AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. షట్చక్రవర్తి చరిత్ర: వర్ణనావైదుష్యం

గట్టెడి విశ్వంత్
పరిశోధకుడు, తెలుగుశాఖ,
మానవీయశాస్త్రాలవిభాగం, హైదరాబాద్ విశ్వవిద్యాలయం,
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
సెల్: +91 7660058907, Email: vishwamithra907@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 09.12.2024 ఎంపిక (D.O.A): 28.12.2024 ప్రచురణ (D.O.P): 01.01.2025
వ్యాససంగ్రహం:
‘దర్శించి, వర్ణించేవాడు’, ‘లోకోత్తరవర్ణన నిపుణుడైనవాడు’ కవి అని భట్టతౌత, మమ్మటులు నిర్వచించారు. ఈ కోణంలో రాజా కామినేని మల్లారెడ్డి (1550-1610) ప్రణీతమైన “షట్చక్రవర్తిచరిత్ర” ప్రబంధాన్ని పరిశీలించి, ఫలితాంశాలను ఈ పరిశోధనవ్యాసంగా క్రోడీకరించడమైనది. ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, మేడవరపు అనంతకుమారశర్మ, పి. వేణుగోపాల్ వంటి వారు ఈ ప్రబంధాన్ని పరిశోధించి అపూర్వవిశేషాలను సాహిత్యలోకానికి అందించారు. కవి ఈ ప్రబంధంలో ప్రదర్శించిన వర్ణనానైపుణ్యాన్ని చర్చించడం ఈ వ్యాసపరిమితి. మూలగ్రంథం (వ్యాఖ్యానసహితం), “దోమకొండ సంస్థానకవులు- వారి రచనలు” (సిద్ధాంతగ్రంథం), పత్రికావ్యాసాలు, అంతర్జాలవనరులు ఈ వ్యాసరచనకు ఉపయోగపడ్డాయి. ఆయా ఆకరాలలో పేర్కొన్న అష్టాదశవర్ణనలు, అప్పకవి చెప్పిన మరికొన్ని వర్ణనభేదాలను కలిపి మొత్తం 22 వర్ణనాంశాల దృష్టితో కొన్ని పద్యాలను ఎంపిక చేసి, ఈ ప్రబంధాన్ని పరిశీలించడమైనది. మల్లారెడ్డి ఆయా వర్ణనలలో ప్రదర్శించిన వైదుష్యాన్ని గుణాత్మక- పరిశోధనాపద్ధతిలో విశ్లేషించడమైనది. కవివర్ణన సామర్థ్యాన్ని, పాండిత్యాన్ని సోదాహరణంగా తెలుసుకోవడానికి ఈ వ్యాసం పరమప్రామాణ్యంగా నిలుస్తుంది.
Keywords: ప్రబంధం, అష్టాదశ వర్ణనలు, శృంగారం, ప్రతిభ, ప్రత్యేకత.
1. ప్రవేశిక:
క్రీ.శ. 1500 ప్రాంతం శ్రీకృష్ణదేవరాయలు విజయనగరసామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ప్రబంధాలు వెలువడ్డాయని సాహితీపిపాసులకు విదితమైన విషయం. అదే రీతిలో తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రబంధ రచనా ధోరణి కొనసాగుతూ వచ్చింది. అలా బిక్కనవోలు (దోమకొండ) సంస్థానంలో ఆ సంస్థానాధీశ్వరులచే అలాగే కవులచే ఈ ప్రబంధ రచన కొనసాగింది. అలా వచ్చిన ఒకానొక ప్రబంధమే దోమకొండ సంస్థాన పాలకుడైన కవి రాసిన “షట్చక్రవర్తి చరిత్ర”. దీనిని రాజా కామినేని మల్లారెడ్డి (1550-1610) 1580 ప్రాంతంలో రచించాడని 1926లో వెలువడిన మొదటి ముద్రిత ప్రతికి పీఠిక రాసిన పెద్దమందడి వెంకటకృష్ణ కవి పేర్కొన్నారు. ఈ ప్రబంధానికి అవతారిక లేకపోవడం ఒక ప్రత్యేకమైన విషయం. మల్లారెడ్డి ఈ షట్చక్రవర్తి చరిత్రయే కాకుండా శివధర్మోత్తరము, పద్మపురాణము అని మరోరెండు రచనలు కూడా చేశాడు. ఈ రెండు రచనల్లో పద్మపురాణము అనేది సంస్కృత పద్మపురాణములోని ఒక భాగాన్ని తెనిగించిన గ్రంథమని ఆరుద్ర గారు తమ సమగ్ర ఆంధ్ర సాహిత్యం రెండవ సంపుటిలో పేర్కొన్నారు.
