headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. అన్నమయ్యభాషలో నామరూపవిజ్ఞానం: ప్రయోగాలు - భాషాశాస్త్రం

డా. ఎం. ప్రసాద్ నాయక్

సహాయ ఆచార్యులు, ద్రవిడయన్ & కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్,
ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం,
చిత్తూరుజిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494697904, Email: prasadnaik6@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 13.12.2024        ఎంపిక (D.O.A): 28.12.2024        ప్రచురణ (D.O.P): 01.01.2025


వ్యాససంగ్రహం:

అన్నమయ్య భాషలో విజ్ఞానం, ప్రయోగాలు దృష్ట్య మనం గాని చూసినట్లయితే తెలుగు సాహిత్య చరిత్రలో అనేకమంది వాగ్గేయకారులు వివిధ రకాలైన సాహిత్య రచనలను మనకు అందించారు. వారిలో వాగ్గేయకారుడైన అన్నమాచార్యుల భాష త్రివేణి సంగమం. సంస్కృతం, విశిష్టవ్యవహారం, పల్లీయుల వ్యవహారికం కలిసే ఉంటాయి. ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమయ్య భాషలో నామరూప ప్రతిపాదికలు గురించి, తత్సమ పద నిర్మాణం, వైకృత పద నిర్మాణం, సర్వనామాలు, లింగ వచనాలు ఎలా ప్రయోగించబడ్డాయో, ఈ వ్యాసం చర్చిస్తుంది. ఇంతకు మునుపు ఎంచుకున్న పరిశోధన అంశానికి సంబంధిన పూర్వపరిశోధనలు, వచ్చిన కొన్ని గ్రంథాల ఆధారంగా చూస్తే ‘అన్నమయ్య భాష’ అనే వ్యాసం వైజ్ఞానిక త్రైమాసిక పత్రికలో ప్రచురించబడినది. అలాగే ‘అన్నమయ్య భాషలో ప్రయోగాలు’ మరియు తూమాటి దోణప్ప రాసినటువంటి ‘తెలుగు వైకృత పదాలు’ సంపుట తెలుగు భాష చరిత్ర అనుగ్రంధంలోను ప్రచురించింది. పరవస్తు చిన్నయ్యసూరి రచించినటువంటి ‘బాలవ్యాకరణం’ లోని కొంత భాగం మరియు గంగప్ప రచించినటువంటి గ్రంథం ‘అన్నమాచార్య సంకీర్తన సుధా’ మొదలైన మరి కొన్ని రచనలు ఈ వ్యాసనికి ఆధారంగా స్వీకరించడం జరిగింది. పద్యకవిత్వ భాషలో లేని ఎన్నో విశిష్ట ప్రయోగాలు అన్నమయ్య భాషలో కనిపిస్తున్నాయి. శాసనభాషలో కనిపించే ఈ ధ్వని మార్పు అన్నమయ్య భాషల్లో కూడా కనిపిస్తుంది. ఈ రకమైన అధ్యయనాలు రచయితలు స్పష్టంగా గుర్తించారని సోదాహరణంగా తెలియచెప్పడం ఈ వ్యాసపరమావధి.

Keywords: నామరూపాలు, విజ్ఞానం, అన్యదేశ్యాలు, లింగం,వర్ణలు,సాహిత్యాం, ప్రయెగం, వ్యావహారిక భాష.

1. ఉపోద్ఘాతం:

శ్రీ వేంకటేశ్వరుని స్తుతిస్తూ అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల్లో మనకు 13,718 సంకీర్తనలు 26 సంపుటాలలో లభ్యమవుతున్నాయి. అన్నమయ్య సాహిత్యం దేశి సాహిత్యానికి చెందుతుంది. నన్నయ, తిక్కన సాహిత్యం మార్గ కవితకు చెందినది కాగా, పాల్కురికి సోమన ద్విపద రచనలు దేశ సాహిత్యానికి చెందుతాయి.

అన్నమయ్య జీవించింది పద్య కవిత్వ కాలంలోనైనా, తాను పద సాహిత్యాన్ని ఎంచుకున్నాడు. ఇతనికి “పదకవిత” అనే బిరుదు ఉంది.  తాను రచించేది భక్తి సాహిత్యం. అందువల్ల అన్నమయ్య తాను పండితుడైనా, సంస్కృత భాషలో ప్రావీణ్యం ఉన్నా పనిగట్టుకుని 'పల్లీయుల' భాషలోనే సంకీర్తనలు రచించాడు. పద్య కవిత్వ భాషలో లేని ఎన్నో విశిష్ట ప్రయోగాలు అన్నమయ్య కవిత్వంలో కనిపిస్తాయి. వాటిని ఒక్కో అంశం కింద పరిశీలిద్దాం.

2. నామరూప విజ్ఞానం:

ఇందులో నామ ప్రాతిపదికల గురించి, తత్సమపద నిర్మాణం గురించి, వైకృత పద నిర్మాణం గురించి, సమాసాలు, సర్వనామాలు, లింగం-వచనం, నామవిభక్తుల రూప నిర్మాణం గురించి చర్చించడం జరిగింది.

