రంథంగా ఇది మనకు కన్పిస్తుంది. వావిలికొలనువారు ఆ రెండు వ్యాకరణాలలోని విషయాలను గ్రహించి, అవి విడిచి పెట్టిన అంశాలను చేర్చి ఒక నూతన గ్రంథంగా ‘సులభ వ్యాకరణాన్ని’ నిర్మించారు.
‘సులభ వ్యాకరణము’ గురించి ఆచార్య లలిత ఇలా అన్నారు: “బాల ప్రౌఢ వ్యాకరణములకు పూరక గ్రంథమని నుడువకున్నను, ఆరెంటి యందలి విషయమును గ్రహించి, అవి విడిచిన వానిని చేర్చి నిర్మించిన వ్యాకృతి “సులభ వ్యాకరణము”” (లలిత 181). రాజేశ్వరశర్మ తమ సిద్ధాంత గ్రంథం ‘ఆంధ్ర వ్యాకరణ వికాసము’ నందు ‘సులభ వ్యాకరణము’ ప్రాథమిక అంశాలను చర్చిస్తూ “శ్రీ సుబ్బారావుగారు పరిచ్ఛేదముల విభాగముననే కాదు; సూత్ర రచనము నందుఁ గూడా బాలప్రౌఢ వ్యాకరణములను బూర్తిగా నుపయోగించుకొనిరి” (రాజేశ్వరశర్మ 358) అని అన్నారు. వావిలికొలను సుబ్బారావుగారు ఆధునికాంధ్ర వ్యాకరణ నిర్మాతలలో ప్రామాణికులని, సులభవ్యాకరణం పైన ఆంగ్లవ్యాకరణ ప్రభావం ఉన్నప్పటికీ చాలా విషయాలలో ప్రామాణికతను సాధించిందని, అతివ్యాప్తి, అవ్యాప్తులు లేకుండా లక్షణ నిర్వచనాలు చెప్పబడ్డాయని రాజేశ్వరశర్మ అన్నారు.
ప్రస్తుత వ్యాసం వావిలికొలను సుబ్బారావుగారు రచించిన ‘సులభవ్యాకరణము’ అనే గ్రంథాన్ని బాల, ప్రౌఢ వ్యాకరణాలతో పోల్చుతూ, సవరణ, పూరణ, వివరణ కోణంలో వ్యాస పరిధిని దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాథమిక అంశాల చర్చకు మాత్రమే పరిమితమైనది.
2. సులభవ్యాకరణంలో బాల, ప్రౌఢ వ్యాకరణ అంశాలు
వావిలికొలను సుబ్బారావుగారు బాల, ప్రౌఢ వ్యాకరణాల నిర్మాణాన్నే అనుసరించారు. విభాగాలను ‘పరిచ్ఛేదాలనే’ పిలిచారు. సులభవ్యాకరణంలో సంజ్ఞ, సంధి, తత్సమ, ఆచ్ఛిక, కారక, సమాస, తద్ధిత, క్రియా, కృదంత, ప్రకీర్ణక, వాక్య, వ్యాస పరిచ్ఛేదాలు ఉన్నాయి. పేరుకు తగిన విధంగా ఆయా పరిచ్ఛేదాలకు సంబంధించిన విషయాలు ఇతర పరిచ్ఛేదాలకు వెళ్ళకుండా వావిలికొలనువారు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ‘సులభ వ్యాకరణము’ లో వ్యాకరణాంశాలను సూత్రాలుగా చెప్పేటప్పుడు అవ్యాప్తి, అతివ్యాప్తి దోషాలను వదిలిపెట్టారు. ఒక్కొక్క అంశానికి సంబంధించిన సూత్రాలను ఒకే చోట చెబుతూ ప్రకరణ ఔచిత్యాన్ని పాటించారు. బాల, ప్రౌఢ వ్యాకరణాలలో సూత్రం క్రింద కన్పించే వృత్తి వాక్యాలను కూడా సులభ వ్యాకరణంలో సూత్రంగా చెప్పారు. బాల, ప్రౌఢ వ్యాకరణాలలోని చాలా వరకు యధాతదంగా సులభవ్యాకర్త గ్రహించారు. వాటిలో కొన్నింటిని ఇక్కడ పేర్కొంటాను.
