headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

2. షట్చక్రవర్తి చరిత్ర: ధార్మికచింతన

ఆచార్య వంగరి త్రివేణి

ప్రొఫెసర్, తెలుగుశాఖ,
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం,
గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9951444803, Email: telugutriveni@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.12.2024        ఎంపిక (D.O.A): 28.12.2024        ప్రచురణ (D.O.P): 01.01.2025


వ్యాససంగ్రహం:

"షట్చక్రవర్తి చరిత్రము" అనే ప్రబంధాన్ని రాజా కామినేని మల్లారెడ్డి రచించారు. ఇందులోని ఆరుగురి కథాంశాలు రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలలో తెలుపబడ్డాయి. వేదాలు, పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. మల్లారెడ్డి రచన నాటికే ఆరుగురి చక్రవర్తులలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క కావ్యంగా విలసిల్లింది. కాని దాన ధర్మ త్యాగ వీర్య సౌశీల్యాది గుణాలకు నిలయమైన ప్రాచీన చక్రవర్తుల రసాధిక గాథలను ఒక్క ప్రబంధంలోనే నిబంధించాలనే అభిలాష చేత రాజా మల్లారెడ్డి ఈ విశేషమైన ప్రబంధ రచన చేశారు. హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్త్యవీరార్జునుడు వంటి చక్రవర్తులు గల "షట్చక్రవర్తి చరిత్రము" అనే ప్రబంధంలో కథా సంవిధానాన్ని అధ్యయనం చేయడం నా పరిశోధన ముఖ్యోద్దేశం. రాజా మల్లారెడ్డి రాచ కుంటుబానికి చెందినవారు. కాబట్టి సూర్య చంద్రవంశ రాజులలో విశిష్ట ఖ్యాతి గడించిన చక్రవర్తుల విశేషాలను కీర్తించాలనే ఆసక్తి ఆయనకు కలిగి ఉండవచ్చు. అందుకే ధర్మవర్తనులైన ఆరుగురు ప్రభువుల వృత్తాంతాలను ఒకే ప్రబంధంగా రచిస్తూ కథాసంవిధానం, వర్ణనా నైపుణ్యం, శ్లేష ఔచిత్యంతో పూర్వపు కథలకు విభిన్నంగా షట్చక్రవర్తి చరిత్రను దర్శింపజేశారు. విభిన్న కథాంశాలతో ప్రబంధంలో వస్త్వైక్య సాధన ఎలా జరిగిందో పరిశీలించడం ఈ పరిశోధన ఆవశ్యకత. దోమకొండ (బిక్కనవోలు) సంస్థాన కవులు– వారి రచనలు (సి.గ్రం.) వంటివి పూర్వపరిశోధనలు. విమర్శల్లో తెలంగాణ ప్రబంధాలు – పరిచయమాలిక. మయూఖ – తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక ముఖ్యమైనవి. ఈ వ్యాసరచనలో వ్యాఖ్యానాలు, పీఠికలు ప్రధాన ఆకరాలు. వస్త్వైక్యం –ఏకవాక్యత, వివిధ ప్రబంధాలు - వస్త్వైక్య చర్చ, ఆరుగురు చక్రవర్తుల కథలు - సంవిధానం ఈ వ్యాసరచనాప్రణాళిక. షట్చక్రవర్తి చరిత్రలో సత్యమహిమా సంపన్నుడిగా హరిశ్చంద్రుడు దర్శనమివ్వడం,నిర్మలమైన అంత:కరణ అభీష్టం నలుడికి ఆభరణంగా నిలవడం, పురుకుత్సుని కథలో భుజబలశౌర్యపరాక్రమంతోపాటుగా ఆర్తజన పరాయణత్వం ప్రతిఫలించడం, పురూరవుడి వృత్తాంతంలో స్వచ్చమైన ప్రేమబంధాన్ని శాశ్వతం చేస్తూ మోహావేశాన్ని నిలువరింపజేసే దృశ్యం ద్యోతకమవడం, సగరుడి చరిత్ర అహంకారం వల్ల కలిగే దుష్పరిణామాలను తెలుపుతూనే కార్యదీక్షా ఫలసాధనను వెల్లడించడం, కార్తవీర్యార్జునుడిలో రాజగుటకు గల అర్హతలు, రాజుగా వ్యవహరించ వలసిన బాధ్యతలను గుర్తుచేయడం వంటి విషయాలను ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: ప్రబంధం, అవతరణిక, వ్యాఖ్యానం, శ్లేషార్థఔచిత్యవిశ్లేషణ, ఛందో2లంకార రస ప్రాధాన్యం,జ్యోతిస్సంగీత శాస్త్ర ప్రావీణ్యం, వ్యాకరణభాషావిశేషాంశాలు, తర్క, మీమాంసపాండిత్యం, అర్థ కాఠిన్యం,వస్త్వైక్య వివాదం, రాజధర్మం, ఏకసూత్రత.

1. ఉపోద్ఘాతం:

శ్లో. హరిశ్చంద్రో నలో రాజ, పురుకుత్స: పురూరవా:

      సగర: కార్త వీర్యశ్చ, షడేతే............ చక్రవర్తిన:

"షట్చక్రవర్తి చరిత్రము" అనే ప్రబంధాన్ని రాజా కామినేని మల్లారెడ్డి రచించారు. సత్కవిరాజ, సర్వజ్ఞ భోజ వంటి బిరుదులతో విరాజిల్లిన మల్లారెడ్డి గొప్ప సాహిత్య సంగీత శాస్త్ర రసజ్ఞులు. “షట్చక్రవర్తి చరిత్రము” తో పాటుగా “శివధర్మోత్తరము”, “పద్మపురాణము” వంటి ప్రౌఢ కావ్యాలను కూడా రచించారు. ఈ మూడు కావ్యాలను తన ఇష్టదైవమైన సిద్ధరామేశ్వర స్వామికి అంకితం చేశారు. మల్లారెడ్డి ప్రతిభా వ్యుత్పత్తులను గూర్చి చాగంటి శేషయ్య ఆంధ్రకవి తరంగిణి (సం. 11, పుట. 25) మరియు ఆరుద్ర సమగ్ర ఆంధ్ర సాహిత్యం (సం. 9, పుట. 212, 213) లో విశేషంగా కొనియాడారు. ఆదిపూడి ప్రభాకర కవి రచించిన “ఉమాపత్యభ్యుదయము” కావ్యంలో కూడా “అతని యనుంగుఁదమ్ముఁడు మహాయత ధీనిధి మల్లారెడ్డి సంస్కృతమున నాంధ్రమందు నసదృక్కవితారచనా సమర్థుఁ డప్రతిమ సమస్త శాస్త్ర గణపారగుఁడత్యలఘుండు ...” (షట్చక్రవర్తి చరిత్ర రెం. సం. పుట. 1050) అని రాజా మలారెడ్డిని ప్రశంసించిన విషయం తెలుస్తుంది.

2. కవి రాజా మల్లారెడ్డి - కామినేని వంశం:

పూర్వం కామినీడు అనే వీరుని పేరు మీదుగా వీరి వంశాన్ని "కామినేని" గా వ్యవహరించారు. మొదట్లో మల్లారెడ్డి వంశీకులు మెదకు మండలంలోని బిక్కనవోలును రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించారు. బిక్కనవోలు సంస్థానాధీశుడైన శ్రీ కాచభూపతి - శ్రీమతి తిమ్మాంబకు జంగమరెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి, మల్లారెడ్డి జన్మించారు. కామిరెడ్డి, ఎల్లారెడ్డి మంచి సాహితీ పోషకులుగా గుర్తింపు పొందారు. అనేక కావ్యాలను అంకితంగా స్వీకరించి ఆస్థాన కవులను ప్రోత్సహించారు. పట్టమట్ట సోమనాథ కవి తన సూత సంహితను కామిరెడ్డికి, బ్రహ్మోత్తర ఖండమును ఎల్లారెడ్డికి అంకితంగా ఇచ్చారు. ఎల్లారెడ్డి స్వయంగా కవి కూడా. వాసిష్ఠము, లింగపురాణము (లైంగ్యము) అనే గ్రంథాలు రచించి సిద్ధరామేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. కాని నేడు ఇవి అలభ్యం. రాజా కామినేని మల్లారెడ్డి 1550- 1610 మధ్య కాలానికి చెందినవారు. ఇబ్రహీం కుతుబ్ షాకు సమకాలికుడని వీరేశలింగం పంతులు తన చాటు పద్యాలలో పేర్కొన్నట్లు సాహితీవేత్తల అభిప్రాయం. మల్లారెడ్డి అనంతరకాలంలో రాజన్న చౌదరి బిక్కనవోలును విడిచి దోమకొండను రాజధానిగా చేసుకున్నారు. ఈ ప్రకారంగా కామినేని వంశీకులు దోమకొండ సంస్థాన ప్రభువులుగా పేర్గాంచారు.

3. షట్చక్రవర్తి చరిత్రము – పెద్దమందడి వెంకటకృష్ణ పీఠిక:

ప్రప్రథమంగా “షట్చక్రవర్తి చరిత్రము”ను 1926 వ తేదీన దోమకొండ సంస్థానాధీశులు రాజా రాజేశ్వర రావు బహదూర్ తన రాణి రాజవ్వ గారి సంస్మరణార్థం ముద్రించారు. ఈ సందర్భంగా పెద్దమందడి వేంకటకృష్ణ కవి ఈ గ్రంథానికి విశేషమైన పీఠికను పొందుపరిచారు.

"షట్చక్రవర్తి చరిత్రమును తన అన్నయగు కామారెడ్డి భూవల్లభతల్లజుని పోషణమున నుండి తర్క వ్యాకరణ వేద వేదాంతోభయ భాషా కవితా పాండిత్యము సంపాదించినందులకు కృతజ్ఞతా సూచకముగ శైవమతోద్బోధకమగు శివధర్మోత్తరమగు గ్రంథము జెప్పినటుల శివధర్మోత్తరావతరణిక పద్యముల వలన తెలియున్నది." (షట్చక్రవర్తి చరిత్ర మొ. సం. పుట. viii)

అని వేంకటకృష్ణ కవి పేర్కొన్నారు. రాజా మల్లారెడ్డి మొదట షట్చక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తరము, ఆ తర్వాత పద్మపురాణము రచించి ఉండవచ్చని తెలుస్తుంది.

షట్చక్రవర్తి చరిత్రకు అవతారిక లేని సంగతి ఈ పీఠిక వల్లనే తెలుస్తుంది.

"ఈ షట్చక్రవర్తి చరిత్రమను మహాప్రబంధము యొక్క యవతరణిక భాగమంతయు శిథిలమయినందున ప్రత్యంతరము లభింపనందున నవతరణిక లేకయే షష్ట్యంతములనుండి ముద్రింపబడియెన్" (షట్చక్రవర్తి చరిత్ర మొ. సం. పుట xii).

కావున రాజా మల్లారెడ్డి వ్యక్తిత్వం, వంశ చరిత్ర షట్చక్రవర్తి చరిత్రలో గాక శివధర్మోత్తర కావ్య అవతరణికలో సవివరంగా తెలుస్తుంది. ఇంకా ఈ పీఠికలో మల్లారెడ్డి కవిత్వ శైలిని గూర్చి-

"ఈ కవి పుంగవుని కవిత మృదుమధుర పదపూరితమై నిర్దుష్టమైన నవరసాలంకార భూయిష్ఠమై ద్వావింశద్వర్ణనాకరమై నానావిధబంధ శ్లేషయమకాదులకు స్థానమై నిరర్గళ గంగాప్రవాహమువలె ననవద్యహృద్య ధారాశుద్ధితో నలరారుచున్నదను విషయమునన్ పండితులెల్ల రేకీభవింతురని నా నమ్మిక." (షట్చక్రవర్తి చరిత్ర మొ. సం. పుట. ix) అని పేర్కొన్నారు.

4. షట్చక్రవర్తి చరిత్ర – ఆచార్య బేతవోలు రామబ్రహ్మం వ్యాఖ్యానం:

ఇంతటి ప్రౌఢ ప్రబంధమైన షట్చక్రవర్తి చరిత్రకు ఉత్కృష్టమైన వ్యాఖ్యానాన్ని సమకూర్చి 2022 లో రెండు సంపుటాల రూపంలో సాహితీ లోకానికి అందించారు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. మొత్తం 1279 పద్య గద్యాలకు ప్రతిభావంతమైన వ్యాఖ్యానం సమకూర్చారు. వ్యాఖ్యాన సందర్భంలో ఆయా పద్యాలకు అర్థ తాత్పర్యాలతో పాటుగా ఛందో2లంకార రస ప్రాధాన్య అంశాలను,  జ్యోతిస్సంగీత శాస్త్ర ప్రావీణ్య అంశాలను, వ్యాకరణ భాషా విశేషాంశాలను, తర్క మీమాంస పాండిత్యంలో గల అర్థ కాఠిన్యాన్ని విపులంగా చర్చించారు. శృంగార రసాది వర్ణనా క్రమంలో కవి ప్రయోగించిన పదాలకు శ్లేషార్థ ఔచిత్య విశ్లేషణను తన వ్యాఖ్యానంతో అద్భుతంగా వివరించారు.

(నా ఈ వ్యాసానికి ప్రధాన భూమికగా ఈ రెండు సంపుటాలే తోడ్పడ్డాయి. షట్చక్రవర్తి చరిత్రకు అత్యంత సుందరతరమైన శైలితో వ్యాఖ్యానాన్ని అందించిన గురువర్యులకు అభివందనాలు)

5. షట్చక్రవర్తి చరిత్ర ప్రబంధం – వస్త్వైక్య చర్చ:

రాజా మల్లారెడ్డి షట్చక్రవర్తి చరిత్రలోని ఆశ్వాసాంత గద్యలలో-

"ఇది శ్రీమద్బిక్కనవోలు పట్టణ ప్రసిద్ధ సిద్ధసరస్తటావలంబ సాంబ సిద్ధరామేశ్వర వరప్రసాద సమాసాదిత సంస్కృతాంధ్ర భాషా కవితా రసపోషణ విశేషతా చమత్కార గురుభక్తి విహార రాచుళ్లగోత్ర పవిత్ర కాచభూపాలపుత్ర బుధజనవిధేయ మల్లారెడ్డి నామధేయ ప్రణీతంబయిన షట్చక్రవర్తి చరిత్రంబను మహాప్రబంధంబు" (షట్చక్రవర్తి చరిత్ర మొ. సం. పుట. 64) అని అంటూ తన షట్చక్రవర్తి చరిత్రను మహాప్రబంధంగా కీర్తించారు. ఈ నేపథ్యాన్ని గ్రహించి “దోమకొండ సంస్థాన కవులు – వారి రచనలు” మీద పరిశోధన చేసిన డా. మేడవరపు అనంత కుమారశర్మ తన అభిప్రాయాన్ని ఈ విధంగా పేర్కొన్నారు.

