AUCHITHYAM | Volume-07 | Issue-04 | April 2026 | Peer-Reviewed | ISSN: 2583-4797
1. ప్రామాణికభాషగా ప్రాంతీయభాష: తెలంగాణ వేర్నక్యులరైజేషన్ పై సిద్ధాంతపర పరశీలన
ల్యాదల్ల రాజశేఖర్, జనగాం రాజారామ్
పరిశోధకులు, ఆంగ్ల సాహిత్య విభాగం
ఐఐటీ ఢిల్లీ , హౌజ్ ఖాస్,
న్యూఢిల్లీ, ఢిల్లీ.
సెల్: +91 8341252263, Email: rajashekariitd116@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 26.02.2026 ఎంపిక (D.O.A): 28.03.2026 ప్రచురణ (D.O.P): 01.04.2026
వ్యాససంగ్రహం:
తెలుగు టెలివిజన్ చరిత్రలో ప్రత్యేకించి వార్తలు ప్రసారం చేసే విధానంలో V6 తీన్మార్ వార్తలు తీసుకొచ్చిన మార్పును గురించి ఈ వ్యాసం ప్రస్తావిస్తుంది. ఇందులో తెలంగాణ మాండలికం, భాషాధికారాల గురించిన చర్చ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత T.V లో వార్తలు చదివే భాషను తీన్మార్ వార్తలు ఎంతగా ప్రభావితం చేశాయో గమనించవచ్చు. దీన్ని ఆధారంగా చేసుకొని తెలంగాణ వేర్నాకులరైజేషన్ ని ఈ పరిశోధన పత్రంలో ప్రస్తావించడం జరిగింది. సిద్ధాంత పరంగా పొల్లాక్ వేర్నాకులరైజేషన్, ఆంటోనియో గ్రామ్సీ హెజిమొని, హేబర్మస్ పబ్లిక్ స్పియర్ ను ఆధారంగా తెలంగాణ మాండలికంలో వార్తలు ప్రజాస్వామిక చర్చలకు ఎలా ప్రధానవేదికగా మారాయో విశ్లేషించబడింది. అందుకోసం V6 లోని 60 ప్రత్యేకమైన ఎపిసోడ్లను (2017 నుండి 2022) కేస్ స్టడీగా తీసుకొని ఈ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా అరవింద్ రాజగోపాల్ జాతీయ మీడియా ప్రసారాలు, రాష్ట్రమీడియా సంబంధాల ప్రస్తావన అలాగే రోనాల్డ్ రాబిన్స్ ప్రస్తావించిన ప్రపంచీకరణ ద్వారా వచ్చిన గ్లోబల్ నుండి లోకల్ అనే ప్రముఖుల వ్యాసాలను అధ్యయన అంశాలు తెలంగాణతో పోల్చి చూడటం జరిగింది. ఇలా జాతీయ, ప్రాంతీయ స్థాయిలో పేరు మోసిన ఇతర న్యూస్ ఛానెల్స్ కి, తీన్మార్ వార్తలకు మధ్య గల వ్యత్యాసాన్ని గురించి ప్రస్తావిస్తూ, తెలంగాణ ప్రజలు ప్రాంతీయ భాషకు పట్టం కట్టిన విధానాన్ని కేవలం ఒక్క న్యూస్ మీడియా ఆధారంగా తీసుకొని గత పది సంవత్సరాలలో మార్పును చర్చించడం ఈ పరిశోధన పరిమితులుగా ఈ పరిశోధనాత్మక వ్యాసం వివరిస్తుంది.
Keywords: తెలంగాణ, వెర్నాక్యులరైజేషన్, టీవీ వార్తా మాధ్యమం, V6 న్యూస్, ప్రతినిధ్యం, ప్రాంతీయ జాతీయత, భాషా రాజకీయాలు.
1. ప్రవేశిక
తెలుగు టెలివిజన్ వార్తాప్రసారాలలో భాష ఒకప్పుడు సమాచార సాధనంగా ఉండేది. క్రమంగా అది అధికారానికి, నమ్మకానికి, సమాజంలో గౌరవానికి చెందిన అంశంగా మారింది. గడిచిన పది సంవత్సరాలలో (2014-2025) తెలంగాణలో జరిగిన మార్పులను వివిధ తెలుగు వార్తాప్రసారాలలో చూడవచ్చు. ప్రత్యేకించి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు, తెలుగు వార్తా ఛానెళ్లలో భాష ప్రామాణికంగా ఉండాలని ప్రామాణిక (standard) తెలుగునే ఉపయోగించారు (Government of India 1966). దీని ఫలితంగా తెలంగాణ ప్రాంత భాష కేవలం మాండలికంగా మిగిలిపోయింది. అది గ్రామీణ భాషగా, ప్రామాణికత లేని భాషగా గుర్తింపు పొందింది (జయశంకర్ 2004; శ్రీనివాస్ 2009). ప్రజలలో తెలంగాణ భాష వాడుక సాంప్రదాయ ఛానెళ్లలో తగ్గడంతో పాటు, సామాజిక సంభాషణలో కూడా తగ్గింది. ప్రజలు వారి రోజువారీ భాషలో, ముఖ్యంగా హైదరాబాద్ వంటి పట్టణ ప్రాంతాలలో, ప్రామాణిక భాష వైపు మారారు. ఈ ప్రక్రియను సామాజిక భాషాశాస్త్రంలో “Change from above” (Labov 1972; Satyanath 2022) లేదా పై నుండి కిందికి జరిగే భాషా ప్రామాణికీకరణ మార్పు (top-down linguistic standardisation) ప్రక్రియగా చెప్పుకోవచ్చు.
ఈ భాషా మార్పుకు సాధారణంగా మీడియా ఒక ప్రత్యేకత కాగా, దాన్ని రూపొందించడంలో రాష్ట్రం అధికారికంగా ఎలా పనిచేస్తుందో ఈ పత్రం వివరిస్తుంది. ఇందులో భాగంగా మేము మూడు ముఖ్య అంశాలను ప్రధానంగా తీసుకొని తెలంగాణ ప్రజాభాషీకరణపై (Vernacularisation) వార్తల ప్రభావం ఎలా జరిగిందో, అది “change from below” అనగా కింది నుండి పైకి జరిగిన భాషా మార్పును వివరించాము (Pollock 2006). ఈ తెలంగాణ భాషీకరణను పరిశీలించడానికి మేము ఎంచుకున్న మూడు ముఖ్య అంశాలు: భాష, రాష్ట్రం, మీడియా. వీటి మధ్య ఉన్న సంబంధం, ఆ సంబంధాలలో సమకాలీనంగా జరుగుతున్న మార్పులను వివరించాము. దీని ద్వారా రోజువారీ మాటలలోని స్థానిక భాషా రూపాలు సామాజిక సమూహాల నుండి ఎలా ఉద్భవిస్తాయో, క్రమంగా అవి సామాజిక మన్ననను పొందే ప్రక్రియను మనము తెలంగాణ వార్తలలో చూడవచ్చు. ఇటువంటి శక్తివంతమైన సంబంధాలను – భాష, ప్రజలు, రాష్ట్ర అధికారం కలిగి ఉన్న సంబంధాలను – పియరీ బోర్డీయో “లెజిటిమేట్ లాంగ్వేజ్”, “సింబాలిక్ పవర్” భావనల ద్వారా వివరించారు (Bourdieu 1991).