2.1. సులభ వ్యాకర్త చెప్పిన బాల వ్యాకరణ సూత్రాలు
అఆఊఊఒఓఔ-లం గూడినచజలు దంత్యంబులు(సుబ్బారావు, సంజ్ఞ 36)
ద్రుత మంతమందు గల శబ్దములు ద్రుతప్రకృతికములు (సుబ్బారావు, సంజ్ఞ 68)
సంస్కృత శబ్దముతోను బ్రాకృత శబ్దముతోను సమానమైన రూపము గలది తత్సమము (సుబ్బారావు, సంజ్ఞ 72)
2.2. సులభ వ్యాకర్త చెప్పిన ప్రౌఢ వ్యాకరణ సూత్రాలు
ఆమ్రేడితంబు పరంబగునపుడు కృత హ్రస్వంబునకు దీర్ఘంబును నగు (సుబ్బారావు, సంధి 68)
సంబోధ్యవాచకంబు బహువచనాంతంబయ్యుఁ గ్రియలమీఁది యమ్మాదు లేకవచనాంతంబుల యగు (సుబ్బారావు, వాక్య 20)
న్యూనవచో వాక్యంబునఁ దద్వచనంబు లధ్యాహార్యంబు లగు (సుబ్బారావు, వాక్య 59)
3. సులభవ్యాకరణ పరిశీలన: తులనాత్మక దృష్టి
3.1. సవరణ అంశాలు
సులభవ్యాకరణములో ప్రతి పరిచ్ఛేదంలో బాల, ప్రౌఢ వ్యాకరణాలకు సంబంధించి సవరణలు చేసిన విషయాలు ఉన్నాయి. బాల, ప్రౌఢ వ్యాకర్తలిద్దరు శకటరేఫని (ఱ) వర్ణంగా పేర్కొనలేదు. సులభ వ్యాకర్త దానిని వర్ణంగా భావించి
తెలుఁగునకు వర్ణములు ముప్పదియేడు (సుబ్బారావు, సంజ్ఞ 11);
ఆంధ్ర భాషకు వర్ణంబులు లేఁబది యాఱు (సుబ్బారావు, సంజ్ఞ 12) అని సూత్రాలను చెప్పారు.
ప్రౌఢవ్యాకర్త
శ్రేష్ఠతా వాచకములగు నార్యాంబాద్యర్థక శబ్దంబులు పరంబులగుచో నన్ని యచ్చులకు సంధి నిత్యము
(సీతారామాచార్యులు, సంధి 1) అని శ్రేష్ఠతను బోధించే ఆర్య (అయ్య), అంబా (అమ్మ), అన్న, అక్క, అప్ప మొదలైన శబ్దాలు పరమైతే అచ్చులన్నింటికి సంధి నిత్యంగా వస్తుందని చెప్పారు. ఉదాహరణకు ‘రామ+అయ్య= రామయ్య’, ‘లక్ష్మి+అమ్మ= లక్ష్మమ్మ’. సులభవ్యాకర్త
ఇకారాంత నామవాచకంబులకు శ్రేష్ఠార్థకంబులైన అన్నాదులు బరమైనపుడు సంధి ప్రాయికంబు
(సుబ్బారావు, సంధి 5) ఇకారాంత నామాలకు శ్రేష్ఠార్థాన్ని ఇచ్చే అన్నాదులు (అన్న, అయ్య, అక్క, అమ్మ) పరంగా ఉంటే సంధి ప్రాయకంగా వస్తుందని చెప్పారు. అంటే కొన్నిచోట్ల సంధి జరగక యడాగమం వస్తుంది. ఉదాహరణకు ‘అమ్మాజి +అమ్మ =అమ్మాజమ్మ, అమ్మాజియమ్మ’.
బాలవ్యాకర్త
సమానపదంబునందు సంయోగంబు పరంబగునపుడెల్లచో ఖండబిందువునకుం బూర్ణంబగు (చిన్నయసూరి, ఆచ్ఛిక 15).
ఏకపదంలో (రెండు పదాలుగా విడదీయడానికి వీలు లేని పదంలో) సంయోగాక్షరం (సంయుక్తాక్షరం) పరమవుతుంటే దానికి ముందు ఉండే అర్థబిందువు అంతటను పూర్ణబిందువుగా అవుతుందని చెప్పి ‘అనఁటులు, అనంట్లు’ వంటి రూపాలను బాలవ్యాకర్త సాధించారు. సులభవ్యాకర్త
మూఁడు నాఁడులం దప్ప నేకపదంబున సంయుక్తాక్షరంబు పరంబగునపు డఱసున్న నెఱసున్న యగు (సుబ్బారావు, ఆచ్ఛిక 22)
అని సూత్రీకరించి ‘మూఁడు, నాఁడు’ అనే శబ్దాలకు తప్ప అన్ని చోట్ల ఏకపదాలలో సంయుక్తాక్షరం పరమవుతుంటే అరసున్న నిండుసున్నగా మారుతుందని చెప్పారు. ఉదాహరణకు ‘మూఁడు మూళ్లు తొమ్మిది, ఎన్ని నాళ్ళు’ వంటి రూపాలను చెప్పారు. ఈ సూత్రం బాలవ్యాకరణానికి సవరణ సూత్రంగా కన్పిస్తుంది.
3.2. పూరణ అంశాలు
బాలవ్యాకర్త
యకారంబును వు వూ వొ వోలును దెలుగు మాటలకు మొదట లేవు (చిన్నయసూరి, సంజ్ఞ 17)
అని కొన్ని అక్షరాలను తెలుగు మాటలలో మొదటగా ఉండవని చెప్పారు. సులభ వ్యాకర్త దానిని కొంత పూరిస్తూ
ణ, య, ళ, వు, వూ, వొ, వో, యను నక్షరములు తెనుగు మాటలకు మొదట నుండవు (సుబ్బారావు, సంజ్ఞ 49)
అని ణ, ళ అక్షరాలు కూడా తెలుగు పదాలలో మొదటగా ఉండవని చెప్పారు. వావిలికొలనువారు ఈ సూత్ర వివరణలోనే రేఫతో కూడిన సంయుక్తాక్షరాలు తప్ప, వేరే హల్లుతో కూడుకొన్న సంయుక్త అక్షరాలు తెలుగు మాటలలో మొదటగా ఉండవని చెప్పారు. ఉదాహరణకు ‘వ్రాలు, ప్రాలు’ ఇవి తెలుగు మాటలు.
