headerbanner

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-07 | Issue-04 | April 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

3. ఆదిభట్ల నారాయణదాసు ‘పంచశతి’ : స్తుతి విశేషాలు

చెన్నా సాయిరమణి

పరిశోధకురాలు, తెలుగు అధ్యయన శాఖ
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
తిరుపతి, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 8688399796, Email: ramani2000sai@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 16.03.2026        ఎంపిక (D.O.A): 29.03.2026        ప్రచురణ (D.O.P): 01.04.2026


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్య ప్రక్రియలలో శతకం అనాదిగా విశేష ప్రాధాన్యత ఉంది. నిత్యనూతన రీతిలో విస్తరిస్తున్న ఈ శతక సాహిత్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి ఆదిభట్ల నారాయణ దాసు రచించిన పంచశతి విశ్లేషణ ప్రస్తుత పరిశోధన ముఖ్యోద్దేశం. దాసు గారు సృజించిన సూర్యనారాయణ శతకం, మృత్యుంజయ శివశక్తి శతకం, ముకుంద శతకం, సత్యవ్రత శతకం, వేల్పువంద శతకం అంశీభూతంగా ఈ అధ్యయనం కొనసాగింది. పూర్వ పరిశోధనలు, సిద్ధాంతవ్యాసాలు శతక స్వరూప లక్షణాలను, భక్తి మార్గాలను విశదీకరించగా, ఈ పరిశోధన ఆదిభట్ల రచనలలోని దైవ వర్ణనలు, భాషాప్రయోగాలు, స్తుత్యంశాలను విశ్లేషించింది. ప్రాథమిక విషయ సేకరణకు పంచశతి మూలగ్రంథంగా నిలిచింది. ద్వితీయ విషయ సేకరణకు కె. గోపాలకృష్ణారావు, గుండవరపు లక్ష్మినారాయణ తదితరుల సాహిత్య పరిశోధనాగ్రంథాలు ఉపకరించాయి. వివరణాత్మక పద్ధతిలో సాగిన ఈ పరిశోధన శతకాలలోని పద్యరచన, శైలీవిన్యాసం, ఛందస్సు, అలంకారాలు, గ్రాంథిక భాషాప్రయోగాలను పరిశీలించింది. దాసు గారు దైవ వర్ణనలలో చూపిన చమత్కారాలు, ప్రత్యేక భాషాప్రయోగాలు, త్రిప్రాస, చతుష్ప్రాస వినియోగం, సంస్కృత పదప్రాబల్యం, అచ్చతెలుగు పదాలు, అంత్యప్రాసల విశిష్టత ఈ పరిశోధనలో స్పష్టమయ్యాయి. భగవల్లీల వర్ణన, ఆత్మ నివేదనం, కీర్తనం అనే భక్తి మార్గాలను శతకకర్త తన పంచశతిలో దృఢంగా ప్రతిపాదించారు. సూర్యనారాయణ శతకంలో భక్తి, చనువు కలగలిసిన ఆర్తి, మృత్యుంజయ శివశతకంలో వినయంతో కూడిన ప్రార్థన, ముకుంద శతకంలో నామ మహిమా విశ్లేషణ, వేల్పువంద శతకంలో రూప వర్ణన ద్వారా స్తుతి ప్రధానంగా కనబడ్డాయి. అయితే, సత్యవ్రత శతకం నీతిబోధకంగా సాగింది. ఈ శతకాలలో కవి తన చాతుర్యాన్ని, లోకజ్ఞానాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. భగవల్లీల వర్ణన, ఆత్మ నివేదనం ద్వారా కీర్తనం ప్రధానమైన భక్తి మార్గమని పంచశతి స్పష్టం చేసింది. ఈ పరిశోధన ఆదిభట్ల నారాయణ దాసు సాహిత్య సేవ ప్రాముఖ్యతను నిరూపించింది. ఈ శతకాలలోని సంస్కృతి, భాషా విశేషాలపై భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు జరగడానికి అవకాశం ఉంది

Keywords: ఆదిభట్ల, నారాయణదాసు, శతకం, పంచశతి, దైవవర్ణన, భాషాప్రయోగాలు, స్తుతి

1. ప్రవేశిక

తెలుగుసాహిత్యం ఎంత ప్రాచీనమో అంతే ప్రాచీనం శతకప్రక్రియ. సాహిత్య సీమలో కవిగా పేరుగాంచాలనుకునే ప్రతి ఒక్కరు శతక ప్రక్రియలో తనదైన రీతిలో రచించి కవిగా సాహిత్య సీమలో నిలదోక్కుకోవాలనేది నానుడి. ఈ నానుడి పద్య సాహిత్యంపై మక్కువున్న నేటి ఆధునిక యుగంలో సైతం కొన సాగుతుంది. ఎంత పెద్దకవి అయినా శతకప్రక్రియ తోనే అడుగులు వేయాలి. అదే కోవలోకి ఆదిభట్ల నారాయణదాసు కూడా చేరుతారు. వీరి సాహిత్యంపై అనేక పరిశోధన చేశారు. వీరి శతకలపై కూడా చాలానే పరిశోధనలు జరిగాయి. ఇప్పుడు ఆదిభట్ల వారి పంచశతి శతకాలను విశ్లేషిస్తున్నాను. ఈ శతకాలపై కూడా వ్యాసాలు, పరిశోధన జరిగాయి. కానీ ఆదిభట్ల పంచశతిలో ‘స్తుతి’ అనే అంశంపై పరిశోధనవ్యాసాలు వెలువడలేదని భావించి ఈ పరిశోధన వ్యాసానికి ఉపక్రమించాను.

ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ముందుకు సాగిపోయేది సాహిత్యం. అలాంటి సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఉద్భవించి, విరాజిల్లి, మరలా సమాధి స్థితికి చేరుకుంటాయి. ఆంధ్ర వాఙ్మయంలో శతక రచనావిర్భావానికి సంస్కృత ప్రాకృత శతకాలు దోహదపడ్డాయి; శతక స్వరూప లక్షణాల వివరణలో ఇది సహేతుకంగా నిరూపితమైంది (గోపాలకృష్ణారావు 19). శతక సాహిత్యం మాత్రం నాటి నుండి నేటి వరకు మార్పులతో సహవాసం చేస్తూ నిత్యనూతన ప్రక్రియగా ముందుకెళ్తుంది. ప్రాచీన కాలంలో కొంత కఠినమైనప్పటికీ, కాలానుగుణంగా సరళత్వం వైపు నడవడం శతకాల గొప్పతనం. ఆధునిక యుగంలో కళింగాంధ్రకు అనంత కీర్తన అందించిన ఆదిభట్ల వారు రాసిన పంచశతి శతకాలను పరిశీలించబోతున్నాను.

ఆదిభట్ల నారాయణ దాసు తల్లిదండ్రులు వెంకటచయనులు, నరసమ్మ. దాసు గారి అసలు పేరు సూర్యనారాయణ. లోకం దాసు గారిని సూర్యనారాయణ నామం నుండి నారాయణ అనునది మాత్రమే గ్రహించి, దానికి దాసును చేర్చి నారాయణదాసుగా చేసింది (లక్ష్మినారాయణ 4).

శ్రావణ కృష్ణ చతుర్దశీ బుధవాసరం, మాఘ నక్షత్ర చతుర్థ చరణం, వృషభ లగ్నం నాడు శ్రీకాకుళం మండలం, అజ్జాడ గ్రామంలో దాసు గారు జన్మించారు. దాసు గారు సంగీతం, సాహిత్యం, నృత్యం మేళవించి హరికథ అనే ప్రక్రియను సృజించి, హరికథా పితామహులయ్యారు. సంస్కృతాంధ్ర భాషలలో అనేక రచనలు చేశారు. 'శ్రీమత్', 'అజ్జాడ' అనే పదాలను కలిపి గౌరవవాచకంగా కవి పేరు ముందు పిలుస్తారు.

ఈ రచయిత తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీక భాషలలో రచనలు చేయడమే కాక అవధానాలు కూడా చేసేవారు. వీటితోపాటు శతకాలు, కావ్యాలు వంటి అనేక ప్రక్రియలలో రచనలు చేశారు. దాసు గారికి జ్వరం తీవ్రరూపం దాల్చడం వల్ల పుష్య బహుళ పంచమినాడు ఈ లోకానికి దూరమయ్యారు (లక్ష్మినారాయణ 32).

వీరు అనేక రచనలు చేశారు. ఇప్పుడు రచయిత రాసిన పంచశతిలో ఉన్న ఐదు శతకాలు విశ్లేషించబోతున్నాను. అవి సూర్యనారాయణ శతకం, మృత్యుంజయ శివశక్తి శతకం, ముకుంద శతకం, సత్యవ్రత శతకం, వేల్పువంద శతకాలు.

పై విషయాలు ఈ పరిశోధనా వ్యాసానికి నేపథ్యం. ఆదిభట్ల నారాయణ దాసు గారి సాహితీ కృషి, ముఖ్యంగా పంచశతి శతకాలు, వాటిలోని దైవవర్ణన పద్ధతులు, భాషా ప్రయోగాలు వంటి అంశాలను ఈ వ్యాసంలో విశ్లేషిస్తాను.

2. ఆదిభట్ల పంచశతి: దైవవర్ణనలు

మనిషి తనను నడిపించే ఒక శక్తి ఉందని, దానికే దైవం అని పేరు పెట్టారని చెప్తుంటారు. ఆ దైవాన్ని మెప్పించడానికి ఒక్కొక్కరు ప్రయత్నం చేస్తారు. కవులు రచనలతో మెప్పిస్తారు. రచయితలు దైవాన్ని వర్ణించే విధానం రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఆదిభట్ల వారు వర్ణించిన దైవ వర్ణన గురించి తెలుసుకుందాం.

2.1. సూర్యనారాయణ శతకం

కవి సూర్యనారాయణ స్వామిని వర్ణిస్తూ ఆయన తత్వం, గుణాలను ప్రధానంగా వివరించారు.

