headerbanner
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

✽ అప్రమత్తంగా ఉండండి. ఔచిత్యమ్ పత్రిక పేరుతో గానీ, సంపాదకుడి పేరుతో గానీ మోసపూరితమైన ఈమెయిళ్ళు, ఊహించని రీతిగా వ్యక్తిగత/ఆర్థిక సమాచారాన్ని దొంగిలించే ప్రమాదకరమైన లింకులతో అనుచితమైన Spam Emails వస్తున్నాయి. సైబర్ నేరగాళ్ళు పంపే ఇలాంటి ఈమెయిళ్ళతో జాగ్రత్తగా, భద్రంగా ఉండడం అత్యవసరం. ఇంగ్లీషులో ఉండే ఇలాంటి మెయిల్స్ తెరవకండి! ఏ లింకులపైనా నొక్కకండి! సమాధానం ఇస్తూ స్పందించకండి.! మీ సమాచారాన్ని పంచుకోకండి. ✽ UGC-CARE Coverage Period: Jan 2023 - Feb 2025 ✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. ✽ గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

"కమనీయం తెలుగు రామాయణం"

జాతీయసదస్సు నవంబర్-2023 ప్రత్యేకసంచిక

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.)

AUCHITHYAM | Volume-4 | Issue-15 | December 2023 (Special Issue) | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. తెలుగు సినీగీతాలు: సీతారాముల ఆదర్శప్రణయం

డా. బూర్ల చంద్రశేఖర్

సహాయాచార్యులు, తెలుగు,
ప్రిన్సిపాల్ (ఎఫ్.ఎ.సి), ప్రభుత్వ డిగ్రీ కళాశాల,
మెట్ పల్లి, తెలంగాణ.
సెల్: +91 9849582926, Email: chandu.dmpboorla2023@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

సాహిత్య విలువలు కలిగిన సినిమా పాటలను వివిధ కోణాలలో అధ్యయనం చేయవచ్చు. తెలుగు సాహిత్యంలో సినిమా పాటలపై వివిధ విశ్వవిద్యాలయాలలో పైడిపాల, చిట్టెబోయిన కోటేశ్వరరావు, కళా మురళి, మౌలానా లాంటి ఎందరో పరిశోధకులు పరిశోధనలు చేసారు. అలాగే వేటూరి, ఆత్రేయ, ఆరుద్ర, దాశరథి లాంటి వారి పాటలపై ఎన్నో సంకలనాలు వచ్చాయి. 1931 తెలుగు సినిమా ప్రారంభం నుండి నేటి వరకు వచ్చిన పాటలకు సంబంధించిన సమాచారం అంతర్జాలంలో కుడా చాలా దొరుకుతుంది. భారత ఇతిహాసాలైన భారత రామాయణ ఇతివృత్తాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగులో ఎన్నో సినిమాలొచ్చాయి.సార్వకాలిక ఆదర్శాలను అందించిన రామాయణ ఇతివృత్త ప్రభావం సినిమారంగం మీద విశేషంగా ఉంది. అనేక సినీ గేయరచనల్లో కవులు సీతారాముల దాంపత్యజీవనాన్ని అందంగా అభివ్యక్తీకరించారు. తెలుగు సినిమా పాటలలో ఆదర్శ దంపతులైన సీతారాముల ప్రణయాన్ని తెలిపే పాటలను తీసుకొని పరిశీలించడం, వారి ఉదాత్తమైన ప్రేమ స్వభావం విశ్లేషించడం ఈ వ్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.

Keywords: సినిమాపాటలు, రామాయణం, సీతారాములు, ఆదర్శం, అద్వైతప్రణయం, స్నేహసారం, ధీర లక్షణాలు, ధర్మవీరం, విద్యా- వివాహం. దాంపత్యప్రణయం.

1. ఉపోద్ఘాతం:

ధైర్యం ఉన్నవాడే బాధ్యత తీసుకుంటాడు. బాధ్యత తీసుకున్న వాడికే ప్రేమించే అర్హత ఉంటుంది. ఆ బాధ్యత నా ఇల్లువరకే అని గిరిగీసుకోవడం, ఎల్లలు దాటి ఉండడమని రెండు రకాలుగా ఉంటుంది. రాముని ప్రేమ రాజ్య ప్రజలందరికోసం. అతి పెద్ద బాధ్యత తీసుకున్నవాడు అత్యున్నతంగా ఆలోచిస్తాడు. అందర్నీ ప్రేమగా చూసుకునే బాధ్యత తీసుకుంటాడు. కనుకనే సీతను రాముడు అత్యున్నతంగా ప్రేమించాడు. అలాగే ప్రజలను కూడా ప్రేమించాడు. ఆ ప్రేమ అర్థమైంది గనుకనే సీత రామున్ని ఉన్నతంగా చూడగలిగింది. రాముని ధర్మం అర్థమైంది కనుకనే ఎప్పుడూ అతనికి నీడలా ఉండగలిగింది. భార్యాభర్తల మధ్యగల ఈ అర్థం చేసుకునే గుణమే ప్రేమను ఇనుమడింపజేయగలదని లోకానికి చాటిన మహనీయ జంట సీతారాములు. అందుకే ప్రజల హృదయభిత్తికలపై