2.1 నామరూప ప్రాతిపదికలు:

తెలుగులోని నామప్రాతిపదికలను దేశ్యాలు, అన్యదేశ్యాలని రెండు విధాలుగా విభజించవచ్చును. దేశ్య, నామ ప్రాతిపదికలకు సాధారణంగా స్వాభావికమైన ప్రత్యయమేదీ చివరలో చేరదు. అయినా కూడా కొన్ని నామ ప్రాతిపదికలకు లింగ వచన సూచక ప్రత్యయాలు చేరుతాయి.

2.2 నిష్పన్న నామములు:

క్రియాధాతువుల నుండి నిష్పన్నమైన నామాలను సాంప్రదాయకంగా కృదంతములు అని వ్యవహరిస్తారు. తెలుగుభాషలో పెక్కు క్రియలు ఎట్టి ప్రత్యయములేకయే నామవాచకములుగా వ్యవహృతములగును. అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తనలు (సంపుటం-1) నుండి ఈ క్రింది ఉదాహరణలు చూద్దాము.

పదము

క్రియార్థము

నామార్థము

అదరు

చలించు: 1.304.6

బాధ: 1.319.12

ఉబ్బు

బయపడు: 1.96.10

సంతోషము: 1.34.4

ఒప్పు

ప్రకాశించు: 1.149.1

కాంతి: 1.468.4 (అ. భా. ప్ర. పుట -83)

క్రియాధాతువుల నుండి ఏర్పడిన నామవాచకము రూప నిష్పత్తిలో కొన్ని సంధిగతమైన మార్పులు గోచరిస్తున్నవి. 'కృత్' ప్రత్యయము చేరుటకు ముందు తరచుగా ధాతువులయందలి అంత్యాక్షరములు లోపించుటను చూడవచ్చు. నామవాచకములు ప్రాథమిక ధాతువులనుండి పరిణామం పొందినట్లు తెలుస్తోంది. (రూప) నిష్పాదక ప్రత్యయములు చేరుటచే నామవాచకాలు ఏర్పడలేదు.

కొన్ని ప్రాధమిక ధాతువులు ద్వితీయావస్థయందు హ్రస్వమునొంది కృదంతము నందు మరల దీర్ఘము నొందును .

కుడు  - కుడు  (చు) - కూడు . 1.71.3 - చా - చ (చ్చు) - చా (వు) 1.485.9
చెడు- చే టు 1. 1.97.11 పడు - పాటు : 1.55.10
పొడు - పోటు : 1.109.8 ముడు - మూట : 1.81.8 (అ. భా. ప్ర. పుట -85)

నిష్పాదక ప్రత్యయములు: అన్నమయ్య సంకీర్తనల్లో గమనిస్తే

3. కృత్ప్రత్యయములు:

సాధారణంగా కృత్తు లీక్రింద సూచించు ప్రత్యయము కలయికచే ఏర్పడుతాయి.

అకము - వంటకము - 1.138.3 (బాలవ్యాకరణం, కృదంతం -9)
అటము - ఇరుకట (గడ)ము (- ఇరుకు) - 1.58.3
అడము: ఉప్పవడము (ఉప్పగు) - 1.148.1 (అ. భా. ప్ర. పుట -85)

నామ ప్రాతిపదికల్ని సామాన్యనామాలు, సమాసనామాలు అని మరొక రకంగా విభజించవచ్చు.

3.1 సామాన్య దేశ్యనామాలు :

కొన్ని దేశ్య సామాన్య నామాలకు మహద్వాచకంలో 'ండు-ఁడు' ప్రత్యయం, మహతీ ఏకవచనంలో - 'అలు', మహతీతర అమహత్ ఏకవచనంలో '౦బు, మ్ము, ము' అనే ప్రత్యయాలు చేరతాయి. అయితే చాలావాటికి పై ప్రత్యయాలు చేరవు. తత్సమ, తద్భవాల మీద చేరే ‘డు, ము, వు' అనే ఏకవచన ప్రత్యయాలు దేశ్య పదాలు 'చాలా వాటిమీద చేరవు.

3.2 తత్సమపదనిర్మాణం :

సంస్కృతంలో శబ్దాన్ననుసరించి లింగ విభజన రూపొందగా తెలుగులో అర్థాన్ననుసరించి లింగ (వాచక) విభాగమేర్పడింది. లింగనిర్మాణంలో ఇట్టి భేదముండుటచే సంస్కృత ప్రాతిపదికలకు తెలుగు లింగబోధక ప్రత్యయాలు చేరి తత్సమములేర్పడుతున్నాయి. సంస్కృతంలోని ప్రకృతులు తత్సమమునందు. ప్రకృతులయ్యేటప్పుడు కొన్నిసార్లు మార్పులకు లోనవుతాయి.
అజంత ప్రాతిపదికలు అన్నమయ్య సంకీర్తనల్లో ఈ రూపాలను పరిశీలిద్దాం.