శా॥ జారుల్చోరులు విద్రలుంగలలు కాసల్వాతరోగంబులు
న్మారక్రూరశిలీముఖ ప్రబల సంతాపంబులున్ ఘోఘూర
కారావంబులు దిగ్భ్రామల్మఱిదురూహల్పీడలుం బూచులు
న్నీరమ్యాతపమందుఁగల్గు టెటుతండ్రీ సూర్యనారాయణా!! (సీతారామాచార్యులు, పంచశతి, సూర్యనారాయణ, 3)

స్వామి కాంతిని వర్ణిస్తున్నప్పుడు రచయిత ఆశ్చర్యంగా "అవురా" అంటూ ఏడవ పద్యంలో మొదలు పెట్టడం కనిపిస్తుంది. "అవురా!" అనే పదంతో కవి ఆశ్చర్యం కనిపించడం ఒక పార్శ్వమైతే, స్వామి కాంతి ఎంత అధికమో రచయిత మరో పార్శ్వంగా మలిచారు.

సూర్యనారాయణుడిని ఉదయాస్త సమయం నుండి ప్రతి అంశాన్ని, ప్రతి తత్వంతో, కఠిన శైలిలో చెప్పినప్పటికీ, తరచి చదివితే అద్భుతంగా కనిపిస్తుంది. దైవాన్ని వర్ణిస్తూనే, నీవే దిక్కని భక్తిని మేళవించి చెప్పడం మరో కారణంగా కనిపిస్తుంది.

శా॥ నీకంటెన్మటిదిక్కు లేదువడినానేరంబులన్సైఁచియీ
లోకంబందుననంజిరంబునియేలో సంబురానీకనన్
నీకీర్తింబ్రకటించవిమ్ముకడు నిన్నే నమ్ముకొన్నాఁడనే
నీకుంబిడ్డఁడసుమ్ముజ్ఞాపకముగొంటే సూర్యనారాయణా॥ (సీతారామాచార్యులు, పంచశతి, సూర్యనారాయణ, 27)

2.2. మృత్యుంజయ శివ శతకం

కవి శతకం పేరు మృత్యుంజయ శివ శతకం అని ఉంచినందున, కావుమని అర్థిస్తూ కొనసాగించారు.

పెక్కులు ప్రేలెదఁ బ్రతినలు
నొక్కటియున్నిలువ దంద హో పౌరుషవా
క్కెక్కడ నాబ్రతుకెక్కడ
నక్క దీవితలం బనాఁగ నగజేశ శివా (సీతారామాచార్యులు, పంచశతి, మృత్యుంజయ, 2)

కవి స్వామి శక్తిని నామాలు, పొగడ్తల ద్వారా చెబుతూ, తుదిలో "ఇంత వాడివి కాబట్టి నన్ను కావుము" అనే ఎత్తుగడతో పద్యాలను మలచడం కనిపిస్తుంది.

2.3. ముకుంద శతకం

ముకుంద శతకంలో కవి వేడుకోవడం, వర్ణించడం ముఖ్యంగా చూపిస్తారు. స్వామి లీలలు, రూపాన్ని ప్రధానంగా వర్ణించడంలో భక్తులను కాపాడే విధానాన్ని దేవుడికే నిర్దేశం చేస్తూ, అలా కాపాడమని రచయిత దిశను చూపినట్లు ప్రస్తావించారు.

ఇందలి కష్టము ద్రుంచి మ
ముందయఁ బెక్కేఁడులుంచి పోషించుము మా
ముందుండుము నారాయణ
కందళితానందమూల కంద ముకుందా! (సీతారామాచార్యులు, పంచశతి, ముకుంద, 23)

పద్యాలలో రూపాన్ని వర్ణించారు; కొన్ని పద్యాలలో భక్తిని మేళవించి నారాయణ తత్వాన్ని చూపారు.

2.4. సత్యవ్రత శతకం

సత్యవ్రత శతకాన్ని శ్రీ ఆనంద గజపతి మహారాజాజ్ఞతో, "సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్" అనే పాదాన్ని మకుటంగా మలిచి కవి రచించారు (సీతారామాచార్యులు, పంచశతి, 91).

ఈ శతకంలో నీతులను, సత్యాలను తెలియజేస్తూ సత్యవంతుడి గుణాలు వివరించారు.

అతుకుడు దబ్బఱలల్లుచు
గొతుకుచుబల్కొండెమారి కొఱికిన చెవితో
మతిచెడును మంచివాఁడున్
సతతము సంతన మొసంగు సత్యవ్రతికిన్ ॥ (సీతారామాచార్యులు, పంచశతి, సత్యవ్రత, 22)

2.5. వేల్పువంద శతకం

ఈ శతకం సీసపద్యాలతో సాగింది. ఇందులో వేడుకోవడం ప్రధానంగా చూపించారు. మరోవైపు కీర్తనం కూడా సాగించారు. శ్రీహరి అవతారాల విశేషాలు వివరిస్తూ శరణు కోరడాన్ని ఈ శతకంలో ముఖ్యంగా చూపించారు.

