headerbanner

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-07 | Issue-04 | April 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797

2. ప్రపంచీకరణ ప్రభావం: అంతరిస్తున్న గిరిజన మౌఖికభాషలు

డా. బానోత్ స్వామి

పోస్ట్ డాక్టోరల్ ఫెలో, తెలుగు శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం
వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9603082128, Email: banothswamy128@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 02.03.2026        ఎంపిక (D.O.A): 27.03.2026        ప్రచురణ (D.O.P): 01.04.2026


వ్యాససంగ్రహం:

ఈ పరిశోధనా పత్రం భారతదేశంలోని గిరిజన తెగల భాషా సంస్కృతుల విశిష్టతను విశ్లేషిస్తుంది. లిపి లేని గిరిజన భాషలు వాటి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న తీరును, ఆధునిక సమాజం, ప్రపంచీకరణ వలసల ప్రభావాల వల్ల అవి ఎదుర్కొంటున్న సవాళ్లను సమగ్రంగా పరిశీలించడం ఈ అధ్యయన ముఖ్యోద్దేశం. భారత దేశంలో ఐదు వందల డెబ్బైకి పైగా తెగలు విభిన్న సంస్కృతులతో, భాషలతో జీవిస్తున్నాయి. వీటిలో కోయ, చెంచు, గోండు, ఎరుకల, పర్ధాన్, కొండరెడ్లు, వాల్మీకి, బంజారా వంటి ప్రధాన తెగల భాషా విశేషాలు, వాటి ప్రాముఖ్యత, ప్రస్తుత స్థితిని ఇది పరిచయం చేస్తుంది. సర్ జార్జి గ్రీయసన్స్, యస్. కె. చటర్జీ వంటి భాషావేత్తలు గిరిజన భాషా వర్గీకరణకు చేసిన కృషిని, ఆచార్య పి.ఎస్. సుబ్రహ్మణ్యం గోండి భాషపై సాగించినవి పూర్వపరిశోధనలు. ప్రసన్నశ్రీ వాల్మీకి భాషకు లిపి కల్పన వంటి ప్రయత్నాలు గుర్తింపదగ్గవి. విషయసేకరణ ప్రధానంగా ద్వితీయ ఆకరాలు ఆధారంగా జరిగింది. వర్ణనాత్మక విశ్లేషణ పద్ధతి ద్వారా గిరిజన భాషల క్షీణతకు కారణాలు, వాటి ప్రభావాలు విశ్లేషించబడ్డాయి. గిరిజనులు నిరక్షరాస్యత, సామాజిక అవగాహన లోపం, ప్రభుత్వ పథకాల పట్ల అజ్ఞానం, ఆధునికీకరణ దూరంగా ఉండడం, ముఖ్యంగా వలసల కారణంగా వారి సంస్కృతిని, భాషను కోల్పోతున్నారని పరిశోధన వెల్లడిస్తుంది. యునెస్కో, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలు అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగుతో పాటు అనేక గిరిజన భాషలు చేరుతున్న విషాదకర వాస్తవాన్ని ధ్రువీకరిస్తాయి. గిరిజనులను వారి ఆవాసాల నుండి తరలించడం, సరైన పునరావాసం కల్పించకపోవడం, ప్రాథమిక విద్యను వారి మాతృభాషలో అందించకపోవడం భాషా విలుప్తతకు ప్రధాన కారణాలు. ఈ పరిశోధన గిరిజన భాషల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తుంది: మాతృభాషలో ప్రాథమిక విద్య, లిపి అభివృద్ధి, మౌఖికభాషలో వర్తకవ్యాపారాలు, సాంస్కృతికకార్యక్రమాలు నిర్వహించడం. భావి పరిశోధకులు అంతరించిపోతున్న భాషలను గుర్తించి, వాటిపై లోతైన అధ్యయనాలు సాగించాలి. వాటి చరిత్రను, సాహిత్యాన్ని వెలికితీయాలి. భాషా డాక్యుమెంటరీలను రూపొందించాలి. ఈ ప్రయత్నాలు గిరిజన భాషలకు సాంఘిక హోదా కల్పించడంలో, తద్వారా వారి అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ అధ్యయనం భవిష్యత్ పరిశోధనలకు ఇది ఒక ప్రేరణగా నిలుస్తుంది.

Keywords: గిరిజన భాషలు, భాషా సంరక్షణ, అంతరించిపోతున్న భాషలు, మౌఖిక సాహిత్యం, ప్రపంచీకరణ ప్రభావం, గిరిజన సంస్కృతి, ఆదివాసీ తెగలు