3.2.1 అకారాంత మహద్వాచకములు:

సంస్కృతములో పుంలింగ ప్రాతిపదికలు సాధారణంగా తెలుగు మహద్వాచకాలపై -ండు/ ఁడు అను లింగబోధక ప్రత్యయాలను చేర్చుకొనును. అప్పుడు సర్వసామాన్యముచే ప్రాతిపదికాంతమైన అకారమునకు ఉకారము వచ్చును. (బాలవ్యాకరణం తత్సమ 21,22,19) 

ఉదా : దేవదేవుఁడు : దేవ - దేవు-ఁడు : 1.400.1

శాసనభాషలోని 'దేవుడు' అను రూపం తర్వాత కాలంలో దేవుండుగా మారినది. తత్సమ శబ్దంలో -ండు/- ండ్డు అను ఉకారంతో ప్రాతిపదిక చేర్చబడలేదు.

కూళండ - 1.286.12 (అ. భా. ప్ర. పుట -90)

సంస్కృతం నుంచి గాని, ప్రాకృతం నుంచి గాని తెలుగులోకి వచ్చి చేరే రూపాలు రెండు రకాలు. 1. తత్సమాలు  2. తద్భవాలు. తత్సమాలు రెండువిధాలు. a. సంస్కృతసమాలు b. ప్రాకృతసమాలు

సంస్కృత సమాలు:

సంస్కృత, ప్రాకృత ప్రాతిపదికల్లో చిన్నచిన్న మార్పులు జరిగి, తెలుగు ప్రథమావిభక్తి ప్రత్యయాలను చేర్చుకొని లేదా లోపింప జేసుకొని ఏర్పడేవి సంస్కృత సమాలు లేదా ప్రాకృత సమాలు. ఈ రెంటిని కలిపి చిన్నయసూరి 'తత్సమాలు' అన్నాడు. (అ. భా. ప. పుట -48)
ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనల్లోని (సంపుటం-6) సంస్కృత సమ నిర్మాణాన్ని గురించి, ప్రాకృత సమ నిర్మాణాన్ని గురించి తెలుసుకుందాం.

తెలుగుభాషలో చేరే తత్సమాలు రెండు రకాలు.

'అనుభవ' అనే పుంలింగ సంస్కృత ప్రాతిపదికకు అమహద్వాచకం కాబట్టి 'ము' వర్ణకం చేరాలి. కాని అన్నమయ్య సంకీర్తనల్లో 'అనుభవన' అనే రూపం కనిపించడం విశేషం.

అనుభవనకెల్ల నీవాతనికిని (6.89.14)

'ము' వర్ణకానికి బదులుగ'౦' రావడం వ్యావహారిక భాషా లక్షణం. శాసనభాషలో కనిపించే ఈ ధ్వని మార్పు అన్నమయ్య సంకీర్తనల్లో కూడా కనిపిస్తుంది.

వసంతం : నీరు వసంతం నీపై జల్లిన (6.83.3)

అన్నమయ్య కొన్ని సంస్కృత ప్రాతిపదికలకు సంబంధంలేని విధంగా తత్సమాలు ఏర్పరచడం జరిగింది. అవి నాటి వ్యవహార రూపాలు అయి ఉంటాయి.

పూతకి : 'పూతనా' అనే నామవాచకం 'ఆ' కారాంత స్త్రీలింగ ప్రాతిపదిక. దీనికి తెలుగులో 'పూతన' అనే రూపం సంస్కృత సమంగా ఉంది. కాని అన్నమయ్య 'పూతకి' అని ప్రయోగించడం విశేషం.

పూతకిఁ : బొమ్మర పోవఁడు పూతకిఁ బరిగొని (6.151.5)

ఇది మాండలికంగా తాళ్లపాక పరిసరాల్లో ఈనాటికీ వ్యాప్తిలో ఉంది.

బాలకి: సంస్కృతంలో 'బాలికా' అనే 'ఆ' కారాంత స్త్రీలింత ప్రాతిపదికకు సంస్కృత సమం 'బాలిక' అనేది. కాని అన్నమయ్య 'బాలకి' అని ప్రయోగించాడు.

బాలకి : నేనేలే యాతనికి నేనేలె బాలకిని (6.67.7)

పై రెండు ఉదాహరణలు 'తాటక' అనే తత్సమం సామ్యంతో ఏర్పడి ఉండవచ్చు.

కాఁతాళము: రాయలసీమలో 'కోపం, ఈర్ష్యతో కూడిన కోపం' అనే అర్థాల్లో 'కాంతాళము, కాంతాళించు' అనే ప్రయోగాలు వాడుకలో ఉన్నాయి. నిండు సున్న బదులు అరసున్నతో వచ్చిన రూపం 'కాఁతాళము', నిండు సున్నతో ఉన్న రూపం 'కాతాళించి' అనే రూపాలు అన్నమయ్య సంకీర్తనల్లో క్రింది విధంగ చూడవచ్చు.