“సీతాసమేత శ్రీరాముడు”..., ‘‘శ్రీరాముని ముద్దులరాణి…”, ‘‘సీతాసఖీప్రాణనాథ…’’ (శ్రీరామ రాజ్యం-2011) గా, ‘‘మంగళం జానకీ మానస నివాసునకు…’’ (శ్రీరామదాసు-2006) గా చిత్రించబడ్డారు.

ఇక్కడ మనం రామాయణ కథని ఇతిహాసంగా తీసుకోవచ్చు లేదా వాల్మీకి రాసిన ఒక కాల్పనిక కథగా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్న అంత గొప్ప వ్యక్తిత్వం గల సజీవ పాత్రలు, జీవన విధానం, ఆదర్శం మరే కథలోను కనబడవు. ఈ వ్యాసంలో సీతారాములను అలౌకిక పాత్రలుగా కాక ఆదర్శ చారిత్రకవ్యక్తులుగా దృష్టిలో ఉంచుకొని విశ్లేషించదల్చాను.

భారతదేశంలో బహుల ప్రచారంలో ఉన్న వాల్మీకి రామాయణ కథ చాలా ప్రక్రియల్లో మళ్లీ మళ్లీ రాయబడింది. అలాగే సినిమా పాటల్లోను వ్యక్తీకరింపబడింది. దృశ్యకావ్యంలో మహాభారతం కన్నా రామాయణం చిత్రించడం అంటే కొంత కష్టమైన పని. ఎందుకంటే మహాభారత పాత్రల్లో చాలా వైవిధ్యం ఉంటుంది. కానీ రామాయణానికి వచ్చే వరకు ప్రతీపాత్రను చాలా ఉదాత్తంగా, ఉన్నతంగా చిత్రించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీతారాముల పాత్రలను చాలా ఆదర్శంగా చిత్రించాలి. అందులోనూ వారికి రాసే పాటలు కూడా అలాగే ఉండాలి. తెలుగు సినిమా రచయితలు ఆ సాహసాన్ని విజయవంతంగా చేసారనిపిస్తుంది. సినిమా మౌలిక లక్షణమైన జనరంజకాన్ని పాటల్లో కూడా ఉండేలా చేసారు. ఈ సినిమా పాట ప్రక్రియలో వచ్చిన సీతారాముల ప్రణయానికి సంబంధించిన కొన్ని పాటలని ఇక్కడ పరిశీలిద్దాం.

సినిమాల్లో ప్రత్యక్షంగా రామకథను ఆధారంగా చేసుకుని వచ్చిన పాటలూ ఉన్నాయి. అలాగే ఇతర సాంఘీక కథా నేపథ్యంగల సినిమాల్లో సందర్భానుగుణంగా సీతారాముల ప్రణయాన్ని వర్ణించిన పాటలూ ఉన్నాయి. ఈ రెండు రకాల పాటలని ఇక్కడ ఉదహరించుకుందాం. 

2. అద్వైత ప్రణయం:

భవభూతి ‘ఉత్తరరామ చరిత’ నాటకంలో సీతారాముల ఆదర్శ ప్రణయాన్ని చిత్రిస్తూ ఇలా అంటాడు,

‘‘ఆద్వైతం సుఖదుఃఖయో రనుగతం సర్వాస్వవస్థాసు యత్
వి శ్రామో హృదయస్య యత్ర, జరసా యస్మి న్నహార్యో రసః
కాలే నావరణాత్యయా త్పరిణతే య త్న్సేహసారే స్థితం
భద్రం తస్య సుమానుషస్య కథమప్యేకం హి తత్ ప్రార్థ్యతే” (ఉత్తరరామచరితనాటకమ్- అంకము.1శ్లో.32)

సుఖదుఃఖాలలో దాంపత్య ధర్మం అద్వైతంగా ఉంటుంది. భార్యాభర్తలు పరస్పర సుఖదుఃఖాలను పంచుకుంటారు. సంపదలు వచ్చినా ఆపదలు వచ్చినా ఈ దాంపత్యధర్మం విడిపోదు. ఒకరికొకరు ఓదార్పు అవుతారు. ముపలితనం పైబడుతున్నా కొద్ది ప్రేమ పెరుగగుతుంది. ఆ ప్రేమ స్థిరత్వాన్ని పొందుతుంది. ఇదే దాంపత్య ధర్మసారం. అద్వైతంగా ఉన్న భార్యాభర్తల హృదయం మాత్రమే విశ్రాంత స్థితిలో ఉంటుందని అంటాడు కవి. ‘మొగుడు వేల్పన పాత మాటది ప్రాణసఖుడు’ అనే ఆధునిక కవి గురజాడ అప్పారావు ‘కాసులు’ ఖండికలో వాడిన మాటలు భవభూతి వాడిన “స్నేహసారం” అనే పదం దగ్గర గుర్తుకు వస్తాయి. గురజాడ కన్న పన్నెండు వందల సంవత్సరాల క్రితమే భవభూతి భార్యాభర్తల మధ్య ఉండవలసిన స్నేహానురాగ ఆవశ్యకతను తెలిపాడు. ఈ పదంపైన ఆధునిక విమర్శకులు కూడా చాలా చర్చ చేసారు.

