AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
11. రాయలసీమ రచయిత్రులు: కథాప్రస్థానం

ఆర్. సి. కాంతివర్ధిని
పరిశోధకులు, తెలుగు & అనువాద అధ్యయనశాఖ,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 6302799584, Email: royalkranti1983@gmail.com

ఆచార్య డా. కె. శ్రీదేవి
తెలుగు & అనువాద అధ్యయనశాఖ,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441404080, Email: kinnerasreedevi65@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 20.12.2024 ఎంపిక (D.O.A): 28.12.2024 ప్రచురణ (D.O.P): 01.01.2025
వ్యాససంగ్రహం:
రాయలసీమ జిల్లాలలో పదులకొద్దీ వున్న స్త్రీ రచయితలు గణనీయమైన సంఖ్యలోనే కథారచన చేశారు. ఈ కృషిలో ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన వాళ్ళేగాక ఈ ప్రాంతానికి ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి వైయక్తిక, సామూహిక కృషి ఫలితంగా సీమ సాహిత్యంలో పరిగణింపదగిన స్త్రీల కథా సాహిత్యాన్ని, దాన్ని సృష్టించిన స్త్రీ రచయిత్రులను, స్త్రీవాద రచయితల వ్యక్తిగతమైన శైలులను, కథావస్తువులను రేఖామాత్రంగా పరిచయం చేయడం, విశ్లేషించడం, పరిశోధించిన అంశాలను ఆవిష్కరించటం ఈ వ్యాసలక్ష్యం. రాయలసీమలో స్త్రీ రచయిత్రులు గతమూడు దశాబ్దాల నుండే ఎక్కువగా స్థాయిలో రాయటం కనిపిస్తుంది. వీరి రచనలలో పురుష రచయితలు తీసుకున్న వస్తువులతోపాటు, వాళ్ళకు సాధ్యపడని, స్త్రీలు మాత్రమే రాయగలిగిన, విశ్లేషించ గలిగిన అంశాలు కూడా ప్రతిఫలించాయి. ఈ ప్రతిఫలనాలను నిర్దిష్టంగా విశ్లేషించటం సోదాహరణంగా చర్చించటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. రచనల ప్రమాణాన్ని (quality) కేంద్రం చేసుకొని విశ్లేషించటం మామూలుగా అవసరమే అయినప్పటికీ, స్త్రీల విషయంలో ఈ సూత్రానికి కొంత మినహాయింపు అవసరం. ఎందుకంటే, స్త్రీలు శతాబ్దాలుగా రచనా రంగం నుంచి అప్రకటిత నిషేధాల ద్వారా దూరం చేయబడ్డారు. ఆధునికయుగంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిందనడానికి ఆస్కారమేమీ లేదు. అటువంటి వాతావరణంలో, భూస్వామ్య సంస్కృతి కలిగిన రాయలసీమలో అసలు స్త్రీలు రచన చేయటమే విశేషం. అందువలన అన్ని తరహా స్త్రీల రచనలను రేఖా మాత్రంగానైనా స్పృశించడం అనివార్యమనే భావనతో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది. చరిత్ర లోతుల్లోకి వెళ్ళకుండానే వెలువడిన సంకలనాలలోనూ స్త్రీలు విస్మరింపబడినారు. ఉదాహరణకు 2004 సంవత్సరంలో నూకా రాంప్రసాద్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన సీమ కక్ష్యల కథలు"లో కూడా కేవలం ఒక స్త్రీ రచయిత మాత్రమే కనిపిస్తుంది. నిజానికి అప్పటికే ఐదారుగురు పైగా శక్తివంతంగా రాయగలిగిన రచయిత్రులున్నారు. ఆ సంకలనం ప్రధానంగా ఫ్యాక్షన్ సంబంధిత ఇతివృత్తాలకు కేటాయింపబడింది. ఆ వస్తువును పురుష రచయితలే కాక స్త్రీలు కూడా స్వీకరించారు. ఉదాహరణకు ఆర్. శశికళ రాసిన "కలుపు మొక్కలు" కథ ఫ్యాక్షనిజం పిల్లల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సోదాహరణంగా నిరూపించిన కథ. ఆ కథకు పై సంకలనంలో చోటు దొరకలేదు. 2006 సంవత్సరంలో ప్రచురించబడిన “రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ” గ్రంధాన్ని రచించిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి సీరియస్ సామాజిక విమర్శకుని దృష్టికి కూడా అందలేదు. సీమ సాహిత్యానికి స్త్రీలు చేసిన కృషి గురించి ఆయన విశ్లేషించలేదు. స్త్రీలను విస్మరించిన ఈ క్రమం వెనుక ఎలాంటి రాజకీయాలూ లేవని అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమ రచయిత్రుల కథా సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. ఈ సిద్ధాంత వ్యాసంలో స్త్రీ రచయితల వయసు, కాలం లాంటి ప్రమాణాలను పక్కన పెట్టి రచనా పరంగా వాళ్ళు సాహిత్య ప్రపంచంలో వేసిన ముద్రల ఆధారంగా ఈ విశ్లేషణ సాగుతుంది.
Keywords: స్ర్రీలు, రచయిత్రులు, రాయలసీమ, విస్మృత రచయిత్రులు, కథ, స్త్రీవాదం
1. ప్రవేశిక:
రాయలసీమ వెయ్యేళ్ళ సాహిత్యచరిత్రలో కథాసాహిత్య చరిత్ర 1918లో ప్రారంభమైతే, రాయలసీమ స్త్రీ రచయితల కథా ప్రస్థానం 1927 నుండి మొదలైంది. నిజానికి 1926లో కస్తూరి వెంకట సుబ్బమ్మ (అనంతపురం) 'కథామంజరి' పేరుతో పౌరాణిక వస్తువుతో 'బలిచక్రవర్తి చరిత్రం', 'భీష్మోదయం', 'గరుడ చరిత్రం' కథలు రాశారు. కానీ ఇవి ఆధునిక జీవితాన్ని చిత్రించిన కథలు కాకపోవడం వలన కథానిక ప్రక్రియగా అంగీకరించలేం. 1927 సంవత్సరంలో చిత్తూరుజిల్లా నుండి మామిడి రుక్మిణమ్మ, కడపజిల్లా ప్రొద్దుటూరు నుండి కథలు రాసిన పూండి చెల్లమ్మ, డి. పాపమ్మ ఆనాటి సమకాలీన సామాజిక సమస్యలను వస్తువుగా స్వీకరించి “సీతాబాయి”, “సుందరి”, “అత్తగారేదియో తెలుసుకొంటిరా” అనే కథలను 'భారత కథానిధి', 'సాధన', 'భారత జ్యోతి' పత్రికలలో ప్రచురించారు. ఆధునిక జీవితాన్ని ప్రతిబింబించేట్లుగా వరకట్న సమస్యను, ప్రేమ వివాహాలు లాంటి సమకాలీన సమస్యలను తమ కథల్లో చిత్రించారు. కొంతమంది రాయలసీమ తొలి రచయిత్రులు ఆధ్మాత్మిక జీవిత నేపథ్యంలోంచి భక్తి ప్రధానమైన ఇతివృత్తాలనే కథావస్తువుగా చేసుకున్నారు. పురాణ కథా వస్తుసముదాయం నుండి ఆధునిక జీవితంలోకి పర్యవసించే క్రమం రాయలసీమ కథా రచయిత్రుల రచనల్లో గమనించవచ్చు. ముఖ్యంగా 'సీతాబాయి' రచయిత్రి పూండి చెల్లమ్మ స్త్రీల మానసిక స్థైర్యానికి, ఆచరణకు ప్రతిఫలనరూపంగా కథారచన చేయగలిగారు. ఆమెను ప్రత్యేకంగా అభినందించవలసిందే.
రాయలసీమ కథ - రచయిత్రులు:
రాయలసీమ కథ వస్తు, రూపపరంగా మిగిలిన ప్రాంత కథలకు దీటుగా వెలువడుతూ వచ్చింది. 1918ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించిన రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని శక్తివంతంచేసే కృషిలో భాగమయ్యారు. ఈ ఆరు దశాబ్దాల కృషిలో సింహభాగం పురుషులదే అయినప్పటికీ, స్త్రీల పాత్రను నిరాకరించటానికి వీల్లేదు. ఎందుకంటే, రాయలసీమ జిల్లాలలో పదులకొద్దీ వున్న స్త్రీ రచయితలు గణనీయమైన సంఖ్యలోనే కథారచన చేశారు. ఈ కృషిలో ఈ ప్రాంతంలో పుట్టిపెరిగిన వాళ్ళేగాక ఈ ప్రాంతానికి ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరి వైయక్తిక, సామూహిక కృషి ఫలితంగా సీమ సాహిత్యంలో పరిగణింపదగిన స్త్రీల కథా సాహిత్యాన్ని, దాన్ని సృష్టించిన స్త్రీ రచయిత్రులను, స్త్రీవాద రచయితల వ్యక్తిగతమైన శైలులను, కథావస్తువులను రేఖామాత్రంగా పరిచయం చేయడం, విశ్లేషించడం, పరిశోధించిన అంశాలను ఆవిష్కరించటం ఈ అధ్యాయం ప్రాముఖ్యం. నిజానికి రాయలసీమలో స్త్రీ రచయిత్రులు గతమూడు దశాబ్దాల నుండే ఎక్కువగా స్థాయిలో రాయటం కనిపిస్తుంది. వీరి రచనలలో పురుష రచయితలు తీసుకున్న వస్తువులతోపాటు, వాళ్ళకు సాధ్యపడని, స్త్రీలు మాత్రమే రాయగలిగిన, విశ్లేషించ గలిగిన అంశాలు కూడా ప్రతిఫలించాయి. ఈ ప్రతిఫలనాలను నిర్దిష్టంగా విశ్లేషించటం సోదాహరణంగా చర్చించటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం.
రాయలసీమలో ఇప్పటిదాకా రచనారంగంలోకి వచ్చిన స్త్రీల రచనలన్నింటినీ సంపూర్ణంగా పరిశీలించటం ఆచరణ(Practical) సాధ్యంకాదు కాబట్టి కొంత వరకైనా పరిశీలించటం అవసరం. ఈ పరిశీలనకు చేయి తిరిగిన స్త్రీ రచయితలనే కాక ఇపుడిపుడే అత్యంత ఉత్సాహంతో రచనా రంగంలోకి ముఖ్యంగా కథా సాహిత్యంలోకి వచ్చిన యువ కథకుల్ని కూడా పరిశీలించడం సముచితంగా వుంటుంది. రచనల ప్రమాణాన్ని (quality) కేంద్రం చేసుకొని విశ్లేషించటం మామూలుగా అవసరమే అయినప్పటికీ, స్త్రీల విషయంలో ఈ సూత్రానికి కొంత మినహాయింపు అవసరం. ఎందుకంటే, స్త్రీలు శతాబ్దాలుగా రచనా రంగం నుంచి అప్రకటిత నిషేధాల ద్వారా దూరం చేయబడ్డారు. ఆధునికయుగంలో ఈ పరిస్థితి పూర్తిగా మారిందనడానికి ఆస్కారమేమీ లేదు. అటువంటి వాతావరణంలో, భూస్వామ్య సంస్కృతి కలిగిన రాయలసీమలో అసలు స్త్రీలు రచన చేయటమే విశేషం. అందువలన అన్ని తరహా స్త్రీల రచనలను రేఖా మాత్రంగానైనా స్పృశించడం అనివార్యమనే భావనతో ఈ వ్యాసం రాశాను.