కాఁతాళము : కన్నులఁగోపమదేలె కాఁతాళమేలె (6.53.6)

కాంతాళించి : కాంతాళించియుఁ గదలదు మనసు (6.73.2) (తె. త్రై. ప. పుట -40)

ప్రాకృతసమాలు:

ప్రాకృత ప్రాతిపాదికలు కూడ ఇలాగే ప్రాకృతసమాలు అవుతాయి. 
          సంస్కృతము      ప్రాకృతము       ప్రాకృత సమము
               రాజ                 రాయ               రాయుండు  6.28.11
సంస్కృత పూలింగంగా వున నపుంసక లింగంగా వున్న అవి తెలుగులో అమహాద్వాచక మైతే ప్రథమలో ‘ము’ వర్ణకాన్ని చేర్చుకొంటాయి.

వైకృతపదనిర్మాణం:

  • సంస్కృత ప్రాతిపదికల నుండి, ప్రాకృత ప్రాతిపదికల నుండి పుట్టే వాటిని తద్భవాలని చిన్నయసూరి పేర్కొన్నాడు.
  • సంస్కృత ప్రాతిపదికలో గాని, ప్రాకృత ప్రాతిపదికలో గాని వర్ణలోపం, వర్ణాగమం, వర్ణాదేశం, వర్ణవ్యత్యయం, వర్ణవికర్ష లాంటి పెద్దపెద్ద మార్పులు జరగడం తద్భవాల లక్షణం.
  • సంస్కృత భవాలను, ప్రాకృత భవాలను కలిపి చిన్నయసూరి తద్భవాలుగా పేర్కొన్నాడు.
  • తత్సమాలకు లాగానే తద్భవాల మీద కూడా ప్రథమా విభక్తి ఏకవచన ప్రత్యయాలు చేరడంగాని, చేరి లోపించడం గాని జరుగుతాయి.

సాధారణంగా తెలుగులోని తద్భవాలను నిరూపించే సందర్భంలో మాతృక లనుగూర్చి తెలుగు వ్యాకర్తలలో రెండు మతాలున్నట్లు గోచరిస్తున్నది. కేతన, విన్నకోట పెద్దన, కూచిమంచి తిమ్మన మొదలైన వారు తద్భవాలకు మాతృకగా సంస్కృతాన్ని మాతమే పేర్కొని, సమీపమాతృక (immediate sources) లయిన పాకృతాల్ని పూర్తిగా విస్మరించారు. చింతామణి కర్త, బాల సరస్వతి, చిన్నయసూరి మొదలెన వారు సమీపమాతృకగా ప్రాకృతాన్ని కూడ పేర్కొ న్నారు. తద్భవాలలో అయిదింట నాలుగువంతులు ప్రాకృతభవాలు; అయిదింట ఒకపాలు మాత్రమే సంస్కృతభవాలు కన్పిస్తున్నాయి. చిన్నయసూరినిరూపించి నట్లుగా తద్భవాలను సంస్కృతభవాలనీ, ప్రాకృతభవాలనీ వేర్వేరుగా వివక్షించడం చాలా శాస్త్రీయమైన దృష్టి.

             సంస్కృతము       ప్రాకృతము           తెలుగు

                  చంద                చందో            చందురుండు
                  రాత్రి                    రిత్తి                రాతిరి  (తె. భా. చ. పుట. 309)

సంస్కృతభవాలు :  

పదాదినగాని, అపదాదిన గాని ఏదైనా ఒక పదం యొక్క వర్ణం లోపించడం వర్ణలోపం. ఈ వర్ణలోపం పదాదిన గాని, అపదాదిన గాని జరిగే అవకాశం ఉంది.

ఎ) పదాది : సంస్కృతంలోని పదాది వర్ణం తెలుగులో లోపించిన రూపాలు.

సాధారణంగా పదాది అచ్చులో మార్పు కనిపించదు.

             సంస్కృతము      ప్రాకృతము         తెలుగు

                   అంగార               ఇంగాల          ఇంగలము - 1.173.5
                    అటవీ                 అడవీ           అడవి - 1.462.5
                    ఆకాశ                  ఆకాస           ఆకసము - 1.436.6 (అ. భా. ప్ర. పుట -95)

              సంస్కృతము         సంస్కృత భవము

                    ప్రతిమా-                 పతిమ - 6.123 9
                    సాహస్ర                  వేయి - 6.112.7 

సంస్కృతంలోని సహస్ర > ఆయిరంగా తమిళంలోకి వచ్చింది. దాన్నుండి 'వేయి' అనే రూపం ఏర్పడి ఉంటుంది.

బి) అపదాది: సంస్కృతంలోని  అపదాది వర్ణలు తెలుగులో లోపించిన రూపాలు.

                      సంస్కృతం     సం. భవము

                       ఔదక              ఔదు - 6.50.14
                      తామరసమ్       తామర - 6.17.3

సంస్కృతంలోని అపదాదిన ఉన్న క, నం, సమ్ అనే అక్షరాలు లోపించి సంస్కృత భవాలు ఏర్పడ్డాయి. (అ. భా. ప. పుట -56)

తెలుగులో సాధారణంగా 'అవ > ఔ'ల మార్పు ఉంది. కాని దానికి వ్యతిరేకంగా సంస్కృతంలోని పదాది 'ఔ'కారం 'అ' కారంగా మారిన రూపం అన్నమయ్య సంకీర్తనల్లో కనిపించడం విశేషం.

