headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

"కమనీయం తెలుగు రామాయణం"

జాతీయసదస్సు నవంబర్-2023 ప్రత్యేకసంచిక

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.)

AUCHITHYAM | Volume-4 | Issue-15 | December 2023 (Special Issue) | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. ‘అనుమాండ్ల భూమయ్య’ రామకథా కావ్యాలు: సూక్ష్మాంశశోధనలు

డా. తత్వాది ప్రమోద కుమార్

అసోసియేట్ ప్రొఫెసర్,
ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కరీంనగర్,
కరీంనగర్, తెలంగాణ.
సెల్: +91 9441024607, Email: thatwadi@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యంలో పేర్కొన్న ఘట్టాలను పాత్రలను ఆధారంగా చేసుకొని, తెలుగు కవులు రచయితలు రామ సంబంధ రచనలు విస్తృతంగా రచించినారు. అలా తెలుగులో రామ కథా సంబంధమైన శతకాలు కావ్యాలు, కథలు, నవలలు కోకొల్లలుగా వెలువడినాయి. రామాయణ కావ్యం లోని పాత్రలను ఆధారంగా చేసుకుని ఆచార్య అనుమాండ్ల భూమయ్య జ్వలిత కౌసల్య, త్రిజట, కబంధమూక్షము అనే చిరుకావ్యాలను రచించినారు. వాల్మీకి మహర్షి ప్రవచించిన రామాయణ కావ్య పరమార్ధాన్ని సూక్ష్మాంశాలుగా శోధించి తెలుసుకొని వాటిని ఈ కావ్యాల ద్వారా పాఠకులకు అందించినారు. ఈ కావ్యాలలో ఆయా పాత్రల మనో విశ్లేషణ కథాక్రమాన్ని నడిపించిన తీరు పద్య రచనలు పద ప్రయోగాలు భూమయ్య చూపిన నేర్పు కథలో చేసిన మార్పులు సామాజిక ప్రయోజనాలను పాఠకులకు అందించినతీరును తెలియజేయడమే వ్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం.

Keywords: రామాయణం, వాల్మీకి మహర్షి, అనుమాండ్ల, భూమయ్య, జ్వలితకౌసల్య, త్రిజట, కబంధుడు, ఏకపత్నీ వ్రతం, ఆత్మవివేచన, దానవత్వం, మానవత్వం, దైవత్వం.

1. ఉపోద్ఘాతం:

భారతీయ నాగరికతా సంస్కృతులకు వేదాలు ఉపనిషత్తులు రామాయణ మహాభారతాది ఇతిహాసాలు మూలం.  వాల్మీకిమహర్షి ముఖతః వెలువడిన రామాయణం అచ్చమైన మర్యాదా మానవ మూర్తిమత్వానికి ప్రతీక.  రామాయణ కావ్యంలో రాముడు మొదలుకొని విభీషణుని వరకు అనేకమైన పాత్రలను వాల్మీకిమహర్షి సృజించినాడు.  కావ్య ప్రయోజనాలు కథా పరిమితుల దృష్ట్యా కావ్యంలోని అన్ని పాత్రలు పూర్తిస్థాయి పాత్ర చిత్రణకు నోచుకోలేవు. ఆ కారణంగానే కౌసల్య, సుమిత్ర, శాంత, శబరి, అహల్య, మంథర, తాటకి, త్రిజట, భరతుడు, శత్రుఘ్నుడు, గుహుడు, కబంధుడు, సుబాహు మొదలైన పాత్రలు పూర్తిస్థాయిగా రామాయణంలో  పాఠకులకు కనిపించవు. స్వల్పంగా మెరిసిపోయే ఆయా పాత్రల స్వభావాన్ని పాత్రల ఔన్నత్యాన్ని గుర్తించడం సాధారణ పాఠకులకు కష్టసాధ్యం. సాధారణ పాఠకులు కథా గమనాన్ని మాత్రమే అనుసరిస్తారు. విమర్శకులు కావ్య అంతరార్థాన్ని పరికిస్తారు. సహృదయ పాఠకులు/విమర్శకులు అంతరార్థంలోని పరమార్ధాన్ని దర్శిస్తారు. “Look between the lines. Read between the words. The most important things are left unsaid and unheard”. కావ్యఅంతరార్థాన్ని, అంతరార్థంలోని పరమార్ధాన్ని దర్శించిన సహృదయుని ముఖతః విశేషాంశాలు వెల్లడవుతాయి. ఆ సహృదయుడు కవితా రస హృదయుడైతే అవి కావ్యంగా కవిత్వంగా రూపుదిద్దుకుంటాయి. ఎందరో కవి పండితులు వైవిధ్యభరితమైన ఆయా పాత్రలను ప్రధానంగా చేసుకొని ఆయా పాత్రల స్వభావాలను ఆ పాత్రల యొక్క అంతరంగ విశ్లేషణతో కథా కావ్యాలను రచించిన వారు ఉన్నారు. అలాగే కవి పండితులైన ఆచార్య అనుమాండ్ల భూమయ్య  చేతిలో జ్వలిత కౌసల్య, త్రిజట, కబంధమూక్షము అనే  రామకథా కావ్యాలు రూపుదిద్దుకున్నాయి.

అధ్యాపకుడిగా, విశ్వవిద్యాలయ ఆచార్యుడిగా, విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడిగా, అంతకుమించి పరిశోధకుడిగా, విమర్శకుడిగా పద్యగేయ కవిగా  ఆచార్య అనుమాండ్లభూమయ్య  కీర్తి ప్రతిష్ఠులైనారు. 1994 మొదలుకొని ఇప్పటివరకు వారు 16 పద్య రచనలు చేసినారు. అందులో జ్వలిత కౌసల్య, త్రిజట, కబంధమోక్షము అనే మూడు రామకథ సంబంధమైన కావ్యాలు.

