AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed
4. బతుకుతాడు నవల: గీత కార్మీకుల జీవనచిత్రణ

డా. ఆగపాటి రాజ్‌కుమార్
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు విభాగం,
యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కాకతీయ విశ్వవిద్యాలయం,
హన్మకొండ జిల్లా, తెలంగాణా.
సెల్: +91 8309706806, Email: agapatirajkumar6@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 09.12.2024 ఎంపిక (D.O.A): 26.12.2024 ప్రచురణ (D.O.P): 01.01.2025
వ్యాససంగ్రహం:
సాహిత్యంలో ఎవరి జాతి గురించి, ఎవరి జీవితం గురించి వారు నిశితంగా పరిశీలించి అక్షరబద్ధం చేసినట్లయితే అదే గొప్ప సాహిత్యం అవుతుందని బి.ఎస్. రాములంటారు. ఈ దారిలో నేరేళ్ళ శ్రీనివాస్ గౌడ్ - తాటిచెట్టును నమ్ముకొని జీవనం సాగించే గీతకార్మికుల జీవన విధానం, వారి జీవితంలోని బాధలను, గాధలను ’బతుకుతాడు’ నవలలో చిత్రికపట్టారు. ఈ విధానాన్ని పరిశోధనాత్మకంగా వివరించడమే ఈ వ్యాసం ప్రధానోద్దేశం. తెలుగు వాఙ్మయప్రపంచంలో గౌడల జీవనవిధానంపై వచ్చిన తొలి తెలుగు నవల "బతుకు తాడు". ఈ నవలలో చిత్రించిన మూడు కుటుంబాల నేపథ్యాన్ని తీసుకుని ముప్పై సంవత్సరాల కాలంలో కులవృత్తిని నమ్ముకోని జీవనం కొనసాగిస్తూ ఈ కుటుంబాలు పడిన బాధలు, అనుభవించిన కష్టాలను తెలియపరచడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం. వాస్తవికసంఘటనలతో కూడిన పాత్రలను సోషల్ మెథాడాలజీ పద్దతిలో విభజన చేసి పరిశోధనాత్మకంగా ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా నా వ్యాసాన్ని విశ్లేషిస్తాను. భారతదేశంలో మహాశ్వేతాదేవి, శివరామారావు, గోపిచంద్, రావూరి భరద్వాజ, బి.ఎస్. రాములు మొదలైన వాళ్ళంతా బడుగు జీవుల ఆక్రందనలను వాళ్ళ సాంస్కృతికనేపథ్యాన్ని అక్షరబద్దం చేశారు. ఈ కోవలోనే నేరేళ్ళ శ్రీనివాస్ గౌడ్ రచన చేరుతుంది. కులవృత్తిని నమ్ముకొని ఆత్మగౌరవంతో జీవనం కొనసాగించాలేని సగటు గీతకార్మికుడి మరణవాఙ్మూలమే ’బతుకు తాడు’ నవల అని తేల్చి చేప్పాను. ఈ పరిశోధన వ్యాసానికి ప్రధాన ఆకరాలు- నేరేళ్ళ శ్రీనివాస్ గౌడ్ "బతుకు తాడు" (నవల), ఆచార్య బన్న అయిలయ్య సంపాదకత్వంలో వెలువడిన "కాలరేఖలు మూల్యాంకనం," ఆగపాటి రాజ్ కుమార్ ఎంఫిల్ సిద్దాంతవ్యాసం "గీతవృత్తి నవలలు-ఒక పరిశీలన", కె.వి.యల్. "కల్లు మండువ" నవల, బి.ఎస్.రాములు "బతుకు పోరు" నవల.
Keywords: తాటి చెట్లు, గీత కార్మికులు, దొరల దౌర్జన్యం, కులవృత్తి, గౌడల రాజకీయ, సాంస్కృతిక నేపథ్యం, గౌడల పోరాట పటిమ, గౌడల జీవన విధానం
1. ఉపోద్ఘాతం:
ఉత్తరతెలంగాణాలోని జగిత్యాల పరిసరప్రాంతాలన్ని అత్యంత విప్లవప్రభావిత ప్రాంతాలు. ఎమర్జెన్సీ తరువాత భూస్వాములంతా ప్రాణభయంతో పట్నం బాట పట్టారు. ఆ సమయంలో అనేక సమస్యల పట్ల ప్రజా పోరాటాలబాటకు సాలుదీసి ముందుకు నడిచినవారైన జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమం అత్మంత తీవ్రరూపం దాల్చడానికి కారణమైన వారైన జగిత్యాల చుట్టుపక్కల నాయకత్వం వహించిన గౌడ్‌లే ప్రధానకారణం. అంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న గౌడల పోరాటపటిమ ఎంతటిదో అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమేణ 2004లో వెలువడిన ‘బతుకుతాడు నవల’ తెలుగు వాఙ్మయ ప్రపంచంలో గౌడల జీవన విధానంపై వచ్చిన తొలి నవల.