గౌరవ (సంస్కృతం). గరువము (సంస్కృతభవం) (6.130.11)

ద్విత్వంగా ఉన్న మహాప్రాణం అల్పప్రాణం అవడం విశేషం. ఇటువంటి ఉదాహరణ అన్నమయ్య సంకీర్తనల్లో కనిపిస్తుంది.

ఇచ్ఛా (సంస్కృతం), ఇచ్ఛా (సంస్కృతం భవం) (6.16.14)

"అవ> ఔ'ల మార్పు అచ్ఛిక శబ్దాల్లో ఉంది. కాని అన్నమయ్య సంకీర్తనల్లో 'అ >ట' కావడం విశేషం.

అపర (సంస్కృతం), అపర (ప్రాకృతం), ఓర (ప్రాకృత భవం) (6.40.8)

'ఉ'కార, 'ఓ' కారాల మధ్య వినిమయం ద్రావిడ భాషా ధ్వని మార్పుల్లో ఒకటి. ఆ మార్పు సంస్కృత, ప్రాకృత భవాల్లో కనిపించడం విశేషం.

ముఖయ్ (సంస్కృతం), ముహం (ప్రాకృతం), మోము (ప్రాకృత భవం) (6.5.8)

ద్విత్వంలో 'ణ'కారం 'న'కారం కావడం విశేషం. ఇటువంటి ఉదాహరణలు అన్నమయ్య సంకీర్తనల్లో క్రింది విధంగ చూడవచ్చు.

చూర్ణ (సంస్కృతం), చుణ్ణం (ప్రాకృతం) సున్నపు (ప్రాకృత భవం) (6.93.9)

పూర్ణిమా (సంస్కృతం), పుణ్ణిమా (ప్రాకృతం), పున్నమ (ప్రాకృత భవం) (6.17.7)

సమీపమాతృకలోని చకారం సకారంగా మారడం ఆర్వాచీనం, ఈ ధ్వని పరిణామం కన్నడాంధ్రాలతో దేశ్యపదాలలో సైతం కనిపిస్తున్నది. తెలుగు లోని సలుపు, సాలు, సెలవు, సౌక్కు, సొలము వంటి సకారాది రూపాలు చకారాదులకు పరిణతరూపాలు. శ్వాసవత్స్పర్శమైన చకారం, శ్వాసవద్దంత మూలీయ విస్తారితోష్మం గా మారడాన్ని తెలుగు వ్యాకర్తలు గసడదవాదేశ విధిగా పేర్కొన్నారు.

ఉదా: సున్నము - చుణ్ణ - చూర్ణ (తె. భా. చ. పుట. 318)

మూల ద్రావిడ 'చ'కారం నుంచే 'స' కారం వచ్చింది. అంటే 'చ > స'ల మార్పు ద్రావిడ ధ్వని మార్పుల్లో ఒకటి. కాని అన్నమయ్య సంకీర్తనల్లో దానికి విరుద్ధంగా 'స > చ' మార్పు రావడం విశేషం.

శర్కరా (సంస్కృతం),   సక్కర (ప్రాకృతం),    చక్కెర (ప్రాకృత భవం)   (6.163.14)
కాంస్య (సంస్కృతం),   కంసం (ప్రాకృతం),   కంచము (ప్రాకృత భవం) (6.43.13) (తె. త్రై. ప. పుట -40)

3. సమాసనిర్మాణం:

అన్నమయ్య సంకీర్తనల్లో సమాసాలు రెండుపదాల నుండి పదిపదాల వరకు విస్తరించి వున్నాయి. సాధారణంగా మొదట రెండుపదాలతో ఒకసమాసం. ఏర్పడి ఆ తర్వాత వెనుకాముందు మరికొన్ని పదాలు చేరి, రెండు పదాలకంటే ఎక్కువ పదాలు ఉండే సమాసాలు ఏర్పడుతాయి.

రెండు పదాల సమాసాలు:

పూర్వకర్మ-1.113.10, పెద్దభూతము- 1.109.8, పరయెగము-1.406.64 (అ. భా. ప్ర. పుట -118)

అన్నమయ్య సంకీర్తనల్లో మూడు అంతకంటే ఎక్కువ పదాల మిశ్ర సమాసాలు కూడా కనిపిస్తాయి.

తలపూ వాడని తరుణి   (6.105.11)
తనివోని నిట్టూర్పు తాపంబు గాలి (6.134.10)

అన్నమయ్య సంకీర్తనల్లో కొన్ని తమిళ సమాసాలు కూడా కనిపిస్తున్నాయి.

అలమేల్ మంగ నాచారమ్మా (6.64.13),
అలమేల్మంగ నాచారి(6.65.2)
అలమేలు మంగ నాచారి(6.65.10)

ఈ సమాసాలకు ఆధారం తమిళంలోని 'అలర్మేలు మంగై'. అంటే 'పద్మాసన అయిన లక్ష్మీదేవి' లేక  పద్మావతీదేవి (తె.వ్యు.కో - సం.1, పుట: 116)

తెలుగులో 'నాచారి' అనే పదానికి మూలరూపం తమిళంలోని 'నాచ్చియార్', 'దేవత, అమ్మవారు' అనే అర్థంలో ఉంది. (తె.వ్యు.కో-సం.4, పుట 331)

తాయి మక్కళ్లె కాక దయగద్దా తనకు (6.115.2)

'తాయి' అంటే తమిళంలో 'తల్లి', 'మక్కళ్' అంటే 'పిల్లలు' అని అర్థం.