‘‘సీతారామకథ వినుడి… దేవుళ్ళే మెచ్చింది…
శివధనువదిగో… ఆ స్పర్శకి ఆలపించే…. ఆజానుబాహుడి …’’ (శ్రీరామ రాజ్యం-2011)
‘‘ముద్దుల సీతతోడ మురిపాలాడినాడు…’’ (శ్రీరామదాసు-2006)
‘‘మావూరి దేవుడు… సీతమ్మ తెలుపంట ఓమాట ఓసీత…” (అల్లుడా మజాకా-1995)
‘‘అడుగడుగున త్యాగము… అనుబంధము …భార్య మొగనికోసం…’’ (శ్రీరామ రాజ్యం-2011)

పై పాటలన్నింటిలో సీతారాములు సుఖదుఃఖాలలో ఏ విధంగా అద్వైతస్థితిలో ఒకరినొకరు అర్థం చేసుకున్నారో కనబడుతుంది. ఇప్పటికీ నవవధూవరులను సీతారాములతోనే పోల్చుతుంటారు.

‘‘మిథునభోగంలో కూడ సుఖానుభూతి ఉంది. అయితే, అది శరీరకైంకర్యంగా ప్రసరించి క్రమంగా ప్రశాంతి చెందుతుంది. కాయికమైన కర్మమే రతి అయితే, దానికి కలకాలం నిలిచే స్థాయి లేదు. అది అంతకరణ నిష్ఠం కావాలి, అంతఃకరణ నిష్ఠమైన రతి భావసంస్కారరూపమై ఉంటుంది. సుఖదుఃఖాలకు అద్వైతంగా నిలిచేది, సర్వావస్థల యందూ హృదయ విశ్రాంతిని కలిగించేదీ, వార్ధక్యంలో కూడా వన్నెవాసులు వాడిపోకుండా నిలిచేది, జీవితసాహచర్యంలో పరిణతిని సాధించేదీ అయిన సుమానుషధర్మం సంభోగపర్యంతమైన రతిభావం కావటానికి వీల్లేదు. దాన్ని స్నేహంగా గుర్తించాడు భవభూతి.’’ (అభినవ లోచనం- డా.జి.వి.సుబ్రహ్మణ్యం, యువభారతి, 1983,పు.13)

పైన తెలిపిన భవభూతి శ్లోకంలో భార్యాభర్తల మధ్య కేవలం శరీరాకర్షణ ప్రేమ కాదని, అంతకు మించిన అర్థంచేసుకునే గుణమే అద్వైతస్థితి అని అంటాడు. అలాగే శరీరం వృద్ధాప్యంలోకి వెళుతున్నకొద్దీ వికాసం చెందేది ప్రణయం అంటాడు. అలాంటి స్థితి మనకు లవకుశ సినిమాలో వచ్చిన పాటల్లో కబడుతుంది.

“ఆలూమగలా అనురాగాలకు… / పోలిక సీతారాములె యనగా.... వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు…
నిరతము ధర్మమూ నెరపీ నిలిపీ… నరులకు సురులకు.... తర తరాలకూ..... / వరవడియైన వరయుగపురుషుడు.....” (లవకుశ-1963)

3. ఆదర్శ ప్రణయం:

భార్యాభర్తలలో మొదటగా ప్రణయం జనించినా అది ఆదర్శం కావాలంటే నైష్కర్మ్య సిద్ధాంతం అర్థం కావాలి. నైష్కర్మ్యం అంటే ఏమీ ఆశించకుండా పని చేయడం. ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు తల్లిద్రండ్రులుగా మారిన తరువాత ఎంతో కొంత నైష్కర్మ్యంగానే కుటుంబ బాధ్యతను తీసుకుంటారు. అది కేవలం ‘నాది’ అనే భావనలో ఒక్క కుటుంబానికే పరిమితమై ఉంటుంది. అదే బాధ్యత ఆ పరిమితత్వాన్ని దాటి ఎంత వరకు వెళుతుందో అంత లోకంలో ఆదర్శనీయులౌతారు వారు. అప్పుడే ‘‘అందరి బంధువు’’లౌతారు. లోకం వారిని కీర్తిస్తుంది. ప్రపంచాన్ని తల్లిలా/ తండ్రిలా ప్రేమించేవారే తన భాగస్వామిని అత్యన్నతంగా ప్రేమిస్తారు. ఇది భార్యాభర్తల పరస్పర అవగాహనమీద, అర్థంచేసుకునే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అదే ఇరువురిలోని శాశ్వత ఆదర్శ ప్రణయానికి కారణమౌతుంది. లోకంలో గొప్పవాళ్ళు దేనినైతే ఆచరిస్తారో దానినే ఇతరులు ప్రమాణంగా తీసుకుంటారు. ఆ ప్రమాణగుణాన్నే ఆదర్శం అనుకోవచ్చు.