బాలవ్యాకర్త
అత్తునకు సంధి బహుళముగానగు (చిన్నయసూరి, సంధి 4)
అనే సూత్రంలో వృత్తి వాక్యంలో బహుళగ్రహణం చేత స్త్రీ వాచక, తత్సమ, సంబోధన పదాలలోని అకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి జరగదని చెప్పారు. ఉదాహరణకు ‘స్త్రీవాచకానికి-అమ్మయిచ్చెను’, ‘తత్సమానికి-దూతయితడు’, ‘సంబోధనాంతానికి-చెలువుఁడ ఇందము’. దీనికి కొనసాగింపుగా సులభవ్యాకర్త
స్త్రీ వాచక, తత్సమ, సంబోధ, నావధారణంబులకు సంధి లేదు (సుబ్బారావు, సంధి 4)
అని అవధారణార్థానికి కూడా సంధి లేదని చెప్పారు. రాముఁడ+ అతడు= రాముఁడ యతడు (అవధారణం).
బాలవ్యాకర్త అపదాలకు (పదం కానివి) సంధి నిత్యంగా చెప్పి ‘మూర+ఎడు= మూరెడు’ వంటి రూపాలను సాధించారు. ‘అందు, అవక్’ ఆగమాలకు మాత్రం ప్రయోగానుసారం గ్రహించాలని చెప్పి ‘రాముల+అందు= రాములందు, రాములయందు’ వంటి ఉదాహరణలను ఇచ్చారు. ఇదే విషయాన్ని సులభవ్యాకర్త
అంద్వం తాగాగమంబులందప్ప నపదాది స్వరంబున కచ్చు పరంబగు నపుడన్ని యచ్చులకు సంధి నిత్యము (సుబ్బారావు, సంధి 14).
‘అందు, అంత, అవక్’ అనే శబ్దాలు పరమైనప్పుడు తప్ప మిగిలిన అపదాలకు (నామవాచకం, క్రియ కాకుండా అర్థం లేని మాటలు) అచ్చుపరమైనప్పుడు అన్ని అచ్చులకు సంధి నిత్యమని చెప్పారు. ఈ సూత్రంలో బాలవ్యాకర్త చెప్పిన విషయాలనే కాకుండా సులభవ్యాకర్త ‘అందు, అవ’ శబ్దాల వలెనే ‘అంత’ అనే శబ్దానికి కూడా ప్రయోగానుసారం సంధి జరుగుతుందని చెప్పారు. ఉదాహరణకు ‘గంప+అంత= గంపంత, గంప యంత’.
ప్రౌఢవ్యాకర్త
ధ్వన్యనుకరణ శబ్దంబుల ద్విరుక్తంబుల యగు (సీతారామాచార్యులు, సంధి 20)
అని సూత్రీకరించారు. ఈ ధ్వన్యనుకరణ శబ్దాలు రెండు సార్లు ఉచ్ఛరించబడేవే ఉంటాయి. ఉదాహరణకు ‘గడగడ, వడవడ, తళతళ, పెళపెళ’. సులభవ్యాకర్త
ధ్వన్యనుకరణంబులు ద్వి, త్రి, చతురుక్తంబులునగు (సుబ్బారావు, సంధి 73).
ధ్వన్యనుకరణ శబ్దాలు రెండు, మూడు, నాలుగు సార్లయిన చెప్పబడేవి ఉంటాయని ‘గడగడ, భుగ భుగ, భుగ యనుచుం గాలఁ జొచ్చెఁ బురిమందిరముల్’, ‘ధణం ధణం ధణ ధణ ధ్వానంబుతో’ వంటి ఉదాహరణలను ఇచ్చారు. ఇది ప్రౌఢవ్యాకర్త చెప్పిన విషయానికి కొంత పూరణగా ఉన్నది.
సులభవ్యాకర్త
‘లు-ల’ లు బహువచనంబులు (సుబ్బారావు, తత్సమ 10)
అని సూత్రీకరించారు. ఒకటి కంటె ఎక్కువ సంఖ్యగల వస్తువులను తెల్పేది బహువచనం. ఉదాహరణకు ‘రామకృష్ణులు గోవులను వత్సములను వనముల మేపరి’. ఈ సూత్రంలో సులభవ్యాకర్త ‘ల’ అనే ప్రత్యయాన్ని కూడా బహువచనంలో ప్రత్యేకంగా చెప్పారు.
