headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

10. తెలుగులో జైలు కవిత్వం: భావుకత - స్థలకాలాల చిత్రణ

గోవిందరావు శివ్వాల

అసిస్టెంట్ మేనేజర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రసృజనాత్మక & సంస్కృతి సమితి
విజయవాడ , ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9971328836, Email: govindarao.sivvala@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.12.2024        ఎంపిక (D.O.A): 27.12.2024        ప్రచురణ (D.O.P): 01.01.2025


వ్యాససంగ్రహం:

జైలులో నిర్భందానికి గురి అయిన తెలుగు కవుల కళ, వారి కళాత్మక ప్రయోగాలు గురించి ఈ వ్యాసం దృష్టి పెడుతుంది. జైలు కళ అనేది సమకాలిన కళ ప్రపంచంలో ముందుకి వచ్చింది. ఎందుకంటే కవులు జైలు అనుభవాలుని, సృజనాత్మకతతో రంగరించి చేసిన రచనలు పాఠకులకి, ప్రేక్షకులకి సమాజాన్ని కొత్తగా చూపుతాయి. అసలు జైలు పాలయిన బందీ కవి శరీరాలు ఏమి ఉహిస్తాయి? ఎలా జైలు నుండి బయట పడాలనా? లేకా బయట ఉండే స్వేచ్చనా? లేక గత జ్ఞాపకాలనా? ఎలాంటి స్వేచ్చని ఊహిస్తారు ? వారి శరీరాలు ఎలా రాజకీయాలని ప్రదర్శిస్తాయి? జైలుని తెలుగు కవులు ఎలా సంభావనీకరించారు? ఈ వ్యాసంలో రాజ్యం కవులకి, మిగతా సమాజానికి మధ్య గల ప్రదర్శనా సహృదయతని చేధించాలని చూస్తుంది అని వాదిస్తుంది. తెలుగులో జైలు రచనలపై కే. ముత్యం కొంత పరిశోధన చేశారు. ఈ వ్యాసానికి ప్రాధమిక ఆకరాలు శివసాగర్, వరవరరావు, బొజ్జా తారకం, కేవిఅర్, ఓల్గా, ప్రకాశం మొదలైన వారి రచనలు, కవితలు. ద్వితీయ ఆకరాలుగా ఫ్లీట్ వుడ్ (2010), ప్యూకో, గూగి వా తియాంగొ రచయితల రచనలని తీసుకోవడం జరిగింది. ఈ వ్యాసం విశ్లేషణాత్మక పద్ధతిలో రూపొందించడం జరిగింది. జైలు కవులు, బంధించలేని భావుకత, స్థలకాలాలు వంటి ఉప శీర్షికలతో వ్యాసాన్ని విభజించడం జరిగింది.

Keywords: కవిత్వం, స్వేచ్చ, ప్రతిఘటన, భావుకత, స్థల కాలాలు, రాజ్యం

1. ఉపోద్ఘాతం:

బందీలు పారిపోవద్దు / నిద్ర పోవద్దు /చచ్చిపోవద్దు
జైలు నిన్ను జాగరూకుణ్ణి చేస్తుంది
మేల్కొని ఉన్నవో లేదోనని
లాఠీని లాకప్ దగ్గర కొడుతుంది /నీ బెడ్ దగ్గర తడుతుంది
బయట తాను చూడలేని ఉదయానికి
నువ్వు బతికే వున్నావా అని /లేపే తహతహ అది  (వరవరరావు, ‘శృతి’, 2017 పుట. 390.) 

ఇది వరకు అనేక మంది పరిశోధకులు, తత్త్వవేత్తలు, సామాజిక శాస్త్రపరిశోధకులు, జైలు శోధకులు, carceral స్టడీస్ జైలుని సంభావికరించే ప్రయత్నం చేశారు. Marking Time: Art in the Age of Mass Incarceration లో ఫ్లీట్ వుడ్ (2020) అనే అమెరికన్ రచయిత్రి బయట విస్తృత ప్రపంచం నుండి, ప్రజా సంస్కృతీ నుండి, కళా కేంద్రాలు నుండి వేరు చేయబడిన బందీల సృజనాత్మక జ్ఞాన ప్రపంచం గురించి నొక్కి చెబుతుంది. జైలు కళా అభ్యాసాలు ఒంటరితనాన్ని, దోపిడిని, నిర్భంద సౌఖ్యాల అమానవీకరణని ప్రతిఘటిస్తాయి అని ఆమె అంటుంది. జైలు నుండి వెలువడిన దృశ్య కళ పై ప్రపంచం అంతగా ఫోకస్ చేయలేదని అంటుంది ఆమె. పాశ్చాత్య దేశాల్లో మాల్కం, ఎక్ష్, ఏంజెలా డవిస్, ఆస్కార్ వైల్డ్, ఎతరిద్జ్ నైట్, గ్రాంసీ, జిమ్మీ శాంటియాగో బాకా, జార్జ్ జాక్షన్ అనే వారి జైలు రచనలను యూనివర్సిటీలలో బోధిస్తున్నారు. సాధారణంగా జైలులో ఆర్ట్ ప్రాక్టిసు అంటే చదువురాని, అనుభవం లేని వారు రాసే కవిత్వం, చిత్ర లేఖనం మొదలైనవిగా భావిస్తారు. రాత థెరపి, ఖైదీల సైకాలజీ, విద్య, నేర శాస్త్రం వంటివి ఖైదీలని బాగుచేయడానికి, పునరావాసం కల్పించడంలో భాగంగా చేసేవి. అయితే, కళని, నిర్బంధ రాజ్యాన్ని మ్యాప్ చేయడానికి ప్రయత్నించింది ఫ్లీట్ వుడ్ తన గ్రంధంలో. ఫ్లీట్ వుడ్ ప్రకారం, జైలు కళ తో ఉన్న అనుబంధం నిర్మూలనా పరమైనినది. మానవ నిర్బంధం అంతం చేయడం, ఇంకా జైలు కలిపించే పరిస్థితులని నిర్మూలన చేయడం. టెర్రరిస్ట్ కార్యకలాపాలు, మావోయిజం, అస్తిత్వ ఉద్యమాలు మొదలైన వాటితో జైలుకి పోయేవారి సంఖ్య పెరిగిపోతుంది. వలస పాలన తరువాత కాలంలో భారత దేశంలో నక్షలబరి ఉద్యమంలో అధిక సంఖ్యలో ఉద్యమకారులు జైలుకి పోయారు. పాపులర్ వినోద కార్యక్రమాల్లో, జర్నలిస్టుల పరిశోధనలలో, కటకటాల వెనుక జీవితం అనేది ఎలా భయంకరమైనది, ఆసక్తికరమైనది అనేది ఉన్నది. అయితే అధిక సంఖ్యాకులు దానిలోనికి పోరుగాని. ఆధునిక జీవితంలో జైలు అనేది మూలరాయి వ్యవస్థగా ఉన్నది (ఫ్లీట్ వుడ్, 2020 : 15). అమెరికన్ ఉద్యమ కార్యకర్త అంజెలా డేవిస్ మనం జైలుని మాములుగా తీసుకోవడానికి గల కారణం చెప్పారు – ‘జైలు అనేది మన చిత్ర వాతావరణంలో ఒకానొక ముఖ్య ఫీచర్ గా ఉన్నది. అది మన ఇంగిత జ్ఞానంలోని భౌతిక అంశం. అది మన చుట్టూ ఉన్నది’ (ibid, 15). దాని వలన జైలు నిర్బంధం ఎలా పౌర హక్కులని, కుటుంబ సంబంధాలని, సామాజిక సంబంధాలని ఎలా ప్రభావితం చేస్తుంది అనేదాన్ని చూడడం లేదు. 1970 లో అమెరికాలో జైళ్ళు అనేవి రాడికల్ రాజకీయ సంఘాలకి, కళా అభ్యాసాలకి, సిద్ధాంతాలకి కేంద్రంగా ఉంది అని బెర్నిస్తిన్ అన్నారు (2010: 163). జైలు సంస్కృతి ప్రజల్లో విస్తృతంగా విముక్తి ఆకాంక్షని ప్రదర్శింపజేసింది.