“అందరి బంధువయా భద్రాచల రామయ్య
ఆదుకునే ప్రభువయ్యా నా అయోధ్య రామయ్య….
తెల్లవారితే చక్రవర్తియై రాజ్యమునేలే రామయ్య
తండ్రిమాటకై పదవిని వదిలి అడవులకేగెనయా….,” (దేవుళ్ళు- 2000)

ఈ పాటలో రాముని ధీర గుణం వర్ణితం. ఒక ధీరుడైన వాడే ఎంత పెద్ద బాధ్యతను అయినా మోయగలడు, ఎంత పెద్ద త్యాగాన్నైనా చేయగలడు. తెల్లవారితే మహారాజ్య పట్టాభిషేకం అనే బాధ్యతను తీసుకుంటా అనుకున్నవాడు. అదే స్థితప్రజ్ఞతతో రాజ్యం త్యజించి అడవుల కేగడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇది కేవలం ధీరురాలైన స్త్రీకి మాత్రమే అర్థమవుతుంది. అందుకే సీత రాముని వెంట అడవికి నడిచింది. సహజంగా మనుషులు తమకు ఎన్ని బలహీనతలు ఉన్నా తనకు కాబోయే భాగస్వామికి మాత్రం ఒక్క బలహీనత కూడా ఉండకూడదనుకుంటారు. కానీ ఇక్కడ ఇద్దరికీ బలహీనతలు లేని స్థితి ఉంటేనే ఆ సంసారం అద్భుతంగా ఉంటుందని అనుకోరు. ఇక్కడ సీతారాములు ఇరువురు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నవారు. అందుకే వారి ప్రేమ ఆదర్శమైంది.

భవభూతి శ్లోకంలో ‘‘ … ‘సుమానుషం’ అనే చక్కని పదాన్ని వాడినారు. మానుషం అంటే మానవ ధర్మం. సుమానుషం అంటే మంచి మానుష ధర్మం. అంటే మానవ ధర్మాలన్నింటిలోను దాంపత్యధర్మం చాలా ఉత్తమ ధర్మమన్న అర్థాన్ని ఈ పదం తెలియజేస్తుంది.’’ (విమర్శక వతంసులు- ఆచార్య ఎస్వీ రామారావు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, 2011, పు.149)

ఒక గృహస్థు ఆదర్శంగా ఉంటేనే ఆ సమాజం ఆదర్శంగా ఉంటుంది. సుమానుష దాంపత్యధర్మం తెలిసినవారు గనుకనే సీతారాములు అలాంటి ఆదర్శమూర్తులగా నిలిచారు.
అందుకే,

“జగదానంద కారక….జయ జానకీ ప్రాణ నాయకా…” (శ్రీరామ రాజ్యం-2011)
‘‘శ్రీరాముని అనురాగం సీతా సతి వైభోగం
శ్రీరాముడు రసవేదం శ్రీ జానకి అనువాదం
ఏనాడు వీడిపోని బంధము…’’ ( శ్రీరామ రాజ్యం-2011)
“వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా…
ఆలపించినా ఆలకించినా ఆనంద మొలకించే గాథ…
శ్రీ రాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగి పోయిరా మంగళ వార్తవిని…’’ (లవకుశ-1963) 

అని సినీకవులు అనగలిగారు. ఇంత గొప్ప ఆదర్శ జంట గురించి కావ్యం రాసిన కవి యొక్క భావనను, రాముని పాత్రచిత్రణ (Characterization) రామాయణ ప్రాశస్త్యం (Prosperity of Epic) గొప్పదనం కొన్ని వాక్యాల్లో చాలా స్పష్టంగా చెప్పాడు ఈ క్రింది పాటలో సినీకవి.

‘‘సందేహించకుమమ్మా... రఘురాము ప్రేమను సీతమ్మా....
ఒకే బాణము ఒకటే మాట - ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా..... వ్రతభంగమ్ము కానీడమ్మా
రఘుకులేశుడే ధర్మమువీడి మరోభామతో కూడిన నాడూ
నాదు జపము తపము - నా కావ్యమ్మె వృధయగునమ్మా…’’ (లవకుశ-1963)
ఇలాంటి ఆదర్శనీయమైన దంపతులుగనుకనే వారి జీవిత చరిత్రను లోకులు ఈ విధంగా వేల తరాలనుంచి ఇలా పాడుకున్నారు.