1. ప్రవేశిక

ప్రపంచీకరణను పరిశీలించినట్లయితే, ప్రస్తుతం అన్ని రంగాలలో వినిపిస్తున్న మాట ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ అనేది అన్ని రంగాలపైన, అందరిపైన ప్రభావం చూపుతున్నది. ఈ ప్రపంచీకరణ ఎవరికి అర్థమయినా, కాకపోయినా ఫలితాలను మాత్రం చవిచూస్తున్నారు. ఇంతగా ప్రభావం చూపిన ప్రపంచీకరణను గురించి ఇప్పటికే పలు పరిశోధనలు వెలువడ్డాయి. ప్రపంచీకరణ వలన కలుగుతున్న లాభాలను, నష్టాలను పరిశోధకులు ఇప్పటికే బేరీజు వేస్తున్నారు. కొందరు ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించినదని పేర్కొంటుంటే, మరికొందరు రాజకీయరంగానికి సంబంధించినదిగా పేర్కొంటున్నారు. ఇంకొందరు ఇది ఆర్థిక, రాజకీయరంగాలకు సంబంధించినదిగా పేర్కొంటున్నారు. కాని ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రవేశించిన ప్రపంచీకరణ మనకు తెలియకుండానే తక్కిన రంగాలలోకి కూడా ప్రవేశించింది. అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్నది. పరిశోధకులు దీనిని వివిధ రకాలుగా నిర్వచించారు. ప్రస్తుతం పరిశోధకుల నిర్వచనాలకు, వారి చర్చను ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. స్థూలంగా ప్రపంచీకరణను ఈ క్రింది విధంగా పేర్కొనవచ్చు. “సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా ఏకరూపతను కలిగి ఉండడాన్ని ప్రపంచీకరణ” (వెంకటరామయ్య, గంపా, డిల్లీ విశ్వవిద్యాలయం, 2005 పుట-7) అని పేర్కొనవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రపంచీకరణ లక్షణాల దృష్ట్యా మరొక్క మాటలో చెప్పాలంటే మనిషి ఆలోచనా విధానం వ్యాపారాత్మకంగా మారడాన్ని ప్రపంచీకరణ అని పేర్కొనవచ్చు. ఈ వ్యాపారాత్మక ఆలోచన అనేది అన్ని రంగాలలోను కనిపిస్తుంది. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా, మతపరమైన ఆలోచనలలో కూడా వ్యాపార దృష్టి ప్రధానంగా కనిపిస్తుంది. అన్ని అంశాలు కూడా వ్యాపారంగా మారడం అనేది ప్రపంచీకరణలో ప్రధానమైన అంశం. ఈ ప్రపంచీకరణ అనేది ప్రపంచ చర్చకు దారితీసింది.

1990 నుండి ఆర్థిక సంస్కరణ ప్రారంభమైన తర్వాత మానవ సమాజంలో విపరీతమైన మార్పులు సంభవిస్తూ వచ్చాయి. అదే క్రమంలో సాంస్కృతిక, ఆర్థిక, సాహిత్య, రాజకీయ, సాంఘిక రంగాలలో మార్పుతో పాటు మానవుని జీవనవిధానంలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా సాహిత్య రంగాన్ని పరిశీలించినట్లయితే అనేక సాహిత్య వాదాలు, సాహిత్య ధోరణులు ఆవిర్భవించాయి. ముఖ్యంగా గిరిజన సాహిత్యంలో కథ, కవిత్వం, నవల ప్రారంభమవుతూ సాంస్కృతిక, మౌఖిక సాహిత్య పరిశోధనలు ప్రారంభమవుతూ వచ్చాయి. కానీ ప్రపంచీకరణ వ్యవస్థలో భాగంగా గిరిజన తెగలపై అనేక ఆంక్షలు విధించబడి అటవీ నుండి నెట్టివేయబడి, జీవన ఉపాధి కోసం, మానవ మనుగడ కోసం వలసలు ప్రారంభమయ్యాయి.

ఈ వలసలు కేవలం వ్యక్తి స్థానభ్రంశం జరగడమే కాకుండా వారి సాంఘిక, సాంస్కృతిక అంశాల మీద ప్రభావం పడ్డాయి. ఆ క్రమంలో వారి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు భాష కూడా వారికి తెలియకుండానే కనుమరుగవుతూ వచ్చింది. ముఖ్యంగా వలసవిధానం ప్రారంభమైన తర్వాత పట్టణీకరణలో భాగంగా గిరిజనులు వివిధ ప్రాంతాలకు వలస వెళ్లడం మూలంగా వారి సంస్కృతి సాంప్రదాయాలతో పాటు భాషను కూడా వారికి తెలియకుండానే ప్రపంచీకరణ ప్రభావంలో కొట్టుకుపోయి, వారి మౌఖిక భాషలు వారికి తెలియకుండానే కనుమరుగవుతూ ప్రాచాత్య సాంస్కృతికి, నాగరికతకు లోనై వారి భాషను క్రమంగా మరచిపోతూ వస్తున్నారు. అదే క్రమంలో భారతదేశంలో దాదాపు 600కు పైగా ఉన్న గిరిజన తెగలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు ప్రాంతాలలో ఉన్న గిరిజనులు వారి మౌఖిక భాషలు అంతరిస్తున్న క్రమాన్ని నేను ఈ పత్రంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను.

ప్రపంచ దేశాల ఆదిమ తెగలలో గిరిజన తెగలు గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఆధునిక నాగరిక సమాజానికి నేటి మానవ సమాజానికి సంస్కృతి, సాంప్రదాయాలు అనేక పాఠాలు నేర్పాయి. గిరిజనుల చారిత్రక అంశాలు, జీవన అలవాట్లు, సాంకేతిక ప్రగతికి కారణాలు, అక్షరాస్యత వంటివి భాష ద్వారా వ్యక్తమవుతాయి. ఒక వ్యక్తి తమ భావాలను మరొక వ్యక్తితో పంచుకోవడానికి సరైన మార్గం భాష. గిరిజనులు మొదట జంతువుల, పక్షుల ధ్వనులను వినడం ద్వారా భాషను రూపొందించడంలో అనేక సంవత్సరాల కృషి తర్వాత భాషాభివృద్ధి సాధ్యమైంది.