2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, తెలంగాణ మాండలికానికి ప్రాంతీయంగా, రాజకీయంగా సాహిత్య సాంస్కృతిక రంగాలలో లభించిన గుర్తింపును స్పష్టంగా చూడవచ్చు (Pingle 2014; ముదిగంటి సుజాతారెడ్డి 2015). ఈ తరుణంలోనే V6 ఛానెల్‌లో ప్రసారమయ్యే తీన్మార్ వార్తలు తెలంగాణ మాండలికాన్ని తమ భాషగా ఎంచుకొని, వార్తలు చదవడం జరిగింది. ఇది సంప్రదాయ వార్తా ప్రసారాలకు భిన్నంగా, వ్యంగ్య, హాస్యపు పదజాలాన్ని వాడుతూ ప్రేక్షకుల మనస్సులలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్టువర్ట్ హాల్ అభిప్రాయం ప్రకారం, మీడియా వాస్తవాన్ని నేరుగా ప్రతిబింబించదు. అది ప్రాతినిధ్య ప్రక్రియల ద్వారా వాస్తవానికి సంబంధించిన అర్థాలను నిర్మిస్తుంది (Hall 1997). ఈ సిద్ధాంతం ప్రకారం తీన్మార్ వార్తలు తెలంగాణ భాషను ప్రసారం చేయడమే కాకుండా ఒక కొత్త సామాజిక దృష్టికోణాన్ని నిర్మించాయి. తెలంగాణ మాండలిక మీడియా ఎదుగుదలను స్థానిక భాషా ప్రజా వేదిక (vernacular public sphere) పరిప్రేక్ష్యంలో చూడవచ్చు. ఈ వేదికలో భాషా సముదాయాలు తమ సాంస్కృతిక గుర్తింపును, రాజకీయ అవగాహనను స్థానిక భాషా వినియోగం ద్వారా నిర్మించుకుంటాయి (Habermas 1989; Fraser 1990; Orsini 2002). ఈ పరిశోధన తీన్మార్ వార్తలను భాషా, రాజకీయ, సామాజిక సాంస్కృతిక కోణాలలో విశ్లేషిస్తుంది. తెలంగాణ మాండలికం ఎలా దినదిన అభివృద్ధి చెందిందో, ఎలా ప్రజా వేదికగా (vernacular public sphere) మారిందో ఈ పరిశోధన వివరిస్తుంది.
2. పరిశోధన ప్రశ్నలు
ఈ పరిశోధన తెలంగాణ మాండలికం వార్తాప్రసారంలో ప్రవేశించిన విధానాన్ని భాషాశైలి మార్పుగా కాకుండా, అధికార పునర్వ్యవస్థీకరణగా అర్థం చేసుకోవడానికి క్రింది ప్రశ్నలను ప్రతిపాదిస్తుంది:
- తెలంగాణ మాండలికం V6 తీన్మార్ వార్తలలో ఎలా ప్రతీకాత్మక మూలధనంగా పనిచేస్తుంది? తెలుగు మీడియా భాషా మార్కెట్‌లో విలువ పునర్మూల్యాంకనాన్ని ఎంతవరకు కలుగజేస్తుంది?
- తీన్మార్ వార్తల వచన నిర్మాణంలో తెలంగాణ మాండలికం ఎన్‌కోడింగ్ స్థాయిలో రాజకీయ అధికారాన్ని ఎలా పునర్‌చిత్రీకరిస్తుంది? ఈ మార్పు ప్రేక్షకుల డీకోడింగ్ అవకాశాలను ఎంతవరకు విస్తరించగలుగుతుంది?
- ప్రామాణిక తెలుగు ఆధిపత్యానికి సంబంధించి తీన్మార్ వార్తలు సంపూర్ణ ప్రతిహెగెమోనిక్ విరామాన్ని సూచిస్తున్నాయా? లేక గ్రాంశీ భావించిన ‘హెగెమోనీ’ పరిధిలో పాక్షిక పునర్వ్యవస్థీకరణగా నిలుస్తున్నాయా?
- తెలంగాణ మాండలిక ప్రసారం ఒక విభజిత ప్రజా వేదికను ఎలా నిర్మిస్తుంది? అది హాబర్మాస్ ప్రతిపాదించిన బూర్జువా ప్రజా వేదిక నమూనాను ఎలా సవాలు చేస్తుంది?
- ఆధునిక మీడియా ప్రసారాలలో తెలంగాణ ప్రజాభాషీకరణ (Vernacularisation), పోలాక్ పేర్కొన్న చారిత్రక ప్రజాభాషీకరణ భావనను ఎలా విస్తరించి, ఆండర్సన్ భావించిన ప్రాంతీయ ఊహాత్మక సముదాయం (Immagined community) నిర్మాణాన్ని ఎలా బలపరుస్తుంది?
పైన పేర్కొన్న ఐదు ప్రశ్నలు మీడియాలో “ఏమి జరుగుతోంది?” అనే వివరణాత్మక స్థాయిని దాటి, “ఎలా”, “ఎంతవరకు” అనే విశ్లేషణాత్మక దృష్టిని కేంద్రంగా ఉంచుతాయి.
3. ఊహా ప్రతిపాదనలు – పరికల్పనలు
ఈ పరిశోధన గుణాత్మక స్వరూపం కలిగినప్పటికీ, సైద్ధాంతిక నిర్మాణాన్ని స్పష్టీకరించడానికి క్రింది విశ్లేషణాత్మక హైపోథిసిస్‌లను ప్రతిపాదించాము:
- ప్ర.పా. 1: తీన్మార్ వార్తలలో తెలంగాణ మాండలిక వినియోగం తెలుగు మీడియా భాషా మార్కెట్‌లో ప్రామాణిక భాషా ఆధిపత్యాన్ని పునర్మూల్యాంకనం చేస్తుంది. మాండలికాన్ని ప్రతీకాత్మక మూలధనంగా పునర్‌వ్యవస్థీకరిస్తుంది.
- ప్ర.పా. 2: తెలంగాణ మాండలికం ద్వారా వార్తల ఎన్‌కోడింగ్ రాజకీయ అధికారాన్ని హైరార్కికల్ నిర్మాణం నుండి భావోద్వేగ-సాన్నిహిత్య నిర్మాణంగా మారుస్తుంది.
- ప్ర.పా. 3: తీన్మార్ వార్తలు ప్రామాణిక తెలుగు హెగెమోనీని పూర్తిగా ధ్వంసం చేయకుండా, దానిలో చర్చాత్మక పునర్వ్యవస్థీకరణను ఉత్పత్తి చేస్తాయి.
- ప్ర.పా. 4: ప్రజాభాషీకరణ (vernacular) వ్యంగ్య వార్తా రూపం ప్రాంతీయ ఊహాత్మక సముదాయాన్ని బలపరుస్తున్నప్పటికీ, అది వాణిజ్య మీడియా నిర్మాణాల ద్వారా పరిమితమవుతుంది.
ఈ ఊహా ప్రతిపాదనలు పరిమాణాత్మక పరీక్షల కోసం కాకుండా, వచన విశ్లేషణ ద్వారా ప్రశ్నించగల వ్యాఖ్యానాత్మక నిర్మాణాలుగా ఉద్దేశించబడ్డాయి.
4. లక్ష్యాలు
ఈ పరిశోధన క్రింది లక్ష్యాలను సాధించడానికి రూపకల్పన చేయబడింది:
- తీన్మార్ వార్తల వచన నిర్మాణాన్ని క్రిటికల్ డిస్కోర్స్ ఎనాలిసిస్ (Critical Discourse Analysis) ద్వారా విశ్లేషించి, భాషా ఎంపికలలో ప్రతీకాత్మక అధికారం ఎలా పనిచేస్తుందో వివరించడం.
- తెలంగాణ మాండలికం ప్రామాణిక తెలుగు వార్తా నిర్మాణాల మధ్య తులనాత్మక విశ్లేషణ ద్వారా భాషా మార్కెట్ పునర్వ్యవస్థీకరణను ప్రతిపాదించడం.
- హెగెమోనీ, భాషా మూలధనం (linguistic capital), ప్రజా వేదిక (public sphere) భావనలను తెలంగాణ మీడియా సందర్భంలో సూత్రప్రాయంగా పునర్‌వ్యాఖ్యానించడం.
- వ్యంగ్య వార్తా రూపం రాజకీయ అధికారాన్ని ఎలా పునర్‌చిత్రీకరిస్తుందో సిద్ధాంతపరంగా వివరిస్తూ తెలంగాణ ప్రజాభాషీకరణను భారతీయ ప్రాంతీయ మీడియా పరివర్తనల విస్తృత సందర్భంలో స్థానం కల్పించడం.
ఈ లక్ష్యాలు పరిశోధన ప్రశ్నలకు దిశానిర్దేశం చేస్తూ, హైపోథిసిస్‌లను అనుభవాత్మక విశ్లేషణ ద్వారా పునర్‌విమర్శించడానికి వీలు కల్పిస్తాయి.
5. పరిశోధన స్థానం
ఈ పరిశోధన మీడియా హెగెమోనీ, భాషా జాతీయత, ప్రజా వేదిక చర్చలలో తెలంగాణను ఒక సూత్రప్రాయ కేస్‌గా ప్రతిపాదిస్తుంది. ఇది భాషా మార్కెట్ పునర్మూల్యాంకనాన్ని మీడియా పరిసరాలలో విశ్లేషిస్తుంది. ఆధునిక భారతదేశంలో భాష-అధికారం-మార్కెట్ సంబంధాలపై అంతర్జాతీయ శాస్త్రీయ వేదికకు ప్రాసంగికతను అందిస్తుంది. ఈ విధంగా, ఇది గ్లోబల్ మీడియా-భాషా అధ్యయనాల సందర్భంలో ప్రాంతీయ అనుభవాన్ని సిద్ధాంతపరంగా విస్తరించే ప్రయత్నంగా నిలుస్తుంది.
