AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. హిందూరాష్ట్రీయవాదం: స్త్రీల పాత్ర

డా. డి. సుజాత
అసిస్టెంట్ ప్రొఫెసర్, సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్,
టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్,
ముంబయి, మహారాష్ట్ర.
సెల్: +91 7718974329, Email: sdevarapalli05@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 05.12.2024 ఎంపిక (D.O.A): 30.12.2024 ప్రచురణ (D.O.P): 01.01.2025
వ్యాససంగ్రహం:
హిందుత్వం అనగా హిందూ రాష్ట్రీయ లేదా జాతీయవాదం. ఇది ఒక రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మికదృక్పథం. హిందుత్వం ముఖ్య ఉద్దేశం భారతదేశంలో హిందూప్రజల సమాజం, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించడం. స్వాతంత్య్రపోరాటసమయంలోనే హిందుత్వఉద్యమం మొదలైనప్పటికి ఈ ఉద్యమంలో స్త్రీల పాత్ర చెప్పుకోదగ్గ రీతిలో లేదు. ఈ ఉద్యమం చాలా వరకు కూడా పురుషాధిక్యంలోనే నడుస్తూ వచ్చింది. అయితే ఇందులో గత రెండుదశాబ్దాలుగా స్త్రీల ప్రాతినిధ్యం క్రమేణ పెరగడంతోపాటు పురుషులతో సమానంగా పాల్గొనడం మనం గమనించవచ్చు. ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం హిందూత్వం అంటే ఏమిటి? హిందూయిజంకి హిందూత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటి? అనేవి వివరిస్తూ , హిందూత్వఉద్యమంలో స్త్రీల ప్రాతినిధ్యం పెరుగుతున్న క్రమాన్ని విశదీకరించే ప్రయత్నం. ఈ అంశం పై పరిశోధన చేసిన వారిలో ప్రముఖ సామాజికవేత్తలు, చరిత్రకారులు ముఖ్యంగా కళ్యాణి మీనన్, ఉమాచక్రవర్తి, స్వాతి దహరోడాయి, లక్ష్మి కేల్కర్ లాంటి వారున్నారు\. వీరి రచనలు పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు, మతం మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని వివరించడమే కాక స్త్రీమూర్తిత్వం హిందూ జాతీయవాదానికి చిహ్నంగా ఎలా మలచబడిందో కూడా విస్తృతంగా చర్చించాయి. తెలుగులో ఈ అంశంపై పరిశోధనాత్మక రచనలు అంతగా రాలేదు. ప్రస్తుతరచన చారిత్రక గ్రంథాలు, వాడుకలో ఉన్న చారిత్రకకథలు-గాధలు, వార్తాపత్రికల సమాచారం, కొన్ని సోషల్ మీడియా చర్చల పై ఆధారపడి రూపుదిద్దుకుంది. చారిత్రక అంశాలతో మొదలు పెట్టి ప్రస్తుతపరిస్థితులను విమర్శనాత్మక విశ్లేషిస్తూ ఈ వ్యాసం ముగుస్తుంది. ఈ వ్యాసంలో స్త్రీవాదదృక్కోణం ప్రధానంగా కులం, మతం, స్త్రీల మధ్య ఉన్న పటిష్టమైన బంధాన్ని వివరించడం, ఆ బంధం మహిళా సాధికారతకు ఎలా తోడ్పడగలదో విశ్లేషించడమైనది.