1.1. భారతదేశంలో గిరిజన తెగలు భాషా వైవిధ్యం

భారతదేశంలో 570 తెగలు ఉన్నట్లు అంచనా. భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ గిరిజనులు నివాసం ఉంటున్నారు. భారతదేశం విభిన్న జాతుల ప్రదర్శనశాల. ఇక్కడ విభిన్న జాతులు నివసిస్తున్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. భారతదేశంలో విభిన్న జాతుల సంస్కృతితో పాటు, వివిధ భాషలు ఉన్నాయి. భారతదేశం బహుభాషా ప్రదేశం. లిపి కలిగిన భాషలు అత్యల్పం. లిపి లేని భాషలు అధికంగా ఉన్నాయి. గిరిజన భాషల విషయానికొస్తే, వాటికి లిపి లేదు. వారి భాషా సాహిత్య విజ్ఞానం మొత్తం నేటికీ మౌఖికంగానే సాగుతుంది. లిపి లేకున్నా, లిఖిత గ్రంథాలు లేకున్నా, గిరిజనులు తమ భాష, సంస్కృతి, సాహిత్య జ్ఞానాన్ని కాపాడుకుంటున్న తీరు, వారి భాష ఎంతగా లోతుగా వేళ్లూనుకుందో తెలియజేస్తుంది. మనిషి తనలోని భావాన్ని వ్యక్తపరచడానికి ధ్వనుల రూపంలో ఉన్న భాషను ఉపయోగిస్తున్నాడు. దేశంలో ఇప్పటికీ లిపి లేని భాషలు అనేకం ఉన్నాయి. లిపి లేని భాషా సమాజాలు కూడా అనేకం ఉన్నాయి. భాష మనుషుల మనసులోని భావాలను, సుఖదుఃఖాలను, ఆచార వ్యవహారాలను ఒకరితో ఒకరు పంచుకోవడానికి, పురోభివృద్ధి సాధించడానికి తోడ్పడుతుంది.

1.2. గిరిజన జీవితం అడవులతో అనుబంధం

భారతదేశంలో వివిధ గిరిజన తెగలు వివిధ రాష్ట్రాల్లో తమ తమ పేర్లతో నివసిస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 33 గిరిజన తెగలు ఉన్నాయని తెలుస్తోంది. కొంతకాలం తర్వాత నక్కల, దూళియా గిరిజన తెగలను ఆ జాబితాలో చేర్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో నల్లమల కొండలు, మైదాన ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి వారిలో యానాదులు, లంబాడీలు, ఎరుకల వాళ్ళు మైదాన ప్రాంతంలో నివసిస్తున్నారు. చెంచు, గోండు, గుత్తి కోయలు, కొండరెడ్లు వంటి గిరిజన తెగలు వేట, పోడు వ్యవసాయం చేసుకుంటూ అభివృద్ధికి దూరంగా అరణ్యంలో జీవిస్తున్నారు. గిరిజన జీవితం అడవులతో ముడిపడి మానవ సంబంధాలను కలిగి ఉంది. వారి జీవితం మొత్తం అడవితో ముడిపడి ఉంటుంది. అడవులు గిరిజనులను పోషిస్తుంటే, గిరిజనులు తిరిగి అడవులను కాపాడుతుంటారు. అడవులు గిరిజనులకు సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల పరంగా ముడిపడి ఉంటాయి. గిరిజనేతరులకు వింతగా అనిపించినా, గిరిజనులు చేసే ప్రతి కార్యానికి ఒక అర్థం ఉంది.

భారతదేశంలోని జనాభాను ప్రస్తుతం భాషా ప్రాతిపదికగా వర్గీకరణ చేసినట్లయితే, యూరోపియన్, ద్రావిడ, ఆస్ట్రిక్, టిబోటా, చైనీస్ దేశంలోని వివిధ తెగలకు సంబంధించి వారి సాంస్కృతిక సంబంధాల ఫలితంగా ఆర్యభాష అమలులోకి వచ్చింది. భారతదేశంలో గిరిజనులను భాషా ప్రాతిపాదికన వర్గీకరించిన వారిలో సర్ జార్జి గ్రీయసన్స్, యస్. కె. చటర్జీ ఉన్నారు. ద్రావిడ భాషా కుటుంబంలో బాగా అభివృద్ధి చెందిన భాషలు తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం. భారతదేశంలో ప్రధానంగా 47 శాతం మంది గిరిజన తెగలు తమ భాషలోనే మాట్లాడతారు. మిగిలిన గిరిజనులు ఇరుగు పొరుగు భాషలలో మాట్లాడతారు (Krishnamurthy).

క్రమంగా తెగకు, తెగకు వేరు వేరు భాషలు ఏర్పడ్డాయి.

2. ప్రధాన గిరిజన తెగలు వాటి భాషలు

2.1. కోయ

భారతదేశంలోని గిరిజనులలో కోయలు ఒక ప్రత్యేకమైన జీవనశైలిని కలిగి ఉన్నారు. వీరు అడవి, కొండ ప్రాంతాలను ఆధారంగా చేసుకుని అటవీ వనరులపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కోయలు దొరల సట్టం, పుట్ట దొరలను నిజమైన దేవుళ్లుగా భావిస్తారు. కోయల పుట్టుక పరిణామ క్రమం అచ్చం విశ్వం పుట్టుకకు సంబంధించిన శాస్త్ర సిద్ధాంతం లాగానే ఉంటుందని కొంతమంది కోయలు వాదిస్తారు. కొన్ని పుస్తకాలలో ఈ విషయం వ్రాయబడింది. కోయ తెగలలో రాచకోయలు, లింగ ధారి కోయలు, డోలికోయ, కమ్మరి కోయ, గట్టుకోయ, గుత్తి కోయాలు ఉన్నారు. వీరు నివసించే ప్రదేశాలు, వారి సంస్కృతి, సాంప్రదాయాల పరంగా జీవనశైలిని బట్టి వర్గీకరించారు. వీరిలో రాచకోయలు ప్రసిద్ధి చెందిన చారిత్రక రాజు పగిడిద్దరాజు, అతని సతీమణి సమ్మక్క వారసులమని భావిస్తారు. వీరి జన్మస్థలం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్, సుకుమా వంటి ప్రాంతాలుగా చెప్పవచ్చు. తర్వాత కాలంలో వీరు కొండలు, అడవులలో శబరి గోదావరి సీలేరు నదుల పరివాహక ప్రాంతాల్లో విస్తరించారు. కోయలకు ప్రత్యేక భాష ఉంటుంది. తమ భాషను కోయ భాష లేదా గోండు భాష అంటారు. అయితే కోయ భాష గోండు భాషకు చాలా వరకు దగ్గర పోలికలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా, కోయ భాషపై స్థానిక భాషా ప్రభావం వల్ల తెలుగు భాషను తమ మాతృభాషగా కూడా మాట్లాడుతున్నారు.