‘1920లో దాసరి లక్ష్మణస్వామి నాయుడు గారు వెలువరించిన వర్ణనరత్నాకరం (4 భాగాలు)లో షట్చక్రవర్తి చరిత్రలోని పద్యాలను అత్యధికంగా తీసుకోవడాన్ని బట్టి వర్ణనల్లో ఈ ప్రబంధానికి ఉన్న ప్రత్యేకత అవగతం అవుతూ ఉంది.’ (మల్లారెడ్డి, కామినేని. బేతవోలు వారి వ్యాఖ్య. 2022; పు. XV).
ఇలాంటి ప్రత్యేకత కలిగిన ప్రబంధంలోని వర్ణనల పరిచయం పాఠకలోకానికి అందించే ప్రయత్నం ఈ వ్యాసం ప్రధాన లక్ష్యం.
2. పూర్వ పరిశోధనలు:
వ్యాససంగ్రహంలో పేర్కొన్నట్లుగా “దోమకొండ సంస్థాన కవులు వారి రచనలు” అనే పీహెచ్.డి సిద్ధాంత గ్రంథం మేడవరపు అనంతకుమారశర్మ గారిది, అలాగే “మల్లారెడ్డి కృతులు - పరిశీలన” అనే పీహెచ్.డి సిద్ధాంత గ్రంథం పి. వేణుగోపాల్ గారిది. ఈ రెండు మాత్రమే కవి మల్లారెడ్డికి సంబంధించిన పూర్వ పరిశోధనలు. ఈ రెంటిలో మొదటిది మాత్రమే ముద్రణ పొంది నాకు అందుబాటులో ఉన్న కారణాన దానినే ఈ పత్రరచనలో ద్వితీయ ఆకారంగా తీసుకోగలిగాను. అలాగే మయూఖ అంతర్జాల పత్రికలో గురిజాల రామశేషయ్యగారు “తెలంగాణ ప్రబంధాలు” పేర 5 ప్రబంధాలను ఎంపిక చేస్తే అందులో ఈ షట్చక్రవర్తి చరిత్రకు కూడా స్థానమిచ్చారు. ఈ ప్రబంధాన్ని నందవరం మృదులగారు సమీక్షించారు. ఆ సమీక్షావ్యాసాన్ని కూడా ఈ పత్ర రచన చేసే సందర్భంలో పరిశీలించాను.
3. షట్చక్రవర్తి చరిత్ర - పరిచయం:
హరిశ్చంద్రో నలో రాజా పురుకుత్సః పురూరవా
సగరో కార్తవీర్యశ్చ షడేతే చక్రవర్తినః (ప్రభాకరశాస్త్రి, వేటూరి. 2013, పు. 7)
అని హరిశ్చంద్రుడు నలుడు పురుకుత్సుడు పురూరవుడు సగరుడు కార్తవీరుడు అనేవారు ఆరుగురు చక్రవర్తులని పై శ్లోకసారం. షట్చచక్రవర్తిచరిత్ర అనే ప్రబంధం ఈ ఆరుగురు చక్రవర్తుల చరిత్రను తెలిపే గ్రంథం. శ్లోకంలో పేర్కొన్నట్లుగానే ప్రబంధంలో కూడా హరిశ్చంద్రుని చరిత్ర మొదటగా, ఆపై నలుడిది, పురుకుత్సుడిది, పురూరవుడిది, సగరుడిది, చివరగా కార్తవీర్యుని చరిత్రం రచించబడ్డాయి. ఈ ప్రబంధరచనకు మునుపే శ్రీనాథుడి శృంగారనైషధం, గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం, రామరాజభూషణుడి హరిశ్చంద్ర నలోపాఖ్యానం అలాగే రఘునాథరాయల నల చరిత్ర సాహితీ ప్రపంచంలోకి వచ్చేసాయి. ఇలా ప్రత్యేకంగా ఆయా చక్రవర్తుల చరిత్రలు వచ్చినా, మల్లారెడ్డి మాత్రం అన్నీ ఒక్కచోట సంగ్రహించాలని ఈ ప్రబంధ రచన చేసారు కాబోలు. ఈ ప్రబంధాన్ని గమనిస్తే, పైన పేర్కొన్న “సంగ్రహం” అనే పదం వ్యాసంలో నేను ఎందుకు వాడానో పాఠకులకు అర్థమవుతుంది.
