headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-06 | Issue-01 | January 2025 | ISSN: 2583-4797 | UGC-CARE listed

1. సోమసుందర్ దీర్ఘకావ్యాలు: వస్తు, దృక్పథాలు

ఆచార్య ఎన్. ఈశ్వరరెడ్డి

ఆచార్యులు, తెలుగుశాఖ
యోగి వేమన విశ్వవిద్యాలయం, వేమనపురం
కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8328296952, Email: eswaryvu@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.12.2024        ఎంపిక (D.O.A): 28.12.2024        ప్రచురణ (D.O.P): 01.01.2025


వ్యాససంగ్రహం:

అభ్యుదయకవిగా సుపరిచితులు డా. ఆవంత్స సోమసుందర్. వజ్రాయుధం కవితాసంపుటితో సాహితీ క్షేత్రంలో అడుగుపెట్టిన ఆయన శతాధిక గ్రంథకర్తగా నిలిచారు. అందులో దీర్ఘకావ్యాలు కూడా భాగం. సోమసుందర్ దీర్ఘ కావ్యాలలోని ప్రత్యేకతలను వివరించడం, ఈ నాటి సందర్భాలకు వాటి అవసరం ఏమిటో వివరించడం ఈ వ్యాసముఖ్యోద్దేశ్యం. సోమసుందర్ దీర్ఘకావ్యాలపై ప్రత్యేకంగా ఎవరూ పరిశోధన చేయలేదు. ఈ వ్యాసకర్త “సోమసుందర్ సాహిత్యంలో అభ్యుదయ దృక్పథం” పిహెచ్డీ గ్రంథం, వ్యాసాలు, మిరియాల రామకృష్ణ, చందు సుబ్బారావు తదితరులు సోమసుందర్ సాహిత్యంపై చేసిన పరిశోధనలు, సోమసుందర్ దీర్ఘకావ్యాలు, రచయిత బతికున్న రోజుల్లో ఆయనతో జరిపిన చర్చలు ఈ వ్యాసరచనకు ప్రధాన ఆకరాలు. సోమసుందర్ దీర్ఘకావ్యాలను అంశాల వారీగా వింగడించుకున్నాను. పరిశీలనలో తేలిన విషయాలే ఈ వ్యాసరూపాన్ని సంతరించుకున్నాయి. పరిచయం, దీర్ఘ కవిత: నిర్వచనం - లక్షణాలు, సోమసుందర్ దీర్ఘకావ్యాలు వంటివి ఈ వ్యాసరచనా ప్రణాళికలో ఉపశీర్షికలు. సోమసుందర్ దీర్ఘకావ్యాలలోని వస్తు, దృక్పథాలను విశ్లేషించడం ఈ వ్యాసపరిమితి. కళాకేళి, సాహిత్యపీఠం గ్రంథాలయం, గౌతమి గ్రంథాలయం మొదలైనవి సమాచారసేకరణ ఉపకరించాయి. సోమసుందర్ తో సహా ఎందరో ఆచార్యులతో చర్చల ఫలితంగా ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.

Keywords: సోమసుందర్, దీర్ఘకావ్యాలు, బృహత్కావ్యాలు, గంధమాదనం, చేతావనీ, రక్షరేఖ , హృదయంలో హిరోషిమా , ధూప ఛాయ, జీవన లిపి.

1. పరిచయం:

తెలుగు కవిత కొత్త - పాతల వంతెనపై నిలబడి మానవతను విప్పార్చుకునే తరుణంలో సోమసుందర్ జన్మించాడు. ప్రాచీన పద్యరూపాన్ని వదులుకోలేక, కొత్త విలువల్ని జీర్ణించుకోలేక సతమతమవుతున్న సమయంలో సోమసుందర్ కవితాలాపన ప్రారంభమైంది. ఉధృతంగా వీచిన ప్రాశ్చాత్య పవనాలలోని ఉన్నతమైన విలువల్ని స్వీకరించి తన కవిత్వానికి సానపట్టాడు ఆవంత్స సోమసుందర్.

భావకవిత్వం ప్రకృతి, ప్రణయ, మార్మిక కవితా శాఖలుగా బ్రతుకుతూనే దేశభక్తిని కూడా ఒంటబట్టిచ్చుకుంది. తనవంతుగా సమాజశ్రేయస్సును దేశభక్తితో మిళితం చేసింది. ప్రపంచయుద్ధాలు, ఆకలి, దారిద్య్ర్యం, నిరుద్యోగం పట్టిపీడిస్తున్న జనానికి ఒక పోరాట స్థాయి కవిత్వం అవసరమైంది. అణగారిపోతున్న ప్రజల మంచిచెడ్డల్ని ప్రతిబింబిస్తూ, పీడక వర్గానికి ఎదురునిలబడే ఉద్యమస్థాయి సామాజికత కలిగిన 'కవిత్వంగా అభ్యుదయ కవిత్వం' ఆవిర్భవించింది. యువతరం దాన్ని ఆదరించింది. 20వ శాతాబ్దంలో అనేకమైన మార్పులు క్రిక్కిరిసి జరిగాయి. నిజానికి యూరప్ దేశాల్లో ఈ రొమాంటిక్ రివైవల్ వచ్చిన తర్వాత చాలా కాలనికి గానీ రియలిస్టిక్ పాయిట్రీ,, రివల్యూషనరీ పాయిట్రి రాలేదు. వాటి మధ్య దాదాపు యాభై యేళ్ళు వ్యవధి ఉంది. కాని మన దేశంలో అంత వ్యవధి లేకపోయింది. ఈ శతాబ్దంలో అనేక వాదాలు ఒక దాని పక్క ఇంకొకటి సహజీవనం చేస్తూ సాహిత్యంలోకి చొరబడ్డాయి. దీని కారణంగానే భావకవిత్వం ముప్పై ఏళ్ళైనా బ్రతక్కుండానే సెలవు తీసుకోవలసి వచ్చింది. భావ కవుల్లో ఆఖరి వాడుగా పుట్టిన శ్రీరంగం శ్రీనివాసరావు నవ్యమానవ కవిత్వానికి ప్రవక్త అయ్యాడు. నిజానికి తెలుగులో భావకవిత్వాన్ని గానీ, మానవీయ కవిత్వాన్నిగానీ ప్రారంభించిన మహర్షి గురజాడ అప్పారావే. అలాంటి గురజాడ అప్పారావు గారి ప్రోక్తమైనట్టి ఈ నవ్యమానవ కవిత్వమే అభ్యుదయ కవిత్వానికి మాతృత్వం వహించిందనవచ్చు. అలాంటి అభ్యుదయ కవిత్వం ఊపిరి పోసుకుంటున్న వేళ కలానికి గళమిచ్చి సాహితీ క్షేత్రంలో అడుగుపెట్టిన కవి సోమసుందర్. 

2. దీర్ఘకవిత నిర్వచనం -  లక్షణాలు:

ఆధునిక కవిత్వంలో ప్రక్రియా విశేషాలు చాలా వచ్చాయి. వచన కవిత, వచన పద్యం, వచన గేయం, మినీ కవిత, హైకూ, నానీలు, రెక్కలు, ఎస్జీడీలు,స్వామీలు, ముఖీలు మొదలైన ప్రక్రియలు రోజుకో రూపాన్ని ధరిస్తూ ముందుకు పోతున్నాయి. 

అలాంటి వాటిలో దీర్ఘ కవిత ఒకటి. దీర్ఘ కవిత అన్నప్పుడు అది కవిత నిడివికి సంబంధించిన విషయంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఆంగ్లంలో దీన్ని లాంగ్ పోయం అంటున్నారు. Long poem అనే మాటకు సంబంధించి పాచ్యాత్య రచయితల అభిప్రాయాలను గమనిస్తే...