"మను, వసు చరిత్రాదులలో గోచరించు ప్రబంధ శైలి షట్చక్రవర్తి చరిత్రలో స్ఫుటంగా కనిపించుటను బట్టి దీనిని తిక్కనాదుల కావ్యముల కోవలో చేర్చుటకు వీలు లేదు. అట్లని మనుచరిత్రాది ప్రబంధముల వరుసలో చేర్చుటకును అవకాశము కానరాదు. ఏలన అట్టి ప్రబంధములకు సామన్యమగు వస్త్వైక్యం కాని, ఏకనాయకత్వం కాని దీని యందు సిద్ధింపవు. ఇవి ఒకే అంగి రసమును కలిగినవి కావు. ఒక్కొక్క చరిత యందును విభిన్నాంశములు వ్యక్తమవు చుండుటను బట్టి ఈ ఆరుగురి చరితలలో ఏదో ఒక విధమగు ఏక సూత్రత చెప్పుటకు అవకాశం లేదు. కనుక ఇందలి ఒక్కొక్క కథను ఒక్కొక చిరు ప్రబంధముగ షట్చక్రవర్తి చరిత్రను ఒక ప్రబంధ గుచ్చమనుట సమంజసముగ తోచును”. (దోమకొండ సంస్థాన కవులు - వారి రచనలు పుట. 213)

కాని షట్చక్రవర్తి చరిత్రలో వస్త్వైక్యం కలదని నిరూపించడానికి “కాళహస్తీశ్వర మాహాత్మ్యం”, “పాండురంగ మాహాత్మ్యం” అనే ప్రబంధాలను దృష్టాంతంగా గ్రహించవచ్చు.

కాళహస్తి మాహాత్మ్యము క్షేత్రమాహాత్మ్య ప్రబంధము. మాహాత్మ్య ప్రబంధములలో సాధారణముగా వస్త్ర్వైక్యముండదు. ఏ కథకాకథయే విడివిడిగా కన్పట్టును. ఆ కథలన్నిటికి ఏకవాక్యత కుదుర్చుట కష్టము. కావుననే కధైక్య దోషమును కప్పిపుచ్చుటకు కాబోలు కవులు వాటిలో విస్తృతవర్ణనలు కూర్తురు. శ్రీకాళహస్తి మాహాత్మ్యము అతివర్ణన దోషమునకు గురికాకుండుట ప్రశంసనీయము. (తెలుగు సాహిత్య చరిత్ర పుట. 85) కాళహస్తీశ్వర మహిమ ద్యోతకము తెలుగు పురాణ ప్రసిద్ధ కథలను గ్రహించి వాటిని శివభక్తి అను ఏకసూత్రమున ఘటించి ధూర్జటి కాళహస్తి మహాత్మ్య ప్రబంధమున, రచించినట్లు తెలియుచున్నది. దూర్జటి తన ఇష్టదైవమైన కాళహస్తీశ్వరుని లీలలను శివభాగవతుల కథలో చక్కగా నిరూపించుటకు కాళహస్తి మాహాత్మ్యమును రచించినాడు. (తెలుగు సాహిత్య చరిత్ర పుట. 86)

పాండురంగ క్షేత్ర ప్రభావమును వివరించుటకై పాండురంగ మాహాత్మ్యమున పుండరీకుని కథ, నిగమ శర్మోపాఖ్యానము, శ్రీకృష్ణావతారచరిత్ర, శ్రీరాధాదేవి చరిత్ర, కాకి హంస పాము చిలుక తేనెటీగ మోక్షము పొందిన కథ, సుశీల అను పతివ్రతకథ, ధర్మరాజు తమ్ములతో పాండురంగ క్షేత్రము దర్శించిన కథ, సుశర్మోపాఖ్యానము, అయుత నియుతులను మునికుమారుల చరిత్ర అను తొమ్మిది చక్కని కథలు వర్ణింపబడినవి. ఈ కథలన్నియు పాండురంగని మహిమను భక్తి భావమును ప్రపంచించును. (తెలుగు సాహిత్య సమీక్ష పుట. 114)

కాళహస్తీశ్వర మహిమను తెలిపే పురాణ ప్రసిద్ధ కథలను గ్రహించి వాటికి “శివభక్తి” అనే ఏకసూత్రతను ఘటింపజేసి ధూర్జటి “కాళహస్తి మాహాత్మ్యం” రచించారు. పాండురంగ క్షేత్ర ప్రభావాన్ని వర్ణించే ప్రసిద్ధ భక్తుల కథలను సృష్టించి వాటికి పాండురంగని పట్ల “భక్తిభావం” అనే ఏకసూత్రతను అనువర్తింపజేసి తెనాలి రామకృష్ణుడు “పాండురంగ మాహాత్మ్యం” రచించారు.  అదే విధంగా కవి రాజా మల్లారెడ్డి పురాణ ప్రసిద్ధమైన చక్రవర్తుల కథకు “రాజధర్మం” అనే ఏకసూత్రతను పాటింపజేసి షట్చక్రవర్తి చరిత్రను రచించారని భావించవచ్చు కదా!.

ఆముక్త మాల్యదలో అనేక ఉపాఖ్యానాలు చెప్పబడినా శ్రీ కృష్ణదేవరాయలు ప్రధాన కథ గోదాదేవి రంగనాథుల వివాహమహోత్సవంలో అంతర్భాగం అయ్యే విధంగా ప్రబంధ రచనా చేశారు. వరూధిని, ప్రవర, మాయా ప్రవర వృత్తాంతాలు, స్వరోచి చరిత్ర అవాంతర గాథలే అయినా అల్లసాని పెద్దన మనుచరిత్రలో  స్వారోచిషమనుసంభవం నిర్వహణకు ఉపకరించే కథాంశాలను సూత్రింపజేశారు. ఏకసూత్రత ద్వారా కథైక్యాన్ని సాధించారు. ఇక కళాపూర్ణోదయాన్ని పింగళి సూరన కథా కథనంలో కాల క్రమ పద్ధతిని గాక కార్య కారణ పద్ధతిని అవలంబించి కథామధ్య వృత్తాంతంతో ఆరంభించారు. కథలన్నింటికి మృగేంద్ర వాహన ఆలయాన్ని కేంద్ర స్థానంగా గ్రహించారు.  ఇలా తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రబంధాలలో జరిగిన వస్త్వైక్య చర్చ పరిశీలిస్తే ఏకనాయకాశ్రయం పట్ల, కథైక్యం పట్ల అసంబద్ధత గోచరమవుతుంది. ఆ ప్రబంధాలన్నింటిలో వస్త్వైక్యాన్ని నిరూపించినట్లే “షట్చక్రవర్తి చరిత్ర”లోని రాజుల కథలన్నింటికి రాజనీతిజ్ఞతను, సార్వభౌమత్వాన్ని కేంద్ర స్థానంగా దర్శింపజేయవచ్చు.

అంతకు పూర్వమే గౌరన ద్విపద కావ్యంగా "హరిశ్చంద్రోపాఖ్యానం" రచించారు. రామరాజభూషణుడు "హరిశ్చంద్ర నలోపాఖ్యానం" అనే ద్వర్థ్యి కావ్యాన్ని రచించారు. హర్ష నైషధాన్ని శ్రీనాథుడు "శృంగార నైషధం" గా తెలుగులో రచించారు. రఘునాథ నాయకుడు "నల చరిత్రము" ను ద్విపద కావ్యంగా రచించారు. కాని రాజా మల్లారెడ్డి రాచ కుటుంబానికి చెందినవారు. కాబట్టి సూర్య చంద్ర వంశ రాజులలో విశిష్ట ఖ్యాతి గడించిన చక్రవర్తుల విశేషాలను కీర్తించాలనే ఆసక్తి ఆయనకు కలిగి ఉండవచ్చు. అందుకే ధర్మవర్తనులైన ఆరుగురు ప్రభువుల వృత్తాంతాలను ఒకే ప్రబంధంగా రచిస్తూ కథా సంవిధానం, వర్ణనా నైపుణ్యం, శ్లేష ఔచిత్యంతో పూర్వపు కథలకు విభిన్నంగా షట్చక్రవర్తి చరిత్రను దర్శింపజేశారు.

"ఈ ఆర్వురి కథలను పేర్కొనినచో మానవ జీవితమున ప్రకటితము కాదగు వివిధాదర్శములను స్ఫుటముగా వ్యక్తము చేయవచ్చును. ఈ కారణముచే మల్లారెడ్డి షట్చక్రవర్తుల చరితములను ఒక కావ్యముగనే కూర్చి యుండవచ్చును. భారతమునందు శాంతిపర్వము (ఆశ్వాసం 1 ప. 229 - 244) లో శ్రీకృష్ణుడు ధర్మజునకు షోడశరాజుల చరితములను చెప్పుట కలదు. ఇదియు షట్చక్రవర్తుల చరిత్రముల నిట్లు ఒక్కచోట చెప్పు ఊహను మల్లారెడ్డికి కలిగించి యుండవచ్చును. (దోమకొండ సంస్థాన కవులు - వారి రచనలు పుట. 212)

షట్చక్రవర్తి చరిత్రలోని ఆరుగురి కథాంశాలు రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలలో తెలుపబడ్డాయి. వేదాలు, పురాణాలలో ప్రస్తావించబడ్డాయి. మల్లారెడ్డి రచన నాటికే ఆరుగురి చక్రవర్తులలో ఒక్కొక్కరి చరిత్ర ఒక్కొక్క కావ్యంగా విలసిల్లింది. కాని దాన ధర్మ త్యాగ వీర్య సౌశీల్యాది గుణాలకు నిలయమైన ప్రాచీన చక్రవర్తుల రసాధిక గాథలను ఒక్క ప్రబంధంలోనే నిబంధించాలనే అభిలాష రాజా మల్లారెడ్డికి కలిగి ఉండవచ్చు. ఈ షట్చక్రవర్తి చరిత్రలో యాగ దీక్షాధర్యులైన శౌనకాది మునులు సూత మహర్షిని దర్శించి హరిశ్చంద్రాదులైన ఆరుగురు చక్రవర్తుల చరిత్రలను తెలుపమని అభ్యర్థించారు. సూత మహర్షి శౌనకాది మునీశ్వరులకు చెబుతున్న కథగా "షట్చక్రవర్తి చరిత్ర" ప్రబంధాన్ని కవి మల్లారెడ్డి రచించారు.  

6. వస్త్వైక్యం – ఏకవాక్యత (మహావాక్యార్ధము):

వస్త్వైక్యాన్నే ఏకవాక్యత (మహావాక్యార్థము) గా విశ్వనాథ సత్యనారాయణ తన “అల్లసాని వారి అల్లిక జిగిబిగి”, “ఒకడు నాచన సోమన్న” వంటి విమర్శా గ్రంథాలలో పేర్కొన్నారు.

“ఈ స్వారోచిషమనువునకు పరమోత్తమ మానవ ధర్మ పాలనా సమర్థమైన జీవశక్తి సంస్కారరూపముగా  నతని జీవ సంపుటిలో నున్నదని నిరూపించుటకు ఈ స్వారోచిష మను సంభవము వ్రాయబడినది. ఈ కావ్యము యొక్క పరమ ప్రయోజనమది. ఏకవాక్యతాగతమైన ఈ మహాకావ్యము యొక్క పరమశిల్పము తదభిముఖముగా నడచినది.” (అల్లసాని వారి అల్లిక జిగిబిగి పుట. 26)  కావ్య శిల్పంలోని పరమైన లోతును ఏకవాక్యతగా విశ్వనాథ సత్యనారాయణ అభివర్ణించారు. కావ్య కథను పరమ నిగూఢమైన అభిప్రాయాలతో సంతరింపజేయగలిగినవారే “మహాకవి” అని అన్నారు. అదే కావ్య శిల్పం యొక్క పరమ స్వరూపంగా పేర్కొన్నారు.

“ఉత్తర హరివంశము కావ్యమునందలి మహావాక్యార్థము దివ్యముగానున్నది. ఇట్టి మహావాక్యార్థము గల కావ్యములు తెలుగులో లేవనియే చెప్పవచ్చు... నా దృష్టితో జూచినచో నాంధ్ర సారస్వతమున నెట్టి మహావాక్యార్థ నిర్ణయము స్వప్రతిభోన్మేషముతో విరచించిన వారిద్దరే. ఇటు నాచన సోమన్నయు, దరువాత పెద్దన్నయు (ఒకడు నాచన సోమన్న పుట. 5,7) మహా కావ్య ధ్వనిని నిర్ణయించాలంటే మొదట ఏకవాక్యతను నిర్మింపజేయాలని అన్నారు.

“రాజశేఖరుడు కావ్య మీమాంసలో అభీప్సితార్ధ ప్రకటనకు అనువుగా రచించబడిన కూర్చబడిన పదసమూహాన్ని వాక్యం అన్నాడు... యోగ్యత, ఆకాంక్ష, ఆసత్తి, యుక్తమనీ, వాక్యోచ్చయమే మహావాక్యమని సాహిత్య దర్పణ కారుడు విశ్వనాథుడు అన్నాడు... ఏకవాక్యత అన్నది మీమాంసకుల ఆలోచన నుంచి విశ్వనాథుని మూలంగా సాహిత్యంలోకి ప్రవేశించింది...” (తెలుగు సాహిత్య విమర్శ దర్శనం - పుట. 850)

“క్షేత్ర మహాత్మ్యములలో సర్వ కథలు తద్దేవతా మాహాత్మ్య ద్యోతకములై యదియే పరమార్థముగా భాసించును. తక్కిన కావ్యములలో మహావాక్యార్థ నిర్ణయము సేత దుర్ఘటమైన విషయం.” (ఒకడు నాచన సోమన్న పుట.7)

పై విశ్లేషణలతో “షట్చక్రవర్తి చరిత్ర”కు కూడా మహావాక్యార్థ నిర్ణయము చేయవచ్చును కదా! ఆరుగురు చక్రవర్తుల కథల్లో “రాజధర్మం” పరమార్థంగా భాసిస్తుంది.

