"కమనీయం తెలుగు రామాయణం"
జాతీయసదస్సు నవంబర్-2023 ప్రత్యేకసంచిక
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.)
AUCHITHYAM | Volume-4 | Issue-15 | December 2023 (Special Issue) | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. విశ్వనాథ రాముడు: జీవుని వేదన
డా. పోగుల విశ్వప్రసాదు
తెలుగు సహాయాచార్యులు,
ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వ. ప్ర.), కరీంనగర్,
కరీంనగర్, తెలంగాణ.
సెల్: +91 9866802692, Email: pogulavishwam72@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
వ్యక్తి సమాజం రెండింటి సమతుల్య కలయిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వ్యక్తిగత స్వార్థం వ్యవస్థను బలహీనం చేస్తుంది. వ్యవస్థ ధర్మమే ఆచరణీయం. భారతీయ చింతన ఎల్లప్పుడూ వ్యవస్థ ద్వారా వ్యక్తికి రక్షణ నిచ్చేది. సమష్టిదృష్టి గల వ్యవస్థను దర్శించే కవులకు ఇబ్బందులు ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే వారే మహాకవులు. అచ్చమైన కవికి స్పష్టంగా చెప్పలేని, ఆధారము లేని ఏదో ఒక ఉద్వేగం హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. ఇది ఒక దిగులు లాంటిది. ఈ ఉద్వేగం, దిగులు కవిని మరింత ద్రవింపజేసే గుణాలు. ఇవి కావ్యాత్మను ఆవిష్కరించడంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. కాబట్టి కవి, గాయకుడు ఇలా అనేక రకాలుగా ఆత్మ బహిర్గతం అవుతుంది. ఈ వెలుపలి రూపం ఏదైనా లోపలి ఆంతరంగికస్వరూపం మాత్రం జీవుని వేదనయే. విశ్వనాథ రామాయణాన్ని కల్పవృక్షంగా భావించాడు. కల్పవృక్షం సార్వకాలిన దృష్టి కలది. పురాతన భారతీయసంస్కృతి వారసత్వాలు విశ్వనాథ రచనల్లో సమకాలీన దృష్టితో కనిపిస్తాయి. ఇక్కడి ధార్మిక చింతనకు విఘాతం కలిగించే సందర్భం విశ్వనాథ రచనల్లో ఖండనకు గురవుతుంది. కేవలం భారతీయుల రాజకీయదాస్యమే కాక మానసిక, సాంస్కృతిక దాస్యాలు విశ్వనాథకు ఎక్కువ ఆవేదనను కలిగించాయి. వైదికకాలం నుండి వస్తున్న మహోన్నతజాతీయశక్తి అస్తిత్వాన్నికోల్పోతుండడం విశ్వనాథని దుఃఖితుడిని చేసింది. జాతి తన ఆత్మని దర్శించి ప్రకాశవంతం కావాలనేది విశ్వనాథ కల్పవృక్షంలోని తాత్వికదృష్టి. ఇది జీవునివేదనగా విశ్వనాథ సమస్తసాహిత్యంలో కనిపిస్తుంది. కల్పవృక్షంలో ఈ వేదనతో కూడిన దిగులు నెలకొన్న ఘట్టాలను, అందుకుకారణాలను సోదహారణంగా పరిశీలించండం ఈ వ్యాసం ముఖ్యోద్దేశ్యం. ప్రతిపాత్రలో, దైవీప్రకృతులు, రాక్షసప్రకృతిలో కూడా ఈ వేదనను విశ్వనాథ సృష్టించాడు. రామాయణం మొత్తంలో ఏ పాత్రను కూడా దుష్టపాత్రగా చిత్రించక అన్నిటిపై సానుకూల, సానుభూతిని పాఠకులలో కలిగించేందుకు విశ్వనాథలోని పురాతనభారతీయసాంస్కృతిక వారసత్వాలకి కలుగుతున్న విఘాతాలను అడ్డుకొనే జీవునివేదనే కారణమని ఈ వ్యాసం చర్చిస్తుంది.
Keywords: జీవునివేదన, రామాయణకల్పవృక్షం, కావ్యాత్మ, జాతీయత, సంప్రదాయం, సామాజికశ్రేయస్సు, ఆధ్యాత్మికత, స్వధర్మం, సార్వకాలీనం జ్ఞానపీఠపురస్కారం.
1. ఉపోద్ఘాతం:
చెప్పదలచుకున్న విషయానికి, వస్తువుకి రచయిత కల్పించే విలక్షణమైన ఆకృతి అభివ్యక్తి. ఇది రసవ్యంజకంగా ఉన్నప్పుడే మంచి రచన అవుతుంది. ఈ అభివ్యక్తి ద్వారా కావ్య పరమార్ధం గ్రహించాలి. విశ్వనాథ రచనల్లో ఈ పరమార్థం రెండు రకాలుగా ఉంటుంది సామాజికత, ఆధ్యాత్మికత. ఈ సామాజికత అనే అంశాన్ని విశ్వనాథ దేశీయతగా భావించారు. జీవితం గురించి విచారణ చేసే జాతికి అనుభవాలు, ప్రశ్నలు, సమాధానాలు ఎప్పుడు కొత్తగా కనిపిస్తాయి. అక్కడి వాతావరణం, ప్రకృతి, మానవ సంబంధాలు ఇవన్నీ కొత్త కొత్త ఊహల్ని ఆలోచన కలిగిస్తాయి. ఈ ఆలోచన ద్వారా సంపాదించిన జ్ఞానం ఒక ప్రత్యేకమైన దృష్టిని ఏర్పరచుకుంటుంది.