  1. లిన్ కెల్లర్ దీర్ఘ కవితను కేవలం "పుస్తకం-నిడివి"గా ఉండే కవితగా వర్ణించాడు. అంటే ఒక కవితా సంపుటి మొత్తానికి మొత్తంగా ఒకే కవితగా ఉండడం. లిన్ కెల్లర్ తన వ్యాసం "పుషింగ్ ది లిమిట్స్"లో కళా ప్రక్రియ ప్రాముఖ్యతను నొక్కి చెప్తాడు, ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలో అమెరికన్ సాహిత్యంలో సుదీర్ఘ కవిత ప్రాముఖ్యత కలిగిన శైలిగా గుర్తించబడింది
  2. సుసాన్ స్టాన్‌ఫోర్డ్ దీర్ఘ కవితను ఒక శైలిగా అభివర్ణించాడు అందుకు ' ఫ్రైడ్‌మాన్ ' అనే దీర్ఘ కవితను ఒక ఒక ఉదాహరణగా పేర్కొన్నాడు..
  3. ఎడ్గార్ అలన్ పో 'ది ఫిలాసఫీ ఆఫ్ కంపోజిషన్‌ ' లో నిజమైన దీర్ఘ కవిత అని ఏదీ లేదని, చిన్న కవితా ఖండికలు కలసి పొడవైన అనుభవాల తీగలుగా మాత్రమే సాగుతాయని తెలియజేస్తాడు.
  4. దీర్ఘ కవిత" అనే పద నిర్వచనం అస్పష్టంగా ఉన్నప్పటికీ, కళా ప్రక్రియగా, సాహిత్య రూపంగా, సామూహిక వ్యక్తీకరణ సాధనంగా ప్రాముఖ్యతను సంతరించు కుంటుంది.
  5. ఎజ్రా పౌండ్ తన సొంత దీర్ఘ కవిత ' ది కాంటోస్‌ ' ను "తెగ కథ" గా సూచించాడు. చిన్న కవిత విశద పరచలేని విషయాన్ని దీర్ఘ కవిత పరిష్కరిస్తుందని పేర్కొన్నాడు.
  6. ఆధునిక, సమకాలీన దీర్ఘ కవితలలో "తెగ కథ" తరచుగా సాంస్కృతికంగా, ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున ఉన్న వ్యక్తులచే తిరిగి చెప్పబడిందని. అందువల్ల, డెరెక్ వాల్కాట్ రాసిన "ఒమెరోస్" వంటి నకిలీ-పురాణ కథనాలు కూడా ఈ కోవలో చేరాయని చెప్తాడు.
  7. వలస పాలనానంతర వ్యక్తులు, జాతిపరంగా అణచివేయబడిన వ్యక్తులు, మహిళలు మరియు సంప్రదాయ ఇతిహాసాలచే విస్మరించబడిన వారు దీర్ఘ కవితా రచనకు పూనుకున్నారని భావించారు.
  8. దీర్ఘ కవితలు యుద్ధం, హింస, వీరత్వం, స్వేచ్ఛ, మొదలైన విస్తారమైన ఇతివృత్తాలను చెప్పగలవని విశ్వసించారు.
  9. కొంతమంది కవులు దీర్ఘ కవితా శైలిలో "రివిజన్ మైథోపోసిస్" చేపట్టారు. సాంప్రదాయకంగా కనీస సాంస్కృతిక అధికారం కలిగిన కవులను మినహాయించిన సందర్భాల్లో వాటిపై తిరుగుబాటుగా వచ్చిన దీర్ఘ కవిత "ప్రాథమిక పునర్విమర్శ" గా, ఆ కవులకు (ఫ్రైడ్‌మాన్) ఒక ఉపన్యాసంగా పని చేస్తుందని అభిప్రాయపడ్డారు.

దీర్ఘ కవితల నిర్మాణంలో సమస్యలు లేకపోలేదు. కథలానో నవలలానో విషయాన్ని చెప్పుకుంటూ పోవడానికి వీలుండదు. కవిత్వ లక్షణాలు, వ్యక్తీకరణ సామర్థ్యాలు చివరిదాకా కొనసాగించడం ఏ కవికైనా కష్టంతో కూడిన పని. అందువల్ల

  1. దీర్ఘ కవితలు కవిత్వ మౌలిక లక్షణాలను కొనసాగించలేకపోవచ్చు.
  2. ఆచరణాత్మకత, వర్గీకరణకు దూరం అవ్వవచ్చు. కవిత్వంలోని భావ సౌందర్యం, ఎమోషన్ పల్చబడవచ్చు.
  3. అనుసరణలుగా మిగిలి, పటుత్వం కోల్పోవచ్చు.
  4. పాఠకుడ్ని చివరిదాకా చదివించే శక్తి సామర్థ్యాలు సన్నగిల్లవచ్చు.

3. సోమసుందర్ - దీర్ఘ కావ్యాలు:

సోమ సుందర్ కు దీర్ఘకావ్యాలపై మక్కువ ఎక్కువ. ఇతర కవితా సంపుటలలో కనిపించే కవితలు కూడా చాలా సందర్భాలలో దీర్ఘ కవితలు లాగే కనిపిస్తాయి .సోమ సుందర్ కు గుర్తింపుగా నిలబడ్డ వజ్రాయుధం కవితా సంపుటిలో బానిసల దండయాత్ర కవిత కూడా అలాంటిదే. ఆంగ్ల సీమలో ఆమని వీణలు, రక్తాక్షి, ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ప్రతి కవితా సంపుటిలోనూ ఏదో ఒక దీర్ఘ కవిత కనిపిస్తుంది. విషయ విస్తృతి దృష్ట్యా దీర్ఘ కావ్యాలుగా నిలబడ్డ సంపుటాలను మాత్రమే ఇందులో ప్రస్తుతిస్తున్నాను. అవి

1.బృహత్కావ్యాలు, 2.గంధమాదనం, 3.చేతావనీ, 4.రక్ష రేఖ, 5.హృదయంలో హిరోషిమా, 6.ధూప ఛాయ , 7.జీవన లిపి

3.1 బృహత్కావ్యాలు:

బృహత్కావ్యాలు: డాక్టర్ ఆవంత్స సోమసుందర్ దక్షిణ భారతదేశ యాత్రా సమయంలో 'అక్షయ తరంగిణి', 'కాలం వీలునామా', 'ముక్తచ్ఛాయ', 'అరిచే లోయలు' అనే నాలుగు సుదీర్ఘ కవితలు రాశాడు. పై నాలుగు కవితల సమాహారమే బృహత్కావ్యాలు. పెద్ద పెద్ద కవితలు సాధారణంగా పాఠకుణ్ణి చదివించే దిశగా నడిపించవు. అయితే కవితలో స్పష్టత, అర్ధగంభీరత, పరుగెత్తే శైలి, మొదలైన ఆకర్షక లక్షణాలు ఉంటే పాఠకులు తప్పించుకునే ప్రయత్నం చెయ్యరు. 'లాంగ్ పోయమ్' ను ఏకబిగువున చదివించగలిగే శక్తి సోమసుందర శైలిలో కనిపిస్తుంది.

తన బృహత్కావ్యాలు (1973) రచనా కాలంలో అంటే సోమసుందర్ యాభైయ్యో సంవత్సరంలో ఇద్దరు ప్రపంచ మహాకవులు మరణించారు. డబ్ల్యు. హెచ్. ఆడెన్ (1907- 1973 సెప్టెంబరు 28), పాబ్లో నెరూడా (1904-1973 సెప్టెంబరు 23)ల మరణాన్ని సోమసుందర్ జీర్ణించుకోలేక పోయాడు. వాళ్ళు భౌతికంగా లేకపోయినా, అక్షర చైతన్యంతో బతికే ఉంటారని, వారి స్మరణ తనను అడగడుగునా వెంటాడినట్లు' సోమసుందర్ బృహత్కావ్యాల ముందు మాటలో చెప్పుకున్నాడు.

(ఎ) అక్షయ తరంగిణి:

"ఈ మానవ మహారణ్యంలో ఏకాకి సహకార వృక్షం వలె నిల్చున్నాను. నా బృహత్వనంలోకి దయచేయమని సుహృద్వరులందరినీ ఆహ్వానిస్తున్నాను" అంటూ కవి తన కావ్యసౌధంలోకి నడిపించుకొనిపోతాడు. సామాజిక మార్పే ప్రధాన ధ్యేయంగా అక్షయ తరంగిణి నిలుస్తుంది.