‘ప్రత్యేకకావ్యాలుగా వచ్చిన చరిత్రలో ఎక్కువ వర్ణాలు ఉండటం వల్ల కథావేగం చెడుతుందేమోనని, మరీ కట్టె, కొట్టె, తెచ్చె అనే విధంగా ఉంటే అసలే పాఠకులను ఆకర్షించలేదని, ఈ రెండు విధాలకు మధ్యస్థంగా ఇలా ఆరుగురు రాజుల చరిత్రను సంగ్రహంగా చెప్పాలని అన్ని ఒక్కచోట చేర్చి ఈ కవి రచన కొనసాగించవచ్చు’ (అనంతకుమారశర్మ, మేడవరపు. 1989; పు. 211).
సామాన్యంగా ప్రబంధలక్షణాలలో అష్టాదశ వర్ణనలు, శృంగార రసాధిక్యం ఉంటాయని సాహితీ విజ్ఞులకు తెలిసిన విషయమే. అష్టాదశవర్ణనల గురించి నన్నెచోడుని కుమారసంభవంలో ఇలా ఉంది-
కం. వన జలకేళీ రవి శశి/ తనయోదయ మంత్ర గతి రత క్షితిప రణాం
బునిధి మధు ఋతు పురోద్వా/హ నగ విరహదూత్య వర్ణనాష్టాదశమున్. (కుమారసంభవం, 1ఆ. 44ప)
పైన చెప్పిన అష్టాదశవర్ణనలకు మరికొన్ని జతచేసి అప్పకవి మొత్తం 22 వర్ణనలు ప్రబంధంలో ఉండాలని పేర్కొన్నాడు (అప్పకవి, 2019. పు. 119). ఈ 22 వర్ణనాంశాలతో పాటుగా షట్చక్రవర్తి చరిత్ర ప్రబంధంలో నాకు ప్రత్యేకంగా అనిపించిన అంశాలను ఈ పత్రంలో విశ్లేషించే ప్రయత్నం చేసాను.
3. మల్లారెడ్డి - వర్ణనావైదుష్యం:
‘దర్శనా ద్వర్ణనాచ్చాథ రూఢాలోకే కవిశ్రుతిః’ అలాగే ‘లోకోత్తర వర్ణనానిపుణః కవి’ అనే ప్రాచీనుల నిర్వచనాలు మల్లారెడ్డి కవికి అన్వయించి పరిశీలిద్దాం.
ప్రబంధ లక్షణాల్లో అష్టాదశవర్ణనలు ప్రధానభాగం వహిస్తాయి అని పైన తెలుసుకున్నాం. ఈ ప్రబంధంలో గల అష్టాదశవర్ణనలలోని ప్రత్యేక వర్ణనలు, వర్ణనలలోని కవి ప్రతిభ ఇప్పుడు గమనిద్దాం.
3.1 పుర వర్ణన:
సీ. గోపురగోపుర గోపుర ప్రతిమంబు
కల్పద్రుకల్పద్రు గౌరవంబు
మానవమానవ మానవాధిశయంబు
మణిజాల మణిజాల మంజిమంబు
సారంగసారంగ సారంగ నయనంబు
సుమనోఙ్ఞ సుమనోబ్జ శోభితంబు
బహుధామ బహుధామ బహుధామ చిత్రంబు
ఘనసార ఘనసార గంధిలంబు
తే.గీ. భవ్యకాసార కాసార బంధురంబు
జవన సైంధవ సైంధవ సంకులంబు
బహుళ కేతనకేతనభస్థలంబు
నై విజృంభించె సిరి నయోధ్యాపురంబు. (1వ ఆ. 15ప)
అయోధ్యాపురంలో చాలా పెద్దవి, ఎత్తైన గోపురాలున్నాయి. దట్టమైన అడవిలా చెట్లున్నాయి. ఆ నగరంలోని ప్రజలందరూ సిరిసంపదలతో తులుతూగుతున్నారు. అయోధ్యలోని ఇళ్ళ కిటికీలకు మణులు గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఉన్నాయి అంటూ శోభాయమానంగా ఉన్న అయోధ్యాపురిని ఇలా ప్రౌఢపదబంధాలతో వర్ణించాడు కవి. ఈ పద్యం పైపై చూపుతో చదివితే ఒక్కొక్క పదాన్ని ఇన్నిసార్లు కవి ఎందుకు వాడాడు అని అనిపిస్తుంది. ఇటువంటి పద్యాలు వ్యాఖ్యానం లేకుండా చదవడం సామాన్య పాఠకులకు కష్టమైన పనే అని చెప్పవచ్చు. కానీ ఇలాంటి సందర్భాలలోనే కవి తన పాండిత్య ప్రదర్శనం చేయడం చాలామటుకు మనం గమనిస్తుంటాం.