7. ప్రబంధ లక్షణాలు – భిన్నాభిప్రాయాలు:

ప్రబంధాన్ని ఒక ప్రత్యేక ప్రక్రియగా పేర్కొంటూ ప్రసిద్ధ సాహిత్య విమర్శకులు ప్రస్తావించిన లక్షణాలను గమనిద్దాం. “పింగళి లక్ష్మీకాంతం 1. ఏకనాయకాశ్రయం, వస్త్వైక్యం 2. అష్టాదశ వర్ణనలు 3. శృంగారరస ఆంగికత్వం 4. ఆలంకారిక శైలి 5. స్వతంత్ర రచన అన్న ఐదు లక్షణాలు గుర్తించారు. జీ. వీ. సుబ్రహ్మణ్యం ప్రబంధ ప్రస్థానంలో వక్రోక్తి జీవితం అన్న వ్యాసంలో ప్రబంధానికి మొత్తం పది లక్షణాలుంటాయని ప్రతిపాదించారు. 1.అష్టాదశ వర్ణనలు 2. వస్త్వైక్యం-ఏకవాక్యత 3. ఏకనాయక అపూర్వ పాత్రలు 4. శృంగారరస ప్రాధాన్యం 5. స్వతంత్ర రచన 6. నాటకీయ శిల్పం 7. జాతి వార్తా చమత్కారాలు 8. ప్రతీకాత్మకం 9. ఆలంకారిక శైలి 10. వక్రోక్తి జీవితం. తుమ్మపూడి కోటేశ్వరరావు ప్రబంధ ప్రక్రియ వివేచన చేస్తూ ఒక నూతన సమన్వయాన్ని ప్రతిపాదించారు. సర్గ ప్రతిసర్గ మన్వంతర వంశానుచరితాల్లో 1. విశ్వనిర్మాణ సూత్రం బ్లూ ప్రింటు - Blue print of plan 2. దాని వ్యక్తీకృతి దేశం 3. కాలం - Time 4-5. మానవ వంశ చరితలు ప్రేరేపింపబడుతాయని అన్నారు”. (తెలుగు సాహిత్య విమర్శ దర్శనం - పుట. 969) ఈ భిన్నాభిప్రాయాల సమాహారంగా ప్రబంధ రచనా నిర్మాణానికి వస్త్వైక్యం, ఏకనాయకాశ్రయం, రసాలంకార ప్రాధాన్యం, వర్ణనా బాహుళ్యం వంటివి సాధారణ లక్షణాలుగా పేర్కొనడం వల్ల “షట్చక్రవర్తి చరిత్ర” కూడా ఒక ప్రబంధంగా వెలుగొందుతుంది.

8. ప్రబంధాల ఒరవడి – కాల ప్రభావం:

పురాణేతి కావ్యాల్లో గల ప్రసిద్ధమైన కథను గ్రహించి స్వకపోల కల్పనలతో కవులు పెంచి పోషించిన ప్రబంధాలు రాయల కాలం నుంచి వెలువడ్డాయి. అల్లసాని పెద్దన "మను చరిత్ర", శ్రీకృష్ణ దేవరాయల "ఆముక్తమాల్యద", నంది తిమ్మన "పారిజాతాపహరణం", దూర్జటి "కాళహస్తి మహాత్మ్యం", తెనాలి రామకృష్ణుడి "పాండురంగ మహాత్మ్యం", పింగళి సూరన "కళా పూర్ణోదయం", "ప్రభావతీ ప్రద్యుమ్నం", రామరాజభూషణుడి "వసు చరిత్ర" వంటి ప్రబంధాలు ఘనతకెక్కాయి. అనంతర కాలంలో కూడా ప్రబంధాల వైశిష్ట్యాన్ని పెంపొందింపజేస్తూ శ్లేష ప్రాధాన్యం వహించింది. అనేకార్థక కావ్యాలు తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించాయి. పింగళి సూరన "రాఘవ పాండవీయం", రామరాజభూషణుడి "హరిశ్చంద్ర నలోపాఖ్యానం" వంటి ద్వర్థ్యి కావ్యాలు, నెల్లూరి వీర రాఘవకవి "రాఘవ యాదవ పాండవీయం", ఎలకూచి బాల సరస్వతి "యాదవ రాఘవ పాండవీయం" వంటి త్ర్యర్థి కావ్యాలు విశేష లక్షణాలతో ప్రశస్తి గాంచాయి. రాజా మల్లారెడ్డి షట్చక్రవర్తి చరిత్ర రచించిన సరాసరి కాలంలోనే అద్దంకి గంగాధరుడి "తపతీ సంవరణోపాఖ్యానం", పొన్నగంటి తెలగన "యయాతి చరిత్ర", నూతనకవి సూరన "ధనాభిరామం", చరిగొండ ధర్మన్న "చిత్రభారతం", సారంగుతమ్మయ్య "విప్రనారాయణ చరిత్ర" వంటి కావ్యాలు వెలిశాయి. షట్చక్రవర్తి చరిత్రలో ప్రబంధ రచనా శైలి, వస్త్వలంకార రస ప్రాధాన్యం, అష్టాదశ వర్ణనలు స్పష్టంగా గోచరమవుతాయి.

9. తెలంగాణ ప్రబంధాలు – డా. గురిజాల రామశేషయ్య వ్యాఖ్య:

తెలంగాణలో పంచ మహాకావ్యాలుగా పేర్గాంచిన  “చిత్ర భారతము, తపతీ సంవరణోపాఖ్యానము, షట్చక్రవర్తి చరిత్ర, యయాతి చరిత్రము, ముకుంద విలాసము” అయిదు ప్రబంధాలను డా. గురిజాల రామశేషయ్య తెలంగాణ సాహితీ వేత్తలైన డా. సంగనభట్ల నరసయ్య, డా. బ్రాహ్మణపల్లె జయరాములు, డా. మృదుల నందవరం, డా. సిహెచ్. లక్ష్మణ చక్రవర్తి, డా. గండ్ర లక్ష్మణ రావులతో వ్యాసాలు రచింపజేశారు.  ఇవి కవి పరిచయం, స్థల కాలాది విశేషాలు, కథా సంగ్రహం, ప్రబంధ నిర్మాణం, పద్య శిల్ప వైభవం విశేషములను వివరిస్తూ విషయ విస్తృతికి ఎక్కువ ప్రాధాన్యం వహించాయి. వీటన్నింటిని డా. కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో వెలువడుతున్న మయూఖ తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రికలో ప్రచురింపజేశారు.

“నా తెలంగాణ ప్రబంధాలు’’ ప్రాజెక్ట్‌లో తొలివిడత ఐదు ప్రబంధాలలో కామినేని మల్లారెడ్డి రచించిన ‘‘షట్చక్రవర్తి చరిత్ర’’ ఒకటి. ఈ ప్రబంధంలో తెలుగు కమ్మని పలుకుతో పాటు సంస్కృతచ్ఛాయా శైలి అధికము. పావనోదార చరితులైన ‘షట్చక్రవర్తుల కథలు ప్రబంధీకరింపబడిన రసప్లావిత మనోహర పద్య శైలీ కావ్యం ‘‘షట్చక్రవర్తి చరిత్ర’’. (మయూఖ పత్రిక 2 జూన్ 2021) అని గురిజాల రామశేషయ్య పేర్కొన్నారు.

ఈ సందర్భంగా డా. నందవరం మృదుల షట్చక్రవర్తి చరిత్రను పరిచయం చేస్తూ...

“ఈ కథలు వేటికవే ప్రబంధం కాగలిగిన లక్షణాలు కలిగినవి. కాని కవి వీటిని ఒక సమాహారంగా చేసి ఒకే గ్రంథంగా ఇవ్వడంలోని ఆంతర్యం – ‘రాజు’ అయినవాడు ఈ ఆరుగురిని ఆదర్శంగా తీసుకొని, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధర్మానికి కట్టుబడి నిలిచి పోరాడాలని తెలియజేయడం. అప్పుడే చరిత్రలో నిలబడగలిగే చక్రవర్తులవుతారని అంతర్లీన బోధన. ఈ కథలను నేటి ప్రజాస్వామ్య పాలన కొరకు కూడా అన్వయం చేయవచ్చు… ఆయా రాజుల జీవితాలలో ఎదురైన ఘట్టాలను చదువుతున్నప్పుడు పాలకులకు, పాలితులకు ఒక ప్రేరణ గ్రంథంగా నిలవడమే కాక – ఛందో ప్రియులకు లక్ష్య గ్రంథంగా, పురాణ ప్రియులకు పౌరాణిక గ్రంథంగా, భాషా ప్రియులకు బహుభాషల సమాహారంగా, రసప్రియులకు కావ్య రస సమాయుక్త ప్రబంధంగా మలచబడి ఆనాటి ఆలయాలలోని పురాణ ప్రవచనంలో ముఖ్య పాత్ర వహించి నవగ్రహ దోష పరిహార తంత్ర గ్రంథంగానూ నిలిచే ఇహపర సాధనమని చెప్పడం అక్షర సత్యం.” (మయూఖ పత్రిక 2 జూన్ 2021) అని పేర్కొన్నారు.

10. షట్చక్రవర్తి చరిత్ర – ధార్మికచింతన:

రాజా మల్లారెడ్డి రచించిన షట్చక్రవర్తి చరిత్ర ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధం. అత్యంత విపులంగా, విస్తారంగా  మొదటి మూడు ఆశ్వాసాలలో హరిశ్చంద్రుడి కథను, తర్వాతి రెండు (నాల్గవ, ఐదవ) ఆశ్వాసాలలో నలుడి కథను విస్తరింపజేశారు. పురుకుత్స పురూరవల వృత్తాంతాలను కేవలం ఒక్క ఆరవ ఆశ్వాసంలోనే పొందుపరిచారు. ఏడవ ఆశ్వాసంలో సగరుడి చరిత్రను, ఎనిమిదవ ఆశ్వాసంలో కార్తవీర్యార్జున చరిత్రను వివరించారు. ఇందులో ఒక్కొక్క చరిత్రలో ఒక్కో ధార్మికచింతన వ్యక్తమయ్యేలా కవి ఈ ప్రబంధాన్ని సంతరించారు. ప్రస్తుతం ఆ యా కథాంశాలవారీగా కవి పేర్కొన ఒక్కో ధార్మికాంశాలను గమనించవచ్చు.

రాజా మల్లారెడ్డి “షట్చక్రవర్తి చరిత్ర” ప్రబంధ రచనలో రామరాజభూషణుడిని అనుసరించాడనే విషయాన్ని జి. నాగయ్య తన తెలుగు సాహిత్య సమీక్ష, బేతవోలు రామబ్రహ్మం తన వ్యాఖ్యాన పరంపరలో పేర్కొన్నారు.

"షట్చక్రవర్తి చరిత్రము మల్లారెడ్డి ప్రథమ గ్రంథము. ఇది ఎనిమిది ఆశ్వాసముల ప్రబంధము. ఇందు ప్రసిద్ధులైన హరిశ్చంద్రాది షట్చక్రవర్తుల చరిత్రలు వర్ణింపబడినవి. ఇందు మల్లారెడ్డి శ్లేష శబ్దాలంకార చిత్ర రచనను ఎక్కువగా ప్రదర్శించినాడు. రామరాజభూషణుని అనుకరణమిందు కానబడును. తన శబ్ద శాస్త్ర పరిచితిని ప్రదర్శించుటకై వ్యాకరణ పదములను, అలంకారములను, రీతులను కూడ శ్లేషలలో కూర్చి పద్యములు రచించారు." (తెలుగు సాహిత్య సమీక్ష రెం. సం. పుట. 264)

"ఈ కావ్యానికి ఒజ్జబంతి వసుచరిత్ర. దానిలో ఎనిమిదే ఆశ్వాసాలు. అందుకని మల్లారెడ్డి  సైతం ఎనిమిది ఆశ్వాసాలకే పరిమితమై ఉండవచ్చు. పురుకుత్స పురూరవ కథలు రెండింటిని ఒకే ఆశ్వాసంగా కూర్చి ఉంటాడు." (షట్చక్రవర్తి చరిత్ర రెం. సం. పుట 683)

ప్రారంభ శ్లోకం – షష్ఠ్యంతములు:

“షట్చక్రవర్తి చరిత్ర” అనే ప్రబంధంలో గల ఆయా ఆశ్వాసాలలో పేర్కొన్న కథా సంవిధాన విశేషాంశాలు రాజా మల్లారెడ్డి కవిత్వ వస్తు పటుత్వాన్ని ప్రదర్శిస్తాయి. ప్రథమాశ్వాసంలో మొదటి పదకొండు పద్యగద్యాలలో కవి షష్ఠ్యంత్యములు ప్రవేశపెట్టారు. సిద్ధరామేశ్వర స్వామిని కొలుస్తూ రచించిన షష్ఠ్యంత్యాలలో షష్ఠి విభక్తితో పద ప్రయోగం చేశారు.

శ్లో. సహసా పాహి మే దేవి త్రిలోకీజన సన్నుతే

ఆరోగ్యమభయం దత్వా యుష్మదంఘ్రి యుగర్చనమ్ (ప్రథమాశ్వాసం ప.1)

షట్చక్రవర్తి చరిత్రను ఈ శ్లోకంతో ప్రారంభించారు కవి. కావ్యాగత సంప్రదాయ పరంపరల మీద మల్లారెడ్డికి ఉన్న గౌరవం దీని ద్వారా వ్యక్తమవుతుంది. జగదేక దేవిని త్రిలోకిగా అభివర్ణించారు. త్రయాణాం, లోకానాం, సమాహారం అనే శబ్దాలు త్రిలోకికి వ్యుత్పత్యర్థములు. ఈ దేవి కృప వల్లనే ఆరోగ్యం, అభయం కలుగుతాయని కవి అభిలాష. సర్వ శుభదాయకమైన "స" వర్ణంతో ప్రబంధం ప్రారంభం కావడం విశేషం.

తర్వాతి పద్యం శ్రీకారంతో కూడినది.

కం. శ్రీమద్భూమీధరపు / త్రీమణి  కుచకుంభికుంభ మృగమదవిదిత

శ్యామల కోమల వక్షో / ధామున కభిరామభూమిధర ధామునకున్. (ప్రథమాశ్వాసం ప.2)

ఈ షష్ఠ్యంత్యాలన్ని శివుడికి అంకితంగా సమర్పింపబడినవి. మంచు కొండల మీద పార్వతీ సమేతుడై ఆసీనుడైన శివుడు "మృదువైన వక్షస్సీమ" కలిగి ఉన్నట్లు కవి వర్ణించారు. తర్వాత కరుణాభరణుడిగా కీర్తించారు. బిక్కనవోలు సిద్ధ రామలింగస్వామిని జటాజూటధారిగా, సర్ప కర్ణ భూషణాదులు ధరించినవాడిగా, వీరభద్రుడు నంది వాహన కారుడిగా, జంభాసురుడిని జయించిన వాడిగా, హాలాహలాన్ని ఆరంగించిన వాడిగా, ఆశ్రితులకు అభీష్ట ప్రదాయుడిగా కొలిచారు. కథాప్రారంభంలో నైమిశారణ్య ప్రసక్తి ఉంది. శౌనకాది మునీశ్వరులను, వారి శివ భక్తి తత్పరతను కవి ప్రత్యేకంగా కీర్తించారు. మునీశ్వరుల వస్త్రాలకు ఆ అరణ్యంలో తరువుల బెరడును శ్లేషార్థంగా కవి పేర్కొన్నారు. వారు తమో గుణాన్ని వదిలించుకొన్నారన్న అభిప్రాయంలో పొగను, చీకటిని పోగొట్టుకున్నారని వర్ణించారు.

10.1 హరిశ్చంద్ర మహారాజు కథ - సత్యసంధత:

రాజా మల్లారెడ్డి ఈ కథ ప్రారంభంలోనే అయోధ్యాపుర వర్ణనలో తన శ్లేష పాండితీ ప్రాభవాన్ని ప్రతిక్షేపించారు.