2. కావ్య వస్తువు:

2.1  జ్వలిత కౌసల్య:

అవతార మూర్తి శ్రీరామచంద్రుని కన్నతల్లి కౌసల్య. రాజు కావలసిన కన్న కొడుకు వనవాస విషయం తెలిసిన తల్లి కౌసల్య ఆవేదనకు అక్షర రూపమే జ్వలిత కౌసల్య కావ్యం. ఇది 109 పద్యాల కావ్యం.
శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ మేరకు పినతల్లి భవనం చేరుకొని, కైకేయి చెప్పిన విధంగా వనవాసానికి సిద్ధమవుతాడు. వనవాస గమనానికై రాముడు తల్లి కౌసల్య అనుమతి తీసుకోవడానికి కౌసల్య భవనానికి చేరుకొనడంతో కథ ప్రారంభమవుతుంది. తల్లి పాదాలకు నమస్కరించి కైకేయ మాటలను ప్రస్తావించి తల్లి అనుమతి కోరినాడు రాముడు. రాముని మాటలు విన్న కౌసల్య హతాశురాలై “స్వర్గమున నుండి పడిన దేవతయ వోలె  నేల పడిపోయినది.”1  రాముడు ఆ తల్లి నెత్తి నిలిపినాడు. అలా తనను ఉద్ధరించిన కొడుకును చూసి కౌసల్య ఉద్విగ్న మనస్కయై  తన దుఃఖాన్ని వెళ్లకక్కుతుంది.

మీ తండ్రి దశరథుని ఇంట కాలు మోపినది మొదలు తనకు సుఖము లేదని, నిన్ను కన్న తర్వాతనే సుఖానుభూతి పొందినానని, నీపై ప్రేమానురాగాలు చూపిస్తూ తన బాధలన్నీ మర్చిపోయినానని రామునితో చెప్పుకున్నది. రాముడు రాజ్యం చేస్తే చూడాలని తలపుల్లో ఉన్న కారణంతో ఉన్న కౌసల్య రామ వనవాస వార్త భరింపరానిదైంది. తాను పడిన కష్టాలను భర్త చూపిన నిర్లక్ష్యాన్ని, సపత్నులు చేసిన అవమానాలను రాముని ఎదుట వెల్లబోసుకున్నది. తల్లడిల్లుతున్న మాతృమూర్తి హృదయ వేదన తల్లి మాటల ద్వారా గమనించిన రాముడు తన ఎదలో పొంగిపొర్లుతున్న దుఃఖాన్ని స్థిరచిత్తం తో అణచుకున్నాడు. కానీ లక్ష్మణుడు మాత్రం క్రోధావేశుడైనాడు. తండ్రి చేసినది అధర్మమని “తండ్రి ప్రేమను మూలకు పెట్టి తండ్రిని బంధింతునని”2 అనంత క్రోధాన్ని వ్యక్తపరిచినాడు. లక్ష్మణుని ఆవేశపు పలుకులు కౌసల్యకు న్యాయమనిపించినాయి. తండ్రి ఆజ్ఞ వలెనే తల్లి మాట కూడా జవదాటకూడదని అంటూ రాముడు అడవికి వెళ్లడానికి కౌసల్య అనుమతించలేదు. ఒకవేళ రాముడు వెళితే రాముని తో పాటు తాను కూడా వస్తానని కౌసల్య పేర్కొంది. తల్లి కౌసల్య హృదయంలో రగులుతున్న బాధానల జ్వాలలను కౌసల్య మాట వల్ల రామచంద్రుడు గ్రహించినాడు. ఆ బాధానల జ్వాలలకు తండ్రి దశరథుని బహుభార్యాత్వమే మూలమని గ్రహించినాడు. అందువల్ల వెంటనే రాముడుదృఢ హృదయుడై “గడిచినట్టి కాలమ్మేదొ  గడిచిపోయె  ఒక్క సీతయే  ఈ జన్మకున్న భార్య”3 అని ప్రతిజ్ఞ చేసినాడు. రాముని ప్రతిజ్ఞ వల్ల కౌసల్య దుఃఖం పరితాపం తొలిగిపోయింది. ప్రశాంత హృదయ అయిన  కౌసల్య రామునికి వనవాస గమనానికై అనుమతినిచ్చింది. “స్వస్తి రఘురామ! నా తండ్రి! స్వస్తి నీకు”4  అని మంగళాశాసనం పలకడంతో కావ్యం ముగుస్తున్నది.

2.2 త్రిజట:

త్రిజట సాధారణ రాక్షస వనిత. రావణుని ఆజ్ఞచే  అశోకవనంలో ఉన్న సీతాదేవికి కాపలాగా ఉన్న రాక్షస స్త్రీలలో ఒకరు. రావణాది రాక్షసుల వినాశనాన్ని రామచంద్రుని విజయాన్ని త్రిజట ఆ కలలో దర్శిస్తుంది. స్వప్నవృత్తాంతాన్ని తోటి రాక్షస స్త్రీలకు ఎరిగించడం ద్వారా వాల్మీకి మహర్షి భవిష్యత్ కథా సారాన్ని పాఠకులకు సూచనామాత్రంగా తెలియజేసినాడు. ఇది సుందరకాండలోని వృత్తాంతం. ఆచార్య అనుమాండ్ల భూమయ్య  త్రిజట వృత్తాంతాన్ని మూలంలో ఉన్నట్లు యథాతథంగా స్వీకరించినారు. 