'తాతలనాటి దిగుడు బావుల్లో రాలిన పుష్ప పరాగాల్ని, గతించిన పితరుల సుందర వదనాలతో వెలిగే స్మృతి దీపికల్ని, మనసు గోడలను మసిబారించే పాత జ్ఞాపకాల్ని వదిలి వాస్తవిక జీవన పథంలోకి నడవమంటుంది అక్షక తరంగణి.' గత కాలపు జీర్ణ పత్రాలను ఉదారంగా విడిచి పెట్టి కొత్త కలల చిగురాకుల్ని కలగంటుంది. ఇసుక తిన్నెల పిచ్చి కోరికలను సెలయేళ్ళు తీర్చనవసరం లేదంటుంది. యెలకోయిల ఉన్మత్త ప్రలాపాలు అభ్యంతరం కావంటుంది.

కొత్త కలల్లో భవిష్యత్తు, జీర్ణపత్రాల్లో కొరగాని సంప్రదాయం, ఇసుక తిన్నెల్లో అనాశయాలు దర్శనమిస్తాయి. యెల కోయిలల్లో చైతన్య రహిత కవులు కనిపిస్తారు. ప్రతీకల్ని ప్రయోగించి సమాజ వాతావరణాన్ని చిత్రించి అవసరమైన మార్పును సూక్ష్మీకరించాడు సోమసుందర్.

శ్రామికుల్లో చైతన్యం నింపగలిగే సిద్ధాంతాలను సోమసుందర్ విశ్వసిస్తాడు. మతోన్మాద భావాలను, మతోద్యమాలను తీవ్రంగా నిరసిస్తాడు. మతోద్యమాలపై సవాలక్ష సందేహాలను సంధించి విమర్శిస్తాడు. ఆడెన్, నెరూడాలను గుర్తు చేసుకుంటూ దక్షిణదేశాల ఇంపీరియలిజం పోకడలను వెతుకుతాడు. మానవ నైజాన్ని, అతనిలో పుట్టే ఉద్రేకాల పునాదిని భిన్న కోణాల నుండి దర్శించి వివరించే ప్రయత్నం చేశాడు.

ప్రస్తుత సమాజ విలువల్ని అంచనా వేస్తూ

"దిక్కులేక తల్లడిల్లే నిరుపేద గాలుల్ని చూచి 

ఎన్నిమార్లు జాలి పడ్డాను! కానీ అవే గాలులు 

విశ్వాస ఘాతుకంగా దుర్వాంఛా కాలకూటాల 

మునిగి. నా తలపూలు రాల్చ సాహసించడం 

ఎంత అసహ్యం"!' - ఆదుకునే చేతిని నరుక్కుపోయే ఈనాటి దుస్థితిని ఖండిస్తాడు.

(బి) కాలం వీలునామా:

డా॥ ఆవంత్స సోమసుందర్ తన బాల్యం నుండి (1924) 'కాలం వీలునామా' రచనా సమయం (1977) వరకు భారతదేశంలో సంభవించిన అనేక సంఘటనలకు రూపమిచ్చిన సుదీర్ఘ కవిత 'కాలం వీలునామా'. సుమారు వంద పేజీల నిడివిగల ఈ కవితలో కవి పరిణామ క్రమం, సామాజిక సంఘటనలు, వ్యక్తులతో గల సంబంధాలు, చేసిన పోరాటాలు, దేశ పరిస్థితులు దర్శనమిస్తాయి. జాతీయ స్థాయిలో సాగిన ఆలోచనలు కలానికి బలాన్నిచ్చాయి. తన 'వీలు నామా'లో బహుముఖ ప్రయోజనాలకు పెద్ద పీట వేశాడు కవి. తన ప్రయోగం గురించి "My new experiment must not just to make it new for mally, but to open up to new areas of experience ముందుకు నడుస్తాడు. అంతేగాక Exoteric, Esoteric అనే బాహ్య అంతర గుణాలను ఈ కవితలో ప్రదర్శించాడు. ఈ కవిత "సమకాలీన జనబాహుళ్య భావధార స్వీయ కంఠంగా ధరించింది. భూత భవిష్యత్తులను స్మృతులుగా, ఆశలుగా సంధానించుకుంది””. వర్తమానం వినిపించే 'Glee' ని రికార్డు చేసే ప్రయత్నం చేసింది.

సోమసుందర్ జనన కాలానికే భారతదేశం స్వాతంత్య్ర కాంక్షతో రగులుతూ రక్త తర్పణం చేస్తోంది. భారతీయుల్లో పొంగి పొర్లిన అంకితభావం పోరాటానికి ఊపిరి పోసింది. విప్లవ సింహాలై ప్రభవించిన అల్లూరి సీతారామరాజును కాల్చి చంపడం, భగత్సింగ్ ను ఉరి తీయడం వంటివి సోమసుందర్ సంవేదన పుట్టించాయి. వేలాది వీరుల్ని మట్టిలో కలిపి పుడమిని రక్తసిక్తం చేసిన గతకాలపు జ్ఞాపకాలను అక్షరీకరిస్తాడు. దీనికి తోడు దేశం నిండా అలుముకున్న దారిద్ర్యం ఆకలి చావుల్ని పండించింది. ఈ దశనుండి ఒక మహావిప్లవానికి అంకురార్పణ చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. మేథావులతో పాటు కవులూ, కళాకారులూ కూడా 'చీకటి గుండెల్ని చీల్చి' బయట పడటానికి నడుం కట్టారు. ఆ పరిస్థితిని ఈ కవిత సమర్ధంగా చిత్రించింది. తర్వాత కాలంలో విదేశీయుల్ని వెళ్ళగొట్టినా, ప్రజాతంత్ర పాలనలో శాంతియుత వాతావరణం ఏర్పడక పోవడాన్ని అభివృద్ధికి 'అఖాతం'గా భావిస్తుంది. ఇవి చాలదన్నట్టు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో 1975 జూన్ 25 నుండి 1977 ఫిబ్రవరి 3 వరకు ఎమర్జెన్సీ ప్రకటించింది. ఈ దశలో స్వాతంత్ర్యం తాలూకు మౌలికతను కాలరాసింది. ఈ విషమ విషాదాల నేపధ్యంతో సాగిన కావ్యమే 'కాలం వీలునామా'.

(సి) ముక్తచ్ఛాయ:

సౌందర్య దృష్టి, చైతన్య దృష్టి, గమన దృష్టి మూడింటి కలబోతతో చేసిన సాహిత్య సృష్టి 'ముక్తచ్ఛాయ' కావ్యం. ఛాయ అంటే మాయ అని అర్ధం. ముక్తచ్ఛాయ అంటే ముక్తమైన ఛాయ లేదా విముక్తమైన మాయ అని చెప్పుకోవచ్చు. వివేచనా శూన్యుడు సామాజిక బాధ్యత కోల్పోతాడు. పురోగమనం స్తంభిస్తే వ్యవస్థ మురికి గుంటలా మారుతుంది. భ్రమల్లో పడి బతుకుతున్న జనం వాస్తవాల్ని గుర్తించలేరు. కాళ్ళకింద భూమి కరిగిపోతున్నా నమ్ముకున్న మతం కోసం చేతులు పైకెత్తి దీనంగా నిలబడగలరేగాని మతం ముసుగును తొలిగించి బయటి వాస్తవాల్ని చూడలేని వారు ఇప్పటికీ ఉన్నారు. వీళ్ళందరి మబ్బును తొలగించడానికి వచ్చిన కావ్యం 'ముక్తచ్ఛాయ'. తత్త్వాన్ని విజ్ఞానాన్ని కలిపి సోమసుందర్ తయారు చేసిన కవితా రసాయనం కొత్త వెలుగులు ప్రసరిస్తుంది. తత్త్వశాస్త్రంలోని కొత్త దృక్పథాలను విజ్ఞాన శాస్త్రంలోని మేలి శిఖరాలను ముక్తచ్ఛాయ కలిగి ఉంది. 