సీ. గోపుర గోపుర గోపుర ప్రతిమంబు / కల్పద్రు కల్పద్రు గౌరవంబు

మానవ మానవ మానవాధిశయంబు / మణిజాల మణిజాల మంజిమంబు

సారంగ సారంగ సారంగ నయనంబు / సుమనోఙ్ఞ సుమనోఙ్ఞ శోభితంబు

బహుధామ బహుధామ బహుధామ చిత్రంబు / ఘనసార ఘనసార గంధిలంబు

తే.గీ. భవ్యకాసార కాసార బంధురంబు / జవన సైంధవ సైంధవ సంకులంబు

బహుళ కేతన కేతనభస్థలంబు /  నై విజృంభించె సిరి నయోధ్యాపురంబు (ప్రథమాశ్వాసం ప.15)

ఈ పద్యంలో శబ్దాలంకారం రమణీయంగా ప్రయోగించబడింది. "గోపుర" శబ్దం అర్థభేదంతో పునరావృత్తి కలిగి లాటానుప్రాసను ప్రదర్శిస్తుంది. కోటగుమ్మాలకు, గృహద్వారాలకు, గోలోక రాజధాని నగరానికి ప్రతిరూపంగా అయోధ్యానగరం శోభిల్లుతుందనే అర్థం ఈ శబ్దంలో భాసిల్లుతుంది. శ్రేష్టమైన గోపురాలతో, దివ్యమైన సరోవరాలతో, దట్టమైన చెట్లతో నగరం వర్ధిల్లినట్లు కవి వర్ణించారు. ప్రజలు నవనిధులలో తులతూగడం, మణుల గుత్తులు వ్రేలాడడం, సజ్జనులు, పండితులు, పశుపక్ష్యాదులు, మేలుజాతి గుర్రాలు, ఆకాశాన్ని తాకుతున్న సౌదాల మీది జెండాలు వంటి అద్భుత దృశ్యాలతో ఆ నగరం వెలుగొందుతుంది.

ప్రఖ్యాతి గాంచిన అయోధ్యాపురికి ప్రభువు హరిశ్చంద్రుడు. రాజదేవేంద్రుడు. బుధజన రక్షకుడు. అధిక సంపన్నుడు. హరిశ్చంద్రుడి రాజ్యపాలనా సామర్థాన్ని కవి గొప్పగా వర్ణించారు. హరిశ్చంద్రుడు స్వయం సిద్ధత ఏర్పడు విధంగా పొరుగు రాజ్యాలతో విభాగజ్ఞతను ప్రదర్శించేవాడు.  శాంతి ఒప్పందాలతో పాటు యుద్ధాల తీరు తెలిసినవాడు. కవి చతురోపాయాలను రాజనీతికి అనుకూలంగా సంభావించారు. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం; సామ దాన భేద దండం వంటివి అవలంబిస్తూ రాజ్యాన్ని రక్షించేవాడు. వేదాలు, వేదాంగాల అధీతి బోధాచరణలకు సదుపాయాలను స్థిరపరిచేవాడు. శత్రువులను నామరూపాల లేకుండా చేయడం రాజనీతిలో భాగం. శౌర్య ఔదార్యాది గుణాలతో వెలుగొందే పెద్దలను పరిపోషించేవాడు. రాజప్రజల పట్ల తన విశ్వాసాన్ని సందర్భానికి తగినట్లు ప్రకటించేవాడు. సూత్ర వృత్తులు, గణక సంజ్ఞలు, సరి చూసే రాజోద్యోగుల సలహాలను పాటించేవాడు. వ్యాకరణ శబ్దం శాస్త్రాలను అనుసరించి పలికేవాడు. ఇందులోని శ్లేషను పరికిస్తే... సూత్రవృత్తులు: దారాలతో చేసే చేతి వృత్తులు, గొప్ప సూత్రాలు "వార్తికాలు" అని; గణక సంజ్ఞలు: ఆదాయ వ్యయాలు, నియత ఆకృతి గుణాలు, ఆకృతి సంజ్ఞలు అని కవి విశ్లేషించారు. భూత వర్తమాన భవిష్యత్ కాల పరిణామాలను తెలుసుకొని పాలించేవాడు. చక్రవర్తి అనే శబ్దానికి పదవి స్ఫూర్తికి పాతంజల శబ్ద శాస్త్ర విస్ఫూర్తితో ఆ హరిశ్చంద్రుడు నృపతి ఉర్విని పాలిస్తున్నాడు. సాముద్రికా శాస్త్రం ప్రకారం వజ్ర చిహ్నం అదృష్టరేఖగా కలిగినవాడు హరిశ్చంద్రుడు. సురపతుల శౌర్యాన్ని తృణీకరించినవాడు. ఇంద్రుడు చేతలో ధరించిన వజ్రాయుధాన్ని రేఖామాత్రంగా కాలిలో ధరించినవాడు. కుభృత్తుల రెక్కలను మాత్రమే ఇంద్రుడు నరికితే హరిశ్చంద్రుడు మొత్తంగా తుత్తునియలు చేశాడని కవి చమత్కరించారు. (సాముద్రికా లక్షణం: చక్రాసి వజ్రాభా: రేఖా: కుర్వంతి భూపతిం)

ఇది ఇలా ఉండగా ఇంద్రుడు తన ఇంద్రసభలో ఆసీనుడై సకల లోకాల్లో సత్య వాక్య నియమం గల రాజు ఒక్కడైనా ఉన్నారా అని అడగగా వశిష్ఠుడు మనుష్య లోకంలో హరిశ్చంద్రుడనే మహారాజు ఉన్నట్లు తెలిపారు.

కం. వినవయ్య పాకశాసన ! / జనలోకములోన నతుల సత్యాధ్యుండై

ఘనరాజశేఖరుం డనఁ / దనరు హరిశ్చంద్ర విభుఁడు దను బుధులెన్నన్. (ద్వితీయాశ్వాసం ప.4)

హరిశ్చంద్రుడు బుధుల ప్రశంసలు అందుకొంటున్నాడని, అతడు సాటిలేని సత్య సంధుడని, ఘన రాజశేఖరుడని సంబోధించినప్పుడు శ్లేషార్థంలో ఇంద్రుడంతటి వాడని, శివుడంతటి వాడని ప్రస్తుతించారు. సజ్జనులను రక్షించేవాడు. వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించినవాడు. కోపాన్ని వహింపనివాడు. అధిక సమ్మదంలో సార్వభౌముడైనవాడు. ఉగ్గుపాలలో సత్యవాక్య నియమాలను అలవరుచుకున్నవాడు. త్రిభువనాలలో సాటిలేని రాజుగా హరిశ్చంద్రుడి గుణగణాలను వశిష్ఠుడు ఇంద్రుడికి నివేదించాడు. శత్రువులు లోకైక వీరుడిగా, పండితులు ఇహలోక కల్పతరువుగా, సుందరీమణులు సాకార మన్మథుడిగా హరిశ్చంద్రుడిని ఎల్లవేళలా స్మరిస్తూనే ఉంటారని మునివర్యులు తెలిపారు.

వశిష్ఠుడి పలుకులను విశ్వామిత్రుడు నిలువరింపజేశారు. హరిశ్చంద్రుడి సత్య వాక్య నియమం పట్ల కొంతసేపు ఇరువురి మునుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. విశ్వామిత్రుడి క్షత్రీయ ధర్మాన్ని గూర్చి వశిష్ఠుడు, వశిష్ఠుడి మూడు జన్మల కథను గూర్చి విశ్వామిత్రుడు పరస్పరం కలహించుకుంటారు. హరిశ్చంద్రుడు సాటిలేని సత్యసంధుడని వశిష్ఠుడు దృఢంగా పలుకగా బ్రహ్మర్షి విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి సత్యసంధతను పరీక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఒక ప్రణాళిక ప్రకారం విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి సభకు విచ్చేసి గౌరవ వందనాలు స్వీకరించి తాను చేసే మహాయజ్ఞం కోసం "ఒక బలశాలి ఏనుగు మీద నిలిచి రత్నాన్ని నింగిలో విసిరితే, ఎంత ఎత్తు వరకు వెళ్లుతుందో అంతటి ఎత్తు ధనం నేల మీద పోస్తే యజ్ఞం నిర్విగ్నంగా సాగుతుంది" అని అభ్యర్థించి, అవసరం వచ్చినప్పుడు ఆ ధనాన్ని తీసుకుంటానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత హరిశ్చంద్రుడి రాజ్యంలోని వనంలో అనేక క్రూర మృగాలను సృష్టించి, రాజు వేటకు వెళ్లే విధంగా ప్రేరేపిస్తాడు.

హరిశ్చంద్రుడి యుద్ధ ప్రావీణ్యాన్ని ఆయన గుణగణాలతో, వంశాచారాలతో భావన చేస్తూ వేట వర్ణనలో కవి మల్లారెడ్డి అద్భుతంగా తెలియజేశారు. భీభత్స రౌద్ర రూపంలో సాగిన వేటను కవి యుద్ధ వర్ణన కంటే అధికంగా వీర్య శౌర్య పరాక్రమాలకు అనుగుణంగా విశ్లేషించారు. మృగాలన్ని సంహరింపబడ్డాయి. చిత్రంగా వన్నెల మెకం అడ్డురాగా ఒక యోజన దూరంలో ఒకే ఒక బాణంతో సంహరించాడు. ఈ వేట సందర్భంలోనే హరిశ్చంద్రుడు వశిష్ఠుడి ఆశ్రమాన్ని, విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని సందర్శించారు. విశ్వామిత్రుడి ఆజ్ఞానుసారం మాతంగ కన్యలు హరిశ్చంద్రుడిని దర్శించి తమ తమ తలపును విన్నవించగా విముఖతను ప్రకటించి తరిమికొడుతాడు. అందుకు విశ్వామిత్రుడు ఆగ్రహించి హరిశ్చంద్రుడి రాజ ధర్మాన్ని నిందిస్తాడు. రాజ్యానైనా వదులుకుంటాను గాని మాతంగ కామినులను చేబట్టబోనని ప్రతిజ్ఞ చేసి భూభాగాన్ని, పదవిని విశ్వామిత్రుడికి అప్పగిస్తాడు. అంతటితో ఆగకుండా విశ్వామిత్రుడు తాను ఇదివరకు మహాయజ్ఞం కోసం వరంగా అడిగిన ధనాన్ని ఇచ్చి వెళ్లమని హరిశ్చంద్రుడిని ఆజ్ఞాపిస్తాడు. ఒక నెల రోజులు గడువు ఇవ్వవలసిందిగా అభ్యర్థించి విశ్వామిత్రుడి శిష్యుడు నక్షత్రకుడితో వెంట రాగా సతీ పుత్ర సమేతంగా హరిశ్చంద్రుడు అడవులకు బయలుదేరుతాడు.

అరణ్యంలో అనేక కష్టాలు అనుభవించిన అనంతరం కాశీ నగరంలోకి అడుగు పెడుతారు. హరిశ్చంద్రుడి నుంచి భార్యను ఎడబాపుమని విశ్వామిత్రుడి నుంచి వచ్చిన సందేశం ప్రకారం నక్షత్రకుడు చంద్రమతిని, లోలితాస్యుడిని  కాలకౌశికుడికి అమ్ముతాడు. కాని ఆ సొమ్ము ద్వారా తన రుణం మాత్రమే తీరిందని తెలిపి, నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని విక్రయానికి పెట్టి కాశీ పురవీధుల్లో చాటింపు వేస్తూ...

సీ. తన కళావిస్ఫూర్తి దరుగ మిత్రునినైనఁ / జేరని రా జన మీరు వానిఁ

దన నెంత ఘనులైనఁగని యడ్డుకొనిన లోఁ / బడని యినుం డనఁ బరఁగు వానిఁ

దన సుదర్శనము చేతను బుణ్యజనుల నొం / పని చక్రవర్తియై తనరువానిఁ

దన కిమ్మటంచును ధనదు దండకుఁ బోని / రాజశేఖరుఁ డనఁ బ్రబలువానిఁ

తే.గీ. బంకరుహ మిత్రకులునిఁ ద్రిశంకుసుతుని / సాంద్రతరకీర్తి శ్రీ హరిశ్చంద్ర నృపుని

నమ్ముచున్నాఁడఁ గొనరో మహాత్ములార ! / దాన దాక్షిణ్యపరులార ! ధనికులార ! (తృతీయాశ్వాసం ప.149)

అని హరిశ్చంద్రుడి ఉత్తమ గుణాలను పేర్కొన్నారు. వీరబాహుడు హరిశ్చంద్రుడిని కొనుక్కొని వీరదాసుడిగా మార్చి స్మశానవాటికకు అధిపతిని చేస్తాడు. కాలకౌశికుడి గృహంలో అనేక కష్టాలు అనుభవిస్తుంది చంద్రమతి. ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్లిన లోలితాస్యుడు పాము కాటుకు బలి అవుతాడు. చంద్రమతి తన విధికి దు:ఖించి నిశ్చేష్టుడైన కుమారుడిని ఎత్తుకొని స్మశానానికి వెళ్లగా వీరదాసుడు కనిపిస్తాడు. స్మశానవాటిక ప్రవేశానికి సొమ్ము చెల్లించాలని ఆజ్ఞాపిస్తాడు. అతడిని తన విభుడిగా గుర్తించినా ఏమీ చేయలేక తన యజమానిని (కాలకౌశికుడిని) అడిగి ధనం తీసుకొని రావడానికి బయలుదేరగా అర్థరాత్రి కాశీ రాజ్య అంత:పురంలో జరిగిన దొంగతనం కుట్రతో ఆమెపై మోపబడుతుంది. చంద్రమతి శిరస్సు ఖండించమని రాజు ఆజ్ఞాపించగా వీరదాసు సిద్ధమవుతాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడు విచ్చేసి సొంత ఇల్లాలిని (గృహిణీ గృహ ముచ్యతే) వధించడం తగదని వారించి ఇప్పటికైనా మాతంగ కన్యలను స్వీకరిస్తే శ్రీమంతుడిని చేస్తానని సూచిస్తాడు. కాని ఆ మాటలను అంగీకరించక చంద్రమతిని ఖండించబోగా మెడలో పూలహారమై ప్రకాశిస్తుంది.

హరిశ్చంద్రుడి సత్యవ్రతానికి ప్రసన్నుడైన శివుడు ప్రత్యక్షమై ఆశీర్వదిస్తాడు. దివ్య సాయుజ్యాన్ని కోరుకున్న హరిశ్చంద్రుడికి శివుడి ఆజ్ఞ మేరకు విశ్వామిత్రుడు రాజ్యాన్ని అప్పగిస్తాడు. లోలితాస్యుడిని బ్రతికించి ఏడు సముద్రాలు చుట్టి ఉన్న భూభాగానికి హరిశ్చంద్రుడిని పట్టాభిషిక్తుడిని చేసి శివుడు అంతర్ధానమవుతాడు.

10.2 నల మహారాజు కథ - త్యాగనిరతి: 

రాజా మల్లారెడ్డి చతుర్థాశ్వాసంలో నల మహారాజు చరిత్రను శ్రీకారంతో ప్రారంభించారు. చంద్రవంశపు కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసే నలచక్రవర్తి ధర్మనిరతిని కవి ఈ పద్యంలో వర్ణించారు.