4. స్నేహసార ప్రణయం:

‘‘దాంపత్యం అనేది స్త్రీపుంసయోగ మంటారు. అది కేవలం తర్కం వల్ల తెలిసేదికాదు. ఆసిధారావ్రతంలా ఆనుష్టింపదగింది. సంతానం కలగగానే దంపతీసాంగత్యం స్నేహసాహచర్యంగా మారుతుంది. దానినే భవభూతి "స్నేహసార" మన్నాడు. (అభినవ లోచనం- డా.జి.వి.సుబ్రహ్మణ్యం, యువభారతి, 1983,పు.13)
పై విమర్శలనుబట్టి భవభూతి శ్లోకంలో సార్వకాలీయమైన ప్రబోధాంశం దాగివుందని తెలుస్తుంది. గృహస్థు ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆదర్శంగా ఉంటాడో సూత్రబద్ధం చేసేలా చెప్పాడు భవభూతి. సీతారాములు అదే ‘స్నేహసారం’ లో జీవించారు కనుక ఆదర్శమైనారు.

‘‘తాంబుల రాగల ప్రేమాంమృతం తమకించి సేవించు తరుణం

శృంగార శ్రీరామా చంద్రోదయం ప్రతీరేయి వైధేహి హృదయం
మౌనం కూడా మధురం… సమయం అంతా సఫలం…
ఇది రామ ప్రేమలోకం ... ఇలా సాగిపోవు స్నేహం
ఇందులోని మోక్షం రవి చంద్రులింక సాక్షం… ఏనాడు విడిపోని బంధం…
శ్రీ రామ రామ రఘురామా పిలిచే సమ్మోహన సుస్వరామా
సీతాభామా ప్రేమారాధానామా హరికే హరి చందన బంధనమా…’’ ( శ్రీరామ రాజ్యం-2011)

నిరపేక్షమగు ప్రేమతత్వాన్ని, రాయప్రోలు, షెల్లి చెప్పిన స్వచ్ఛ ప్రేమతత్త్వాన్ని, అలాగే భార్యాభర్తల అనురాగతత్వాన్ని చాలా చక్కగా ఈ పాటలో తెలుపుతాడు కవి. ‘మౌనం కూడా మధురం… సమయం అంతా సఫలం…’ ఈ ఒక్క వాక్యం అర్థమైతే ఏ భార్యాభర్తల్లోను కలహాలనేవే ఉండవు. ఇది ప్రయత్నపూర్వకంగా కాదు అతి సహజంగా ఉండే మౌనం. అలాగే భార్యాభర్తల్లో యవ్వనంలోనే ఉండే సాంగత్యమే కాదు, వృద్దాప్యంలో కూడా అదే సాంగత్య సుఖాన్ని అనుభూతి చెందేలా ఉండాలి. అప్పుడే అది స్నేహసారమవుతుంది. అందుకే ఇది చాలా జాగరుకతతో, ఇంద్రియాలను నిరంతరం గెలుస్తూ అనుష్టించదగిన అసిధారావ్రతం అన్నారు విమర్శకులు. అందుకే పాట చివర్లో ఎన్నడూ విడిపోని బంధం అంటారు కవి. విడి పోవడం అనేది శరీరానికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది అనేది అర్థం చేసుకుంటే ఆ దాంపత్య స్నేహసార ప్రణయం అర్థమౌతుంది. ఫలితం ఆశించకుండా పని చేసే గుణమే స్నేహం కదా మరి.
అలాగే ఈ క్రింది పాటలో రాముడు, సీత ఒకరి నుండి ఒకరు ఏమాశిస్తున్నారో తెలిపాడు కవి. వారు ఆశిస్తున్నది మణులు మాణిక్యాలుకావు, ధనధాన్యాలు కావు, ఒకరికొకరు అతి సాన్నిహిత్యంలో ఉండడం. మనసు తెలిసికొని మెదలడం. అంటే భౌతిక సుఖాలకన్నా, అలౌకికానుభూతినందించే ప్రణయానందమే వారు కోరుకున్నదని తెలుస్తుంది.