"Imaginatively she is of the highest importance, practically she is completely insignificant. She pervades poetry from cover to cover, she is all but absent from history"1. -Virginia Woolf "A Room of One's own"
నిజమే, వర్జీనియా ఉల్ఫ్ భావించినట్లుగా కేవలం ఊహల్లో స్త్రీకి అత్యంత ప్రాముఖ్యం వుంది. ఆచరణాత్మకంగా చూసినపుడు ఆమెకు ఎక్కడా గుర్తింపే లేదు. కానీ కవిత్వంలో ఆమె సర్వవ్యాపకంగా వుంటుంది. చరిత్రలో ఆమెకేమాత్రం స్థానంలేదు. వర్జీనియా ఉల్ఫ్ అభిప్రాయం ఐరోపా సాహిత్య సందర్భాన్ని గురించి మాట్లాడినప్పటికీ, దానికి విశ్వజనీయమైన విలువ వుంది. ఎందుకంటే, మిగతా ప్రపంచంలోనూ స్త్రీల స్థితి ఇందుకు ఏమాత్రం భిన్నంగాలేదు. భారతదేశానికి కూడా ఇది వర్తిస్తుంది. ఆ విషయాన్ని అలావుంచితే రాయలసీమలో సాహిత్యం రూపొంది వృద్దిచెందడంలో స్త్రీల కృషిని గుర్తించటం, విశ్లేషించటం ఈ పరిశోధనాంశం లక్ష్యం. రాయలసీమ సాహిత్య చరిత్రను పరిశీలించినపుడు లేక ఆ చరిత్రను గ్రంథస్థం చేసే సంకలనాలను విశ్లేషించినపుడు, ఈ విషయంలో స్త్రీలు ఎంత విస్మరణకు గురయినారో చాలా స్పష్టంగా అవగతమవుతుంది. చరిత్ర లోతుల్లోకి వెళ్ళకుండానే వెలువడిన సంకలనాలలోనూ స్త్రీలు విస్మరింపబడినారు. ఉదాహరణకు 2004 సంవత్సరంలో నూకా రాంప్రసాద్ రెడ్డి సంపాదకత్వంలో వెలువడిన సీమ కక్ష్యల కథలు"లో కూడా కేవలం ఒక స్త్రీ రచయిత మాత్రమే కనిపిస్తుంది. నిజానికి అప్పటికే ఐదారుగురు పైగా శక్తివంతంగా రాయగలిగిన రచయిత్రులున్నారు. ఆ సంకలనం ప్రధానంగా ఫ్యాక్షన్ సంబంధిత ఇతివృత్తాలకు కేటాయింపబడింది. ఆ వస్తువును పురుష రచయితలే కాక స్త్రీలు కూడా స్వీకరించారు. ఉదాహరణకు ఆర్. శశికళ రాసిన "కలుపు మొక్కలు" కథ ఫ్యాక్షనిజం పిల్లల ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సోదాహరణంగా నిరూపించిన కథ. ఆ కథకు పై సంకలనంలో చోటు దొరకలేదు. 2006 సంవత్సరంలో ప్రచురించబడిన “రాయలసీమలో ఆధునిక సాహిత్యం సామాజిక సాంస్కృతిక విశ్లేషణ” గ్రంధాన్ని రచించిన వల్లంపాటి వెంకట సుబ్బయ్య లాంటి సీరియస్ సామాజిక విమర్శకుని దృష్టికి కూడా అందలేదు. సీమ సాహిత్యానికి స్త్రీలు చేసిన కృషి గురించి ఆయన విశ్లేషించలేదు. స్త్రీలను విస్మరించిన ఈ క్రమం వెనుక ఎలాంటి రాజకీయాలూ లేవని అనుకోవటం అమాయకత్వమే అవుతుంది. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమ రచయిత్రుల కథా సాహిత్యాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను.
ఈ సిద్ధాంత వ్యాసంలో స్త్రీ రచయితల వయసు, కాలం లాంటి ప్రమాణాలను పక్కన పెట్టి రచనా పరంగా వాళ్ళు సాహిత్య ప్రపంచంలో వేసిన ముద్రల ఆధారంగా ఈ విశ్లేషణ సాగుతుంది. ఈ విశ్లేషణ కోసం ప్రముఖంగా ఈ క్రింది స్త్రీ రచయితల కథలలో కొన్నింటిని మాత్రమే ఈవ్యాస పరిధిలోకి స్వీకరించాను. గమనించగలరు. 1. నిర్మలా రాణి, 2. ఆర్. శశికళ, 3. యం.కె.దేవకి, 4. జయలక్ష్మీరాజు, 5. షహనాజ్ బేగం, 6. చిలుకూరు దీవెన, 7. చిలుకూరు లక్ష్మి, 8. ఆర్. వసుంధరాదేవి, 9. పుష్పాంజలి, 10. కె. మధుజ్యోతి, 11. యం.ఆర్. అరుణకుమారి, 12. మధురాంతకం నాగభూషణమ్మ, 13. మంజుల, 14. యం. నాగమణి, 15. మంగమ్మ, 16. దుర్గాదేవి, 17. కె. సుభాషిణి, 18. యస్. జయ, 19. చక్కిలం విజయలక్ష్మి, 20. కొండూరి శ్రీదేవి, 21. డి. నాగమ్మ పూలే, 22. వి. రుక్మిణి, 23. కె. వసంత ప్రకాశ్, 24. విశాల వియోగి, 25. చంద్రకళ, 26. కోమలాదేవి, 27. కస్తూరి వెంకట సుబ్బమ్మ, 28. మామిడి రుక్మిణమ్మ, 29. పూండి చెల్లమ్మ, 30. డి. పాపమ్మ, 31. అమ్మళ్ళదిన్నె పద్మజ, 32. సి. యం. అనురాధ, 33. భాస్కర బాలభారతి, 34. హెచ్. కె. ఫైరోజా భాను, 35. చేలూరు రమాదేవి, 36. ఆలూరి లక్ష్మిదేవి, 37. కాకి అరుణ, 38. ఉన్నమట్ల స్వర్ణకుమారి, 39. పోరాల శారద, 40. బి. హేమ మాలిని, 41. కొండసాని రజిత, 42. యం. ప్రగతి, 43. ఆవుల జయప్రద, 44. ఏ. జయలక్ష్మి రాజ్, 45. డా. పుట్టపర్తి నాగ పద్మిని, 46. సింగాడి శోభామణి, 47. బి. బిజిలి, 48. సులోచనా దేవి మాడుగుల ౪౯. సుహాసిని మొదలైనవాళ్ళు.
దాదాపుగా యాభైమంది కథా రచయిత్రులు రాయలసీమ ప్రాంతంలో వున్నప్పటికీ వాళ్ళ రచనలు అందుబాటులో లేకపోవటం వలన, నాలుగైదు కథలు రాసి ఆగిపోయిన రచయిత్రులు కొంతమందిని ఈ పరిశోధనా వ్యాసంలో విశ్లేషించటం సాధ్యంకాలేదు. అంతమాత్రం చేత ఈ ప్రయత్నంలో వారి కృషిని విస్మరించినట్లు కాదని భావిస్తున్నాను.
2.1 ఆర్. శశికళ:
శశికళ వృత్తిరీత్యా స్కూల్ ప్రిన్స్ పాల్. ఆమెది పిల్లల ప్రపంచం. ఒక రచయిత అధ్యాపకవృత్తిలో వుండటం వలన కలిగే మేలు వారి వృత్తిజీవితం - రచనా జీవితం పరస్పరం ఎలా వెలిగించుకుంటాయో శశికళ కథలు చదివితే తెలుస్తుంది. ఆమె రెండు సంకలనాలలో ముప్ఫై ఐదు కథలలో దాదాపు అన్ని కథలు పాఠశాల నేపధ్యంలో రాసినవే. స్త్రీలు, పిల్లల జీవితమే ఆమె కథల ముడిసరుకు. నిరంతరం పిల్లల చుట్టూ తిరగడమే కాకుండా వాళ్ళ జీవితం లోలోపలికి చూడగలిగారు. అందుకే ఆపిల్లల వ్యక్తిగత కుటుంబనేపధ్యాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి, అంచలంచలుగా, పొరలు పొరలుగా చుట్టుకొన్న బాల్య జీవితంలోని జైవిక వైవిధ్యాన్ని కథలుగా మలిచారు. ”చెదిరిన పిచ్చికగూడు”,” మా తుజే సలామ్” పేరిట రెండు కథాసంకలనాలు వెలువరించారు. చాలా కవితలు రాశారు. ఆంగ్లం నుండి అనువాదాలు చేశారు. వ్యాసాలు రాశారు. అనంతపురం రచయితల సంఘంలో, విరసంలో ఇప్పటికీ కొనసాగుతున్న సుధీర్ఘ కాల సభుయురాలు. సామాజిక సమస్యలపై సదస్సులు, చర్చావేదికల నిర్వహణ బాధ్యతలు లాంటి కార్యక్రమాలను కూడా ముందుండి నడిపిస్తుంటారు. కడపజిల్లా ఈమె జన్మస్థలం. వివాహమైన తరువాత స్థిరపడ్డ కారణంగా కడపజిల్లా వాస్తవ్యాన్ని ఎవరైనా గుర్తుచేస్తే తప్ప గుర్తురానంతగా అనంతపురంజిల్లాలోఇమిడిపోయారు, ఎనభై దశకంలో ఏ.పి.సి.ఎల్.సి. సారధ్యంలో బాలగోపాల్, రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, సింగమనేని నారాయణ జి. నిర్మలారాణి, శేషయ్య, చంద్రశేఖర్ మొదలైన వారితో సహా కరువు సహాయక బృందంగా ఏర్పడి అనంతపురం జిల్లాలో పలుమార్లు పర్యటించారు. విపరీతమైన వరుస కరువులలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న సంధర్భంగా జిల్లారచయితలంతా రైతులకు భరోసా ఇచ్చేందుకు కరువు పర్యటనలు చేశారు. ఈక్రమంలో శశికళ దృష్టిపథంలో నిలిచిన దారుణమైన సంఘటనలు ఆమె ఉపాధ్యాయ జీవితాన్ని వెంటాడాయి. దాని ఫలితంగా రూపుదిద్దుకున్న కథలు “డ్రాప్ వుట్” , “తారాబాయి – తాజ్ మహల్” మొదలైనవి.