కథాగమనంలో మార్పు చేయలేదు కాని త్రిజట పాత్రకు వన్నెలు దిద్దినారు. జన్మ సంస్కారాన్ని కలిగిన రాక్షసిగా, జన్మ సంస్కార ఫలితంగా ఆత్మ దర్శనం చేసుకున్న ఉత్తమ మనిషిగా, తద్వారా భగవత్ సాక్షాత్కారాన్ని పొందడానికి తపించిన దైవగుణ సంపన్నురాలిగా త్రిజటను భూమయ్య తీర్చిదిద్దినారు.

సీతాన్వేషణలో భాగంగా ఆంజనేయుడు లంకలో కాలు మోపడంతో కావ్యం ప్రారంభమవుతుంది. రావణుడు సీతను హెచ్చరిస్తాడు. సీత గడ్డిపరకను అడ్డుగా ఉంచుకుని సమాధానమిస్తుంది. ఈసమయంలో త్రిజట నిద్రపోతుంది. త్రిజట కన్న కలలో లంకా నగరంతో పాటు రావణాది రాక్షస వీరులందరూ వినాశమైనారు. శ్రీరాముడు పరబ్రహ్మస్వరూపంగా దర్శనం ఇచ్చినాడు. నిద్ర నుంచి మేల్కొన్న త్రిజట స్వప్నవృత్తాంతాన్ని తోటి రాక్షస స్త్రీలకు తెలియజేసింది. పరబ్రహ్మస్వరూపుడైన రామునిలో లీనం కావడమే జన్మకు ఫలితమని, అది ఫలించాలంటే సీతాదేవి అనుగ్రహం పొందాలని త్రిజట భావించింది. తోటి రాక్షస స్త్రీలకు సీతాదేవి పట్ల గౌరవభావాన్ని పెంపొందింప చేసింది. వారితో కలిసి సీతా దేవిని సేవిస్తూ ఆడింది పాడింది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన త్రిజట పరబ్రహ్మమైన రామునిలో ఐక్యం కావడానికి తపించింది. ఆ తపనతో ఆమెలో మొహశోకాలు నశించినాయి. ఆమెకు సర్వం రామమయంగా తోచింది. రామునికి అంజలింతునని పలికింది. ఆ మాటలను పలికిన త్రిజటను,త్రిజటహృదయంలో నెలకొన్న రామచంద్రుని దర్శించిన ఆంజనేయుడు “జయము రఘువంశ కీర్తికి జయము జయము”5  అంటూ స్వస్తి వాక్యాన్ని పలకడంతో కావ్యం ముగుస్తుంది.

2.3 కబంధమోక్షము:

వికృత రూపుడైన కబంధుని కథను వాల్మీకి మహర్షి రామాయణం లో అరణ్యకాండలో ఐదు సర్గల్లో ప్రస్తావించినాడు. ముల్లోకాలలో అందరినీ మించిన అందగాడైన కబంధుడు వికృతపుటాలోచనలతో వికృత శరీరాన్ని ధరించి మునులను, సాధువులను పరిహసిస్తుంటే స్థూలశిరుడు అనే మహర్షి శాపానికి గురవుతాడు. ఫలితంగా శాశ్వత వికృత శరీరుడౌతాడు. కబంధుడు మునిని ప్రాధేయపడి ప్రార్థించగా దశరథాత్ముజుడైన రాముడు నీ భుజాలను నరికి నిన్ను దహించినప్పుడు శాప విముక్తి కలుగుతుందని స్థూలశిరుడుశాప విముక్తి మార్గాన్ని తెలిపినాడు.

ఈ స్థితికి ముందుగానే కబంధుడు తపస్సు చేసి బ్రహ్మ దేవుని మెప్పించి దీర్ఘాయువును వరంగా పొందినాడు. ఆ వరగర్వంతో వికృతపుటాలోచనలు వికృతపు శరీరంకలిగిన  కబంధుడు తెలివిహీనుడై ఇంద్రుని ఎదిరించినాడు. ఇంద్రుడు కోపించి వజ్రాయుధంతో కబంధుని కాళ్లు చేతులు తొడలు శిరస్సు నరికి వేసి ప్రాణాలతో వదలినాడు.కబంధుని జీవిక కోసం పొడవైన చేతులను మాత్రం ఇంద్రుడు ప్రసాదించినాడు. ఆనాటి నుండి కబంధుడు మరింత వికృతుడై కదలక మెదలక బండ బతుకును ఈడుస్తాడు.

సీతాన్వేషణ విషయమై రామలక్ష్మణులు అరణ్యంలో సంచరిస్తూ కబంధుని నివాస ప్రాంతానికి చేరుకుంటారు. కబంధుని హస్తాల్లో చిక్కుకుంటారు రామలక్ష్మణులు కబంధుని హస్తాలను నరికి వేస్తారు. ముని వచించిన విధంగా శాప విముక్తి ప్రసాదించే రాముడే ఇతడు అని భావించి తనను దహించివేయుమని రామున్ని ప్రార్థిస్తాడు. కబంధుని ప్రార్థనపై రాముడు కబంధుని అగ్నికి ఆహుతి చేస్తాడు.పాప విముక్తితో నిజరూపం పొందిన కబంధుడు రాముని పట్ల కృతజ్ఞతాపూర్వుడై సుగ్రీవుని గురించి తెలియచేసి, సుగ్రీవుని నివాస మార్గాన్ని వివరిస్తాడు. తన జన్మకు ఉపకారం చేసిన రామునికి ప్రత్యుపకారం చేస్తాడు.