ఆపై ప్రబంధసాహిత్యంలో నాయకవర్ణనం సాధారణంగా కనిపించేదే. అదీ ఆ నాయకునికి శివునితోనో, విష్ణుమూర్తితోనో అభేదం కల్పించి చెప్పడం అక్కడక్కడా గమనిస్తూ ఉంటాం. ఇక్కడ శ్లేష ద్వారా ఈ వర్ణన కొనసాగించాడు కవి.
3.2 నాయక వర్ణన:
సీ. గోరక్షణము సేయు శౌరియుండుటఁ జేసి
గోరక్షణము సేయుఁ గోర్కె మీఱె
బుధులఁ బ్రోచెడి చతుర్భుజుఁ డుండుటను జేసి
బుధులఁ బ్రోచుచునున్న బుద్ధి మించె
సత్యానురక్తుఁడౌ చక్రియుండుటఁ జేసి
సత్యానురక్తుఁడై చాల మెఱసె
బలభద్రయుతుఁడు శ్రీపతి యుండుటను జేసి
బలభద్రయుక్తుఁడై ప్రజ్ఞ హెచ్చె
తే.గీ. నొడలఁ బురుషోత్తముఁడు పూనియుంటఁ జేసి
తాను బురుషోత్తముఁ డనఁగ ధాత్రి వెలసె
భవ్య లక్ష్మీవిలాస విభ్రమము లలరఁ
జక్రధరమూర్తి పురుకుత్స చక్రవర్తి. (6వ ఆ. పూర్వభాగం. 45 ప)
ఇది పురుకుత్స చక్రవర్తిని గురించి చెప్పే పద్యం. ఈ పద్యంలో గోరక్షణ - భూరక్షణ, బుధులను బ్రోవడం - పండితులను బ్రోవడం, సత్యభామకు అనురక్తుడవడం - సత్యానికి అనురక్తుడవడం, బలరాముడితో కూడుకుని ఉండడం - బలము, భద్రతలతో కూడుకుని ఉండడం అనేవి పురుకుత్స చక్రవర్తికి విష్ణమూర్తి పూనుకొని ఉండడం కారణంగా ఆయన గుణాలన్నీ సంక్రమించాయని తాత్పర్యం.
సూర్యోదయ వేళ ఆకాశాన్ని గురించి వర్ణించే సందర్భంలో కవి మల్లారెడ్డి ఊహాశాలీనత కింది పద్యంలో గమనించవచ్చు.
3.3 సూర్యోదయ వర్ణన:
శా. ప్రాతఃకాలము నందుఁ బూర్వహరిదభ్రంబొప్పె సంరక్తజీ
మూతచ్ఛేదక వీటికారసమునై ముక్తప్రభాసాంద్ర తా
రాతాంత ప్రసవంబునై విరళచంద్రాంచత్పటీరాంశు సం
ఘాతంబై రజనీసుధాకరుల రంగత్కేళి తల్పం బనన్. (3వ ఆ. 72 ప.)