సీ॥ పులిపొదువుఁబిదుకఁ దోవన్ గాని విన్దల పవిచెసఁటి చెంతఁజనరాదు.
పామునోటన్గయి వుపనా గాని నినఁటోనిమ్రుక్కడి నెనయరాదు
మొసలిగలగునేల మునుఁ గనౌఁగాని విజ్ఞాన కెడుములుచ తిండితినరాదు
వెట్టి వేసి చెలిమి పెశయనౌఁగాని విన్నమ్మనితులువ కొస్కగొనరాదు।
ఏనెనిక్కముతక్కిన దెల్లకల్ల యనుచుఁగూడుకూటములకు ర్యాడు కొంటె
పల్కు వినకాదుజాగువా సలుపదార్పి రెంటత్రాగుడుతిండి మెట్టంటు వేల్ప॥ (సీతారామాచార్యులు, పంచశతి, వేల్పువంద, 19)

ఇందులో కవి పదచమత్కారాలను అధికంగా ఉపయోగించారు.

3. విశేషాలు

3.1. సూర్యనారాయణ శతక విశేషాలు

ప్రత్యక్ష నారాయణుడిని మత్తేభశార్దూల పద్యాలతో కీర్తించారు. సూర్యనారాయణ శతకాలలో కవి అధిక సమాసాలు వాడటం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సంస్కృత ప్రభావం అధికంగా ఈ శతకంలో ప్రయోగించారు. శతకాన్ని కవి శార్దూల, మత్తేభ పద్యాలలో కొనసాగించారు. పద్యం మలుపును బట్టి, మకుటమైన సూర్యనారాయణ అనే పదానికి ముందు "తండ్రి" (పద్యం 31), "మహాత్మ" (పద్యం 32) అనే విశేషాలు ప్రయోగించి, పద్య భావాన్ని మరింత అర్థవంతం చేయడంలో ఉపయుక్తంగా చేశారు.

తప్పులను ఎంచుతున్న వారికి తమ తప్పులు తెలుసుకోమని, ఒక ఉదాహరణతో మరో విషయాన్ని ప్రస్తావిస్తూ, చమత్కారంగా ఏమీ తెలియని అమాయకత్వాన్ని మేళవించి చెప్పారు.

మ॥ అవురా గొంగళిలోనఁ దించుఁదలపోయన్వెండ్రుకల్లెక్కనే
యువిధిందప్పులు పట్టుచుంద్రుకడునన్యోన్యంబు విభ్రాంతులై
యవని బండిత మానులౌజసులుమాయాకల్పితంబై నయీ
భవమందెట్లు వివేక మబ్బఁగలదబ్బాసూర్యనాయణా॥ (సీతారామాచార్యులు, పంచశతి, సూర్యనారాయణ, 52)

ఇలా అక్కడక్కడ కవి తన చాతుర్యాన్ని చూపించడం జరిగింది.

3.2. మృత్యుంజయ శివ శతక విశేషాలు

మృత్యువు నుండి కాపాడే మృత్యుంజయుడిని కీర్తిస్తూ, మృత్యుంజయ శివ శతకంలో కందమాలికలతో అర్చించారు.

ఈ శతకంలో స్వామి రూపాన్ని వర్ణిస్తున్నప్పుడు గుణాన్ని తెలియజేస్తూ రూపాన్ని వివరించడం విశేషంగా ప్రస్తావించారు. స్వామి లీలలను వివరిస్తూ, దానికి తగ్గట్టు శరణాగతి విషయాన్ని ప్రస్తావించడం ఈ శతకంలో విశేషంగా గోచరిస్తుంది.

హాలాహలభక్షణ మా
పాలన్నీ తాధికతను బాపుము త్వరగా
జాలింగొని కాపాడుము
బాలేందువతంస యన్నఁబాలించు శివా! (సీతారామాచార్యులు, పంచశతి, మృత్యుంజయ, 67)

ప్రశ్నించడం, అర్థించడం, వేడుకోవడం శరణాగతిలో విశేష పదాలతో వివరించారు.

3.3. ముకుంద శతక విశేషాలు

శివుడిని, విష్ణువును అభేదంగా చాటినట్లు ముకుంద శతకాన్ని కూడా కంద పద్యాలతోనే రచించారు. ఒకే పదాన్ని పలుమార్లు ప్రయోగించి పలు విషయాలను వివరించారు; భావాలను మలచడాన్ని చూపించారు. ఉదాహరణకు 'డెందము' అంటే హృదయం.

త్రిప్రాస అక్కడక్కడ ఈ శతకంలో ప్రయోగించారు. ఉదాహరణ:

ఎందుకు మముఁ గల్పించెద
వెందుకు మూఢత్వమిచ్చి యెంచెదవీవె
ట్ట్రెందుకురా నారాయణ
కందళితానందమూలకంద ముకుందా॥ (సీతారామాచార్యులు, పంచశతి, ముకుంద, 70)

కందపద్యం శతకంలో వాడటం వల్ల సంధిగత పదాలు అధికంగా ప్రయోగించారు; భాషను గ్రాంథిక శైలిలో ఉపయోగించారు.