సీ. సౌకర్య రక్షిత సర్వభూవలయుఁడై / హరికి సమానాధికరణ మగుచు

స్థిరతర వీర్య సంచిత మహాసేనుఁడై / యురగకంకణుని పెన్నుద్ది యగుచు

భాసుర గురునీతిపాలనాసక్తుఁడై / సుత్రామునకు సహశ్రోత యగుచు

జనితానిరుద్ధ శాశ్వత భూతి శాలియై / కుసుమాస్త్రునకుఁ బ్రతికోటి యగుచుఁ

తే. గీ. బొగడికకు నెక్కి నిశ్చల బుద్ధి మహిమఁ / బూని తన దాన మెప్పుడు బుధుల పాలె

చేయుచున్నాఁడు ధరణిఁ జర్చింప సార్వ / భౌమమాత్రుండె నలమహీపాలమౌళి !! (చతుర్థాశ్వాసం ప.3)

దాతృత్వంతో తన బుధులను సంతృప్తి పరిచే రాజ శిఖామణిగా కవి కీర్తించారు. మొదట సౌకర్య రక్షిత సర్వ భూవలయం అనే పద బంధాన్ని కవి శ్రీహరికి, నల చక్రవర్తి సామాన్యాధికరణంగా ప్రకటింపజేశారు. ప్రజలకు సౌకర్యాలు కల్పించడం రాజు కర్తవ్యం (నలచక్రవర్తి). ఆది వరాహవతారంతో భూగోళాన్ని రక్షించినవాడు (శ్రీహరి). అదేవిధంగా "స్థిరతర వీర్య సంచిత మహాసేనుడు" స్థిరమైన స్థలిత వీర్యంతో కుమారస్వామిని సమకూర్చుకున్నవాడు (శివుడు). "భాసుర గురు నీతి పాలనాసక్తుడు" గొప్ప రాజనీతిని పాటిస్తూ పాలన సాగిస్తున్నవాడు (నలచక్రవర్తి). బృహస్పతి చెప్పిన నీతిని ఆచరిస్తూ పాలన సాగిస్తున్నవాడు (ఇంద్రుడు). "జనతానిరుద్ధ శాశ్వత భూతిశాలి" శాశ్వతంగా నిలిచిపోయే ఐశ్వర్యం కలవాడు (నలచక్రవర్తి). శివుడి నేత్ర జ్వాలతో శాశ్వతంగా బూడిద చేయబడినవాడు (మన్మథుడు). సుస్థిరమైన బుద్ధి వైభవం కలిగిన పూనికతో దానం చేస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. మరొక పద్యం “ఆ నిషధాధినాథుని సమంచిత కీర్తి..” (చతుర్థాశ్వాసం ప.4) లో కూడా దాన గుణ శీలత్వాన్ని తెలుపుతూ కవి నలచక్రవర్తిని వర్ణించారు.

నిషధదేశాన్ని పరిపాలిస్తున్న ఆ నలుడు మంచి యశస్సు కలవాడు. "తెల్లని పద్మం" ను అందుకు ప్రతీకగా కవి ప్రతిష్ఠ చేశారు. దాన ధర్మాల వల్ల వచ్చిన కీర్తి శౌర్య సూర్య కిరణాలతో పగలు రేయి వాడిపోకుండా వికసించి ఉంటుందని అన్నారు. ఆ పద్మం మీద వినీలాకాశం గడుసరి తుమ్మెదగా భాసిల్లుతుందని అన్నారు. దానజలంతో పద్మం వికసించడం నలచక్రవర్తి కీర్తి మిన్నంటిదనే అర్థంతో కవి ప్రౌఢోక్తిని ప్రదర్శింపజేశారు. రాజా మల్లారెడ్డి తర్కశాస్త్ర పరిభాషలో నలమహారాజు సౌందర్యాన్ని అద్భుతంగా వర్ణించారు. చంద్రుడు, అశ్వినీ కుమారులు, వసంతుడు, మన్మథుడు వంటి వారి గుణగణాలతో కవి తర్కించి వారందరి కంటే సుందరాంగుడిగా తేల్చారు. తర్క శాస్త్రంలో గొప్ప శక్తి మహిమలు కలిగిన వీరసేన మహారాజు పుత్రుడిగా ఎనలేని కీర్తిని గడించాడు.

ఈ విధంగా నల చక్రవర్తి దానగుణ కీర్తిదాయకతను కవి ప్రకటించి తదనంతరం నలదమయంతులకు అన్యోన్య అనురాగం ఏ విధంగా ఉద్భవించిందో వర్ణించారు. కుండినపుర భీమరాజు పుత్రిక దమయంతి నలుడి గుణగణాలు కథలు, గాథలుగా అప్పటికే విన్నది. అతడి పట్ల అనురక్తురాలై ఉండగా మన్మథుడు పుష్ప ధనుస్సు సంధించాడు. దమయంతీ గుణ సౌందర్యాతిశయం నలుడి మనస్సులో ముద్రపడింది. అత్యంత ప్రౌఢతనంతో ఇరువురి హృదయాలు భాసించాయి. నలుడి లాలిత్యం దమయంతి మనస్సులో, దమయంతి సౌభాగ్యం నలుడి మనస్సులో నాటుకొని పోయి మన్మథుడి పుష్ప బాణాల చేత నాటి నాటికి గాఢానురాగాలుగా వృద్ధి చెందుతున్నాయని కవి భావన. వసంతాగమనం నలదమయంతులలో సంచారి భావాలను పెంపొందించింది. అయినా మనో నిగ్రహ సంపన్నుడైన నలచక్రవర్తి మహాసభకు విచ్చేయడం అతని ధీరోదాత్త గుణాన్ని తెలుపుతుందని కవి అభివర్ణించారు.

నలుడి రాజదర్భారును కవి కొనియాడుతూ కరహాటదేశం, శకదేశం, లాటదేశం వంటి సామంతరాజులతో; శ్రేష్టమైన మహాపండితులతో, సత్కవి బృందంతో, పుణ్య చరితులతో విలసిల్లుతున్నదని పేర్కొన్నారు. వారందరు శబ్దార్థ చాతుర్యంతో, గుణ విభావంతో ఉన్నతంగా భాసిల్లగా అంతకంటే అతిశయంగా నలచక్రవర్తి మెరసిపోతున్నాడని కవి వర్ణించారు. నలుడు విరహ తాపాన్ని తాళలేక ఉద్యానవనాన్ని దర్శిస్తాడు. అకడొక సరస్సులో రాజహంస విహరిస్తుండగా రాజు దానిని ఒదుపుగా పట్టుకొని ఒడిలో నిలుపుకున్నాడు. బంగారు రెక్కలు ముడిచి అప్పుడే నేలకు వాలిన రాయంచ, తామర తూడులు మాత్రమే ఆరగించే రాయంచ, పవిత్రమైన తీర్థాలతో విహరించే రాయంచను ఒక యోగీశ్వరుడు అభ్యాసవశాన తన అంతరంగంలో పరమాత్మను పట్టి నిలుపుకున్నట్లుగా కవి భావన చేశారు. ఒడిలో సుఖాసీనురాలైన హంస నలుడికి భైమి వృత్తాంతాన్ని వివరించింది. విదర్భ దేశాన్ని పాలిస్తున్న భీముడి మహా మహిమను, సర్వమంగళాన్విత భాగ్యాన్ని వర్ణించింది. భీముడి పుత్రుడు ధముడని, అతడు పండిత పోషకుడని వివరించింది. భీముడి పుత్తిక దమయంతి అని, రూపలావణ్యాలలో రంభా, తిలోత్తమ, ఇందుమతి, అప్సరస వంటి దేవకన్యలతో సాటిలేనిదిగా వర్ణించింది. అంతటితో నలుడు తన సందేశాన్ని తెలిపి హంసను దమయంతి దగ్గరకు పంపించాడు.

విదర్భపట్టణంలో ప్రమదా (క్రీడ) వనంలో విహరిస్తూ ఉండగా రాజహంస ఎగిరి వచ్చి మనోహరమైన గుబురు చెట్ల పొదలో చేరి తన ప్రశస్తిని పేర్కొంటుంది. సరసజ్ఞులైన పండితులలో నిరంతరం సంచరిస్తుంటానని, సమస్త వేద శాస్త్రాలు పఠించానని, మత్స్య కూర్మ పురాణాల మహిమలను అధ్యయనం చేస్తుంటానని, స్వజాతీయులతోనే జత కుడుతానని, సన్మార్గ గతులలోనే పయనిస్తానని, ప్రతి నిత్యం ఆ శ్రీహరి సేవయే చేస్తానని, లక్ష్మీదేవీ కరుణా కటాక్షాలతో తామర తూడులు తిని జీవిస్తున్నానని, బ్రహ్మ దేవుని సన్నిధిలో నిలయమై ఉన్నానని రాజహంస దమయంతితో పలుకుతుంది. తనకు తాను ద్విజేంద్రుడనని సగర్వంగా ప్రకటిస్తుంది. "నలరాజంతటివాడు గాక" ఇతరులు సమర్థులు కారని వాదిస్తూ నల చక్రవర్తితో చెలిమి చేస్తుంటానని పేర్కొంటుంది. నలుడి గుణగణాలు వర్ణన చేసి దమయంతికి వివరిస్తుంది. హంస రాయభారంతో నలదమయంతులిద్దరు పరితాపం పొందడం వంటివి కవి ప్రత్యేకంగా కల్పించి వర్ణన చేశారు.

వియోగ తాపం ఉపశమించే విధంగా పరిపరివిధాలా దమయంతికి చెలికత్తెలు సేవ చేస్తున్నారు. చంద్రోపాలంభన, మదనోపాలంభన, మలయ పవనోపాలంభన, మదనాది ప్రార్థన వంటివి అన్ని చేశారు. చెలికత్తెల ద్వారా దమయంతి పరిస్థితిని గ్రహించిన భీమరాజు స్వయంవరం ప్రకటించారు. నారదుడి ప్రమేయంతో దమయంతి సౌందర్యాన్ని తెలుసుకున్న ఇంద్రుడు, అగ్ని, యముడు, వరణుడు స్వయంవరంలో తమలో ఒకరినైనా వరించాలనే ఆలోచనతో భూలోకానికి బయలుదేరారు. నలుడి దగ్గరికి వచ్చి తమకు దౌత్యం చేయవలసిందిగా అభ్యర్థించారు. ఇంద్రాదులు ప్రస్తుతించిన నలుడి త్యాగగుణాన్ని కవి ఒక చక్కని పద్యం “ఇతడనలుడితడు శమనుండు..” (చతుర్థాశ్వాసం ప.109) ద్వారా వివరించారు. "పరోపకారార్థమిదం శరీరం" అనే స్మృతి వాక్యానికి అనుగుణంగా హరిశ్చంద్రుడు స్వార్థం వీడి పరార్థం నెరవేర్చడం గొప్పవరంగా భావించాడు. ఇంద్రాదులు ఇచ్చిన శాంబరీ విద్య స్వీకరించి దమయంతి అంత:పురంలోకి వెళ్తారు. ఇంద్రాది దేవతల వైభవాన్ని దమయంతికి వివరిస్తాడు. కాని దమయంతి ఇంద్రాదులను నిరాకరిస్తుంది.

ఇక కుండిన పురాన్ని అలంకరించి భీమ మహారాజు స్వయం వరం నిర్వహించడానికి సంసిద్ధుడవుతాడు. పద్దెనిమిది ద్వీపాల నుంచి విచ్చేసిన మహాత్ముల సామర్థ్యం, తారతమ్యం నిర్వచించడానికి శారదా మాతను ఆహ్వానిస్తాడు భీమరాజు. దమయంతికి శారదా మాత వివిధ దేశాలకు చెందిన రాజుల అర్హతలను క్రోడీకరించి వివరిస్తుంది. శాక, క్రౌంచ, కుశ, ప్లక్ష, శాల్మలీ ద్వీపాధిపతులు;  సింధు, అంగ, మత్స్య, లాట, మగధ, శక, గౌడ దేశాధిపతుల గుణగణాలతో వారిని కీర్తించింది. కాని వారినెవ్వరిని దమయంతి వరించలేదు. నల రూపంలో ఉన్న ఇంద్రాది దేవతల చేరువకైనా వెళ్లలేదు. చివరగా శారదాదేవి దమయంతికి నలమహారాజును  పరిచయం చేస్తూ...

తే. గీ. వీరసేనోద్భవ ఖ్యాతి విశ్రుతుండు / గురుకళానిధి ధర్మాధికుం డితండు

హరి హృదయవేది వికచపద్మాయతాక్షి ! / వీని కంఠంబునను నిల్పు విరుల దండ. (పంచమాశ్వాసం ప.32)

వీరసేనుడి సుతుడిగా కళానిధిగా, ధర్మవేత్తగా, హరి హృదయవేదిగా వర్ణించింది. దమయంతి తన చేతిలోని పూలదండను అతని మెడలో వేసి వరించింది. తదనంతరం నలదమయంతుల వివాహం అత్యంత సుందరంగా జరిగింది.

10.3 పురుకుత్స చక్రవర్తి కథ - శౌర్య సంపద:

రాజా మల్లారెడ్డి షష్ఠాశ్వాసం పూర్వభాగంలో పురుకుత్సుని కథ వర్ణించారు.

సీ. తన దానమునను బ్రత్యర్థుల యర్థుల/ ప్రియ జీవనము లుద్ధరించినాఁడు

తన యిష్టమునను గోత్రజుల గోత్రజులను / ఘనతరాజ్య సమృద్ధిఁ దనిపినాఁడు

తన పురంబునను బద్మను బద్మనాభుని / నీడితస్థితి నిర్వహించినాఁడు

తన ధర్మమున రసాతలమునఁ దద్రసా / తలమునను సమాఖ్య నిలిపినాఁడు

తే.గీ. తన భుజాపీఠి నహి కూర్మ దంతి దంష్ట్రి / ధరములకు నూఱటగ ధాత్రిఁ దాల్చినాఁడు

సత్యవాచాగరిష్ఠుండు చక్రవర్తి / మాత్రుఁడే యెంచఁ బురుకుత్స మహివిభుండు !! (షష్ఠాశ్వాసం పూర్వభాగం ప.3)

పురుకుత్సుడు తన దానధర్మాల వల్ల యాచకుల జీవనం రక్షించాడని, క్షత్రీయకులంలో పుట్టి జాతి ఔన్నత్యాన్ని పెంపొందింపజేశాడని, పితృ యజ్ఞంతో పితృ పితామహుల ఆత్మలను సంతృప్తి పరిచాడని, రాజ్యంలో లక్ష్మీదేవిని, మనస్సులో మహావిష్ణువుని స్థిరంగా నిలుపుకున్నాడని, విశిష్టమైన రాజధర్మంతో భూలోకంలో చిరకీర్తిని ఆర్జించాడని, ఆదిశేషుడు, ఆది కూర్ముడు, అష్టదిగ్గజాలు, సప్త కుల పర్వతాలు వంటి సమస్త భుభాగాన్ని తన భుజస్కంధాల మీద ధరించాడని, సత్య వాఙ్మయంలో అగ్రగణ్యుడని వర్ణించారు కవి. భూపాలురందరిలో పరిగణించి చూస్తే పురుకుత్సుడు సాధారణ చక్రవర్తి కాదని అంతకంటే వేయి రెట్లు గొప్పవాడిగా అభివర్ణించారు. రాజు దగ్గర గల ఖడ్గం (కౌక్షేయకం) దుష్ట శిక్షణ అనే దీక్షను వహించింది.  ఆ ఖడ్గం "కరాళ కాళికాదేవి క్రుద్ధ వీక్షణం" అనే ఖ్యాతి గడించినట్లు కవి పేర్కొన్నారు.

జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు మహారాజు పర్వతాల వంటి గణసైన్యంతో, దూసుకుపోయే బాణాల వంటి అశ్వ సైన్యంతో, పుష్పకాల వంటి రథ సైన్యంతో, సింహాల వంటి పదాతి భటులతో, సముద్ర ఘోషను మించిన భేరి భాంకార సింహ గర్జనలతో దండెత్తి వెళ్లేవాడు. ఈ విజయయాత్రలలో సింధు, మత్స్య, కాంభోజ, అంగ దేశాలను గెలిచి ఆయా దేశాధిపతుల వల్ల మేలుజాతి గుర్రాలను, ముత్యాల వరుసలను, బంగారు రాశులను, శరములను కానుకలుగా గ్రహించాడు. సమస్త దేశాల నుంచి అనేక వస్తువులను బహుమానాలుగా స్వీకరించి చక్రవర్తిగా ప్రశస్తి గాంచాడు.

మహారాజు గణ కీర్తిని కవి రాజా మల్లారెడ్డి అద్భుతంగా వర్ణించారు.

కాగా కవి పాతాళ వర్ణన చేశారు. భూనభోంతరాళం, స్వర్గలోకం, క్షీరసముద్రం లాగా ప్రసిద్ధికెక్కిందని, బలిచక్రవర్తికి నిలయమై విరాజిల్లిందని పాతాళ లోక వర్ణన గావించారు. కవి భావనలో నాక లోకం (స్వర్గం) ను వాసవుడు (దేవేంద్రుడు) ఏ విధంగా పాలిస్తున్నాడో పాతాళ లోకాన్ని వాసుకి పాలిస్తున్నాడని ఉపమానం చేశారు. "మహాభోగశ్రీ హేలాలోలానుభూతి" అనే పదబంధంలో సమాన ధర్మాన్ని రూపింపజేశారు కవి. పాతాళ లోకాన్ని గంధర్వులు నిరంతరం హింసిస్తుండడం వల్ల సర్పరాజులు తాళలేక పోయారు. శ్రీహరికి తమ గోడును విన్నవించుకోగా భూలోకంలో పురుకుత్సుడనే రాజును ఆవహించి శత్రువులను అణచివేస్తానని అంటాడు. నాగరాజులు శ్రీహరి అభయంతో నిర్భయంగా తమ తమ నెలవులకు వెళ్లిపోయారు. తర్వాత

సీ. పుట్టమట్టుగఁ దుట్టవెట్టి నిట్టలఁ జుట్టి / కొట్టు పిట్టను బట్టి మట్టువేల్పు

తమ్మి యిమ్ముగ నమ్ము కొమ్మ ఱొమ్మొగిఁ గ్రుమ్మ / నెమ్మి సొమ్ముగ నెమ్మె నొమ్ము వేల్పు

పెక్కు చుక్కలు జక్కు లుక్కు మిక్కిలి మ్రొక్కు / నిక్కు చక్కఁగ దక్కఁ జొక్కు వేల్పు

తల్లి పెల్లుగ నుల్లముల్ల సిల్లఁగ గొల్ల / పల్లె యిల్లుగఁ జెల్లు నల్లవేల్పు

తే.గీ. శౌరి లోకనివాసుండు కోరి మీఱి / భక్తి శక్తి సమంచితా సక్తి యుక్తిఁ

దాళి యాలిని గూడి నయాళి వ్రాలి / హాళిఁ బురుకుత్స విభునియం దావహించె. (షష్ఠాశ్వాసం పూర్వభాగం ప.42)

శ్రీమన్నారాయణుడు శ్రీదేవీ సహితుడైన పురుకుత్స మహారాజును ఆవహించిన ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టుగా కవి ఈ సందర్భంలో వర్ణించారు. పురుకుత్సుడు శ్రీహరిగా, శ్రీహరి పురుకుత్సునిగా అభిన్నంగా విలసిల్లారు. పుట్టుకతోనే శ్రీమహావిష్ణువు రూపంతో ఉన్న పురుకుత్సుడికి ఈ ప్రమేయంతో నారాయణుడి గుణగణాలు సంక్రమించాయి. గోరక్షణలో, భూరక్షణలో, బుధరక్షణలో, పండిత పోషణలో, సత్య భాషణానురక్తిలో, బలభద్ర రామయుక్తిలో పోలిక కుదిరి ఉత్తమ పురుషుడిగా పురుకుత్సుడు వెలుగొందాడు.

కొన్ని రోజుల తర్వాత సర్పరాజులు తమ సోదరి నర్మదను దూతగా నిర్ణయించి పురుకుత్సుడిని పాతాళలోకానికి తీసుకొని రమ్మని పంపిస్తారు. జగదేక వీరుడిగా, పురుషోత్తముడిగా కొనియాడి దుష్టశిక్షణ శిష్టరక్షణ కర్తవ్యాలను గుర్తుచేసి నర్మద నాగలోకాన్ని గంధర్వుల నుంచి రక్షించవలసిందిగా చక్రవర్తిని ప్రార్థిస్తుంది. ఆమె అభ్యర్థనను అంగీకరించి మంత్రాలోచన కోసం ప్రధానులను సంప్రదిస్తాడు. శత్రువులను సంహరించి పీడితులను కాపాడినవాడికే  క్షత్రీయుడనే నామం సార్థకమవుతుందని హితవు వారు పలుకుతారు. శత్రువుకు బంధువైన వాడిని ఆదరించడం మంచిది కాదని, శరణు వేడితే మాత్రం ఎంతటి శత్రువునైనా కాపాడడం రాజధర్మం అని అంటారు. అంతేగాక సాటి విరోధితో సామం, బలాధికుడితో భేదం, అధిక బలాధికుడితో దానం, బలహీనుడితో దండం వంటి చతురోపాయాలను రాజు వ్యవహరించాలని ప్రబోధిస్తారు. ఇతరులకు సహాయపడడం - ఇతరుల నుంచి సహాయం పొందడం, సామదానాది చతురోపాయాలు గ్రహించడం, దేశకాల విభాగాలను ఎరగడం, కార్యసిద్ధి విషయంలో తిరుగులేని వాడై ఉండడం, విపత్తులకు విరుగుడు వెయ్య గలగడం వంటి అంగపంచకం పరిపాలకుడికి తెలిసి ఉండాలి. ప్రభు ఉత్సాహ మంత్ర శక్తి త్రయంతో వ్యవహరించాలి. పురుషార్థాలను, పంచ మహా యజ్ఞాలను, షడ్గుణాలను, షట్శాస్త్రాలు తెలుసుకొని మసులుకోవాలి. అప్పుడే ఆ రాజుకు అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు, అష్టలక్ష్ములు ప్రాప్తిస్తాయని అంటారు. సప్త రాజ్యాంగాలతో ప్రకాశించే దానశీలుడైన చక్రవర్తి లోకోత్తర ఖ్యాతిని పొందుతాడని, భూగోళం మొత్తం భారాన్ని వహిస్తాడని పురుకుత్సుడిని అమాత్యులు ప్రోత్సహించారు.

మంత్రివర్యుల ప్రబోధంతో రాజు పాతాళ లోకం వెళ్లి గంధర్వుల మీద యుద్ధం ప్రకటిస్తాడు. పురుకుత్సుడు - గంధర్వుల మధ్య భీకరమైన యుద్ధ సన్నివేశాన్ని కవి రాజా మల్లారెడ్డి అద్భుతంగా వర్ణించారు. శుక్రగ్రహం స్వాతి నక్షత్రం (తులారాశి) జతకూడి కుంభవృధ్టి కురిసినట్లుగా పురుకుత్సుడు మహోత్పాతం లాగా గంధర్వుల మీద శరవృష్టి కురిపిస్తారు. బాణాబాణి, ఖడ్గాఖడ్గ, దండాదండి, బాహాబాహీ పోరాటంలో విజృంభించి పురుకుత్సుడు గందర్వులందరిని సంహరిస్తారు. నాగరాజులందరు సంతోషం ప్రకటిస్తూ...

తే.గీ. చక్రివై తగు లోకరక్షకుఁడ వీవు / శౌరివై మను ఘనదానవారి వరయ

అచ్యుత సమాఖ్య కల్గు గోత్రాధి పతివి / నిన్ను వర్ణింప నేర్తుమే నెమ్మి నధిప! (షష్ఠాశ్వాసం పూర్వభాగం ప.92)

అని పురుకుత్సుడిని కీర్తించి నర్మదను ఇచ్చి వివాహం జరిపిస్తారు. అయోధ్యకు తిరిగి వచ్చిన నర్మదా పురుకుత్సులకు కొంత కాలానికి కుమారుడు బృహదశ్వుడు జన్మిస్తాడు. తదనంతరం అశ్వమేధ యాగాలు చేసి ధర్మబద్ధ పాలన సాగించాడు.

10.4 పురూరవ చక్రవర్తి కథ - ప్రేమ తత్త్వం:

షష్ఠాశ్వాసం ఉత్తరభాగంలో పురూరవ చక్రవర్తి కథను మల్లారెడ్డి వర్ణించారు. ఈ కథారంభంలో కుమార వనంలో శివపార్వతుల ఏకాంత కేళీ సమయంలో కొందరు ఋషులు ప్రవేశించారు. అందుకు కోపించిన శివుడు వనంలోకి ఎవరైన పురుషులు ప్రవేశిస్తే స్త్రీలుగా మారిపోతారని శపిస్తాడు. కొంతకాలానికి సుద్యుమ్నుడనే సూర్యవంశపు రాజు మిత్రపరివార సహితంగా వన విహారానికి బయలుదేరి కుమారవనంలోకి అడుగు పెట్టగానే పద్మముఖిగా, ప్రియమిత్రులు పద్మసఖీ జనంగా, మగగుర్రాలు ఆడగుర్రాలుగా మారిపోతారు. ఆ సమయంలోనే ఆకాశవాణి భూమికి సాటిదిగా ఆమె పేరును "ఇల" గా ప్రకటించింది. శివుడి మహత్తుకు ప్రతిరూపంగా వెలసిన కుమారవనాన్ని ఘనంగా కీర్తించింది "ఇల". ఆమె సౌందర్యానికి ఎందరో భూపాలురు ముగ్ధులైనారు. కాని ఇల వాగ్దేవతగా ఒప్పారి మెల్లగా బుధాశ్రమానికి చేరింది. ఇలాదేవిని తిలకించిన బుధుడు ఆమెపై మోహాన్ని ఏర్పరచుకున్నాడు. బుధుడి సమాగమం తర్వాత ఇలాదేవి గర్భవతి అవుతుంది. నెల నెల ప్రవర్ధమానం అవుతున్న ఇల సౌందర్యాన్ని, చేష్టలను కవి ప్రత్యేకంగా పేర్కొన్నారు. పుట్ట బోయే బిడ్డ సార్వభౌముడవుతాడని కలలు గని భూభారాన్ని వహించాలనే ఉద్దేశంతో ఇల మట్టిపెడ్డలు తింటున్న సన్నివేశాన్ని కవి చమత్కరించారు. తదనంతరం పురూరవుడు జన్మనించినందుకు తండ్రి బుధుడు, తాత చంద్రుడు సంతోషించి సంబరాలు జరుపుతారు.

కం. అత్తఱిని నార్యు లెంతయుఁ / జిత్తంబున శంఖ చక్ర చిహ్నము లతనిన్

హత్తి విలసిల్లఁ జూచి మ / హత్తరుఁ డగు చక్రవర్తి యగునని పలుకన్. (షష్ఠాశ్వాసం ఉత్తరభాగం ప.32)

శిశువు శరీరం మీద శంఖ చక్ర చిహ్నాలను గుర్తించిన సాముద్రికా శాస్త్ర పండితులు ఈ బిడ్డడు గొప్ప చక్రవర్తి (చక్రాసి ఖడ్గాభా: రేఖా: కుర్వంతి భూపతిం) అవుతాడని ప్రకటించారు. శుక్ల పక్షారంభం నుంచి పున్నమి వరకు చంద్రుడు రాకపోకలు జరిపి మనవడికి ఒక్కొక్క కళ ప్రసాదించి సకల కళా సంపన్నుడిగా తీర్చిదిద్దాడు. తండ్రి, తాతల పోలికలతో పాటుగా ముత్తాత క్షీర సముద్రుడి తేజస్సు కలిగి అత్యంత ప్రతిభా సామర్థ్యాలతో రాజ్యం పాలించారు.

తే.గీ. ఎలమి ముత్తాత గతిని వాహినుల మెఱసి / తాత కైవడి సన్మార్గ నీతి నడచి

తండ్రి చొప్పున గూఢవర్తనము నేర్చి / మీరె శౌర్యంబు మెఱయఁ బురూరవుండు. (షష్ఠాశ్వాసం ఉత్తరభాగం ప.39)

దాన గాంభీర్య మహిమలతో ఒప్పారుతున్న పురూరవుడు ఇంకా విజయయాత్రలకు పూనుకోకముందే నవద్వయ ద్వీపాల పాలకులు విచ్చేసి కానుకలు సమర్పించేవారు. జాతకచక్రంలో కేతువు మినహా ఎనిమిది గ్రహాలు శుభస్థానంలో నిలిచి శుభఫలాలు అందించాయి. భూభారాన్ని మోస్తున్న పర్వత, దిగ్గజ, ఆదికూర్మ, ఆదివరాహలకు ఊరట కలిగించి మొత్తం భూభారాన్ని పురూరవుడు వహించాడు.