ముక్త ఛాయను 'సప్తసర్గలు'గా విభజించి గొలుసు వచనం (Run Onverse) గా నడిపించాడు సోమసుందర్.

"దిక్కులన్నీ మొగాలు ముడిచి 

వెల వెల లాడాక 

చుక్కలన్నీ ... 

అంతరిక్ష అంతఃగర్భంలోకి 

అంతర్థానమయ్యాక 

ఇంకా ఇక్కడే తచ్చాడు తున్నావా

పదీనీ నియోన్లైటు 

ధగద్ధగల హాసపుంజాల 

నేత్రజ్వాలలతో నీ కోసం 

సౌమ్యంగా సామరస్య పూరితంగా

మండితమైన జీవన జ్యోతి"ని' దర్శించలేకపోయిన వెర్రిజనాన్ని కర్తవ్య ముఖులుగా చేస్తాడు. 'మొక్కుబడుల ముడుపులతో దాడీలు పెంచి కొండకొనల్లో తిరిగేవాడు పానకాల స్వామిగా మిగిలిపోతాడని' హెచ్చరిస్తాడు. లక్ష్యరహితంగా సాగే జీవితం ఎప్పటికీ నీ దప్పిక తీర్చదని బోధిస్తాడు. 'చతుష్పథాలు' లేని మత భ్రమల నుండి మనిషిని బయట పడేసే ప్రయత్నం చేస్తుందీ ముక్తచ్ఛాయ.

(డి) అరిచే లోయలు:

ఆకలి దప్పులలో అలమటించే నిరుపేదలకు చిహ్నాలు 'అరిచే లోయలు'. ఆధునిక కవిత్వంలో వస్తు రూపాల్లో మార్పు తెచ్చిన వర్గ చైతన్యం అణగదొక్కబడిన వాళ్ళ గళానికి మాటనిచ్చింది. చైతన్యం కుషస్విని లాగా ప్రవేశించి ప్రేరణ నివ్వాలని సోమసుందర్ ఆకాంక్షిస్తాడు.

 పేదల ఆకలి అరుపులకు మూలాన్ని వెదుకుతూ 'చంద్రశాలా పంజరంలో బంధితమైన లక్ష్మి'ని చూస్తాడు. రవంత ఒరిగి పేదల ఇండ్లపై చూపులు సారించమని కోరుతాడు. సంపన్నుల పంజరంలో కీరవాణిగా మిగిలిన డబ్బు నిర్భాగ్యులకు ఆకలి ఆక్రోశాలను కలిగిస్తుందంటాడు.

పేదల పరిస్థితులను చిత్రిస్తూ..

"లోయలు గాయాలతో అరుస్తున్నాయి 

ఆకలితో ఆక్రోషిస్తున్నాయి. 

ఆశాభంగాల ఆర్తితో ఘోషిస్తున్నాయి

కన్నీటి మడుగుల చెమ్మలతో 

గండ పాళికలు మెరుస్తున్నాయి. 

శిఖరాల పీడనతో కళవళిస్తున్నాయి లోయలు"అంటాడు. ఈ పరిస్థితిలో పీడిక శిఖరాలను దాటి తన 'పయోధర'ను పేదలకు అందివ్వలేక బాధపడుతుంది. - లక్ష్మీదేవి. ఈ స్థితినుండి బయట పడడానికి,

"ఈ దుర్భర దుస్సహ ధనస్వామ్య వ్యవస్థను 

పరిమార్చేందుకు అకటావికటపు 

ఆటవికత్వం గమ్యమెన్నడూ కానేరదు".? అంటాడు. నైతిక విలువలు కలిగి పురోగమన దృష్టితో వచ్చే మార్పుకోసం కవి పరితపిస్తాడు. 'నిరుపేద గుండె నవపథమై తరించాలని', 'ధరణి విరచించే అమర కావ్యాక్షరాలను' స్పృశించి ప్రచండార్కుడై వెలగాలని సోమసుందర్ ప్రయత్నిస్తాడు.

"రాత్రి తెల్లవార్లూ ఎందుకో భూమి 

మూలుగుతూ చీకట్లో పడి ఉంది 

తనమీదికెక్కి తొక్కిన వివిధ స్వరూపాల నీడలనే 

అలంకారాలుగా ధరించింది భ్రమించింది వెర్రిముండ" అంటూ చైతన్యం లేని సమాజానికి రూపాన్ని పట్టిస్తాడు. కవిత్వాన్ని ఒక శక్తివంతమైన ఆయుధంగా నమ్మి సోమసుందర్ మార్పు కోసం నిరంతరం తపిస్తాడు.

3.2 గంధమాదనం:

గంధమాదనం కావ్యం సోమసుందర్ వ్యక్తిత్వ పరిణామ వికాసాన్ని తెలిపే మైలురాయి లాంటిది. చారిత్రిక అవసరాన్ని తీర్చడం కోసం కవితా ప్రస్థానాన్ని నడిపించిన సోమసుందరు బహుముఖాలుగా దర్శించవచ్చు. సోమసుందర్ జననం, అక్కడి పరిసరాలు, అప్పటి దేశ వాతావరణం, ఉద్యమాలు, వ్యక్తులు, సంస్థలు తన క్రమ పరిణామంలో ముడిపడిన తీరు తెన్నుల్ని ప్రస్ఫుటిస్తుందీ కవిత. కవిత్వాన్ని ఆయుధంగా ప్రయోగించిన సోమసుందర్ వెనుక దాగి ఉన్న జీవన వేదనను ఈ కావ్యంలో దర్శించవచ్చు.

'గంధ మాదనం' సూర్యరాయ విద్యానంద గ్రంథాలయానికి (పిఠాపురం) మారుపేరు. ఇక్కడ తనను నడిపించిన వివేచనా సంపత్తికి గంధమాదనం ప్రతీకగా కనిపిస్తుంది. పౌరాణికంగా "గంధమాదనం ఒక పర్వతం పేరు. అది పురాణ ప్రాశస్త్యమే తప్ప భౌగోళికంగా దాని ఉనికి ఎక్కడో దాని నైసర్గిక విశేషాలెట్టివో ఎవరికీ తెలియవు"" అని సోమసుందర్ స్పష్టపరిచాడు. స్థూలంగా విజ్ఞాన సంపత్తికి మారుగా నిలుస్తుంది గంధమాదనం.

సోమసుందర్ కవిగా మారుతున్న తరుణంలో పిఠాపురం. 'కోటి నందన వనాల పరిమళాల'తో అలరారుతోంది. పారిశ్రామికీ కరణ చెందిన ఊరు చెరుకు బళ్ళతో కిర్రుకిర్రులాడి ''మొలాసా' కుళ్ళు వాసనను వెదజల్ల నారంభించింది. ఆ శోభ గాబరాపెట్టే సమయంలో తను విద్యానందం వైపు నడత ప్రారంభించాడు. జ్ఞానోదయ మహాధరం లాంటి గంధమాదన ఆరోహణ ఇక్కడే ప్రారంభిస్తాడు. గమ్యం కోసం వెతుకులాట మొదలైంది ఇక్కడే. అప్పుడప్పుడే మొగ్గతొడుగుతున్న ఆలోచనలకు మార్గాలూ- దుర్గాలూ' కనిపించిందీ ఇక్కడే. లక్ష్యాన్వేషణ చేస్తున్న కవిని 'సుగంధ వర్షం'లో ముంచి తన ఆరాటానికి అర్థం చూపిస్తుంది.

వేవూరి గోపాల దాసు గంధమాదన పర్వతంలో కెంపుల శిఖరం లాంటి వాడని, గ్రంథాలయానికి సేవ చేసిన రంగనాయకులు అల్లం పురుషోత్తం తన జీవితంలో మైలురాళ్లుగా నిలబడ్డవారని పేర్కొంటాడు. గ్రంథాలయం దురవస్థకు చేరుతున్న తరుణంలో దానిని కాపాడిన భావరాయడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాడు. 