3.4. సత్యవ్రత శతక విశేషాలు

వివిధ విషయాలను ప్రస్తావిస్తూ, సత్యవ్రత శతకాన్ని నీతి బోధకంగా మలిచారు.

క్షితినోర్వలేమి పాము ని
రతమును సూనృత ముపాలు దోనియు విషరూ
పతఁగల్లఁబంట నొసఁగన్
సతతము సంతన మెసంగు సత్యవ్రతికిన్ (సీతారామాచార్యులు, పంచశతి, సత్యవ్రత, 24)

ఈ శతకం ద్వారా కవి విషయ విజ్ఞానాన్ని పరోక్షంగా తెలియజేసినట్లు పద్యాలు మలిచారు.

3.5. వేల్పువంద శతక విశేషాలు

వేల్పువంద శతకంలో ప్రాస పదాలు అధికంగా వాడారు. సరళ పదాలతో భక్తిని ప్రధానం చేసి శతకాన్ని మలిచారు.

రావులు జువ్వులు మాపులుసుఱ్ఱులు వెలఁగలుమద్దులు వేములూట్లు
నేరేళ్లు తేఁచెట్లు నెల్లులు టేఁకులు గొలుగులు జీర్లు రేఁగులు సిరికలు
తుమ్ముకల్ తాండ్రలు విమ్మలుదబ్బలు సననెడు పొదరిండ్ల నాఫలంట్లు
మోదుగులూడుగు ల్బొడ్డలీడెలు వేగినలు లిమిరులు కానుగులు వెదుళ్ళు॥
నాటునుడులతో బేర్కొన రాని వేళ్ళనుండికొసలవఱకుఁ బండ్ల విండుమాన్లు
మిగులు వీయిల్లు ముసిముసి నగువుతాల్ప రెంటత్రాగుడుతిండి మెట్టంటు వేల్ప॥ (సీతారామాచార్యులు, పంచశతి, వేల్పువంద, 19)

అచ్చ తెలుగు పదాలను, అంత్యప్రాసను, అలంకారాలను ఈ శతకంలో ప్రయోగించారు.

4. భాషా ప్రయోగాలు

రచనలలో రచయిత పాండిత్యం, చమత్కారాలను అద్దం పట్టినట్లు చూపగలిగేవి ప్రయోగాలు. పంచశతిలో రచయిత కొన్ని వినూత్నంగా ప్రయోగించారు. అవి:

4.1. సూర్యనారాయణ శతకంలో భాషా ప్రయోగాలు

"భళిరా!" (పద్యం 59), "అవురా!" (పద్యం 78), "అకటా!" (పద్యం 78), "అయ్యయ్యో!" (పద్యం 80) అని ఆశ్చర్యంగా అధిక పద్యాలు ప్రారంభించడం సూర్యనారాయణ శతకంలో గమనించవచ్చు.

కవి ఈ శతకంలో కొన్ని పద్యాలను ప్రాసలతో మలిచారు. ఆ ప్రాసలను చందోదర్పణం ఆధారంగా గుర్తించాను.

4.1.1. త్రిప్రాసం

క. తానవనీత ప్రియుఁ డన
దానవనిర్మూల నైకతత్పరుఁ డన స
న్మౌనివినుతుఁ డన నతసుర
ధేను వనం గృతులయందుఁ ద్రిప్రాసమగున్. (శ్రీరామ శర్మ 40)

4.1.2. చతుష్ప్రాసం

కం. వారణవరద నిశాటవి
దారణ వీరావతార ధరణీవలయో
ద్ధారణ విరచిత సత్యవ
ధూరణ విజయ యనఁ దగి చతుష్ప్రనమగున్ (శ్రీరామ శర్మ 40)

మ. అకలంకంబగు సీమహామహిమనత్యంత ప్రమోదంబుతో
సకల శ్రోతృసుబావహంబుగలసత్సంగీత సాహిత్యభ
వ్యకళాకల్పనఁ జేయు దాసులకు దీర్ఘాయుశ్శుభారోగ్యము
ల్పృకటాభీష్టములన్నియుంజెలఁగ నీరాసూర్యనారాయణా (సీతారామాచార్యులు, పంచశతి, సూర్యనారాయణ, 29)

శా. వర్షంబున్పడనీయకాక్షసమునన్వ్యర్థంబుగావారిదో
త్కర్షంబుంగలిగించేదేవిటులుబ్ధ శ్రీవిధానంగడున్
హర్షంబుం చెడి ప్రాణులెందెడుఁద్వరన్రక్షించుమాతండ్రిబ్ర
హ్మర్షిప్రస్తవనీయమానకరుణాఢ్యా సూర్యనారాయణా॥ (సీతారామాచార్యులు, పంచశతి, సూర్యనారాయణ, 36)

ఇలా కవి ఈ శతకంలో త్రిప్రాస, చతుష్ప్రాసలు ఉపయోగించారు. అధిక సంస్కృత పదాలతో అన్ని పద్యాలను మలచడం ప్రధానంగా కనిపిస్తుంది. మూడు వంతులు సంస్కృతం, ఒక వంతు తెలుగు పదాలతో శతకం కొనసాగింది.