2. మూడు కుటుంబాల జీవనచిత్రణ:
రచయిత ఈ నవలలో ముప్పై సంవత్సరాల కాలాన్ని తీసికొని ఈ ముప్పై ఏండ్లలో గీత కార్మికులు బ్రతికిన బ్రతుకు, బతుకుతున్న బతుకును వర్ణించాడు. ఈ నవల ప్రధానంగా మూడు కుటుంబాల మధ్య నడుస్తుంది. ఈ మూడు కుటుంబాలు తాటి చెట్టును నమ్ముకొని బతికినవే. నేరెళ్ల ధర్మయ్యగౌడ్-లింగవ్వ కుమారులు.
1.నేరెళ్ళ భూమమ్మ - లక్ష్మీనర్సవ్వ
2. రచయిత కుటుంబం నారయణగౌడ్ - లక్ష్మీ
3. లక్ష్మణ్ గౌడ్- రాజేశ్వరీ
ఈ కుటుంబాలు పడిన బాధలు, అనుభవించిన కష్టాలే నవలలో చిత్రించిబడినవి. మొత్తంగా గౌడల పోరాట పఠిమను వారి జీవన విధానాన్ని సమాజానికందించిన ఈ నవల ఇతివృత్తాన్ని, పాత్రలను పరిశోధనాత్మకంగా వివరించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం.
కులాలు, కుల పురాణాల నేపధ్యానికి, సంస్కృతి సంబంధాలకు సంబంధించిన అకాడమిక్ రచనలు తప్ప, సాధికారంగా ఒక వృత్తిలోని సాధారణ కుటుంబ జీవన వైవిద్యాన్ని, విధ్వంసమౌతున్న సామాజిక విలువలను పెనవేసుకున్న మానవ సంబంధాలను చిత్రించిన నవలలు ప్రధానంగా తెలుగు సాహిత్యంలో అతి తక్కువ. కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల దగ్గరలోని హన్మాజిపేటలోని ఒక గౌడ కుటుంబం నేపథ్యమే ‘బతుకుతాడు’ నవల.
‘‘నేనేమి సేతు - నెనెట్ల బతుకుడు
బతుకుదెరువు కొరకు
బాధలేన్నో పడిన
బాధ తీరలేదు
బతుకు మారలేదు!’’1
నవల ప్రారంభంలోనే నారయణగౌడ్ ‘కనిమిద్ది’ అనే తాటి చెట్టు మీద కల్లు గొలలు గీస్తూ పాడుతుంటాడు. కనిమద్ద్టి తాటి చెట్టు దగ్గర పరపుదాల్ల సీజన్‌లో ప్రారంభమైన నవల అనేక మలుపులు తిరిగి ముప్పై ఏండ్ల తరువాత అదే కనిమిద్ది తాటి చెట్టు దగ్గర పరపుదాల్ల సీజన్‌లోనే ముగిసిపోవడం కనిపిస్తుంది.
జన్మనిచ్చేది తల్లి అయితే గౌండ్లోల్లకు బతుకునిచ్చేది తాటిచెట్టు. అలాంటి తాటిచెట్టు గురించి, తాటిచెట్టుకు పారే తాటికల్లు గురించి సాహిత్యంలో అసభ్యకరమైన, అవమానకరమైన రచనలు వున్నాయి. ‘‘సారాయి త్రాగుట సభకు యోగ్యత కాదు కల్లు త్రాగ ఎదకు బలము కానేకాదు. ఉచ్ఛమెంచి ఇంత వుచ్చత్రాగుట మేలు’’ ఇలాంటి రచనలు సాహిత్యంలో ఎన్నో ఉన్నాయి. సాహిత్యలోనే కాదు గౌడవృత్తిలో కూడా ఎన్నో అవహేళనలు ఎదురౌతాయి. చెవులు చిల్లులు పడేలాంటి దెప్పి పొడిచే మాటలు ఈ వృత్తిలో ఎన్నెన్నో. ఈ నవల రచయిత ఆత్మకథ లాంటిది అయిన కథ ఉత్తమ పురుషలో నడవదు. రచయిత ఇందులో ఒక పాత్రదారిగా మాత్రమే కనిపిస్తాడు. ఈ నవలలోని పాత్రలు మనం పరిశీలించినట్లయితే ఆనాడు తెలంగాణ ప్రాంతంలో గీత వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగించే కుటుంబాలు ఎంతటి దుర్భమైన పరిస్థితిని ఎదుర్కొన్నాయో అవగతం అవుతుంది.
2.1 పేదరికాన్ని జయించిన భూమయ్యగౌడ్:
ధర్మయ్య గౌడ్ పెద్ద కొడుకు భూమయ్యగౌడ్, తాటిచెట్లు ఎక్కుతున్న తన తండ్రి. తండ్రి లాంటి వాళ్ళు పడుతున్న కష్టాలను గమనిస్తాడు భూమయ్య గౌడ్. తన ఊర్లోని తాటిచెట్ల గురించి గౌడ్‌ల జీవితాల గురించి నిశితంగా పరిశీలిస్తాడు. తన తండ్రి పూర్వీకుల నుంచి తన కులం వారంతా తరతరాలుగా తాటిచెట్లకు అంకితమై బ్రతకడం గమనిస్తాడు. కుల వృత్తి అంటే ప్రేమ వున్నా ఉన్నా అందులో ఎదుగదల లేకపోవడంతో పాటు తన పూర్వీకులు తన వాళ్ళు ఎంత కష్టాపడ్డా ఎదిగిరాక పోవడం భూమయ్యగౌడ్‌కు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడుంటే తను కూడా ఎంత కష్టపడ్డా భవిష్యత్తులో ఎదగలేడనే భావన ఏర్పడిరది.