సూర్యుడు ఉదయించే వేళకు తూర్పు దిక్భాగమైన ఆకాశం కేళీతల్పంలా కనిపించిందట. అదీ రజనీ (నిశా కన్య - నాయిక), సుధాకరుల (చంద్రుడు - నాయకుడు) కేళీతల్పమట. కేళీతల్పమని ఊరికే అంటే సరిపోతుందా? దాని లక్షణాలు చెప్పాలి కదా. ఇదుగో ఇలా చెబుతున్నాడు కవి. ఉదయం సూర్యుడు వచ్చేవేళకి మబ్బులు ఎర్రబడతాయి కదా. అవేమో తాంబూల రసం పడిన మరకల్లా ఉన్నాయట. అప్పుడే తమ వెలుగుల్ని కోల్పోతున్న నక్షత్రాలు నలిగిన పువ్వుల్లా ఉన్నాయట. అంతకంతకూ తగ్గిపోతూ ఉన్న చంద్రుడి కాంతి ఆ నాయికానాయకుల శరీరం నుంచి విడిపోయిన గందపు పొడిలా ఉందట. ఇన్ని లక్షణాలు చెప్పాక అవును గదా, అది కేళీతల్పమే కదా అని మనం అనకుండా ఉంటామా.?
ప్రబంధాల్లో శృంగారరసానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. ఇలాంటిదే మరొక పద్యాన్ని చూద్దాం. సూర్యోదయ వేళను శృంగారంతో జోడించి ఎలా వర్ణించాడో అలాగే సూర్యాస్తమయాన్ని కూడా శృంగారసంలో మునకలాడేలా చేసిన పద్యం కింద గమనించవచ్చు.
3.4 సూర్యాస్తమయ వర్ణన:
తే.గీ. అపరదిగ్వారసతి రవి యనెడు విటుఁడు
రాగయుతుఁడైన నేకాంబరంబు చిక్క
నిర్వసునిఁ జేసి కడు రశ్మి పర్వ రాజు
వేగరాఁ దెల్సి తనయిల్లు వెళ్ళఁ ద్రోచె. (3వ ఆ. 41 ప)
పడమర దిక్కు అనే వారకాంత, రవి (సూర్యుడు) అనే విటుడు తనపై అనురాగం కలవాడై ఉండగా, తనకూ సూర్యునికి ఒకే అంబరం (వస్త్రం, ఆకాశం) ఉండేలాగ కాంతి విహీనుడిని చేసి, కడు రశ్మి అంటే మిక్కిలి తేజస్సు (వెన్నెల) వ్యాపిస్తుండగా రాజు (చంద్రుడు) వేగంగా అవతలి వైపు (తూర్పు) నుండి రావడం తెలుసుకుని తన ఇంటి నుండి విటుణ్ణి (సూర్యుడిని) వెళ్ళగొట్టింది. అంటే ఇలా పంపించేస్తేనే సూర్యాస్తమయం అయ్యిందేమో అని పాఠకుడికి అనిపించకమానదు.
ఈ పద్యం గమనిస్తూ ఉంటే “గాథాసప్తశతి”లోని గాథలను గుర్తుచేసే విధంగా ఉంది. ఇది మల్లారెడ్డి ప్రత్యేకత. ఇలాంటి ప్రత్యేకతలు ప్రబంధంలో చాలా వరకు చూడవచ్చు.
3.5 వేటమృగాల వర్ణన:
సీ. విలసిత మత్తేభవిక్రీడిత స్ఫూర్తి
మహిత ప్రపంచచామర నిరూఢి
విస్ఫుట శార్దూల విక్రీడిత ప్రౌఢి
తతభుజంగప్రయాత క్రమంబు
మానిత సింహరేఖానేక సంస్థితి
పటుతరహరిణీ ప్రభావసరణి
నిరుపమ విస్మయాకర శరభక్రీడ
రమణీయ వనమయూరప్రదీప్తి
తే.గీ. మఱియుఁ దక్కిన యుపజాతి మహిమ బెక్కు
చందముల మీఱి గణనకాశ్చర్య మొదవఁ
బ్రబల గురులఘు వర్ణ నిర్ణయము గాఁగ
సత్కవియుఁ బోలి నిర్మించి జగతినించె. (2వ ఆ. 38 ప)
ఈ పద్యం హరిశ్చంద్రుని రాజ్యంలో అనేక వేట జంతువులను విశ్వామిత్రుడు సృజించి వదిలే సందర్భంలోనిది. ఈ పద్యాన్ని పైపై దృష్టితో గమనిస్తే మత్తేభవిక్రీడితం, పంచచామరం, శార్దూలవిక్రీడితం, భుజంగప్రయాతం, సింహరేఖ, హరిణి, శరభ క్రీడ, వనమయూరం, ఉపజాతి, గణన, గురులఘువులు వంటి పదాలు ఛందశాస్త్రాన్ని గుర్తుచేసి, ఇదేమిటి? రాజ్యంలో పద్యాలుండడమేమిటి? అనే ప్రశ్న పాఠకుడికి సాధారణంగానే కలుగుతుంది.