‘‘సీతే రాముడి కట్నం... ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం…
సీత అడిగిన వరమొకటే... చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే... అది సీతమ్మ సన్నిధే…
రామకథలుగా వెలసేది ప్రేమ ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం’’ (మగ మహారాజు-1983)

5. ధీరలక్షణాలు - ప్రణయ గుణం :

‘‘ …నూరామడల సంద్రము దాట, వారధి కట్టి వానరులు…
సీతను చూడ సేతువు మీడ సేనావాహిని పొంగినది…’’ (సంపూర్ణ రామాయణం- ఆరుద్ర-1959)

పై పాటలో సీతను పొందడం కోసం రాముడు ఎంత గొప్ప ధైర్య, సాహసాలు ప్రదర్శించాడో మనకు తెలుస్తుంది. మనం మొదటగానే చెప్పుకున్నట్టు ధీరులు మాత్రమే ప్రేమించగలరు, వారే ఆదర్శులైతారు అనే దానికి నిదర్శనమే సీతారాములు. లోకంలో సహజంగా స్త్రీపురుషులు బాహ్య, అంతరంగ ధీరగుణాలతోనే పరస్పరం ఆకర్శణీయు- లౌతారు. కాని వారికున్న కొన్ని బలహీనతలతోని ఆ ధీర గుణాన్ని కోల్పోతారు. ఆ ధీరగుణాలని జీవిత చరణాంకం వరకు ఎవరైతే నిలుపుకుంటారో వారే ఉత్తములు. స్వయంవరానికి ముందు ఉన్న కథలో సీతాదేవి వీరత్వం కూడా కనిపిస్తుంది. ఎవరూ లేపలేని శివునివిల్లును ఒక సందర్భంలో సీతాదేవి పక్కకు జరుపుతుంది. ఇది జనకుడు చూసి ఆమెకు సరైన జోడినే తేవాలనుకొని సీతా స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. స్వయంవర ఘట్టంలో శ్రీరాముని ధీర, వీర గుణాల ప్రదర్శన మనకు తెలిసిందే. ఈ ఘట్టాన్ని వివిధ సినీకవులు చాలా రసరమ్యంగా వర్ణించారు.

‘‘వాలుకనుల ఆ జానకినీ… ఓరకనుల ఒకసారి గనీ చేల శివుని విల్లందుకుని… లీల విరిచెనట
నీల నీరద శ్యాముడట… కళ్యాణ రాముడట…’’ (భక్తశబరి-1958)

‘‘ …జానకి చెలులతో నిలబడెను… కన్నిక రాఘవుడు చూచెను…
కన్నులు నాలుగు కలిసినవి…’’ (సంపూర్ణ రామాయణం- ఆరుద్ర-1959)

ఈ పై పాటల్లో సీతారాములు వారివారి గుణవిశేషాలతో ముందుగానే ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలుస్తుంది. ఇరువురిలోని ధర్మవీరం, దయావీరం లోకంలోని ప్రజలకు ఆదర్శం కనుకనే సీతారాముల ప్రణయాన్ని ఆదర్శంగా నేటికీ ప్రజలు గ్రహిస్తున్నారు.

‘‘…. శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండీ సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగట నున్న చెలికత్తెతో.. ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే…’’ (వాగ్దానం-శ్రీశ్రీ-1961)

అనే పాటలో బాహ్య, అంతరంగ ధీరగుణాలను చక్కగా వర్ణించారు కవి. వాల్మీకి రామాయణంలోని ఈ శ్లోకం ‘‘ఇయం సీతా మమసుతా సహధర్మచరీతవ…’’ సీత గొప్ప లక్షణాలను తెలుపుతుంది. జనకుడు తన కుమార్తె ఎంత ధీరురాలో, ఆమె వ్యక్తిత్వం ఎంత బలమైందో తెలుపుతాడు.

“రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ… ధరాపుత్రి.. సుమ గాత్రి..
సీత వంక ఓరకంట చూసినాడు ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు …” (స్వాతిముత్యం-1985)

పై పాటలో రాముని బాహ్య ధీరత్వ గుణాన్ని వర్ణిస్తూ అది ఒక ధీరత్వ గుణంతో ఉన్న స్త్రీని ఎలా ఆకర్శిస్తుందో, వారి జీవితాన్ని ఎంత ఆదర్శం చేస్తుందో తెలుపుతాడు కవి. సీతా వర్ణనలో ఆమెకు రామునిపై ఉన్న ప్రణయస్వభావాన్ని చాలా అందంగా చిత్రిస్తాడు కవి. సమ ఉజ్జిలకు మాత్రమై ప్రేమను చివరి వరకు నిలుపుకునే సామర్థ్యం ఉంటుంది. అది సీతారాముల విషయంలో సాధ్యమైంది. లోకులు వారిని ఆదర్శంగా తీసుకొని ఆనందంగా ఇహపరసుఖములు పొదాంలనే ప్రబోధం ఈ క్రింది పాటలో కనిపిస్తుంది.

“రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా
ఇహపర సుఖముల నొసగే సీతా రామకథను వినరయ్యా” (లవకుశ-1963)

6. సీతారాముల విద్యా - వివాహం ఆదర్శం:

భారతదేశ విద్యావిధాన పటిష్టతే సీతారాముల ఆదర్శదాంపత్య ప్రణయకారకమైందని చెప్పవచ్చు. ఈ విద్యా విధానాన్ని అనుసరించారు కనుకే సీతారాములు మంచి గృహస్థులు అయినారని చెప్పవచ్చు. ఈ భావన రామాయణం నుంచి మనం గ్రహించవచ్చు. ఇంచుమించు ఆంగ్లేయులు భారతదేశంలోకి వచ్చేనాటికి ఎన్నో వేల గురుకులాలుండేవి. గురుకులం అంటే కేవలం చదువు చెప్పడమే కాదు, సమాజానికి ఉపయోగపడే మంచి గృహస్థు అయ్యేవరకు గురువ శిష్యున్ని పట్టుకునేవాడు. రామ కథలో సీతా స్వయవరఘట్టంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకొని రావడంలో మనకది కనబడుతుంది. గురువు విద్య చెప్పడమే కాదు యోగ్యుడైనటువంటి అతనికే, ఆమెకే వివాహం చేసుకోవడానికి అనుమతించేవాడు. అర్హత సాధించారని శిష్యులకు గురువు యోగ్యతాగుర్తింపు (సర్టిఫికెట్) ఇస్తేనే వివాహం అయ్యేది. వివాహం సామాజిక ధర్మంగా భావించారు కాని వ్యక్తిగత ధర్మంగా కాదు. ఎందుకంటే వారి సంతానం మళ్ళీ సమాజంలోకి వస్తుంది కనుక. దాంపత్యం ఒక క్రతువులాంటిది. సత్ సంతానమే, మంచి పెంపకమే కావాలి గనుక అలా చేసేవారు గురువులు. అలాగే ఇతర జీవుల్లో కామం కేవలం సంతానం కొరకే. మనుషులలో మాత్రం సత్సంతాన లక్ష్యమే కామం పరమావధి. అందుకే గురువులు అర్హతలేనివానికి అత్యున్నత బాధ్యత ఇవ్వలేదు. దంపతులిరువురు కూడా నాకేమీ వద్దు అందరి కోసం పనిచేస్తాను అనుకునే వారు. అదే సంఘం శరణం గచ్ఛామి. ఈ క్రింది పాటల్లో ఈ సాంప్రదాయం మొత్తం కనబడుతుంది.

“...మదన కోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయె మురిసినదీ
ధరణిజ మదిలో మెరసిన మోదము కన్నుల వెన్నెల విరిసినదీ…
హరుని విల్లు రఘునాథుడు చేకొని ఎక్కిడ పెళ పెళ విరిగినదీ
కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలసినవీ” (లవకుశ-1963)

రాముని రాకతో మిథిలా ప్రజలు కూడా మిక్కిలి సంతోషించారు అనడంలో అతని నాయకత్వ లక్షణాలు తెలియడమే కాకుండా సీతదేవి ఇష్టానికి కారణం కూడా తెలుస్తుంది. అలాగే గురువు అనుమతించాకే రాముడు స్వయంవరంలో పాల్గొనడం వల్ల గురుకుల విద్యా, గురువు ప్రాముఖ్యం వివాహవ్యవస్థలో ఎంతుందో తెలుస్తుంది. జ్ఞానమున్నవానికే, శౌర్యంమున్నవానికే వివాహం చేసుకునే అర్హత ఉంటుంది. అలాంటివాడే సమాజానికి మేలుచేసే సత్ సంతానాన్ని అందిస్తాడనే గొప్ప ఆదర్శభావం ఇందులోని విషయం.

“నెల మూడు వానలూ కురిసేనురా..... బంగారు పంటలూ పండేనురా…
కష్టజీవుల వెతలూ తీరేనురా... బీదాసాదా బ్రతుకు మారెనురా...
రామయ్య వంటి కొడుకు రావాలనే.... సీతమ్మ వంటి బిడ్డ కావాలనే ...
పేదతనము భుమిమీద ఉండబోదురా… భేదాలకిక మీద తావులెదురా …
న్యాయమ్ము పాలించినడుపువాడురా.... ధర్మమ్ము గిరిగీసి నిలుపు తాడురా....’’ (లవకుశ-1963)

పై పాటలో బీదతనంలేదని, పంటలుపండాయాని తెలుపడంలో అంతరార్థం రాజ్యం సుభిక్షంగా ఉందని అర్థం చేసుకోవాలి. ధీర, శౌర్య, జ్ఞానవంతులైన సీతారాములు రాజ్యపరిపాలన చేయడంవల్లనే ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని భావం. అందుకే అలాంటి రాముడే, అలాంటి సీతనే వారికి కొడుకుగా, కూతుర్లుగా పుట్టాలని కోరుకుంటున్నారట ప్రజలు. తమ సంతానం అయోగ్యంగా ఉండాలని ఎవరూ కోరుకోరుకదా.