జీవపరిణామ సిద్ధాంతకర్త 'చార్లెస్ డార్విన్' ను మగత నిద్రలో కలుసుకొని, ఆయనకు ఆంగ్ల సీమ పర్యటన విశేషాలు తెలియజేస్తాడు. జంతువు నుండి వివిధ దశల్లో విడివడిన మనిషి మానుషత్వ పరిపూర్ణత దిశగా పరిణామం చెందాల్సిన అవసరాన్ని తెలియజేస్తాడు.

విజ్ఞానం తనను నడిపించిన విధానాన్ని వివరిస్తూ-

"పుస్తకమే కరదీపంగా

పుస్తకమే కరవాలంగా

పుస్తకమే శిరస్త్రాణంగా 

నశ్వర శరీరానికి అమృతమయ ప్రాణంగా" మారిందంటాడు. తనకు ఇంతశక్తి నిచ్చిన గ్రంథాలయానికి రమ్మని పిలుస్తూ..

"ఇటురండి బాటసారులారా భోక్తలుగా వేంచేయండి 

ఈ గంధమాదనంపై ఫలద్రుమారామం మీకోసమే..” అంటాడు.

మానవేతి హాసంలో 'గ్రంథాలయం' మనిషి విజయమే. మనిషి విజయానికి గ్రంథాలయం పూలబాటగా నిలబడింది. గ్రంథాలయ స్మృతి కావ్యంగా 'గంధమాదనం' మిగలడాన్ని గుర్తించవచ్చు. గంధమాదనం కావ్యం ఏకబిగువున చదివించ గలిగే శైలిని కలిగి భావ ప్రపంచంలోకి ఈడ్చుకుని పోతుంది. వ్యంగ వీచికలతో ప్రబోధాత్మకంగా సాగిన ఈ కావ్యం సోమ సుందర్ జీవిత,కవిత్వ నేపథ్యాలను ప్రతిఫలిస్తుంది.

3.3 చేతావనీ: 

ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కులాలు,మతాలు భారతదేశంలో ఉన్నాయి. ప్రతి మతం, ప్రతి కులం తమ ప్రత్యేకతను కాపాడుకుంటూనే ఇతర కులాలతో మతాలతో కలిసి సహజీవనం చెయ్యడంలోనే భిన్నత్వంలో ఏకత్వం నిలబడగలిగింది. పరాయి మూకలు దేశాన్ని ఉక్కుగోళ్ళతో తొక్కిపట్టినప్పుడు ఉద్వేగంతో తిరగబడిన భారతజాతిలో అంత సూత్రంగా ప్రవహించిన 'ఏకత' స్వాతంత్య్రం దాకా తీసుకెళ్ళింది. సమైక్యత వికసించిన ఈ కర్మభూమి పై మతాధిక్యత కోసం ప్రాణాలను కూడా తీయడం అమానవీయాంశం. సభ్య సమాజం గర్తించే విషయం. నర రక్తం తాగడానికి వెనుకాడని మత పిశాచులు సమన్వయంతో పురోగమిస్తున్న భారత జాతి హృదయంలో చిచ్చుపెట్టారు. అలాంటి మతోన్మాద కరసేవకులపై సోమసుందర్ సంధించిన కవితాస్త్రం' 'చేతావనీ',

కరసేవ పేర హిందూసన్యాసులు, కార్యకర్తలు, బాబర్ స్మృతి చిహ్నంగా నిర్మించిన 'బాబ్రీమసీదు'ను అన్యాయంగా కూల్చేశారు. రామరాజ్యం పేరుతో రావణ కృత్యానికి పాల్పడ్డారు. 'రాముడు కరసేవకులను పట్టుకొని మందిరం కోసం దుఃఖంచాడట' అంటూ సోమసుందర్ ఎగతాళి చేస్తాడు. రాజకీయ లాభార్జన కోసం మనషుల్ని మతాల్ని ఎరగా వేసే నాయకుల అసలు రంగును బయట పెట్టడానికి సోమసుందర్ నడుం బిగించాడు.

సామూహిక భద్రత కోసం ప్రతి మనిషీ 'అపద్ధర్శమైనా' కరవాల మెత్తమంటుందీ కవిత.

"మనిషి మనిషిగా సిద్ధిపొందడం 

సమాజ జీవిగా తలలోని నాలుకగా మారడం 

జీవచైతన్యంతో భాసించడానికే 

కడగొట్టు తమ్ముడికైనా 

దుర్మార్గ నరాధముల వల్ల అన్యాయం జరిగినప్పుడు 

నువ్వు గొంతెత్తక పోతే 

రేపు కడకు నువ్వూ నీ గొంతూ మిగులవు సుమీ 

రేపటి నీ భద్రత కోసమే నేడు గొంతెత్తు 

అవసరమైతే చేయెత్తు 

మరీ అపద్దర్మమైతే కరవాలమెత్తు""

అంటూ మానవ ఉనికిని కాపాడమంటాడు. సాటి మనిషిగా తన బాధ్యతను గుర్తించ మంటాడు వ్యష్టి ప్రయోజనాల కన్నా సమష్టి ప్రయోజనాలే ముఖ్యమనే సూత్రాన్ని బోధిస్తాడు.

బెబ్బులిని చంపలేక చెవులపిల్లని చంపి తమ భుజ బలాన్ని నిరూపించుకునే ఆటవిక నీతిని తూర్పారబడతాడు. 'వీలైనంత వెనక్కిపోయి ఆదిమత్వానికి హిందూత్వమని పేరుబెట్టి విజయ భేరి ధ్వనింప చేద్దాం. మనం తప్ప మరేరీ కర్త వ్యపాలకులు?' అంటూ వ్యంగ్యాన్ని విసురుతాడు. ' తల్లిని నరికిన పరశురాముని సంతతిగా' పోల్చి, మెత్తని చురక తగిలిస్తాడు. శంబూకుని తలనరికిన రాముణ్ణి, శూద్రులకు, పంచములకు, తప్పస్సు చేయకూడదని గిరిగీసిన వశిష్టుణ్ణి కూడా నిలదీస్తాడు. మత పరిరక్షణ పేరుతో మనుషుల్ని హతమార్చే విషకృత్యాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలో వేళ్ళూనుకుంటున్న కుటిలత్వాన్ని ఎండగడతాడు.

"ఆటవిక జీవన వారసత్త్వాలు 

భ్రాతృ హంతల జాతరలో 

రక్తోత్సవాలు జరుపుకుంటాయి 

దానవత దురాక్రమిస్తుంది"

ఈ స్థితి మారకుంటే సహనం ఎండమావిగా వెక్కిరిస్తుందని హెచ్చరిస్తాడు.

" కొబ్బరి చిప్పలతో జననాంగాలు దాచుకున్న 

వన్యమృగాలు జ్ఞానోప దేష్టలై 

రాజధానిలో రాణకెక్కుతున్నారు 

బాబాల స్వామీజీల గోసాయి చిట్కాగాళ్ళ 

జనాభా పెరిగింది గలాభా పెరిగింది" ఈ సమస్య వ్యవస్థ మనుగడనే ప్రశ్నిస్తోంది. మతం రంగులో బతుకుతున్న మానవతా హీనులను ఫాసిస్టులుగా వర్ణించి దూషిస్తాడు.

 కవితా హృదయంతో తీర్పు చెపుతూ - మతాల మత్తు చీకట్ల నల్లని ధాత్రిపై గాఢంగా నల్లగా వికారంగా పడుతుంది రాత్రి. చీకటే చీకటి పాపాల హరిస్తుంది" అని తుది నిర్ణయాన్ని కాలానికే వదిలేస్తాడు.