జైళ్ళ వ్యవస్థ ఆరంభం అయినది ఖైదీలని సంస్కరించడానికే. దాని నిర్మాణంలో, భావజాలంలో, ప్రోగ్రాంలో ప్రయత్నాలు దానికొరకే సాగాయి. ఈ వ్యవస్థ శిక్షా స్మృతిలో ఒక చారిత్రక క్షణాన్ని నమోదు చేసింది. దాని ఉద్దేశ్యం మానవత్వాని చేరుకోవడం, కాని జరుగుతున్నది స్వేచ్చని నిషేధించడం. బందీ పై కాల శిక్ష వేయడం వలన సమాజం మొత్తంగా గాయపడుతుంది, బాధితుడు కాదు. స్వేచ్చని నిరోధించడం మొదటి అయితే, తరువాత ‘సరిదిద్దడం’ జోడింపబడింది. ఏకాంత వాసం, మత పరివర్తనం, నిశ్శబ్ద శ్రమ అనేవి ఆధ్యాత్మిక, నైతిక మార్పుని తీసుకొస్తుంది అని సంఘ సంస్కర్తలు నమ్ముతారు. వారు బందీ వ్యక్తిగత ప్రవర్తనని మార్చాలి అనే దాని మీద దృష్టి పెట్టారు, సామాజిక స్థితిగతుల కంటే. జైళ్ళు పూర్తిగా కఠినమైన వ్యవస్థలు Austere institution (ప్యూకొ, 1977: 235).

జైలు అనేది ఎడతెగని క్రమ శిక్షణా పరికరం. వ్యక్తులపై దాని చర్యలు ఆపరానివి. ఖైదీలపై పూర్తీ అధికారం ఉంటుంది. బందీ పడుకునే, తినే, విశ్రాంతి తీసుకునే, తినే తిండి రేషన్, మాట్లాడడాన్ని, ప్రార్ధనా సమయాన్ని, ప్రతిదీ నియంత్రణ చేస్తుంది. శరీర కదలికల్ని regulate చేస్తుంది. జైలు మొదటి సూత్రం ఏకాంతంగా ఉంచడం. బాహ్య ప్రపంచం నుండి ఒంటరిని చేయడం. తప్పులని చేయడానికి ప్రేరేపించే దాని నుండి దూరంగా ఉంచడం. ఏకాంతం అనేది ప్రాధమిక కండిషన్ మొత్తం లొంగుబాటుకి. ఏకాంత గదిలో పెట్టడడం వలన మతపరమైన జ్ఞానోదయం కలుగుతుంది అనేది ఒకటి అయితే, వైద్య విధానంలో బందీ పూర్తిగా పిచ్చిగా మారిపోయే అవకాశం ఉంది అని సంఘర్షణ ఉంది. ఇంకా ఈ పద్దతి ఆర్ధికంగా వ్యయభారితం అయినది. ఆర్కిటెక్చర్ పరంగా బందీ పూర్తీ నిఘాలో ఉంచబడి సరి అయిన పరిశీలనలో ఉన్నాడా అనేది ముఖ్యం. బందీ శరీరం పై మాత్రమె నిఘా ఉండదు, అతని అనుభూతులపైనా, ఉద్వేగాలుపైనా ఊహాలు, అవసరాలు, బలహీనతలు పైనా స్నేహం, ప్రేమ అన్నిటిపైనా నిఘా ఉంటుంది. జైలు జీవితంలో నిరాశ, ఒంటరితనం, స్వేచ్చ కోల్పోవడం, దానికన్నా ముఖ్యంగా ఆ భావం కలిగించే ఆందోళన, తన గురించి బయట వాళ్ళు ఏమి పట్టించుకోవడం లేదన్న చిరాకు, అసహనం వంటి చాలా విచిత్రమైన భావాలు బందీలకు కలుగుతాయి. 

2. కారాగారవాసం - తెలుగుకవిత్వం:

తెలుగులో మొదటి జైలు కవిగా రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచెర్ల గోపన్నని చెప్పవచ్చు. శిస్తు సొమ్ముని రాముడి గుడి కట్టడానికి వాడాడని గోల్కొండ నవాబు అతన్ని ఖైదులో పెట్టాడు. అతను జైలు నుండే ‘పలుకే బంగరమాయేనే’, ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’ వంటి అద్భుత సంకీర్తనలు రాశాడు. ఆధునిక యుగంలో తెలుగు ప్రాంతాల్లో ప్రతీ రాజకీయ ఉద్యమంలో జైళ్ళ నుండి సాహిత్యం వెలువడుతుంది. జాతీయ ఉద్యమంలో పాటలు రాసి నిర్బందించబడ్డారు గరిమెళ్ళ సత్యన్నారాయణ, గురజాడ రాఘవశర్మ మొదలైన కవులు.

గరిమెళ్ళ సత్యన్నారాయణ ప్రసిద్దమైన పాట – ‘మాకొద్దీ తెల్ల దొరతనం’ ప్రజలలో దేశభక్తిని మేలుకొలిపింది. స్వాతంత్ర్య ఉద్యమకాలంలో రాయవెల్లూరు జైలులో 1921 – 22 మధ్య ఖైదీగా ఉన్న ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రసిద్ధ ‘మాలపల్లి’ నవలని రాశాడు. బ్రిటిష్ ప్రభుత్వం దీనిని నిషేధించింది. ముందు జైలు సూపర్నెంటు అనుమతి తీసుకోని నవల రాస్తే అతను దాన్ని స్వాధీన పరుచుకొని పైవారికి పంపాడు. రచయిత క్రిమినల్ సెటిల్మెంట్ వ్యవస్థ గురించి, పోలీసు, జైలు, కోర్ట్ వ్యవస్థల గురించి పరమ దారుణంగా రాశాడని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం కలిగేటట్లు బోల్షేవిజం సూత్రాలను, సహాయ నిరాకరణ తత్వాన్ని ప్రబోధం, ప్రచారం చేసే విధంగా ఉన్నది కావున ప్రచురణకు అనుమతి ఇవ్వకూడదు పైనుండి ఆర్డర్ వచ్చింది. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వక ముందే 1922 లో మాలపల్లి తొలిభాగం, 1923 లో రెండో భాగం వెలువడ్డాయి. దాంతో ప్రభుత్వం షాక్ తిని, కారణాలు పరిశోధించగా జైల్లోనే రచయిత ఒక్కొక్క భాగం రాయగా తోటి రాజకీయ ఖైదీలు దాన్ని వెంటనే కాపీ చేసి బయటకు పంపించేవారు అని నిర్ధారించింది. 1923 లోనే రెండు భాగాలను ప్రభుత్వం నిషేధించింది. మాలపల్లి మూడో భాగాన్ని కూడా బ్రిటిష్ ప్రభుత్వం 1923 లో నిషేధించింది.

జైలులో నిర్బంధించడం అనేది కవులు, కళాకారులపై రాజ్యం ప్రదర్శిస్తున్న మరొక హింసా రూపం. కవులకి, రాజ్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇది ఒక భాగం. 1948 – 51 తెలంగాణ సాయుధ పోరాటంలో జైళ్ళ నుండి సాధారణ ప్రజానీకం పాటలు రాశారు. 1970 -74 మధ్య శ్రీకాకుళ ఉద్యమం సందర్భంగా జైళ్ళ నుండి వెలువడిన పాటల్ని వాటిలోని వస్తువు బట్టి – అమర గీతాలు, ఉద్యమాన్ని కీర్తించే పాటలు, పాలక వర్గాల నిరసనగా విభజించారు పరిశోధకులు కే. ముత్యం (1993 : 132 ). 

జైల్లో కార్యకర్తలు కూర్చి, పాడిన పాటలు 1972లో ‘శంఖారావం’ పేరుతో, 1974 లో నక్షల్బరి’ పేరుతో సంకలనాలుగా వెలువడ్డాయి. చారుమజుందార్ విప్లవ కార్యకర్తలని ఉద్దేశించి ‘ఈనాటి జైళ్ళు తిరుగుబాటు కేంద్రాలు అన్నాడు (ibid, 134). జైల్లో రాసిన పాటల్లో అమరవీరులని కీర్తించే పాటలు ఎక్కువ ఉన్నాయి. జైల్లో కవులు సమిష్టిగా పాడుకోవడానికి వీలుగా పాటలు రాశారు. ఉద్యమానికి, ప్రజలకి దూరంగా ఏకాంతంగా గడపవలసి రావడంతో, కవులు తోటి కార్యాకర్తలతో భావాలని పంచుకోవడానికి, ఉత్తేజితులు అవడానికి వీలుగా ఇలా కోరస్ పాటలు తీసుకువచ్చారు (ibid, 137). జైల్లో ఉన్న కవి మంచివెంకట నరసయ్య, శ్రీకాకుళం ఉద్యమ నాయకుడు వెంపటాపు సత్యం మరణించిన సందర్బంగా, ఆ ఉద్యమాన్ని కీర్తిస్తూ రాసిన పాట ‘విప్లవాగ్నులు’.