ఈ పదాలను శ్లేషతో ఇలా సాధించవచ్చు. మత్తేభాలు (మదించిన ఏనుగులు), చమరీ మృగాలు, శార్దూలాలు (పులులు), సర్పాలు, సింహాలు, హరిణులు(జింకలు), శరభాలు, వనమయూరాలు ఇంకా అనేక జాతుల, ఉపజాతుల జంతువులను ఇలా ఎన్నో సృష్టించి ఆ రాజ్యంలో నింపేశాడట విశ్వామిత్రుడు.
ఇక్కడ చివరిపాదంలోని ‘సత్కవి’ అనే పదాన్ని అన్వయించుకోవాలి. కవి ఏవిధంగానైతే వివిధ ఛందస్సులతో తనజగత్తు (కావ్యజగత్తు) నింపివేస్తాడో అలా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని రాజ్యాన్ని పలుమృగాలతో నింపివేశాడని ఈ పద్యార్థం. ఇలా పద్యార్థం తెలుసుకోగానే పాఠకుని మనస్సు ఉవ్వెత్తున ఎగిసి వహ్వా! అనిపించకమానదు.
3.6 పర్వత వర్ణనం (వింధ్య పర్వతం):
సీ. సానుగ్రహస్థితి సంతసంబున మించి
ఘనగుహాశక్తి నిక్కముగఁ గాంచి
వనమాలికావైభవంబునఁ దనరారి
నిరుపమాహీన సన్నిధుల వెలసి
యక్షీణరుద్ర సమారూఢిఁ జెన్నొంది
నీలకంఠ స్ఫూర్తి నివ్వటిల్లి
యమల ఘన ప్రవాహశ్రీల శోభిల్లి
పుండరీకోల్లాసభూతిఁ దాల్చి
తే.గీ. ముని విధంబున - శూలి చొప్పునను శౌరి
ప్రతి - ధనదు మాడ్కి - శశి లీల - రజితశిఖరి
సరణి - వజ్రి తెఱంగున - తరణి కరణి
నలరె నభ మంటఁజాలి యయ్యచలమౌళి. (2ఆ. 83 ప)
ఇది హరిశ్చంద్రుడు వింధ్య పర్వతాన్ని చూడడానికి వెళ్ళిన సందర్భంలోనిది. ఈ సీస పద్యంలోని ఎనిమిది పాదాలు వింధ్యపర్వతపు సామాన్య అభిధేయార్థాన్ని సూచించినట్లుగా అనిపిస్తుంది. ఎలాగంటే వింధ్యపర్వత సానువులు (శిఖరాలు) చాలా ఎత్తైనవని, ఆ కొండ గుహలను కలిగి ఉందని, అడవుల గుంపులను కలిగి ఉందని, ఎన్నో పాములకు నివాసమైందని, ఎక్కువగా ఉండే అగ్నిని తనలో ఇముడ్చుకుందని, నీలకంఠాలు (నెమళ్ళు) ఉండే చోటని, నిర్మలమైన జలపాతాలతో శోభిల్లేదని, పులుల స్వైరవిహారం కలిగి ఉందని సామాన్యార్థం. అదీ తేటగీతి పద్యపాదాలను కలుపుకోకుండా చెప్పుకునేది. ఇప్పుడు ఇందులోని విశేషార్థాన్ని చూద్దాం. దీనికోసం సీస పద్యంలోని ప్రతిపాదానికి తేటగీతి పద్యంలోని ఒక్కొక్క ఉపమాన పదం క్రమంగా అన్వయిస్తే రసానందడోలోత్సవమే.
కరుణ, సంతోషం మిక్కిలి కలిగి ఒక మునిలాగా, ఘనుడైన గుహుడు (కుమారస్వామి) కలిగి శివుడి లాగా, వనమాలతో కూడుకున్న విష్ణుమూర్తి లాగా, సాటిలేని నిధులతో కుబేరునిలాగా, శివుడి శిరసున ఉండే చంద్రుడి లాగా, సాక్షాత్తు శివుడు ఉండే వెండికొండ లాగా తెల్లతామరలు వికసించడానికి శక్తినిచ్చే సూర్యునిలాగా ఆ వింధ్య పర్వతం ఆకాశాన్ని తాకేటట్టుగా విరాజిల్లింది అని విశేషార్థం.