 చరిత్రను, కాలాన్ని రెండు కళ్ళుగా ధరించి గత యాభై ఏళ్ళకు పైగా కవిత్వం రాస్తున్న సోమసుందర్ విపత్కర పరిస్థితులు దాపురించినప్పుడల్లా నేనున్నానంటూ స్పందిస్తున్నాడు. అవసరమైన చోట కలాన్ని కరవాలంగా మారుస్తూ సమాజానికి అవసరమైన నైతిక బలం చేకూరుస్తున్నాడు. బాబ్రీ మసీదు విధ్వంసానికి చలించిన సోమసుందర్ విశ్వ మానవుడుగా నిలబడి మతాధిక్యతను చండాడటం తన ఆలోచనా సరళికి రూపునద్దిందనవచ్చు

3.4 రక్షరేఖ:

రెండో ప్రపంచయుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. కొన్ని లక్షల మందిని బలిగింది. అభివృద్ధి చెందిన సాంకేతిక వైజ్ఞానిక పరిజ్ఞానం వెర్రితలలు వేసి మానవ వినాశనానికి సహకరించింది. 1935 స్పెయిన్ అంతర్యుద్ధ దశ నుండి ఫాసిస్టులు రెండో ప్రపంచ యుద్ధానికి పునాదులు వేశారు. అప్పటికే రూపం ధరించిన ఐన్స్టీన్ 'సాపేక్ష సిద్ధాంతం' పరిశీలనలోకి వచ్చిన సిగ్మండ్ ప్రాయిడ్ మానవ మనస్తత్త్వ విశ్లేషణా సిద్ధాంతాలు జర్మన్ నాజీ హిట్లర్కు ఉపయోగపడ్డాయి. జాతి వైరుధ్యాలు, ప్రపంచాధిపత్యం కోసం చేసిన ప్రయత్నాలు మానవ మారణ హోమాలను సృష్టించాయి. విశ్వాన్ని భయం గుప్పిట్లోకి నెట్టేశాయి.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐన్స్పీన్ సిద్ధాంతానికి వికృతి లబించి అణ్వస్త్రం తయారైంది. ఆ అస్త్రాన్ని ఏకపక్షంగా సామ్రాజ్యవాద అమెరికా ప్రయోగించి హిరోషిమా, నాగసాకి నగరాలను ధ్వంసం చేసింది. ఈ అస్త్రం లక్షల మందిని పొట్టన బెట్టుకుంది. మిగిలిన వాళ్ళను రోగ పీడితుల్ని చేసింది.

వికసించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సామ్రాజ్యవాద దేశాలు మానవ వినాశనానికి ఉపయోగిస్తున్నాయి. కవులూ, కళాకారులు, మేధావులు, ఆశించిన అభివృద్ధికి భిన్నంగా అమానవీయ హింస పేట్రేగిపోతోంది. సామ్రాజ్యవాదం కొరియాను హోమం చేసి, వియత్నాం వీరులను కాల రాసింది. ఇంగ్లాండు, బెల్జియం ఫ్రాన్స్ దేశాల వలస వాదానికి విశ్వం నెత్తిపై నెత్తుటి ధారలు మిగిలాయి.

ఈ నేపథ్యంలో పరిపూర్ణ శాంతిని కోరుతూ వర్తమాన ప్రపంచానికి రక్షణ కవచం తొడగాలనే సంకల్పంతో డాక్టర్ ఆవంత్స సోమసుందర్ రాసిన కావ్యం ' రక్ష రేఖ'.

"అలనాడెక్కడో చూచినా కాలకూట 

విషతిక్త కషాయాలు నరరూప వేషాడంబరాలు 

ఎక్కడ చూచినా కోమల కపోల పాళిని 

కశ్మల మొనరించే అశ్రుధారా ప్రవాహాల"ను చూపిస్తుంది రక్షరేక. ధూర్త విశ్వాసాలకు, కుటిల నీతులకు ధనాశాపరులకు జీవిత సత్యాలను బోధిస్తూ...

"శూన్య హస్తాలతోనే మట్టిలో కలిసిపోతామన్న 

సత్యాన్ని మరిచిపోతారు ఆత్మను చంపేసిన వాడికి 

ఆధ్యాత్మికత నీటి మూట, దూరాశల గాలియీత” అంటుంది.

పుట్టుక ముందు, చావు తర్వాత ఏమీలేని, ఏమీ కాని మనిషి ఈ రెంటి మధ్య వికృత దురాగతానికి ఎందుకు పాల్పడతాడో తెలుసుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తిందిక్కడ.

 ఆటవిక నీతి, శిశుహత్యలు, నారీ హననాలు, 'వ్యాఘ్రగుణం' వదులుకోలేని మనషులు సమాజంలో కల్లోలం పుట్టిస్తున్నారు. అణువిచ్ఛేదన శక్తితో అంతర్భాహిర ఏకపక్ష పోరాటాలతో మానవ జాతి నలిగిపోతోంది. వీటన్నిటి నుండి ప్రపంచానికి స్వేచ్ఛ కావాలని కోరుకుంటుందీ కవిత.

 "కోటి కోట్ల జీవరాశుల దప్పితీర్చి 

పరిపోషించి మంగళాంతంగా జలనిధుల చేరి 

రేపటి వానలకై, మాపటి కామనలకై 

దాచుకున్న యోజనాలై సుస్థిర సంకల్పాలై 

కల్పాంతం వరకూ ఇలాగే ఇలాగే మనిషికి నీరాజనం పడుతూ

వెన్నెల నెలవులందిస్తూ సాగే.."- ధరిత్రిని కోరుకుంటుంది సోమసుందర్ రక్ష రేఖ. 

3.5 హృదయంలో హిరోషిమా: 

ప్రపంచంలో జరుగుతున్న ఘోర సంఘటనలు ప్రగతి వాదులను ఎట్లా ప్రభావితం చేస్తాయో 'హృదయంలో హిరోషిమా' కవిత చిత్రించింది. విపరీత ధోరణులకు సిద్ధపడుతున్న బీభత్సవాదులు మానవజాతిని సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డారు. 1945 ఆగష్టు 6 తేదీ ఉదయం 8.20 నిమిషాలకు హిరోషిమా నగరం అణుబాంబు దాటికి ఛిన్నాభిన్నమైంది. సామ్రాజ్యవాదులు "మిత్రపక్షాలకు తెలియనీకుండా, అతి గోప్యంగా కుట్రగా తమ అణ్వస్త్ర పాటవ శక్తిని పరీక్షించుకొందుకు అమెరికన్ సామ్రాజ్య బాస్టర్డు ఏకపక్ష నిర్ణయంగా హిరోషిమా నగరం పై మొదటి అణుబాంబును ప్రయోగించారు. మనుషుల్ని ఎలుకలుగా, గిన్నిపిగ్స్ గా సర్వనాశనం చేశారు." ఇంత ఘోర విపత్తుకు కారణమైన సామ్రాజ్యవాదాన్ని తీవ్రంగా నిరసిస్తూ, మానవ శాంతికి అవసరమైన ప్రాతిపదికలను అన్వేషిస్తుంది. హృదయంలో హిరోషిమా (1997) కవిత.

"సోమసుందర్ తరం కవుల్లో ఒక్క అనిశెట్టి సుబ్బారావు మాత్రమే అణు సంగీతం అనే ఒక విషాదాత్మక విపుల కావ్యం రాశాడు. ఆంగ్ల కవయిత్రి 'ఎడిల్సెట్వెల్' మాత్రమే 'ది ఏటమిక్ ఏజ్' అనే సుదీర్ఘ కావ్యం రచించింది."(హృదయంలో హీరోషిమా అవతారిక)

మనిషిని మనిషే ఇంత పెద్ద ఎత్తున బలిగొన్న సంఘటన హిరోషిమాలో మొట్టమొదట జరిగింది. ఇంత ప్రళయాంతక మానవ విపత్తు గతంలో ఎప్పుడూ జరగలేదు. లక్షలాది మంది నిమిషాల్లో శవాలై తేలిపోయారు. ఇది జరిగిన రెండు రోజులకు 'నాగసాకి' నగరంపై ఇదే వరస దాడి జరిగింది. మానవ జాతిని కలిచివేసిన అణ్వస్త్ర మృత్యుతాండవం యావత్ ప్రపంచాన్ని నిశ్చేతన మొనర్చింది. ఈ బీభత్స కాండను పత్రికలు విస్తృతంగా ప్రచురించాయి. ఈ విపత్తు కలిగించిన వ్యథ సోమసుందర్ 'హృదయంలో హిరోషిమా'గా బయటపడింది.