రాయలసీమ నుండి కరువుపైన చాలా కథలే వచ్చాయి. స్త్రీలు కూడా పరిగణింపదగిన సంఖ్యలోనే రాశారు. కరువుకున్న బహుపార్శ్వాలను ముఖ్యంగా స్త్రీలు, ఆడపిల్లలపైన కరువు చూపుతున్న ప్రభావాలను విశ్లేషిస్తూ వచ్చిన కథలలో ఆర్. శశికళ రాసిన "డ్రాపవుట్" కథ ఒకటి. ఒక రకంగా ఈ కథ రాయలసీమ కరువు మహిళలపై వేసిన ప్రభావం, దాని వలన ఎలాంటి కొత్త సమస్యల్ని రాయలసీమ స్త్రీలు ఎదుర్కోవలసి వచ్చిందో సమగ్రంగా చిత్రించిన కథ. రాయలసీమ స్త్రీలు మిగిలిన ప్రాంతాల స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొంటూనే రాయలసీమ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకంగా ఉన్న సమస్యలను అదనంగా ఎదుర్కొంటు… రమాదేవి - కాంతమ్మల పరిస్థితి రాయలసీమ జిల్లాల్లో కరువుకాటకాలతో అలమటించి పోతున్న గ్రామీణ మహిళల దీనస్థితికి అక్షరరూపం. ఒంటరిస్త్రీలుగా వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటినీ రచయిత ఈ కథలో చొప్పించే ప్రయత్నం చేశారు.
"డ్రాపవుట్” అంటే “స్కూల్ డ్రాపవుట్” అన్న అర్థమే వస్తుంది. ఆడపిల్లల జీవితం చదువుకోవడంలోనే వారికి రక్షణ, పోషణ దొరుకుతుందన్న వాస్తవాన్ని ఈ కథలో తెలియజెప్పడమే కాక చదువు మానేసిన ఆడపిల్లలు చదువు నుండే కాక అసలు వాళ్ళ జీవితం నుండే “డ్రాపవుట్” అవుతారన్న అర్థంలో అమ్మాయిల చదువును సమర్థిస్తూ రాసిన కథగా కూడా చెప్పవచ్చు. ఏది ఏమైనా "డ్రాపవుట్" అన్న పేరు ఈ కథకు పెట్టడం రచయిత సూక్ష్మదృష్టికి నిదర్శనం.
అయితే, “డ్రాపవుట్” అనగానే ఇంత విశాలార్థం పాఠకులకు గోచరిస్తుందా అన్న సందేహం కూడా కలుగుతుంది. కరువు ప్రభావాన్ని దాని సాంస్కృతిక ప్రతిఫలనాలను ఇంత చక్కగా చెప్పగలిగిన రచయిత తన కథాశిల్పంలో మరింత జాగ్రత్తగా వుంటే, ఆడపిల్లల జీవితమే (డ్రాపవుట్) జారిపోతుందన్న అర్థం స్ఫురించే విధంగా కథనాన్ని నడిపేవారు. ఏది ఏమైనా రచయితగా శశికళ చేసిన ఈ ప్రయత్నం వస్తురీత్యా మంచి కథల జాబితాలో చేరింది. రాయలసీమ గ్రామీణ స్త్రీల సమస్యాత్మక, సంక్షుభిత జీవితాలను, కరువు ద్వారా సంభవించే మానవీయ విలువల విధ్వంసాన్ని రాయలసీమ కథల్లో మొట్ట మొదటిసారి చెప్పటం యాధృచ్ఛికం కాదు.
“డ్రాపవుట్” కథతోపాటు “అనంతగాయం”కథలో కూడా ఎయిడ్స్ వ్యాధి వలన కుప్పకూలిపోతున్న జీవితాలను సామాజిక, ప్రభుత్వ సంస్థల ఆసరాతో అర్థవంతంగా, ఆశావహంగా నడిపించుకునే అవకాశంవుందన్న ఊరడింపును అందించే ప్రయత్నం ఈకథలో కనపడుతుంది. రాజ్యహింస్పపట్ల చాలా స్పష్టమైన వైఖరిలో “అంతా ప్రశాంతం” కథలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క ద్వంద్వ వైఖరిని స్పష్టంగా చెప్పిన రచయిత 'అనంతగాయం' కథలో ప్రభుత్వ సంస్థలు, సామాజిక సంస్థలు అందించే సహాయ కార్యక్రమాలను సమర్థించటం కొంత ఆశ్చర్యం కలిగిస్తుంది.
2.2 జి. నిర్మలారాణి:
జి. నిర్మలా రాణి “గాజుకళ్ళు' పేరుతో 2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని ప్రచురించారు. దాదాపు ముప్ఫైఏళ్ళనుండి కథలు రాస్తున్నారు. రాయలసీమ నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. ఈమె రాసిన అన్ని కథలూ స్త్రీలకు సంబంధించినవే. ‘కాటేసిన కరువు' కథ అనంతపురం జిల్లాలో వరుస కరువులతో వచ్చిన వ్యావసాయక సంక్షోభాన్ని దానిపర్యవసానాలను, తత్ఫలితంగా, గ్రామీణ స్త్రీల స్థితిగతుల్లో వచ్చిన పరిణామాన్ని ప్రభావాలను ఆవిష్కరించింది. స్త్రీలే కాదు మగవాళ్ళపై కూడా ఈ ప్రభావం అధికంగా వుంది. వ్యవసాయం మూలపడటంతో, పనులకోసం పట్నం చేరినవాళ్ళు దొంగలుగా జీవితాన్ని వెళ్ళమార్చాల్సిన దీనత్వాన్ని ఈ కథలో చిత్రించారు. ఒకప్పుడు స్వయం సమృద్దిగా ఎలాంటి లోటులేకుండా బ్రతికిన గ్రామీణులు, ఈ రోజు ఎందుకూ కొరగాని వారుగా మారిన వైనాన్ని ఈ కథలో చిత్రించగలిగారు.
తండ్రి పక్షవాతంతో మంచమెక్కడంతో పనికోసం పట్నంవెళ్ళిన నాగప్ప అక్కడ వని సంపాదించుకోలేక పొట్ట నింపుకోవటం కోసం జైలు శిక్ష అనుభవిస్తాడు. దాంతో దొంగగా జీవించడం కంటే పల్లెలోనే కూలో నాలో చేసుకొని తన కుటుంబంతోనే గడపాలనుకుంటాడు. పదేళ్ళ తరువాత పల్లెలో అడుగుపెట్టిన నాగప్పకు పల్లెలో తాండవం చేస్తున్న కరువు పరిస్థితి ఆశనిపాతం అవుతుంది.
నాగప్ప కళ్ళబడిన ఒక్కొక్క దృశ్యం రాయలసీమ పల్లెల్ని వాళ్ళ వెతల్ని పరిచయం చేస్తాయి. ఒకప్పుడు సరిగ్గా అన్నం తినడం లేదని “ఆప్యాయంగా కొసరి కొసరి తినిపించే తల్లి ఆకలంటూ పిల్లలేడుస్తుంటే, ఎప్పుడూ తిండి తిండి అని నన్ను చంపుక తినండి”. (పుట-34 “గాజుకళ్ళు”- జి. నిర్మలారాణి) అంటూ పిల్లల్ని కొట్టి, తాను ఏడ్చే తల్లుల నిస్సహాయతను, పేదరికాన్ని ఈ కథ తెలియజేస్తుంది.
కూలీ నాలీ చేసైనా తన చెల్లెలు లక్ష్మికి, కన్న తల్లిదండ్రులకు అన్నానికి లోటులేకుండా చూసుకోవాలని ఆశపడిన నాగప్ప పల్లె నుండి కుటుంబాలకు కుటుంబాలు పనికోసం వలసపోయాయని తెలిసి విస్తుపోతాడు. కన్నబిడ్డలకు, తల్లిదండ్రులను కాపాలాగా పెట్టి వలసవెళ్ళిన వాళ్ళు కనీసం గంజినీళ్ళకు కూడా డబ్బులు పంపలేకపోతున్న దుర్భరత్వాన్ని ఈ కథలో రచయిత దృశ్యమానం చేశారు.
నాగప్ప ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నపుడు ఇంట్లో నుండి తల్లితో మాట్లాడుతున్న చెల్లెలు మాటలు ఇలా వినబడతాయి.
"దుడ్లు కాదే వంటినిండా రోగాలిచ్చినారు. ఆరోగాలు, రొచ్చులకే ఆ దుడ్లన్ని అయిపోయినయ్యి చూడు! వాళ్ళకోరిక తీర్చలేదని ఎట్లా వాతలు పెట్టినారో చూడమ్మా!... వాళ్ళు మనుషులు కాదమ్మా. రాక్షసులు మనుషుల్ని పీక్కుతినే దయ్యాలంట్లంటోళ్ళు. గిరాకితో సరిగ్గా నడచుకోలేదని, యజమానురాలు చావగొడుతుంది. నేనింక చావలేనమ్మా, యాడికైనా పారిపోతా. అదీ గాకుంటే, ఇంత విషం తాగి సచ్చిపోదాం”. అంటూ నాగప్ప చెల్లెలు లక్ష్మి హృదయ విదారకంగా ఏడ్చే, ఏడ్పు విని కరువు వికృత స్వరూపాన్ని పాఠకులు అంచనా వేసుకోగలుగుతారు. బ్రతకలేక తమను అల్లారుముద్దుగా పెంచిన తల్లులే బలవంతంగానైనా తమ బిడ్డలను వేశ్యాగృహాలకు తరలించబడుతున్న అనివార్యతను సంధర్భిస్తూనే, తత్ఫలితంగా బొంబాయి, ఢిల్లీ, పూనా లాంటి నగరాలకు రవాణా అవుతున్న గ్రామీణ యువతులు అనుభవిస్తున్న, దుర్భర జీవితాన్ని ఈ కథలో రచయిత్రి చిత్రించారు.
“ఎట్లా బతికిన వాళ్ళం చివరికెట్లా అయిపోయినాం... తాను చావలేకనే కదా, కడుపు కూటికోసం చిల్లర దొంగతనాలు చేసింది. ఎవరైనా అంతేనేమో! నీతి నియమాలు పట్టుకొని, కూర్చుంటే కడుపెట్లా నిండాల? తమ లాంటోళ్ళు బ్రతికేదెట్లా వళ్ళమ్ముకొనే స్థితికి వచ్చినారంటే జీవితం ఎంతగా చితికి పోయుండాల... ఏ మగదిక్కు లేకనే కదా ఇట్లా అయిపోయింది.” (పుట 36 “గాజుకళ్ళు" . జి. నిర్మలారాణి)అని వాపోతున్న ఈ క్రమాన్ని చిత్రించే సందర్భంలో రచయిత్రి ఆర్థిక కారణాలు అంతిమంగా నైతిక విలువల సంక్షోభానికి కారణమౌతున్న వైనాన్ని ఈకథలో చర్చించారు. మనుషుల మధ్య సహజంగా వుండే మానవీయ స్పర్శ, సెంటిమెంట్లు లాంటి అంశాలు కరువు నేపథ్యంలో ధ్వంసమయి, కరువు కారణంగా పుట్టుకొస్తున్న అమానుష ప్రవర్తనలు జి. నిర్మలారాణి “గాజుకళ్ళు” కథలో ప్రతిఫలించాయి.