బొంబాయిలో ఆబ్కారీ చట్టాలు, వాటి రూల్సు తెల్పుకోని వేలం పాటలో ఒక కల్లు దుకాణం తన సొంతం చేసుకుంటాడు. కొన్ని తాటి చెట్లు తీసుకుంటాడు తాటిచెట్లు ఎక్కడం కోసం ఒక గీత కార్మికుడిని జీతం ఉంచుకున్నాడు. అతనికి జీతంతో పాటు తిండి కూడా పెట్టాలి. దీంతో భూమయ్య గౌడ్‌కు పని పెరిగింది. అన్నం వండుకోవడానికి తీరిక దొరకడం లేదు. బొంబాయిలో అన్నం వండడం కోసం అతని భార్య పిల్లలను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు భూమయ్యగౌడ్ అమ్మనాన్నలు ధర్మయ్యగౌడ్, లింగమ్మలు తిరిగి అతడు బొంబాయి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు. ఊర్లో పెద్ద మనుషుల చేత చెప్పిస్తారు. అయితే భూమయ్య గౌడ్ ఆలోచించిన విధానం వేరేలా ఉంది. పల్లెలో పంటలు బాగా పండితే రైతులు కల్లు తాగుతారు. తమకు లాభం ఉంటుంది. రైతుకు పంట లేకుంటే గౌడ్‌లకు చిల్లర ఖర్చుకు కూడా కష్టమే. పెద్ద పట్టణాల్లో ఉద్యోగులు, వ్యాపారులు, కూలీలు, కార్మికులు, కాంట్రాక్టర్లుంటారు. అందువల్ల పట్టణాల్లో కల్లు తాగే వారు ఎక్కువ కల్లు మాముల లాభల్లో నడుస్తుంది. అందుకే తను బొంబాయిలో కల్లు దుకాణము పట్టినట్లుగా పెద్ద మనుషులకు వివరిస్తాడు.
నాన్న ఇన్ని రోజులు మనమో తీరుగ బతుకుతున్న మాట వాస్తవమే కానీ అన్ని కాలాలు మనయి కావు. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మారుతున్న పరిస్థితుల్లో ఈ సంపాదన ఏ మూలకు చాలదు. సంపాదనే పెంచుకునే ప్రయత్నం చేయాలి. నేను అన్ని ఆలోచించే బొంబాయి కల్లు దుకాణం పట్టినాను. అక్కడ నష్టం రాదనీ నమ్మకం నాకుంది అని భూమయ్య గౌడ్ తండ్రిని తల్లిని ఒప్పిస్తాడు. భార్యపిల్లలతో తిరిగి బొంబాయి వెళతాడు. బొంబాయిలో కల్తి కల్లు వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదిస్తాడు. జగిత్యాలలోని డిగ్రీ కాలేజీ దగ్గర ధర్మపురి రంగపేట రోడ్ చౌరస్తాలో పది గుంటల భూమికొంటాడు. ఇంకా రెండు ఇళ్ళు కొంటాడు. ఆ తరువాత రెండుతస్తుల మేడ కట్టించి పై అంతస్తుల్లో లాడ్జి, కింద అంతస్తులో హోటల్ పెడతాడు. తన ఊరికి వచ్చినప్పుడల్లా తన వారికి బహుమతులు తెచ్చి, వెళ్ళేటప్పుడు డబ్బులిచ్చి వెళుతుంటాడు తమ్ముడు లక్ష్మణ్‌గౌడ్‌ను గ్రామ పంచాయితీ ఎలక్షన్లలో పోటీ చేసే పెద్దవాళ్ళతో పేచీ పెట్టుకోవద్దనడం రెండవ తమ్ముడు నారయణగౌడ్ దుర్భర జీవితాన్ని చూసి ఇల్ల్లును నారయణగౌడ్‌కు ఇచ్చి ఆర్థిక స్థితిని బట్టి తోచినవి ఇవ్వనమనటం కుటుంబ సంబందాల పట్ల అతనికి గల ప్రేమానురాగాలకు నిదర్శనం. ఈ నవలలో భూమయ్యి గౌడ్ పాత్రను భవిష్యత్ గురించి ఆలోచించే వాడుగా లౌక్యం తెలిసినవాడుగా రచయిత తీర్చిదిద్దాడు.