4.2. మృత్యుంజయ శివ శతకంలో భాషా ప్రయోగాలు

మృత్యుంజయ శివశతకంలో "ఏదిరా" (పద్యం 73), "అన్నా" (పద్యం 74) అనే పదాలతో చనువు, భక్తిని మేళవించి చెప్పారు. సంధిగత పదాలు, గ్రాంథిక పదాలు అధికంగా ఈ శతకంలో చూపించారు. "శివ" అనే మకుటంతో కంద పద్యంలో శతకం మలచడం వల్ల అధిక సంస్కృత పదాల కంటే గ్రాంథిక పదాలను ప్రయోగించారు.

4.3. ముకుంద శతకంలో భాషా ప్రయోగాలు

ముకుంద శతకంలో "ఎందుకు" (పద్యం 88) అనే ప్రశ్నావాచకంతో పద్యాలను ప్రారంభించారు. స్వామి రూపాన్ని వర్ణించేటప్పుడు అధిక సంస్కృత పదాలు, దీర్ఘ సమాసాలు వాడారు. రూపాన్ని, శరణును చెబుతూ నారాయణ ముందు విశేషణం ప్రయోగించి పద్యాలను మలిచారు.

సందియమేలా సౌఖ్యము
లందించుము సంకటముల నడఁగించుమువే
గం దయతో నారాయణ
కందళితానందమూల కంద ముకుందా!! (సీతారామాచార్యులు, పంచశతి, ముకుంద, 2)

ముందె రుచిమరిగినాఁడను.
బొందుగ నీభ క్తి యిష్ట ములిడఁగ నింకే
సందియమో నారాయణ
కందళితానందమూల కంద ముకుందా! (సీతారామాచార్యులు, పంచశతి, ముకుంద, 3)

4.4. సత్యవ్రత శతకంలో భాషా ప్రయోగాలు

సత్యవ్రత శతకంలో అధిక శాతం పొల్లులతో పాదాన్ని ముగించారు. ఒక విషయం చెప్పడానికి మరో విషయంతో పోల్చడం ఇందులో గోచరిస్తుంది.

ఉతికిన దుప్పటితీరున
మతిశుద్ధత చెందుఁ జాటు మాటు తొలఁగినన్
ధృతివంతునకని తెలిసిన
సతతము సంతసమెసంగు సత్యవ్రతికిన్! (సీతారామాచార్యులు, పంచశతి, సత్యవ్రత, 39)

ఒకే పదం రెండు అర్థాలు వచ్చేలా వివిధ పద్యాలలో ప్రయోగించారు. శతకాన్ని కఠిన పదజాలంతో కొనసాగించారు.

4.5. వేల్పువంద శతకంలో భాషా ప్రయోగాలు

వేల్పువంద శతకంలో సరస పదాలను వాడుతూ సంస్కృతిని, దైవ విషయాలను విశ్లేషించేందుకు పరోక్షంగా ప్రయత్నించారు. పొడుపు కథ వలే స్వామి అవతరణను చెప్పారు.

పులిపొదువుఁబిదుకఁ దోవన్ గాని విన్దల పవిచెసఁటి చెంతఁజనరాదు. పామునోటన్గయి వుపనా గాని నినఁటోనిమ్రుక్కడి నెనయరాదు మొసలిగలగునేల మునుఁ గనౌఁగాని విజ్ఞాన కెడుములుచ తిండితినరాదు వెట్టి వేసి చెలిమి పెశయనౌఁగాని విన్నమ్మనితులువ కొస్కగొనరాదు।
ఏనెనిక్కముతక్కిన దెల్లకల్ల యనుచుఁగూడుకూటములకు ర్యాడు కొంటె
పల్కు వినకాదుజాగువా సలుపదార్పి రెంటత్రాగుడుతిండి మెట్టంటు వేల్ప॥ (సీతారామాచార్యులు, పంచశతి, వేల్పువంద, 19)

అచ్చ తెలుగు పదాలను, అంత్యప్రాసను, అలంకారాలను ఈ శతకంలో ప్రయోగించారు.

5. స్తుత్యంశాలు

5.1. స్తుతి భావన - ప్రాముఖ్యత

స్తుతి అంటే స్తోత్రం, పొగడిక అని నిఘంటువుల అర్థం. ఈ అర్థం ప్రకారం దైవాన్ని కీర్తిస్తూ చేసే ప్రక్రియను స్తుతి అని కూడా చెప్పవచ్చు. దైవాన్ని చేరుకోవడానికి పోతన భాగవతంలో తొమ్మిది భక్తి మార్గాలు తెలిపారు. అవి:

మ. తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్ దాసత్వమున్ వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్ సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి స
జ్జనుఁడై యుండుట భద్రమంచుఁ దలఁతున్ సత్యంబు దైత్యత్తమా! (పాపయ్య శాస్త్రి 46)

వీరు చెప్పిన మార్గాలలో కీర్తనం ఒక మార్గం. దేవుడిని కీర్తించడం భక్తిని సూచిస్తుందని తెలిపారు. పూర్వులు చెప్పిన గాథలను మరలా మరలా తలచుకుంటూ సాగే క్రియ కీర్తనం. దీనిని కొందరు అక్షరబద్ధం చేస్తుండటం వల్ల కావ్యాలు వెలిశాయి. సాహిత్యం రూపొందాక ప్రతి ప్రక్రియలో కవులు తమదైన శైలిలో కీర్తిస్తూనే ఉండేవారు.