ప్రపంచీకరణ నేపథ్యంలో దేశీయత చర్చ తక్షణ అవసరంగా మారింది. దేశీయ, విదేశీయ భావజాలాల మధ్య సంఘర్షణ సాంప్రదాయాన్ని, సమాజాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. సంప్రదాయ ఆలోచనలు గల కవికి ఇవి వేదనను కలిగిస్తాయి. ఈ వేదన రచనగా మారుతుంది. దూరదృష్టి గల రచయిత ఈ విషయాన్ని ముందుగానే పసిగడతాడు. తన సమకాలీన సమాజంలో జరుగుతున్న మార్పుల్ని ఆధారంగా భవిష్యత్తు పై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకుంటాడు. ఇది సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంటే అది అతని రచనల్లో వేదన రూపంలో బయటకు వస్తుంది. విశ్వనాథ రచనల్లో ఇదే గమనార్హం. రామాయణ కల్పవృక్షంలోని కవి వేదనను భిన్నమైన సందర్భాల ద్వారా సంఘటనల ద్వారా రాముని పాత్ర ఆధారం గా నిరూపించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం
2. పరిచయం:
“నా కవిత్వం అంతా నా జీవితంలోని అనుభవాలమయం. ఈ భావాలు ఈ అనుభవాలు నీ మనస్సుపై వేసిన ముద్రలో నుండి నీ మాటలు దొర్లుకొని వస్తాయి నీవు కవివైతే ఈ శబ్దము వ్యంజకమై కావ్యత్వాన్ని పొందుతుంది”. (విశ్వనాథ శారద1 పు.18_19) అంటారు విశ్వనాథ. విశ్వనాథ (1895-1976) సంధికాలంలో పుట్టినారు 19వ శతాబ్దం చివరలో దేశంలో ప్రపంచంలో సాంఘిక,ఆర్థిక,రాజకీయరంగాలలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ప్రపంచాన్ని బ్రిటిష్ సామ్రాజ్యమే పాలిస్తుంది కనుక అక్కడ వచ్చిన మార్పులు వలసదేశాలపై అనివార్యంగా పడ్డాయి. గ్రామీణజీవితానికి, నాగరికతకు, సంస్కృతి-సాంప్రదాయాలకు, సౌందర్యవాతావరణానికి ఆ కాలం చివరి గడప. బస్తీ నాగరికత తోసుకొస్తుంది విశ్వనాథ తండ్రి బందరులో కాపురం పెట్టి విశ్వనాథకు ఇంగ్లీష్ చెప్పించారు. చిన్నతనంలోనే విశ్వనాథ తన స్వస్థాన వేష భాషల నుండి వేరు చేయబడుతూ దాని తీవ్రతను అనుకోకుండానే అనుభవించారు. అజ్ఞాత చైతన్యం, అననుకూల అనుభవ తీవ్రత ఉండడంవల్ల ఇంగ్లీష్ చదివినా స్వస్థానవేషభాషల చదువును ప్రదీప్తం చేసింది. ఆధునికనాగరికత వ్యాప్తివలన కలిగే దుష్పరిణామాలను చూసేందుకే ప్రోత్సహించింది. దీనికి జాతీయోద్యమం కూడా అనుకూలించింది. దీనినే విశ్వనాథ “నిజానికి శిల్పము కాని సాహిత్యం కానీ జాతీయమై ఉండవలయును. విజాతీయమై ఉండరాదు. వ్రాసినవానికి ముక్తి, చదివిన వారికి రక్తి, ముక్తి. ఎంత సముద్రము మీద ఎగిరినను పక్షి రాత్రి గూటికి చేరును. ఇది జాతీయత, ఇది సంప్రదాయం” (మహతి. పు.12. నేను-నా సాహిత్య రచనలు) అని తన సాహితీ లక్ష్యాన్ని తెలిపినారు.
విశ్వనాథ 1895 సెప్టెంబర్ 10 తేదీన కృష్ణాజిల్లా నందమూరులో పార్వతి శోభనాద్రి దంపతులకు జేష్ఠ పుత్రుడిగా జన్మించాడు. ప్రసిద్ధశతావధానులు తిరుపతివేంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వీరికి గురువు. విశ్వనాథ వ్యక్తిత్వాన్ని మలిచిన ఆధ్యాత్మిక గురువు కుర్తాళంలో సిద్దేశ్వర పీఠాధిపత్యం వహించిన కానుకొలను త్రివిక్రమరావు. వీరిద్వారా విశ్వనాథ వేదాంతరహస్యాలను గ్రహించారు. స్వాతంత్రోద్యమకాలంలో సహాయ- నిరాకరణం పిలుపునందుకొని విశ్వనాథ కళాశాలనుండి బయటకు వచ్చారు. తర్వాత పట్టభద్రులైనారు. అధ్యాపక- వృత్తి చేపట్టి సుమారు రెండుదశాబ్దాలు (1938_1958) ఎందరో శిష్యులను రూపొందించారు. పదవి విరమణ చేసిన తర్వాత కరీంనగర్ ప్రిన్సిపాల్గా (1959_61) పనిచేశారు. నవలలు, నాటకాలు, కావ్యాలు, విమర్శ గ్రంధాలు ఇలా అనేక ప్రక్రియలలో విస్తృతంగా సాహిత్యాన్ని సృజించారు వేయిపడగలు, చెలియలికట్ట, వీరవల్లడు, మాబాబు, లాంటి నవలలు ఆంధ్రపౌరుషం, వరలక్ష్మీత్రిశతి లాంటి కావ్యాలు, త్రిశూలం లాంటి నాటకాలు, నన్నయ ప్రసన్న కలితార్థయుక్తి లాంటి విమర్శగ్రంధాలు అనేకంగా రాశారు. అనేక బిరుదులు, గౌరవాలు పొందారు. రామాయణ కల్పవృక్షం (1932-1962) కు జ్ఞానపీఠపురస్కారం (1971) వచ్చింది.