ఈ విప్లవాగ్నులు ఎక్కడవి అని అడిగితే / శ్రీకాకుళం వైపు వేలు చూపించాలి
వెంపటాపు సత్యం ఎవరు అని అడిగితే/గిరిజనులు వలె సత్యమని గొప్పగా చెప్పాలి (147).

కొర్రాయి గణపతి అనే ఉద్యమ కార్యకర్త జైల్లో రాసిన్న పాట – ‘శ్రీకాకుళం రా వీర శ్రీకాకుళం’. శ్రీకాకుళం నైసర్గిక ప్రాంతాన్నేకాక అక్కడ పుట్టిన వీరయోధులని కీర్తిస్తాడు. జైలు నుండే దేశానికి వెలుగు బాట అంటూ మార్గ నిర్దేశనం చేస్తాడు. శ్రీకాకుళం ఉద్యమంలో పాల్గొని సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యం, చినబాబు, ఆరిక సోములు, జుత్తు ఉమాపతి వంటి కవులు ఎన్కౌంటర్స్ లో మరణించగా, వై. కోటేశ్వరరావు, మంచివెంకట నరసయ్య, హేమచంద్ర పాణిగ్రాహి, కొర్రాయి గణపతి, పొందర దామోదరం, మరడాన సత్యన్నారాయణ, ఎడ్ల అప్పారావు, కృష్ణ, కళ్యాణ కృష్ణ వంటి కవులు పార్వతీపురం కుట్రకేసులో జైలుకి వెళ్ళారు.

జ్వాలాముఖి, చెరబండరాజు, నిఖిలేశ్వర్ లని 1971లో పిడి చట్టం కింద, వరవరరావు (వివి), చెరబండరాజు, ఖాన్ ని 1973లో అంతరంగిక భద్రత చట్టం (మీసా) కింద అభ్యంతర రచనలు చేసినందుకు ప్రభుత్వం నిర్భందించింది. కవి, విప్లవకారుడు శివసాగర్ 1972 – 77 మధ్య కాలంలో జైల్లో ఉన్నారు. 1973 లో ఖమ్మంలో అరెస్ట్ అయ్యాడు శివసాగర్. పార్వతీపురం, సికింద్రాబాద్ కుట్రకేసులలో ముద్దాయిగా, అదే క్రమంలో ఎమర్జెన్సీ లో కూడా 73 నుంచి జైల్లోనే ఉన్నాడు. ఒక ద్రోహి కారణంగానే అరెస్ట్ అయ్యానని హోచిమన్ వలెనె చందమామని ఉద్దేశిస్తూ జైలు నుంచి కవిత పంపాడు. ‘ఖైదీ గీతం’ పేరుతో 74 జనవరిలో అది చిన్న కవితా సంకలనంగా వెలువడింది.

శత్రుచేజిక్కితినని వెక్కిరించకు నన్ను
మిత్రద్రోహం చేత శత్రువు చేతికి చిక్కితినే చందమామా! చందమామా!!
బందిఖానాలోన ఒంటరిగ ఉన్నాను
నీకే చెప్పుదు గోడు నీవె నాకు తోడు చందమామా ! చందమామా !!
బెందిరింపులెన్నయినా, లాలింపు లేవైనా
మన జెండా గౌరవం నిలిపితిని నిజమమ్మా ! చందమామా! చందమామా!!
అష్టకష్టాలతో నా దేహమే చివికెను
గుండె నిబ్బరమొక్కటే అండగా నిలిచెను చందమామా! చందమామా!!
ఆకొకటి రాలినా చెట్టు మోడే అగునా అవుతుందా
నేనొకడ రాలినా పోరుశమియించునా చందమామా! చందమామా!!
పోరాటమే సలిపి చివరికీ ఖైదిలో బందీగా ఉన్నాను
బంధాలు బద్దలగు రోజొకటికి వచ్చులే చందమామా! చందమామా!!
జీవితాంతం వరకు ప్రజలకు సేవలచేయ
విఫలమైనందుకు నన్ను మన్నించమని నా మిత్రులను వేడవే చందమామా! చందమామా! (శివుడు, సృజన, జనవరి, 1973, పుట. 5 - 6)

ఇక్కడ కవి తన నివేదన చెబుతున్న చందమామ పాఠకుడు కావచ్చు, విప్లవ ఉద్యమం కావచ్చు. కవిత టోన్ లో విచారం, భవిష్యత్ పైన ఆశ వ్యక్తం అవుతున్నది. ఏకాంత జైల్లో కళని సృష్టించాలి అంటే జ్ఞానేంద్రియాలపై ఏకాంత జైలు చేసిన అత్యాచారాలపై కావాలనే ఎంగేజ్ కావాలి. నిర్బంధ రాజ్యం జైలులో ఉన్న వారి శరీరాలుపై, మైండ్ పై పూర్తీ ఆధీనం చేసుకోవాలి అని ప్రయత్నిస్తుంది. 1974 మే లో ప్రభుత్వం సికింద్రాబాద్ కుట్రకేసు పేరుతో విప్లవ రచయితలు వరవరరావు, చెరబండరాజు, కెవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూధన రావు, ఎం టి ఖాన్, రంగనాధంతో పాటు, నక్షలైట్ నాయకులు, కార్యకర్తలు అయిన కే జి సత్యమూర్తి, కొండపల్లి సీతారామయ్య, ఇంగువ మల్లిఖార్జున శర్మ, బార్ల యాదగిరి రాజు మొదలగు వారిని చట్టరీత్యా ఏర్పడి ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించి అరెస్ట్ చేసింది. హై కోర్ట్ ప్రభుత్వ ఆరోపణలను తోసిపుచ్చి రచయితలని విడుదల చేసింది. విశ్వాసాలు అదుపులో పెట్టబడేవి కావు – ఎవరినీ అతనికున్న విశ్వాసాలు గురించి జైల్లో పెట్టడానికి వీలులేదు’ ఈ కేసు లో జస్టిస్ చిన్నప రెడ్డి చెప్పారు (సి. వెంకట కృష్ణ విరసం పై కుట్రకేసు, సృజన, జూలై, 1974, 31). ఆ కాలంలో మొదలైన విప్లవ ఉద్యమాన్ని సమర్ధించడం కారణం. అనేకమంది కవులపై కుట్ర కేసులు నమోదు చేసి నిర్భందించింది రాజ్యం. 1974 జూన్ నుంచి అక్టోబర్ దాకా సికింద్రాబాద్ కుట్ర కేసులో నిందితులుగా జైల్లో గడిపిన కాలంలో కేవిఅర్ రాసుకున్న డైరిని 1986 లో ‘మూడు నెలల ముచ్చట’ పేరుతో ప్రచురించాడు. కేవిఅర్ జైలు డైరీ జైలు జీవితాన్ని అతి సూక్ష్మంగా ఆవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విప్లవ ఉద్యమం గురించి, విప్లవ సాంస్కృతిక ఉద్యమం వివరంగా ఉంది.

ఎమర్జెన్సీ 1975 జూన్ 26 న అధ్యక్ష ఉపాద్యక్షుల్ని మినహాహించి విరసం కార్యవర్గ సభ్యులలో ఒకరిద్దరు తప్ప తక్కినవారినందరూ, సాధారణ సభ్యులలో చాలా మందిని ప్రభుత్వం జైల్లలో వేసింది. కవి బొజ్జా తారకంని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అక్కడ అతను రాసిన కవిత్వం ‘నది పుట్టిన గొంతుక’ సంకలనంగా వెలువడింది. ఒక సున్నిత మనస్సుతో ఉద్విగ్నంగా కవిత్వం రాశాడు అంటాడు వివి.