కన్నకూతుర్ని కడుపు నింపుకోవటం కోసం వ్యభిచార గృహానికి తరలించటం అంటే, కరువు తీవ్రతను చెప్పడానికి ఇంతకన్నా మించిన ప్రమాణం వుంటుందని ఏ సామాజిక శాస్త్రవేత్తా చెప్పలేడు. మరీ ముఖ్యంగా భూస్వామ్య వ్యవస్థ కనుమరుగు కాని రాయలసీమ పల్లెల్లో ఐదువేలు కోసం కన్నకూతుర్ని వేశ్యాగృహానికి పంపడం ఒక ఎత్తైతే, తీసుకున్న ఐదువేలు తిండితిప్పలకోసం ఖర్చయిపోతే, కూతురు స్థానంలో తల్లి వ్యభిచార గృహానికి సైతం వెళ్ళడానికి సిద్ధపడడం మరోఎత్తు. ఆకలి మనుషుల చేత చేయించని ఘోరమైన పనంటూ ఏదీ లేదన్న కఠిన వాస్తవాన్ని ఈ కథ నిరూపిస్తుంది.
కరువు మనుషుల్ని డొల్లలుగా మారుస్తుంది. డొల్లలైపోయిన మనుషులు అన్ని విలువలతోపాటు సెంటిమెంట్లనూ పోగొట్టుకుంటారు. కరువులో ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఏ పరిస్థితికైనా సిద్ధపడటం మనిషిలో వుండే దుర్బలత్వానికి ప్రతీక. 68 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో పొట్టకూటికోసం పడుపు వృత్తికి పంపబడుతున్న పరిస్థితుల్ని అధిగమించలేని పాలకవర్గాల అలసత్వాన్ని సహించే స్థితి మనకెక్కడి నుండి వచ్చిందో. మనల్ని మన స్థితిగతుల్ని కూడా విస్మరింపచేసే వ్యవస్థ పూర్వాపరాల్ని లోతుగా విశ్లేషించుకోవాల్సిన సామాజిక సందర్భాన్ని “గాజుకళ్ళు”, “డ్రాపవుట్” కథలు గుర్తుచేస్తున్నాయి.
నిర్మలారాణి కరువు నేపథ్యంలోనే కాక స్త్రీపురుష సంబంధాల్లోని అసమానతలను 'వికసించిన అంతరంగం', 'ఎంతెంత దూరం', 'రిగ్రెట్స్', 'బొమ్మల పెళ్ళి', 'మండే అంతరంగం', 'కొత్త స్పర్శ', 'మామూలు కథకాదు', 'మలుపు' కథల్లో ప్రతిఫలింపజేశారు. 'మానవత్వం' కథ పేదవారికి - పేదవారే ఆసరా కాగలరన్న వాస్తవాన్ని చెప్పిన కథ. అసలు ఆకలికి అలమటిస్తూ తిండిలేక చచ్చిపోయే దశలో వున్నా తోటి మనిషి కష్టంపట్ల స్పందన కలిగితే, ఆ మనిషి బ్రతుకుతున్నట్లు లెక్కని, ఖరీదైన జీవితం గడుపుతున్నా అటువంటి స్పందన లేకపోతే మనిషిగా బతకనట్లే అర్థం అని తెలియజేశారు. “వికసించిన అంతరంగం' కథలో నిర్మలారాణి ఉద్యోగంచేసే ఆడవారి అవస్థలను వివరిస్తూ వంటపనిలో ఇంటిని శుభ్రం చేసేపనిలో మగవారుకూడా ఆడవారితోపాటు పాలు పంచుకోవడంలో తన కూతురికి, కోడళ్ళపట్ల వ్యవహరించే, తన ప్రవర్తనలోని తేడాను గుర్తిస్తుంది. తన తప్పు తాను తెలుసుకోగలుగుతుంది. ఆడవాళ్ళు తమ దాకా వస్తే, ప్రవర్తించే తీరులో ఉన్న బేధాన్ని, కుటుంబ జీవితంలోని (complexity) సంక్లిష్టత పాఠకులకు ఈ కథలో అవగతమౌతుంది.
స్రీపురుషుల మధ్య సమానంగా శ్రమ విభజన జరగాలన్న డిమాండు కూడా ఈ కథలో వ్యక్తమౌతుంది.
2.3 జయలక్ష్మి రాజు:
జయలక్ష్మి రాజు కర్నూలు జిల్లాలో పుట్టారు. అనంతపురంలో వుంటున్నారు. ఈమె రాసిన "పొగబండినేస్తం” సంకలనంలో కథలు, మినీకథలు స్కెచ్ లు మొత్తం 26 ఉన్నాయి. దాదాపు అన్ని కథలు కూడా సున్నితమైన హాస్య, వ్యంగ్యాత్మక శైలిలో రాసినవి. అలవోకగా ఏ మాత్రం పాఠకుల్ని ఇబ్బంది పెట్టకుండా populist కథా వస్తువుతో Popular రచనా విధానంతో మంచి ఆరోగ్యకరమైన హాస్యాన్ని గుప్పిస్తూ కాలక్షేపం కోసం కథలు రాశారనిపిస్తుంది. ఈమె ఎంత సరదా కథలు రాసినా ఈమె కథాసంకలనంలో 'పిచ్చితల్లి', 'ఇదికథకాదు' అన్న సీరియస్ కథలు కూడా వున్నాయి. “ఇది కథకాదు” కథ రాయలసీమ కరువును ప్రధాన ఇతివృత్తంగా తీసుకొన్న కథ. కరువువలన కుటుంబ యజమాని ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబంలోని స్త్రీలు అవమానాలకు, అత్యాచారాలకు ఎలా గురికావలసివస్తుందో ఈ కథలో చెప్పారు. అంతేకాక భూస్వాములు తమ దాష్టీకానికి తలవంచని వాళ్ళను ఎన్ని చిత్రహింసలు పెట్టెనాసరే లొంగదీసుకుంటారనేందుకు ఈకథ ఒక ఉదాహరణగా నిలిచింది.
ఈమె హాస్య వ్యంగ్యాత్మక కథలే కాక సామాజిక సమస్యలను కూడా నేర్పుతో రాయగలిగారు. అయితే అలా రాయగలిగే సామర్థ్యం వుండి కూడా సీరియస్ సమస్యలను పట్టించుకోక పోవడం ఆశ్చర్యం! స్త్రీల రచనలకు గుర్తింపు ప్రాధాన్యత పెరుగుతున్న సందర్భంలో ఈమె స్త్రీల సమస్యల పట్ల తాత్విక దృక్పథంతో రాయాల్సిన అవసరం వుంది.
'ఇది కథకాదు' కథలో ముత్యాలమ్మ పదెకరాల పంటచేను రెండు ఎకరాల మడి,నాలుగు సేద్యపుటెద్దులు వున్న ఆసామి భార్య. కరువులో చేసిన అప్పులు తీర్చలేక, కొత్తపంట పెట్టుకోలేకపోతారు. ఈమె పంటచేల గట్లమీద బోరుబావుల చుట్టూ పడిన ఆకుకూరలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తుందని చెప్పడంవల్ల రచయితకు రాయలసీమ గ్రామాలలో నెలకొన్న వ్యవసాయ దయనీయ స్థితిగతుల పట్ల అవగాహన వుందని తెలుస్తుంది. "బాకీ తీసుకునేది కాదురా తీర్సేకి రోసముండాల. మాటని పిచ్చుకో గూడదంటే, పెండ్లాన్ని యాడన్నా పండబెట్టి బాకి కట్టల్లరా నాకొడుకా!” (పుట. 126 పొగబండి నేస్తం ఎ. జయలక్ష్మి రాజ్) అన్న మాటల్లో అప్పులిచ్చిన భూస్వామి దాష్టీకం, రైతుల నిస్సహాయత వ్యక్తమౌతున్నాయి. రైతు భార్యపైన కన్నేసిన ఆసామి కుతంత్రం పరోక్షంగా తెలుస్తుంది. అతని ప్రవర్తన ముత్యాలమ్మకు, భర్తకు ఇద్దరికీ తెలుసు. కానీ వాళ్ళు అతని అసభ్య ప్రవర్తనను కానీ, దౌర్జన్యాన్ని కానీ ఏరకంగానూ నిలవరించలేకపోతారు. కారణం సమాజంలో రాజ్యమేలుతున్న ఆధిపత్య వాతావరణం మాత్రమే.
భూస్వామి దుర్మార్గమైన ఆలోచనను పసిగట్టికూడా భర్త తన భార్యకు, బిడ్డలకు ఏలాంటి రక్షణను కల్పించలేకపోవటంలో ఈ ప్రాంతవాసుల అసహాయతా స్వరూపం అర్థమవుతుంది. భర్తచావుతో ముత్యాలమ్మ మరింతగా అతనికి లొంగిపోయే పరిస్థితులు కలుగుతాయి. బాకీ చెల్లింపు కింద కూలికి పోయిన ముత్యాలమ్మ పెద్ద కూతురు కూడా అతని దౌర్జన్యానికి గురవుతుంది. ముత్యాలమ్మ అతని బెదింరింపులకు భయపడి పడగనీడని తెలిసినా అతని దగ్గరకే చేరుకోవడం ఈ కథలోని విషాదం.
ఈ కథ ద్వారా రచయిత సన్నకారు రైతుకుటుంబం ఆర్థికంగా చితికిపోతున్న వైనాన్ని, ఆ క్రమంలో ఆత్మగౌరవం, వ్యక్తిత్వం మొదలైన వాటిని నిలుపుకోవటం ఎంత అసాధ్యమో ఈకథ తెలియజేస్తుంది. “పదెకరాల ఆసామి భార్యవైయుండి నువ్వు ఆకుకూరలు అమ్మటమేంది" అంటూ ఆశ్చర్యపోయిన ఆమెతో ముత్యాలమ్మ ఇలా అంటుంది.
“ఇంకా వానొత్తాది, ఇంకా వానొత్తాదని ఇనాకమయ్య పండగ దంక సూసి సూసి ఇత్తనాల గింజలు కూడా అమ్ముకొని తింటిమి. గడ్డిల్యాక ఇనుంగొడ్లను, ఎద్దులను యాటికంటే ఆటికి మాదిగోల్ల కమ్మేత్తిమి. పైమింది బంగారం, అంగడింట్లో కొనుక్కుంటామని సెప్పిన బోకులన్ని అమ్మేసు కుండేది, కడుపు నించుకుండేది ఇదే సరిపాయ... అన్ని బోకులు, బోలెలు అమ్ముకొని తిన్నెంక ఇంగేంల్యాక గంపనెత్తుకుంటి". (పుట. 123 'పొగబందినేస్తం' జయలక్ష్మీరాజు.ఎ.)
ఎంతపెద్ద రైతైనా పంటలు పండినంతవరకే వారి ఆత్మగౌరవాలు. వానలు రాక పంటలకు తెగుళ్ళు సోకి అప్పులపాలైన రైతన్నల వెతలకు అంతేలేదన్న వాస్తవాన్ని, ఒక్కొక వస్తువును అమ్ముకొని ప్రాణాలు నిలుపుకొన్న సన్నకారు రైతుల దయనీయస్థితిని ఈ కథ తెలుపుతుంది.