2.2. చెంచు

నాలుగు ఆదిమ గిరిజన తెగలలో ఒకరిగా చెంచులను గుర్తించారు. భారత ప్రభుత్వం చెంచులను 1978 సంవత్సరంలో ఆదిమ గిరిజనులుగా గుర్తించి, వారి అభివృద్ధి కోసమే ప్రత్యేక ఐటిడిఎలను ఏర్పాటు చేసింది. గిరిజనులలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి, ప్రభుత్వాలచే గుర్తించబడిన గిరిజనులే ఈ ఆదిమ జాతి చెంచులు. కృష్ణా నదికి ఇరువైపులా విస్తరించి ఉన్న నల్లమల కొండలలో, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సరిహద్దు ప్రాంతాలలో, నల్గొండ జిల్లాలలో వీరు నివసిస్తున్నారు. వీరిలో అడవి చెంచులు, దేవ చెంచులు నల్లమల ప్రాంతాల్లో నివసిస్తే, బొంత చెంచులు, కృష్ణ చెంచులు లోతట్టు పల్లపు ప్రాంతాల్లో జీవిస్తారు. బొంత చెంచులు మాట్లాడే భాషను “బొంతకోర్” అని అంటారు.

2.3. గోండు

భారతదేశంలో సంఖ్యాపరంగా అతిపెద్ద గిరిజన తెగలలో గోండులు చాలా గొప్పవారు. మధ్య భారతదేశంలో గోండుల పేరు మీద గోండ్వానా ప్రాంతంలో ఎక్కువగా గోండులు నివసిస్తున్నారు. గోండులు హిందూ రాజులతో సమానంగా రాజ్యాలను స్థాపించారు. తర్వాత కాలంలో గోండులు 50కి పైగా ఉపతెగలుగా విడిపోయారు. ఇతరులను పరిచయం చేసుకునేటప్పుడు వీరు తమ ఉపతెగల పేర్లను చెబుతుంటారు. ఆచార్య పి.ఎస్. సుబ్రహ్మణ్యం ‘ఎ గోండి లాంగ్వేజ్’ అనే గ్రంథం రచించారు. డాక్టర్ విల్సన్ అభిప్రాయం ప్రకారం, గోండులు ప్రధానంగా 5 ఉపతెగలుగా విడిపోయారు. గోండి భాషను మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలలో, తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాట్లాడతారు. ఈ భాషను సుమారు 30 లక్షల మంది వరకు మాట్లాడతారు. గోండి భాష ద్రవిడ భాషా కుటుంబానికి చెందినది. తెలుగు కంటే కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండి భాష నుంచే తెలుగు భాష పుట్టిందని భాషావేత్తలు నిర్ధారించారు. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప వేరే భాష రాదు, అర్థం చేసుకోలేరు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీతో పాటు గోండీ భాష కూడా మాట్లాడగలరు. ప్రధాన్‌, తోటి, ఓజా వంటి గిరిజన జాతులకు కూడా ఇది మాతృభాషే. గోండి భాష భారతదేశంలోనే కాకుండా ఆస్ట్రేలియాలో కూడా మాట్లాడబడుతుంది.

2.4. ఎరుకల

మహాభారతం ఎంత పురాతనమైనదో, ఎరుకల ఇతిహాస పురాణం అంతకంటే పురాతనమైనది. పంచమ వేదమైన మహాభారతంలో ద్రోణాచార్యుని కోరికపై తన బొటన వేలును ఇచ్చినవాడు ఎరుకలవాడు. కిరాతార్జునీయంలో కిరాతుడు ఎరుకలవాడే. ఎరుక చెప్పే జీవితం గడిపిన ఎల్లమ్మ ఎరుకల నాంచారి. కుంతలాదేవి కుమారుడు ఎరుకరాజు రాజ్యపాలన చేశాడు. అందుకే తాము పురాతన వారసులమని తమిళం, తెలుగు, కన్నడం కలగలిసిన ఒక రకమైన ఎరుక భాషను మాట్లాడుతారు. వీరి భాషకు లిపి లేదు. వీరు చేసే పనులను బట్టి ఎరుకల వారిని ఉపతెగలుగా విభజిస్తారు.

2.5. పర్ధాన్

పర్ధాన్ తెగలవారు ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో నివసిస్తున్నారు. వీరిని పటాడిలు అని కూడా పిలుస్తారు. అందుకు కారణం వీరు గోండుల వంశ చరిత్రను కీర్తి గానం చేస్తూ దానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఈ పరస్పర సంబంధాన్ని కొన్ని తరాలుగా పాటిస్తున్నారు. గోండు భాషలో పటాడి అంటే గాయకులని అర్థం. పర్ధాన్ మాతృభాష మరాఠీ. గోండుల వంశ చరిత్రను గానం చేసేటప్పుడు గోండి భాషను ఉపయోగిస్తారు. పూర్వం వీరు రాజుల వద్ద పూజారులుగా, గాయకులుగా పని చేశారు. వీరు కిక్రి, పిప్రే వంటి సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఈ వాయిద్యాల కోసం ఇత్తడితో తయారుచేసిన ‘కాలికొం’ సంగీత స్వర పరికరాన్ని వాడుతారు.

2.6. కొండరెడ్లు

కొండరెడ్లు ఎక్కువ భాగం గోదావరి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దులకు సమీపంలో వీరు నివాసాలు ఏర్పరచుకున్నారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ సరిహద్దు ప్రాంతాలలో చెదురుమదురుగా నివసిస్తారు. తమను కొండరెడ్లుగా, పాండవ రెడ్లుగా, రాచరెడ్లుగా పిలుచుకుంటూ ఇతర తెగల వారి కంటే గొప్పవారమని చెప్పుకుంటారు. కొండరెడ్లు మాట్లాడేది తెలుగే అయినప్పటికీ, రూపురేఖల్లో, భౌతిక రూపంలో వీరికీ, తెలుగు మాట్లాడే ఇతర ప్రజలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది.

2.7. వాల్మీకి

వాల్మీకులను ఏజెన్సీ మాల అంటారు. ఒడిశాలో వీరిని దొంబు, పైడిలు అని పిలుస్తారు. దీపావళి, గోత్రాకి, పూటప్ అనే పండుగలు జరుపుకుంటారు. వాల్మీకి భాషను కుపియా అంటారు. ఇతర గిరిజన భాషల మాదిరిగానే దీనికి కూడా లిపి లేదు. కానీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేసిన ప్రొఫెసర్ ప్రసన్న శ్రీ కృషితో వాల్మీకి భాషకు లిపి ఏర్పడింది. 18 సంవత్సరాల కృషి చేసి, ఆమె 54 అక్షరాలతో లిపిని రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం వీరిని షెడ్యూల్ తెగలుగా గుర్తించాలని 2016లో పార్లమెంట్‌కు బిల్లును సిఫారసు చేసింది. కర్ణాటకలో ప్రస్తుతం వీరిని గిరిజన తెగగా వ్యవహరిస్తున్నారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1978లో రాజకీయ స్వార్థం వల్ల వీరిని షెడ్యూల్ తెగల జాబితా నుండి తొలగించారు.

2.8. బంజారా

బంజారాలు తమ భాషను గోర్ బోలి లేదా గోర్ అంటారు. తమను తాము గోర్ జాతిగా పిలుచుకుంటారు. బంజారా స్టడీ టీం 1969 సంవత్సరంలో తొలిసారిగా బంజారాల భాష గోర్ బోలి వాడుకలో ఉన్నదని గుర్తించారు. భారతదేశంలో వివిధ జాతులకు, తెగలకు ప్రత్యేక భాష ఉంది. బంజారా భాషలో పలికే మాటల్లో, పాడే గేయాల్లో అలంకారాలు, పొడుపు కథలు, సామెతలు సందర్భాన్ని బట్టి వ్యక్తమవుతాయి. సంచార జీవులైన లంబాడీలకు అలంకారశాస్త్రంపై అవగాహన లేకపోయినా, వారి సహజ మౌఖిక గేయాల్లో అలంకారాలు దాగి ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 6 నుంచి 7 కోట్ల మంది మాట్లాడే భాషను గోర్ బోలి అంటారు. సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వమైందని భాషా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

బంజారాల వేషభాషలను, జీవన విధానాన్ని, వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో బంజారా భాష గోర్ బోలి, బంజారా సాహిత్యం రెండు ప్రముఖ పాత్రలను పోషిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో భాషకు లిపి లేకపోవడం, భాషాభివృద్ధికి ప్రయత్నాలు జరగకపోవడం వల్ల సాహిత్య సౌందర్యం బయటి ప్రపంచానికి తెలియకుండా పోయింది. దీనివల్ల బంజారా జాతి సాహిత్యం ఎంతో నష్టపోయింది. వారి భాష, సాహిత్యం అంతరించిపోతున్న భాషల జాబితాలో చేరడం బాధాకరం.

దాదాపుగా భారతదేశంలో 398 భాషలు ఉన్నాయని భాషా శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అందులో 99 భాషలు విలుప్తమైనాయి. సంఖ్యాపరంగా చూస్తే ఐదు కోట్ల కంటే ఎక్కువ జనాభా మాట్లాడే భాషలో 5 ఉన్నాయి: హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం. ఈ వరుసలో తర్వాత స్థానంలో బంజారా భాష ఉంది. కానీ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, అంతటి గణనీయమైన స్థాయిలో ఉన్న బంజారా భాష నేడు అతి త్వరగా అంతరించిపోతున్న భాషల జాబితాలో చేరడం చాలా బాధాకరం. 10 లక్షల కంటే తక్కువ మంది ప్రజలు మాట్లాడే కాశ్మీరి, ముండారి వంటి భాషలకు భాషాపరమైన జనాభా లెక్కల్లో దక్కిన చోటు ఇంతటి ప్రాముఖ్యత కలిగిన బంజారా భాషకు దక్కకపోవడం విచారకరం. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించినందుకు కేంద్ర ప్రభుత్వం కేతావత్ సోమ్లాల్‌కు 2024 సంవత్సరానికి సాహిత్య విభాగంలో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డును అందజేశారు (Devi).

3. భాషా అంతరించిపోవడానికి కారణాలు

3.1. సామాజిక-ఆర్థిక కారణాలు

భారతదేశంలో గిరిజన భాషా శాస్త్రాల సర్వేలలో జాతీయ సంస్థలు పనిచేసినప్పటికీ సరైన ఫలితాలను అందించలేకపోయాయి. గిరిజన మౌఖిక భాషలను బతికించే అంశాలను తక్కువగా ప్రతిపాదించాయి. ఎందుకంటే గిరిజనుల జీవన మనుగడ కోసం, ఆర్థిక అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కార్మికులుగా పనిచేసేందుకు వలసలు ప్రారంభించారు. ఈ విధంగా అవసరాల నిమిత్తం వలస వెళ్తున్నప్పుడు, ఆ క్రమంలో వారు తమ సంస్కృతి, సాంప్రదాయాలు, ఉనికి, జీవన గమ్యం, మారుతున్న కాలక్రమంలో భాషను కూడా మర్చిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం వలసలు, నిరక్షరాస్యత, సామాజిక అవగాహన లోపం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన లేకపోవడం. ముఖ్యంగా గిరిజనులు ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఆధునికీకరణకు దూరంగా జీవిస్తున్నారు.