2.2 లౌక్యం తెలియని శ్రామికుడు నారాయణగౌడ్:
బతుకుతాడు నవలలో ప్రధానపాత్ర నారాయణగౌడ్. ఇతను ధర్మయగౌడ్ ముగ్గురు కుమారుల్లో రెండవవాడు. ఇతనికి కులవృత్తిపై మమకారం ఎక్కువ. తాటిచెట్టును ఆరాధిస్తాడు, ప్రేమిస్తాడు, ‘‘తల్లిని నమ్ముకున్న పిల్లలు, తాటిచెట్టును నమ్ముకున్న గౌండ్ల్లోల్లు ఎప్పటికి చెడిపోరు’’ అనేది నారాయణగౌడ్ విశ్వాసం. (బతుకుతాడు నవల, పుట 34)
ఇట్నీని శివలింగం అప్పనిరాజం, పూరెల్ల లచ్చంలకు కల్లు మండువ దగ్గర నారయణగౌడ్ కల్లు పోస్తున్నప్పుడు అక్కడికి చాకలి భూమయ్య, వచ్చి లక్ష్మణ్‌రావు పటల్ కల్లు పోయమంటున్నాడు అని అంటాడు. నారయణగౌడ్ కల్లు లేదంటాడు కారణం అంతకుముందు కల్లు పోస్తే డబ్బులివ్వలేదు పైగా అడిగితే బెదరించాడు ఆ కారణంగా కల్లులేదంటాడు. కాగా కల్లు అమ్ముకొని సాయంకాలం తిరిగి ఇంటికి పోతున్న సమయంలో నారయణగౌడ్‌ను దొరకబట్టి గుంజుకువెళ్ళి తన ఇంటిలోని పందిరి గుంజకు కట్టేస్తాడు. లంజకొడుక నాకు కల్లు లేదంటావా! అని తిడుతుంటే బుద్ది గడ్డి తిన్నది పటేలా.. పిల్లలు గలవాణ్ణి నన్నేం జేయకండ్రి -నీ కాల్మొక్త అంటూ కాళ్ళ మీద పడిపోవడాన్ని బట్టి పటేల్, పట్వారీ భూస్వామ్య వ్యవస్థ గౌడుల జీవితాల మీద నిన్నటి తరంలో ఎంతటి జులం చేలాయించిందో ఈ నవలలోని సంఘటనలే సజీవ సాక్ష్యం.
డబ్బులిచ్చినా, ఇవ్వకపోయినా దొరలకు కల్లు పోయాల్సిరావడం నారయణగౌడ్ జీవితంలోని దైన్యం. భార్య లక్ష్మీికి జ్వరం వస్తే వైద్యం చేయించలేక ప్రభుత్వ ఆసుపత్రిలోనే చూపిస్తే జ్వరం తగ్గకపోవడంతో తన పుట్టింటి వారికి కబురు చేసి వారికి భార్య బాధ్యతనప్పగించిన నిస్సహాయత, కన్న బిడ్డలకు కడుపునిండా తిండి పెట్టలేని దారిద్య్రం నారయణగౌడ్‌ది. రోజురోజుకు నారయణగౌడ్ ఆర్థికంగా దిగజారుడు పైగా ఎదుగుతున్న పిల్లలు, పెరుగుతున్న ఖర్చులు పెరగని సంపాదన ఇది వరకు వ్యవసాయంలో వచ్చిన పంట ఇంటి అవసరాలకు పోగా మిగిలిన పంటను అమ్మితే వ్యవసాయానికి పెట్టిన ఖర్చులు వచ్చేవి. ఇప్పుడు పెటుబడి లేక ఇంటి అవసరాలకు సరిపోయేంత పంట కూడా రావడం లేదు. అదికాక నారాయణగౌడ్ ఉండే ఇల్లు ఒక మూలకు కూలిపోయింది. ఆ ఇల్లు కూలగొట్టి కొత్తగా ఇల్లు కట్టే శక్తి అతనికి లేదు. అందుకు కూలిపోతున్న ఇంట్లో నుంచి వెళ్ళి ఇంటి ప్రక్కన గుడిసే వేసుకుంటాడు. ఇది ఇలా ఉంటే అప్పుడే ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయిపోయేదాక గవర్నమెంట్ వారు కల్లు అమ్మవద్దని ఆంక్షలు పెడతారు. దీంతో ‘‘మూలుగుతున్న నక్కమీద తాటిపండు పడ్డట్టు’’ నారాయణగౌడ్ ఇంట్లో పరిస్థితి దారుణంగా తయారైంది. చేసేదేమిలేక తన దగ్గర అటకం పట్టి కల్లు తాగే బొడ్డు గంగన్నతో ఆవేదన చెప్పుకుంటే ఆయన వారి కుటుంబానికి సరిపడ బియ్యం యిస్తాడు. దీన్ని బట్టి ‘‘రెక్క ఆడితేగాని డొక్కడే జీవితాలు’’ గౌండ్లోల్లవి. ‘కులవృత్తిపై మమకారం ఉన్న దాన్ని నమ్ముకొని భార్యబిడ్డలకు ఒక పూట తిండి పెట్టలేని స్ధితిలో ఉన్నాడని అర్థమవుతుంది.