ఆచార్య అనుమాండ్ల భూమయ్య  కబంధుని కథను యధా మూలకంగానే అనువదించినారు. కాని  కథనంలో కొంత మార్పులు చేసినారు. కథనంతా కబంధుని చేత ఆత్మాశ్రయంగా రామునికి వినిపింప చేసినారు. కబంధుడు నిజరూపం పొందిన తర్వాత రామున్ని విష్ణుపరంగా స్తుతించినట్లు రచించినారు. ఇవి రెండు భూమయ్య  చేసిన మార్పులు.  కబంధుని చేత కథ  చెప్పించడం ద్వారా, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్న కబంధుని హృదయావేదనను జీవుని వేదనను భగవంతుని ఎదుట వెల్లబోసుకుని భగవంతుని అనుగ్రహంతో మోక్షాన్ని చేరవచ్చు అనే సూచనను ఈ కావ్యం ద్వారా భూమయ్య  వెల్లడించినారు.

3. కావ్య నిర్మాణం:

“అపారే కావ్యసంసారే కవిరేవ ప్రజాపతిః యధాస్మైరోచతే విశ్వం తథేదం పరివర్తతే” (ఆనందవర్ధనుడు)  కావ్యప్రపంచానికి సృష్టికర్త కవి తాను ఎంచుకున్న కథా భాగాన్ని అనుసరించి కవికథాక్రమాన్ని, కావ్యనిర్మాణానికి బాటలు ఏర్పరచుకుంటాడు. ఆచార్య అనుమాండ్ల భూమయ్య ఎన్నుకున్న ఈ రామకథలు వాల్మీకి మహర్షి రచించిన రామాయణాంతర్భాగ కథలు. ఇవి విస్తృత రామాయణకథలో కీలకమైన సంఘటనలు. ఈ చిన్న సంఘటనలను ఆధారంగా చేసుకుని కావ్య నిర్మాణం చేయడం కవి ప్రతిభకు ఓ పెద్ద పరిక్షే.  కాని ఆచార్య అనుమాండ్ల భూమయ్య  ఈ కావ్య కథలను ప్రణాళికాబద్ధంగా ఆవిష్కరించి కావ్య నిర్మాణాన్ని ఆకర్షణీయం చేసినారు
త్రిజట మినహా మిగిలిన రెండింటిలోనూ అనగా జ్వలిత కౌసల్య, కబంధ మోక్షంలో కథా గమనాన్ని కొన్ని ప్రకరణాలుగా పేర్కొన్నాడు. ప్రకరణ నామంతో పాఠకునికి కథాగమనం సులభంగా బోధపడుతుంది. కథా వేగం కూడా పెరిగినట్లు అవుతున్నది. బిగువు సడలకుండా కథను ముందుకు నడిపించినారు.

3.1 జ్వలిత కౌసల్య:

జ్వలిత కౌసల్యలో  ఎనిమిది ప్రకరణాలు ఉన్నాయి. కైకేయి వరంతో కథ ప్రారంభమవుతుంది.  వేదనాగ్ని భరితమైన హృదయం జ్వలితకౌసల్యగా మారింది. కౌసల్య హృదయవేదననువిన్న లక్ష్మణుడు భరించలేక పోయినాడు. అనంతక్రోధాగ్ని ప్రకటించినాడు. లక్ష్మణుని ప్రతిస్పందనతో కౌసల్య మాతృహృదయం పొంగి పొరలింది. రాముడు మాతృ ప్రేమను స్వీకరిస్తూనే పితృ వాక్య పరిపాలనకు కట్టుబడి నిలిచినాడు. తల్లిని ఒప్పించినాడు. పుత్రవాత్సల్యం ప్రదర్శించే కౌసల్యకు రాముడు ఏకపత్నివ్రతంతో ఉంటానని ప్రతిజ్ఞ చేసినాడు. కౌసల్య నోట మంగళాశాసనం పలికిస్తూ కథను మనోహర క్రమంగా తీర్చిదిద్దినారు. కవి కథా గమనంలో కావ్య నిర్మాణంలో పునరుక్తులు అనవసర బోధనలు లేవు. పాత్రల మనఃప్రవృత్తిని చిత్రించినతీరు పాఠకులకు ఆకర్షణీయం గా నిలుస్తున్నది.

3.2 త్రిజట:

త్రిజట కావ్యంలో ప్రకరణ విభజన లేదు. త్రిజట తాను కలలో కాంచిన విషయాన్ని తోటి రాక్షస స్త్రీలకు వివరిస్తుంది. వారిని కూడా సాత్వికమూర్తులుగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. ఆత్మోద్ధరణకైపరితపిస్తుంది.ఇది ఏకబిగిన సాగినకథ కథను 131 పద్యాలలో రచించినారు.
త్రిజట స్వప్న వృత్తాంతం వాల్మీకి రామాయణం సుందరకాండలో కేవలం 48 శ్లోకాలలో ప్రస్తావితమైంది. మూల కథలో మార్పు చేయలేదు. త్రిజట పాత్ర హృదయ సంస్కారాన్ని పరిపుష్టం చేయడంలో కవి  ప్రతిభను ప్రదర్శించినారు. అంతవరకు జరిగిన రామాయణ కథను ఆరు పద్యాల్లో త్రిజటముఖతః పలికించినారు. ఇది మూలంలో లేదు దీనివల్ల రాక్షస స్త్రీలకు రాముని గూర్చి పరిచయం చేయడంతో పాటు పాఠకులకు పూర్వగాథను గుర్తుచేసినట్లు (Remind) అవుతున్నది. “ఎరుగ రాక్షస జన్మ”6 అనే ఆత్మవికిత్సతో ప్రారంభమైన త్రిజట భావపరంపర “ఇది ఎల్ల రామ మయమైతే నాకు శోకము లేదు మోహము లేదు నాకు”7 అని ఆత్మ పరిణతి చెందిన వ్యక్తిగా కొనసాగినాయి. సర్వ సృష్టి రామమయంగా భావించిన త్రిజట నోట రామునికి అంజలింతునని పలికించడం అది విన్న ఆంజనేయుడు జయము జయము అని పలికి మంగళప్రదంగా కథను ముగించడం కావ్య నిర్మాణ నైపుణ్యమే.