బాలవ్యాకర్త
ఆచ్ఛికశబ్దంబులెల్లం దఱుచుగ స్త్రీసమంబులు, గ్లీబ సమంబులయి యుండు (చిన్నయసూరి, ఆచ్ఛిక 2)
అని సూత్రీకరించారు. ఆచ్ఛిక శబ్దాలు సాధారణంగా స్త్రీ సమాలుగా గాని క్లీబ (నపుంసక) సమాలుగా గాని ఉంటాయని చెప్పారు. సులభవ్యాకర్త
ఏకాదులు తప్ప వికృతి శబ్దంబులు స్త్రీసమంబులు గ్లీబ సమంబులు (సుబ్బారావు, ఆచ్ఛిక 1)
అని సూత్రీకరించారు. ఏకాది గణాలలో చేరిన ‘ఒక్కడు-వాడు-వీడు-మగడు’ మొదలైన శబ్దాలు కాకుండా మిగిలిన అచ్చతెలుగు శబ్దాలన్ని స్త్రీ సమాలుగా గాని, క్లీబ సమాలుగా గాని అవుతాయని చెప్పారు. తద్భవ రూపాలుగా కన్పిస్తున్న ‘చందురుడు’ మొదలైన పుంలింగ రూపాలు ఏకాది గణంలో చేరుతాయని సులభవ్యాకర్త చెప్పారు.
బాలవ్యాకర్త ప్రాతిపదికర్థంలో, సంబోధనార్థంలో, ఉక్తార్థంలో ప్రథమా విభక్తి ప్రత్యయం వస్తుందని చెప్పగా, సులభవ్యాకర్త
ప్రాతిపదికార్థ, పరిమాణ, సంబోధ, నోక్తార్థంబులం బ్రథమయగు (సుబ్బారావు, కారక 2)
అని సూత్రీకరించి పరిమాణార్థంలో కూడా ప్రథమా విభక్తి ప్రత్యయం విధించారు. ఉదాహరణకు ‘చెట్లకు నీళ్ళు రెండు కడవలు పోయుము’. ఇందులో రెండు కడవల కొలత గల నీళ్ళని అర్థం. కాబట్టి ‘కడవలు’ అనే పదం ప్రథమావిభక్తిలో ఉన్నది.
ప్రౌఢవ్యాకర్త కర్మార్థంలో ఉద్దేశార్థక ద్వితీయకు ‘గుఱిచి’ అనేది అనుప్రయుక్తంగా వస్తుందని ‘మము గుఱిచి’ వంటి ఉదాహరణని చెప్పారు. సులభవ్యాకర్త
కర్మప్రవచనీయోద్దేశార్థంబుల ద్వితీయ కుఁ గూర్చి- గుఱించి-గుఱించులగు (సుబ్బారావు, కారక 5)
అని సూత్రీకరించారు. కర్మార్థంలో ఉద్దేశార్థక ద్వితీయకు ‘గూర్చి, గుఱచి, గుఱించి’ వంటి ప్రత్యయాలు వస్తాయి. కర్మ ప్రవచనీయమునకు ఉదాహరణ ‘దైవము గుఱించి జపము’. ఉద్దేశార్థమునకు ‘జ్ఞానము గుఱించి విద్య- కాశిం గూర్చి ప్రయాణము’. ఉద్దేశ ద్వితీయకు ‘కొఱకు- కై- కు’ ప్రత్యయాలు వస్తాయని సులభవ్యాకర్త చెప్పారు. ఉదాహరణకు ‘కాశికిఁ బ్రయాణము- మోక్షము కొఱకు (కై) బ్రయత్నము’. ఇక్కడ బాలవ్యాకర్త ‘గుఱిచి’ మాత్రమే చెప్పగా సులభవ్యాకర్త ‘గూర్చి- గుఱించి’ అనేవి కూడా వస్తాయని చెప్పారు.
బాలవ్యాకర్త
దఘ్నార్థంబున బంటి కొలఁదులగు (చిన్నయసూరి, తద్ధిత 27)
అని సూత్రీకరించారు. సంస్కృతంలో ‘దఘ్నచ్’ ప్రత్యయం లోతును తెలపుతుంది. ఈ అర్థంలో తెలుగు శబ్దాలకు ‘బంటి, కొలది’ అనే ప్రత్యయాలు చేరుతాయని ‘మోఁకాలు+వు+బంటి= మోఁకాలి బంటి’, ‘మోఁకాలి కొలది’ వంటి రూపాలను సాధించారు. సులభవ్యాకర్త
దఘ్నార్థంబున బంటి-కొలఁదు లు సర్వత్ర యగు (సుబ్బారావు, తద్ధిత 39)
అని సూత్రీకరించి ‘బంటి, కొలది’ అనే ప్రత్యయాలు తెలుగు శబ్దాలకు మాత్రమే కాకుండా, తత్సమ శబ్దాల మీదను వస్తాయని చెప్పారు. ఉదాహరణకు ‘మోకాలిబంటి, మోకాటి కొలది’. తత్సమానికి ఉదాహరణ ‘కటిబంటి’.