ఎన్నిసార్లు ఎన్నికలొచ్చిన ఎందరు ముఖ్యమంత్రులు మారిన ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిన నారాయణగౌడ్ బతుకులో ఎలాంటి మార్పు లేకపోవడం గమనిస్తాడు. కొడుకు చదువుకోవడం ఇష్టం లేనంతగా తయారవుతుంది నారాయణగౌడ్ పరిస్థితి. ఎందుకంటే కొడుకును చదివించే ఆర్థిక స్థోమత అతనికి లేదు. ఈ క్రమంలో ఊర్లోకి గౌడశెట్టిలు ఆటలాడటానికి వచ్చినప్పుడు గంగారాంగౌడ్ మొదలైన వాళ్ళు తమ ఊర్లోనే ఆటాలాడుమని గౌడశెట్టిలకు చెప్పి నారయణగౌడ్‌ను తమ ఊర్లోనే ఆట చూడమంటారు. కానీ నారాయణగౌడ్ పట్టుబట్టి తమ ఊర్లో కూడా గౌడశెట్టిల ప్రదర్శన ఇచ్చేలా చేసి గ్రామస్థుల మెప్పు పొందుతాడు. దానికి గాను పాలిచ్చే ఆవును అమ్మి గౌడ శెట్టిలకు డబ్బులు ఇవ్వడాన్ని చూస్తే పట్టుదల గల వానిగా, ఆత్మాభిమానం గల వ్యక్తిగా నారయణ గౌడ్ కనిపిస్తాడు.
‘‘వృత్తి మనుగడని కాపాడుకోవడానికి జరిగిన సంఘర్షణలోంచే ఈ కులపురాణాలు ఉద్భవించాయి. కులాల అస్థిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకొనేందు కోసం ఉద్యమించడానికి కుల పురాణాలు ప్రేరణలిచ్చాయి. కులానికి జీవనాడి లాంటిది కులపురాణం. నైతిక జీవనాన్ని పరిరక్షిస్తూ జీవజలాన్నిస్తుంది. అది వృత్తిని ఉన్నతంగా చూడ్డం నేర్పింది. శ్రమ విలువని వ్యక్తీకరించే శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడ్డది.’’2
తాటిచెట్టును నమ్ముకున్న నారయణగౌడ్ ఆర్థిక పరిస్థితిలో ఏ మాత్రం మార్పురాదు. పైగా పిల్లలు పెద్ద వాళ్ళువుతున్నారు. ఎప్పుడో వెసుకున్న గుడిసే అలాగే ఉంది. తన అప్పు మాత్రమే కట్టులేకపోతున్నాడు. ఇక భవిష్యతలో ఇల్లు ఎలా కట్లాలి, పిల్లలకు పెండ్లిల్లు ఎలా చేయాలనే ఆలోచనతో కృంగిపోతుంటాడు. ఈ పరిస్థితిలో అన్న భూమయ్య గౌడ్ ఊర్లో కొన్న రెండిళ్ళలో ఒక దానిలో తమ్ముడిని ఉండమని ఎంతో కొంత ఇవ్వమనటంతో బాధల్లోంచి కొంత తేరిపించినట్లయింది. నారాయణగౌడ్ బతుకు లౌక్యం తెలియనివాడు ఉన్న ఊరిని కన్న తల్లిగా ప్రేమించినవాడు. ఆ తల్లి కోపంతో కసిరిన, ప్రేమతో మెచ్చకోలు మాట విసిరినా నిలువెత్తు ఓపికగా మారినవాడు, గౌండ్లల్లకు తాటిచెట్టు తల్లిలాంటిది, ఈత చెట్టు ఇల్లు లాంటిది. మా పూర్వీకులు తాటిచెట్లను, ఈత చెట్లను నమ్ముకొని బతికిన వాళ్ళే అంటాడు. దీన్ని బట్టి ఎన్ని కష్టాలు ఎదురైన కులవృత్తిపై నారయణ గౌడ్‌కు ఎంత మమకారమో విశదమవుతుంది. నారయణగౌడ్ చివరకు ఈతచెట్టుకు మెరబెడుతూ చెట్టుమీదనే మరణిస్తాడు. ఇలా ఒక గీతకార్మికుడి జీవితం ముగిసిపోవడం బాధకారం. కావడి కుండల్లాంటి కష్టసూఖల మర్మం తెలిసిన కష్టజీవిగా రచయిత నారయణగౌడ్ పాత్రను తీర్చిదిద్దాడు.