3.3 కబంధమోక్షము:

11 ప్రకరణాలలో కబంధమోక్షము కథ విస్తరించింది కబంధునికి శ్రీరామ దర్శనముతో కావ్యకథ ప్రారంభమవుతుంది. మునిశాపము, బ్రహ్మ వరము, వజ్రఘాతము, పరితాపము, ఇలా చివరివరకు ఒక్కొక్క ప్రకరణలో కబంధుని ఆత్మవృత్తాంతం తో పాటు పశ్చాత్తాప హృదయాన్ని కవి ఆవిష్కరింప చేసినారు.
దేహాభిమానం, వరగర్వం వల్ల తామసుడైపోయిన కబంధుడు రామ దర్శనం వల్ల, రామానుగ్రహం వల్ల సాత్వికుడైనాడు. నిజరూప దారియైన కబంధుడు రాముని శ్రీమహావిష్ణువు పరంగా స్తుతించినాడు. ఇది మూలంలో లేదు. మహాభారతంలోని భీష్మ స్తవం ఆలంబనగా చేసుకుని రచించినారు. ఇది కబంధునిలోని చిత్త సంస్కారాన్ని పరిపూర్ణం చేస్తున్నది. ఆత్మజ్ఞానాన్ని తెలిసిన కబంధుడు “తొలగె దేహాత్మ భావన …….” 8 అని పలకడంతో కావ్య కథ ముగుస్తున్నది.
రామాయణ మహాకావ్యంలో సూక్ష్మరేఖాంశాలుగా ఉన్న ఈ మూడుకథలు కథలలోని పాత్రల మనఃప్రవృత్తిని ఆధారంగా చేసుకుని విశ్లేషణ పటిమతో ఆయా పాత్రలను విశేషమూర్తులుగా అనుమాండ్ల భూమయ్య తీర్చిదిద్దినారు. వాల్మీకి మహర్షి మనోగతాన్ని అర్థం చేసుకొని రామాయణ కథా పరమార్ధాన్ని పండితుల పాఠకుల హృదయాలలో వికసింప చేసినారు.

4. కావ్య శిల్పము:

ప్రాచీనాధునిక కావ్య శిల్ప విద్యను, కావ్య శిల్ప రహస్యాలను తెలిసిన ఆచార్య అనుమాండ్ల భూమయ్య  ఈ రెండింటిని సమన్వయిస్తూ రామకథ కావ్యాలను రచించడం గమనించదగిన విషయం. వస్తువు పాత్ర చిత్రణ, రసము, భాష, ఛందస్సు, అలంకారాలు మొదలైనవి ప్రాచీన కవిత్వంలో ప్రధానం. పాత్రల మనఃప్రవృత్తి, విశ్లేషణ, సరళ భాష, సామాజిక సందేశం మొదలైనవి ఆధునిక సాహిత్యంలో ప్రధానం.

జ్వలిత కౌసల్య, త్రిజట, కబంధమోక్షము ఈ కథావస్తువులన్నీ రామాయణ కావ్యం లోనివి అంటే ప్రసిద్ధమైన కథలే. కవి ఈ పాత్రల అంతరంగాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించడమే ఈ కావ్యాలలోని నూతనత్వం.

గారాల ముద్దుబిడ్డకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేని మాతృమూర్తి ఆవేదనతో పాటు బహు భార్యత్వం వల్ల సపత్నుల మధ్య ఉండే ఈర్ష్యా ద్వేషాలు, ఈసడింపులు, స్వేచ్ఛా విహీనత మొదలైన వాటిని జ్వలిత కౌసల్య లో గుర్తించవచ్చు. మాతృమూర్తి కౌసల్య ఆవేదన రామున్ని మహోన్నతమైనఆదర్శమూర్తిగా తీర్చిదిద్దింది. ”కైక మొదలైన వారు”9  బహు భార్యత్వం వల్ల సపత్నుల్లో కలతలు పెరుగుతాయి. పురుషులలో స్వేచ్ఛ తరిగిపోతుంది. అవన్నీ గుర్తించిన రాముడు “గడచినట్టి కాలమ్మేదొ  గడిచిపోయె”10 అని పలికినాడు. ఇది రామాయణ కథకు, రాముని మహోన్నత వ్యక్తిత్వానికి, ఆదర్శ మూర్తిమత్వానికి కీలకమైన సంఘటనగా నిలిచింది. రాముడు ఏక పత్నీవ్రతుడు అని రామాయణంలో వాల్మీకి మహర్షి సూటిగా స్పష్టంగా చెప్పలేదు. రాముని ప్రతిజ్ఞ మూలంలో లేదు. రంగనాథ రామాయణం, భాస్కర రామాయణం, మొల్ల రామాయణం, విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం మొదలైన తెలుగు రామయణాల్లోనూ లోను రాముని ప్రతిజ్ఞ లేదు. ఇది కవి నూతనంగా కల్పించినది. ఈ కల్పన రామునికి, రామాయణ కథకు కొలికి పూసగా గుర్తించాలి. ఇది అంగీకరించ దగిన కల్పన ఆని బేతవోలు రామబ్రహ్మం  పేర్కొన్నారు.11

రాక్షసస్త్రీ అయిన త్రిజట మానవత్వం కలిగిన మనిషిగా, దివ్యభావనలతో తపన కలిగిన దైవ మూర్తిగా చిత్రితమైంది. కామమెగసి తన్నుకుని వచ్చిన రావణుని చర్యలను ఈసడించుకుంది. రావణుని ఎదిరించ- లేకపోయినా సీతను బాధించకూడదని సహస్త్రీలకు తెలియజేసింది.