Keywords: హిందుత్వం, హిందూయిజం, స్త్రీ ప్రాతినిధ్యం, కులం, మతం, స్త్రీవాదం
1. ఉపోద్ఘాతం:
హిందూజాతి పరిరక్షణే ధ్యేయంగా 1920ల్లో మొదలైన హిందూ రాష్ట్రీయ ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించిన సంస్థలు విశ్వహిందూపరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, కరసేవక్, మరియు భజరంగ్ దళ్. హిందూ వ్యతిరేక శక్తుల నుండి హిందూ సంస్కృతిని కాపాడడం, హిందూ జాతి కీర్తి దశదిశలా వ్యాప్తి చేయడం, హిందూ దేశాన్ని నిర్మించడం వీటి ముఖ్య లక్ష్యం. వీటిలో పారా మిలిటరీ సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ పాత్ర చాలా ముఖ్యమైనది. హిందూ రాష్ట్ర పునర్నిర్మాణం లో భాగంగా దేశ చరిత్ర ని పునర్ నిర్వచించడం, సంస్కృతి సంప్రదాయాలకు ప్రచారం కల్పించడం, హిందూ పండుగలు పెద్ద ఎత్తున జరుపుకోవడంతో పాటు ఈ సంస్థ యొక్క మరొక ముఖ్య లక్ష్యం హిందూ స్త్రీలను బయటి వ్యక్తుల నుండి కాపాడడం! హిందూ స్త్రీలను అప్రమత్తం చేయడానికి వారికోసం ప్రత్యేక సభలు సమావేశాలు నిర్వహిస్తూ, చరిత్ర లో ప్రముఖ మైన హిందూస్త్రీల గురించి వారి సాహసాలను గురించి కథలు గాధలు ప్రచురించడం తో పాటు, స్త్రీల కోసం రాష్ట్రీయ సేవిక సంస్థ ని ప్రారంభించి ఈ ఉప సంస్థ ద్వారా స్త్రీలను హిందూత్వ ఉద్యమం లో భాగం చేసింది.
అయితే చాలా కాలం వరకు కూడా హిందుత్వ ఉద్యమం పురుషుల ఆధ్వర్యం లో నే కొనసాగింది. బాబ్రీ మజిద్ లాంటి సంఘటనల్లో సాద్వి రితంభర లాంటి కొద్దిమంది మహిళలే మగవారితో పాటు సమానంగా పాల్గొన్నారు. ఆర్.ఎస్.ఎస్.తో సంబంధాలు కలిగిన కుటుంబాల నుండి మాత్రమే స్త్రీలుఎక్కువగా ఈ ఉద్యమం లో పాల్గొనేవారు. అయితే, ఇప్పుడు ఆర్ ఎస్ ఎస్ తో ఎలాంటి సంబంధం లేక పోయినప్పటికీ హిందుత్వ ఉద్యమంలో పెద్ద సంఖ్యలో స్త్రీలు భాగస్వాములు అవుతున్నారు. అసలు సనాతన ధర్మం అంటే ఏమిటో కనీస అవగాహన లేనప్పటికీ, సావర్కర్, విష్ణుశర్మ లాంటి హిందుత్వవాదుల పేరుకూడా తమజీవితంలో ఎప్పుడూ వినని వాళ్ళు (ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లొ) ఈరోజు సోషల్ మీడియా లో హిందూ పద్ధతులు, కట్టుబాట్లు గురించి ఉపన్యాసాలుఇస్తూ హిందూ ధర్మప్రచారం చేస్తున్నారు. ఇలా, సహనం, సౌమ్యత కు మారుపేరుగా కీర్తించబడే సాంప్రదాయ హిందూ స్త్రీలు తమ లక్ష్యం సాధించడం కొరకు ఎంతకైనా సిద్ధపడే, అతివాద హిందూత్వ ఉద్యమంలో భాగం కావడం వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
2. హిందూయిజం పై పూర్వ అధ్యనాలు :
“హిందుత్వ”, “హిందూయిజం”ని వి డి సావర్కర్ ఇలా నిర్వచించాడు-
”హిందుత్వ అంటే అది ఒక నినాదం మాత్రమే కాదు హిందుత్వ అంటే చరిత్ర. హిందూయిజం అంటే భావజాలం. హిందూయిజం అనే భావజాలం హిందూ చరిత్ర లో ఒక భాగం మాత్రమే. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని అర్థం చేసుకోకపోవడం వల్ల హిందూజాతికి జరిగిన నష్టాన్ని గ్రహించి హిందుత్వవాదాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది”. కానీ దురదృష్టవశాత్తు మత ప్రాతిపదిక పై నిర్మించబడిన హిందూయిజం ప్రాముఖ్యత సంపాదించుకున్నట్టుగా, భిన్న కోణాలు కలిగిన హిందూ జాతి మొత్తాన్ని అక్కున చేర్చుకోవాలనుకునే హిందుత్వ వాదం సామాన్య జనం కి చేరలేకపోయింది (వి. డి సావర్కర్ - 1920).
ఎప్పటికైనా ఒకే జాతి, ఒకే సంస్కృతి, ఒకే దేశం ను నిర్మించాలన్న సావర్కర్, తిలక్, విష్ణుశర్మ, లాంటి హిందుత్వ వాదుల లక్ష్యం తో మొదలైన ఈ ఉద్యమం కి అనుసంధానం గా ఏర్పడిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చాక మరింత శక్తివంతం గా ముందుకు వెళుతుంది .
3. భూమి, స్త్రీలు, మతం :
భూమి, స్త్రీలు, మతం ఈ మూడింటిని కాపాడుకోవడం హిందూ సామజిక నిర్మాణ ప్రధాన సూత్రం. ఎందుకంటే ఈ మూడింటి మధ్య వ్యవస్థాగతమైన సంబంధం ఉండటమే. ఈ సంబంధం పటిష్టంగా ఉండాలంటే స్త్రీల లైంగికత్వంపై నియంత్రణ లేనిదే ఇది సాధ్యం కాదు. మను ధర్మ శాస్త్రం వర్ణసంకరణను తీవ్రంగా వ్యతిరేకించదమే కాక కుల వ్యవస్థ పవిత్రతను కాపాడాలంటే స్త్రీ పురుషులిద్దరూ ఒకే కులానికి చెందిన వారై ఉండాలి అని తీర్మానించింది. అప్పుడే వారికి పుట్టిన పిల్లలు శ్రేష్టులవుతారు (ఉమాచక్రవర్తి - 2017.) అగ్ర కులాల పరువు మర్యాద కాపాడవలిసిన బాధ్యత వారి స్త్రీలపైనే ఉంటుంది కాబట్టి వారిని కట్టడి చేస్తూ, స్త్రీ శరీర ధర్మాలకు అపవిత్రతను అంటగట్టి యజ్ఞయాగాదులకు దూరం పెట్టడంతో పాటు విద్యను కూడా దరి చేరనీయలేదు. అందువల్లనే స్వజాతి వివాహ పద్ధతి 'పవిత్ర' కుల వ్యవస్థకు ప్రాతిపదిక అయింది. ఈ పవిత్రతను కాపాడడానికి బాల్య వివాహాలను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహం నిషేధించడం, సతి సహగమనం మొదలైన అనేక ఆచారాలు అమల్లోకి తెచ్చి, కుల మరియు పితృస్వామ్య వ్యవస్థలు సమాజాన్ని శాసించాయి అని ఉమాచక్రవర్తి తన స్త్రీవాద దృక్కోణం లో కులం మరియు జెండర్ అనే గ్రంధం లో వివరిస్తారు.
హిందూ సమాజంలో స్త్రీల అణచివేత కి ముఖ్య కారణం కుల మరియు పితృస్వామ్య వ్యవస్థ అని చరిత్రకారులు, సామాజికవేత్తలు, సంఘ సంస్కరణ వాదులు తమ పరిశోధనాత్మకగ్రంధాలు ద్వారా నిరూపించారు అలాగే సంఘ-సంస్కరణవాదులు 19వ శతాబ్దంలో హిందూసమాజంలో వేళ్ళూనికొనిపోయిన సాంఘిక దురాచారాలను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా హిందూ మతాన్ని అడ్డుపెట్టుకుని స్త్రీలు మరియు కింది కులాల పై జరుగుతున్న , లింగ వివక్ష, మరియు కుల వ్యవస్థ కు కు వ్యతిరేకంగా పోరాడారు. స్వతంత్రం వచ్చిన తరువాత సమాజంలో అందరూ సమానమే అన్న ఆధునిక భావాలను చట్టబద్ధం చేస్తూ అందరికీ విద్య ఉపాధి మరియు ఇతర రంగాలలో సమాన హక్కులును రాజ్యాంగం కుల, మత లింగభేదం లేకుండా అందరికీ ప్రసాదించింది.
ఆధునిక విద్య స్త్రీలకూ అందుబాటులోకి రావడం, ఆధునిక భావాలు తీసుకువచ్చిన చైతన్యం తో సనాతన ఆచారాలను, తమపై జరుగుతున్న అణచివేతను స్త్రీలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. రాజ్యాంగబద్ధంగా తమకు వచ్చిన హక్కులు వారిలో మరింత ధైర్యాన్ని ఇచ్చాయి. ఈ రోజు అన్ని రంగాల్లో ను స్టీలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. అయినప్పటికీ మన సమాజం లో వేళ్లూనికుని పోయిన పితృస్వామ్య ధోరణి లో మాత్రం పెద్దగా మార్పు రాలేదు.
సతి సహగమనఁ లాంటి ఆచారాలు ఇప్పుడు చాలావరకు తగ్గినప్పటికీ స్త్రీల పై మానసిక మరియు శారీరక హింస విపరీతంగా పెరిగింది. సమాజం లోని మార్పులకు అనుగుణంగా పితృస్వామ్య వ్యవస్థ తనరూపాన్ని మార్చుకుంటూ వివిధ పద్ధతుల్లో స్త్రీలపై అణచివేతకు పాల్పడుతుంది. వారి శ్రమను దోపిడీ చేస్తూ తమకు విధేయులు కానీ వారిని విపరీతమైన హింసకు గురిచేస్తుంది. అయితే స్త్రీలపై జరుగుతున్న హింసకు ముఖ్య కారణమైన పితృస్వామ్య వ్యవస్థ మూలాలలకు వెళ్లకుండా ఇది కేవలం హిందూ స్త్రీల పై ఇతర మతాలకు చెందిన పురుషులు చేస్తున్న హింసగా హిందుత్వ వాదులు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. ఇందుకు సాక్ష్యంగా చరిత్ర లో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారం చేసుకుని సాహస హిందూ స్త్రీ మూర్తుల కధలను తెరపైకి తీసుకువచ్చి వారి కధల ద్వారా ఇప్పటి స్త్రీలకు జ్ఞానబోధ చేయడం మొదలు పెట్టారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవలసింది మాత జీజాభాయి, ఒక వీరమాత కథ.
4. వీరమాత జీజాభాయి :
17వ శతాబ్దపు రాజైన ఛత్రపతి శివాజీ మాతృమూర్తి జీజాభాయి. హిందూ రాజ్య స్థాపన యొక్క ఆవశ్యకతను శివాజీ గుర్తించడం లో ఆమె చాలా కీలక పాత్ర పోషించింది. అందువల్లనే జీజాభాయి అంటే హిందుత్వ వాదులకు మిక్కిలి గౌరవం. వారి ట్రైనింగ్ క్యాంపుల్లో అభ్యర్థుల్లో గుండె నిండా హిందూ భావన ను రగిలించడానికి ఎంతో ఉత్తేజకరమైన మాత జీజాభాయి కథను తప్పనిసరిగా వినిపిస్తారు. శివాజీ లాంటి గొప్పవీరుడికి జన్మనిచ్చి అతని లో వీరత్వాన్ని తట్టిలేపిన మాతృమూర్తి జీజాభాయి గొప్ప ఆదర్శవంతమైన మహిళ. ఆమె దూరదృష్టి కలిగిన మహిళ.మొఘల్ చక్రవర్తులు హిందూ దేవాలయాలపై, హిందూ స్త్రీల పై జరుగుతున్న అకృత్యాలను తన చిన్నప్పటి నుంచి చూసిన జీజాభాయి ఎప్పటికైనా హిందూ రాజ్య స్థాపన జరుగుతుందని అప్పుడే ఈ అకృత్యాలు అంతమవుతాయని నమ్మి తన కుమారుడికి బాల్యం నుండి హిందూ పురాణాలూ, ధర్మశాస్త్రాలు చిన్ని చిన్ని కధలుగా చెబుతూ హిందూభావాలును శివాజీ చిన్నప్పుడే తన మనసులో నాటి, హిందువులు పిరికిగా ఉండబట్టే విదేశీయులు తమ భూమిని ఆక్రమించి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని, హిందూ పురుషులు తమ వీరత్వం చూపించి విదేశీయుల అంతు చూడాలని ఆమె శివాజీ ని కోరుతుంది. తల్లి కోరికను తీర్చడమే ధ్యేయంగా మరాఠా సామ్రాజ్యం స్థాపించి బ్రాహ్మణులను, గోవులను, స్త్రీలను రక్షించినవాడిగా శివాజీ పేరు పొందాడు. ఆవిధంగా జీజాభాయి ఒక ఆదర్శ మాతృత్వానికి ఉదాహరణగా ఇప్పటికీ కీర్తించబడుతుంది (మీనన్ -2005)
జీజాభాయిలానే హిందూ స్త్రీలు తమ పిల్లలకు చిన్నప్పటినుండి హిందూ ధర్మాన్ని, నీతిని ఆచారాలను నేర్పించి వారిని మంచి పౌరులుగా తీర్చి దిద్దాలని, అది హిందూ స్త్రీల ధర్మమనీ హిందుత్వ సంఘాలు తమ దగ్గరకు శిక్షణకు వచ్చిన స్త్రీలకు నేర్పిస్తాయి. పిల్లలను పెంచడం, హిందూ ధర్మాన్ని రక్షించడం రెండు ఒకేసారి జరగాలంటే స్త్రీలు చాల బాధ్యత గా ఈ కర్తవ్యాన్ని నిర్వహించాలని తమ హిందుత్వ ఎజెండా అమలుపరిచే క్రమంలో స్త్రీలను వారి మాతృత్వాన్ని పరిధుల మేరకు వాడుకోవడం జరుగుతుంది.
విశ్వహిందూపరిషత్ కి అనుబంధసంస్థలయిన దుర్గవాహిని, భజరంగ్ దళ్ తమ అభ్యర్థులకు నిర్వహించే క్యాంపులు కేవలం హిందూధర్మాన్ని వ్యాప్తి చేయడానికే కాకుండా క్యాంపుల్లో పాల్గొనేవారికి శారీరక శిక్షణ కూడా ఇస్తారు. హిందూ సమాజాన్ని పునర్నిర్మించి హిందూ రాజ్యాన్ని స్థాపించేందుకు ఈ సంస్థలు ముఖ్యంగా మూడు సూత్రాలు బోధిస్తాయి అవి సేవ, స్వయం రక్షణ, సంస్కారం. ఎందుకంటే స్త్రీలు శారీరకంగా బలంగా ఉండడం చాలా అవసరమని వారు శారీరకంగా బలంగా ఉన్నప్పుడే వారిపై జరిగే లైంగిక, ఇతర దాడులను ఆపడం సాధ్యమవుతుందని దుర్గవాహిని సంస్థ ను స్థాపించిన లక్ష్మి కేల్కర్ అభిప్రాయం.
ఈ క్యాంపులకు వచ్చే స్త్రీలు చాల వరకు మధ్య తరగతి ఆ పై తరగతి కి చెందిన అగ్ర కులాల వారు. వారి దైనందిన జీవితం లో ఎదుర్కొనే సమస్యలు అయిన గృహ హింస, వరకట్నం మరణాలు, ఆఫీసులకు కాలేజీలకు వచ్చే వెళ్ళేదారిలో వారికి ఎదురయ్యే ఇబ్బందులు, పనిచేసే ప్రదేశాలలో లింగవివక్ష లాంటి వాటి నుండి తమను తాము రక్షించుకోవాలనుకునే వారు ఎక్కువగా ఈ క్యాంపులకు ఆకర్షితులవుతున్నారు. శారీరక దృఢత్వం తో పాటు ఆత్మ విశ్వాసాన్ని ఈ శాఖల ద్వారా పొందడం ఇక్కడి ప్రత్యేకత.
అలాగే శాఖ యొక్క రెండవ సూత్రం సేవ. సమాజంలో లింగ వివక్ష పై పోరాడడానికి ఈ స్త్రీలు స్త్రీవాద ఉద్యమం కంటే సాంస్కృతిక ఉద్యమాల ని ఎంచుకోవడం గమనార్హం. మన సమాజం లో అగ్రకుల “ఆదర్శ” మహిళలు ప్రజలలోకి వెళ్ళడానికి ఎంచుకునే మార్గం ‘సేవ’. వీరి సేవ గుళ్ళు గోపురాల్లో అన్నదానం, పండుగలప్పుడు అనాధాశ్రమాలు కు, వృద్ధాశ్రమాలకు వెళ్లి వారికి పళ్ళు, పూలు పంచడం.
ఇక మూడవది సంస్కారం. కట్టు బొట్టు విషయంలో చాలా సంస్కార యుతంగా కనిపిస్తూ టీవీ ల్లో ను యు ట్యూబ్ ఛానెల్స్ లోను సంప్రదాయాల గురించి,హిందూ ఆచార వ్యవహారాల గురించి వివరిస్తూ, పాశ్చాత్య ధోరణుల వల్ల యువత, స్త్రీలు ఎంతగా పాడై పోతున్నారో వివరిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఈ స్త్రీల కున్న ముఖ్య లక్షణం వారి వాగ్ధాటి, కెమెరాల ముందు అభినయిస్తూ, భావావేశాలు ముఖంలో ప్రస్ఫుటంగా కనపడేలా జాగ్రత్తలు తీసుకుంటూ వారు చెప్పే ఏ విషయం అయినా సత్యాసత్యాలతో సంబంధం లేకుండా విపరీతమైన ఆత్మ విశ్వాసంతో మాట్లాడటం. అయితే తాము ఎంత అంకితభావంతో పనిచేసినప్పటికీ రాజకీయంగా లబ్ది పొందేది, పురుషులు మాత్రమే.
ముఖ్యమైన పదవులు అన్నిటిలోను పురుషులే ఉండడం, స్త్రీ సేవికలకు నామ మాత్రపు గుర్తింపు కూడా దక్కడం లేదన్న అసంతృప్తి ఈ స్త్రీల కు ఉంది. అలాగే ఒక పక్క సనాతన ధర్మం ని పొగుడుతూ స్త్రీ సాధికారత సాధించాలని కోరుకోవడం, ఆధునికత కు సనాతన ఆచారాలకు మధ్య సరికొత్త వారధిని నిర్మించాలనుకోవడం ఎలా సాధ్యమవుతుంది. ఏదైనా భావజాలాన్ని మనం నమ్మి ప్రచారం చేస్తున్నప్పుడు దానిపై కనీస అవగాహన ఉండడం,దీర్ఘ కాలం లో దానివల్ల మనకు జరిగే ప్రయోజనం ఏమిటి అనే ఆలోచన ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఎంతో గొప్ప గొప్ప విప్లవాత్మక ఉద్యమాలు కూడా స్త్రీల విషయం వచ్చేసరికి “ముందు విప్లవం రానీయండి” “మీ సంగతి తరువాత చూద్దాం” అని తప్పించుకున్నవే. అంతెందుకు నిన్న మొన్న జరిగిన రాష్ట్ర విభజన ఉద్యమంలో తమ రచనలతో, ఉపన్యాసాలతో పాటు, ఆటపాటలతో ప్రముఖ పాత్ర వహించిన తెలంగాణా స్త్రీలకూ విభజన తరువాత ఏర్పడిన ప్రభుత్వం ఏపాటి ప్రాముఖ్యతను ఇచ్చిందో అందరం చూశాం. అందువల్లనే, ఏ ఉద్యమమైనా వాటి ఫలితం తమపై ఎలా ఉండబోతుంది, తమ ప్రత్యేక ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయి, ఉద్యమం యొక్క ఎజెండా ఏమిటి? అందులో తమ భాగస్వామ్యం ఎంత వరకు ఉండబోతుంది? ఏ ఉద్యమం లో ఉన్నప్పటికీ స్త్రీ, ఇతర అణగారిన వర్గాల ప్రయోజనాలకు ఆ ఉద్యమం ఎంత మేలు చేయగలదు అని ఆలోచించుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.
తమ బృహత్ ప్రయోజనాలకోసం ఇప్పుడు హిందుత్వ ఉద్యమం స్త్రీలను, ఇతర అణగారిన వర్గాలను కలుపుకునిపోవడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి, మహిళా సేవికలు తమ పీకు ఒనగూరే ప్రయోజనాలపై స్పష్టతను ఇవ్వాలని ఉద్యమ నాయకులను డిమాండ్ చేయాలి. వారిచ్చే హామీలను బట్టి ఎన్నో సంస్కరణ ఉద్యమాల ఫలితంగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి నుండి ఇంకా ముందుకు వెళ్లడమా లేక వెనుకకు పోవడమా అనేది నిర్ణయించుకోవలసిన బాధ్యత కచ్చితంగా స్త్రీలదే.
4. ఉపసంహారం:
- తమ ఉద్యమం పటిష్టం కావాలంటే అణగారిన వర్గాలు, స్త్రీల సహకారం ఎంత అవసరమో హిందుత్వ సంస్థలు గుర్తించినప్పటికీ వారికి ఇచ్చే ప్రత్యేక హామీలు పై గాని దీర్ఘకాలంలో ఈ వర్గాలకు ఒనగూడే ప్రయోజనాలపై కానీ, ముఖ్యంగా స్త్రీసాధికారత పై ఇంతవరకు స్పష్టమైన చర్చ జరగలేదు.
- ఈ సంస్థలతో కలిసి తాము ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ తమకు సరైన గుర్తింపు రాకపోవడం, రాజకీయ ప్రయోజనాలు అందకపోవడం, కీలకపదవులు పూరించడంలో పురుషుల ఆధిక్యం కొనసాగడంతో అనేకమంది మహిళాసేవికలు అసంతృప్తి చెందుతున్నారు.
- మహిళా సాధికారత గురించి పార్టీలకు, సంస్థలకు, కులాలకు, వర్గాలకు అతీతంగా అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవాళ్లే గాని అందులో నిజాయితీ గా మహిళల సాధికారతకు తమ సహకారాన్ని అందించేవాళ్ళు చాలా తక్కువ.
- ముఖ్యంగా ఒక పక్క సనాతన వాదాన్ని ప్రచారం చేస్తూ మరో వైపు స్త్రీ సాధికారత కొరకు ఏ విధంగా కృషి చేస్తారో అతివాద సంస్థలు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
5. సూచికలు:
- చక్రవర్తి ఉమా (2017): స్త్రీవాద దృక్కోణం లో జెండర్ మరియు కులం, భత్కల్ అండ్ సన్స్, న్యూ ఢిల్లీ పుట 3
- సావర్కర్ వి డి (1920): “ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందూత్వ “, పుట. 1
- కళ్యాణి మీనన్ (2005): “వుయ్ విల్ బికమ్ జీజాభాయి” : హిస్టారికల్ టేల్స్ ఆఫ్ నేషనలిస్ట్ వుమన్, జర్నల్ ఆఫ్ ఆసియన్ స్టడీస్ పుట. 5
6. ఉపయుక్తగ్రంథసూచి:
- అమ్రిత బసు. (2024) : ది పాపులిస్ట్ రివోల్ట్ ఫ్రం ది మార్జిన్స్ : ఏ కేస్ అఫ్ ఉమా భారతి, క్రిటికల్ ఆసియన్ స్టడీస్ (ఆన్లైన్)
- కళ్యాణి మీనన్. (2005): “వుయ్ విల్ బికమ్ జీజాభాయి”: హిస్టారికల్ టేల్స్ ఆఫ్ నేషనలిస్ట్ వుమన్, జర్నల్ ఆఫ్ ఆసియన్ స్టడీస్
- చక్రవర్తి ఉమా. (2017): స్త్రీవాద దృక్కోణంలో జెండర్ మరియు కులం, భత్కల్ అండ్ సన్స్, న్యూ ఢిల్లీ
- లీల దూబే. (2009): విమెన్ అండ్ కిన్ షిప్, రావత్ పబ్లికేషన్స్, న్యూ ఢిల్లీ
- శ్రీనివాస్ ఎం.ఎన్. (1996): కాస్ట్ ఇట్స్ ట్వంటీ యత్ సెంచరీ అవతార్, న్యూ ఢిల్లీ
- సానియా దింగ్ర. (2023): నేషనలిస్ట్ విమెన్ లీడర్స్, న్యూ లైన్స్ మేగజైన్, (ఆన్లైన్)
- సావర్కర్, వి. డి. (1920): “ఎస్సెన్షియల్స్ ఆఫ్ హిందూత్వ”. అభిషేక్ పబ్లికేషన్స్.
- స్వాతి, డి. (2009) : ఎక్సప్లోరింగ్ జెండర్, హిందుత్వ, జెండర్, ఈ.పి.డబ్ల్యూ, ముంబై
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.