2.3 గౌడ స్త్రీ పాత్రకు నిదర్శనం - లక్ష్మీ:
బతుకుతాడు నవలలో నారయణగౌడ్ భార్య లక్ష్మీ. లక్ష్మీకి కుటుంబ ఆర్థిక పరిస్థితి చూస్తూంటే ఒక్కొక్కసారి బ్రతకడం కంటే చావడమే మేలనిపిస్తుంది. పొద్దటి పూటకి మక్క గడక, రాత్రి పూటకి వరి అన్నం వండుతుంది. ఇంకా పొలం కోతకు రాలేదు. ఇంట్లో తినడానికి బియ్యం లేవు, మక్కలు లేవు. అసలు ఇంట్లో ఏ వస్తువు లేదు. లక్ష్ష్మీ ఒక్కొక్క రోజు కూలికి పోతుంది. ఆ కూలీ రూపాయలతో బియ్యం కొని తెచ్చి వండుతుంది. అలా వీలుకాని నాడు నారయణగౌడ్ దగ్గర ఎవరైన కల్లు తాగితే ఆ కల్లు తాగిన వారి దగ్గర రూపాయలకు బదులు బియ్యం తీసుకువస్తాడు. అలాంటి ధైన్యస్థితిలో కుటుంబం కష్టాల్లో మునిగి తేలుతుంది. ఆలోచించిన కొద్దీ పిచ్చెక్కిపోతుంది లక్ష్మీ దుఃఖించని రోజు లేదు. లక్ష్మీకి కడుపునిండా తిండిలేదు, కంటినిండా నిద్ర లేదు, ఒంటి నిండా బట్టలేదు. లక్ష్మికే కాదు పిల్లలకు ఒంటినిండా బట్టు లేదు. అనేక సందర్భాల్లో ఊర్లో వారి దగ్గర పాత బట్టలు అడిగి తొడిగింది. కొన్ని సార్లు లక్ష్మి తల్లి లాలవ్వ బట్టలు కొని ఇస్తుంది. తినడానికి బియ్యం తీసుకవస్తుంది. ఈ విధంగా రోజులు గడిచిన లక్ష్మికి ఏమి తోచదు. భవిష్యత్ గురించి ఆమె భయపడుతుంది. పిల్లలను ఎలా బతికించాలని ఆలోచిస్తుంది. ఎక్కడ మార్గం కనిపించక పిచ్చెక్కినట్టు ఏడుస్తుంది. ఆ ఏడుపు ఆవేశంగా మారి ఒక్కోక్కలు బొంబాయి వోయి సంపాదించుకోవట్రి, నీకే తెలివిలేకపాయె అని దుఃఖించేది. దానికి సమాధానంగా ‘‘తాటి చెట్టు తల్లి లాంటిది. ఈత చెట్టు ఇల్లు లాంటిది అని నారాయణగౌడ్ అన్నప్పుడు తాటిచెట్టు తల్లిలాంటిదే, ఈతచెట్టు ఇల్లు లాంటిది? మన కుటుంబాలను సాదుతున్నాయి నిజమే కానీ మూడోద్దులాయె వానపడ బట్టి అయిన్ని తాటిచెట్లు ఎండిపోతే’’ (బతుకు తాడు నవల. పుట 61) అని లక్ష్మీ ఆవేదనను నారాయణగౌడ్‌కు తెలియజేస్తుంది. ఈ రకంగా దీన అవస్థలోని ఒక గౌడ స్త్రీ పాత్ర లక్ష్మీ.
‘‘ఆనాదిగా సాహిత్యానికి చరిత్రకు అవినాభావ సంబంధం ఉంది. సాహిత్య చరిత్రలో కావ్య యుగం నుండి ఆధునిక ప్రక్రియల వరకు వచ్చిన సాహిత్యంలో చరిత్ర అంతర్లీనంగా ఉంటూ వస్తున్నది. ఆనాటి కావ్యాల ఆధారంగానే శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాశారు. ముఖ్యంగా నవలలు ఆధునిక ప్రక్రియలలో సమకాలిన చరిత్రను రికార్డు చేయడంలో ముందంజలో ఉన్నవి. సమకాలీక వాస్తవిక జీవిత చిత్రణకు నవలలు ప్రాధాన్యం ఇవ్వడం వలన నవల చరిత్రకు దగ్గరైంది. రాబోయే తరాల వారికి సాంఘిక జీవన చరిత్రను అందించే రిఫరెన్స్ గ్రంథాలుగా నవలలు నిలువగలవని భావించడంలో ఏమాత్రం సందేహం లేదు.’’3
అలా గీతా కార్మికుల జీవితాలను చరిత్రలో భాగంగా బతుకు తాడు నవలలో చిత్రితమయ్యాయి.
2.4 పోరాట యోధుడు - లక్ష్మణ్‌గౌడ్:
నవలలో ధర్మయ్యగౌడ్ చిన్న కొడుకు లక్ష్మణ్ గౌడ్, జగిత్యాల జైత్రయాత్ర సభ, భూస్వాములకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమాలలో లక్ష్మణ్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తాడు. దోరలకు భూస్వాములకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసేవాడు. ఆ ఊరిలో పెద్ద దొరలు లేరు. చిన్న దొరలే ఉన్నారు. ఊర్లో ఎవరిదైన పంట పొలంలో ఎక్కువ పంట వచ్చెదుంటే రాత్రికి రాత్రే కోసుక వచ్చేవారు. అలా వీలు కాకుంటే ఎడ్లను తీసుకవెళ్ళి మేపుక వచ్చేవారు. అలాంటి దొరలను రెండు మూడు సార్లు నక్సలైట్లు చితిక్కొడతారు. అయితే లక్ష్మణ్‌గౌడ్ లాంటి వారే అన్నల చేత మమ్మల్ని కొట్టించారని వారి అనుమానం వామపక్ష భావజాలంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ ఊర్లో అందరికి భరోసగా ఉంటాడు. అతనికి ఆర్థిక ఇబ్బందులు ఏమిలేవు. ఈ కారణంగా ఊర్లో దొరలకు వ్యతిరేకంగా గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వార్డ్ మెంబర్‌గా పోటి చేసి గెలిచి ఉపసర్పంచి అవుతాడు. ఇదీ జీర్ణించుకోలేని దొరలు భూస్వాములు అతని మీద కుట్రచేస్తారు. కాలం గడిచే కొద్ది అతని మీద దాడులు అవినీతి ఆరోపణలు చేసి ఊర్లో ఆవమానాలకు గురిచేస్తారు. దీంతో లక్ష్మణ్ గౌడ్ బొంబాయి వెళ్ళి తన అన్నలాగే కల్లు వ్యాపారం చేస్తాడు. మొదట్లో లాభాల్లో నడిచిన వ్యాపారం ‘లౌక్యం తెలియని కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోతాడు. ఒక్కగానొక్క బిడ్డ కాపురం సరిదిద్దడానికి ఊర్లో ఉన్న ఎకరంన్నర భూమి అమ్మివేస్తాడు. భార్య పిల్లలను తీసుకుని పుట్టిన ఊరయిన హన్మాజీపేటకు రాకుండా అతని అత్తగారి ఊరయిన అనంతారం వెళతాడు. ఇది తన ఊరిలో తలవంపులు పడకూడదన్న అతని ఆత్మాభిమానాన్ని సూచిస్తుంది. అత్తగారి ఊరిలో కొన్ని రోజులు తర్వాత ఆనారోగ్యం కారణంగా విషాదకర మరణం సంభవిస్తుంది. సమాజాన్ని ఏదో మార్చాలనుకుని సహచరుల చేతుల్లో మోసపోయి, వ్యాపారంలో లౌక్యం తెలియక జీవిత సమరంలో ఓడిపోయి మరణం చెందిన అభాగ్య జీవి లక్ష్మణ్ గౌడ్.