సీతారాముల దివ్యత్వాన్ని గుర్తించింది. అదే అనుసరణీయమని భావించింది. జన్మనేపథ్యం కాకుండా జన్మ సంస్కారం, ఆత్మసంస్కారంతో దానవత్వం నుండి మానవత్వం, మానవత్వం నుండి దైవత్వం వరకు జీవన ప్రయాణం కొనసాగాలని త్రిజట కథ ద్వారా తెలిపినారు.

త్రిజట దానవత్వం నుండి దైవత్వం వరకు ప్రయాణిస్తే, కబంధుడు దైవత్వం నుండి రాక్షసత్వానికి దిగజారి పోయినాడు. అతి సుందరుడైన కబంధుడు బ్రహ్మ వరం చేత దీర్ఘాయువైనాడు. ఎవరికి లభించని అందచందాలు దీర్ఘాయువు అనేవిషయాలు కబంధుని గర్వితున్ని చేసినాయి. ఆ గర్వంతో సుందరుడైన కబంధునిలో వికృతపుట ఆలోచనలు మొదలైనవి. తత్ఫలితంగా వికృత రూపుడైనాడు. వికృత చర్యలతో అంగవిహీనుడై కదలక మెదలకుండిపోయినాడు. దేహాభిమానం బలగర్వం ఉండకూడదు అని, ఇది మనిషిని సాత్విక ప్రవృత్తి నుండి తామస వృత్తిలోకి దిగజార్చుతాయి.

రాముని దర్శనం వరకు కబంధుడు దుర్భరంగా బ్రతుకీడ్చినాడు. తన గూర్చి రామునితో ప్రస్తావిస్తూ “గుండెలో నొక గర్వము కొండ యయ్యె”12 అని మధనపడినాడు. “గర్వము కలగనే రాదు”13 అని తన అహంకారాన్ని గుర్తించినాడు. “బ్రహ్మ నుండి దీర్ఘాయువు బడసి కూడ... నన్ను నే నుద్ధరించు కొన్నదియె లేదు”14 అంటూ మనిషి జీవన పరమార్థాన్ని తెలియచేస్తున్నాడు.

“అపశ్యం గ్రహణం రామో మన్యేహం సమపైష్యతి
ఇమాం బద్ధిం పురస్కృత్య దేహన్యాస కృతశ్రమః”15

రాముడు నిశ్చయంగా తన వద్దకు రాగలరు. అప్పుడు నా దేహాన్ని వదులుతాను. అన్న కబంధుని మాటను భూమికగా చేసుకొని అనుమాండ్ల భూమయ్య 153 పద్యాల కబంధమోక్షము కావ్యాన్ని  రచించినారు. ఈ సందర్భంగా పశ్చాత్తాప విషయాలను పెంచి రాసినారు. కబంధుడు దేహ త్యాగం కోసమే రాముని కోసం ఎదురు చూస్తున్నాడు. రామ దర్శనానికై పరితపించినాడు.16  ఆ నిరీక్షణలో హృదయ ప్రక్షాళన జరిగింది రాముని చేతిలో చావడాన్ని వరంగా భావించినాడు. వాల్మీకి రామాయణంలో కానీ ఇతర రామాయణంలో కానీ కబంధుని రాక్షసుని గానే పేర్కొన్నారు. భూమయ్య  కబంధుని పశ్చాత్తాపాన్ని వివరిస్తూ ఆయనను రామభక్తునిగా చిత్రించినారు.ఇది నవ్యమైన, సవ్యమైన కల్పన.

భూమయ్య కావ్యాల్లో కథ, పాత్రలు, పాత్రల మనోగత విశ్లేషణ, కవిత్వం మొదలైనవి మాత్రమే దర్శనమిస్తాయి. అంతేకాని కవి ఎక్కడ ప్రత్యక్షం కాడు. అంటే పడికట్టు పదాలతో డాంబిక శబ్దశక్తితో అనవసరమైన వర్ణనలతో పాండిత్య ప్రకర్షణ ప్రదర్శించడు. తేట తేట తెలుగు పదాలతో పాఠకుల హృదయ సీమలలో వివేచనాశక్తిని, తార్కిక జిజ్ఞాసను కలిగిస్తాడు.

‘ఒక్క సీతయె ఈ జన్మకున్న భార్య’ అని రాముడు ఏకపత్నీవ్రత ప్రతిజ్ఞ చేయగానే కౌసల్య హృదయం పులకించిపోయింది. “ఆకసపు గంగ వచ్చి ముందాగినట్లు/భూమి మల్లె పూదోటయై మురిసినట్లు/ తల్లి కౌసల్య ఒకరీతి తనయు జూడ/ సూర్యుడుదయించె శ్రీరాము చూడ్కులందు”17 కొడుకు చూపుల్లో సూర్యుడు ఉదయించినాడు. ఇది ఒక కొత్త భావన శ్రీరాముని ప్రతిజ్ఞ ద్వారా భావికాలాల్లో దాంపత్య ధర్మంలో, దాంపత్య జీవనంలో ఆదర్శనీయమైన కొంగొత్త పరిమళాలు ప్రసరించబోతున్నాయనే విలువైన సూచనను వ్యక్తీకరించినారు.