3.3. వివరణ అంశాలు
వావిలికొలనువారు ‘వర్ణ విభాగ ప్రకరణం’ లో వర్ణాల పేర్లను (సంజ్ఞలను), వాటి ఉత్పత్తి స్థానాలను చెప్పారు. ‘అ’కారాదులు అచ్చులుగా, ‘క’కారాదులు హల్లులుగా పూర్వ వ్యాకరణాల వలెనే పరిచయం చేసి సులభవ్యాకర్త ఇంకొంత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. హల్లులను స్థిరాలు, పరుషాలు, సరళాలు అని గాని; స్పర్శాలు, అంతస్థాలు, ఊష్మాలు, ళ అని గాని చెప్పవచ్చని చెప్పారు. బాల, ప్రౌఢ వ్యాకరణాలు సందర్బోచితంగా వర్ణాలు సంజ్ఞలను చెప్పాయి తప్ప ప్రత్యేకంగా వర్ణవిభాగ చర్చ చేయలేదు. వర్ణాలు ఉత్పత్తి స్థానాలను బట్టి కంఠ్యాలు, తాలవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్ఠ్యాలు అనునాసికాలు, కంఠ తాలవ్యాలు, కంఠ్యోష్ఠ్యాలు, దంత్యోష్ఠ్యం అవుతాయని సులభవ్యాకర్త పేర్కొన్నారు. సులభవ్యాకర్త తెలుగు భాషకు వర్ణాలను చెబుతూ వాటికి సంబంధించిన అన్ని వివరణలు ఒకేచోట వివరించారు.
సులభవ్యాకర్త
ఋ ౠ ఌ ఌూ విసర్గ వర్గయుగ్ఙఞశష లు తత్సమాన్య దేశ్యానుకరణంబులఁ గూడి యాంధ్ర భాషం జొచ్చు (సుబ్బారావు, సంజ్ఞ 17)
అని సూత్రీకరించి సంస్కృత భాషలోని 19 అక్షరాలు తత్సమ పదాలుగాను, అన్యదేశ్య పదాలుగాను, ధ్వన్యనుకరణ పదాలుగాను కలిసి ఆంధ్రభాషలోకి వచ్చాయని చెప్పారు. బాలవ్యాకర్త సంస్కృతంలోని 19 అక్షరాలు ‘తత్సమాలుగా’ మాత్రమే తెలుగులోకి వచ్చి చేరుతాయని చెప్పారు. సులభవ్యాకర్త తత్సమాలలోనే కాక అన్యదేశ్యాలుగా, ధ్వన్యనుకరణ పదాలుగా తెలుగులోకి ప్రవేశిస్తున్నాయని విస్తృతంగా చెప్పారు.
బాల వ్యాకర్త
సంస్కృత సమంబులం దికారాంతములయిన శబ్దముల యుపధా చజలు బహువచనంబు పరంబగునపుడు దంత్యములగును (చిన్నయసూరి, సంజ్ఞ 16).
సంస్కృత సమాలలో ‘చజ’లు ఉపథగా ఉండే ఇకారాంత శబ్దాలకు బహువచనం పరమైతే ఆ ఉపథగా ఉండే చజలు దంత్యాలవుతాయని చెప్పి ‘అర్చి+లు = అర్చులు’ వంటి రూపాలను చర్చించారు. ఈ సూత్రంలోనే వృత్తివాక్యంలో ‘రాజు’ శబ్దంబొక్కటి దంత్యయుక్తంబు కానంబడియెడి’ అని ‘రాజు’ అనే తత్సమ రూపం మాత్రమే దంత్యమవుతుంది చెప్పారు. సంస్కృత సమాలలో దంత్యాలు లేవని చెప్పారు.
సంస్కృత సమంబులందు దంత్యములు లేవు (సుబ్బారావు, సంజ్ఞ 39)
అని సూత్రీకరించి బాలవ్యాకర్త చెప్పిన విషయాన్నే కొంచం వివరంగా చెప్పారు. అనగా తత్సమాలలో కన్పిస్తున్న ‘చ-జ’లు ‘ౘ ౙ’ లుగా ఉచ్చరింపకూడదు. ‘చక్రం, చందనం, చంపకం, చకోరం, చామరం, చుంబనం, చూడామణి’ వంటి శబ్దాలలోని ‘చ’ కారం ‘అ,ఆ,ఉ, ఊ’ అనే అచ్చులతో కూడి ఉన్నప్పటికీ దంత్యాలు కావు. తత్సమ రూపాలు కాబట్టి అవి తాలవ్యాలే అవుతాయి. తత్సమాలలో తాలవ్య ‘చ-జ’లు కొన్నిచోట్ల దంత్యాలుగా మారుతున్నాయి. ఉదాహరణకు అర్చి+లు = అర్చులు.
సులభ వ్యాకర్త ‘రాజు’ శబ్దం ఉకారాంతంగా ఉన్న అది దంత్యమే అవుతుందని ‘రాజు+ఇతడు= రాజితడు’ రూపాన్ని చెప్పారు. ‘పాండురాజయశము’ ఇందులో ఉన్న ‘రాజ’ శబ్దాన్ని తాలవ్యంగానే చెప్పారు. ప్రౌఢవ్యాకర్త “రాజు వైకృతంబని కొందఱందురు” అని అనడం వల్ల ఆయన కూడా దీనిని సంస్కృత సమంగానే భావించారని చెప్పవచ్చు. బాల, ప్రౌఢ, సులభ వ్యాకర్తలు ముగ్గురూ ‘రాజు’ శబ్దాన్ని సంస్కృత సమంగా భావించారని తెలుస్తుంది.