"శతాబ్దాల చరిత్రలో తరతరాలుగా నిర్మించుకొన్న నాగరికత సమిష్టి హృదయంలో పూచిన సంస్కారం

సర్వం క్షణంలో మసై, శూన్యమై" మిగిలిపోయిన చిత్రమైన విపత్తు. అన్న వస్త్రాలకు కరువైన ఈ ప్రపంచం నిండా అణ్వస్త్రాలు పండటం కవికి మింగుడు పడని అంశం.

"చేయని నేరం కోసం వేయబడిన శిక్షలాగ 

ఒక్కమారుగా బ్రహ్మాండం కూల్చే 

ఆశని పాతం దుమికిన వేళ 

మహోత్సాహం ప్రళయ కాల విషహాసం"గా

మిగలడం ఎంతవరకు సమంజసం? 'జీవ ఝుంకార ధ్వనులన్నిటినీ ఒక్కపెట్టున మాయం చేసిన అవధిలేని దుర్మాగర్గాన్ని కవి ప్రశ్నిస్తాడు. ఈ బీభత్సానికి 'పచ్చని జీవనమంతా నిర్దూమధామంగా మారి 'తిమిరం కమ్మిన ఉదయం' జీవకాంతి కోల్పోవడాన్ని దర్శిస్తుందీ కవిత.

"గాలి భయం 

వెలుగు భయం 

కొన్ని రోజులు వరకూ ఎడతెరిపి లేకుండా 

రాలిపడుతున్న మానవ శరీర ఖండాలతో 

ఆకాశం భయం

చీకటి నూతులేర్పడి 

ఏదోదుస్సహవాదులు వెలువడే 

భూమి భయం సర్వ కలుషిత మైపోయి

నీరు సరే భయం భయం."

అంటూ అణ్వస్త్ర దాడిలో భయకంపితం అయిపోయిన ప్రపంచాన్ని చూపిస్తాను. ఇలాంటి మారణ హోమాలకు దూరంగా ఉండాలని పిలుపునిస్తాడు.

3.6 ధూపఛాయ:

 'సమీప గతంలో బీభత్స వాదులైన ప్రజా యుద్ధ వాదులు - ఒక

ఎక్స్ప్రెస్ ట్రెయిన్లో స్త్రీల బోగీలో టైమ్బాంబు పెట్టి ఒక మరపు రాని

దారుణ హింసా కాండకు కారకులయ్యారు. వారు చెప్పుకొనే వర్గ శత్రు నిర్మూలనం అనే మహదాశయం - ఈ నిరాధులైన స్త్రీల, శిశువుల దారుణ హత్యాకాండతో ఎలా నెరవేరిందో అర్ధంకాదు. శాస్త్రీయ సామ్యవాద వ్యవస్థ ఉత్తమ మానవతా మూల్యాలను సంరక్షించే సౌమ్యతర వ్యవస్థ. అట్టి ఉత్తమ వ్యవస్థను రక్తపంకిలమైన హింసామార్గంతో ఎలా సాధించగలరో అలా సాధించిన గమ్యం ఎలా సౌమనస్య వాతావరణాన్ని సృజించగలదో అర్ధంకాదు' అని తలంచాడు. ఆ సంఘటన జరిగిన నాటి నుంచి సోమ సుందర్ హృదయం విపరీతంగా క్షోభించింది. పీడకలల దురాక్రమణతో ప్రశాంత నిద్రకు కూడా కరువేర్పడింది. 1996 జూన్లో ఈ కావ్యం రచించే వరకూ ఆ స్థితి కొనసాగిందని ముందుమాటలో చెప్పుకున్నాడు.

ఈ కావ్యానికి ప్రధాన సంఘటనగా నిలబడిన రైలు ప్రమాదం గురించి కూడా కొంత తెలుసుకోవాలి. రైలు బండిలో స్త్రీల బోగీలో పేలిన బాంబు 'మహాగ్ర పీడన శక్తితో రెండు పిడుగులు' పడినట్టు 'పేలిపోయాయి. ఆ రాత్రి కాళరాత్రిగా మారిపోయింది. 'ధూపఛాయా వినిర్గత సంకాశం'గా ఆకాశం మారింది. విగత జీవులనూ, విచ్ఛిన్న దేహాలనూ ముక్కలైన బోగీలనూ, మిగిలిన హృదయ విదారక దృశ్యాలు కావ్యగతమై పాఠకుడికి కంటతడి పెట్టిస్తాయి. ఈ సమయంలో కవిలో పొంగిన ఆవేశం కట్టలు తెంచుకోవడం చూడవచ్చు.

"దోపిడీలు చేసి ఆధునిక ఆయుధాలు కొన్నది అమెరికా నుంచేనా? ఎన్కౌంటర్ల పేరుతో చుట్టు ముడుతున్న పోలీసుల్నీ ఇటు వారిపై కక్షతీర్చుకుందుకు సోదర జనానీక సహస్రాన్నీ నిహితులను చేస్తున్నారే ఎదురు నిర్వచించినదీ విప్లవ హింస? ఏ దుష్కృతుల వినాశనార్థమీ యజ్ఞం"

పోలీసుల మధ్య, నక్సలైట్ల మధ్య సాగుతున్న ప్రతీకార యుద్ధం సాధారణ పౌరుల్ని బలిగొంటోంది. దీన్ని ఖండిస్తూ హింసను ప్రోత్సహించే దుష్టశక్తులపై పోరాటానికి సోమసుందర్ నడుంకడతాడు. సామాజిక దోపిడి నుండి శ్రమజీవుల్ని రక్షించడం కోసం, మానవతా సామ్యవాదాన్ని బతికించడం కోసం సోమసుందర్ ప్రయత్నిస్తాడు.

'దయారహిత మృత్యుఛాయల్లా' వెంటాడే డేగలను, గద్దలను, రాబందులను, ఇంకోవైపు విప్లవమని చెప్పుకుంటున్న నిరహంతకులను ఈ దేశం ఎంతో కాలం భరించదని హెచ్చరిస్తాడు. "సర్వమానవ శ్రేణులను చేరబిలిచి జీవన సురభిళమందిస్తూ 

స్నేహ మధువు తాగిస్తూ సామూహిక గానంగా 

సాక్షాదింద్ర చాపంగా విజయోత్సవ కృత్యంగా 

సాగనీయి తల్లీ మిగిలిన మేమే మేమే.... మేమే....." అంటూ రావాల్సిన భవిష్యత్ రూపాన్ని అవలోకిస్తాడు.

సోమసుందర్లో తొణికిసలాడే మానవతాగుణం నిరంతరం స్పందిస్తూనే ఉంటుంది. ఏమూల మానవతకు ఆటంకం కలిగినా నేనున్నానంటూ ముందుకొస్తాడు. ఈ స్పందన ఆయన కవిగా మారినప్పటి నుండీ ఉంది. ఈ స్పందన లేకుంటే నైజాం నవాబు పై వజ్రాయుధం సారించే వాడు కాదు. కుల, మత, వర్గాల కతీతంగా సర్వమానవ శ్రేయస్సును కోరి విశ్వకవిగా సాక్షాత్కరిస్తాడు.

3.7 జీవనలిపి:

ఆంవత్స సోమసుందర్ సాహితీ జీవితాన్ని ప్రతిఫలించిన సంపూర్ణ 'కావ్యం 'జీవనలిపి' జీవితంతో పెనవేసుకున్న సుఖదుఃఖాలను సమర్థంగా వ్యక్తీకరించింది ఈ కావ్యం. కవి తను అనుభవించిన సాహితీ జీవితాన్ని అక్షరాల్లోకి తర్జుమా చేసింది జీవనలిపి. అక్షరాలను అణుబాంబుల్లా పేల్చడమే కాదు, అందమైన పువ్వుల్లా అవధరించిన నర్తకీమణుల్లా అక్షరాలను ఆడించిన కావ్యం జీవనలిపి. ఇదొక ప్రయోగాత్మక కావ్యం.