“రావణుని మోయు చున్నగార్దభ మదెంత సిగ్గు పదినదొ”18 రావణుడు గాడిద నుండి కింద పడిపోయి- నట్లుగా వాల్మీకి రామాయణంలో ఉన్నది. రావణుని సిగ్గుమాలిన చర్యలకు గాడిద కూడాసిగ్గుపడి రావణుని కింద పడవేసినదనే భావాన్ని ఒకవైపు హాస్యస్ఫోరకంగానూ, మరోవైపు కామాంధున్ని గాడిదలు కూడా అసహ్యించుకుంటాయని సామాజిక చైతన్యంగాను స్ఫురించేటట్లు ధ్వనింప చేసినారు. అలతి అలతి పదాలతో పాఠకులకు మరింత దగ్గరగా కావ్యాంతరార్ధాన్ని తీసుకొస్తున్నారు.

సరళమైన పదాలతో పాటు దేశీయమైన తేటగీతి ఛందస్సును ఉపయోగించడం అనుమాండ్ల భూమయ్య  ప్రత్యేకత. తేటగీతి తో పాటు ముత్యాలసరాలు, ద్విపదలు, ఒక్కచో శార్దూల పద్య వృత్తాన్ని కూడా ప్రయోగించినారు. పదాలు పద్య శైలి సరళమైనప్పటికీ పద్య నిర్మాణంలో బిగువు ఏ మాత్రం సడలక పోవడం విశేషం. అర్థగాంభీర్యం, పదసౌకుమార్యంతో పద్య రచన పటిష్టంగా కొనసాగింది.

“ఈమె నోంకార మూర్తిగా నిట్లె చూడ” 19 ఇచట శ్రీరామున్ని ఓంకార శబ్ద వాచ్యుడిగా భాసింప చేస్తున్నాడు కవి. సీతాదేవి రామ నామాన్ని జపించగా త్రిజట విన్నది. తర్వాత సీతాదేవిని రాముడైనట్లుగా దర్శించింది. వెనువెంటనే భక్తి భావనతో త్రిజట హృదయ గుహలో శ్రీరాముడే అవతరించినాడు. ఆ దివ్యత్వమే తన జీవన్ముక్తికి మార్గమని, శ్రేష్ఠమని త్రిజట భావించింది. ఇలా తాత్విక విషయాలను తేట తేట పదాలతో చిన్న పద్యాలలో ఒదిగించడం కవి ప్రతిభకు నిదర్శనం.
సాధారణంగా కవులు పద్య రచనలు ఏ పద్యానికి పద్య పాదం పద్యగణం పూర్తి అయ్యేటట్లు రచిస్తారు. ఒకవేళ పూర్వ పాదంలో గల పదాల్లోని ఒకటి రెండు అక్షరాలు తర్వాత పాదాల్లోకి వెళితే పద్యగతి కుంటుపడినట్లు అవుతుందని భావిస్తారు. భూమయ్య  పద్య రచనలో అక్కడక్కడ ఈ విధమైన ప్రయోగం కనిపిస్తుంది. కాని పద్యగతిలో, ధారాశుద్ధిలో ఏమాత్రం సమగతి లోపించినట్లు కనిపించకపోవడం ఒక విశేషం. కారణం యతిమైత్రి స్థానాల్లో అక్షరాల కోసం కవి వెంపర్లాడినట్లు కనిపించదు. ఆ స్థానాల్లో అక్షరాలు సహజంగా ఒదిగి పోయినాయి. భూమయ్య  సాధనతో తేటగీతి పద్య చందస్సును కరతలామలకం చేసుకున్నారు ఇలా పద్య రచన చేయడం భూమయ్య  ప్రత్యేకత.

“తిని తిని అలసినప్పుడేమి య/టంచు ననిపించు నాకపు డపుడు”20 


తేటగీతిలో పాదం మొదట సూర్య గణం విరుపు ఉన్నట్లుగా కవులు రచిస్తారు. ఇక్కడ భూమయ్య  చూపిన రచించిన పద్యంలో మొదట సూర్య గణాభాసంగా కనిపిస్తున్నది. కాని పద్యగతి ఏమాత్రం కుంటు పడలేదు. ఇది పై విషయానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది భూమయ్య  ప్రత్యేకత.

5. సామాజిక సందేశం:

వ్యక్తి యొక్క ఆత్మ సంస్కారం వల్ల, ఆత్మోద్ధరణ వల్ల క్రమక్రమంగా సమాజం, దేశం, సౌశీల్య సంపన్నమై ఉంటుందనే సందేశం ఈ కావ్యాల్లో కనిపిస్తుంది. తండ్రి బహు భార్యత్వం ఫలితంగా మాతృమూర్తి వేదనను రాముడు విన్నాడు. తండ్రి కష్టాలను ఊహించినాడు. తల్లి పడిన వేదన సీతకు ఉండకూడదని ఏకపత్నీవ్రతంగా ఉంటానని ప్రతిజ్ఞ చేసినాడు. శ్రీరాముని ఈ నిర్ణయం యుగయుగాలలో ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ ఆదర్శాన్ని అందరూ పాటించాలని అంతఃసూత్రాన్ని కవి పాఠకులహృదయాల్లో నిలిపినారు.