బాల వ్యాకర్త
ఐదంతములయిన చజలు సమేతర శబ్దములందు లేవు (చిన్నయసూరి, సంజ్ఞ 9)
అని సూత్రంలో వృత్తి వాక్యంగా చెప్పారు. అనగా అచ్చ తెలుగులో చజలు ఐకారంతో కలిసి ఉండవు. ఈ విషయాన్నే సులభ వ్యాకర్త
చై జై - తెలుఁగుమాటలందు మొదట లేవు (సుబ్బారావు, సంజ్ఞ 37)
అని సూత్రీకరించారు. తెలుగు మాటలలో కనిపించకపోయిన తత్సమ రూపాలలో కన్పిస్తున్నాయని ‘చైత్రము-జైత్రుడు’ వంటి రూపాలను సులభవ్యాకర్త పేర్కొన్నారు.
సులభ వ్యాకర్త తత్సమాలను చెప్పే సందర్భంలో తత్సమాలని గుర్తించడానికి ఐదు రకాల విషయాలను చెప్పారు: 1. సంస్కృతంలో ఉండి తెలుగులో లేని 19 అక్షరాలలో ఏదో ఒక అక్షరం ఉన్న శబ్దాలు. ఉదాహరణ ‘రాక్షసుఁడు, అవధారు’ 2. యకారం- చై-జై -వు-వూ-వొ-వో అనే అక్షరాలు మొదట ఉండే శబ్దాలు. ఉదాహరణకు ‘చైత్రము, జైత్రుడు’ 3. అనుస్వారం పక్కన పరుష సరళాలు కాకుండా ‘కల’ శబ్దంతో కూడుకున్న మిగిలిన శబ్దాలు. ఉదాహరణకు ‘శృంఖలము’. 4. ‘వ్యాజ్యెం’ అనే శబ్దం తప్ప (రేఫ కాకుండా) వేరే హల్లులతో సంయుక్తమైన వర్ణాలు మొదటి అక్షరంగా ఉండే శబ్దాలు. ఉదాహరణకు ‘స్యందనం’ 5. రెండు కంటే ఎక్కువ హల్లులు సంయుక్తమైన శబ్దాలు. ఉదాహరణకు ‘మత్స్యము, ముత్త్రోవ’.
బాలవ్యాకర్త
త్రిలింగ దేశ వ్యవహార సిద్ధంబగు భాష దేశ్యంబు (చిన్నయసూరి, సంజ్ఞ 21)
అని నిర్వచించారు. మూడు శివలింగాల (శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం) మధ్య నివసిస్తున్న ప్రజలు వ్యవహరించే భాషను దేశ్యంగా బాల వ్యాకర్త చెప్పారు. ఉదాహరణకు ‘ఊరు, పేరు, తావి’. వావిలికొలనువారు ఏదైనా ఒక దేశంలో వ్యవహరించబడే భాష దేశ్యము నిర్వచించారు.
దేశమున వాడబడునది దేశ్యము (సుబ్బారావు, సంజ్ఞ 73).
‘ఆంధ్రదేశ్యం’ అనగా ఆంధ్ర దేశంలో పుట్టి ఆంధ్ర ప్రజలచే వాడబడే అచ్చతెలుగు. బాలవ్యాకర్త చెప్పినట్లుగా మూడు లింగాల సరిహద్దుగా గల ప్రదేశంలో భాషా వ్యవహర్తలు మాట్లాడే భాష దేశ్యము అని చెప్పలేదు. వావిలికొలనువారు చెప్పిన నిర్వచనం విస్తృతంగా కన్పిస్తున్నది. వావిలికొలనువారు దేశ్యాలతో పాటుగా అన్యదేశ్యాల చర్చ కూడా ఈ సూత్ర వివరణలో సందర్భోచితంగా చేశారు. ఆంధ్రులు ఇతర భాషల నుండి తమ భాషలోకి చేర్చుకొనే పదాలను అన్యదేశ్యాలు అంటారని చెప్పారు. ఉదాహరణకు ‘పురే’ ఇది మరాఠి భాషా పదం. దీనికి చాలు అని అర్థం. ఇది ప్రశంసార్థకమైన ‘బాపురే’ నుండి ఏర్పడినది కాదని చెప్పారు.
3.4. నూతన అంశాలు
వావిలికొలనువారు ‘గుణింతాలు’ వంటి సూక్ష్మ విషయాలను కూడా పిల్లలకు అర్థమయ్యే రీతిలో పొందుపరిచారు. తలకట్టులు లేని అక్షరాలను ఒక చోట చేర్చి
ఖ ఙ జ ౙ ఞ ట ణ బ ఱ ల (సుబ్బారావు, సంజ్ఞ 15) అని సూత్రంగా చెప్పారు.
గుణింత చిహ్నాలను అన్నింటిని చెప్పి అవి తలకట్టు ఉన్న అక్షరాలలో ఎక్కడ (ఏ స్థానంలో) వస్తాయో వివరించారు. గుణింతాల విషయంలో అనుసరించాల్సిన సూచనలు చేశారు.