“రాముని అవతారం… రవికుల సోముని అవతారం
సుజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం…’’ (భూకైలాస్ - 1958)
అందుకే సీతారాముల జంటని, వారి చరిత్రనీ సమకాలికులే కాదు ఇప్పటివారు రాబోయే తరాల వారూ ఆదర్శంగా తీసుకుంటారు. గానం చేస్తారు. 

7. ముగింపు:

‘‘యద్య దాచరతి శ్రేష్ఠ స్తత్త దేవేతరో జనః- స యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే’’ (భగవద్గీత, 3-21) అనే గీతాసారాంశం సీతారాముల జీవితంలో స్పష్టం. సీతారాముల ప్రణయసుధారాగం సార్వకాలీనం, నిత్య సమకాలీనం. అందుకే ఇప్పటికీ వారి పెళ్ళిని సంవత్సరానికొకసారి జరుపుకుంటూ ప్రజలు గుర్తుచేసుకుంటారు. వారి జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటారు.

“సీతారాముల కళ్యాణం చూతము రారండి...
జానకి దోసిట కెంపుల ప్రోవై … రాముని దోసిట నీలపురాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా… శిరముల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతము రారండి…’’ (సీతారాముల కళ్యాణం-సముద్రాల రాఘవాచార్య -1961 )

పై పాట ఇప్పటికీ ప్రతి పెళ్ళిల్లలోను వినబడుతుంది. సామాన్యంగా సినిమా చూసే సహృదయ ప్రేక్షకుడు ఆయా కావ్య పాత్రలలో తన్నుతనూ ఊహించుకుంటాడు, లీనం చెందుతాడు కనుకనే అందులో ఉండే ధర్మాలను, లక్షణాలను నిజజీవితంలో అనుకరించాలని చూస్తాడు. మొదటి నుండి రామాయణ కావ్యం చేస్తుంది అదే.

భార్యకోసం ఎంతో దూరం ప్రయాణించి, సంముద్రంపైన వారధి కట్టి తన ప్రణయాన్ని చాటుకున్న రాముడి గుణాన్ని ఏ స్త్రీ ఇష్టంగా చూడదు?., అలాగే భర్త అత్యున్నత ధర్మాన్ని నిరంతరం అర్థం చేసుకునే అనుకూలవతియైన సీతలోని గుణాన్ని ఏ పురుషుడు ఇష్టంగా చూడడు?. అందుకే నేటికి ప్రజలు సీతారాముల పాత్రల్లో లీనమై తమని తాము ఆ ఆదర్శ దంపతులుగా ఊహించుకుంటారు. దానికి ఉదాహరణే పైన తెలిపిన సముద్రాల రాఘవాచార్య గారి సినిమా పాట నేటికీ చిరంజీవిలా ఉండడమే.

చివరగా ఒక్క మాట ఏ ఆదర్శమైనా కేవలం విని కూర్చుంటే, పొగుడ్తూ తిరుగుతుంటే సరిపోదు. దాన్ని ఆచరణలోకి తీసుకువస్తేనే దాని ఫలితాన్ని, అందులోని అమృతానందాన్ని అనుభవిస్తాం.

‘‘రాముడ్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా
వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా…’’ ( ఒక్కడు-2003)

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అప్పన్నశాస్త్రి, బులుసు. (1947). శ్రీభగవద్గీతా. శారదాముద్రణాలయము, భట్నవిల్లి, తూర్పుగోదావరి.
  2. రామారావు, ఎస్వీ. (2011). విమర్శక వతంసులు, ఆంధ్రసారస్వతపరిషత్తు, హైదరాబాద్.
  3. వీరరాఘవాచార్య, వాధూల. (వ్యాఖ్యా). (1940). భవభూతి ఉత్తరరామచరితనాటకమ్, వావిళ్ల రామశాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు.
  4. సుబ్రహ్మణ్యం, జి.వి. (1983). అభినవ లోచనం, యువభారతి, సికింద్రాబాద్. 
  5. సంపూర్ణ రామాయణం (1959) సినిమా పాటల పుస్తకం. (పాటల రచయిత ఆరుద్ర) పి.డి.ఎఫ్. 

అనుబంధం : తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన ఈ శ్లోకం తరచూ కనిపించేది. ఈ క్రింది శుభలేఖలు చూస్తే మనకది తెలుస్తుంది. ఈ శ్లోకంలోని కొంత భావానుకరణే ‘సీతారాముల కళ్యాణం’ (1961) సినిమా కొరకు సముద్రాల రాఘవాచార్య రాసిన ‘‘ శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి…’’ పాట.

‘‘జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః…’’ 

(https://telugupadyam.blogspot.com/2012/04/blog-post.html?m=1)

***

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.

వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

View all

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

(A Portal for the Latest Information on Telugu Research)


AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal
Call for Papers

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500 చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal

Letter of Support - Format
[for Research Scholars only]

Circular
Responsive image

AUCHITHYAM - Peer-Reviewed Telugu Research Journal