అంతలోనే మిత్రావరణుల శాపానికి గురి అయిన ఊర్వశీ దేవలోకం నుంచి భూలోకానికి వచ్చింది. తన చెలికత్తెలతో విహరిస్తున్న ఊర్వశీ అందచందాలను చారుడి ద్వారా పురూరవుడు తెలుసుకుంటాడు. ఈ సందర్భంలో కవి మల్లారెడ్డి ఊర్వశీ సౌందర్యాన్ని ఆపాత మధురంగా అభివర్ణించారు. మహారాజు ఊర్వశీని దర్శించడానికి వెళ్లినప్పుడు ఆ ఉద్యాన వనం ఒక స్త్రీ రూపంగా భాసించింది. ఇక ఊర్వశిని చూసి మోహానికి గురియైన పురూరవుడి చిత్తవృత్తులను కవి ప్రత్యేకంగా పేర్కొన్నారు. పరస్పర సంవాదం అనంతరం ఊర్వశీ తన జన్మవృత్తాంతాన్ని పురూరవుడితో విన్నవిస్తుంది. పురూరవుడి ప్రేమను శంకించి ఇదివరకు పురుషులు చేసిన నమ్మక ద్రోహాన్ని ఎండగడుతుంది. అందుకు రాజు ప్రతిజ్ఞ చేసి తన తాత చంద్రుడు సత్యసంధుడై భాసిల్లగా, తన తండ్రి బుధుడై విలసిల్లగా, తాను చక్రవర్తిగా ఉండి అబద్ధం పలకడం రాదని అంటాడు. పురూరవుడితో ఉండాలంటే ఐదు నియమాలను పాటించాలని ఊర్వశీ అంటుంది. అవి: ఎంగిలి తినమనకూడదు. దివా మైథునానికి పిలవకూడదు. గౌరవంగా రాత్రిపూటనే చేరవలెను. దిగంబరంగా కంటబడకూడదు. బిడ్డల లాంటి తన గొర్రెలకు ఆపద కలుగకూడదు. ఈ ఐదు నియమాలను పురూరవుడి అంగీకారం తెలపడంతో ఇంద్రుడి నందనవనంలో, కుబేరుడి చైత్రరథ ఉద్యానవనంలో, మందర పర్వతం మీద, మలయగిరి మీద, మానస సరోవర ప్రాంతంలో, మందాకినీ నదీ తీరంలో ఇరువురు అనేక సంవత్సరాలు క్రీడించారు.

ఇది ఇలా ఉండగా దేవలోకంలో ఇంద్రుడు అప్సరసల నృత్య రీతులలో ఊర్వశీ స్థానాన్ని నిర్ధారించి, ఊర్వశిని తోలుకొని రావలసిందిగా విశ్వావసుడనే గంధర్వుడిని ఆజ్ఞాపిస్తాడు. భూలోకంలో ఉన్న ఊర్వశిని పురూరవుడి నుంచి విడదీయడం కోసం ఆమె ప్రాణప్రదంగా పెంచుకుంటున్న గొర్రపిల్లల్ని అర్థరాత్రి అపహరించుకొని వెళ్లిపోతాడు విశ్వావసుడు. అందుకు ఊర్వశీ కలత చెందగా మహారాజు లేచి వాటి జాడ కోసం బయలుదేరాడు. గంధర్వుడు తన కుతంత్రంతో మెరుపు సృష్టించి పురూరవుడి నగ్న స్వరూపం ఊర్వశీ కంటబడేటట్టు చేస్తాడు. నియమానికి ఉల్లంఘన జరిగినందుకు ఆ మరుక్షణమే ఊర్వశీ అంతర్ధానమవుతుంది. ఆ తర్వాత ఊర్వశీ కనబడక పురూరవుడు మోయలేని విరహభారాన్ని మోస్తాడు. ఒకనాడు కురుక్షేత్రంలో గల కాంభోజ సరోవరంలో విహరిస్తూ ఊర్వశీ రాజు కంటబడుతుంది. తాను గర్భవతినని ఏడాది గడిచిన తర్వాత కలుస్తానని తెలుపుతుంది. ఏడాది కాలాన్ని మహాకల్పంగా గడిపి ఊర్వశీ వద్దకు వస్తాడు రాజు. తనకు పుట్టిన కుమారుడిని పురూరవుడి చేతిలో పెట్టగా "ఆయువు" అనే నామకరణం చేసి సంబరపడుతాడు. ఆ రేయి ఊర్వశీతో సమాగమం చెంది ఇది శాశ్వతంగా ఉండాలని అభ్యర్తిస్తాడు. అందుకు గంధర్వ నాయకులను మెప్పించాలని షరతు పెడుతుంది. గంధర్వనేతలను కలిసి తన కోరికను తెలుపుతాడు. అగ్నిస్థాలి (నిప్పుకుండ) నియమంతో మహాయజ్ఞం నిర్వహించి ప్రసన్నం చేస్తాడు. దీనితో ఊర్వశి సాలోక్యం కలిగి దీర్ఘాయువు, శతాయువు, శ్రుతాయువు, మానవసువు, విశ్వావసువు అనే పేర్లతో ఐదుగురు బలపరాక్రమ సంపన్నులైన పుత్రులను కని సుభిక్షంగా రాజ్యం పాలిస్తాడు.

10.5 సగర చక్రవర్తి కథ - కార్య దీక్షాఫలం:

సగర చక్రవర్తి కథ సప్తమాశ్వాసంలో ప్రారంభం అయ్యింది. ధర్మం కోసం ధర్మ మార్గంలో శత్రువులను ఓడించి ఉత్తమ ధర్మపరాయణుడైన సగర భూపాలుడు ప్రసిద్ధి గడించాడు.

సీ. తన దాన ధారాళ ధారకు సత్కీర్తి / జాలంబు లతులసస్యములు గాఁగఁ

దన సముజ్జ్వలిత ప్రతాపాన లార్చికిఁ / బరభూపతులు శలభములు గాఁగఁ

దన జగత్పరిపూర్ణ ఘన గుణవల్లికి / నక్షత్రములు ప్రసూనములు గాఁగఁ

దన రూప చంద్రికకునుఁ గామినీలోచ / నములు చకోర సంఘములు గాఁగ

తే.గీ. వినుతిఁ గాంచె నవద్వయ ద్వీప భూప / కనక కోటీర మాణిక్య కలిత దీప్తి

నికర బాలాతప సదా వినిద్రితాంఘ్రి / పద్మయుగపాళి తన్మహీపాల మౌళి (సప్తమాశ్వాసం ప.3)

ఈ పద్యంలో కవి మల్లారెడ్డి సగరుడి దానగుణ కీర్తిని అభివర్ణించారు. రాజు తమ ప్రతాపంతో శత్రువులను అణచివేశాడు. ఆయన గుణ కీర్తులు తారకలను మెరిపించినట్లు కవి పేర్కొన్నారు. పద్దెనిమిది ద్వీపాల ప్రభువులు సామంతులుగా చేరువైనారు. ఆయన కీర్తి పద్నాలుగు లోకాలకు వ్యాపించింది. శత్రురాజులను తుడిచివేసే శౌర్యం గలవాడు. ఎల్లవేళలా పండితులకు సన్మానాలు, సత్కారాలు నిర్వర్తించేవారు. యుద్ధ తంత్ర రాజనీతికి ఘనుడు. వాల్మీకి రామాయణంలోని సగరుని జన్మ వృత్తాంతాన్ని చెబుతూ ఇక్ష్వాకు వంశంలో బాహుకుడనే మహారాజు కుమారుడని కవి అన్నారు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దాయాదులు విషప్రయోగం చేశారు. అయినా గర్భం నిలిచి శిశువు విషం ముద్దతో సహా జన్మించాడు. అందుకే సగరుడి (గరము - గరళము)గా ప్రసిద్ధి పొందాడని, తర్వాత చక్రవర్తి అయ్యాడని మల్లారెడ్డి పేర్కొన్నారు.

సగర చక్రవర్తి విదర్భ రాజ కూతురు సుకేశినిని, అరిష్టనేమి రాజ కూతురు సుమతిని వివాహం చేసుకున్నాడు. కాని సంతానలేమి వల్ల సతుల సమేతంగా భృగు మహర్షిని ధ్యానిస్తూ మహా తపస్సు గావించాడు. భృగువు ప్రత్యక్షం కాగా బహు సంతానం కావాలని సగరుడు, ఉత్తముడైన కొడుకు కావాలని సుకేశిని, మహా బల శాలులైన అరవై వేల కుమారులు కావాలని సుమతి కోరుకున్నారు. కొంత కాలానికి సుకేశినికి అసమంజసుడు జన్మించగా, సుమతి అరవై వేల మంది పుత్రులను ప్రసవించింది. పెరిగినా కొద్ది అసమంజసుడు ఆకతాయిగా వ్యవహరించేవాడు. అతడి క్రూరమైన చేష్టలను భరించలేక సగర చక్రవర్తి రాజ్య బహిష్కారం విధించారు. అసమంజసుడికి అప్పటికే ఒక పుత్రుడు ఉన్నాడు. అతడి పేరు అంశుమంతుడు. సూర్యుడని అర్థం. పద్మహితుడిగా, లోక బాంధవుడిగా, అభ్యుదయ శాలిగా, సన్మార్గ సంచారిగా పేరొందాడు. సగరుని అరవై వేల పుత్రులు పూల పొదరిళ్లు గల గుహలలో విలసిల్లారు. కొంతకాలానికి సగరుడు అశ్వమేధ యాగం చేసి యాగాశ్వాన్ని దేశాల మీదికి విడిచిపెట్టాడు. అది సంచరించిన రాజ్యాలలో సామంతులు కప్పం కట్టాలని, కాదనే వారు ఉంటే యాగాశ్వాన్ని బంధించవచ్చని రాయించి దాని నుదుట పట్టి కట్టాడు. అసంఖ్యాక సైన్యంతో పాటుగా అంశుమతుడు ఆ యాగాశ్వం వెంట నడిచి సామంతులు చెల్లిస్తున్న ధనాన్ని తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

అశ్వమేధ యాగానికి అంతరాయం కలిగించాలనే బుద్ధితో దేవేంద్రుడు యాగాశ్వాన్ని అపహరించి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర దాచిపెడుతాడు. అంశుమతుడు అశ్వం జాడ తెలియక తిరిగి వచ్చి తాత సగరుడికి విన్నవిస్తాడు. కొంత సేపు విచారించి తన అరవై వేల పుత్రులను పిలిచి యాగాశ్వం ఎక్కడుందో వెదికి తోలుకొని రమ్మంటాడు. వారు మహా ఉత్సాహంతో సింహ కిశోరాల లాగా సమస్త లోకాలతో పాటు ఆసాంతం భూగోళాన్ని గాలించారు.  ఒక్కొక్కరు ఒక్కో ఆమడ చొప్పున పాతాళలోకాన్ని తొవ్విపోశారు. వారి విజృంభనకు నిరాశ్రయులైన దేవతులు బ్రహ్మను ప్రార్థించారు. అందుకు బ్రహ్మ ఆవేదన పడవద్దని తెలిపి, శ్రీమన్నారాయణుడు కపిల మహర్షి రూపంలో భూలోకంలో అవతరించి సగర పుత్రులను దహించివేస్తాడని చెబుతాడు. ఎంత వెతికినా యాగాశ్వం సగర పుత్రులకు కనబడక తిరిగి తండ్రి దగ్గరకు వచ్చేస్తారు. యాగాశ్వంతో రాక తిరిగి వచ్చిన కుమారులను చూసి సగరుడు వ్యధ చెందుతాడు. అధిక సంఖ్యలో పుత్రులు ఉన్నా తన విధికి కలత చెందుతాడు. ఎలాగైనా అశ్వమేధానికి విఘాతం కలుగ కూడదని సగరుడు తలంచగా పౌరుషంతో అరవై వేల మంది పుత్రులు మళ్లీ యాగాశ్వం వెదకుతూ పోతారు. భులోకంలో కపిల మహర్షి చెంత ఉన్న యాగాశ్వాన్ని తిలకించిన సగర పుత్రులు ఆగ్రహించి విడిపించడానికి ప్రయత్నిస్తారు. కాని కపిలుడి కోపానికి ఆహుతి అయ్యి బూడిద కుప్పలాగా పడిపోతారు.

తన పుత్రులు వెళ్లి చాలా కాలం అయిందని వెంటనే వారి సమాచారాన్ని కనుకొనిరావడానికి సగరుడు తన మనుమడైన అంశుమతుడిని ఉపక్రమిస్తాడు. సామంతులతో బయలుదేరిన అంశుమంతుడు అంతటా వెదికి చివరకు దిగ్గజములను పినతండ్రుల జాడ కోసం అభ్యర్థించాడు. ఈశాన్య మార్గంలో పాతాళం వరకు వ్యాపించి ఉన్న ఒక మహారంధ్రం (బిలం) ఉంటుందని, అక్కడ కావలసినంత వివరం ఉంటుందని చెబుతాయి. పాతాళానికి వెళ్లిన అంశుమంతుడు తన పినతండ్రుల జాడ తెలియక గరుత్మంతుడిని ప్రార్థిస్తాడు. అంశుమంతుడి ప్రార్థనను మన్నించి కపిల ముని కోపాగ్నికి అరవై వేల మంది పినతండ్రులు బూడిద అయిన ఘటనను తెలియజేయడమే గాక, యాగాశ్వాన్ని పంపించి వేస్తాడు గరుత్మంతుడు. అశ్వమేధయాగం సుసంపన్నం అవుతుందని ప్రోత్సహిస్తాడు. కాని పినతండ్రుల భస్మరాశుల మీద శివుని శిరస్సు నుంచి దుమికి వచ్చే దేవగంగ ప్రవహించినప్పుడే వారికి ముక్తి లభిస్తుందని చెబుతాడు. యాగాశ్వంతో అయోధ్యకు వచ్చి తన తాత సగరుడికి పినతండ్రుల దుస్థితిని వివరిస్తాడు. దు:ఖాన్ని దిగమింగుకొని, ధైర్యాన్ని కూడగట్టుకొని అంశుమంతుడి అండగా సగరుడు యజ్ఞం పూర్తి చేసి సార్వభౌముడిగా వెలుగొందుతాడు. కొంతకాలానికి ఇక్ష్వాకు రాజ్యాన్ని అంశుమంతుడికి కట్టబెట్టి సగరుడు తన భార్యలతో కలసి అడవులకు వెళ్లిపోయాడు.

అంశుమంతుడు కొంతకాలం రాజ్యం పాలించి తర్వాత సర్వ సమవర్తియైన తన కుమారుడు దిలీపుడికి అప్పగిస్తాడు. బ్రహ్మ కోసం తపస్సు చేసి గంగను భూమి మీదకు తేవడానికి అరణ్యాలకు వెళ్లిపోతాడు. సాధ్యం గాక అక్కడే అమరత్వం పొందుతాడు. దిలీపుడు కూడ కొంతకాలానికి తన మహా బలశాలి అయిన భగీరథుడిని సింహాసనంపై అధిష్ఠింపజేసి అరణ్యాలకు వెళ్లిపోతాడు. గంగను భూలోకానికి రప్పించడం కోసం బ్రహ్మ కోసం ప్రార్థిస్తాడు. కఠోర తపస్సు చేసినా సాక్షాత్కారం పొందలేక స్వర్గస్థుడవుతాడు.

ఇక భగీరథుడు సూర్యసమానుడై తన ప్రతాప కిరణాలను దశదిశలా వ్యాపింపచేశాడు. కొంతకాలానికి తన రాజ్యభారాన్ని ప్రధాన మంత్రులకు అప్పగించి తన పితృదేవతలకు సద్గతి కలిగించడం కోసం తపోభూమికి బయలుదేరాడు. భగీరథుడు గోకర్ణ క్షేత్రం చేరుకొని ఘోరతపస్సు చేశాడు. బ్రహ్మ దేవుడు ప్రసన్నుడై వరం కోరుకోవలసిందిగా ఆజ్ఞాపించాడు. అందుకు భగీరథుడు సగరపుత్రులు విముక్తులు అయ్యే విధంగా దేవగంగను ప్రవహింపజేయమని బ్రహ్మను అభ్యర్థించాడు. కాని దేవగంగను భరించేవాడు శివుడొక్కడే అని ఆయన కోసం ప్రార్థించవలసిందిగా పేర్కొన్నాడు. తదనంతరం శివుడి కోసం కఠోర తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై దేవగంగను శిరసావహించడానికి అంగీకరించాడు.