సులభ వ్యాకర్త సంజ్ఞాపరిచ్చేదంలో ‘యె’ అనే అక్షరం సంధి వల్ల కాకుండా పదాల మధ్య ఎక్కడెక్కడ వస్తుందో (47-48) రెండు సూత్రాలలో వివరించారు. భూతార్థ క్రియల (కనియెను, చనియెను, పోయెను), తద్ధర్మార్థక క్రియలైన (కనియెడున్, చనియెడున్, వినియెదన్) వంటి క్రియల మధ్యలో ‘యె’ కారం మాత్రమే రాయాలి ‘య’కారం రాయకూడదు. అలాగే ఉయ్యెల, పయ్యెద, తాయెతులు వంటి శబ్దాల మధ్య కూడా ‘యె’కారం మాత్రమే రాయాలి. పదాది యకారం తెలుగు పదాలలో మొదటగా ఉండదు. ఈ ‘యె’ కార చర్చ బాల, ప్రౌఢ వ్యాకర్తలు చేయలేదు.
సులభవ్యాకర్త
పట్టి ప్రత్యయము పరమైనపుడు సర్వత్ర నుగాగమంబగు (సుబ్బారావు, సంధి 51)
అని సూత్రీకరించారు. పట్టి ప్రత్యయం పరమైతే అన్నిచోట్లా ‘ను’ ఆగమంగా వస్తుంది. ఉదాహరణకు ‘జ్ఞానముంబట్టి మోక్షము’. ఈ విషయాన్ని బాల, ప్రౌఢ వ్యాకర్తలు చెప్పలేదు.
సులభవ్యాకర్త
సదాద్యవ్యయంబులు గ్రాహ్యంబులు (సుబ్బారావు, సంధి 79) అని సూత్రీకరించారు.
యథా యథలు వృథా వృథలు (సుబ్బారావు, సంధి 80) అని సూత్రీకరించారు.
సదా, సర్వత్రా, నహి, నాస్తి, స్వస్తి ఈ శబ్దాలకు తెలుగు భాషలో స్వతంత్ర ప్రయోగం కనిపిస్తుంది. ‘యథా యధము’ అనే సంస్కృత అవ్యయాలు తెలుగులో ‘యథాయధలు’ అని, ‘వృథా’ అనేది ‘వృథ, వృథలు’ అని ప్రయోగాలలో కనబడుతున్నది.
వావిలికొలనువారు మాహేశ్వర సూత్రాలను అనుసరించి ప్రత్యాహారాల ద్వారా సంస్కృత సంధులను సూత్రీకరించారు. గుణాలు, వృద్ధులు వంటి సంజ్ఞలను సూత్ర రూపంలో నిర్వచించారు. సంస్కృత సంధులైన సవర్ణదీర్ఘసంధి, యణాదేశ సంధి, పరరూప సంధి, అవాంఙదేశ సంధి, ప్రకృతిభావ సంధి, శ్చుత్వ సంధి, ష్టుత్వసంధి, జశ్త్వ సంధి, అనునాశిక సంధి, పూర్వ సవర్ణ సంధి, విసర్గ సంధి, స్వాది సంధి మొదలైన సంధులను సూత్రరూపంలో సులభవ్యాకర్త నిర్వచించారు.
సులభవ్యాకర్త
భట్టశబ్దం బుదంతమాత్రం బగు (సుబ్బారావు, తత్సమ 21)
అని సూత్రీకరించారు. ‘భట్ట’ శబ్దానికి ఉకారం మాత్రం వస్తుందని ‘డుఙ్’ రాదని అర్థం. ఉదాహరణకు ‘నన్నయ భట్టు’, ‘నారాయణ భట్టు’.
ఇదంత శబ్దములకు ప్రథమైక వచన ప్రత్యయములు రావు (సుబ్బారావు, తత్సమ 30)
అని సూత్రీకరించారు. ప్రథమా ఏకవచన ప్రత్యయాలైన ‘డు, ము, వు, లు’ ఇకారం చివరగల శబ్దాలకు రావు. ఉదాహరణకు ‘హరి, మతి’.
సులభవ్యాకర్త
ఐ యొకానొకచోఁ గలయర్థంబున నగు (సుబ్బారావు, వాక్య 63)
అని సూత్రీకరించారు. ‘ఐ’ అనేది ఒక్కొక్కసారి ‘కల’ అనే అర్థంలో వస్తుంది. ఉదాహరణ ‘కృష్ణుని సారధ్యమునై’ ఇక్కడ ‘కృష్ణుడు సారధిగా గల’ అని అర్థాన్ని కూడా ఇస్తుందని అర్థం.
గ్రంథకర్తలు, పత్రికాధిపతులు, ఉత్తములు ఉత్తమపురుష ఏకవచనం బదులుగా బహువచనాన్ని ప్రయోగిస్తారని సులభవ్యాకర్త చెప్పారు. కవులు కొన్నిసార్లు ఉత్తమ పురుషలో చెప్పగలిగిన మాటలకు బదులుగా ప్రథమ పురుషలో ప్రయోగిస్తారు. ఉదాహరణకు ‘కవి వరుండిట్లనియె’. ఇక్కడ ‘నేను ఇట్లంటిని’ అని ఉత్తమ పురుషలో చెప్పే బదులుగా ‘కవి వరుండిట్లనియె’ అని ప్రథమ పురుషలో ప్రయోగించడం జరిగింది. ఇలాంటి నూతన విషయాలు చాలా వరకు ‘సులభవ్యాకరణము’ లో చెప్పబడ్డాయి.