అన్నమయ్య సంకీర్తనల్లో కన్నడ సమాసాలు ఈ క్రింది విధంగా చూడవచ్చు.

ఉప్పవడము : ఉప్పవడముగావయ్యా ఉయ్యాల మంచము మీఁద (6.102.1)

'ఉయ్యాల మంచము మీద నుంచి మేలుకొను' అని దీనికి అర్థం.

కన్నడ :  ఉప్పవడ - మేల్కొలుపు పాట

అన్నమయ్య సమాస నిర్మాణంలో మరికొన్ని విశిష్టతలు కనిపిస్తున్నాయి. సంస్కృతంలోని ప్రసిద్ధమైన సమాసాల్ని తెలుగు పదాల్లో చెప్పడం అన్నమయ్య ప్రత్యేకత.

తామరలోని కాంత (లక్ష్మీదేవి) - 6.168.5.  (తె. త్రై. ప. పుట -42)

తెలుపు జలములు (క్షీర సముద్రం) - 6.22.3

'రాక్షసుడు' అనే శబ్దానికి 'రక్కసుడు' అనేది తద్భవం కాగా, 'రాకాసుడు' అని ప్రజల వాడుకలోని పదాన్ని అన్నమయ్య ప్రయోగించడం విశేషం.

పది శిరసుల పెద్ద బమ్మరాకాసునిని ( 6.112.3)

సంస్కృత పదం ఉపయోగించాల్సిన సందర్భంలో తెలుగు సమాసం ఉపయోగించడం అన్నమయ్యకు వెన్నతో పెట్టిన విద్య. వీటిలో చాలావారకు ఆనాటి వాడుక భాషలోని రూపాలే కవి వాడటం విశేషం.

చలి మందులు (6.129.6) మొరవంకయుంగరాలు (6.1.7)

సమాసంలో సంఖ్యావాచకం పూర్వపదంగా ఉన్నపుడు ఆ సమాసం సాధారణంగా ఏకవచనంలో ఉంటుంది. కాని అన్నమయ్య సంకీర్తనల్లో ఏకవచన రూపాలతోపాటు బహువచన రూపాలు కూడా కనిపిస్తున్నాయి.

ఇరువరక (6.42.12)            ఇరువంకల  (6.42.8)

నలుగద (6.81.9)                నలుగడలం  (6.175.12)

4.  లింగం - వచనం అన్నమయ్య భాషల్లో లింగము:-

పుంలింగం : స్త్రీలింగం, నపుంసకలింగం అని సంస్కృతంలో శబ్దాన్ని అనుసరించి మూడు రకాలుగా ఉంది. తెలుగులో వీటి విధానం అర్థాన్ని ఆశ్రయించి ఈ క్రింది విధంగా ఉంటుంది.

పులింగం - మహద్వాచకం - పురుషులను గూర్చి తెలిపేది.
స్త్రీలింగం - మహతీవాచకం - స్త్రీలను గూర్చి తెలిపేది.

నపుంసకలింగం: క్లీబము - పై రెండు కాక మిగిలినవి. మరలా ఇందులో స్త్రీ సమాలు, క్లీబ సమాలు ఉన్నాయి.

స్త్రీ సమం, స్త్రీలింగం కాదుగాని, స్త్రీలింగ శబ్దాలకు ఏకార్యాలు అయితే చెప్పబడ్డాయో ఆ కార్యాలు స్త్రీ సమశబ్దాలుగా ఏవయితే చెప్పబడ్డాయో వాటికి కూడా వస్తాయి. అంటే ప్రథమైక వచనానికి లోపం అని అర్థం.

క్లీబసదం: నపుంసక లింగ శబ్దాలకు సంబంధించిన కార్యాలు ఏవయితే వస్తాయో అవి క్లీబసమ శబ్దాలకుకూడా వస్తాయి. మువర్ణకం - మొదలయినవి రావటం, మహతీవాచకం, క్లీబం ఈ రెండింటికీ అమహత్తులని పేరు. (అ. భా. ప్ర. పుట -136)

లింగ బోధక ప్రత్యయాలు చేరని రూపాలు:

మహద్వాచకం:  బిడ్డ (6.43.4) మామ (6.165.8)
కొడుకు (6.62.12) అప్ప (6.4.1)
మహతీవాచకం: కొమ్మ ( 6.2.5) తెఱవ (6.3.3)

లింగ బోధక ప్రత్యయాలు చేరిన రూపాలు:

మహద్వాచకం:  బిడ్డండు (6.114.2) బిడ్డండు (6.60.1) 
మహతీవాచకం: ఆలు: జవరాలు 6.118.1  అట్టు +లు  > అట్లు (6.4.4)

పై ఉదాహరణలో బహువచన ప్రత్యయం చేరినపుడు ద్విత్వం లోపించడం విశేషం.

'పాయసము' అనే శబ్దానికి 'పాశము' అనేది వ్యావహారిక రూపం. దానికి బహువచన రూపం అయిన 'పాశాలు' అన్నమయ్య ప్రయోగించడం విశేషం.

నీ పలుచని నీ తెలిచూపుల బాశాలు (6.121.4)

'వారు' అనే సర్వనామాన్ని బహువచన ప్రత్యయానికి బదులుగ అన్నమయ్య ప్రయోగించడం విశేషం. 'లోకులు' అనడానికి బదులుగా 'లోకమువారు' అని అన్నాడు.

వాసనై లోకము వారి వలపించఁగా (6.95.4)

'ఎక్కడ' అనే శబ్దానికి వ్యావహారిక రూపం అయిన 'ఏడ' అనే శబ్దం అన్నమయ్య ప్రయోగించడం విశేషం.

5. సర్వనామలు:

నిర్మాణక్రమాన్ని అనుసరించి చూసినపుడు సర్వనామాలు కూడా విశేష్యాలలో ఒక భాగమేనని తేలుతుంది. ఇవి నాలుగు విధాలు. 1. పురుష వాచక సర్వనామాలు, 2. ఆత్మార్థక సర్వనామాలు, 3. నిర్దేశ సర్వనామాలు, 4. ప్రశ్నార్థక సర్వనామాలు అన్నమయ్య అధ్యాత్మ సంకీర్తన (సంపుటం-1)ల్లో వచ్చిన సర్వనామాల్ని చూపడం జరిగింది.

ఉత్తమ పురుష:

ప్రథమావిభక్తి ఏకవచనంలో 'నేను' అనే రూపం మాత్రం ఉన్నది. 'ఏను' అను రూపంకూడా వుంది.

నేను (1.38.10) ఏను  (1.369.14)

ప్రథమావిభక్తి బహువచనంలో 'ఏము, మేము, నేము' అనే మూడురూపాలు కన్పిస్తున్నాయి.

ఏము 1.94.2 మేము 1.441.13 నేము 1.408.2

ఉభయార్థకంలో 'మనము' అనే రూపం కన్పిస్తున్నది.

మనము - 1.197.2

మధ్యమ పురుష:  మధ్యమ పురుష ప్రథమైక వచన రూపాలు

నీవు  1.23.8 నీవూ 1.360.14 (సముచ్చయార్థం చేరిన రూపం)

నీకే  1.466.13 నీకు (షష్ఠీ) 1.193.2

మధ్యమపురుష, ప్రథమావిభక్తి ఏకవచనంలో 'నీవు' అనే రూపం కనిపిస్తున్నది. బహువచన రూపమైన 'మీరు' ఈ సంపుటంలో కనిపించడం లేదు. (అ. భా. ప్ర. పుట -101)

అస్మదర్థక సర్వనామాలు:

ఏను, నేను మూ, ద్రా.  యాన్ నించి వచ్చినవి. ఏము, మేము మూ. ద్రా.  యామ్నించి వచ్చినవి. ఇక ఏను, ఏము ప్రాచీన రూపాలనీ, నేను, మేము అర్వాచీన రూపాలనీ తులనాత్మక వ్యాకరణ దృష్ట్యానే కాకుండా నన్నయ భారతం వల్ల కూడా సృష్ట మవుతుంది. నన్నయభారతంలో ఏను, ఏము అతి ప్రచురంగా ఉండగా నేను నాలుగుచోట్ల, 'మేము' ఆరుచోట్ల మాత్రమే కనబడు. తుంది (చూ. నన్నయపద ప్రయోగకోశము). ఆలాగే నన్నెచోడుని కుమార సంభవంలో కూడా (చూ. నన్నెచోడ ప్రయోగనూచిక) 'ఏను' చాలాచోట్ల ఉండగా 'నేను' నాలుగుచోట్ల మాత్రమే ఉంది; ఇందులో ఏము అనే రూపమే తప్ప మేము అనేరూపం అసలేలేదు. కాబట్టి ఏను, ఏము-వీటి ఔపవిభక్తిక రూపాలైన నా-, మా- ల ప్రభావంవల్ల నకార మకారాలు వీటి ముందు చేరడంవల్ల ఇవి నేను, మేముగా తరవాత కాలంలో మారేయని ఊహించవచ్చు.  (అ. భా. ప్ర. పుట -101)

6. నామవిభక్తులు - రూపనిష్పత్తి:

ప్రాతిపదికలపై చేరే ప్రత్యయాలను నామవిభక్తి ప్రత్యయాలు అంటారు. అవి చేరి లేదా చేరకుండానే ఏర్పడిన ప్రథమా విభక్త్యంగ రూపాలు  పైన 'లింగం- వచనం' అనే భాగంలో  వివరించడం జరిగింది.

బహువచనంలో 'ఆర' అనే ఆగమం ప్రాతిపదికకు చేరి సంభోదన రూపం కనిపిస్తుంది. దానితోపాటు అన్నమయ్యలో 'ర' కారం బదులు 'ల'కారం వచ్చిన రూపాలు ఉండడం విశేషం.

ఓ రమణులార! (6.129.1)        అమ్మలాల (6.144.1)

స్త్రీవాచకాలకు చివర 'రో' అనే ఆగమం చేరుతుందని ప్రౌఢవ్యాకరణం చెప్పినా అన్నమయ్య సంకీర్తనల్లో తిర్యక్ వాచకాల తరవాత కూడా 'రో' చేరడం విశేషం.  (ప్రౌఢ వ్యాకరణం. శబ్ద. 14)
తుమ్మెదరో  (6.32.1)

7. ఉపసంహారం:

  • అన్నమయ్య భాష గ్రాంధికంలో రచించబడిన పద్య కవిత్వం కన్నా పామర జనం వ్యవహారంలోని భాషలో రచించబడినదిగా తేటతెల్లమవుతుంది. 
  • దేశ్య, నామ ప్రాతిపదికలకు సాధారణంగా స్వాభావికమైన ప్రత్యయమేదీ చివరలో చేరదు. సంస్కృత, ప్రాకృత ప్రాతిపదికల్లో చిన్నచిన్న మార్పులు జరిగి, తెలుగు ప్రథమావిభక్తి ప్రత్యయాలను చేర్చుకొని లేదా లోపింప జేసుకొని ఏర్పడేవి సంస్కృత సమాలు లేదా ప్రాకృత సమాలు అని గమనించము. శాసనభాషలో కనిపించే ఈ ధ్వని మార్పు అన్నమయ్య సంకీర్తనల్లో కూడా కనిపిస్తుంది. 
  • సంస్కృత ప్రాతిపదికల నుండి, ప్రాకృత ప్రాతిపదికల నుండి పుట్టే వాటిని తద్భవాలని చిన్నయసూరి పేర్కొన్నాడు. సంస్కృతంలోని పదాది 'ఔ'కారం 'అ' కారంగా మారిన రూపం అన్నమయ్య సంకీర్తనల్లో కనిపించడం విశేషం.
  • ద్విత్వంగా ఉన్న మహాప్రాణం అల్పప్రాణం అవడం విశేషం. ఇటువంటి ఉదాహరణ అన్నమయ్య సంకీర్తనల్లో కనిపిస్తుంది. 
  • మూల ద్రావిడ 'చ'కారం నుంచే 'స' కారం వచ్చింది. అంటే 'చ > స'ల మార్పు ద్రావిడ ధ్వని మార్పుల్లో ఒకటి. కాని అన్నమయ్య సంకీర్తనల్లో దానికి విరుద్ధంగా 'స > చ' మార్పు రావడం విశేషం. వీటిలో చాలావారకు ఆనాటి వాడుక భాషలోని రూపాలే కవి వాడటం విశేషం. 
  • వర్ణజ్ఞానంలోగాని, సంధిమార్పుల్లోగాని, నామ, క్రియావిజ్ఞానంలోగాని, జాతీయాలు అన్నమయ్య భాష విశిష్టమైనదిగా మనం భావించవచ్చు.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అనంతరామశాస్త్రి, నేతి. (1982 ). శ్రీనాథభాషాపరిశీలన, బ్రాడీపేట, గుంటూరు
  2. కృష్ణమూర్తి, భద్రిరాజు. (1989). తెలుగు భాషా చరిత్ర.  తెలుగు విశ్వవిద్యాలయం,  హైదరాబాదు
  3. గంగప్ప, యస్. (1995). అన్నమాచార్య సంకీర్తన సుధ. శశీ ప్రచురణలు, గుంటూరు
  4. చంద్రశేకర్ రెడ్డి, మాండ్యం. (2009). అన్నమయ్య భాష పరిశీలన. అజయ్ సుస్మితా పబ్లికేషన్, తిరుపతి
  5. చిన్నయసూరి, పరవస్తు. (1972). బాలవ్యాకరణం. వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు
  6. దొణప్ప, తూమాటి. (2000). తెలుగులోని వైకృతపదాలు. తెలుగుభాషాచరిత్ర, తెలుగువిశ్వవిద్యాలయం,  హైదరాబాదు
  7. పిచ్చయ్య, కొల్లూరి.(2000). అన్నమయ్య ఆధ్యాత్మసంకీర్తనల్లోని నామవిశేషణరూపాలు. (అ.సి.గ్రం.),  శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి
  8. శ్రీహరి, ఆర్. (2006). అన్నమయ్య భాషా వైభవం. వరురుచి పబ్లికేషన్స్, హైదరాబాదు
  9. సాయి శంకర్ రెడ్డి, తాళంబేడు. (2019). అన్నమయ్య భాషలో ప్రయోగాలు. తెలుగు భాషాపరిరక్షణ సమితి ప్రచురణలు
  10. సిమ్మన్న, వెలమల. (2004). తెలుగు భాషాచరిత్ర. దళితసాహిత్యపీఠం, విశాఖపట్నం
  11. సుబ్రమణ్యం, పి. ఎస్. (2000). తెలుగు మిగలిన ద్రావిడభాషలు. తెలుగుభాషాచరిత్ర, తెలుగు విశ్వవిద్యాలయం,  హైదరాబాదు

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]