సమాజ హితకరం కాని బ్రతుకు నిష్ఫలమనే భావాన్ని కబంధునిపశ్చాత్తాప ప్రకటన ద్వారా వివరించినారు. దీర్ఘకాలంగా బతకడమే బ్రతుకు కాదు. ఆత్మవికాసంతో ఆత్మోద్ధరణ జరగాలి. పలువురికి ఉపయోగపడే పనులు చేయాలనే భావన కబంధమోక్షములో ప్రస్ఫుటమవుతున్నది.
సమకాలీన సమాజాన్ని సంస్కృతులను రచనల్లో ప్రతిపాదింప చేయడం కవి యొక్క హృదయ సంస్కారం పై ఆధారపడి ఉంటుంది. భూమయ్య  తెలంగాణ బిడ్డ తెలంగాణ తల్లి సంస్కృతిని సంస్కారాన్ని అక్షరీకరించాలను- కున్నారో ఏమో “ఒక కమలముల ప్రోవుగా నొప్పు సీత” 21 అని త్రిజట నోట సీతాదేవిని తెలంగాణ నారీ జన నీరాజనాల అందుకుని బ్రతకమ్మగా భాసింప చేసినారు.

6. ముగింపు:

కౌసల్య త్రిజట కబంధుడు ఈ పాత్రలన్నీ రామాయణంలో వాల్మీకి మహర్షి ప్రవచించిన కథా ఘట్టాలని భూమయ్య  స్వీకరించినారు. వాల్మీకి మహర్షి రేఖామాత్రంగా కౌసల్య మనోబాధను వ్యక్తీకరించినారు. భూమయ్య  కౌసల్య పాత్రను ఆ పాత్ర యొక్క మనఃప్రవృత్తిని పాఠకులకు సన్నిహితమయ్యే విధంగా చిత్రించినారు. ఆమె వేదన ఘనమైన సౌశీల్య సంపదకు మూల కారణమైంది. అది రాముని ప్రతిజ్ఞ. ఇది కవి అనల్పమైన కల్పన.

దనుజకాంత అయిన త్రిజట దివ్యత్వాన్ని సాధించే దిశగా ఆత్మ వివేచనతో ఆత్మోద్ధరణకై సాధన చేసినదని కవి  రచించుట వారి చిత్త సంస్కారానికి నిదర్శనం.

గర్వ మదాంధతతో ప్రవర్తిస్తే దేవజాతి పురుషుడికైనా అథః పతనం తప్పదు. ఇది కబంధుని వృత్తాంతం. కబంధుని పశ్చాత్తాపాన్ని వాల్మీకి మహర్షి ప్రవచించలేదు. భూమయ్య  కబంధుని పశ్చాత్తాపాన్ని కల్పించినారు. తదనంతరం రాముని విష్ణు పరంగా కబంధుని చే స్తుతింప చేయడం రాముని భగవత్ తత్వాన్ని ప్రకటించడమే.

రామాయణ కావ్య ధర్మ సారాన్ని గ్రహించిన అనుమాండ్ల భూమయ్య  రామాయణం లోని సూక్ష్మ విషయాలను వెలికి తీసి ఈ రామ కథా కావ్యాలను రచించినారు. వాల్మీకి మహర్షి యొక్క మనోగతాన్ని శ్రీరామావతార పరమార్ధ రహస్యాన్ని ఈ కావ్య కథల ద్వారా తెలుగు పాఠకులకు తెలియజేస్తున్నారు భూమయ్య.

7. పాదసూచికలు:

1. జ్వలిత కౌసల్య - కైకేయి వరం 6
2. జ్వలిత కౌసల్య - అనంత క్రోధం 6
3. జ్వలిత కౌసల్య - ఏక పత్నీ వ్రతం 1
4. జ్వలిత కౌసల్య – మంగళాశాసనం 2
5. త్రిజట – 130
6. త్రిజట – 1
7. త్రిజట –127
8. కబంధ మోక్షము – 11
9. జ్వలిత కౌసల్య – పితృ వాక్యం 3
10 జ్వలిత కౌసల్య - ఏక పత్నీ వ్రతం 1
11. భూమయ్య పద్య కావ్యాలు పుట.8
12. కబంధ మోక్షము – 23
13. కబంధ మోక్షము – 24
14. కబంధ మోక్షము –43
15. వాల్మీకి రామాయణము - అరణ్య 71-17
16. కబంధ మోక్షము –74
17. జ్వలిత కౌసల్య - ఏక పత్నీ వ్రతం 3
18, త్రిజట – 87
19. త్రిజట- 98
20. కబంధ మోక్షము –41
21. త్రిజట- 112 

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. భూమయ్య, అనుమాండ్ల. భూమయ్య పద్యకావ్యాలు, అజో విభో కందాళం ఫౌండేషన్, హైదరాబాద్ 2023.
  2. రామారావు, చేకూరి. (సం), అంతర్వీక్షణ సార్వభౌమం, మనస్వినీ దేవి ప్రచురణలు, హైదరాబాద్ 2003.
  3. లక్ష్మణ రావు, గండ్ర, తెలుగులో రామాయణాలు, తెలుగు అకాడెమీ, హైదరాబాద్, 2012
  4. వాల్మీకి, శ్రీ రామాయణం, సుందరకాండం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి -1973
  5. శ్రీరామచంద్రుడు, పుల్లెల. వాల్మీకి, శ్రీరామాయణం, అయోధ్య,అరణ్య,సుందరకాండలు, టి.ఎల్.పి. పబ్లికేషన్, హైదరాబాద్, 2013.
  6. సాహితీ వైజయంతి సమ్మానోత్సవ విశేష సంచిక, అజో విభో కందాళం ఫౌండేషన్, హైదరాబాద్, 2021.

***

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.

వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal