AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. బెల్లంకొండ లక్ష్మణసూరి ‘వాసంతసమీరం’ పద్యకవిత్వం: పరిశీలన

డా. పులవర్తి పైడిరాజు
తెలుగు ఉపన్యాసకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వి.మాడుగుల,
అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 7981225466, Email: psrpstu@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 13.12.2024 ఎంపిక (D.O.A): 28.12.2024 ప్రచురణ (D.O.P): 01.01.2025
వ్యాససంగ్రహం:
అపారమైన తెలివి, భాషా జ్ఞానము కవులకు, రచయితలకు గీటురాయి. అవి బయల్పడాలంటే పద్యరచనే కొలమానం. పద్య సాహిత్య ప్రక్రియను ఎంచుకుని కావ్యాలను సృష్టించిన ఆధునిక కవులలో బెల్లంకొండ లక్ష్మణసూరిని ఒకరు. పద్యాలను సరళతరం చేసి రాయడంలో దిట్ట అయిన సూరి మూడు పద్యకావ్యాలను, రెండు శతకాలను రాశారు. అందులో వాసంత సమీరం అనే పద్యకావ్యం భావకవితాఛాయలను కలిగిఉంది. ఈ కావ్యంలో వస్తువు భావుకత. ఇందులోని భావకవిత్వాన్ని, రచయిత భావుకతని పరిశీలించడమే ఈ వ్యాస మఖ్యోద్దేశం. వాసంత సమీరం, ప్రభంజనం, ప్రణయ కవిత్వం, ఊహాసుందరి, వాస్తవాతీత భ్రమ, ఆర్థిక అసమానతలు, సాంప్రదాయకత మొదలైన భాగాలుగా విశ్లేషణాత్మకపద్ధతిలో ఈ పరిశోధన వ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: వాసంతసమీరం, ప్రభంజనం, ప్రణయ కవిత్వం, ఊహాసుందరి, వాస్తవాతీత భ్రమ, ఆర్థిక అసమానతలు, సాంప్రదాయకత.
1.ఉపోద్ఘాతం:
ఆధునిక కాలంలో ఆంధ్ర సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు కదం తొక్కుతున్నాయి. ఎన్ని వ్యతిరేక పరిస్థితులున్నా పద్య కవిత్వం కొంత మార్పుతో తన ఉనికిని చాటుకొంటూనే ఉంది. వైవిధ్యభరితంగా గ్రాంథికం నుండి వ్యవహారిక, జానపద భాషలను కూడా ఉపయోగిస్తూ రాయడం విశేషం. పూర్వం ఒక మూసలో సాగిన విధానం కట్టలు తెంచుకొని రూపు మార్చింది. అవధాన పద్యాలు, సమస్యాపూరణ పద్యాలు సమకాలీన అంశాలపై వస్తువైవిధ్యంతో చెప్పబడుతున్నాయి. పద్యకావ్యాలు పద్యం, గేయం, కవితగా రూపాంతరం చెందాయి. నవీనతల నడుమ వచనంతో పోటీపడి భావపుష్టితో అందరికీ అర్ధమయ్యే రీతిని సంతరించుకున్నాయి. చైతన్యం, ప్రణయం, విప్లవం, ఆధ్యాత్మికత, సుఖదుఃఖాలు, మానవత, చైతన్యం వంటివి మరెన్నో పద్య కవితల వస్తువులై చర్చించే అవకాశాలనిచ్చే లోతుదనంతో రాయబడటం ప్రశంసనీయం. సాహిత్యం గురించి ‘ఏ తరంలోని సాహిత్యమైనా, తన కాలపు ఆలోచనా స్వభావాదులను ప్రతిబింబిస్తుంది. ఇది ఒక యుగం, వెనుకటి యుగపు సాహిత్య ప్రమాణాలను గుడ్డిగా అనుసరించదు. అది వర్తమాన కాలం నుంచి ఆవేశాన్ని పొందుతుంది. విషయ స్వీకరణంలో, భావ వ్యక్తీకరణలో రెండిరటా, తన లక్ష్యం జీవిత విమర్శ కాని, నిర్జీవ పదార్థ విమర్శ కానేకాదని అది ఉద్ఘాటిస్తుంది.’ అన్న వాక్యాన్ని బట్టి స్థాయి తగ్గని రచనలను సాహిత్య లోకంలో నిలిపే బాధ్యత సాహితీకారులదే. అలాగే విలువలు, సాంప్రదాయాలు పాటింపబడినవి కాలం గడిచినా, తరాలు గడిచినా వెలసిపోవు. పాఠకుల నోళ్ళలో నెమరు వేసుకుంటూనే ఉంటాయి. ఈ తరహాలో ఆధునిక రచయితలు ప్రాచీన కవుల ఛాయలను అనుసరిస్తూ, నిర్దుష్ట నియమాలను పాటిస్తూ సుతారంగా సాగడంలో సరికొత్త భావనను అనుభూతిగా దర్శనమిస్తుంది. పద్యం, వచనం, శతకం ఏదైనాగానీ రాసి మెప్పించగల సత్తా కనిపించడం వీరి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. సరళత, స్పష్టత కలిగి ప్రత్యేక ఇతివృత్త ఎంపికతో నిత్య నూతనంగా వీరి బాణి వర్ధిల్లుతుందనడంలో అతిశయోక్తి లేదు.
లక్ష్మణసూరి పద్యప్రక్రియలో విరచించిన ‘వాసంత సమీరం’ అనేది భావ కవిత్వంలోని ప్రణయ శాఖా సంబంధిత శృంగార కావ్యం. దీనిలో పద్యకవితలు అమృత బిందువులై అక్షరాలుగా జాలువారాయి. వస్తువును అనుసరించి ఒక్కటిగా కాక దేనికి అవే ప్రత్యేకమైనవనే భావనతో ప్రతీపదర్యం పాఠకులను రంజింపచేసేలా ఉంది.
2. కవి పరిచయం:
బెల్లంకొండ లక్ష్మణసూరి 1939, నవంబరు 16వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు గ్రామంలో మాతామహులైన శ్రీ రాంపల్లి నర్సింహారావు ఇంట జన్మించారు. ఈయన తల్లిదండ్రులు బెల్లంకొండ కృష్ణవేణి, చంద్రమౌళి శాస్త్రిగార్లు. నలుగురు తమ్ముళ్ళు, ఐదుగురు అక్కాచెళ్ళెల్లలో సూరిగారు ప్రథమ సంతానం. విజయలక్ష్మితో 1965 మార్చి 6న సూరిగారికి వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కూమారులు. ఒక కుమారుడు కృష్ణ చంద్రకీర్తి, రెండవ కుమారుడు సమీర్ చంద్ర చక్రవర్తి. లక్ష్మణసూరి తండ్రి చంద్రమౌళి శాస్త్రిగారు కుటుంబం ఖమ్మం జిల్లా మదిర తాలూకా మీరవోలు నుండి వేంసూరుకి వలస వచ్చారు. ఈయన వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. తాను చదువుకున్నది ఐదవ తరగతి అయినప్పటికీ పండిత కుటుంబం కావడం వల్ల సహజంగానే పాండిత్యం వంటబట్టింది. 1944 లో ప్రారంభమైన ఈయన విద్యాభ్యాసం 7వ తరగతి వరకూ అంటే 1951 వరకూ వేంసూరులోనే సాగింది. గురువులు శ్రీ సాంబమూర్తి గారి వద్ద సంస్కృతాంధ్ర విద్యాపీఠం లో సంస్కృతం నేర్చుకున్నారు. అలాగే సాయంకాలం వేళ శ్రీ ఆంజనేయశాస్త్రి గారి వద్ద పురాణం నేర్చుకున్నారు.
ఇక ఉద్యోగం విషయంలో 1961 డిశంబరు నుండి 1962 మార్చి వరకూ చెరువు మాధవరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయులుగా పనిచేసి, 1976 ఆగస్టులో ఏనుకూరు జిల్లా పరిషత్ పాఠశాలకు బదిలీ అయ్యారు. తరవాత పదోన్నతి పొంది 1978 లో వేంసూరు పాఠశాలకు స్కూల్ అసిస్టెంటుగా వెళ్ళారు. ఆ తరవాత ఖమ్మంజిల్లా, గౌరీదేవీ పేట గ్రామంలో భద్రాచలం మండలం హెడ్మాష్టరుగా పదోన్నతి లభించింది.అక్కడే నిరాఘాటంగా 1997 వరకూ పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
3. వాసంత సమీరం - పరిశీలన :
తెలుగు సాహిత్యంలో భావకవితాయుగం ఒక వెలుగు వెలిగింది. ఎప్పటికీ పాతబడని కవితా ధోరణి పాఠకుల హృదయాలలో వసంతాలను పూయిస్తూనే ఉంటుంది. ఆత్మాశ్రయ రీతిలో కవి హృదయం నుండి వచ్చే ప్రతి భావనా తమదే, తమ సొంతమేనన్నట్లు అనుభూతి చెందడం భావకవితలలోని ఆత్మీయత. ప్రబంధ కవితా ధోరణి నుండి వెలుపలకు వచ్చి కవితాఝరిలో తడిసి ముద్దైన తీరుని భ్రమింపజేయడం ఓ గొప్పతనం. ఓ ఉద్యమంలా సాగిన భావకవితా అక్షర తరంగాలను సృజించని రచయిత లేడంటే అతిశయోక్తి కాదు. ‘‘కవి భావమే ఇతివృత్తంగా సాగిన కవిత్వం భావకవిత్వం’’1 అని ఇక భావకవిత్వంలో ‘ప్రణయ కవిత్వం’ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించిన శాఖ. సృష్టిలో ప్రేమ భావం ఎలా శాశ్వతమో అలా ఊహా ప్రపంచంలో తేలియాడేలా చేసే ప్రణయం ఓ అద్భుతం. దీన్ని ఆధారం చేసుకొని ఆధునిక రచయితలు చేసిన కవితాసృష్టి ఓ ప్రభంజనంలా హృదయాలను తాకుతుంది. అలాంటి వారిలో బెల్లంకొండ లక్ష్మణసూరి ఒకరు.
‘వాసంత సమీరం’ పద్యకావ్యాన్ని ఆసాంతం అనుభూతుల పరిమళాలు వెదజల్లే శృంగార, ప్రణయ భావాల వేదికగా లక్ష్మణసూరి తీర్చారు. సార్వజనీన, సార్వకాలిక కథావస్తువును కలిగి సాహితీదాహార్తిని తీర్చిన రచనగా చెప్పవచ్చు. ప్రేమ భావమైనా, విరహవేదనైనా, విషాద నిరాశా వాదాలైనా, కవి హృదయాన్ని ప్రతిబింబించేలా కొనసాగించి రససిద్ధిని కలిగించి కావ్య ప్రయోజనం గావించారు. భిన్నరీతుల్లో రసానుభూతులను పంచుతోన్న పద్యాల్లో మూడు పద్యాలు మినహాయిస్తే మిగిలిన పద్యాలన్నీ ఉత్పలమాలలో ఛందోబద్ద రీతిలో రాయడం విశేషం. రస సాగరంలో ప్రేమ తెప్పోత్సవాన్ని చేయిస్తోన్న శృంగార ప్రధానమైన ఈ పద్యాలు సి.నారాయణరెడ్డి గారు విభజించిన ఆత్మాశ్రయ ప్రణయావస్థలైన పది దశలనూ పరిపుష్టంగా కలిగి ఉండటం మరీ విశేషం. ఈ విధంగా స్వచ్ఛంద ప్రణయం, పూర్వరాగం, సంయోగ దశ, ఆశాభంగం- విరహ విప్రలంభం, విషాదస్థితి, పలాయన తత్త్వం - నిరాశావాదం, విషాద మాధురి, ఊహాప్రేయసీ సృష్టి, ప్రేయసీ పూజ్యత, కులపాలికా ప్రణయం వంటి దశలన్నీ కానవచ్చే భావకావ్యంగా వర్ధిల్లింది.
లక్ష్మణసూరి ‘సుప్తస్వరాలు’ అనే కవితా సంపుటిలో తన ఊహా సుందరిని ‘ఊర్మిళ’ అని ముందుమాటలో పరిచయం చేసారు. ‘వాసంత సమీరం’ కావ్యంలో ప్రత్యేకంగా పేర్కొనకున్నా తన ఊహాసుందరిపైనే పద్యాల అక్షర కుసుమాలను ఆమెపై కురిపించారని నాకు అనిపించింది. ఈ వ్యాసంలో అన్ని పద్యాలనూ వివరించే వీలు లేకున్నా రచయిత అనుభూతులను ఉచ్ఛస్థితిలో ప్రతిఫలించిన వాటిని, పరిశీలనకు అనువుగా అనిపించినవి మాత్రం స్వీకరించాను. ఆయా విశేషాలను వివరించే ప్రయత్నాన్నిక్కడ చేస్తున్నాను.
3.1. స్వచ్ఛంద ప్రణయం :
ప్రేమభావం ఒక స్వేచ్ఛాయుత సహజ లక్షణమై జీవులందు ఉంటుంది. పూలకు తావిలా, చంద్రునికి వెన్నెలలా ప్రణయం ప్రేమకు పరాకాష్ఠ. యవ్వనపు ప్రవాహం సుడులు తిరిగే తరుణంలో ఊహాసుందరి కలలలోనో, కనులముందో సాక్షాత్కరిస్తే ఇక ప్రియుని ఆనందానికి అవధులుండవు. అది కట్టలు తెంచుకున్న జలపాతంలా ఆమె వైపు ఉరుకుతుంది. ప్రేమకు, ప్రేమించుటకు, ప్రేమింపబడటానికి వయసూ, తరుణమూ ఉంటాయా? అంటే లేదంటారు మన భావకవులు. కోరుకున్న చెలి సాక్షాత్కరిస్తే అంతకన్నా మంచి సమయం మరిక లేదంటారు. అలాగే ప్రేమన్నది మెదడులో జనించే రసాయనాల ఉద్రేకమని అది హృదయాన్ని ఆవహించినపుడు ఆ మోహావేశం పులకితంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెప్పినా ఆ దివ్యభావన స్త్రీ పురుషుల నడుమ బీజాలు వేసి చిగురించే అపురూప భావన. దాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనన్నట్లు సాగిన ఈ పద్య కవితలోని స్వచ్ఛందనము ఇలా సాగింది-
‘‘అంచలు నేర్చెనో నడక, లామని కోయిల పాట నేర్చెనో...
మంచిగ మాట నేర్చె శుకి, మంజుల నాట్యము కేకి నేర్చె, ప్రే
మించుట యే సుమా సృజన, మిథ్యను వాస్తవమే వరించ - జీ
వించుట నేర్పదే ప్రణయ వేదము నాదము నాదరించుటల్?!’’ 2
ప్రణయాన్ని వేదంతో పోలుస్తున్న తీరు ప్రేమికునికి అతని ఊహా సుందరి మూసిన కనులముందు శ్రుతులను చెవికి లీలగా వినిపించిన చందాన్నిచ్చింది. కంటికి కానరాక ధ్వని ప్రాయంగా అతని హృదయాన్ని మీటుతూ మైమరపిస్తోంది. ఆ ఊహ వాస్తవంగా పరిణమించాలని అతను కోరుకోవడంలో ఆమెని దర్శించాలని, ఆదరించాలని పడుతోన్న తపనకు పద్యరూపం చక్కగా అమరింది. మనసుకి నచ్చిన చిన్నదాని నడక, మాట, పాట, నాట్యం అన్నీ ప్రకృతిలో తన చుట్టూ ఉన్న వాటిలో చూసి తన ప్రేయసి వాటికి ఆ గుణాలను నేర్పిందని తలపోయడం ఆమెను మరింత అతిశయంగా అభివర్ణించుకోవడంలో భాగం. అతని మానసవీణని మీటే వేదనాదం ఆమెదేనని మురిసిపోవడంతో స్వచ్ఛమైన భావలాలసం కానవస్తోంది. ప్రేయసి నడకలోని హొయలను నేర్చిన హంసలు మరియు ఆమె నుండే నాట్యాన్ని అభినయించడాన్ని నేర్చుకున్న నెమలిఆటలు చూస్తే ఆ లయబద్దత కానవచ్చింది. ఇంకా ఆమె పలుకుల తియ్యదనాన్నే చిలుకలు పలకగా, కోయిల పాట అతనికి ఆమె గాన మాధుర్యాన్ని తలపించేలా చేసింది. అంటే ఆమె ప్రతీ సడిని, కదలికని ప్రదర్శించేవాటిలో ప్రేయసిని గుర్తు తెచ్చుకోవడం, కనులముందు నిలిచిందని ఆనందాన్ని అనుభవించడం అతనికి ఇష్టం. స్వచ్ఛంద ప్రణయాన్ని ఆస్వాదిస్తే కంటికి ఏం కనిపించినా, చెవికి ఏం వినిపించినా ప్రేయసిగా అనుకోవడంలో ప్రకృతి, ప్రేమ ఒకటే అన్నట్లు తలిచాడు. అక్కడ అతని పవిత్ర ప్రేమ కానవచ్చింది. ‘ప్రేమించుటే సృజన’ అనీ, ‘మిథ్యను వాస్తవమే వరించింది’ అని జీవించుటలో ఉన్న సంతోషాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. సమస్తం ప్రణయ సంబంధీకమని తలచి, తలపింపజేసిన ప్రేమతావిని ఈ పద్య పంక్తులకు అద్దారు కవి.
భావకవి తానే నాయకునిగా తలచి స్వచ్ఛంద ప్రణయాన్ని తన జీవితాశయం చేసుకొని ఆ గమ్యమే తన ధ్యేయంగా ప్రేయసికై ఎదురుచూస్తూ ఆరాధనా భావాలను వెదజల్లుతాడు. ఆ ప్రకాశం ప్రకృతిని వరించి అన్నింటా ఆమెనే కనిపించి, వినిపింప జేయడం ఒక మైమరపు. దాన్ని ఆస్వాదిస్తూ ఎదురుచూడటంలో స్వచ్ఛమైన ప్రేమకై పరితపించే హృదయం ఆమె సడిని మాత్రమే వినిపింపజేసి ఊపిరిని నిలుపుతోందనే వాస్తవాతీత భ్రమ నిజాన్ని ముందు నిలిపేంత పవిత్రంగా నెలకొంది. మాయ అయినా, సత్యమైనా ప్రేయసి కోసం ప్రియుని ఆరాటాన్ని, ఆరాధనా భావాన్ని బయటపెడుతూ, అంతటా ఆమె గమనాన్నే చూసి మధురతని పొందడంను దర్శింపజేసారు. నేటి ఉరుకుల పరుగుల ప్రేమ భావనలను అనుభవించలేని యువతకు ఆ తియ్యందనాన్ని స్వేచ్ఛగా సేవింపజేసిన పద్యం మానసోల్లాసాన్ని అందించింది. ఆస్వాదించడంలోని స్వచ్ఛతని చవిచూపింది. అంతేకాకుండా ప్రేయసిపై ఉండే ఇష్టాన్ని ప్రకృతికి ఆపాదింపజేసి అనుక్షణం ఆ దగ్గరితనాన్ని సృష్టింపజేసుకోమని సూచించింది. కపటం, అధికారిత్వం, పెత్తనంలేని సునిశిత ప్రేమ ఎప్పటికైనా ఫలిస్తుందన్నట్లు భావింపజేసారు.
స్వచ్ఛంద ప్రణయంతో ప్రేమ భావం ప్రతి చోటా ప్రేయసిని కనిపింపజేస్తూ ఆమె దరిచేరాలని కాంక్షింపజేయడం విశేషం. ప్రేమలో స్వచ్ఛత ఉంటే ఎదురుచూసి ఆమె తనను చేరుతుందన్న నమ్మకంతో ఆరాధనని మాత్రం బయటపెడుతుంది. సాధారణంగా భావకవి తానే ప్రియునిగా ఊహించుకొంటూ నాయక పాత్రని వహిస్తాడు. రచయితలోని భావాల స్వేచ్ఛ అప్పుడే వెల్లువలెత్తుతుంది. అతని ధోరణిలో ఆమె కోసం పరితపిస్తూ సమస్త ప్రకృతినీ ఆమె రూపుగా భ్రమిస్తూ తానెంత స్వచ్ఛమైన ప్రేమను కనబరుస్తున్నాడో అదే భావన ఆమె నుండి కలిగినా కలగకున్నా ఓర్పు వహిస్తాడు. ఆమెలోనూ ప్రేమ విరియాలని ఎదురుచూస్తూ తన దృక్పథాన్ని మాత్రం స్వతంత్రతతో వెలిబుచ్చుతాడు. అలాంటి ప్రణయపథ సాక్షాత్కారాన్ని ఓ పద్యకవితలో వర్ణించిన విధానం మధురానుభూతిని పంచుతుంది.
‘‘ఈ దివారాత్రాలు నీ రాకపోకలే
రంజిల్లు ప్రణయ నీరాజనాలు!
ఈ శరత్శిశిరాలు నీ హావ భావాల
నయనాల బింబించు నర్తనాలు!
ఆకాల గమనాలు ఆలోచనాలోక
మందందగించు నీ రాగధునులు!
యీ వెల్గు నీడలు నీనేత్ర చలనాల
శాసన బద్ధులౌ స్వర పదాలు!
ఈ చరాచర సృజన కాద్యంతమైన
రాగమే శ్వాస - నీ కంతరాంతరాల
నిశ్చలమ్ముగ వెలుగుచు నిన్ను ప్రణయ
పథమున నడిపి నను జేర్చు పరమ పదము!’’ 3
ఈ పద్య కవితలో రచయిత హద్దులులేని స్వేచ్ఛను తన భావ కవితలో వెలిబుచ్చారు. ప్రేమ అనేది ఒక దివ్య భావన. అది ఇరువురిలోను స్వచ్ఛందంగా జనించాలి. అప్పటి దాకా ప్రేమించిన వారికి ఎదురుచూపులు తప్పవు. కాని అన్నీ తన ప్రేయసే అన్నట్లు నిరంతర ప్రణయ సరాగాలను భ్రమిస్తూ తన యొక్క ప్రేమను ఎల్లలు లేని భావాలను విన్నవిస్తారు. అన్నీ తన ప్రేయసి కాక మరేదీ లేదనే మత్తులో మునిగిపోవడంతో సమస్త సృష్టీ ప్రేమకు ప్రతిరూపంగా తలుస్తారు. పగలు రేయి అనేవి వస్తూ పోతూ ఉంటేనే రోజు గడుస్తుంది. సమస్త జీవాలకూ కావాల్సిందదే. అలాగే ప్రేమికునికి జీవాన్నిచ్చేది ప్రేయసి మాత్రమే. పగలు ఆమె ప్రత్యక్షంగా కనిపించి రేయి కలలలో ప్రత్యక్షమవుతుంది. అతని కనులకు కాంతిని నింపుతుంది. ఋతువులలో ప్రేయసి హావభావాలను దర్శించడం ఆమెని ఆరాధించే పురుషునికే సాధ్యం. ఆమె కోసం శిశిరాన్ని తలపిస్తే ఆమె చిరునవ్వుశరత్ వెన్నెలలను చిలికిస్తుంది. వెలుగు నీడల్లోను, కంటి కదలికలలోను ఆమె రాకపోకల్ని చూడటమంటే హృదయమంతా పరుచుకున్న ప్రేమే కారణం. ఆమె రూపు, చూపు, స్వరం అన్నీ అతన్ని మరిపించే నాదాలై ఈ అనంత విశ్వానికి ఆద్యంతాలుగా కానరావడంలో అపరిమిత, అవ్యాజమైన, పరిపక్వ ప్రేమే హేతువు. అతనిలోని శ్వాస ఆమెదైనపుడు తాను ప్రేమ మార్గంలో వచ్చి తీరుతుందని తనను చేరుతుందనే ఆశాభావంతో అతనికున్న ఆత్మవిశ్వాసంతో పాటు ప్రేమకు అంతటి శక్తి ఉందని అది స్వచ్ఛమైనదైతే ఆకర్షణ తప్పక ఉంటుందనే ప్రణయ తత్వాన్నిక్కడ ప్రబోధించడం గమనించదగిన విషయం.
ప్రేమ, ప్రణయం ఎప్పుడూ స్వేచ్ఛాయుతంగా ఉండాలి కానీ అవతలి వారి స్వేచ్ఛను హరించకూడదు. ప్రేయసిని ఎంత హుందాగా హృదయంలో ప్రతిష్టించుకోగలడో అంత పవిత్రంగా అభిమానించి ఆరాధించాలి. అది కరిగే కాలంతో పోలిక పెట్టుకోకూడదు. దానికి వేచి చూడటం తప్ప వేధించడం తెలియదు. ఓర్పు, ఓదార్పు తెలుసు. వెలుగునే ఆస్వాదించాలని చీకటిని తిప్పికొట్టాలని అనుకోదు. తేజతిమిరాలు రెండూ ప్రేయసినే తలపించినపుడు దేన్నైనా దరిచేర్చుకోగలరు. ప్రేమను నిశ్చలపరుచుకొని ప్రణయ తీరాలకు ఇరువూరు కలిసి చేరడం గురించే ఆలోచించగలడు. కానీ నేటి ప్రేమలను పరిశీలిస్తే ఈ స్వేచ్ఛ, స్వచ్ఛత రెండూ కొరవడ్డాయి. ప్రేమించిన వారినే ప్రాణాలు తీసేంతగా అపనమ్మకం, ఒక వైపు ఉండటంతో హింసాత్మకాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారికి అసలు ప్రేమంటే ఏంటో, ప్రేమికుని నిస్వార్థ ఆరాధన ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలిపేందుకే ఈ పద్య రచనని చేసారనిపించింది. ఆరాధన సున్నితమైనదిగా కలకాలం నిలిచి ఉండేంత తరగని గనిగా ఉండాలని అదే స్త్రీకి ఇచ్చే విలువగా ఎంచి ఆమెను స్వేచ్ఛాయుత ప్రకృతితో పోల్చి అపురూపమైనదిగా భావింపజేసారు.
3.2. పూర్వరాగము :
భావకవి స్వచ్ఛమైన ప్రేమికుడు. అతనికి ప్రేమించడం, దాన్ని సార్థకత చేసుకోవడం వంటివి ఇష్టపూర్వకాలు. తన ఊహా సుందరిని తనకు అనువైన విధంగా ఊహించుకొని ప్రాణ ప్రతిష్ట చేసి హృదయ మందిరంలో ఉంచి ఆరాధిస్తాడు. అలాంటి లక్షణాలున్న అమ్మాయి కోసం ఎంత కాలమైనా నిరీక్షిస్తాడు. ఊహలలోనైనా, వాస్తవంలోనైనా ప్రేయసిని చేరాలని తపిస్తాడు. ఆమెను తనదాన్ని చేసుకోవాలంటే వచ్చే అడ్డంకులు ఎన్ని ఉన్నా వాటిని తొలగించుకొంటూ వెళ్ళి ఆమె చేయిని అందుకోవాలని పరితపిస్తాడు. ఎలాంటి అంతరాలతోనైనా పోరాడుతాననే ధైర్యాన్ని కనబరుస్తూ తమ ప్రేమకు అడ్డు వచ్చేవి ఏవైనా గానీ వాటిని రూపుమాపమని ఆ ప్రకృతినీ, తాను కొలిచే దేవుడినీ ప్రార్థించడంతో పాటు పెద్దలనూ చివరకు ప్రేయసినైనా వేడుకునేందుకు సిద్ధపడతాడు. ఆ ఎదురు చూపులతో అతని హృదయ తల్లడిరపులు, వేడుకోలు, భయం వంటి భావాలన్నీ పూర్వరాగముగా పరిగణిస్తుంటారు. ¿£$ ఆ ఛాయలున్న పద్యాలను కూడా అందించడం విశేషంగా ఉంది.
ప్రేమను సఫలం చేసుకోవలెనన్న ప్రేయసీ ప్రియుల మాట, బాట ఒకటే కావాలి. అంతటితో సరిపోదు భిన్నతలున్న ఈ ఇరువురు కలిసినా వేరు వేరు కుటుంబాలను కలిపి ఒప్పించడం అంత సులువు కాదు. అంతరాల నీడలు వారిని వెంటాడుతాయి. అయినా ప్రేయసి కోసం ఏదైనా ఎదిరించి దారికి తెచ్చుకునే తెగువను ఎంతటి భయాలు చుట్టుముట్టినా, అడ్డంకులను తొలగించుకొని ఉన్నా అన్నింటినీ గట్టెక్కిస్తానన్న విశ్వాసం కూడా ఉంది. ప్రేయసిని చేరుకోవడం కష్టమైనా ప్రేమే దైవ స్వరూపం కనుక చేజిక్కించుకుని తీరుతాననే నమ్మకం ఆదర్శనీయంగా ఉంది.
‘‘జీవన సంద్రయానమున జేరుట సాధ్యము ప్రాప్తమున్న యా
రేవుకు! మార్గ మెంచుకొను రీతిని బట్టియె కష్ట, సౌఖ్యముల్
నీవు వరించుచో వెలుగు నీడల వోలిన సాహచర్యమున్
దేవి! సరింతు నేనును యధేచ్ఛగ - గుండెలు పండ నిండుగన్’’ 4
ప్రేమ ఎలాంటి భేదభావాలు, అంతరాలు, అంతరంగాలు చూసుకోకుండా జనిస్తుంది. దానికి నచ్చిన మగువ కానరాగానే స్పందించడం మాత్రమే తెలుసు. ఆ ప్రేమ ముందుకు వెళ్ళాలన్నా, పెళ్ళిగా మారాలన్నా ఆమె ఒప్పుకోలు ఒకటే సరిపోదని వారు ఎన్నింటినో ఎదుర్కొని ఒక్కటవ్వాల్సి ఉంటుందని రచయిత చెప్పారు. అవన్నీ ఎందుకని ఆమె వెనుదిరుగుతున్న భయం, తననూ ఒప్పించి వెనక్కు మరలమంటుందన్న భీతి అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందుకే ప్రేయసిగా తన దరిచేరి మిగిలిన జీవితం కలసిబతుకుదామని అంటే అతను సిద్ధపడి తమ మార్గానికి అడ్డొచ్చే వాటిని తప్పించే యత్నం చేయగలనంటాడు. ఆమె తనది అవుతుందన్న ఆనందం అతన్ని ఏ సాహసానికైనా పురిగొల్పుతుంది. ప్రేమ ప్రణయంగా, పెళ్ళిగా ముందడుగు వేయడంలో సామాజిక, ఆర్థిక సమస్యలుంటాయి. వీటిని అనుసరించే చాలా వరకు ప్రేమలు పెళ్ళి పీటల వరకూ వెళ్ళక భగ్నమవుతుంటాయి. సమాజంలో మగవాడికి ఉన్నంత స్వేచ్ఛ, తెగింపు యువతులకు ఉండదు. కనుక తన వారిని నొప్పింపలేకో, సామాజిక కట్టుబాట్లకు ఎదురు ఈదలేకో ప్రేమకు ముగింపు పలుకుతుంటారు. కనుక ఆమెను సిద్ధపరిస్తే చేయి వీడనితనాన్ని బలంగా ఆమె నుండి పొందగలిగితే మార్గం కొంత సుగమం అవుతుంది. ఆ పని ఎంత కష్టమైనదైనా దాన్ని జయించినచో సుఖాలే ఉంటాయన్నది ఇరువురు అర్థం చేసుకోవాలి. కులాలు అడ్డొచ్చినా ఒప్పించుకోవడం, ఆర్థిక అసమానతలు రేకెత్తినా సమాధానపరిచే తీరు వంటివి కుటుంబాల పరంగా చేయాల్సి ఉంటుంది. ప్రేమ అనేది ఆనందాలను, ఊహలను ముందుంచితే పరిణయం బాధ్యతలను, బరువులను తలకెత్తుకోమంటుంది. అలాంటి కష్టసుఖాలు వెలుగు నీడల వంటివే కనుక కలిసి బతకడం ముందు ఏవీ ఎక్కువకాదని మనస్పూర్తిగా నమ్మాలి. అనుకున్నది అందుకోవాలంటే కొంత శ్రమ, ఒత్తిడి తప్పవని తర్వాతే సఫలత చేకూరుతుందని కవి స్పష్టపరచడం కవి భావుకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
జీవితం సముద్రం లాంటిది. ఆశ అనే నావపైన కోరుకున్న ప్రేయసి చెంత ఉన్నప్పుడు ఆ ప్రయాణం భయాన్ని కలిగించదు. ఆవలి గట్టుపై తాము కలసి బతకవచ్చుననే ఆలోచన ఇచ్చే స్ఫూర్తి మునుముందుకు వెళ్ళమంటుంది. కోరుకున్న స్త్రీ మాటలు, దర్శనభాగ్యం పూర్వరాగమై ప్రేయసి మరింత వృద్ధి చేయగా ఆ ప్రణయాన్ని శాశ్వతం చేసుకొని అదృష్టవంతుడిగా జీవితాంతం ఆమె సామీప్యాన్ని మాత్రమే ఆస్వాదించి ఆనందంతో తేలియాడాలనే కోరిక అతన్ని ధీరుణ్ణి చేస్తుంది. అపుడే అసలైన పండుగ ఆ హృదయాలకు వస్తుందని తెలిపారు. కానీ నేటి యువత ప్రేమలను గమనిస్తే అది ఆకర్షణలు తగ్గేంతవరకే ఉంటూ సఫలత దాకా వెళ్ళడం లేదు. ప్రేమకు ఉన్న ధైర్యం మునుముందుకు లేకపోవడంతో పాటు ఒక కాలక్షేపంగా చూడటం ఎక్కువైంది. జీవితంలో ప్రేమ భావన మనసుకు నచ్చే ఒక్కరి మీదే ఉంటుంది. కానీ నేడు ఒకరితో విడిపోయాక మరొకరు, ఒకరుండగానే మరొకరు అనేలా తయారయ్యారు. ఒకే హృదయం ఉండగా అందులో ఒక్కరికే స్థానం అనేది స్పష్టం అదే నిజమైన ప్రేమ. అలా కాకుండా గొలుసుకట్టు ప్రేమలు మది వరకు వెళ్ళనివిగాను, స్వచ్ఛత-స్పష్టత కొరవడినదిగాను ఉంటున్నాయి. ఇది పాశ్చాత్య నాగరికతా ప్రభావంగాను, నిబద్దత లేని ప్రేమలుగాను చెప్పాలి. ప్రేమ వివాహం వరకూ వెళ్ళడంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి కలిసి నడిచే ఏడడుగుల బంధం వారిని జీవితాంతం కలిపి ఉంచి కష్టసుఖాలను ఒకటిగా అనుభవించడమే జీవనయానమని నేర్పుతుంది. ఇక కొందరైతే కుటుంబాలను వీడి ఒక్కటవ్వాలనుకొంటారు. కానీ ఆమె వేచి చూస్తే, అతను అందర్నీ ఒప్పించే ప్రయత్నం చేస్తే దానికామె సహకరిస్తే కొంత సమయం వృథా అయినా అందరూ ఆనందంగా ఉండొచ్చు. ఈ విధమైన కష్టాలు కూడా ఉంటాయని ఇవి ప్రేమ తర్వాత ఎదురయ్యే అనుభవాలని కష్టసుఖాలలో ఇలాంటివి భాగమేనని సుఖపడాలంటే కష్టపడాలి కానీ కష్టపెట్టకూడదని ఈ పద్యకవిత ఆలోచింపజేసింది.
3.3. సంయోగదశ :
స్త్రీ పురుష సంయోగం సృష్టి సారం. ఈ అనంత సకల చరాచర ప్రాణికోటి యుగయుగాలుగా మనుగడను కొనసాగించడానికి వారసత్వపు తరాలు నిరంతర ప్రవాహినిలా ఎప్పటికీ నిలిపి ఉంచే జీవన సారాంశం. స్త్రీకి పురుషుడు, పురుషునికి స్త్రీ ఎప్పటికీ అవసరం. ప్రేమను పంచడం, పొందడం అనేది ఓ పరమార్థం. ఒకరికొకరం అని అతి సన్నిహితంగా మెలుగుతూ ఇరువురం ఒకటేనని లోకానికి చాటే దశ. సాహిత్య పరంగా చూస్తే కావ్యాలలో కొంత ప్రబంధాలలో మరింతగా సంయోగ వర్ణనలున్నాయి. ఇక దక్షిణాంధ్రయుగం, క్షీణ యుగాలలో ఈ వర్ణనలు హద్దులులేని రతికేళిని జుగుప్సాకరంగా కొనసాగించాయి. నాటి సాహిత్యంలో పూర్తిగా అన్నీ ఇలాంటివే అని కావు. సవ్యరీతిలో సాగినవెన్నో రాయబడినవి. ఇక్కడ నియంత్రణ లేని రచనల గురించి మాత్రమే ప్రస్తావనలో తీసుకోవాలి. కానీ భావ కవిత్వంలో సంయోగ దశ గురించి ఎంతో రమ్యంగా ఎక్కడా విచక్షణ మరచి ప్రవర్తించకపోవడం అభినందనీయం. సుతిమెత్తని విషయ జ్ఞానాన్ని రమ్యంగా తెలపడం విశేషం. శృంగారం అనేది భావ కవిత్వంలో ఎంతో ముఖ్యమైన భూమికను పోషించినా అది అమలిన శృంగారం మాత్రం కాదు. ఈ పరిణతి భావకవులలో కనిపించడం అందరూ భావ కవిత్వాస్వాదకులుగా మారడంలో భాగమైంది. గుప్పిట నుంచిన అవస్థను గురించి భావనలు పిల్ల తెమ్మెరల్లా హృదయాన్ని తాకింది. ఈ ప్రయత్నాన్నే వీరి రచనల్లో కనిపింపజేయడం ఒక గొప్ప. లక్ష్మణ సూరిగారు కూడా ఇలాంటి శైలీ సాంప్రదాయాలనే తన పద్యకవితల్లో పాటించారు. వాటినోమారు పరికించి ఆ దృక్పథాన్ని వివరించే ప్రయత్నాన్ని చేస్తూ ‘సంయోగ దశ’ను వారెలా అభివర్ణించారో పరిశీలించదగినది.
సాంప్రదాయకత సాహిత్యంలోనైనా, సమాజంలోనైనా కనిపించాలన్నదే భావకవుల ప్రణయ కవితాసారం. దీన్ని అనుసరించే పూర్వరాగానంతర సంయోగాన్ని విచక్షణా పూర్వకంగా మలిచారు. భావకవి తన అక్షరాలతో ఊహాలోకంలో విహరింపజేస్తూ ఊహించుకునే స్వేచ్ఛను పాఠకుల పరం చేయిస్తాడు. వీరి దృష్టిలో ఏదైనా సున్నితమే. సుతి మెత్తగా మలయ సమీరంలా హృదిని తాకే అక్షర తెమ్మెరలతో ప్రేయసీ ప్రియుల సమాగమాన్ని వర్ణించిన తీరుని పద్యరూపాన్నిచ్చి ఆస్వాదింపజేసారు కవి లక్ష్మణసూరి.
‘‘సన్నిహితంబుగా నిలిచి, చక్కని చల్లని చందమామ తా
వెన్నెల పట్టు దుప్పటుల వెచ్చగ గప్పెను తేనె చూపుతో
నిన్నును నన్ను ముద్దిడుచు నేర్పుగ మీటెను రాగలాహిరుల్
వెన్నున పుల్కరింత లెద వీణియ వాణిని మేలు కొల్పగా!’’ 5
రస హృదయాలను రంజింపజేయడం భావకవులకన్నా చక్కగా ఎవరూ చేయలేరన్న దానికి పై పద్యమే రుజువు. ప్రేమ పెళ్ళికి దారి తీసినా, ఊహా సుందరి ప్రణయ సుందరై మూసిన కనుల ముందు నిలిచి రారమ్మని పిలిచినా ఆ పులకింతకై ఇరువురి హృదయాలు తపిస్తాయి. ఆ భావాన్ని చందమామను, వెన్నెలను అడ్డుపెట్టి ఎద వీణలను మీటించడాన్ని నేర్పుగా చెప్పి ప్రేమికుల కలయికను అభివర్ణించారు. ప్రకృతిలో సంయోగ గుణం ప్రధానమైన సహజ ఘట్టం. ప్రేయసిని తానెంతగా ప్రేమించాడో ఆమె తోడు నీడను జీవితాంతం ఎంతగా ఆశిస్తున్నాడో చెప్పడంతో పాటు ఆమె సన్నిధి అతని పెన్నిధిగా జీవన మధురిమలను గ్రోలే తరుణంగా భావింపజేసారు. నింగి, నేల ఏకమవడంగా సంయోగాన్ని వర్ణిస్తారు. కానీ అవి ఎన్నటికీ కలవవని, ఒక భావనలో మాత్రమే సుదూరంగా అవి కలిసిన వైనాన్ని గోచరింపజేస్తాయి. కానీ రేయికి రారాజు చందమామ ఎప్పుడూ వెన్నెల వెలుగులను వెంట తెచ్చుకుంటాడు. ఆ చల్లదనాన్ని తాను అనుభవిస్తూ లోకానున్న వారందరికీ అందిస్తాడు. వేవేల చుక్కలు నింగిలో మిణుకుమణుకుమని కాంచినట్లు ప్రేమికుల హృదిలో ఆనందాల తళుకుల జల్లులను కురిపించే యత్నాన్ని గావిస్తాడు. అంతవరకూ తాము పడిన విరహతాపాన్నీ, దాటి వచ్చిన సమస్యల సుడిగుండాలనూ మరిపించే ఏకాంతం చల్లని వెన్నెల రాత్రిలో చందమామ సాక్షిగా మరచిపోయే ప్రయత్నాన్ని చేస్తారు. ఎక్కడా శృతిమించని సరాగాల సుమాలను పూయించిన భావ కవిత్వ ధోరణిలోని ఈ దశను మలచిన రచయిత హృదివీణను మీటి ఆనందింపజేసారు.
కాలానుగుణంగా సాహిత్యాన్ని వెలువరిస్తూ భావ కవిత్వం కపిత్వం కాదని వారిపై వేసిన మచ్చను చెరిపే ప్రయత్నాన్నే చేసారు భావ సాహితీకారులు. ప్రతి మనిషి మనసూ అనుభవాలను కోరుకోవడమో, నెమరు వేసుకోవడమో వంటివి చేయడానికి ఇష్టపడుతుంది. ప్రతీ నదీ సముద్రుని సంగమాన్ని కోరుతుందన్నట్లు ప్రేమకు పరాకాష్ఠ సమాగమం అనేది స్పష్టం. శృంగారం అసహ్యించుకో తగినది కాదు. కవితా రూపంలో చర్చింపజేయడానికి హద్దులు దాటి విచక్షణను కోల్పోయేలాంటి వర్ణనాదులేమీ అవసరం లేదు. భావకవిత్వంలో జీర్ణించుకున్న ప్రేమ, ప్రణయం, శృంగారం అనేవి రససిద్ధిని కలిగించే రీతిలో స్పష్టంగా వివరించవచ్చు. ఇది తప్పేమీ కాదు. ఇలాంటి కవితా రీతులే రచయితల ప్రతిభను వెలికితీస్తాయి. బూతు ప్రధానం చేసి ఒక పవిత్ర సృష్టికార్యాన్ని అపహాస్యం చేస్తున్న రచయితలు కాని రచయితలున్నారు. వారికి ఈ పద్య కవితా ధోరణి కనువిప్పు అని చెప్పాలి. ఆవేశకావేశాలను, విశృంఖలతను పెంచేది సాహిత్యం కాదు. ఈ విషయం భావకవులు ఎరిగి నడుచుకున్నారు. అందుకే నాటి నుండి నేటికీ భావ కవిత్వమైనా అందులోని ప్రణయశాఖ అయినా ఆదరింపబడుతూనే ఉంది. ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకున్నా నియమ నియంత్రణలను మీరని తీరుని కవి కళ్ళకుకట్టినట్లు స్పృశింపజేరయడం ఈ పద్యంలోని విశేషంగా చెప్పుకోవచ్చు.
3.4.ఆశాభంగము- విరహవిప్రలంభం :
అనురాగానికి ప్రతిబింబాలు ప్రేయసీ ప్రియులు. వారి ఇరువురి ప్రేమ స్వచ్ఛమైనది మరియు స్వార్థాలకు అతీతమైనది. ఒకరికొకరు ప్రాణమని ఒకరు లేనిదే మరొకరు జీవించలేరన్నంత గాఢత వారిది. అలాంటి ప్రేమకు విఘాతం కలిగి విధివశాత్తూ దూరమైతే వారి ఆశ నిరాశ అవుతుంది. వారి బాధ వర్ణనాతీతం అవుతుంది. ఊహా సుందరితో తన ప్రణయం ఒక కొలిక్కిరాకముందే ఆమె దూరమైతే ఆ ప్రియుని జీవితం నీరుగారిపోతుంది. తాను నిర్మించుకున్న ప్రేమ మందిరం నిలువునా కూలిపోతుంది. కావాలనుకొన్నది కాకుండా పోవడానికి అడ్డొచ్చిన హేతువులపై అతని కసి, కోపం ఉవ్వెత్తున ఎగసి పడటం సహజం. చేసుకున్న బాసలు నేలజారిపోయినపుడు మిన్ను విరిగి మీద పడ్డట్లు మధ్యలో ఊపిరాడని హృదయ వేదన ప్రేయసి కోసం పరితపిస్తుంది. అపుడు అతని అంతరంగం ఘోషించి తమ మధ్య గోడలు కట్టిన వాటిని నిందిస్తూ వాటిని ద్వేషించి దూషించి తన మది వేదనను ఆశల నావ మునిగిపోయిన వైనాన్ని గొంతెత్తి వినిపిస్తాడు. పరిస్థితుల కొలిమిలో సమిధలా మాడిన ప్రేమను తలుచుకొని తనది కాలేకపోయిన ప్రేయసిని తలుచుకొంటాడు. ప్రణయ కవిత్వానికి సంబంధించిన పలు పద్య కవితలు ఈ కావ్యంలో దర్శనమిచ్చాయి.
ఆనందాన్నే కాక దుఃఖాన్ని కూడా కనులకు కట్టి, అనుభవింపజేసిన ఘనత భావ కవిత్వానికే దక్కింది. పాఠకుని హృదయ స్పందనలను తన హక్కుగా భావించిన వైనం ఈ ధోరణిది. ఈ రచయితలో జనించిన ప్రతి భావన వెంటా సాహితీ ప్రియులను చేయిపట్టి తీసుకెళ్ళిన వైనాన్ని దర్శింపవచ్చు. అనుకొన్నది ఒకటి కాగా అయినది మరొకటి అయినప్పుడు సాధారణ విషయమైతే తిరిగి ప్రయత్నించి సాధించవచ్చు. కానీ ప్రేమ సంబంధితంలో అలాకాదు. ఒకసారి చేజారితే తిరిగి పొందడం కల్ల. ప్రేయసి మనసునైనా మార్చవచ్చు కానీ తమని వేరుపరుస్తోన్న సమస్యలుగా మారిన కారణాలను అధిగమించడం కష్టం. తగిన సమయం లేనపుడు ఇక ఎడబాటు శాశ్వతం. అలా తమను వేరు చేసిన విధి విలాసమును ఎదిరించలేని శాపగ్రస్తుని ఆశాభంగము వ్యక్తమవుతోన్న తీరుని గమనిస్తే-
‘‘వేసవి యెండకీ భువి తపించు విధాన వియోగ వేదనల్
వ్రాసెను గుండెపైన తిమిరాక్షర సంహతి నవ్వి కాల్చగా
దూసెను నిప్పు బాకులను దూకుచు మీదికి నన్ను మ్రింగగా
నీ సిరి మువ్వ నవ్వులను నే నెడబాసిన నేడు శప్తుడన్!’’ 6
ప్రేమే పరమావధిగా ప్రేయసే లోకంగా బతికే ప్రేమికునికి పిడుగుపాటులా ఆమె దూరమైతే అంతకన్నా నరకయాతన ఇంకొకటి ఉండదు. ఈ భావన పెళ్ళి కాని ప్రేమికునిలోనైనా, భార్య మరణించిన తర్వాత భర్తలోనైనా సమంగానే ఉంటుంది. ముందు జీవితమంతా తేనియలతో నిండినది కాగా తర్వాత బతుకు భారమై క్షణమొక యుగంలా ఆమె జ్ఞాపకాలతో పిచ్చి వాడవడక తప్పదు. ఆ వేదన ఎండకు మాడిన నేలను తాకని వర్షపు చినుకుకై పడే ఆరాటాన్ని, జీవితమంతా చీకటేనని విధి రాత హృదయాన్ని కాల్చివేసి బతుకుని అంధకారమయం చేయగా, నిప్పు బాకులు గుండెను చీల్చినట్లు విలవిలలాడతాయని భావకవి అనుభవిస్తోన్న బాధ ప్రతి భగ్న ప్రేమికుని హృది అనుభవమే. ఆమె నవ్వుని తిరిగి చూడలేని ఒంటరి వాడై ఆమె లేని జీవితమనే మోడై శాపగ్రస్తునిలా విధి ఆడిన వింత నాటకంలోని అనామక పాత్రలా నిలిచిపోక తప్పదు. ప్రేయసితో ఆ ఎడబాటు తాత్కాలికం కాక శాశ్వతమైనపుడు వ్యథకు అంతంగానీ, ఉపశమనం కానీ ఉండదు. అందమైన గులాబిని అందుకోవాలని ప్రయత్నిస్తే రక్కసి కంటకాలు చేతినికాక మనసునే చీరేస్తే దానికిక చికిత్స కూడా ఉండదు. ఆ మంటను జీవిత చివరి క్షణం వరకూ భరింపక తప్పదనే వాస్తవాన్ని విధిరాతగా అనుభవించే అంతరంగాన్ని ఆవిష్కరించడంలో కవికి ప్రణయంపై ఉన్న భావం గ్రహించవచ్చు.
ప్రేమ ఎంత తీయనిదో ఆశాభంగము అంతటి విషప్రాయమైనది. అది ప్రాణాన్ని ఏకంగా హరించక గాయాన్ని మండిస్తూ హింసిస్తుంది. ఆ బాధలో అనుక్షణం ఆమెని గుర్తుకు తెచ్చిన విధి వేడుక చూస్తుంది. ప్రతి ప్రేమా ఫలించే అవకాశం ఉండదు. అలాగే ప్రేమించిన భార్య శాశ్వతంగా దూరమైన వ్యక్తికి కూడా ఇది వర్తిస్తుంది. తిరిగిరాని ఆమెకై అతను విలపించక తప్పదు. కాలం గాయాన్ని మాన్పుతుందని అంటారు. కానీ ప్రేయసిని చేజార్చుకున్న వారికి క్షణమొక యుగం. అనుక్షణం గాయాన్ని పెద్దది చేసే జ్ఞాపకాలు గుచ్చి గుచ్చి చంపుతాయి. కులాల అడ్డుతో కన్నవారిని బాధపెట్టలేక త్యాగం చేసి వారికోసం వేరొకరి చేయందుకున్న ప్రేయసి అయినా విధి వంచితమే. చేరువయ్యేలోగా శాశ్వత నిద్రలో జారి ప్రియుని బాసినా ఆ బాధ బతికున్న అతనే అనుభవించాలి. అంతరాలు గుర్తు చేసిన పెద్దలు ప్రేమికులు పాలిట రాక్షసులైనా ఆశాభంగము తప్పదు. వీటిలో ప్రేయసి బాధ కూడా తీసిపోనిదే. ప్రణయానికి ప్రేయసి ఒప్పుకోలు చాలు. కానీ ప్రేమికులను దూరం చేసే అంశాలు మాత్రం కోకొల్లలు. వాటితో జరిపే పోరాటంలో ప్రియుని ఓటమి విలువ మాత్రం రెండు నిండు జీవితాలు. ఇద్దరూ కలసి ఒక్కటిగా మారాలన్న ఆశకు భంగం చేకూరడం తద్వారా ఆవేదనకి బలవడం అనేవి దారుణమైన ఒంటరితనాన్ని శాపంగా ఇస్తాయని ప్రేమకు కూడా ముందు చూపు తప్పదనేలా పరిస్థితులుంటాయన్నారు. కానీ ప్రేమ పథకం ప్రకారం జనించేది కాదు. అది ఎప్పుడెలా జనిస్తుందో చెప్పలేనిది. అలా పుట్టిన సహజభావన విధివశాత్తో, మానవ మూలంగానో, ఆచారాలననుసరించో దూరమైనపుడు ఎవర్నీ నిందించలేక తనని తానే నిందించుకొంటూ దురదృష్టానికి వగచేవారి గురించి తెలిపి నిజమైన ప్రేమ విఫలమైతే అలాంటి బాధనిస్తుందని తెలిపారు.
3.5. విషాదస్థితి :
ఆశాభంగము విపరీత రూపు దాల్చి ప్రేమికునికి హృదయ శోకాన్ని భరింపరానిదిగా చేస్తే అది విషాద స్థితి. ఈ గతిలోనివాడు పరిస్థితులతో విధితో అందరితో తనకెలాంటి సంబంధం లేదని తనకు ఇది అంతిమ దశ అన్నంత వేదనని కలిగిస్తుంది. భావ కవిత్వంలోని ప్రణయ శాఖలో ఉండే ఈ విషాద స్థితి ఈ ప్రపంచానికి అతీతునిగా ప్రియుని ఉంచి అతనికే భవబంధాలూ, బాధ్యతలూ, ఆశావాదం, బతుకు తీపి లేని దీనునిగా మార్చి మృత్యుముఖం వైపు నడిపిస్తూ నిర్వేదాన్ని అలవర్చి విరాగిగా మారుస్తుంది. ఆనందంలో ఉన్న ప్రియుని కన్నా పదింతల విషాద భావాలు ఈ దశలో వెలువడి భగ్న హృదయుని మతిలేనివాడిగా ఆమె జ్ఞాపకాలతోనే కుమిలిపొమ్మని శపిస్తాయి. భ్రమలలో, ఊహలలో కూడా ఆమెతో దగ్గరితనాన్ని ఊహించుకోలేక బతుకు భారమై గాలికి, ధూళికి బతుకుతూ తనలోకంలో తానుండి పోయే దుర్భర స్థితిని అనుభవింపజేస్తుంది. ఆ దశలో అతని భావనలేంటో రచయిత పద్య కవితల ద్వారా వివరించిన తీరుతెన్నులను పరిశీలించాల్సిన అవసరం ఉంది.
కలలోనూ, ఇలలోనూ ప్రేయసితోడిదే జీవితమని ఎంచినపుడు కారణాంతమున ఆమె దక్కకుండాపోతే అతని హృదయ వేదనకు అడ్డు అదుపు ఉండదు. ప్రేయసితో చెప్పిన ఊసులు, చేసిన బాసలు, కలసి కట్టుకున్న ఆశల సౌధాలు, గడిపిన అపురూప క్షణాలన్నీ శాశ్వతమని తలచినపుడు అవి నీటి బుడగలని తేలితే ఆమె అతన్ని వీడిపోతే ఆ క్రుంగుబాటు సాధారణ స్థాయిలో ఉండనీయదు. ప్రేయసి ఆలోచనలే వెలుగుగా ఆమె సాన్నిధ్యమే జీవితంగా బతికినవాడికి ఆమె వియోగం చిమ్మచీకటిని తలపిస్తే గుండెలవిసేలా రోదనలు తప్ప ఇక ఏం మిగలవు. దుఃఖ వశమైన హృదయానికి నిరాశ తప్ప మరేం లేనిదవుతుంది. రక్త కన్నీటి కాల్వలు కట్టడం విరక్తితో బతుకును ముగించాలనే ఆలోచనలు రేగి ఆత్మహత్యాయత్నాలు ఈ దశలోనే జరుగుతాయి. రచయిత హృదయాధికంగా ప్రేమించిన వారి ప్రేమలోని వాస్తవికతను తెలుపుతూ ప్రియుని సంతోషం, ఆశలు, భవిత అంతా ప్రేయసి వెంటే వెళ్ళిపోయినట్లు ఆ విషాద స్థితిని ఎదుర్కోవడం కష్టసాధ్యమని అన్నారు. లోకంలో ఎందరో భగ్న ప్రేమికులు ఉండవచ్చు. ఎవరి కారణాలతో వారు ఎడబాసి వేదనలతో కుమిలిపోతుండవచ్చు. వారి ఆలోచన ఈ ప్రపంచంలో నేనొక్కడినే దురదృష్టవంతుడిననే భావన నెలకొంటుంది. అలాంటి వారికి ఇలాంటి స్థితిలో ఉన్న వారెందరో ఉన్నారని ఇలాగే బాధపడుతున్నారని చెప్పడం కూడా ఒక చిన్న ఓదార్పు వంటిదే. వేదనలో ఉన్నవాడిని ఊరుకోమంటే ఊరకుండలేడు. చిన్న గీత ముందు పెద్దగీతలున్నాయని తెలిపినపుడు ఆత్మ స్థైర్యాన్ని కొంతైనా మూటగట్టుకొని జీవన యానాన్ని భారంగానైనా సాగిస్తాడని భావకవి యోచించారు. ముల్లుని ముల్లుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని అనుసరించారని తెలుస్తుంది.
హృదయం నిండా తీయని గమకాలు పలికి సరాగాల తోటలో ప్రేయసితో కలసి విహరించిన ప్రియునికి ఆమె ఎడబాటు తట్టుకోలేనిది. ఎన్నటికీ తిరిగి రాదని తనదానిగా చేసుకోవడమన్నది అసంభవమని తోచినపుడు ఆమె తలపులు, వలపులు, జీవన మలుపులు అన్నీ వేదనాభరితంగా ఉంటాయి. ఆ సమయంలో ఎవరి ఓదార్పులు రుచించవు. తనకుతానే కరిగి, విరిగి, ముక్కలై అతకడం కష్టమైనా సర్దుకోవాల్సిన వైనం అతనిదే. వాస్తవాలెపుడూ నిశితమైన బాకులా గుండెను చీల్చినపుడు ఊహలే అతన్ని నడిపించేవిగా తలపోయక తప్పదని భావకవి తన విషాద స్థితిని పద్య పంక్తులతో అక్షర అశ్రువులు కార్చారు.
‘‘అప్పటి నిన్ను నేను మరవాలను మాటలు రాతి గుండెతో
చెప్పుట తెలికే! మనసు చేదు తలంపుల వీడినట్లుగా
ఒప్పునె గుండె? యీ వలపు టూపిరు లూదిన జీవకాంతి వీ
వెప్పటికైన నన్ మరువ నీయని తీయని గాయ గేయమే!’’ 7
మనసు మరులు గొలపడం మరచి శుష్కించిపోవడం ప్రేయసిని కోల్పోయిన భగ్న హృదయునికి శాపం. ఆ స్థితిని అతనెలా అనుభవిస్తాడో ఈ పద్య కవిత నివేదిస్తోంది. గాయం మనిషికి తగిలితే కోలుకోవచ్చు. కానీ హృదయానికి తగిలితే మాత్రం అది ముక్కలవడంతో పాటు బతుకుని అతకనీయదు. ఆ హృది ఆమెకై పరితపించి పోతుందే కానీ అదొక ఘటన అనీ, పీడకల అని తలపించి మరచిపొమ్మని ఎప్పటికీ శాసించదు. అతని మనోరథంలో ఆమె ఊరేగిన గుర్తులు, సడులనే గుండె సవ్వడిని చేసి బతకమని ఆదేశిస్తుంది గానీ ఆమె మరపుని మాత్రం దరి చేరనీయదు. విషాద స్థితిలో ఉన్నవారికి ఊరట కలిగించడానికి ఇతరులైనా, మరెవరైనా పలు మాటలతో ఓదార్పునిస్తారు. గుండెను రాయిగా మార్చుకోవాలని ద్రవించనీయవద్దని ఊరడిస్తారు. కానీ అతనికి జీవకాంతినిచ్చిన ప్రకాశత వీడి జీవాన్ని తనవెంట తీసుకెళ్ళిందని అతనిక బతికున్నా లేనట్టేనని శాపగ్రస్తునిలా జీవించక తప్పదనేది మాత్రం ఎదుర్కోవలసిందే. అపుడతని గాయం గేయాలుగా, విషాద కవితా రaరిలా రుధిరాక్షరాలను కురిపిస్తుంది. ఆ తరుణమే భావకవి జననం. నిజం బోధపడిన పిమ్మట ఆ భారాన్ని దించుకోడానికి ఊహా సుందరిగా ఆమెను ప్రతిష్టించుకొని ఇలలో దక్కనిది భ్రమలో పొందుతాడు. తిరిగి ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. అతని ప్రతి శ్వాసలోనూ ఆమె ఊపిరులే కనిపిస్తాయి. భావకవి తన హృదయానుభవాలైన ప్రేమను, విషాదాన్ని అంత లోతుగా చెప్పడానికి ఆనందం, వేదనలు అనుభవించిన జ్ఞానమే కవిత్వమవుతుంది. అది స్వయంగా పొందినది కాకున్నా ప్రేమికునిలో పరకాయ ప్రవేశాన్ని చేసి తానే అతనిగా భావాలను వెదజల్లుతాడన్న విషయాన్ని స్పష్టీకరించారు.
విషాదస్థితి ప్రణయ కవిత్వంలో చాలా ఉధృతగతిని పొందింది అదే భావకవుల ఊహా సుందరి సృష్టికి కారణభూతమై అతని ప్రతి స్పందనకి ప్రేరణగా మారింది. ప్రేమ విషాదంగా తిరిగి అదే విషాదం ప్రేమగా మారడం భావ కవిత్వంలోనే దర్శించగలం. ఈ తరుణాలు సాహితీ ప్రియుల స్వయం అనుభవాల్లా స్పందింపగలిగేలా మమేకం చేయడమే ఈ దక్పథానికి ఉండే గొప్పతనం ప్రేయసి వీడగానే జీవాన్ని వీడాలన్నంత వేదన కలగడం సహజం. కానీ ఆమెను ఊహల్లో పునఃప్రతిష్ట చేసుకొని ఆరాధించడం కోలుకోవడంలో భాగం. ఇది స్వచ్ఛమైన ప్రేమలోనే జరుగుతుంది. అంతటా ఆమేనని మనఃపూర్వకంగా నమ్మిన హృది చేసే సర్దుబాటు ఇదేనని భావకవి గురించి భావకవే తెలిపారు. ఇది తననితాను పరిచయం చేసుకోవడం వంటిది. ఊపిరి ఉన్నంతవరకు ప్రేయసినే తన జీవంగా తలిచే హృదయాన్ని కలిగి ఉంటేనే స్వచ్ఛమైన ప్రేమ. అది ఆమె ఉన్నా, లేకున్నా, భావాలలో, భావనలలో సజీవ చిత్రమై మనో ఫలకంపై తిష్ట వేసుకొంటుందని తెలిపారు.
3.6. పలాయన తత్త్వం - నిరాశావాదం :
భావకవిని వీడిన ప్రేయసిని తలచుకొని విషాదంలో కృంగి నిరాశావాదాన్ని నెత్తికెత్తుకొని విరాగి అవుతాడు. తన ఊపిరి, జీవము అన్నీ ఆమేనని తలచినపుడు తనని బాసి దూరమైన ఆ జవ్వని జ్ఞాపకాల సుడులలో చిక్కుకొని గాలిని పీల్చడం కూడా భారమని ఇక ఏం మిగిలిందని ప్రశ్నించుకోవడం ఆ నెపాన్ని ఏదో ఒక కారణానికి అంటగట్టి ఇదంతా దాని వైపరీత్యమని కుమిలిపోతాడు. దూరమైన ప్రేయసిని, దూరం చేసిన హేతువులను తలచుకొని ఊహలలోనైనా ఆమెను నిలుపుకోవాలని వాస్తవాల నుండి పలాయనాన్ని కోరుకొంటాడు. సుదూరాలకు ఏగి అక్కడి భ్రమలతో ఉండి నిరాశను అనుభవిస్తూనే ఆశాజీవిగా బతకలేక బతుకుతాడు. తన బాధను చంద్రునికో, చుక్కలకో, వెన్నెలకో వినిపించి తనను ఐక్యం చేసుకోమని విన్నవించుకొంటాడు. ఈ లోకములో తన చెంత లేని ఆమెను తలచుకొని ఈ నేలను వీడి గగనానికి ఎగరాలనే కోరికతో కనిపించిన మేఘాన్నో, విహంగాన్నో సాయం చేయమని వేడుకొంటాడు. ప్రేయసి లేని ప్రియుని హృది ఎగిరిపోవాలన్న కాంక్ష నిరాశావాదం నుండి జనించి పలాయనతవైపు పరిగెడమంటుంది. అలాంటి ప్రయత్నమున్న పద్య కవితలు లక్ష్మణసూరి భావకవిత్వంలో కనిపించాయి.
ఆశ మనిషిని బతికించి నిలిపితే నిరాశ పారిపోయి ఆశను వెతుక్కోమంటుంది. దూరంగా వెళితేనో, దేన్నో నిందిస్తేనో మనశ్శాంతిని పొందవచ్చునని హృదయం పోరుతుంది. పరిస్థితులకు కారణం తానో, తన ప్రేయసో కాదని విధినో, కాలాన్నో తిట్టి తన ఈ నిరాశ నిస్పృహలకు హేతువుని చేసి బాధపడుతాడు. అంతా అయిపోయిందని తన ప్రేమ వాడిపోయిన పూవుగా, తన మనసుని మోగని మురళిగా అభివర్ణించుకొని బహుదూరపు బాటసారిలా గమ్యం తెలియని తీరాలు చేరుకోమని కోరుతుంది. అలాంటి దశని భావకవి అనుభవిస్తున్న పద్య కవితను గమనిద్దాం-
‘‘కాలమెరుంగునే వలపు? కాలును, కాల్చును, కాలికొద్ది తా
గాలివలెన్ పరుంగులిడు కన్నుల కందక దొంగ రీతిగా!
కాలము కొల్చు జీవముల కాయువు వాయువు! గుండెలేని యీ
రాలకు శిల్పరమ్యతలు రాగము నేర్పునె? యూపి రూదునే??’’ 8
కాలం చేసే జాలం మనుషులను, మనసులను కలుపుతుంది. అదే తిరిగి విడదీసి ఎడబాటుని కలిగించి గాయాలను రేపుతుంది. ఈ మాయలో చిక్కుకొని ఆటబొమ్మనయ్యాననే నిరాశావాదాన్ని ఈ పంక్తులు వినిపించాయి. ప్రాణం లేని కాలం ప్రాణులను ఆడిస్తోంది. ఊహాసుందరిగా గూడు కట్టుకున్న యువతిని వాస్తవంలో చేజిక్కించి కనులముందుంచిన కాలం ధన్యతను సంపాదించుకొంది. వారి ఆనంద విహారాలలో, కానరాని సమయంలో రోజులు క్షణాలను చేస్తే, ఆమె దూరమయ్యాక క్షణాలు యుగాలవుతున్నాయని, కాలం ఈ విధంగా కూడా హింసపెడుతోందని దాని నిర్దయను నిరసించాడు. ప్రేయసి దూరమవుతూ తాను కొలువున్న ప్రియుని గుండెను వెంట తీసుకెళ్ళగా రాయిలాంటి కాయం మాత్రం ఉండిపోయింది. దాన్ని ఏదీ రంజింపలేదు. అందులో సంతోష సుమాలను పూయించనూ లేదు. పోయిన ఊపిరిని మరే శక్తి కానీ నిలుపలేదు. కేవలం ఆమె ఊహలే అతనికి శ్వాసగా మారాయి. వలపు తియ్యదనం కాలానికి తెలియదు. దానికి తెలిసింది వడివడిగా వెళ్ళడమే చేయాల్సినదంతా చేసి ఇరు హృదయాలను దూరం చేసి ఏమీ తెలియని జాణతనంతో జారుకొని పలాయనం చిత్తగించిందని భావకవి వాపోయాడు. వియోగాన్నందించిన కాలం ఊపిరిని అందించలేక అతన్ని కాలగతిలో కలిపేస్తే బాగుండునని కాలం ప్రేయసి విషయంలో చేసినట్లే తనకూ చేయమని తన ప్రాణాన్ని సుదూర తీరాలకు విసరమని నిస్పృహతో నిండిన అతని మానసం కోరిందని వివరించారు.
హృదయం ఆనందంతో నిండిపోతే భవిష్యత్తు అంతా ఆశావాదంతో నిండుతుంది. అలాకాకుండా వేదనతో రగిలిపోతే నిరాశతో భవిత అంధకారమయంగా గోచరిస్తుంది. అనుకున్న యువతి తన మదిలో సిరిమువ్వలు మోగించినట్లే తన గృహమునందు కుడికాలు మోపాలని కోరుకుంటాడు. కానీ అది నెరవేరని నిరాశను మిగిల్చినపుడు దానికి కారణమైన వారిని నిందిస్తూ ఆమె లేని చోట తనకు రుణం తీరిందని భావిస్తాడు. ఆ పుణ్యాన్ని కూడా కాలమే కట్టుకొందని మరెవరినీ అనలేక కంటికి కానని దానిపై వేసి తాను గమ్యం లేక విసిరికొట్టబడిన బాధని పంటిబిగువున భరిస్తాడు. ఒక భావకవి ప్రేమను ఎంత రమ్యంగా వ్యక్తపరచి మదిని రంజింపచేస్తాడో అదే తీరుని ముక్కలైన హృదయవేదనని వెలిబుచ్చగలడు. ఆనందాన్ని, బాధని ఒకే విధంగా అనుభవించగలడు. ప్రేయసి వీడిన వేదన నుండి బయటపడలేక పిచ్చివాళ్ళలా రోడ్ల మీద తిరిగేవారు. పడేది ఇదే నరకయాతన. ప్రేమ దక్కకుంటే సున్నిత మనస్కులకు మతి తప్పడమో, ఆత్మహత్యా ప్రేరణలో కలుగుతాయి. అప్పుడే సంయమనాన్ని పాటించాలి. భావకవి ఇంత చేసిన కాలం తన జీవితంలో మరేదో చేస్తుందని ఆశావాదంతో ఊపిరిని నిలుపుకున్నాడు. అలా నెపాన్ని నిందించి పలాయనం చిత్తగించకుంటే ఉన్న చోటే పాతుకుపోతాము. అది చెడు చేస్తుందే కానీ కోలుకునే అవకాశాన్నివ్వదు. దాన్ని మీరి కాలచక్రంతో ఆశతోనో, నిరాశతోనో కదలక తప్పదు. జీవితంలో ప్రేమ ఒక భాగమే కానీ పూర్తి జీవితాన్ని హరించేంత వికృతం కాదు. ప్రేమపంచే ఆనందాన్ని అనుభవించాల్సిందే విషాదాన్ని దిగమింగి కదలాల్సిందేనన్నది కవి అభిప్రాయంగా వెల్లడవుతూ ఉంది.
3.7. విషాదమాధురి :
ప్రేమించిన నెలతని దక్కించుకోలేని తరుణంలో ఆమె దూరమై ఒక్కడిగా మిగిలిన ప్రియుని విషాదం వర్ణింప నలవికానిది. ఆ ఆశాభంగము, కృంగుబాటు ఒంటరిjైున అతని హృదయాన్ని అల్లాడిరచి విరక్తిని కలిగిస్తుంది. మనసు వేవేల తుఫానుల చిక్కిన చిగురుటాకువలె విలవిలలాడుతుంది. అంతటి కల్లోలత అతన్ని కలచివేస్తున్నా ఆమె జ్ఞాపకాల మాధుర్యాన్ని తలచుకొని విషాదాన్ని కూడా సంతోషంగా భరించడం భావకవికే చెల్లింది. ఆనందాలను హరించిన దుఃఖాన్ని దిగమింగి ఆ బాధనే చెలిమిగా తలచి విషాదంలోనూ ప్రశాంతతను వెతుక్కునేంత మనోవికాసాన్ని ప్రేమతత్వం నేర్పుతుంది. ఉన్నంతలో ఆనందాన్ని వెతుక్కోమని చెప్పడంలో వెన్నెల రాత్రులే కాదు చీకటి అమావాస్యలూ ఉంటాయని ఆ నిశిని కూడా అనుభవించాలనే జీవిత సత్యాన్ని భావకవి గ్రహించి తన కవిత్వంలో ప్రతిఫలిస్తాడు. అంతులేని ప్రేమను పంచిన ప్రేయసి విషాదాన్ని మిగిల్చినా అది భౌతికమేకానీ మానసికంగా కాదని భావించే హృదయం బాధని భరించినా ఆనందాన్ని అందులోనే వెతుక్కోవడం తప్పదని, కన్నీటినే ఆనంద బాష్పాలుగా రాల్చి అంతరంగాన్ని జ్ఞాపకాల వెలుగులతో నింపుకొంటాడు. ఈ తరహా పద్య కవితలను ఈ ఉపశీర్షికలో పరిశీలించవచ్చు.
మనస్పూర్తిగా ప్రేమించిన ప్రియురాలు కొన్ని కారణాల చేత వేరొకరి సొంతమైనపుడు ఆ ప్రేయసి వేదన వర్ణనాతీతం. తల్లడిల్లిపోతున్న మదిని తిరిగి చేజిక్కించుకునే ప్రయత్నంలో ఆ భగ్న ప్రేమికుడు భయంకరమైన వేదనని శిక్షగా పొందుతాడు. విషాన్ని నింపిన ప్రేమ తాగక తప్పని గరళకంఠుడవుతాడు. అర్ధనారీశ్వరునిలా ఒక వైపు ఆమె పంచిన ప్రేమతత్వం, మరోవైపు ఆమె నింపిన విషాద వాస్తవం రెండిరటినీ సమం చేసుకొంటాడు. ఈ వేదన మరవడానికి ఆ ప్రేమనే అడ్డుపెట్టుకొని జ్ఞాపకాలను అరువు తెచ్చుకుంటాడు. ‘నీ సుఖమే నే కోరుకున్నా’ అంటూ విషాదాన్ని కూడా ఆనందంగా హృదికి వినిపించి సర్ది చెప్పే ప్రయత్నాన్ని చేసిన భావకవి దృక్పథానికి ఈ పద్య కవిత అద్దం పడుతోంది-
‘‘నీవెవరిన్ వరించినను నిక్కముగా మన ప్రేమ నిత్యమే!
నీ వెచటన్ వసించినను నిర్మలమౌ మన యాత్మలొక్కటే!
నీ వలుకన్ వహించినను నెయ్యము నయ్యది మాపలేదులే!
నీ వెదియో వచించినను నేను తలంచు సరాగమద్దియే!’’ 9
వియోగంలోనూ మాధుర్యాన్ని వెతుక్కునేంత గొప్పతనం స్వచ్ఛమైన ప్రణయంలో ఉంటుందని ఈ పంక్తుల భావం. కోరుకున్న లక్షణాలున్న యువతిని చూడగానే ప్రేమ పుడుతుంది. ఆమె తప్ప తనకు మరింకేం వద్దనే భావనను రగిలిస్తుంది. ఇదే భావన ఆమెలోనూ జనించినా జనించకున్నా ఆమె అతనికి అపురూపమే. ఇద్దరిలో అదే ప్రేమ ప్రజ్వరిల్లితే, ఇరువురి పరిచయం కాస్త గాఢతను పొంది ఎన్నో బాసలతో చెట్టపట్టాల్ వేసుకొన్న ప్రేమ గురుతులను హృదయాల నిండా నింపుకొంటారు. కుటుంబ ఒత్తిడో, మరో సామాజిక, ఆర్థిక కారణమో ఆమె అతని నుండి వీడినా, అది శాశ్వత ఎడబాటుగా తెలిసినా ఇరువురికీ ఆవేదన తప్పదు. మది నిండా ఆమెనే తలచి, ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలన్న అతని ఆశలు అడియాశలవుతాయి. అప్పుడతని విషాదం మిన్నంటినా సంయమనాన్ని పాటించక తప్పదు. మనసుకి పలాయన తత్త్వమూ తప్పదు. ఆమె ఇక ఊహా సుందరిగానే తప్ప వాస్తవ జీవితంలోనికి ఎన్నటికీ అడుగుపెట్టదని తెలిసినా ఆ బాధని దిగమింగుకోవలసిందే అపుడతను జ్ఞాపకాలను నిదురలేపక తప్పదు. వాటి తోడిదే జీవితమని సంతోషాన్ని వెతుక్కోక తప్పదు. మనసా వాచా కర్మణా ఆమె సాన్నిహిత్యాన్ని అతి పవిత్రంగానే ఊహించుకొంటూ ఉన్నత గతిలో ప్రేమ యొక్క నిస్వార్థతను, నిష్కపటాన్ని, నిర్మలతను ప్రదర్శించాల్సిన తరుణం అది. అదే విషాద మాధురి. పై పద్యకవితలో ప్రియురాలు ఎవరిని వరించినా, ఎక్కడ నివసించినా, ఇతనితో మాట మాత్రపు సంబంధం లేకున్నా ఆమె మనోగతం ఏదైనా గానీ అతని ప్రేమ నిత్యమై, ఆత్మలొక్కటై, స్నేహశీలతను, సరాగాన్ని మది దాటనీయక ఆరాధించుకోవాల్సిందేనని భావకవి భావించారు. కాకుంటే అవి కల్మషం లేని ప్రేమగా అభివర్ణించడమే విశేషంగా చెప్పుకోవచ్చు.
విషాదమాధురి దశ నుండి నేటి యువత ఎంతో స్ఫూర్తిని పొందొచ్చు. ప్రేమ కపటం లేనిదిగా అది త్యాగాన్ని కోరేదిగా మాత్రమే తలవాలి. ప్రేమ పరిణయానికి దారి తీయకున్నా స్త్రీ స్వేచ్ఛకి భంగాన్ని కలిగించకుండా ఆమె తన నుండి వీడిన కారణాలను అర్థం చేసుకోవాలి. ఆమె బతుకుకి అడ్డం తగలకూడదు. ‘నువ్వు నాకు దక్కకుంటే మరెవరికీ దక్కనివ్వను’ అనే హీరోయిజాల వికృత సినీ సంభాషణలను ఒంటబట్టించుకొన్న కొందరు యువకులు పూర్వ ప్రేయసిపై రకరకాల దాడులు, ఒత్తిడులు చేయడాలు పలు నేరాలకు దారి తీసే ప్రవృత్తిని చూపడాలు వంటి నీచ కృత్యాలకు పాల్పడుతున్నారు. ఈ దుష్ట సంస్కృతిని విడనాడాలి. ఎంత గొప్పగా ఆరాధించగలమో, అంత గొప్పగా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. దక్కని దానికై దుశ్చర్యలు ఎపుడూ తగనివి. సున్నితమైన ప్రేమ మాత్రమే హృదయానికి పరిచయం చేయాలి. దానికి వికృత విధానం అలవర్చడం సరికాదనే సందేశం ఇచ్చే ఉద్దేశ్యం విషాద మాధురి రచనల అంతర్భావం. గొప్ప ఆరాధకునిగా మిగిలిపోవడమే ప్రేమకు, ప్రేయసికి, ఆమె కుటుంబానికి, సాంప్రదాయాలకు ఇచ్చే గౌరవం. మనిషి మనిషిగా ప్రవర్తించాలి గానీ మృగంలా మారకూడదన్నది స్పష్టం చేసారు. భావ కవిత్వంను చిన్నచూపు చూసేవారు భావ కవులు నిర్వర్తిస్తున్న బాధ్యతను కూడా గమనించాలి. వారు మనోల్లాసాన్ని కలిగించడంతో పాటు మార్గదర్శకతనూ నేర్పి విలువలను పెంచుతున్నారన్నది కూడా కవి వర్ణించడం ఈ కావ్యలోని ఆస్వాదించదగిన అంశం.
3.8. ఊహా ప్రేయసీ సృష్టి :
ప్రణయ కవిత్వంలో ఆత్మాశ్రయ రీతిలోని ఊహా ప్రేయసీ సృష్టి భావ కవుల హృదయాలకు వెలుగు. అదే వేవేల కవితా ధారలను వర్ణించే కరదీపిక. స్వచ్ఛంద ప్రణయం ఆశాభంగాన్ని పొందినపుడు ఆ విషాద స్థితి నిరాశావాదాన్నిస్తుంది. అందులో నుండే విషాద మాధుర్యాన్ని అందుకోడానికి సిద్ధపడి ఊహాప్రేయసీ సృష్టిని చేసుకొని ఆమె తనని నీడలా వెన్నంటే ఉంటుందన్న భద్రతను ఉదారంగా పొందుతాడు. వాస్తవంలో చేజారిన ప్రేయసిని ఆమెతో గడపాలనుకున్న తరుణాలను ఊహాత్మక సౌధాలలో పొందుతాడు. ఊహా సుందరిని మనోరథంలో ఒక దేవతని చేసి తన జీవితాంతం సారథిగా ఊరేగించి తన ప్రేమను నిరూపించుకొంటాడు. ఆ ఆనందంలో తన విషాదాలన్నింటినీ మరచి కోరుకున్న సుందరితో అమలిన భావాత్మకతను ప్రకటింపజేస్తూ తనలో ఐక్యం చేసుకొని తృప్తి పడతాడు. మన భావకవులంతా ఈ కోవకు చెందినవారే. విశ్వనాథ సత్యనారాయణ ‘కిన్నెరసాని’నీ, బాపిరాజు ‘శశికళ’నూ, నండూరి ‘ఎంకి’నీ, దేవులపల్లి కృష్ణశాస్త్రి ‘ఊర్వశి’నీ, బుచ్చిబాబు ‘ఊర్వశి’ నీ ఊహాసుందరులుగా సృష్టించుకున్నట్లే బెల్లంకొండ లక్ష్మణ సూరి గారు కూడా ‘ఊర్మిళ’ను కవితారాణిగా చేసుకొన్నారు. ఇలా కవి ఊహాసుందరి ప్రతిష్ఠను ఊహించుకుని చెప్పిన భావాలను ఈ కింది పద్యంలో చూడొచ్చు.
ప్రేమించే హృదయం ఒక దేవతను అధిష్టించుకొని పూజిస్తుంది, ఆరాధనతో ఆమెకై వెతుకుతుంది. ఆమె అతని ఊహాసుందరి. ప్రేమకు మునుపైనా ఆమె మదిలో కొలువవుతుంది. లేదా విషాదమాధురి దశ అనంతరమైనా పునఃప్రతిష్ఠత అవుతుంది. ఏదైమైనా గానీ భావకవులు ప్రేయసిని వీడి బతకలేరు. వారి ఆనందం, వియోగం, విషాదం అన్నీ ఆమె చుట్టూ పెనవేసుకుంటారు. అలా ప్రియునిలోనే ప్రాణం పోసుకున్న ప్రియురాలి గురించి సాగిన పద్యకవితతో హృదయాన్ని రంజింపజేసారు.
‘‘పూవుల సౌకుమార్యమును, పూర్ణ సుధాకర బింబ కాంతియున్
తావుల వశ్య శక్తి, జలదాలు దయామృత హృత్స్వభావమున్
తీవెల వోలె నల్లుకొని తిన్నగ ముందుకు సాగు దృష్టియున్
నీవుగ రూపు దాల్చె రమణీ! హృదయంగమ సంగమంబుగా’’ 10
మనసు కోరిన, ప్రేమార్తిని తీర్చి జంటగా నిలిచి నడిచే ప్రేయసిని సృష్టించుకొని హృదయ సంగమం చేసుకున్న భావకవి ఆనందామృత జల్లులను పద్యాక్షరాలు స్పష్టంగా కురిపించాయి. తాననుకున్న రూపు రేఖలు, గుణగణాలతో ఉండే సుధామయి అవతరణ భావకవికి విశ్వాన్ని జయించినంత ఆనందాన్నిస్తాయి. ప్రణయ కవిత్వానికి ఉన్న గొప్పతనం అదేనన్నది స్పష్టం. రచయిత రమణీయ వర్ణనలో ఎక్కడా అసభ్యత లేకపోవడం, ప్రబంధ కవులవలె అంగాంగ వర్ణన చేసిన విధంగాని కానరాకపోవడంను గమనించవచ్చు. హద్దులు దాటని సున్నిత ప్రేమ మాధుర్య వర్ణనా క్రమాన్ని ఊహా సుందరికి ఆపాదించి కనులకు కట్టడాన్నిక్కడ చూడొచ్చు. తనలో రగిలిన ప్రేమ దావానలాన్ని చప్పున చల్లార్చే శీతలశక్తి ఆమెకు రంగరించిన వైనంలో భావకవి చేయి తిరిగిన సృష్టి ప్రదాతని మించారు. తన కన్నీటి తెరలను తుడిచి పన్నీటిని చిలకరించే రూపలావణ్య లాస్యాది గుణాలను పోత పోసిన తీరుని ప్రదర్శింపజేసి కళాకారుడనిపించుకొని నచ్చిన శిల్పాన్ని మది దేవతగా పరిచయం చేసారు. ఆమెలో సుకుమారాన్ని, ఆకర్షణను, దయా హృదయాన్ని, సదృష్టిని కోరుకొని సంస్కారాన్ని చాటారు. ప్రేమించే హృదయం కోరుకునే లక్షణాలెపుడూ సాంప్రదాయబద్దమై సవ్యరీతిలోనే ఉంటాయన్న విషయం భావకవుల ఊహా సుందరుల విషయంలో తేటతెల్లం చేసారు. ప్రేమ భావాలు ప్రణయంతో పెనవేసుకొని ఊహాల్లోనైనా, వాస్తవంలోనైనా సేద తీర్చాలనే తపన అందరిలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమకు అనుకూలమైన, సరిపడే వ్యక్తిత్వమున్న వారినే జీవిత గమనంలో తోడుగా చేసుకోవాలన్న కాంక్ష ఉంటుంది. అలాంటి వారికై వేచి చూడటం ఊహలలో విహరించడం సాంత్వననిస్తాయన్నది ఇక్కడి భావంగా గ్రహించవచ్చు.
బాధను దిగమింగుకోవాలన్నా, ఆనందాలలో సాగిపోవాలన్నా ఓ తోడు అవసరం. ఒంటరి వారికైనా, వేదనలో ఉన్నవారికైనా మానసికంగా ఓ సాహచర్యాన్ని ఊహల్లోనైనా కోరుకుంటారు. అదే ప్రేమతత్వంలోని సాన్నిహిత్య భావన. కష్టసుఖాలు అయినవారితోనో మనసుకు నచ్చిన వారితోనో పంచుకోవడంతో హృదయోపశమనం కలుగుతుంది. ఇప్పటి హడావుడీ జీవితాలలో జీవితాన్ని అనుభవించడం మర్చిపోతున్నారు. ఆకర్షణలే ప్రేమలై క్షణికాలవుతున్నాయి. కేవల పుస్తక ఆస్వాదన చేసే సమయమైనా లేకపోతుంది. ఇక ఊహలు, ఊహాసుందరుల గురించి ఆలోచనలేదు. కాకుంటే ఆ లోటు తీర్చే వీలుని భావకవిత్వం కల్పిస్తుంది. ప్రశాంతతనిచ్చి మన వివిధ భావాలను ప్రతిబింబిస్తూ మనల్ని మనకే కొత్తగా పరిచయం చేస్తుంది. ఎప్పుడూ ఉండే సమస్యలు, హృదయాందోళనల చర్చే సాహిత్యంలోనూ ఉన్నపుడు ఆలోచన, చైతన్యాలపరంగా పర్లేదు. కానీ మనిషిలోని ఆస్వాదన, అనుభవపూర్వకతా పరిచయాలను చేయించేది మాత్రం చిత్తశాంతేనని, అందుకే ఈ సౌందర్యారాధన అని రచయిత రుజువు చేసారు.
3.9. ప్రేయసీ పూజ్యత :
ప్రబంధ కవులపై యుద్ధం ప్రకటించినట్లు వెల్లువిరిసినదే భావకవిత్వం. స్త్రీ విషయంలో అంగాంగ వర్ణనలతో దిగజార్చిన ప్రబంధ కవులకు భిన్నమైన ధోరణితో ఆత్మపరమైన సౌందర్యాన్ని మిన్నగా కొనియాడి ఆమెకో గౌరవ హృదయ పీఠాన్నిచ్చిన ఘనత భావకవిత్వ సృష్టికర్తలకే దక్కుతుంది. విరహంలోనో, విషాదంలోనో వారు ప్రేయసిని తూలనాడటంలోనూ ప్రేమనే ప్రస్ఫుటం చేయడం విశేషం. ఒకరకంగా భక్తుడు దేవతని నిష్ఠూర మాడినట్లే అనిపింప జేసారు. భావకవులందరూ ఇదే ధోరణితో ప్రేయసీ పూజ్యతను మర్యాదపూర్వకంగా వ్యక్తపరిచారు. ఊహాసుందరి అయిన ప్రేయసిని తనలో సగభాగంగా ఎంచి దగ్గరితనాన్ని చూపినా ఎక్కడా అమర్యాద పరచలేదు. దీన్ని బట్టి సాంప్రదాయబద్ధత సాహిత్యపరంగా ఉండాలనే సందేశాన్ని రాబోవు రచయితలకు సూచించారు లక్ష్మణసూరి. అలాంటి ప్రేయసీ పూజ్యత దశను లక్ష్మణసూరి అద్భుతంగా కవిత్వీకరించారు.
స్త్రీని ఆదిశక్తిగా పూజించే సాంప్రదాయం మనది. నదీమతల్లుల చల్లని చూపే అన్నదాతల ఫలసాయమని లోకం యొక్క ఆకలిని తీర్చే సౌభాగ్య ప్రదాయినిగా భావిస్తారు. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడే దేవతలుంటారని, సంతోష సిరులన్నీ కొలువు తీరుతాయని చెప్పే వేదాలు వెలసిన పుణ్యభూమి. ఈ విషయాన్ని భావకవులు బాగా గుర్తుంచుకున్నారు. ప్రేయసి చిరునవ్వులు వాడనీయక నిత్య ఆనందాలు అందిస్తూ వారి సుఖాన్నే ఆశించిన దొడ్డ మనసు వీరిదని ఈ పద్యకవితను చూస్తే తెలుస్తుంది.
‘‘నవ్వుల వాడనీకు లలనా! భగవానుని దివ్య దీవెనౌ
పువ్వుల వర్ణకాంతులను పుక్కిట బట్టుచు హర్షవర్షమై
రువ్విన జల్లులవ్వి! మధురోహల లాస్య విలాస లోకనల్
రవ్వల మువ్వ నవ్వు - మది రంజిల జేయును, పంచి మించులన్!’’ 11
నవ్వు సిరికి ప్రతిరూపం. ఆడపిల్ల చిరునవ్వులే ఇంటికి వెలుగు. ఇది ఆమెకు ఆ దేవతామూర్తుల నుండి వారసత్వంగాను, వరప్రసాదంగాను వచ్చిన దివ్యశక్తి. దాన్ని జీవితాంతం నిలపాలనుకొనేవాడు ఆమెను నెత్తిన పెట్టుకొని చూసుకుంటాడు. ఏ చిన్న బాధ అయినా తన వలన పడకూడదనుకుంటాడు. భావకవితా నాయకుడెపుడూ ప్రేయసిని సునిశిత కుసుమంతో పోల్చి తనవలన సహజ గుణాలైన తావి, వర్ణం, ఆహ్లాదకత్వం వసివాడకూడదని అనుకొంటాడో అదే విధంగా స్త్రీయొక్క సహజ సౌమ్యాలు కూడా పరిరక్షించే బాధ్యతను నియమబద్ధంగా నిర్వర్తిస్తాడు. సృష్టిలో కుసుమాలు, స్త్రీ అత్యంత సుకుమారమైనవిగా ఆ భగవంతుడు దీవించాడు. అలాంటి పూల వర్ణాల హరివిల్లులను ప్రేయసి దరహాసంలో దర్శించిన ప్రియుడు కలకాలం ఆ హాసాన్ని అలాగే నిలపాలని ప్రతిజ్ఞ చేసుకుంటాడు. తన హృదయం, గృహం ఆమె నవ్వుల చల్లదనంతో నిండినపుడు ఆనందాల జల్లులు వెల్లువలెత్తుతాయన్న భావనతో ఆమెని, ఆమె నవ్వుని అభిమానించి గౌరవిస్తాడు. ఇలాగే ఆమె వాక్కు, ప్రేమ, నడత అన్నీ అతనికి దివ్యమైనదే. నవ్వుని పంచినా, పెంచినా అది ప్రశాంతతను కోరుకొని అనుభూతుల వర్ణాలను జీవితంలో ఆవిష్కరించుకోవాలన్న ప్రయత్నంలో భాగమని స్త్రీ వరసకు తనకు ఏమైనాగానీ ఆమెకు గౌరవలోపం జరగక చూసుకోవాలన్న ప్రబోధాన్ని ప్రణయ కవిత్వంలో పొందుపరచడం సాహిత్యపరంగా చులకన చేయబడిన స్త్రీ స్థానాన్ని తిరిగి సరిచేయడంలో చేసిన ప్రయత్నంగా తలపింపజేసారు.
సాహిత్య పరంగానైనా, సామాజికంగానైనా స్త్రీ స్థానం అట్టడుగున ఉండేలా పురుషాధిక్యత ఆదేశించింది. ఆమెనో సౌందర్య నిధిగానో, నాలుగు గోడల మధ్య గృహిణిగానో ఉంచి సముచిత స్థానాన్నివ్వలేదు. భావకవుల చెలిమి ప్రేయసితో కూడి ఆమె వ్యక్తిత్వంతో కలసి చరించేదిగా ఉండటంతో ఆమె అతని దృష్టిలో ఉన్నతమైనది. ఆ స్థాయి నుండి దించకూడదన్న సంస్కారాన్ని సాంప్రదాయంగా భావ కవులందరూ ఆచరించారు. పైగా కాల్పనిక సాహిత్యంపై పాశ్చాత్య రచయితల ప్రభావం, ప్రపంచ వ్యాప్తంగా స్త్రీ తన ఉనికిని చాటాలని చేస్తోన్న ప్రయత్నాన్ని వీరు గమనించారు. ఏదో కొద్ది చోట్ల మినహా దాదాపు ఆమె పూజ్యనీయతని కొనసాగించారు. నేటి ఆధునిక సమాజంలో స్త్రీని ఒక ఆటవస్తువుగా, సంపాదనా యంత్రంగా, పనులకే పరిమితమైన మరబొమ్మలా భావించడం, యువతుల పట్ల హింసాత్మక చర్యలకు పాల్పడటం, వరకట్నాదులకు బలిచేయడం వంటి అకృత్యాలు ఆమె పట్ల జరుగుతున్నాయి. వారికో గుణపాఠంలా ‘పూజ్యనీయత’ అనే భావనని కలిగింపజేయడం ఆవశ్యకం. ఆ బాధ్యతని భావకవిత్వపు ప్రణయశాఖలోని పూజ్యనీయతా దశలో ప్రతిఫలింపజేయడం భావకవులకుండే అనురక్తిని స్త్రీల పట్ల ప్రదర్శింపజేయడం ద్వారా మార్గదర్శకులయ్యారు. ప్రేయసి పట్లనైనా అదే పూజ్యనీయతతో నడుచుకోవడం సబబు అనే భావనకు తావిచ్చారు.
3.10. కులపాలికా ప్రణయము :
భారతీయ సాంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఉన్నత స్థానముంది. ఒక కుటుంబ నిర్వహణలో భార్యాభర్తలిరువురి పాత్ర ప్రధానమైనది. అందుకే భావకవిత్వం ప్రేయసిగాను, భార్యగాను స్త్రీకి ఉన్నత స్థానమిచ్చింది. ఇల్లాలిని హృదయేశ్వరిగాను, ఆమెతో ప్రణయం తన అదృష్టంగాను ఎంచి భావకవుల కవిత్వంలో తమ అర్ధభాగాన్ని కొనియాడి అర్ధనారీశ్వర తత్త్వాన్ని బలపరిచారు. తన సహధర్మచారిణిగా కష్టసుఖాల్లో వెంటనడిచి వంశాభివృద్ధి చేసే దేవతగా అభివర్ణించి ఆమెను, ఆమెపై తమ ప్రేమను శాశ్వత బంధంగా చెప్పి అది జన్మజన్మలకూ సరిపోనిదని అనుబంధాన్ని గొప్పగా చాటారు. ప్రణయ భావన, ప్రేమ భావన విషయంలో ప్రేయసే ఇల్లాలిగా మారినా, లేక భార్య స్థానంలోనికి వచ్చిన మగువను సమానంగా ఎంచి తమ జన్మ సార్థకతలో వారికీ భాగముందని భావించడం ప్రశంసనీయం. ఈ ఔన్నత్యాన్ని భావకవిత్వంలోనే చూడగలం. ఈ దృక్పథాన్ని లక్ష్మణసూరి ఈ కావ్యంలో ఎంతో ఔచిత్యంతో వర్ణించారు.
స్త్రీకి సముచిత స్థానాన్ని సాంప్రదాయాలు ప్రసాదించాయి. కాకుంటే పురుష సమాజంలో ఆమెది మగవాని తరువాత స్థానంగానే భావింపబడిరది. అది సమాజం, కుటుంబం అని తేడా లేక పురుషుని అనుసరించడమే సహధర్మచారమనే పతివ్రతా ధర్మాన్ని పాడు చేసాయి. అలాంటి భార్య ఎక్కడో పుట్టి తనని వెతుక్కొంటూ వచ్చి తన ఇంట కాలుపెట్టి అత్తమామలనే తల్లిదండ్రులుగా తలంచి వారి సేవలో తరిస్తుంది. భర్త అడుగుజాడలనే తనవిగా చేసుకొని తన స్వచ్ఛమైన ప్రేమతో తరింపజేసి అత్తింటి వారసత్వానికి జన్మనిస్తుంది. ఆమె త్యాగాలను గుర్తించిన భావకవి తన కవితల ద్వారా ఆమె సేవలను పొగిడి ఆమెకో సమున్నత గౌరవాన్ని సాహిత్య రూపేణా ఇచ్చి చరిత్ర కెక్కించాడు. అలా తన ఇల్లాలే కంటికి, ఇంటికి వెలుగు అని అంటోన్న భావకవి దృక్కోణాన్ని ఈ పద్యకవిత ఆవిష్కరించింది-
‘‘ఇంటి దీపమై బ్రతుకు నింపుగ దీర్చగ, రక్తి నింపగా
కంటికి దీపమైతివి, జగమ్మున నెల్లెడ సోయగమ్మునే
గంటిని నిన్ను నింపికొనిÑ గాఢ తమిస్రమె కాంతి సోన నా
కంటిని! విశ్వమే వలపు కాకృతి నిచ్చిన మాతృమూర్తిగా!!’’ 12
‘ఇంటికి దీపం ఇల్లాలు’ అని ఆమె కరిగే క్రొవొత్తిలా గృహానికి వెలుగునిచ్చి సంసారానికి వన్నె తెచ్చిన స్త్రీ మూర్తిగా సంపూర్ణతని జీవితానికిచ్చిన వైనాన్ని ఎంతో గొప్పగా పై పద్యం ఆవిష్కరించింది. పూర్వ భావకవులైన విశ్వనాథ సత్యనారాయణగారు, నాయని సుబ్బారావు గార్లు కుల పాలికా ప్రణయానికి పెద్దపీట వేసారు. రచయిత వారిని గుర్తుకు తెచ్చేలా ప్రస్తుత పద్య చిత్రణని గావించారు. ప్రేమ, పెళ్ళి, ప్రణయం, సంసారం, సాహచర్యం అన్నింటిలోనూ స్త్రీ పాత్రే ప్రధానం. ప్రేయసిగా, భార్యగా, తల్లిగా ఆమె నిర్వర్తించే విధులు అనన్యసామాన్యం మరియు విలువ కట్టలేనివి. భర్త తోడు లోకంగా అత్తింటి గౌరవాన్ని నిలపడమే లక్ష్యంగా చేసుకొని నిత్యం శ్రమించి సమాజంలో తన కుటుంబానికి విలువను కల్పిస్తుంది. బ్రతుకుని వెన్నెల ప్రాయంగా తీర్చిదిద్ది భర్తను కంటిపాపలా చూసుకొని అతని దృష్టిపథంలో ఉన్నత స్థానాన్ని పొందుతుంది. అనంత భూ మండలాన్ని సహనంగా మోస్తున్న భూమాతకు వారసురాలై నవమాసాలూ బిడ్డను మోసి తన ప్రాణాలను పణంగా పెట్టే మాతృస్థానానున్న భార్యను నిత్యం పూజించినా అది తక్కువేనన్న భావనను పద్యకర్త కలిగించారు. అఖండ భూమండలంలో స్త్రీస్థానం సూర్యచంద్రుల ప్రకాశం ఉన్నంత వరకూ వెలుగొందుతుందనే గౌరవ ప్రపత్తులను కులపాలికా ప్రణయ దశలో ప్రదర్శించిన భావకవి ఉత్తమపురుషుడన్న దృక్పథానికి ఊతమిచ్చారు.
నేడు స్త్రీ స్థానం భార్యగా, తల్లిగా చాలా దిగజారిపోయిన పరిస్థితులున్నాయి. తల్లిగా ఆమె సేవల్ని జీవితాంతం పొంది చివరి దశలో అనాథగా వదిలే కొడుకులున్నారు. ఆమెనో పనిమనిషిగా ఇంట్లో పనులకు వినియోగించే అధమపుత్రులు కూడా కానవస్తున్నారు. భార్యను కట్నాల కోసం పీడిరచి ఆమెనో యంత్రంగా తలిచి పెత్తందారులైన భర్తలున్నారు. ఎంతటి ఉద్యోగస్తురాలైనా ఇంట్లో హీనంగా చూడబడే పరిస్థితులు కుటుంబాలలో ఉన్నాయి. ఇలా సమాజంలో ఆమె స్థానం చులకన చేయబడటం భావకవులను కలచివేసింది. తనతో పాటు కలిసి నడుస్తూ అన్నీ పాలుపంచుకొనే భార్యకు గౌరవాన్నివ్వడం తమ బాధ్యతగా చేయడం సమాజంలో స్త్రీలపై దౌర్జన్యాలు చేసేవారి కళ్ళు తెరిపించడమే. సంఘం పురుషునిది మాత్రమే కాదు అతనికన్నా బలహీనురాలైనా బలాన్ని కూడగట్టుకొని అతనితో సరి సమానంగా పోటీ పడుతున్న నారీ లోకానికి సముచిత స్థానాన్నివ్వడం ధర్మంగా భావించారు. ప్రణయ కవిత్వంలో ఆమెకు ఓ గౌరవ ప్రద దశను సమర్పించుకొన్నారు. వెలుగులు నింపే భార్యకు ఈ కానుక చంద్రునికో నూలుపోగువంటిదని భావించి మార్గదర్శకులయ్యారు. స్త్రీ పూజ్యనీయతే మన సాంప్రదాయమని విన్నవించారు.
4. ముగింపు :
- ‘వాసంత సమీరం’ ఒక శృంగార కావ్యం. ఇందులో భావ కవితా శాఖ అయిన ప్రణయం చాలా ఉన్నతంగా అభివర్ణింపబడటం విశేషం. ఇందులో భాగంగా ప్రణయ దశలన్నింటినీ ప్రతిబింబిస్తోన్న పద్యకవితలలో ప్రేమ, ఆర్తి, ఆనందం, వియోగం, బాధ, విషాదం వంటివన్నీ తగుపాళ్ళలో రంగరించి ఓ గొప్ప భావకావ్యంగా మలిచారు.
- ప్రేయసిలోని ప్రేమ దృక్కోణాన్ని ప్రియుని ఆరాధనా భావాలను, ఎడబాటునీ, విరక్తినీ విషాదాన్ని ఉవ్వెత్తున ఎగసే అక్షర వాహినులుగా ప్రవహింపజేసారు. ఇందులో భాగంగా స్త్రీ పూజ్యతను ప్రతిఫలింపజేస్తూ ఆమె భర్త కనులకు ఇంటికి వెలుగు ఎలా అయిందో చర్చించి సమాజానికి ఒక సందేశాన్ని కూడా అందించారు.
- భావకవిత్వం అంతా ఊహాత్మకమని, ఉపయోగం లేనిదని చెప్పేవారికి భావకవులే హృదయమున్న వారని తమ కవితా రaరిలో ఆనంద సాగరాలలో పయనింపజేసి సేద తీర్చే సాహితీ కారులని ఈ పద్య కవితలు నిరూపించాయి.
- పద్యకవిత్వం అనగానే సుదీర్ఘత, క్లిష్టత ఉంటాయని అనుకొనేవారికి ఆ అభిప్రాయం తప్పు అనీ వ్యాకరణ బద్దమైనా, సాంప్రదాయ ప్రాచీన శిష్టతైనా వస్తువును బట్టి తీర్చిదిద్దే విధానంలో వైవిధ్యాన్ని చూపవచ్చునని నిరూపించారు.
- ఆధ్యాత్మికత క్షీణించడం వలన ఆత్మసాక్షికి, భక్తికీ, భయానికీ లోబడక హద్దులు మీరాడని అంటూనే ఆ భగవంతుడు పూనుకొంటే సరికానిది ఏదీ ఉండదని తేల్చిచెప్పారు.
- వ్యవస్థల తప్పు త్రోవలకు పాలించే వాడు సరైనవాడు కాకపోవడం, పాలన పేరుకే ప్రజాస్వామ్యాన్ని ప్రతిపాదిస్తూ స్వార్థరాజకీయాలకు మార్గం వేసిన స్వార్థత్వాన్ని ఎండగట్టారు.
- సాయం చేయాలనే గుణం ప్రధానం కానీ సాటిమనిషిలో దైవత్వాన్ని చూడగలమని ప్రబోధించడం దానికి సాయిని కర్తను చేసి చూపి విద్యా, వైద్య, నీటి సదుపాయాలకు, కనీస అవసరాలు తీర్చాలనే మార్గదర్శకత అనుసరణీయమని సాక్ష్యాలను ముందుంచారు.
- నేటి గజిబిజి జీవితం స్వచ్ఛమైన ప్రేమను అందించలేకపోతోందని తెలిపి ప్రేమ, విరహం, స్మృతి, విషాదం, ఊహాసృష్టి వంటి ఆత్మాశ్రయ భావ కవితా ప్రణయశాఖలను పరిచయం చేస్తూ మానవ జీవితానికి కల్మషంలేని ప్రేమ ఉండాలని ప్రతిపాదించారు.
12. సూచికలు:
- తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, పుట: 393
- వాసంత సమీరం, పుట:12, పద్యం- 2
- పైదే. పుట:50, పద్యం- 4
- పైదే. పుట:32, పద్యం- 5
- పైదే. పుట: 43, పద్యం- 4
- పైదే. పుట : 41, పద్యం- 2
- పైదే. పుట: 28, పద్యం- 5
- పైదే. పుట: 12, పద్యం- 3
- పైదే.పుట: 38, పద్యం- 5
- పైదే. పుట: 2, పద్యం- 1
- పైదే. పుట :43, పద్యం- 1
- పైదే. పుట: 36, పద్యం -4
13. ఉపయుక్తగ్రంథసూచి:
- చంద్రశేఖర రెడ్డి. రాచపాళెం. “ఆధునికాంధ్ర కవిత్వం- ఉద్యమాలు, సందర్భాలు”, ఆర్ లక్ష్మీ, లౌకికనాథ కోలనీ, అనంతపురం, 2002
- నరసింహం. కె.వి.ఆర్. “ఆధునికాంధ్ర కవితా సమీక్ష”, గంగాధర పబ్లికేషన్స్, విజయవాడ, 1982
- నారాయణరెడ్డి. సుంకిరెడ్డి. “ఆధునిక తెలుగు కవిత్వం- తాత్విక నేపథ్యం” (పిహెచ్.డి. సిద్ధాంత వ్యాసం), 1990
- రంగనాథాచార్యులు, కె.కె. “ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు”, ఆంధ్ర సారస్వత పరిషత్, హైదరాబాద్, 1982
- లక్ష్మణసూరి, బెల్లంకొండ.“వాసంత సమీరం”(పద్యకావ్యం), విజయశ్రీ ప్రచురణలు, వెంకటాపురం, వేంసూరు, ఖమ్మం, 2004
- లక్ష్మణ సూరి, బెల్లంకొండ.: “ప్రణతి”, విజయశ్రీ ప్రచురణలు, వెంకటాపురం, వేంసూరు, ఖమ్మం, 2004.
- సిమ్మన్న. వెలమల,: “తెలుగు సాహిత్య విమర్శ సిద్దాంతాలు”, దళితసాహిత్య పీఠం ప్రచురణ, విశాఖపట్నం, 2005
- సుబ్రహ్మణ్యం,తిప్పావజల. : “సామాజిక సరిగమలు”(పద్యకవిత్వం) నవ శంఖారావం పబ్లికేషన్స్, శ్రీవారి నిలయం, సుబేదారు పేట, నెల్లూరు, 2010
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.