యునెస్కో 2022 నివేదిక ప్రకారం, అంతరించిపోతున్న భాషల జాబితాలో తెలుగు కూడా చేరడం బాధాకరం. గడిచిన అర్ధ శతాబ్దం నుంచి దాదాపు 229 ప్రాంతీయ గిరిజన భాషలు భారతదేశంలో కనుమరుగవుతున్నాయని “పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా” ఒక నివేదికను అందించింది (Devi).

భాష అంతరించిపోవడానికి గల ప్రధాన కారణాలలో ప్రాంతీయ భాషకు లిపి లేకపోవడం మొదటి సమస్య. గిరిజనులు నిరక్షరాస్యులుగా విద్యకు దూరంగా జీవించడం రెండో ప్రధాన కారణం. గిరిజన సమాజం మొదటి నుంచి వలస జీవితానికి అలవాటు పడిన క్రమంలో, నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, ఇంకా కొన్ని మారుమూల గూడేలలో, తండాలలో సరైన మౌలిక సదుపాయాలు లేక, వారి ఆర్థిక, సామాజిక, సాంఘిక పరిస్థితులు ఛిన్నాభిన్నమై అనేక సమస్యలకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో గిరిజన ప్రాంత ప్రజలు మానవ మనుగడ సాగించడం కోసం పట్టణాలకు, పరిశ్రమలకు వలస వెళ్లడం మొదలుపెట్టారు.

3.2. ప్రపంచీకరణ ప్రభావం

1990లో ప్రపంచీకరణ ప్రభావం తర్వాత, అన్ని వర్గాల తెగల కంటే గిరిజన తెగలు ఎక్కువగా నష్టపోయాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గిరిజనులు నివసిస్తున్న అటవీ ప్రాంతాల నుంచి ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల స్థాపన, జాతీయ సంస్థల ఏర్పాటు పేరుతో వారిని మైదాన ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో వారికి సరైన పునరావాస కేంద్రాలు లభించక ఎంతోమంది గిరిజనులు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో గిరిజనులు వేరే ప్రాంతాలకు పని కల్పన కోసం వలసలు ప్రారంభించి తమ అస్తిత్వాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను, ముఖ్యంగా మౌఖిక భాష, సాంఘిక హోదాను కాలగర్భంలో కలిపివేశారు. గిరిజనులు నెమ్మదిగా తమ భాషను మరచిపోయి, ఆ ప్రాంతీయ భాషలో నిమగ్నమై మాతృభాషను మర్చిపోయే స్థితికి చేరుకున్నారు. దీనికి ప్రధాన కారణాలు వారి ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలే.

3.3. విద్యా వ్యవస్థ వైఫల్యం

విద్యావ్యవస్థ ప్రాంతీయ భాషలో ప్రాథమిక విద్యను అందించలేకపోవడం వల్ల గిరిజన విద్యార్థులు ప్రత్యామ్నాయ భాషలను నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా వివిధ మాధ్యమాల చదువులను ప్రాథమిక దశ నుంచి మాతృభాషలో బోధనను ప్రభుత్వాలు, విద్యాసంస్థలు చాలా వరకు చేపట్టకపోవడం వల్ల ప్రాంతీయ భాషలో లేదా మాతృభాషలో అభ్యసించలేకపోతున్నారు. ఈ విధంగా గిరిజన మౌఖిక భాషలు అంతరించిపోవడానికి వలసలు మాత్రమే ప్రధాన సమస్య కాదు, వివిధ ప్రాంతీయ ఆర్థిక, సాంఘిక, రాజకీయ సమస్యలు కూడా ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు.

3.4. లిపి లేకపోవడం అధికారిక గుర్తింపు లోపం

భారతదేశంలో అధికారిక గుర్తింపునకు అన్ని అర్హతలు ఉన్న కొన్ని భాషలకు సరైన లిపి లేనందున జాతీయ హోదా పొందడంలో వెనుకబడ్డాయి. భారతదేశంలో దాదాపు 16 కోట్ల మంది మాట్లాడే బంజారా గోర్ బోలి భాషకు ఇప్పటికీ లిపి లేదు. ప్రస్తుతం ఈ భాష కూడా అంతరించిపోయే భాషల జాబితాలో చేరింది. కాబట్టి భాషలు అంతరించిపోవడానికి గల కారణాలను అన్వేషించి, వాటిని బతికించే దిశగా లోతైన పరిశోధనలు జరగాలి. అంతరించిపోవడానికి కారణాలను అన్వేషించి, వాటికి సరైన ప్రణాళికలను తయారు చేయవలసిన అవసరం భావి పరిశోధకులపై ఉంది. దానితో పాటు భాషా సాహిత్యంపై మరింత లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