6. పూర్వ అధ్యయనాల సమీక్ష
ఆధునిక తెలుగు సాహిత్య, సాంస్కృతిక చరిత్రలో మీడియా, రాజకీయ అధికారాల మధ్య ఉన్న భాషా సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి అనేక సిద్ధాంతాలను రూపొందించారు (రామమోహనరావు 1982).
మాండలిక భాష ప్రధాన వార్తా ప్రసార భాషగా మారే సందర్భంలో తెలంగాణను సమగ్రంగా విశ్లేషించిన పరిశోధనలు, సాహిత్య సమీక్షలు తెలంగాణ ప్రజాభాషీకరణను కొత్త మీడియా ప్రక్రియగా ప్రతిపాదిస్తాయి. పియరీ బోర్డ్యూ అభిప్రాయం ప్రకారం, భాషా మార్కెట్‌లో ఒక భాషకు లేదా భాషా రూపానికి కలిగే విలువ సహజమైనది కాదు. అది రాష్ట్రం, విద్యా వ్యవస్థ, ఇతర అధికార సంస్థల ద్వారా నిర్మించబడే సామాజిక ప్రక్రియ. ఈ నేపథ్యంలో కొన్ని భాషా రూపాలు “లెజిటిమేట్ లాంగ్వేజ్”గా గుర్తింపును పొందుతాయి. ఇతర భాషా రూపాలు తక్కువ విలువ కలిగినవిగా పరిగణించబడతాయి (Bourdieu 1991; Milroy 2001).
తెలుగు వార్తా రంగంలో ఆంధ్ర భాషా ఆధిపత్యం తెలంగాణ మాండలికంపై చాలా కాలం పాటు మూలధనం లేని భాషగా ముద్ర వేసింది (Yamada 2010; Inukonda 2019; Quadri 2021; Srikanth 2011). మాండలిక భాషను ప్రసార వేదికలో వినిపించినప్పుడు అది కొత్త ప్రతీకాత్మక మూలధనాన్ని సంతరించుకుంటుంది. ఇది కేవలం శైలి మార్పు కాదు, భాషా పునర్వ్యవస్థీకరణ. భాషా ఎంపిక ఒక సిద్ధాంతపరమైన చర్య. తెలంగాణ మాండలికాన్ని వార్తా నిర్మాణంలో చేర్చడం కొత్త అర్థ నిర్మాణాన్ని సూచిస్తుంది. 1991వ సంవత్సరంలో ఫౌలర్, భాషలో దాగి ఉన్న సిద్ధాంతపరమైన ఎంపికలను వెలికితీస్తూ వార్తా వచనాన్ని విమర్శనాత్మకంగా విశ్లేషించారు (Fowler 1991). ఈ సాహిత్యం భాషా మార్పు, ఉచ్చారణ మార్పును కాదు. ఇది సిద్ధాంతపరమైన పునర్నిర్మాణాన్ని సూచిస్తుంది. టెలివిజన్ ప్రజల మధ్య కొత్త రాజకీయ సంబంధాలను నిర్మించింది. ఈ సందర్భంలో ప్రాంతీయ భాషలో వార్తా ప్రసారం రాష్ట్ర ప్రజా సంబంధాన్ని పునర్‌వ్యాఖ్యానిస్తుంది. ఈ విశ్లేషణలో స్థానిక కథనాలు గ్లోబల్ మీడియా లాజిక్‌లతో ఎలా మిళితమవుతాయో తెలుసుకోవచ్చు.
తెలంగాణలో తీన్మార్ వార్తలు కూడా స్థానిక మాండలికాన్ని వినియోగించినప్పటికీ అవి వాణిజ్య మీడియా వ్యవస్థలోనే కొనసాగుతాయి. దేశ చరిత్రలో సంస్కృత ఆధిపత్యం నుండి ప్రాంతీయ భాషల ఎదుగుదలను “ప్రజాభాషీకరణ (vernacular)”గా విశ్లేషించారు (Pollock 2006). తెలంగాణ మాండలికం వార్తా ప్రసార భాషగా ఎదగడం ఒక ఆధునిక ప్రజాభాషీకరణ. ఇది కేవలం భాషా చలనమే కాదు. అది ప్రాంతీయ గౌరవ వ్యక్తీకరణ. భాషా జాతి సముదాయ నిర్మాణంలో కీలకమే కాక, వార్తా ప్రసారంలో మాండలికం వినిపించినప్పుడు ఆ భాష మాట్లాడే సముదాయం ఒక ఊహాత్మక రాజకీయ సముదాయంగా బలపడుతుంది (Anderson 1983). 1956 ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావంలో భాషా భావోద్వేగ రాజకీయాలతో ముడిపడి ఉంటుందని చూపిస్తుంది (Government of India 1956).
అదే 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అది ఒక ఊహాత్మక సముదాయంగా ఉన్నట్లు మరింత స్పష్టమైంది (Brass 1994; Tillin 2013; Government of India 2014). ఈ దృష్టిలో తెలంగాణ మాండలికం కేవలం సంభాషణ పద్ధతి కాదు. అది భావోద్వేగ గౌరవం ద్వారా ప్రజాస్వామ్య చర్చను విస్తరించగలుగుతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమ సందర్భంలో మనం గమనించవచ్చు. ప్రాంతీయ భాషా మీడియా రాజకీయ చైతన్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాన్ని చక్రవర్తి రోయ్ గార్ల విశేషణ ద్వారా గ్లోబలైజేషన్ తర్వాత భారతీయ మీడియా జాతీయతను ఎలా పునర్నిర్మించిందనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు (చక్రవర్తి రోయ్ 2013). ప్రాంతీయ మీడియా కేవలం స్థానిక వినోదం కాదు. అది జాతీయ రాజకీయ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషిస్తుందని అర్థమవుతుంది. దీన్ని తీన్మార్ వార్తలు నిరూపిస్తున్నట్లుగా చెప్పవచ్చు. అందువల్ల ఈ అధ్యయనం ప్రస్తుత సాహిత్యాన్ని విస్తరించి, తెలంగాణ ప్రజాభాషీకరణను ఒక ప్రతీకాత్మక మూలధన పునర్వ్యవస్థీకరణగా ప్రతిపాదిస్తుంది.
7. పరిశోధన పద్ధతి
ఈ పరిశోధనలో గుణాత్మక పరిశోధన (qualitative research design)ను అనుసరించడం జరిగింది. ప్రధానంగా క్రిటికల్ డిస్కోర్స్ ఎనాలిసిస్ (CDA) పద్ధతిని ఉపయోగించాము. భాష, అధికారం, హెగెమోనీ మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించడానికి CDA అత్యంత అనుకూలమైన విధానంగా గుర్తించబడింది కనుక క్రిటికల్ డిస్కోర్స్ ఎనాలిసిస్ ఆధారంగా తెలంగాణ వార్తా ప్రసారంలో వచ్చిన మార్పులను వివరించాము. దీనికి తోడు తులనాత్మక మీడియా వచన విశ్లేషణను (comparative media discourse approach) కూడా అనుసరించాము.
2017–2022 కాలపరిమితి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (2014) తర్వాత స్థిరీకరణ దశగా పరిగణించబడింది. ఈ కాలంలో ప్రాంతీయ రాజకీయ గుర్తింపు మీడియా రూపాలలో స్థిరపడుతున్న దశగా మార్పులను గమనించవచ్చు. ఇందుకోసం గత పది సంవత్సరాలలో V6 “తీన్మార్ వార్తలు” కార్యక్రమంలోని 60 ఎపిసోడ్‌లను విశ్లేషించడం జరిగింది. ప్రతి ఎపిసోడ్ సగటున 20–25 నిమిషాల నిడివి కలిగి ఉన్నాయి. ఎంపిక చేసిన ఎపిసోడ్‌లు ప్రధానంగా రాజకీయ, వ్యంగ్య, పాలన, ప్రజా సమస్యలు ఎన్నికల అంశాలను గురించి ప్రసారమైనవి.