ప్రఖ్యాత వంగకవి ప్రొఫెసర్ బుద్ధదేవ్ బోస్ రాసిన తన సాహితీ జీవితాన్ని 'ఆలోక్ రంజాన్ గుప్తా' ఆంగ్లంలోకి అనువదించాడు. బుద్ధదేవ్ రాసిన 'పాండులిపి' గురించి రంజన్ ప్రస్తావించడాన్ని చదివినప్పుడు 'జీవనలిపి' అనే మాట తన ఆలోచనల్లో మెదిలిందని సోమసుందర్ జీవనలిపి కావ్య ప్రస్తావనలోనే చెప్పుకున్నారు. ఈ కావ్యాన్ని ఆంధ్రప్రభలో 1986 నుండి 1977 వరకు అప్పుడప్పుడూ భాగాలుగా ప్రచురించారు. సోమసుందర్తో కలిసి యాత్రించిన దర్భారాంషా ఆయన సతీమణి శిరీష దంపతులకు కావ్యాన్ని అంకితం చేశాడు.

ఈ కావ్యాన్ని ఐదు అంకాలుగా విభజించి జీవన పరిణామాన్ని చిత్రించాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి, నిశాంతం, అనే ఐదు భాగాలూ దిన క్రమంలో వచ్చేవే. అవి జీవన క్రమానికి ప్రతీకలుగా భాసిస్తాయి.

కావ్యాన్ని మనిషిని చేసి సమాజ రంగస్థలం పై నిలబెడతాడు. ప్రారంభంలోనే...

"నా నాల్క బాల్కనీలో 

ఆశీనులైన సుశబ్ద సుందరాంగులారా 

లేవండి నర్తించండి 

నా జీవన లిపిని ధరించండి. 

సుమాహార్యంగా 

ఇదే శివానంద రాత్రి అవధరించండి 

ఇదే మనోజ్ఞ కళాధరిత్రి తరించండి" అంటూ తనలో కొలువున్న సాహితీ మణుల్ని ఆజ్ఞాపిస్తాడు. జీవన యానంలో ఎదురొచ్చిన మంచి చెడ్డల్ని సమదృష్టితో తూచి నిరూపించే ప్రయత్నం చేశాడు.

"తీరిన కోర్కెలు వెక్కసమై

తీరని కోర్కెలను వెక్కిరిస్తూ

బ్రతుకే నాగచెముడు డొంకై

పరిహసిస్తుంటే ఏ కోమల గాంధర్వం రచించను" అని మానవ మానసికావస్థను చిత్రిస్తాడు. చరిత్ర సృష్టించడం కోసం పుట్టిన మహానుభావులు త్యాగాలకు, కష్టాలకు వెనుకాడరు. సోమసుందర్ భవిష్యత్తుకోసం కలలుగనే వ్యక్తిగా 'తీయగా పాడటం కోసం బ్రతుకు బ్రతుకంతా వేపచివుళ్ళార' గిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.

'వర్తమాన కాలుష్యాలన్నిటికీ ప్రాతినిధ్యం కల్పిస్తూ సాగితే తన వీధి నాటకం శృంగాటకంలోనే తనకు మరణ దండన విధిస్తుందని వాస్తవ రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తాడు. వేదాలు పుట్టిన ఈ కర్మ భూమిపై హత్యే పరిష్కారంగా మలుచుకున్న దయనీయ పరిస్థితిని చిత్రిస్తాడు'.

నీతి నియమాలకు కట్టుబడి నడిచే వాణ్ణి ఈ ప్రపంచం బతకనివ్వదని వాపోయాడు.

"ఒంటరి బాటసారిగా దొరికిన నన్ను 

నెత్తురుగా గడ్డకట్టిస్తోంది కాలం 

కుట్ర మొగాల దొంగమబ్బులు 

దాచేస్తున్నాయి సూర్యుణ్ణి." వ్యవస్థ పై ఒంటరి పోరాటం ఎంత కష్టంగా ఉంటుందో తెలియజేస్తాడు.

తన చుట్టూ ఆవహిస్తున్న సామాజిక సంక్షోభాలు సోమసందర్ ను కలవరపెట్టాయి. దేశంలో పెరుగుతున్న అశాంతి మతతత్వ దౌర్జన్యాలు రౌడీయిజం రాజకీయ గూండాయిజం వంటివి ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని ఆవేదన చెందుతాడు. వాటికి తోడు కాలదోషం పట్టిన సంప్రదాయాలను భుజాన మోస్తూ మనిషి వెనక్కి నడవడానికి ఆక్షేపిస్తాడు. 

"ఒసే! అంతరాత్మా! నిద్రపోకు లార్వాలా 

విజృంభించు లావాలా" అంటూ ఆత్మబోధ చేసుకుంటాడు.

"అదిగో తూరుపు మొగసాలలో 

చీకట్లు విరుగుతున్నట్లు - జేవురు రంగులు 

దిగంతాలలో విహాయసం పచరిస్తున్నట్లు 

రంగురంగుల చూపులు జాగృతికలనాదం సంతరిస్తునట్లు" ఆశావహ దృక్పథంతో ముందుకు నడవమంటాడు. జీవన ప్రవాహంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని ముందుకు నడవాలనే సందేశాన్ని జీవనలిపి కావ్యం ఇస్తుంది.

4. ముగింపు:

  • రామాయణ మహాభారతాల నుండి ప్రబంధాల వరకు ఇంకా చెప్పాలంటే ఆధునిక ప్రక్రియలు ఏర్పడినంతవరకు కవిత్వం, కథ తెలిసే నడిచాయి. ఇవన్నీ కూడా దీర్ఘకావ్యాలకు పూర్వ రూపాలే.
  • భావోద్వేగాలను అక్షరీకరించే కవిత్వం, విస్తృతమైన సామాజికాంశాల నేపథ్యం కలిస్తే దీర్ఘకావ్యం లేదా దీర్ఘ కవిత అవుతుందని అర్థం చేసుకోవచ్చు.
  • సామాజిక అంశాలపై సుదీర్ఘ సందేశాలు చేయాల్సి వచ్చిన తరుణంలో సోమ సుందర్ దీర్ఘ కవిత్వ రచనకు పూనుకున్నట్టు ఆయన కావ్యాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.
  • సామాజిక పరిస్థితులు తారుమారైనప్పుడు, మానవ విలువలు మంట కలిసినప్పుడు, ప్రకృతి విపత్తులు మానవ కల్పిత వైపరీత్యాలు మనిషిని నాశనం చేయడానికి పూనుకున్నప్పుడు ఆయన తీసుకున్న కవితా ప్రక్రియ దీర్ఘ కవితగా గుర్తించవచ్చు.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఈశ్వరరెడ్డి, ఎన్. (2006). సోమ సుందర్ సాహిత్య దృక్పథం. స్వీయ ప్రచురణ.
  2. రామకృష్ణ మిరియాల (2007). సోమసుందర్ పరిణామక్రమం. డాక్టర్ ఆవంత్స సోమసుందర్ లిటరరీ ట్రస్ట్, పిఠాపురం.
  3. సోమసుందర్, ఆవంత్స. (1994). గంధమాదనం: శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం.
  4. పైదే. (1994).  చేతావనీ. భాగ్య ప్రచురణలు, మచిలీపట్నం.
  5. పైదే. (1997). ధూపఛాయ. కళాకేళి నికేతన్, పిఠాపురం
  6. పైదే. (ప్రథమ ముద్రణ 1958). రక్తాక్షి. కళాకేళి ప్రచురణలు, పిఠాపురం.
  7. పైదే. (ప్రథమ ముద్రణ 1996). రక్షరేఖ. కళాకేళి ప్రచురణలు, పిఠాపురం.
  8. పైదే. (ప్రథమ ముద్రణ 1997). జీవనలిపి. కళాకేళి ప్రచురణలు, పిఠాపురం.
  9. పైదే. (ప్రథమ ముద్రణ 1997). హృదయంలో హిరోషిమా. అభ్యుదయ రచయితల సంఘం, విశాఖపట్నం.
  10. పైదే. (రచనా కాలం 1977).  సోమసుందర్ బృహత్కావ్యాలు. కళాకేళి ప్రచురణలు, పిఠాపురం.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "February-2025" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-January-2025

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "FEBRUARY-2025" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.


Letter of Support - Format
[for Research Scholars only]