విద్యార్థి దశలో మిత్రులతో కలిసి మెలిసి, దేశసంచారం చేసిన నిత్య జాగరుకుడైన విశ్వనాథ హృదయం తీవ్రంగా స్పందించేది. ఆ స్పందనలోంచి ఆవేశంలోంచి కవిత్వం పుట్టింది. సంక్షుభిత జీవన మధనంలోంచి పుట్టిన గొప్ప రచనలు విశ్వనాథవి. విస్తృత సాహిత్య అధ్యయనం, విలక్షణమైన ఆలోచన, తీక్షణమైన ప్రాపంచిక దృష్టి, వైభోగం, దారిద్రం విశ్వనాథ సొంతం. విశ్వనాథ రచనలు ఈ అవగాహనతో అధ్యయనం చేయాలి. “నేనే స్వయముగా ఎన్ని అడవులు తిరిగాను,ఎన్ని కొండలు ఎక్కాను చెప్పలేను ఆ నా సొంత అనుభవాలు ఆయా గ్రంధాలలో ఉన్న విషయాలు రామాయణంలో వ్రాశాను” (మహతి.12) అంటారు.
ఒకవైపు జాతీయ పునరుజ్జీవన ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం మరొకవైపు కాల్పనికో ద్యమం వీటి ప్రేరణ పొంది సంప్రదాయాన్ని ప్రేమించి, నవ్యతను కోరి, గొప్ప సంగమస్థానంగా నిలిచిపోయారు. ఆంధ్రవాఙ్మయంలో తనదైన ముద్రను భద్రపరుచుకున్నారు. సామాజికశ్రేయస్సును లక్ష్యంగా చేసుకొని రచనలు చేసిన విశ్వనాథ సాహిత్యమంతటా లోకహిత నిష్ట కనిపిస్తుంది ఈ లోకహితనిష్ఠనే జీవునివేదనగా భావించవచ్చు. సాహిత్యం భౌతిక భావ, ఆధ్యాత్మికభావజాలాలతో పుడుతుంది అనుకుంటే విశ్వనాథ సమకాలీనులలో ఈ మూడు వరసగా శ్రీశ్రీ, చలం, విశ్వనాథలో గమనించవచ్చు. ఈ మూడుపాయలూ జీవునివేదన ద్వారానే ప్రవహించడం గమనార్హం. విశ్వనాథ ప్రతిపాదించిన ఈ జీవుని వేదనకు ధూళిపాళ శ్రీరామమూర్తి, తుమ్మపూడి కోటేశ్వరావు, జి.వి. సుబ్రహ్మణ్యం, కోవెల సంపత్ కుమారాచార్య, సుప్రసననాచార్య మొదలగువారు ప్రాచుర్యం కలిగించారు.
3. జీవుని వేదన - నేపధ్యం:
విశ్వనాథ కావ్యాత్మను 5 సూత్రాలుగా చూడవచ్చు.
- “విజాతీయ నాగరికత వ్యామోహంలో పడి స్వ జాతి ధర్మాన్ని, జీవ లక్షణాన్ని విస్మరించకూడదు.
- వ్యక్తి స్వేచ్ఛ పేరిట వ్యవస్థ ధర్మాన్ని అతిక్రమించి అవ్యవస్థకు దారి తీయకూడదు.
- ధర్మాధర్మాలకు సంఘర్షణ సంభవించినప్పుడు వ్యక్తిలోని వివేకం, విచక్షణ జ్ఞానం జాగరూకం కావాలి.
- మనిషిలో కృతజ్ఞతా భావం అంతరించిపోరాదు.
- మానవ జీవితంలోని ఆత్మీయమైన అనుబంధాలు ఎంతో విలువైనవి” (విశ్వనాథదర్శనం, పు. 39)
జీవన విధానంలోని సహజమైన మానవీయమైన కరుణ ఆయన రచనలన్నిటికీ మూల ద్రవ్యం. ఆయన రచనలన్నింటికీ మూలాధారంగా అడుగున కారుణ్యం చూపిస్తాడు. అందుకే వారి రచనల్లో ఎక్కువ భాగం దుఃఖంతోనే పూర్తవుతాయి.
మా తండ్రి ఉండగా నేను యువరాజును పుట్టు భోగిని తర్వాత కష్టదశ. ఈ కనబడే భోగం, మేడ అంతా ఆ జీవుడిని అంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో, కష్టమేమిటో తెలిసినంత సుఖం గురించి తెలియదు” (విశ్వనాథ శారద పు. 13) అని అంటారు. “ఎప్పుడు మేను దాల్చితినో ఈ తను సంగత లక్షణంబులు తప్పవు” (సుందర. పు. 322) అని ఒక పాత్రచే అనిపిస్తాడు. మనసుపై వేసిన ముద్ర, ఈ తను సంగత లక్షణములు విశ్వనాథను ఆంతరంగికంగా వేదనకు గురిచేసాయిఅందుకే.
“వ్రాసిన రామచంద్రుకథ వ్రాసితివనిపించుకో వృధా/యాసము గాక కట్టుకథలైహికమా/ పరమాయటంచు తా/ చేసిన తండ్రి ఆజ్ఞయును జీవునివేదన రెండు నేకమై/ నా సకలోహ వైభవసనాథము నాధకధను రచించెదన్” (బాల. అవతారిక పు.7) అంటూ తన రచనకు కారణాన్ని, నేపథ్యాన్ని, అవసరాన్ని తెలిపారు తండ్రి ఆజ్ఞ, జీవుని వేదనలతో కవిత రూప తపస్సు చేసి రామాయణం అని నిర్మించారు.
ప్రధానంగా కావ్యావిర్భావానికి మౌలిక హేతువుగా ప్రతిపాదించిన అంశము జీవుని వేదన.ఈ జీవుని వేదన ఆంతరికము. కవికి సహజంగా ఉంటుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే కాక ప్రతిజీవికి వేదన ఉంటుంది. ఆ జీవుని వేదన వల్లనే కవి అయినాడు. ఈ జీవునివేదన సాహిత్య అనుభవం కోసం ఎదురుచూస్తుంది. ఈ అనుభవం సామాజిక, వ్యక్తిగత అవసరాల దృష్ట్యా విశాల ప్రయోజనాలను ఆశించి, లోకరక్షణ కోసం వివిధ రీతులుగా కనిపిస్తుంది. కళానుభవం పరిపూర్ణం కావాలంటే 5 రకాలుగా వ్యూహాలు ఉంటాయని ఆచార్య జీవి ఎస్ అన్నారు. “సాహిత్య అనుభవం కోసం పంచజివహాలు అర్రులు చాస్తుంటాయి. వాస్తవ, కాల్పనిక, వైజ్ఞానిక, జీవచైతన్య, ఆధ్యాత్మిక అనుభూతుల కొరకై సమాజం తన కామనను వ్యక్తం చేయటమే వీటి ప్రవృత్తి. ఇలా ఆస్వాదించే కళా అనుభవమే పరిపూర్ణం సమగ్రం” (విశ్వనాథ సాహిత్య వ్యక్తిత్వం పు 4) విశ్వనాథ వారు రామాయణం ద్వారా ఈ కార్యానికి పూనుకున్నారు. ఆయన జీవునివేదన సమగ్ర కళానుభూతి కోసం సమాజ జీవచైతన్యం వ్యక్తం చేస్తుంది.
4. జీవుని వేదన - నిర్వచనం:
ఈ జీవుని వేదనను విశ్వనాథ వారు ప్రతిపాదించగా దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వారు శ్రీ ధూళిపాళ శ్రీరామమూర్తి. జయంతి పత్రికలో రాసిన వ్యాసాలలో దీని గురించి చర్చించారు.
- జీవుని యొక్క అంతఃకరణము ఇంద్రియ ముఖమున బహిర్ వ్యాపారము అంత ప్రణవమైనప్పుడు జీవుడు పొందు అనుభూతి యది. (ఫిబ్రవరి 60 పు. 14)
- ఈ వేదన సుఖము కాదు, దుఃఖము కాదు వాటి కంటే విలక్షణమైనది, సుఖము అనుటకు గాని,దుఖం అనుటకు గాని వీలు లేదు,కాబట్టి పర్యుత్సుకత్వ మని కాళిదాసు చెప్పినారు. ఈ పర్యుత్సు కత్వం సుఖమునకు విరుద్ధమైనది. అందుచేత దుఃఖము వంటి స్వభావం కలది. దుఃఖం కాదు అనగా నిరపేక్షమైన దుఃఖానుభవము స్వరూపము గాగలది. (ఫిబ్రవరి 60. పు. 19)
- మనకు ఏమాత్రమును సంబంధము లేని వారి కష్టములను చూసి మనము పొందు శో కము కరుణ అనబడును. (డిసెంబర్ 59, పు. 7)
- నిరవధికసుఖస్వరూపమైన యా పరమేశ్వరుని బొందవలెనని తనకు తెలియక నిత్యం ఆరాటపడుతున్నారు. ఈ ఆరాటమే ఈ పరమేశ్వర విరహానుభవమే జీవునివేదన. (ఏప్రిల్ 60 పు.30) అంటూ జీవుని వేదన ను నిర్వచించారు.
మానవుడు తనను తాను తవ్వుకుంటూ సుఖస్వరూపుడైన పరమేశ్వరుని ఎలాగోలా చేరాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఆరాటమే అనుభవమే జీవునివేదనగా కనిపిస్తుంది. అయితే ఇది ఒక వ్యక్తికి, ఒక కావ్యానికి మాత్రం పరిమితం కాదని గమనించాలి. ఈ వేదన విశ్వ చైతన్యాన్ని లయబద్ధం చేసేందుకే ప్రయత్నిస్తుంది. ఈ సంవిధానానికి ఎక్కడ అడ్డంకులు ఏర్పడినా ఏ రూపంలోనైనా విఘాతాలు వచ్చినా తీవ్రంగా స్పందిస్తుంది. “అనేక విధములుగా గతిశీలుని చేయుటలో కదులుతూ కదిలించు నా అంతరంగికమగు మౌలిక శక్తి జీవని వేదన” (ఆ.తె. సా.వి.సాం.రీ. పు.256) అంటారు కోవెల సంపత్ కుమారాచార్య. ఈ జీవునివేదన లౌకికమైనది కాదు. సంసార బాధలకు పరిమితం కాదు, సామాజిక స్పందనలతో కూడి ఉన్నది. ఆదికవి నుండి ఆధునిక కవుల వరకు అచ్చమైన కవులు అందరిలో ఈ అంతర్వేదనా తాపం ఉంటుంది. వాల్మీకి శో కము లాంటిదే విశ్వనాథ జీవునివేద.
5. జీవుని వేదన-విశ్లేషణ:
జీవునివేదన సామాజికవేదన తాత్వికదర్శనానికి మధ్య ఉన్నది. (విశ్వనాథ సాహితీ సమాలోచనం పు.218) జీవునిలో అంతరంగంగా ఆధ్యాత్మిక వేదన ఉంది బహిరంగంగా సామాజికవేదన ఉంది. జాతి జీవనం ఆధ్యాత్మిక చైతన్యంతో ముందుకు నడిచినప్పుడే మానవ వికాసం సంపూర్ణమవుతుందని అది భారతీయ సంస్కృతిని కాపాడడం వల్ల సాధ్యమవుతుందని సాంప్రదాయాభిజ్ఞుల అభిప్రాయం.
విశ్వనాథ ఒకసారి “ఒంటరిగాడను అయిపోయి ఈ ఇల్లు పిల్లల చదువు సంసారము సుందరకాండము రాయటం బుద్ధి క్లిష్టమైపోయింది” (విశ్వనాథ ఉత్తరాలు విమర్శిని-2 పు. 140) అని వాపోతారు. కాబట్టి సమిష్టి అయిన వ్యవస్థ ధర్మంలో నిలబెట్టుటకు వ్యక్తిత్యాగం చేయవలసింది అని విశ్వనాథ సాహిత్య సందేశంలో ఈ జీవిని వేదన ఎల్లెడలా కనిపిస్తుంది. అవతారికలో విశ్వనాథ వారు “నేను మన సన్యాసిని/ నేనిది ఇమ్మంచును అడగను ఎవ్వరినెప్పుడున్ / దానిది ఏది ప్రాప్తం అయినవలదంచు చెప్ప నంతియ గాక” (బాల. అవతారిక ప. 44) అని తన వ్యక్తిత్వాన్ని జీవుని వేదనతో జోడిస్తారు. మనిషిలోని ఆర్తి పరమేశ్వర అనుగ్రహంవైపు పయనిస్తూ లోకానికి క్రమంగా దూరంగా తననుతాను జరుపుకుంటుంది. లోకంనుండి వియోగం చెందడం జీవునివేదన బహిరంగపరచడమే. కల్ప వృక్షంలో ఇలాంటి వియోగాలు అనేకంగా వర్ణించబడ్డాయి. ఈ కావ్యంలో ప్రతి పాత్ర మరణ సమయంలో ఆవేదన పొందినట్లు వర్ణించబడింది. దీని కోసమే ప్రతి జీవి లోనూ ఆధ్యాత్మిక వినియోగం ఉంటుంది. అది కాక ప్రతి వానిలో ఆవేదన, తీవ్రత ఉంటాయి అది వానిని ఉన్నత ఆశయాల వైపు ప్రయాణం చేయిస్తుంది. దేనికోసమో అన్వేషణ చేయిస్తుంది. మనిషి దేనికో ఆవేదన పడుతుంటాడు. ఈ ఆవేదంలో మానవత్వం ఉంటుంది. ఇది మనిషిని మంచివాడిగా మారుస్తూ దైవత్వం వైపు ప్రయాణింప చేస్తుంది. లక్ష సాధన వైపు ప్రయాణం ఆవేదనకు సరైన ముగింపు. అలాంటి జీవితం నిరర్థకం కాదు. విశ్వనాథ నిరాశ వాది కాదు. అంతే కాదు మానవుడు సూక్ష్మమతి అంటూ. “ఏ నొక పెద్ద పర్వతమ నెవ్వడు నెత్తగలేదు” అనే పద్యంలో కరుణతో పాటు సూక్ష్మమతిగా ఉన్నప్పుడే చైతన్యశీలుడు మానవత్వం నుండి దైవత్వానికి పయనిస్తాడని దీనికి వాహికగా జీవునివేదన మనిషిని క్రమంగా భౌతిక భావ ఆధ్యాత్మికదారుల గుండా వియోగిని చేస్తూ పరిపూర్ణ జీవితాన్నిస్తుందని తన రచనలన్నింటిలో గాఢంగా వివరించారు. రామాయణకల్పవృక్షంలో ప్రతిపాత్ర జీవునివేదనలో తపించిపోయేదే.
6. రాముడు- జీవుని వేదన:
శ్రీరాముడు జీవునివేదన ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా అనుభవించాడనేది చర్చనీయాంశం. తల్లిదండ్రులతో, భార్యతో, సోదరులతో, గురువులతో, సేవకులతో, శత్రువులతో, పెద్దలతో పుర ప్రముఖులతో, ప్రజలతో ఇలా తనకు తారసపడి పరిచయమైన ప్రతి వ్యక్తి పట్ల తన వైఖరిని,తనకు దూరమవుతున్న వారి పట్ల దుఃఖం, తనకు సాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత,తనను గౌరవించిన వారి పట్ల ఆదరణ, ప్రేమించిన వారి పట్ల గౌరవం, ఆరాధించిన వారి పట్ల వాత్సల్యం, శత్రువుల పట్ల సహనం ఇలా ప్రతి దగ్గర తనకు తాను పొంగిపోతూ,కరిగిపోతూ జన్మాంతరాల వేదనను కనబరుస్తాడు.
తండ్రి వనవాసం పంపే సమయంలో రామునిమాటలు తండ్రి శాసించాలి, తనయుడు పాటించాలి అంటూ కండ్లు మూసి తెరిచే లోపల 14 సంవత్సరములు పూర్తి చేసుకొని వస్తానంటాడు,నాకు తండ్రియే దైవము, తండ్రి మాట జవదాటే సమస్య ఉత్పన్నం కాదు అంటాడు. తన పితృ వాక్య దీక్షను “ఇది పురా దేవసములైన ఋషుల చేత/ చేయబడినది నేనట్లే చేయువాడ ని ది సనాతన ధర్మంబు, యిద్ధి చేయ లలిత మర్యాదలకు నెల్ల లక్షమిది” (అయోధ్య పు 58) తండ్రి మాట పాటించని కొడుకు ఉన్నా లేకపోయినా ఒకటే అంటాడు. పుత్రి పుత్రునిగా జనకుని మాటను నిర్వర్తించు తన ధర్మ నిర్వహణము నకు అనుమతి ఇవ్వాల్సిందని వేడుకొంటూ తల్లి అనుమతి పొంది ఆశీస్సులు కూడా గ్రహిస్తాడు. ఇదంతా సీతతో చెప్తూ పిత్రాజ్ఞ పాలనలోని విశేషాలను “తండ్రి మాట ఆరాధించు తనయునకు/ నల త్రిలోకి గతంబు భయం బు లేదు/ దాన మాన యజ్ఞములు రక్షణములు పితృ సమారాధన బోల్కి పెట్టలేవు” (అయోధ్య. పు. 80) అని తండ్రి పై నిశ్చయాత్మని ప్రకటిస్తాడు. తండ్రి బతికున్నచో ఆయన మాట కాదనవచ్చా అని “ఒగి జనకుండె తా బ్రతికి యుండిన నాయన మాట కాదనం దగదు మె తండ్రి లేడనుచు తత్వచనంబు నిరాదరింపగా నగుదుమె” (అయోధ్య. పు. 313) “నే న క్షరాల చేసేద? మానక మన తండ్రి య న్న మాటను” (అయోధ్య. పు. 313) అని నిశ్చయముగా పలికి జగతికి ఆదర్శమూర్తి అయినాడు. కైకేయి రాముడిని అరణ్యవాసం చేయాల్సిందేనని ఇందులో తన తప్పేమీ లేదని దశరథుడు తనకిచ్చిన వరాలివి అనగా రాముడు “నీ ఉపకారములు మరువ నే మరి యో జననీ…” అనే పద్యం రాముని తో కైక చేసిన ప్రసంగం దుఃఖంతో మొదలుపెట్టి క్రమముగా దుఃఖము తగ్గి ఉద్విగ్నత మొదలైంది. రాముని వనవాసమునకు పంపుట దశరథున కు దుఃఖ కారణమని ఆమెకు తెలుసు. కాబట్టి ఇది ఆమెకు దుఃఖమే. వనవాసఫలము రాక్షస సంహారం సంతోషకరమైనప్పటికీ ఉపవాసము దుఃఖ కరమైనది ఇది ఆమె దుఃఖం అలాంటి తన ధ్యేయమును సాధించిన తీరు స్వభావము గలది కాబట్టి వరం అడిగి తీర్చాలని పట్టుబట్టింది. కానీ కైకేయిని అందరూ దూషించారు కానీ ఆమె ఇంగితమును తెలుసుకోలేక- పోయారు అని రాముని ఉద్దేశం. కైకేయీ సహాయము అందుకే మరువలేనిది.
అరణ్యవాసంలో సీతను విరాధుడు ఎత్తుకెళ్తున్నప్పుడు “నా వైదేహి కనుగొంటివే ఇంకా..” అని విలపిస్తూ తాను స్వార్థబుద్ధితో తన సుఖము కొరకు సీతను అడవులకు తెచ్చి కష్టాలపాలు చేసినానని దుఃఖిస్తూ “పితృ వియోగాలని దుఃఖ పెట్టు బిట్టు/ గాని జానకి దుఃఖము కరణి కాదు” (అరణ్య పు. 8) అని భార్య లేని లోటుకు విల పిస్తాడు. రావణాసురుడు సీతమ్మనుఅపహరించిన పిమ్మట తన శక్తిని హరించ బడినట్లు సర్వస్వం కోల్పోయినట్లు సామాన్యుడివలె భీరువులా దుఃఖించాడు. అడవిలో చెట్టును పుట్టను గాలిస్తాడు. కిష్కిందలో సీత ఆభరణాలు చూసినాక ఆనందంలో “భూసుత స్త్రీ జగత్తునకు భూషణ్ మాయను భూషణావళుల్ / భా సురబుల్ కనుంగోనెదు భాగ్యము కంటెను భాగ్య మున్నదే” (కిష్కింద. ప. 32) అని పొంగిపోతాడు. శూర్పణఖ ప్రేమను నిరాకరిస్తున్న సమయంలో సీతమ్మ శూర్పణఖ ప్రేమను గుర్తించి ఆదరించమంటుంది రాముడితో. “ఈమె మానవి కామిన్ నిను నేను చూసినట్టు ల కనుచున్నది దోస మెందుకు స్వామి” అంటుంది అప్పుడు సీతారాముడు “ఆమె ఎరిగిన కామంబు నది ఎరుంగ/ నీమె ఎరి గిన వేదాంత మిది ఎరుగ/ మనుజుడను నేను మానవ ధర్మం బెరుగు దు/ నిల నధర్మంబు చాయ సహించుటె రుగ” (అరణ్య 188) కామాదులకన్నా, వేదాంతం కన్నా, ఆధ్యాత్మిక విచారం కన్నా మనుషులకి కావలసింది సరిగ్గా నిర్వర్తింపగలిగిన నాడే మిగతా అంశాల ప్రసక్తి. తాటకిని చంపినందుకుతానెంత బాధపడినాడో వివరిస్తూ రాముడు తన తల్లికి చెప్పిన మాటలు “ఇలపై రాజ బిడ్డ బ్రతుకే ఇది, వానికి మృత్యుతత్వముల్ తెలియగా తేలికైన పని తెల్లముగా తాటక వధ విలగతిని గ్రహించితిని వెక్కసమై, చని జీవితం ఎంతగా గిలగిల తన్నుకొన్నది కేవలం అప్పుడు చూడవలెను” (బాల. 339) అని చెప్తాడు రాక్షసులందరినీ చంపినప్పుడు కూడా “ఈ చంపుటయో కసాయి పని మేలు అన్నట్లుగా ఉన్నది” (అరణ్య. 14) అంటూ బాధపడకుండా ఉండలేక పోతాడు.
యుద్ధరంగంలో లక్ష్మణుడు మూర్ఛగ్రస్తుడై చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు “ఇతడు చనిపోవలేదని నీవు చెప్పుమా/ ఇతనిని బ్రతికించు నంచును నీవు చెప్పుమా /ఇతను బ్రతుకకు ఉన్నచో బ్రతుక నేను/ నాకు రాజ్యము వలదు జానకియు వలదు” (యుద్ధ. 253) ప్రియ సోదరుడు తన కష్టకాలంలో తోడైనాడు తనకు పంచప్రాణాలు అందుకే జీవునివేదన. లక్ష్మణుడు దక్కకుండా సీత వద్దు యుద్ధం వద్దు అని విలపిస్తాడు తమ్ముడు పునరుజీవీతుడు అయినాక “అన్నా నీవును జన్న నాకికను రాజ్యం బేల” (యుద్ధ. పు. 250) అని తమ్ముడి పట్ల తన ప్రేమను వ్యక్త పరుస్తాడు. జటాయువు మరణించిన సమయంలో “పితృకల్పుండవు నీకు అర్ఢ్యమిదిగో ప్రేతాత్ముడై కొమ్ము” (అరణ్య పు. 66) అంటాడు జటాయువు బతికి ఉన్నప్పుడు గౌరవంగా అర్ఘ్య పాద్యాలు చేస్తాడు. తన హృదయంలో పొంగి వచ్చిన భక్తితో మృదువుగా మాట్లాడాడు. చివరికి “రాముడే ఖగలోకనాధునకు పుత్రస్థానం తండ్రికిన్” (అరణ్య. పు. 295) అని ఆయనకు తండ్రిగా భావించి ఉత్తర క్రియలు చేస్తాడు.
మానవుని జీవితము వేదనామయము. ఈ వేదనలు అనేక విధములు. బ్రతుకంతా బాధలమయం దుఃఖమయం. సుఖి అనే వాడు ఎవడు లేడు. ఎవరి దుఃఖం వారిది. రాముడీ దుఃఖతత్వాన్ని చిన్నప్పటినుండి గాఢంగా అనుభవించాడు. లోకంలోని జీవులందరూ ఇట్లాంటి దుఃఖము చేత బాధపడుతున్నారని ఆవేదన. ఈ దుఃఖం అనుభవించాల్సిందే అంటూ తల్లితో “అమ్మ దేహమును విచిత్రమవు దుఃఖా రామమనిపించు దే/హం ఉన్నంతవరకు నీ జీవి పొందనగు బాధ సహ్యతల్ చెప్ప స /ఒక్కొక్క జీవి ఒక్కొక్క విధంబై పొందు దుఃఖము రా/జ్యము రాణియో కనకంబో ఋ షిభార్యారత్నము చెప్పగన్” (బాల. పు. 338) జీవితం పట్ల స్పష్టమైన అవగాహనతో రాముడు అన్న మాటలు. అలాగే వాలి వధ అనంతరము విలపిస్తున్న తారను ఓ దారుస్తూ “ఎవరు నెవరు నే తెచ్చినది ఏమీ లేదు/ నెండ్లుగా పూంద్లు గా ఏడ్చి ఏడ్చి యతివ/చచ్చినన్ దుఃఖ మేటికి జన్మ మంది/ నప్పుడు దుఃఖింపవలయు కంబుజాక్షి” (కిష్కింద. పు.127) పరమజీవితసత్యాన్ని చెప్పి ఓదారుస్తారు. ఇదంతా జీవునివేదన.