పోలిక కోసం అదే కాలంలో ప్రసారమైన TV9, Tnews, HMTV ప్రధాన వార్తా బులెటిన్‌ల నుండి 30 ఎపిసోడ్‌లను ఎంపిక చేసాము. వీటిలో సగటు బులెటిన్ నిడివి 30 నిమిషాల లోపు ఉన్నాయి. ఈ తులనాత్మక నమూనా ప్రామాణిక తెలుగు వార్తా నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఉపయోగపడింది. తీన్మార్ ఫార్మాట్ స్టూడియో-ఆధారితమైనదే అయినప్పటికీ సంభాషణాత్మక, ప్రదర్శనాత్మక శైలిని అనుసరిస్తుంది. దీనికి విరుద్ధంగా TV9 అధికారిక, ఏకస్వర నిర్మాణాన్ని అనుసరిస్తుంది.
ఈ వార్తలలో వచ్చిన ప్రధాన మార్పులను విశ్లేషించడానికి ఆంటోనియో గ్రామ్సీ హెగెమొనీ థియరీ (Gramsci 1971), పియరీ బోర్డీయో భాషా మార్కెట్ భావన (Bourdieu 1991), స్టువర్ట్ హాల్ మీడియా అర్థం నిర్మాణం (Hall 1997), హేబర్మస్ ప్రజా వేదిక (Habermas 1989), అరవింద్ రాజగోపాల్ టెలివిజన్ రాష్ట్ర సంబంధాలు చెప్పిన సిద్ధాంతాలను ఆధారంగా తీసుకొని పరిశోధన చేయడం జరిగింది (Rajagopal 2001). ఉద్దేశపూర్వక నమూనా ఎంపికగా మూడు ప్రమాణాలు నిర్దేశించబడ్డాయి. అవేమనగా:
- ప్రతి సంవత్సరం కనీసం 10 ఎపిసోడ్‌ల ప్రాతినిధ్యం
- రాజకీయ, పరిపాలన, ప్రజా సమస్యల వైవిధ్యం
- స్థిరమైన ఫార్మాట్ కొనసాగింపు
ఈ అన్ని ఎపిసోడ్‌లు కాలపరంగా సమానంగా విభజించబడ్డాయి, తద్వారా ఒకే సంవత్సరానికి అధిక ప్రాతినిధ్యం లేకుండా చూసుకున్నాము. ఈ విధంగా ఎంపిక పక్షపాతం తగ్గించడానికి ప్రయత్నించాం.
అదే తరహాలో వచన విశ్లేషణ కోసం కింది కోడింగ్ వర్గాలను ఎంచుకోవడం జరిగింది:
- ప్రామాణిక వర్సెస్ తెలంగాణ పదజాలం
- సంబోధన రూపాలు (అక్క, అన్న, మామ మొదలైనవి)
- సర్వనామ మార్పులు
- వ్యంగ్య సూచికలు (హాస్య విరామాలు, ధ్వని స్వరం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్)
- అంతర్‌పాఠ్య సూచనలు (రాజకీయ ప్రసంగాల సూచనలు)
- దృశ్య చిహ్నాలు (దుస్తులు, స్టూడియో అలంకరణ)
- ప్రదర్శన శైలి
పైన పేర్కొన్న కోడింగ్ వర్గాల ద్వారా ఫెయిర్‌క్లో (Fairclough 1995) ప్రతిపాదించిన మూడు నమూనాలను (Text, Discursive Practice, Social Practice) ఈ విశ్లేషణకు మార్గదర్శకంగా ఉపయోగించాము:
- Text: పదజాలం, సంబోధన, శైలి
- Discursive Practice: వార్తా నిర్మాణం, వ్యంగ్య వినియోగం
- Social Practice: భాషా మార్కెట్ పునర్వ్యవస్థీకరణ
మాకు తెలంగాణ భాషా సందర్భంతో పరిచయం కలిగి ఉన్నప్పటికీ, మాండలికాన్ని గొప్పదిగా చూపించే ప్రమాదాన్ని గుర్తించి విశ్లేషణలో భాష అంటే ఇలాగే ఉండాలి అనే ప్రశంసలను నివారించాము. ఈ అధ్యాయం ముఖ్య లక్ష్యం మాండలికాన్ని ఉన్నతమైనదిగా చూపడం కాదు. అది గత పది సంవత్సరాలలో భాషా అధికార నిర్మాణాన్ని ఎలా పునర్వ్యాఖ్యానిస్తుందో విశ్లేషించాలని మేము భావించాం. పరిమితులుగా ఈ అధ్యయనం ప్రేక్షకుల స్వీకరణ విశ్లేషణను చేర్చలేదు.
8. సిద్ధాంత రూపకల్పన
భాష మనిషి భావోద్వేగాన్ని తెలుపుతుంది. మన చుట్టూ ప్రత్యక్షంగా పరోక్షంగా పెనవేసుకున్న ఎన్నో భిన్న స్వరాలకు ఊతమిచ్చేది మాతృభాష. యావత్ ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలలో భాషలే ప్రధానంగా మారాయి. భాషకు ప్రాధాన్యత ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఒకే భాషలో రకరకాల భాషా రాజకీయాల ఎత్తుగడలు ఏర్పడతాయి (Ferguson 1959). ఇదే తరహాలో దశాబ్దాల కాలంపాటు దగాపడ్డ తెలంగాణ భాష ఎదుర్కొన్న భాషా రాజకీయాలు, రాష్ట్ర ఆవిర్భావం వల్ల గత మూడు తరాలలో ప్రజలలో వచ్చిన భాషా ఎంపిక మార్పులను ఈ అధ్యయనంలో మేము వివరించే ప్రయత్నం చేశాం. ఇలా తెలంగాణ సమాజం మాండలిక భాష నుండి వార్తా ప్రసార భాషగా ఎదిగిన ప్రక్రియను “డీ-కన్‌స్ట్రక్టింగ్ లింగ్విస్టిక్ హెగెమోనీ” మార్పుగా మేము ప్రస్తావించాం. ఇలా హెగెమోనీ భాషా మూలధనం, అర్థ నిర్మాణం, ప్రజా వేదిక, ప్రజాభాషీకరణ, ఊహాత్మక సముదాయ భావనలు పరస్పర సమ్మేళనాన్ని తెలంగాణలో వచ్చిన మార్పులను అవగాహన చేసుకోవచ్చు. తెలుగు వార్తా భాష సహజమైనది, నిష్పాక్షికమైనదని అంగీకరించడం ఈ నిర్మాణంలో భాగం. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణ మాండలికం వార్తా వేదికలలో వినిపించడంలో తన ప్రత్యేకతను చాటుకుంది. కనుక ఈ భాషా రాజకీయ మార్పులను ఒక సిద్ధాంతపరమైన భావనగా చూస్తూ మేము ఈ అధ్యయనం చేయడం జరిగింది.
తెలంగాణ భాష భిన్నంగా ఉన్నందున సినిమా, వార్తా రంగాలలో వినోదాత్మక భాషగా పరిమితమైంది. తీన్మార్ వార్తలు వెలుగులోకి వచ్చాక ఒక ప్రత్యేకమైన అలజడిని సృష్టించాయి. ఒక మాండలికం ప్రసారాధికారాన్ని పొందినప్పుడు అది ప్రతీకాత్మక మూలధనంగా మారుతుంది. కానీ పూర్తి సమానత్వాన్ని తీసుకురాదు. కాబట్టి ఇది ఆధిపత్యాన్ని ధ్వంసం చేయడం కాదు. పునర్వ్యవస్థీకరించడంలో భాగం మాత్రమే. ప్రేక్షకులు ఈ మార్పును తమ అనుభవాల ఆధారంగా అవగాహన చేసుకోగలుగుతారు. స్థానిక భాష వినిపించినప్పుడు ప్రేక్షకుల గుర్తింపు వార్తా నిర్మాణంలో భాగమవుతుంది. ఇక్కడ మీడియా ఒక ఏకస్వర నిర్మాణం నుండి సంభాషణాత్మక నిర్మాణంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ప్రజాభాషీకరణ (vernacular) వార్తా రూపం ప్రాంతీయ ప్రజా వేదికను సూచిస్తుంది. అవి హాస్య, భావోద్వేగ స్థానిక అనుభవాల ద్వారా రాజకీయ చర్చను నిర్మిస్తాయి. ప్రజాభాషీకరణ వేదికలు భావోద్వేగ రాజకీయాలతో ముడిపడి ఉంటాయి. ఈ భావనను ఆధునిక మీడియా పరిసరాలకు విస్తరించవచ్చు అని అప్పదురై ప్రస్తావించారు (Appadurai 1996). ఇలా తెలంగాణ మాండలికం అనేది వార్తా ప్రసారాలలో వినిపించడం ఒక ఆధునిక ప్రజాభాషీకరణ ప్రక్రియగా చెప్పవచ్చు. ఇది ప్రజల నుండి వచ్చిన మార్పు గనుక దీన్ని స్వీయ గౌరవంగా మాత్రమే కాకుండా, ప్రాంతీయ రాజకీయ ఆత్మగౌరవాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ఇటువంటి మార్పుని భాషా శాస్త్రంలో కింది నుండి పైకి జరిగిన (bottom up) భాషా మార్పుగా చెప్పుకోవచ్చు.