‘‘కల్లోల కాలానికి చిత్రిక పట్టడం ఎంత ముఖ్యమో, ప్రశాంత సమయంలోను ప్రజల బ్రతుకులు ఎంత కల్లోలంగా ఉంటాయో చిత్రించడం అంతే ముఖ్యం. ఈ రెండు కీలకమైన అంశాలు ఈ నవలలో మనకు కనిపిస్తాయి.’’4
జగిత్యాల జైత్రయాత్ర ఉద్యమ ప్రభావంతో దొరల మీద తిరుగుబాటు చేసి పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ఉప సర్పంచ్‌గా ఎన్నికవుతాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని దొరలు వాళ్ళ మనుసులో పెంచుకున్న కక్ష దాని తరువాత లక్ష్మణ్ గౌడ్ జీవితం ఎలా విధ్వంసం అయిందో వాస్తవికంగా రచయిత పాఠకుల కళ్ళకు కట్టినట్లు చూపించాడు.
2.5 ఆత్మ గౌరవానికి ప్రతీక- శ్రీనివాస్ గౌడ్
బతుకుతాడు నవలలో మూడవ తరానికి చెందిన వ్యక్తి శ్రీనివాస్ గౌడ్. తల్లిదండ్రుల కష్టాలు, బాధలు వాళ్ల బతుకు పోరాటం చూస్తూ పెరిగినవాడు, ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకొని ఏడవ తరగతితోనే చదువు మానేసి కుల వృత్తిని నేర్చుకొంటాడు. తండ్రి నారయణగౌడ్ దగ్గర శ్రీనివాస్‌గౌడ్ మరింత సంపాదించాలనే ఆలోచన కలుగుతుంది. వ్యవసాయం చేస్తూ ఈత చెట్లుగాని, తాటిచెట్లు గాని ఎక్కితే ఈ పరిస్థితిలో మార్పురాదనీ ఆలోచన కలిగి బొంబాయి వెళ్ళి బాగా సంపాదించాలను కుంటాడు. తండ్రి అంగీకరించక పోవడంతో చెప్పకుండానే బొంబాయి వెళతాడు. అతని పెద్దనాన్న భూమయ్యగౌడ్ వద్ద పనిలో చేరతాడు. అయితే భూమయ్య గౌడ్ చేసే కల్తీ కల్లు వ్యాపారం నచ్చక తిరిగి హన్మాజీపేట చేరుకుంటాడు. ఇది అతనిలోని నిజాయితిని సూచిస్తుంది. ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్‌కు పెండ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు నారయణగౌడ్. పెళ్ళి చూపులకు వెళ్ళినప్పుడు కట్నం దగ్గర బేరసారాలు జరుగుతున్నప్పుడు శ్రీనివాస్ గౌడ్‌కు అంగట్లో పశువులకు బేరం చేసినట్లే అనిపిస్తుంది. తండ్రి నారయణగౌడ్ డిమాండ్ చేసినంత కట్నం ఇవ్వలేని స్థితిలో ఆడపెళ్ళి వారు ఉండటం గమనించి వారు ఇవ్వగలిగే కట్నానికే అంగీకారం తెలుపుతాడు. ఇది అతనిలో మంచి లక్షణాలను తెలియజేస్తుంది. శ్రీనివాస్ గౌడ్ చెల్లి, తమ్ముడి పెండ్లికి సగం ఖర్చులు యిస్తాడు.దీంతో కుటుంబంపట్ల బాధ్యతలు తెలిసి నెరవేర్చిన వాడిగా శ్రీనివాస్‌గౌడ్ కనిపిస్తాడు. తాటిచెట్లు బందు చేసిన సందర్భంలో బొంబాయి వెళ్ళి కూలీ పని చేస్తాడు. ఇది అతనిలో కష్టపడే మనస్తత్వాన్ని తెలుపుతుంది. బొంబాయి నుండి తిరిగి వచ్చి మళ్ళీ గీతవృత్తినే నమ్ముకుంటాడు. కులవృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగించ లేక చాలా మంది సౌదీ, బొంబాయి, దుబాయి లాంటి ప్రాంతాలకు వలస వెళతారు. అందువల్ల హన్మాజీపేట గ్రామంలో తిరుపతిగౌడ్, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరే గీత కార్మికులు మిగులుతారు. గీతవృత్తినే జీవనాధారంగా చేసుకొని మనస్ఫూర్తిగా ఆచరించిన వక్తిగా శ్రీనివాస్ గౌడ్ పాత్ర చిత్రణ చేశాడు రచయిత.