4. భాషా పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు

  • భాషను కాపాడుకోవడం కోసం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే కొనసాగించాలి.
  • ప్రాథమిక విద్య వరకు తప్పనిసరిగా మాతృభాషను చదివేలా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రవేశపెట్టి నిర్బంధ భాషా కార్యక్రమాన్ని అమలు చేయాలి.
  • మారుతున్న సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన మనుగడ అవసరాలను బట్టి భాషను మాట్లాడాలి. అయితే సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, ఉనికిని మర్చిపోకుండా గిరిజనులు తమ మౌఖిక భాషలోనే వర్తక, వ్యాపారాలు, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.
  • ప్రస్తుతం నాగరిక సమాజంలో మానవ జీవనం గడపడానికి విద్య, ఆరోగ్యం, వ్యాపార రంగాలలో తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల ప్రభావం పెరుగుతుంది. ఆ భాషా ప్రభావాల వల్ల గిరిజనులు తమ మౌఖిక భాషలను మరచిపోయి పరభాషలకు లోనవుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, మానవుని మనుగడ అవసరాలకు పరభాషను మాట్లాడాలి తప్ప, మాతృభాష, మౌఖిక భాషను మర్చిపోకూడదు. ఈ విధంగా మర్చిపోయే క్రమంలో చాలా గిరిజన మౌఖిక భాషలు అంతరించుకుంటూ వస్తున్నాయి.
  • ముఖ్యంగా భాష అంతరించిపోవడానికి ప్రపంచీకరణ ప్రభావంతో పాటు, మానవుని సాధారణ జీవిత లక్ష్యాలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే భాషను కాపాడుకోవడం కోసం ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ, అవి క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడం వల్ల భాషను బతికించుకోలేకపోతున్నారు. ఇప్పుడు కనుమరుగవుతున్న భాషల ప్రభావం భవిష్యత్తులో వారి సంస్కృతి, సాంప్రదాయాలు, అస్తిత్వం, జీవన ప్రమాణాలపై చాలా వైరుధ్యాన్ని చూపిస్తుంది. కాబట్టి ప్రతి సగటు జీవి తమ మౌఖిక, ప్రాంతీయ మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంటుంది.
  • గిరిజనులు తమ మౌఖిక భాషను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నం చేయాలి. దీని కోసం భాషను చదవడం, రాయడం కోసం లిపిని కనుగొనే ప్రయత్నం చేయాలి. లిపిని కనుగొనడం ద్వారా భాష స్వరూపాన్ని బట్టి సాంఘిక హోదా లభిస్తుంది.
  • గిరిజనులు ఆర్థిక, సాంఘిక, సామాజిక అవసరాల నిమిత్తం వలసలు చేపట్టడం వల్ల భాష ప్రాధాన్యతను కోల్పోతున్న విషయాన్ని వారు గుర్తించాలి.
  • ప్రభుత్వాలు మాతృభాషలను, మౌఖిక భాషలను కాపాడేందుకు అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహించి, వారిని చైతన్యపరచాలి.
  • ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఉన్న భాషా కుటుంబాలను గుర్తించి, వాటికి సరైన ప్రాధాన్యతనిస్తూ మౌఖిక భాషల డాక్యుమెంటరీలను తయారు చేసే విధంగా పరిశోధన కార్యక్రమాలను అమలు చేయాలి.
  • దక్షిణ భారతదేశంలో ఉన్న ద్రావిడ భాషా కుటుంబాలు, వాటి ఉపకుటుంబాల భాషా జాబితాను ఒక నివేదిక రూపంలో తయారు చేసి, ప్రస్తుతం అంతరించిపోతున్న గిరిజన మౌఖిక భాషలను గుర్తించి, వాటిని కాపాడుకోవడం కోసం, భావి పరిశోధకులు వాటిపై సాంస్కృతిక, సాంఘిక, గేయ, అస్తిత్వ పరిశోధనలు జరిగేలా ప్రోత్సహించాలి.
  • గిరిజనులు తమ మౌఖిక భాషలో మాట్లాడడం ద్వారా భావ ప్రకటన స్వేచ్ఛగా జరుగుతుంది. కాబట్టి, ఇతర భాషల ప్రభావాలు వాటిపై ఎలాంటి ఫలితాన్ని చూపిస్తున్నాయో వారికి వివరించే ప్రయత్నాలు చేయాలి.
  • ముఖ్యంగా గిరిజన మౌఖిక భాషలను కాపాడుకోవడం కోసం విద్యావ్యవస్థను ప్రాథమిక దశ నుంచే వారి ప్రాంతీయ భాషలో కొనసాగించి, కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 386 ప్రాథమిక పాఠశాలల్లో గిరిజనుల మౌఖిక భాషలైన గోండు, కోయ భాషలలో విద్యా వ్యవస్థను కొనసాగిస్తున్నారు.

5. ఉపసంహారం

1990 తర్వాత ప్రపంచీకరణ పేరుతో కొత్త జీవనవిధాన మనుగడ ప్రారంభమైంది. దీని బారిన పడిన జీవితాలలో గిరిజనులు మొదటి వరుసలో ఉన్నారు. అడవిపై ప్రత్యేక చట్టాలు రావడం, భూమి ఆక్రమణ అవసరాల కోసం ప్రభుత్వం నూతన పాలసీలను, వివిధ అంశాలను రూపొందించడం వల్ల ముఖ్యంగా గిరిజనుల భూములు నష్టపోయాయి. పారిశ్రామిక మార్కెట్ వ్యవస్థ రావడం, సరళీకరణ పేరుతో గిరిజనులను స్థానభ్రంశం చేయడం దీనికి ప్రధాన కారణం. తర్వాత కాలంలో అనేక సాహిత్య ఉద్యమాలు, సామాజిక కార్యక్రమాలు పేద ప్రజల తరఫున ఆవిర్భవించినప్పటికీ, చివరికి గిరిజనుడు పేదవాడిగా, కార్మికుడిగా మారిన క్రమాన్ని, ప్రైవేటీకరణ నేపథ్యంలో భాషా కనుమరుగు అయిన తీరును గమనించవచ్చు.