ఈ ప్రక్రియలో ఆండర్సన్ ఊహాత్మక సముదాయం భావన కీలకంగా గమనించవచ్చు, ఎందుకనగా ఒకే భాషలో వార్తలు వినిపించినప్పుడు ఒక ప్రాంతీయ సముదాయం తనను తాను ఊహించుకుంటుంది. ఇలా మాండలికం ద్వారా నిర్మితమవుతున్న ఈ ఊహాత్మక సముదాయం ప్రాంతీయ గుర్తింపును బలపరుస్తుంది. దీన్నే మనం తెలంగాణలో వస్తున్న మార్పులతో పోల్చి చూడవచ్చు. అయితే ఈ మొత్తం ప్రక్రియను వచన స్థాయిలో విశ్లేషించడానికి వార్తా వచన సిద్ధాంతాలు అవసరం.
భారతీయ మీడియా పరిసరాలలో గ్లోబలైజేషన్ తర్వాత ప్రాంతీయ భాషా మీడియా రాజకీయ చైతన్యాన్ని ప్రభావితం చేసిందని చక్రవర్తి రోయ్ (2013) సూచించారు. నేయాజీ (2018) ప్రాంతీయ మీడియా రాజకీయ మొబిలైజేషన్‌లో కీలకమని చూపారు. అరవింద్ రాజగోపాల్ మీడియా వ్యవస్థను జాతీయ, రాష్ట్ర స్థాయిల మధ్య ఏర్పడే శక్తి సంబంధాల ద్వారా విశ్లేషిస్తూ ప్రసార మాధ్యమాలలో ఎలా రాజకీయ సాంస్కృతిక భావజాలాలను నిర్మిస్తాయో వివరించారు (Rajagopal 2001). ఆయన పరిశీలించిన జాతీయ మీడియా ఆధిపత్యం ప్రాంతీయ స్వరాలను అణగదొక్కే పరిస్థితులను కూడా చూపిస్తుంది. ఇదే తరహాలో రోలాండ్ రాబర్ట్‌సన్ ప్రపంచీకరణ నేపథ్యంలో గ్లోబల్ నుండి లోకల్ ప్రక్రియను వివరిస్తూ ప్రపంచ స్థాయి మీడియా ప్రభావాలు స్థానిక సంస్కృతులు భాషలతో కలిసిపోతూ కొత్త గుర్తింపులను సృష్టిస్తాయని సూచించారు (Robertson 1995). ఈ సిద్ధాంతపరమైన దృక్కోణాలను తెలంగాణ సందర్భంలో పరిశీలిస్తే ప్రాంతీయ భాషా మాండలికాలు, స్థానిక మీడియా వేదికలు జాతీయ ప్రమాణ భాషా ఆధిపత్యాన్ని ప్రశ్నించే ప్రక్రియలో భాగమవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణ మీడియా ప్రాతినిధ్యం ప్రాంతీయ గుర్తింపును పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని ఈ అధ్యయనం ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ సందర్భంలో తీన్మార్ వార్తలు స్థానిక మాండలికాన్ని వినియోగించినప్పటికీ, అవి వాణిజ్య మీడియా వ్యవస్థలో భాగమే. అందువల్ల ఈ అధ్యయనం తెలంగాణ ప్రజాభాషీకరణను ఆధునిక మీడియా సంస్కృతిలో ప్రతీకాత్మక అధికార పునర్వ్యవస్థీకరణగా ప్రతిపాదిస్తుంది. దీన్ని సంపూర్ణ విప్లవంగా కాకుండా, భాష, ప్రాంతీయ రాజకీయాల మధ్య కొనసాగుతున్న చర్చా ప్రక్రియగా చూడవచ్చు. ఈ దృష్టిలో భాష, రాష్ట్రం, మీడియా మధ్య ఉన్న ఒక సిద్ధాంతాత్మక సంబంధాన్ని మనం గమనించినట్లయితే, ఒక కొత్త తెలంగాణ ప్రజాభాషీకరణ ప్రక్రియను సూచిస్తుంది. ఇది భాషల (తెలుగు, ఉర్దూ, తమిళ్ హిందీ) మధ్య ఉన్న వ్యత్యాసం కంటే భాషతో (తెలంగాణ తెలుగు వర్సెస్ ఆంధ్ర తెలుగు) ముడిపడిన సంబంధాన్ని మనకు తెలియపరుస్తుంది. అది ఎలాగనగా రమా మంతెన (2013) సూచించిన తెలుగు ఆధునికత అనేది ఎలా రూపుదిద్దుకుందో అది వలస పాలన కాలంలో ప్రింట్, విద్యా సంస్థల వల్ల ఏర్పడ్డ భాషా ఆధునికతను ఒక కొత్త ప్రజా వేదికగా వివరించడం జరిగింది. ఈ ప్రక్రియలో తెలుగు భాషా కేవలం సాహిత్య మాధ్యమంగా కాకుండా సామాజిక రాజకీయ చర్చలకు కూడా కీలక సాధనంగా మారినట్లు ఆమె ప్రస్తావించారు. వారు సూచించిన తెలుగు ఆధునికత అనేది “change from above”గా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రజాభాషీకరణను ప్రజల నుండి వెలువడిన ఒక ప్రక్రియగా చూసినట్లయితే “change from below” అంశాలు మనకు కనిపిస్తాయి. అది ఎలాగనగా ఆంధ్ర తెలుగు సందర్భంలో ఆధునికత అనేది ప్రభుత్వాల నుండి ప్రజల్లోకి వచ్చిన మార్పుగా చూడవచ్చు. కానీ తెలంగాణ సందర్భంలో మీడియా వేదికలు ముఖ్యంగా సినిమా, వార్తలు ఉపయోగించే భాషను గమనించినట్లయితే అవి మార్పుతో పాటు భాషా రాజకీయ, సాంస్కృతిక ప్రాతినిధ్య మలుపుని ప్రజల నుండి పుట్టిన మార్పుగా సూచిస్తాయి. ఇటువంటి ప్రామాణిక భాషా మార్పుని ఆంధ్ర తెలుగు ఆధిపత్యాన్ని ప్రశ్నించే మార్పుని పైన పేర్కొన్న మూడు అంశాలు భాష, రాష్ట్రం, మీడియా, వాటి మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం కోసం తెలంగాణలో భాషా రాజకీయాల రూపాంతరాన్ని అర్థం చేసుకోవడం కీలకం. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని తర్వాతి విశ్లేషణ విభాగంలో వివరించడం జరిగింది.
9. సమాచార విశ్లేషణ
9.1. భాషా డీ-స్టాండర్డైజేషన్ ప్రక్రియ
ప్రస్తుత తెలంగాణ మీడియా ప్రసారాలలో ప్రాంతీయ మాండలిక వినియోగం పోలాక్ చెప్పినట్లు ప్రజాభాషీకరణ భావనను ఆధునిక మీడియా పరిధిలో విస్తరించి, స్థానిక భాషను ప్రజా సంభాషణలో కేంద్రంగా నిలుపుతుంది (Pollock 2006). ఈ ప్రక్రియ ద్వారా మీడియా ప్రేక్షకులలో ప్రాంతీయ అనుభవాలను, గుర్తింపును పంచుకునే సామూహిక చైతన్యాన్ని సూచిస్తుంది. ఇది భాషా డీ-స్టాండర్డైజేషన్ ప్రక్రియను వివరిస్తూ ఆండర్సన్ పేర్కొన్న ఊహాత్మక సముదాయం భావనకు అనుగుణంగా తెలంగాణ భాషా సాంస్కృతిక ఐక్యతను వ్యక్తపరుస్తుంది (Anderson 1983). సాధారణంగా తెలుగులో ప్రధాన వార్తా బులెటిన్‌లను చూస్తే మనకు వినిపించే వాక్య నిర్మాణం కంటే తీన్మార్ వార్తలలో వినిపించే భాషా నిర్మాణంలో ప్రత్యేకమైన పదజాల శైలి ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులోని అధికారిక సంబోధన, సంభాషణ పద్ధతి చెవులకు ఎంతో వినసొంపుగా ఉంటుంది. ఈ మార్పు కేవలం పదజాల శైలి మార్పు కాదు. అధికార దూరాన్ని తగ్గించే వచన వ్యూహం.