భగీరథుడి ప్రయత్నం వల్ల దేవలోకం నుంచి ఉదృతంగా ప్రవహిస్తున్న గంగను తన జటాజూటంలో బంధించి ఒక పెద్ద జలబిందువును మాత్రమే వదిలాడు. భగీరథుడి వెంట పరవళ్లు తొక్కుతూ వస్తున్న గంగ మార్గమధ్యంలో జహ్నమహర్షి యూప జంతుజాలాన్ని ముంచివేసింది. అందుకు కోపోద్రిక్తుడైన మహర్షి గంగను ఆపోశన పట్టివేశాడు. భగీరథుడికి దు:ఖం పొంగుకొచ్చింది. దేవతల అభ్యర్థన మేరకు మహర్షి గంగను తన చెవిరంధ్రం గుండా విడిచిపెట్టాడు. అప్పటి నుంచి గంగ జాహ్నవిగా భూలోకంలో వర్ధిల్లింది.

సీ. ఒకచోటను గృపీట నికరాటనప్రౌఢి / వెలయ నిచ్ఛా వృత్తి విస్తరించి

యొకదారిఁ గడు మీఱి యురువారి నద్రులు / ఘర్షించి గంభీరగతి వహించి

యొకక్రేవఁ దగుత్రోవ నొగిఁబోవఁ దనదులో / పలఁగొన్ని యంతరీపంబు లుంచి

యొకవంక నకలంక యోగాంక మునిజనా / శ్రమ రక్షకై వక్ర సరణి నరిగి

తే.గీ. శరనిధుల నించి సరస విభ్రాంతి మించి / సగరుసుతు భస్మరాశు లెచ్చరిక ముంచి

భూరి కాండ ప్రకాండ విస్ఫూర్తి మెఱసి / ధావనంబున నా రసాతలము సొచ్చె. (సప్తమాశ్వాసం ప.132)

ఈ విధంగా మహా ప్రవాహమైన గంగ సగరపుత్రుల చితాభస్మాలను తర్పణ చేయడానికి పాతాళలోకం చేరింది. పితామహులను దేవలోకానికి చేర్చి భగీరథుడు ఆ చంద్రతారార్కం కీర్తి గడించాడు.

10.6 కార్తవీర్య మహారాజు కథ - రాజనీతిజ్ఞత:

అష్టమాశ్వాసంలో కార్తవీర్యుడి కథను ప్రస్తావించారు మల్లారెడ్డి. మాహిష్మతి పురాన్ని కృతవీరుడు పరిపాలిస్తున్నాడు. కవి ఇతనిని ఇంద్రుడితో సరిపోల్చారు. కొంతకాలానికి కృతవీరుడు ఆయుషు నిండిపోయింది. రాజ్య ప్రముఖులందరు ముక్త కంఠంతో అతని పుత్రుడైన కార్తవీర్యార్జునుడిని పట్టాభిషేకం స్వీకరించమని కోరారు. కాని రాజత్వాన్ని గ్రహించడానికి ఇష్టపడక అరణ్యాలకు వెళ్లి తపస్సు చేసుకుంటానని అంటాడు. కార్తవీర్యుడి సంకల్పాన్ని దర్శించిన గర్గ మహర్షి దత్తాత్రేయుడి మహిమను ప్రస్తావిస్తాడు. ఈ సందర్భంలో ఇంద్రుడు, సిద్ధులు, ఇక్ష్వాకుడు, రంతిదేవుడు గురించి చెప్పి దత్తాత్రేయుడిని ఉపాసించడం వల్ల వారు కష్టాల నుండి తప్పించుకున్నారని వివరించాడు. గర్గుడి ఉపదేశం ప్రకారం తపోవనానికి వెళ్లి దత్తాత్రేయుడిని దర్శించుకుంటాడు కార్తవీర్యుడు. భూలోకంలోని భోగాలు, వైభోగాలకు విముఖతను చూపుతున్న కార్తవీర్యుడిని తన భక్తుడిగా స్వీకరిస్తాడు. స్వామి వెంటే ఉండి ప్రతి నిత్యం సేవలందించేవాడు. రాజు చిత్తశుద్ధి చూసి స్వామి అనేక వరాలను అందించాడు. సార్వభౌమ బిరుదాంకితుడిగా, సహస్ర బాహుడిగా భులోకాన్ని పాలించాలని, దాన మహిమ, ప్రతాప మహిమతో విలసిల్లాలని ఆశీర్వదించాడు. స్వామి ఆదేశానుసారం కార్తవీర్యుడు మాహిష్మతి రాజ్యానికి వచ్చాడు.

కం. కువలయ బాంధవ కులభూ / ధవుఁ డర్జునుఁ డలరె నాత్మ దత్తాత్రేయ

ద్వివర కళుండును గురు బుధ / కవియుతుఁడునునై సహస్ర కరవిస్పూర్తిన్. (అష్టమాశ్వాసం ప.39)

చంద్రవంశరాజుగా కార్తవీర్యుడు కీర్తిని ఆర్జిస్తూ అన్ని ద్విపాలలో యజ్ఞయాగాలు చేస్తూ యూపస్తంభాలు, తన ఆయుధ పటీమతో జయస్తంభాలు నెలకొల్పారు. కవి మల్లారెడ్డి వర్ణించిన రాజును గుణ విశేషాలన్ని విష్ణువుకు వాచకాలై వర్ధిల్లాయి. అష్టాంగ యోగం, అష్టాదశ విద్యలు నేర్చి కార్తవీర్యార్జునుడు అష్టభోగాలు అనుభవిస్తూ అష్టాదశ ద్వీపాలలో ప్రసిద్ధిగాంచాడు.

తర్వాత తన భార్యలతో కార్తవీర్యుడు క్రీడించిన సందర్భాలను కవి మల్లారెడ్డి ప్రస్తావించారు. అష్టవిధ శృంగారనాయికల లక్షణాలను రాజు భార్యలలో ప్రతిక్షేపించి చెప్పారు. ఇదే సందర్భంలో రాజు తన కాంతలతో కూడి వసంత విహారానికి బయలుదేరాడు. ఉద్యానవనం తుమ్మెదల ఝంకారాలతో, కోకిలల ఆలాపనలతో, నర్మదానది తరంగాలతో, పూల పరిమళాలతో అలరారుతుంది. రాజును చూడడానికి ఉద్యానవన లక్ష్మి వివిధ రూపాలు ధరించి వచ్చిందా అన్నట్లు కవి కల్పన చేశారు. తన స్త్రీ జన సమూహంతో విహరించి అలసిన అతివలతో కలిసి కార్తవీర్యుడు జలకేళి కోసం నర్మదా నదిలోకి ప్రవేశించాడు. నీళ్లు చల్లుకుంటూ రాణులు రాజుతో కేళీ విలాసం కొనసాగించారు.

కొంత సమయానికి భూలోకంలోని రాజులందరిని జయించి రావణుడు మహాగర్వంతో నర్మదా నది దగ్గరకు వచ్చాడు. నర్మదా నది రావణుడిని ఆహ్వానించగా ఆయన ఇతర నదులేవి ఆ నర్మదకు సాటిరావని స్తుతించాడు. ఆ నదీ తీరంలో శివ పూజ చేస్తే మేలవుతుందని భావించి దిక్పతులను ఆజ్ఞాపించాడు.

సీ. తన వ్రాలు కమ్మఁ జూచినయంత జంభారి/ పారిజాతముల పుష్పములు పనుపఁ

దనయాజ్ఞ కెదురుగాఁ జనుదెంచి శమనుండు/ సారంబుగల గంధసార మనుపఁ

దన యుత్తరము శిరంబునఁ దాల్చి వరుణుండు/ లాలితముక్తాఫలములు పనుపఁ

దన లేఖ కన్నులఁ గని యద్దుకొని యక్ష/ నాథుండు మణిభూషణంబు లనుప

తే.గీ. నమ్మహానది మజ్జనం బాచరించి/ హారి సికతాతలంబుపై నధివసించి

భవ్య నిష్ఠా గరిష్ఠుఁడై భక్తి నిందు/ధరునిఁ బూజించె వేడ్క నా దశముఖుండు. (అష్టమాశ్వాసం ప.111)

శివపూజకు ఇంద్రుడు పారిజాతాలు, యముడు గంధం, వరణుడు మంచి ముత్యాలు, కుబేరుడు మణిభూషణాలు పంపించారు. నదిలో స్నానం చేసి ఇసుక తిన్నెల మీద కూర్చొని రావణుడు పూజకు ఉపక్రమించాడు. కాని భార్యల జలకాలాటలతో కార్తవీర్యుడు తన సహస్ర బాహువులతో నర్మదా ప్రవాహం దిగువకు పోనివ్వకుండా అడ్డుకున్నాడు. అంతలోనే వరద పొంగి ఇసుక తిన్నె మునిగిపోగా రావణుడి పూజా సామాగ్రి కొట్టుకొని పోయింది. వెంటనే రావణుడు తమ గూఢాచారి శుకుడిని పంపి కారణం తెలుసుకున్నాడు. ఆక్రోశంతో తన ప్రతాపం చూపడానికి కార్తవీర్యుడిపై సేనలతో విరుచుకుపడ్డాడు. కార్యవీరుడు తన గొప్పనైన ధనుస్సునందుకొని మహా సైన్యంతో రావణుడి శరీరాన్ని గాయపరిచి ఓడించాడు. రాజు ఆదేశంతో అధికారులు వచ్చి రావణుడిని బంధించి రాజ్యం చెరసాలలో పెట్టారు.

చాలా సమయం వరకు రాణులు జలక్రీడ చేసి అలసి గట్టెక్కి మద్యం సేవించడం ఆరంభించారు. అనేక రకాల వినోదాలతో సంతృప్తి పొందిన తర్వాత రాజు తన భార్యలతో కలిసి మాహిష్మతీ పట్టణానికి బయలుదేరారు. రాజు చేతిలో చావగా మిగిలిన సైన్యం లంకా నగరానికి పారిపోయి పులస్త్య బ్రహ్మకు రావణుడు బంధింపబడ్డ సంగతి వెల్లడించారు. రావణుడి బంధ విముక్తి కోసం పులస్త్య బ్రహ్మ మాహిష్మతీ రాజ్యానికి వెళ్లగా కార్తవీర్యుడు ఎదురేగి అతిథి సత్కారాలు నిర్వహించాడు. కార్తవీర్యుడి పరాక్రమం సాటిలేనిదని, కీర్తి ముల్లోకాలు నిండిందని తెలిపి తన మనవడు రావణుడిని విడుదల చేయలసిందిగా కోరాడు. ఆ మాటలకు రాజు సంతోషించి రావణుడిని బంధ విముక్తుడిని చేస్తాడు. తర్వాత పులస్త్య బ్రహ్మ సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్లాడు. ఇక కార్తవీర్యుడు ఎప్పటి లాగే రాజధర్మాన్ని పాటించి జగత్తునంతటిని పాలింపసాగాడు.

11. ఉపసంహారం:

  • రాజా మలారెడ్డి రచించిన ఈ షట్చక్రవర్తి చరిత్రలో ఒక్కో మహారాజు వారి వారి గుణ విశేషాలతో రాజ్య పాలనా కర్తవ్యాన్ని, స్వయం దక్షతను సాధించారు.
  • సత్య మహిమా సంపన్నుడిగా హరిశ్చంద్రుడు దర్శనమిస్తాడు.
  • నిర్మలమైన మనో నిశ్చయం, అంత:కరణ అభీష్టం నలుడికి ఆభరణంగా నిలుస్తాయి.
  • పురుకుత్సుని కథలో భుజబల శౌర్య పరాక్రమంతో పాటుగా ఆర్తజన పరాయణత్వం ప్రతిఫలిస్తుంది.
  • పురూరవుడి వృత్తాంతంలో స్వచ్చమైన ప్రేమ బంధాన్ని శాశ్వతం చేస్తూ మోహావేశాన్ని నిలువరింపజేసే దృశ్యం ద్యోతకమవుతుంది.
  • సగరుడి చరిత్ర అహంకారం వల్ల కలిగే దుష్పరిణామాలను తెలుపుతూనే కార్యదీక్షా ఫలసాధనను వెల్లడిస్తుంది.
  • కార్తవీర్యార్జునుడిలో రాజగుటకు గల అర్హతలు, రాజుగా వ్యవహరించవలసిన బాధ్యతలను గుర్తుచేస్తుంది.
  • చక్రవర్తులు అనుసరించిన సత్యసంధత, దాతృత్వం, త్యాగనిరతి, కార్యసాధనతో కూడిన విలువలు రాజధర్మంలో పాలనావశ్యకతను తెలియజేస్తాయి.  

12. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అనంతకుమార శర్మ, మేడవరపు, (జనవరి 1989). దోమకొండ (బిక్కనవోలు) సంస్థాన కవులు – వారి రచనలు (సి. గ్రం.). కామారెడ్డి: హితసాహితి.
  2. ఆరుద్ర. (2012). సమగ్ర ఆంధ్ర సాహిత్యం (రెం. సం.). హైదరాబాద్: తెలుగు అకాడమీ.
  3. నాగయ్య, జి. (సెప్టెంబర్ 2009). తెలుగు సాహిత్య సమీక్ష (రెం. సం.). తిరుపతి: నవ్య పరిశోధక ప్రచురణలు.
  4. మృణాళిని, సి., ఆచార్య (సం.). (2016). తెలుగు సాహిత్య విమర్శ దర్శనం (పదకొండవ సం.). విజ్ఞాన సర్వస్వ కేంద్రం. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం.
  5. రామబ్రహ్మం, బేతవోలు (వ్యా.). (2022). షట్చక్రవర్తి చరిత్ర – రాజా మల్లారెడ్డి ప్రణీతము (మొ. సం. & రెం. సం.). విజయవాడ: శ్రీ రాఘవేంద్ర ప్రచురణలు.
  6. రామలింగారెడ్డి, కట్టమంచి (1973). కవిత్వతత్వ విచారము. విశాఖ పట్నం: ఆంధ్ర విశ్వ కళా పరిషత్.
  7. రామశేషయ్య, గురిజాల (2 జూన్ 2021). తెలంగాణ ప్రబంధాలు – పరిచయ మాలిక. మయూఖ – తెలంగాణ సాహిత్య ద్వైమాసిక అంతర్జాల పత్రిక.
  8. సత్యనారాయణ, విశ్వనాథ (-). ఒకడు నాచన సోమన్న, విజయవాడ: వి. యస్. యన్. అండ్ కో. పబ్లిషర్స్.
  9. సుబ్రహ్మణ్యం, జి., వి., (సెప్టెంబర్ 1996). అనుశీలన. హైదరాబాద్: షష్టి పూర్తి ప్రచురణలు.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]