"ఇప్పుడు స్తోత్రాల విస్తృత పరిధియే శతకం; స్తుతి శతకంలో నామగుణ కీర్తనం ప్రధానాంశం" (గోపాలకృష్ణారావు 40). ఇవి రెండు రకాలు: 1. ఛందస్సును బట్టి పద్యాలలో ఒకటి రెండు నామాలు చేర్చి కీర్తించడం, 2. ప్రతి పద్యం నామావళిగా కీర్తించడం.

ఉదాహరణకు: బసవా! బసవా! బసవా! వృషధిపా! శతకం.

జిహ్వకు ఒక రుచి, మనిషికి ఒక బుద్ధి అన్నట్లు, దైవాన్ని స్తుతిస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. అందులో కవి మానసిక స్థితిని బట్టి, సామాజిక పరిస్థితులను బట్టి కూడా ఇవి ఏర్పడతాయి. ప్రధానంగా చూస్తే భగవల్లీల వర్ణన, పశ్చాత్తాపం, విరక్తి ప్రకటన, ఆర్త హృదయ నివేదనగా ఉంటాయి. అలానే కాలక్రమేణా స్తుతి, భక్తి ప్రధానంగా ఆధునికాలలో వస్తువును అనుసరించి వివిధ భక్తి శతకాలుగా వర్గీకరించబడ్డాయని డా. కె. గోపాలకృష్ణారావు 'ఆంధ్ర శతక సాహిత్య వికాసం' లో వివరించారు.

5.2. పంచశతిలో స్తుత్యంశాల విశ్లేషణ

5.2.1. సూర్యనారాయణ శతకంలో స్తుతి

సూర్యనారాయణ శతకంలో సూర్యనారాయణ స్వామి వైభవాన్ని చెబుతూనే, నీవే దిక్కని చెప్పడంలో స్తుతిలో భక్తిని మేళవించి తెలియజేయడం ముఖ్యంగా గోచరిస్తుంది. కొన్ని పద్యాలలో భక్తితో చనువును, రూప వర్ణనలో వర్ణన వైశిష్ట్యాన్ని అధికం చేసి చెప్పారు. విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పేందుకు ప్రయత్నించారు. స్తుతిని చేయడమే భక్తిలో ఒక భాగమని ఈ శతకంలో కవి పరోక్షంగా అభివర్ణించి తెలియజేయడం ప్రధానంగా కనిపిస్తుంది. ఈ శతకాన్ని కవి ఆర్త హృదయ నివేదనగా మలిచారు.

5.2.2. మృత్యుంజయ శతకంలో స్తుతి

మృత్యుంజయ శతకం అంతా స్తుతి పరంగానే సాగించారు. స్వామి లీలలను చెప్తూ, "ఆ లీలలో అలా చేశావు, మమ్ము కావలేవా?" అనే ప్రశ్నతో వినయాన్ని మిళితం చేసి స్తుతించడం ప్రధానంగా చూపించారు. ఈ శతకంలో మాహాత్మ్యం, లీలలు వివరించడంలో స్వామి వైభవాన్ని పరోక్షంగా తెలియజేస్తూ, భక్తిలో వేదనను, ఆర్తిని మిళితం చేసి అర్థించడం మరో కోణంగా చూపించారు. ఈ శతకాన్ని భగవల్లీల వర్ణనతో రచించారు.

5.2.3. ముకుంద శతకంలో స్తుతి

ముకుంద శతకంలో "నారాయణ" అని మూడవ పాదంలో ప్రయోగిస్తూ, నారాయణ ముందు విశేషపదం వాడుతూ స్తుతిస్తూ శతకాన్ని నడిపించారు. "సంక్రందనుత" (పద్యం 92), "నన్నుందయతో" (పద్యం 93) ఈ శతకంలో స్తుతిని కవి నామాన్ని ఆధారంగా ప్రయోగిస్తూ, నామ శక్తిని అధికం చేసి చెప్పారు. ఈ శతకంలో భగవల్లీల వర్ణనలో నామశక్తిని విపులీకరించారు.

5.2.4. సత్యవ్రత శతకంలో స్తుతి

సత్యవ్రత శతకం నీతులను, విషయాన్ని పోలికలతో సాగింది. ఇందులో స్తుతి పూర్వకంగా సాగలేదు. ఈ శతకం స్తుతి అంశాల కింద చేరదు.

5.2.5. వేల్పువంద శతకంలో స్తుతి

వేల్పువంద శతకంలో కవి భక్తితో దైవాన్ని వర్ణిస్తూ కొనసాగించారు. ఈ శతకం ద్వారా రూపాన్ని వర్ణిస్తూ, కొలుస్తూ, వేడుకోవడమే భక్తి అని, స్తుతి అని పద్యాలలో తెలియజేశారు. ఈ శతకాన్ని భగవల్లీల వర్ణనతో రచించారు.