నీతో చెప్పనేలేదు /నేను వెళ్తున్నప్పుడు
నన్ను పోలీసులు పట్టుకున్నపుడు నీతో చెప్పలేదు
నన్ను చూస్తూ నిలబడిపోయావు
నీ కళ్ళ నిండా నీళ్ళు / నీ కన్నీళ్ళు తుడవడానికి నా చేతులకు సంకెళ్ళు
నిశ్శబ్దానికి గంటలు కొడుతూ /పోలీసు బూట్లు చప్పుళ్ళు ...
తిండిలేని మండు బతుకులని
మందకడుతున్న జీవాలను/మందగిస్తున్న శవాలని చూశాను నేను
వారి గాధాలను బాధలను నా మాటల్లో పేర్చాను / నా ఊపిరిలో ఊచాను
చీకటిని తొలగించాలని వెలుగు తేవాలని ఉవ్విళ్ళూరాను...
నీ కన్నీళ్ళు నాకొక్కడికే కాదని
కోటికోటి బాధాతప్త హృదయాలకు నివాళులని
ఆనంద జలదాలని, ఆశాకిరణాలని, అరుణార్ణవ కెరటాలని
నీకు చెప్పనేలేదు. (బి. తారకం, సృజన, ఆగష్టు, 1977, పుట . 51)

1975 జూన్ 25 న మధ్య రాత్రి ఎమర్జెన్సీలో అరెస్ట్ అయిన కవి, బొజ్జా తారకం తన భార్యకి ‘నీతో చెప్పలేదు’ అనే కవిత దేశంలో ఎమర్జెన్సీ ఎలా ప్రజల మీద పడినది, ఎలా జన జీవితాలని అస్తవ్యస్తం చేసింది అనేదానికి ఉదాహరణ. తనకు కలిగిన దుఃఖాన్ని లోకంలోని దుఃఖంతో ఐడెంటిఫై చేసుకున్నాడు. అతను వెళ్ళిపోతున్నప్పుడు ఆమె కన్నీళ్ళు పెడితే – ఆ కన్నీళ్ళు తనకి ఒక్కడికే కాదు అని కోట్లాది బాధలలో ఉన్నవారికీ నివాళులు అని అర్ధం చేసుకుంటాడు. భార్య కన్నీళ్ళు దేశం జైలుగా మారిన ప్రతి ఒక్కరికి అనుకుంటాడు. జైలులో తను ఉండడం వలన తన వారికి కలిగిన బాధని విస్తృతం చేస్తాడు. సార్వజనీనం చేస్తాడు. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో మౌలిక వ్యవస్థలన్నీ ద్వంసం అయిపోయావి. అక్రమ అరెస్టులు విచ్చల విడిగా జరిగాయి. వందలాది మంది నక్షలైట్ సానుభూతిపరులు, ప్రతిపక్ష నాయకులూ, ప్రజా సంఘాల నాయకులు నిర్భంధానికి గురి అయ్యావి. ప్రభుత్వ పాఠశాలలు, పంచాయితి భవనాలు, గెస్ట్ హౌస్ లు నిర్భంద శిభిరాలుగా మారిపోయావి అన్నారు కన్నబిరాన్ (కన్నబిరాన్, 2010 : 28-29). అంపశయ్య నవీన్ ‘చీకటి రోజులు’ నవల ఆ నిర్భంద కాండ గురించి వివరంగా రాసింది. కళ్యాణ రావు రాసిన ‘ అరుణ’ నాటికలో ఎమర్జెన్సీ పరిస్థితులని అడ్డుపెట్టుకొని జాతీయవాది అయిన నాయకుడు పట్టణ సుందరికరణ పేరుతో పేదవారి గుడిసెలు పీకించడానికి పోలీసులతో చేతులు కలిపి దానికి అడ్డువస్తున్న విద్యార్ధి నాయకుడిని నక్షలైట్ పేరుతో లాకప్ లో వేసి చంపిస్తాడు. ఎమర్జెన్సీ ప్రకటించగానే సాయుధ విప్లవ పార్టీల అనుబంధ సంస్థ గా విప్లవ రచయితల సంఘం ముద్రపడింది. విప్లవ రచయితలుగా వారు రహస్య జీవితం గడపలేకపోయారు. కావునే వారు జైళ్ళకి వెళ్ళవలసి వచ్చింది. ఆ కాలంలో ఏ పని చేయలేకపోయారు. జైలు అనుభవాలు, కొన్ని కవితలు మాత్రమే రాయగలిగారు అని కన్నాబిరాన్ విమర్శించారు (విరసం ఎలా ఉంది’ సృజన, ఏప్రిల్, మే 1978, పే. 83). తరువాత దీనిలో కొందరు విరసానికి రాజీనామా ఇచ్చారు.

దేశంలో దీర్ఘ కాలం జైలులో గడిపిన కవి వరవరరావు. అయన 1971 నుండి సికింద్రాబాద్ కుట్రకేసు (1974), రాంనగర్ కుట్ర కేసు, భీమా కొరేగావ్ కేసు (2018) వంటి వాటిలో అనేక సార్లు నిర్బంధం ఎదుర్కొన్నారు. ఆయన జైలులో ఉండగా స్వేచ్చ(1978), ముక్త కంఠం (1990) వంటి కవితా సంపుటాలు రాశారు. 1985 లో రచించే, జీవించే స్వేచ్చ కోసం ఆయన జైలుకెళ్ళారు. ఆసందర్భంగా ఇలా రాశారు. ‘మనిషి స్వేచ్చా ప్రియుడు. కవి సంగతి చెప్పనక్కర లేదు. కవి స్వేచ్చకు ఊహల రెక్కలు భావుకత్వ ఆకాశం కూడా తోడూ అవుతాయి. అయినా నిర్భంధంలోనైనా జీవించి వుంటే తప్ప రచించలేను గనుక నన్ను సికింద్రాబాద్ కుట్రకేసులో బెయిలు రద్దు చేసి సికింద్రబాద్ జైలుకి పంపవలసినదిగా ఈ కోర్ట్ కి కోరుతున్నాను (వరవర రావు, ‘రచించే స్వేచ్చ కోసం’, విరసం ప్రకటన, అరుణతార, ఫిబ్రవరి, 1986, పుట .1) . ‘దీర్ఘ కాలం ఒక చిన్న స్థలంలో బందీ అయి జీవించడం అంటే ఏమిటి? జైల్లో ఉండే చిన్న సమాజం ఆరాటాలు ఏమిటి? అని ఇండియన్ ఎక్షప్రెస్ ఎడిటర్ అరుణ్ శౌరి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కవి వరవరరావు ఇండియన్ ఎక్షప్రెస్ కి, ఆంధ్రప్రభ కి పత్రికలకి కొన్ని వారాలు పాటు లేఖల కాలమ్ రాశారు. ఆ తరువాత ఇది ‘సహచరులు’గా పుస్తకంగా ప్రచురించబడింది. ఈ లేఖల లక్ష్యం ఏమిటంటే – చదువరుల నుండి కవి విడుదలకి సంఘీభావం కూడగట్టడం. ఈ లేఖల్లో జైల్లో నిరీక్షణ, కలలు, ఉహాలు, ఆనందం, ఆందోళన, ఆశనిరాశలు, మౌనం, స్వేచ్చ వంటి భావాలతో పాటు జైల్లో పక్షుల గురించి, మొక్కలు, పత్రికలు, ఉత్తరాలు, కవిత్వం, కన్నతల్లి, మనుషుల గురించి కూడా రాశారు. జైలులో కవి రాసిన కవితలకి వ్యాఖ్యానాలులా ఉంటాయి ఈ లేఖలు. ఈ లేఖలు జైలుని, కవికి స్వేచ్చ పట్ల ఉండే దృక్పదాన్ని వివరిస్తాయి.