ప్రామాణిక తెలుగుకు ఉండే లెజిటిమేట్ లాంగ్వేజ్ హోదాను తీన్మార్ వార్తలలోని మాండలికం ప్రసారాలకు అనుగుణంగా మార్చి దానికి ప్రతీకాత్మక మూలధనాన్ని కల్పిస్తుంది (Bourdieu 1991). తెలంగాణ భాషా వినియోగం వలన ఈ సహజీకరణలోని మార్పు తీన్మార్ వార్తలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ చీలిక పూర్తిగా విప్లవాత్మకమా? లేక హెగెమోనీలో భాగమా అన్న ప్రశ్నలు విశ్లేషణలో ప్రధానంగా వివరించడం జరిగింది.
9.2. తెలంగాణ ఎన్‌కోడింగ్
రాజకీయ సంగతులలో నాయకులను అన్న, అక్క, మామ వంటి సంబోధనలతో పేర్కొనడం ఒక ప్రత్యేక ఎన్‌కోడింగ్ వ్యూహం. అది తీన్మార్ వార్తలలో వాడిన తర్వాత ఆ భాష, ఆ యాసలోని సొగసు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవడమే కాదు, ఆలోచింపజేసింది. అందులోని మాటల తీరు అధికారులను కుటుంబ సంబంధీకులుగా మారుస్తుంది. అట్లా చేయడం ద్వారా అధికారులకు, ప్రజలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు, ప్రధాన వార్తా (ETV, TV9) మీడియాలో “ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు” అని చదువుతారు. కానీ తీన్మార్ వార్తలలో “మన పెద్దసారు పనులు మొదలుపెట్టారు” అని సాధారణ భాషలో చదువుతారు. ఇక్కడ అధికార పదాలు స్థానిక మాటలుగా మారతాయి. ఇది కేవలం శైలిలో మార్పు కాదు. ఇతర ప్రామాణిక వార్తా వేదికలలో నాయకుడు అధికార ప్రతినిధిగా కనిపిస్తే, తీన్మార్ వేదికలో సామాజిక సంబంధాలలో ఒక పాత్రధారిగా కనిపిస్తారు. ఇలా ప్రజలకు అధికారులకు మధ్య దూరాన్ని చెరిపేసే ఈ మార్పును ఫెయిర్‌క్లో మూడు నమూనాల ద్వారా విశ్లేషించిన విధానాన్ని చూస్తే మరింత సులువుగా అర్థం చేసుకోవచ్చు (Fairclough 1995). అవి:
- స్థానిక పదజాలం, సంబోధనలు
- వ్యంగ్య నిర్మాణం ద్వారా అధికారాన్ని చర్చించడం
- రాజకీయ అధికారానికి కొత్త సామాజికార్థం ఇవ్వడం
ఈ ప్రక్రియ ప్రేక్షకుల మనస్సులను ప్రభావితం చేసి ఆకట్టుకుంటుంది. స్థానిక ప్రేక్షకుడు తన అనుభవాన్ని వార్తా నిర్మాణంలో గుర్తించగలుగుతాడు.
9.3. వ్యంగ్యం, భావోద్వేగం, ప్రజా వేదిక సంస్కృతి
తీన్మార్ వార్తలలోని భాష అందులోని పదజాల వినియోగం ఎంతో హాస్యంతో మేళవిస్తాయి. ఈ వ్యంగ్య రూపం అధికారులను నేరుగా ధ్వంసం చేయదు కానీ అది ప్రజాస్వామ్య చర్చకు దారితీస్తుంది. రాజకీయాలలో భావోద్వేగ ప్రాధాన్యాన్ని గుర్తించి రాజకీయ విమర్శను సున్నితంగా మలుస్తుంది. ఉదాహరణకు, తీన్మార్ వార్తలు విమర్శలు కూడా హాస్యంగా చెబుతాయి – “పనులు చేశామంటారు కానీ గుంతలే కనిపిస్తాయి” లాంటి మాటలు ప్రజలకు నవ్వు తెప్పిస్తాయి. అదే సమయంలో ఇటువంటి వార్తలు కేవలం వినడమే కాకుండా ప్రశ్నించే తీరుని వివరిస్తాయి. దీన్ని హాబర్మాస్ ప్రజా వేదికలో విశ్లేషించినట్లయితే, వ్యంగ్యం అనేది భయాన్ని పోగొట్టి చర్చకు దారి తీస్తుంది, కానీ పూర్తిగా విప్లవాత్మక మార్పు సూచించదు (Habermas 1989). ఇలా ఒకే ఎపిసోడ్‌లో అధికారిక ప్రకటనను చదివి వెంటనే స్థానిక వ్యాఖ్యానం జోడించడం వచనంలో బహుళ స్వరాలను సృష్టిస్తుంది. ఆ దృశ్య రూపకల్పన కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది.
9.4. దృశ్య ప్రాతినిధ్యం
సాధారణంగా వార్తా ఛానెళ్లలో సూటు బూట్లు వేసుకొని గంభీరంగా స్టూడియో నేపథ్యంలో కొనసాగితే, తీన్మార్ వార్తలలో మాత్రం ప్రజా జీవితంలోని సాధారణ వస్త్రాలతోనో లేదా సంప్రదాయ దుస్తులతోనో కనిపిస్తూ తమ హావభావాలతో కూడిన సంభాషణ కనిపిస్తుంది. ఇలా సంస్కృత ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ భాష ఎదిగినట్లే ఇక్కడ ప్రామాణిక తెలుగు ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ భాష మార్పు పొందింది. కింద పేర్కొన్న చిత్రాలలో ఇవి మనం చూడవచ్చు:
V6 వార్తలు
V6 తీన్మార్ వార్తలను పోలిన వార్తలు:
| T News “ధూమ్ దాం ముచ్చట్లు” | HMTV “జోర్దార్ వార్తలు” |
9.5. భాషా మార్కెట్ పునర్వ్యవస్థీకరణ
ఈ పోటీ ప్రపంచంలో దినదినం అనేక వార్తా ప్రసార వేదికలు సామాజిక మాధ్యమాలు పుట్టగొడుగుల్లాగా పెరుగుతూ వస్తున్న తరుణంలో తీన్మార్ వార్తలకు ఆదరణ పెరగడం టి.ఆర్.పి. స్థాయి ఆకాశాన్ని తాకడం ఏకదాటిగా సాగాయి. ఈ విజయంతో తెలంగాణ మాండలికం వాణిజ్యపరమైన విలువను కూడా కూడగట్టుకుంది. ఒకప్పుడు హాస్యంగా చూసిన భాషనే, ప్రస్తుతం ఆచరించడం ఇతర వార్తా ఛానెళ్లలో చూడవచ్చు. ఇది మార్కెట్ లాజిక్‌తో కూడిన ప్రజాభాషీకరణ (vernacularisation). చక్రవర్తి రోయ్ (2013) సూచించినట్లు, గ్లోబలైజేషన్ తర్వాత ప్రాంతీయ మీడియా జాతీయ మార్కెట్‌లో భాగమైంది. వార్తా వేదికలలోనే కాదు, దిన పత్రికలలో, సినిమాలలో కూడా తెలంగాణ భాష తనదైన పంథాలో ముందుకు సాగుతుంది. ఇది హెగెమోనీని పూర్తిగా కూల్చక పోవచ్చు కానీ దాని నిర్మాణాన్ని సవరిస్తుంది. ఈ విశ్లేషణలో సూచించేది ప్రజాభాషీకరణ నాలుగు స్థాయిలలో పనిచేస్తుంది. అవి:
- ప్రామాణిక భాషా సహజీకరణలో చీలిక
- భాషా మార్కెట్‌లో ప్రతీకాత్మక మూలధన పునర్వ్యవస్థీకరణ
- స్థాయిలో అర్థ నిర్మాణ మార్పు
- ప్రాంతీయ ఊహాత్మక సముదాయ నిర్మాణం ఒక విస్తరించిన ప్రజాభాషీకరణ
పియరీ బోర్డీయో ప్రకారం భాషకు కూడా మార్కెట్ విలువ ఉంటుంది (Bourdieu 1991). తీన్మార్ వార్తల విజయంతో తెలంగాణ భాషకు మీడియా విలువ పెరిగింది. కానీ ఇది పూర్తిగా ఆధిపత్యం అయితే కాదు. కార్పొరేట్ సంస్థలలో వచ్చిన మార్పు. ఆంటోనియో గ్రామ్సీ దీన్ని చాలా సాధారణంగా జరిగే మార్పు అని వివరించారు (Gramsci 1971). ఈ కార్యక్రమం ప్రామాణిక భాషా ఆధిపత్యాన్ని పూర్తిగా తొలగించలేదు కానీ దానిలో మార్పు తీసుకొచ్చింది. ఇలా తెలంగాణ మాండలికం ప్రసారాధికారాన్ని పొందినప్పటికీ, అది వాణిజ్య మీడియా నిర్మాణంలోనే పనిచేస్తుంది. ఈ సూత్రప్రాయ స్థితి తదుపరి చర్చా విభాగానికి పునాది వేస్తుంది. అక్కడ ఈ మార్పు విస్తృత భారతీయ మీడియా పరిణామాలలో ఎలా స్థానం సంపాదించిందో పరిశీలించవచ్చు.
10. చర్చ
వార్తా ప్రసార వేదికలలో నూతన పద్ధతికి శ్రీకారం చుట్టి ప్రజల మనస్సులను చూరగొన్న తెలంగాణ భాషను పరిశీలించినప్పుడు ఇది కేవలం శైలి మార్పు కాదని స్పష్టమవుతుంది. ప్రామాణిక తెలుగు ఆధిపత్యం ఒక హెగెమోనిక్ సహజీకరణగా పనిచేసిన సందర్భంలో మాండలికం ప్రసార వేదికలో ప్రవేశించడం ఆ సహజీకరణలో చీలికను సృష్టిస్తుంది. ఇది మీడియా కేంద్రీకృత భాషా మార్కెట్లు కేవలం వర్గ ఆధారితమే కాకుండా ప్రాంతీయ భావోద్వేగ మూలధనాన్ని కూడా వినియోగిస్తాయి.
తెలంగాణ భాష వార్తా నిర్మాణంలో వినిపించడం ప్రాంతీయ ప్రేక్షకుడిని స్వేచ్ఛగా చర్చలో భాగం చేస్తుంది. అందువల్ల ఈ మార్పు స్వయంచాలకంగా హెగెమోనీ పతనానికి దారితీయదు. ఇది ప్రేక్షకుల అనుభవాలతో పరస్పర సంబంధంలోనే అర్థవంతమవుతుంది. తెలంగాణ ప్రజాభాషీకరణ (vernacular) ప్రజా వేదిక భావోద్వేగ, వ్యంగ్య, సంభాషణాత్మక రూపాలను స్వీకరిస్తుంది. ఓర్సినీ, మిచెల్ సూచించినట్లుగా భారతీయ ప్రజాభాషీకరణ వేదికలు భావోద్వేగ రాజకీయాలను కేంద్రంగా ఉంచుతాయి (Orsini 2002; మలయశ్రీ 2010). కాబట్టి ఇక్కడ ప్రజా వేదిక విభజితమైనది, బహుళ స్వరాలతో కూడినది. ఇది హాబర్మాస్ నమూనాను సవాలు చేస్తూ ఫ్రీజర్ ప్రస్తావించిన కౌంటర్ పబ్లిక్ స్పియర్‌ని తెలంగాణ మీడియాలో మనం గమనించవచ్చు (Fraser 1990). ఈ సిద్ధాంతాన్ని ఆధునిక మీడియా పరిసరాలకు విస్తరించడానికి అవకాశం ఇస్తుంది. ఇటువంటి ప్రజాభాషీకరణ ప్రక్రియ రాష్ట్ర నిర్మాణానంతర రాజకీయ గుర్తింపుతో ముడిపడి ఉంది. ఇది చారిత్రక భాషా పునరుజ్జీవనం కాదు. అది మీడియా ద్వారా మధ్యవర్తిత్వం చేయబడిన ప్రాంతీయ స్వీయవ్యాఖ్యానం. ఇలా తమదైన భాష ప్రసారంలో వినిపించడం వలన ప్రాంతీయ సముదాయాన్ని బలపరుస్తుంది. ఈ ఊహాత్మకత కూడా మార్కెట్, మీడియా, రాజకీయాల మధ్య ఏర్పడుతుంది. కాబట్టి ఇది స్వచ్ఛమైన జాతీయత కాదు. మధ్యవర్తిత్వం వల్ల వచ్చిన ప్రాంతీయత. ఈ సందర్భంలో తెలంగాణ వార్తా రూపం ప్రాంతీయ రాజకీయ చైతన్యాన్ని సాంస్కృతిక శైలిలో వ్యక్తీకరిస్తుంది. ఇందులో మాండలికం భాష వినిపించినప్పటికీ అది గ్లోబల్ మీడియా ఫార్మాట్‌లలోనే కొనసాగుతుంది. కానీ అదే సమయంలో రాజకీయ తీవ్రతను సున్నితపరచవచ్చు. మార్కెట్ విజయం ప్రతిఘటనను తటస్థీకరించవచ్చు. కాబట్టి ఇది అధికార పునర్విభజన కాకుండా అధికార పునర్‌బ్రాండింగ్ కావచ్చని కూడా వాదించవచ్చు.
తెలంగాణ సందర్భంలో ప్రత్యేకత ఏమిటంటే ఇది రాష్ట్ర ఆవిర్భావానంతర రాజకీయ స్థిరీకరణ దశలో జరిగింది. అందువల్ల ఇది మీడియా రాష్ట్ర మార్కెట్ సంబంధాల మధ్య ఏర్పడిన చర్చా వేదికగా మారింది.
10.1. ఈ పరిశోధనలోని ప్రధానాంశాలు
- మీడియా హెగెమోనీ సిద్ధాంతాన్ని ప్రాంతీయ భాషా సందర్భంలో విస్తరించడం.
- భాషా జాతీయత అధ్యయనాలలో మాండలిక ప్రసారాధికారాన్ని చేర్చడం.
- ప్రజాభాషీకరణ (vernacular) ప్రజా వేదిక భావనను టెలివిజన్ వ్యంగ్య రూపంతో అనుసంధానించడం.
- దక్షిణాసియా మీడియా అధ్యయనాలలో తెలంగాణను ఒక కీలక కేస్‌గా ప్రతిపాదించడం.
- ప్రతీకాత్మక అధికారం పునర్వ్యవస్థీకరణను వివరించడం.
తెలంగాణ ప్రజాభాషీకరణను మీడియా ద్వారా మధ్యవర్తిత్వం చేయబడిన ప్రతీకాత్మక అధికార పునర్వ్యవస్థీకరణగా చూడాలి. ఇది సంపూర్ణ విప్లవాత్మక విరామం కాదు, అది చర్చా ఆధారిత హెగెమోనీ. ప్రామాణిక తెలుగు ఆధిపత్యాన్ని పూర్తిగా కూల్చకుండా దానిలో పాక్షిక మార్పును సృష్టిస్తూ తెలంగాణ మాండలికం ప్రసారాధికారాన్ని సంపాదించింది. ఈ పరిణామం ఆధునిక భారతీయ మీడియా భాషా రాజకీయాలను అర్థం చేసుకోవడానికి కీలక సూచికగా నిలుస్తుంది.
ఉపసంహారం
తెలుగు పద సంపదలో తెలంగాణలోని వృత్తులు, జీవన విధానాలు, గ్రామీణుల భాష, ప్రజలు మాట్లాడే భాషా రీతులు, కొందరు పండితులు రచయితలు రాసిన శైలీలు తెలంగాణ భాషకు ఆనవాళ్లుగా కనబడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం తెలంగాణ భాషా ఘంటువును రూపొందిస్తోంది. నాడు ప్రత్యేక రాష్ట్ర సాధనోద్యమంలో భాష ఒక ప్రధాన సాధనంగా మారింది. వీటినన్నింటినీ బట్టి చూస్తే తెలంగాణ భాషకు ప్రత్యేకత ఉందని, అది ఈ మధ్యకాలంలో రూపుదిద్దుకుంటుందని స్పష్టంగా అర్థమవుతోంది. తెలంగాణ వారి పండుగలు చాలా వరకు వేరుగా ఉంటాయి. వాటిని తెలంగాణ రాష్ట్ర పండుగలుగా ప్రకటించడంతో పాటు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం కూడా వేరు అనడమే కాకుండా పాఠ్య పుస్తకాలను సైతం తెలంగాణ భాషలోనే ముద్రించుకోవడం, మీడియాలో ఎంతో హట్టహాసంగా అనేక కార్యక్రమాలను నిర్వహించడం, సినిమాలను తీయడం జరుగుతోంది. ఇంత కాలం ఆధిపత్యంగా కొనసాగిన తెలుగు భాషను మరిపిస్తూ వార్తా రంగంలోకి ప్రవేశించిన అనతి కాలంలోనే తీన్మార్ వార్తలు తెలంగాణ ప్రజల హృదయాలను చూరగొన్నాయి. ఈ పరిశోధనలో వెలుగు చూసింది ఏమిటంటే తెలంగాణ మాండలికం టెలివిజన్ వార్తలలో స్థానం సంపాదించడం ఒక ముఖ్యమైన పరిణామం. ఇది ప్రామాణిక భాష అనే దాన్ని పూర్తిగా తొలగించలేదు కానీ కొంతవరకు మార్పు తీసుకొచ్చింది. తద్వారా ప్రాంతీయ గుర్తింపు బలపడింది. అయితే ఈ మార్పు సంపూర్ణమైన మార్పు కాదు. క్రమంగా జరిగే ఒక సామాజిక మార్పు మాత్రమే. అయితే ఈ మార్పు అధికారాన్ని పూర్తిగా కూల్చివేయలేదు కాబట్టి ఇలాంటి పరిశోధనలు భవిష్యత్ లో ప్రేక్షకుల అభిప్రాయాలు, డిజిటల్ మీడియా ప్రభావం వంటి విషయాల పై మరింత పరిశోధన అవసరం. మొత్తంగా తెలంగాణ భాష వార్తల వేదిక మీదకి రావడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుగా భావించవచ్చు.
- తెలంగాణ మాండలికం వార్తా ప్రసారాలలోకి ప్రవేశించడం ఒక ముఖ్యమైన సామాజిక మార్పుగా గుర్తించబడింది.
- ఇది ప్రామాణిక తెలుగు భాషా ఆధిపత్యాన్ని పూర్తిగా తొలగించకుండా, దానిలో పాక్షిక మార్పును సృష్టించింది.
- ప్రాంతీయ గుర్తింపును బలోపేతం చేయడంలో తీన్మార్ వార్తలు కీలక పాత్ర పోషించాయి.
- మాండలిక వినియోగం కేవలం శైలి మార్పు కాకుండా, అధికార పునర్వ్యవస్థీకరణకు, ప్రజాస్వామ్య చర్చకు దారితీసింది.
- ఈ మార్పును 'కింది నుండి పైకి జరిగే' (bottom-up) భాషా పరిణామంగా చూడవచ్చు. ఇది తెలంగాణ ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది.
- భవిష్యత్తులో ప్రేక్షకుల అభిప్రాయాలు, డిజిటల్ మీడియా ప్రభావం వంటి అంశాలపై మరింత పరిశోధన అవసరం.
కృతజ్ఞతలు
ఈ వ్యాసం అభివృద్ధి చేయడంలో నాతో సుదీర్ఘంగా చర్చించి అనేక ఆలోచనలను పంచుకున్నందుకు, ముఖ్యమైన సూచనలు చేసినందుకు కవి, రచయిత ఎనుపోతుల వెంకటేష్ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ఉపయుక్త గ్రంథసూచి
- Anderson, Benedict. Imagined Communities: Reflections on the Origin and Spread of Nationalism. Verso, 1983.
- Appadurai, Arjun. Modernity at Large: Cultural Dimensions of Globalization. University of Minnesota Press, 1996.
- Bourdieu, Pierre. Language and Symbolic Power. Harvard University Press, 1991.
- Brass, Paul R. The Politics of India Since Independence. Cambridge University Press, 1994.
- Chakravartty, Paula., and Roy, Srirupa. “Media Pluralism Redux: Towards New Frameworks of Comparative Media Studies ‘Beyond the West.’” Political Communication, vol. 30, no. 3, 2013, pp. 349–370.
- Fairclough, Norman. Media Discourse. Edward Arnold, 1995.
- Ferguson, Charles A. “Diglossia.” Word, vol. 15, no. 2, 1959, pp. 325–340.
- Fowler, Roger. Language in the News: Discourse and Ideology in the Press. Routledge, 1991.
- Fraser, Nancy. “Rethinking the Public Sphere: A Contribution to the Critique of Actually Existing Democracy.” Social Text, no. 25/26, 1990, pp. 56–80.
- Government of India. Andhra Pradesh Language Policy Act, 1966. 1966.
- Government of India. Andhra Pradesh Reorganisation Act, 2014. 2014.
- Government of India. States Reorganisation Act, 1956. 1956.
- Gramsci, Antonio. Selections from the Prison Notebooks. Edited and translated by Quintin Hoare and Geoffrey Nowell Smith, International Publishers, 1971.
- Habermas, Jurgen. The Structural Transformation of the Public Sphere: An Inquiry into a Category of Bourgeois Society. Translated by Thomas Burger, MIT Press, 1989.
- Hall, Stuart. “Encoding/Decoding.” Culture, Media, Language: Working Papers in Cultural Studies, 1972–79, edited by Stuart Hall et al., Hutchinson, 1980, pp. 128–138.
- Hall, Stuart. Representation: Cultural Representations and Signifying Practices. Sage Publications, 1997.
- Inukonda, Sumanth. Media, Nationalism and Globalization: The Telangana Movement and Indian Politics. Routledge, 2019.
- కాత్యాయనీ, విద్యాహే. ప్రాంతీయ చైతన్యం తెలంగాణ సాహిత్యం. పాలపిట్ట బుక్స్, 2013.
- Keiko, Yamada. “Origin and Historical Evolution of the Identity of Modern Telugus.” Economic and Political Weekly, vol. 45, no. 34, 2010, pp. 57–63. JSTOR.
- కొత్తపల్లి, జయశంకర్. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్. మల్లెపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్, 2004.
- Krishnamurti, Bhadriraju., and Gwynn, J.P.L. A Grammar of Modern Telugu. Delhi: Oxford University Press, 1985.
- Labov, William. Sociolinguistic Patterns. University of Pennsylvania Press, 1972.
- మలయశ్రీ. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, జన జీవనం. నవ్య సాహిత్య పరిషత్, 2010.
- Mantena, Rama Sundari. “Vernacular Publics and Colonial Modernity in Telugu Print Culture.” The Origins of Modern Telugu Literature. Cambridge University Press, 2013.
- Milroy, James. “Language Ideologies and the Consequences of Standardisation.” Journal of Sociolinguistics, vol. 5, no. 4, 2001, pp. 530–555.
- ముదిగంటి, సుజాతారెడ్డి. తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర. తెలంగాణ సరస్వత పరిషత్తు, 2015.
- Neyazi, Taberez Ahmad. Political Communication and Mobilisation: The Hindi Media in India. Cambridge University Press, 2018.
- Orsini, Francesca. The Hindi Public Sphere 1920–1940: Language and Literature in the Age of Nationalism. Oxford University Press, 2002.
- Pingali, Gautam. The Fall and Rise of Telangana. Orient Blackswan, 2014.
- Pollock, Sheldon. The Language of the Gods in the World of Men: Sanskrit, Culture, and Power in Premodern India. University of California Press, 2006.
- Quadri, Iqbal. “Beyond Telangana Sentiment: Reimagining Region and Culture in a New State.” Economic and Political Weekly, vol. 56, no. 18, 2021.
- Rajagopal, Arvind. Politics After Television: Hindu Nationalism and the Reshaping of the Public in India. Cambridge University Press, 2001.
- రామమోహనరావు, కడియాల. తెలుగు కవిత్వ వికాసం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1982.
- Robertson, Roland. “Glocalization: Time-Space and Homogeneity-Heterogeneity.” Global Modernities, edited by Mike Featherstone, Scott Lash, and Roland Robertson, Sage Publications, 1995, pp. 25–44.
- , Satyanath. “Standard-ness, National Ideologies and Their Embedding in ‘Sociolinguistic Theory’.” Asia-Pacific Language Variation, vol. 8, no. 2, 2022, pp. 174–205.
- సంగిశెట్టి, శ్రీనివాస్. 1969–1973 తెలంగాణ ఉద్యమ కవిత్వం. తెలంగాణ రచయితల సంఘం, 2009.
- Srikanth, H. “United Andhra or Separate Telangana? Politics of Regionalism in Andhra Pradesh.” The Indian Journal of Political Science, vol. 72, no. 3, 2011, pp. 781–790.
- Tillin, Louise. Remapping India: New States and Their Political Origins. Oxford University Press, 2013.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