ఉపసంహారం
తెలుగు భాషలో బాల, ప్రౌఢ వ్యాకరణాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. వావిలికొలను సుబ్బారావుగారు ఈ రెండు గ్రంథాల ఆధారంగా విద్యార్థుల కోసం ‘సులభవ్యాకరణము’ ను మూడు భాగాలుగా రచించారు. ఈ గ్రంథంలో ‘సంజ్ఞా పరిచ్ఛేదం నుండి వ్యాస పరిచ్ఛేదం’ వరకు మొత్తంగా పన్నెండు పరిచ్చేదాలు ఉన్నాయి. ప్రస్తుత వ్యాసం వావిలికొలను సుబ్బారావుగారు రచించిన “సులభవ్యాకరణము” అనే గ్రంథ ప్రాధాన్యతను తెల్పుతుంది. ఈ గ్రంథాన్ని బాల, ప్రౌఢవ్యాకరణాలతో పోల్చుతూ సవరణ, పూరణ, వివరణ, నూతన అనే కోణంలో కొన్ని అంశాలను చర్చించడం జరిగింది. బాల, ప్రౌఢ వ్యాకరణాలు “ఱ” (శకటరేఫ)ను వర్ణంగా గుర్తించకపోయినా, సులభవ్యాకర్త దానిని వర్ణంగా పేర్కొన్నారు. ‘ణ’, ‘ళ’ అక్షరాలు తెలుగు పదారంభంలో ఉండవని చెప్పడం, వర్ణాల ఉత్పత్తి స్థానాలు, సంస్కృత అక్షరాల ప్రవర్తన, తత్సమ, దేశ్య, అన్యదేశ్య పదాల మధ్య తేడా వంటి విషయాలను విస్తృతంగా వివరించారు. బాల, వ్యాకరణాలతో సమానంగా భాషా పరిణామాన్ని వివరణాత్మకంగా చూపించారు. “గుణింతాలు”, “యె” అక్షర వినియోగం, “పట్టి” ప్రత్యయానికి సంబంధించిన సూత్రాలు, సంస్కృత సంధులను ప్రత్యాహారాల ఆధారంగా సూత్రీకరించడం మొదలైన నూతన అంశాలు బాల, ప్రౌఢవ్యాకరణాలలో లేనివి ‘సులభవ్యాకరణము’ లో కన్పిస్తున్నాయి. అందువల్ల ఈ గ్రంథం బాల, ప్రౌఢ వ్యాకరణాలకు ఒక పరిశిష్ట గ్రంథంగా చెప్పవచ్చు.
- వావిలికొలను సుబ్బారావుగారి ‘సులభవ్యాకరణము’ బాల, ప్రౌఢ వ్యాకరణాలకు ఒక విశిష్ట పూరక గ్రంథం.
- శకటరేఫ (ఱ), ణ, ళ అక్షరాల వాడకంపై స్పష్టమైన సవరణలను వివరణలను ఇది అందిస్తుంది.
- వర్ణ విభాగం, వాటి ఉత్పత్తి స్థానాలపై సులభవ్యాకరణం సమగ్రమైన వివరణను ఇచ్చింది.
- ధ్వన్యనుకరణ శబ్దాల విస్తృత ప్రయోగాలు, గుణింతాల క్రమబద్ధీకరణ లాంటి నూతన అంశాలు ఇందులో కనిపిస్తాయి.
- సంస్కృత సంధులను ప్రత్యాహారాల ఆధారంగా సూత్రీకరించడం ఈ గ్రంథం ప్రత్యేకత.
ఉపయుక్త గ్రంథసూచి
- భాస్కరరావు, టి. బాల ప్రౌఢ వ్యాకరణ సర్వస్వము (ప్రథమ&ద్వితీయ సంపుటాలు). కాకినాడ: ప్రశాంతి పబ్లిషర్స్. ఐదవ ముద్రణ.
- మోహన్ రెడ్డి, ఆలేటి. బాలవ్యాకరణము (తెలుగు వ్యాఖ్య). హైదరాబాదు: ఎమెస్కో ప్రచురణలు. ప్రథమముద్రణ.
- రాజేశ్వరశర్మ, అమరేశం. ఆంధ్రవ్యాకరణ వికాసము (ప్రథమ&ద్వితీయ భాగములు). కామారెడ్డి: ప్రాచ్యవిద్యాపరిషత్తు. ప్రథమ ముద్రణ.
- రామకృష్ణారావు, వంతరాం. బాలవ్యాకరణ ఘంటాపథము. హైదరాబాద్: నవచేతన పబ్లిషింగ్ హౌస్. ప్రథమ ముద్రణ.
- రామకృష్ణారావు, వంతరాం. ప్రౌఢవ్యాకరణ ఘంటాపథము. హైదరాబాద్ : విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్. ద్వితీయ ముద్రణ.
- లలిత, జి. తెలుఁగు వ్యాకరణముల చరిత్ర. మద్రాసు: వెలగపూడి ఫౌండేషన్.
- సుబ్బారావు, వావిలికొలను. సులభ వ్యాకరణము. అంగలకుదురు: శ్రీ కోదండరామసేవక ధర్మసమాజము. ప్రథమ ముద్రణ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