ఏ ముత్యాలమ్మ మాన మర్యాదలకు అడ్డుపడలేక ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ముత్యాలమ్మ భర్తను, పిల్లల్ని అందర్నీ పోగొట్టుకొని ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి నెట్ట బడుతుంది. భూస్వామి పంట చేనులోకే పనికి చేరుతుంది. కరువు వాతబడిన నిరుపేద స్త్రీల పౌరుషాలు, ప్రతిష్ఠలు అన్నీకూడా ఆకలి ముందు దిగదిడుపే అన్న కఠోర వాస్తవాన్ని ఈ కథ తెలుపుతుంది. జయలక్ష్మీ రాజ్ కథను ముగిస్తూ “ఇదికథకాదు” వాస్తవం ఇది ఇలాగే జరిగింది కాబట్టి అలాగే రాశానని సమర్థించుకున్నారు. కానీ ఈ కథ రాయడానికి ఆమెకు గల ఉద్దేశం, బాధ్యతలు చెప్పకుండానే పాఠకులకు తెలుస్తున్నాయి. జరిగిన సంఘటనను జరిగినట్లుగానే చెప్తే అది నివేదిక అవుతుంది తప్ప సాహిత్యం కాదు. దానికొక ప్రయోజనం కలగాలి అన్న దృక్పథం రచయితకుంటే, తప్పకుండా తను వాంఛిస్తున్న సమాజం కోసం ఎలాంటి మార్పు అవసరమని రచయిత భావిస్తారో అలాంటి మార్పులనే తన కథలో చెప్పే ప్రయత్నం చేసి వుండేవారు.
"అనంతపురం నుండి చిలుకూరు దీవెన అనే కథారచయిత ఎమ్.ఏ. చదువు తున్నప్పటికీ కథలు రాస్తున్నారు. ఇప్పటివరకు 9 కథలు రాశారు. రాయలసీమ కరువు ఇతివృత్తంగా వచ్చిన కథలలో దీవెన బాలికల చదువు ఎలా అర్ధాంతరంగా ముగిసిపోతుందో తెలియజెప్పే కథను ‘విషమ సంధ్య' పేరుతో రచించారు. సీత చదువులో ఎంతముందున్నా, కరువులో పంటచేతికి రాక, అప్పులు తీర్చలేక సీత తండ్రి ఆత్మహత్య చేసుకుంటాడు. తత్ఫలితంగా ఒక మోస్తరుగా జీవితాన్ని గుడుపుతున్న సీత కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. చదువులో ఎంత రాణించినా, చివరకు సీత వ్యవసాయకూలీగా జీవితాన్ని వెళ్ళబుచ్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
కుటుంబంలో ఆర్థికంగా ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, వాటి దుష్ఫలితాలను అనుభవించే వారిలో ఆడపిల్లలు, స్త్రీలు ముందు వరుసలో వుంటారనటానికి ఈ కథ సాక్ష్యంగా నిలుస్తుంది. అలాగే "వాంగ్మూలం” కథలో దీవెన సినీ మాయా ప్రపంచంలో యువత ఎలాంటి ఆలోచనలు చేస్తుందో తెలియజెప్పారు. ఇటీవల అమ్మాయిలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ అసలు ఆ దాడులకు కారణమైన సినిమాలను నిషేధించకుండా, వ్యక్తుల్ని శిక్షించటం వలన యాసిడ్ దాడులు ఆగవనే నగ్నసత్యాన్ని ఈ కథలో చెప్పారు. చిలుకూరి దీవెన లత పాత్ర ద్వారా ఈనాడు అమ్మాయిలపై జరుగుతున్న దాడులకు వ్యక్తులకన్నా సమాజమే కారణమని చెప్పడంలోని దీవెన సామాజిక దృష్టి తెలుస్తుంది.
అలాగే భాషపైన మమకారాన్ని, మాతృభాషాబోధన అవసరాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పేవి “అమ్మఒడి”, “చేదుమాత్ర” కథలు. అమెరికా చదువులపై వ్యామోహంతోనూ, బాలమేధావులుగా తమ పిల్లలు అందరి మన్నలను పొందాలనే తాపత్రయంతోనూ వారిపై ఎంతెంత భారాలను తల్లిదండ్రులు మోపుతున్నారో రచయిత 'చేదుమాత్ర' కథలో తెలియజేస్తారు. ఈ విధమైన వైఖరివలన వారిలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాన్నాయో చెప్పే చక్కని కథలను పరిచయం చేసినారు.
గత పది పన్నెండు సంవత్సరాల నుండి వెలుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల వ్యాపార ధోరణిని ఎండగడుతూ తల్లిదండ్రులు పిల్లల మనసులపై రుద్దుతున్న వాళ్ళ కలల ప్రపంచాలను నిజం చేయాల్సిన బాధ్యత ఎంతవరకు పిల్లలపైన వుంది అన్న నిష్ఠుర వాస్తవాన్ని సహేతుకంగా మనముందు వుంచే ప్రయత్నం చేశారు. మంచి రచనా శిల్పాన్ని పెంపొందిందేందుకు రచయిత్రి దీవెన మరింత కృషిచేయాల్సి వుంది. పాత్రల మనస్తత్వ విశ్లేషణ చేస్తున్నపుడు తన కథల ద్వారా పాఠకుల్ని త్వరత్వరగా చైతన్యం చేయాలన్న తపన చిలుకూరి దీవెన కథల్లో కనబడుతుంది.
తగిన వ్యవధీ, శిల్పం కోసం అభ్యాసం చేయకుండా తనను కదిలించిన అంశాన్ని మధించకుండా రచన చేయడం వలన ఈ కథా వస్తువులో మదింపు కొరవడింది. అందుకే చాలా దీర్ఘంగా, ఉపన్యాస ధోరణిలో పాత్రల సంభాషణ దొర్లింది. ఉదాహరణకు 'చేదుమాత్ర' కథలో ధనలక్ష్మి రాయలసీమ భాషలో వున్నయాసను, మాండలిక ధోరణిని వివరిస్తూ చెప్పిన విషయాలు. అలాగే 'రేపటి కిరణం' కథలోని అత్తపాత్ర చేత చెప్పించిన ఉపన్యాసాల తరహా శైలిని పరిహరించుకోవటం అవసరం. ఇది అభ్యాసంలో అధ్యయనంలో నేర్చుకోవలసినవే. పాత్రల సంభాషణల్లో శ్రద్ధ తీసుకోవాలి. ఈమె రాయలసీమ కథకులలో మరో మంచి కథకురాలిగా రాణించగలరు.
2.4 కుడాల లక్ష్మి:
కుడాల లక్ష్మి అనంతపురంలో వుంటున్నారు. ఈమె రాసిన 'నిరీక్షణ', 'నిర్ణయం', 'అద్దం' కథల్లో మానవ సంబంధాలు వుండాల్సిన తీరును గురించి ప్రతిపాదన చేశారు. ఈమె కథలు మనుషులు ఎలా వుండాలో, ఎలా వుండకూడదో తెలియజేస్తాయి. మధ్యతరగతి స్త్రీలు చాలీచాలని ఆదాయంతో సంసారాలను నడిపేతీరు, ఇరుగుపొరుగు స్త్రీలతో కలుపుగోలు తనంతో ఒకరికి ఒకరు ఆసరాగా నిలబడే వైనం, సఖ్యత, దాంపత్యంలో అన్యోన్యత ఈమె కథావస్తువులు. కుటుంబ జీవితంలోని ఒడిదుడుకులను (positive approach)తో చూస్తుంది. వాటిని పరిష్కరించుకునే క్రమం కుడాల లక్ష్మి కథల్లో అద్దం పడతాయి. ఈమె చాలా హాయిగా, హృద్యంగా కథను నడిపిస్తుంది. ఈమె కథలు చదువుతుంటే, రోజువారీ జీవితాన్ని పరిచయం చేసినట్లుగా వుంటాయి. స్త్రీలలో ముఖ్యంగా గృహిణిలపట్ల వున్న చులకన భావంతో, అమ్మలక్కల కబుర్లుగా, ఒకరితో ఒకరికి పడనట్లుగా చిత్రించే ధోరణి చాలా మామూలుగా సాహిత్యంలో కనిపిస్తుంది. లక్ష్మి గృహిణిల పట్ల వాళ్ళ సామర్థ్యం పట్ల ఈమెకు సానుభూతి, అవగాహన వున్నాయి. మనుషుల్లోని మంచిని మాత్రమే ఆవిష్కరించడం లక్ష్మి కథల్లోని మరో మంచి లక్షణం.
2.5 యం.కె. దేవకి:
యం.కె. దేవకి అధ్యాపక పరిశోధన బాధ్యతల్లో వుంటూనే, 'మంటల ఒడిలో', 'ముళ్ళదోవ' అన్న రెండు కథా సంకలనాలను ప్రచురించారు. గ్రామీణ, మధ్యతరగతి జీవితంలోని మోసపూరిత విలువల్ని ఎండగడుతూ, మానవత్వాన్ని, మంచితనాన్ని ప్రతిపాదించడం ఈమె కథల మౌలిక స్వభావం. ఈమె దృష్టిలో సమాజం అంటే మంచితనం మాత్రమే కలిగిన మనుషుల సమూహం. అందుకే దేవకి మనిషిని కేంద్రంగా చేసుకొని రచనలు చేశారనిపిస్తుంది. మనిషిలోని మంచి చెడ్డలకు, సుఖఃదుఖాలకు మనిషినే భాధ్యులుగా చేశారు. సమాజంలోని వర్గస్వభావం ఈమెకథల్లో కనబడదు. మనిషి మనిషిగా ప్రవర్తించాలన్న మంచి కోరిక. ఒక రకంగా చెప్పాలంటే, ఆదర్శీకరించబడిన మానవత్వం ఈమె కథల్లో కనబడుతుంది. మనుషుల్లో వుండే ఔదార్యగుణమే ఈ సమాజాన్ని నడిపిస్తుందని రచయిత నమ్మకం. అదే నమ్మకం “పెరుమాళ్ళకెరుక” అనే కథలో స్నేహలత ప్రదర్శించిన హృదయ సౌందర్యం వెనుక దాగిన అమానవీయతను, కుసంస్కారాన్ని దేవకి ఈ కథలో బట్టబయలు చేశారు.
సొంత అత్తను పనిమనిషిగా, వంటమనిషిగా ఇరుగు పొరుగువారు అనుకునే విధంగా ప్రవర్తించిన తీరులోని సోకాల్డ్ ధనవంతుల అహంకారాన్ని తెలియజెప్పిన కథ ఇది. ఎంతో సంస్కార వంతురాలిగా, సౌందర్యోపాసకురాలిగా, స్థితిమంతురాలిగా గౌరవించిన కాలనీవాసులు స్నేహలతను 'పిచ్చికుక్క' అని సంబోధించడంలోనే వారికి ఆమె ప్రవర్తన పట్ల వున్న నిరసన వ్యక్తమవుతుంది. కుహనావిలువలకు(false motives) విలువనిచ్చే దానికన్నా మనిషిలోని హృదయ సంస్కారం గొప్పదని తెలియజెప్పడం రచయిత ఉద్దేశం. అందుకు అనుగుణంగా కథనాన్ని నడిపారు. స్నేహలతలాంటి వారిని తయారు చేస్తున్న సమాజం గురించి ఏ బాధ్యతలేకుండా ఆమె ప్రవర్తనకు ఆమెను బాధ్యురాలిగా చేయటంలో ఖచ్ఛితంగా రచయిత దృక్పథమే వ్యక్తమవుతుంది.
రచయిత అధ్యాపకురాలవటం మూలాన ప్రతిదాన్ని విడమరచి చెప్పటం చాలా కథల్లో కనబడుతుంది. ఉదాహరణకు 'పెరుమాళ్ళకెరుక' అనే కథలో హాస్పిటల్లో చేరిన స్నేహలత వంటమనిషిని (అప్పటికి ఆమె అత్తగారని పాఠకులకు తెలియదు) పంపేందుకు వెళ్ళినపుడు, స్నేహలత వాళ్ళింట్లో గుడ్డలు ఇస్త్రీ చేసే ఓబులమ్మ ఆమె వంటమనిషి కాదని ఆమె స్నేహలత అత్తని తెలియజేయడంతోనే కథను ముగించినట్లయితే, కథలో పటుత్వం సన్నగిల్లేది కాదు. కానీ కాలనీ వాసులంతా కలసి ఆ విషయంపైన తమకు కలిగిన విస్మయాన్ని ఎంత స్థాయిలో ఉన్నదీ, దానిపైన వ్యాఖ్యానాలు చేర్చడం వలన కథనం పేలవంగా తయారయింది.
2.6 యం. ఆర్. అరుణకుమారి:
యం.ఆర్. అరుణకుమారి చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈమె రెండు కథా సంకలనాలను వెలువరించారు. “నిశ్శబ్ద కెరటాలు” అన్న కథలో పేద ముస్లిం కుటుంబాల్లో పన్నెండేళ్ళు కూడా నిండని అమ్మాయిల్ని అరవైయేళ్ళు పైబడిన అరేబియా షేక్ లకు పెళ్ళి పేరుతో అమ్ముకొనే దయనీయ పరిస్థితి చిత్రించబడింది. ఈ కథలో అమీనా అనే అమ్మాయి తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతుంది. ఎగుమతి చెయ్యబడే దుస్థితి నుండి తనను తాను కాపాడుకుంటుంది. నజీర్ లాంటి బ్రోకర్లకు బుద్ధి చెబుతుంది.
అలాగే ''లేతవెన్నెల' కథ యదార్థ సంఘటన ఆధారంగా రాశారు. బురఖా వేసుకోలేదని ముస్లిం యువతి ముఖం మీద కొందరు మతోన్మాదులు ఆసిడ్ పోసిన సంఘటన ఆధారంగా రాసిన కథ ఇది. ముస్లిం స్త్రీల జీవితాల్లో, తొంగిచూసే నీలినీడల్ని వారి మనోవేదనను తెలియజెప్పే ఈ రెండు కథలూ "మన్నులో మన్నై" కథా సంకలనంలో చోటు చేసుకున్నాయి. ఈమె సులభశైలిలో కథలు రాశారు. 'అలాగే గిరిజన మహిళ గురించి రాసిన కథ "అడవి పువ్వు". తల్లిని మోసం చేసిన అతనికి బుద్ధి చెప్పడంకోసం అతని కొడుకుతో కలసి ప్రేమ నాటకమాడి, పదిమందిముందు తన తల్లికి జరిగిన మోసాన్ని ఒప్పుకునేట్లు చేసిన గిరిజన యువతి మోతి సామర్థ్యాన్ని, ధైర్యాన్ని నిరూపించిన కథ ఇది.
గిరిజన యువతి 'కాళి' పనిమనిషిగా వుంటూ అదే ఇంట్లో వుంటూ కూడా శేఖరం చేసిన మోసాన్ని బట్టబయలు చేయలేకపోతుంది. కాళీ కూతురు చదువుకున్న గిరిజన యువతి మోతి. తన తల్లి కాళీకి జరిగిన అన్యాయానికి, అందరిని ఎదిరించి న్యాయం చేయగలిగేంత స్థాయిలో మోతి పాత్రను యం.ఆర్. అరుణ కుమారి తీర్చిదిద్దగలిగారు. కానీ కూతురు చొరవను ధైరాన్ని చూసిన కాళి, అంతవరకు శేఖర్ మోసాన్ని ప్రశ్నించలేని కాళి, అతను కట్టబోయిన తాళిని అతని మొహంపైకి విసిరివేయటం, శేఖర్ మోసగాడని తెలిసి కూడా అతనితో జీవితాన్ని పంచుకోవాల్సిన అవసరం తనకు లేదని నిర్భయంగా తన నిర్ణయాన్ని తెలపడం ఇవన్నీ ఆ పాత్ర ఆలోచనా పరిణామాన్ని పట్టిస్తాయి. రచయిత ఆలోచనల్లో స్త్రీల వ్యక్తిత్వం పట్ల సంస్కారం పట్లగల ఆదర్శ భావనలకు ప్రతీకగా నిలుస్తుందీ కథ.
ఈ కథలో మోతి ఒక గిరిజన యువతిగా వుండి ధనబలంతో అగ్రకులస్థుడైన శేఖరం కొడుకుతో తన తల్లికి జరిగిన మోసాన్ని తెలిపి, అతన్ని ప్రేమ నాటకానికి ఒప్పించడం. మోతి తల్లికి న్యాయం చేయడం కోసం శేఖరం తన తల్లి గురించి ఆలోచించకుండా, కన్నతండ్రికి మరో పెళ్ళి చేసుకునేందుకు ఒప్పించడం ఇవన్నీ చాలా నాటకీయంగా (సినిమాటిక్ గా) అనిపిస్తాయి. వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఈ అననుకూల పరిస్థితులన్నీ అలవోకగానూ, రెడీమేడ్ గానూ సమాజంలో చకచకా జరిగిపోవు. రెండు భిన్న వర్గాల మధ్యగల వైరుధ్యాలు ఏ సామాజిక సంఘర్షణ లేకుండా సమస్యలు సుఖాంతం కావు. అలా జరిగిందీ అంటే ఆ కథలో శిల్పపరమైన లోపంగానీ లేదా రచయిత ఆలోచనా దృక్పథంలో గాని ఏదో అస్పష్టత వుందనిపిస్తుంది. దాన్ని అధిగమించగలగాలి. యం. ఆర్. అరుణకుమారి చక్కని వైవిధ్య భరితమైన కథావస్తువులను తీసుకున్నందువలన చక్కని ఇతివృత్తాలతో మంచి కథలు అందించగలరు.
ప్రేమించానని వెంటబడిన యువకుడితో నేను నిన్ను ప్రేమించలేదని చెప్పినా వినకుండా ఒకసారి ఆమెను రేప్ చేస్తే చచ్చినట్లు పెళ్ళాడుతుంది కదా అనే కుట్రతో ప్రవర్తించిన యువకుణ్ణి ఆమె తిరస్కరిస్తుంది. ఒకసారి అత్యాచారానికి గురి అయినానని అతన్ని పెళ్ళాడడానికి సిద్దపడితే, జీవితాంతం అతని చేత లైంగిక దోపిడికి గురవటమేనని మోతి పాత్ర అంటుంది.
ఈమె కథల్లోని స్త్రీపాత్రలు చాలా అభ్యుదయంగా ఆలోచిస్తాయి. ప్రేమ పెళ్ళి పట్ల అరుణకుమారికి వున్న స్పష్టమైన అవగాహన ఫలితంగానే ఈమె కథల్లోని స్త్రీపాత్రలు అంత వ్యక్తిత్వంతో వ్యవహరించగలుగుతాయి. “అడవిపూలు" కథలోని కాళి పాత్ర కూడా పాతతరానికి చెందిన యువతైనా తనకు జరిగిన మోసాన్ని ఎదిరించే చైతన్యం ఆమెకు లేక మౌనంగా వుంటుందేకానీ, నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినపుడు, నమ్మించి మోసంచేసి పారిపోయిన వాణ్ణి స్వీకరించడానికి సిద్ధపడక తానే స్వచ్ఛందంగా శేఖరాన్ని తిరస్కరిస్తుంది. ఆరుణ కుమారి తన అన్ని కథల్లోకూడా ముగింపు విషయంలో పాఠకులు ఊహించలేని కొసమెరుపులతో, స్త్రీపాత్రలను ఉన్నతీకరిస్తారు. ఈ విషయాలను పరిశీలనలోకి తీసికొన్నపుడు, ఈమె పితృస్వామ్య వ్యవస్థ స్వరూప స్వభావాలను మరింత లోతుగా అధ్యయనం చేసినట్లయితే, భవిష్యత్తులో మంచి స్త్రీవాద రచయిత అవగలరనిపిస్తుంది.
2.7 డా॥కొలకులూరి మధుజ్యోతి:
డా॥కొలకులూరి మధుజ్యోతి ఇటీవల కాలంలో కథలు రాస్తున్నారు. బాల్య స్మృతుల్లో నుంచి (నాస్టాల్జిక్) కథను చిత్రించటం ఈమె రాసిన మూడు కథల్లోనూ ప్రతిబింబిస్తుంది. "అమ్మమ్మ అప్పగింత" కథ ఎపుడో చనిపోయిన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని చెబుతూ అప్పగింతల రూపంలో కథకురాలు అమ్మపట్ల తనకున్న ప్రేమను, అవగాహనను, బాల్యంలో ఆమె తల్లి కురిపించిన ప్రేమను, తన తండ్రికి తనతల్లి పట్ల గల వాత్సల్యాన్ని ఆవిష్కరిస్తే, రెండో కథలో తన కొడుకుపట్ల తనకుగల మాతృవాత్సల్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ రెండు రకాల అభివ్యక్తిలో ఉన్న తేడా చాలా సున్నితమైంది.
2.8 ఆర్. వసుంధరాదేవి:
ఆర్. వసుంధరాదేవి ఈమె ఆర్. ఎస్. సుదర్శనం పెళ్ళాడిన తరువాత చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలో స్థిరపడ్డారు. తెలుగులో తాత్విక స్పర్శతో కథలు రాసిన రచయితలు చాలా తక్కువ. అందులోనూ స్త్రీరచయిత్రులు అయితే చాలా అరుదు. ఈ అరుదైన రచయితల్లో వసుంధరాదేవి ఒకరు. నిజానికి తాత్విక స్పర్శ ఎక్కువ సందర్భాల్లో పఠనీయతని దెబ్బతీస్తుంది. రచయితకు ఎంతో సహనం, సంయమనం వుంటే తప్ప ఆ స్థితినుంచి కథను కాపాడుకోగలగటం సాధ్యంకాదు. వసుంధరాదేవి కథల్లో ఈ సంయమనం చాలా ఎక్కువగానే వుంది. అందువలనే ఆమె తాత్విక కథలు సిద్ధాంత చర్చల్లా కాకుండా కథలుగానే మిగిలాయి. అస్తిత్వ వాద కథల్లో పాత్రలు తమ చుట్టూ వున్న, తమను నిరంతరం నిర్దేశిస్తున్న సమాజ భారాన్ని భరించలేని స్థితిలో ఆవేదన చెందుతాయి. ఆ ఆవేదనను ఈ కథలోని సంభాషణలు వ్యక్తం చేస్తున్నాయి.
సంభాషణలు ఎక్కువ సందర్భాలలో మనోగతం (Monologue) రూపంలో వుంటాయి. ఈ ధోరణి వసుంధరా దేవి కథల్లో చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. అలాగే మనసు తమబాధను ఫిర్యాదులుగా ప్రపంచానికి మనోగత సంభాషణ రూపంలోనే వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు 'బదిలీ', 'చెరువుదగ్గర' కథలలోని వాక్యాలలో చూడవచ్చు.
"అబ్బ! కదిలిపోతున్నది. అందులోని భరింపరాని వేదననుభవిస్తున్నది... ఈ బాధ నేను భరించలేనే... ఆ నిరాశా సముద్రాన్ని నేనీదలేను. ఆ నిస్పృహ పర్వతాల్ని నేనెక్కలేను. నేను వేరుగానే వుంటాను. మనసంటే ఏమిటి? ఆశలూ, అనుభవాలూ అంటూ దాన్నే పోగేసి ఎంత కొండ కట్టాను! ఎంత సముద్రాన్ని సృష్టించాను... అంతా బూడిదై పోయింది... దాన్ని భరించలేను". (పుట-56 వసుంధరా దేవి కథలు) అంటూ స్త్రీ సహజాత స్పందనలను అస్తిత్వవాదం ఆధారంగా చూపింది. ఈ తరహా కథల్లోని పాత్రలు నిరంతరం జీవితాన్వేషణ క్రమంలో అనుభవాన్ని ఆధారంగా చేసుకొని జీవించడమే కాకుండా తమ అస్తిత్వాన్ని గురించిన ఆందోళనలో వుంటాయి. ఉదాహరణకు “చెరువుదగ్గర” అనే కథలో “నిస్పృహతో, ఏమో చెయ్యాలని, దేన్నో పొందాలని ఏదో తపన ఏమి చెయ్యలేని నిరాశ. తన జీవితం తనది కానట్లు ఎవరి బలవంతం మీదనో జరుగుతున్నట్లు బాధ. జీవితంలో ముప్ఫై అయిదేళ్ళు చాలా భాగం గడచిపోయింది. తెలీకుండానే... ఇహ చచ్చిపోవటమే తరువాయి. బ్రతక్కుండానే చావు!" ఈ విధంగా పాత్రల వైయక్తిక భావనల్ని, అనుభూతుల్ని తాత్వికంగా చిత్రించటం వసుంధరాదేవి చాలా కథల్లో కనిపించే సాధారణాంశం.
2.9 పుష్పాంజలి:
పుష్పాంజలి 20ఏళ్ళుగా చిత్తూరులో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి మదనపల్లెలో వున్నారు. ఈమె రాసిన కథల్లో “ఓన్లీ బికాజ్...” అనేకథ వస్తువరంగా శిల్పపరంగా కూడా చాలా శక్తివంతమైన కథ. ఒక రకంగా ఈ కథా రచయిత ఇందులో conventional ఆలోచనల నుండి బయటపడి, కొన్ని ప్రగతిశీల ఆలోచనలతో రాశారు. సంతానోత్పత్తి, బైగమీ, వివాహేతర సంబంధాలు, ప్రేమ పెళ్ళిళ్ళు వాటి వెనుకవున్న 'radical ఆలోచనలు' వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి అంతరంగిక ప్రపంచపు కోర్కెలు, వాటి బాహ్య స్పందనలు మహిళా సంఘాలు, జీవిత భాగస్వామిని ఎన్నుకోవటంలో అందానికి, intellect కి వున్న ప్రాధాన్యత లాంటి అనేక అంశాలు ఈ కథలో చాల micro level లో వున్నప్పటికీ చాలా స్పష్టతతో చిత్రించారు. అయితే ఎంతో ambitious గా తీసుకున్న ఇన్ని రకాల అంశాలు శిల్పపరంగా కథను కొంత గందరగోళ పరిచినప్పటికీ, భావపరమైన (conceptual strength) బలం దాన్ని ఒక మంచి కథగా నిలిపాయి.
కథలోని అనేక పొరల (layers) ద్వారా విరుద్ధ స్వభావాలున్న పాత్రలను ప్రవేశపెట్టి వాటి సారాన్ని లేక స్వరూపాన్ని అవే బహిర్గతం చేసుకునేటట్లు చిత్రించటంలో ఈ రచయిత విజయం సాధించారు. ఈ సందర్భంలో రచయితకు శిల్పపరమైన సలహా ఒకటి ఇవ్వటం అవసరం. అదేమంటే, కథలో సంఘటన లేక ఘటన ఎంత ప్రాముఖ్యమో, అది ఒకటిగా చిత్రించటం అంతే ప్రాముఖ్యంగల అంశం. అదే సందర్భంలో కథకున్న పరిధిని మించిన సంఖ్యలో పాత్రలను ప్రవేశపెట్టడం కూడా కథాశిల్పాన్ని దెబ్బతీస్తుంది. ఆవిషయాలు పక్కన పెడితే, ఈ కథ సమాజంలోని అనేక ద్వంద్వ నీతుల్ని, విలువల్ని, కపట ప్రేమల్ని చర్చకు పెట్టారు. సమాజంలో నీతి అనేది అందరూ అనుసరించాల్సిన విషయం. సమాజం అత్యంత సజావుగా సాగేందుకు అవసరమైన అంశంగా ప్రతివాళ్ళూ భావించినప్పటికీ అందరూ దాన్ని అతిక్రమించటం ఎందుకు జరుగుతుంది? అనేది నిరంతరం సాహిత్యంలో చర్చించాల్సిన విషయం. నైతిక అతిక్రమణను నియమ ఉల్లంఘనను వ్యక్తి చైతన్యంలో భాగం అన్న దృక్పథాన్ని ఈ కథ స్పష్టపరుస్తుంది.
ఈ కథ ప్రారంభంలోనే కథకుడు (narrator) ఇలా అంటారు. "వంచన... పరవంచన! ప్రపంచమే ఒక వంచన”. వీలైనప్పుడల్లా ప్రతి ఒక్కరూ ఉల్లంఘించే నియమావళి! దానికి బద్ధులై వుండాలని నీతులు!!" ఈ కథలో పాత్రల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, మూడు ప్రధాన పాత్రలు, అమృతవర్షిణి, శరత్, గోవర్ధనరావుల పాత్ర చిత్రణ చాలా శక్తివంతంగా చేయటం జరిగింది. ముఖ్యంగా అమృతవర్షిణికి వున్న నవీన భావాలు,శక్తివంతంగా చెప్పటం, భావుకత, హేతువు (assertiveness, emotional, rational) అంశాలను సమ్మిళితంగా కలిగివున్న ఆమె స్వభావం, గోవర్ధనరావు ద్వంద్వ ప్రవృత్తి, శరత్ సంస్కారం, అతని కళాత్మక దృష్టి, భావాల్లో స్పష్టత అన్నీ చాలా చక్కగా రచయిత్రి చిత్రించారు.
ఈ కథలో అత్యంత కీలకాంశం శరత్ అమృత వర్షిణీల మధ్య ఏర్పడబోయిన సంబంధం, అది విఫలమైన తీరు. శరత్ పట్ల అమృత వర్షిణికి ఏర్పడుతున్న ప్రేమను, ఇష్టాన్ని రచయిత చాలా భావుకతతో కథ ముగింపులో చిత్రించారు. నిజంగా అటువంటి భావుకత అత్యవసరం. అతనితో మాట్లాడకపోయినా నిర్విరామంగా అతని గురించి ఆలోచిస్తూ అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతుంది.
2.10 యస్. జయ:
తెలుగు కథలు వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. రూపపరంగా అంతవైవిధ్యం కనిపించటంలేదు. అయితే కొంతమంది రచయితలు చాలా చేతనాపూరితంగా శిల్పపరమైన వైవిధ్యం కోసం తపించి రాశారు. అటువంటి వాళ్ళలో యస్. జయ కూడా ఒకరు. ఆమె కథ "రెక్కలున్న పిల్ల" అటువంటి విభిన్నత ప్రదర్శించిన కథ. కథలో మెటఫర్ను చాలా కీలకంగా తీసుకొని రాయటం అరుదు. అటువంటి అరుదయిన పనిని జయ ఈ కథలో రూపించారు. ఈ కథ రూప విశిష్టతతోపాటు వస్తువిశిష్టత కూడా వుండటం గమనించదగిన అంశం. స్త్రీలను కుదించే బుద్ధి కేవలం తల్లిదండ్రులకే కాక తనని ప్రేమించిన, తన భావాలను అర్థం చేసుకున్న ప్రేమికులలో కూడా అచేతనంగా దాగివుండటాన్ని ఈకథ బహిర్గతం చేస్తుంది.
ఈ కథలో ఆశ చిన్నప్పటి నుండి చాలా స్వతంత్ర భావాలున్న వ్యక్తి, ఆ భావాలు ఆమె పెద్దయిన తరువాత కూడా కొనసాగుతాయి. ఈ స్వతంత్ర భావాల వలన ఆమె తల్లిదండ్రుల్ని వదలి తనకు ఆ భావాల్ని పరిచయం చేసి, తన చైతన్యస్థాయిని పెంచిన శ్యామలా టీచర్ దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆశ పాత్రలో క్రమంగా పెరుగుతూ వచ్చిన చైతన్య స్థాయిని రచయిత్రి చాలా నేర్పుతో ఒక క్రమంలో చిత్రించారు. శ్యామలా టీచర్ సాంగత్యంలో మామూలు పుస్తకాలతో మొదలైన ఆమె అధ్యయనం రంనాయకమ్మ ‘జానకి విముక్తి' నుంచి విద్యార్థి ఉద్యమాన్ని గురించి రచించిన “రెక్క విప్పిన రెవల్యూషన్” చదివేంతవరకు పెరుగుతుంది. చైతన్యం ఏ మూలం (source) నుంచి వచ్చినా, ఏ రూపంలో వచ్చినా సారాంశంలో అది వ్యక్తి జీవితంలో అనువర్తితంగా చేసుకోవటానికి వుపయోగ పడాలి. అప్పుడు మాత్రమే ఆ జ్ఞానానికి విలువ ఉంటుంది. ఈ కథలో ఆశ సరిగ్గా ఆ భావాల్ని తన జీవితంలో అమలయ్యేటట్లు చూసుకోగలుగుతుంది. తను రూపొందించుకున్న వ్యక్తిత్వాన్ని, పొందిన సంస్కారాన్ని ఎవ్వరికోసమూ చివరికి తాను ప్రేమించిన వ్యక్తికోసం కూడా వదలుకోదు. తన రెక్కలు కత్తిరించటానికి, తన వ్యక్తిత్వాన్ని కుదించటానికి చేసిన ప్రయత్నాలన్నింటినీ అడ్డుకుంటుంది.
ఈ కథలో మురళి ఆశ వ్యక్తిత్వాన్ని చూసి, చైతన్యంతో పురివిప్పిన ఆమె రెక్కల్ని చూసి ప్రేమిస్తాడు. ఆశతో అతని ప్రేమ గురించి తెలిసిన అతని స్నేహితుడు మురళి ఆశకు మొలిచిన చైతన్య రెక్కల గురించి హెచ్చరించినా, ఖాతరు చేయని సంస్కారం మురళిది. ఆశకు రెక్కలున్నాయని, చాలాసార్లు ఆ రెక్కల చప్పుడు విన్నానని స్నేహితుడు మురళిని హెచ్చరించినపుడు, మురళి అన్నమాట అతని వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తాయి
“ఆమె వ్యక్తిత్వం చూసి స్నేహం చేశాను. ఆమె రెక్కల్ని ప్రేమించాను. కలిసి వుండాల కుంటున్నాం” అంటాడు మురళి. అలాగే మురళి సంస్కారం వ్యక్తమయ్యే మరొక సన్నివేశం ఒక వ్యవస్థగా (institute) పెళ్ళిని వ్యతిరేకించటం. పెళ్ళంటే ఒక ఇంట్లో ఇద్దరిని బంధించి వుంచి, కాపురం చేయండి అని అందరూ ఆమోదించటంగా భావిస్తాడు మురళి. ప్రేమలేని ప్రపంచాన్ని మురళి ఊహించలేకపోతాడు. మురళి సంస్కారాన్ని గౌరవించే, అతని అభిప్రాయాలకు విలువనిచ్చే, తల్లిదండ్రులుకూడా అతను ఆశను చేసుకోవటానికి నిరాకరిస్తారు. ఈ నిరాకరణకు కారణం కూడా ఆశకు రెక్కలుండటమే. అసలు ఆశకు రెక్కలుండటం అనేది ఆశకు సంబంధించిన వైయక్తిక అంశంకాక సామాజిక అంశంగా పరిణమించిన వైనాన్ని, మొత్తం సమాజం ఆమె రెక్కలు కత్తిరించటానికి చేసే ప్రయత్నాలను కూడా రచయిత చాలా శక్తివంతంగా చిత్రించారు. "చైతన్యంలోంచి పుట్టినపుడే కదా నిజంగా జన్మించినట్టు అని ఆశ అన్నపుడు ఆమెలో కొత్త అందాలు చూడగలిగిన భావుకత వున్న మురళి చివరకు, ఆమె రెక్కల్ని కత్తిరించాలని చూస్తాడు.
ఏ రెక్కలయితే అతనిని పెళ్ళికి ముందు ఆమెవైపు ఆకర్షించేటట్లు చేయగలిగాయో, ఆ రెక్కలే అభ్యంతరకరంగా తోస్తాయి. ఆ విషయమే ఆమెతో ప్రస్తావిస్తాడు. అప్పుడు ఈమె అతనితో ఇలా అంటుంది “నాకు రెక్కలున్నాయి. నా పనులు నేను చేసుకోగలను”అని చాలా నిమ్మళంగా అతనితో చెప్పటమే కాక, అతనితో “ఒకరి స్వేచ్ఛ మరొకరికి అడ్డంకి కాకూడదు” అనే పరివర్తనకు చేరుకుంటుంది. ఆమె చైతన్యాన్ని చాలా చిన్నకథలో లోతయిన విషయాన్ని చాల convincing గా చెప్పటంలో యస్. జయ విజయం సాధించారు. స్త్రీవాద కథలు రాయలసీమ నుండి శక్తివంతంగా వైవిధ్యంతో వస్తున్నాయి. కానీ సంఖ్యాపరంగా చాలా తక్కువగానే వున్నాయి.
2.11 కె. సుభాషిణి:
కె. సుభాషిణి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగ బాధ్యతలు నిర్వ హిస్తున్నారు. ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని కథలు కార్పొరేట్ విద్యావ్యవస్థలో చోటుచేసుకొన్న సంసృతిని, దాని పర్యావసానాలు, ప్రతిఫలనాల గురించి చర్చించిన కథలు. ముఖ్యంగా కార్పొరేట్ పెట్టుబడి విద్యవ్యవస్థను ఎలా ప్రభావితం చేయగలిగిందో, తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవ చైతన్యం నుంచి రచయిత్రి పట్టుకోగలిగింది. అర్థిక సరళీకృత సంస్కరణల ప్రభావాలను, స్త్రీలపై పడుతున్న అదనపు భారాలను, ఆక్రమంలో ఎదురవుతున్న సంఘర్షణలను, ప్రతిఫలనాలను స్త్రీవాదదృక్పథంతో సృజించిన రెండవ సంపుటి “అమూల్య”. తెలంగాణా ప్రాంతంలో పెల్లుబికిన ప్రాంతీయచైతన్యం ప్రత్యేక రాష్ట్రానికి దారితీయడంతో, “గాయాలు” ’దృతరాష్ట్ర కౌగిలి’ ’రెండు సందర్బాలు’ కథలను రాశారు. ఈమెకథల్లో ప్రాంతీయ, పితృస్వామిక రాజకీయాలను ప్రశ్నించటమే కాక వాటిని సాధించే క్రమంలో ప్రాంతీయ, చారిత్రక దృష్టికోణాన్ని అందిస్తుంది.
3. ఉపసంహారం:
- పై విశ్లేషణంతా పరిశీలించిన తరువాత రాయలసీమలోని అనేకమంది రచయిత్రులు విభిన్నమైన తాత్విక సామాజిక, రాజకీయ అవగాహనలో నుంచి ఆప్రాంత జీవితాన్ని అందులోని వైవిధ్యాన్ని ప్రతిబింబించారని అర్ధమౌతుంది.
- సూక్ష్మంగా వీరి మధ్య కొన్ని అంతరాలు, ప్రత్యేకతలు వున్నప్పటికీ, స్థూలంగా ఈ ప్రాంత రచయిత్రులందరూ ఈ ప్రాంతానికి వున్న ప్రత్యేక సమస్యలను సంక్షోభాలను సాహిత్యీ కరించారు. వీళ్ళ రచనల్లో సార్వత్రిక లక్షణాలు కొన్ని వున్నప్పటికీ, ఈ ప్రాంత సాహిత్యం ప్రధానంగా అత్యంత ప్రాంతీయ ముద్రతో వచ్చిందని తెలుస్తుంది.
- స్త్రీల రచనల్లో ప్రధానంగా కరువు, స్త్రీల రవాణా (trafficking), ఎయిడ్స్ (aids), బాల్యవివాహాలు, వలసలు, వేశ్యావృత్తి, కరువుదాడులు, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వ్యవసాయదారులు కూలీలుగా మారిపోయిన వైనం, మానవత్వం విచ్ఛిన్నమౌతున్న క్రమం, కుటుంబ సంబంధాలు అందులో ఉన్న సమస్యలు, మధ్యతరగతి జీవితంలోని ఒడిదుడుకులు, లైంగిక వేధింపులు వ్యాపారంగా పరిణమించిన విద్యావ్యవస్థ, తత్ఫలితంగా ఉత్పన్నమైన సమస్యలు వాటి పర్యవసానంగాజరుగుతున్న ఆత్మహత్యలు, గిరిజన, ముస్లింస్త్రీల సమస్యలు, ఆదర్శీకరించబడిన మానవీయ విలువలు, ఆధునిక సంస్కార సంపర్కం ఫలితంగా రూపుదిద్దుకుంటున్న కొత్త విలువలు, స్త్రీల జీవితాలపై వాటి ప్రభావాలు, సంప్రదాయ విలువలపై దాడిచేస్తూ ప్రత్యామ్నాయ విలువలు రూపుదిద్దుకునేందుకు ముందుకు వస్తున్న నూతన ప్రతిపాదనలు, జీవన శైలులు వంటి అంశాలు రాయలసీమ రచయిత్రుల కథల్లో మౌలికమైన అంశాలుగా చిత్రీకరించారు.
- ఈ పై సమస్యలలో కొన్నింటిని పురుష రచయితలు కూడా సృజించి నప్పటికీ, వాటిలో మనకు కనిపించిన నిర్దిష్టమైన అనుభవం, స్త్రీ అనుభూతి(women sensibility) మరీ ముఖ్యంగా ఈవిషయాలను స్త్రీ దృక్కోణం నుంచి పరిశీలించి చిత్రించడం అనేది అత్యంత సంతోషకరమైన విషయం.
- ఈ క్రమాన్ని ఇకముందు కూడా రాయలసీమ రచయిత్రులు కొనసాగిస్తారని అటువంటి కొనసాగింపు అనివార్యంగా జరుగుతుందని పైన తెలిపిన స్త్రీ కథకుల కథల్ని చూసినపుడు మనకనిపిస్తుంది. అయితే, ఈమూడు దశాబ్దాలలో స్త్రీలు చేసిన కృషిని మనం గుర్తిస్తూనే, వాళ్ళు మరింతగా విస్తరించాల్సిన అవసరాన్ని వారికి గుర్తు చేస్తున్నాను.
- తద్వారా వాళ్ళ రచనా వికాసానికి దాని ఫలితంగా మొత్తం రాయలసీమ సాహిత్య వికాసానికి వారి రచనలు దోహదం కాగలవు. అటువంటి అత్యవసర కార్యాచరణకు పురికొల్పే లక్ష్యంతో జరుగుతున్న రాయలసీమ స్త్రీల సాహిత్య సృజన రచయిత్రులకు మరింత స్ఫూర్తిదాయకం అవగలదు.
4. ఉపయుక్తగ్రంథసూచి:
- Virginia Woolf "A Room of One's own" Taj Press New Delhi -2004. Second print (UBS publishers pvt. Ltd.)
- అరుణ కుమారి ఎం. ఆర్. మన్నులో మన్నునై, ప్రజాశక్తి బుక్ హౌస్ హైదరాబాద్ -2006.
- ఇమాం, నారాయణ, సింగమనేని. (సం.) ఇనుప గజ్జెలతల్లి అనంత కరువు కథల సంపుటి.
- జయ, యస్. రెక్కలున్న పిల్ల, కథాసంపుటి - 2004
- జయలక్ష్మి రాజు ఏ., ఇది కథ కాదు, పొగ బండి నేస్తం కథాసంపుటి, - సెప్టెంబర్
- తిరుపతి రావు, బి. 'సమకాలీన వాద ధోరణలు' ఇండియా టుడే – డిసెంబర్ -
- దేవకి యం. కె., మమతలు, ముళ్ళపొదలు,కథాసంపుటి అనంతపురం, 2007.
- నవీన్ వాసిరెడ్డి., శివ శంకర్, పాపినేని, (సంపాదకులు), కథ 2002, 2005, 2007, కథా సాహితీ పబ్లికేషన్స్, సికింద్రాబాద్.
- నాగమ్మ పూలే, యల్లమ్మలు, మట్టి కుండ ప్రచురణలు, కర్నూలు - 2008
- నిర్మల రాణి జి., గాజు కళ్ళు, అనంతపురం, - 2006.
- పుష్పాంజలి, ఎ. 'ఓన్లీ బికాస్ ఆఫ్ దట్......'వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు'. చిత్తూరు -2006.
- వసుంధరా దేవి, ఆర్. 'వసుంధర దేవి కథలు' విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్,
- వేణుగోపాల్, ఎన్. కథా సందర్భం, విరసం ప్రచురణలు, 2002.
- శశికళ ఆర్., డ్రాప్ అవుట్, పిచ్చిక గూళ్ళు కథాసంపుటి, విరసం, అనంతపురం - 2005 .
- శ్రీదేవి కె., కథా దృక్పథం, సంహిత పబ్లికేషన్స్, హైదరాబాద్ -2010 .
- షహనాజ్ బేగం, పరిష్కారం, షహనాజ్ భేగం కథలు కథాసంపుటి,అనంతపురం, 1995.
- సుభాషిని కె, అమూల్య, స్ఫూర్తి ప్రచురణలు కర్నూలు -
- సుభాషిని, కె. కరువెవరికి, "మర్మమెళ్ళ గ్రహించితి తల్లి"కథాసంపుటి.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.