ఇలా కల్పవృక్షంలోని ప్రతివియోగ సందర్భంలో రాముడు పురాదుక్కం ఏదో అనుభవిస్తుంటాడు. ఆ దుఃఖం స్వంతం అయినప్పటికీ, గానప్పటికీ కూడా తనతో తన కాలంలో జీవిస్తున్న ప్రాణుల పట్ల మమకారం ఏ ప్రాణి దూరమైతున్నప్పటికీ భరింపశక్యంకాని ఆంతరంగికమైన దిగులు రామునిలో స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణం భారతీయ జీవన విధానానికి దిక్సూచి, ఇందులో మానవీయధర్మాలు, సామాజికసంబంధాలు భావితరాలకు ఒక గొప్ప మార్గనిర్దేశం చేస్తాయి. రామాయణం సమకాలీలత తో పాటు సార్వకాలిన లక్షణాలను ఎలా కలిగి ఉంటుంది అనే ప్రశ్నకు జవాబుగా విశ్వనాథ తన కల్పవృక్షంలో వర్తమానకాలంలో విదేశీయసాంస్కృతిక చొరబాటు కారణంగా శిథిలమవుతున్న అనేక మానవ సంబంధాలను, దైవీ గుణాలను, తీవ్రమైన వేదనతో కల్ప వృక్షంలో రామునిపాత్ర ద్వారా పునర్నిర్మించే ప్రయత్నం చేస్తారు. రాముని యొక్క జీవనవేదన విశ్వనాథ జీవునివేదన ఒక్కటే, స్వధర్మాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి యొక్క జీవు ని వేదన ఇదే.
7. ముగింపు:
వేయి పడగలు ముగింపు లో ధర్మారావు చిన్న అరుంధతి మధ్య సంభాషణ లో చివరకు ఏమి మిగిలినది “నీవు మిగిలితివి, నేను మిగిలితిని” అని ధర్మారావు అంటాడు. సహస్ర ముఖాలుగా వున్న భారత జాతీయ ధర్మాలు, వేగంగా చొచ్చుకొని వస్తున్న విపరీత సాంస్కృతిక దాడులకు అన్ని ధర్మాలు కూలిపోయినా దాంపత్యధర్మం ఒక్కటి ఈ దేశంలో ఎల్లప్పటికే నిలిచి వుంటుందనే విశ్వాసం విశ్వనాథది. విశ్వనాథసాహిత్యం మొత్తంగా ఇదే కనిపిస్తుంది. కుటుంబసంబంధాలు, సామాజిక సంబంధాలు, విలువలతో కూడిన జీవనవిధానం, దేశం పట్ల జాతి పట్లా గొప్ప అభిమానం వీరి రచనలలో కనిపిస్తాయి. కల్పవృక్షం ఆధారంగా దేశంలో శిథిలమౌతున్న ఈ విషయాలను స్పష్టంగా చూపెట్టారు. అలాగే జీవుడికీ దేవుడికీ మధ్య నున్న ఆధ్యాత్మిక సంబంధాలు కల్పవృక్షంలొ అనేకం. మానవుడు జీవన సోఫానంలో చివరకు చేరుకునే మెట్టు ఇదే.. అందుకే “నా భక్తి రచనలు నావి గాక” అని విశ్వనాథ అన్నాడు.
సమాజంలో విలువలు కనుమరుగు కాకుండా వాటిని కాపాడుకోవాలనే ఆర్తి విశ్వనాథ జీవద్రవ్యం. అంతర్ బహిర్ వేదన కూడా. ఈ జీవుని వేదన సకలోహవైభవ సనాథంగా ఆయన రచనలలో కనిపించింది. సకల భావానా శక్తి ప్రయోగించి తన ఆలోచనాధారను ప్రవహింపజేశారు. అది సహృదయ లోకాన్ని జ్ఞానవంతుల్ని చేసింది. ద్రవింపజేసింది. ఒక రామాయణ కల్పవృక్షంగా జాతి ఆత్మను ప్రకటిస్తూ జీవుని వేదనగా కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది.
8. ఉపయుక్తగ్రంథసూచి:
- జయంతి మాసపత్రిక- (డిసెంబర్ 1959, ఫిబ్రవరి 1960, ఏప్రిల్ 1960).
- రామారావు, యస్వీ. (2011). విశ్వనాథ దర్శనం, పసిడి ప్రచురణలు.
- విమర్శిని-2. (1977). తెలుగు విభాగం, కాకతీయ విశ్వ విద్యాలయం, వరంగల్.
- సంపత్ కుమారాచార్య, కోవెల. (1981). ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయికరీతి.
- సంపత్ కుమారాచార్య, కోవెల.(1989). విశ్వనాథ సాహిత్య వ్యక్తిత్వం (సం.). తెలుగు అకాడెమీ, హైదరాబాద్.
- సత్యనారాయణ, విశ్వనాథ. (1981). విశ్వనాథశారద (ప్రథమభాగము) శ్రీవిశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి, హైదరాబాద్.
- సత్యనారాయణ, విశ్వనాథ, (2011). శ్రీమద్ రామాయణ కల్పవృక్షం (6 కాండములు), శ్రీ విశ్వనాథ పబ్లికేషన్స్.
- సుబ్రహ్మణ్యం, జి.వి.(1972). విశ్వనాథ సాహితీసమాలోచనం (సం), యువభారతి, హైదరాబాద్.
***
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