3. బంధించలేని భావుకత:

నోటికి కాళ్ళకూ ఇది జైలు
చెయ్యి రాయడం మానలేదు /మనసు రాపాడడం మానలేదు
ఒంటరి చీకటి నుండి పయనించిన కలలు
వెలుగు తీరాలకు చేరుతూనే ఉన్నాయి (వరవరరావు, 2017: 203)

జైల్లో బందీగా ఉన్న కవి కనే ‘రక్త స్వప్నం’ – అంటే విప్లవ స్వప్నం ఈ కవితలోని ఇతివృత్తం. బయట సమాజంలో ఉన్న పోరాట స్పూర్తి వాతావరణం కవి గొంతులో ధ్వనిస్తుంది. జైలుని భావించుకోవడానికి, పాఠకునిలో అనుభూతికి అవకాశం ఇస్తుంది ఈ కవిత. జైలు పట్ల కవి చేసే ఊహ, లేదా కవి రీడర్ లో కలిగించే భావన. జైలు వ్యవస్థ పట్ల ఉండే అభిప్రాయాన్ని రకరకాల పద చిత్రాలులో చిత్రిస్తాడు వరవరరావు. ఒక కవిని రాజ్యం అతని రచనల కోసం జైలులో పెట్టి అతని నోటిని కట్టి వేసినా, కాళ్ళని బంధించినా అతని చేయి రాయడం మానదు అంటే రచన చేయడాన్ని జైలు ఆపలేదు అని అర్ధం ఇస్తాడు కవి. ‘పాలక వర్గం ప్రాణాలని నిలబెట్టడానికి ఈ వ్యవస్థ’ ఉంది అనే స్టేట్మెంట్ ని కవి సపోర్ట్ చేయడానికి, ‘దోపిడీ వ్యవస్థ చేయించిన నేరలల్ని అమాయకంగా మోస్తున్న ఖైదీలు’, పేదరికం ఓడుతున్న పోలీసులు’ వంటి పదబంధాలని వాడుతాడు. ‘పునాది లేని జైలు గోడలు’, ‘తుప్పుపట్టిన కటకటాలు’, ‘లాంగ్ మార్చ్ చేస్తున్న చీమలు’, ‘అణిగి ఉన్న అగ్గిరవ్వలు’, విప్లవ సూర్యుడు’, ‘సాయుధ మార్గం’, సమాజం కోసం హంతకులు’ వంటి పదచిత్రాలు విప్లవ రొమాంటిసిజాన్ని సూచిస్తాయి. జైలు వ్యవస్థనే గర్హించి కవి సాయుధ మార్గం కోసం జైలుని బయలుగా రక్త స్వప్నాలు కంటాడు.

జైలులో రచన అనేది బందీలకి బయట జనాలకి మధ్య, కుటుంబ సభ్యులకి మధ్య, సామాజిక సంబంధాల మధ్య కలుపుతుంది. వీటి కోసం carceral aesthetics అనే పదబంధాన్ని వాడారు ఫ్లీట్ వుడ్. పీనల్ నిర్భందంలో కళ సృష్టి గురించి వివరించే పదబంధాన్ని ఈమె వాడింది. సామూహిక నిర్బంధం అనేది ప్రధానంగా రాజ్యం తను లక్ష్యంగా పెట్టుకున్న జన సముహలని తొలగించడానికి, బహిష్కరించడానికి వాడేది. జైలు చరిత్రలు ఏమి చెబుతున్నాయి అంటే జైలు పుట్టుకకి కారణం సమాజంలో శిక్ష పాత్ర సంఘ సంస్కరణ పట్ల ఉన్న దృష్టి మారిన తరువాత వచ్చాయి. బహిరంగ మరణ దండన నుండి నాలుగు గోడలలోనికి మారి కొంత హింస తక్కువగా ఉండే విధంగా మారింది. మ్యూజియం అనేది మొదట శిక్షని ప్రదర్శించే చారిత్రిక ప్రదర్శన (ఎక్సిబిషన్)గా ఉండేది. పునరుజ్జీవ కాలంలో మ్యూజియం, జైలు అనేవి ఒకదాని వెనుక ఒకటి అభివృద్ధి చెందిన వ్యవస్థలు.

సమాజంలో స్వేచ్చకి సంకేతంగా ‘గాల్లో ఎగురుతున్న పక్షి’ అనే మెటాఫర్ వాడుతాం. నిర్బంధానికి ‘పంజరంలో చిలుక’ అనే మెటాఫర్ ఉపయోగిస్తాం. అటువంటి పక్షులు జైల్లో ఉండటం గమనించి, అవి జైల్లో ఉండడం సంతోషకరమైన విషయం కాదు అంటాడు కవి (2019: 39). పావురాలు, కోయిలలు, పిల్లులు, ఎలుకలు. జైలులో పావురాలకి, పిల్లులకి బయటకి వెళ్ళాలి అని ఎందుకు అనిపించదు అనుకుంటాడు కవి. జైల్లో కవి గత అనుభవం లోకి ప్రతి క్షణం తొంగి చూస్తుంటాడు. కవి జాగ్రత్తగా ప్రతి శబ్దం ఒడిసి పట్టుకుంటాడు. తను స్వేచ్చ ఉహిస్తాడు కాబట్టి. కవి కేవిఅర్ జైలులో స్వేచ్చ కోరుతున్నాడు కింద కవితలో.

గోడలను మీటి పోలేను గాని /కాలు లోకాలనే చుట్టగోరును
కంటికి కటకటాలు అడ్డు రాకుంటే /మంటిని మింటిని మించిపోవాలి అనుకొంటుంది (కేవిఅర్, ‘కాలూ – కన్నూ’ , 2017 పుట. 296)

వార్తా పత్రికలు, పుస్తకాలు చదివించడం అనేది ఆధునిక క్రమ శిక్షణలో ఒక భాగం. గురు ఆశ్రమాలలో తపస్సుకి పురాణగా పుస్తకాల చదవడం అనేది ఆధునిక విద్యా విధానంలో వచ్చింది. క్రమ శిక్షణలో భాగంగా ఏది చదవాలి ఏది కూడదు అనేది సెన్సార్ అవుతుంది. రోజు ఉదయం వచ్చే వార్తా పత్రికలు చదవడం ఆధునిక సమాజంలో ఒక హాబి అయిపోతుంది. పెట్టుబడి పత్రికలు వార్తలని మరింత ఆహ్లాదకరంగా తీర్చి దిద్దుతాయి. లోకం గురించి సమాచారం కంటే, వినోదం కొరకు కాలాన్ని వెళ్ళబుచ్చదానికి పత్రికలు ఒక సాధనం. అలా రానురాను పత్రిక చదవడం ఒక వ్యసనం అయిపోతుంది విద్యావంతులకి. జైల్లో బందీలు చదవడం అనేది నిరాపాయకరమైన వ్యాపకం అనవచ్చు. అది బందీల దిద్దుబాటు కార్యక్రమంలో భాగం కూడా కావచ్చు. అయితే బయట సమాజం వలె ఏమి చదవాలి ఏమి చదవకూడదు అనేది జైలు సిబ్బంది నిర్ణయిస్తారు. కవులు, రాజకీయ ఖైదీలు జైలులో బందీలు అయితే వారి ఏకాంతవాసాన్ని పత్రికలతో, పుస్తకాలతో పూరిస్తారు. వారికి అందే పత్రికలు ముందే సెన్సార్ అవుతాయి. పత్రికల్లో ప్రింట్ అయ్యే వార్తలు ముందే సెల్ఫ్ సెన్సార్ కి గురి అవుతాయి. అవి బందీలకి చేరే సరికి ఇంకా కొన్ని వార్తలు మీద నల్ల రంగు పూసి ఇస్తారు. చైతన్యవంతులైన బందీలకి నల్ల రంగు పూసిన వార్తలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బందీకి వర్తమాన విషయాల పట్ల పరిజ్ఞానం వార్తా పత్రికలు వలన, రేడియోల కలుగుతుంది. చైతన్యవంతులైన ఖైదీలని నిరంతరం వేధించేది తాము చరిత్ర నిర్మాణంలో పాలుపంచుకోలేక పోతున్నాం అనేది అని జైలులో కవి అనుకుంటాడు (వరవర రావు, 2019, పే. 45). అందుకే ఈ కాలాన్ని వినియోగించుకోవాలి అని పుస్తకాలు ఎక్కువ చదువుతారు. భావి చరిత్ర నిర్మాణం, ప్రాచీన చరిత్ర అధ్యయనం అని రెండు రకాలుగా ఉంటుంది. తాము చరిత్ర గతిలో వెనుకబడి పోకుండా ఉండడానికి రాజకీయ ఖైదీలు బయట ప్రపంచంతో పెట్టుకునే సజీవ సంబంధం పత్రికలు అంటాడు. ఖైదిలకి బయట ప్రపంచం ఇలా కనిపిస్తుంది కాని వారు బయట ప్రపంచానికి కనబడరు.