3.7 రాజ్య వర్ణనం:
సీ. ప్రౌఢి సదాదేశ పద విభక్తు లెఱింగి
సంధి విగ్రహముల సరణిఁ దెలిసి
వివిధాగమాంగముల్ వేడ్కఁబ్రతిష్ఠించి
పరరూప వినిపాత భంగులరసి
యనురక్తి గుణవృద్ధు లలరంగఁ బోషించి
ప్రకృతి ప్రత్యయలీల బయలుపఱచి
ఘనసూత్ర వృత్తులు గణక సంజ్ఞలు నేర్చి
యవ్యయభవ్య వాక్యములు వలికి
తే.గీ. ప్రకృతి భావంబు పూర్వరూపమును గాంచి
యుర్వి యేలుచునుండునభ్యుదయ మహిమ
మానవేంద్రులలోననహీన రాజ
శబ్దవిస్ఫూర్తినా హరిశ్చంద్ర నృపతి. (1వ ఆ. 38 ప)
ఈ పద్యం హరిశ్చంద్రుని రాజ్యపాలన గురించి వర్ణించే సందర్భం.
ప్రౌఢి, ఆదేశం, పదం, విభక్తి, సంధి, విగ్రహం, ఆగమం, అంగం, పరరూపం, నిపాతం మొదలైన ఎన్నో వ్యాకరణ పారిభాషిక పదాలను ఉపయోగించి వాటికి ఉన్న శ్లేషార్ధాల ద్వారా ఇలా హరిశ్చంద్రుడి రాజ్యాపాలనను వర్ణించడం కేవలం మల్లారెడ్డి కవికే చెల్లిందకి చెప్పవచ్చు. ఇలాగే మరొకటి.
3.8 స్వయంవర వర్ణనం:
తే.గీ. ప్రథమ పురుషులఁ జేసె దిక్పతుల, నృపులఁ
జేరి మధ్యమ పురుషులఁ జేసె, నలుని
జేరి యుత్తమ పురుషునిఁ జేసె నతివ
వ్యాకరణ లీల నని మెచ్చి వాణి పలికె. (5వ ఆ. 31 ప)
ఈ పద్యం దమయంతి నలున్ని వరించే సందర్భంలోనిది. ఇందులో కూడా వ్యాకరణ పారిభాషికపదాలే. వ్యాకరణశాస్త్రంలో ప్రథమ పురుష అంటే చాలా దూరంగా ఉన్నవారు / ఉన్నది, మధ్యమ పురుష అంటే ఎదుటనే ఉన్నవారు / ఉన్నది, ఉత్తమ పురుష అంటే తామే అయి ఉన్నవారు / ఉన్నది. దీనికి క్రమంగా వారు, వీరు, మేము అనే సర్వనామాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా దమయంతి కూడా వ్యాకరణలీలను ఇంద్రాది దేవతలను దూరంగా, స్వయంవర రాజులను సమీపంగా, నలున్ని దగ్గరగా/తానే అయనట్లుగా (ఉత్తమంగా) జమకట్టిందని కవి భావం. ఇలాంటి వర్ణన కలిగిన పద్యాలు మల్లారెడ్డి ప్రతిభకు గొప్ప తార్కాణాలు.
3.9 వివాహ వర్ణనం:
కం. జనపతి భీమజ కంఠం
బున మంగళ సూత్ర మపుడు పొందుగఁ గట్టెన్
మనసిజుని గెల్చి తత్పుర
మున నిల్పెడు తోరణంబు మురువు దలిర్పన్. (5వ ఆ. 67 ప)
ఈ పద్యం నలుడు దమయంతి మెడలో మంగళసూత్రం కట్టే సందర్భంలోనిది. మొదటి రెండు పాదాలు చదివితే ఈ విషయం అర్థమైపోతుంది. అసలు విషయం కింది రెండుపాదాల్లో ఉంది. ఆ నలడు దమయంతి మెడలో తాళి కట్టడం ఎలా ఉందట? మన్మథుని రాజ్యాన్ని గెల్చి ఆ రాజ్యానికి కట్టే దిగ్విజయ తోరణంలాగ ఉందట. ఇలాంటి వర్ణనలున్న చోటే పాఠకుని మనస్సు ఎగిరి గంతులేస్తుంది.