3. ముగింపు:
- ప్రాచీన సాహిత్యమంతా తాటి కమ్మల మీదే రాయబడిరది. అయినా తాటిచెట్లు ఎక్కే గౌండ్ల వారి జీవితాన్ని మాత్రం ఎన్నడూ పట్టించుకొన్న పాపాన పోలేదని పేర్కొన్నాను.
- కౌటింబిక, సామాజిక వ్యవస్థలో గౌడుల జీవన విధానంలో చోటు చేసుకున్న పరిణామాలను రచయిత ఒక సజీవ సాక్ష్యంలా ఈ సమాజానికి నవలా రూపంలో అందించాడని తెలియజేస్తున్నాను.
- కుల వృత్తిని నమ్ముకుని ఆత్మ గౌరవంతో జీవనం కొనసాగించలేని సగటు గీత కార్మికుని మరణ వాంగ్మూలమే బతుకుతాడు నవల అని నా పరిశోధనా వ్యాసం ద్వారా తేల్చిచెప్పుతున్నాను.
- ప్రపంచీకరణ విధానాల వల్ల విధ్వంసమై, కనుమరుగై పోతున్న వృత్తిని, ధ్వంసం చేయబడుతున్న గౌడ బతుకు చిత్రాన్ని ఈ నవలలో అద్భుతంగా ఆవిష్కరించాడు. తాళ్ళు సహజమైన వృక్ష సంపద. ఐనా గౌండ్లు రకం కట్టాల్సిందే! ఈ క్రమంలో అబ్కారి వ్యవస్థలో ఉన్న డొల్లతనాన్ని అబ్కారి పోలీసులు గౌడులపై కొనసాగించే అఘాయిత్యాలను కళ్ళముందు సాక్షాత్కరింపజేస్తాడు.
- బ్రతుకుతాడు నవలలో వృత్తిపరమైన అంశాలే కాక గౌడ సంస్కృతిని కూడా వివరంగా తెలియజేయడం జరిగింది.
- ఈ నవలను పరిశోధనాత్మకంగా పరిశీలించినపుడు గౌడులు ఆర్థికంగా ఎన్ని కష్టాలలో వున్నప్పటికీ ఆత్మ గౌరవ పోరాటాలలో ముందుండి పోరాటం చేసిన వారిగా మనకు అవగతం అవుతుందని పేర్కొంటున్నాను.
4. సూచికలు:
1) నేరెళ్ళ శ్రీనివాస్ గౌడ్ -బతుకుతాడు నవల-పుట-2
2) ప్రొఫెసర్ ననుమాస స్వామి - కంఠమహేశ్వర పఠం కథ - పుట -9
3) డా॥ బన్న అయిలయ్య - సాహితీ కిరణాలు - పుట - 69
4) (సం॥) బన్న అయిలయ్య - తెలంగాణ కాల రేఖలు మూల్యాంకనం - పుట - 6
5. ఉపయుక్తగ్రంథసూచి:
- అయిలయ్య, బన్న. సవ్వడి (సాహిత్య వ్యాససంపుటి). నానీ ప్రచురణలు, హన్మకొండ, 2006.
- కృష్ణమూర్తి, సి.హెచ్. తెలుగులో దళిత నవలలు-అనుశీలన. 2018
- చంద్రయ్య, మేడి. గౌడ శెట్టీల. జీవనవిధానం-సాహిత్యం. నవ్య సాహిత్య పరిషత్, కరీంనగర్.జనవరి- 2005.
- నవీన్, అంపశయ్య. అనురాగ దీపం. నవచేతన పబ్లిషింగ్ హౌస్, 2024
- భరద్వాజ, రావూరి. పాకుడురాళ్ళు, విపిహెచ్ ముద్రణలు, ఏప్రిల్2013
- మల్లికార్జున్, కాలువ మల్లయ్య నవలలు - సామాజిక చిత్రణ. 2006
- రామకోటిశాస్త్రి, కేతవరపు. నవలాలోకనం, 2015.
- వెంకటయ్య, కె. గీత కార్మికోద్యమం: నిన్న-నేడు-రేపు, ప్రజాశక్తి బుక్ హౌస్, హైదరాబాద్, 2012
- వెంకటసుబ్బయ్య. వల్లంపాటి. నవలాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, ద్వితీయ ముద్రణ. 2000.
- శ్రీనివాస్‌గౌడ్, నేరేళ్ళ. బతుకుతాడు నవల, జగిత్యాల, కరీంనగర్ జిల్లా, 2004
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers: Download PDF 
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.