ప్రపంచీకరణ వల్ల మానవ సంబంధాలలో వచ్చిన మార్పులు, సంస్కృతిని విచ్ఛిన్నం చేసిన విషయాలు, పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేసి, మానవ వనరులను మార్కెట్ వైపుకు మళ్లించిన తీరు, ముఖ్యంగా సంస్కృతి, సాంప్రదాయాలలో విపరీతంగా వచ్చిన మార్పుల ద్వారా వలసలు ప్రారంభమయ్యాయి.

వలసల కారణంగా గిరిజనులు తమ అస్తిత్వాన్ని, సంస్కృతి, సంప్రదాయాలను తమకు తెలియకుండానే ఆధునికం వైపు మళ్ళించబడ్డారు. ఈ క్రమంలో తమ భాషతో పాటు ఉనికిని కోల్పోయే ప్రమాదానికి లోనయ్యారు. పేదరికం, నిరుద్యోగిత, వలసలు, సామాజిక అవగాహన లేకపోవడం వంటి అంశాలు వీరి భాషా మనుగడపై ప్రభావం చూపుతున్నాయి.

గిరిజన సాహిత్యంలో ఇంకా ఎన్నో నూతన పరిశోధనలలో భాగంగా ప్రాచీన అంశాలు, పోరాట చరిత్రలు, వీరుల గాథలు, ప్రాచీనాంధ్ర సాహిత్యంలో ఎన్నో గిరిజన సాహిత్య పాత్రల సన్నివేశాల గురించి భావి పరిశోధకులు పరిశోధన చేయవలసిన పని ఉంది.

తెలుగు సాహిత్యంలో దళితవాద సాహిత్యం, ముస్లిం మైనార్టీ సాహిత్యం, బిసి వాద సాహిత్యం, వివిధ అస్తిత్వవాద, ప్రాంతీయ సాహిత్యాలు తమ నేపథ్యాన్ని, చరిత్రను, వర్తమాన విషయాలను సాహిత్య సృష్టిగా మలిచాయి. కానీ, గిరిజన సాహిత్యం పరిపుష్టి కాలేకపోయింది.

మరొక రెండు విషయాలు ఏమిటంటే, గిరిజన సాహిత్యం ఒక బలమైన సాహిత్యవాదంగా ప్రేరణ జరగాలని కాంక్షిస్తూ, గిరిజన పోరాట వీరుల గురించి, చారిత్రక విషయాల గురించి, గిరిజన సాహిత్యం గురించి కాలగర్భంలో కలిసి ఉన్న గిరిజన సాహిత్యాన్ని వెలికితీసి గిరిజన సాహిత్యానికి మరింత ప్రస్ఫుటత ఇవ్వవలసిన బాధ్యత రాబోయే భావి పరిశోధకుల మీద ఆధారపడి ఉంది.

భవిష్యత్ కాలంలో యువ కవులు, రచయితలు గిరిజన సాహిత్యంపై మరింత లోతైన పరిశోధన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • ప్రపంచీకరణ, అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల గిరిజనులు తమ భూములను, సంస్కృతిని కోల్పోతున్నారు.
  • స్థానభ్రంశం, వలసలు భాషా నష్టానికి, అస్తిత్వ క్షీణతకు దారితీశాయి.
  • లిపి లేకపోవడం, విద్యలో మాతృభాషా బోధన లోపం గిరిజన భాషల మనుగడకు సవాళ్లు.
  • గిరిజన సాహిత్యం, చరిత్రపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.
  • ప్రాథమిక విద్యలో మాతృభాషా బోధన, భాషా డాక్యుమెంటరీల రూపకల్పన వంటి చర్యలు భాషా పరిరక్షణకు అవసరం.

ఉపయుక్త గ్రంథసూచి

  1. ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఐక్యవేదిక. అటవీ హక్కుల కోసం పోరాటం. అదిలాబాద్, 2005.
  2. బాలగోపాల్, కె. ఆదివాసులు. మానవ హక్కుల వేదిక, ప్రచురణలు, 2005.
  3. చెన్నయ్య, జే. తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్, 2017.
  4. చీనియ, నాయక్. బంజారా చరిత్ర సంస్కృతి- ప్రగతి. అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్, 1998.
  5. Devi, G.N. Peoples Linguistic Survey of India Vol:3 Part :2 Telangana, The Languages of Telangana. 2020.
  6. జగన్నాధం, పెర్వరం. ఆధునిక సమాజంలో గిరిజన భాషా సంస్కృతి. ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2012.
  7. Krishnamurthy, BH. The Dravidian Languages. Cambridge University Press, Cambridge, 2003.
  8. ముత్యం. తెలంగాణ భాష, తెలుగు భాష, గిరిజన భాషలు. శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్, 2016.
  9. నాయక్, గోనా. భారతదేశంలో బంజారాలు. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005.
  10. నాయక్, గోనా. సుగాలి సంస్కృతి భాషా సాహిత్యం. కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005.
  11. రాజారాం, జె. నల్గొండ జిల్లా బంజారా మౌఖిక కథలు. హైదరాబాద్, 2009.
  12. రామాచార్యులు, బి. తెలుగు కావ్యాల్లో గిరిజనుల సంస్కృతి. 2001.
  13. శైలమ్మ, జీ. తెలుగు కథా సాహిత్యం - గిరిజన జీవితం. ద్రవిడ విశ్వవిద్యాలయం, కుప్పం, 2011.
  14. సూర్యనారాయణ. భారతదేశం గిరిజన సముదాయం. 1983.
  15. UNESCO. Endangered Languages Yearly Report. 2022.
  16. వెంకటేశం, ఎన్. అర్. బుడగ జంగాలు భాషాసాహిత్యం, సాంస్కృతిక పరిశీలన. 1995.
  17. విట్ట, వేణుగోపాల్. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో గిరిజన జీవన చిత్రణ. ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2008.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image