4. ఉపసంహారం:
- ప్రబంధ లక్షణాలుగా విమర్శకులు పేర్కొన్న అష్టాదశవర్ణనలు, అప్పకవి జోడించిన మరికొన్ని వర్ణనలు ప్రబంధ రచనలో ఒకభాగం. అలాగే శృంగారం అంగి రసంగా ఉండడం కూడా ప్రబంధనిర్మాణంలో భాగమే. ప్రస్తుతపరిశోధనావ్యాసంలో మల్లారెడ్డి శ్లేషాద్యాలంకారాల చేత, శృంగార రసాధిక్యత కలిగిన పద్యరచనచేత, అష్టాదశవర్ణనలు, మరికొన్ని వర్ణనాంశాల వర్ణన సందర్భంలో తన వర్ణనావైదుష్యాన్ని ప్రదర్శించాడన్నది షట్చక్రవర్తి చరిత్ర అనే ప్రబంధం గమనిస్తే మనకు అర్థమౌతుంది.
- దాదాపు తెలుగు సాహిత్యంలోని ప్రబంధాలు పురవర్ణనతో మొదలవడం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా అలాగే. కానీ కొంచెం ప్రౌఢమైన రీతిలో అర్థభేదం గల పదాల పునరావృత్తితో హరిశ్చంద్రుని రాజ్యం వర్ణించబడింది.
- పురవర్ణన అయిన తర్వాత ఆ పురిని ఏలే నాయకుడుంటాడు కదా. ఆయనను, ఆయన గుణగణాలను వర్ణించాలి. దీనికి పురుకుత్స చక్రవర్తికి సంబంధించిన పద్యం పైన చూడవచ్చు. చక్రవర్తికి, విష్ణుమూర్తికి సమానత్వం ఉన్నట్లు వర్ణించిన పద్యం అది.
- ఇక సూర్యోదయ, సూర్యాస్తమయ వర్ణనలు అన్ని ప్రబంధాల్లో కనిపించే అంశాలే అయినా ఈ ప్రబంధంలో మాత్రం రెండు సమయాల్లో కూడా శృంగారరస సంబంధిగా చిత్రించడం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది.
- రాజ్య వర్ణన చేసే సమయంలో, స్వయంవర వర్ణన చేసే సమయంలో వ్యాకరణ పారిభాషిక పదాలుపయోగించి పద్యరచన కొనసాగించడం మల్లారెడ్డికే చెల్లింది.
5. ఉపయుక్తగ్రంథసూచి:
- అనంతకుమారశర్మ, మేడవరపు. 1989. దోమకొండ (బిక్కనవోలు) సంస్థానకవులు-వారి రచనలు. హితసాహితి. కామారెడ్డి.
- అప్పకవి, కాకునూరి. 2019. అప్పకవీయము. తెలంగాణ సాహిత్య అకాడమి. హైదరాబాదు. (8వ ముద్రణ).
- ఆరుద్ర. 2005. సమగ్ర ఆంధ్రసాహిత్యం (రెండవసంపుటి). తెలుగు అకాడమి. హైదరాబాద్.
- దుర్గయ్య, పల్లా. 2012. ప్రబంధవాఙ్మయవికాసము. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్.
- నాగయ్య, జి. 2021. తెలుగు సాహిత్య సమీక్ష (రెండుసంపుటాలు). నవ్యపరిశోధక ప్రచురణలు. హైదరాబాద్.
- నిత్యానందరావు, వెలుదండ. 2013. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన. రచయిత స్వీయ ప్రచురణలు. హైదరాబాద్.
- ప్రభాకర శాస్త్రి, వేటూరి. 2013. చాటుపద్య మణిమంజరి (రెండవ భాగము). తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుపతి.
- మల్లారెడ్డి, కామినేని. 2022. షట్చక్రవర్తి చరిత్ర (బేతవోలు వారి వ్యాఖ్యానం, రెండు భాగాలు). శ్రీరాఘవేంద్ర పబ్లికేషన్స్. విజయవాడ.
- మృదుల, నందవవరం. ప్రబంధవ్యాసాలు- షట్చక్రవర్తి చరిత్ర. మయూఖ అంతర్జాల పత్రిక. April 9, 2022.
- లక్ష్మణస్వామి, దాసరి. 2012. వర్ణన రత్నాకరం (పాఠక మిత్ర వ్యాఖ్య, మొదటి సంపుటం). ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.