ఉపసంహారం

కవి భగవల్లీల వర్ణన, ఆత్మ నివేదనం చేస్తూ కీర్తనలు చేయాలని పంచశతి శతకం ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ రెండు మార్గాలతోనే సాగాలని పంచశతిలోని అన్ని శతకాలలో అదే విషయాన్ని చెప్పడం వల్ల, కవి మనోగతం ఎంత ధృడంగా తెలియజేయాలని ప్రయత్నం చేశారో ఈ శతకాలే సాక్షిగా నిలుస్తున్నాయి. కవి దృష్టిలో స్తుతి అంటే ఏమిటో ఒక్కో శతకంలో ఒక్కో విధంగా చెప్పినప్పటికీ, అన్నిటి సారాంశం కీర్తన చేయడమే అని తెలిపారు. భక్తిని, కీర్తనాన్ని సమ్మేళనం చేసి రూపాన్ని దర్శించాలని పంచశతి ద్వారా వివరించారు.

ఇంకా ఈ శతకంలో నాటి సంస్కృతి, భాషా విశేషాల ప్రయోగాన్ని పరిశీలించి తెలియజేయడానికి ఆస్కారం ఉంది. వీటిపై మరిన్ని పరిశోధన వ్యాసాలు వెలువడటానికి అవకాశం ఉంది.

  • ఆదిభట్ల నారాయణ దాసు పంచశతి శతకాలలో దైవ వర్ణన ప్రధానాంశం.
  • సూర్యనారాయణ, మృత్యుంజయ శివ, ముకుంద, వేల్పువంద శతకాలలో స్తుతి, భక్తి ప్రధానంగా కనిపిస్తాయి.
  • సత్యవ్రత శతకం నీతిబోధనపై దృష్టి పెట్టింది, స్తుతి అంశాలకు దూరంగా నిలిచింది.
  • కవి పద్య రచనలో సంస్కృత సమాసాలు, ప్రాసలు, ఛందో నియమాలు, గ్రాంథిక పదజాలం విరివిగా ఉపయోగించారు.
  • ఆదిభట్ల వారు భగవల్లీల వర్ణన, ఆత్మ నివేదన ద్వారా కీర్తనల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
  • పంచశతి శతకాలు కవి భక్తి, సాహితీ పరిజ్ఞానం, భాషా చాతుర్యాన్ని ప్రతిబింబిస్తాయి.

ఉపయుక్త గ్రంథసూచి

  1. అధర్వణాచార్యుడు. వికృత్త వివేకము (అధరవణ కారికావళ్ల). కవిజనమండన సహితము. వావిళ్లప్రతి, 1955.
  2. ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం (3,4 సంపుటాలు). తెలుగు అకాడమీ, first edition, 2004, హైదరాబాద్.
  3. గోపాలకృష్ణారావు, కె. ఆంధ్ర శతక సాహిత్య వికాసం. ఉస్మానియా విశ్వవిద్యాలయం వారిచే డాక్టరేటు పట్టము నొందిన సిద్ధాంత వ్యాసము, ఆంధ్ర సారస్వత పరిషత్తు, తిలక్ రోడ్డు, హైదరాబాద్.
  4. గోపాలకృష్ణారావు, కె. శతక సౌరభం. యువ భారతి, సాహితీ సాంస్కృతిక సంస్థ, 5, కింగ్స్ వే, సికిందరాబాదు-3.
  5. పాపయ్య శాస్త్రి, జంధ్యాల, సంపాదకుడు. పోతన భాగవతము (మూడవ సంపుటి). తిరుమల తిరుపతి దేవస్థానములు, మలి ముద్రణ, 2010, తిరుపతి.
  6. లక్ష్మినారాయణ, గుండవరపు. నారాయణ దర్శనము. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు, పట్టము నిచ్చిన పరిశోధన నిబంధము, ప్రథమ ముద్రణ, 1983, పద్మిని ప్రింటర్స్, గుంటూరు.
  7. రామచంద్రన్, కె. త్యాగరాజకీర్తన హారము. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, 1956.
  8. రామరావు పంతులు, అడిదము. విస్కృత కళింగాంధ్ర చరిత్ర ప్రథమ భాగము. ఆంధ్ర విజ్ఞానసమితి, విజయనగరం.
  9. సీతారామాచార్యులు, కోగంటి, సంపాదకుడు. పంచశతి (దాసు గారి తెలుగు శతకములు). మొదటి కూర్పు, 1976, రామకృష్ణ ఇండస్ట్రీస్ వారి సౌజన్యముతో, వెల్కమ్ ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్, బ్రాడిపేట, గుంటూరు -2.
  10. శ్రీరామ శర్మ, చిర్రావూరి, వ్యాఖ్యాత. అనంతమాత్యుని ఛందోదర్పణము. ప్రధమ ముద్రణ, 1998, రోహిణి పబ్లికేషన్స్, రాజమండ్రి -1.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image