కవికి పత్రిక వాడిపోయినా వాసన తరగని పువ్వు (46). రాజకీయ ఖైది పత్రికని పువ్వులా జాగ్రత్తగా పట్టుకుంటాడు, అంటాడు వరవర రావు. అన్ని జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలు చరిత్ర, తత్వ శాస్త్రం, సిద్ధాంత గ్రంధాలూ ఎక్కువగా అధ్యయనం చేస్తారు. పుస్తకాల్లో మిత్రులు దొరుకుతారు గోర్కి చెప్పినట్టు. కొన్ని పుస్తకాలు మన జీవితంలో కొన్ని అనుభవాలు వల్ల మనకు ఆత్మీయం అవుతాయి అనుకుంటాడు అంటాడు కవి (49). జైల్లో పుస్తకాలు చదివి కవి చుట్టూ ప్రపంచాన్ని మైమరచి పోతాడు. ‘బందీకి పుస్తకాలు నిజంగా రెక్కలు వంటివి, చైతన్యానికి ఆహారం వంటివి (51). అయితే ఎంత పుస్తకం అయిన మనిషికి ప్రత్యామ్నాయం అవుతుందా అంటాడు కవి (51). చీమలు తమ ఆహారాన్ని ఎక్కడెక్కడి నుండి కణం కణం ప్రోగు చేసుకున్నట్లుగా రకరకాల దిన, వార, పక్ష, మాస పత్రికల చదివి ఒక వార్తని, వ్యాఖ్యని, సమాచారాన్ని వ్యాసాన్ని జల్లెడ పట్టి ఆకృతి నిర్మించుకుంటాం. పత్రికలకి సెలవు అయిన రోజు కాలం గడవదు. అప్పుడు కవి అనుకుంటాడు – నిరక్షరాస్యుడు అయిన ఖైదీలు ఎలా కాలాన్ని గడుపుతారో అనుకుంటాడు (47). ‘ఖైదీలకి దగ్గరకి రానిదే వార్తా అన్నది జైలు సత్యం’ అని కవి విచిత్రమైన సత్యం చెబుతాడు.

‘శిలువకి కాలాన్ని తగిలించి మేకులు కొడుతున్నట్లు జైలుగంట’ (వరవరరావు, 2017, పే. 393) అనే కవితాత్మక వాక్యం జైలులో కాలం గడవడం అనే ఒక హింసాత్మక కార్యక్రమం మత ప్రతీకతో సూచించాడు. క్రిస్టియన్ సమాజంలో హింసకి, అహింసకి మధ్య గల సానుభూతి వ్యక్తం చేసే ప్రతీక శిలువ. ఆధునిక పారిశ్రామిక యుగంలో కాలం గురించి ఫ్యాక్టరీ జైలులో అమర్చిన గంట శబ్దం ప్రతీక శబ్దకాలుష్య హింసాత్మకంగా మారడం అనే అనుభవాన్ని సూచిస్తుంది. సైరన్ ని ఒక అవమానించే పిలువుగా భావిస్తాడు కవి.

జైల్లో ఏదీ సీక్రెట్ కాదు. అంతా బహిరంగమే, బందీకి సంబంధించినంత వరకు. ‘నాకు ప్రభుత్వం అనే దాయాది ఉన్నట్టు తెలియద’ని ఒక అరబ్బు కథలో పాత్ర అంటే – జైల్లో తన ఉత్తరాలను ఇంటిలిజెన్స్ వారు చదువుతుంటే – గతంలో తన ఉత్తరాలు ఎలా సెన్సార్ అయ్యావి అనే సందర్భం గుర్తు చేసుకుంటూ ‘నాకు రాజ్యం అనే నెచ్చలి, నేస్తం, తల్లి, బిడ్డ, బందువు ఉన్నట్టు నాకు 1965 దాకా పీడకలలో కూడా ఊహించలేదు’ అని వెటకారంగా అంటాడు వరవర రావు (వరవర రావు, 2019: 52). జైల్లో ఉత్తరాలకి sensored అనే ముద్ర ఉంటుంది. జైల్లోంచి రాసే ఉత్తరాలులో ఉండేవి - వియోగం, ఆకాంక్ష, కన్నీళ్ళు, ఆశ్వాసం, బాగున్నామని చెప్పుకునే అబద్దాలు, మరిచిపోలేకుండా ఉన్నాం అని చెప్పుకునే నిజాలు (54). వేరే వారి ఉత్తరాలు చదవడం అనేది సీక్రెట్, నిఘా పెట్టడం – వారి వ్యక్తిగత ప్రైవసీని ప్రదర్శనలో పెట్టడం అవుతుంది. జైలులో సందర్శకులకి, ఖైదీలకి మధ్య జరిగే ఇంటర్ వ్యూ విజిటింగ్ హాలులో ఒక పోలీసు ప్రేక్షకుడు ఉంటాడు. రాజ్యం బందీలకి ప్రైవసీని నిషేధిస్తుంది. వారు రాజ్యం ముందే ప్రదర్శన చేయాలి.

కొన్ని రకాల వ్యక్తులని దొంగలుగా, నేరగాళ్ళుగా, చట్ట అతిక్రమణదారులుగా రాజ్యం ముద్ర వేసి వదిలి వేస్తుంది. వారిని జైల్లో వేసినప్పుడు తీసిన ఫోటో దానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. సమాజం ఎలా జైలులో నిర్బంధించ బడిన వారిని ఎలా చూస్తుంది అనేదానికి రాజ్యం ఫోటోలు విడుదల చేస్తుంది. విప్లవ ఉద్యమంలో కార్యాకర్తలు తమని రాజ్యం, పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు ఈ మాత్రం ఫోటో ఆధారాలు లేకుండా కాల్చివేసేవారు. ఎమర్జెన్సీ సమయంలో విప్లవ కవులు సామూహికంగా జైళ్లలో ఉండడం వలన, అక్కడ సామూహిక జీవనం వలన, చైతన్యం వలన కవులు ఎక్కువగా బయట ప్రజా పోరాటాలు గురించి, ఉద్యమాలు గురించి, సంఘటనల గురించి రాసేవారు అంటాడు వివి. ఎన్కౌంటర్ లో మరణించిన కామ్రేడ్స్ గురించి సహజంగానే తమ తీవ్రమైన అనుతాపాన్ని ఉత్తేజకరమైన ఎలిజీలుగా రాసేవారు (68).

రోగమే శిక్షగా పరిణమించిన దుర్మార్గమైన కేసు కవి చెరబండరాజు ది. దీర్ఘ కాలం జైల్లో గడపడం వలన బ్రెయిన్ ట్యూమర్ సోకి మరణించాడు చెరబండరాజు(1982). సాధారణంగా జైల్లో రోగం పూర్తిగా బందీ శరీరంలో ప్రవేశించి ఆక్రమించే వరకు అధికారులు నిరీక్షిస్తారు. అప్పుడు గాని చికిత్స ప్రారంభించరు. అప్పుడైనా వాళ్ళు బందీ బాగుపడడానికి కాదు. వాళ్ళ రికార్డ్ కోసమే మాత్రమే చేస్తారు. అనారోగ్యంతో ఉన్నవారు, లింగ నిర్ధారణ కానీవారు, మైనారిటీ మతస్తులు, రాజకీయ ఖైదీలు, డాక్యుమెంట్ కాని వారు జార్జ్ అగంబాన్ థియరీ ‘బేర్ లైఫ్’ లో పెట్టబడతారు. వారు ఇతరులతో మాట్లాడకూడదు, వారి కుటుంబాల నుండి ములాఖత్ ఉండదు, ఉత్తరాలు ఉండవు. ఎంత అనుమానానికి తావులేని డిటెన్యూని కూడా కుటుంబాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకొని రాజకీయంగా వెన్నెముక విరవవచ్చు. ఎందుకంటే కుటుంబంతో అటువంటి గాఢమైన భావోద్రేకాలు, ఉద్వేగాలు ముడిపడి ఉంటాయి అని గూగి అన్నారు (1998: 150). పాలక అల్ప సంఖ్యాక వర్గం చేతుల్లో జైలు వ్యవస్థ ఒక అణిచివేత సాధనం (గూగి, 25). Prison is a sort coercive theatre there prisoner life will be examined from top to bottom అన్నాడు ప్యూకో (1977: 252). జైల్లో టాయిలెట్ పేపర్ మీదా నవల రాశాడు గూగి. గూగి తన జాతికి చెందినా గికుయు భాషలో రైతాంగ, కార్మిక సమ్మేళనంలో ప్రజా రంగ స్థలాన్ని నిర్మించే ప్రయత్నం చేసిన నేరానికి జైలులో నిర్భందించబడ్డాడు. జైల్లో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడవలసిన అవసరం గురించి గూగి చెప్పారు.

4. స్థలకాలాల చిత్రణ:

లాగరా కాలాన్ని లాగరా హైలెస్సా /లాగరా బందీ సాగరా
కదలకున్నది కాలం/ నిలువకున్నది మనసు లాగరా
అదిలించి కాలాన్ని/ అదుపు చేయర మనసు లాగరా
ఎక్కడున్నది స్వేచ్చ / ఎక్కడయినా ఖైదే లాగరా
ఎగరనీరా మనసు / విరగనీరా గొలుసు లాగారా
చేధించి సంకెలలు/ చేదుకోరా స్వేచ్చ లాగరా (వరవరరావు, ‘లాగరా కాలాన్ని’, 2017, పే. 443).

జైలులో కాలం కదలదు. అక్కడ స్థల కాలాలు రెండు నిలిచిపోతాయి. జైలు అనే సముద్రంలో కాలం అనే పడవని బందీ అనే జాలరి ని హైలెస్సా అంటూ లాగమంటూన్నాడు కవి. ఆ పడవ లాగే ఉత్సాహ కార్యంలో మనసుని అదుపు చేసి, సంకెళ్ళు అనే గొలుసుని చేధించమంటున్నాడు. స్వేచ్చ అనే తీరం చేరుకోమని బోధ చేయడమే ఈ కవిత ఇతివృత్తం. ఈ ‘పీనల్ కాలం’ అనేక తాత్కాలిక విషయాలతో విస్తృతం చేయబడి ఉంటుంది (ఫ్లీట్ వుడ్, 2020, పే. 39). కాలం వృధా చేయించడమే ఆధునిక శిక్ష. కాల శిక్ష విధించడం ఒక పెద్ద లోపం అంటాడు ఫెర్గుసన్. కాలం అనేది జైల్లో ఎలా ఫీల్ అవుతుంది అనే కాన్సెప్ట్ నేర చట్ట వ్యవస్థలో లేదు. భోజనం అందించడం బట్టి ఒక చిత్రకారుడు కాలాన్ని లెక్క పెట్టాడుట అని రాసింది ఫ్లీట్ వుడ్. జైల్లో కాలం అనేది నెమ్మది చావుతో సమానం. పెరుగుతున్న చెట్టుతో తన నిర్భంద కాలాన్ని కొలమానం చేస్తుంటాడు కవి వరవరరావు. జైల్లో చెట్లు పెంచడం అన్నిటి కన్నా నిష్కామ కర్మ అనేది అతని భావన. జైలులో బందీకి ఒక రోజు – పగలు, రాత్రి రెండు రోజులు అవుతాయి అంట. ‘ఏడేళ్ళు అంటే దినం రాత్రి లెక్కన పద్నాలుగేళ్ళు, లైఫ్ అంటే పద్నాలుగేళ్ళు అనే అభిప్రాయం ఏర్పడిపోయింది.’ (వరవర రావు, 2019, పే 77). ‘ఒక ఖైదీ ఇలా అన్నాడుట: మనకు జైల్లో రాత్రి కూడా మరొక దినమే కదా. ఒక నిద్రనా, ఒక కలనా, అట్లా కళ్ళు పొడుచుకుని తెల్లవార్లు ఎదురు చూడడమే కదా (పే. 77).

‘పీనల్ స్పేస్’ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తూ, జైలు అనేది నేర శిక్షా స్థలం, ఒక నిర్భంధించే నిర్మాణం, ఇంకా కుటుంబ సంబంధాలని దూరం చేసేది అన్నది ఫ్లీట్ వుడ్. కదలికలపైన నిషేధం విధించేది, నిఘా పెట్టేదిగా మార్క్ చేసింది ఆమె (ఫ్లీట్ వుడ్, 2020, పే. 38) . పీనల్ స్పేస్ అనేది జైలు బందీలు ప్రదర్శించే, రాసే, శరీరాల దర్శించే నాటక స్థలం. కళా సృష్టి జైలు స్థలాన్ని కొత్త విధంగా ఊహించడానికి ప్రయత్నం చేస్తుంది. జైలుగదికి ఆత్మ ఉంటె ఎలా ఫీల్ అవుతుంది అనేదాన్ని ‘జైలు గది’ కథలో చెప్పింది రచయిత్రి ఓల్గా. జైలు గది, తన వద్దకు ఎప్పుడు గొప్పవాళ్ళు రారు. అందరు పతితులు, బ్రష్టులే వస్తారు అని విలపిస్తుంది జైలు గది. అయితే, జైలుకి వచ్చిన విప్లవకారులు పాటలు పాడుతుంటే ఆశ్చర్యపోయింది జైలు గది. ‘జైలు గోడలని అడిగిచూడు, ఆ గోడలని తడిమి చూస్తే రక్తం కన్నీళ్ళు కలసి కురుస్తాయి జ్ఞాపకాలు’ అంటాడు కవి ఎన్ కే ఒక కవితలో . మరొక రచయిత, జైలు గోడ అంటే న్యాయానికి, అన్యాయానికి, స్వాతంత్ర్యానికి పీడనకు సరిహద్దు అంటాడు. దోపిడిని ప్రశ్నించడం నేరమని, తమ పాలనకు అడ్డు ఉండరాదని, ధన మధాందులు బందించినది ఆ గోడ. ఈ గోడలు కట్టినది, దానిలో బందీలు అయింది కూలీలు . స్వంత ఆస్తి వచ్చినప్పుడే ఈ గోడలు వచ్చాయి అని మార్క్సిస్ట్ భావజాలంలో చెబుతాడు రచయిత. రాజుగారి ఆజ్ఞతో ధర్మపాలన కోసం అని, ప్రజా రక్షణకు అని, దేవుని ఆజ్ఞ కారణమని – రాజ్యపు పునాదులు పెకిలించి వేయబడకుండా కాపాడేందుకు జైళ్ళు వచ్చాయి. ‘నూతన మానవుడు’ అనే కథ లో ప్రకాశం జైలుని వర్ణిస్తాడు. ఆ గదిలో ఏ వస్తువు లేదు. కనీసం కూర్చునేందుకు పడుకునేందుకు గాని చిన్న చాప కూడా లేదు. గది అంతా దుర్వాసన వేస్తున్నది. బయటకు వెళ్ళే మార్గం పుడుకుపోయి ఉండటం మూలన ఒక మూల ఉచ్చ పేరుకుని ఉంది. గదంతా ఆసహ్యం వేసే మరకలు, అక్కడక్కడ రక్తం మరకలు ఉన్నాయి. ఆ గదిలో కూడా ‘శాంతి భద్రతల రక్షణ కోసం లాటి చార్జీలు, పోలీసు కాల్పులు జరిగాయట’ . జైలు ఆకారం – చుట్టూ ప్రాకారపు గోడ, దానికి ఒక పెద్ద గేటు, అందులో కొండ చిలువ నోరు వలె ఒక గేటు, లాకప్ లు, ఎత్తయినా గోడలు, పై కరెంటు తీగలు, ఎటు చూసినా పది అడుగులు నడిస్తే మూసుకునే గేట్లు, ఖైదీల నెంబర్లు, దుస్తులు, ఖాకి దుస్తులు నిర్బంధాన్ని నిరంతరం గుర్తు చేస్తుంటే చెట్లు, పక్షులు ఖైదికి బలగం అవుతాయి.

రైలు ప్రయాణంలోనూ జైలు ప్రవాసంలోనూ నువ్వు ప్రేక్షకునివే
నీచూపుల కిటికీల దగ్గరికి స్థలకాలాలను యంత్రమో, యాంత్రిక నియంత్రనో తేవల్సిందే...
జైల్లో ప్రకృతీ, మనిషీ వచ్చి నిను పలకరించవలసినదే
(వరవర రావు, ‘జీవన్ కే సఫర్ మే రాహి’ 2017, పే. 485)

జైలు జీవితాన్ని, రైలు ప్రయాణంతో పోల్చి రీడర్ కి జైలు అనుభవాన్ని అందిస్తాడు కవి. అక్కడ ఇద్దరు ప్రేక్షకులే. ఇద్దరినీ యంత్రమే దగ్గరకి తెస్తుంది. స్థల, కాలాల మార్పు తేడా వలన జైలు, రైలు భిన్నంగా కనిపిస్తాయి. స్థలకాలాల బంధనే కదా జైలు అంటే.

5. ముగింపు:

  • జైలు కవిత్వానికి, బయట కవిత్వానికి తేడా ఏమిటి? జైలు కవిత్వం అనేది ఒక ప్రత్యేకత ఎలా సాధించుకోగలుగుతుంది? జైలులో ఇంద్రియ అనుభవం deprivation అనేది మొదటి విషయం. 
  • సమాజంలో కవి అనే వాడు ఎందుకు కవిత్వం రాస్తాడు. కవిత్వం, పాట అంతా ఒక సామూహిక వ్యక్తీకరణ అనేది తెలుసు. ప్రాచీన సమాజంలో సామూహిక, శ్రమ వ్యక్తీకరణగా ఉన్న పాట – సమాజం వర్గాలుగా, శ్రమ విభజన ఏర్పడడంతో విశ్రాంతి వర్గం ఏర్పడి ఛందస్సుతో కూడిన పద్యాలు ఫ్యూడల్ సమాజంలో వస్తే, ఆధునిక పెట్టుబడిదారీ సమాజాల్లో వచన కవితా రూపాలు స్థిరపడ్డాయి.
  • జైలు వ్యవస్థ ఆధునికవ్యవస్థ. కావున ఆధునిక సమాజంలో వచనకవితం ప్రధాన స్రవంతి అవ్వడం వలన జైలులో వచనకవిత్వం ఎక్కువ వచ్చింది. జైలు అనేది బందీలను సమష్టి నుండి విడదీసి ఏకాంతంలో పెడుతుంది. జైలుకి వెళ్ళిన కవి, రచయిత ఒంటరితనం నుండి సమష్టిలోనికి వెళ్ళే ప్రయత్నమే రచించడం, చదవడం.
  • జైలులో చైతన్యవంతులైన బందీలు ఎక్కువగా తత్వశాస్త్రం, చరిత్ర, సామాజికగ్రంధాలు చదవడానికి ఇష్టపడతారని విన్నాము. ఆధునిక సాహిత్య రూపం అయిన నవలా రచనపై కొందరు రచయితలు దృష్టి పెట్టారు.
  • జైలులో బందీ అయిన కవి ఎంత రాజకీయ సిద్ధాంతాలు రాసినా తన భౌతిక పరిస్థితికి అనుక్షణం తిరిగి వస్తాడు. జైలు అనుక్షణం బందీ శరీరాన్ని, ఇంద్రియాల అనుభవాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. బయట సమాజంలో రాసే కవి శరీరాన్ని కొంతవరకు అధిగమించవచ్చు. జైలులో కవిత్వం రాసే కవికి బయట వాళ్ళు తన కవిత్వం చదువుతారు అనే స్పృహ తో రాసినా కొంత తమ కొరకు కూడా రాసుకుంటారు.
  • జైల్లో రాజకీయ ఖైదీలు సాహిత్య సాధనని వారు భావోద్వేగపరంగా, ఉత్సాహంగా, సజీవంగా, నిలుపుకోవడానికి కృషి చేస్తారు అంటాడు కవి వరవరరావు. అది వారు అప్రయత్నంగా చేస్తారు. విప్లవ ఉద్యమం వలెనె జైలు జీవితం కూడా చాలా మంది రాజకీయవేత్తలని కవులుగా తీర్చిదిద్దింది. 
  • శ్రామికునికి పాట సేదదిర్చినట్లుగా ఖైదీకి ఈ నిర్భంధంలోని బోర్ డం నుండి, మొనాటమీ నుండి కవిత్వం రిలీఫ్ ఇస్తుంది. ఇది కవిత్వం చదివి అనుభూతి చెందడంతో ప్రారంభం అయి తామే కవిత్వం రాయాలన్న ఉద్విగ్నత కలిగేంత దూరం పోతుంది. 
  • జైల్లో చెప్పిన కవిత్వం సాంద్రంగా ఉంటుంది. ప్రతి పరిస్థితిని అనుకూలంగా అర్ధవంతంగా సృజనాత్మకంగాను మార్చుకోవడానికి జైల్లో కవిత్వం రచయితలకి ఉపకరణంగా ఉంటుంది అని చెప్పవచ్చు.

6. సూచికలు:

  1. వరవరరావు, ‘శృతి’, 2017 పుట. 390.
  2. బంగోరె, అరుణతార, అక్టోబర్ 1978 – జనవరి 1979, 44 – 45.
  3. శివుడు, సృజన, జనవరి, 1973, పుట. 5 - 6
  4. బి. తారకం, సృజన, ఆగష్టు, 1977, పుట . 51
  5. వరవర రావు, ‘రచించే స్వేచ్చ కోసం’, విరసం ప్రకటన, అరుణతార, ఫిబ్రవరి, 1986, పుట. 1
  6. కేవిఅర్, ‘కాలూ – కన్నూ’ , 2017 పుట. 296
  7. ఎన్. కే. ‘జ్ఞాపకాలు’, సృజన, మార్చి, 1979, పుట. 53
  8. అరుణ కుమార్, ‘చీకటోళ్ళు’, సృజన, ఏప్రిల్, 1972, పుట. 39ప్రకాశం, ‘నూతన మానవుడు’ సృజన, ఫిబ్రవరి 1973, పుట. 31

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. Agamban, G. State of Exception. (2005). University of Chicago Press
  2. Berger, John. Meanwhile. (2008) Drawbridge
  3. Bernstein, Lee. America is the Prison: Arts and Politics in Prison in the 1970s. (2010) University of North Carolina Press
  4. Fleetwood, Nicole R. Marking time: Art in the age of mass incarceration. (2020) Harvard University Press
  5. Foucault, Michel. "Discipline and punish: The birth of the prison, (1977). trans. Alan Sheridan."
  6. Kannabiran, Vasantha. Captive Imagination: letters from prison. (2010)Penguin Books India.
  7. wa Thiong'o, Ngugi. Penpoints, gunpoints, and dreams: Towards a critical theory of the arts and the state in Africa. (1998)Clarendon Press.
  8. కన్నబిరాన్, కే. జి. 24 (2010). దేవులపల్లి పబ్లికేషన్స్, హైదరాబాద్
  9. ముత్యం, కె. శ్రీకాకుళ ఉద్యమ సాహిత్యం. (1993 ) దృష్టి పబ్లికేషన్స్, హైదరాబాద్
  10. సత్యన్నారాయణ, ఎస్. వి. వి. తెలుగులో ఉద్యమ గీతాలు (1991) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
  11. వరవరరావు. వరవరరావు కవిత్వం 1957 – 2017. (2017)స్వేచ్చ సాహితీ, హైదరాబాద్
  12. వరవరరావు. సహచరులు. (2019.) నవోదయ ప్రచురణలు, హైదరాబాద్

పత్రికలు:

  1. అరుణ్ కుమార్. ‘చీకటోళ్ళు’. సృజన మాస పత్రిక, సంచిక. 31, సంపుటి. 4, ఏప్రిల్, 1972, పుట. 39-44.
  2. ఎన్. కే. ‘జ్ఞాపకాలు’. సృజన మాస పత్రిక, సంచిక. 89. సంపుటి. 3. మార్చి, 1979. పుట. 53.
  3. కన్నబిరాన్. ‘విరసం ఎలా వుంది? ఎలా వుండాలి?’. సృజన మాస పత్రిక, సంచిక 78/79, సంపుటి. 4 ఏప్రిల్ – మే, 1978, పుట. 61- 84 .
  4. తారకం, బి. ‘నీతో చెప్పనేలేదు’. సృజన మాస పత్రిక, సంచిక. 70. సంపుటి. 1, ఆగష్టు, 1977, పుట. 51.
  5. ప్రకాశం. ‘నూతన మానవుడు’. సృజన మాస పత్రిక, సంచిక 41, సంపుటి. 2, ఫిబ్రవరి, 1973, పుట. 30 -39.
  6. బంగోరె, అరుణతార త్రైమాసిక పత్రిక, సంచిక. 2, సంపుటి. 1 అక్టోబర్ 1978 – జనవరి 1979, పుట 44 – 45.
  7. వరవరరావు. ‘రచించే స్వేచ్చ కోసం’. విరసం ప్రకటన, అరుణతార మాస పత్రిక, సంచిక, 74, సంపుటి. 2 ఫిబ్రవరి, 1986, పుట. 1-7.
  8. వెంకట కృష్ణ, సి. ‘విరసం పై కుట్రకేసు’. సృజన మాస పత్రిక, సంచిక. 58, సంపుటి.7, జూలై, 1974, పుట. 29-31.
  9. శివుడు. ‘ఖైదీ గీతం’. సృజన మాస పత్రిక, సంచిక. 40. సంపుటి. 1. జనవరి, 1973, పుట. 5 -6.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]